ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు (Prophet’s Miracles)
https://youtu.be/2su-OWOpcGo [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహిమలు అనే అంశంపై ఈ ప్రసంగం సాగింది. ప్రవక్తలందరూ తమ ప్రవక్తృత్వానికి నిదర్శనంగా అల్లాహ్ యొక్క అనుమతితో కొన్ని మహిమలను చూపారని, వాటిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మహిమలు ఎన్నెన్నో ఉన్నాయని వక్త వివరించారు. అన్నింటికన్నా గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథమని, అది ప్రళయం వరకు సజీవంగా ఉండే మహిమ అని తెలిపారు. చంద్రుడిని రెండుగా చీల్చడం, హుదైబియా వద్ద తన వేళ్ళ నుండి నీటిని ప్రవహింపజేసి 1500 మంది సహచరుల దాహాన్ని తీర్చడం, కందకం యుద్ధం సమయంలో కొద్దిపాటి ఆహారాన్ని వెయ్యి మందికి పైగా సరిపోయేలా చేయడం, ఒక చెట్టు మరియు తోడేలు ఆయన ప్రవక్తృత్వాన్ని సాక్ష్యమివ్వడం వంటి సంఘటనలను వివరించారు. ప్రవక్తలు చూపిన మహిమలు వారు దైవ ప్రవక్తలని రుజువు చేయడానికే గానీ, వారు దేవుళ్ళమని ప్రకటించుకోవడానికి కాదని, నేటి కాలంలోని దొంగ బాబాలు చేసే కనుగట్టు విద్యలకు, ప్రవక్తల మహిమలకు తేడాను గ్రహించాలని ఉద్భోదించారు.

స్తోత్రాలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహిమలు.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ప్రవక్తలను, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించడానికి, ధర్మ ప్రచారము చేయించడానికి వివిధ సందర్భాలలో, వివిధ యుగాలలో, వివిధ ప్రదేశాలలో అనేక మంది ప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఆ ప్రవక్తలు ప్రజల ముందర దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ప్రజలు ఆ ప్రవక్తలతో కొన్ని సూచనలు, కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, ఆ ప్రవక్తలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలకు ఆశ్చర్యం కలిగేటట్టుగా కొన్ని మహిమలను, అద్భుతాలను చూపించాడు.

ఆ ప్రకారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేసి చూపించిన కొన్ని మహిమల గురించి, కొన్ని సూచనల గురించి మనము ఈ ప్రసంగంలో తెలుసుకుందాం.

మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన మహిమలు అనేకమైనవి ఉన్నాయి. ఆ మహిమలన్నింటిలో గొప్ప మహిమ, అన్నిటికంటే పెద్ద మహిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. ఇదేంటండీ? మహిమలంటే ఏదో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చెబుతారంటే, ఇదేదో పుస్తకం గురించి మీరు చెబుతున్నారేంటి అని మీరు ఆశ్చర్యపోతారేమో.

అయితే అభిమాన సోదరులారా, ఒక్క విషయం జాగ్రత్తగా వినండి, అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన అతి గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథం అని ఎందుకు చెబుతున్నానంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన మహిమలు అవి అప్పటికప్పుడే కనిపించాయి, ఆ తర్వాత అదృశ్యమైపోయాయి. కానీ ఈ ఖుర్ఆన్ గ్రంథం ఎలాంటి మహిమ అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలం నుండి ఇప్పటి వరకు కూడా అది అలాగే సజీవంగా ఉంది, ప్రళయం వరకు కూడా అది అలాగే ఉంటుంది. కాబట్టి మహిమలన్నింటిలో గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని చెప్పబడుచున్నది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ గ్రంథము కంటే పూర్వము అనేక గ్రంథాలు ప్రపంచంలో వచ్చాయి. కానీ అవి ఏదీ కూడాను తన అసలు రూపంలో నిలబడలేదు. కానీ ఖుర్ఆన్ గ్రంథం అల్ హందులిల్లాహ్ అవతరించబడిన నాటి నుండి నేటి వరకు కూడా అది తన అసలు రూపంలోనే ఉంది, ప్రళయం వరకు కూడా అది అసలు రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే గ్రంథాలన్నింటిలో సురక్షితమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఖుర్ఆన్ గ్రంథము మాత్రమే. ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని రక్షించే బాధ్యత స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీసుకుని ఉన్నాడు కాబట్టి అది సురక్షితమైన గ్రంథము. కాబట్టి అది గొప్ప మహిమ అని చెప్పబడుచున్నది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ ఎంత గొప్ప మహిమ అంటే, ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని ఉద్దేశించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఈ ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము మీరు ఏదైనా రచించి తేగలరేమో తెచ్చి చూపించండి అని ఛాలెంజ్ చేశాడు. ఖుర్ఆన్ పూర్తి గ్రంథము. అలాంటి పూర్తి గ్రంథము మీరు రచించలేకపోతున్నారా? పోనీ ఖుర్ఆన్ లో ఉన్న అధ్యాయాలలో నుంచి ఒక పది అధ్యాయాలు రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్లీ ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఒక పది సూరాలు మీరు రాసి చూపించండి అన్నాడు. పది సూరాలు వీలుపడదా? ఒక్క సూరా అయినా సరే మీరు రాసి చూపించగలరా ఖుర్ఆన్ లాంటిది అని అడిగాడు. ఒక్క సూరా కూడా మీరు రాయలేరా? పోనీ ఒక్క ఆయతు, ఒక్క వాక్యము, ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాల లాంటి ఒక్క వాక్యము మీరు, జిన్నాతులు అందరూ కలిసి పరస్పరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుని మరి ఇలాంటి ఒక్క వాక్యము రాయగలరేమో రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఛాలెంజ్ చేశాడు.

అభిమాన సోదరులారా, ఈ ఛాలెంజ్ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక మంది ప్రజలు ఖుర్ఆన్ లాంటి ఒక్క వాక్యము రాయలేకపోయారు. వారు ఎంత కష్టపడ్డా, రాత్రింబవళ్ళు ప్రయత్నించినా వారికి సాధ్యపడలేకపోయింది అభిమాన సోదరులారా. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన సూచనలలో, మహిమలలో గొప్ప సూచన, గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని ఇందుకే చెప్పబడుచున్నది అభిమాన సోదరులారా.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ చూపించిన మరొక గొప్ప మహిమ, చంద్రుడు రెండు ముక్కలైపోవటం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో నివసిస్తున్న రోజుల్లో, మక్కాలోని పెద్దలు కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, “నీవు దైవప్రవక్తవే అయితే ఒక సూచన చూపించు, ఒక మహిమ చూపించు” అని ప్రశ్నించారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తో ప్రార్థన చేశారు, దుఆ చేశారు, “ఓ అల్లాహ్, మక్కా వాసులు నాతో సూచన అడుగుతున్నారు, మహిమ అడుగుతున్నారు” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా, వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ ద్వారా చూపించాడు, “ఓ దైవప్రవక్తా, చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోవుచున్నాడు.”

అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ప్రజలకు ఆ పెద్ద మహిమ చూపించారు, “చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోతున్నాడు” అని. మక్కా ప్రజలు కళ్ళారా చూశారు, చంద్రుడు రెండు ముక్కలైపోయి హిరా పర్వతం కుడి వైపున ఒక భాగము, హిరా పర్వతము ఎడమ వైపున మరొక భాగము, రెండు భాగాలుగా విడిపోయాడు. అభిమాన సోదరులారా, ఇంత పెద్ద అద్భుతము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించాడు. దీని ప్రస్తావన ఖుర్ఆన్ గ్రంథంలో సూరా ఖమర్ ఒకటవ వాక్యం నుండి ఐదవ వాక్యం వరకు మీకు లభిస్తుంది. అలాగే ముస్లిం గ్రంథంలో కూడా దీని ప్రస్తావన మీకు దొరుకుతుంది.

చంద్రుడు రెండు ముక్కలైపోవటం, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.

అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను తీసుకుని ఉమ్రా చేయటానికి మదీనా నుండి మక్కాకు వస్తూ ఉన్నారు. హుదైబియా అనే ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వచ్చిన సహాబాల వద్ద ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. త్రాగటానికి కూడా నీళ్ళు లేవు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఒక చిన్న పాత్ర ఉంటే, ఆ పాత్రలో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, ఆ పాత్ర తీసుకుని అందులో ఉన్న నీళ్ళ నుండి వుజూ చేయటం ప్రారంభించారు. వెంటనే సహాబాలందరూ అక్కడ ప్రోగైపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “ఏంటండీ, మీరందరూ ఇక్కడికి వచ్చేశారు? ఏంటి విషయము?” అంటే అప్పుడు సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు, “ఓ దైవ ప్రవక్తా, మనము ఇంచుమించు 1500 మంది మనం ఉన్నాం ఇక్కడ. ఎవరి వద్ద కూడా నీళ్ళు లేవండి, త్రాగడానికి కూడా నీళ్ళు లేవండి. కేవలం మీ దగ్గర ఉన్న ఆ పాత్రలో నీళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయండి. ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళు కూడా మీరు వుజూ చేసేస్తున్నారు కదా, మనకు వుజూ చేసుకోవడానికి గానీ, త్రాగడానికి గానీ, వంట చేసుకోవడానికి గానీ మా దగ్గర అస్సలు నీళ్ళే లేవండి” అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపించగా, అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ ను ప్రార్థించి, తమ చేతులను ఆ పాత్రలో పెట్టగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వేళ్ళ మధ్య నుండి నీటి ప్రవాహం ఉబికింది. ఎన్ని నీళ్ళు వచ్చాయంటే అక్కడ ఉన్న 1500 మంది సహాబాలు అందరూ ఆ నీళ్ళతో వుజూ చేసుకున్నారు, వారి వద్ద ఉన్న పాత్రలన్నింటినీ నీళ్ళతో నింపుకున్నారు. అల్లాహు అక్బర్. ఇంత పెద్ద మహిమ అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా చూపించాడు.

అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో పాటు ఒక ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ ఉంటే మార్గమధ్యలో ఒక బద్దూ వ్యక్తి కనిపించాడు. ఒక పల్లెటూరు వాసి అని మనం మన భాషలో చెప్పుకుంటాం కదండీ. అలాంటి ఒక పల్లెటూరు వాసి కనిపించగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని దగ్గరకు వెళ్లి, “అయ్యా, అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్తను అని నీవు సాక్ష్యం పలకవయ్యా” అని చెప్పారు. అంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నువ్వు సాక్ష్యం పలకవయ్యా అని ఆ పల్లెటూరు వాసితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నిస్తే, అతను ఏమన్నాడంటే, “నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే సాక్ష్య వచనం, కల్మా పఠించాలంటే, నేను కాకుండా ఎవరైనా ఈ కలిమాను సాక్ష్యం పలికే వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరి నుండైనా మీరు నా ముందర సాక్ష్యం పలికించి చూపిస్తారా?” అని అతను మళ్లీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు.

అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరలోనే ఒక చెట్టు ఉంటే, ఆ చెట్టు వైపు సైగ చూపి, ఏమన్నారంటే, “చూడయ్యా, ఈ చెట్టు కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్త అని సాక్ష్యం పలుకుతుంది, చూపించనా?” అన్నారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ చెట్టుకి పురమాయించగా, ఆ చెట్టు అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
“అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”

అని మూడు సార్లు సాక్ష్యం పలికి, అక్కడి నుంచి వెళ్లి మళ్ళీ తన స్థానంలో వెళ్లి నిలబడిపోయింది. అది చూసిన ఆ వ్యక్తి వెంటనే అతను కూడా,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)

అని అతను కూడా సాక్ష్యం పలికాడు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక సూచన, మరొక మహిమ.

అభిమాన సోదరులారా, అలాగే మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ చూపించిన మరొక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వెళ్ళిన తర్వాత ఒకసారి బాగా కరువు ఏర్పడింది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆకలి దప్పులతో గడుపుతున్న రోజుల్లో మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మదీనాకు వెళ్లి హతమార్చాలని, ఆయనను అక్కడి నుంచి కూడా తరిమివేయాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మక్కా వాసుల్ని మదీనా లోపలికి రానియ్యకుండా అడ్డుకోవటానికి కందకం తవ్వాలని నిర్ణయించారు.

ఆ కందకం త్రవ్వేటప్పుడు, కరువు వల్ల సమయానికి అన్నము, నీళ్ళు దొరకని కారణంగా ఆకలి దప్పికలతో ప్రవక్త వారు మరియు సహాబాలు అందరూ కష్టపడుతున్నారు, ఆ గుంత, ఆ కందకము తవ్వుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా బలహీనపడిపోయారు, సహాబాలు కూడా బలహీనపడిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిస్థితిని చూసి ఒక సహాబీ ఇంటికి వెళ్లి వాళ్ళ ఆవిడతో అన్నాడు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా రోజుల నుండి అన్నం తినని కారణంగా బలహీనులైపోయారు. కాబట్టి, మన ఇంట్లో ఏమైనా ఉంటే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆహారం ఏర్పాటు చేద్దాము, ఏమైనా ఉందా చూడు” అంటే, ఆవిడ వెళ్లి వెతకగా ఒక ‘సా’ గింజలు కనిపించాయి. ఒక ‘సా’ అంటే ఇంచుమించు, రెండున్నర కేజీలు గింజలు కనిపించాయి.

అవి తీసుకొని వచ్చి ఆవిడ ఏమందంటే, “చూడండి, ఈ ధాన్యము రెండున్నర కేజీలు మాత్రమే ఉంది. దీనిని నేను పిండిగా మార్చేస్తాను. ఆ తర్వాత మన ఇంట్లో ఒక మేక పిల్ల ఉంది, దాన్ని జబా చేయండి, ఇన్షా అల్లాహ్ దానితో నేను కూర వండుతాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రవక్త వారితో ఒక కొద్ది మంది, ఐదు లేదా పది మంది వస్తే గనక ఇన్షా అల్లాహ్ వారందరికీ మనము ఈ పిండి ద్వారా, ఈ మాంసము ద్వారా ఆహారం ఏర్పాటు చేయగలము, భోజనం ఏర్పాటు చేయగలము. మీరు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఒక పది మందిని కూడా రమ్మని చెప్పండి, ఆహ్వానించండి” అని ఆ సహాబీ వాళ్ళ ఆవిడ చెప్పింది.

ఆ సహాబీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లి, పక్కకు పిలిచి, “ఓ దైవ ప్రవక్త, ఈరోజు మా ఇంట్లో మీకు ఆహారం ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఒక పది మందిని తీసుకుని మా ఇంటికి ఆహారానికి, భోజనానికి రండి” అని ఆహ్వానించారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, అక్కడ కందకం తవ్వుతున్న సహాబాలు అందరినీ, “ఏవండీ, ఫలానా సహాబీ వారి ఇంటిలో మనకు ఈరోజు భోజన ఏర్పాటు ఉంది, కాబట్టి అందరూ నా వెంట రండి వెళ్దాం” అని చెప్పి అందరినీ తీసుకుని వచ్చేశారు. అల్లాహు అక్బర్. వారి సంఖ్య ఎంత ఉందో తెలుసా? అక్కడ కందకం తవ్వుతున్న వారి సంఖ్య వెయ్యి కంటే ఎక్కువగా ఉంది. అంత మందిని కూడా తీసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేశారు.

అది చూసి ఆ సహాబీ కంగారు పడిపోయారు. అదేంటండీ, నేను ఏదో పది మందిని తీసుకుని రమ్మంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకంగా వెయ్యి కంటే ఎక్కువ మందిని తీసుకుని వచ్చేస్తున్నారు. అంత మందికి నేను భోజన ఏర్పాటు ఎలా చేయగలను? నా దగ్గర ఉన్నది కొంచెమే కదా అని ఆయన కంగారు పడుతుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తితో అన్నారు, ఆ సహాబితో అన్నారు, “ఏమయ్యా, మీ ఇంటిలో పొయ్యి మీద ఉన్న ఆ పాత్రను అలాగే ఉంచమని చెప్పండి మీ ఆవిడతో. అలాగే, మీ ఆవిడ ఆ గింజల్ని పిండి లాగా రుబ్బుతోంది కదా, ఇప్పుడనే రొట్టెలు తయారు చేయవద్దు, అలాగే ఉంచమని చెప్పండి నేను వచ్చేవరకు కూడా” అని చెప్పి పంపించారు.

ఆ సహాబీ వెళ్లి వాళ్ళ ఆవిడతో, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మందిని తీసుకుని వస్తున్నారు, కాకపోతే ఆ పొయ్యి మీద ఉన్న పాత్రను దింపవద్దని చెప్పారు, రొట్టెలు ఇప్పుడనే వంట చేయవద్దని చెప్పారు, ఆయన వచ్చేవరకు ఆగాలంట” అని చెప్పారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేవరకు వాళ్ళ ఆవిడ ఆగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఇంట్లోకి ప్రవేశించి అల్లాహ్ పేరు తలచుకుని ‘బిస్మిల్లాహ్’ అని ఆ కూర వండుతున్న పాత్రలో వేలు పెట్టి ఇలా తిప్పారు. ఆ తర్వాత ఎక్కడైతే ఆ పిండి ఉందో అక్కడ కూడా వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ పిండిలో చెయ్యి పెట్టారు. ఆ తర్వాత ఆ సహాబీ వాళ్ళ భార్యతో ఏమన్నారంటే, “రొట్టెలు తయారు చేయడానికి నీకు ఒక్కరితోనే సరిపోదు కాబట్టి మరొక మహిళను కూడా పిలిపించుకో” అన్నారు. ఆవిడ పక్కింటి ఒక ఆవిడని కూడా పిలిపించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పిండిని ఆ ఇద్దరు మహిళలు తీసుకుని రొట్టెలు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సహాబీ ఆ పాత్రలో ఉన్న ఆ కూర కొంచెం కొంచెము తీసి ఆ అక్కడ ఉన్న సహాబాలు అందరికీ వడ్డిస్తున్నారు. ఆ సహాబీ చెబుతున్నారు, అక్కడ ఉన్న వెయ్యి మంది కూడా ఆ రొట్టెలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని ఆ మాంసము కూర ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని పూర్తి వెయ్యి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా తిన్నారు, కడుపునిండా భుజించారు. అయినాగానీ పిండి అలాగే మిగిలిపోయింది, కూర కూడా ఆ పాత్ర నిండా అలాగే మిగిలి ఉంది. అల్లాహు అక్బర్.

అంటే పది మంది తినే ఆహారాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంతలో ఎంతటి శుభం కల్పించాడంటే, ఎంతటి బర్కత్ ఇచ్చాడంటే వెయ్యి కంటే ఎక్కువ మంది అల్లాహ్ దయవల్ల అక్కడ భోజనం చేశారు. ఇది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.

అలాగే ఒకసారి మదీనా ఇరుపక్కల కొంతమంది యూదులు ఉండేవారు ఆ రోజుల్లో. ఒక యూదుడు గొర్రెలు మేపటానికి గొర్రెలను తోలుకొని వెళితే ఒక తోడేలు వచ్చి ఒక గొర్రెను పట్టుకుని లాక్కుని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే గొర్రెను కాపాడుకోవడానికి ఆ తోడేలును వెంబడించాడు, వెంబడించి వెంబడించి వెంబడించి చివరికి ఆ గొర్రెను ఆ తోడేలు నుండి కాపాడుకుని తీసుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అప్పుడు ఆ తోడేలు కూర్చుని ఆ యూదునితో మాట్లాడుతా ఉంది. “ఏంటయ్యా, అల్లాహ్ నాకు ఇచ్చిన ఆహారాన్ని నా నోటి వద్ద నుండి నువ్వు లాక్కుని వెళ్ళిపోతున్నావే” అంది. అతను ఆశ్చర్యపడిపోయాడు. ఇదేంటండీ? జంతువు ఏకంగా మనిషితోనే మాట్లాడటం ప్రారంభించేసింది అని ఆ జంతువుతో అతను అడుగుతుంటే అప్పుడు ఆ తోడేలు ఆ వ్యక్తితో అంటూ ఉంది, “దీనికంటే ఒక మరొక్క గొప్ప విషయం నేను నీకు చెప్పనా? మదీనాలో ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు. అతను జరిగిన విషయాలు కూడా చెబుతుంటాడు, అలాగే జరగబోయే విషయాలు కూడా చెబుతున్నాడు. నువ్వు వెళ్లి అతనితో కలుసు” అంది.

ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ యూదుడు గొర్రెలు ఇంటికి తోలుకొని వచ్చేసి, ఇండ్లల్లో ఆ గొర్రెలు వదిలేసి తిన్నగా మదీనాకు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన విషయం, సంఘటన మొత్తం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వినిపిస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తోడేలు చెప్పింది నిజమే, నేనే ఆ ప్రవక్తను అని చెప్పగా, వెంటనే ఆ యూదుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”

అని సాక్ష్యం పలికి ముస్లిం అయిపోయాడు అభిమాన సోదరులారా. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక మహిమ. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అని ఒక జంతువు కూడా సాక్ష్యమిచ్చింది.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరికొన్ని మహిమల్లో ఒక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలి నుండి చాలా మందికి స్వస్థత లభించింది. మనమంతా వినే ఉన్నాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణం చేసే సందర్భంలో సౌర్ గుహలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవేశించారు. ఆ గుహను శుభ్రపరిచిన తర్వాత అక్కడ ఉన్న రంధ్రాలన్నింటినీ బట్టతో కప్పేయగా ఒక రంధ్రం మిగిలిపోతే అబూబకర్ రజియల్లాహు అన్హు తమ కాలుని ఆ రంధ్రం పైన పెట్టేసి ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని లోపలికి ప్రవేశించమని చెబితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోపలికి ప్రవేశించారు, ఆ తర్వాత అబూబకర్, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి తొడ మీద తల పెట్టుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఒక విషపురుగు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి కాలుకి కాటేసింది. విషం శరీరంలో ఎక్కుతూ ఉంటే బాధ భరించలేక అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కన్నీరు కారిస్తే, ఒక చుక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం మీద పడినప్పుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కళ్ళు తెరిచి, “ఎందుకు ఏడుస్తున్నావు అబూబకర్?” అంటే అప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కాలు చూపించి, “ఏదో విషపురుగు నాకు కాటేసింది” అని చెప్పగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మిని తీసి అక్కడ పూయగానే విషం మొత్తం తగ్గిపోయింది. చూశారా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మి నుండి విషము నుండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత కల్పించాడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి గారికి.

అలాగే ఖైబర్ ప్రదేశంలో కూడా అలీ రజియల్లాహు అన్హు వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిలవగా, అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలోకి చేరితే, అప్పటికే అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళలో సమస్య ఏర్పడి కళ్ళు బాగా ఎర్రబడిపోయాయి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ ఉమ్మిని తీసి అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళల్లో పూయగా, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారికి ఉన్న సమస్య తొలగిపోయింది. ఆయనకు కూడా స్వస్థత లభించింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత పెట్టాడు. ఇది కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరొక మహిమ.

ఇలాగే అభిమాన సోదరులారా, చాలా విషయాలు ఉన్నాయి. చివరిగా ఒక విషయం చెప్పి నేను నా మాటను ముగిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త పదవి వారికి లభించక పూర్వమే మక్కాలో తిరుగుతూ ఉంటే, రాళ్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, చెట్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, గుట్టలు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మహిమ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో అనేవారు, “నేను బాగా గుర్తు పెట్టుకుని ఉన్నాను, నాకు ప్రవక్త పదవి లభించక పూర్వమే మక్కాలో ఫలానా రాయి నాకు సలాం చెబుతా ఉండింది, నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు ఉంది” అని దైవ ప్రవక్త చెప్పేవారు.

అలాగే పన్నెండు సంవత్సరాల వయసులో పినతండ్రి అబూ తాలిబ్ గారితో సిరియా దేశానికి వర్తకం కోసము ప్రయాణం చేస్తూ ఉంటే మార్గమధ్యంలో ఒక క్రైస్తవ పండితుడు వచ్చి సాక్ష్యమిచ్చాడు ఏమంటే, “ఈ బాలుడు, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు వేలు చూపించి, ఏమన్నాడంటే, ఈ బాలుడు నడుచుకుని వస్తూ ఉంటే దారిలో కనిపించిన రాయి, దారిలో కనిపించిన చెట్టు వంగి ఇతనికి సలాము చెబుతా ఉంది. కాబట్టి ఇతను పెద్దవాడైన తర్వాత కారుణ్య మూర్తి, రహ్మతుల్లిల్ ఆలమీన్ అవుతాడు” అని ఆరోజే ఆయన సాక్ష్యం పలికాడు.

కాబట్టి అభిమాన సోదరులారా, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి, ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోయింది. చివరిగా ఒక విషయం ఏమిటంటే, మనం దృష్టి పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ప్రవక్తలు వారు దైవ సందేశహరులు అని ప్రపంచానికి రుజువు చూపించటానికి కొన్ని మహిమలు చూపించారు. ఆ మహిమలు చూపించి మేము కేవలం దైవ సందేశహరులము అని చెప్పుకున్నారు గానీ, మహిమలు చూపించి మేమే దేవుళ్ళము లేదా దేవునిలోని భాగము లేదా దేవుని అవతారము అని వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రకటించుకోలేదు. అయితే ఈ రోజుల్లో ఎవడైతే కొన్ని కిటుకులు, కొన్ని కనుగట్టులు చూపించి ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, నా వద్ద మహిమలు ఉన్నాయి, నేనే దేవుణ్ణి లేదంటే నేనే దేవుని స్వరూపాన్ని, లేదంటే నేనే దేవుని అవతారాన్ని అని ప్రకటిస్తుంటున్నాడంటే అతను అబద్ధం పలుకుతున్నాడు అని మనము గ్రహించాలి.

ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. మహిమలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తలకు మాత్రమే ఇచ్చాడు గానీ, ఇలాంటి దొంగ బాబాలకు ఆయన ఇవ్వలేదు. ఇలా ఈ రోజుల్లో ఎవరైనా ప్రకటిస్తున్నాడంటే వాడు దొంగ బాబా అని మనం గుర్తించాలి అభిమాన సోదరులారా.

అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను, మనము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గొప్పతనాన్ని అర్థం చేసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాలను ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

ఆఖూలు ఖవ్ లీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాఇరిల్ ముస్లిమీన్ ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16753

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) & కుటుంబం
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7