[ఇక్కడ చదవండి] [ఇక్కడ బుక్ డౌన్లోడ్ చేసుకోండి] [ఆడియో వినండి ]
వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
ఈ ఆడియో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన విధానంలో ‘వుదూ’ (శుద్ధి) ఎలా చేసుకోవాలో వివరిస్తుంది. మొదటగా, ఆదేశించబడిన రీతిలో వుదూ మరియు నమాజు చేయడం వల్ల కలిగే గొప్ప ఫలితాన్ని, అంటే పూర్వ పాపాలు మన్నించబడతాయని హదీసుల ద్వారా తెలియజేశారు. వుదూ చేయడానికి గల ముఖ్య గమనికలైన సంకల్పం (నియ్యత్), వరుస క్రమం, నీటి ఆదా మరియు ఒక అవయవం ఆరకముందే మరొకటి కడగడం (కంటిన్యూటీ) గురించి వివరించారు. అనంతరం బిస్మిల్లాహ్ తో మొదలుపెట్టి కాళ్లు కడగడం వరకు వుదూ యొక్క పూర్తి పద్ధతిని స్టెప్-బై-స్టెప్ గా విపులకరించారు. చివరగా, వుదూ తర్వాత చదవాల్సిన దుఆ మరియు దాని వల్ల స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరుచుకుంటాయనే శుభవార్తను తెలియజేశారు.
السلام عليكم ورحمة الله وبركاته، حامدا ومصليا أما بعد
[అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు, హామిదన్ వ ముసల్లియన్ అమ్మ బాద్]
వుదూ యొక్క ప్రాముఖ్యత
వుదూ విధానం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా వుదూ చేశారో, అలాగే వుదూ చేయడం తప్పనిసరి. ప్రవక్త ఆదేశం:
مَنْ تَوَضَّأَ كَمَا أُمِرَ وَصَلَّى كَمَا أُمِرَ غُفِرَ لَهُ مَا قَدَّمَ مِنْ عَمَلٍ
[మన్ తవద్దఅ కమా ఉమిర వసల్ల కమా ఉమిర, ఘుఫిర లహు మా ఖద్దమ మిన్ అమల్]
ఎవరు ఆదేశించబడిన రీతిలో వుదూ చేసి, ఎవరు ఆదేశించబడిన రీతిలో నమాజు చేస్తారో, అతని పూర్వ చిన్న పాపాలు మన్నించబడతాయి. (సునన్ నసాయి: 144, ఇబ్నె మాజా: 1396).
మరో ఉల్లేఖనంలో ఉంది:
مَنْ تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا
[మన్ తవద్దఅ నహ్వ వుదూఈ హాజా]
ఎవరు నా ఈ పద్ధతిలో వుదూ చేస్తారో (సహీహ్ బుఖారీ: 159).
ముఖ్య గమనిక
- వుదూ నియ్యత్ అంటే సంకల్పం నోటితో పలకకుండా మనసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనసులో నిర్ణయించుకోవడమే నియ్యత్.
- రెండవ గమనిక: వుదూ క్రమంగా చేయాలి, క్రమం తప్పకూడదు.
- మూడవ గమనిక: వుదూ చేయునప్పుడు సాధ్యమైనంత వరకు నీళ్లు దుబారా అంటే వృధా ఖర్చు కాకుండా జాగ్రత్త పడాలి.
- నాలుగవ గమనిక: వుదూ చేయునప్పుడు ఒక అవయవం కడిగిన తర్వాత మరో అవయవం కడగడంలో ఆలస్యం చేయకూడదు.
వుదూ పద్ధతి
వుదూ పద్ధతి ఇలా ఉంది:
ప్రారంభంలో “బిస్మిల్లాహ్” అనాలి.
తర్వాత రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి (ఫిగర్స్ చూడండి).
మూడు సార్లు నోట్లో నీళ్లు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్లు ఎక్కించి శుభ్రం చేసుకోవాలి.
ఆ తర్వాత మూడు సార్లు ముఖం కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు, నిలువులో నుదుటి మొదటి భాగం నుండి గడ్డం కింది వరకు. ఇక దట్టమైన గడ్డం గలవారు తమ గడ్డంలో ఖిలాల్ చేయాలి. అయితే గడ్డాన్ని షేవ్ చేయడం గాని, కట్ చేయడం గాని ప్రవక్త విధానానికి వ్యతిరేకం.
ఆ తర్వాత రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి తర్వాత ఎడమ చెయ్యి.
ఆ తర్వాత ఒకసారి తల మసాహ్ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్లి, మళ్లీ వెనక నుండి మొదటి వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి.
ఒకసారి రెండు చెవుల మసాహ్ చేయాలి. అంటే రెండు చూపుడు వేళ్లతో చెవి లోపలి భాగాన్ని, బొటన వేలితో పై భాగాన్ని స్పర్శించాలి.
ఆ తర్వాత రెండు కాళ్లు వేళ్ల నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తర్వాత ఎడమ కాలు.
వుదూ తర్వాత చదవవలసిన దుఆ
చివరిలో ఈ దుఆ చదవాలి:
أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు]
వుదూ చేసిన తర్వాత ఎవరైతే ఈ దుఆ చదువుతారో వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టం అండి. ఈ దుఆ ప్రస్తావన సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది (హదీథ్ నెంబర్: 234).
ఈ పూర్తి వుదూ విధానం ఏదైతే మీరు విన్నారో సహీహ్ బుఖారీ (హదీథ్ నెంబర్: 159) మరియు అబూ దావూద్ (హదీథ్ నెంబర్: 108) లో ఉన్నది.
అల్లాహ్ యే ప్రవక్త పద్ధతిలోనే మనందరికీ వుదూ చేసే అటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక.
وآخِرُ دَعْوانا أَنِ الْحَمْدُ لِلَّهِ، وَالسَّلامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكاتُهُ.
[వ ఆఖిరు దావానా అనిల్ హం దులిల్లాహి, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు]

You must be logged in to post a comment.