ముస్లిం సమాజంలో ధార్మికత లోపించటానికి కారణాలు వాటి పరిష్కారాలు [వీడియో]

ముస్లిం సమాజంలో ధార్మికత లోపించటానికి కారణాలు వాటి పరిష్కారాలు [వీడియో]
https://youtu.be/YLVGfyGBUws [47 నిముషాలు]
వక్త: షరీఫ్, వైజాగ్ (హఫిజహుల్లాహ్), మదీనా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర [వీడియో & టెక్స్ట్]

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర
వక్త: సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/c8YBKq1fepo [30 నిముషాలు]

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప సహాబీ అయిన అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్రను క్లుప్తంగా వివరించబడింది. ఇస్లాం స్వీకరించక ముందు ఆయన పేరు, స్వీకరించిన తర్వాత ప్రవక్త వారు పెట్టిన పేరు, మరియు ఆయనకు “అబూ హురైరా” (పిల్లికి తండ్రి) అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించబడింది. ఆయన యెమన్ దేశంలోని దౌస్ తెగలో జన్మించి, తండ్రిని కోల్పోయి తల్లి వద్ద పెరిగిన తీరు, మరియు తుఫైల్ బిన్ అమర్ దౌసీ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇస్లాం స్వీకరించిన వృత్తాంతం చెప్పబడింది. మదీనాలో ఆయన అనుభవించిన తీవ్ర పేదరికం, అహ్ల్ అస్-సుఫ్ఫాలో ఒకరిగా జీవించిన విధానం, మరియు ప్రవక్త వారి దుఆ ఫలితంగా ఆయన తల్లి ఇస్లాం స్వీకరించిన అద్భుత సంఘటనను కళ్ళకు కట్టినట్టు వివరించారు. ప్రవక్త వారి తర్వాత, వివిధ ఖలీఫాల కాలంలో ఆయన పాత్ర, బహ్రెయిన్ గవర్నర్‌గా ఆయన సేవలు, మరియు ఆయన మరణ సమయంలో పరలోకం గురించి ఆయనకున్న భయభక్తులను ఈ ప్రసంగం తెలియజేస్తుంది. అత్యధికంగా 5,374 హదీసులను ఉల్లేఖించిన సహాబీగా ఆయన స్థానం, మరియు ఆయన అద్భుతమైన జ్ఞాపకశక్తిని కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావించారు.


اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ
[అల్-హమ్దు లిల్లాహ్, వస్సలాతు వస్సలాము ‘అలా రసూలిల్లాహ్]
సకల స్తోత్రములు, పొగడ్తలు అల్లాహ్ కే శోభస్తాయి. మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈనాటి ప్రసంగంలో మనం ఒక గొప్ప సహాబీ గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన గొప్పతనం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రత్యేకంగా దుఆ చేసి ఉన్నారు. హదీసు గ్రంథము చిన్నది అయినా సరే, పెద్దది అయినా సరే, ఆయన పేరు తప్పనిసరిగా అందులో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడి ఉంటుంది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి 5,374 హదీసులు, ఉల్లేఖనాలు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. ఇలాంటి విశిష్టతలు కలిగిన ఆ సహాబీ ఎవరనుకుంటున్నారా? ఆయనే అబూ హురైరా రజియల్లాహు త’ఆలా అన్హు వారు. రండి, ఇన్ షా అల్లాహ్, ఈ ప్రసంగంలో మనం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర క్లుప్తంగా, ఇన్ షా అల్లాహ్, తెలుసుకుందాం.

ఆయన ఇస్లాం స్వీకరించక ముందు ఆయనకు అబ్దుష్ షమ్స్ అని పేరు ఉండేది. ఇస్లాం స్వీకరించిన తర్వాత, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పేరు సరికాదు అని మార్చి అబ్దుర్రహ్మాన్ అని పేరు పెట్టారు. అయితే, అబూ హురైరా అని ఆయనకు కున్నియత్, నామాంతరము ఉండేది. అబూ హురైరా అంటే దాని అర్థం ఏమిటి? చిన్న పిల్లికి తండ్రి అని అర్థం. ఆ పేరు ఆయనకు ఎందుకు పెట్టబడింది అంటే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన ఒక పిల్లిని పోషిస్తూ ఉండేవారు. ఆ పిల్లి ఆయన మీద అభిమానంతో ఎల్లప్పుడూ ఆయన వెంట వెంట తిరుగుతూ ఉండేది, ఆయన ఒడిలో కూర్చుంటూ ఉండేది. అది చూసిన ప్రజలు ఆయనకు అబూ హురైరా, చిన్న పిల్లికి తండ్రి అని నామాంతరము, కున్నియత్ పెట్టేశారు అని అంటూ ఉన్నారు.

ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎక్కడ జన్మించారు అని మనం చూచినట్లయితే, యెమన్ దేశంలోని దౌస్ తెగలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జన్మించారు. ఆయన జన్మించిన కొద్ది రోజులకే వారి తండ్రి మరణించారు. ఆయన అనాథగా తల్లి వద్ద పెరిగారు. తల్లి పేరు ఉమైమ. ఆమె అబూ హురైరా వారిని ఎంతో ప్రేమ, అనురాగాలతో పోషించారు.

ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎలా ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో భాగంగా తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారి ఇస్లాం స్వీకరణ మనము విని ఉన్నాం. తుఫైల్ బిన్ అమర్, ఈయన కూడా యెమన్ దేశస్థులు, దౌస్ తెగకు చెందినవారు, గొప్ప కవి కూడా. మక్కాకు ఒకసారి వచ్చారు. మక్కా వాసులు ఆయనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడకండి, ఆయన మాటలు వినకండి అని హెచ్చరించారు. ఆయన ప్రారంభంలో ప్రవక్త వారి మాటలు వినకూడదు అనుకున్నారు. తర్వాత లోలోపల ఆలోచించి, “నేను కవిని, మంచి చెడులో వ్యత్యాసాన్ని గ్రహించగలిగే వాడిని, మరి అలాంటప్పుడు ముహమ్మద్ మాటలు వినటానికి నేను ఎందుకు భయపడాలి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు విన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఆయన తరపు నుంచి ఏమీ మాట్లాడేవారు కాదు కదా! దైవ వాక్యాలు ప్రజలకు బోధించేవారు కదా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తుఫైల్ బిన్ అమర్ వారికి దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ఆయన దైవ వాక్యాలను అర్థం చేసుకొని వెంటనే ఇస్లాం స్వీకరించేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు, “మీ తెగ వారికి కూడా వెళ్లి మీరు ఇస్లాం గురించి బోధించండి” అని ఆదేశించినప్పుడు, ఆయన దౌస్ తెగకు తిరిగి వెళ్లి ఇస్లాం వైపుకి ఆహ్వానించారు. ప్రారంభంలో తెగ వారు ఎవరూ కూడా ఆయన మాటను పట్టించుకోలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు మళ్లీ వెళ్లి ప్రయత్నము చేయమని ఆదేశించినప్పుడు, మళ్లీ వెళ్లి ఆయన ప్రయత్నము చేయగా 80 కుటుంబాలు అల్-హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించాయి. అలా ఇస్లాం స్వీకరించిన వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు.

మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో విన్నాం అండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణము చేసి వెళ్లిపోయారు. మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్లిపోయిన ఆరవ లేదా ఏడవ సంవత్సరంలో తుఫైల్ బిన్ అమర్ వారు 80 కుటుంబాలను తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి హాజరయ్యారు. మదీనాకు వచ్చి చూస్తే, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేరు. ఆ సమయానికి ఆయన సైన్యముతో పాటు ఖైబర్ ప్రదేశానికి వెళ్లి ఉన్నారు, అక్కడ యూదులతో యుద్ధం సంభవిస్తూ ఉంది. దౌస్ తెగకు చెందిన తుఫైల్ బిన్ అమర్ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, మిగతా ప్రజలు కొంతమంది మదీనా నుండి చక్కగా ఖైబర్‌కు వెళ్లిపోయారు. ఆ ప్రకారంగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మొదటిసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎక్కడ కలిశారు అంటే ఖైబర్ ప్రదేశంలో కలిశారు. ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసి, అల్-హమ్దులిల్లాహ్ ఆ తర్వాత ఆయన కూడా, దౌస్ తెగ ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొని విజేతలుగా మదీనాకు తిరిగి వచ్చేశారు.

మదీనాకు వచ్చేసిన తర్వాత ఏమి జరిగిందంటే, దౌస్ తెగకు చెందిన చాలా మంది ప్రజలు వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. కానీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మూడు విషయాల కారణంగా మదీనాలోనే స్థిరపడిపోయారు. మొదటి విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పదే పదే చూడాలనే కోరిక. రెండవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేయాలనే కోరిక. మూడవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇస్లాం శిక్షణ మరియు ధార్మిక శిక్షణ పొందాలనే కోరిక. ఈ మూడు విషయాల కారణంగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలోనే స్థిరపడిపోయారు. అయితే, గమనించాల్సిన విషయం ఏమిటంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు యెమన్ నుండి మదీనాకు వస్తున్నప్పుడు తల్లిని కూడా వెంట తీసుకొని వచ్చారు. తల్లి ఇస్లాం స్వీకరించలేదు, అయినా గానీ ఆవిడను వెంటబెట్టుకొని మదీనాకు వచ్చేసి ఉన్నారు.

ఇక్కడ మదీనాలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వేరే ఏ వృత్తిని కూడా ఆయన ఎంచుకోకుండా, కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి ఎక్కువగా మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పని కోసం ఆయన పూర్తిగా అంకితమైపోయారు. మస్జిద్-ఎ-నబవీలో ఉండిపోతూ ఉండేవారు. ఆయన లాగే మరికొంత మంది సహాబాలు కూడా ఉండేవారు. వారందరినీ కూడా అస్హాబుస్ సుఫ్ఫా అనేవారు. అజియాఫుల్ ఇస్లాం అని, అజియాఫుల్లాహ్ అని, ఖుర్రా అని వారిని పిలిచేవారు. వారందరూ కూడా నిరుపేదలే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారందరి కోసము ఒక ప్రదేశాన్ని కేటాయించి నీడ సౌకర్యము కూడా కల్పించారు. వారందరూ కూడా ఆ ప్రదేశంలో సేద తీరేవారు.

ఇక, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలో ఉంటున్నప్పుడు చాలా పేదరికము మరియు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఆయన స్వయంగా తెలియజేసిన విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాలలో రెండు రెండు రోజులు, మూడు మూడు రోజులు ఆయనకు తినటానికి ఏమీ దొరకని కారణంగా పూర్తిగా నీరసించిపోయి, ఒక్కొక్కసారి స్పృహ కోల్పోయి పడిపోతే, ప్రజలు ఆయన పడుకుంటూ ఉన్నాడేమోలే అనుకునేవారు. మరికొంత మంది అయితే, ఏమైంది ఈయనకు ఎక్కడంటే అక్కడ పడుకుంటున్నారు, పిచ్చి పట్టిందా అని కూడా కొంతమంది భావిస్తూ ఉండేవారు. కానీ వాస్తవానికి, ఆయన నీరసించిపోయి స్పృహ కోల్పోయి పడిపోయేవారు.

ఒకసారి ఆయన కడుపు మీద రాయి కట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎవరైనా కనిపిస్తే వారితో మాట్లాడుదాము, వారు ఏమైనా తినటానికి ఇస్తారేమో అని ఆశిస్తూ ఉన్నారు. అంతలోనే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అటువైపు వచ్చారు. ఆయనతో మాట్లాడారు, ఆయన కేవలం మాట్లాడి పలకరించి వెళ్లిపోయారు. తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు వచ్చారు, ఆయనను పలకరించారు, ఆయన కూడా కేవలం పలకరించి మాట్లాడి ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడితే, వెంటనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ముఖ కవళికను గమనించి అర్థం చేసుకొని, “నాతో పాటు రండి” అని ఇంటికి తీసుకుని వెళ్లారు. ప్రవక్త వారి ఇంట్లో ఒక పాత్రలో కొన్ని పాలు ఉన్నాయి. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి ఆదేశిస్తూ, “మీ మిగతా మిత్రులు మస్జిద్ లో ఉన్నారు కదా, అస్హాబుస్ సుఫ్ఫా, వారందరినీ కూడా పిలుచుకొని రండి” అన్నారు. ఆయన మనసులో ఆశ్చర్యపోతూ ఉన్నారు, “ఏమిటండి, ఒక చిన్న పాత్రలో ఉన్న పాలు అంత మంది నా మిత్రులకు సరిపోతాయా?” అని లోలోపల ఆశ్చర్యపోతూ ఉన్నారు, కానీ ప్రవక్త వారి ఆజ్ఞ కదా, పాటించాలి కదా, కాబట్టి వెళ్లి వారందరినీ పిలుచుకొని వచ్చారు. వారందరూ ప్రవక్త వారి ఇంటికి వచ్చినప్పుడు ప్రవక్త వారు తమ స్వహస్తాలతో ఆ పాత్ర ఒక శిష్యునికి అందజేసి, అల్లాహ్ నామాన్ని తలుచుకొని తాగటం ప్రారంభించండి అన్నారు. ఒక శిష్యుడు తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆయన తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా అక్కడ ఉన్న వారందరూ కూడా తాగేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి కూడా ఇచ్చారు. ఆయన కూడా ఒకసారి తాగి ఇచ్చేస్తూ ఉంటే, “లేదు మరొకసారి తాగండి, మరొకసారి తాగండి” అని ఇంచుమించు ప్రవక్త వారు మూడు నాలుగు సార్లు ఆయనకు తాగమని చెప్పగా, ఆయన తాగేసి, “ఓ దైవ ప్రవక్త, నా కడుపు నిండిపోయిందండి, ఇక నేను తాగలేను” అని ఇచ్చేయగా, చివరిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పాలు త్రాగారు. అల్లాహు అక్బర్! ఒక గిన్నెలో ఉన్న పాలు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందులోనే ఎంత వృద్ధి, బరకత్ ఇచ్చాడంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా అల్-హమ్దులిల్లాహ్ తనివి తీరా త్రాగగలిగారు.

అలాగే మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ప్రవక్త వారికి సేవలు కూడా చేస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు నీటి ఏర్పాటు చేసేవారు, వేరే వేరే పనులు కూడా ప్రవక్త వారి పనులు ఆయన చేసి పెడుతూ ఉండేవారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కూడా మదీనాకు వచ్చి ఉన్నారు, ఆవిడ ఇస్లాం స్వీకరించలేదు అని మనం ఇంతవరకే విని ఉన్నాము కదండీ. తల్లిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ఎందుకంటే, పసితనంలోనే తండ్రి మరణించినా ఆవిడ బిడ్డను పోషించుకుంటూ ఉండిపోయారు గానీ మరొక వివాహము చేసుకోలేదు. కాబట్టి, బిడ్డ కోసం అంకితమైన తల్లి కోసము బిడ్డ, అనగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా చాలా అభిమానించేవారు, సేవలు చేసేవారు, గౌరవించేవారు. ఆవిడ కూడా ఇస్లాం స్వీకరించాలని పదేపదే వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉండేవారు.

ఒకసారి ఏమైందంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి వద్దకు వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉంటే ఆమె కోపగించుకున్నారు. కోపగించుకుని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక అనరాని మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కూడా మాట్లాడేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి బాధ కలిగింది. ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, ఇలా జరిగింది మా ఇంట్లో. మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా తల్లికి ఇస్లాం భాగ్యము లభించాలని, అల్లాహ్ ఆమెకు ఇస్లాం స్వీకరించేలాగా చేయాలని అల్లాహ్ తో ప్రార్థన చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కోసము ప్రత్యేకంగా అల్లాహ్ తో దుఆ చేయగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లారు. వెళ్లి చూస్తే, తలుపులు మూయబడి ఉన్నాయి, లోపల తల్లి స్నానం చేస్తున్న శబ్దం వస్తూ ఉంది. బిడ్డ వచ్చాడన్న విషయాన్ని గమనించిన తల్లి, “ఓ అబూ హురైరా, ఆగిపో నాయనా కొద్దిసేపు” అని ఆజ్ఞాపించగా, బయటే అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కొద్దిసేపు నిలబడిపోయారు. తర్వాత తల్లి స్నానం ముగించుకొని, బట్టలు ధరించుకొని, తలుపులు తెరిచి, ముందుగా ఆమె పలికిన మాట ఏమిటంటే:

أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ
[అష్-హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్-హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్]
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.

తల్లి సాక్ష్య వచనం పఠించి, కలిమా పఠించి, ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని చూసి, విని, మళ్లీ పట్టరాని సంతోషంలో ఆనంద భాష్పాలు కార్చుకుంటూ, ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, నా తల్లి ఇస్లాం స్వీకరించేశారు” అని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మళ్లీ దైవ ప్రవక్తతో వేడుకున్నారు, “ఓ దైవ ప్రవక్త, విశ్వాసులందరూ కూడా నన్ను, నా తల్లిని అభిమానించాలని మీరు అల్లాహ్ తో దుఆ చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొకసారి ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ తో దుఆ చేశారు. అల్-హమ్దులిల్లాహ్! నేటికీ కూడా విశ్వాసులందరూ వారు మదరసాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు చదువుతూ ఉన్నా, లేదా వారు విద్యార్థులు కాకుండా సామాన్యమైన ప్రజలు ధార్మిక పండితుల నోట ప్రసంగాలలో గానీ, మస్జిదులలో గానీ ఎక్కడైనా గానీ ప్రవక్త వారి మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు వింటూ ఉన్నారు అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క పేరు ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడుతూనే ఉంటుంది. ఆ ప్రకారంగా, ప్రతి విశ్వాసి అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి అభిమానిగా ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇన్ షా అల్లాహ్, అలాగే ఉంటూ ఉంటారు ముందు కూడా. అంటే, ప్రవక్త వారి యొక్క దుఆ ఫలితంగా విశ్వాసులందరూ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు వారిని అభిమానిస్తూ ఉన్నారు మిత్రులారా, ఇది చెప్పాల్సిన విషయం.

అలాగే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి గురించి ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో చూడండి. మరొక ఉదాహరణ చెబుతూ ఉన్నాను. ఒకసారి ఆకలి కారణంగా ఆయన మస్జిద్-ఎ-నబవీ లోకి ప్రవేశించారు. అక్కడ ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అని ఆశతో వస్తే, ఎవరూ లేరు. కొంతమంది అక్కడ కూర్చొని ఉంటే వారి దగ్గరకు వెళ్లి, “ఈ సమయానికి మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి?” అని అడిగారు. వారందరూ ఏమన్నారంటే, “మీరు ఏ విధంగా అయితే ఈ సమయానికి ఆకలితో ఇక్కడికి ఏమైనా దొరుకుతుందని వచ్చారో, అలాగే మేము కూడా వచ్చాము” అన్నారు. తర్వాత వారందరూ కూడా కలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్దాము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లారు. వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, మాకు తినటానికి ఏమీ దొరకలేదు” అని ఆకలితో ఉన్నాము అని తెలియజేయగా, ప్రవక్త వారు ఖర్జూరపు పళ్ళు తెప్పించి ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్! సహాబాలు మరియు ప్రవక్త వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో చూడండి. ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు వస్తూ ఉన్నాయి. ప్రవక్త వారు అంటున్నారు, “ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీరు తినండి. అల్లాహ్ దయతో ఈ పూర్తి రోజుకు ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీకు సరిపోతాయి.” అందరూ కూడా రెండు రెండు ఖర్జూరపు పండ్లు తీసుకొని తింటూ ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మాత్రము ఒక ఖర్జూరపు పండు మాత్రమే తిని ఒకటి లోపల పెట్టుకుంటూ ఉంటే, ప్రవక్త వారు చూసి, “ఎందుకండి ఒకటి ఖర్జూరము పెట్టుకుంటూ ఉన్నారు?” అంటే, “నా తల్లి కోసము పెట్టుకుంటున్నాను, ఓ దైవ ప్రవక్త” అన్నారు. అల్లాహు అక్బర్! తల్లి గురించి ఎంత శ్రద్ధ తీసుకునేవారో చూడండి. “నా తల్లి కోసము ఆ ఖర్జూరము నేను పెట్టుకుంటూ ఉన్నాను, ఓ దైవ ప్రవక్త” అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “లేదండి, ఆ ఖర్జూరము మీరు తినేయండి. మీ తల్లి కోసము నేను ప్రత్యేకంగా అదనంగా రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తాను” అని దైవ ప్రవక్త వారు రెండు అదనంగా ఖర్జూరపు పండ్లు ఇచ్చి మీ తల్లికి ఇవ్వండి అన్నారు. అల్లాహు అక్బర్! మొత్తానికి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి ప్రారంభంలో ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆ ఫలితంగా ఆవిడ ఇస్లాం స్వీకరించారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా తల్లి గురించి శ్రద్ధ తీసుకునేవారు, సేవలు చేసేవారు, బాగా అభిమానించేవారు కూడానూ.

ఆ తర్వాత మనం చూచినట్లయితే, హిజ్రీ శకం ఏడవ సంవత్సరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా ఆచరించటానికి వెళ్ళినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త వారి వెంట వెళ్లి ఆ సంవత్సరము ఉమ్రా ఆచరించి వచ్చారు. ఆ తర్వాత, హిజ్రీ శకం ఎనిమిదవ సంవత్సరం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బహ్రెయిన్ దేశానికి అలా బిన్ అల్-హదరమీ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి పంపిస్తూ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని కూడా ఆయనకు తోడుగా, జతగా పంపించారు. “మీరు అబూ హురైరా వారిని వెంట తీసుకుని వెళ్ళండి, ఆయనను గౌరవించండి” అని అలా బిన్ అల్-హదరమీ వారికి ప్రవక్త వారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఇద్దరూ కలిసి బహ్రెయిన్‌కు వెళ్లారు. అలా బిన్ అల్-హదరమీ వారు బహ్రెయిన్‌కు వెళ్ళిన తర్వాత ప్రవక్త వారి ఆదేశం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారితో, “ఏమండీ, మీకు నేను గౌరవిస్తున్నాను, మీరు ఏ బాధ్యత తీసుకుంటారో చెప్పండి” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆలోచించి, “నాకు అజాన్ పలికే బాధ్యత ఇవ్వండి” అన్నారు. అల్లాహు అక్బర్! అజాన్ పలికే బాధ్యత అది సాధారణమైనది కాదు. అది చాలా విశిష్టత కలిగిన బాధ్యత, ఎంతో గౌరవంతో కూడుకున్న బాధ్యత కాబట్టి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత ఇవ్వండి అన్నారు. నేడు చాలామంది అజాన్ పలికే బాధ్యతను చిన్నచూపుతో చూస్తూ ఉంటారు, అది సాధారణమైన విషయంగా భావిస్తూ ఉంటారు. లేదండి, చాలా విశిష్టతలతో కూడిన విషయము అది. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత తీసుకున్నారు.

కొద్ది నెలలకే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే అబాన్ బిన్ సయీద్ అనే ఒక సహాబీని అక్కడికి అనగా బహ్రెయిన్‌కు నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఇద్దరూ తిరిగి మళ్లీ మదీనాకు వచ్చేశారు. ఒక సంవత్సరం గడిచింది. హిజ్రీ శకం తొమ్మిదవ సంవత్సరము వచ్చింది. ఆ సంవత్సరము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి, ఆయన సారథ్యంలో ఇంచుమించు 300 మంది సహాబాలను హజ్ ఆచరించడానికి పంపించారు. వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. అంటే, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి సారథ్యంలో హజ్ ఆచరించబడినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చేశారు. ఆ సంవత్సరం ప్రవక్త వారు మాత్రము హజ్‌కి వెళ్ళలేదండి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం, అనగా హిజ్రీ శకం పదవ సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మంది సహాబాలను వెంటబెట్టుకొని వెళ్లి హజ్ ఆచరించారు. ఆ హజ్‌ని హజ్జతుల్ వదా అని అంటూ ఉంటారు. ఆ హజ్‌లో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, ఆయన పరిపాలన యుగంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు, ముఖ్యంగా ముర్తద్దీన్‌లతో జరిగిన యుద్ధాలలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉమర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే, బహ్రెయిన్ ప్రదేశానికి ప్రవక్త వారి లాగే అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, వీరిద్దరినీ నాయకులుగా నియమించి పంపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ సందర్భంలో బహ్రెయిన్‌లో ఇంచుమించు ఒక సంవత్సరం నాయకునిగా పరిపాలన కొనసాగించారు. ఆ ఒక సంవత్సరంలో ప్రభుత్వ తనఖా కూడా పొందారు, అటుగా ఆయన స్వయంగా కూడా వ్యాపారము చేశారు. ఆ ప్రకారంగా, ఆ ఒక సంవత్సరంలో ఆయన పెద్ద మొత్తంలో అల్-హమ్దులిల్లాహ్ డబ్బు సంపాదించుకోగలిగారు.

ఒక సంవత్సరం తర్వాత, ఉమర్ రజియల్లాహు అన్హు వారు వేరే సహాబీని అక్కడికి నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వీరిద్దరూ మళ్లీ మదీనాకు తిరిగి వచ్చేశారు. అయితే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఈసారి మదీనాలో వచ్చినప్పుడు ఆయన వద్ద చాలా డబ్బు సొమ్ము ఉంది. ఇప్పుడు ఆయన మునుపటి లాగా నిరుపేద, ఆకలి దప్పుకలతో గడిపేవారు కాదు. చాలా డబ్బు అల్-హమ్దులిల్లాహ్ ఆయన సంపాదించుకోగలిగి ఉన్నారు. అయితే ఆయన ఏం చేశారో తెలుసా? మదీనాకు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తము బైతుల్ మాల్ కోసం అంకితం చేసేశారు. బైతుల్ మాల్ అంటే ప్రభుత్వం తరపున వితంతువులకు, అనాథలకు, మరియు నిరుపేదలకు ఆ సహాయము అందించేవారు. ఆ సహాయ నిధి కోసము ఈయన ఆయన వద్ద ఉన్న సంపద, డబ్బు మొత్తము అంకితం చేసేశారు, విరాళంగా ఇచ్చేశారు. అల్లాహు అక్బర్!

ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, అంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి పరిపాలన యుగంలో, సల్మాన్ బిన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారితో పాటు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఆయన తూర్ పర్వతం ఉంది కదండీ, వాది-ఎ-సైనా, సైనా అనే ఒక లోయ ఉంది. ఆ మైదానములో ఒక పర్వతం ఉంది, కోహె తూర్. అక్కడ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఎలాంటి మధ్యవర్తి లేకుండా మాట్లాడారు కదండీ. ఆ పర్వతం వరకు ఆయన ప్రయాణము కొనసాగించారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే, ఆ ప్రయాణంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే, కాబ్ అహ్బార్ రజియల్లాహు అన్హు వారు, వాస్తవానికి ఆయన ఒక యూదుడు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారు. ఆయనకు వేరే గ్రంథాల జ్ఞానము ఉంది. ఆయనతో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం వినిపించారు. ఏమని వినిపించారంటే, “జుమా రోజు చాలా విశిష్టత కలిగినది. జుమా రోజున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారిని పుట్టించాడు. జుమా రోజున ఆయనకు స్వర్గంలో ప్రవేశింపజేశాడు. జుమా రోజునే ఆయన స్వర్గం నుంచి బయటికి వచ్చేశారు.” ఆ విధంగా చెబుతూ చెబుతూ చివర్లో, “జుమా రోజులో ఒక ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తుడు చేసే దుఆ తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమోదిస్తాడు” అని తెలియజేయగా, కాబ్ అహ్బార్, ఆయన ఏమంటున్నారంటే, “ఆ ఘడియ సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదా” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అన్నారు, “లేదండి, దైవ ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము ప్రతి శుక్రవారము ఆ ఘడియ ఉంటుంది” అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి వారి గ్రంథము, అంటే వేరే మత గ్రంథాలు ఉన్నాయి కదండీ, ఆయన ఇస్లాం స్వీకరించక ముందు యూదుడు కదండీ, ఆ మతానికి చెందిన గ్రంథము చదివి ఆయన, “ప్రవక్త వారు చెప్పిన మాట నిజము” అని అప్పుడు ఆయన ధ్రువీకరించారు కూడా.

సరే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క వీర మరణం సంభవించినప్పుడు అలీ రజియల్లాహు అన్హు వారు ముస్లింల నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగంలో ముస్లింల రెండు పెద్ద సమూహాల మధ్య పెద్ద యుద్ధము జరిగింది. ఆ యుద్ధ సమయంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వారిద్దరి మధ్య సంధి కుదిర్చటానికి చాలా ప్రయత్నము చేశారు. చివరికి ఆయన ఫలితం దొరకని కారణంగా యుద్ధంలో పాల్గొనకుండా ఆయన ఒంటరితనాన్ని ఎన్నుకున్నారు. ప్రత్యేకంగా దైవ ఆరాధన కోసం ఆయన అంకితమైపోయారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు.

సరే, ఏది ఏమైనప్పటికినీ, అలీ రజియల్లాహు అన్హు వారి తర్వాత, హిజ్రీ శకం 59వ సంవత్సరం, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాధి రాను రాను ముదురుతూనే పోయింది. మరణ సమయం సమీపించింది. అప్పుడు ఆయన పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నారు. ప్రజలు ఆయనతో అడిగారు, “ఏమండీ, ఎందుకు ఏడుస్తున్నారు?” అంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “నేను ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోతున్నానని బాధలో నేను ఏడవట్లేదు. పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నాను. ప్రయాణము ముందు ముందు చాలా పెద్దది, నా దగ్గర ఏమో సామాను చాలా తక్కువగా ఉంది. నేను స్వర్గానికి చేరుకుంటానా, నరకానికి చేరుకుంటానా నాకు అర్థం కావట్లేదు. స్వర్గం నా గమ్యస్థానం అవుతుందా, నరకం నా గమ్యస్థానం అవుతుందా తెలియదు కాబట్టి, అది తలుచుకొని నేను ఏడుస్తూ ఉన్నాను” అన్నారు.

అల్లాహు అక్బర్! జీవితాంతం ప్రవక్తకు మరియు సహాబాలకు మరియు ఇస్లాంకు అంకితమైపోయిన అలాంటి సహాబీ పరలోకాన్ని తలుచుకొని, “నా వద్ద సొమ్ము తక్కువ ఉంది,” అంటే పుణ్యాలు తక్కువ ఉన్నాయి, ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది, “స్వర్గానికి వెళ్తానో నరకానికి వెళ్తానో తెలియదు” అని ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారంటే, ఆయనలో ఎంత దైవభీతి ఉండేదో ఆలోచించండి. అలాగే, మనము ఎలాంటి ఎక్కువ పుణ్యాలు చేయకపోయినా పరలోకాన్ని తలుచుకొని ఏడవట్లేదు అంటే, ఎలాంటి భ్రమలో మనము జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించండి మిత్రులారా.

సరే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణ సమయము సమీపించింది. ఆయన మదీనాలో ఉంటూ ఉన్నారు. మదీనా యొక్క నాయకుడు ఆ రోజుల్లో మర్వాన్ ఇబ్నుల్ హకం అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన పరామర్శించడానికి వచ్చారు. వచ్చి, “అల్లాహ్ మీకు స్వస్థత ప్రసాదించుగాక” అని ప్రార్థిస్తూ ఉంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అల్లాహ్ తో ప్రార్థించారు, “ఓ అల్లాహ్, నేను నీతో కలవటానికి ఇష్టపడుతూ ఉన్నాను, నువ్వు కూడా నన్ను నీ వద్దకు రావటానికి ఇష్టపడు” అని ప్రార్థించారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణము సంభవించింది.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మరణించిన తర్వాత వలీద్ బిన్ ఉత్బా బిన్ అబీ సుఫియాన్ రహిమహుల్లాహ్ వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క జనాజా నమాజు ఆచరించారు. తర్వాత అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి దేహాన్ని అల్-బఖీ, జన్నతుల్ బఖీ అంటుంటారు కదండీ, అల్-బఖీ అల్-గర్కద్, అందులో ఆయనకు ఖనన సంస్కారాలు చేయడం జరిగింది. 59వ హిజ్రీలో ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు ఇంచుమించు 80 సంవత్సరాలకు కొద్దిగా తక్కువ లేదంటే కొద్దిగా ఎక్కువ అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన తర్వాత రోజుల్లో వివాహం చేసుకున్న కారణంగా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. ఆ కుమార్తె యొక్క వివాహము గొప్ప తాబయీ, సయీద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ వారితో జరిగింది అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి 5,374 హదీసులు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. సహాబీలందరిలో ఎక్కువగా హదీసులు ఉల్లేఖించిన వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి హదీసుల్ని జీవితాంతం చాలా చక్కగా కంఠస్థం చేసుకొని భద్రంగా గుర్తుంచుకొని ఉన్నారు అని చెప్పటానికి ఒక ఉదాహరణ వినిపిస్తూ ఉన్నాను, చూడండి. ఆయన జీవించి ఉన్నప్పుడు మదీనా నాయకుడు మర్వాన్ ఇబ్నుల్ హకం అని ఇంతవరకు మనం విన్నాము కదా. ఆ మర్వాన్ అనే అతను ఏం చేశాడంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని పిలిపించి ఆ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి, ఈ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి అని కొన్ని హదీసులు అడిగారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ హదీసులన్నీ కూడా వినిపించారు. ఈయన ఏం చేశారంటే, ముందే ఒక వ్యక్తిని ఆదేశించి, ఆయన వినిపిస్తున్న హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకోండి అని ఆదేశించగా, తెర వెనుక ఒక వ్యక్తి ఆ హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని ఆ మర్వాన్ అనే వ్యక్తి పిలిపించి మళ్ళీ ఆ హదీసులు ఫలానా ఫలానా హదీసులు వినిపించండి అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు గత సంవత్సరం ఏ విధంగా వినిపించారో అదే విధంగా చక్కగా ఎలాంటి తప్పు దొర్లకుండా వినిపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వెళ్లిపోయిన తర్వాత తెర వెనుక కూర్చుని ఉన్న ఆ పత్రాన్ని గమనిస్తున్న వ్యక్తితో అడిగారు, “అబూ హురైరా కరెక్ట్ గానే వినిపించారా? ఏమైనా హెచ్చుతగ్గులు జరిగాయా?” అంటే, ఆ వ్యక్తి కూడా, “ఉన్నది ఉన్నట్టే ఆయన మొత్తం చెప్పారు, ఎలాంటి హెచ్చుతగ్గులు జరగలేదు” అని ఆ వ్యక్తి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జీవితాంతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్ని చక్కగా గుర్తుంచుకొని వేరే వారి వరకు చేరవేశారు అని మనకు ఈ సంఘటన తెలుపుతుంది.

ఆ ప్రకారంగా, నేను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉల్లేఖనాలు చదివి, నేర్చుకొని, ఇతరుల వద్దకు చేర్చే భాగ్యం ప్రసాదించుగాక. ఇది అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وَجَزَاكُمُ اللهُ خَيْرًا
[వ జజాకుముల్లాహు ఖైరన్]
మరియు అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=19741

సలీం జామిఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM

అల్లాహ్ శుభనామాల జ్ఞాన ప్రాముఖ్యత [వీడియోలు & టెక్స్ట్]

అల్లాహ్ శుభనామాల జ్ఞాన ప్రాముఖ్యత -1
షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
https://youtu.be/VXTqC6DrUHw [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, అల్లాహ్ యొక్క శుభ నామాల (అస్మా-ఉల్-హుస్నా) జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మరియు దాని వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించబడింది. అల్లాహ్‌ను తెలుసుకోవడానికి ఆయన నామాలను తెలుసుకోవడమే ప్రధాన మార్గమని, ఇది విశ్వాసాన్ని, ప్రేమను, భయభక్తులను పెంచుతుందని మరియు సరైన ఆరాధనకు పునాది అని నొక్కి చెప్పబడింది. అల్లాహ్ నామాలను తెలుసుకోవడం స్వర్గ ప్రవేశానికి, పాపాల నుండి దూరం కావడానికి, ఆత్మ శుద్ధికి మరియు ప్రార్థనల స్వీకరణకు దారితీస్తుందని వివిధ ఉదాహరణలు, ఖురాన్ ఆయతులు మరియు హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. ప్రజలపై ఆధారపడటాన్ని తగ్గించి, కేవలం అల్లాహ్‌పైనే నమ్మకం ఉంచేలా ఈ జ్ఞానం ఎలా సహాయపడుతుందో కూడా వివరించబడింది.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్)
శపించబడిన షైతాన్ నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మా ఉల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
మరియు అల్లాహ్ కొరకు శుభ నామాలు ఉన్నాయి, వాటి ద్వారానే మీరు ఆయనను ప్రార్థించండి.

సోదర మహాశయులారా, రండి ఈ రోజు మనం అల్లాహ్ యొక్క శుభ నామాల జ్ఞాన ప్రాముఖ్యత, శుభ నామాల జ్ఞానాన్ని మనం పొందితే మనకు ఏంటి లాభాలు, అల్లాహ్ యొక్క శుభ నామాల జ్ఞానం మనం నేర్చుకోవడం, దీనికి ఎంత గొప్ప ప్రాముఖ్యత ఉన్నదో కొన్ని పాయింట్స్ లలో దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

చూడండి, వలిల్లాహిల్ మసలుల్ ఆలా, నేను అల్లాహ్ కొరకు ఏ ఉపమానం ఇవ్వడం లేదు. ఫలా తజ్రిబూ లిల్లాహిల్ అమ్సాల్. మన తక్కువ జ్ఞానం, మన యొక్క బుర్రలో విషయం త్వరగా దిగడానికి అర్థం అవ్వడానికి ఒక చిన్న ఉదాహరణ. మీ ఊరిలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. ఎవడబ్బా ఇతను అని మీరు అనుకుంటారు. కానీ అతని వేషధారణను బట్టి ఏదో ఒక చిన్న అంచనా వేసుకుంటారు. కదా? దానివల్ల మరికొంత పరిచయం ఎంతైతే పెరుగుతుందో అంతే అతని పట్ల మీరు కొంచెం ఆకర్షితులవుతారు. ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, అతని యొక్క పరిచయంలో ఇంకా ఎక్కువ విషయాలు తెలిసి వచ్చేసరికి ఇంకా అతనికి ఆకర్షితులై, దగ్గరగా అయి మరింత ప్రేమ ఎక్కువ అవుతుంది. అవును కదా? అంతేకాదు, ఇక ఎవరికీ ఎలాంటి రిలేషన్ షిప్ లతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందో, అలాంటివి కొందరికి అత్తగారి సంబంధాలు అంటే కొంచెం ఎక్కువ లైక్ కదా? ఈ విధంగా, ఓ మా అత్తగారి ఊరి వారంట ఇతను అని అంటే, అరే ఇంటికి పిలిపించుకొని చాయన్నా తాగించాలి అని ఆలోచన వస్తుంది. ఇంకా నేను డీప్ లో వెళ్ళను. చిన్నగా మీకు అర్థం కావడానికి ఉదాహరణ ఇచ్చాను.

ఏ వ్యక్తి పట్ల అతని యొక్క పరిచయం మనకు ఎంత ఎక్కువగా తెలుస్తుందో, అతని పట్ల మన ప్రేమ, గౌరవ అభిమానం, అతని సేవ, అతని యొక్క ఆదేశాన్ని, అతను ఏదైనా మాటను శ్రద్ధగా వినడం, దాని తర్వాత దానిని ఆచరించే విషయం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి కదా?

సోదర మహాశయులారా, అల్లాహ్ మనందరి సృష్టికర్త, మన అందరి ఉపాధికర్త, పోషణకర్త, ఈ మొత్తం విశ్వాన్ని నిర్వహిస్తున్నవాడు, నడుపుతున్నవాడు. అతని గురించి మనం తెలుసుకోవడం, ఇది మనపై ఉన్నటువంటి విధులలో, బాధ్యతలో అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే మొట్టమొదటిది, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. నిన్ను కన్న తండ్రిని కొంచెం కూడా నువ్వు ఖాతరు చెయ్యవా? అని మనం అంటాము కదా? కన్న తండ్రి ద్వారా మనల్ని పుట్టించిన ఆ అసలైన సృష్టికర్తను తెలుసుకోకుంటే, అతని పరిచయం మనకు లేకుంటే ఎలా మరి?

అయితే అల్లాహ్ శుభ నామాల జ్ఞాన ప్రాముఖ్యత తెలుస్తుంది కదా ఇప్పుడు మీకు? అల్లాహ్ గురించి మనకు ఎక్కువగా తెలవాలంటే, అల్లాహ్ యొక్క పరిచయం మనకు కావాలంటే తప్పకుండా అల్లాహ్ యొక్క శుభ నామముల, ఉత్తమ గుణాల వివరణ మనకు ఎంత తెలుస్తుందో అంతే ఎక్కువ అల్లాహ్ యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. అందుకొరకే ఒకచోట ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఎంత మంచి మాట చెప్పారు:

مَعْرِفَةُ أَسْمَاءِ اللَّهِ الْحُسْنَى وَصِفَاتِهِ الْعُلَا هِيَ الطَّرِيقُ الرَّئِيسِيُّ إِلَى مَعْرِفَةِ اللَّهِ
(మారిఫతు అస్మాఇల్లాహిల్ హుస్నా వ సిఫాతిహిల్ ఉలా హియత్ తరీఖుర్ రఈసీ ఇలా మారిఫతిల్లాహ్)
అల్లాహ్ యొక్క శుభ నామాలు మరియు ఆయన ఉన్నత గుణగణాల యొక్క జ్ఞానం, అల్లాహ్ ను తెలుసుకోవడానికి ప్రధానమైన మార్గం.

అల్లాహ్ గురించి తెలుసుకోవడానికి అతి ప్రధానమైన మార్గం అల్లాహ్ యొక్క శుభ నామాలు మరియు ఉత్తమ గుణాలు. అందుకొరకే ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తరీఖుల్ హిజ్రతైన్‌లో చెబుతున్నారు:

وَلَيْسَتْ حَاجَةُ الْأَرْوَاحِ قَطُّ إِلَى شَيْءٍ أَعْظَمَ مِنْهَا إِلَى مَعْرِفَةِ بَارِئِهَا وَفَاطِرِهَا
(వలైసత్ హాజతుల్ అర్వాహి ఖత్తు ఇలా షైఇన్ ఆ’జమ మిన్హా ఇలా మారిఫతి బారిఇహా వ ఫాతిరిహా)
మనిషి యొక్క శరీరానికి తిండి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ అతని ఆత్మకు అల్లాహ్ యొక్క పరిచయం, అతన్ని పుట్టించినటువంటి సృష్టికర్త యొక్క పరిచయం చాలా అవసరం.

وَلَا سَبِيلَ إِلَى هَذَا إِلَّا بِمَعْرِفَةِ أَوْصَافِهِ وَأَسْمَائِهِ
(వలా సబీల ఇలా హాదా ఇల్లా బి మారిఫతి అవ్సాఫిహి వ అస్మాఇహి)
ఆయన గుణగణాలు మరియు నామాలను తెలుసుకోవడం ద్వారా తప్ప దీనికి మార్గం లేదు.

మరి ఇది ఎలా సాధ్యం? అల్లాహ్ యొక్క ఉత్తమ పేర్లు, అల్లాహ్ యొక్క ఉత్తమ గుణాలు తెలుసుకోవడం ద్వారానే సాధ్యము. ఇది ఒక పాయింట్.

రెండవ పాయింట్, అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు? ఎందుకు పుట్టించాడు? అల్లాహ్‌ను ఆరాధించడానికి. ఎప్పటివరకైతే మనం అల్లాహ్ యొక్క పరిచయం అతని శుభ నామాల ద్వారా మంచి రీతిలో తెలుసుకోమో, అతని యొక్క ఆరాధన కూడా సరియైన రీతిలో చేయలేము. అల్లాహ్ యొక్క ఆరాధన మంచి రీతిలో చేయడానికి, అల్లాహ్ యొక్క శుభ నామాలను తెలుసుకోవడం చాలా చాలా అవసరం.

మూడో విషయం, అల్లాహ్‌ను విశ్వసించడం తప్పనిసరి కదా? అయితే, అల్లాహ్‌ను మనం ఎంత ఎక్కువగా అతని శుభ నామాల ద్వారా తెలుసుకుంటామో, అంతే మన విశ్వాసం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. షేఖ్ అబ్దుర్రహ్మాన్ అస్-సాదీ రహిమహుల్లాహ్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియపరిచారు.

ఇంకా, సోదర మహాశయులారా, సహీ బుఖారీలో వచ్చిన హదీస్ మీకు తెలుసు. నాలుగో పాయింట్‌ లో ఈ విషయం నోట్ చేసుకోండి. ఏంటి? ఎవరు ఎంత ఎక్కువగా అల్లాహ్ యొక్క నామాలను, ఉత్తమ పేర్లను తెలుసుకుంటారో, అంతే వారు స్వర్గంలో ప్రవేశించడానికి ఎక్కువ అర్హత కలిగి ఉంటారు.

إِنَّ لِلَّهِ تِسْعَةً وَتِسْعِينَ اسْمًا، مَنْ أَحْصَاهَا دَخَلَ الْجَنَّةَ
(ఇన్న లిల్లాహి తిస్’అతన్ వ తిస్’ఈన ఇస్మన్, మన్ అహ్సాహా దఖలల్ జన్నహ్)
నిశ్చయంగా అల్లాహ్ కొరకు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి, ఎవరైతే వాటిని లెక్కిస్తారో (పూర్తిగా గ్రహిస్తారో) వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.

అల్లాహ్ కొరకు ఒకటి కంటే ఒకటి తక్కువ వంద, అంటే తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి. మన్ అహ్సాహా దఖలల్ జన్నహ్. ఎవరైతే దానిని లెక్కించారో స్వర్గంలో ప్రవేశిస్తారు. ‘అహ్సా‘, ఇక్కడ ఏదైతే అరబీ పదం వచ్చిందో ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తెలుపుతున్నారు, దీని యొక్క భావం ఏమిటంటే ఇందులో మూడు విషయాలు రావడం తప్పనిసరి, అప్పుడే ‘అహ్సా’ ఈ యొక్క సరియైన అర్థాన్ని, భావాన్ని అతను ఆచరించిన వాడు అవుతాడు. అప్పుడే అతడు స్వర్గంలో ప్రవేశించడానికి అర్హుడు అవుతాడు.

మొదటిది, అల్లాహ్ యొక్క శుభ నామాలను తెలుసుకోవాలి, ఆ పదాలను, వాటి భావాలను తెలుసుకోవాలి.

రెండవది, ఆ భావాలు ఏదైతే తెలుసుకుంటున్నాడో, ప్రతి ఒక్క అల్లాహ్ పేరుకు ఒక అర్థం ఉంటుంది కదా, ఉదాహరణకు అర్-రహ్మాన్, అనంత కరుణామయుడు. ఇప్పుడు పదం తెలిసింది, అల్లాహ్ యొక్క పేరు రహ్మాన్ అని తెలిసింది, దాని యొక్క భావం తెలిసింది. ఆ భావం ద్వారా మనపై వచ్చి పడే బాధ్యతలు ఏమిటి? అది కూడా తెలుసుకోవాలి. అంటే, అల్లాహ్ కంటే ఇంకా ఎవరైనా వేరే వారు కరుణించే విషయంలో గొప్పగా ఉన్నారు అని నమ్మవద్దు, అలాంటి ఆశతో వేరే ఎవరి వైపునకు మరలవద్దు.

ఇంకా, మూడో విషయం, అల్లాహ్ యొక్క ఈ నామాలు తెలుసుకొని, భావాలు తెలుసుకొని, వాటి యొక్క బాధ్యత ఏమిటో తెలుసుకొని, అల్లాహ్‌ను ఆ శుభ నామాల ద్వారా అర్ధించాలి, దుఆ చేయాలి, వేడుకోవాలి. ఇదే విషయం అల్లాహ్ చెప్పాడు సూరతుల్ ఆరాఫ్, ఆయత్ నెంబర్ 180 లో:

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మా ఉల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
అల్లాహ్ కు చాలా మంచి పేర్లు ఉన్నాయి, మీరు ఆ పేర్ల ఆధారంగానే అల్లాహ్‌తో దుఆ చేయండి.

ఇప్పుడు ఈ ఆయత్, సూరా ఆరాఫ్ ఆయత్ నెంబర్ 180 మరియు సహీ బుఖారీ లో వచ్చిన హదీస్, ఈ రెండిటిని కలిపి ఒక ముఖ్యమైన మాట చెబుతున్నాను శ్రద్ధ వహించండి. సర్వసామాన్యంగా అల్లాహ్ యొక్క పేర్లు ఎన్ని అని మనం ఎవరినైనా అడిగితే వెంటనే 99 అని చెప్పేస్తాం. అయితే గుర్తుంచుకోండి, అల్లాహ్ యొక్క పేర్లు లెక్కలేనన్నివి. అయితే సహీ బుఖారీలో వచ్చిన హదీస్ భావం ఏంటంటే, 99 పేర్లు కనీసం తెలుసుకుంటే, వాటి యొక్క హక్కును నెరవేరుస్తే స్వర్గ ప్రవేశ భాగ్యం లభిస్తుంది. పేర్లు ఎన్ని అంటే 99 అనకూడదు. లెక్కలేనన్ని పేర్లు. ఎందుకంటే ముస్నద్ అహ్మద్‌లో మరొక హదీస్ కూడా ఉంది. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దుఆ నేర్పారు:

اللَّهُمَّ إِنِّي عَبْدُكَ وَابْنُ عَبْدِكَ وَابْنُ أَمَتِكَ
(అల్లాహుమ్మ ఇన్నీ అబ్దుక వబ్ను అబ్దిక వబ్ను అమతిక…)
ఓ అల్లాహ్, నిశ్చయంగా నేను నీ దాసుడను, నీ దాసుని కుమారుడను మరియు నీ దాసురాలి కుమారుడను…
తో ప్రారంభమవుతుంది. ఇన్షాఅల్లాహ్ దాని యొక్క వివరణ ఇంతకు ముందు కూడా ఎన్నో సందర్భాల్లో మేము చెప్పి ఉన్నాము.

ఐదో పాయింట్ ఏంటంటే, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఉత్తమ నామాలు మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అతని పట్ల ప్రేమ అంతే ఎక్కువగా పెరుగుతుంది. అవును, ఇది వాస్తవం. దీనికి సంబంధించి ఖురాన్‌లో నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల నుండి ఎన్నో ఆధారాలు మనం తీసుకోవచ్చు. కానీ స్టార్టింగ్‌లో నేను ఏదైతే ఒక ఉదాహరణ ఇచ్చానో, దాని ద్వారా కూడా మీకు విషయం అర్థమవుతుంది కదా? ఒక వ్యక్తి యొక్క గుణగణాలు ఎన్ని ఎక్కువ తెలిసి వస్తాయో, అతని సంబంధం మనకు ఎంత దగ్గరగా ఉంది అని తెలిసి వస్తుందో, అంతే అతని పట్ల ప్రేమ పెరుగుతుంది కదా? ఆ విధంగా, అల్లాహ్ యొక్క నామములు, అల్లాహ్ యొక్క ఉత్తమ పేర్లు మనం తెలుసుకోవాలి. రహ్మాన్, రహీమ్, అల్-మలిక్, అల్-ఖుద్దూస్…

ఆరవ పాయింట్ – అల్లాహ్ ఉత్తమ నామాలు ప్రాముఖ్యత, ఘనత, లాభం ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క నామాలను ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, వాటి హక్కును నెరవేరుస్తామో, అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు! మనము అల్లాహ్‌ను ప్రేమిస్తున్నాము అని అనుకుంటాము. అది ఎంతవరకు అందులో సత్యమో, అల్లాహ్ యే సత్యవంతులుగా మనల్ని తేల్చుగాక, సత్యంగా ఉంచుగాక. కానీ, అల్లాహ్ నామములు ఎంత ఎక్కువగా తెలుసుకొని వాటి హక్కులు నెరవేరుస్తామో అంతే ఎక్కువగా అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు. సహీ బుఖారీలో దీని గురించి దలీల్ ఉంది. తెలుసు కదా ఆ సంఘటన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హదీస్ యొక్క సారాంశం చెబుతున్నాను, సహీ బుఖారీ లోని హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలలో ఒక సహాబీ నమాజ్‌లో సూరే ఫాతిహా తర్వాత ఏదైనా సూరా చదివిన తర్వాత, సూరతుల్ ఇఖ్లాస్ కూడా చదువుతూ ఉండేవాడు. అయితే వెనుక ముఖ్తదీలకు కొంచెం విచిత్రంగా ఏర్పడి ప్రవక్తతో తెలియజేశారు. ప్రవక్త చెప్పారు, “అడగండి అతను అలా ఎందుకు చేస్తున్నాడు?” అని.

فَسَأَلُوهُ، فَقَالَ: لِأَنَّهَا صِفَةُ الرَّحْمَٰنِ، وَأَنَا أُحِبُّ أَنْ أَقْرَأَ بِهَا
(ఫసఅలూహు, ఫఖాల: లి అన్నహా సిఫతుర్ రహ్మాన్, వ అన ఉహిబ్బు అన్ అఖ్రఅ బిహా)
వారు అతనిని అడిగారు, అప్పుడు అతను ఇలా అన్నాడు: “ఎందుకంటే అది దయామయుని (అల్లాహ్) గుణగణం, మరియు నేను దానిని పఠించడానికి ఇష్టపడతాను.”

అందులో అల్లాహ్ యొక్క గుణగణాలు ఉన్నాయి. అల్లాహ్ యొక్క ఉత్తమ పేర్ల ప్రస్తావన ఉంది. అందుకొరకే అది నాకు చాలా ప్రియమైనది.

فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَخْبِرُوهُ أَنَّ اللَّهَ يُحِبُّهُ
(ఫఖాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం: అఖ్బిరూహు అన్నల్లాహ యుహిబ్బుహు)
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతనికి తెలియజేయండి, నిశ్చయంగా అల్లాహ్ అతనిని ప్రేమిస్తున్నాడు.”

ఆ వ్యక్తికి మీరు వెళ్లి శుభవార్త ఇవ్వండి, అల్లాహ్ ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. అల్లాహ్ యొక్క నామాలను, శుభ నామాలను, ఉత్తమ పేర్లను ఎంత ఎక్కువగా మనం తెలుసుకుంటామో, అంతే ఎక్కువగా అల్లాహ్ యొక్క ప్రేమ అనేది మనకు లభిస్తుంది.

ఇక రండి, ధర్మవేత్తలు ఈ సబ్జెక్టు మీద ఎంత పనిచేసారు! అల్లాహు అక్బర్! పాతకాలపు ఇమాములు మరియు ప్రస్తుతం ఉన్నటువంటి ధర్మవేత్తల్లో షేఖ్ అబ్దుర్రహ్మాన్ అస్-సాదీ గానీ, షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ గానీ, హిస్నుల్ ముస్లిం పుస్తకం ఉంది కదా, దాని యొక్క రచయిత షేఖ్ సయీద్ అల్-కహ్తానీ, వీరందరూ కూడా వీటిపై పుస్తకాలు రాసి ఉన్నారు.

ఏడవ పాయింట్: అల్లాహ్ యొక్క శుభ నామాలు, ఉత్తమ పేర్ల జ్ఞానం యొక్క ప్రాముఖ్యత, లాభం, ఘనతలో ఏమిటంటే మనం అల్లాహ్ యొక్క నామాల గురించి ఎంత మంచిగా, వివరంగా, ఎంత లోతుగా తెలుసుకుంటామో, అంతే ఎక్కువగా అల్లాహ్‌కు దగ్గరగా అయి ప్రపంచ వాసులతో సంబంధం తక్కువ ఉంటుంది. అంటే ఏంటి? అల్లాహ్‌ను సరియైన రీతిలో మనం తెలుసుకొని, అతని యొక్క హక్కు సరియైన రీతిలో మనం నెరవేరుస్తూ, ప్రజల అవసరాలు లేకుండా వారి ముందు చెయ్యి చాపకుండా, వారి ముందు అర్ధించకుండా, భిక్షాటన చేయకుండా ఉండగలుగుతాము. అవును, దీనికి సంబంధించి చాలా వివరాలు ధర్మవేత్తలు రాసి ఉన్నారు. సంక్షిప్తంగా ఒక రెండు విషయాలు నేను చెప్తాను. ఇన్షాఅల్లాహ్ మీకు ఈ మాట అర్థమవుతుంది.

ఎప్పుడైతే అల్లాహ్ మాత్రమే ‘ఘనీ‘, ఆయనే నిరపేక్షాపరుడు మరియు నన్ను కూడా ప్రజల అవసరం లేకుండా చేయగలడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకం ఉండి, సూరె ఫాతిర్ ఆయత్ నెంబర్ 15:

يَا أَيُّهَا النَّاسُ أَنتُمُ الْفُقَرَاءُ إِلَى اللَّهِ
(యా అయ్యుహన్ నాస్ అన్తుముల్ ఫుఖరాఉ ఇలల్లాహ్)
ఓ ప్రజలారా, అల్లాహ్ ముందు మీరందరూ కూడా అడిగేవారు, భిక్షాటన చేసేవారు. అల్లాహ్ యొక్క అవసరం మీరు కలిగి ఉన్నారు.

وَاللَّهُ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ
(వల్లాహు హువల్ ఘనియ్యుల్ హమీద్)
మరియు అల్లాహ్, ఆయనే ఎవరి అవసరం కలిగిలేడు, ప్రశంసనీయుడు.

ఆయన అల్-ఘనీ, ఎవరి అవసరం కలిగిలేడు. అల్-హమీద్, ఎవరు ప్రశంసించినా ప్రశంసించకపోయినా, అతడు అన్ని రకాల ప్రశంసలకు అర్హుడు. ఈ ఆయత్, ఇలాంటి భావంలో ఉన్నటువంటి అల్-ఘనీ, అల్లాహ్ యొక్క పేర్లలో గొప్ప పేరు, దాని యొక్క భావం, అర్థం, మరి దాని యొక్క బాధ్యత మనపై, మనిషి మంచి రీతిలో ఖురాన్ హదీసుల ఆధారంగా తెలుసుకున్నాడంటే, అల్లాహ్ తో అర్ధిస్తాడు, అల్లాహ్ యే నిరపేక్షాపరుడు కనుక నన్ను ప్రజల అవసరం లేకుండా చేస్తాడు అన్నటువంటి నమ్మకం ఎక్కువగా కలిగి ఉంటాడు. ఇక దీనికి ఉదాహరణలు ఇవ్వాలంటే స్వయం ప్రవక్త జీవితంలో నుండి, సహాబాల నుండి చాలా ఉన్నాయి. ఒక్క చిన్న ఉదాహరణ అర్థం కావడానికి ఇవ్వడం జరిగింది.

అలాగే సోదర మహాశయులారా, అల్లాహ్ అల్-మలిక్, అల్-మాలిక్. ఆయనే రాజు. ఆయనే సర్వాధికుడు. ఈ ఆయత్, దీని యొక్క లోతైన జ్ఞానం, దీనికి సంబంధించిన ఆయతులు వాటిని మనం అర్థం చేసుకున్నామంటే:

وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا
(వలిల్లాహి ముల్కుస్ సమావాతి వల్ అర్జి వమా బైనహుమా)
ఆకాశాల మరియు భూమి యొక్క మరియు వాటి మధ్య ఉన్న సమస్తం యొక్క ఆధిపత్యం అల్లాహ్ కే చెందింది.

ఆకాశాలు, భూమి, వమా బైనహుమా, వీటి మధ్యలో ఉన్న సమస్తానికి ఏకైక అధికారుడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఇక ఈ లోకంలో ఎవరికి ఏదైనా చిన్న అధికారం ఉంటే వారితో భయపడడం, ఏదైనా అవసరం ఉంటే ఆ అధికారుల వద్దకు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, ఇట్లాంటి పనులు చేయడు.

8వ పాయింట్ : సోదర మహాశయులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయి. కానీ రండి, మరొక విషయం ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క నామాలను ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, వాటి హక్కును నెరవేరుస్తామో, అల్లాహ్ పట్ల భయం, అల్లాహ్ యొక్క గౌరవం ఎక్కువగా పెరుగుతుంది. అవును.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు చెప్పారు, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఈ విషయాన్ని మిఫ్తాహు దారిస్ సాదాలో ప్రస్తావించారు. ఏమిటంటే:

كَفَى بِخَشْيَةِ اللَّهِ عِلْمًا وَكَفَى بِالِاغْتِرَارِ بِاللَّهِ جَهْلًا
(కఫా బి ఖష్యతిల్లాహి ఇల్మన్ వ కఫా బిల్ ఇగ్తిరారి బిల్లాహి జహలా)
మనిషి ఎంత ఎక్కువగా అల్లాహ్ గురించి తెలుసుకుంటాడో అంతే ఎక్కువగా అల్లాహ్‌కు భయపడతాడు మరియు మనిషి ఎంత ఎక్కువగా అల్లాహ్ పట్ల అజ్ఞానంగా ఉంటాడో, అంతే అల్లాహ్ విషయంలో మోసపోయి పాపాలకు గురి అయి ఉంటాడు

ఒకవేళ ఈ భావం మరింత మంచిగా మీకు అర్థం కావాలంటే సూరె ఫాతిర్, ఆయత్ నెంబర్ 28 చదవండి:

إِنَّمَا يَخْشَى اللَّهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاءُ
(ఇన్నమా యఖ్శల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా)
నిశ్చయంగా, ఆయన దాసులలో జ్ఞానులు మాత్రమే అల్లాహ్‌కు భయపడతారు.

అల్లాహ్‌తో భయపడేది, అల్లాహ్ గురించి ఎక్కువగా తెలిసిన వారు. ధర్మ జ్ఞానం కలిగి ఉన్నవారు, అల్లాహ్‌కు సంబంధించిన జ్ఞానం కలిగి ఉన్నవారే అల్లాహ్‌తో ఎక్కువగా భయపడతారు. మరియు సహీ హదీసులో వచ్చిన విధంగా బుఖారీ మరియు ముస్లింలో, ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చెప్పారు?

أَنَا أَعْلَمُكُمْ بِاللَّهِ وَأَشَدُّكُمْ لَهُ خَشْيَةً
(అన ఆ’లముకుం బిల్లాహి వ అషద్దుకుం లహు ఖశ్యహ్)
నేను మీ అందరిలో అల్లాహ్ గురించి బాగా తెలిసిన వాడను మరియు ఆయనకు అత్యధికంగా భయపడే వాడను.

అల్లాహ్ గురించి నేను మీ అందరిలో ఎక్కువగా తెలిసినవాన్ని, మీ అందరిలో అల్లాహ్ పట్ల ఎక్కువగా భయం కలిగి ఉన్నవాన్ని. అర్థమైందా? అల్లాహ్ యొక్క నామ ప్రాముఖ్యత తెలుస్తుందా?

సోదర మహాశయులారా, తొమ్మిదవ పాయింట్, మనం అల్లాహ్ యొక్క ఉత్తమ నామాల గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అంతే ఎక్కువగా పాపాలకు దూరం ఉండగలుగుతాము. తద్వారా నరకం నుండి మోక్షం పొందగలుగుతాము. అవును, ఎంత ఎక్కువగా అల్లాహ్ గురించి తెలుసుకోగలుగుతామో, అంతే పాపాలకు దూరంగా ఉండగలుగుతాము. అవునా లేదా? దీనికి సంబంధించి కూడా ఎన్నో ఆయతులు, ఎన్నో హదీసులు ఉన్నాయి. కానీ ఒక చిన్న ఉదాహరణ, ఉపమానం ద్వారా మీకు చెబుతాను.

ఏదైనా బంగారం దుకాణంలో దొంగలించాలని, ఆ… ఎక్కడ ఎవరు లేరు, ఏ పోలీస్ వారు కూడా లేరు అని దుకాణానికి ఏదైనా బొక్క వేయాలని దొంగ దగ్గరికి వస్తున్నాడు, అంతలోనే అటు నుంచి పోలీస్ బండి వస్తుంది. ఏమవుతుంది? అలాగే అదే ఉద్దేశంతో, అదే ధైర్యంతో దొంగతనం చేయడానికి వెళ్తాడా? లేదా కెమెరాలు నలువైపుల నుండి ఉన్నాయి, అలాంటి చోట ఏదైనా పాపం, దోషం, నేరం, తప్పు… అంతెందుకండి, సిగ్నల్ వద్దకు వచ్చాము, రెడ్ లైట్ ఉంది, అక్కడ కెమెరాలు కూడా ఉన్నాయి సిగ్నల్ పై, మళ్లీ పోతే పోలీస్ కెమెరా కూడా పట్టుకొని ఉన్నాడు. మీరు దాటారంటే క్లిక్ కొడతాడు. దాటుతారా? దాటరు కదా? వలిల్లాహిల్ మసలుల్ ఆలా. అల్లాహ్ కొరకు కాదు ఈ ఉపమానాలు, మనకు అర్థం కావాలి అని.

ఇన్న బత్ష రబ్బిక లషదీద్. నీ ప్రభువు పట్టుకోవడానికి, శిక్షించడానికి వచ్చినప్పుడు ఎవరు కూడా అతని పట్టు నుండి వదులుకోలేరు అన్న విషయంపై మనకు కచ్చితమైన నమ్మకం ఉండేది ఉంటే. అల్లాహు తాలా చీకట్లలో కూడా అలాగే చూస్తాడు, ఎలాగైతే పట్టపగలు మిట్ట మధ్యాహ్నం చూస్తాడో అన్నటువంటి నమ్మకం మనకు ఉండేది ఉంటే, పాపంలో ముందడుగు వేయగలుగుతామా, ధైర్యం చేయగలుగుతామా?

అల్లాహ్ యొక్క శుభ నామములు, ఉత్తమ పేర్లు ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అంతే ఎక్కువగా పాపాల నుండి దూరం ఉండి నరకం నుండి మోక్షం పొందగలుగుతాము.

10వ పాయింట్, అల్లాహ్ యొక్క నామములు ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అంతే మన ఆత్మ శుద్ధి కలుగుతుంది. పాపాల పట్ల ఆలోచన, పాపాల పట్ల ఒక రకమైన ఆకర్షణ అనేది తగ్గుతుంది. దానికి బదులుగా పుణ్యాల వైపు ఆలోచనలు ఎక్కువగా కలిగి మనం పుణ్యాలు చేయడానికి పూనుకుంటాం. సూరతుష్ షమ్స్, అలాగే సూరతుల్ ఆలా యొక్క ఆయతుల ద్వారా ఈ విషయం మనకు బోధపడుతుంది. అలాగే, సూరత్ ఆల ఇమ్రాన్ మరియు సూరతుల్ జుమాలో వచ్చిన ఆయతుల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉద్దేశం పంపడానికి ఇదే అన్నట్లుగా అల్లాహు తాలా చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు.

సోదర మహాశయులారా, సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఏమిటి? అల్లాహ్‌ను ఎంత ఎక్కువగా మనం అతని శుభ నామాల ద్వారా తెలుసుకుంటామో, అంతే విశ్వాసం పెరుగుతుంది, అతని పట్ల ప్రేమ పెరుగుతుంది, స్వర్గానికి దగ్గరవుతాము, పాపాలకు దూరంగా ఉండి నరక మోక్షం పొందుతాము, అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు.

లాస్ట్, ఫైనల్, ఇంపార్టెంట్ విషయం. – మనం అల్లాహ్ యొక్క నామాలతో దుఆ చేస్తే… అల్లాహ్ యొక్క నామాలు మనం మంచిగా తెలుసుకొని వాటి ఆధారంగా, ఏ దుఆ మనకు చేయవలసిన అవసరం ఉందో దానికి అనుగుణంగా ఏ అల్లాహ్ యొక్క పేరు ఉందో దాని ఆధారంగా దుఆ చేస్తే, వెంటనే, త్వరగా దుఆ స్వీకరించబడే అవకాశాలు పెరుగుతాయి. దీనికి సంబంధించి కూడా సహీ బుఖారీ, ముస్లింలోని హదీసులు ఉన్నాయి. సూరతుల్ ఇఖ్లాస్ యొక్క వ్యాఖ్యానం మీరు చదివారంటే అందులో కూడా ఆ హదీసులు వస్తాయి. ఒక సందర్భంలో ఒక సహాబీ వచ్చి:

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِأَنَّكَ أَنْتَ اللَّهُ الْأَحَدُ الصَّمَدُ الَّذِي لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
(అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బి అన్నక అంతల్లాహుల్ అహదుస్ సమద్, అల్లజీ లమ్ యలిద్ వలమ్ యూలద్ వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్)
ఓ అల్లాహ్, నిశ్చయంగా నేను నిన్నే వేడుకుంటున్నాను, ఎందుకంటే నీవే అల్లాహ్, ఏకైకుడవు, నిరపేక్షాపరుడవు. ఆయన ఎవరినీ కనలేదు, ఎవరి చేతా కనబడలేదు. మరియు ఆయనకు సరిసమానులెవరూ లేరు.

అని అన్నాడు, ప్రవక్త వెంటనే ఏమి చెప్పారు? ఇతను అల్లాహ్ యొక్క ఎంతటి గొప్ప పేర్లతో అర్ధిస్తున్నాడు అంటే ఇక అతడు ఏ ఏమీ అడిగినా అల్లాహ్ ప్రసాదిస్తాడు, ఏ దుఆ చేసినా అల్లాహ్ స్వీకరిస్తాడు.

అల్లాహ్ శుభనామాల జ్ఞాన ప్రాముఖ్యత -2 || షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
https://youtu.be/o2Az39e4Gvs [34 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త ఏ విద్య అత్యంత శ్రేష్ఠమైనది మరియు ఘనత గలది అనే ప్రశ్నతో ప్రారంభించి, దాని సమాధానం అల్లాహ్ గురించిన జ్ఞానమేనని స్పష్టం చేశారు. అల్లాహ్ యొక్క నామాలు, గుణాలు మరియు పనుల గురించి తెలుసుకోవడమే అన్ని జ్ఞానాలలోకి గొప్పదని, దీనిని ‘అల్-ఫిఖ్ హుల్-అక్బర్’ (అత్యున్నత అవగాహన) అని అంటారని వివరించారు. ఒక ఎత్తైన భవనానికి బలమైన పునాది ఎంత అవసరమో, మన ఆరాధనలు మరియు విశ్వాసానికి అల్లాహ్ గురించిన సరైన జ్ఞానం అంత అవసరమని ఒక ఉదాహరణతో పోల్చారు. ఖురాన్‌లోని సూరత్ అత-తౌబా, సూరత్ అత-తలాఖ్ మరియు సూరత్ అల్-మునాఫిఖూన్ వంటి అధ్యాయాల నుండి ఆయత్‌లను ఉటంకిస్తూ, అల్లాహ్ తన సృష్టిని మనకు పరిచయం చేసింది మనం ఆయనను తెలుసుకోవడానికేనని నొక్కి చెప్పారు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ మరియు షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా వంటి పండితుల మాటలను ప్రస్తావిస్తూ, ఖురాన్‌లో స్వర్గంలోని సుఖాల కంటే అల్లాహ్ గుణగణాల ప్రస్తావనే ఎక్కువగా ఉందని తెలిపారు. చివరగా, మన సిరిసంపదలు మరియు సంతానం అల్లాహ్ ధ్యానం నుండి మనల్ని మరల్చరాదని, అల్లాహ్ గురించిన జ్ఞానంతో మన విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలని హితవు పలికారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمْمَدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ.
[అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.]
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్, ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత.

ప్రియ మిత్రులారా, కొన్ని రకాల విద్యలో ఏ విద్య ఎక్కువ ఘనత గలది? ఏ విద్యను నేర్చుకోవడంలో సమయం కేటాయించడం ఎక్కువ ఘనత గల విషయం? ఏ విద్యను మనం నేర్చుకుంటే మనకు ఎక్కువ లాభం కలుగుతుంది? ఈ మూడు ప్రశ్నలకు కూడా సమాధానం ఒకటే. ఏమిటి? ఆ విద్య దేనికి సంబంధించిందో దానిని బట్టి ఆ ఘనత, ఆ లాభం ఉంటుంది.

ఈ విధంగా, ఇప్పుడు మన ముందు ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి. ధర్మ విద్యకు సంబంధించి కూడా అందులో మరీ ఎన్నో అంశాలు, ఎన్నో వివరాలు ఉన్నాయి. వాటన్నిటిలోకెల్లా అతి గొప్ప ఘనత గల విషయం, అల్లాహ్ త’ఆలా యొక్క పేర్ల గురించి, ఉత్తమ నామాల గురించి, సుందరమైన గుణాల గురించి తెలుసుకోవడం. దానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకోవడం ఇతర జ్ఞానాల కంటే ఎక్కువ ఘనత గల విషయం. ఇందులో మన సమయాన్ని వెచ్చించడం మన కొరకు ఎక్కువ లాభదాయకమైన విషయం. దీనినే కొందరు ధర్మవేత్తలు

أَلْفِقْهُ الْأَكْبَرُ
[అల్ ఫిఖ్ హుల్ అక్బర్]
అత్యున్నత అవగాహన

అని చెప్పారు. అంటే అతి పెద్ద, అతి గొప్ప ధర్మ అవగాహన.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో, ధర్మ అవగాహన ఎవరికైతే ప్రసాదించబడినదో వారి యొక్క ఘనత తెలుపుతూ ఏమన్నారు? సహీ బుఖారీలోని హదీస్, హజ్రత్ ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు.

مَنْ يُرِدِ اللَّهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ
[మన్ యురిదిల్లాహు బిహి ఖైరన్ యుఫఖ్ఖిహ్ హు ఫిద్దీన్]
అల్లాహ్ ఎవరికైతే మేలు చేయాలని తలుస్తాడో, అతనికి ధర్మంలో అవగాహనను ప్రసాదిస్తాడు.

అల్లాహు త’ఆలా ఎవరి పట్లనైతే మేలు చేయగోరుతాడో, అతనికి ధర్మ అవగాహన ప్రసాదిస్తాడు. ధర్మం మన జీవిత విధానం. ఎక్కడి నుండి వచ్చింది? అల్లాహ్ నుండి వచ్చింది. ఆ అల్లాహ్ నుండి వచ్చిన ఈ ధర్మ జ్ఞానంలో అతి ఉత్తమమైన, ఉన్నతమైన, ప్రప్రథమమైన నేర్చుకోవలసిన విషయం అల్లాహ్ గురించి. ఎందుకంటే ధర్మం యొక్క అసలు మూలం ఏంటి? నేను దాసుణ్ణి, అతడు నా యజమాని. నా జీవితమే అతని దాస్యంలో ఉండాలి. ఎలా చేయాలి ఆ దాస్యం? ఆయన నేర్పుతాడు, మనం నేర్చుకొని అలాగే ఆచరిస్తాము. అందుకొరకే అల్లాహ్ గురించి తెలుసుకోవడమే సర్వ విద్యల్లో, అన్ని రకాల జ్ఞానాల్లో అతి గొప్ప ఘనత గల విషయం.

ఇక రండి, ఈ విషయాన్ని మరో రకంగా తెలుసుకుందాము. మీరు ఎంత మంచి, ఎంత ఎత్తైన భవనం కట్టాలనుకుంటారో, అంతే పునాదిని గట్టిగా, బలంగా, దృఢంగా చేస్తారు. అవునా కాదా? కేవలం, కేవలం గడ్డి వేసి పైన ఏదో చిన్న వర్షం నీళ్లు పడకుండా ప్లాస్టిక్ కవర్ ఏదైనా వేసుకోవడానికి చిన్నపాటి గుంజల మీద మనం ఒక కప్పు లాంటిది వేసేస్తాము. అదే ఒకవేళ స్లాబ్ వేయాలంటే, పునాదులు మంచిగా లోతుగా త్రవ్వి, రాళ్లతో, సిమెంట్ తో, ఐరన్ (ఇనుము)తో కలిసిన అన్ని విషయాల ద్వారా, మళ్లీ దానిలో పిల్లర్లను లేపి దానిపై స్లాబ్ వేస్తాము. ఇది ఒక్క స్లాబ్ విషయం అయితే. అదే ఒకవేళ ఎత్తైన భవనాలు 10 అంతస్తులు, 20 అంతస్తులు, 30, 40, 70 కట్టాలనుకుంటే, అంతే ఎక్కువగా పునాది బలంగా, దృఢంగా తయారు చేయడం జరుగుతుంది. కదా?

ఇది లాజిక్ పరంగా, సామాన్య మనిషికి కూడా బుద్ధి జ్ఞానాల్లో వచ్చే విషయమే కదా? అయితే మనం ఈ లోకంలో ఎన్ని పుణ్యాలు చేసుకున్నా, మన వద్ద ఎంత ఎక్కువ ధర్మ అవగాహన కలిగి ఉన్నా, ఇదంతా కూడా పై భవనాల మాదిరిగా. ఒకవేళ పునాది బాగు లేకుంటే, దృఢంగా లేకుంటే ఈ భవనం పైన ఏదైతే మేడలు కడుతున్నామో అవి గట్టిగా ఉండవు, చిన్నపాటి కదలికకు కూడా, వేగంగా వీచే గాలికి కూడా పడిపోవచ్చు. అలాగే అల్లాహ్ గురించి తెలుసుకోవడం, అల్లాహ్ యొక్క నామాల గురించి, అతని ఉత్తమ గుణాల గురించి తెలుసుకోవడం, వాటి ప్రకారంగా మన విశ్వాసాన్ని దృఢంగా ఉంచడం, ఈ విశ్వాసం అల్లాహ్ గురించి కావలసిన నమ్మకం ఇది బలమైన పునాది లాంటిది. ఈ పునాది ఎంత గట్టిగా ఉంటుందో, అంతే బలంగా పై భవనాలు ఉంటాయి, మేడలు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి.

అల్లాహ్ యొక్క పేర్లలో అల్-అలీమ్, అల్-బసీర్, అస్-సమీ‘ ఇవన్నీ మనం విన్నాము. చిన్నపాటి వివరణ, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆయతులు, కొన్ని వివరాలు చెప్పగలిగాను. కానీ వాటిని మనం అర్థం చేసుకున్నామా? కేవలం ఇప్పుడు ఒక మూడు పేర్ల విషయమే తీసుకోండి మీరు. వాస్తవంగా ప్రతిక్షణం అల్లాహ్ నన్ను చూస్తూ ఉన్నాడు, నా నుండి వింటూ ఉన్నాడు, నా గురించి అన్నీ తెలిసి ఉన్నాడు అన్నటువంటి బలమైన, ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటే, అతని యొక్క అవిధేయత మనం చేయగలమా?

తండ్రి ముంగట ఉండి బీడీ, సిగరెట్ బయటికి తీసే వాడినే మనం ఎంత దుష్టుడివిరా, ఎంత దుర్మార్గుడివి నువ్వు, ఇంత కూడా నీకు తండ్రి యొక్క విలువ తెలియదా అన్నట్లుగా మనం అతన్ని నిందిస్తాము. కదా? మరి ఏ ఒక్క క్షణమైనా మనం అల్లాహ్ దృష్టి నుండి దూరం ఉన్నామా? అల్లాహ్ చూడకుండా మనం ఎక్కడైనా దాచుకోగలుగుతామా? అర్థమవుతుందా? అల్లాహ్ యొక్క పేర్లు, అల్లాహ్ యొక్క నామాలు, అల్లాహ్ యొక్క ఉత్తమ గుణాల గురించి తెలుసుకోవడం ఎంత అవసరం ఉన్నది.

సోదర మహాశయులారా, ఈ భవనాల యొక్క సామెత ఏదైతే ఇప్పుడు ఇచ్చానో, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ వారు దీని గురించి చాలా స్పష్టంగా, చాలా వివరంగా దీని గురించి చెప్పి ఉన్నారు. అయితే, ఖురాన్‌లోని ఒక్క ఆయత్, సూరత్ అత-తౌబా, ఆయత్ నంబర్ 109 తీసి చూడండి.. దీని ద్వారా మనకు బోధ పడుతున్న విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి.

أَفَمَنْ أَسَّسَ بُنْيَانَهُ عَلَىٰ تَقْوَىٰ مِنَ اللَّهِ وَرِضْوَانٍ خَيْرٌ أَم مَّنْ أَسَّسَ بُنْيَانَهُ عَلَىٰ شَفَا جُرُفٍ هَارٍ فَانْهَارَ بِهِ فِي نَارِ جَهَنَّمَ
తన కట్టడాన్ని దైవభీతి, దైవ ప్రసన్నతల పునాదిపై కట్టినవాడు ఉత్తముడా? లేక కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఏదైనా లోయ యొక్క డొల్ల అంచున తన కట్టడాన్ని కట్టినవాడు ఉత్తముడా? (9:109)

ఖురాన్‌లో లాజిక్ పరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఇది లాజిక్ పరమైన ఆధారం కాదా? గమనించండి. ఒక కట్టడం ఎలా ఉన్నది? దైవభీతి, దైవ ప్రసన్నతల పునాదిపై. మరొకతని కట్టడం ఎలా ఉంది? కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న, అది కూడా ఏదైనా లోయ యొక్క డొల్ల అంచున. ఏది త్వరగా పడిపోవడానికి భయం ఉన్నది? ఇది. కదా? అటు పిమ్మట అది అతనితో పాటే నరకాగ్నిలో పడిపోయింది. ఈ కట్టడాల విషయం తీసుకొచ్చి అల్లాహ్ మళ్ళీ నరకం విషయం ఎందుకు తీసుకొచ్చాడు? ఇక్కడ ఉద్దేశం అదే. ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. విశ్వాసం, అల్లాహ్ గురించి సరియైన జ్ఞానం కావలసిన రీతిలో ఎంత అవసరమో అంత లేనందువల్ల, అల్లాహ్ పట్ల ఆ బలమైన విశ్వాసం కలిగి లేము. దాని కారణంగా ఎన్నో పాపాలు జరుగుతున్నాయి. దాని కారణంగా మనిషి నరకంలో పడిపోతాడు.

సోదర మహాశయులారా, అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు? అందరి సమాధానం ఒకటే ఉంటుంది కదా? అల్లాహ్ ను ఆరాధించడానికి. అల్లాహ్ ఆరాధన మనం, అల్లాహ్ ను గుర్తుపట్టకుండా, అల్లాహ్ అనేవాడు ఎవడు అనేది సరియైన రీతిలో తెలుసుకోకుండా ఎలా చేయగలుగుతాము?

అందుకొరకే అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని కూడా ఎంత స్పష్టంగా ఖురాన్‌లో మన కొరకు తెలియజేశాడో గమనించండి. ముందు అల్లాహ్ మనకు అతని గురించి జ్ఞానం ఇచ్చాడు. ఆ తర్వాత నన్ను ఆరాధించు, నా ఆరాధన కొరకే నిన్ను పుట్టించాను అన్న మాట, ఆదేశం తెలియపరిచాడు. ఈ విషయాన్ని మీరు ఒకవేళ గ్రహించగలిగారనుకుంటే ఖురాన్‌లో అనేక సందర్భాలలో ఆయతులు ఉన్నాయి. కానీ రండి, ఒకసారి సూరతు అత-తలాఖ్ సూర నంబర్ 65 ఇది. ఇందులో ఈ ఆయత్ పై ఒకసారి మనం శ్రద్ధ వహిద్దాము, ఆయత్ నంబర్ 12. ఇది చివరి ఆయత్ సూరత్ తలాఖ్‌లో. ఏముంది గమనించండి?

اللَّهُ الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ وَمِنَ الْأَرْضِ مِثْلَهُنَّ يَتَنَزَّلُ الْأَمْرُ بَيْنَهُنَّ لِتَعْلَمُوا أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ وَأَنَّ اللَّهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَيْءٍ عِلْمًا
అల్లాహ్, ఆయనే సప్తాకాశాలను, అలాంటివే భూములను సృష్టించినవాడు. ఆయన ఆజ్ఞ వాటి మధ్య అవతరిస్తుంది. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడని, ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి. (65:12)

అరబీ గ్రామర్ ప్రకారంగా ఇక్కడ వచ్చింది లిత’లమూ, కానీ మన తెలుగు సాహిత్య ప్రకారంగా ఆ మాట చివరలో వచ్చింది, తెలుసుకోవటానికి. ఏమని తెలుసుకోవటానికి? అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడని. ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి. మనం తెలుసుకోవాలి అల్లాహ్ గురించి. అల్లాహ్ యే సృష్టించినవాడు, అల్లాహ్ యే ఆదేశించువాడు, అల్లాహ్ యొక్క ఆదేశ ప్రకారమే ఈ మొత్తం సృష్టి యొక్క ప్రక్రియ నడుస్తూ ఉన్నది, జరుగుతూ ఉన్నది. ఈ ఆయతులో అల్లాహ్ సృష్టించిన తన సృష్టి గురించి తెలియజేస్తూ, మీరు అల్లాహ్ గురించి తెలుసుకోవాలి, ఆ అల్లాహే సృష్టించాడని, ఆయనే సర్వశక్తిమంతుడు అని, ఆయన యొక్క జ్ఞానం ఈ సర్వ సృష్టిని ఆవరించి ఉంది. అర్థం కాలేదా? ఖురాన్ యొక్క ఈ మాట అర్థమవుతుందా, అవతలేదా?

అల్లాహ్ క్షమించు గాక నన్ను, మిమ్మల్ని, మనందరినీ కూడా. అల్లాహ్ గురించి కాదు, సామెత, మన మదిలో విషయం నాటుకుపోవడానికి, మింగుడు పడని మనం జీర్ణించలేని మాటను మంచిగా జీర్ణించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, డైజిన్ టాబ్లెట్ మాదిరిగా, ఒక ఉదాహరణ. ఏంటి? కాలేజీలో ఒక వ్యక్తి ప్రవేశించాడు. సూట్ బూట్‌లో ఉన్నాడు. అతను ఎవరో అన్నది తెలియని వరకు కాలేజ్ స్టూడెంట్స్ కూడా అతని పక్క నుండే దాటుతూ ఎవరో వస్తూ పోతా ఉంటారు కాలేజీలో ఎంతో మంది అన్నట్లుగా ఉంటారు. అవునా లేదా? అదే ఒకవేళ తెలిసింది, ఈ కాలేజ్ యొక్క ఓనర్, ఈ కాలేజ్ యొక్క అసలు బాధ్యుడు, క్షణంలో అతను తలచుకుంటే మీకు ఫీజులన్నీ మాఫ్ చేసి, మీ పరీక్షల్లో అన్ని రకాల సులభతరాలు కలుగజేసి, అంతటి ఎదిగిన మినిస్ట్రీలో కూడా చాలా పెద్ద చేయి ఉన్నటువంటి వ్యక్తి అని మీకు తెలిస్తే, పరిచయమైతే? అరె, నా పక్క నుండే దాటాడు కాదా, మంచిగా సలాం చేసి, సలాం చేసేవాడిని, అరే ముందు తెలియదు రా నాకు. ఈ విధంగా అనుకుంటారా లేదా?

అవునా కాదా? మరొక సామెత కూడా ఉంది, అరబీలో, ఉర్దూలో, తెలుగులో కూడా చెప్పుకుంటారు. ఒక దేశం రాజు పక్క దేశంలో పోయారంటే, తెలియని వారి కొరకు అతడు అజ్ఞానుడు, పామరుడు లాంటివాడే. కానీ ఎప్పుడైతే ఆ దేశ ప్రజలకు తెలుస్తుందో, ఫలానా అగ్రరాజ్యం యొక్క రాజు అట ఇతను అని, ఎలా అతనిపై గౌరవం ఉంటుంది అప్పుడు? ఎలా ఉంటుంది అతని యొక్క మర్యాద? ఇవన్నీ లాజిక్ పరంగా మనకు అర్థమయ్యే విషయాలే కదా? ఏ అల్లాహ్‌ను మనం ఆరాధించాలో, ఆ ఆరాధన కొరకే మనము పుట్టామో, అతని గురించి, అతని నామాల గురించి, అతని ఉత్తమ గుణాల గురించి మనకు తెలియకుంటే, ఈ రోజుల్లో మనలో అనేక మందికి తెలియదు గనుక, మనం ఆ అల్లాహ్‌ను ఉత్తమ రీతిలో, ఆరాధించవలసిన రీతిలో, అతనితో భయపడవలసిన రీతిలో భయపడటం లేదు.

అల్లాహ్ త’ఆలా ఒక్క ఆయత్ కాదు, రెండు ఆయతులలో కాదు, అనేక సందర్భాలలో ‘వఅలమూ, వఅలమూ, వఅలమూ’ అల్లాహ్ గురించి తెలుసుకోండి, తెలుసుకోండి, తెలుసుకోండి అని మాటిమాటికి అల్లాహ్ యొక్క గుణాలు ప్రస్తావించడం జరిగింది.

فَاعْلَمُوا أَنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
[ఫఅ’లమూ అన్నల్లాహ అజీజున్ హకీమ్]
మీరు తెలుసుకోండి, అల్లాహ్ యే తిరుగులేని శక్తిమంతుడు, వివేచనాపరుడు. (బఖరా 2: 209)

وَاعْلَمُوا أَنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
[వఅ’లమూ అన్నల్లాహ బికుల్లి షైఇన్ అలీమ్]
మీరు తెలుసుకోండి, అల్లాహ్ సర్వజ్ఞాని, సర్వం గురించి ఉత్తమ రీతిలో తెలిసినవాడు.(బఖరా 2: 231)

وَاعْلَمُوا أَنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
[వఅ’లమూ అన్నల్లాహ బిమా త’అమలూన బసీర్]
మీరు చేస్తున్నదంతా అల్లాహ్ సూక్ష్మంగా చూస్తూ ఉన్నాడు. (బఖరా 2: 233)

وَاعْلَمُوا أَنَّ اللَّهَ غَفُورٌ حَلِيمٌ
[వఅ’లమూ అన్నల్లాహ గఫూరున్ హలీమ్]
తెలుసుకోండి, నిశ్చయంగా అల్లాహు త’ఆలా ఎంతో క్షమాశీలి మరియు సహనశీలి. (బఖరా 2: 235)

وَاعْلَمُوا أَنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
[వఅ’లమూ అన్నల్లాహ సమీఉన్ అలీమ్]
తెలుసుకోండి, నిశ్చయంగా అల్లాహు త’ఆలా వినువాడు మరియు అన్నీ తెలిసినవాడు. (బఖరా 2: 244)

وَاعْلَمُوا أَنَّ اللَّهَ غَنِيٌّ حَمِيدٌ
[వఅ’లమూ అన్నల్లాహ గనియ్యున్ హమీద్]
తెలుసుకోండి, నిశ్చయంగా అల్లాహ్ నిరపేక్షాపరుడు, స్వతహాగా అన్ని రకాల ప్రశంసలకు అర్హుడు. (బఖరా 2: 267)

కేవలం సూర బఖరాలోనే ‘వఅలమూ, వఅలమూ’ (జ్ఞానం నేర్చుకోండి, మీరు తెలుసుకోండి) అల్లాహ్ గురించి అని అల్లాహ్ యొక్క ఎన్ని పేర్లు, ఆ పేర్లలో ఉన్నటువంటి ఎన్ని గుణాల గురించి మనకు చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే సూరతుల్ మాయిదా 98, సూరతుల్ బఖరా 194, సూరతుల్ అన్ఫాల్ 40, ఇంకా సూరత్ ముహమ్మద్ 19, అనేక ఆయతులు ఉన్నాయి.

అందుకొరకే షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహ్మతుల్లా అలైహి వారి యొక్క ఈ మాటను కొంచెం శ్రద్ధ వహించండి. చెప్పారు:

وَالْقُرْآنُ فِيهِ مِنْ ذِكْرِ أَسْمَاءِ اللَّهِ وَصِفَاتِهِ وَأَفْعَالِهِ أَكْثَرُ مِمَّا فِيهِ مِنْ ذِكْرِ الْأَكْلِ وَالشُّرْبِ وَالنِّكَاحِ فِي الْجَنَّةِ
ఖురాన్‌లో, స్వర్గంలో తినడం, త్రాగడం మరియు వివాహం గురించి ఉన్న ప్రస్తావన కంటే అల్లాహ్ యొక్క పేర్లు, గుణాలు మరియు పనుల గురించిన ప్రస్తావనే ఎక్కువగా ఉంది.

అరబీ యొక్క సెంటెన్స్ షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహమహుల్లాహ్ చెప్పింది వినిపించాను. దీని అనువాదం తర్వాత చెప్తాను. అంతకంటే ముందు, ఈ రోజుల్లో ఎంతో మంది అజ్ఞానులు, అవును, ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎన్ని ప్రపంచ చదువులు ఉన్నా గానీ, వారు పలికే ఈ పనికిమాలిన మాటల ద్వారా వారి డిగ్రీలన్నీ కూడా వ్యర్థమే. సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్థమురా, నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా అని ఒక గేయం కూడా మీరు విని ఉండవచ్చు నా నోట. ఏంటి విషయం? ఎందరో అజ్ఞానులు, ఏండయ్యా మీ ఖురాన్‌లో, మాటిమాటికి మొగోళ్ళకు నలుగురు భార్యల గురించి ప్రస్తావన ఉంటుంది, స్వర్గంలో ఇంత మంది కన్యలు అని ఉంటుంది, లేదా అంటే స్త్రీల యొక్క ప్రత్యేక విషయాల గురించి, వారి యొక్క బహిష్టుల గురించి ఉంటుంది, ఏంటి ఈ ఖురాన్? నఊజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఇలాంటి యొక్క ఎగతాళి ఖురాన్ పట్ల చేసిన అజ్ఞానులు, వారిలో మరీ దుర్మార్గులు, కొందరు అజ్ఞాన ముస్లింలు కూడా. నఊజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. కానీ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్, ఎవరి జీవితాలైతే ఖురాన్ చదవడం, చదివించడం, వ్యాఖ్యానం, ఇలాంటి విషయాల్లో గడిసిపోయినవో, ఏమంటున్నారు? ఖురాన్‌లో, స్వర్గంలో తినడం, త్రాగడం మరియు వివాహం గురించి ఉన్న ప్రస్తావన కంటే అల్లాహ్ యొక్క పేర్లు, గుణాలు మరియు పనుల గురించిన ప్రస్తావనే ఎక్కువగా ఉంది.

وَالْآيَاتُ الْمُتَضَمِّنَةُ لِذِكْرِ أَسْمَاءِ اللَّهِ وَصِفَاتِهِ أَعْظَمُ قَدْرًا مِنْ آيَاتِ الْمَعَادِ
[వల్ ఆయాతుల్ ముతదమ్మినతు లిజిక్రి అస్మాఇల్లాహి వ సిఫాతిహి అ’జము ఖదరన్ మిన్ ఆయాతిల్ మ’ఆద్]
మరియు అల్లాహ్ యొక్క పేర్లు మరియు గుణాలను కలిగి ఉన్న ఆయతులు, పరలోకం గురించిన ఆయతుల కంటే ఎక్కువ ఘనత గలవి.

పరలోకం గురించి ఉన్న ఆయతుల యొక్క సంఖ్య, విలువ, వాటికంటే గొప్ప సంఖ్యలో అల్లాహ్ యొక్క పేర్ల, అల్లాహ్ యొక్క గుణాల ప్రస్తావనకు సంబంధించిన ఆయతులు ఉన్నాయి.ఉదాహరణకు, పూర్తి ఖురాన్‌లో ఉన్నటువంటి 6000 కంటే ఎక్కువ ఆయతులలో అతి గొప్ప ఆయత్ అని దేనిని చెప్పడం జరిగింది? ఆయతుల్ కుర్సీని. కదా? అందులో, అందులో ఏముంది ప్రస్తావన? అల్లాహ్ గురించే ఉన్నది మొత్తం టోటల్‌గా. పరలోక ప్రస్తావన, స్వర్గం ప్రస్తావన, తిను త్రాగు ప్రస్తావన, వేరే విషయాలు లేవు, కేవలం అల్లాహ్ గురించి. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉబై బిన్ కా’బ్ ని ప్రశ్నించారు,

أَتَدْرِي أَيُّ آيَةٍ فِي كِتَابِ اللَّهِ أَعْظَمُ؟
[అతద్రి అయ్యు ఆయతిన్ ఫీ కితాబిల్లాహి ఆ’జం?]
అల్లాహ్ యొక్క గ్రంథంలో ఏ ఆయత్ చాలా గొప్పది అని నీకు తెలుసా?

అప్పుడు ఉబై బిన్ కా’బ్ “అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్” అని చెప్పారు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంతోషంతో, వాహ్, ఏం చెప్పినావు అన్నట్లుగా తన యొక్క ఛాతిలో ఈ విధంగా తట్టి,

لِيَهْنِكَ الْعِلْمُ يَا أَبَا الْمُنْذِرِ
[లియహ్నికల్ ఇల్ము యా అబల్ ముందిర్]
ఓ అబల్ ముందిర్, ఈ జ్ఞానం నీకు శుభకరంగా అగుగాక. అని ప్రశంసించారు.

ఖురాన్‌లోని అతి గొప్ప ఆయత్, ఏ దీనిని చెప్పడం జరిగింది, అందులో ఎవరి ప్రస్తావన ఉంది, ఆ ఆయత్ గురించి తెలిసిన సహాబీకి ఎంత గొప్ప షాబాష్ ఇవ్వడం జరిగింది. ఇక సూరతులలో చూసుకుంటే, ఆయతులలో గొప్ప ఆయత్ ఇది.

సూరతులలో చూసుకుంటే ఏ సూరతుని أَعْظَمُ سُورَةٍ [అ’జము సూర] అతి గొప్ప సూరా ఉమ్ముల్ ఖురాన్, ఖురాన్ యొక్క మూలం అని చెప్పడం జరిగింది? సూరతుల్ ఫాతిహా. చూడండి, బిస్మిల్లా నుండి మొదలుకొని సుమారు సగం సూరా కంటే ఎక్కువ అల్లాహ్ యొక్క పేర్లు, అల్లాహ్ గురించి, అతని యొక్క ఉత్తమ గుణాలు, అతని యొక్క ఉత్తమ పనులు, అతనికి, మనిషికి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి దాని ప్రస్తావన ఉంది, చివర్లో ఒక రెండు ఆయతులలో దుఆ ఉంది, అది కూడా అల్లాహ్‌తోనే అడగడం జరుగుతుంది.

అంతేకాదు, ఈ సూరా గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు ఇంతకుముందే మీరు విన్నారు, తౌరాత్‌లో గానీ, ఇంజీల్‌లో గానీ, జబూర్‌లో గానీ, స్వయం ఖురాన్‌లో గానీ ఇలాంటి గొప్ప సూరా వేరేదేదీ కూడా అవతరించబడలేదు.

చూస్తున్నారా? అల్లాహ్ యొక్క ప్రస్తావన ఎంత గొప్పగా ఖురాన్‌లో ఉంది? మనం ఆ ఉద్దేశంతో, ఆ భావంతో ఖురాన్ చదువుతున్నామా? అల్లాహ్‌ను తెలుసుకోవడానికి.

మరొక చిన్న ఉదాహరణ ఇచ్చి ఇక నేను సమాప్తం చేస్తాను. ఖురాన్‌లో ఏ సూరత్ కి ఆ ఒక్క చిన్న సూరా, ఖురాన్‌లోని మూడో వంతు భాగానికి సమానమైనది అన్నట్లుగా చెప్పడం జరిగింది?

إِنَّهَا تَعْدِلُ ثُلُثَ الْقُرْآنِ
[ఇన్నహా త’దిలు సులుసల్ ఖుర్ఆన్]
నిశ్చయంగా ఇది (సూరతుల్ ఇఖ్లాస్) ఖురాన్‌లో మూడో వంతుకు సమానం.

సహీ బుఖారీలోని హదీస్ ఇది. ఖురాన్‌ను మూడు భాగాలు చేస్తే ఒక్క భాగానికి సరి సమానమైనటువంటి అంత గొప్ప సూరా ఏది? ఖుల్ హువల్లాహు అహద్. సూరతుల్ ఇఖ్లాస్. నాలుగే నాలుగు ఆయతుల చిన్న సూరా. ఏముంది అందులో? అల్లాహ్ ఏకత్వం గురించి. అల్లాహ్ నిరపేక్షాపరుడు అన్న విషయం గురించి. ఆయనకు సంతానం లేదు, ఆయన ఎవరికీ సంతానం కాడు, మరియు ఆయనకు సరి సమానుడు, సాటి గలవాడు ఎవరూ లేరు అన్నటువంటి ప్రస్తావన.

అందుకొరకే, అల్లాహ్ గురించిన జ్ఞానం నేర్చుకోవడం, అల్లాహ్ శక్తి సామ్రాజ్యాల గురించి తెలిసి అతని యొక్క భయం మనలో, అతని పట్ల ప్రేమ మనలో, అతని పట్ల ఆశ మనలో పెరిగే విధంగా అల్లాహ్ గురించి ఖురాన్ ద్వారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసుల ద్వారా తెలుసుకోవడం చాలా, చాలా అవసరం.

ఎప్పుడైతే అల్లాహ్‌ను మనం తెలుసుకోవలసిన రీతిలో తెలుసుకొని విశ్వాసం చాలా బలంగా, ప్రగాఢంగా, దృఢంగా చేసుకుంటామో, ఆ తర్వాత ఏ సత్కార్యాలు చేసినా వాటి పుణ్యాలు, వాటి యొక్క లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి, మరియు ఎల్లవేళల్లో మనం ప్రపంచంలోని ఏ పనిలో ఉన్నా గానీ, మన ఏ డ్యూటీలో ఉన్నా గానీ, మన ఏ జాబ్‌లో ఉన్నా గానీ, ఫ్రెండ్స్‌లతో ఆనంద ఉత్సవాల్లో ఉన్నా గానీ, భార్యా పిల్లలతో మనం ఎంతో సంతోషంగా గడుపుతున్నా గానీ, ఇంట్లో ఎవరైనా చనిపోయి బాధగా ఉన్నప్పుడు గానీ, ఏదైనా వ్యవసాయంలో పంట మునిగిపోయినా గానీ, మన వ్యాపారం ఏదైనా చాలా అది లాస్‌లో జరిగినా గానీ, అన్ని స్థితిల్లో, అన్ని వేళల్లో మనం అల్లాహ్‌ను మరిచిపోయి ఉండలేము. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకొని, అల్లాహ్, అరే ఉండనీరా భయ్, ఏంటి మాటిమాటికి నువ్వు ధర్మం, ధర్మం, అల్లాహ్, అల్లాహ్ అని అనుకుంటూ ఉంటావు. ఈ విధంగా అనేవాళ్ళు ఉన్నారు కొందరు, అస్తగ్ఫిరుల్లాహ్.

కానీ ఎవరైతే ఆనంద, సంతోషాల్లో గానీ, లేదా బాధలో ఉన్నప్పుడు గానీ, సుఖంలో గానీ, దుఃఖంలో గానీ, పేదరికంలో గానీ, సిరి సంపదలో గానీ, అన్ని స్థితిల్లో అల్లాహ్‌ను ముందుగా ఉంచి, అల్లాహ్ యొక్క ప్రస్తావన, అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క జిక్ర్ ఎక్కువగా చేస్తూ ఉంటారో వారే సాఫల్యూలు, మరీ ఎవరు దీనికి భిన్నంగా ఉంటారో వారే చాలా నష్టం పోతారు.

చదవండి సూరతుల్ మునాఫిఖూన్, ఆయత్ నంబర్ తొమ్మిది.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُلْهِكُمْ أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُمْ عَن ذِكْرِ اللَّهِ
[యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుల్హికుమ్ అమ్వాలుకుమ్ వలా అవ్లాదుకుమ్ అన్ జిక్రిల్లాహ్]
ఓ విశ్వాసులారా! మీ సిరిసంపదలు, మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరల్చరాదు.

చూశారా? ఎవరైతే అలా చేస్తారో వారే నష్టపోయేవారు. అల్లాహ్ ధ్యానం నుండి, అల్లాహ్ యొక్క జిక్ర్ నుండి.

నిన్ననే ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మాట మీద మాట వచ్చేసి, ఇప్పుడే నీ కళ్ళ ముంగట నీకు చాలా ప్రియమైనవాడు, నీ తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, నీ సంతానంలో ఎవరైనా కావచ్చు, చనిపోయారు, యాక్సిడెంట్ అయింది. అంటే నువ్వు ఇక్కడ హాయిగా తినుకుంటూ ఏదైనా మంచిగా ఉన్నావు, సంతోషంగా, యకాయకిగా నీకు వార్త వచ్చేసింది అతను చనిపోయాడు అని. నీవు ఏం చేస్తావు, ఏం చెబుతావు?

ఇద్దరు ముగ్గురిది సమాధానాలు వేరు వేరుగా ఉండినవి. కానీ వారిలో ఎవరికైతే ధర్మ జ్ఞానం కొంచెం ఎక్కువగా ఉండిందో వెంటనే చెప్పారు,

إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ
[ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్]
నిశ్చయంగా మేము అల్లాహ్ కే చెందినవారము మరియు నిశ్చయంగా మేము ఆయన వైపునకే మరలి పోవలసి ఉంది.

చదివి

الْحَمْدُ لِلَّهِ
[అల్హమ్దులిల్లాహ్]
అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

అని అంటాను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, ధర్మ జ్ఞానం యొక్క బరకత్. అందుకొరకే అల్లాహ్ యొక్క జిక్ర్ కంటే, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్‌ను తెలుసుకోవడం కంటే, అల్లాహ్ గురించి ఎక్కువ జ్ఞానం పొంది, ఆయన భయం, ఆయన పట్ల ప్రేమ, ఆయన పట్ల ఆశ, ఇవి మనలో ఎక్కువగా కుదిరి ప్రతి సమయంలో, సందర్భంలో, స్థితిలో అల్లాహ్‌కు ఇష్టమైనదే చేయాలి అన్నటువంటి తపన కలిగి ఉంటామో, అప్పుడు మనకు ఈ నష్టం ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో, సిరిసంపదలు, సంతానం మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి దూరం చేయకూడదు, చేసిందంటే మరి మీరు నష్టపోతారు.

అల్లాహ్ ఈ అస్మాయె హుస్నా, సిఫాతె ఉలియా, అల్లాహ్ యొక్క మంచి పేర్లు, ఉత్తమ గుణాల గురించి అయిన జ్ఞానం, ఖురాన్ హదీస్ ఆధారంగా, సలఫ్ మనహజ్ ప్రకారంగా తెలుసుకుంటూ మన విశ్వాసాన్ని పెంపొందించుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలని.

వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=19684

అల్లాహ్ (తఆలా) – మెయిన్ పేజీ
https://teluguislam.net/allah

అల్లాహ్ శుభ నామాల వివరణ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

నలుగురు ఇమాముల విశిష్టత ( ఇమామ్ అబూ హనీఫా, మాలిక్, షాఫయీ, అహ్మద్ బిన్ హంబల్) [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

నలుగురు ఇమాముల విశిష్టత (ఇమామ్ అబూ హనీఫా, మాలిక్, షాఫ’ఐ, అహ్మద్ బిన్ హంబల్)
https://youtu.be/TeTJLqXXYHk [38:34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నాలుగు గొప్ప ఇమామ్‌లైన ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ మాలిక్, ఇమామ్ షాఫయీ, మరియు ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ (రహ్మతుల్లాహి అలైహిమ్ అజ్మయీన్) యొక్క జీవిత చరిత్రలు, వారి విశిష్టతలు, మరియు ధర్మ సేవకు వారు చేసిన త్యాగాల గురించి వివరించబడింది. ప్రతి ఇమామ్ యొక్క బాల్యం, విద్యాభ్యాసం, వారి గురువులు, వారు రచించిన ముఖ్య గ్రంథాలు, మరియు వారు ఎదుర్కొన్న పరీక్షల గురించి క్లుప్తంగా చర్చించబడింది. ప్రసంగం ముగింపులో, ఈ ఇమామ్‌లను గుడ్డిగా అనుసరించడం (తఖ్లీద్) లేదా వారిని ద్వేషించడం రెండూ సరికాదని, వారిని గౌరవిస్తూనే, ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలకే ప్రాధాన్యత ఇవ్వాలనే సరైన మార్గాన్ని సూచించడం జరిగింది.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు. (1:2)

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِيْنَ
(వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్)
ప్రవక్తలలోకెల్లా అత్యంత శ్రేష్టులైన వారిపై మరియు దైవప్రవక్తలందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

أَمَّا بَعْدُ
(అమ్మా బాద్)
ఇక విషయానికి వస్తే

رَبِّ اشْرَحْ لِيْ صَدْرِيْ وَيَسِّرْ لِيْ أَمْرِيْ وَاحْلُلْ عُقْدَةً مِّنْ لِّسَانِيْ يَفْقَهُوْا قَوْلِيْ
(రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్ దతమ్ మిల్ లిసానీ యఫ్ ఖహూ ఖౌలీ)
“ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కోసం విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుక ముడిని విప్పు. జనులు నా మాటను బాగా అర్థం చేసుకునేందుకు.” (20:25-28)

సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ శోభిస్తాయి.

ఆ కరుణామయుని కారుణ్యం ప్రవక్తలందరిపైనను, ముఖ్యంగా చిట్టచివరి ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై ఎల్లవేళలా వర్షించుగాక.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి ప్రసంగంలో నలుగురు ఇమాముల విశిష్టత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇస్లామీయ సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ధర్మ సేవ చేసిన భక్తులకు పేరు ప్రఖ్యాతి, ప్రతిష్ట, కీర్తిని ప్రసాదించాడు. గౌరవ ఉన్నత శిఖరాలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని చేర్చాడు. అలా ధర్మ సేవ చేసి కీర్తిని పొందిన పండితులలో ఈ నలుగురు ఇమాములు కూడా ఉన్నారు. నలుగురు ఇమాములు అంటే ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి.

ధార్మిక సేవ చేసి ప్రాచుర్యం పొందిన అనేక మంది పండితులలో ఈ నలుగురు ఇమాములకు ఉన్నతమైన స్థానం అల్లాహ్ తరపున ఇవ్వబడింది. రండి సోదరులారా, ఈ నలుగురు ఇమాముల గురించి క్లుప్తంగా మనము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి గురించి మనం చూచినట్లయితే, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి అసలు పేరు నోమాన్ బిన్ సాబిత్. ఆయనకు అబూ హనీఫా అని నామాంతరము ఉండేది, దీనిని అరబీ భాషలో కున్నియత్ అంటారు. ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 80వ సంవత్సరంలో కూఫా నగరంలో జన్మించారు.

ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి తండ్రి బట్టల వ్యాపారం చేసేవారు కాబట్టి, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి కూడా బట్టల వ్యాపారము చేశారు. అయితే ఒకరోజు ఒక వీధి నుండి వెళుతూ ఉంటే, ఇమామ్ షాబీ రహ్మతుల్లాహి అలైహి గారి కంటబడ్డారు. ఇమామ్ షాబీ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారిని చూచిన వెంటనే, “నాయనా, నీవు చదువుకుంటున్నావా లేదా?” అని ప్రశ్నించారు. దానికి సమాధానం ఇస్తూ ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి, “లేదండి నేను చదువుకోవట్లేదు” అన్నారు. అప్పుడు ఇమామ్ షాబీ రహ్మతుల్లాహి అలైహి వెంటనే ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి తో ఇలా అన్నారు, “నాయనా, నీ ముఖారవిందాన్ని బట్టి చూస్తుంటే నీవు ధార్మిక విద్య అభ్యసించడం ఎంతో ఉత్తమము అని నాకు అనిపిస్తుంది. కాబట్టి నాయనా, నీవు ధార్మిక విద్యను అభ్యసించు,” అని సలహా ఇచ్చారు.

ఆయన సలహాను పాటిస్తూ ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి అలనాటి గొప్ప గొప్ప ధార్మిక పండితుల వద్ద ధర్మ విద్య అభ్యసించారు. ఉదాహరణకు, అతా బిన్ అబీ రబాహ్ రహ్మతుల్లాహి అలైహి, అబ్దుల్లా బిన్ దీనార్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ నాఫె రహ్మతుల్లాహి అలైహి లాంటి గొప్ప గొప్ప ధార్మిక పండితుల వద్ద ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ధర్మ విద్యను అభ్యసించారు.

ఆ రోజుల్లో ఇమామ్ హమ్మాద్ ఇబ్నె సులైమాన్ రహ్మతుల్లాహి అలైహి అనే ఒక గొప్ప ధార్మిక పండితుడు, ధర్మ విద్యకు సంబంధించిన ఒక విద్య, ఫిఖహ్ విద్య, ఆ ఫిఖహ్ విద్యలో చాలా ప్రాచుర్యం పొంది ఉన్నారు. ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఆయన వద్ద కూడా శిష్యరికము చేసి ఫిఖహ్ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఎంతగా ఎదిగారంటే, ఇమామ్ హమ్మాద్ బిన్ సులైమాన్ రహ్మతుల్లాహి అలైహి గారు మరణించిన తర్వాత ఆయన స్థానంలో ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారిని కూర్చోబెట్టడం జరిగింది.

అభిమాన సోదరులారా, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అనేక ప్రత్యేకతలను ప్రసాదించాడు. ఆయనకు ప్రసాదించబడిన ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఎదుటి వ్యక్తి ఏదైనా ప్రశ్న అడిగితే దానికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చి ఎదుటి వ్యక్తిని సంతృప్తి పరచటం ఆయనకే సొంతం.

ఉదాహరణకు, ఒకసారి ఆ రోజుల్లో ఒక నాస్తికుడు ఈ సృష్టి మొత్తము తనంతట తానే సృష్టించబడింది, దీనిని సృష్టించినవాడు ఒకడు ఎవడూ లేడు అని వాదించేవాడు. అతను ఒకరోజు కూఫా నగరానికి చేరుకొని అక్కడ కూడా తన వాదన ప్రజలకు వినిపిస్తూ ఉంటే, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి అక్కడికి చేరుకున్నారు.

ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఆ నాస్తికుని వాదన విన్న తర్వాత, వెంటనే అతనితో ఇలా అన్నారు: “అవునయ్యా, నువ్వు చెబుతున్న విషయం నిజమే. నేను ఇప్పుడే ఒక చోటు నుంచి వస్తున్నాను, మార్గమధ్యలో నేను ఒక విషయాన్ని చూశాను, అదేమిటంటే, ఒక పెద్ద మాను (చెట్టు) ఉందండి, ఆ మాను తనంతట తానే తెగిపోయింది, ఆ తర్వాత చెక్కలు తయారయ్యాయి, ఆ చెక్కలన్నీ కలిసి ఒక పడవ రూపాన్ని దాల్చినాయి, ఆ పడవ నీటి మీద వచ్చి నిలబడింది, అందులో నేను ఎక్కుకున్నాను, ఆ పడవ తనంతట తానే నది అవతల ఒడ్డు నుంచి ఇవతల ఒడ్డుకు ప్రయాణం చేసి వచ్చింది, నేను ఆ పడవలో నుంచి దిగి ఇప్పుడే అక్కడి నుంచి మీ దగ్గరికి వస్తున్నాను,” అని చెప్పారు.

ఈ మాటలన్నీ విన్న ఆ నాస్తికుడు, “ఏమండీ! మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నేనేమైనా మూర్ఖుడ్నా, బుద్ధిహీనుడ్నా? చెట్టు తనంతట తానే తెగిపోవడం ఏమిటి, చెక్కలు తయారైపోవడం ఏమిటి, ఎవరూ తయారు చేయకుండానే పడవ తయారైపోవటం ఏమిటి, ఎవరూ నడిపించకుండానే పడవ నది అవతల ఒడ్డు నుంచి ఇవతల వైపుకు వచ్చేయటం ఏమిటి? ఇదంతా నమ్మేదానికి నేనేమైనా మూర్ఖుడ్నా?” అని ప్రశ్నించినప్పుడు, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఆ వ్యక్తితో ఇలా అన్నారు: “అయ్యా, ఒక చిన్న పడవ తనంతట తానే సృష్టించబడదు, ఒక చిన్న పడవ తనంతట తానే నడవదు అని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. మరి ఇంత పెద్ద సృష్టి తనంతట తానే ఎలా సృష్టించబడుతుంది? తనంతట తానే ఎలా నడుస్తుంది ఎవరూ నడిపించకుండానే? ఒకసారి ఆలోచించరా?” అని చెప్పినప్పుడు, ఆ వ్యక్తి వెంటనే ఆ విషయాన్ని అర్థం చేసుకుని, ఈ సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడు, ఈ సృష్టిని నడిపించే ఒక యజమాని ఉన్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు సోదరులారా. ఇది ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి చాతుర్యానికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ.

ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారి వద్ద చాలా మంది శిష్యులు శిష్యరికం చేశారు. వారిలో ఇమామ్ అబూ యూసుఫ్ యాఖూబ్ బిన్ ఇబ్రాహీం రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ ముహమ్మద్ బిన్ హసన్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ జఫర్ బిన్ హుజైల్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ హసన్ బిన్ జియాద్ రహ్మతుల్లాహి అలైహి, ఈ నలుగురు శిష్యులు చాలా ప్రాచుర్యం పొందారు ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద శిష్యరికం చేసిన శిష్యుల్లో.

ఆ తర్వాత అలనాటి నాయకుడు ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారికి ఖాజీయుల్ ఖుదాత్ అనే పదవిని తీసుకోమని అభ్యర్థించాడు. ఖాజీయుల్ ఖుదాత్ అంటే మన భాషలో న్యాయమూర్తి పదవి అని చెప్పుకోవచ్చు. న్యాయమూర్తి పదవి తీసుకోమని ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారిని అడిగినప్పుడు, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఆ పదవి స్వీకరించడానికి నిరాకరించారు. ఆ రాజు ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి మీద కోపపడి ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారిని చెరసాలలో బంధించేశాడు. చెరసాలలోనే ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 150వ సంవత్సరంలో మరణం పొందారు సోదరులారా. ఇది ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క క్లుప్తమైన జీవన చరిత్ర.

ఇక రండి, మనం రెండవ ఇమామ్, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం.

ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి అసలు పేరు మాలిక్ బిన్ అనస్. ఆయనకు అబూ అబ్దుల్లాహ్ అని నామాంతరము ఉండేది. దీనిని అరబీ భాషలో కున్నియత్ అంటారు. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 93వ సంవత్సరంలో మదీనా పట్టణంలో జన్మించారు.

ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి అలనాటి గొప్ప గొప్ప ధార్మిక పండితులైన ఇమామ్ అబ్దుర్రహ్మాన్ బిన్ హుర్ముజ్, ఇమామ్ నాఫె, ఇమామ్ ఇబ్నె షిహాబ్ జుహ్రీ, ఇమామ్ రబీఆ రహ్మతుల్లాహి అలైహిమ్ అజ్మయీన్ లాంటి గొప్ప గొప్ప ధార్మిక పండితుల వద్ద ధర్మ విద్యను అభ్యసించారు.

హదీసు గ్రంథాలలో మొట్టమొదటి హదీసు గ్రంథం, మువత్తా ఇమామ్ మాలిక్ అనే గ్రంథాన్ని రచించారు సోదరులారా. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిర్మించిన మస్జిదె నబవీలో కూర్చొని ప్రజలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు, ఉల్లేఖనాలు వినిపించేవారు.

ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి కాలంలో ఆనాటి రాజు బలవంతంగా ఒక జంటకు విడాకులు ఇప్పించాడు. తలాఖ్ ఇప్పించాడు. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్దకు ఆ విషయం చేరినప్పుడు, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి బలవంతంగా ఇప్పించిన విడాకులు ఇస్లాం ధర్మం ప్రకారంగా అధర్మం, నిషేధం, అవి చెల్లవు అని ఫత్వా ఇచ్చారు సోదరులారా.

అలనాటి రాజు, ఖలీఫా మన్సూర్, వెంటనే ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి మీద బలవంతం చేశాడు: “అయ్యా, నా ఇష్ట ప్రకారంగానే ఈ తలాఖ్ చెల్లుతుంది, ఈ విడాకులు చెల్లుబాటులో ఉంటాయి అని మీరు నా ఇష్ట ప్రకారంగా ఫత్వా ఇవ్వండి” అని బలవంతం చేశాడు. కానీ ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి అలనాటి రాజు ఖలీఫా మన్సూర్ గారి మాటను వినలేదు. అతను ఎంత బలవంతము చేసినా తల వంచలేదు. బలవంతంగా ఇప్పించబడిన తలాఖ్ ఇస్లాం ధర్మం ప్రకారంగా నిషేధం, చెల్లవు అంటే చెల్లవు అని చెప్పి ఫత్వా ఇచ్చారు.

ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి ఈ ప్రవర్తన చూసి ఖలీఫా మన్సూర్ ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి మీద కోపపడి, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారిని చెరసాలలో బంధించాడు, కొరడాలతో కొట్టించాడు సోదరులారా. అంతేకాదు, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారిని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించారు.

ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ప్రజలతో ఒకే మాట చెప్పేవారు: “ప్రజల్లారా, ఎవరైతే నన్ను గుర్తు పట్టున్నారో వారు గుర్తు పట్టున్నారు, మరెవరైతే నన్ను గుర్తు పట్టట్లేదో వినండి, నేను మాలిక్ బిన్ అనస్, నేను చెప్పే మాట ఒక్కటే, బలవంతంగా ఇప్పించబడిన తలాఖ్, బలవంతంగా ఇప్పించబడిన విడాకులు ఇస్లాం ధర్మం ప్రకారంగా అధర్మము, చెల్లవంటే చెల్లవు” అని చెప్పేవారు సోదరులారా. ఇది ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి విశ్వాస నిలకడకు నిదర్శనము సోదరులారా.

ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారికి మదీనా పట్టణం అంటే చాలా అభిమానం. మదీనాలో నివసించే ధార్మిక పండితులు అంటే కూడా చాలా అభిమానం. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారు మస్జిదె నబవీలో కూర్చొని ప్రజలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు వినిపించేవారు. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద కూడా చాలా మంది శిష్యులు శిష్యరికం చేశారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన శిష్యులలో ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ ముహమ్మద్ బిన్ హసన్ అష్-షైబానీ రహ్మతుల్లాహి అలైహి వీరిరువురు చాలా పేరును పొందారు సోదరులారా.

అలాగే, అలనాటి మరొక రాజు, హారూనుర్ రషీద్, అతను కూడా ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద విద్య అభ్యసించాలనే కోరికతో ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారిని: “అయ్యా, మీరు రాజభవనానికి వచ్చి నాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు వినిపించండి, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను” అని విన్నవించుకున్నాడు. కానీ ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారు ఏమన్నారో తెలుసా? “మీకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు వినాలని, నేర్చుకోవాలని కోరిక ఉంటే మీరు మస్జిదె నబవీకి వచ్చి అక్కడ నలుగురితో పాటు కూర్చొని మీరు కూడా వినవచ్చు. నేను వచ్చి మీ రాజభవనంలో మీకు బోధించాలంటే నా వల్ల కాదు” అని చెప్పారు.

అలనాటి రాజు, హారూనుర్ రషీద్, మస్జిదె నబవీకి వెళ్ళి ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి బోధించే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు నలుగురితో పాటు సామాన్యమైన ప్రజలతో పాటు కూర్చొని విని ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద శిష్యరికం చేశాడు సోదరులారా.

ఆ తర్వాత ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి మదీనాలో మరణం పొందాలని చాలా కోరుకునేవారు, అల్లాహ్‌కు ప్రార్థించేవారు. అందుకోసమే ఎవరైనా మదీనా అవతల వైపు నుంచి మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారిని ఆహ్వానిస్తే, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి మదీనా బయటకు ఎప్పుడూ వెళ్ళేవారు కాదు. ఆయన జీవితంలో చాలా తక్కువ సార్లు ఆయన మదీనా నగరాన్ని వదిలి బయటకు వెళ్ళారు. ఎక్కువ సమయం, ఆయన జీవితంలోని ఎక్కువ సమయం మదీనాలోనే ఆయన గడిపారు సోదరులారా.

ఆ తర్వాత, ఆయన ప్రార్థించినట్లుగానే, ఆయన కోరుకున్నట్లుగానే, హిజ్రీ శకం 179వ సంవత్సరంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారికి మదీనాలోనే మరణాన్ని ప్రసాదించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు మదీనాలో మరణం ప్రసాదించిన తర్వాత మదీనాలోనే ఆయన ఖనన సంస్కారాలు కూడా జరపబడ్డాయి. ఇది ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క క్లుప్తమైన జీవిత చరిత్ర సోదరులారా.

ఇక రండి, మూడవ ఇమామ్, ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి కూడా మనం తెలుసుకుందాం సోదరులారా.

ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క అసలు పేరు ముహమ్మద్ బిన్ ఇద్రీస్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి. ఆయనకు అబూ అబ్దుల్లాహ్ అనే నామాంతరము ఉండేది. దీనిని అరబీ భాషలో కున్నియత్ అంటారు.

ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 150వ సంవత్సరంలో గాజా పట్టణంలో జన్మించారు. రెండు సంవత్సరాల వయస్సుకు చేరగానే ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి తండ్రి మరణించారు. తండ్రి మరణించిన తర్వాత ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి తల్లి ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారిని తీసుకొని మక్కా నగరానికి వచ్చేసారు.

మక్కా నగరంలో ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి ఏడు లేదా తొమ్మిది సంవత్సరాల వయసులోనే పూర్తి ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసేశారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత మదీనాలో ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు బోధిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని మదీనాకు వెళ్లి, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద శిష్యరికము చేసి మువత్తా ఇమామ్ మాలిక్ పూర్తి గ్రంథాన్ని వినటమే కాకుండా కంఠస్థము కూడా చేశారు. అల్లాహు అక్బర్! ఇది ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క జ్ఞాపక శక్తికి నిదర్శనము సోదరులారా.

ఆ తర్వాత ఇరాక్ పట్టణంలో ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క ప్రముఖ శిష్యులు ఇమామ్ ముహమ్మద్ రహ్మతుల్లాహి అలైహి గారు ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని ఇరాక్ పట్టణానికి వెళ్లి, ఇమామ్ ముహమ్మద్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద శిష్యరికము చేసి ఫిఖహ్ ధర్మ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత మక్కాకు తిరిగి వచ్చి మక్కాలో ప్రజలకు ధార్మిక విద్యను బోధించడం ప్రారంభించారు. ఆ తర్వాత 195 హిజ్రీ శకం అలాగే 198 హిజ్రీ శకంలో రెండు సార్లు ఇరాక్ పట్టణానికి వెళ్లి అక్కడ విద్యను బోధించి ఆ తర్వాత తిన్నగా ఈజిప్టు దేశానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత మిగతా జీవితం మొత్తం ఆయన ఈజిప్టు దేశంలోనే గడిపారు.

ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి ఈ ప్రపంచానికి అందజేసిన గొప్ప కానుకలలో ఒక గొప్ప కానుక ఏమిటంటే ఆయన రచించిన ఒక గ్రంథం ‘అర్-రిసాలా ఫీ అదిల్లతిల్ అహ్కామ్’. ఈ గ్రంథంలో వివిధ విద్యలకు సంబంధించిన నియమాలన్నింటినీ ఆయన పొందుపరిచారు సోదరులారా. నేటికీ కూడా ధార్మిక పండితులు ఈ గ్రంథం యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూనే ఉంటారు. అలాగే ‘కితాబుల్ ఉమ్‘, ‘మస్నదె షాఫయీ‘ లాంటి గొప్ప గొప్ప గ్రంథాలు ప్రపంచానికి ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి ద్వారా కానుకగా అందజేయబడ్డాయి.

ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 204వ సంవత్సరంలో ఈజిప్టు దేశంలోనే మరణించారు. ఈజిప్టు దేశంలోనే ఆయన ఖనన సంస్కారాలు కూడా చేయబడ్డాయి. ఇది ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క క్లుప్తమైన జీవిత చరిత్ర.

ఇక రండి సోదరులారా, నాలుగవ ఇమామ్, నాలుగవ ధార్మిక పండితులైన ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి కూడా మనము క్లుప్తంగా తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి అసలు పేరు అహ్మద్ బిన్ ముహమ్మద్ బిన్ హంబల్. ఆయనకు అబూ అబ్దుల్లాహ్ అని నామాంతరము ఉండేది. దీనిని అరబీ భాషలో మనం కున్నియత్ అంటాము.

ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి వారి తాత పేరుతో ఎక్కువగా ప్రాచుర్యం పొందారు. వాస్తవానికి అహ్మద్ గారి యొక్క తండ్రి పేరు ముహమ్మద్, కానీ ప్రపంచం ఆయనను అహ్మద్ ఇబ్నె హంబల్, హంబల్ కుమారుడు అని గుర్తిస్తుంది సోదరులారా. అంటే తాతగారి పేరుతోనే అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారు ప్రాచుర్యం పొందారు.

అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 164వ సంవత్సరంలో బగ్దాద్ పట్టణంలో జన్మించారు. పసితనంలోనే నాన్నగారు మరణించారు. 14 సంవత్సరాల వయసుకు చేరాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు, హదీసులు తెలుసుకోవాలని, నేర్చుకోవాలని మనసులో కోరిక కలిగింది.

అలనాటి గొప్ప గొప్ప ధార్మిక పండితులు, ఇమామ్ అబూ యూసుఫ్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి విద్యను అభ్యసించారు. సోదరులారా, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారికి హదీసుల మీద ఎంత అభిమానం ఉండేదంటే, ఫలానా దేశంలో కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు కంఠస్థం చేసి ఉన్నారన్న వార్త తెలుసుకున్న తర్వాత కాలి నడకన వెళ్ళి వారి వద్దకు చేరుకొని వారి నోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు విని వాటన్నింటినీ ఒక గ్రంథంలో పొందుపరిచారు. ఆయన జీవిత చరిత్ర చూచినట్లయితే, ఆయన బగ్దాద్ నుండి మక్కాకు, మక్కా నుండి యమన్ కు, యమన్ నుండి సిరియాకు కాలి నడకన ప్రయాణాలు చేశారు సోదరులారా. అల్లాహు అక్బర్!

ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, హదీసు గ్రంథాలలో అన్నింటికంటే పెద్ద గ్రంథం ‘మస్నద్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి’. ‘మస్నదె అహ్మద్’, హదీసు గ్రంథాలలోనే పెద్ద గ్రంథం, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారు ప్రపంచానికి కానుకగా ఇచ్చారు సోదరులారా. ఆయన ప్రపంచానికి అందజేసిన ‘మస్నదె అహ్మద్’ గ్రంథంలో 40,000 కంటే ఎక్కువ హదీసులు పొందుపరచబడి ఉన్నాయి. అల్లాహు అక్బర్!

ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క విశ్వాస ధృడత్వాన్ని మనం చూచినట్లయితే, ఆ రోజుల్లో మాయమాటలకు గురైన ఒక తెగ, మోతజిలే వారు, ‘ఖుర్ఆన్ మఖ్లూఖ్’ అని ఒక ఉపద్రవాన్ని లేవనెత్తారు. ‘ఖుర్ఆన్ మఖ్లూఖ్’ అని ఒక ఉపద్రవాన్ని లేవనెత్తినప్పుడు, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి వారి ఈ వాదనను ఖండించారు. ఖుర్ఆన్ ఎన్నిటికీ మఖ్లూఖ్ కాజాలదు. ఖుర్ఆన్ మఖ్లూఖ్ కానే కాదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క వాక్యం, అల్లాహ్ యొక్క మాట, ఖుర్ఆన్ ఎప్పటికీ మఖ్లూఖ్ కాజాలదు అని ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి ప్రకటించారు సోదరులారా.

తత్కారణంగా, అలనాటి నాయకులు ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి మీద దౌర్జన్యం చేశారు, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారిని చెరసాలలో బంధించారు, కొరడాలతో కొట్టించారు సోదరులారా. ఎంతగా కొరడాలతో కొట్టించారంటే, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి వీపు మొత్తం పుండు అయిపోయింది సోదరులారా, గాయాలతో వీపు మొత్తం పుండు అయిపోయింది.

అయినా కొరడా దెబ్బలు తింటూ కూడా, బాధను భరిస్తూ కూడా, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి ఒకే మాట ప్రకటించేవారు. ఆయన ఏమనేవారంటే: ‘అతూనీ బిషైఇమ్ మిన్ కితాబిల్లహి అవ్ సున్నతి రసూలిహి హత్తా అఖూల బిహి’. ‘ఖుర్ఆన్ మఖ్లూఖ్ అని మీరు వాదిస్తున్నారు కదా, దానికి ఆధారంగా మీరు ఖుర్ఆన్ గ్రంథంలో నుంచి ఒక్క వాక్యము గానీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక ఉల్లేఖనం గానీ నాకు చూపించండి, నేను ఒప్పుకుంటాను. లేదంటే నా ప్రకటన ఒక్కటే, ఖుర్ఆన్ అల్లాహ్ వాక్యం, అది మఖ్లూఖ్ కాజాలదు‘ అని చెప్పేవారు సోదరులారా.

ఆయన ఆ విధంగా అలాంటి నిలకడను, అలాంటి స్థిరత్వాన్ని ప్రదర్శించారు కాబట్టే తర్వాత వచ్చిన వారు ఆ విషయాన్ని గ్రహించారు. ఖుర్ఆన్ మఖ్లూఖ్ అని చెప్పటము, వాదించటము తప్పు అన్న విషయాన్ని అర్థం చేసుకోగలిగారు. ఇదంతా ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారు ప్రదర్శించిన నిలకడ కారణముగానే జరిగిందని మనం చెప్పుకోవచ్చు సోదరులారా.

అయితే, చాలా ఎక్కువగా హింసలు ఎదుర్కొన్న కారణంగా, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత, హిజ్రీ శకం 241వ సంవత్సరంలో ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి జుమా రోజున మరణించారు. ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గురించి ధార్మిక పండితులు అప్పుడూ ఇప్పుడూ ఒకే మాట చెప్తారు, అదేమిటంటే, ఎవరైతే ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారిని అభిమానిస్తున్నారో, నిజానికి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉల్లేఖనాలను అభిమానిస్తున్నారు. ఎవరైతే ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారిని ద్వేషించుకుంటున్నారో, నిజానికి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉల్లేఖనాలను ద్వేషిస్తున్నారు. ఇది ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారికి అల్లాహ్ ఇచ్చిన కీర్తి సోదరులారా.

అభిమాన సోదరులారా! ఇప్పటివరకు మనం నలుగురు ఇమాములు – ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ మాలిక్, ఇమామ్ షాఫయీ, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహిమ్ అజ్మయీన్ గురించి క్లుప్తంగా జీవిత చరిత్రను తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆ ఇమాములు గతించిన తర్వాత ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయాల గురించి క్లుప్తంగా తెలుసుకొని, ఆ విషయాన్ని తెలిపి నేను నా మాటను ముగిస్తాను సోదరులారా.

అభిమాన సోదరులారా, నలుగురు ఇమాములు మరణించిన తర్వాత, వారి మరణానంతరం తర్వాత వచ్చిన తరం వారు రెండు భిన్నమైన అభిప్రాయాలకు గురయ్యారు. కొందరు నలుగురు ఇమాములను ఎంతగా అభిమానించారంటే, వారి అభిమానంలో హద్దు మీరిపోయారు. వారిని ప్రవక్తకు ఇవ్వాల్సిన స్థానము ఇమాములకు ఇచ్చేశారు. అభిమాన సోదరులారా, కళ్ళు మూసుకొని వీరిని అనుసరించడం ప్రారంభించేశారు సోదరులారా. దీనిని అరబీ భాషలో తఖ్లీద్ అంటారు. ఇలా చేయడము సరి కాదు అభిమాన సోదరులారా. ఎందుకంటే ఈ నలుగురు ఇమాములలో ఏ ఒక్క ఇమాము కూడా ప్రజలను కళ్ళు మూసుకొని వారిని అనుసరించండి అని బోధించలేదు.

రండి, వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారు ఏమనేవారంటే: ‘ఇదా సహ్హల్ హదీసు ఫహువ మజ్హబీ’. “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట వచ్చేస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనం వచ్చేస్తే అదే నా మార్గము” అని చెప్పారు సోదరులారా. అలాగే మరొక సందర్భంలో ఆయన ఏమన్నారంటే: ‘ఇదా వజద్తుమ్ కలామీ యుఖాలిఫు కలామ రసూలిల్లాహి ఫద్ రిబూ బి కలామిల్ హాయిత్’. “ఎప్పుడైనా నా మాట, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటకు విరుద్ధంగా వచ్చేస్తే, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటనే తీసుకోండి, నా మాటను గోడకేసి విసిరికొట్టండి” అని చెప్పారు సోదరులారా.

అలాగే, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి మనం చూచినట్లయితే, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారు ఏమన్నారంటే: ‘కుల్లున్ యుఖజు మిన్ కౌలిహి వ యురద్దు ఇల్లా సాహిబు హాజల్ ఖబ్ర్’. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి మస్జిదె నబవీలో కూర్చొని శిష్యులకు, ప్రజలకు బోధించేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధి వైపు సైగ చేస్తూ ఇలా చెప్పేవారు: “ప్రతి మనిషి యొక్క మాట తీసుకొనవచ్చు, ప్రతి మనిషి యొక్క మాటను తిరస్కరించే అధికారము అందరికీ కలదు. కానీ, ఈ సమాధిలో నిద్రిస్తున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలను కేవలం తీసుకోవాలే తప్ప తిరస్కరించేదానికి అధికారము లేదు” అని చెప్పేవారు.

అలాగే ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి మనం చూచినట్లయితే, ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి ఏమనేవారంటే, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట వచ్చేసిన తర్వాత, ప్రపంచంలోని ఏ వ్యక్తి మాటను కూడా తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటను వదిలేయటము నిషేధం” అని చెప్పేవారు. అంతేకాకుండా ‘ఇదా సహ్హల్ హదీసు ఫహువ మజ్హబీ’, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనం వచ్చేస్తే అదే నా మార్గం” అని ఆయన కూడా ప్రకటించేవారు.

ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి మనం చూసినట్లయితే, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారు వారి శిష్యులలోని ఒక శిష్యునికి బోధిస్తూ ఇలా అన్నారు. ఏమన్నారంటే: ‘లా తుఖల్లిద్ నీ వలా తుఖల్లిద్ మాలికన్ వలల్ ఔజాయియ్య వఖుజ్ మిన్ హైసు అఖజూ’. “ఓ నా శిష్యుడా, నువ్వు కళ్ళు మూసుకొని నన్ను అనుసరించకు. అలాగే ఇమామ్ మాలిక్ ని, ఇమామ్ ఔజాయీని ఎవరిని కూడా నువ్వు కళ్ళు మూసుకొని అనుసరించకు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి అయితే ధర్మ విద్యను అభ్యసించారో, నువ్వు కూడా అక్కడి నుంచే ధర్మ విద్యను అభ్యసించు” అని చెప్పేవారు. అల్లాహు అక్బర్!

ఇవన్నీ చూచిన తర్వాత మనకు ఏం అర్థమవుతుంది సోదరులారా? ఇమాములను కళ్ళు మూసుకొని అనుసరించడం ఇది సరి కాదు.

ఇక రెండవ రకమైన ప్రజలు ఎవరంటే ఈ నలుగురు ఇమాముల యొక్క జీవిత చరిత్రను తెలుసుకోకుండా, ఈ నలుగురు ఇమాముల యొక్క త్యాగాలను, వారు చేసిన ధార్మిక సేవను గుర్తించకుండా ఈ నలుగురు ఇమాములను ద్వేషిస్తారు, ఈ నలుగురు ఇమాములను దూషిస్తారు. దీనిని కూడా మనం ఖండిస్తాం. ఎందుకంటే వీళ్ళు ధర్మ సేవకు త్యాగాలు చేసిన వారు, ఎన్నో త్యాగాలు చేసి ప్రపంచానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు అందించిన వారు. వీరి త్యాగాలను మనము కనుమరుగు చేయలేము. వీరిని ద్వేషించుకోవటం, వీరిని దూషించడం తప్పు సోదరులారా.

న్యాయంగా మాట్లాడాలంటే నలుగురు ఇమాములు ప్రజలకు బోధించిన బోధనలలో కొన్ని బోధనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలకు విరుద్ధంగా వెళ్ళాయి. కానీ, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఈ తప్పు చేయలేదు సోదరులారా. వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు అందలేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులు వారికి చేరలేదు. కాబట్టి వారు అలాంటి ఫత్వాలు ఇచ్చారు. అయితే, మరణించే ముందు వారు చెప్పారు కదా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట వచ్చేస్తే అదే మా మార్గము అని. కాబట్టి వారిని ద్వేషించుకోవటం, వారిని దూషించడం సరి కాదు.

ఈ రెండింటికి మధ్య ఒక మార్గం ఉంది. అదే సజ్జన పూర్వికుల మార్గం, అదే సలఫీల మార్గం, అదే అహ్లె హదీసుల మార్గం. అదేమిటంటే నలుగురు ఇమాములను గౌరవించడం తప్పనిసరి. నలుగురు ఇమాములతో పాటు ఇంకా ఎంత మంది ఇమాములు ఉన్నారో, ఎంత మంది ధర్మ సేవ చేసిన పండితులు ఉన్నారో, వారందరినీ గౌరవించడం తప్పనిసరి. వారెవరినీ కించపరచకూడదు. వారి త్యాగాలను మనము కొనియాడాలి. అయితే, వారి ఏ మాటలైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటకు విరుద్ధంగా వెళ్ళాయో, ఆ మాటలను మాత్రం తీసుకోకుండా అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలనే తీసుకోవటం సరైన మార్గం అని బోధిస్తారు. ఇదే సలఫీల యొక్క బోధన, ఇదే అహ్లె హదీసుల యొక్క బోధన, ఇదే సరైన మార్గం.

అభిమాన సోదరులారా, చివరలో ఒక మాట చెప్పదలచుకుంటున్నాను, అదేమిటంటే, కళ్ళు మూసుకొని అనుసరించడానికి అర్హత కలిగిన ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు చెప్పి మనల్ని అనుసరించాలని ఆదేశించాడు కాబట్టి, కళ్ళు మూసుకొని మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరించవచ్చు.

అల్లాహ్ మనందరికీ ఈ విషయాలు అర్థం చేసుకొని సరైన మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

أَقُوْلُ قَوْلِيْ هٰذَا وَأَسْتَغْفِرُ اللهَ لِيْ وَلَكُمْ وَلِسَائِرِ الْمُسْلِمِيْنَ فَاسْتَغْفِرُوْهُ إِنَّهُ هُوَ الْغَفُوْرُ الرَّحِيْمُ. وَصَلَّى اللهُ تَعَالَى عَلَى خَيْرِ خَلْقِهِ مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ وَأَهْلِ بَيْتِهِ أَجْمَعِيْنَ بِرَحْمَتِكَ يَا أَرْحَمَ الرَّاحِمِيْنَ وَالْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16733

ఇతర లింకులు: