అల్లాహ్ శుభనామాల జ్ఞాన ప్రాముఖ్యత -1
షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
https://youtu.be/VXTqC6DrUHw [26 నిముషాలు]
ఈ ప్రసంగంలో, అల్లాహ్ యొక్క శుభ నామాల (అస్మా-ఉల్-హుస్నా) జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మరియు దాని వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించబడింది. అల్లాహ్‌ను తెలుసుకోవడానికి ఆయన నామాలను తెలుసుకోవడమే ప్రధాన మార్గమని, ఇది విశ్వాసాన్ని, ప్రేమను, భయభక్తులను పెంచుతుందని మరియు సరైన ఆరాధనకు పునాది అని నొక్కి చెప్పబడింది. అల్లాహ్ నామాలను తెలుసుకోవడం స్వర్గ ప్రవేశానికి, పాపాల నుండి దూరం కావడానికి, ఆత్మ శుద్ధికి మరియు ప్రార్థనల స్వీకరణకు దారితీస్తుందని వివిధ ఉదాహరణలు, ఖురాన్ ఆయతులు మరియు హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. ప్రజలపై ఆధారపడటాన్ని తగ్గించి, కేవలం అల్లాహ్‌పైనే నమ్మకం ఉంచేలా ఈ జ్ఞానం ఎలా సహాయపడుతుందో కూడా వివరించబడింది.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్)
శపించబడిన షైతాన్ నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మా ఉల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
మరియు అల్లాహ్ కొరకు శుభ నామాలు ఉన్నాయి, వాటి ద్వారానే మీరు ఆయనను ప్రార్థించండి.
సోదర మహాశయులారా, రండి ఈ రోజు మనం అల్లాహ్ యొక్క శుభ నామాల జ్ఞాన ప్రాముఖ్యత, శుభ నామాల జ్ఞానాన్ని మనం పొందితే మనకు ఏంటి లాభాలు, అల్లాహ్ యొక్క శుభ నామాల జ్ఞానం మనం నేర్చుకోవడం, దీనికి ఎంత గొప్ప ప్రాముఖ్యత ఉన్నదో కొన్ని పాయింట్స్ లలో దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
పరిచయం మరియు ఒక ఉపమానం
చూడండి, వలిల్లాహిల్ మసలుల్ ఆలా, నేను అల్లాహ్ కొరకు ఏ ఉపమానం ఇవ్వడం లేదు. ఫలా తజ్రిబూ లిల్లాహిల్ అమ్సాల్. మన తక్కువ జ్ఞానం, మన యొక్క బుర్రలో విషయం త్వరగా దిగడానికి అర్థం అవ్వడానికి ఒక చిన్న ఉదాహరణ. మీ ఊరిలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. ఎవడబ్బా ఇతను అని మీరు అనుకుంటారు. కానీ అతని వేషధారణను బట్టి ఏదో ఒక చిన్న అంచనా వేసుకుంటారు. కదా? దానివల్ల మరికొంత పరిచయం ఎంతైతే పెరుగుతుందో అంతే అతని పట్ల మీరు కొంచెం ఆకర్షితులవుతారు. ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, అతని యొక్క పరిచయంలో ఇంకా ఎక్కువ విషయాలు తెలిసి వచ్చేసరికి ఇంకా అతనికి ఆకర్షితులై, దగ్గరగా అయి మరింత ప్రేమ ఎక్కువ అవుతుంది. అవును కదా? అంతేకాదు, ఇక ఎవరికీ ఎలాంటి రిలేషన్ షిప్ లతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందో, అలాంటివి కొందరికి అత్తగారి సంబంధాలు అంటే కొంచెం ఎక్కువ లైక్ కదా? ఈ విధంగా, ఓ మా అత్తగారి ఊరి వారంట ఇతను అని అంటే, అరే ఇంటికి పిలిపించుకొని చాయన్నా తాగించాలి అని ఆలోచన వస్తుంది. ఇంకా నేను డీప్ లో వెళ్ళను. చిన్నగా మీకు అర్థం కావడానికి ఉదాహరణ ఇచ్చాను.
ఏ వ్యక్తి పట్ల అతని యొక్క పరిచయం మనకు ఎంత ఎక్కువగా తెలుస్తుందో, అతని పట్ల మన ప్రేమ, గౌరవ అభిమానం, అతని సేవ, అతని యొక్క ఆదేశాన్ని, అతను ఏదైనా మాటను శ్రద్ధగా వినడం, దాని తర్వాత దానిని ఆచరించే విషయం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి కదా?
సోదర మహాశయులారా, అల్లాహ్ మనందరి సృష్టికర్త, మన అందరి ఉపాధికర్త, పోషణకర్త, ఈ మొత్తం విశ్వాన్ని నిర్వహిస్తున్నవాడు, నడుపుతున్నవాడు. అతని గురించి మనం తెలుసుకోవడం, ఇది మనపై ఉన్నటువంటి విధులలో, బాధ్యతలో అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే మొట్టమొదటిది, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. నిన్ను కన్న తండ్రిని కొంచెం కూడా నువ్వు ఖాతరు చెయ్యవా? అని మనం అంటాము కదా? కన్న తండ్రి ద్వారా మనల్ని పుట్టించిన ఆ అసలైన సృష్టికర్తను తెలుసుకోకుంటే, అతని పరిచయం మనకు లేకుంటే ఎలా మరి?
అయితే అల్లాహ్ శుభ నామాల జ్ఞాన ప్రాముఖ్యత తెలుస్తుంది కదా ఇప్పుడు మీకు? అల్లాహ్ గురించి మనకు ఎక్కువగా తెలవాలంటే, అల్లాహ్ యొక్క పరిచయం మనకు కావాలంటే తప్పకుండా అల్లాహ్ యొక్క శుభ నామముల, ఉత్తమ గుణాల వివరణ మనకు ఎంత తెలుస్తుందో అంతే ఎక్కువ అల్లాహ్ యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. అందుకొరకే ఒకచోట ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఎంత మంచి మాట చెప్పారు:
مَعْرِفَةُ أَسْمَاءِ اللَّهِ الْحُسْنَى وَصِفَاتِهِ الْعُلَا هِيَ الطَّرِيقُ الرَّئِيسِيُّ إِلَى مَعْرِفَةِ اللَّهِ
(మారిఫతు అస్మాఇల్లాహిల్ హుస్నా వ సిఫాతిహిల్ ఉలా హియత్ తరీఖుర్ రఈసీ ఇలా మారిఫతిల్లాహ్)
అల్లాహ్ యొక్క శుభ నామాలు మరియు ఆయన ఉన్నత గుణగణాల యొక్క జ్ఞానం, అల్లాహ్ ను తెలుసుకోవడానికి ప్రధానమైన మార్గం.
అల్లాహ్ గురించి తెలుసుకోవడానికి అతి ప్రధానమైన మార్గం అల్లాహ్ యొక్క శుభ నామాలు మరియు ఉత్తమ గుణాలు. అందుకొరకే ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తరీఖుల్ హిజ్రతైన్‌లో చెబుతున్నారు:
وَلَيْسَتْ حَاجَةُ الْأَرْوَاحِ قَطُّ إِلَى شَيْءٍ أَعْظَمَ مِنْهَا إِلَى مَعْرِفَةِ بَارِئِهَا وَفَاطِرِهَا
(వలైసత్ హాజతుల్ అర్వాహి ఖత్తు ఇలా షైఇన్ ఆ’జమ మిన్హా ఇలా మారిఫతి బారిఇహా వ ఫాతిరిహా)
మనిషి యొక్క శరీరానికి తిండి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ అతని ఆత్మకు అల్లాహ్ యొక్క పరిచయం, అతన్ని పుట్టించినటువంటి సృష్టికర్త యొక్క పరిచయం చాలా అవసరం.
وَلَا سَبِيلَ إِلَى هَذَا إِلَّا بِمَعْرِفَةِ أَوْصَافِهِ وَأَسْمَائِهِ
(వలా సబీల ఇలా హాదా ఇల్లా బి మారిఫతి అవ్సాఫిహి వ అస్మాఇహి)
ఆయన గుణగణాలు మరియు నామాలను తెలుసుకోవడం ద్వారా తప్ప దీనికి మార్గం లేదు.
మరి ఇది ఎలా సాధ్యం? అల్లాహ్ యొక్క ఉత్తమ పేర్లు, అల్లాహ్ యొక్క ఉత్తమ గుణాలు తెలుసుకోవడం ద్వారానే సాధ్యము. ఇది ఒక పాయింట్.
ఆరాధన మరియు విశ్వాసంలో ప్రాముఖ్యత
రెండవ పాయింట్, అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు? ఎందుకు పుట్టించాడు? అల్లాహ్‌ను ఆరాధించడానికి. ఎప్పటివరకైతే మనం అల్లాహ్ యొక్క పరిచయం అతని శుభ నామాల ద్వారా మంచి రీతిలో తెలుసుకోమో, అతని యొక్క ఆరాధన కూడా సరియైన రీతిలో చేయలేము. అల్లాహ్ యొక్క ఆరాధన మంచి రీతిలో చేయడానికి, అల్లాహ్ యొక్క శుభ నామాలను తెలుసుకోవడం చాలా చాలా అవసరం.
మూడో విషయం, అల్లాహ్‌ను విశ్వసించడం తప్పనిసరి కదా? అయితే, అల్లాహ్‌ను మనం ఎంత ఎక్కువగా అతని శుభ నామాల ద్వారా తెలుసుకుంటామో, అంతే మన విశ్వాసం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. షేఖ్ అబ్దుర్రహ్మాన్ అస్-సాదీ రహిమహుల్లాహ్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియపరిచారు.
స్వర్గ ప్రవేశానికి మార్గం
ఇంకా, సోదర మహాశయులారా, సహీ బుఖారీలో వచ్చిన హదీస్ మీకు తెలుసు. నాలుగో పాయింట్ లో ఈ విషయం నోట్ చేసుకోండి. ఏంటి? ఎవరు ఎంత ఎక్కువగా అల్లాహ్ యొక్క నామాలను, ఉత్తమ పేర్లను తెలుసుకుంటారో, అంతే వారు స్వర్గంలో ప్రవేశించడానికి ఎక్కువ అర్హత కలిగి ఉంటారు.
إِنَّ لِلَّهِ تِسْعَةً وَتِسْعِينَ اسْمًا، مَنْ أَحْصَاهَا دَخَلَ الْجَنَّةَ
(ఇన్న లిల్లాహి తిస్’అతన్ వ తిస్’ఈన ఇస్మన్, మన్ అహ్సాహా దఖలల్ జన్నహ్)
నిశ్చయంగా అల్లాహ్ కొరకు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి, ఎవరైతే వాటిని లెక్కిస్తారో (పూర్తిగా గ్రహిస్తారో) వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.
అల్లాహ్ కొరకు ఒకటి కంటే ఒకటి తక్కువ వంద, అంటే తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి. మన్ అహ్సాహా దఖలల్ జన్నహ్. ఎవరైతే దానిని లెక్కించారో స్వర్గంలో ప్రవేశిస్తారు. ‘అహ్సా‘, ఇక్కడ ఏదైతే అరబీ పదం వచ్చిందో ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తెలుపుతున్నారు, దీని యొక్క భావం ఏమిటంటే ఇందులో మూడు విషయాలు రావడం తప్పనిసరి, అప్పుడే ‘అహ్సా’ ఈ యొక్క సరియైన అర్థాన్ని, భావాన్ని అతను ఆచరించిన వాడు అవుతాడు. అప్పుడే అతడు స్వర్గంలో ప్రవేశించడానికి అర్హుడు అవుతాడు.
మొదటిది, అల్లాహ్ యొక్క శుభ నామాలను తెలుసుకోవాలి, ఆ పదాలను, వాటి భావాలను తెలుసుకోవాలి.
రెండవది, ఆ భావాలు ఏదైతే తెలుసుకుంటున్నాడో, ప్రతి ఒక్క అల్లాహ్ పేరుకు ఒక అర్థం ఉంటుంది కదా, ఉదాహరణకు అర్-రహ్మాన్, అనంత కరుణామయుడు. ఇప్పుడు పదం తెలిసింది, అల్లాహ్ యొక్క పేరు రహ్మాన్ అని తెలిసింది, దాని యొక్క భావం తెలిసింది. ఆ భావం ద్వారా మనపై వచ్చి పడే బాధ్యతలు ఏమిటి? అది కూడా తెలుసుకోవాలి. అంటే, అల్లాహ్ కంటే ఇంకా ఎవరైనా వేరే వారు కరుణించే విషయంలో గొప్పగా ఉన్నారు అని నమ్మవద్దు, అలాంటి ఆశతో వేరే ఎవరి వైపునకు మరలవద్దు.
ఇంకా, మూడో విషయం, అల్లాహ్ యొక్క ఈ నామాలు తెలుసుకొని, భావాలు తెలుసుకొని, వాటి యొక్క బాధ్యత ఏమిటో తెలుసుకొని, అల్లాహ్‌ను ఆ శుభ నామాల ద్వారా అర్ధించాలి, దుఆ చేయాలి, వేడుకోవాలి. ఇదే విషయం అల్లాహ్ చెప్పాడు సూరతుల్ ఆరాఫ్, ఆయత్ నెంబర్ 180 లో:
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మా ఉల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
అల్లాహ్ కు చాలా మంచి పేర్లు ఉన్నాయి, మీరు ఆ పేర్ల ఆధారంగానే అల్లాహ్‌తో దుఆ చేయండి.
ఇప్పుడు ఈ ఆయత్, సూరా ఆరాఫ్ ఆయత్ నెంబర్ 180 మరియు సహీ బుఖారీ లో వచ్చిన హదీస్, ఈ రెండిటిని కలిపి ఒక ముఖ్యమైన మాట చెబుతున్నాను శ్రద్ధ వహించండి. సర్వసామాన్యంగా అల్లాహ్ యొక్క పేర్లు ఎన్ని అని మనం ఎవరినైనా అడిగితే వెంటనే 99 అని చెప్పేస్తాం. అయితే గుర్తుంచుకోండి, అల్లాహ్ యొక్క పేర్లు లెక్కలేనన్నివి. అయితే సహీ బుఖారీలో వచ్చిన హదీస్ భావం ఏంటంటే, 99 పేర్లు కనీసం తెలుసుకుంటే, వాటి యొక్క హక్కును నెరవేరుస్తే స్వర్గ ప్రవేశ భాగ్యం లభిస్తుంది. పేర్లు ఎన్ని అంటే 99 అనకూడదు. లెక్కలేనన్ని పేర్లు. ఎందుకంటే ముస్నద్ అహ్మద్‌లో మరొక హదీస్ కూడా ఉంది. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దుఆ నేర్పారు:
اللَّهُمَّ إِنِّي عَبْدُكَ وَابْنُ عَبْدِكَ وَابْنُ أَمَتِكَ
(అల్లాహుమ్మ ఇన్నీ అబ్దుక వబ్ను అబ్దిక వబ్ను అమతిక…)
ఓ అల్లాహ్, నిశ్చయంగా నేను నీ దాసుడను, నీ దాసుని కుమారుడను మరియు నీ దాసురాలి కుమారుడను…
తో ప్రారంభమవుతుంది. ఇన్షాఅల్లాహ్ దాని యొక్క వివరణ ఇంతకు ముందు కూడా ఎన్నో సందర్భాల్లో మేము చెప్పి ఉన్నాము.
అల్లాహ్ పట్ల ప్రేమ పెరుగుట
ఐదో పాయింట్ ఏంటంటే, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఉత్తమ నామాలు మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అతని పట్ల ప్రేమ అంతే ఎక్కువగా పెరుగుతుంది. అవును, ఇది వాస్తవం. దీనికి సంబంధించి ఖురాన్‌లో నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల నుండి ఎన్నో ఆధారాలు మనం తీసుకోవచ్చు. కానీ స్టార్టింగ్‌లో నేను ఏదైతే ఒక ఉదాహరణ ఇచ్చానో, దాని ద్వారా కూడా మీకు విషయం అర్థమవుతుంది కదా? ఒక వ్యక్తి యొక్క గుణగణాలు ఎన్ని ఎక్కువ తెలిసి వస్తాయో, అతని సంబంధం మనకు ఎంత దగ్గరగా ఉంది అని తెలిసి వస్తుందో, అంతే అతని పట్ల ప్రేమ పెరుగుతుంది కదా? ఆ విధంగా, అల్లాహ్ యొక్క నామములు, అల్లాహ్ యొక్క ఉత్తమ పేర్లు మనం తెలుసుకోవాలి. రహ్మాన్, రహీమ్, అల్-మలిక్, అల్-ఖుద్దూస్…
ఆరవ పాయింట్ – అల్లాహ్ ఉత్తమ నామాలు ప్రాముఖ్యత, ఘనత, లాభం ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క నామాలను ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, వాటి హక్కును నెరవేరుస్తామో, అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు! మనము అల్లాహ్‌ను ప్రేమిస్తున్నాము అని అనుకుంటాము. అది ఎంతవరకు అందులో సత్యమో, అల్లాహ్ యే సత్యవంతులుగా మనల్ని తేల్చుగాక, సత్యంగా ఉంచుగాక. కానీ, అల్లాహ్ నామములు ఎంత ఎక్కువగా తెలుసుకొని వాటి హక్కులు నెరవేరుస్తామో అంతే ఎక్కువగా అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు. సహీ బుఖారీలో దీని గురించి దలీల్ ఉంది. తెలుసు కదా ఆ సంఘటన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హదీస్ యొక్క సారాంశం చెబుతున్నాను, సహీ బుఖారీ లోని హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలలో ఒక సహాబీ నమాజ్‌లో సూరే ఫాతిహా తర్వాత ఏదైనా సూరా చదివిన తర్వాత, సూరతుల్ ఇఖ్లాస్ కూడా చదువుతూ ఉండేవాడు. అయితే వెనుక ముఖ్తదీలకు కొంచెం విచిత్రంగా ఏర్పడి ప్రవక్తతో తెలియజేశారు. ప్రవక్త చెప్పారు, “అడగండి అతను అలా ఎందుకు చేస్తున్నాడు?” అని.
فَسَأَلُوهُ، فَقَالَ: لِأَنَّهَا صِفَةُ الرَّحْمَٰنِ، وَأَنَا أُحِبُّ أَنْ أَقْرَأَ بِهَا
(ఫసఅలూహు, ఫఖాల: లి అన్నహా సిఫతుర్ రహ్మాన్, వ అన ఉహిబ్బు అన్ అఖ్రఅ బిహా)
వారు అతనిని అడిగారు, అప్పుడు అతను ఇలా అన్నాడు: “ఎందుకంటే అది దయామయుని (అల్లాహ్) గుణగణం, మరియు నేను దానిని పఠించడానికి ఇష్టపడతాను.”
అందులో అల్లాహ్ యొక్క గుణగణాలు ఉన్నాయి. అల్లాహ్ యొక్క ఉత్తమ పేర్ల ప్రస్తావన ఉంది. అందుకొరకే అది నాకు చాలా ప్రియమైనది.
فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَخْبِرُوهُ أَنَّ اللَّهَ يُحِبُّهُ
(ఫఖాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం: అఖ్బిరూహు అన్నల్లాహ యుహిబ్బుహు)
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతనికి తెలియజేయండి, నిశ్చయంగా అల్లాహ్ అతనిని ప్రేమిస్తున్నాడు.”
ఆ వ్యక్తికి మీరు వెళ్లి శుభవార్త ఇవ్వండి, అల్లాహ్ ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. అల్లాహ్ యొక్క నామాలను, శుభ నామాలను, ఉత్తమ పేర్లను ఎంత ఎక్కువగా మనం తెలుసుకుంటామో, అంతే ఎక్కువగా అల్లాహ్ యొక్క ప్రేమ అనేది మనకు లభిస్తుంది.
ఇక రండి, ధర్మవేత్తలు ఈ సబ్జెక్టు మీద ఎంత పనిచేసారు! అల్లాహు అక్బర్! పాతకాలపు ఇమాములు మరియు ప్రస్తుతం ఉన్నటువంటి ధర్మవేత్తల్లో షేఖ్ అబ్దుర్రహ్మాన్ అస్-సాదీ గానీ, షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ గానీ, హిస్నుల్ ముస్లిం పుస్తకం ఉంది కదా, దాని యొక్క రచయిత షేఖ్ సయీద్ అల్-కహ్తానీ, వీరందరూ కూడా వీటిపై పుస్తకాలు రాసి ఉన్నారు.
సృష్టిపై ఆధారపడటం తగ్గడం
ఏడవ పాయింట్: అల్లాహ్ యొక్క శుభ నామాలు, ఉత్తమ పేర్ల జ్ఞానం యొక్క ప్రాముఖ్యత, లాభం, ఘనతలో ఏమిటంటే మనం అల్లాహ్ యొక్క నామాల గురించి ఎంత మంచిగా, వివరంగా, ఎంత లోతుగా తెలుసుకుంటామో, అంతే ఎక్కువగా అల్లాహ్‌కు దగ్గరగా అయి ప్రపంచ వాసులతో సంబంధం తక్కువ ఉంటుంది. అంటే ఏంటి? అల్లాహ్‌ను సరియైన రీతిలో మనం తెలుసుకొని, అతని యొక్క హక్కు సరియైన రీతిలో మనం నెరవేరుస్తూ, ప్రజల అవసరాలు లేకుండా వారి ముందు చెయ్యి చాపకుండా, వారి ముందు అర్ధించకుండా, భిక్షాటన చేయకుండా ఉండగలుగుతాము. అవును, దీనికి సంబంధించి చాలా వివరాలు ధర్మవేత్తలు రాసి ఉన్నారు. సంక్షిప్తంగా ఒక రెండు విషయాలు నేను చెప్తాను. ఇన్షాఅల్లాహ్ మీకు ఈ మాట అర్థమవుతుంది.
ఎప్పుడైతే అల్లాహ్ మాత్రమే ‘ఘనీ‘, ఆయనే నిరపేక్షాపరుడు మరియు నన్ను కూడా ప్రజల అవసరం లేకుండా చేయగలడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకం ఉండి, సూరె ఫాతిర్ ఆయత్ నెంబర్ 15:
يَا أَيُّهَا النَّاسُ أَنتُمُ الْفُقَرَاءُ إِلَى اللَّهِ
(యా అయ్యుహన్ నాస్ అన్తుముల్ ఫుఖరాఉ ఇలల్లాహ్)
ఓ ప్రజలారా, అల్లాహ్ ముందు మీరందరూ కూడా అడిగేవారు, భిక్షాటన చేసేవారు. అల్లాహ్ యొక్క అవసరం మీరు కలిగి ఉన్నారు.
وَاللَّهُ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ
(వల్లాహు హువల్ ఘనియ్యుల్ హమీద్)
మరియు అల్లాహ్, ఆయనే ఎవరి అవసరం కలిగిలేడు, ప్రశంసనీయుడు.
ఆయన అల్-ఘనీ, ఎవరి అవసరం కలిగిలేడు. అల్-హమీద్, ఎవరు ప్రశంసించినా ప్రశంసించకపోయినా, అతడు అన్ని రకాల ప్రశంసలకు అర్హుడు. ఈ ఆయత్, ఇలాంటి భావంలో ఉన్నటువంటి అల్-ఘనీ, అల్లాహ్ యొక్క పేర్లలో గొప్ప పేరు, దాని యొక్క భావం, అర్థం, మరి దాని యొక్క బాధ్యత మనపై, మనిషి మంచి రీతిలో ఖురాన్ హదీసుల ఆధారంగా తెలుసుకున్నాడంటే, అల్లాహ్ తో అర్ధిస్తాడు, అల్లాహ్ యే నిరపేక్షాపరుడు కనుక నన్ను ప్రజల అవసరం లేకుండా చేస్తాడు అన్నటువంటి నమ్మకం ఎక్కువగా కలిగి ఉంటాడు. ఇక దీనికి ఉదాహరణలు ఇవ్వాలంటే స్వయం ప్రవక్త జీవితంలో నుండి, సహాబాల నుండి చాలా ఉన్నాయి. ఒక్క చిన్న ఉదాహరణ అర్థం కావడానికి ఇవ్వడం జరిగింది.
అలాగే సోదర మహాశయులారా, అల్లాహ్ అల్-మలిక్, అల్-మాలిక్. ఆయనే రాజు. ఆయనే సర్వాధికుడు. ఈ ఆయత్, దీని యొక్క లోతైన జ్ఞానం, దీనికి సంబంధించిన ఆయతులు వాటిని మనం అర్థం చేసుకున్నామంటే:
وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا
(వలిల్లాహి ముల్కుస్ సమావాతి వల్ అర్జి వమా బైనహుమా)
ఆకాశాల మరియు భూమి యొక్క మరియు వాటి మధ్య ఉన్న సమస్తం యొక్క ఆధిపత్యం అల్లాహ్ కే చెందింది.
ఆకాశాలు, భూమి, వమా బైనహుమా, వీటి మధ్యలో ఉన్న సమస్తానికి ఏకైక అధికారుడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఇక ఈ లోకంలో ఎవరికి ఏదైనా చిన్న అధికారం ఉంటే వారితో భయపడడం, ఏదైనా అవసరం ఉంటే ఆ అధికారుల వద్దకు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, ఇట్లాంటి పనులు చేయడు.
భయభక్తులు పెరగడం మరియు పాపాలకు దూరం కావడం
8వ పాయింట్ : సోదర మహాశయులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయి. కానీ రండి, మరొక విషయం ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క నామాలను ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, వాటి హక్కును నెరవేరుస్తామో, అల్లాహ్ పట్ల భయం, అల్లాహ్ యొక్క గౌరవం ఎక్కువగా పెరుగుతుంది. అవును.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు చెప్పారు, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఈ విషయాన్ని మిఫ్తాహు దారిస్ సాదాలో ప్రస్తావించారు. ఏమిటంటే:
كَفَى بِخَشْيَةِ اللَّهِ عِلْمًا وَكَفَى بِالِاغْتِرَارِ بِاللَّهِ جَهْلًا
(కఫా బి ఖష్యతిల్లాహి ఇల్మన్ వ కఫా బిల్ ఇగ్తిరారి బిల్లాహి జహలా)
మనిషి ఎంత ఎక్కువగా అల్లాహ్ గురించి తెలుసుకుంటాడో అంతే ఎక్కువగా అల్లాహ్‌కు భయపడతాడు మరియు మనిషి ఎంత ఎక్కువగా అల్లాహ్ పట్ల అజ్ఞానంగా ఉంటాడో, అంతే అల్లాహ్ విషయంలో మోసపోయి పాపాలకు గురి అయి ఉంటాడు
ఒకవేళ ఈ భావం మరింత మంచిగా మీకు అర్థం కావాలంటే సూరె ఫాతిర్, ఆయత్ నెంబర్ 28 చదవండి:
إِنَّمَا يَخْشَى اللَّهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاءُ
(ఇన్నమా యఖ్శల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా)
నిశ్చయంగా, ఆయన దాసులలో జ్ఞానులు మాత్రమే అల్లాహ్‌కు భయపడతారు.
అల్లాహ్‌తో భయపడేది, అల్లాహ్ గురించి ఎక్కువగా తెలిసిన వారు. ధర్మ జ్ఞానం కలిగి ఉన్నవారు, అల్లాహ్‌కు సంబంధించిన జ్ఞానం కలిగి ఉన్నవారే అల్లాహ్‌తో ఎక్కువగా భయపడతారు. మరియు సహీ హదీసులో వచ్చిన విధంగా బుఖారీ మరియు ముస్లింలో, ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చెప్పారు?
أَنَا أَعْلَمُكُمْ بِاللَّهِ وَأَشَدُّكُمْ لَهُ خَشْيَةً
(అన ఆ’లముకుం బిల్లాహి వ అషద్దుకుం లహు ఖశ్యహ్)
నేను మీ అందరిలో అల్లాహ్ గురించి బాగా తెలిసిన వాడను మరియు ఆయనకు అత్యధికంగా భయపడే వాడను.
అల్లాహ్ గురించి నేను మీ అందరిలో ఎక్కువగా తెలిసినవాన్ని, మీ అందరిలో అల్లాహ్ పట్ల ఎక్కువగా భయం కలిగి ఉన్నవాన్ని. అర్థమైందా? అల్లాహ్ యొక్క నామ ప్రాముఖ్యత తెలుస్తుందా?
సోదర మహాశయులారా, తొమ్మిదవ పాయింట్, మనం అల్లాహ్ యొక్క ఉత్తమ నామాల గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అంతే ఎక్కువగా పాపాలకు దూరం ఉండగలుగుతాము. తద్వారా నరకం నుండి మోక్షం పొందగలుగుతాము. అవును, ఎంత ఎక్కువగా అల్లాహ్ గురించి తెలుసుకోగలుగుతామో, అంతే పాపాలకు దూరంగా ఉండగలుగుతాము. అవునా లేదా? దీనికి సంబంధించి కూడా ఎన్నో ఆయతులు, ఎన్నో హదీసులు ఉన్నాయి. కానీ ఒక చిన్న ఉదాహరణ, ఉపమానం ద్వారా మీకు చెబుతాను.
ఏదైనా బంగారం దుకాణంలో దొంగలించాలని, ఆ… ఎక్కడ ఎవరు లేరు, ఏ పోలీస్ వారు కూడా లేరు అని దుకాణానికి ఏదైనా బొక్క వేయాలని దొంగ దగ్గరికి వస్తున్నాడు, అంతలోనే అటు నుంచి పోలీస్ బండి వస్తుంది. ఏమవుతుంది? అలాగే అదే ఉద్దేశంతో, అదే ధైర్యంతో దొంగతనం చేయడానికి వెళ్తాడా? లేదా కెమెరాలు నలువైపుల నుండి ఉన్నాయి, అలాంటి చోట ఏదైనా పాపం, దోషం, నేరం, తప్పు… అంతెందుకండి, సిగ్నల్ వద్దకు వచ్చాము, రెడ్ లైట్ ఉంది, అక్కడ కెమెరాలు కూడా ఉన్నాయి సిగ్నల్ పై, మళ్లీ పోతే పోలీస్ కెమెరా కూడా పట్టుకొని ఉన్నాడు. మీరు దాటారంటే క్లిక్ కొడతాడు. దాటుతారా? దాటరు కదా? వలిల్లాహిల్ మసలుల్ ఆలా. అల్లాహ్ కొరకు కాదు ఈ ఉపమానాలు, మనకు అర్థం కావాలి అని.
ఇన్న బత్ష రబ్బిక లషదీద్. నీ ప్రభువు పట్టుకోవడానికి, శిక్షించడానికి వచ్చినప్పుడు ఎవరు కూడా అతని పట్టు నుండి వదులుకోలేరు అన్న విషయంపై మనకు కచ్చితమైన నమ్మకం ఉండేది ఉంటే. అల్లాహు తాలా చీకట్లలో కూడా అలాగే చూస్తాడు, ఎలాగైతే పట్టపగలు మిట్ట మధ్యాహ్నం చూస్తాడో అన్నటువంటి నమ్మకం మనకు ఉండేది ఉంటే, పాపంలో ముందడుగు వేయగలుగుతామా, ధైర్యం చేయగలుగుతామా?
అల్లాహ్ యొక్క శుభ నామములు, ఉత్తమ పేర్లు ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అంతే ఎక్కువగా పాపాల నుండి దూరం ఉండి నరకం నుండి మోక్షం పొందగలుగుతాము.
ఆత్మ శుద్ధి మరియు దుఆ స్వీకరణ
10వ పాయింట్, అల్లాహ్ యొక్క నామములు ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అంతే మన ఆత్మ శుద్ధి కలుగుతుంది. పాపాల పట్ల ఆలోచన, పాపాల పట్ల ఒక రకమైన ఆకర్షణ అనేది తగ్గుతుంది. దానికి బదులుగా పుణ్యాల వైపు ఆలోచనలు ఎక్కువగా కలిగి మనం పుణ్యాలు చేయడానికి పూనుకుంటాం. సూరతుష్ షమ్స్, అలాగే సూరతుల్ ఆలా యొక్క ఆయతుల ద్వారా ఈ విషయం మనకు బోధపడుతుంది. అలాగే, సూరత్ ఆల ఇమ్రాన్ మరియు సూరతుల్ జుమాలో వచ్చిన ఆయతుల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉద్దేశం పంపడానికి ఇదే అన్నట్లుగా అల్లాహు తాలా చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు.
సోదర మహాశయులారా, సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఏమిటి? అల్లాహ్‌ను ఎంత ఎక్కువగా మనం అతని శుభ నామాల ద్వారా తెలుసుకుంటామో, అంతే విశ్వాసం పెరుగుతుంది, అతని పట్ల ప్రేమ పెరుగుతుంది, స్వర్గానికి దగ్గరవుతాము, పాపాలకు దూరంగా ఉండి నరక మోక్షం పొందుతాము, అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు.
లాస్ట్, ఫైనల్, ఇంపార్టెంట్ విషయం. – మనం అల్లాహ్ యొక్క నామాలతో దుఆ చేస్తే… అల్లాహ్ యొక్క నామాలు మనం మంచిగా తెలుసుకొని వాటి ఆధారంగా, ఏ దుఆ మనకు చేయవలసిన అవసరం ఉందో దానికి అనుగుణంగా ఏ అల్లాహ్ యొక్క పేరు ఉందో దాని ఆధారంగా దుఆ చేస్తే, వెంటనే, త్వరగా దుఆ స్వీకరించబడే అవకాశాలు పెరుగుతాయి. దీనికి సంబంధించి కూడా సహీ బుఖారీ, ముస్లింలోని హదీసులు ఉన్నాయి. సూరతుల్ ఇఖ్లాస్ యొక్క వ్యాఖ్యానం మీరు చదివారంటే అందులో కూడా ఆ హదీసులు వస్తాయి. ఒక సందర్భంలో ఒక సహాబీ వచ్చి:
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِأَنَّكَ أَنْتَ اللَّهُ الْأَحَدُ الصَّمَدُ الَّذِي لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
(అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బి అన్నక అంతల్లాహుల్ అహదుస్ సమద్, అల్లజీ లమ్ యలిద్ వలమ్ యూలద్ వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్)
ఓ అల్లాహ్, నిశ్చయంగా నేను నిన్నే వేడుకుంటున్నాను, ఎందుకంటే నీవే అల్లాహ్, ఏకైకుడవు, నిరపేక్షాపరుడవు. ఆయన ఎవరినీ కనలేదు, ఎవరి చేతా కనబడలేదు. మరియు ఆయనకు సరిసమానులెవరూ లేరు.
అని అన్నాడు, ప్రవక్త వెంటనే ఏమి చెప్పారు? ఇతను అల్లాహ్ యొక్క ఎంతటి గొప్ప పేర్లతో అర్ధిస్తున్నాడు అంటే ఇక అతడు ఏ ఏమీ అడిగినా అల్లాహ్ ప్రసాదిస్తాడు, ఏ దుఆ చేసినా అల్లాహ్ స్వీకరిస్తాడు.
అల్లాహ్ శుభనామాల జ్ఞాన ప్రాముఖ్యత -2 || షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
https://youtu.be/o2Az39e4Gvs [34 నిముషాలు]
ఈ ప్రసంగంలో, వక్త ఏ విద్య అత్యంత శ్రేష్ఠమైనది మరియు ఘనత గలది అనే ప్రశ్నతో ప్రారంభించి, దాని సమాధానం అల్లాహ్ గురించిన జ్ఞానమేనని స్పష్టం చేశారు. అల్లాహ్ యొక్క నామాలు, గుణాలు మరియు పనుల గురించి తెలుసుకోవడమే అన్ని జ్ఞానాలలోకి గొప్పదని, దీనిని ‘అల్-ఫిఖ్ హుల్-అక్బర్’ (అత్యున్నత అవగాహన) అని అంటారని వివరించారు. ఒక ఎత్తైన భవనానికి బలమైన పునాది ఎంత అవసరమో, మన ఆరాధనలు మరియు విశ్వాసానికి అల్లాహ్ గురించిన సరైన జ్ఞానం అంత అవసరమని ఒక ఉదాహరణతో పోల్చారు. ఖురాన్‌లోని సూరత్ అత-తౌబా, సూరత్ అత-తలాఖ్ మరియు సూరత్ అల్-మునాఫిఖూన్ వంటి అధ్యాయాల నుండి ఆయత్‌లను ఉటంకిస్తూ, అల్లాహ్ తన సృష్టిని మనకు పరిచయం చేసింది మనం ఆయనను తెలుసుకోవడానికేనని నొక్కి చెప్పారు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ మరియు షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా వంటి పండితుల మాటలను ప్రస్తావిస్తూ, ఖురాన్‌లో స్వర్గంలోని సుఖాల కంటే అల్లాహ్ గుణగణాల ప్రస్తావనే ఎక్కువగా ఉందని తెలిపారు. చివరగా, మన సిరిసంపదలు మరియు సంతానం అల్లాహ్ ధ్యానం నుండి మనల్ని మరల్చరాదని, అల్లాహ్ గురించిన జ్ఞానంతో మన విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలని హితవు పలికారు.
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمْمَدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ.
[అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.]
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్, ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత.
ప్రియ మిత్రులారా, కొన్ని రకాల విద్యలో ఏ విద్య ఎక్కువ ఘనత గలది? ఏ విద్యను నేర్చుకోవడంలో సమయం కేటాయించడం ఎక్కువ ఘనత గల విషయం? ఏ విద్యను మనం నేర్చుకుంటే మనకు ఎక్కువ లాభం కలుగుతుంది? ఈ మూడు ప్రశ్నలకు కూడా సమాధానం ఒకటే. ఏమిటి? ఆ విద్య దేనికి సంబంధించిందో దానిని బట్టి ఆ ఘనత, ఆ లాభం ఉంటుంది.
ఏ జ్ఞానం అతి శ్రేష్ఠమైనది?
ఈ విధంగా, ఇప్పుడు మన ముందు ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి. ధర్మ విద్యకు సంబంధించి కూడా అందులో మరీ ఎన్నో అంశాలు, ఎన్నో వివరాలు ఉన్నాయి. వాటన్నిటిలోకెల్లా అతి గొప్ప ఘనత గల విషయం, అల్లాహ్ త’ఆలా యొక్క పేర్ల గురించి, ఉత్తమ నామాల గురించి, సుందరమైన గుణాల గురించి తెలుసుకోవడం. దానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకోవడం ఇతర జ్ఞానాల కంటే ఎక్కువ ఘనత గల విషయం. ఇందులో మన సమయాన్ని వెచ్చించడం మన కొరకు ఎక్కువ లాభదాయకమైన విషయం. దీనినే కొందరు ధర్మవేత్తలు
أَلْفِقْهُ الْأَكْبَرُ
[అల్ ఫిఖ్ హుల్ అక్బర్]
అత్యున్నత అవగాహన
అని చెప్పారు. అంటే అతి పెద్ద, అతి గొప్ప ధర్మ అవగాహన.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో, ధర్మ అవగాహన ఎవరికైతే ప్రసాదించబడినదో వారి యొక్క ఘనత తెలుపుతూ ఏమన్నారు? సహీ బుఖారీలోని హదీస్, హజ్రత్ ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు.
مَنْ يُرِدِ اللَّهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ
[మన్ యురిదిల్లాహు బిహి ఖైరన్ యుఫఖ్ఖిహ్ హు ఫిద్దీన్]
అల్లాహ్ ఎవరికైతే మేలు చేయాలని తలుస్తాడో, అతనికి ధర్మంలో అవగాహనను ప్రసాదిస్తాడు.
అల్లాహు త’ఆలా ఎవరి పట్లనైతే మేలు చేయగోరుతాడో, అతనికి ధర్మ అవగాహన ప్రసాదిస్తాడు. ధర్మం మన జీవిత విధానం. ఎక్కడి నుండి వచ్చింది? అల్లాహ్ నుండి వచ్చింది. ఆ అల్లాహ్ నుండి వచ్చిన ఈ ధర్మ జ్ఞానంలో అతి ఉత్తమమైన, ఉన్నతమైన, ప్రప్రథమమైన నేర్చుకోవలసిన విషయం అల్లాహ్ గురించి. ఎందుకంటే ధర్మం యొక్క అసలు మూలం ఏంటి? నేను దాసుణ్ణి, అతడు నా యజమాని. నా జీవితమే అతని దాస్యంలో ఉండాలి. ఎలా చేయాలి ఆ దాస్యం? ఆయన నేర్పుతాడు, మనం నేర్చుకొని అలాగే ఆచరిస్తాము. అందుకొరకే అల్లాహ్ గురించి తెలుసుకోవడమే సర్వ విద్యల్లో, అన్ని రకాల జ్ఞానాల్లో అతి గొప్ప ఘనత గల విషయం.
అల్లాహ్ గురించి తెలుసుకోవడం – ఒక బలమైన పునాది
ఇక రండి, ఈ విషయాన్ని మరో రకంగా తెలుసుకుందాము. మీరు ఎంత మంచి, ఎంత ఎత్తైన భవనం కట్టాలనుకుంటారో, అంతే పునాదిని గట్టిగా, బలంగా, దృఢంగా చేస్తారు. అవునా కాదా? కేవలం, కేవలం గడ్డి వేసి పైన ఏదో చిన్న వర్షం నీళ్లు పడకుండా ప్లాస్టిక్ కవర్ ఏదైనా వేసుకోవడానికి చిన్నపాటి గుంజల మీద మనం ఒక కప్పు లాంటిది వేసేస్తాము. అదే ఒకవేళ స్లాబ్ వేయాలంటే, పునాదులు మంచిగా లోతుగా త్రవ్వి, రాళ్లతో, సిమెంట్ తో, ఐరన్ (ఇనుము)తో కలిసిన అన్ని విషయాల ద్వారా, మళ్లీ దానిలో పిల్లర్లను లేపి దానిపై స్లాబ్ వేస్తాము. ఇది ఒక్క స్లాబ్ విషయం అయితే. అదే ఒకవేళ ఎత్తైన భవనాలు 10 అంతస్తులు, 20 అంతస్తులు, 30, 40, 70 కట్టాలనుకుంటే, అంతే ఎక్కువగా పునాది బలంగా, దృఢంగా తయారు చేయడం జరుగుతుంది. కదా?
ఇది లాజిక్ పరంగా, సామాన్య మనిషికి కూడా బుద్ధి జ్ఞానాల్లో వచ్చే విషయమే కదా? అయితే మనం ఈ లోకంలో ఎన్ని పుణ్యాలు చేసుకున్నా, మన వద్ద ఎంత ఎక్కువ ధర్మ అవగాహన కలిగి ఉన్నా, ఇదంతా కూడా పై భవనాల మాదిరిగా. ఒకవేళ పునాది బాగు లేకుంటే, దృఢంగా లేకుంటే ఈ భవనం పైన ఏదైతే మేడలు కడుతున్నామో అవి గట్టిగా ఉండవు, చిన్నపాటి కదలికకు కూడా, వేగంగా వీచే గాలికి కూడా పడిపోవచ్చు. అలాగే అల్లాహ్ గురించి తెలుసుకోవడం, అల్లాహ్ యొక్క నామాల గురించి, అతని ఉత్తమ గుణాల గురించి తెలుసుకోవడం, వాటి ప్రకారంగా మన విశ్వాసాన్ని దృఢంగా ఉంచడం, ఈ విశ్వాసం అల్లాహ్ గురించి కావలసిన నమ్మకం ఇది బలమైన పునాది లాంటిది. ఈ పునాది ఎంత గట్టిగా ఉంటుందో, అంతే బలంగా పై భవనాలు ఉంటాయి, మేడలు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి.
అల్లాహ్ యొక్క పేర్లలో అల్-అలీమ్, అల్-బసీర్, అస్-సమీ‘ ఇవన్నీ మనం విన్నాము. చిన్నపాటి వివరణ, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆయతులు, కొన్ని వివరాలు చెప్పగలిగాను. కానీ వాటిని మనం అర్థం చేసుకున్నామా? కేవలం ఇప్పుడు ఒక మూడు పేర్ల విషయమే తీసుకోండి మీరు. వాస్తవంగా ప్రతిక్షణం అల్లాహ్ నన్ను చూస్తూ ఉన్నాడు, నా నుండి వింటూ ఉన్నాడు, నా గురించి అన్నీ తెలిసి ఉన్నాడు అన్నటువంటి బలమైన, ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటే, అతని యొక్క అవిధేయత మనం చేయగలమా?
తండ్రి ముంగట ఉండి బీడీ, సిగరెట్ బయటికి తీసే వాడినే మనం ఎంత దుష్టుడివిరా, ఎంత దుర్మార్గుడివి నువ్వు, ఇంత కూడా నీకు తండ్రి యొక్క విలువ తెలియదా అన్నట్లుగా మనం అతన్ని నిందిస్తాము. కదా? మరి ఏ ఒక్క క్షణమైనా మనం అల్లాహ్ దృష్టి నుండి దూరం ఉన్నామా? అల్లాహ్ చూడకుండా మనం ఎక్కడైనా దాచుకోగలుగుతామా? అర్థమవుతుందా? అల్లాహ్ యొక్క పేర్లు, అల్లాహ్ యొక్క నామాలు, అల్లాహ్ యొక్క ఉత్తమ గుణాల గురించి తెలుసుకోవడం ఎంత అవసరం ఉన్నది.
సోదర మహాశయులారా, ఈ భవనాల యొక్క సామెత ఏదైతే ఇప్పుడు ఇచ్చానో, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ వారు దీని గురించి చాలా స్పష్టంగా, చాలా వివరంగా దీని గురించి చెప్పి ఉన్నారు. అయితే, ఖురాన్‌లోని ఒక్క ఆయత్, సూరత్ అత-తౌబా, ఆయత్ నంబర్ 109 తీసి చూడండి.. దీని ద్వారా మనకు బోధ పడుతున్న విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి.
أَفَمَنْ أَسَّسَ بُنْيَانَهُ عَلَىٰ تَقْوَىٰ مِنَ اللَّهِ وَرِضْوَانٍ خَيْرٌ أَم مَّنْ أَسَّسَ بُنْيَانَهُ عَلَىٰ شَفَا جُرُفٍ هَارٍ فَانْهَارَ بِهِ فِي نَارِ جَهَنَّمَ
తన కట్టడాన్ని దైవభీతి, దైవ ప్రసన్నతల పునాదిపై కట్టినవాడు ఉత్తముడా? లేక కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఏదైనా లోయ యొక్క డొల్ల అంచున తన కట్టడాన్ని కట్టినవాడు ఉత్తముడా? (9:109)
ఖురాన్‌లో లాజిక్ పరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఇది లాజిక్ పరమైన ఆధారం కాదా? గమనించండి. ఒక కట్టడం ఎలా ఉన్నది? దైవభీతి, దైవ ప్రసన్నతల పునాదిపై. మరొకతని కట్టడం ఎలా ఉంది? కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న, అది కూడా ఏదైనా లోయ యొక్క డొల్ల అంచున. ఏది త్వరగా పడిపోవడానికి భయం ఉన్నది? ఇది. కదా? అటు పిమ్మట అది అతనితో పాటే నరకాగ్నిలో పడిపోయింది. ఈ కట్టడాల విషయం తీసుకొచ్చి అల్లాహ్ మళ్ళీ నరకం విషయం ఎందుకు తీసుకొచ్చాడు? ఇక్కడ ఉద్దేశం అదే. ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. విశ్వాసం, అల్లాహ్ గురించి సరియైన జ్ఞానం కావలసిన రీతిలో ఎంత అవసరమో అంత లేనందువల్ల, అల్లాహ్ పట్ల ఆ బలమైన విశ్వాసం కలిగి లేము. దాని కారణంగా ఎన్నో పాపాలు జరుగుతున్నాయి. దాని కారణంగా మనిషి నరకంలో పడిపోతాడు.
అల్లాహ్‌ను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం?
సోదర మహాశయులారా, అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు? అందరి సమాధానం ఒకటే ఉంటుంది కదా? అల్లాహ్ ను ఆరాధించడానికి. అల్లాహ్ ఆరాధన మనం, అల్లాహ్ ను గుర్తుపట్టకుండా, అల్లాహ్ అనేవాడు ఎవడు అనేది సరియైన రీతిలో తెలుసుకోకుండా ఎలా చేయగలుగుతాము?
అందుకొరకే అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని కూడా ఎంత స్పష్టంగా ఖురాన్‌లో మన కొరకు తెలియజేశాడో గమనించండి. ముందు అల్లాహ్ మనకు అతని గురించి జ్ఞానం ఇచ్చాడు. ఆ తర్వాత నన్ను ఆరాధించు, నా ఆరాధన కొరకే నిన్ను పుట్టించాను అన్న మాట, ఆదేశం తెలియపరిచాడు. ఈ విషయాన్ని మీరు ఒకవేళ గ్రహించగలిగారనుకుంటే ఖురాన్‌లో అనేక సందర్భాలలో ఆయతులు ఉన్నాయి. కానీ రండి, ఒకసారి సూరతు అత-తలాఖ్ సూర నంబర్ 65 ఇది. ఇందులో ఈ ఆయత్ పై ఒకసారి మనం శ్రద్ధ వహిద్దాము, ఆయత్ నంబర్ 12. ఇది చివరి ఆయత్ సూరత్ తలాఖ్‌లో. ఏముంది గమనించండి?
اللَّهُ الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ وَمِنَ الْأَرْضِ مِثْلَهُنَّ يَتَنَزَّلُ الْأَمْرُ بَيْنَهُنَّ لِتَعْلَمُوا أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ وَأَنَّ اللَّهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَيْءٍ عِلْمًا
అల్లాహ్, ఆయనే సప్తాకాశాలను, అలాంటివే భూములను సృష్టించినవాడు. ఆయన ఆజ్ఞ వాటి మధ్య అవతరిస్తుంది. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడని, ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి. (65:12)
అరబీ గ్రామర్ ప్రకారంగా ఇక్కడ వచ్చింది లిత’లమూ, కానీ మన తెలుగు సాహిత్య ప్రకారంగా ఆ మాట చివరలో వచ్చింది, తెలుసుకోవటానికి. ఏమని తెలుసుకోవటానికి? అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడని. ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి. మనం తెలుసుకోవాలి అల్లాహ్ గురించి. అల్లాహ్ యే సృష్టించినవాడు, అల్లాహ్ యే ఆదేశించువాడు, అల్లాహ్ యొక్క ఆదేశ ప్రకారమే ఈ మొత్తం సృష్టి యొక్క ప్రక్రియ నడుస్తూ ఉన్నది, జరుగుతూ ఉన్నది. ఈ ఆయతులో అల్లాహ్ సృష్టించిన తన సృష్టి గురించి తెలియజేస్తూ, మీరు అల్లాహ్ గురించి తెలుసుకోవాలి, ఆ అల్లాహే సృష్టించాడని, ఆయనే సర్వశక్తిమంతుడు అని, ఆయన యొక్క జ్ఞానం ఈ సర్వ సృష్టిని ఆవరించి ఉంది. అర్థం కాలేదా? ఖురాన్ యొక్క ఈ మాట అర్థమవుతుందా, అవతలేదా?
అల్లాహ్ క్షమించు గాక నన్ను, మిమ్మల్ని, మనందరినీ కూడా. అల్లాహ్ గురించి కాదు, సామెత, మన మదిలో విషయం నాటుకుపోవడానికి, మింగుడు పడని మనం జీర్ణించలేని మాటను మంచిగా జీర్ణించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, డైజిన్ టాబ్లెట్ మాదిరిగా, ఒక ఉదాహరణ. ఏంటి? కాలేజీలో ఒక వ్యక్తి ప్రవేశించాడు. సూట్ బూట్‌లో ఉన్నాడు. అతను ఎవరో అన్నది తెలియని వరకు కాలేజ్ స్టూడెంట్స్ కూడా అతని పక్క నుండే దాటుతూ ఎవరో వస్తూ పోతా ఉంటారు కాలేజీలో ఎంతో మంది అన్నట్లుగా ఉంటారు. అవునా లేదా? అదే ఒకవేళ తెలిసింది, ఈ కాలేజ్ యొక్క ఓనర్, ఈ కాలేజ్ యొక్క అసలు బాధ్యుడు, క్షణంలో అతను తలచుకుంటే మీకు ఫీజులన్నీ మాఫ్ చేసి, మీ పరీక్షల్లో అన్ని రకాల సులభతరాలు కలుగజేసి, అంతటి ఎదిగిన మినిస్ట్రీలో కూడా చాలా పెద్ద చేయి ఉన్నటువంటి వ్యక్తి అని మీకు తెలిస్తే, పరిచయమైతే? అరె, నా పక్క నుండే దాటాడు కాదా, మంచిగా సలాం చేసి, సలాం చేసేవాడిని, అరే ముందు తెలియదు రా నాకు. ఈ విధంగా అనుకుంటారా లేదా?
అవునా కాదా? మరొక సామెత కూడా ఉంది, అరబీలో, ఉర్దూలో, తెలుగులో కూడా చెప్పుకుంటారు. ఒక దేశం రాజు పక్క దేశంలో పోయారంటే, తెలియని వారి కొరకు అతడు అజ్ఞానుడు, పామరుడు లాంటివాడే. కానీ ఎప్పుడైతే ఆ దేశ ప్రజలకు తెలుస్తుందో, ఫలానా అగ్రరాజ్యం యొక్క రాజు అట ఇతను అని, ఎలా అతనిపై గౌరవం ఉంటుంది అప్పుడు? ఎలా ఉంటుంది అతని యొక్క మర్యాద? ఇవన్నీ లాజిక్ పరంగా మనకు అర్థమయ్యే విషయాలే కదా? ఏ అల్లాహ్‌ను మనం ఆరాధించాలో, ఆ ఆరాధన కొరకే మనము పుట్టామో, అతని గురించి, అతని నామాల గురించి, అతని ఉత్తమ గుణాల గురించి మనకు తెలియకుంటే, ఈ రోజుల్లో మనలో అనేక మందికి తెలియదు గనుక, మనం ఆ అల్లాహ్‌ను ఉత్తమ రీతిలో, ఆరాధించవలసిన రీతిలో, అతనితో భయపడవలసిన రీతిలో భయపడటం లేదు.
అల్లాహ్ త’ఆలా ఒక్క ఆయత్ కాదు, రెండు ఆయతులలో కాదు, అనేక సందర్భాలలో ‘వఅలమూ, వఅలమూ, వఅలమూ’ అల్లాహ్ గురించి తెలుసుకోండి, తెలుసుకోండి, తెలుసుకోండి అని మాటిమాటికి అల్లాహ్ యొక్క గుణాలు ప్రస్తావించడం జరిగింది.
فَاعْلَمُوا أَنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
[ఫఅ’లమూ అన్నల్లాహ అజీజున్ హకీమ్]
మీరు తెలుసుకోండి, అల్లాహ్ యే తిరుగులేని శక్తిమంతుడు, వివేచనాపరుడు. (బఖరా 2: 209)
وَاعْلَمُوا أَنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
[వఅ’లమూ అన్నల్లాహ బికుల్లి షైఇన్ అలీమ్]
మీరు తెలుసుకోండి, అల్లాహ్ సర్వజ్ఞాని, సర్వం గురించి ఉత్తమ రీతిలో తెలిసినవాడు.(బఖరా 2: 231)
وَاعْلَمُوا أَنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
[వఅ’లమూ అన్నల్లాహ బిమా త’అమలూన బసీర్]
మీరు చేస్తున్నదంతా అల్లాహ్ సూక్ష్మంగా చూస్తూ ఉన్నాడు. (బఖరా 2: 233)
وَاعْلَمُوا أَنَّ اللَّهَ غَفُورٌ حَلِيمٌ
[వఅ’లమూ అన్నల్లాహ గఫూరున్ హలీమ్]
తెలుసుకోండి, నిశ్చయంగా అల్లాహు త’ఆలా ఎంతో క్షమాశీలి మరియు సహనశీలి. (బఖరా 2: 235)
وَاعْلَمُوا أَنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
[వఅ’లమూ అన్నల్లాహ సమీఉన్ అలీమ్]
తెలుసుకోండి, నిశ్చయంగా అల్లాహు త’ఆలా వినువాడు మరియు అన్నీ తెలిసినవాడు. (బఖరా 2: 244)
وَاعْلَمُوا أَنَّ اللَّهَ غَنِيٌّ حَمِيدٌ
[వఅ’లమూ అన్నల్లాహ గనియ్యున్ హమీద్]
తెలుసుకోండి, నిశ్చయంగా అల్లాహ్ నిరపేక్షాపరుడు, స్వతహాగా అన్ని రకాల ప్రశంసలకు అర్హుడు. (బఖరా 2: 267)
కేవలం సూర బఖరాలోనే ‘వఅలమూ, వఅలమూ’ (జ్ఞానం నేర్చుకోండి, మీరు తెలుసుకోండి) అల్లాహ్ గురించి అని అల్లాహ్ యొక్క ఎన్ని పేర్లు, ఆ పేర్లలో ఉన్నటువంటి ఎన్ని గుణాల గురించి మనకు చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే సూరతుల్ మాయిదా 98, సూరతుల్ బఖరా 194, సూరతుల్ అన్ఫాల్ 40, ఇంకా సూరత్ ముహమ్మద్ 19, అనేక ఆయతులు ఉన్నాయి.
అందుకొరకే షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహ్మతుల్లా అలైహి వారి యొక్క ఈ మాటను కొంచెం శ్రద్ధ వహించండి. చెప్పారు:
وَالْقُرْآنُ فِيهِ مِنْ ذِكْرِ أَسْمَاءِ اللَّهِ وَصِفَاتِهِ وَأَفْعَالِهِ أَكْثَرُ مِمَّا فِيهِ مِنْ ذِكْرِ الْأَكْلِ وَالشُّرْبِ وَالنِّكَاحِ فِي الْجَنَّةِ
ఖురాన్‌లో, స్వర్గంలో తినడం, త్రాగడం మరియు వివాహం గురించి ఉన్న ప్రస్తావన కంటే అల్లాహ్ యొక్క పేర్లు, గుణాలు మరియు పనుల గురించిన ప్రస్తావనే ఎక్కువగా ఉంది.
అరబీ యొక్క సెంటెన్స్ షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహమహుల్లాహ్ చెప్పింది వినిపించాను. దీని అనువాదం తర్వాత చెప్తాను. అంతకంటే ముందు, ఈ రోజుల్లో ఎంతో మంది అజ్ఞానులు, అవును, ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎన్ని ప్రపంచ చదువులు ఉన్నా గానీ, వారు పలికే ఈ పనికిమాలిన మాటల ద్వారా వారి డిగ్రీలన్నీ కూడా వ్యర్థమే. సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్థమురా, నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా అని ఒక గేయం కూడా మీరు విని ఉండవచ్చు నా నోట. ఏంటి విషయం? ఎందరో అజ్ఞానులు, ఏండయ్యా మీ ఖురాన్‌లో, మాటిమాటికి మొగోళ్ళకు నలుగురు భార్యల గురించి ప్రస్తావన ఉంటుంది, స్వర్గంలో ఇంత మంది కన్యలు అని ఉంటుంది, లేదా అంటే స్త్రీల యొక్క ప్రత్యేక విషయాల గురించి, వారి యొక్క బహిష్టుల గురించి ఉంటుంది, ఏంటి ఈ ఖురాన్? నఊజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఇలాంటి యొక్క ఎగతాళి ఖురాన్ పట్ల చేసిన అజ్ఞానులు, వారిలో మరీ దుర్మార్గులు, కొందరు అజ్ఞాన ముస్లింలు కూడా. నఊజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. కానీ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్, ఎవరి జీవితాలైతే ఖురాన్ చదవడం, చదివించడం, వ్యాఖ్యానం, ఇలాంటి విషయాల్లో గడిసిపోయినవో, ఏమంటున్నారు? ఖురాన్‌లో, స్వర్గంలో తినడం, త్రాగడం మరియు వివాహం గురించి ఉన్న ప్రస్తావన కంటే అల్లాహ్ యొక్క పేర్లు, గుణాలు మరియు పనుల గురించిన ప్రస్తావనే ఎక్కువగా ఉంది.
وَالْآيَاتُ الْمُتَضَمِّنَةُ لِذِكْرِ أَسْمَاءِ اللَّهِ وَصِفَاتِهِ أَعْظَمُ قَدْرًا مِنْ آيَاتِ الْمَعَادِ
[వల్ ఆయాతుల్ ముతదమ్మినతు లిజిక్రి అస్మాఇల్లాహి వ సిఫాతిహి అ’జము ఖదరన్ మిన్ ఆయాతిల్ మ’ఆద్]
మరియు అల్లాహ్ యొక్క పేర్లు మరియు గుణాలను కలిగి ఉన్న ఆయతులు, పరలోకం గురించిన ఆయతుల కంటే ఎక్కువ ఘనత గలవి.
పరలోకం గురించి ఉన్న ఆయతుల యొక్క సంఖ్య, విలువ, వాటికంటే గొప్ప సంఖ్యలో అల్లాహ్ యొక్క పేర్ల, అల్లాహ్ యొక్క గుణాల ప్రస్తావనకు సంబంధించిన ఆయతులు ఉన్నాయి.ఉదాహరణకు, పూర్తి ఖురాన్‌లో ఉన్నటువంటి 6000 కంటే ఎక్కువ ఆయతులలో అతి గొప్ప ఆయత్ అని దేనిని చెప్పడం జరిగింది? ఆయతుల్ కుర్సీని. కదా? అందులో, అందులో ఏముంది ప్రస్తావన? అల్లాహ్ గురించే ఉన్నది మొత్తం టోటల్‌గా. పరలోక ప్రస్తావన, స్వర్గం ప్రస్తావన, తిను త్రాగు ప్రస్తావన, వేరే విషయాలు లేవు, కేవలం అల్లాహ్ గురించి. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉబై బిన్ కా’బ్ ని ప్రశ్నించారు,
أَتَدْرِي أَيُّ آيَةٍ فِي كِتَابِ اللَّهِ أَعْظَمُ؟
[అతద్రి అయ్యు ఆయతిన్ ఫీ కితాబిల్లాహి ఆ’జం?]
అల్లాహ్ యొక్క గ్రంథంలో ఏ ఆయత్ చాలా గొప్పది అని నీకు తెలుసా?
అప్పుడు ఉబై బిన్ కా’బ్ “అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్” అని చెప్పారు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంతోషంతో, వాహ్, ఏం చెప్పినావు అన్నట్లుగా తన యొక్క ఛాతిలో ఈ విధంగా తట్టి,
لِيَهْنِكَ الْعِلْمُ يَا أَبَا الْمُنْذِرِ
[లియహ్నికల్ ఇల్ము యా అబల్ ముందిర్]
ఓ అబల్ ముందిర్, ఈ జ్ఞానం నీకు శుభకరంగా అగుగాక. అని ప్రశంసించారు.
ఖురాన్‌లోని అతి గొప్ప ఆయత్, ఏ దీనిని చెప్పడం జరిగింది, అందులో ఎవరి ప్రస్తావన ఉంది, ఆ ఆయత్ గురించి తెలిసిన సహాబీకి ఎంత గొప్ప షాబాష్ ఇవ్వడం జరిగింది. ఇక సూరతులలో చూసుకుంటే, ఆయతులలో గొప్ప ఆయత్ ఇది.
సూరతులలో చూసుకుంటే ఏ సూరతుని أَعْظَمُ سُورَةٍ [అ’జము సూర] అతి గొప్ప సూరా ఉమ్ముల్ ఖురాన్, ఖురాన్ యొక్క మూలం అని చెప్పడం జరిగింది? సూరతుల్ ఫాతిహా. చూడండి, బిస్మిల్లా నుండి మొదలుకొని సుమారు సగం సూరా కంటే ఎక్కువ అల్లాహ్ యొక్క పేర్లు, అల్లాహ్ గురించి, అతని యొక్క ఉత్తమ గుణాలు, అతని యొక్క ఉత్తమ పనులు, అతనికి, మనిషికి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి దాని ప్రస్తావన ఉంది, చివర్లో ఒక రెండు ఆయతులలో దుఆ ఉంది, అది కూడా అల్లాహ్‌తోనే అడగడం జరుగుతుంది.
అంతేకాదు, ఈ సూరా గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు ఇంతకుముందే మీరు విన్నారు, తౌరాత్‌లో గానీ, ఇంజీల్‌లో గానీ, జబూర్‌లో గానీ, స్వయం ఖురాన్‌లో గానీ ఇలాంటి గొప్ప సూరా వేరేదేదీ కూడా అవతరించబడలేదు.
చూస్తున్నారా? అల్లాహ్ యొక్క ప్రస్తావన ఎంత గొప్పగా ఖురాన్‌లో ఉంది? మనం ఆ ఉద్దేశంతో, ఆ భావంతో ఖురాన్ చదువుతున్నామా? అల్లాహ్‌ను తెలుసుకోవడానికి.
మరొక చిన్న ఉదాహరణ ఇచ్చి ఇక నేను సమాప్తం చేస్తాను. ఖురాన్‌లో ఏ సూరత్ కి ఆ ఒక్క చిన్న సూరా, ఖురాన్‌లోని మూడో వంతు భాగానికి సమానమైనది అన్నట్లుగా చెప్పడం జరిగింది?
إِنَّهَا تَعْدِلُ ثُلُثَ الْقُرْآنِ
[ఇన్నహా త’దిలు సులుసల్ ఖుర్ఆన్]
నిశ్చయంగా ఇది (సూరతుల్ ఇఖ్లాస్) ఖురాన్‌లో మూడో వంతుకు సమానం.
సహీ బుఖారీలోని హదీస్ ఇది. ఖురాన్‌ను మూడు భాగాలు చేస్తే ఒక్క భాగానికి సరి సమానమైనటువంటి అంత గొప్ప సూరా ఏది? ఖుల్ హువల్లాహు అహద్. సూరతుల్ ఇఖ్లాస్. నాలుగే నాలుగు ఆయతుల చిన్న సూరా. ఏముంది అందులో? అల్లాహ్ ఏకత్వం గురించి. అల్లాహ్ నిరపేక్షాపరుడు అన్న విషయం గురించి. ఆయనకు సంతానం లేదు, ఆయన ఎవరికీ సంతానం కాడు, మరియు ఆయనకు సరి సమానుడు, సాటి గలవాడు ఎవరూ లేరు అన్నటువంటి ప్రస్తావన.
అందుకొరకే, అల్లాహ్ గురించిన జ్ఞానం నేర్చుకోవడం, అల్లాహ్ శక్తి సామ్రాజ్యాల గురించి తెలిసి అతని యొక్క భయం మనలో, అతని పట్ల ప్రేమ మనలో, అతని పట్ల ఆశ మనలో పెరిగే విధంగా అల్లాహ్ గురించి ఖురాన్ ద్వారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసుల ద్వారా తెలుసుకోవడం చాలా, చాలా అవసరం.
ఎప్పుడైతే అల్లాహ్‌ను మనం తెలుసుకోవలసిన రీతిలో తెలుసుకొని విశ్వాసం చాలా బలంగా, ప్రగాఢంగా, దృఢంగా చేసుకుంటామో, ఆ తర్వాత ఏ సత్కార్యాలు చేసినా వాటి పుణ్యాలు, వాటి యొక్క లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి, మరియు ఎల్లవేళల్లో మనం ప్రపంచంలోని ఏ పనిలో ఉన్నా గానీ, మన ఏ డ్యూటీలో ఉన్నా గానీ, మన ఏ జాబ్‌లో ఉన్నా గానీ, ఫ్రెండ్స్‌లతో ఆనంద ఉత్సవాల్లో ఉన్నా గానీ, భార్యా పిల్లలతో మనం ఎంతో సంతోషంగా గడుపుతున్నా గానీ, ఇంట్లో ఎవరైనా చనిపోయి బాధగా ఉన్నప్పుడు గానీ, ఏదైనా వ్యవసాయంలో పంట మునిగిపోయినా గానీ, మన వ్యాపారం ఏదైనా చాలా అది లాస్‌లో జరిగినా గానీ, అన్ని స్థితిల్లో, అన్ని వేళల్లో మనం అల్లాహ్‌ను మరిచిపోయి ఉండలేము. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకొని, అల్లాహ్, అరే ఉండనీరా భయ్, ఏంటి మాటిమాటికి నువ్వు ధర్మం, ధర్మం, అల్లాహ్, అల్లాహ్ అని అనుకుంటూ ఉంటావు. ఈ విధంగా అనేవాళ్ళు ఉన్నారు కొందరు, అస్తగ్ఫిరుల్లాహ్.
కానీ ఎవరైతే ఆనంద, సంతోషాల్లో గానీ, లేదా బాధలో ఉన్నప్పుడు గానీ, సుఖంలో గానీ, దుఃఖంలో గానీ, పేదరికంలో గానీ, సిరి సంపదలో గానీ, అన్ని స్థితిల్లో అల్లాహ్‌ను ముందుగా ఉంచి, అల్లాహ్ యొక్క ప్రస్తావన, అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క జిక్ర్ ఎక్కువగా చేస్తూ ఉంటారో వారే సాఫల్యూలు, మరీ ఎవరు దీనికి భిన్నంగా ఉంటారో వారే చాలా నష్టం పోతారు.
చదవండి సూరతుల్ మునాఫిఖూన్, ఆయత్ నంబర్ తొమ్మిది.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُلْهِكُمْ أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُمْ عَن ذِكْرِ اللَّهِ
[యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుల్హికుమ్ అమ్వాలుకుమ్ వలా అవ్లాదుకుమ్ అన్ జిక్రిల్లాహ్]
ఓ విశ్వాసులారా! మీ సిరిసంపదలు, మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరల్చరాదు.
చూశారా? ఎవరైతే అలా చేస్తారో వారే నష్టపోయేవారు. అల్లాహ్ ధ్యానం నుండి, అల్లాహ్ యొక్క జిక్ర్ నుండి.
నిన్ననే ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మాట మీద మాట వచ్చేసి, ఇప్పుడే నీ కళ్ళ ముంగట నీకు చాలా ప్రియమైనవాడు, నీ తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, నీ సంతానంలో ఎవరైనా కావచ్చు, చనిపోయారు, యాక్సిడెంట్ అయింది. అంటే నువ్వు ఇక్కడ హాయిగా తినుకుంటూ ఏదైనా మంచిగా ఉన్నావు, సంతోషంగా, యకాయకిగా నీకు వార్త వచ్చేసింది అతను చనిపోయాడు అని. నీవు ఏం చేస్తావు, ఏం చెబుతావు?
ఇద్దరు ముగ్గురిది సమాధానాలు వేరు వేరుగా ఉండినవి. కానీ వారిలో ఎవరికైతే ధర్మ జ్ఞానం కొంచెం ఎక్కువగా ఉండిందో వెంటనే చెప్పారు,
إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ
[ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్]
నిశ్చయంగా మేము అల్లాహ్ కే చెందినవారము మరియు నిశ్చయంగా మేము ఆయన వైపునకే మరలి పోవలసి ఉంది.
చదివి
الْحَمْدُ لِلَّهِ
[అల్హమ్దులిల్లాహ్]
అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.
అని అంటాను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, ధర్మ జ్ఞానం యొక్క బరకత్. అందుకొరకే అల్లాహ్ యొక్క జిక్ర్ కంటే, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్‌ను తెలుసుకోవడం కంటే, అల్లాహ్ గురించి ఎక్కువ జ్ఞానం పొంది, ఆయన భయం, ఆయన పట్ల ప్రేమ, ఆయన పట్ల ఆశ, ఇవి మనలో ఎక్కువగా కుదిరి ప్రతి సమయంలో, సందర్భంలో, స్థితిలో అల్లాహ్‌కు ఇష్టమైనదే చేయాలి అన్నటువంటి తపన కలిగి ఉంటామో, అప్పుడు మనకు ఈ నష్టం ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో, సిరిసంపదలు, సంతానం మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి దూరం చేయకూడదు, చేసిందంటే మరి మీరు నష్టపోతారు.
అల్లాహ్ ఈ అస్మాయె హుస్నా, సిఫాతె ఉలియా, అల్లాహ్ యొక్క మంచి పేర్లు, ఉత్తమ గుణాల గురించి అయిన జ్ఞానం, ఖురాన్ హదీస్ ఆధారంగా, సలఫ్ మనహజ్ ప్రకారంగా తెలుసుకుంటూ మన విశ్వాసాన్ని పెంపొందించుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలని.
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=19684
అల్లాహ్ (తఆలా) – మెయిన్ పేజీ
https://teluguislam.net/allah
అల్లాహ్ శుభ నామాల వివరణ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb
మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1