ఆదం (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియోలు | టెక్స్ట్]

ఆదం (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – యూట్యూబ్ ప్లే లిస్ట్ [3 భాగాలు]
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0ZDGMr5t5ob5y_APUUiX6A

ఆదం (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – (పార్ట్ 1)
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిదహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=TJlbNHv1IX8

ఈ ప్రసంగం మానవుని సృష్టికి సంబంధించిన ఇస్లామీయ గాథను వివరిస్తుంది. అల్లాహ్ దైవదూతలను కాంతి నుండి, జిన్నాతులను అగ్ని నుండి సృష్టించిన తరువాత, భూమండలంలోని మట్టితో మొదటి మానవుడైన ఆదం (అలైహిస్సలం)ను తన స్వహస్తాలతో సృష్టించాడు. అల్లాహ్ ఆదం (అలైహిస్సలం)కు వస్తువుల పేర్ల జ్ఞానాన్ని నేర్పి, దైవదూతల కంటే ఆయన శ్రేష్ఠతను చాటాడు. తరువాత, ఆదం (అలైహిస్సలం) పక్కటెముక నుండి హవ్వా (అలైహస్సలాం)ను సృష్టించి, వారిద్దరినీ స్వర్గంలో నివసించమని ఆజ్ఞాపించాడు, అయితే ఒక నిర్దిష్ట వృక్ష ఫలాన్ని తినవద్దని నిషేధించాడు. అహంకారం కారణంగా స్వర్గం నుండి బహిష్కరించబడిన ఇబ్లీస్ (షైతాన్), వారిద్దరినీ ప్రలోభపెట్టి ఆ ఫలాన్ని తినేలా చేశాడు. ఈ అవిధేయత కారణంగా, ఆదం మరియు హవ్వా (అలైహిమస్సలాం) కూడా స్వర్గం నుండి బహిష్కరించబడ్డారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మొదటి మనిషి ఎవరు? మొదటి మనిషి ఎలా సృష్టించబడ్డాడు? దేనితో సృష్టించబడ్డాడు? ప్రారంభంలో మనిషి ఆకారము ఎలా ఉండేది? మొదటి మానవుని పేరు ఏమిటి? ప్రారంభంలో మనిషి అజ్ఞానినా? మరి అతనికి జ్ఞానం ఎలా ఇవ్వబడింది? మొదటి మహిళ ఎవరు? ఆమె పేరు ఏమిటి? ఆమె ఎలా సృష్టించబడింది? మానవులు ప్రారంభంలో స్వర్గంలో ఉన్నారంట, నిజమేనా? షైతాన్ అంటే ఎవరు? దేనితో సృష్టించబడ్డాడు? పుట్టుకతోనే షైతాను చెడ్డవాడా? లేక మధ్యలో ఏదైనా కారణంగా అతనిలో ఇలాంటి మార్పు వచ్చిందా? ఈ విషయాలు నేటి మన ప్రసంగంలో ఇస్లామీయ ధార్మిక గ్రంథాల వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా భూమి ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే, దూతల్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సృష్టించాడు. దైవదూతల్ని కాంతితో సృష్టించాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త వారి పలుకులు:

خُلِقَتِ الْمَلَائِكَةُ مِنْ نُورٍ
[ఖులికతిల్ మలాయికతు మిన్నూర్]
దైవదూతలు కాంతితో సృష్టించబడ్డారు.

మిత్రులారా, దైవదూతల సంఖ్య అనేకం. అల్లాహ్ ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించటం వారి పని. అల్లాహ్ ఆజ్ఞలను అతిక్రమించడం, పాపాలకు పాల్పడటం వారి స్వభావంలోనే లేదు. అలాంటి భక్తి కలిగిన ఉత్తమ జీవులు, మంచి జీవులు దైవదూతలు.

ఆ తర్వాత మనం చూచినట్లయితే, జిన్నాతులని కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సృష్టించాడు. జిన్నాతులను అగ్ని జ్వాలతో సృష్టించాడు అని తెలుపబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

وَخَلَقَ الْجَانَّ مِنْ مَارِجٍ مِنْ نَارٍ
[వ ఖలఖల్ జాన్న మిమ్మా రిజిమ్ మిన్నార్]
మరియు జిన్నులను అగ్ని జ్వాలతో సృష్టించాడు. (55:15)

అభిమాన సోదరులారా, జిన్నాతులలో ముఖ్యమైన వాడు ఇబ్లీస్. అతని ప్రస్తావన మున్ముందు ఇన్ షా అల్లాహ్ వస్తుంది.

ఆ తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా భూమండలంలోని రకరకాల మట్టి నమూనాలను సేకరించి, తన స్వహస్తాలతో ఒక ఆకారాన్ని తయారు చేశాడు. ఆ ఆకారాన్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తయారు చేసి కొద్ది రోజుల వరకు అలాగే వదిలేసినప్పుడు, అటువైపు నుంచి దైవదూతలు మరియు జిన్నాతులు వస్తూ వెళ్తూ, వస్తూ వెళ్తూ ఆ ఆకారాన్ని చూసి, ఏదో కొత్త జీవి సృష్టించబడుతున్నది అని అర్థం చేసుకున్నారు.

ఒకసారి అయితే అల్లాహ్ మరియు దైవదూతల మధ్య ఆ కొత్త జీవి గురించి సంభాషణ కూడా జరిగింది. ఆ సంభాషణ ఖుర్ఆన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. దైవదూతలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో ప్రశ్నించారు, “ఓ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఎవరు ఈ కొత్త జీవి?” అని అడిగినప్పుడు, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సమాధానం ఇచ్చాడు:

إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً
[ఇన్నీ జాఇలున్ ఫిల్ అర్ది ఖలీఫా]
“నిశ్చయంగా నేను భూమిపై నా ప్రతినిధిని (ఖలీఫాను) నియమించబోతున్నాను.” (2:30)

దానికి దైవదూతలు ఒక సందేహం వ్యక్తపరిచారు. ఆ సందేహం ఏమిటంటే:

أَتَجْعَلُ فِيهَا مَنْ يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ
[అతజ్ అలు ఫీహా మయ్యుఫ్సిదు ఫీహా వయస్ఫికుద్దిమా వనహ్ను నుసబ్బిహు బిహందిక వనుఖద్దిసులక్]
“మేము నీ పవిత్రతను కొనియాడుతూ, నీ స్తోత్రపాఠాలు చేస్తూ ఉండగా, నువ్వు భూమిలో కల్లోలం రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసే వాడిని నియమిస్తావా?” అని అడిగారు. (2:30)

ఓ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, నీవు భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తున్నావు? నిన్ను కొనియాడటానికి, నిన్ను స్తుతించటానికి, నీ నామాన్ని ఉచ్చరించటానికి మేము ఉన్నాము కదా? అని దైవదూతలు అడిగారు.

మిత్రులారా, ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగి ఒక విషయం ఆలోచించాలి. అదేమిటంటే, ఇంకా ఒక ఆకారము సృష్టించబడింది, ఆ జీవి ఇంకా ఉనికిలోనికే రాలేదు. అయితే దైవదూతలకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? ఈ జీవి భూమిలో రక్తపాతాలు సృష్టించుకుంటాడన్న సందేహము ఎందుకు వచ్చింది? అంటే, ధార్మిక పండితులు దాని వివరణ ఇలా తెలియజేశారు: ఇప్పటివరకు మనం విన్నాం, మానవుని కంటే ముందు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతల్ని, జిన్నాతుల్ని సృష్టించాడని. ఆ జిన్నాతులను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సృష్టించి భూమి మీద నివసింపజేసినప్పుడు, ఆ జిన్నాతులు పరస్పరం గొడవ పడ్డాయి, రక్తపాతాలు సృష్టించుకున్నాయి. తత్కారణంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దూతల్ని పంపించి వారిని శిక్షించాడు. దైవదూతలు వచ్చి జిన్నాతులను ఇక్కడి నుంచి తరిమేసి సముద్రాల మధ్య ఉన్న దీవుల్లోకి పరిమితం చేసేశారు. అంటే, మనిషి కంటే ముందు ఒక జీవిని భూమి మీద అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నివసింపజేస్తే, వారు పరస్పరం గొడవపడ్డారు, వారు రక్తపాతాలు సృష్టించుకున్నారు కదా! కాబట్టి దైవదూతలకు ఆ సందేహం కలిగి, వారు “ఈ జీవి కూడా అలాగే రక్తపాతాలు సృష్టించుకుంటాడేమో” అని అల్లాహ్ ముందర సందేహం వ్యక్తపరిచారు.

దానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇచ్చిన సమాధానం ఏమిటంటే:

إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ
[ఇన్నీ ఆ’లము మాలా తా’లమూన్]
“నాకు తెలిసింది మీకు తెలియదు” అని సమాధానమిచ్చాడు. (2:30)

మిత్రులారా, రోజులు గడిచాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన స్వహస్తాలతో సృష్టించిన ఆ ఆకారంలో తను సృష్టించిన ఆత్మను ఊదాడు. “వ నఫఖ్తు ఫీహి మిర్రూహీ” అని తెలుపబడింది మిత్రులారా. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆత్మను ఆ ఆకారంలోకి ఊదినప్పుడు, ఆ ఆకారం శరీర అవయవాలు ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా ఏర్పడటం ప్రారంభించింది. చూస్తూ ఉండంగానే మనిషి సంపూర్ణంగా అవతరించాడు.

అభిమాన సోదరులారా, మనిషి శరీరం తయారయ్యింది, మానవుడు పూర్తిగా తయారైపోయాడు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ముందర మనిషి నిలబడినప్పుడు, అతనికి తుమ్ము వచ్చింది. అల్లాహ్ ఆజ్ఞతో మనిషి “అల్ హందులిల్లాహ్” అని పలికాడు. మిత్రులారా, మనిషి సృష్టించబడిన తర్వాత అతని నోటి నుండి వచ్చిన మొదటి పలుకు “అల్ హందులిల్లాహ్”, అనగా అల్లాహ్ కు కృతజ్ఞతలు. ఆ మాట వినగానే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనిషికి సమాధానం ఇచ్చాడు. ఏమని సమాధానం ఇచ్చాడంటే “యర్ హముకల్లాహు యా ఆదం“, ఓ ఆదం, అల్లాహ్ నీ మీద కరుణించాడు. ఆ విధంగా మొదటి మనిషికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అని పిలిచి, ఆదం అనే నామకరణం చేశాడు.

అభిమాన సోదరులారా, ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మొదటి మనిషి అయిన ఆదం అలైహిస్సలం వారికి, అక్కడ కూర్చొని ఉన్న దైవదూతల వద్దకు వెళ్లి వారికి సలాము చెప్పు అని ఆదేశించాడు. ఆదం అలైహిస్సలం దైవదూతల వద్దకు వెళ్లి “అస్సలాము అలైకుం” అని సలాం పలికారు. దానికి దైవదూతలు “వ అలైకుముస్సలాం వ రహ్మతుల్లాహ్” అని సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం విని ఆదం అలైహిస్సలం అల్లాహ్ వద్దకు వచ్చేసి, “ఓ అల్లాహ్, నేను దైవదూతలకు అస్సలాము అలైకుం అని సలాం చెబితే, వారు వ అలైకుముస్సలాం వ రహ్మతుల్లాహ్ అని సమాధానం ఇచ్చారు” అని చెప్పారు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారితో అన్నాడు, “ఓ ఆదం, నీకు మరియు నీ సంతానానికి పరస్పరం పలకరించుకోవడానికి ఇవే పలుకులు నేను ఇస్తున్నాను” అని చెప్పాడు.

మిత్రులారా, ఆ నాటి నుండి ఈ నాటి వరకు కూడా, ఇన్ షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా, అల్లాహ్ భక్తులు పరస్పరం ఎదురైనప్పుడు ఇవే పలుకులతో పలకరించుకుంటూ ఉంటారు. ఇక్కడ నాకు మరొక విషయం గుర్తుకు వస్తూ ఉంది. సందర్భానుసారం అది కూడా నేను వివరించి ముందుకు సాగుతాను మిత్రులారా. అదేమిటంటే, అస్సలాము అలైకుం, వ అలైకుముస్సలాం వ రహ్మతుల్లాహ్ – ఈ పలుకులు ఏ ధర్మంలో తెలియజేయబడ్డాయి మరియు ఏ ధర్మాన్ని అవలంబించే వాళ్ళు పలుకుతున్నారు? అందరూ ముక్తకంఠంతో ఒకే మాట చెబుతారు, అదేమిటంటే “ఈ పలుకులు ఇస్లాం ధర్మంలో మాత్రమే నేర్పబడ్డాయి, మరియు ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తున్న ముస్లింలు మాత్రమే ఈ పలుకులు పలుకుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం” అంటారు. అయితే ఇప్పుడు చెప్పండి, ఈ పలుకులు ఇస్లామీయ ధర్మం పలుకులు అయితే, మరి ఇస్లాం ధర్మం ఎప్పటి నుంచి మొదలైంది అండి? మనిషి పుట్టుక నుండే ఇస్లామీయ ధర్మము ఉంది, ఇస్లామీయ ధార్మిక నియమాలు కూడా ఉన్నాయి అని మనకి ఇక్కడ స్పష్టమవుతుంది.

ఆ తర్వాత మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారి వీపు మీద తన చేయితో స్పర్శించగా, అక్కడ చాలా ఆత్మలు ఉనికిలోకి వచ్చాయి. వాటన్నిటికీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కాంతిని ప్రసాదించాడు, అవి మెరిసిపోతూ ఉన్నాయి. అది చూసి ఆదం అలైహిస్సలం వారు, “ఓ అల్లాహ్, ఎవరు వీరు?” అని అడిగారు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారితో అన్నాడు, “వీరంతా రాబోయే నీ సంతానము” అని చెప్పాడు.

ఆదం అలైహిస్సలం వారందరినీ బాగా గమనిస్తే, ఒక ఆత్మ వద్ద కాంతి చాలా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంది. ఆయనను చూసి ఆదం అలైహిస్సలం అల్లాహ్ తో అడిగారు, “ఓ అల్లాహ్, అక్కడ కొంచెం ఎక్కువగా కాంతి ప్రకాశిస్తూ ఉంది, అతను ఎవరు?” అని ప్రత్యేకంగా అడిగారు. దానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అన్నాడు, “ఇతను నీ బిడ్డ దావూద్, అతని ఆయుష్షు 40 సంవత్సరాలు” అన్నాడు. అది విని ఆదం అలైహిస్సలం వారు అల్లాహ్ తో అన్నారు, “ఓ అల్లాహ్, అతనికి కేవలం 40 సంవత్సరాలే ఆయుష్షానా? నా ఆయుష్షులో నుంచి ఒక 60 సంవత్సరాలు తీసి అతని ఆయుష్షులో కలిపేయండి” అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో కోరారు. ఆయన కోరిక మేరకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆజ్ఞతో అలాగే 60 సంవత్సరాలు దావూద్ అలైహిస్సలం వారి ఆయుష్షులో పెంచడం జరిగింది. ఆ విధంగా దావూద్ అలైహిస్సలం వారి ఆయుష్షు 100 సంవత్సరాలు అయింది మిత్రులారా.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారికి విద్య నేర్పాడు, వస్తువుల పేర్లు నేర్పాడు, వాటి వినియోగం కూడా నేర్పాడు అని ధార్మిక పండితులు తెలియజేశారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో తెలియజేశాడు:

وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا
[వ అల్లమ ఆదమల్ అస్మాఅ కుల్లహా]
తరువాత అల్లాహ్‌ ఆదంకు అన్ని వస్తువుల పేర్లను నేర్పాడు. (2:31)

అంటే, మనిషి పుట్టిన తర్వాత అల్లాహ్ తరఫు నుండి ఆయనకు జ్ఞానం ఇవ్వబడింది అన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతలను పిలిచి, దైవదూతల ముందర ఆ వస్తువులన్నింటినీ ప్రవేశపెట్టి, అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతలతో మరొక ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే:

أَنْبِئُونِي بِأَسْمَاءِ هَؤُلَاءِ إِنْ كُنْتُمْ صَادِقِينَ
[అంబిఊనీ బి అస్మాఇ హాఉలాఇ ఇన్ కున్తుం సాదిఖీన్]
“మీరు సత్యవంతులే అయితే, వీటి పేర్లు చెప్పండి” అని అన్నాడు. (2:31)

ఇక్కడ కనిపిస్తున్న వస్తువుల పేర్లు నాకు చెప్పండి అంటే, దైవదూతలు అల్లాహ్ తో అన్నారు:

سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا إِنَّكَ أَنْتَ الْعَلِيمُ الْحَكِيمُ
[సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్]
వారంతా ఇలా అన్నారు : “(ఓ అల్లాహ్‌!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!” (2:32)

అంటే, వీటి జ్ఞానము మాకు లేదు, మేము చెప్పలేము అని దైవదూతలు అక్కడ చెప్పేశారు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ ఆదం అలైహిస్సలం వారితో, “ఓ ఆదం, వీటి పేర్లు నువ్వు తెలుపు” అని ఆదేశించాడు. అప్పుడు ఆదం అలైహిస్సలం అక్కడ ఉన్న వస్తువుల పేర్లన్నీ చకచకా తెలియజేశారు. ఇది నది, ఇది భవనము, ఇది వృక్షము, ఇది ఫలము, ఈ విధంగా వస్తువుల పేర్లన్నీ ఆయన పలికేశారు. మిత్రులారా, అప్పుడు దూతలకు అర్థమయింది, ఈ కొత్త జీవిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, ముఖ్యంగా విద్య ఉంది, జ్ఞానం ఉంది అని. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా దూతలతో అన్నాడు, “నేను ముందే మిమ్మల్ని చెప్పాను కదా, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని. ఇందులో, ఈ కొత్త జీవిలో ఈ ప్రత్యేకతలు ఉన్నాయి, చూడండి” అన్నాడు.

ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దూతలందరినీ ఆదం అలైహిస్సలం వారి ముందర సాష్టాంగపడమని, సజ్దా చేయమని ఆదేశించాడు. అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం, దైవదూతలందరూ సజ్దా చేశారు, సాష్టాంగపడ్డారు. కానీ, అప్పటికే ఎంతో గౌరవ మర్యాదలతో స్వర్గంలో ఉన్నతమైన స్థానంలో ఉంటున్న ఇబ్లీస్ మాత్రం సాష్టాంగపడలేదు.

అది చూసి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇబ్లీస్ తో అడిగాడు:

يَا إِبْلِيسُ مَا مَنَعَكَ أَنْ تَسْجُدَ لِمَا خَلَقْتُ بِيَدَيَّ
[యా ఇబ్లీసు మా మనఅక అన్ తస్జుద లిమా ఖలఖ్తు బియదయ్య]
“ఓ ఇబ్లీస్‌! నేను నా స్వహస్తాలతో సృష్టించిన వానిముందు సాష్టాంగపడకుండా ఏ విషయం నిన్ను ఆపింది?” (38:75)

దానికి ఇబ్లీస్ అల్లాహ్ కు సమాధానం ఇచ్చాడు, చూడండి ఏమంటున్నాడో:

قَالَ أَنَا خَيْرٌ مِنْهُ خَلَقْتَنِي مِنْ نَارٍ وَخَلَقْتَهُ مِنْ طِينٍ
[ఖాల అన ఖైరుమ్ మిన్హు ఖలఖ్తనీ మిన్నారిన్ వ ఖలఖ్తహు మిన్తీన్]
“నేను అతనికంటే ఘనుడను. (ఎందుకంటే) నీవు నన్ను అగ్నితో సృష్టించావు. అతన్నేమో మట్టితో సృష్టించావు” అని వాడు సమాధానమిచ్చాడు. (38:76)

అంటే, నేను అతని కంటే గొప్పవాణ్ణి, అగ్నితో పుట్టినవాణ్ణి కదా, నేను గొప్పవాణ్ణి. అతను మట్టితో పుట్టాడు కదా, అతను అల్పుడు అని అతను భావించాడు. ఒక రకంగా చెప్పాలంటే, అతను లోలోపల గర్వపడ్డాడు, అహంకారానికి గురయ్యాడు. అదే విషయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ లో కూడా తెలియజేసి ఉన్నాడు:

أَبَى وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ
[అబా వస్తక్బర వకాన మినల్ కాఫిరీన్]
వాడు మాత్రం తిరస్కరించాడు. అహంకారి అయి, అవిధేయులలో చేరిపోయాడు. (2:34)

మిత్రులారా, అహంకారం ప్రదర్శిస్తే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు నచ్చదు. అహంకారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలో ఇష్టపడడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఎవరి వద్ద అయినా రవ్వంత అహంకారం ఉన్నా, అతను స్వర్గంలో ప్రవేశింపజాలడు” అన్నారు. మనిషికి అహంకారం తగదు మిత్రులారా. అదేవిధంగా ఇబ్లీస్ కూడా అదే పొరపాటు చేశాడు, అహంకారానికి గురయ్యాడు, అల్లాహ్ సాష్టాంగపడమంటే సాష్టాంగపడలేదు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కోపగించుకొని, ఆగ్రహించి, అతన్ని స్వర్గం నుండి బహిష్కరించేశాడు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు:

فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ
[ఫఖ్రుజ్ మిన్హా ఫఇన్నక రజీమ్]
(అప్పుడు అల్లాహ్‌ ఈ విధంగా) సెలవిచ్చాడు : “నువ్విక్కణ్ణుంచి వెళ్ళిపో. నువ్వు ధూత్కరించబడ్డావు. (38:77)

మిత్రులారా, అతను ప్రదర్శించిన అహంకారం కారణంగా తన గౌరవాన్ని కోల్పోయాడు, తన ఉన్నతమైన స్థానాన్ని కోల్పోయాడు, స్వర్గ బహిష్కరణకు గురైపోయాడు షైతాను.

ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలం వారిని స్వర్గంలోకి ప్రవేశింపజేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ రోజు అయితే ఆదం అలైహిస్సలం వారు పుట్టారో అది జుమా రోజు, అంటే శుక్రవారం రోజు. మరియు ఏ రోజు అయితే ఆదం అలైహిస్సలం వారు స్వర్గంలో ప్రవేశించారో అది కూడా జుమా రోజు, శుక్రవారం రోజు. అంటే శుక్రవారం రోజున ఆదం అలైహిస్సలం వారు స్వర్గంలోకి ప్రవేశించారు.

స్వర్గంలో వెళ్ళిన తర్వాత, ఆదం అలైహిస్సలం ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉన్నారు. అయితే అక్కడ ఆయనకు ఒంటరితనం అనిపించింది. ఒక రోజు ఆయన పడుకుంటూ ఉంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన పక్కటెముకల నుండి, ఎడమ వైపున ఉన్న పక్కటెముక నుండి ఒక మహిళను సృష్టించాడు. ఆమె పేరు హవ్వా. ఆదం అలైహిస్సలం వారు నిద్ర లేచి చూస్తే, ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉండటాన్ని గమనించి “ఎవరు మీరు?” అని ప్రశ్నించారు. హవ్వా అలైహస్సలాం వారు అన్నారు, “నా పేరు హవ్వా, నన్ను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీ కోసం పుట్టించాడండి” అని చెప్పారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిద్దరితో మాట్లాడాడు. “మీరిద్దరూ జంటగా ఈ స్వర్గంలో తిరగండి, స్వేచ్ఛగా మీకు తోచిన చోటు నుండి తినండి, స్వేచ్ఛగా మీకు తోచిన చోటు నుండి త్రాగండి” అని చెబుతూ, ఒకే ఒక నిబంధన పెట్టాడు. ఏంటి ఆ నిబంధన?

وَلَا تَقْرَبَا هَذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ
[వలా తఖ్రబా హాదిహిష్షజరత ఫతకూనా మినజ్జాలిమీన్]
కాని ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు. లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు” (2:35)

ఆదం అలైహిస్సలం మరియు హవ్వా అలైహస్సలాం వారిద్దరూ జంటగా స్వర్గంలో ప్రశాంతంగా, హాయిగా జీవిస్తూ ఉన్నారు మిత్రులారా.

అల్లాహ్ ఆజ్ఞకు కట్టుబడి వారు స్వర్గంలో ప్రశాంతంగా, గౌరవంగా జీవించుకుంటూ ఉంటే, స్వర్గ బహిష్కరణకు గురైన షైతాను వారిని చూసి లోలోపల కుళ్ళిపోయాడు, అసూయకు గురయ్యాడు. అసూయకు గురయ్యి, ఎలాగైనా సరే వీరిద్దరితో నేను తప్పు చేయించాలి, వారిని కూడా స్వర్గ బహిష్కరణకు గురి చేయాలి అని లోలోపలే అతను అసూయపడ్డాడు.

ఆ తర్వాత, వారిద్దరి వద్దకు షైతాన్ దుష్ప్రేరేపణ కల్పించడం మొదలెట్టేశాడు. దాన్ని వస్వసా అని అంటారు మిత్రులారా. దుష్ప్రేరణ రేకెత్తించడం ప్రారంభించాడు. అతను ఏమన్నాడంటే, “ఏమండీ, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మిమ్మల్ని స్వర్గంలో స్వేచ్ఛగా అన్నీ తినండి, స్వేచ్ఛగా మీకు తోచిన చోటు నుండి తాగండి అని చెబుతూ, కేవలం ఆ ఒక్క వృక్ష ఫలమే ఎందుకు తినవద్దు అని నిబంధన పెట్టాడో తెలుసా? ఆ వృక్ష ఫలాన్ని మీరు తినినట్లయితే, మీరు దైవదూతలుగా మారిపోతారు, శాశ్వతమైన రాజ్యం మీకు దక్కుతుంది, శాశ్వతమైన జీవితం మీకు దక్కుతుంది. అందుకోసమే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీకు ఆ వృక్షం వద్దకు కూడా వెళ్ళవద్దు అని నిబంధన పెట్టేశాడు” అని చెబుతూ, షైతాన్ ఒట్టేసుకున్నాడండి, ప్రమాణం చేసేశాడు.

అతను ప్రమాణం చేసి మరీ చెబుతూ ఉంటే, మిత్రులారా, వారిద్దరూ అతని మాటల్లో పడిపోయారు. అతని మాటల్లో పడి, వారిద్దరూ కలిసి ఆ వృక్ష ఫలాన్ని తినేశారు. మిత్రులారా, ఖుర్ఆన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు. 20వ అధ్యాయం, 121వ వాక్యంలో:

فَأَكَلَا مِنْهَا
[ఫ అకలా మిన్హా]
చివరకు వారిద్దరూ దానిని తిన్నారు. (20:121)

అలాగే, 7వ అధ్యాయం, 20వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

فَوَسْوَسَ لَهُمَا الشَّيْطَانُ
[ఫ వస్వస లహుమష్షైతాను]
అప్పుడు షైతాను వారిద్దరి మనస్సులలో దుష్ప్రేరణను రేకెత్తించాడు. (7:20)

మిత్రులారా, ఇద్దరూ కూడా షైతాను మాటల్లో పడి ఆ వృక్ష ఫలము తిన్నారు అని ఖుర్ఆన్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అయితే, మహిళ ఒక్కరే ఈ పాపానికి ఒడిగట్టారు, దీనికి కారణము మహిళ అని నిందించడము సమంజసము కాదు అని మనకు ఖుర్ఆన్ ద్వారా తెలియజేయబడింది మిత్రులారా.

ఎప్పుడైతే వారు ఆ వృక్ష ఫలాన్ని తిన్నారో, వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి. వారు స్వర్గంలోని ఆకులు తీసుకొని వారి మర్మస్థానాలను కప్పుకోవడం ప్రారంభించారు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిద్దరితో మాట్లాడాడు. “ఏమండీ, నేను నిషేధించిన చెట్టు, వృక్ష ఫలాన్ని మీరు తిన్నారు అంటే, మీరు కూడా నా ఆజ్ఞను అతిక్రమించారు. కాబట్టి, మీరు కూడా శిక్షార్హులు, మీకు శిక్ష ఏమిటంటే మీరు కూడా స్వర్గం నుండి బయటికి వెళ్ళండి” అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిద్దరినీ, ఆ తప్పు చేసిన కారణంగా, ఆ నిషేధించబడిన వృక్ష ఫలము తిన్న కారణంగా, స్వర్గం నుంచి బయటికి బహిష్కరించాడు మిత్రులారా.

ఆ తర్వాత ఏమి జరిగింది? స్వర్గం నుంచి బహిష్కరించబడిన తర్వాత మానవులను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎక్కడికి చేర్చాడు? ఆ తదుపరి జరిగిన వృత్తాంతాన్ని ఇన్ షా అల్లాహ్ మనం రెండవ భాగంలో తెలుసుకుందాం.

అల్లాహ్ తో మేము దుఆ చేస్తున్నాము, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ అల్లాహ్ ఆజ్ఞలను పాటిస్తూ, అహంకారానికి గురికాకుండా, అల్లాహ్ ఆరాధన చేసుకుంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

[రెండవ భాగం]

ఆదం (అలైహిస్సలాం) జీవిత చరిత్ర (పార్ట్ 2)
https://www.youtube.com/watch?v=X-bmzBv-g8U
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిదహుల్లాహ్)

ఈ ప్రసంగం ఆదం (అలైహిస్సలాం) జీవిత చరిత్రలో రెండవ భాగాన్ని వివరిస్తుంది. స్వర్గం నుండి బహిష్కరించబడిన తరువాత, ఆదం (అలైహిస్సలం) మరియు హవ్వా (అలైహస్సలాం) భూమిపై వేర్వేరు ప్రదేశాలలో దిగి, పశ్చాత్తాపంతో అల్లాహ్‌ను క్షమాపణ వేడుకున్నారు. అల్లాహ్ వారిని క్షమించి, అరఫా మైదానంలో తిరిగి కలిపాడు. వారికి కవలలుగా సంతానం కలిగింది. వారి కుమారులైన కాబిల్ మరియు హాబిల్ మధ్య వివాహ విషయంలో వివాదం తలెత్తగా, దానిని పరిష్కరించడానికి అల్లాహ్ వారిని ఖుర్బానీ (బలి) చేయమని ఆదేశించాడు. హాబిల్ ఖుర్బానీ స్వీకరించబడి, కాబిల్ ఖుర్బానీ తిరస్కరించబడటంతో, అసూయతో కాబిల్ తన సోదరుడైన హాబిల్‌ను హత్య చేశాడు. ఇది భూమిపై జరిగిన మొదటి హత్య. తరువాత, ఒక కాకి ద్వారా అల్లాహ్ శవాన్ని ఎలా ఖననం చేయాలో కాబిల్‌కు నేర్పాడు. చివరగా, ఆదం (అలైహిస్సలం) 960 సంవత్సరాలు జీవించి మరణించగా, దైవదూతలు ఆయన ఖనన సంస్కారాలు నిర్వహించి మానవాళికి మార్గనిర్దేశం చేశారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

మిత్రులారా, మనిషి భూమి మీద మొదటిసారి ఎక్కడ పాదం మోపాడు? మనిషికి భూమి మీద పంపించబడిన తర్వాత ఎన్ని సంవత్సరాల ఆయుష్షు ఇవ్వబడింది? మొదటి మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించాడు? మొదటి మనిషికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎంత మంది బిడ్డలను ప్రసాదించాడు? మనిషికి పుట్టిన బిడ్డలలో, ఓ ఇద్దరు బిడ్డల గురించి ప్రత్యేకంగా ధార్మిక గ్రంథాలలో తెలుపబడిన విషయాలు, మొదటి మనిషి యొక్క మరణం మరియు అతని ఖనన సంస్కారాలు, ఈ విషయాలన్నీ మనము ఈనాటి ప్రసంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఎప్పుడైతే ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం స్వర్గంలో నిషేధించిన వృక్ష ఫలాన్ని తిని అల్లాహ్ ఆజ్ఞను అతిక్రమించారో, వారిని స్వర్గం నుండి బహిష్కరించి భూమి మీదకి దింపేశాడు. దైవదూతలు ఇద్దరినీ భూమి మీదికి తీసుకువచ్చారు. ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, ఆదం అలైహిస్సలాం వారిని దైవదూతలు భారతదేశంలో దింపారు. నేడు శ్రీలంక అని ఒక దేశం పేరు మనం వింటూ ఉన్నాము కదా, ఒకప్పుడు అది భారతదేశపు భూభాగంలోనే ఒక భాగము. అక్కడ దైవదూతలు ఆదం అలైహిస్సలాం వారిని దింపారు. మరియు హవ్వా అలైహస్సలాం వారిని దైవదూతలు సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వద్ద దింపారు. అంటే ఇద్దరినీ కూడా వేరు వేరు ప్రదేశాలలో దైవదూతలు దింపేశారు.

భూమి మీద దిగిన తర్వాత, వారు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సమక్షంలో కన్నీరు కార్చి, ఏడ్చి, పశ్చాత్తాపపడి క్షమాభిక్ష వేడుకున్నారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారికి కొన్ని పలుకులు కూడా నేర్పాడు. ఆ పలుకులతో ఆదం అలైహిస్సలాం వారు అల్లాహ్ తో క్షమాభిక్ష కోరారు. ఏమిటి ఆ పలుకులు అంటే, ఖుర్ఆన్ గ్రంథంలో మనం చూచినట్లయితే, ఏడవ అధ్యాయం, 23వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు:

قَالَا رَبَّنَا ظَلَمْنَا أَنْفُسَنَا وَإِنْ لَمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ

[రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లమ్ తగ్ఫిర్లనా వ తర్హమ్నా లనకునన్న మినల్ ఖాసిరీన్]
వారిద్దరూ, “మా ప్రభూ! మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి, మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము” అని వేడుకున్నారు (7:23)

ఈ విధంగా అల్లాహ్ నేర్పిన ఆ పలుకులను నేర్చుకొని, ఆది దంపతులైన ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం ఇద్దరూ అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి వేడుకోగా, కరుణామయుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారి మీద కరుణించి, వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి, వారి పాపాన్ని మన్నించేశాడు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు, “ఫతాబ అలైహి ఇన్నహూ హువత్తవ్వాబుర్రహీం.” అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారి తౌబా స్వీకరించి మన్నించేశాడు. నిశ్చయంగా ఆయన కరుణించేవాడు మరియు పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు.

మిత్రులారా, మనిషి చేసిన పాపము క్షమించబడింది, మన్నించబడింది అని ఖుర్ఆన్ గ్రంథము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే మిత్రులారా, ఎప్పుడైతే వారి పాపము మన్నించబడిందో, క్షమించబడిందో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతల్ని పంపించి, వేరు వేరు ప్రదేశాలలో ఉన్న వారిద్దరినీ మళ్ళీ ఒకచోట కలిపేశాడు. ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, దైవదూతలు వచ్చి, ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం వారి ఇద్దరినీ మక్కా సమీపంలో ఉన్న అరఫా మైదానంలోని జబలె రహ్మా వద్ద వారిద్దరినీ కలిపేశారు. మిత్రులారా, విడిపోయిన ఆ ఆలుమగలిద్దరూ, దూరం దూరంగా ఉన్న ఆ ఆలుమగలిద్దరూ పరస్పరం అక్కడ, అరఫా మైదానంలో జబలె రహ్మా వద్ద ఒకరికొకరు ఎదురయ్యారు. వారిద్దరూ అక్కడ ఒకరికొకరు పరిచయమయ్యారు కాబట్టి ఆ మైదానానికి పరిచయ స్థలం అనే భావన వచ్చేటట్టుగా అరఫా అని పేరు పడింది అని ధార్మిక పండితులు తెలియజేస్తారు.

సరే, ఆ విధంగా ఆది దంపతులు ఇద్దరూ ఒకచోట వచ్చారు, వారిద్దరూ కలిసి నివసించడం ప్రారంభించారు. మిత్రులారా, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారిని భూమండలం మీద, మీకు ఒక నిర్దిష్ట కాలం వరకు జీవితం ఇవ్వబడింది, మీరు అక్కడ ఆ నిర్దిష్ట కాలం వరకు జీవించండి, మీకు సంతానము కూడా కలుగుతుంది, ఆ విధంగా ప్రపంచము నడుస్తుంది, మళ్ళీ మీకు మరణం అని ఒకటి వస్తుంది, ఆ మరణం సంభవించిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి నా సమక్షంలోకి వస్తారు, అప్పుడు మళ్ళీ నేను మీ స్థానమైన స్వర్గానికి చేరుస్తాను అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశారు అని ధార్మిక పండితులు తెలియజేశారు.

అయితే మిత్రులారా, ఎప్పుడైతే మనిషి యొక్క పాపము మన్నించబడిందో, అతను మరణించి మళ్ళీ స్వర్గానికి వెళ్లిపోబోతున్నాడు అన్న విషయము తెలిసిందో, అసూయకు గురై ఉన్న షైతాను మరింత అసూయకు గురయ్యాడు. మామూలుగా చేయాల్సింది ఏమిటండి? మనిషితో తప్పు దొల్లింది, షైతానుతో కూడా తప్పు దొర్లింది. ఇద్దరికీ ఒకే శిక్ష. షైతాను కూడా స్వర్గం నుంచి బహిష్కరించబడ్డాడు, మానవుడు కూడా స్వర్గం నుంచి బహిష్కరించబడ్డాడు. మానవుడు అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి, క్షమాభిక్ష వేడుకున్నాడు, అతని పాపము క్షమించబడింది. మరి అలాంటప్పుడు షైతాను ఏమి చేయాలి? అతను కూడా అల్లాహ్ వద్ద వెళ్లి, క్షమాభిక్ష వేడుకొని, మన్నింపు వేడుకొని, తౌబా చేసుకోవాలి, పశ్చాత్తాప పడాలి. కానీ అతను ఏం చేశాడంటే, మరింత అసూయకు గురైపోయి, “అరే, నేను స్వర్గం నుంచి మనిషిని బయటికి వచ్చేటట్టు, బహిష్కరించబడేటట్టు చేస్తే, ఇతను మళ్ళీ స్వర్గవాసి అయిపోతున్నాడే” అని అల్లాహ్ వద్దకు వెళ్లి మళ్ళీ అతను సవాలు చేశాడు. ఏమని సవాలు చేశాడంటే, “ఓ అల్లాహ్, నేను కూడా భూమి మీదకు వెళ్లి, మనిషి దారిలో కూర్చొని, కుడి వైపు నుండి, ఎడమ వైపు నుండి, నలువైపుల నుండి నేను అతన్ని నీ మార్గములో, నీ దారిలో నడవకుండా మార్గభ్రష్టత్వానికి గురయ్యేటట్టు చేస్తాను, దారి తప్పేటట్టు చేసేస్తాను” అని సవాలు విసిరాడు.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని మాటలు వింటూ ఉంటే, అతను మళ్ళీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో అడిగాడు, “ఇదంతా చేయటానికి నాకు కొన్ని శక్తులు కావాలి” అన్నాడు. ఏమిటి ఆ శక్తులు అంటే, అతను అన్నాడు:

أَنْظِرْنِي إِلَى يَوْمِ يُبْعَثُونَ
“ప్రజలు తిరిగి లేపబడే రోజు వరకు నాకు గడువు ఇవ్వు.” (7:14)

అనగా, అందరూ తిరిగి లేపబడే రోజు వరకు నాకు గడువు ఇవ్వు. అంటే ప్రళయం వరకు నాకు చావు రాకూడదు అన్న విషయం అతను అల్లాహ్ తో కోరాడు. అలాగే, మరిన్ని కొన్ని కోరికలు అతను కోరాడు. ముఖ్యంగా మనం చూచినట్లయితే, మనిషి హృదయం పక్కన కూర్చొని, మనిషి మనసులో చెడు ఆలోచనలు కలిగించడానికి స్థానము కావాలి అని కోరుకున్నాడు. ఆ విధంగా మరిన్ని కోరికలు అతను కోరుకుంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని కోరికల ప్రకారం అతనికి ఆ శక్తులన్నీ ఇచ్చాడు. “ప్రళయం వరకు నాకు మరణం సంభవించకూడదు” అంటే అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతనికి ఇచ్చేశాడు. “కాల ఇన్నక మినల్ ముంజరీన్, సరే, నీకు ఆ గడువు ఇవ్వబడింది, వెళ్ళు” అని చెప్పాడు. అతను ఆ శక్తులు తీసుకొని భూమి మీదకి వస్తూ ఉంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతనితో అన్నాడు, “నీవు వెళ్లి నీ ప్రయత్నము చెయ్. నేను కూడా నా భక్తుల వద్దకు నా వాక్యాలు పంపిస్తాను. ఒకవేళ ఎవరైనా నీ మాట విని, నా దారి వదిలేసి, దారి తప్పిపోయి మార్గభ్రష్టత్వానికి గురైపోతే, నిన్ను మరియు నీ మాట విని మార్గభ్రష్టత్వానికి గురవుతున్న వారిని ఇద్దరినీ కూడా నేను నరకంలో శిక్షిస్తాను” అని చెప్పేశాడు.

సరే, ఏది ఏమైనను మిత్రులారా, ఇద్దరూ ఇటు మానవులు, అటు జిన్నాతులు భూమి మీద నివసించడం ప్రారంభించారు. మొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహస్సలాం తో కలిసి ఈ భూమి మీద నివసిస్తూ ఉంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారికి సంతానాన్ని ప్రసాదించాడు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతో హవ్వా అలైహస్సలాం వారికి ప్రతి కాన్పులో ఇద్దరు బిడ్డలు పుట్టేవారు, ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ. ఇద్దరు బిడ్డలు ప్రతి కాన్పులో పుట్టేవారు. ఆ విధంగా హవ్వా అలైహస్సలాం వారికి 20 కాన్పుల్లో 40 మంది బిడ్డలు పుట్టారు అని ధార్మిక పండితులు తెలియజేశారు.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారికి సంతానం ఇచ్చినప్పుడు, ఆ సంతానాన్ని పోషించుకుంటూ, వారికి దైవ వాక్యాలు, నిబంధనలు నేర్పించుకుంటూ ఆది మానవులైన ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం వారు ఈ భూమండలం మీద జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. చూస్తూ ఉండంగానే, ఆది మానవులైన ఆదం అలైహిస్సలాం వారి సంతానము పెరుగుతూ పోయింది భూమండలం మీద. ప్రజల సంఖ్య పెరుగుతూ పోయింది, రోజులు గడుస్తూ పోయాయి. ఆ తర్వాత, ఆదం అలైహిస్సలాం వారి బిడ్డల మధ్య ఒక విషయంలో గొడవ జరిగింది.

మిత్రులారా, ఆదం అలైహిస్సలాం వారి బిడ్డల్లో కాబిల్ మరియు హాబిల్ అనే వారు ఇద్దరూ ముఖ్యమైన వ్యక్తులు. కాబిల్ అనే ఆదం అలైహిస్సలాం కుమారుడు వ్యవసాయం చేసేవాడు. హాబిల్ అనే ఆదం అలైహిస్సలాం కుమారుడు పశువుల కాపరిగా, పశువులను మేపేవాడు. అయితే, వారిద్దరూ పెరిగి పెద్దవారయ్యాక, వివాహ విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆనాటి నియమ నిబంధనల ప్రకారము, ఏ అమ్మాయినైతే కాబిల్ వివాహం చేసుకుంటాను అని కోరాడో, ఆ అమ్మాయిని హాబిల్ కి ఇచ్చి వివాహం చేయాలి. కానీ, కాబిల్ ఆ అమ్మాయితో నేనే వివాహం చేసుకుంటాను అని పట్టుపట్టాడు. ఆనాటి నియమ నిబంధనలకు అతని ఆ కోరిక విరుద్ధమైనది.

విషయం తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. ఆదం అలైహిస్సలాం, కాబిల్ కి చాలా రకాలుగా నచ్చజెప్పారు, “బిడ్డా, నువ్వు కోరుతున్న కోరిక అధర్మమైనది, ఈ విధంగా నీవు పట్టుపట్టడం, మొండి వైఖరి వివలంబించడం మంచిది కాదు” అని ఆదం అలైహిస్సలాం కాబిల్ కి ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా, అతను మాత్రం వినలేదు. చివరికి ఆదం అలైహిస్సలాం వారు ఏమన్నారంటే, “సరే, ఒక పని చేయండి, మీరిద్దరూ కలిసి అల్లాహ్ సమక్షంలో ఖుర్బానీ చేయండి. ఎవరి ఖుర్బానీ స్వీకరించబడుతుందో, అతనికి ఇచ్చి ఆ అమ్మాయితో వివాహం చేసేస్తాము” అని చెప్పారు.

మిత్రులారా, ఈ విషయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు, ఐదవ అధ్యాయం, 27వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు:

وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ ابْنَيْ آدَمَ بِالْحَقِّ إِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ أَحَدِهِمَا وَلَمْ يُتَقَبَّلْ مِنَ الْآخَرِ
ఆదం యొక్క ఇద్దరు కుమారుల వృత్తాంతాన్ని కూడా వారికి యధాతథంగా వినిపించు. వారిరువురూ దైవానికి ఖుర్బానీ సమర్పించగా, వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది. మరొకరిది స్వీకరించబడలేదు.(5:27)

ఎవరి ఖుర్బానీ స్వీకరించబడింది, ఎవరి ఖుర్బానీ స్వీకరించబడలేదు అన్న విషయాన్ని ధార్మిక పండితులు తెలియజేశారు. అదేమిటంటే, ఆదం అలైహిస్సలాం వారు చెప్పిన ప్రకారం, కాబిల్ మరియు హాబిల్ ఇద్దరూ కూడా ఖుర్బానీ చేయటానికి ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నారు, ఒక సమయాన్ని ఎన్నుకున్నారు. నిర్దిష్ట సమయం వచ్చినప్పుడు, కాబిల్, అతను వ్యవసాయం చేసేవాడు కాబట్టి, అతను కొన్ని ధాన్యాలు తీసుకొని వెళ్లి ఒక మైదానంలో ఉంచాడు. ఇటు హాబిల్, గొర్రెల కాపరి కాబట్టి, ఒక గొర్రెను లేదా ఒక పశువుని తీసుకొని వెళ్లి మైదానంలో నిలబెట్టాడు. ఆ రోజుల్లో ఖుర్బానీ ఇచ్చే విధానం ఏమిటంటే, వారి ఖుర్బానీ తీసుకొని వెళ్లి మైదానంలో ఉంచితే, ఎవరి ఖుర్బానీ స్వీకరించబడుతుందో, అతని ఖుర్బానీని ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చేస్తుంది. అప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది, ఫలానా ఫలానా వ్యక్తుల ఖుర్బానీ స్వీకరించబడింది అని.

కాబట్టి, వారిద్దరూ కూడా, కాబిల్ మరియు హాబిల్ ఇద్దరూ కూడా, వారి వారి ఖుర్బానీని తీసుకొని వెళ్లి మైదానంలో ఉంచారు. మైదానంలో ఉంచగా, అగ్ని వచ్చి హాబిల్ పెట్టిన ఖుర్బానీని కాల్చి వెళ్లిపోయింది. అప్పుడు స్పష్టమైపోయింది, హాబిల్ మాత్రమే సత్యం మీద ఉన్నాడు, అతని మాట న్యాయమైనది. కాబిల్ అసత్యం పైన ఉన్నాడు, అతను అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు అని స్పష్టమైపోయింది. ఎప్పుడైతే కాబిల్ కు తెలిసిందో, “నా ఖుర్బానీ స్వీకరించబడలేదు, తిరస్కరించబడింది” అని, అతను అతని తమ్ముని మీద కోపం పెంచుకున్నాడు. కోపం పెంచుకొని, అతని తమ్ముని వద్దకు వెళ్లి అతను ఏమన్నాడంటే:

لَأَقْتُلَنَّكَ
“నిశ్చయంగా నేను నిన్ను చంపేస్తాను.” (5:27)

నువ్వు నాకు అడ్డుపడుతున్నావు, నేను నిన్ను హతమార్చేస్తాను అన్నాడు. అంటే చంపేస్తాను అని అతన్ని బెదిరించాడు. మిత్రులారా, అది విని హాబిల్, అతను మంచి వ్యక్తి, మృదు స్వభావి, ఆయన ఏమన్నాడంటే:

إِنَّمَا يَتَقَبَّلُ اللَّهُ مِنَ الْمُتَّقِينَ
“అల్లాహ్‌ భయభక్తులు గలవారి ఖుర్బానీనే స్వీకరిస్తాడు.” (5:27)

దైవభీతి ఉన్నవారి ఖుర్బానీ అల్లాహ్ త’ఆలా స్వీకరిస్తాడు, నాలో దైవభీతి ఉండింది కాబట్టి అల్లాహ్ నా ఖుర్బానీ స్వీకరించాడు, నీవు అన్యాయంగా పోతున్నావు కాబట్టి నీ ఖుర్బానీ స్వీకరించబడలేదు. నువ్వు నన్ను చంపుతాను అని బెదిరిస్తున్నావు కదా!

لَئِنْ بَسَطْتَ إِلَيَّ يَدَكَ لِتَقْتُلَنِي مَا أَنَا بِبَاسِطٍ يَدِيَ إِلَيْكَ لِأَقْتُلَكَ
ఒకవేళ నువ్వు నన్ను హత్య చేయటానికి చెయ్యి ఎత్తితే, నేను మాత్రం నిన్ను హత్య చేయటానికి నా చెయ్యి ఎత్తను. (5:28)

ఒకవేళ నువ్వు నా ప్రాణము తీస్తే, నా పాపము మూటగట్టుకుంటావు అని చెప్పాడు. మిత్రులారా, కాబిల్ ఆ మాటలు విని కూడా మారలేదు. అతని మనసులో ఒకే మొండిపట్టు ఉండింది, ఎలాగైనా సరే నా మాటను నేను నెగ్గించుకోవాలి అని అతను పట్టుపట్టాడు. షైతాను కూడా అతనికి పురికొల్పాడు.

ఒకరోజు హాబిల్ నిద్రిస్తూ ఉంటే, అతను ఒక పెద్ద రాయి తీసుకొని వెళ్లి అతని తల మీద పడేశాడు. ఆ విధంగా కాబిల్ హాబిల్ ని హతమార్చేశాడు. మరికొన్ని ఉల్లేఖనాలు ఏమని ఉందంటే, ఒక గట్టి వస్తువు తీసుకొని అతని తల మీద కొట్టాడు, తత్కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పబడింది. ఏది ఏమైనను సరే, కాబిల్ హాబిల్ ని హతమార్చేశాడు.

మొదటిసారి ఈ భూమండలం మీద ఒక వ్యక్తి ప్రాణాలు పోయాయి, ఒక నేరము జరిగింది. ఆ నేరం ఏమిటంటే హత్య. ఒక హత్యా నేరము ఈ భూమండలం మీద మొదటిసారి జరిగింది మిత్రులారా. ఇక్కడ ఒక విషయం మనం దృష్టిలో పెట్టుకుందాం. అదేమిటంటే, మొదటి హత్య ఈ భూమండలం మీద కాబిల్ చేశాడు. ఆ తర్వాత ప్రపంచం నడుస్తూనే ఉంది, ప్రజలు పుడుతూనే పోతున్నారు. ప్రతి యుగములో కూడా కొంతమంది దుర్మార్గులు, కొంతమంది యువకుల ప్రాణాలు తీసేస్తున్నారు, హత్యలు చేసేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఈ ప్రపంచంలో, భూమండలం మీద ఎక్కడ హత్య జరిగినా, హంతకునికి పాపం ఉంటుంది. దానితో పాటు, ఒక భాగము పాపమిది ఆ కాబిల్ ఖాతాలోకి కూడా చేరుతుంది. ఎందుకంటే ఆ పాపాన్ని ఈ భూమండలం మీద ప్రవేశపెట్టింది అతడే కాబట్టి.

మిత్రులారా, ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “మన్ దల్ల అలా ఖైరిన్ ఫలహూ మిస్లు అజ్రి ఫాయిలిహి,” ఎవరైనా ఒక మంచి మార్గం చూపిస్తే, ఆ మంచి మార్గంలో ఎంతమంది నడుచుకుంటారో, నడుచుకున్న వాళ్ళకి కూడా పుణ్యం ఉంటుంది, దారి చూపించిన వ్యక్తికి కూడా ఒక భాగము అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పుణ్యం ప్రసాదిస్తూనే ఉంటాడు.

అలాగే, “వ మన్ దల్ల అలా ఇస్మిన్ ఫలహూ మిస్లు అజ్రి మా ఆసామా,” ఎవరైనా ఒక చెడ్డ దారి చూపిస్తే, ఆ చెడ్డ దారిలో ఎంతమంది నడుచుకుంటారో, ఆ చెడ్డ దారిలో నడుచుకొని ఎంతమంది పాపాలు మూటగట్టుకుంటారో, పాపం చేసిన వారికి కూడా పాపం ఉంటుంది, ఆ దారి చూపించిన వ్యక్తికి కూడా ఒక భాగము పాపం దొరుకుతూనే ఉంటుంది అని చెప్పారు.

కాబట్టి, జాగ్రత్త పడాలి మిత్రులారా. మనం మన ఇరుపక్కల ఉన్న వారికి మంచి విషయాలు నేర్పిస్తున్నామా, మంచి దారి చూపిస్తున్నామా, లేదా మా తరఫు నుంచి ఇతరులకు మేము చెడ్డ అలవాట్లు నేర్పిస్తున్నామా అనేది జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

సరే, ఇక్కడ కాబిల్, హాబిల్ ని హతమార్చేశాడు. హతమార్చిన తర్వాత, మొదటిసారి ఒక వ్యక్తి ప్రాణము పోయింది, అక్కడ శవం మిగిలింది. ఆ శవాన్ని ఇప్పుడు ఏమి చేయాలి? ఇంతవరకు, ఒకరి మరణం కూడా సహజంగా సంభవించలేదు కాబట్టి, ఎవరికీ తెలియదు మరణించిన వ్యక్తికి ఏమి చేయాలి అనేది. అతనికి కూడా తోచలేదు ఏమి చేయాలి అనేది. అతను ఏం చేశాడు, తన తమ్ముని శవాన్ని భుజాన వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, అతనికి అర్థం కావటం లేదు.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కాకిని పంపించాడు. ఒక కాకి వచ్చింది. అది భూమి మీద దిగి కాళ్ళతో మట్టిని తవ్వ సాగింది. మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో, ఐదవ అధ్యాయం, 31వ వాక్యంలో ఈ విషయాన్ని తెలియజేశాడు:

فَبَعَثَ اللَّهُ غُرَابًا يَبْحَثُ فِي الْأَرْضِ لِيُرِيَهُ كَيْفَ يُوَارِي سَوْءَةَ أَخِيهِ
ఆ తరువాత సోదరుని శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించటానికి అల్లాహ్‌ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. (5:31)

ఒక కాకిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పంపాడు. అది నేల మీద దిగి త్రవ్వ సాగింది. తన తమ్ముని శవాన్ని ఎలా కప్పి పెట్టాలో అతనికి నేర్పించటానికి అని చెప్పబడింది మిత్రులారా. కొంతమంది ధార్మిక పండితులు ఈ వాక్యాన్ని వివరిస్తూ ఏమని చెప్పారంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా రెండు కాకిల్ని పంపించాడు, ఆ రెండు కాకులు పరస్పరం గొడవ పడ్డాయి, ఒక కాకి మరొక కాకిని చంపేసింది. చనిపోయిన ఆ కాకిని, బతికి ఉన్న ఆ కాకి తన కాళ్ళతో మట్టి తవ్వి, ఆ కాకి మరణించిన కాకిని ఆ గుంతలోకి తోసేసి, దానిపైన మళ్ళీ మట్టి కప్పేసింది. ఇది అంతా ఆ కాబిల్ ముందరే జరిగింది. అది చూసి, కాబిల్ తల పట్టుకొని, “అయ్యో, ఈ కాకికి ఉన్నంత జ్ఞానము కూడా నాకు లేకపోయేనే, నా తమ్ముని శవాన్ని ఏమి చేయాలో నాకు అర్థం కాకపోయేనే” అని అతను, ఆ తర్వాత భూమిలో గుంత తవ్వి, తన తమ్ముని శవాన్ని భూమిలో కప్పేశాడు.

ఆ విధంగా మిత్రులారా, కాబిల్ తన తమ్ముడు హాబిల్ ని చంపి, హత్య చేసి, భూమిలో పాతిపెట్టేశాడు. నేరం జరిగింది కదా, తప్పు చేశాడు కదా! ఇక తల్లిదండ్రుల ముందర వెళ్లి, అక్క చెల్లెళ్ళ, తమ్ముళ్ళ ముందర తలెత్తుకొని తిరగగలడా? తిరగలేడు. కాబట్టి, అప్పుడు అతను ఏం చేశాడంటే, తల్లిదండ్రుల వద్ద నుంచి దూరంగా వెళ్లిపోయి స్థిరపడిపోయారు. మిత్రులారా, అతను వెళ్లి దూరంగా స్థిరపడిపోయాడు. ఇన్ షా అల్లాహ్, ఆ తర్వాత ఏమి జరిగింది అన్న విషయం తర్వాత తెలుసుకుందాం.

ఇక్కడ ఉన్న మన ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం మరియు వారి సంతానము అందరూ కలిసిమెలిసి నివసిస్తూ ఉన్నారు. ఆదం అలైహిస్సలాం వారి వయస్సు 940 సంవత్సరాలకు చేరింది. అప్పుడు దైవదూతలు మనిషి ఆకారంలో భూమి మీదకి దిగారు.

ఆ రోజు జరిగిన విషయం ఏమిటంటే, ఆదం అలైహిస్సలాం తన బిడ్డల్ని పిలిచి, “బిడ్డలారా, నాకు కొన్ని పండ్లు తినాలని అనిపిస్తుంది, మీరు వెళ్లి కొన్ని పండ్లు తీసుకొని రండి” అంటే, బిడ్డలు తండ్రి కోసము పండ్లు తీసుకురావటానికి బయలుదేరారు. అంతలోనే అటువైపు నుంచి దైవదూతలు మనిషి ఆకారంలో, ఖనన వస్త్రాలు, శవ వస్త్రాలు తీసుకొని, అలాగే సువాసనలు తీసుకొని వస్తూ ఉన్నారు. వారికి ఎదుటపడి, “ఎక్కడికి మీరు వెళ్తున్నారు?” అని ప్రశ్నిస్తే, “మా తండ్రి కోసము పళ్ళు ఫలాలు తీసుకురావడానికి వెళ్తున్నాము” అంటే, అప్పుడు దూతలు అన్నారు, “లేదండి, మీ తండ్రి వద్దకు వెళ్ళండి, మీ తండ్రి మరణ సమయము సమీపించింది” అని వారు పంపించేశారు.

ఆ తర్వాత దైవదూతలు, ఆదం అలైహిస్సలాం వారి వద్దకు వచ్చారు. “మీ సమయం ముగిసింది, మీ ఆయుష్షు పూర్తయ్యింది. ఇక పదండి, మీకు ఇప్పుడు మరణం సంభవిస్తుంది” అంటే, ఆదం అలైహిస్సలాం వారు అన్నారు, “అదేంటండి, నాకు 940 సంవత్సరాలే కదా, ఇంకా 60 సంవత్సరాలు నా ఆయుష్షు మిగిలి ఉంది కదా! అప్పుడే మీరు వచ్చేసారు ఏమిటి?” అని ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు దైవదూతలు ఆయనకు జరిగిన సంఘటన తెలిపారు, “ప్రారంభంలో, మీ ఒక బిడ్డ ఆయుష్షు 40 సంవత్సరాలే అని మీకు తెలిసినప్పుడు, మీరు మీ ఆయుష్షులో నుంచి 60 సంవత్సరాలు అతని ఆయుష్షులో కలపండి అని చెప్పారు కదా! కాబట్టి మీ ఆయుష్షులో నుంచి 60 సంవత్సరాలు తీసి అతనికి ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మీ ఆయుష్షు 940 సంవత్సరాలే, అది పూర్తి అయిపోయింది” అని చెప్పారు. మిత్రులారా, ఈ విషయం చెప్పి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఆది మానవుడు కూడా మరిచిపోయాడు, మనుష్యుల్లో కూడా మరిచిపోవటం అనేది ఒక సహజ లక్షణం” అన్నారు.

ఆ తర్వాత మిత్రులారా, దైవదూతలు ఆదం అలైహిస్సలాం వారి ప్రాణము తీయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, హవ్వా అలైహస్సలాం ఏడవడం ప్రారంభించారు. హవ్వా అలైహస్సలాం ఏడుస్తూ ఉంటే, ఆది మానవుడు ఆమెకు చెప్పారు, “లేదు, నాకు దూతలతో పాటు వదిలేయండి” అని చెప్పేశారు. ఆ తర్వాత దైవదూతలు ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారి ప్రాణాలు తీశారు. ఆ తర్వాత, దైవదూతలే ఆదం అలైహిస్సలాం వారికి స్నానము చేయించారు, శవ వస్త్రాలు తొడిగించారు, సువాసనలు పూశారు, భూమి తవ్వి, ఆ తర్వాత ఆదం అలైహిస్సలాం వారికి అక్కడ ఖనన సంస్కారాలు చేయించి, “మానవులారా, మీలో ఎవరైనా మరణిస్తే, ఇదే విధంగా మీరు ఖనన సంస్కారాలు చేసుకోవాలి” అని దైవదూతలు అక్కడ ఉన్న ఆదం అలైహిస్సలాం వారి సంతానానికి నేర్పించి వెళ్లిపోయారు.

మిత్రులారా, ఈ విధంగా ఆదం అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర పూర్తయింది. ఆ తర్వాత విషయాలు వచ్చే ఎపిసోడ్లలో ఇన్ షా అల్లాహ్ ఆ భాగాలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ దైవ ప్రవక్తల జీవితాలను తెలుసుకొని, మన భక్తిని పెంచుకొని, దైవ విధేయులుగా, భక్తులుగా జీవించే భాగ్యం ప్రసాదించు గాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఆదం (అలైహిస్సలాం) జీవిత చరిత్ర (పార్ట్ 3)ఆదం (అలైహిస్సలాం) జీవిత పాఠాలు
https://www.youtube.com/watch?v=HWwkHE2iErQ
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిదహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఆదం (అలైహిస్సలం) జీవిత చరిత్ర నుండి నేర్చుకోవలసిన పాఠాలు వివరించబడ్డాయి. మొదటిది, మానవుని సృష్టి – అల్లాహ్ తన స్వహస్తాలతో, తన ఆత్మను ఊది, జ్ఞానాన్ని ప్రసాదించి మానవుడిని సృష్టించాడు, ఇది ఇతర సృష్టితాలపై మానవుని ఆధిక్యతను సూచిస్తుంది. రెండవది, అహంకారం యొక్క పరిణామం – షైతాన్ తన అహంకారం కారణంగా శపించబడి స్వర్గం నుండి బహిష్కరించబడ్డాడు. అహంకారం సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా చూడటమేనని, ఇది వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించబడింది. మూడవది, షైతాన్ మానవుని బహిరంగ శత్రువు అని, అతను ఎల్లప్పుడూ చెడు మరియు నీతిబాహ్యత వైపు ప్రేరేపిస్తాడని, అతని పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించబడింది. నాలుగవది, అల్లాహ్ దయ మరియు క్షమాపణ – ఆదం (అలైహిస్సలం) తప్పు చేసి పశ్చాత్తాపపడగా, అల్లాహ్ క్షమించాడు. అల్లాహ్ నిరంతరం క్షమాపణను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడని, కాబట్టి మనం ఎల్లప్పుడూ పశ్చాత్తాపపడాలని బోధించబడింది. చివరిగా, మొదటి నేరమైన హత్య గురించి చర్చిస్తూ, ఒక చెడు మార్గాన్ని ప్రారంభించిన వ్యక్తి, ఆ మార్గాన్ని అనుసరించేవారి పాపంలో కూడా భాగస్వామి అవుతాడని, కాబట్టి చెడుకు దూరంగా ఉండాలని నొక్కి చెప్పబడింది.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, “ఆదం అలైహిస్సలాం జీవిత పాఠాలు” అనే నేటి ప్రసంగ అంశానికి మిమ్మల్నందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అభిమాన సోదరులారా, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర చదివి లేక విని మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి.

ముందుగా మనం తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే, మానవుని పుట్టుక ఎలా జరిగింది? నేడు ప్రపంచంలో మానవుడు కోతి జాతి నుండి అభివృద్ధి చెందిన జీవి అని ప్రచారం చేయబడి ఉంది. మరికొందరైతే సముద్రం నుండి బయటకు వచ్చిన ఒక జీవి క్రమంగా అభివృద్ధి చెందుతూ మానవునిగా రూపం దాల్చింది అని ప్రచారం చేస్తున్నారు. ఇలా రకరకాలుగా మానవుని పుట్టుక గురించి ప్రచారాలు ప్రపంచంలో జరిగి ఉన్నాయి. అయితే అభిమాన సోదరులారా, వాస్తవం ఏమిటంటే, ఇవన్నీ కేవలం మానవుని ఊహా కల్పితాలు మాత్రమే. మనిషి పుట్టుక ఎలా జరిగింది అనేది మనిషిని మరియు మొత్తం ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఏమి చెబుతున్నాడో తెలుసుకుంటే, మనిషి పుట్టుక ఎలా జరిగింది అన్న విషయం స్పష్టమవుతుంది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా యొక్క నైజం ఏమిటంటే, ఆయన ఏదైనా ఒక వస్తువుని తయారు చేయదలిస్తే, కేవలం అతను నోటితో “కున్” అనగా “అయిపో” అని చెప్పగానే అది అయిపోతుంది. ఈ విషయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ లో 36వ అధ్యాయం, 82వ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు.

إِنَّمَا أَمْرُهُ إِذَا أَرَادَ شَيْئًا أَنْ يَقُولَ لَهُ كُنْ فَيَكُونُ
ఆయన ఎప్పుడైనా, ఏదైనా వస్తువును చేయ సంకల్పించుకుని ‘అయిపో’ అని ఆదేశించగానే అది అయిపోతుంది. (36:82)

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవుడిని సృష్టించాడు. మానవుడిని కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కేవలం నోటితో “కున్ (అయిపో)” అని చెప్పేస్తే మానవుడు కూడా సృష్టించబడేవాడే. కానీ అలా చేయలేదండి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవుడిని సృష్టించటానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని, భూమండలం మీద ఉన్న రకరకాల మట్టి నమూనాలను సేకరించి, తన స్వహస్తాలతో మానవ ఆకారాన్ని రూపుదిద్దాడు.

మిత్రులారా, ఖుర్ఆన్ లోని 38వ అధ్యాయం 75వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

خَلَقْتُ بِيَدَيَّ
నేను నా స్వహస్తాలతో సృష్టించాను. (38:75)

అలాగే మరోచోట 15వ అధ్యాయం, 29వ వాక్యంలో తెలియజేశాడు:

وَنَفَخْتُ فِيهِ مِنْ رُوحِي
నేను మానవునిలో నా ఆత్మను ఊదాను. (15:29)

అలాగే మరొకచోట మానవుని గురించి రెండవ అధ్యాయం 31వ వాక్యంలో తెలియజేస్తున్నాడు:

وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا
ఆది మానవుడైన ఆదంకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వస్తువులన్నింటి పేర్లు నేర్పాడు. విద్యాబోధన స్వయంగా అల్లాహ్ చేశాడు. (2:31)

ఏ మానవునికైతే అల్లాహ్ తన స్వహస్తాలతో సృష్టించాడో, తన ఆత్మను ఊదాడో, తానే స్వయంగా విద్యాబోధన చేశాడో, అలాంటి మానవుడిని పట్టుకొని, కోతితో అభివృద్ధి చెందిన జీవి అని చెప్పటము లేదా సముద్రం నుంచి బయటికి వచ్చిన జీవి అని చెప్పటము, ముమ్మాటికీ ఇది మానవజాతిని కించపరచటమే సోదరులారా. వాస్తవం ఏమిటంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రపంచంలో ఉన్న జీవులన్నింటిలో మానవుడిని ఉత్తమ జీవిగా, శ్రేష్టమైన జీవిగా చేశాడు.

ఒక ఆది మానవుడే కాదు, ఆ ఆది మానవుడి సంతానమైన మానవులందరికీ కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇతర జాతుల మీద గౌరవ స్థానం కల్పించాడండి. ఈ విషయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ లోని 17వ అధ్యాయం 70వ వాక్యంలో తెలియజేశాడు:

وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ وَحَمَلْنَاهُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ وَرَزَقْنَاهُمْ مِنَ الطَّيِّبَاتِ وَفَضَّلْنَاهُمْ عَلَى كَثِيرٍ مِمَّنْ خَلَقْنَا تَفْضِيلًا
మేము ఆదం సంతతికి గౌరవం వొసగాము. వారికి నేలపైనా, నీటిలోనూ నడిచే వాహనాలను ఇచ్చాము. ఇంకా పరిశుద్ధమైన వస్తువులను వారికి ఆహారంగా ప్రసాదించాము. మేము సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము. (17:70)

ఇది చివర్లో చెప్పిన మాట ఒకసారి మనము దయచేసి జాగ్రత్తగా గమనించాలి. అదేమిటంటే, సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము. అంటే, ప్రపంచంలో అల్లాహ్ చే సృష్టించబడిన సృష్టితాలన్నింటి మీద మానవజాతిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆధిక్యతను, గౌరవాన్ని ఇచ్చి ఉన్నాడు కాబట్టి, మనిషి ప్రపంచంలో ఉన్న జీవులన్నింటిలో శ్రేష్టమైన జీవి మరియు అతని పుట్టుక మట్టితో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవ రూపంలోనే తన స్వహస్తాలతో చేశాడన్న విషయం మనము గమనించాలి మిత్రులారా.

అలాగే, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనం తెలుసుకోవలసిన రెండవ విషయం, అహంకార పరిణామం ఎలా ఉంటుంది?

మిత్రులారా, అహంకారం అల్లాహ్ కు నచ్చదు. అహంకారిని అల్లాహ్ ఇష్టపడడు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారి ముందర సాష్టాంగపడండి అని ఆదేశించాడో, అల్లాహ్ ఆదేశాన్ని షైతాన్ శిరసావహించలేదు. ఏమిటయ్యా ఎందుకు నీవు సాష్టాంగపడలేదు అంటే, అతనేమో “నన్ను అగ్నితో సృష్టించావు, మానవుడిని మట్టితో సృష్టించావు, నేను ఉత్తముణ్ణి” అని చెప్పాడు. అంటే, లోలోపల అతను అహంకారానికి గురి అయ్యి, “నేను అగ్నితో తయారు చేయబడిన వ్యక్తిని, గొప్పవాడిని, మానవుడు మట్టితో తయారు చేయబడ్డవాడు అల్పుడు,” అని లోలోపల అహంకారానికి గురి అయ్యి అతను ఆదం అలైహిస్సలాం వారి ముందర సాష్టాంగపడలేదు.

తత్కారణంగా జరిగిన విషయం ఏమిటి? అహంకారం ప్రదర్శించిన కారణంగా అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యాడు. అల్లాహ్ అతనికి ఎంతో గౌరవంగా స్వర్గంలో ప్రసాదించి ఉన్న గౌరవ స్థానాన్ని కోల్పోయాడు. స్వర్గం నుండి ధూత్కరించబడ్డాడు, బహిష్కరించబడ్డాడు. అంటే, అహంకారం వలన మనిషి తన గౌరవ స్థానాలను కోల్పోతాడు, దైవ శిక్షకు గురవుతాడని స్పష్టమవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా తెలియజేశారు:

لَا يَدْخُلُ الْجَنَّةَ مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ ذَرَّةٍ مِنْ كِبْرٍ
[లా యద్ఖులుల్ జన్నత మన్ కాన ఫీ ఖల్బిహి మిస్ఖాలు జర్రతిమ్ మిన్ కిబ్ర్]
ఎవరి హృదయంలోనైనా జొన్నగింజంత అహంకారమున్నా అతను స్వర్గంలోకి ప్రవేశింపజాలడు ( సహీ ముస్లిం)

మరొక ఉల్లేఖనంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం మరియు నరకం గురించి తెలియజేస్తున్నారు. స్వర్గము మరియు నరకం పరస్పరము సంభాషణ చేసుకుంటాయి. స్వర్గంలో ఉన్నవారు ఎవరు, నరకంలో ఉన్నవారు ఎవరు అని పరస్పరము మాట్లాడుకుంటే, అప్పుడు నరకము స్వర్గముతో ఇలా అంటుంది:

فَقَالَتِ النَّارُ فِيَّ الْجَبَّارُونَ وَالْمُتَكَبِّرُونَ
[ఫకాలతిన్నారు ఫియ్యల్ జబ్బారూన వల్ ముతకబ్బిరూన]
నరకం స్వర్గంతో అంటుంది, “నా లోపల అందరూ దౌర్జన్యపరులు మరియు అహంకారులు ఉన్నారండి” అని చెబుతుంది.

అంటే మిత్రులారా, నరకంలో వెళ్ళేవాళ్ళలో అధిక శాతం ప్రజలు ఎవరు ఉంటారంటే, దౌర్జన్యపరులు ఉంటారు మరియు అహంకారులు ఉంటారు. అంటే, అహంకారి నరకానికి వెళ్తాడు, స్వర్గాన్ని కోల్పోతాడని స్పష్టమవుతుంది.

ఈ ఉల్లేఖనాలు విన్న తర్వాత కొంతమందికి ఒక అనుమానం కలుగుతుంది. అదేమిటంటే, ఏమండీ, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రసాదించిన మంచి బట్టలు ధరించటం, మంచి పాదరక్షలు ధరించటం, ఇవి కూడా అహంకారానికి చిహ్నమేనా అని అనుమానం కలిగి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇదే ప్రశ్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఒక వ్యక్తి అడిగాడు. ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు:

إِنَّ الرَّجُلَ يُحِبُّ أَنْ يَكُونَ ثَوْبُهُ حَسَنًا وَنَعْلُهُ حَسَنَةً
ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మనిషి తన బట్టలు మంచివి ఉండాలని, తన పాదరక్షలు కూడా మంచివి ఉండాలని కోరుకుంటాడు. అలా మంచి బట్టలు, మంచి పాదరక్షలు ధరించడము కూడా అహంకారమేనా? అని అడిగితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బదులిచ్చారు:

إِنَّ اللَّهَ جَمِيلٌ يُحِبُّ الْجَمَالَ
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అత్యంత సుందరుడు. సుందరమైన వాటిని ఇష్టపడతాడు.

الْكِبْرُ بَطَرُ الْحَقِّ وَغَمْطُ النَّاسِ
అహంకారం దేనిని అంటారంటే, సత్యాన్ని అంగీకరించకుండా ప్రజల్ని చులకనగా చూడటం.

ప్రజల్ని చిన్నచూపుతో చూసే భావం మరియు సత్యాన్ని అంగీకరించకుండా తిరస్కరించే భావాన్ని అహంకారం అంటారు అని చెప్పారు.

మిత్రులారా, పరిశుభ్రంగా ఉంచటం, మంచి బట్టలు ధరించటం, పరిశుద్ధంగా ఉండటం అహంకారము కాదు. కానీ ఒకవేళ బట్టల నుండే, వస్త్రాల నుండే ఎవరైనా అహంకారం ప్రదర్శిస్తే, అది కూడా అహంకారం అనబడుతుంది. ఉదాహరణకు, ముఖ్యంగా పురుషుల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైనా పురుషుడు చీలమండల కింద భూమికి ఆనుతూ బట్టలు ధరించి, గర్వంగా అతను నడిస్తే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని కూడా ఎంత భాగమైతే అతను చీలమండల కిందికి వదిలాడో బట్టల్ని, అంత భాగాన్ని నరకంలో కాల్చుతాడు అని చెప్పారు. మరొక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, పూర్వం ఒక వ్యక్తి తన బట్టల్ను భూమిపై ఈడ్చుకుంటూ గర్వంతో, అహంకారంతో ప్రజల మధ్య నడుస్తూ ఉంటే, అందరూ చూస్తూ ఉండంగానే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని అలాగే భూమిలోకి పాతేశాడు. అల్లాహు అక్బర్. ఈ ఉల్లేఖనాలన్నింటినీ, షైతాను మరియు ఆదం అలైహిస్సలాం వారి వృత్తాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే, మనకు స్పష్టమయ్యే విషయం ఏమిటంటే మిత్రులారా, అహంకారము మానవునికి ఎట్టి పరిస్థితుల్లో తగదు. అహంకారం వల్ల మనిషి తన గౌరవ స్థానాన్ని, అల్లాహ్ అనుగ్రహాలను కోల్పోతాడు, నరకవాసి అయిపోతాడు. కాబట్టి, అహంకారం నుండి దూరంగా ఉండాలి.

అలాగే, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనం గ్రహించవలసిన మరొక విషయం ఏమిటంటే, షైతాన్ మానవుని బహిరంగ శత్రువు. మిత్రులారా, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం విన్నాం, ఎప్పుడైతే ఆదం అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో తప్పు చేసిన తర్వాత క్షమించమని వేడుకున్నారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయ తలచి ఆదం అలైహిస్సలాం వారి తప్పుని మన్నించేశాడు. ఆ విషయాలన్నీ మనము ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో తెలుసుకున్నాం.

అయితే, షైతాన్ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో సవాలు చేశాడు. నేను మళ్ళీ వెళ్లి మానవుని దారిలో కూర్చుండిపోయి, నలువైపుల నుండి అతన్ని నీ మార్గం మీద నడవకుండా పక్కకి దారి తప్పేటట్టు చేసేస్తాను అని సవాలు విసిరి వచ్చాడు. మిత్రులారా, అతను సవాలు విసిరి వస్తే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులను హెచ్చరించాడు. ఏమన్నాడు?

وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ
షైతాన్‌ అడుగుజాడలలో మాత్రం నడవకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. [2:168]

మానవులారా, మీరు షైతాను అడుగుజాడలలో నడవకండి, వాడు మీకు బహిరంగ శత్రువు అని చెప్పారు. మిత్రులారా, షైతాన్ మానవునికి బహిరంగ శత్రువు. అతను మానవునికి ఏమంటాడు, ఏ పనులు చేయమంటాడు, అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ లో తెలియజేశాడు. ఖుర్ఆన్ లోని రెండవ అధ్యాయం, 169వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు:

إِنَّمَا يَأْمُرُكُمْ بِالسُّوءِ وَالْفَحْشَاءِ وَأَنْ تَقُولُوا عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
వాడు మిమ్మల్ని కేవలం చెడు వైపుకు, నీతి బాహ్యత వైపుకు పురికొల్పుతాడు. ఏ విషయాల జ్ఞానం మీకు లేదో వాటిని అల్లాహ్‌ పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తాడు. (2:169)

అనగా, కేవలం చెడు వైపుకు, నీతిబాహ్యత వైపుకు పురికొల్పుతాడు ఆ షైతాన్. కాబట్టి, మీరు జాగ్రత్తపడండి. ఎందుకంటే, అతను మీకు తెలియని వాటిని అల్లాహ్ పేరుతో చెప్పండి అని ఆజ్ఞాపిస్తాడు. నీతిబాహ్యమైన పనులు చేయమని, తెలియని విషయాలు అల్లాహ్ చెప్పాడు అని చెప్పమని అతను ఆజ్ఞాపిస్తాడు కాబట్టి, షైతాను మాటల్లో పడకుండా జాగ్రత్త పడండి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులను హెచ్చరించి ఉన్నాడు.

మిత్రులారా, షైతాన్ ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారిని తప్పు చేయించి స్వర్గం నుండి బహిష్కరణకు గురయ్యేటట్టు చేశాడు. మన నుండి కూడా తప్పులు చేయించి, మనల్ని కూడా స్వర్గానికి చేరకుండా నరకానికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు కాబట్టి, షైతాన్ మన శత్రువు అన్న విషయము తెలుసుకొని, మనసులో అతను కలిగించే ఆలోచనలకు మనము గురికాకుండా జాగ్రత్త పడాలి.

అలాగే, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనం గ్రహించవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయామయుడు. ఆయన ఎంత గొప్ప దయ కలిగినవాడంటే మిత్రులారా, మనిషి వల్ల తప్పు దొర్లితే, తప్పు దొర్లిన తర్వాత మానవుడు అల్లాహ్ సన్నిధిలో క్షమాభిక్ష వేడుకుంటే, పశ్చాత్తాపపడితే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన దయతో మనిషి పశ్చాత్తాపాన్ని ఆమోదించి, అతని పాపాన్ని తుడిచేస్తాడు, మన్నించేస్తాడు, క్షమించేస్తాడు.

మిత్రులారా, ఆదం అలైహిస్సలాం వారు కూడా షైతాను మాటల్లో పడి, అతను చెప్పిన మాటల్ని నమ్మి, నిషేధించిన వృక్ష ఫలాన్ని తిని, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పెట్టిన నిబంధనను అతిక్రమించారు కాబట్టి, ఆయనతో కూడా పొరపాటు జరిగింది. ఆయనతో పొరపాటు దొర్లిన తర్వాత, ఆయన ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో క్షమాభిక్ష వేడుకున్నారు. ఆయన క్షమాభిక్ష వేడుకుంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనను మన్నించాడు. ఈ రెండు విషయాలు కూడా ఖుర్ఆన్ లో తెలుపబడి ఉన్నాయి. ఖుర్ఆన్ లోని ఏడవ అధ్యాయం, 23వ వాక్యంలో, ఏ పలుకులు తీసుకొని ఆదం అలైహిస్సలాం అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుకున్నారని తెలుపబడింది:

رَبَّنَا ظَلَمْنَا أَنْفُسَنَا وَإِنْ لَمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
వారిద్దరూ, “మా ప్రభూ! మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి, మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము” అని వేడుకున్నారు. (7:23)

ఈ పలుకులతో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారి సన్నిధిలో క్షమాభిక్ష వేడుకోగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిని మన్నించేశాడు. మన్నించేశాడన్న విషయం కూడా తెలియజేసి ఉన్నాడు, రెండవ అధ్యాయం, 37వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

فَتَابَ عَلَيْهِ
ఆదం అలైహిస్సలాం క్షమాభిక్ష వేడుకుంటే, “ఫతాబ అలైహి“, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన తోబాను, పశ్చాత్తాపాన్ని ఆమోదించి, ఆయనను క్షమించేశాడు.

మిత్రులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనంలో ఈ విధంగా తెలుపబడింది:

إِنَّ اللَّهَ يَبْسُطُ يَدَهُ بِاللَّيْلِ لِيَتُوبَ مُسِيءُ النَّهَارِ، وَيَبْسُطُ يَدَهُ بِالنَّهَارِ لِيَتُوبَ مُسِيءُ اللَّيْلِ، حَتَّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا
[ఇన్నల్లాహ యబ్ సుతు యదహు బిల్ లైలి లియతూబ ముసి ఉన్నహార్, వయబ్ సుతు యదహు బిన్నహారి లియతూబ ముసి ఉల్ లైల్, హత్తా తత్లుఅష్షమ్సు మిమ్ మగ్రిబిహా]

అనగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా రాత్రంతా చేయి చాచి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరి కోసం అండి? ఉదయం పూట తప్పు చేసిన వారు రాత్రి తప్పును గ్రహించి అల్లాహ్ తో క్షమాభిక్ష వేడుకుంటారేమో, వారిని మన్నించేద్దాము అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతులు చాచి మరి ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే, పగలంతా కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతులు చాచి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరి కోసం అంటే, రాత్రి పూట తప్పులు చేసిన వారు బహుశా ఉదయాన్నే తప్పును గ్రహించి అల్లాహ్ తో క్షమాభిక్ష వేడుకుంటారేమో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిని క్షమించటానికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, సూర్యుడు పడమర దిక్కు నుంచి ఉదయించే రోజు వచ్చేంతవరకు కూడా ఇదే విధంగా భక్తుల పాపాలను మన్నించటానికి రేయింబవళ్ళు ఎదురు చూస్తూ ఉంటాడు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అల్లాహు అక్బర్. ఎంత దయామయుడండి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా! మన్నించటానికి, క్షమించటానికి రేయింబవళ్ళు ఆయన ఎదురు చూస్తూ ఉంటే, తప్పులు చేసే మనము అల్లాహ్ తో క్షమాభిక్ష వేడుకోవటానికి ఆలస్యం ఎందుకు చేయాలి మిత్రులారా? వెంటనే మనము కూడా అల్లాహ్ సన్నిధిలో క్షమాభిక్ష వేడుకుంటూ ప్రతిరోజు గడపాలి. ఎందుకంటే, మనం ప్రతిరోజు తప్పులు దొర్లుతూనే ఉంటాయి కాబట్టి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఉల్లేఖనంలో ఇలా తెలుపబడింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలుపుతున్నారు:

يَا أَيُّهَا النَّاسُ تُوبُوا إِلَى اللَّهِ فَإِنِّي أَتُوبُ فِي الْيَوْمِ إِلَيْهِ مِائَةَ مَرَّةٍ
ఓ మానవులారా, మీరు అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాప పడండి. నేను కూడా ప్రతిరోజు అల్లాహ్ సమక్షంలో 100 సార్లు పశ్చాత్తాప పడతాను అని చెప్పారు.

అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తప్పులు చేయరండి ఆయన. తప్పులు చేయకపోయినా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారి సన్నిధిలో ఆయన 100 సార్లు క్షమాభిక్ష వేడుకుంటున్నారు ప్రతిరోజు అంటే, అడుగడుగునా తప్పులు చేసే మనము అల్లాహ్ తో ఎన్ని సార్లు క్షమాభిక్ష వేడుకోవాలి, పశ్చాత్తాప పడాలి, గమనించండి మిత్రులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేశారు, ఆయన ఏమన్నారంటే:

كُلُّ بَنِي آدَمَ خَطَّاءٌ وَخَيْرُ الْخَطَّائِينَ التَّوَّابُونَ
ప్రతి మానవుడు తప్పు చేస్తాడు. అయితే తప్పు చేసిన వాళ్ళలో క్షమాభిక్ష వేడుకున్నవాడు ఉత్తముడు అని చెప్పారు.

కాబట్టి మిత్రులారా, నాతో, మనందరితో తప్పులు దొర్లుతూనే ఉంటాయి. అయితే మన బాధ్యత ఏమిటంటే, మనము వెంటనే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో పశ్చాత్తాపపడి క్షమాభిక్ష వేడుకోవాలి. ఆది మానవునితో కూడా తప్పు జరిగింది, ఆయన కూడా క్షమాభిక్ష వేడుకున్నారు. ఆదిమానవుని సంతానమైన మనతో కూడా తప్పులు దొర్లుతాయి, మనము కూడా క్షమాభిక్ష వేడుకుంటూనే ఉండాలి.

ఇక ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనం గ్రహించవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదటి నేరం ఎవరు చేశారు? మొదటి నేరం చేసిన కారణంగా, దాని దుష్ప్రభావం అతనిపై ఎలా పడుతూ ఉంది?

మిత్రులారా, ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం విన్నాం, ఆదం అలైహిస్సలాం వారి ఇద్దరు కుమారులు హాబిల్ మరియు కాబిల్ మధ్య వివాహ విషయంలో గొడవ జరిగింది. అయితే, కాబిల్ అన్యాయంగా, దౌర్జన్యంగా, మొండిపట్టు పట్టి, చివరికి తన సోదరుడైన హాబిల్ ని హతమార్చేశాడు.

మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

لَا تُقْتَلُ نَفْسٌ ظُلْمًا إِلَّا كَانَ عَلَى ابْنِ آدَمَ الْأَوَّلِ كِفْلٌ مِنْ دَمِهَا لِأَنَّهُ كَانَ أَوَّلَ مَنْ سَنَّ الْقَتْلَ
ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ, ఎక్కడైనా అన్యాయంగా ఒక మనిషి ప్రాణం తీయబడింది, హత్య చేయబడింది అంటే, ఆ హత్య యొక్క పాపములోని ఒక భాగము కాబిల్ ఖాతాలోకి కూడా చేరుతుంది.

ఎందుకంటే, ప్రపంచంలో హత్య అనే ఒక నేరాన్ని ప్రారంభించి మానవులకు అతనే చూపించాడు కాబట్టి, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ అయితే హత్యలు జరుగుతాయో, హత్య చేసిన వారికి కూడా పాపము ఉంటుంది, ఆ హత్య ప్రపంచానికి నేర్పించిన కాబిల్ కి కూడా ఆ నేరములోని పాప భాగము చేరుతుంది అని చెప్పారు.

మిత్రులారా, అందుకోసమే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు హెచ్చరించారు:

وَمَنْ دَعَا إِلَى ضَلَالَةٍ كَانَ عَلَيْهِ مِنَ الْإِثْمِ مِثْلُ آثَامِ مَنْ تَبِعَهُ، لَا يَنْقُصُ ذَلِكَ مِنْ آثَامِهِمْ شَيْئًا
అనగా, ఎవరైనా ఒక వ్యక్తి ప్రజలను మార్గభ్రష్టత్వానికి గురిచేసే ఏదైనా ఒక కార్యం నేర్పిస్తే, ఆ మార్గంలో ఎంతమంది అయితే నడుచుకొని పాపానికి పాల్పడతారో, వారికి కూడా పాపము ఉంటుంది, ఆ మార్గము చూపించిన వ్యక్తికి కూడా ఆ పాపము యొక్క భాగము చేరుతుంది అని చెప్పారు.

మిత్రులారా, ఈ విధంగా ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనము అనేక విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అవన్నీ మనము ఒక్కొక్కటిగా నేర్చుకొని, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో భయపడుతూ, పశ్చాత్తాపపడుతూ, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ జీవితం గడిపే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=15524

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ఖదీజా బిన్త్ ఖువైలిద్ (రదియల్లాహు అన్హా) గారి జీవిత చరిత్ర (సీరత్) [వీడియో]

బిస్మిల్లాహ్

మొదటి భాగం

[47 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్

రెండవ భాగం

[52 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్

ఇతరములు: 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎందుకు ఎక్కువ మంది భార్యలున్నారు? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎందుకు ఎక్కువ మంది భార్యలున్నారు?
https://youtu.be/XPzalQiVVY4 [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బహుళ వివాహాల గురించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. మొత్తం 11 మంది భార్యలు ఉన్నారని, వారిలో ఇద్దరు ఆయన జీవితకాలంలోనే మరణించారని, ఆయన మరణించే సమయానికి తొమ్మిది మంది ఉన్నారని వక్త స్పష్టం చేశారు. ఈ వివాహాలు అల్లాహ్ యొక్క ప్రత్యేక అనుమతితో జరిగాయని, దీనికి సూరతుల్ అహ్‌జాబ్‌లో ప్రమాణం ఉందని వివరించారు. ఈ వివాహాల వెనుక ఉన్న అనేక కారణాలను ఆయన వివరించారు: స్త్రీలకు ఆదర్శవంతమైన జీవితాన్ని తెలియజేయడం, వైవాహిక జీవితంలోనూ ఆయన ఒక ఉత్తమ ఆదర్శంగా నిలవడం, వివిధ వంశాలు మరియు వర్గాల మధ్య సంబంధాలను బలపరచడం, మరియు ఇస్లాం యొక్క గొప్పతనాన్ని, శత్రువుల పట్ల కూడా గౌరవప్రదంగా వ్యవహరించే తీరును తెలియజేయడం వంటివి ముఖ్యమైనవి. ఇది ఇస్లాం యొక్క విశ్వజనీన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొత్తం భార్యలు 11. అయితే తమ జీవితంలో ఇద్దరు భార్యలు చనిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే సందర్భంలో తొమ్మిది భార్యలు వారి వద్ద ఉన్నారు.

అయితే, ప్రవక్తకు నలుగురి కంటే ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకునే అటువంటి అనుమతి, అర్హత స్వయంగా నిజ సృష్టికర్త అయిన మనందరి ఆరాధ్యుడైన అల్లాహ్ ప్రసాదించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెళ్లిళ్లు చేసుకున్నారు. దీని యొక్క వివరణ సూరతుల్ అహ్‌జాబ్‌లో చూడవచ్చును. సూరా నెంబర్ 33, మరి ఇందులో ప్రత్యేకంగా ఎక్కడైతే అల్లాహ్ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒకరి కంటే ఎక్కువగా భార్యలు చేసుకునే అటువంటి అనుమతి ఇచ్చాడో, ఆయతు నెంబర్ 28 నుండి సుమారు సుమారు 35 వరకు మరియు ఆ తర్వాత ఒక రెండు ఆయతులు కూడా మీరు చూశారంటే దీనికి సంబంధించిన ఎన్నో లాభాలు మనకు ఏర్పడతాయి.

సంక్షిప్తంగా మనం చెప్పుకోవాలంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం పురుషులకే ప్రవక్త కారు, స్త్రీలకు కూడాను. అయితే, ప్రవక్త వారి ఆదర్శ జీవితం పురుషులకు ఎంత అవసరమో, అలాగే స్త్రీలకు కూడా అవసరం. ఒకరి కంటే, నలుగురి కంటే ఎక్కువ భార్యల ద్వారా ఇలా ప్రవక్త వారి ఆదర్శవంతమైన జీవితాన్ని తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేయడానికి మంచి సహకారం ఏర్పడుతుంది.

రెండవ విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన అందరి కొరకు ఒక ఉత్తమ ఆదర్శం అని ఇదే సూరతుల్ అహ్‌జాబ్‌లో కూడా అల్లాహ్ మనకు తెలియజేశాడు. అయితే, ఈ ఆదర్శం కేవలం మస్జిద్ వరకు, బయట బజారు వరకు, యుద్ధాల్లోనే కాదు, వైవాహిక జీవితంలో, ఫ్యామిలీ లైఫ్‌లో కూడా. అంతేకాదు, ఇంకా మనం కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే, మానవుల్లో, సమాజంలో విద్యా రీత్యా గానీ, బుద్ధి జ్ఞానాల పరంగా గానీ, విషయాలు నేర్చుకుని ఆచరించే పరంగా గానీ, సమాజంలో ప్రజలు ఏ తారతమ్యాలు ఏర్పాటు చేసుకుంటారో దాని పరంగా గానీ వేరువేరుగా ఉంటారు గనుక, వేరువేరు వంశాలకు సంబంధించిన భార్యలు ప్రవక్త దగ్గర ఉండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉత్తమ ఆదర్శాన్ని అందరికీ తెలియజేయడానికి.

అంతే కాదు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా వచ్చారు. సర్వ మానవాళిలో ప్రత్యేకంగా ఆ కాలంలో బహుదైవారాధకుల రూపంలో, యూదుల రూపంలో, క్రైస్తవుల రూపంలో ఎందరో అక్కడ నాయకులు ఉన్నారు. అయితే, ఆ నాయకుల యొక్క బిడ్డలు సైతం ఎప్పుడైతే యుద్ధంలో బానిసరాళ్లుగా వచ్చారో, వారికి వారి హోదా, అంతస్తు ప్రకారంగా వారి యొక్క తండ్రులకు ఇస్లాం యొక్క గొప్పతనం తెలిసిరావాలి, ‘నా బిడ్డలు బానిసరాళ్లు అయ్యారు’ అన్నటువంటి అవమానంతో ఇస్లాం పట్ల మరింత వారి యొక్క హృదయాలలో ఏ చెడు చేసుకోకూడదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి బిడ్డలను వివాహం చేసుకున్నారంటే, ఇస్లాం యొక్క గొప్ప నాయకుల వద్ద నా బిడ్డలు ఒక మహారాణిగా ఉన్నారు అన్నటువంటి సంతోషంతో వారు కూడా ఇస్లాంకు మరింత దగ్గరగా అయ్యారు.

ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉర్దూ తెలిసిన వారు మౌలానా సయ్యద్ సులేమాన్ మన్సూర్‌పురి రహ్మతుల్లాహి అలైహి వారి ‘రహ్మతున్ లిల్ ఆలమీన్’ పుస్తకంలో దీని యొక్క వివరాలను కూడా ఇన్షా అల్లాహ్ చూడగలుగుతారు. ఈ సమాధానం సరిపోతుందని ఆశిస్తున్నాను.

ఇతరములు: 

మద్రాస్ ప్రసంగాలు – ప్రవక్త ﷺ జీవితచరిత్రకు సంబంధించిన వివిధ కోణాలపై 8 ఖుత్బాలు
అల్లామా సయ్యిద్ సులైమాన్ నద్వీ
https://teluguislam.net/2021/12/01/madras-prasangalu/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అనువాదం : ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అనువాదం : ముహమ్మద్ నసీరుద్దీన్

ప్రవక్త ﷺ గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 12: ప్రవక్త ﷺ గురించి ఎవరేమన్నారు? [వీడియో]

బిస్మిల్లాహ్

[14:28 నిముషాలు]

సీరత్ పాఠాలు – 12: ప్రవక్త ﷺ గురించి ఎవరేమన్నారు?

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [14:27 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గురించి ఎవరేమన్నారు?

కొందరు తత్వవేత్తలు, ఇస్లాం స్టడీ చేసిన పాశ్చాత్య నిపుణులు (orientalists) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇచ్చిన స్టేట్ మెంట్స్ తెలుపుతున్నాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్పతనాన్ని, ఆయన ప్రవక్తపదవిని, ఆయన ఉత్తమ గుణాలను వారు ఒప్పుకున్న విషయాల్ని స్పష్టం చేస్తున్నాము. కొందరు ఇస్లామీయ విరోధులు, శత్రువులు చేస్తున్న దుష్ప్రచారానికి, పక్షపాతానికి ఈ ఇస్లాం ధర్మం దూరంగా ఉంది అని వారు తెలిపిన ఇస్లాం ధర్మ వాస్తవికతలను మీ ముందుంచుతున్నాము. (అయితే ఇస్లాంగానీ, ప్రవక్తగానీ వారి ప్రశంసలకు, సాక్ష్యాలకు ఆధారపడిలేరు. మరి ఇవి తెలిపే కారణం ఏమిటంటే; ఇస్లాంను అర్థం చేసుకోకుండా, దానిని చెడుగా భావించేవారు, వారి వంశం, లేదా వారి లాంటి మతాలపై ఉన్నవారిలో కొందరు ఇస్లాంను చదివి ఎలా అర్థం చేసుకున్నారో అదే విధంగా ఇస్లాం అధ్యాయనం చేసి, న్యాయంపై ఉండాలన్నదే మా ఉద్దేశం).

జోర్జ్ బర్నార్డ్ షా:

George Bernard Shaw. జననం 26/7/1856.
మరణం 2/11/1950. జన్మ స్థలం Ireland.

జోర్జ్ బర్నార్డ్ షా తన రచన “ముహమ్మద్”లో (బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని కాల్చేసింది) ఇలా వ్రాశాడుః “ఈ నాటి సమాజానికి ముహమ్మద్ లాంటి మేధావి అవసరం చాలా ఉంది. ఈ ప్రవక్త ఎల్లప్పుడూ తన ధర్మాన్ని గౌరవ స్థానంలో ఉంచాడు. ఆయన తీసుకొచ్చిన ధర్మం ఇతర నాగరికతలను అంతమొందించే అంతటి శక్తి గలది. శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండునది. నా జాతి వాళ్ళల్లో చాలా మంది స్పష్టమైన నిదర్శనంతో ఈ ధర్మంలో ప్రవేశిస్తున్నది నేను చూస్తున్నాను. సమీపం లోనే ఈ ధర్మం యూరపు ఖండంలో విశాలమైన చోటు చేసుకుంటుంది”.

ఇంకా ఇలా వ్రాశాడు: “అజ్ఞానం, లేదా పక్షపాతం వల్ల మధ్య శతాబ్థి (Middle Ages) లోని క్రైస్తవ మత పెద్దలు ముహమ్మద్ తీసుకొచ్చిన ధర్మాన్ని అంధవికారంగా చిత్రీకరించి, అది క్రైస్తవ మతానికి శత్రువు అని ప్రచారం చేశారు. కాని నేను ఈ వ్యక్తి (ముహమ్మద్) గురించి చదివాను. అతను వర్ణనాతీతమైన, అపరూపమైన వ్యక్తి. ఆయన క్రైస్తవమతానికి శత్రువు ఎంత మాత్రం కారు. ఆయన్ను మానవ జాతి సంరక్షకుడని పిలవడం తప్పనిసరి. నా దృష్టిలో ఆయన గనక నేటి ప్రపంచ పగ్గాలు తన చేతిలో తీసుకుంటే మన సమస్యల పరిష్కార భాగ్యం ఆయనకు లభిస్తుంది. నిజమైన శాంతి, సుఖాలు ప్రాప్తమవుతాయి. అవి పొందడానికే మానవులు పరితపిస్తున్నారు.

థోమస్ కార్లైల్:

Thomas Carlyle జననం 4/12/1795 స్కాట్లాండ్ లోని Ecclefechan గ్రామంలో. మరణం 5/2/1881.
లండన్ లో. ప్రఖ్యాతిగాంచిన చరిత్ర కారుడు, సాహిత్య పరుడు.

థోమస్ కార్లైల్ తన ప్రఖ్యాతిగంచిన రచన “On Heroes, HeroWorship, and the Heroic in History”లో ఇలా వ్రాశాడు: “ముహమ్మద్ కుయుక్తుడు, మోసగాడు, అసత్యరూపి మరియు అతని ధర్మం కేవలం బూటకపు, బుద్ధిహీన విషయాల పుట్ట అన్న ప్రస్తుత మన వ్యూహం, మరియు ఇలాంటి వ్యూహాలను వినడం నేటి విద్యాజ్ఞాన యుగంలో మన కొరకే సిగ్గు చేటు. ఇలాంటి మూఢ, సిగ్గుచేటు విషయాలు ప్రభలకుండా పోరాడడం మన విధి. ఈ ప్రవక్త అందజేసిన సందేశం 12 వందల సంవత్సరాల నుండి రెండు వందల మిలియన్లకంటే ఎక్కువ మంది కొరకు ప్రకాశవంతంగా ఉంది. ఈ సందేశాన్ని విశ్వసించి, దాని ప్రకారం తమ జీవితాలను మలచుకొని దానిపై చనిపోయిన ప్రజలు అసంఖ్యాకులు. ఇంతటి గొప్ప వాస్తవం అబద్ధం, బూటకం అని భావించగలమా?”.

రామక్రిష్ణ రావు:

Prof. K. S. Ramakrishna Rao, Head of the Department
of Philosophy, Government College for Women, University of Mysore.

మన ఇండియా తత్వవేత్త రామక్రిష్ణారావు గారు ఇలా చెప్పారు: “అరబ్ ద్వీపంలో ముహమ్మద్ ప్రకాశమయినప్పుడు అది ఓ ఎడారి ప్రాంతం. అప్పటి ప్రపంచ దేశాల్లో నామమాత్రం గుర్తింపు లేని ప్రాంతం అది. కాని ముహమ్మద్ తన గొప్ప ఆత్మ ద్వారా క్రొత్త యుగాన్ని, నూతన జీవితాన్ని, కొత్త సంస్కృతి, సభ్యతను ఏర్పరిచారు. మరియు కొత్త రాజ్యాన్ని నిర్మించారు. అది మొరాకో నుండి ఇండియా ద్వీపకల్పం వరకు విస్తరించింది. అంతే కాదు ఆయన ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ఖండాల్లోని జీవనశైలి, విచారణా విధానాల్లో గొప్ప మార్పు తేగలిగాడు.

S.M.జ్వీమర్:

Samuel Marinus Zwemer. జననం 12/4/1867.
Michigan. మరణం 2/4/1952. New York.

(S.M. Zweimer) ఇలా వ్రాశాడు: “నిశ్చయంగా ముహమ్మద్ ధార్మిక నాయకుల్లో అతి గొప్పవారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన శక్తివంతుడైన సంస్కరణకర్త, అనర్గళవాగ్ధాటి, ధైర్యంగల అతిసాహసి, సువిచారం చేయు గొప్ప మేధావి అని అనడమే సమంజసం. ఈ సద్గుణాలకు విరుద్ధమైన విషయాలు ఆయనకు అంకితం చేయుట ఎంత మాత్రం తగదు, యోగ్యం కాదు. ఆయన తీసుకొచ్చిన ఈ ఖుర్ఆన్ మరియు ఆయన చరిత్ర ఇవి రెండూ ఆయన సద్గుణాలకు సాక్ష్యం.

విలియం మోయిర్:

Sir William Muir. జననం 27/4/1819. UK.
మరణం 11/7/1905. UK.

సర్ విలియమ్ యోయిర్ (Sir William Muir) ఇలా చెప్పాడు: “ముహమ్మద్ -ముస్లిముల ప్రవక్త- చిన్నప్పటి నుండే అమీన్ అన్న బిరుదు పొందారు. ఆయన ఉత్తమ నడవడిక, మంచి ప్రవర్తనను బట్టి ఆయన నగరవాసులందరూ ఏకంగా ఇచ్చిన బిరుదు ఇది. ఏదీ ఎట్లయినా, ముహమ్మదు వర్ణనాతీతమైన శిఖరానికి ఎదిగి యున్నారు. ఏ వ్యక్తి ఆయన గురించి వర్ణించగలడు?. ఆయన్ను ఎరగనివాడే ఆయన గౌరవస్థానాన్ని ఎరగడు. ఆయన గురించి ఎక్కువగా తెలిసినవాడు ఆయన గొప్ప చరిత్రను నిశితంగా పరిశీలించినవాడు. ఈ చరిత్రనే ముహమ్మదును ప్రవక్తల్లో మొదటి స్థానంలో మరియు విశ్వమేధావుల్లో ఉన్నతునిగా చేసింది.

ఇంకా ఇలా అన్నాడుః “ముహమ్మద్ తన స్పష్టమైన మాట, సులభమైన ధర్మం ద్వారా సుప్రసిద్ధులయ్యారు. మేధావుల మేధను దిగ్ర్భమలో పడవేసిన పనులు ఆయన పూర్తి చేశారు. అతి తక్కువ వ్యవధిలో అందరినీ జాగరూక పరచిన, అప్రమత్తం చేసిన, నశించిపోయిన సద్గుణాల్లో జీవం పోసిన, గౌరవ మర్యాదల ప్రతిష్ఠను చాటి చెప్పిన ఇస్లాం యొక్క ప్రవక్త ముహమ్మద్ లాంటి సంస్కరణకర్త చరిత్రలో ఎవ్వరూ మనకు కనబడరు.

లియో టోల్స్ టాయ్:

Leo Tolstoy Nikolayevich. జననం 9/9/1828
Tula Oblast, Russia. మరణం 20/11/1910
ప్రపంచపు గొప్ప నవలా రచయిత, తత్త్వవేత్త

గొప్ప నవలారచయిత, తత్వవేత్త రష్యాకు చెందిన లియో టోల్స్ టాయ్ ఇలా చెప్పాడు: “ముహమ్మద్ విఖ్యాతి, కీర్తి గౌరవానికి ఇది ఒక్క విషయం సరిపోతుంది: ఆయన అతి నీచమైన, రక్తపాతాలు సృష్టించే జాతిని, సమాజాన్ని దుర్గుణాల రాక్షసి పంజాల నుండి విడిపించారు. వారి ముందు అభివృద్ధి, పురోగతి మార్గాలు తెరిచారు. ముహమ్మద్ ధర్మశాస్త్రం కొంత కాలంలో విశ్వమంతటిపై రాజ్యమేలుతుంది. ఎందుకనగా ఆ ధర్మానికి బుద్ధిజ్ఞానాలతో మరియు మేధ వివేకాలతో పొందిక, సామరస్యం ఉంది.

ఆస్ట్రియా దేశస్తుడైన షుబ్రుక్ చెప్పాడుః ముహమ్మద్ లాంటి వ్యక్తి వైపు తనకు తాను అంకితం చేసుకోవడంలో మానవజాతి గర్వపడుతుంది. ఎందుకనగా ఆయన చదువరులు కానప్పటికీ కొద్ది శతాబ్ధాల క్రితం ఒక చట్టం తేగలిగారు. మనం ఐరోపాకు చెందిన వాళ్ళం గనక దాని శిఖరానికి చేరుకున్నామంటే మహా అదృష్టవంతులమవుతాము.

వస్సలాము అలైకు వరహ్మతుల్లాహి వబరకాతుహు

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ప్రవక్త ﷺ గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 11: ప్రవక్త ﷺ వారి జుహ్ద్, వస్త్రాధారణ, న్యాయం [వీడియో]

బిస్మిల్లాహ్

[20:33 నిముషాలు]

ప్రవక్త ﷺ వారి జుహ్ద్, వస్త్రాధారణ, న్యాయం సహనాలు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [20:33 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహ్ద్

జుహ్ద్ అన్న పదం ఏదైనా వస్తువును త్యజించడం అన్న భావంలో వస్తుంది. ఈ నిర్వచనం వాస్తవ రూపంలో ఎవరిపై ఫిట్ అవుతుందంటే; ఐహిక సుఖాలనూ, భోగభాగ్యాలనూ పొంది, అయిష్టతతో వాటిని వదులుకొనుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా ఎక్కువ జుహ్ద్ గలవారు. ప్రపంచం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఉన్నప్పటికీ, ఆయన సర్వ సృష్టిలో అల్లాహ్ కు అతి ప్రియులు అయినప్పటికీ, అల్లాహ్ తలిచితే ఆయన కోరుకున్నంత ధనం, వరాలు ఆయనకు ప్రసాదిం- చేవాడు. అయినప్పటికీ ఆయన అందరికన్నా తక్కువ ప్రపంచ వ్యామోహం గలవారు. ఎంత లభించిందో అంతలోనే సరిపుచ్చుకొని, శ్రమతో కూడిన జీవితం పట్ల సంతృప్తి పడేవారు.

ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ తన తఫ్సీరులో ఖైసమ ఉల్లేఖనం ప్రస్తావించారు: “నీవు కోరితే ఇంతకు ముందు ఏ ప్రవక్తకు లభించనంత భూకోశాలు, వాటి బీగములు ప్రసాదిస్తాము. ఇవన్నీ నీ తర్వాత ఎవరికీ దొరకవు. ఇవన్నీ నీకు లభించినప్పుడు అల్లాహ్ వద్ద నీకు గల గౌరవ స్థానాల్లో ఏ కొరతా కలగదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పబడింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఇవన్నియూ నా కొరకు పరలోకంలో ఉండనీవండి“. (సూర అల్ ఫుర్ఖాన్ 25:10).

ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం, ఆయన ఆర్థిక విషయం మరీ విచిత్రమైనది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: మదీనలో ఒకసారి నేను ప్రవక్త వెంట రాతినేల మీద నడుస్తూ ఉండగా మాకు ఎదురుగా ఉహుద్ పర్వతం వచ్చింది. అప్పుడు ప్రవక్త చెప్పారుః “అబూ జర్ర్! నా దగ్గర ఉహుద్ పర్వతమంత బంగారం ఉండి, మూడు రాత్రులు గడిచినంత కాలంలో అప్పు తీర్చడానికి ఉంచుకునే కొంత బంగారం తప్ప అది నా దగ్గర ఉండిపోవడం నాకిష్టం లేదు. నేనా సంపదను అల్లాహ్ దాసుల కోసం ఇలా అలా ఖర్చు చేస్తాను అని కుడి, ఎడమ, వెనకా సైగ చేశారు”. మరో సందర్భంలో ఇలా అన్నారు: “నాకు ఈ ప్రపంచంతో ఏమిటి ప్రేమ/ సంబంధం? నేను ఈ లోకంలో ఒక బాటసారి లాంటి వాడిని, ప్రయాణిస్తూ, ఓ చెట్టు క్రింద మజిలి చేసి కొంత సేపట్లో అలసట దూరమయ్యాక ఆ స్థలాన్ని వదలి వెళ్ళిపోతాడు“.

ప్రవక్త తిండి మరియు వస్త్రాధారణ

తిండి విషయం: నెల, రెండు నెలలు ఒక్కోసారి మూడు నెలలు గడిసేవి, అయినా ఇంటి పోయిలో మంటనే ఉండకపోయేది. అప్పుడు వారి ఆహార పదార్థం ఖర్జూరం మరియు నీళ్ళు మాత్రమే ఉండేవి. ఒక్కోసారి దినమంతా తిండి లేక మెలికలు పడేవారు. అయినా కడుపు నింపుకోటానికి ఏమీ దొరక్క పోయేది. అధిక శాతం ఆయన యవధాన్యాల రొట్టె తినేవారు. ఆయన ఎప్పుడైనా పలచని రొట్టెలు తిన్న ప్రస్తావనే రాలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సేవకుడైన అనస్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: ప్రవక్త గారు అతిథులున్న సందర్భంలో తప్ప పగలు, సాయంకాలం రెండు పూటల భోజనం రొట్టె మరియు మాంసంతో ఎప్పుడూ తినలేదు.

ఆయన దుస్తుల విషయం కూడా పైన పేర్కొనబడిన స్థితికి భిన్నంగా ఏమీ లేకుండింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బట్టల విషయంలో ఆడంబరం కనబరచేవారు కారు. ఇందులో కూడా జుహ్ద్ పాటించేవారని స్వయంగా సహచరులు సాక్ష్యం పలికారు. ఎక్కువ దరగల బట్టలు ధరించే శక్తి ఉన్నప్పటికీ అలా ధరించలేదు. ఆయన వస్త్రాల గురించి ప్రస్తావిస్తూ ఒక సహచరుడు ఇలా చెప్పాడుః నేనో విషయం మాట్లాడుటకు ప్రవక్త వద్దకు వచ్చాను. ఆయన కూర్చుండి ఉన్నారు. ఆయన మందమైన కాటన్ లుంగీ కట్టుకొని ఉన్నారు.

అబూ బుర్దా రజియల్లాహు అన్హు ఒకసారి విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళారు. ఆమె మాసిక వేసియున్న, మందమైన ఓ గుడ్డ మరియు లుంగీ చూపిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకం వీడిపోయేటప్పుడు ఈ రెండు బట్టలు ధరించి ఉండిరి అని చెప్పారు. అనస్ రజియల్లాహు అన్హు చెప్పారు: నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నడుస్తూ ఉండగా ఆయనపై నజ్రాన్ లో తయారైనా మందపు అంచుల శాలువ ఉండినది.

ప్రపంచాన్ని వీడి పోయేటప్పుడు ఏ డబ్బు (దిర్హమ్, దినార్), బానిస, బానిసరాళు మరే వస్తువూ విడిచిపోలేదు. కేవలం ఒక తెల్లటి కంచర గాడిద, ఆయుధం మరియు ఒక భూమి తప్ప, అది కూడా దానం చేశారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన రోజు నా అల్మారాలో ఏదైనా ప్రాణి తినగల ఓ వస్తువు అంటూ లేకుండింది. కేవలం కొన్ని బార్లీ గింజలు (యవ ధాన్యాలు) తప్ప. ప్రవక్త చనిపోయినప్పుడు ఆయన ఒక కవచం యవధాన్యాలకు బదులుగా ఒక యూదుని వద్ద కుదువకు ఉండినది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయం

న్యాయం విషయానికొస్తే, ఆయన తమ ప్రభువు పట్ల న్యాయంగా వ్యవహరించేవారు. తమ ఆత్మ పట్ల న్యాయంగా ప్రవర్తించేవారు. తమ సతీమణులతో న్యాయంగా జీవించేవారు. దగ్గరివారు, దూరపువారు, స్నేహితులు, తన వాళ్ళు, విరోధులు చివరికి గర్వంగల శత్రువులతో కూడా ఆయన న్యాయాన్ని పాటించేవారు. ఎవరైనా ఆయన్ను ఉపేక్షించినా, ఆయన హక్కును కొందరు అర్థం చేసుకోకున్నంత మాత్రానా ఆయన న్యాయాన్ని వదులుకునేవారు కారు. ఆయన ఎక్కడా, ఏ స్థితిలో ఉన్నా న్యాయం ఆయనకు తోడుగా ఉండేది. ఆయన సహచరుల మధ్య తారతమ్యాలను అసహ్యించుకునేవారు. అందరి పట్ల సమానత్వం, న్యాయాన్ని కోరేవారు. ఆయన స్వయంగా వారిలాగా కష్టాన్ని భరించే వారు. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు: బద్ర్ యుధ్ధం రోజున ఒంటెలు తక్కువ ఉండడం వల్ల ప్రతి ముగ్రురికి ఒక ఒంటె వచ్చింది. అయితే అబూ లుబాబ మరియు అలీ బిన్ అబీ తాలిబ్ తో మూడువారో ప్రవక్త ఉండిరి. నడిచే వంతు ప్రవక్తది వచ్చినప్పుడు ప్రవక్తా! మీరు స్వారీ చేయండి మేము నడిచి వెళ్తాము అంటే ప్రవక్త వినిపించుకునేవారు కారు. ఆయన ఇలా చెప్పేవారు: “మీరు నా కంటే ఎక్కువ శక్తి గలవారు కారు. నేను కూడా మీలాగ పుణ్యం సంపాదించుకోవాలని కోరేవాణ్ణి“.

ఒకసారి ఉసైద్ బిన్ హూజైర్ రజియల్లాహు అన్హు తన జాతివారితో జోకులేసుకుంటూ నవ్వుతుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన నడుములో పుల్ల గుచ్చారు, వెంటనే ఉసైద్ అన్నాడు: ప్రవక్తా! మీరు నాకు నొప్పి కలిగించారు. నేను మీతో ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నాను. ప్రవక్త చెప్పారు: సరే తీర్చుకో, ఉసైద్ అన్నాడు: ఇప్పుడు మీ శరీరంపై చొక్కా ఉంది, మీరు నాకు పుల్ల గుచ్చినప్పుడు నాపై చొక్కా లేకుండింది, అప్పుడు ప్రవక్త తమ నడుము నుండి చొక్కా లేపారు, ఇదే అదృష్టం అనుకున్న ఉసైద్ నడుము మరియు పక్కల మధ్య చుంబించుకోసాగాడు. మళ్ళీ చెప్పాడు: ప్రవక్తా! నేను కోరింది ఇదే.

అల్లాహ్ యొక్క హద్దులను అతిక్రమించుట, లేదా న్యాయంగా ప్రజల్లో వాటిని అమలు పరుచుటలో ఏ మాత్రం జాప్యం చేయుట ఇష్టపడేవారు కారు. అపరాధి ఆయన దగ్గరివాడు, బంధువుడైన సరే. మఖ్జూమియ వంశానికి చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసినప్పుడు ఆమెపై అల్లాహ్ విధించిన హద్దు చెల్లవద్దని ఉసామా రజియల్లాహు అన్హుని సిఫారసు కొరకు ప్రవక్త వద్దకు పంపారు. ప్రవక్త అతని సిఫారసు అంగీకరించలేదు. అప్పుడు ఈ ప్రఖ్యాతిగాంచిన నుడివి పలికారు: “ఓ ప్రజలారా! మీకంటే ముందు గతించిన వారు వినాశనానికి గురి అయ్యే కారణం ఏమిటంటే వారిలో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయడయితే అతన్ని శిక్షించకుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అల్లాహ్ సాక్షిగా! “ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేవాన్ని“.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ప్రవక్త ﷺ గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 10: ప్రవక్త ﷺ వారి ఓపిక, సహనాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[18:05 నిముషాలు]

ప్రవక్త ﷺ వారి ఓపిక సహనాలు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [18:05 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ప్రవక్త ﷺ ఓపిక, సహనం

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓపిక గురించి ఏమి చెప్పగలం?!! వాస్తవానికి ఆయన పూర్తి జీవితమే ఓపిక, సహనాలతో, శ్రమ, కష్టాలతో కూడియుంది. ఆయనపై తొలి వహీ (దివ్యవాణి) అవతరించినప్పటి నుండి (ఇస్లాం ప్రచార) మార్గంలో ఆయన ఏమేమి ఏదురుకోబోతున్నారో ప్రవక్త అయిన మొదటి క్షణం, మొదటిసారి దైవదూతను కలుసుకున్న తర్వాత నుండే స్వభావికంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేయబడింది. అప్పుడు ఖదీజా (రదియల్లాహు అన్హా) ఆయన్ను వరఖా బిన్ నౌఫల్ వద్దకు తీసుకెళ్ళింది. వరఖా చెప్పాడు: “నీ జాతి వారు నిన్ను నీ దేశం నుండి బహిష్కరించినప్పుడు నేను బ్రతికుంటే ఎంత బావుండేది”. అప్పుడు ప్రవక్త ఆశ్చర్యంగా అడిగారు: “ఏమీ నా జాతివారు నన్ను దేశం నుండి బహిష్కరిస్తారా”. అతడన్నాడు: “అవును. నీవు తెచ్చినటువంటి సందేశం తెచ్చిన ప్రతీవారూ తరిమివేయబడ్డారు”. అయితే ఇలా ముందు నుండే కష్టాలను, బాధలను, కుట్రలను మరియు శత్రుత్వాన్ని భరించే అలవాటు తనకు తాను అలవర్చుకున్నారు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఓపిక, సహనాలు స్పష్టంగా ఏర్పడే చిత్రాల్లో; ఎల్లప్పుడూ ఆయనతో ఎగితాళి చేయడం, ఆయనను పరిహసించడం. ఆయన అల్లాహ్ సందేశం ప్రజలకు అందజేస్తున్నప్పుడు, మక్కాలో తమ జాతి, వంశం వారి వైపున భరించిన శారీరక చిత్రహింసలు.

అందులో ఒక సంఘటన సహీ బుఖారిలో ఇలా వచ్చి ఉంది: ప్రవక్తపై ముష్రికులు పెట్టిన చిత్రహింసల్లో ఘోరాతిఘోరమైనదేమిటి? అని ఉర్వా బిన్ జుబైర్, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర బిన్ ఆస్ ని అడిగాడు. అతడు చెప్పాడు: ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హిజ్ర్ [1] లో నమాజు చేస్తుండగా ఉఖ్బా బిన్ అబూ ముఈత్ వచ్చాడు. తన వద్ద ఉన్న దుప్పటిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మెడలో వేసి గొంతును మెలివేశాడు. అందువల్ల ఆయన గొంతు బాగా బిగుసుకు పోయింది. అంతలో అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) పరుగెత్తుకుంటూ వచ్చి ఉఖ్బా భుజాన్ని పట్టి తోసేసారు. మళ్ళీ ఖుర్ఆనులోని ఈ ఆయతు చదివారు:

(ఒక వ్యక్తి తన ప్రభువు అల్లాహ్ అని అన్నంత మాత్రాన మీరు అతణ్ణి హతమారుస్తారా?). (ఘాఫిర్ 28)

[1] అది కాబా గృహానికి ఆనుకొనియున్న స్థలం. సుమారు ఏడు ఫిట్ల గోడ ఎత్తి యుంటుంది. ఖురైషుల వద్ద హలాల్ సంపద సరిపోనందుకు దాన్ని కాబా గృహంలో కలుపుకో లేకపోయారు. అయితే అది కాబాలోని భాగమే.

ఒక రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాబా వద్ద నమాజు చేస్తున్నారు. అబూ జహల్ , వాని మిత్రులు కాబా ప్రాంగణంలో కూర్చొని యున్నారు. అబూ జహల్ మాట్లాడుతూ: ఫలానా ఇంట్లో ఈ రోజు ఒంటెను కోశారు, ఎవరు పోయి దాని పొట్ట, జీర్ణాశయం మరియు ప్రేగులను తీసుకువచ్చి, ముహమ్మద్ సజ్దాలో పోయినప్పుడు అతని వీపు మీద వేస్తాడు అని పురిగొల్పాడు. వారిలోని పరమ దుర్మార్గుడొకడు (ఉఖ్బా బిన్ అబూ ముఈత్) దిగ్గున లేచాడు. దాన్ని తీసుకొచ్చి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దాలో పోగానే ఆయన భుజాల మధ్య వీపుపై పెట్టేశాడు. ఇక అవిశ్వాసులు ఒకరిపై ఒకరు పడిపోతూ విరగబడి నవ్వసాగారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దాలోనే ఉండిపోయారు. తల పైకి లేపలేక పోయారు. చివరికి ఆయన కూతురు ఫాతిమా (రజియల్లాహు అన్హా) వచ్చింది. వీపుపై నుండి దాన్ని తొలగించింది.

వీటి కంటే మరీ ఘోరమైనది మానసిక బాధ. ఇందుకు కూడా వారు వెనక ఉండలేదు. అందుకే ఆయన ఇచ్చే సందేశాన్ని నిరాకరిస్తూ, తిరస్కరిస్తూ ఆయన పై అపనిందలు మోపేవారు, ఆయన జ్యోతిష్యుడు, పిచ్చివాడు, మాంత్రికుడు అని పేర్లు పెట్టేవారు, ఆయన తీసుకువచ్చిన ఆయతులు పూర్వకాలపు కట్టుకథలు అని అనేవారు. ఒకసారి అబూ జహల్ ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! నీ వద్ద నుండి వచ్చిన సత్యం, ధర్మం ఇదేనయితే ఆకాశం నుండి మాపై రాళ్ళ వర్షం కురిపించు. లేదా బాధకర మైన శిక్ష పంపించు.”

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల్ని ఇస్లాం వైపునకు ఆహ్వానించుటకు వారి సమూహాల్లో, బజారుల్లో వెళ్ళినప్పుడు పినతండ్రి అబూ లహబ్ వెనకనే వచ్చి, ఇతను అబద్ధికుడు. ఇతని మాటను మీరు నిజపరచవద్దు అని చెప్పేవాడు. అతని భార్య ఉమ్మె జమీల్ ముళ్ళ కంప ఏరుకొచ్చి ప్రవక్త నడిచే దారిలో వేస్తుండేది.

బాధాలు, కష్టాలు పరా కాష్ఠకు చేరిన వేళ ఒకటుంది. అది ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం మరియు ఆయన్ను విశ్వసించినవారు మూడు సంవత్సరాల వరకు షిఅబె అబూ తాలిబ్ లో బంధీలుగా అయిన వేళ. ఆ రోజుల్లో ఆకలిని భరించలేక ఆకులు తిన వలసి వచ్చేది. ఇంకా ఆయన తమ పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హాను కోల్పోయిన సందర్భంలో మరింత బాధకు గురి అయ్యారు. ఆమె కష్ట రోజుల్లో తృప్తినిస్తూ, తగిన సహాయసహకారాలు అందించేది.

ఆ తర్వాత ఆయనకు అండదండగా నిలిచిన, ఆయన్ను పోషించిన పినతండ్రి మరణం, అతను అవిశ్వాస స్థితిలో చనిపోవడం ప్రవక్తను మరింత కుదిపి వేసింది. ఆయన్ను సంహరించే ఖురైషుల యత్నాలు విఫలమయ్యాయి. ప్రవక్త స్వదేశం వదిలేసి పరదేశానికి వలసపోయారు. మదీనాలో ఓపిక, సహనాల మరో క్రొత్త కాలం, శ్రమ, ప్రయాస, కష్టాలతో కూడిన జీవితం మొదలయింది. చివరికి ఆకలిగొన్నారు. బీదవారయ్యారు. తమ కడుపుపై రాళ్ళు కట్టు కొన్నారు. ఒకసారి ప్రవక్త — ఇలా చెప్పారు: “అల్లాహ్ విషయంలో నేను బెదిరింపబడినంత మరెవరూ బెదిరింప బడలేదు. అల్లాహ్ విషయంలో నేను గురి అయిన చిత్రహింసలకు మరెవరూ గురికాలేదు. 30 రేయింబవళ్ళు గడిసినా మా పరిస్థితి ఎలా ఉండిందంటే నా వద్ద, మరియు బిలాల్ (రదియల్లాహు అన్హు) వద్ద ఒక ప్రాణి తినగల ఏ వస్తువూ లేకుండింది. కేవలం బిలాల్ చంకలో దాచిపెట్టినంత ఓ వస్తువు మాత్రం“.

ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మానవ గౌరవాల్లో కూడా శత్రువులు జోక్యం చేసుకున్నారు. మునాఫిఖుల మరియు అజ్ఞాన అరబ్బుల తరఫున ఎన్నో రకాల బాధలకు గురి అయ్యారు. సహీ బుఖారిలో అబ్దుల్లాహ్ బిన్ మఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విజయ ధనం పంపిణీ చేశారు. అన్సారులోని ఒక వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ ఈ రకమైన పంపిణి ద్వారా అల్లాహ్ సంతృష్టి కోరలేదు” అని అన్నాడు. ఇబ్ను మఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విషయం ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “అల్లాహ్, ప్రవక్త మూసాను కరుగించుగాకా! ఆయన ఇంతకంటే ఎక్కువ బాధలకు గురయ్యారు. అయినా ఓపిక వహించారు“.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓరిమి కనబరచిన సందర్భాల్లో ఒకటి ఆయన సంతానం చనిపోయిన రోజు. ఆయనకు ఏడుగురు సంతానం. కొద్ది సంవత్సరాల్లో ఒకరెనుకొకరు మరణించారు. కేవలం ఫాతిమ (రజియల్లాహు అన్హా) మిగిలారు. అయినా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనస్తాపం చెందలేదు. అలసటకు గురి కాలేదు, కాని ఓరిమి కనబరచారు. ఆయన కుమారులైన ఇబ్రాహీం చనిపోయిన రోజు ఆయన ఇలా తెలిపారు: “కళ్ళు తప్పకుండా అశ్రుపూరితలవుతాయి. మనస్సు కూడా బాధపడుతుంది. అయితే మా ప్రభువుకు ప్రీతికరమైన మాటలే నా నోట వెలువడుతాయి. ఇబ్రాహీమా! నీ ఎడబాటు మమ్మల్ని శోకసముద్రంలో ముంచేసింది“.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓర్పు, సహనం కేవలం కష్టాల, ఆపదల పైనే కాదు, అల్లాహ్ ఆయనకు ఇచ్చే ఆదేశాల విధేయతలో కూడా ఉండింది. అల్లాహ్ ఆరాధన, విధేయతలో ఆయన కఠోరమైన శ్రమపడేవారు. ఎక్కువ సేపు నమాజులో నిలబడినందుకు ఒక్కోసారి కాళ్ళు వాచిపోయేవి. ఉపవాసాలు, అల్లాహ్ స్మరణలు ఇతర ఆరాధనలు చాలా చేసేవారు. మీరెందుకు ఇంత శ్రమ పడుతున్నారని అడిగినప్పుడు, “నేను అల్లాహ్ కృతజ్ఞత చేసే దాసుణ్ణి కాకూడదా” అని అనేవారు.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ప్రవక్త గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 9: ప్రవక్త గారి పరిహాసం, బాలలతో అనురాగం, ఇంటి వారితో ప్రవక్త గారి వ్యవహారం, ప్రవక్త గారి కారుణ్యం [వీడియో]

బిస్మిల్లాహ్

[17:38 నిముషాలు]

ప్రవక్త గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 9: ప్రవక్త చరిత్రలోని నేర్చుకోదగ్గ విషయాలు (1)
ప్రవక్త గారి పరిహాసం, బాలలతో అనురాగం, ఇంటి వారితో ప్రవక్తగారి వ్యవహారం, ప్రవక్త గారి కారుణ్యం

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [17:38 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ప్రవక్త చరిత్రలోని నేర్చు కోదగ్గ విషయాలు

పరిహాసం (Joke)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో పరిహసించే వారు, తమ ఇల్లాలితో వినోదంగా, ఉల్లాసంగా గడిపేవారు. చిన్నారులతో ఆనందంగా ఉండేవారు. వారి కొరకు సమయం కేటాయించేవారు. వారి వయసు, బుద్ధిజానాలకు తగిన రీతిలో వారితో ప్రవర్తించేవారు. తమ సేవకుడైన అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్షుతో కూడా ఒకప్పుడు పరిహసిస్తూ “ఓ రెండు చెవులవాడా” అని అనేవారు.

ఒక వ్యక్తి వచ్చి ప్రవక్తా! నాకొక సవారి ఇవ్వండని అడిగాడు. ప్రవక్త పరిహాసంగా “మేము నీకు ఒంటె పిల్లనిస్తాము” అని అన్నారు. నేను ఒంటె పిల్లను తీసుకొని ఏమి చేయాలి? అని ఆశ్చర్యంగా అడిగాడతను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ప్రతి ఒంటె, పిల్లనే కంటుంది కదా” అని నగుమోహంతో అన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల ముందు ఎల్లప్పుడూ మంద హాసంతో, నగుమోహంతో ఉండేవారు. వారి నుండి మంచి మాటే వినేవారు. జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్షు ఉల్లేఖనం ప్రకారం: నేను ఇస్లాం స్వీకరించినప్పటి నుండీ, ప్రవక్త వద్దకు ఎప్పుడు వచ్చినా ఆయన రావద్దని చెప్పలేదు. నేను ఎప్పుడు చూసినా చిరునవ్వే ఉండేది. ఒకసారి “ప్రవక్తా! నేను గుఱ్ఱంపై స్థిరంగా కూర్చోలేకపోతాను అని” విన్నవించు కున్నాను. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా రొమ్ము మీద కొట్టాడు. మళ్ళీ ఇలా దుఆ చేశారు: “అల్లాహ్ ఇతన్ని స్థిరంగా కూర్చోబెట్టు. ఇతడ్ని మార్గదర్శిగా, సన్మార్గగామిగా చెయ్యి”. ఆ తర్వాత నేను ఎప్పుడూ గుఱ్ఱం మీది నుంచి పడలేదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ బంధువులతో కూడా పరిహసించే వారు. ఒకసారి ప్రవక్త తమ కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా ఇంటికి వెళ్ళారు. అక్కడ హజ్రత్ అలీ రజియలాహు అను కన్పించక పోవడంతో. ఆయన ఎక్కడి వెళ్ళాడమ్మా! అని కూతుర్ని అడిగారు. దానికి ఫాతిమ రజియల్లాహు అన్హా సమాధానమిస్తూ “మా ఇద్దరి మధ్య చిన్న తగాద ఏర్పడింది. అందుకు ఆయన నాపై కోపగించుకొని, అలిగి వెళ్ళిపోయారు” అని అంది. ప్రవక్త అక్కడి నుండి మస్తిదుకు వచ్చారు. అతను అందులో పడుకొని ఉన్నారు. ఆయన మీది నుండి దుప్పటి తొలిగి పోయింది. ఆయన శరీరానికి మట్టి అంటుకొని ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన శరీరానికి అంటుకొని ఉన్న మట్టిని తూడుస్తూ “అబూ తురాబ్ (మట్టివాడా)! లే అబూ తురాబ్! లే” అని అన్నారు.

ప్రవక్త బాలలతో

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులకు, కూతుళ్ళకు ప్రవక్త ఉత్తమ సద్గుణాల్లో ఓ గొప్ప వంతు ఉండింది. ఒక్కోసారి ప్రవక్త తమ సతీమణి ఆయిషా రజియల్లాహు అన్హా తో పరుగు పందెం పెట్టేవారు. ఆమె తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటే వద్దనేవారు కాదు. స్వయంగా ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారు: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదుట నా స్నేహితురాళ్ళతో కలసి ఆడుకునేదాన్ని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లోకి రాగానే ఆ బాలికలు భయపడి దాక్కునేవారు. అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నా దగ్గరకు పంపేవారు. నేను వారితో మళ్ళీ ఆడుకునేదాన్ని”. “

బాలలతో అనురాగంగా కలిగి యుండి, వారిని ప్రేమగా చూసుకుంటూ ఒక్కోసారి వారితో ఆటలాడేవారు. షధాద్ రజియల్లాహు అను ఉల్లేఖనం ప్రకారం: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజులో తమ వెంట హసన్ లేదా హుసైన్ ను తీసుకొచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందుకు వెళ్ళి అబ్బాయిని కూర్చోబెట్టారు. అల్లాహు అక్బర్ అని నమాజునారంభించారు. సజ్జాలో వెళ్ళి, చాలా ఆలస్యం అయినప్పటికీ లేవలేదు. నాకు అనుమానం కలిగి కొంచం తల లేపి చూశాను. ఆ అబ్బాయి ఆయన వీపుపై ఉన్నాడు. నేను మళ్ళీ సలో ఉండిపోయాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ముగించిన తర్వాత సహచరులు: ‘ప్రవక్తా! మీరు దీర్ఘంగా స చేసినందుకు ఏదైనా సంఘటన జరిగిందా లేదా మీపై దివ్యవాణి (వక్త) అవతరణ జరుగుతుందా అని భావించాము’ అని అడిగారు. అందుకు ప్రవక్త చెప్పారుః “ఇవన్నీ ఏమి కాదు, విషయం ఏమిటంటేః అబ్బాయి నా వీపుపై ఎక్కాడు. అతను కోరిక తీరక ముందే తొందరగా లేవడం నాకు బావ్యమనిపించలేదు.

అనసు రజియల్లాహు అన్షు ఉల్లేఖనంలో ఉందిః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలందరిలోకెల్లా ఉత్తమ గుణం గలవారు. నాకో చిన్న తమ్ముడు ఉండేవాడు. అతని పేరు ఉమైర్. ప్రవక్త ప్రేమతో, అతని తృప్తి కొరకు ఇలా అనేవారు: “ఉమైర్ నీ నుఫైర్ ఎలా ఉంది”. నుషైర్ అంటే బుర్ర పిట్ట. అతను దానితో ఆడుకునేవాడు.

ప్రవక్త ఇల్లాలితో

ఇంటివారితో ప్రవక్త వ్యవహారంలో సర్వ సద్గుణాలు ఏకమయ్యాయి. ఆయన చాలా వినయనమ్రతతో మెదిలేవారు. తమ చెపులు స్వయంగా కుట్టుకునేవారు. అవసరమున్న చోట బట్టలకు మాసికలేసుకునేవారు. ఎప్పుడూ భోజనానికి వంకలు పెట్టేవారు కారు. ఇష్టముంటే తినే, లేదా వదిలేసేవారు. స్త్రీ జాతిని ఒక మనిషి గా గౌరవించేవారు. అంతే కాదు, తల్లి, భార్య, కూతురు, చెల్లి రూపాల్లో వివిధ గౌరవాలు ప్రసాదించేవారు. ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడుః నా సేవా సద్వర్తనలకు అందరికన్నా ఎక్కువ అర్హులేవరు అని. దానికి ఆయన “నీ తల్లి” అని చెప్పారు. మళ్ళీ ఎవరు అన్న ప్రశ్నకు “నీ తల్లి” అని చెప్పారు. మళ్ళీ ఎవరు అన్న ప్రశ్నకు “నీ తల్లి” అనే జవాబిచ్చారు. నాల్గవ సారి అడిగినప్పుడు “నీ తండ్రి” అని చెప్పారు. మరొసారి ఇలా చెప్పారు: “ఏ వ్యక్తి తన తల్లిదండ్రిలో ఒకరిని లేదా ఇద్దరిని పొంది, వారి సేవా చేసుకోకుండా నరకంలో ప్రవేశిస్తాడో అల్లాహ్ అతన్ని తన కరుణకు దూరమే ఉంచుగాకా!”.

ఆయన సతీమణి ఏదైనా పాత్ర నుండి త్రాగినప్పుడు, ఆయన ఆ పాత్ర తీసుకొని ఆమె ఎక్కడ తన మూతి పెట్టిందో అక్కడే తమ మూతి పెట్టి త్రాగేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “మీలో మంచివారు తమ ఇల్లాలి పట్ల మంచి విధంగా మెలిగేవారు. నేను నా ఇల్లాలి పట్ల మీ అందరికన్నా మంచి విధంగా వ్యవహరించేవాణ్ణి”.

(ఈనాడు మనం మన భార్యలతో ఉత్తమ రీతిలో వ్యవహరించి ఉంటే మరియు మన ఇల్లాలులు ప్రవక్త సతీమణుల లాంటి సద్గుణాలు అవలంబించి ఉంటే మన జీవితాలు సుఖశాంతులతో నిండి ఉండేవి. మనందరికి అల్లాహ్ ఈ భాగ్యం ప్రసాదించుగాక! ఆమీన్).

ప్రవక్త కారుణ్యం

ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి కరుణ గుణం: ఆయన ఇలా ప్రవచించారు: “కరుణించేవారిని కరుణామయుడైన అలాహ్ కరుణిస్తాడు. మీరు భువిలో ఉన్నవారిపై కరుణ చూపండి. దివిలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతాడు”. ప్రవక్తలో ఈ గొప్ప గుణం అధిక భాగంలో ఉండింది. చిన్నలు, పెద్దలు, దగ్గరివారు, దూరపువారు అందరితో గల ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యవహారాల్లో ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన కరుణ, వాత్సల్యపు నిదర్శనం ఒకటి: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న పిలవాళ్ళ ఏడుపు విని సామూహిక నమాజు దీర్ఘంగా కాకుండా, సంక్షిప్తముగా చేయించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని అబూ ఖతాదా రజియల్లాహు అను ఉల్లేఖించారు: “నేను నమాజు కొరకు నిలబడినప్పుడు దీర్ఘంగా చేయించాలని అనుకుంటాను, కాని పసి పిల్లవాని ఏడుపు విని నేను సంక్షిప్తంగా చేయిస్తాను. తన తల్లికి అతని వల్ల ఇబ్బంది కలగ కూడదని”.

తమ అనుచర సంఘం పట్ల ఆయన కరుణ, మరియు వారు అల్లాహ్ ధర్మంలో చేరాలన్న కాంక్ష యొక్క నిదర్శనం: ఒక యూద పిల్లవాడు వ్యాదిగ్రస్తుడయ్యాడు. అతడు ప్రవక్త సేవ చేసేవాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని పరామర్శ కొరకు బయలుదేరి, అతని తలకడన కూర్చున్నారు. కొంత సేపటికి, “అబ్బాయీ! ఇస్లాం స్వీకరించు” అని చెప్పారు? అతడు తన తలాపునే నిలుచున్న తండ్రి వైపు చూశాడు. అబుల్ ఖాసిం (ప్రవక్త విశేషనామం, కునియత్) మాట విను అని అతని తండ్రి చెప్పాడు. ఆ అబ్బాయి అప్పుడే ఇస్లాం స్వీకరించాడు. మరి కొంత సేపటికే చనిపోయాడు. ప్రవక్త అతని వద్ద నుండి వెళ్తూ ఇలా అన్నారు: “ఇతన్ని అగ్ని నుండి కాపాడిన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు”.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ప్రవక్త గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 8: సహజ గుణాలు, సద్గుణాలు, మహిమలు [వీడియో]

బిస్మిల్లాహ్

[17:49 నిముషాలు]

ప్రవక్త గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 8: సహజ గుణాలు, సద్గుణాలు, మహిమలు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

 ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [17:49 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహజ గుణాలు

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పొట్టిగా గాని లేదా పొడుగ్గా గాని కాకుండా మధ్యరకమైన ఎత్తులో ఉండిరి. విస్తరించిన భుజాలు. సరితూగిన అవయవాలు. విశాలవక్షస్తుడు. చంద్రబింబం లాంటి అందమైన ముఖం. సుర్మా పెట్టుకున్నటువంటి కళ్ళు. సన్నటి ముక్కు. అందమైన మూతి. సాంద్రమైన గడ్డం.

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అను కథనం, అంబర్ గ్రిస్ (ambergris) మరియు కస్తూరి లేదా ఇంకేదైనా సువాసనగల పదార్థం, ద్రవ్యాల సువాసన ప్రవక్త సువాసన కంటే ఎక్కవ ఉన్నది నేను ఎన్నడూ చూడలేదు/ ఆఘ్రాణించేలదు. ప్రవక్త చెయ్యి కంటే ఎక్కువ సున్నితమైన వస్తవును ఎప్పుడూ నేను ముట్టుకోలేదు.

ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా, మందహాసంగా ఉండేవారు. తక్కువ సంభాషించేవారు. మధుర స్వరం గలవారు. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్షు ఆయన గురించి ఇలా చెప్పాడుః ఆయన అందరిలో అందమైన వారు. అందరికన్నా ఎక్కువ దాతృత్వ గుణం గలవారు, మరియు అందరి కన్నా గొప్ప శూరుడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణాలు

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా శూరులు, బలశాలి. అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్షు ఉల్లేఖించారు: యుద్ధం చెలరేగి ఒకరిపై ఒకరు విరుచుకుపడేటప్పుడు మేము ప్రవక్త వెనక ఉండేవారము.

ఆయన అందరికన్నా ఎక్కువ ఉదారులు, ఔదార్యము ఉన్నవారు. ఆయన్ను ఏదైనా అడుగుతే ఎప్పుడూ లేదు, కాదు అనలేదు.

అందరికన్నా ఎక్కువ ఓర్పు, సహనం గలవారు. ఎప్పుడూ తమ స్వంత విషయంలో ఎవరితో ప్రతీకారం కోరలేదు. ఎవరినీ కోపగించలేదు. కాని అల్లాహ్ నిషిద్ధతాల పట్ల జోక్యం చేసుకున్నవాడిని అల్లాహ్ కొరకు శిక్షించేవారు.

ఆయన దృష్టిలో దూరపు – దగ్గరివారు, బలహీనులు – బలలవంతులు అనే తారతమ్యము లేదు. హక్కులో అందరూ సమానం. మరింత తాకీదు చేస్తూ ఇలా చెప్పారు: “ఏ ఒకరికి మరొకరిపై ఆధిక్యత, ఘనత లేదు. కేవలం తఖ్వా (అల్లాహ్ భయభీతి) తప్ప. మానవులందరూ సమానులే. గత కాలల్లో గతించిన జాతుల్లో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయు డవుతే శిక్షించకుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అందుకే వారు నాశనం అయ్యారు. వినండి!
“ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేసేవాన్ని”.

ఎప్పుడూ ఏ భోజనానికి వంక పెట్ట లేదు. ఇష్టముంటే తినేవారు. లేదా వదిలేవారు. ఒక్కోసారి నెల రెండు నెలల వరకు ఇంటి పొయ్యిలో మంటే ఉండకపోయేది. ఆ రోజుల్లో ఖర్జూరం మరియు నీళ్ళే వారి ఆహారంగా ఉండేది. ఒక్కోసారి ఆకలితో కడుపుపై రాళ్ళు కట్టుకునేవారు.

చెప్పుల మరమ్మతు చేసుకునేవారు. దుస్తులు చినిగిన చోట కుట్లు వేసుకునేవారు. ఇంటి పనుల్లో ఇల్లాలికి సహకరించేవారు. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించేవారు.

పేదరికం వల్ల పేదలను చిన్న చూపు చూసేవారు కారు. రాజ్యాధికారం వల్ల రాజులతో భయపడేవారు కారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గుఱ్ఱం, ఒంటె, గాడిద మరియు కంచర గాడిదలపై ప్రయాణం చేసేవారు.

ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా అందరికన్నా ఎక్కువ మందహాసంతో ఉండేవారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేవారు. సువాసనను ప్రేమించే వారు. దుర్వాసనను అసహ్యించుకునేవారు. సర్వ సద్గుణాలను, ఉత్తమ చేష్టలను అల్లాహ్ ఆయనలో సమకూర్చాడు.

అల్లాహ్ ఆయనకు నొసంగిన విద్యా జ్ఞానం ముందువారిలో, వెనుక వారిలో ఎవ్వరికీ నొసంగ లేదు. ఆయన నిరక్షరాస్యులు. చదవలేరు, వ్రాయ లేరు. మానవుల్లో ఎవరూ ఆయనకు గురువు కారు. దివ్యగ్రంథం ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి వచ్చినది. దాని గురించి అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

{ఇలా అను ఓ ప్రవక్తా! ఒకవేళ మానవులూ జిన్నాతులూ అందరూ కలసి ఈ ఖుర్ ఆను వంటిదానిని దేనినయినా తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తీసుకురాలేరు. వారందరూ ఒకరికొకరు సహాయులు అయినప్పటికినీ. (బనీ ఇస్రా ఈల్ 7: 88).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నపటి నుండి చదవడం, వ్రాయడం నేర్చుకోకుండా నిరక్షరాస్యులవడం తిరస్కారుల అపోహాలకు ఒక అడ్డు కట్టుగా నిలిచింది. ఈ గ్రంథాన్ని ముహమ్మద్ – సల్లల్లాహు అలైహి వసల్లం- స్వయంగా వ్రాసారు, లేదా ఇతరులతో నేర్చుకున్నారు, లేదా పూర్వ గ్రంథాల నుండి చదివి వినిపిస్తున్నాడన్న అపోహాలు వారు లేపుతూ ఉంటారు. నిరక్షరాస్య మనిషి ఎలా ఇలా చేయగలడు? అందుకని వాస్తవంగా ఇది అల్లాహ్ వైపు నుండి అవతరించినదే.

మహిమలు (MIRACLES)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించిన మహిమల్లో అతి గొప్పది దివ్య గ్రంథం ఖుర్ఆన్. ఇది ప్రళయం వరకూ మహిమగా నిలిచి ఉంది. అది భాషా ప్రావీణులను, వాక్పుతులను అశక్తతకు గురి చేసింది. ఖుర్ఆన్ లో ఉన్నటువంటి పది సూరాలు, లేదా ఒక సూరా, లేదా కనీసం ఒక్క ఆయతెనా తేగలరా అని అలాహ్ అందరితో ఛాలెంజ్ చేశాడు. ముషీకులు స్వయంగా తమ అసమర్థత, అశక్తతను ఒప్పుకున్నారు.

ఆయన మహిమల్లో ఒకసారి ముఫ్రికులు మహత్యము చూపించమని కోరారు. ప్రవక్త అల్లాహ్ తో దుఆ చేశారు. చంద్రుణ్ణి రెండు వేరు వేరు ముక్కల్లో వారికి చూపించబడింది. (దీని వివరం పైన చదివారు).

కంకర రాళ్ళు ఆయన చేతులో సుబ్ హానల్లాహ్ పఠించాయి. అవే రాళ్ళు అబూ బక్ర్ చేతులో, తర్వాత ఉమర్ చేతులో, ఆ తర్వాత ఉస్మాన్ — చేతులో పెట్టారు. అప్పుడు కూడా అవి తస్బీహ్ పఠించాయి.

ఎన్నో సార్లు ఆయన వ్రేళ్ళ నుండి నీళ్ళ ఊటలు ప్రవహించాయి.

ప్రవక్త భోజనం చేసేటప్పుడు ఆ భోజనం కూడా తస్బీహ్ పఠిస్తున్నది సహచరులు వినేవారు.

రాళ్ళు, చెట్లు ఆయనకు సలాం చేసేవి.

ఒక యూదురాళు ప్రవక్తను చంపే ఉద్దేశ్యంతో మేక మాంసంలోని దండచెయి భాగంలో విషం కలిపి బహుమానంగా పంపింది. ఆ మాంసపు దండచెయి మాట్లాడింది.

ఒక గ్రామీణుడు ఏదైనా మహిమ చూపించండి అని కోరినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టును ఆదేశించగా అది దగ్గరికి వచ్చింది. మరోసారి ఆదేశించగా తన మొదటి స్థానానికి తిరిగి వెళ్ళింది.

ఏ మాత్రం పాలు లేని మేక పొదుగును చెయితో తాకగానే పాలు వచ్చేశాయి. దాని పాలు పితికి స్వయంగా త్రాగి, అబూ బక్రకు త్రాపించారు.

అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అను కళ్ళల్లో అవస్త ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మిని అతని కళ్ళల్లో పెట్టగా అప్పడికప్పుడే సంపూర్ణ స్వస్థత కలిగింది.

ఒక సహచరుని కాలు గాయపడంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని కాలును చెయితో తుడిస్తారు. వెంటనే అది నయం అయ్యింది.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అను కొరకు దీర్ఘాయుష్మంతుడుగను, అధిక ధన సంతానం గలవాడవాడిగను మరియు అల్లాహ్ వారికి శుభం (బర్కత్) ప్రసాదించాలని దుఆ చేశారు. అలాగే ఆయనకు 120 మంది సంతానం కలిగారు. ఖర్జూరపు తోటలన్నీ ఏడాదికి ఒక్కసారే ఫలిస్తాయి. కాని ఆయన ఖర్జూరపు తోట ఏడాదికి రెండు సార్లు పండేది. ఇంకా ఆయన 120 సంవత్సరాలు జీవించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు మెంబర్ పై ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యక్తి వచ్చి, అనావృష్టి దాపురించింది మీరు వర్షం కొరకు దుఆ చేయండని కోరగా, రెండు చేతులెత్తి దుఆ చేశారు. ఎక్కడా లేని మేఘాలన్నీ పర్వతాల మాదిరిగా ఒక చోట చేరి, వారం రోజుల పాటు కుండ పోత వర్షం కురిసింది. మరో జుమా రోజు ఖుత్బా సందర్భంలో వర్షం వల్ల నష్టం చేకూరుతుందని విన్నవించుకోగా రెండు చేతులెత్తి దుఆ చేశారు. అప్పటికప్పుడే వర్షం నిలిచింది. ప్రజలందరూ ఎండలో నడచి వెళ్ళారు.

ఖందక యుద్ధంలో పాల్గొన్న వెయ్యి మంది వీరులందరికీ సుమారు మూడు కిలోల యవధాన్యాల రొట్టెలు మరియు ఒక చిన్న మేక మాంసం తో ప్రవక్త వడ్డించారు. అందరూ కడుపు నిండా తృప్తికరంగా తిని వెళ్ళారు. అయినా రొట్టెలు మరియు మాంసంలో ఏ కొదవ ఏర్పడలేదు.

అదే యద్దంలో బషీర్ బిన్ సఅద్ కూతురు తన తండ్రి మరియు మామ కొరకు తీసుకొచ్చిన కొన్ని ఖర్జూరపు పండ్లు వీరులందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తినిపించారు.

అబూ హురైరా రజియల్లాహు అన్షు వద్ద ఉన్న ఒకరి భోజనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి సైన్యానికి తినిపించారు.

హిజ్రత్ కు వెళ్ళే రాత్రి ఆయన్ను (సల్లల్లాహు అలైహి వసల్లం) హత్య చేయుటకు వేచిస్తున్న వంద మంది ఖురైషుల పై దుమ్ము విసురుతూ వారి ముందు నుండి వెళ్ళి పోయారు. వారు ఆయన్ని చూడలేకపోయారు.

హిజ్రత్ ప్రయాణంలో సురాఖా బిన్ మాలిక్ ఆయన్ను చంపడానికి వెంటాడుతూ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని శపించారు. అందుకు అతని గుఱ్ఱం కాళ్ళు మోకాళ్ళ వరకు భూమిలో దిగిపోయాయి.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

సీరత్ పాఠాలు 7: ఉహుద్ యుద్ధం నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణం వరకు [వీడియో]

బిస్మిల్లాహ్

[19:44 నిముషాలు]

ఉహుద్ యుద్ధంనుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణం వరకు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

 ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [19:44 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ఉహద్ యుద్ధం

బద్ర్ యుద్ధం తర్వాత ఒక సంవత్సరానికి, మస్లిముల మరియు అవిశ్వాసుల మధ్య ఈ యుద్ధం జరిగింది. బద్ర్ యుద్ధంలో ఓటమికి పాలైన అవిశ్వాసులు, ముస్లిములతో ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఈ సారి 3000 సైనికులతో బయలుదేరారు. వారితో పోరాడడానికి ముస్లిముల వైపు నుండి 700 మంది పాల్గొన్నారు. ప్రారంభ దశలో ముస్లిములే గెలుపొందారు. అవిశ్వాసులు మక్కా దారి పట్టారు. కాని వెంటనే మళ్ళీ తిరిగి వచ్చారు. కొండ వెనుక వైపు నుండి వచ్చి, ముస్లిములపై విరుచుకు పడ్డారు. ఇలా ఎందుకు జరిగిందంటే: అదే కొండపై ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొందరు విలుకాండ్రులను నియమించారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ స్థానాన్ని వదలకూడదని వారికి నొక్కి చెప్పారు. కాని వారు ముస్లిములు గెలుపొందినది, ముష్రికులు పారిపోవునది చూసి (యుద్ధం ముగిసిందన్న భ్రమలో పడి) విజయప్రాప్తి కోసం పరుగెత్తుకొచ్చారు. అందువల్ల ఆ స్థలం ఖాలీ అయిపోయింది. ఖురైషులకు మంచి అవకాశం లభించింది. కొండ వెనక నుండి తిరిగి దాని శిఖరంపై వచ్చి అక్కడి నుండి ముస్లిములపై దాడి చేశారు. అందుకే ఈ సారి ముష్రికులు గెలుపొందారు. ఈ యుద్ధంలో 70 మంది ముస్లిములు అమరవీరులయ్యారు. వారిలో ఒకరు: హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు). ముష్రికుల వైపు నుండి 22 మంది చంపబడ్డారు.

ఖందక యుద్ధం

ఉహద్ యుద్ధం తర్వాత కొద్ది రోజులకు మదీన యూదులు మక్కా వెళ్ళి ఖురైషుల్ని కలుసుకొని మీరు గనక మదీనా పై దాడి చేసి, ముస్లిములతో యుద్ధం చేస్తే ఈ సారి మేము (లోపల నుండి) మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానం చేశారు. ఖురైషులు సంతోషంతో దీన్ని ఒప్పుకున్నారు. ఖురైషులు ఒప్పుకున్నాక ఇతర తెగవాళ్ళను కూడా పురికొలిపారు. వారు కూడా ఒప్పుకున్నారు. అరబ్బు దేశమంతటి నుండి యూదులు, ముష్రికులందరూ ఏకమై భారీ ఎత్తున మదీనా పై దండ యాత్రకు బయలుదేరారు. సుమారు పది వేల మంది సైనికులు మదీనా చుట్టు ప్రక్కన పోగు అయ్యారు.

శత్రువుల కదలిక గురించి ప్రవక్తకు వార్తలు అందుతున్నాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాలతో సలహా కోరారు. అప్పుడు ఈరాన్ దేశస్తుడైన సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు) ఖందకం త్రవ్వాలని సలహా ఇచ్చారు. మన రెండు వైపులా ఖర్జూరపు తోటలు, ఒక వైపు కొండ ఉండగా మరో వైపు ఏమీ అడ్డుగా లేనందు వల్ల అదే వైపు ఖందకం త్రవ్వడం ప్రారంభించారు. ముస్లిములందరూ ఇందులో పాల్గొని అతి తొందరగా దాన్ని పూర్తి చేశారు. ముష్రికులు ఖందకానికి ఆవల ఒక నెల వరకు ఉండిపోయారు. మదీనలో చొరబడటానికి ఏ సందు దొరకలేదు. ఆ కందకాన్ని దాటలేక పోయారు. అల్లాహ్ అవిశ్వాసులపై ఒకసారి తీవ్రమైన గాలి దుమారాన్ని పంపాడు. దాని వల్ల వారి గుడారాలు ఎగిరిపోయాయి. వారిలో అల్లకల్లోలం చెలరేగి భయం జనించింది. క్షణం పాటు ఆగకుండా పారిపోవడంలోనే క్షేమం ఉంది అనుకొని పరిగెత్తారు. ఈ విధంగా అల్లాహ్ ఒక్కడే దాడి చేయుటకు వచ్చిన సైన్యాలను పరాజయానికి గురి చేసి, ముస్లిములకు సహాయ పడ్డాడు.

ముష్రికుల సైన్యాలు దారి పట్టిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఈ సంవత్సరం తర్వాత ఖురైష్ మీపై దాడి చేయరు. కాని మీరు వారి మీద దాడి చేస్తారు“. వాస్తవంగా ప్రవక్త చెప్పినట్లు ఖురైషు వైపు నుండి ఇదే చివరి దాడి అయ్యింది. (ఆ తర్వాత వారు ఎప్పుడు ముస్లింపై దాడి చేయుటకు సాహసించలేదు).

కందకం త్రవ్వే సందర్భంలో ముస్లిములు ఘోరమైన ఆకలికి గురి అయ్యారు. ఆకలి భరించలేక కడుపుపై రాళ్ళు కట్టుకోవలసి వచ్చింది. అప్పుడు జాబిన్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కనీసం ప్రాణం కాపాడేంత పరిమాణంలోనైనా ప్రవక్తకు ఏదైనా తినిపించాలని కోరుకొని తన వద్ద ఉన్న ఓ చిన్న మేక పిల్లను కోశాడు. మాంసం తయారు చేసి భార్యకు ఇస్తూ దీని కూర వండి, అతితక్కవగా ఉన్న బార్లీ గింజల పిండితో రొట్టెలు చేసి పెట్టమని చెప్పాడు. వంట తయ్యారు అయ్యాక ప్రవక్త వద్దకు వెళ్ళి ‘మీకు మరో ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే సరిపడేంత భోజనం ఉంది’ అని తెలియజేశాడు. అప్పుడు ప్రవక్త “ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది” అని కందకంలో పాల్గొన్న వారందరినీ పిలిచారు. మరియు స్వయంగా మాంసం ముక్కలు మరియు రొట్టెలు వడ్డించారు. అందరూ కడుపు నిండా తిన్నారు. అయినా ఆ భోజనం ఎవరి చేయి పెట్టినట్లుగా మిగిలింది. అప్పుడు వారు సుమారు వెయ్యి మంది ఉండిరి. ఇది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహిమల్లో ఒకటి.

హుదైబియా ఒప్పందం

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ముస్లిములు మదీనకు వలస వచ్చినప్పటి నుండి, వారిని ఎన్నటికీ తిరిగి మక్కా రానివ్వకూడదని, మస్జిదె హరాం దర్శనం చేయనివ్వద్దని దృఢంగా ముష్రికులు నిశ్చయించుకున్నారు. కాని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన సహచరులు మక్కాకు పయనం కావాలని హిజ్రి శకం ఆరవ ఏట ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిశ్చయించారు. వెళ్ళడానికి జిల్ ఖాద నెల నిర్ణయమయింది. అది గౌరవపదమైన నెల అని, అందరూ దాన్ని గౌరవిస్తారనీ, ఉమ్రా ఉద్దేశ్యంతో బయలుదేరారు. యుద్ధ ఆదేశం ఏ మాత్రం లేకుండినది. 1400 మంది సహాబాలు ఇహ్రామ్ దుస్తులు ధరించి, బలివ్వడానికి ఒంటెలు తమ వెంట తీసుకెళ్ళారు. వాస్తవానికి వీరు కాబా దర్శనానికి, దానిని గౌరవార్ధమే బయలుదేరారన్న నమ్మకం చూసేవారికి కలగలాని, ఖురైషువారు వీరిని మక్కాలో ప్రవేశం నుండి నిరోధించుటకు ఊహించనూ వద్దని ఆయుధాలు కూడా ధరించలేదు. కేవలం ప్రయాణికులు తమ ఖడ్గ ఒరలో ఉంచుకునే ఆయుధం తప్ప.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖస్వా పేరుగల తమ ఒంటపై పయనమయ్యారు. సహచరులు ఆయన వెనక ఉన్నారు. మదీనవాసుల మీఖాత్ జుల్ హులైఫా చేరుకున్నాక, అందరూ బిగ్గరగా తల్బియా చదువుతూ ఉమ్రా యొక్క ఇహ్రామ్ సంకల్పం చేశారు. వాస్తవానికి కాబా దర్శన హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంది. దాని దర్శనం మరియు ప్రదక్షిణం నుండి నిరోధించే హక్కు అప్పటి ఆచారం (దస్తూర్, ఖానూన్) ప్రకారం కూడా ఖురైషుకు ఏ మాత్రం లేదు. వారి శత్రువైనా సరే, అతడు కాబా గౌరవ ఉద్దేశ్యంతో వస్తే అతడ్ని ఆపవద్దు.

కాని ముస్లిములు మక్కా ఉద్దేశ్యంతో బయలుదేరారని విన్న వెంటనే ముష్రికులు యుద్ధానికి సిద్ధమయ్యారు. వారికి ఎంత కష్టతరమైన సరే ప్రవక్తను మక్కాలో రానివ్వకూడదని దృఢంగా నిర్ణయించుకున్నారు. వారి ఈ చేష్ట, వారు ముస్లిముల పట్ల శత్రుత్వంగా, దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నా రనడానికి మరియు వారికి లభించవలసిన హక్కుల నుండి వారిని దూరం చేస్తున్నారు అనడానికి గొప్ప నిదర్శనం.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బిడారం నడుస్తూ నడుస్తూ మక్కాకు సమీపములో చేరుకుంది. కాని ఖురైషువారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన సహచరుల్ని మక్కాలో ప్రవేశించకుండా, కాబా ప్రదక్షిణం చేయకుండా నిరోధిస్తునే ఉన్నారు.

ప్రవక్తతో సంధి చేసుకొని ఏదో ఓ కొలికికి రావాలని రాయబార వ్యవహారాలు మొదలయ్యాయి. ఇరు పక్షాల్లో (అంటే ముస్లిముల మరియు మక్కాలోని ముష్రికుల మధ్య) అనేక రాయబార బృందాలు వస్తూ పోయాయి. ఈ మధ్యలో ఖురైష్ యువకుల్లో నలబై మంది హఠాత్తుగా ముస్లిములపై విరుచుకుపడి వారిలో కొందరిని చంపుదాము అని అనుకున్నారు. కాని ముస్లిములు వారిని పట్టుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం వద్దకు తీసుకువచ్చారు. అయితే ప్రవక్త వారితో ఏ ప్రతికార చర్యకు పాల్పడకుండా వారిని వారి దారిన వదిలేసి వారిని మన్నించారు.

ఆ తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు)ని రాయబారిగా ఖురైష్ నాయకుల వద్దకు పంపి, మేము యుద్దానికి కాదు వచ్చింది. కేవలం అల్లాహ్ గృహ దర్శనం, దాని గౌరవార్థం వచ్చాము అని తెలియజేశారు. ఉస్మాన్ మరియు ఖురైషుల మధ్య సంధి కుదరలేదు. అంతే గాకుండా వారు ఉస్మాన్ ని పోనివ్వకుండా తమ వద్దే నిర్బంధించారు. అందువల్ల ఉస్మాన్ హత్యకు గురయ్యాడు అన్న పుకారు పుట్టింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఈ విషయం తెలిసిన వెంటనే “ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోకుండా ఇక్కడి నుండి కదిలేది లేదు” అని స్పష్టం చేసి, దీనికై ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరితో శపథం తీసుకున్నారు. అప్పుడు తమ ఒక చేతిని ఉస్మాన్ చేతిగా పరిగణించి తమ రెండవ చేయిని దానిపై కొట్టి శపథం చేశారు. ఈ శపథం ” బైఅతుర్ రిజ్వాన్” అన్న పేరు పొందింది. ఓ చెట్టు క్రింద జరిగింది. ప్రవక్తగారు సహచరులతో చేసిన శపథం ఇలా ఉండింది: ఉస్మాన్ కు వాస్తవంగా ఏదైనా కీడు జరిగింది అని తెలిస్తే గనక మీలో ఏ ఒక్కరూ పారిపోకుండా ముష్రికులతో పోరాడనిదే ఈ స్థలాన్ని వదలేది లేదు. తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తెలిసిన వార్త ఏమిటంటే ఉస్మాన్ క్షేమంగానే ఉన్నారు. హత్య చేయబడలేదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిములతో యుద్ధానికి సిద్ధమన్నట్లు శపథం చేశారని తెలిసిన వెంటనే సుహైల్ బిన్ అమ్ర్ ను దౌత్యవేత్తగా పంపారు. అతను ప్రవక్తతో కూర్చుండి; ముస్లిములు ఈ సారి తిరిగి వెళ్ళిపోవాలని మరియు వచ్చే సంవత్సరం ఎప్పుడైనా రావచ్చనే విషయంపై సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. సంధి కుదిరింది. ప్రవక్త కూడా సంధి ఒప్పంద నిబంధనలను అంగీకరించారు. ఈ నిబంధనలు బాహ్యంగా ముష్రికుల పక్షంలో వారికి మాత్రమే అనుకూలమైనవిగా ఉండెను. అందుకే ముస్లిములు మండిపడ్డారు. వారి దృష్టిలో అవి అన్యాయం, దౌర్జన్యంతో కూడి ఉన్న నిబంధనలని. ముష్రికులకు అనుకూలమైనవిగా ఉన్నాయని అనిపించింది. కాని ప్రవక్త సంధి కుదరాలనే కోరేవారు. ఎందకుంటే ఇస్లాం ప్రశాంత వాతవరణంలో వ్యాపిస్తూ ఉంటే అనేక మంది ఇస్లాంలో ప్రవేశించవచ్చు అన్న విషయం ప్రవక్తకు తెలుసు. వాస్తవానికి జరిగింది కూడా ఇదే. ఈ యుద్ధవిరమణ కాలంలో ఇస్లాం విస్తృతంగా వ్యాపించింది.

అంతే కాదు, వాస్తవానికి ముస్లిముల మరియు ఖురైష్ ల మధ్య జరిగిన ఈ యుద్ధవిరమణ సంధి ఇస్లాం మరియు ముస్లిముల పాలిట గొప్ప సహాయంగా నిలిచింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవజ్యోతితో చూస్తూ ఉన్నారని కుడా ఈ సంఘటన గొప్ప నిదర్శనంగా నిలిచింది. ఎలా అనగ నిబంధనలన్నిటీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అంగీకరిస్తూ పోయారు. అదే సందర్భంలో కొందరి సహచరులకు అవి బాహ్యంగా ముష్రికులకు అనుకూలంగా కనబడినవి.

మక్కా విజయం

హిజ్రి శకం ఎనిమిదవ ఏట (ముష్రిక్కులు తాము చేసిన వాగ్దానానికి వ్యెతిరేకం వహించినందుకు) మక్కాపై దాడి చేసి, జయించాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిర్ణయించారు. రమజాన్ 10వ తారీకున 10 వేల వీరులతో బయలుదేరారు. ఏలాంటి పోరాటం, రక్తపాతం లేకుండా మక్కాలో ప్రవేశించారు. ఈ ప్రవేశం చారిత్రకమైనది. చెప్పుకోదగ్గది. ఖురైషులు తమ ఇష్టానుసారం లొంగిపోయారు. అల్లాహ్ ముస్లిములకు సహాయపడ్డాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిదె హరాం వెళ్ళి కాబా యొక్క తవాఫ్ చేసి, కాబా లోపల, వెలుపల, పైన ఉన్న విగ్రహాలన్నిటిని తొలగించి దాని లోపల రెండు రకాతుల నమాజు చేశారు. తర్వాత కాబా గడపపై వచ్చి నిలుచున్నారు. ఖురైషులు గడప ముందు నిలబడి, ప్రవక్త వారి గురించి ఏ తీర్పు ఇస్తారు అని వేచిస్తున్నారు. ప్రవక్త గంభీర స్వరంతో “ఓ ఖురైషులారా! నేను మీ పట్ల ఎలా ప్రవర్తిస్తానని భావిస్తున్నారు” అని అడిగారు. వారందరూ ఏక శబ్దమై “మేలు చేస్తారనే భావిస్తున్నాము. ఎందుకంటే మీరు మంచి సోదరులు, మంచి సోదరుని సుపుత్రులు” అని సమాధానమిచ్చారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “పోండి, మీరందరికి స్వేచ్ఛ ప్రసాదించబడుతుంది” అని ప్రకటించారు. ఈ విధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన్ను, తన సహచరుల్ని బాధించి, నానా రకాలుగా హింసించి, స్వదేశం నుండి తరిమిన శత్రువుల్ని ఈ రోజు క్షమిస్తూ, మన్నిస్తూ ఒక గొప్ప ఉదాహరణ / ఆదర్శం నిలిపారు.

బృందాల రాక, రాజులకు ఇస్లాం సందేశం

మక్కా విజయం తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రస్తావన మరియు ఇస్లాం ధర్మ ప్రచారం నలువైపులా వ్యాపించింది. ఇక సుదూర
ప్రాంతాల నుండి బృందాలు వచ్చి ఇస్లాం స్వీకరించ సాగాయి.

అలాగే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చుట్టుప్రక్క దేశాల రాజులకు ఇస్లాం పిలుపునిస్తూ, ఉత్తరాలు వ్రాయించి పంపారు. వారిలో కొందరు ఇస్లాం స్వీకరించారు. మరి కొందరు ఇస్లాం స్వీకరించలేదు కాని ఉత్తమరీతి లో ఉత్తరాన్ని తీసుకొని మంచి విధంగా సమాధానమిచ్చారు. కాని ఈరాన్ రాజైన ఖుస్రో (Khosrau) ప్రవక్త పత్రాన్ని చూసి కోపానికి గురై దాన్ని చింపేశాడు. ప్రవక్తకు ఈ విషయం తెలిసింది. పిమ్మట ఆయన ఇలా శపించారు: “అల్లాహ్! అతని రాజ్యాన్ని కూడా నీవు చించేసెయి“. ఈ శాపనానికి ఏమంత ఎక్కువ సమయం గడువక ముందే అతని కొడుకు స్వయంగా తండ్రిని చంపేసి, రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు.

మిస్ర్ (Egypt) రాజు ముఖోఖిస్ ఇస్లాం స్వీకరించలేదు. కాని ప్రవక్త రాయబారితో ఉత్తమ రీతిలో ప్రవర్తించి, అతనితో ప్రవక్త కొరకు కానుకలు పంపాడు. అలాగే రోమన్ రాజు కూడా ప్రవక్త రాయబారికి మంచి ఆతిథ్యం ఇచ్చి మంచి విధంగా ప్రవర్తించాడు.

బహైన్ రాజు ముంజిర్ బిన్ సావీ ప్రవక్త పత్రాన్ని ప్రజలందరికీ వినిపించాడు. వారిలో కొందరు విశ్వసించారు మరి కొందరు తిరస్కరించారు.

హిజ్రి శకం 10వ ఏట ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్ చేశారు. ఆయన చేసిన ఏకైక హజ్ ఇదే. ఆయనతో పాటు లక్షకు పైగా సహచరులు హజ్ చేశారు. ఆయన హజ్ పూర్తి చేసుకొని మదీన తిరిగి వచ్చారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం

హజ్ నుండి వచ్చాక సుమారు రెండున్నర మాసాలకు ప్రవక్తకు అస్వస్థత అలుముకొన్నది. దిన దినానికి అది పెరగ సాగింది. నమాజు కూడ చేయించడం కష్టమయిపోయింది. అప్పుడు అబూబక్ర్ ను నమాజు చేయించాలని ఆదేశించారు.

హిజ్రి పదకొండవ శకం, నెల రబీఉల్ అవ్వల్, 12వ తారీకు సోమవారం రోజున ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమోన్నతుడైన అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. మొత్తం 63 సంవత్సరాలు జీవించారు. ప్రవక్త మరణ వార్త సహచరులకు అందగా వారికి సృహ తప్పినట్లయింది. నమ్మశక్యం కాక పోయింది. అప్పుడు అబూ బక్ర సిద్దీఖ్ రజియల్లాహు అను నిలబడి ప్రసం గించారు: వారిని శాంతపరుస్తూ, ప్రశాంత స్థితి నెలకొల్పుతూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరి లాంటి ఒక మానవుడే, అందిరికి వచ్చి నటువంటి చావు ఆయనకు వచ్చింది అని స్పష్టపరిచారు. అప్పుడు సహచరులు తేరుకొని, శాంత పడ్డారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు స్నానం చేయించి, కఫన్ దుస్తులు ధరియింపజేసి, ఆయిషా (రజియల్లాహు అన్హా) గదిలో ఖననం చేశారు.

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్త పదవికి ముందు 40 సం. ఆ తర్వాత 13 సం. మక్కాలో, 10 సం. మదీనలో గడిపారు.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

సీరత్ పాఠాలు 6: మదీనాకు హిజ్రత్ (వలస), బద్ర్ యుద్ధం [వీడియో]

బిస్మిల్లాహ్

[21:14 నిముషాలు]

హిజ్రత్ మదీనా, బద్ర్ యుద్ధం

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

 ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [21:14 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీన నుండి వచ్చి మజిలి చేసిన కొందరితో కలిసి వారిని అల్లాహ్ వైపు పిలిచారు. వారు ఆయన మాటలను శ్రద్ధగా విని, ఆయన్ను విశ్వసించి, అనుసరిస్తామని వారు ఏకీభవించారు. అయితే “ఒక ప్రవక్త రానున్నాడు, అతని ఆగమన కాలం సమీపించిందని” వారు ఇంతకు ముందే యూదులతో వినేవారు. ఎప్పుడైతే ప్రవక్త వారికి ఇస్లాం బోధ చేశారో, యూదులు చెప్పే మాట గుర్తొచ్చి, ఆ ప్రవక్త ఈయనే అని తెలుసుకొని, ఈయన్ని విశ్వసించడంలో యూదులు మనకంటే ముందంజ వేయకూడదని వారు పరస్పరం అనుకొని తొందరగా విశ్వసించారు. వారు ఆరుగురు. ఆ తరువాత సంవత్సరం పన్నెండు మంది ప్రవక్తతో కలసి ఇస్లాం ధర్మ జ్ఞానం నేర్చుకున్నారు. వారు తిరిగి మదీన వెళ్ళేటప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముస్అబ్ బిన్ ఉమైర్ (రదియల్లాహు అన్హు)ను వారితో పంపారు. అతను వారికి ఖుర్ఆన్ నేర్పాలని మరియు ఇస్లాం ధర్మాదేశాలు బోధించాలని. అతను అక్కడి సమాజంపై మంచి ప్రభావం వేయగలిగారు. అంటే మదీనవాసులు అతని ప్రచారం పట్ల ఆకర్షితులయ్యే విధంగా అతను అక్కడ ఉండి ఇస్లాం బోధించగలిగారు. ఒక సంవంత్సరం తర్వాత అతను మక్కా వచ్చేటప్పుడు తన వెంట 72 మంది పురుషులు, ఇద్దరు స్త్రీలు వచ్చారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో కలిశారు. అల్లాహ్ ధర్మ సహాయానికి ఎల్లవేళల్లో సిద్ధమేనని వారు శపథం చేసి తిరిగి మదీన వెళ్ళిపోయారు.

కొత్త ప్రచారం కేంద్రం

మదీన పట్టణం ఇస్లాం మరియు ముస్లింలకు మంచి ఆశ్రయం, శాంతి స్థానంగా అయ్యింది. అక్కడికి మక్కా పీడిత ముస్లిముల హిజ్రత్[1] మొదలయ్యింది. ముస్లిములను హిజ్రత్ చేయనివ్వకూడదని ఖురైషు గట్టి పట్టు పట్టారు. హిజ్రత్ చేయబూనిన కొందరు ముస్లిములు నానా రకాల హింసా దౌర్జన్యాలకు గురయ్యారు. అందుకు ముస్లిములు రహస్యంగా హిజ్రత్ చేసేవారు. అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తతో అనుమతి కోరినప్పుడల్లా “తొందరపడకు, బహుశా అల్లాహ్ నీకొక ప్రయాణమిత్రుడు నొసంగవచ్చును” అని చెప్పేవారు. చివరికి చాలా మంది ముస్లిములు హిజ్రత్ చేశారు.

[1] హిజ్రత్ అంటే వలసపోవుట. అంటే తన స్వగ్రామంలో ఇస్లాం ధర్మ ప్రకారం జీవితం గడపడం కష్టతరమైతే, దాన్ని వదిలి వేరే ప్రాంతానికి ప్రయాణమగుట.

ముస్లిములు ఈ విధంగా హిజ్రత్ చేసి, మదీనలో వెళ్ళి స్థానం ఏర్పరుచుకుంటున్న విషయాన్ని చూసి ఖురైషులకు పిచ్చెక్కి పోయింది. అంతే కాదు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రతిష్ట, ఆయన ప్రచారం దినదినానికి వృద్ధి చెందుతున్నది చూసి వారు భయం చెందారు. అందుకని వారందరూ కలసి సమాలోచన చేసి ప్రవక్తను హతమార్చాలని ఏకీభవించారు. అబూ జహల్ ఇలా చెప్పాడు: “మనం ప్రతి తెగ నుండి శక్తివంతుడైన ఒక యువకునికి కరవాలం ఇవ్వాలి. వారందరూ ముహమ్మదును ముట్టడించి, అందరు ఒకేసారి దాడి చేసి సంహరించాలి. అప్పుడు అతని హత్యానేరం అన్ని తెగలపై పడుతుంది. బనీ హాషిం అందరితో పగతీర్చుకొనుటకు సాహసించలేరు” అని పథకం వేశారు. వారి ఈ పథకం, దురాలోచన గురించి అల్లాహ్ ప్రవక్తకు తెలియ జేశాడు. అల్లాహ్ అనుమతిని అనుసరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు)తో హిజ్రత్ కొరకు సిద్ధమయ్యారు. అలీ (రదియల్లాహు అన్హు)ను పిలిచి, “ఈ రాత్రి నీవు నా పడకపై నిద్రించు, (నీకు ఏ నష్టమూ కలగదు). చూసే వారికి నేనే నిద్రిస్తున్నానన్న భ్రమ కలుగుతుంది” అని చెప్పారు.

అవిశ్వాసులు తమ పథకం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటిని చుట్టుముట్టారు. అలీ (రదియల్లాహు అన్హు)ను నిద్రిస్తున్నది చూసి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అని భ్రమపడ్డారు. ఆయన బైటికి వచ్చిన వెంటనే ఒకే దాడిలో హత్య చేయాలని ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నారు. వారు ముట్టడించి కాపుకాస్తున్న వేళ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మధ్య నుండి వెళ్ళారు. వారి తలలపై మన్ను విసురుతూ అక్కడి నుండి వెళ్ళారు. అల్లాహ్ వారి చూపులను పట్టుకున్నాడు. ప్రవక్త వారి ముందు నుండి దాటింది వారు గ్రహించలేక పోయారు. అక్కడి నుండి ప్రవక్త అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) వద్దకెళ్ళి, ఇద్దరూ కలసి సుమారు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న సౌర్ గుహలో దాగి పోయారు. అటు ఖురైషు శక్తిశాలి యువకులు తెల్లారే వరకు నిరీక్షిస్తునే ఉండిపోయారు. తెల్లారిన తర్వాత ప్రవక్త పడక నుండి అలీ (రదియల్లాహు అన్హు) లేచి, వీరి చేతిలో చిక్కాడు. ప్రవక్త గురించి అడిగారు. అలీ (రదియల్లాహు అన్హు) ఏమీ చెప్ప లేదు. అతన్ని పట్టి లాగారు, కొట్టారు, కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది.

అప్పుడు ఖురైషులు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను వెతకడానికి అన్ని దిక్కులా అన్వేషీలను పంపారు. ఆయన్ని జీవనిర్జీవ ఏ స్థితిలో పట్టు కొచ్చినా, అతనికి 100 ఒంటెల బహుమానం అని ప్రకటించారు. కొందరు అన్వేషీలు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన మిత్రుడు ఉన్న గుహ వద్దకు చేరుకున్నారు. వారిలో ఏ ఒక్కడైనా వంగి తన పాదాల్ని చూసుకున్నా, వారిద్దర్ని చూసేవాడు. అందుకు అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) (ప్రవక్త పట్ల) కంగారు పడ్డారు. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి ఇలా ధైర్యం చెప్పారు: “అబూ బక్ర్! ఏ ఇద్దరికి తోడుగా మూడోవాడు అల్లాహ్ ఉన్నాడో వారి గురించి నీకు రందేమిటి. దిగులు పడకు అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు“. వాస్తవంగా వారు ఆ ఇద్దరిని చూడలేదు కూడా.

మూడు రోజుల వరకు అదే గుహలో ఉండి, మదీనాకు బయలుదేరారు. దూర ప్రయాణం, మండే ఎండలో ప్రయాణం సాగుతూ రెండవ రోజు సాయంకాలం ఒక గుడారం నుండి వెళ్ళుచుండగా అక్కడ ఉమ్మె మఅబద్ పేరుగల స్త్రీ ఉండెను. నీ వద్ద తిను త్రాగటకు ఏమైనా ఉందా అని ఆమెతో అడిగారు. నా వద్ద ఏమీ లేదు. ఆ మూలన బలహీన మేక ఉంది. మందతో పాటు నడవలేకపోతుంది. దానిలో పేరుకు మాత్రం పాలు కూడా లేవు అని చెప్పింది. పిదప ఆమె అనుమతి మేరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ మేక వద్దకు వెళ్ళి దాని పొదుగును చెయితో తాకగానే అందులో పాలు వచ్చేశాయి. పెద్ద పాత్ర నిండ పాలు పితికారు. ఉమ్మె మఅబద్ మరీ ఆశ్చర్యంగా ఒక వైపు నిలుచుండి బిత్తర పోయింది. ఆ పాలు అందరూ కడుపు నిండా త్రాగారు. మరో సారి పాత్ర నిండా పితికి, ఉమ్మె మఅబద్ వద్ద వదిలి, ప్రయాణమయ్యారు.

మదీనవాసులు ప్రతీ రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఎదురు చూస్తూ మదీన బైటికి వచ్చేవారు. ప్రవక్త మదీనా చేరుకునే రోజు సంతోషంతో, స్వాగతం పలుకుతూ వచ్చారు. మదీన ప్రవేశంలో ఉన్న ఖుబాలో మజిలి చేశారు. అక్కడ నాలుగు రోజులున్నారు. మస్జిద్ ఖుబా పునాది పెట్టారు. ఇది ఇస్లాంలో మొట్టిమొదటి మస్జిద్. ఐదవ రోజు మదీన వైపు బయలుదేరారు. అన్సారులో అనేక మంది ప్రవక్త ఆతిథ్య భాగ్యం తనకే దక్కాలని చాలా ప్రయత్నం చేసేవారు. అందుకని ప్రవక్త ఒంటె కళ్ళాన్ని పట్టుకునేవారు. అయితే ప్రవక్త వారికి ధన్యావాదాలు తెలుపుతూ, వదలండి! దానికి అల్లాహ్ ఆజ్ఞ అయిన చోటనే కూర్చుంటుంది అని చెప్పే వారు. అది అల్లాహ్ ఆజ్ఞ అయిన చోట కూర్చుంది. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దిగలేదు. మళ్ళీ లేచీ కొంత దూరం నడిచింది. తిరిగి వచ్చి మొదటి ప్రాంతంలోనే కూర్చుంది. అప్పుడు ప్రవక్త దిగారు. అదే ప్రస్తుతం మస్జిదె నబవి ఉన్న చోటు. ప్రవక్త అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) వద్ద ఆతిథ్యం స్వీకరించారు.

అటు అలీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త వెళ్ళాక మూడు రోజులు మక్కాలో ఉండి, ఆ మధ్యలో ప్రవక్త వద్ద ఉన్న అమానతులు హక్కుదారులకు చెల్లించి మదీనకూ బయలు దేరాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖుబాలో ఉండగా అక్కడికి వచ్చి కలుసుకున్నాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో

ఒంటె కూర్చున్న స్థలాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాని యజమానుల నుండి ఖరీదు చేసి అక్కడ మస్జిద్ నిర్మించారు. ముహాజిరీన్ మరియు అన్సారుల [2] మధ్య సోదర బాంధవ్యం ఏర్పరిచారు. ఒక్కో ముహాజిరును ఒక్కో అన్సారుతో కలిపి ఇతడు నీ సోదరుడు తన సొమ్ము లో కూడా నీ భాగమని తెలిపారు. ముహాజిరులు అన్సారులు కలసి పని చేసుకోవడం మొదలెట్టారు. వారి మధ్య సోదర బాంధవ్యం మరీ గట్టిపడింది.

[2]మదీనకు వలస వచ్చిన వారిని ముహాజిరీన్ అంటారు. వారి సహాయం చేసిన మదీన వాసులను అన్సార్ అంటారు.

మదీనాలో ఇస్లాం విస్తృతం కావడం మొదలయింది. కొందరు యూదులు ఇస్లాం స్వీకరించారు. వారిలో ఒకరు అబ్దుల్లాహ్ బిన్ సలాం (రదియల్లాహు అన్హు). ఇతను వారిలో ఒక పెద్ద పండితుడు. మరియు వారి పెద్ద నాయకుల్లో ఒకరు.

ముస్లిములు మక్కా నగరాన్ని వదలి వెళ్ళినప్పటికీ వారికి వ్యతిరేకంగా ముష్రికుల విరోధం, పోరాటం సమాప్తం కాలేదు. ఖురైషులకు మదీన యూదులతో ముందు నుండే సంబంధం ఉండెను. అయితే వారు దాన్ని ఉపయోగించి ముస్లిముల మధ్యగల ఐక్యతను భంగం కలిగించాలని, తృప్తిగా ఉండనివ్వకుండా మనోవ్యధకు గురి చేయాలని యూదులను ప్రేరేపించేవారు. అంతే కాదు, వారు స్వయంగా ముస్లిములను బెదిరిస్తూ, అంతమొందిస్తామని హెచ్చరించేవారు. ఈ విధంగా ముస్లిములకు ముప్పు ఇరువైపులా చుట్టుముట్టింది. అంటే మదీన లోపల ఉన్నవారితో మరియు బైటి నుండి ఖురైషులతో. సమస్య ఎంత గంభీరమైనదంటే సహాబాలు ఆయుధాలు తమ వెంట ఉంచుకొని రాత్రిళ్ళు గడిపేవారు. ఈ భయాందోళన సందర్భంలోనే అల్లాహ్ యుద్ధానికి అనుమతించాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గస్తీ దళాల్ని తయారు చేసి పంప సాగారు. వారు చుట్టు ప్రక్కల్లో శత్రువులపై దృష్టి ఉంచేవారు. ఒక్కోసారి వారి వ్యాపార బృందాలను అడ్డుకునేవారు. వీటి ఉద్దేశం: ముస్లిములు అశక్తులు కారు అని తెలియజేయుటకు, వారిపై ఒత్తిడి చేయుటకు, ఇలా వారు సంధికి దిగి వచ్చి, ముస్లిములు స్వేచ్ఛగా ఇస్లాంపై ఆచరిస్తూ, దాని ప్రచారం చేసుకోవడంలో వారు అడ్డు పడకూడదని. అలాగే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చుట్టుప్రక్కలో ఉన్న తెగలవారితో ఒప్పందం, ఒడంబడికలు కుదుర్చుకున్నారు.

బద్ర్ యుద్ధం

ముస్లిములు మక్కాలో ఉన్నప్పుడు ముష్రికులు వారిని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసి చివరికి తమ స్వస్థలాన్ని వదలి వలస వెళ్ళే స్థితికి తీసుకొచ్చారు (అన్న విషయం తెలిసినదే). అందువల్ల వారు తమ జన్మస్థలాన్ని, తమ ధనాన్ని మరియు తమవారిని వదలి మదీనా వచ్చారు. అప్పుడు ముష్రికులు వారి ధనాన్ని ఆక్రమించుకున్నారు. అంతేకాదు ఇటు మదీనా వాసులపై దొంగ దాడులు చేస్తూ తృప్తిగా ఉండకుండా చేయసాగారు.

అందుకే ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సీరియా నుండి వస్తున్న ఖురైషు వాణిజ్య బృందాన్ని అడ్డుకొని, వారిని అదుపులో మరియు భయంలో ఉంచాలని నిశ్చయించి, 313 మంది సహాబాలతో కలసి వెళ్ళారు. అప్పుడు వారి వద్ద రెండు గుర్రాలు, 70 ఒంటెలు మాత్రమే ఉన్నాయి. ఖురైషు బృందంలో 1000 ఒంటెలున్నాయి. 40 మంది ఉన్నారు. అబూ సుఫ్యాన్ వారికి నాయకత్వం వహిస్తున్నాడు. కాని మస్లిములు అడ్డుకునే విషయాన్ని అబూ సుఫ్యాన్ గ్రహించి, ఈ వార్త మక్కా పంపుతూ, వారితో సహాయం కోరాడు. అంతే కాదు, అతడు తన బృందంతో ప్రధాన రహదారిని వదిలేసి వేరే దొడ్డిదారి గుండా వెళ్ళిపోయాడు. ముస్లిములు వారిని పట్టుకోలేక పోయారు. అటు వార్త తెలిసిన మక్కా ఖురైషులు, 1000 యుద్ధవీరులతో పెద్ద సైన్యం తయారు చేసుకొని బయలుదేరారు. వీరు దారిలో ఉండగానే అబూ సుఫ్యాన్ రాయబారి వచ్చి, వాణిజ్య బృందం ముస్లిముల నుండి తప్పించుకొని, క్షేమంగా చేరుకోనుంది. మీరు తిరిగి మక్కా వచ్చేసెయ్యండి అని చెప్పాడు. కాని అబూ జహల్ నిరాకరించాడు. తిరిగి మక్కా పోవడానికి ఒప్పుకోలేదు. ప్రయాణం ముందుకు సాగిస్తూ బద్ర్ వైపు వెళ్ళాడు.

ఖురైషు సైన్యం బయలుదేరిన విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తెలిసిన తర్వాత తమ సహచరులతో సమాలోచన చేశారు. అందరూ అవిశ్వాసులతో పోరాడుటకు సిద్ధమేనని ఏకీభవించారు. రెండవ హిజ్ర శకం, రమజాను మాసములోని ఒక రోజు రెండు సైన్యాలు పోరాటానికి దిగాయి. ఇరువురి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ముస్లింలు విజయం పొందారు. వీరిలో 14 మంది సహాబాలు షహీదు (అమరవీరు) లయ్యారు. ముష్రికుల్లో 70 మంది వధించబడగా, మరో 70 మంది ఖైదీలయ్యారు.

ఈ యుద్ధ సందర్భంలోనే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూతురు, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) సతీమణి రుఖయ్యా (రదియల్లాహు అన్హా) మరణించారు. అందుకే ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఈ యుద్ధం లో పాల్గొన లేకపోయాడు. ప్రవక్త ఆదేశం మేరకు అతను తన అనారోగ్యంగా ఉన్న భార్య సేవలో మదీనలోనే ఉండిపోయాడు. ఈ యుద్ధం తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ రెండవ కూతురు ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) వివాహం ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)తో చేశారు. అందుకే అతను జిన్నూరైన్ అన్న బిరుదు పొందాడు. అంటే రెండు కాంతులు గలవాడు అని.

బద్ర్ యుద్ధంలో ముస్లిములు అల్లాహ్ సహాయంతో విజయం సాధించి, ముష్రికు ఖైదీలతో మరియు విజయధనంతో సంతోషంగా తిరిగి మదీన వచ్చారు. ఖైదీల్లో కొందరు పరిహారం చెల్లించి విడుదలయ్యారు. మరి కొందరు ఏ పరిహారం లేకుండానే విడుదలయ్యారు. ఇంకొందరి పరిహారం; ముస్లిం పిల్లవాళ్ళకు చదువు నేర్పడం నిర్ణయమయింది. వారు ఇలా విడుదలయ్యారు.

ఈ యుద్ధంలో ముష్రికుల పేరుగాంచిన నాయకులు, ఇస్లాం బద్దశత్రువులు హతమయ్యారు. వారిలో అబూ జహల్, ఉమయ్య బిన్ ఖల్ఫ్, ఉత్బా బిన్ రబీఆ మరియు షైబా బిన్ రబీఆ వైగారాలు.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్