మూడు మస్జిద్ లు తప్ప ఇతర పుణ్యస్థలాల దర్శనార్ధం ప్రయాణ సంకల్పం నిషిద్ధం

882. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

మూడు మస్జిద్ ల దర్శనం కోసం తప్ప మరే పుణ్యస్థల దర్శనం కోసమూ ప్రయాణం చేయకూడదు.
(1) మస్జిదుల్ హరాం (మక్కాలోని కాబా మస్జిద్)
(2) మస్జిదె నబవి (మదీనాలోని ప్రవక్త మస్జిద్)
(3) బైతుల్ మఖ్దిస్ లోని మస్జిదె అఖ్సా

[సహీహ్ బుఖారీ : 20 వ ప్రకరణం – ఫజ్లిస్సలాతి ఫీ మస్జిద్ మక్కా వ మదీనా – 1 వ అధ్యాయం – ఫజ్లిస్సలాతి ఫీ మస్జిద్]

హజ్ ప్రకరణం – 95 వ అధ్యాయం – మూడు మస్జిద్ లు తప్ప ఇతర పుణ్యస్థలాల దర్శనార్ధం ప్రయాణ సంకల్పం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నా (ఉమ్మత్) లో ఒక వర్గం ఎల్లప్పుడూ ధైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగా ఉంటుంది

1250. హజ్రత్ ముఆవియా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

నా అనుచర సమాజం (ఉమ్మత్) లో ఒకవర్గం ఎల్లప్పుడూ ధైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగా ఉంటుంది. ఎవరైనా వారిని అవమాన పరచదలిచినా లేదా వ్యతిరేకించ దలచినా వారా వర్గం (ముస్లింల) కు ఎలాంటి హాని కలిగించలేరు. ఆ విధంగా చివరికి ప్రళయం వచ్చినా అప్పుడు కూడా ఆ వర్గం వారు దైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగానే ఉంటారు.

[సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం – మనాఖిబ్, 28 వ అధ్యాయం – హద్దసనీ ముహమ్మదుబ్నుల్ ముసన్నా]

పదవుల ప్రకరణం : 53 వ అధ్యాయం – నా అనుచర సమాజంలో ఒక వర్గం ఎల్లప్పుడూ ధర్మంపై స్థిరంగా ఉంటుంది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

హజ్ లో – కాబా వీడ్కోలు ప్రదక్షిణ చేయడం తప్పనిసరి, అయితే రుతుమతికి (Menstruating woman) మినహాయింపు ఉంది

836. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో “దైవప్రవక్తా! సఫియా బిన్తే హుయ్యి (రధి అల్లాహు అన్హు) బహిష్టు అయి ఉంది” అని తెలిపాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మనం ఆగిపోవడానికి ఈమె కారకురాలవుతుందేమో!” అని అన్నారు. ఆ తరువాత “ఆమె మీ అందరితో పాటు ఏదైనా ఒకసారి కాబా ప్రదక్షిణ చేయలేదా?” అని అడిగారు. “ఎందుకు చెయ్యలేదు, చేసింది (సందర్శనా ప్రదక్షిణ)” అన్నా నేను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అయితే ఇక పరవాలేదు. మనం బయలుదేరవచ్చు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 6 వ ప్రకరణం – హైజ్, 27 వ అధ్యాయం – అల్ మర అతి తహైజు బాదల్ ఇఫాజా]

హజ్ ప్రకరణం – 67 వ అధ్యాయం – వీడ్కోలు ప్రదక్షిణ చేయడం తప్పనిసరి, అయితే రుతుమతికి మినహాయింపు ఉంది. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఇతను ప్రళయదినాన లబ్బైక్ అంటూ లేస్తాడు

753. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఒక వ్యక్తి అర్ఫా రోజు (Day of Arafah) వఖూఫ్ (లేచి ఉండు) స్థితిలో ఉండి హఠాత్తుగా ఒంటె మీద నుంచి జారిపడ్డాడు. అతని మెడ ఎముక విరగడంతో (అక్కడికక్కడే) చనిపోయాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అతని భౌతిక కాయానికి రేగాకులు కలిపిన నీళ్ళతో స్నానం చేయించి రెండు వస్త్రాలతో చుట్టండి. శవానికి సువాసన పూయకండి. ముఖం (వస్త్రంతో) కప్పకుండా అలాగే బయట ఉంచండి. ఇతను ప్రళయదినాన లబ్బైక్ అంటూ లేస్తాడు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయేజ్, 20 వ అధ్యాయం – అల్ కఫని ఫి సౌబైన్]

హజ్ ప్రకరణం : 14 వ ప్రకరణం – ఇహ్రాం స్థితిలో యాత్రికుడు చనిపోతే ఏం చేయాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

తారాబలాన్ని నమ్మడం సత్యతిరస్కారంతో సమానం

46. హజ్రత్ జైద్ బిన్ ఖాలిద్ జుహ్ని (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు ఆఇహి వసల్లం) మాతో కలిసి హుదైబియా ప్రాంతంలో ఉదయం నమాజు చేశారు. రాత్రి వర్షం కురిసింది. ఉదయం వరకు నేల తడిగానే ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు ముగిసిన తరువాత అనుచరుల వైపుకు తిరిగి, “అల్లాహ్ ఏం సెలవిచ్చాడో మీకు తెలుసా?” అని అడిగారు. “దేవునికి, దైవప్రవక్తకే బాగా తెలుసు. మాకు తెలియదు” అన్నారు అనుచరులు. అప్పుడు దైవప్రవక్త ఈ విధంగా తెలిపారు –

“అల్లాహ్ ఇలా అన్నాడు – ఈ రోజు ఉదయం నా దాసులలో కొందరు విశ్వాసులయిపోయారు, మరి కొందరు అవిశ్వాసులయిపోయారు. దేవుని దయవలన మనకు వర్షం కురిసింది అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలానా నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసిందని అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 156 వ అధ్యాయం – యస్తగ్ బిలుల్ ఇమామున్నాస ఇజా సల్లమ్]

విశ్వాస ప్రకరణం – 30 వ అధ్యాయం – తారాబలాన్ని నమ్మడం సత్యతిరస్కారంతో సమానం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఫజ్ర్, అస్ర్ నమాజుల ఔన్నత్యం, వాటి పరిరక్షణ

367. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :-

మీ దగ్గరకు రాత్రి దైవదూతలు, పగటి దైవదూతలు ఒకరి వెనుక మరొకరు వస్తారు. ఈ రెండు బృందాలు ఫజ్ర్, అస్ర్ నమాజులలో మాత్రం కలుస్తారు. రాత్రంతా మీతో పాటు గడిపిన దైవదూతలు తిరిగి ఆకాశం పైకి వెళ్ళినప్పుడు మీ ప్రభువు వారిని ఉద్దేశించి “మీరు నా దాసులను ఏ స్థితిలో వదిలిపెట్టి వచ్చారు?” అని అడుగుతాడు. దానికి దైవదూతలు “మేము వారి దగ్గర్నుంచి బయలు దేరేటప్పుడు వారు నమాజు చేస్తూ ఉండటం కన్పించింది. అంతకు ముందు మేము వారి దగ్గరకు చేరుకున్నప్పుడు కూడా వారిని నమాజ్ స్థితిలోనే చూశాము” అని సమాధానమిస్తారు.

[సహీహ్ బుఖారీ : 9 వ ప్రకరణం – మనాఖియతుస్సలాత్, 16 వ అధ్యాయం – ఫజ్లి స్సలాతిల్ అస్ర్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 37 వ అధ్యాయం – ఫజ్ర్, అస్ర్ నమాజుల ఔన్నత్యం, వాటి పరిరక్షణ . మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1 . సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మృతుని కోసం చేసే దానం అతనికి పుణ్యం చేకూర్చుతుంది

588. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “నా తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. మాట్లాడే అవకాశం గనక లభించి ఉంటే ఆమె (తన తరఫున) దానం చేయమని చెప్పి ఉండేది. మరి ఇప్పుడు నేను ఆమె తరఫున ఏదైనా దానం చేస్తే దాని పుణ్యం ఆమెకు చేరుతుందంటారా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేరుతుందని సమాధానమిచ్చారు.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయేజ్, 95 వ అధ్యాయం – మౌతిల్ ఫుజా అల్ బగ్ తత్]

జకాత్ ప్రకరణం – 15 వ అధ్యాయం – మృతుని కోసం చేసే దానం అతనికి పుణ్యం చేకూర్చుతుంది. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మితిమీరిన ముఖస్తుతి మంచిది కాదు

1888. హజ్రత్ అబూ బక్రా (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఒకతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ఒక వ్యక్తిని పొగిడాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది విని “నువ్వు చెడ్డపని చేశావు. నీవు పొగడ్తలతో, నీ మిత్రుని గొంతుకోశావు” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట అనేకసార్లు అన్నారు. తర్వాత ఆయన ఇలా అన్నారు : “మీలో ఎవరైనా మీ సోదరుడ్ని పొగడటం చాలా అవసరమని భావించినప్పుడు ఈ విధంగా అనాలి – ‘ఇది నా అభిప్రాయం. వాస్తవ పరిస్థితి అల్లాహ్ కు మాత్రమే తెలుసు. నేను అల్లాహ్ కు వ్యతిరేకంగా ఎవరి పవిత్రతనూ నిరూపించడం లేదు. ఆ వ్యక్తి ఇలాంటివాడు, అలాంటివాడు అని అన్నానంటే ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ – ఈ మాటలయినా ఆ మనిషి గురించి మీకు వ్యక్తిగతంగా తెలిసి ఉన్నప్పుడే అనాలి. (అంతేగాని ఎవరో చెప్పిన మాటలు విని పొగడకూడదు)”.

[సహీహ్ బుఖారీ : 52 వ ప్రకరణం – అష్షహాదాత్, 17 వ అధ్యాయం – ఇజా జక్కా రజులున్ రజులన్ కఫాహు]

ప్రేమైక వచనాల ప్రకరణం : 14 వ అధ్యాయం -మితిమీరిన ముఖస్తుతి మంచిది కాదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నాకు పూర్వం ఏ ధైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి

299. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రది అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :-

నాకు పూర్వం ఏ ధైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి.

(1) నా గాంభీర్యానికి శత్రువులు ఒకనెల ప్రయాణపు దూరం నుండే భయపడి పోయేలా అల్లాహ్ నాకు సహాయం చేస్తున్నాడు.

(2) నా కోసం యావత్తు భూమండలం ప్రార్ధనా స్థలంగా, పరిశుద్ధ పరిచే వస్తువుగా చేయబడింది. అందువల్ల నా అనుచర సమాజంలోని ప్రతి వ్యక్తీ ఏ చోటున ఉంటే ఆ చోటునే వేళ అయినప్పుడు నమాజు చేసుకోవచ్చు.

(3) నా కోసం యుద్ధప్రాప్తి (మాలె గనీమత్) ను వాడుకోవడం ధర్మసమ్మతం చేయబడింది.

(4) ఇతర ధైవప్రవక్తలందరూ తమతమ జాతుల కోసం మాత్రమే ప్రత్యేకించబడగా, నేను యావత్తు మానవాళి కోసం ధైవప్రవక్తగా పంపబడ్డాను.

(5) నాకు (పరలోక తీర్పుదినాన సాధారణ) సిఫారసు (*) చేసే అధికారం ఇవ్వబడింది.

(*) ఇక్కడ సిఫారసు అంటే, హషర్ మైదానంలో మానవులంతా తీవ్ర ఆందోళనకు గురి అయినపుడు చేసే సాధారణ సిఫారసు అని అర్ధం. అప్పుడు ఇతర ప్రవక్తలందరూ ప్రజలను నిరాశపరుస్తారు. అయితే ఇతర సందర్భాలలో ప్రత్యేక సిఫారసు ప్రవక్తలు, సజ్జనులు కూడా చేస్తారు. లేదా ఇక్కడ సిఫారసు అంటే రద్దు కానటువంటి సిఫారసు కాని, అణుమాత్రం విశ్వాసమున్న వారికి సయితం ప్రయోజనం చేకూర్చే సిఫారసు గానీ అయి ఉంటుంది.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 56 వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి …. జు ఇలత్ లియల్ అర్జుకుల్లాహ మస్జిదన్ వ తహూర]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1 – సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

రాత్రి పడుకునేటప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడటం

1739. హజ్రత్ అలీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

హజ్రత్ ఫాతిమా (రధి అల్లాహు అన్హ) తిరగలి విసరి విసరి వ్యాధిగ్రస్తులయ్యారు. (అంటే ఆమె చేతులకు కాయలు కాశాయి). ఓసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు కొందరు (యుద్ధ) ఖైదీలు వచ్చారు. అది తెలిసి హజ్రత్ ఫాతిమా (రధి అల్లాహు అన్హ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికెళ్లారు. కాని ఆయన లేరు. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) మాత్రమే వున్నారు. అందుచేత ఫాతిమా (రధి అల్లాహు అన్హ) ఆమెనే కలుసుకొని విషయం తెలియజేశారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చారు. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఆయనకు ఫాతిమా (రధి అల్లాహు అన్హ) వచ్చి పోయిన సంగతి తెలియజేశారు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేము మా పడకలపై పడుకొని ఉన్నాము. నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను చూసి లేవడానికి ప్రయత్నించాను. కాని ఆయన నన్ను అలాగే పడుకొని ఉండమని చెప్పి మా ఇద్దరి మధ్య కూర్చున్నారు. అప్పుడు ఆయన దివ్యపాదాల చల్లదనం నా గుండెలకు తాకింది. ఆయన ఇలా అన్నారు,

“(ఫాతిమా!) నీవు నన్నడిగిన దానికంటే ఎంతో మేలయినది నీకు చెప్పనా? నీవు పడుకోవటానికి పడక మీదికి చేరినపుడు 34 సార్లు అల్లాహు అక్బర్ అనీ, 33 సార్లు సుబ్ హానల్లాహ్ అనీ, 33 సార్లు అల్ హమ్దులిల్లాహ్ అనీ పఠిస్తూ ఉండు. ఈ స్మరణ నీ కోసం సేవకుడి కంటే ఎంతో శ్రేష్ఠమైన సంపద.”

[సహీహ్ బుఖారీ :- 62 వ ప్రకరణం – ఫజాయిలి అస్ హాబిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం), 9 వ అధ్యాయం – మనాఖిబ్ అలీ బిన్ అబీతాలిబ్ అల్ ఖురషీ – రజి]

ప్రాయశ్చిత్త ప్రకరణం : 19 వ అధ్యాయం – ఉదయం, రాత్రి పడుకునేటప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడటం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2 . సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్