నేను మీకు అన్నిటికంటే ఘోరమైన పాపాలను గురించి తెలుపనా?

54. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబూ బక్ర్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్మల్ని ఉద్దేశించి “నేను మీకు అన్నిటికంటే ఘోరమైన పాపాలను గురించి తెలుపనా? అని అడిగారు. ఈమాట ఆయన మూడుసార్లు పలికారు. దానికి మేము “తప్పకుండా తెలుపండి దైవప్రవక్తా!” అన్నాము. అప్పుడాయన “అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పించటం, తల్లిదండ్రులమాట వినకపోవటం”  అని తెలిపారు. ఆ తరువాత ఆయన ఆనుకుని కూర్చున్న వారల్లా ఒక్కసారిగా లేచి సరిగా కూర్చొని “జాగ్రత్తగా వినండి! అబద్ధమాడటం (అన్నిటికంటే ఘోరమైన పాపం)” అని అన్నారు. ఇలా మాటిమాటికి చెబుతూ పోయారు. చివరికి మేము మనసులో “అయ్యో! ఈయన ఈ మాటలు ఇక చాలిస్తే బాగుండు” అని అనుకున్నాం.

[సహీహ్ బుఖారీ : 52 వ ప్రకరణం – షహాదాత్, 10 వ అధ్యాయం – మాఖీల ఫీషహాదతిజ్జూర్]

విశ్వాస ప్రకరణం : 36 వ అధ్యాయం – ఘోరపాపాలు, ఘోరాతి ఘోరమైన పాపాలు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1.
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఈ మాటను గనక ఆవ్యక్తి పలికితే అతని కోపం పటాపంచలయిపోతుంది

1677. హజ్రత్ సులైమాన్ బిన్ సుర్ద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ఇంటి) సమీపంలో ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోసాగారు. ఆ సమయంలో నేను కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గర కూర్చొని వున్నాను. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకతను కోపంతో రెండవ వ్యక్తిని దూషించటం మొదలుపెట్టాడు. కోపంతో అతని ముఖం జేవురించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని వైఖరి చూసి “నాకో మాట తెలుసు. ఈ మాటను గనక ఆవ్యక్తి పలికితే అతని కోపం పటాపంచలయిపోతుంది. ఆ మాట – అవూజు బిల్లాహి మినష్ షైతానిర్రజీం” అని అన్నారు. ప్రజలు ఈమాట విని ఆవ్యక్తితో “నీవు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాన్ని వినలేదా?” అని అన్నారు. దానికా వ్యక్తి “నేను పిచ్చివాడ్ని కాను” అన్నాడు.(*)

(*) అల్లాహ్ విషయంలో తప్ప మరేదయినా విషయంలో కోపం వస్తే అది షైతాన్ ప్రేరణ వల్ల వచ్చిందని గ్రహించాలి. అప్పుడు “అవూజు బిల్లాహి మినష్షైతాన్” అని పఠించాలి. దాంతో షైతాన్ పారిపోతాడు. కోపం కూడా తగ్గిపోతుంది. ఈవ్యక్తి ‘నేను పిచ్చివాడ్ని కాను’ అన్నాడంటే అది అతని అజ్ఞానాన్ని బహిర్గతం చేస్తోందని గ్రహించాలి. ఉన్మాదం ఆవహించినప్పుడు మాత్రమే అవూజు బిల్లాహ్ పఠిస్తారని అతను భావించాడు. కాని కోపం కూడా ఒక విధమైన ఉన్మాదం అని అతను గ్రహించలేదు. కోపం వచ్చినప్పుడు మనిషి సమతౌల్యాన్ని కోల్పోతాడు. (సంకలనకర్త)

[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 76 వ అధ్యాయం – అల్ హజ్రి మినల్ గజబ్]

సామాజిక మర్యాదల ప్రకరణం – 30 వ అధ్యాయం – కోపాన్ని దిగమింగేవాడు, దిగమింగేందుకు ప్రయత్నించేవాడు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఓ ఖర్జూరపు ముక్కనయినా సరే దానం చేసి నరకాగ్ని నుండి రక్షించుకోండి

597. హజ్రత్ అదీ బిన్ హాతిం (రధి అల్లాహు అన్హు) ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

“అతి త్వరలోనే అల్లాహ్ ప్రళయదినాన మీలోని ప్రతివ్యక్తితో ప్రత్యక్షంగా మాట్లాడుతాడు. ఆరోజు అల్లాహ్ కి దాసునికి మధ్య ఎలాంటి అనువాదకుడు ఉండదు. దాసుడు తల పైకెత్తి చూస్తాడు. మొదట తన ముందు ఏదీ కన్పించదు. రెండవసారి మళ్ళీ తలపైకెత్తి చూస్తాడు. అప్పుడతని ముందు ఎటు చూసినా అతనికి స్వాగతం చెబుతూ అగ్నే (భగభగ మండుతూ) కన్పిస్తుంది. అందువల్ల మీలో ఎవరైనా ఖర్జూరపు ముక్కయినా సరే దానం చేసి నరకం నుండి కాపాడుకోగలిగితే కాపాడుకోవాలి.”

హజ్రత్ అదీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారమే మరో సందర్భంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నరకాన్ని ప్రస్తావిస్తూ “నరకాగ్ని నుండి కాపాడుకోండి” అన్నారు. ఈ మాట చెప్పి ఆయన ముఖం ఓ ప్రక్కకు తిప్పుకున్నారు. (తాను నరకాగ్నిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు) నరకాగ్ని పట్ల భీతి, అసహ్యతలు వెలిబుచ్చారు. ఆ తరువాత తిరిగి ఆయన “నరకాగ్ని నుండి రక్షించుకోండి” అన్నారు. మళ్ళీ నరకాగ్ని పట్ల భీతి, అసహ్యతలు వెలిబుచ్చుతూ ముఖాన్ని ఒక పక్కకు తిప్పుకున్నారు.

ఈ విధంగా ఆయన మూడుసార్లు చేశారు. చివరికి ఆయన నిజంగానే నరకాగ్ని చూస్తున్నారేమోనని మాకు అనుమానం వచ్చింది. ఆ తరువాత ఇలా అన్నారు: “ఓ ఖర్జూరపు ముక్కనయినా సరే దానం చేసి నరకాగ్ని నుండి రక్షించుకోండి. అదీ దొరక్కపోతే ఓ మంచి మాటయినా పలకండి. నోట ఓ మంచిమాట వెలువడటం కూడా దానం (సదఖా) గానే పరిగణించబడుతుంది“.

[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – రిఖాఖ్, 49 వ అధ్యాయం – మన్నూ ఖిషల్ హిసాబి అజాబ్]

జకాత్ ప్రకరణం – 20 వ అధ్యాయం – దానం నరకానికి అడ్డుగోడగా నిలుస్తుంది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1.
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజులో మరచిపోవటం, సహూ సజ్దా చేయటం గురించి

335. హజ్రత్ అబ్దుల్లా బిన్ బహీనా (రధి అల్లాహు అన్హు) కధనం :-

(ఓ రోజు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక నమాజులో రెండు రకాతులు పఠించిన తరువాత లేచి నిల్చున్నారు. ‘ఖాయిదాయె ఊలా’ ప్రకారం కూర్చోవడం మరచిపోయారు. అనుచరులు కూడా ఆయనతో పాటు పైకి లేచారు. నమాజు పూర్తయి ‘సలాం’ చేయడానికి మేము ఎదురుచూస్తున్న తరుణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘అల్లాహు అక్బర్’ అంటూ కూర్చునే రెండు సార్లు సజ్దా చేశారు. ఆ తరువాత కుడి ఎడమల వైపు సలాం చేశారు.

[సహీహ్ బుఖారీ : 22 వ ప్రకరణం – సహూ, 15 వ అధ్యాయం – మాజాఅ ఫిస్సహూ….]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 19 వ అధ్యాయం – నమాజులో మరచిపోవటం, సహూ సజ్దా చేయటం గురించి. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు స్థితిలో మాట్లాడటం నిషిద్ధం

311. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

మొదట్లో మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేస్తుంటే ఆయనకు సలాం చేసే వాళ్ళము. నమాజు స్థితిలోనే ఆయన మాకు ప్రతి సలాం పలికేవారు. అయితే మేము (అబిసీనియా రాజు) నజాషీ దగ్గర నుండి (వలస వెళ్లి) తిరిగి వచ్చిన తరువాత మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు (నమాజు స్థితిలో) సలాం చేస్తే, ఆయన మాకు సమాధానమివ్వలేదు. (నమాజు ముగిసిన తరువాత) “నమాజు చేస్తున్నప్పుడు మనిషికి ఏకాగ్రత చాలా అవసరం” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 21 వ ప్రకరణం – అల్ అమలు ఫిస్సలాత్, 2 వ అధ్యాయం – మాయున్హా మినల్ కలామి ఫిస్సలాత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 7 వ అధ్యాయం – నమాజు స్థితిలో మాట్లాడటం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

క్రింది చేయి కంటే పైచేయి శ్రేష్టమైనది

613. హజ్రత్ హకీం బిన్ హిజామ్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

క్రింది చేయి కంటే పైచేయి శ్రేష్టమైనది. మొదట మీ పోషణలో ఉన్న వారికి దానం చేయండి. దానమిచ్చిన తరువాత కూడా మనిషి ధనవంతుడిగా ఉండిపోతే అలాంటి వ్యక్తి చేసే దానమే ఎంతో శ్రేష్టమైనది. (దానం) అర్ధించడం మానుకున్న వ్యక్తికి అల్లాహ్ దేవురించే అవమానం నుండి కాపాడుతాడు. దాన స్వీకారాన్ని లక్ష్యపెట్టకుండా మసలుకునే వారికి అల్లాహ్ కలిమిని ప్రసాదిస్తాడు.

[సహీహ్ బుఖారీ : 24 వ ప్రకరణం – జకాత్, 18 వ అధ్యాయం – లా సదఖత ఇల్లా అన్ జహ్ రిగ్నీ]

జకాత్ ప్రకరణం – 32వ అధ్యాయం – ఇచ్చే చేయి ఎప్పుడూ పైనే, పుచ్చుకునే చేయి ఎప్పుడూ క్రిందనే. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

The Upper Hand is better then the Lower Hand and Imaam Sufyaan ath-Thawree on the Filth of the People

ఇద్దరు తప్ప మరెవరి పట్లా అసూయ చెందటం ధర్మసమ్మతం కాదు

467. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రది యల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :-

“ఇద్దరు తప్ప మరెవరి పట్లా అసూయ చెందటం ధర్మసమ్మతం కాదు. ఒకరు, అల్లాహ్ సిరిసంపదలు అనుగ్రహించడంతో పాటు, వాటిని దైవమార్గంలో వినియోగించే సద్బుద్ధి కూడా ప్రసాదించబడిన వ్యక్తి. రెండోవాడు, అల్లాహ్ విజ్ఞతా వివేకాలు ప్రసాదించగా, వాటి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ, ఆ విజ్ఞతావివేకాలను ఇతరులకు కూడా బోధిస్తూ ఉండే వ్యక్తి.”

[సహీహ్ బుఖారీ : వ ప్రకరణం – ఇల్మ్, వ అధ్యాయం – అల్ ఇగ్గిబాతి ఫిల్ ఇల్మివల్ హిక్మత్]

47 వ అధ్యాయం – ఖుర్ఆన్ విద్య నేర్చుకొని ఇతరులకు నేర్పే వ్యక్తి ఔన్నత్యం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మస్జిద్ లో రెండు రకాతులు (నఫిల్) నమాజు చెయ్యనిదే కూర్చోరాదు

503. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపన్యాసం ఇస్తూ “ఇమామ్ ఉపన్యాసం ఇస్తున్నప్పుడు” లేక ఉపన్యాసం ఇవ్వడానికి ఉపక్రమించినప్పుడు ఎవరైనా వస్తే అతను (ముందుగా) రెండు రకాతులు (నఫిల్) నమాజు చేయాలి” అని అన్నారు.(*)

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 25 వ అధ్యాయం – మాజాఅ ఫిత్తత్వా మస్నామస్నా]

జుమా ప్రకరణం – 14 వ అధ్యాయం – జుమా ప్రసంగం సమయంలో ‘తహ్యతుల్ ఉజూ’ నమాజ్ చేయవలెను . మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ప్రతి నమాజు తరువాత, ‘సుబహానల్లాహ్’ అని, ‘అలహందులిల్లాహ్’ అని, ‘అల్లాహు అక్బర్’ అని ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించండి

348. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఓ రోజు కొందరు పేదప్రజలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! ధనికులు తమ సిరిసంపదల మూలంగా గొప్పగొప్ప హొదా, అంతస్తులు, శాశ్వత సౌఖ్యాలు పొందగలుగుతున్నారు. వారు మాలాగా నమాజులు కూడా చేస్తున్నారు, ఉపవాసాలు కూడా పాటిస్తున్నారు, పైగా డబ్బున్నందున హజ్, ఉమ్రా ఆచారాలు కూడా పాటిస్తున్నారు. జిహాద్ (ధర్మపోరాటం) కూడా చేస్తున్నారు. దానధర్మాలు కూడా చేస్తున్నారు” అని అన్నారు.

అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-  “సరే, నేను మీకో విషయం తెలియజేయనా? దాన్ని గనక మీరు మీ దినచర్యగా చేసుకుంటే, మిమ్మల్ని మించిపోయిన వాళ్ళతో మీరు సమానులయిపోతారు. ఆ తరువాత మీతో మరెవరూ పోటీ ఉండరు. ఈ పద్ధతి అనుసరించే వాడుతప్ప మీరే అందరికంటే శ్రేష్ఠులయి పోతారు. ఆ విషయం ఏమిటంటే, ప్రతి నమాజు తరువాత, ‘సుబహానల్లాహ్’ అని, ‘అలహందులిల్లాహ్’ అని, ‘అల్లాహు అక్బర్’ అని ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించండి”.

హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-  ఆ తరువాత (వీటి సంఖ్య విషయమయి) మాలో విబేధాలు వచ్చాయి. కొందరు సుబహానల్లాహ్, అలహందులిల్లాహ్ అనే మాటలు ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించాలని, అల్లాహు అక్బర్ అనే మాటను ముఫ్ఫై నాలుగుసార్లు స్మరించాలని అన్నారు. అందువల్ల నేను ఈ విషయం గురించి మరోసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అడిగాను. అప్పుడాయన “సుబహానల్లాహ్, అలహందులిల్లాహ్, అల్లాహు అక్బర్ అనే మాటలలో ప్రతిదాన్ని ముఫ్ఫై మూడుసార్లు పఠించండి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 115 వ అధ్యాయం – అజ్జిక్రి బాదస్సలాత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 26 వ అధ్యాయం – నమాజు తరువాత ఏ ధ్యానం అభిలషణీయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజులో ఏఏ కీడు నుండి అల్లాహ్ శరణు కోరాలి?

344. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజులో తషహ్హుద్ తరువాత ఇలా దుఆ (ప్రార్ధన) చేస్తూ ఉంటే నేను విన్నాను.

అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మహ్యాయి వ ఫిత్నతిల్ మమాతి. అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మినల్ మాసమి వల్ మగ్రమ్.

“దేవా! నేను సమాధి యాతన నుండి నీ శరణు కోరుతున్నాను. ‘మసీహిద్దజ్జాల్’ ఉపద్రవం నుండి నీ శరణు కోరుతున్నాను. జీవన్మ(*)రణాల పరీక్ష నుండి నీ శరణు కోరుతున్నాను. దేవా! పాపాల్లో పడివేసే పనుల నుండి నీ శరణు కోరుతున్నాను. రుణగ్రస్తుడిని అయ్యే దుస్థితి నుండి నీ శరణు కోరుతున్నాను.”

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీరు రుణగ్రస్త స్థితి నుండి కూడా అంత ఎక్కువగా శరణు కోరుతున్నారెందుకు?” అని అడిగాడు. దానికి ఆయన సమాధానమిస్తూ “ఎందుకంటే మనిషి అప్పుల పాలయితే అసత్యమాడతాడు. వాగ్దాన భంగానికి పాల్పడతాడు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 149 వ అధ్యాయం – అద్దుఆవు ఖబ్లస్సలాం ]

(*) ‘జీవిత’ పరీక్ష అంటే, మానవ జీవితంలో ఎదురయ్యే పరీక్షలన్నీ అని అర్ధం. ఉదాహరణకు – పనికిమాలిన విషయాల్లో చిక్కుకు పోవడం, మనోవాంఛలకు బలయిపోవడం మొదలైనవి. మరణ పరీక్ష అంటే, మనిషి మరణ ఘడియల్లో దైవానుగ్రహం పట్ల నిరాశ చెందడం, సద్వచనం (కలిమా) పలకలేక పోవడం, ఇస్లాం వ్యతిరేక విషయాలు మాట్లాడటం ఇత్యాదివి. రుణగ్రస్తుడవడం అంటే, అధర్మ కార్యాలు లేక అనవసరమైన పనుల కోసం చేసే అప్పు అన్నమాట. లేదా అప్పుతీర్చే సద్బుద్ధి లేకపోవడం. నిజమైన అవసరాల నిమిత్తం అప్పు తీసుకోవడంలో తప్పులేదు. అయితే దాంతో పాటు అప్పు తీర్చే స్తోమత కూడా ఉండాలి. ఈ దుఆ (వేడుకోలు) మొదటి భాగం దేవుని హక్కులకు, రెండవభాగం దాసుల హక్కులకు సంభందించినది.

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 25 వ అధ్యాయం – నమాజులో ఏఏ కీడు నుండి దేవుని శరణు కోరాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్