ఇస్రా మరియు మేరాజ్ యాత్ర – సలీం జామియీ [వీడియో & టెక్స్ట్]

మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర ఇస్రా మరియు మేరాజ్ యాత్ర
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/ts0-ZZ_G9D0 [39 నిముషాలు]

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రలోని ఇస్రా మరియు మేరాజ్ యాత్ర గురించి ఈ ప్రసంగం వివరిస్తుంది. ఇందులో ప్రవక్త యొక్క హృదయ శుద్ధి, బురాఖ్ పై ప్రయాణం, మస్జిద్ అల్-అక్సాలో ప్రవక్తలందరికీ ఇమామత్ చేయడం, ఏడు ఆకాశాలలో ఆదం, ఈసా, యహ్యా, యూసుఫ్, ఇద్రీస్, హారూన్, మూసా మరియు ఇబ్రాహీం (అలైహిముస్సలాం) వంటి ప్రవక్తలను కలవడం వంటి సంఘటనలు వివరించబడ్డాయి. అల్లాహ్ తో సంభాషణ, యాభై పూటల నమాజు ఐదుకు తగ్గించబడటం, స్వర్గ నరకాలలోని కొన్ని దృశ్యాలు, వడ్డీ, అనాథల సొమ్ము తినేవారికి, వ్యభిచారులకు మరియు చాడీలు చెప్పేవారికి విధించబడే శిక్షల గురించి కూడా ప్రస్తావించబడింది. ఈ అద్భుత సంఘటనను మక్కావాసులు అపహాస్యం చేసినప్పుడు, అబూ బక్ర్ రజియల్లాహు అన్హు దానిని దృవీకరించి “సిద్దీఖ్” బిరుదును ఎలా పొందారో కూడా ఈ ప్రసంగం వివరిస్తుంది.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ
[అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِيْنَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِيْنَ
[వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్]

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర ఆరవ భాగంలోకి మనము ప్రవేశించాము. ఈ భాగంలో మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చోటు చేసుకున్న ఒక గొప్ప యాత్ర, మేరాజ్ యాత్ర గురించి మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకోబోతున్నాం.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉంటున్నప్పటి సంఘటన ఇది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిదె హరాంలో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దైవదూత అయిన జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించగా, జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. ప్రవక్త వారు మస్జిదె హరాంలో ఉన్న సందర్భంలో ప్రవక్త వారితో కలిసి మాట్లాడి, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయ శుద్ధి సంఘటన కూడా ఈ సందర్భంలో చోటు చేసుకుంది.