ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) ఉపవాసం యొక్క విశిష్టత

ఆషూరాఅ రోజు ఉపవాసం యొక్క విశిష్టత

ఆషూరాఅ రోజు (ముహర్రం నెల 10 తేదీ) ఉపవాసం గురించి అడిగిన ప్రశ్నకు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారని అబూ ఖతాదహ్ రధి అల్లాహు అన్హు ఉల్లేఖించినారు :

” ఆయన ఆషూరాఅ రోజు ఉపవాసానికి ప్రతిఫలంగా క్రిత సంవత్సరపు పాపాలు (చిన్న పాపాలు) మన్నిస్తాడని నేను అల్లాహ్ నుండి ఆశిస్తున్నాను.”

ఆషూరాఅ దినమున ఉపవాసం పాటించే పద్ధతి :

ఆషూరాఅ రోజు ఉపవాసం యొక్క మూడు పద్ధతులను కొందరు ఇస్లామీయ పండితులు ఇలా తెలిపినారు.

(1) ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) ఉపవాసంతో పాటు, దాని ముందు రోజున లేదా దాని తరువాత రోజున కూడా ఉపవాసం ఉండటం.
(2) కేవలం ఆషూరాఅ రోజున (ముహర్రం 10 వ తేదీన) మాత్రమే ఉపవాసం ఉండటం.
(3) ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) ఉపవాసంతో పాటు, దాని ముందు రోజు (ముహర్రం 9 వ తేదీ) మరియు దాని తరువాత రోజులలో (ముహర్రం 11 వ తేదీలలో) కూడా ఉపవాసం ఉండటం, అంటే వరుసగా మూడు రోజులు (ముహర్రం నెల 9, 10 మరియు 11 వ తేదీలు) ఉపవాసం పాటించడం.

ఆషూరాఅ దినమున ఉపవాసం ఎందుకు ఉండవలెను :

ఆషూరాఅ దినమున అంటే ముహర్రం 10 వ తేదీన అల్లాహ్ తన ప్రవక్త మూసా అలైహిస్సలాం ను మరియు ఆయన ప్రజలను, ఫిరౌను మరియు అతడి ప్రజల దౌర్జన్యం నుండి రక్షించినాడు. కాబట్టి దీనికి కృతజ్ఞతగా అల్లాహ్ కొరకు ఉపవాసం ఉండవలెను.

ఆషూరాఅ రోజు ఉపవాసం – కొన్ని ప్రయోజనాలు :

  1. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరిస్తూ ఆషూరాఅ దినము యొక్క ఉపవాసం పాటించడం ఉత్తమం.
  2. ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) కంటే ఒకరోజు ముందు లేదా ఒకరోజు తరువాత కూడా ఉపవాసం ఉండటం ఉత్తమం.
  3. ఈరోజు చాలా శుభమైనది. పూర్వం నుండే దీని పావనత్వం మరియు ఔన్నత్యం ప్రసిద్ది గాంచి యున్నది.
  4. పూర్వ సమాజములలో నెలల నిర్ణయం ఇంగ్లీషు క్యాలెండరును బట్టికాక, చంద్రుడ్ని గమనాన్ని బట్టి జరిగేదని స్పష్టమవుతున్నది. ఎందుకంటే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపి ఉన్నారు – అల్లాహ్ ముహర్రం 10 వ తేదీన ఫిరౌను మరియు అతడి సహచరులను వినాశం చేసినాడు. మరియు ప్రవక్త మూసా అలైహిస్సలాం మరియు అతని సహచరులకు ఆ రోజున విజయం ప్రసాదించినాడు.
  5. ఆషూరాఅ దినమున ఉపవాసం ఉండటమనేది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు (విధానం) నుండి స్పష్టంగా ద్రువీకరించబడినది. ఉపవాసం కాకుండా ఈ దినమున చేసే ఇతర చేష్టలన్నీ నూతన కల్పితాలే (బిదాఅతులే) తప్ప ఇంకేమీ కావు. అంతేకాక – అవన్నీ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాలకు విరుద్ధమైనది కూడా.
  • ఒక దినపు ఉపవాసానికి బదులుగా మొత్తం ఒక సంవత్సరపు పాపాలన్నీ క్షమించివేయడమనేది అల్లాహ్ మనపై చూపుతున్న అనంతమైన కరుణకు మరియు అనుగ్రహానికిఒక చిన్న మచ్చు తునక మాత్రమే. నిశ్చయంగా అల్లాహ్ సాటిలేని అనుగ్రహం కలవాడు.
  •  ఓ నా సోదరులారా! ఈ అనుగ్రహాన్ని చేజిక్కించుకోవటానికి సిద్ధపడండి. తమ నూతన సంవత్సరాన్ని అల్లాహ్ కు విధేయత చూపటంలో, దానధర్మాలు చేయటంలో మరియు పుణ్యాలు సంపాదించటంలో పోటీపడుతూ ప్రారంభించండి. పుణ్యాలు, మంచిపనులు తప్పకుండా పాపాలను, చెడుపనులను చేరిపివేస్తాయి.

(ఈ విషయాలు షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉధైమిన్ రహిమహుల్లాహ్ యొక్క నుండి మరియు షేఖ్ సాలెహ్ అల్ఫౌజాన్ హాఫిజహుల్లాహ్ యొక్క నుండి తీసుకోబడినవి.)

గమనుక : కేవలం ఆషూరాఅ రోజున మాత్రమే ఉపవాసం ఉండటంలో ఎలాంటి తప్పూ లేదు – దీనికి ఆధారం షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉధైమిన్ (రహిమహుల్లాహ్) యొక్క ఫత్వా. కాని రెండు రోజులు ఉపవాసం ఉండటం సున్నత్

గమనిక: సౌదీ అరబియా క్యాలెండర్ ప్రకారం  ఆషూరా 19th ఆగష్టు 2021 వచ్చింది. కాబట్టి 18 మరియు 19 ఆగష్టు ఉపవాసం ఉండటం మంచిది. ఇండియా లో ఆషూరా 20th ఆగష్టు. కాబట్టి 19 & 20 ఆగష్టు ఉపవాసం ఉండటం మంచిది.

అరఫా రోజు పాటించబడే ఉపవాసం ఘనత

1251. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అరఫా నాటి ఉపవాసం గురించి విచారించటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, “అది క్రితం యేడు మరియు వచ్చేయేటి పాపాలన్నిటినీ (minor sins – చిన్న పాపాలు) తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు.

[సహీహ్ ముస్లిం లోని ఉపవాసాల ప్రకరణం]

ముఖ్యాంశాలు:-

జుల్ హిజ్జా మాసపు తొమ్మిదో తేదీని ‘అరఫా రోజు’ అని పిలుస్తారు. ఆ రోజు హజ్ యాత్రికులందరూ అరఫాత్ మైదానంలో ఆగుతారు. కనుక ఆ రోజును ‘అరఫాత్ రోజు’ గా వ్యవహరిస్తారు. ఆ విధంగా అరఫాత్ మైదానంలో ఆగటమనేది హజ్ విధులన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించకపోతే హజ్జే నెరవేరదు. హజ్ యాత్రికులు ఆ రోజున ప్రార్ధనలు, సంకీర్తనల్లో నిమగ్నులై ఉంటారు. ఆనాడు వారికి అదే గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. కనుక వారు ఆరోజు ఉపవాసం పాటించటం అభిలషణీయం కాదు. కాని హజ్ యాత్రలో పాల్గొనని వారికి మాత్రం ఆరోజు ఉపవాసం పాటిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ఆ ఒక్క ఉపవాసం రెండేళ్ళ పాపాలను తుడిచిపెట్టేస్తుంది.

227 వ అధ్యాయం – అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో, పదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత
హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)

నోట్: సఊది అరేబియా కాలమానం ప్రకారం అరఫా రోజు 25/10/2012. ఇండియా లో 26/10/2012 ఉండవచ్చు. కాబట్టి 25 మరియు 26 తారీఖు లలో ఉపవాసం ఉండి ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోకుండా చూసుకోండి. బారకల్లః ఫీకుం.

షాబాన్ నెలలో ఉపవాసపు ప్రాముఖ్యత

ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఎనిమిదవ నెల షాబాన్. ఈ నెలలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అధికంగా నఫిల్ ఉపవాసాలుండేవారు.

సహీ బుఖారీ 1969లో ఉంది: హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారుః

عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، قَالَتْ: فَمَا رَأَيْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ اسْتَكْمَلَ صِيَامَ شَهْرٍ إِلَّا رَمَضَانَ، وَمَا رَأَيْتُهُ أَكْثَرَ صِيَامًا مِنْهُ فِي شَعْبَانَ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ తప్ప మరే మాసమంతా ఉపవాసం ఉన్నది చూడలేదు. మరియు షాబాన్ కంటే ఎక్కువ (ఇతర మాసాల్లో నఫిల్) ఉపవాసాలున్నది చూడలేదు.

ఈ మాసములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకు అధికంగా ఉపవాసాలుండేవారో ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త గారినే అడిగారు, అందుకు ప్రవక్త ఇలా సమాధానమిచ్చారుః

ذَاكَ شَهْرٌ يَغْفُلُ النَّاسُ عَنْهُ بَيْنَ رَجَبٍ وَرَمَضَانَ، وَهُوَ شَهْرٌ تُرْفَعُ فِيهِ الْأَعْمَالُ إِلَى رَبِّ الْعَالَمِينَ، فَأُحِبُّ أَنْ يُرْفَعَ عَمَلِي وَأَنَا صَائِمٌ

ఈ మాసం, ఇది రజబ్ (గౌరవనీయ నాలుగు మాసాల్లో ఒకటి-బుఖారి 4662) మరియు (ఘనతలుగల, శుభప్రదమైన) రమజాను మాసాల మధ్యలో ఉంది, ప్రజలు దీని పట్ల అశ్రద్ధగా ఉంటారు. ఈ మాసంలోనే సర్వలోకాల ప్రభువు వైపునకు (మానవుల) కర్మలు ఎత్తబడతాయి, మరియు నేను ఉపవాస స్థితిలో ఉండగా నా కర్మలు ఎత్తబడాలి అన్నది నాకు చాలా ఇష్టం.

(ముస్నద్ అహ్మద్ 36/85, సహీ తర్గీబ్ 1022. దీని సనద్ హసన్ అని షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ తెలిపారు).

ఉపవాసము ఒక డాలు వంటిది

706. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :-

ఉపవాసము ఒక డాలు వంటిది. (కాబట్టి) ఉపవాసి అశ్లీలమైన పలుకులు పలకడం గానీ, మూర్ఖుల్లా, అజ్ఞానుల్లా ప్రవర్తించడం గాని చేయకూడదు. ఎవరైనా అతనితో జగడానికి దిగితే లేదా దూషిస్తే అతనావ్యక్తితో తాను ఉపవాసం ఉన్నానని రెండుసార్లు చెప్పాలి

(ఆయన ఇంకా ఇలా అన్నారు):

నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్ష్యంగా చెబుతున్నాను, ఉపవాసి నోటి వాసన అల్లాహ్ దృష్టిలో కస్తూరి సువాసన కన్నా ఎంతో శ్రేష్ఠమైనది. అల్లాహ్ ఇలా అంటున్నాడు – ఉపవాసి నా (ప్రసన్నత) కోసం ఆహారపానీయాలు, లైంగిక వాంచలు త్యజిస్తున్నాడు. ఉపవాసం ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది. అందవల్ల స్వయంగా నేనే దాని పుణ్యఫలాన్ని (ఉపవాసికి) ప్రసాదిస్తాను. ఒక సత్కార్యానికి పదింతల పుణ్యం లభిస్తుంది

[సహీహ్ బుఖారీ : 30 వ ప్రకరణం – సౌమ్, 2 వ అధ్యాయం – ఫజ్లిస్సౌమ్]

ఉపవాస ప్రకరణం – 29 వ  ప్రకరణం – ఉపవాసకుడు నోరు పారేసుకోరాదు. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

English Version : As-Siyaam (fasting) is Junnah (protection or shield or a screen or a shelter from the Hell-fire)

దైవమార్గంలో పోరాడుతూ ఒకరోజు ఉపవాసం పాటించే వ్యక్తి

709. హజ్రత్ అబూ సయీద్ ఖుధరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

దైవమార్గంలో పోరాడుతూ ఒకరోజు ఉపవాసం పాటించే వ్యక్తిని దేవుడు నరకానికి డెభ్భై యేండ్ల (ప్రయాణం) మేరకు దూరంగా ఉంచుతాడు.

[సహీహ్ బుఖారీ : 56 వ ప్రకరణం – జిహాద్ వస్సైర్, 36 వ అధ్యాయం – ఫజ్లుస్సౌమి ఫీసబీలిల్లాహ్]

ఉపవాస ప్రకరణం – 31 వ ప్రకరణం – ధైవయోధుని ఉపవాసం ఘనత
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

English Version of the Hadeeth: Whosoever observes Saum (fast) for one day for Allaah’s Cause ..

ఉపవాసం ఔన్నత్యం

707. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

“దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మానవుడు చేసే సత్కార్యాలన్నీ తన కోసమే ఉన్నాయి. అయితే ఉపవాసం సంగతి అలా కాదు.ఉపవాసం నాకోసం ప్రత్యేకంగా పాటించబడుతుంది. అందువల్ల నేను స్వయంగా దానికి ప్రతిఫలం ప్రసాదిస్తాను – ఉపవాసం ఒక డాలు వంటిది. మీలో ఎవరైనా ఉపవాసం పాటిస్తే వారు అశ్లీలపు పలుకులు పలకరాదు, పోట్లాటల్లో దిగకూడదు; ఎవరైనా దూషిస్తే లేక జగడానికి దిగితే అలాంటి వ్యక్తితో తాము ఉపవాసం పాటిస్తున్నామని చెప్పాలి.”

“ఎవరి అధీనంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణం ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్ష్యం! ఉపవాసకుడి నోటి వాసన దేవుని ద్రుష్టిలో కస్తూరి సువాసన కంటే ఎంతో శ్రేష్ఠమైనది. ఉపవాసి రెండు సందర్భాలలో  అమితానందం పొందుతాడు. ఒకటి : ఉపవాసం విరమిస్తున్నప్పుడు. రెండు : తన ప్రభువును సందర్శించినపుడు ఉపవాస పుణ్యఫలం చూసి”.

[సహీహ్ బుఖారీ: 30 వ ప్రకరణం – సౌమ్, 9 వ అధ్యాయం – హల్ యఖూలు ఇన్నీ సాయిమున్ ఇజాసితుమ్ ?]

ఉపవాస ప్రకరణం – 30 వ  ప్రకరణం – ఉపవాసం ఔన్నత్యం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్