షాబాన్ నెలలో ఉపవాసపు ప్రాముఖ్యత

ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఎనిమిదవ నెల షాబాన్. ఈ నెలలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అధికంగా నఫిల్ ఉపవాసాలుండేవారు.

సహీ బుఖారీ 1969లో ఉంది: హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారుః

عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، قَالَتْ: فَمَا رَأَيْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ اسْتَكْمَلَ صِيَامَ شَهْرٍ إِلَّا رَمَضَانَ، وَمَا رَأَيْتُهُ أَكْثَرَ صِيَامًا مِنْهُ فِي شَعْبَانَ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ తప్ప మరే మాసమంతా ఉపవాసం ఉన్నది చూడలేదు. మరియు షాబాన్ కంటే ఎక్కువ (ఇతర మాసాల్లో నఫిల్) ఉపవాసాలున్నది చూడలేదు.

ఈ మాసములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకు అధికంగా ఉపవాసాలుండేవారో ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త గారినే అడిగారు, అందుకు ప్రవక్త ఇలా సమాధానమిచ్చారుః

ذَاكَ شَهْرٌ يَغْفُلُ النَّاسُ عَنْهُ بَيْنَ رَجَبٍ وَرَمَضَانَ، وَهُوَ شَهْرٌ تُرْفَعُ فِيهِ الْأَعْمَالُ إِلَى رَبِّ الْعَالَمِينَ، فَأُحِبُّ أَنْ يُرْفَعَ عَمَلِي وَأَنَا صَائِمٌ

ఈ మాసం, ఇది రజబ్ (గౌరవనీయ నాలుగు మాసాల్లో ఒకటి-బుఖారి 4662) మరియు (ఘనతలుగల, శుభప్రదమైన) రమజాను మాసాల మధ్యలో ఉంది, ప్రజలు దీని పట్ల అశ్రద్ధగా ఉంటారు. ఈ మాసంలోనే సర్వలోకాల ప్రభువు వైపునకు (మానవుల) కర్మలు ఎత్తబడతాయి, మరియు నేను ఉపవాస స్థితిలో ఉండగా నా కర్మలు ఎత్తబడాలి అన్నది నాకు చాలా ఇష్టం.

(ముస్నద్ అహ్మద్ 36/85, సహీ తర్గీబ్ 1022. దీని సనద్ హసన్ అని షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ తెలిపారు).

%d bloggers like this: