నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? – [మరణానంతర జీవితం – పార్ట్ 54] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 4
నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి?
[మరణానంతర జీవితం – పార్ట్ 54] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=vnw-1Kcariw
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక కూడా నరకంపై వేయబడే వంతెన.

నరకంపై వేయబడే వంతెన క్షేమంగా, సురక్షితంగా దాటడానికి అల్లాహ్ యొక్క దయ, ఆయన కరుణ తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు తర్వాత మన సత్కార్యాలు కూడా చాలా దోహదపడతాయి. అయితే ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? ఆ విషయాలు తెలుసుకోబోతున్నాము.

కానీ అంతకంటే ముందు మరొక చిన్న విషయం. అదేమిటంటే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత అటువైపున స్వర్గం ఉంటుంది. ఎవరైతే స్వర్గంలో ప్రవేశించే వారు కారో వారు నరకంలో పడిపోతారు. కానీ ఎవరైతే స్వర్గంలో ప్రవేశించేవారో వారే నరకంపై వేయబడిన వంతెనను దాటిపోతారు. దాటిపోయిన వెంటనే స్వర్గంలో ప్రవేశించలేరు. అక్కడ మరో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. మరో చిన్న వంతెన ఉంటుంది. దానిని కూడా తప్పకుండా దాటవలసి ఉంటుంది.

ఆ వంతెన దేని గురించి? స్వర్గంలో ఎవరు కూడా ప్రవేశించాలంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడంతో పాటు ఆంతర్యం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే, ఎవరి మనసులో కూడా ఏ రవ్వంత కపటం, ఏ రవ్వంత జిగస్సు, ఏ రవ్వంత చెడు అనేది మరొకరి గురించి ఉండకూడదు.

అయితే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత, పరస్పరం ఎవరి మధ్యలోనైనా ఏదైనా మనస్సులో చెడు మిగిలి ఉంటే, దానిని శుభ్రపరచి, వారి యొక్క హృదయాలను అన్ని రకాల మలినాల నుండి, అన్ని రకాల చెడుల నుండి శుభ్రపరిచి ఆ తర్వాత స్వర్గంలో చేర్పించడం జరుగుతుంది.

సహీ బుఖారీలో హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “విశ్వాసులు నరకంపై వేయబడిన వంతెన దాటి వెళ్ళిన తర్వాత, ఇటు నరకం అటు స్వర్గం మధ్యలో ఆపుకోబడతారు. ప్రపంచంలో ఏ కొంచెం వారి హృదయాల్లో ఏ చెడు ఉన్నా వాటిని శుభ్రపరచడం జరుగుతుంది. ఎవరి పట్ల ఏ కొంచెం అన్యాయం ఉన్నా, అన్యాయం చేసిన వానికి స్వర్గపు స్థానాలు తగ్గించబడతాయి, మరీ ఎవరిపైనైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల స్వర్గ స్థానాలు పెంచడం జరుగుతుంది.”

మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు, ఎవరి హృదయాలలోనైతే ఏ కొంచెమైనా కపటం, ఏదైనా జిగస్సు, చెడు ఒకరి గురించి ఉందో. వారిని శుభ్రపరిచి ఆ తర్వాత వారిని స్వర్గంలో చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించేవారు, వారి హృదయాలు శుభ్రంగా, అందులో ఎలాంటి కీడు లేకుండా ఉంటుంది.” ఎందుకంటే వారి హృదయాలు వాటిలో ఎలాంటి కీడు, ఎలాంటి చెడు లేకుండా ఉండాలి, అప్పుడే వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. అందుకని మహాశయులారా, ఇహలోకంలోనే మనం ఒకరిపై ఏదైనా అన్యాయం చేసి ఉంటే, ఒకరిది ఏదైనా హక్కు తిని ఉంటే, ఒకరికి ఏదైనా బాధ మనం కలిగించి ఉంటే, క్షమాపణ కోరుకొని లేదా వారి యొక్క హక్కు చెల్లించి హృదయాలలో ఎలాంటి మలినము మనం ఉంచుకోకూడదు.