జిల్ హిజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం మరియు ఇతర సత్కార్యాల ఘనత

ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు

హజ్ నెల ప్రారంభ మైనది, మొదటి పది రోజులు ఎంతో ముఖ్యమైనవి. ఈ పది రోజులలో చేసిన మంచి పనులకు అల్లాహ్ ఎంతో గొప్ప పుణ్యం ప్రసాదిస్తాడు.

1250. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :-

జిల్ హిజ్జా మాసపు తొలి పదిరోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ దేవుని దృష్టిలో అత్యంత ప్రియమైనవి కావు. అది విని సహచరులు సందేహపడుతూ, “ధైవప్రవక్తా! అల్లాహ్ మార్గంలో చేయబడే పోరాటం కూడా (దాని కన్నా ప్రియమైనది) కాదా? అని అడిగారు. దానికి సమాధానమిస్తూ, “అల్లాహ్ మార్గంలో చేయబడిన పోరాటం కూడా (ప్రియమైనది) కాదు. ఒకవేళ ఎవరయినా ధనప్రాణాలు సమేతంగా బయలుదేరి వాటిలో ఏదీ తిరిగిరాకపోతే (అంటే దైవమార్గంలో వీరమరణం పొందితే మాత్రం నిశ్చయంగా అతను శ్రేష్టుడే)” అని చెప్పారు.    [బుఖారీ]

[సహీహ్ బుఖారీలోని పండుగ ప్రకరణం]

ముఖ్యాంశాలు :

జిల్ హిజ్జా మాసపు మొదటి పది రోజుల్లో హజ్ యాత్రికులు ప్రత్యేక ఆరాధనా కార్యకలాపాలు నిర్వర్తిస్తారు. కాని హజ్ చేయలేక  పోతున్నవారు ఆ పుణ్యానికి నోచుకోలేరు. అందుకని అలాంటివారు తమ స్వంత ప్రదేశాల్లోనే ఉండి నఫీల్ ఉపవాసాలు ఇతర ఆరాధనా  కార్యకలాపాలు చేసుకొని వీలైనంత ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించుకోగలగాలన్నా ఉద్దేశ్యంతో జిల్ హిజ్జా మాసపు తొలి పది రోజుల్లో చేయబడే సత్కార్యాలు దేవునికి అత్యంత ప్రియమైనవని ప్రకటించడం జరిగింది. ఇస్లాం లో ‘జిహాద్’ కు చాలా ప్రాముఖ్యత ఉందన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధనపడుతున్నది.

హదీసు కిరణాలు (RiyadusSaliheen) రెండవ సంపుటం
సంకలనం: ఇమాం నవవి (రహిమహుల్లః )

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?

429. హజ్రత్ మస్రూఖ్ (రహ్మతుల్లా అలై) కధనం :-

నేను (ఓసారి) హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ని “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?” అని అడిగాను. దానికామె “ఆయనకు నిత్యం క్రమం తప్పకుండా చేసేపని అంటే ఎంతో ఇష్టం” అని సమాధానమిచ్చారు.

“మరి రాత్రివేళ ఆయన (తహజ్జుద్ నమాజు చేయడానికి) ఎప్పుడు లేస్తారు? అని అడిగాను మళ్ళీ. అందుకామె “కోడికూత వినగానే లేస్తారు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 7వ అధ్యాయం – మన్ నామ ఇన్ద స్సహార్]

ప్రయాణీకుల నమాజు ప్రకరణం – 17 వ అధ్యాయం – ఇషా నమాజులో పఠించవలసిన రకాతుల సంఖ్య
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

తారాబలాన్ని నమ్మడం సత్యతిరస్కారంతో సమానం

46. హజ్రత్ జైద్ బిన్ ఖాలిద్ జుహ్ని (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు ఆఇహి వసల్లం) మాతో కలిసి హుదైబియా ప్రాంతంలో ఉదయం నమాజు చేశారు. రాత్రి వర్షం కురిసింది. ఉదయం వరకు నేల తడిగానే ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు ముగిసిన తరువాత అనుచరుల వైపుకు తిరిగి, “అల్లాహ్ ఏం సెలవిచ్చాడో మీకు తెలుసా?” అని అడిగారు. “దేవునికి, దైవప్రవక్తకే బాగా తెలుసు. మాకు తెలియదు” అన్నారు అనుచరులు. అప్పుడు దైవప్రవక్త ఈ విధంగా తెలిపారు –

“అల్లాహ్ ఇలా అన్నాడు – ఈ రోజు ఉదయం నా దాసులలో కొందరు విశ్వాసులయిపోయారు, మరి కొందరు అవిశ్వాసులయిపోయారు. దేవుని దయవలన మనకు వర్షం కురిసింది అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలానా నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసిందని అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 156 వ అధ్యాయం – యస్తగ్ బిలుల్ ఇమామున్నాస ఇజా సల్లమ్]

విశ్వాస ప్రకరణం – 30 వ అధ్యాయం – తారాబలాన్ని నమ్మడం సత్యతిరస్కారంతో సమానం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఫజ్ర్, అస్ర్ నమాజుల ఔన్నత్యం, వాటి పరిరక్షణ

367. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :-

మీ దగ్గరకు రాత్రి దైవదూతలు, పగటి దైవదూతలు ఒకరి వెనుక మరొకరు వస్తారు. ఈ రెండు బృందాలు ఫజ్ర్, అస్ర్ నమాజులలో మాత్రం కలుస్తారు. రాత్రంతా మీతో పాటు గడిపిన దైవదూతలు తిరిగి ఆకాశం పైకి వెళ్ళినప్పుడు మీ ప్రభువు వారిని ఉద్దేశించి “మీరు నా దాసులను ఏ స్థితిలో వదిలిపెట్టి వచ్చారు?” అని అడుగుతాడు. దానికి దైవదూతలు “మేము వారి దగ్గర్నుంచి బయలు దేరేటప్పుడు వారు నమాజు చేస్తూ ఉండటం కన్పించింది. అంతకు ముందు మేము వారి దగ్గరకు చేరుకున్నప్పుడు కూడా వారిని నమాజ్ స్థితిలోనే చూశాము” అని సమాధానమిస్తారు.

[సహీహ్ బుఖారీ : 9 వ ప్రకరణం – మనాఖియతుస్సలాత్, 16 వ అధ్యాయం – ఫజ్లి స్సలాతిల్ అస్ర్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 37 వ అధ్యాయం – ఫజ్ర్, అస్ర్ నమాజుల ఔన్నత్యం, వాటి పరిరక్షణ . మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1 . సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మృతుని కోసం చేసే దానం అతనికి పుణ్యం చేకూర్చుతుంది

588. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “నా తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. మాట్లాడే అవకాశం గనక లభించి ఉంటే ఆమె (తన తరఫున) దానం చేయమని చెప్పి ఉండేది. మరి ఇప్పుడు నేను ఆమె తరఫున ఏదైనా దానం చేస్తే దాని పుణ్యం ఆమెకు చేరుతుందంటారా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేరుతుందని సమాధానమిచ్చారు.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయేజ్, 95 వ అధ్యాయం – మౌతిల్ ఫుజా అల్ బగ్ తత్]

జకాత్ ప్రకరణం – 15 వ అధ్యాయం – మృతుని కోసం చేసే దానం అతనికి పుణ్యం చేకూర్చుతుంది. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మితిమీరిన ముఖస్తుతి మంచిది కాదు

1888. హజ్రత్ అబూ బక్రా (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఒకతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ఒక వ్యక్తిని పొగిడాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది విని “నువ్వు చెడ్డపని చేశావు. నీవు పొగడ్తలతో, నీ మిత్రుని గొంతుకోశావు” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట అనేకసార్లు అన్నారు. తర్వాత ఆయన ఇలా అన్నారు : “మీలో ఎవరైనా మీ సోదరుడ్ని పొగడటం చాలా అవసరమని భావించినప్పుడు ఈ విధంగా అనాలి – ‘ఇది నా అభిప్రాయం. వాస్తవ పరిస్థితి అల్లాహ్ కు మాత్రమే తెలుసు. నేను అల్లాహ్ కు వ్యతిరేకంగా ఎవరి పవిత్రతనూ నిరూపించడం లేదు. ఆ వ్యక్తి ఇలాంటివాడు, అలాంటివాడు అని అన్నానంటే ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ – ఈ మాటలయినా ఆ మనిషి గురించి మీకు వ్యక్తిగతంగా తెలిసి ఉన్నప్పుడే అనాలి. (అంతేగాని ఎవరో చెప్పిన మాటలు విని పొగడకూడదు)”.

[సహీహ్ బుఖారీ : 52 వ ప్రకరణం – అష్షహాదాత్, 17 వ అధ్యాయం – ఇజా జక్కా రజులున్ రజులన్ కఫాహు]

ప్రేమైక వచనాల ప్రకరణం : 14 వ అధ్యాయం -మితిమీరిన ముఖస్తుతి మంచిది కాదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ప్రతి పిల్లవాడు ప్రకృతి ధర్మంపై పుడతాడు

1702. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-

ప్రతి పిల్లవాడు (ఏ మతస్థుడైనా) ప్రకృతి ధర్మంపై (అంటే ఇస్లాం ధర్మంపై) పుడతాడు. కాని తరువాత అతని తల్లిదండ్రులు అతడ్ని యూదుడిగానో, క్రైస్తవుడిగానో లేదా మజూసీ (అగ్ని పూజారి)గానో మారుస్తారు, జంతువుల్ని మార్చినట్లు. జంతువులు పుట్టేటప్పుడు వాటి అవయవాలన్నీ సక్రమంగానే ఉంటాయి. (ఆ తరువాత ఈ మానవులు వాటి చేవులనో, కొమ్ములనో కోసి పారేస్తారు) ఏ జంతు పిల్లయినా తెగిపోయిన చెవులతో పుట్టడం మీరెప్పుడైనా చూశారా?

హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) పై హదీసు ఉల్లేఖించిన తరువాత ఈక్రింది (ఖుర్ఆన్) సూక్తిని పఠించే వారు.

“అల్లాహ్ మానవులను ఏ ప్రకృతి ధర్మంపై పుట్టించాడో అది మార్చనలివి కానిది”. ఇదే సవ్యమైన, స్థిరమైన ధర్మమార్గం. (30:30)

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయిజ్, 8 వ అధ్యాయం – ఇజా అస్లమస్సబియ్యు ఫమాత హల్ యుసల్లా అలైహి]

విధివ్రాత ప్రకరణం : 6 వ అధ్యాయం – ప్రతి పిల్లవాడు ప్రకృతి ధర్మంపై పుడతాడు.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అబద్ధం చెడ్డ విషయం, సత్యం మంచి విషయం

1675. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :-

నిజం మనిషిని పుణ్యకార్యాల వైపుకు తీసుకుని వెళుతుంది. పుణ్యకార్యాలు (అతడ్ని) స్వర్గానికి గొనిపోతాయి. ఎవరైనా ఎల్లప్పుడు నిజం చెబుతుంటే అది అతడ్ని ఎప్పుడో ఓ రోజు సిద్దీఖ్ (సత్యశీలుడి) గా మార్చివేస్తుంది. అబద్ధం మనిషిని పాపకార్యాల వైపుకు తీసుకుని వెళుతుంది. పాపకార్యాలు అతడ్ని నరకానికి చేర్చుతాయి. ఎవరైనా (ఎల్లప్పుడూ) అబద్ధమాడుతుంటే దానివల్ల అతడు ఎప్పుడో ఓ రోజు అల్లాహ్ దగ్గర అబద్దాలరాయుడిగా వ్రాయబడతాడు.

[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 69 వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఅలా (యాఅయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వకూనూ మాఅస్సాదిఖీన్)]

సామాజిక మర్యాదల ప్రకరణం – 29 వ అధ్యాయం – అబద్ధం చెడ్డ విషయం, సత్యం మంచి విషయం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఆహారంలో లోపం ఎత్తి చూపకూడదు

1336. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నడూ ఏ ఆహారంలో కూడా లోపం ఎత్తి చూపలేదు. ఆయనకు ఇష్టమయితే తినేవారు, ఇష్టం లేకపోతే మానేసేవారు. (అంతేగాని అందులో అది బాగా లేదు, ఇది బాగా లేదని లోపం ఎత్తి చూపేవారు కాదు).

[సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం – మనాఖిబ్, 23 వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం)]

పానీయాల ప్రకరణం : 35 వ అధ్యాయం – అన్నంలో లోపం ఎత్తి చూపకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నాకు పూర్వం ఏ ధైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి

299. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రది అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :-

నాకు పూర్వం ఏ ధైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి.

(1) నా గాంభీర్యానికి శత్రువులు ఒకనెల ప్రయాణపు దూరం నుండే భయపడి పోయేలా అల్లాహ్ నాకు సహాయం చేస్తున్నాడు.

(2) నా కోసం యావత్తు భూమండలం ప్రార్ధనా స్థలంగా, పరిశుద్ధ పరిచే వస్తువుగా చేయబడింది. అందువల్ల నా అనుచర సమాజంలోని ప్రతి వ్యక్తీ ఏ చోటున ఉంటే ఆ చోటునే వేళ అయినప్పుడు నమాజు చేసుకోవచ్చు.

(3) నా కోసం యుద్ధప్రాప్తి (మాలె గనీమత్) ను వాడుకోవడం ధర్మసమ్మతం చేయబడింది.

(4) ఇతర ధైవప్రవక్తలందరూ తమతమ జాతుల కోసం మాత్రమే ప్రత్యేకించబడగా, నేను యావత్తు మానవాళి కోసం ధైవప్రవక్తగా పంపబడ్డాను.

(5) నాకు (పరలోక తీర్పుదినాన సాధారణ) సిఫారసు (*) చేసే అధికారం ఇవ్వబడింది.

(*) ఇక్కడ సిఫారసు అంటే, హషర్ మైదానంలో మానవులంతా తీవ్ర ఆందోళనకు గురి అయినపుడు చేసే సాధారణ సిఫారసు అని అర్ధం. అప్పుడు ఇతర ప్రవక్తలందరూ ప్రజలను నిరాశపరుస్తారు. అయితే ఇతర సందర్భాలలో ప్రత్యేక సిఫారసు ప్రవక్తలు, సజ్జనులు కూడా చేస్తారు. లేదా ఇక్కడ సిఫారసు అంటే రద్దు కానటువంటి సిఫారసు కాని, అణుమాత్రం విశ్వాసమున్న వారికి సయితం ప్రయోజనం చేకూర్చే సిఫారసు గానీ అయి ఉంటుంది.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 56 వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి …. జు ఇలత్ లియల్ అర్జుకుల్లాహ మస్జిదన్ వ తహూర]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1 – సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్