మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి? – షేక్ హబీబుర్రహ్మన్ జామయి [వీడియో & టెక్స్ట్]

మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి?
https://youtu.be/51-0s5yKLYg [12 నిముషాలు]
షేక్ హబీబుర్రహ్మన్ జామయి

ఈ ప్రసంగంలో, దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఆచరించవలసిన సరైన పద్ధతి గురించి వివరించబడింది. దుఆ ఆరాధనలలో ఒక ముఖ్యమైన భాగమని, దానిని ఎలా చేయాలో అల్లాహ్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారని చెప్పబడింది. ప్రవక్త గారి జీవితం నుండి రెండు సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ, అల్లాహ్ ను స్తుతించకుండా మరియు ప్రవక్తపై దరూద్ పంపకుండా నేరుగా అభ్యర్థించడం తొందరపాటు అవుతుందని, అయితే అల్లాహ్ యొక్క ఉత్తమమైన నామాలు మరియు గుణగణాల ద్వారా వేడుకోవడం సరైన పద్ధతి అని స్పష్టం చేయబడింది. అల్లాహ్ యొక్క 99 పేర్ల ప్రాముఖ్యత మరియు వాటిని గణించడం అంటే కేవలం లెక్కించడం కాదని, వాటిని విశ్వసించి, అర్థం చేసుకుని, జీవితంలో ప్రతిబింబించేలా చేయాలని వివరించబడింది. ప్రార్థన చేయడానికి మధ్యవర్తి (వసీలా) అవసరమా అనే అంశం తదుపరి ప్రసంగంలో చర్చించబడుతుందని చెప్పబడింది.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియా ఇ వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను సృష్టించి వారికి సన్మార్గం చూపడానికి ప్రవక్తలను పంపాడు. దివ్యమైన ఆ పరంపరలో చివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ప్రతి సమస్య విషయంలో తన ఉమ్మత్ కు స్పష్టమైన మార్గదర్శనం ప్రసాదించారు. ఇతర ఆరాధనా పద్ధతులు తెలిపినట్లే, ప్రార్థించే విషయంలో కూడా, దుఆ చేసే విషయంలో కూడా మార్గదర్శులయ్యారు.

అభిమాన సోదరులారా! వేడుకోవటం, దుఆ చేయటం ఒక ముఖ్యమైన ఆరాధన.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ గురించి ఇలా సెలవిచ్చారు,

اَلدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
(అద్దుఆ హువల్ ఇబాదహ్)
దుఆ యే అసలైన ఆరాధన.

ఈ హదీస్ అహ్మద్ గ్రంథంలో ఉంది, తిర్మిజీ లో ఉంది, అబూ దావూద్ లో ఉంది, ఇంకా అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది.

దుఆ తప్పక చేయవలసిన ఆరాధన. కావున, దుఆ ముఖ్యమైన ఆరాధన కాబట్టి, తప్పనిసరిగా చేయవలసిన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం కూడా స్వయంగా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రవచనాల ద్వారా మనల్ని దుఆ చేసే విధానం, పద్ధతి నేర్పించారు.

అబూ దావూద్ లో ఒక హదీస్ ఉంది, ఫుజాలా బిన్ ఉబైద్ రదియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లో ఉన్నారు, ఒక వ్యక్తి వచ్చాడు. నమాజ్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి డైరెక్ట్ ఇలా దుఆ చేశాడు, ‘నాకు మోక్షం ఇవ్వు, ఓ అల్లాహ్ నన్ను కరుణించు’ అని డైరెక్ట్ గా దుఆ చేశాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “మీరు తొందరపడ్డారు, ముందు అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడు, ఆ తర్వాత నాపై దరూద్ పంపించు, ఆ తర్వాత నువ్వు ఏమి కోరుకుంటావో అది కోరుకో, నువ్వు చేసుకోదలచుకున్న దుఆ చేసుకో” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

కాసేపటి తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి దుఆ చేసే విధానం ఇలా ఉండింది. ఆ వ్యక్తి తన అవసరాలను అడగక ముందు, తన అవసరాలను అల్లాహ్ ముందు పెట్టక ముందు, తన దుఆ ఈ విధంగా అతను ప్రార్థన చేశాడు:

اَللّٰهُمَّ إِنِّيْ أَسْأَلُكَ بِأَنِّيْ أَشْهَدُ أَنَّكَ أَنْتَ اللّٰهُ لَا إِلٰهَ إِلَّا أَنْتَ الْأَحَدُ الصَّمَدُ الَّذِيْ لَمْ يَلِدْ وَلَمْ يُوْلَدْ وَلَمْ يَكُنْ لَّهُ كُفُوًا أَحَدٌ
(అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక బిఅన్నీ అష్ హదు అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్ సమద్, అల్లదీ లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్)

“ఓ అల్లాహ్! నేను నిన్నే అర్థిస్తున్నాను. అల్లాహ్ నువ్వు మాత్రమే. సకల లోకాలకు ప్రభువు, పాలకుడు, పోషకుడు. ఆరాధ్య దైవం నువ్వు మాత్రమే. లా ఇలాహ ఇల్లా అంత్, నువ్వు తప్ప ఏ దేవుడూ లేడు. అల్ అహద్, నువ్వు ఒకే ఒక్కడివి. అస్సమద్, నిరపేక్షాపరుడివి, అవసరాలు, అక్కర్లు లేనివాడివి. నీకు తల్లిదండ్రులు గానీ, సంతానం గానీ లేరు. నీకు సరిసమానం ఎవ్వరూ లేరు.”

ఇలా అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడి ఆ తర్వాత ఆ వ్యక్తి తాను చేసుకున్న దుఆ చేసుకున్నాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తికి ఇలా బదులిచ్చారు:

لَقَدْ سَأَلْتَ اللّٰهَ بِالِاسْمِ الَّذِيْ إِذَا سُئِلَ بِهِ أَعْطٰى وَإِذَا دُعِيَ بِهِ أَجَابَ
(లఖద్ సఅల్తల్లాహ బిల్ ఇస్మిల్లదీ ఇదా సుఇల బిహీ అఅతా వ ఇదా దుఇయ బిహీ అజాబ్)
“ఏ పేరుతో అర్థిస్తే ఆయన ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే ఆ దుఆ స్వీకరించబడుతుందో, ఆ పేరుతోనే నువ్వు అడిగావు.”

అంటే ఇక్కడ రెండు విషయాలు మన ముందుగా ఉన్నాయి ఈ హదీస్ లో. మొదటి వ్యక్తి డైరెక్ట్ గా అల్లాహ్ ఘనత లేకుండా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించకుండా, పంపించకుండా డైరెక్ట్ దుఆ ప్రారంభం చేశాడు, ‘ఓ అల్లాహ్ నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, కరుణించు, క్షమించు’ అని చెప్పి స్టార్ట్ చేసేశాడు. అందుకు ఆ వ్యక్తికి సమాధానం ప్రవక్త గారు ఏమి ఇచ్చారు? “ఓ నాయనా! నువ్వు తొందరపడ్డావు” అని చెప్పారు. మరో వ్యక్తికి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా మెచ్చుకున్నారు. “ఏ పేరుతో అర్థిస్తే ఆ అల్లాహ్ ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే దుఆ స్వీకరించబడుతుందో ఆ పేరుతోనే నువ్వు అడిగావు” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని మెచ్చుకొని ఇలా సమాధానం ఇచ్చారు.

ప్రియ వీక్షకులారా! మనకు అర్థమైంది ఏమిటంటే, దుఆ ఒక ముఖ్యమైన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఆరాఫ్, ఆయత్ 180 లో తెలియజేశాడు, ఏ విధంగా అల్లాహ్ ను వేడుకోవాలి అనటానికి.

وَلِلّٰهِ الْاَسْمَاۤءُ الْحُسْنٰى فَادْعُوْهُ بِهَاۖ
(వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
అల్లాహ్ కు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతోనే ఆయనను ప్రార్థించండి. (7:180)

అభిమాన సోదరులారా! బుఖారీ, కితాబుద్ దావాత్, అలాగే ముస్లిం గ్రంథం కితాబుద్ దికిర్ లో ఒక హదీస్ ఉంది. అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. ఎవరైతే వాటిని గణిస్తూ ఉంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అల్లాహ్ బేసి సంఖ్యలో ఉన్నాడు, బేసి సంఖ్యను ఆయన ఎంతో ఇష్టపడతాడు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది ఈ హదీస్.

ఈ హదీస్ లో ముఖ్యంగా రెండు విషయాలు తెలియపరచాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏమిటి ఈ హదీస్ లో? అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. అంటే దీనికి అర్థము 99 మాత్రమే ఉన్నాయి అని కాదు, ఈ విషయం గమనించుకోండి. హదీస్ లో 99 పేర్లు తెలియజేయడం జరిగింది, దానికి అర్థం అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అంటే ఈ పేర్ల ద్వారా గణిస్తే, లెక్కిస్తే, అడిగితే దుఆ స్వీకరించబడుతుంది అని అర్థం వస్తుంది కానీ, అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అల్లాహ్ కు పేర్లు అసంఖ్యాకమైనవి, కొన్ని పేర్లు అది అల్లాహ్ యొక్క ఇల్మె గైబ్ లోనే ఉన్నాయి, మనకు తెలియవు. అందుకు 99 మాత్రమే కాదు అనే విషయం తెలుసుకోవాలి.

రెండవ విషయం ఈ హదీస్ లో, ఎవరైతే అల్లాహ్ యొక్క నామాలను గణిస్తూ ఉంటాడో అంటే, గణించటం అంటే అర్థం కేవలం లెక్కించటం అని భావం కాదు. గణించడంతో పాటు వాటిని దృఢంగా విశ్వసించాలి, చిత్తశుద్ధితో, భక్తితో ఈ నామాలను స్మరించాలి, ఒక్కో నామంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి, వాటిని కంఠస్థం చేసుకోవాలి, ఆ గుణగణాలు తమ వ్యక్తిగత జీవితంలో ప్రతిబింబించేలా ప్రవర్తించాలి. ఇది భావం అల్లాహ్ యొక్క నామాలను లెక్కించడం అంటే, గణించడం అంటే.

అభిమాన సోదరులారా! అలాగే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దుఆ చేసేవారు, అల్లాహ్ నామాలను గణించేవారు, లెక్కించేవారు, అల్లాహ్ యొక్క నామాల ద్వారా, గుణ విశేషాల ద్వారా కూడా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ఉదాహరణకు ఒక హదీస్ ఉంది, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే దుఆలలో ఒక దుఆ యొక్క ఒక్క భాగం ఇలా ఉంటుంది:

أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ
(అస్ అలుక బికొల్లి ఇస్మిన్ హువ లక సమ్మైత బిహీ నఫ్సక్)
ఓ అల్లాహ్! నువ్వు నీ కోసం పెట్టుకున్న ప్రతి పేరు ద్వారా నేను నిన్ను పిలుస్తున్నాను.

అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ప్రియ వీక్షకులారా! ఈ… ఇంతకీ నా మాటలకి సారాంశం ఏమిటంటే దుఆ చేయటం, అల్లాహ్ ను వేడుకోవటం, ఇది ముఖ్యమైన ఆరాధన కాబట్టి, దీని విధానం ఏమిటి? అల్లాహ్ యొక్క నామాల ద్వారా, ఆయన గుణ విశేషాల ద్వారా మనము అల్లాహ్ ను పిలవాలి, వేడుకోవాలి, దుఆ చేయాలి. ఆ, ఇది కొన్ని ముఖ్యమైన విషయాలు మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి.

ప్రియ సోదరులారా! ఇక ఈ అంశానికి సంబంధించిన విషయమే, అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అల్లాహ్ ను వేడుకోవటానికి, దుఆ చేయటానికి, ఆ దుఆ స్వీకరించబడటానికి ఎవరి సహాయమైనా అవసరమా? మధ్యవర్తి అవసరమా? సింపుల్ గా చెప్పాలంటే వసీలా అవసరమా? అసలు వసీలా అంటే ఏమిటి? వసీలా వాస్తవికత ఏమిటి? వసీలా ధర్మసమ్మతమా కాదా? వసీలా గురించి వివరాలు, వసీలా గురించి వాస్తవికత ఏమిటో ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ధర్మ సమ్మతమైన వసీలా (అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనం) – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ధర్మ సమ్మతమైన వసీలా [వీడియో]
https://youtu.be/aOiweVwQqFA [14 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ(హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ‘వసీలా’ (అల్లాహ్‌కు సామీప్యం పొందడానికి ఒక సాధనం) అనే ఇస్లామీయ భావన గురించి వివరించబడింది. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం వసీలా యొక్క సరైన అవగాహనను, మరియు సాధారణ అపోహలను వక్త స్పష్టం చేశారు. వసీలా అంటే అల్లాహ్ యొక్క సామీప్యాన్ని ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వెతకడం అని ఆయన వివరించారు. ఈ ప్రసంగం ఆరు రకాల “ధర్మ సమ్మతమైన వసీలా”పై దృష్టి పెట్టింది: 1. అల్లాహ్ యొక్క అందమైన పేర్లు మరియు గుణగణాల ద్వారా. 2. ఒకరి విశ్వాసం (ఈమాన్) మరియు సత్కార్యాల ద్వారా. 3. తౌహీద్ (ఏకేశ్వరోపాసన) ద్వారా. 4. అల్లాహ్‌కు తమ అవసరాన్ని మరియు నిస్సహాయతను వ్యక్తపరచడం ద్వారా. 5. అల్లాహ్ ముందు తమ పాపాలను ఒప్పుకోవడం ద్వారా. 6. జీవించి ఉన్న ఒక పుణ్యాత్ముడిని తమ కోసం అల్లాహ్‌తో ప్రార్థించమని (దుఆ) కోరడం ద్వారా. మరణించిన ప్రవక్తలు, పుణ్యాత్ములు లేదా వారి సమాధుల ద్వారా వసీలాను వెతకడం ధర్మసమ్మతం కాదని వక్త నొక్కి చెప్పారు.

اَلْحَمْدُ لِلّٰهِ وَحْدَهُ
(అల్ హందులిల్లాహి వహ్ దహు)
అన్ని పొగడ్తలు ఏకైకుడైన అల్లాహ్ కే.

وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ
(వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు)
ఆయన తర్వాత ప్రవక్త ఎవరూ రారో, ఆయనపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అంటే మధ్యవర్తి అవసరమా? అల్లాహ్ ను దుఆ చేయటానికి, అర్థించటానికి, వేడుకోవటానికి లేదా మా దుఆలు స్వీకరింపబడటానికి మధ్యవర్తి అవసరమా? ఒకరి సహాయం అవసరమా? వసీలా అవసరమా? అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో వసీలా గురించి తెలియజేశాడు, కాకపోతే మన సమాజంలో ఒక వర్గం దానికి తప్పుడు అర్థం తీసుకుంటుంది. సహాబాలు, తాబయీన్లు, సజ్జనులు, పూర్వీకులు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, అయిమ్మాలు (ఇమాములు) తీసుకోలేని అర్థం వీళ్ళు తీసుకుంటున్నారు. దాని వాస్తవం ఏమిటి? ఇన్ షా అల్లాహ్ ఆధారంగా, ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ఆధారంగా తెలుసుకుందాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా, ఆయత్ 35 లో ఇలా తెలియజేశాడు:

وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ
(వబ్తగూ ఇలైహిల్ వసీల)
ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)

ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అని అల్లాహ్ తెలియజేశాడు. ఈ ఆయత్ లో వసీలా అనే పదం ఉంది.

అసలు వసీలా అంటే అర్థం ఏమిటి? వసీలా అంటే ఏదేని ఆశయాన్ని సాధించటానికి, సామీప్యం పొందటానికి అవలంబించబడే మార్గం లేక సాధనం. ఇది వసీలా యొక్క అర్థం. సింపుల్ గా చెప్పాలంటే, అల్లాహ్ సామీప్యం కొరకు సృష్టితాలను సాధనంగా చేసుకోవటం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అంటే ఆయనకు దగ్గర చేర్చే సత్కార్యాలను చేయమని అర్థం. కానీ కొంతమంది అసలు ఈ వసీలాను వదిలేసి, ఖురాన్ లో ఏ వసీలా గురించి చెప్పడం జరిగిందో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వసీలా గురించి చెప్పారో, దాని నిజమైన అర్థం ఏమిటి, వాస్తవమైన భావం ఏమిటి అది పక్కన పెట్టి, దర్గా, సమాధులను, పుణ్య పురుషులను, ప్రవక్తలను, దైవదూతలను, ఔలియాలను, చనిపోయిన వారిని సాధనంగా చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ ఖురాన్ కి, హదీసులకు లకు విరుద్ధం.

అభిమాన సోదరులారా! ఇక, వసీలా రెండు రకాలు. ధర్మ సమ్మతమైన వసీలా, అధర్మమైన వసీలా.

ఈరోజు మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకుందాం. ఏ వసీలా సమ్మతంగా ఉందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి తెలియజేశారో, ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి ఈరోజు మనము తెలుసుకుందాం, ఇన్ షా అల్లాహ్.

ధర్మ సమ్మతమైన వసీలాలో ఒకటి, గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం.

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. (7:180)

మొదటి ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి? అల్లాహ్ నామాలను, గుణగణాలను సాధనంగా చేసుకోవటం. అల్లాహ్ నామాన్ని, అల్లాహ్ గుణాలను వసీలాగా తీసుకోవటం. ఇది సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 180. వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా – అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఇది గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం, అంటే దుఆ చేసేటప్పుడు, వేడుకునేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అల్లాహ్ నామాల ద్వారా, అల్లాహ్ గుణ విశేషణాల ద్వారా వేడుకోవటం, అల్లాహ్ యొక్క నామాలను, అల్లాహ్ యొక్క గుణాలను సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం. ఇది మొదటి విషయం.

ఆ తర్వాత రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేయటం. విశ్వాసాన్ని, సత్కర్మలను. దీనికి ఉదాహరణ, బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక పేరు పొందిన ఒక హదీస్ ఉంది, ఫేమస్ హదీస్, గుహ వారి హదీస్. దీనికి ఒక ప్రబల తార్కాణం. ఆ వివరంగా ఉంది హదీస్, నేను కేవలం దాంట్లో యొక్క సారాంశం మాత్రమే చెప్తున్నాను.

ఆ ముగ్గురు వ్యక్తులు, బనీ ఇస్రాయీల్ లో, గుహలో తల దాచుకున్నారు. గాలుల మూలంగా, వర్షాల మూలంగా కొండరాయి విరిగి ఆ గుహ ముఖాన్ని మూసేసింది. ఆ ముగ్గురు వ్యక్తులు గుహ లోపల ఉండిపోయారు. బయటికి రావాలంటే కొండరాయి వచ్చి పడిపోయింది, ఆ ముఖ ద్వారం బంద్ అయిపోయింది. ఆ ముగ్గురు వ్యక్తులు బయటికి రాలేరు, శబ్దం బయటికి రాదు, అది ఊరు కాదు, ఎవరో సహాయం చేసే వారు ఎవరూ లేరు, మాట వినే వారు ఎవరూ లేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదో ఒక దారి చూపిస్తే తప్ప వారికి వేరే మార్గమే లేదు. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారు? ఆ ముగ్గురు తమ తమ జీవితంలో చేసుకొన్న సత్కర్మలను ఆధారంగా చేసుకుని దుఆ చేశారు. ఒక వ్యక్తి అయితే తమ అమ్మ నాన్నల పట్ల ఏ విధంగా వ్యవహరించాడో అది సాధనంగా చేసుకున్నాడు, అమ్మ నాన్నల పట్ల సత్ప్రవర్తన గురించి. ఇంకో వ్యక్తి దానధర్మాల గురించి, ఇంకో వ్యక్తి వేరే విషయం గురించి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ తమ సత్కర్మలను, చేసుకొన్న పుణ్యాలను సాధనంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని అల్లాహ్ ను వారు దుఆ చేశారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి దుఆలను ఆలకించి, వారి ప్రార్థన స్వీకరించి, వారికి ఆ బండరాయిని తప్పించి, కొండరాయిని తప్పించారు. వారు ముగ్గురు అల్హందులిల్లాహ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అంటే దీంతో ఏం అర్థం అవుతుంది? విశ్వాసం మరియు సత్కర్మలను సాధనంగా, వసీలాగా చేసి వేడుకోవచ్చు. ఇది రెండో విషయం.

మూడో విషయము, అల్లాహ్ సన్నిధిలో ఆయన “తౌహీద్ ను ఆశ్రయించటం. అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించి దుఆ చేయటం, తౌహీద్ ను వసీలాగా చేసుకోవటం. ఇది యూనుస్ అలైహిస్సలాం ఇలా దుఆ చేశారు. సూర అంబియా ఆయత్ 21:87:

فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ
(ఫనాదా ఫిజ్జులుమాతి అల్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక)
అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు.” అని మొరపెట్టు కున్నాడు(21:87)

ఇది యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులో చేసిన దుఆ ఇది. చీకట్లో, కటిక చీకట్లో, సముద్రం చీకటి, మళ్లా చేప కడుపు, ఆ చీకటి. కటిక చీకట్లో యూనుస్ అలైహిస్సలాం చేసిన దుఆ ఇది. చీకట్లో ఇలా మొరపెట్టుకున్నారు: “ఓ అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.” లా ఇలాహ ఇల్లా అంత – తౌహీద్ ని ఆశ్రయించారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక – “నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు.” అంటే మూడో విషయం, అల్లాహ్ సన్నిధిలో ఆయన తౌహీద్ ని, ఏకత్వాన్ని ఆశ్రయించి దుఆ చేయటం.

నాలుగో విషయం, అల్లాహ్ వైపు మరలి తన అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం. అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వసీలాగా చేసుకొని అల్లాహ్ ను అడగటం, వేడుకోవటం. ఇది అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు, దాదాపు 18 సంవత్సరాలు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఎంత ఆయన సహనం, ఓర్పు, ఆయనకు వచ్చిన పరీక్ష. అభిమాన సోదరులారా! అయ్యూబ్ అలైహిస్సలాం అనారోగ్యానికి గురైనప్పుడు, ఆ ఆయన యొక్క నిస్సహాయ స్థితిని ఆయన వసీలాగా చేసుకొని అల్లాహ్ కు ప్రార్థించారు, వేడుకున్నారు. అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ ఏమిటి? సూర అంబియా ఆయత్ 83:

أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ
(అన్నీ మస్సనియద్దుర్రు వ అంత అర్హముర్రాహిమీన్)
నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవు” (21:83)

అని దుఆ చేసుకున్నారు, వేడుకున్నారు. అంటే తన నిస్సహాయ స్థితిని సాధనంగా చేసుకున్నారు.

అభిమాన సోదరులారా, అలాగే ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం, పాపాలను అంగీకరిస్తూ, ఒప్పుకుంటూ దానికి సాధనంగా చేసుకుని వేడుకోవటం. ఇది మూసా అలైహిస్సలాం దుఆ చేశారు. సూర ఖసస్, ఆయత్ 16లో:

قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي
(ఖాల రబ్బీ ఇన్నీ జలంతు నఫ్సీ ఫగ్ ఫిర్లీ)
“నా ప్రభూ! నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. కనుక నన్ను క్షమించు.” (28:16)

అభిమాన సోదరులారా, ఇది ఐదవది.

ఆరవది ఏమిటంటే, ఇది చాలా గమనించి వినాలి, అపార్థం చేసుకోకూడదు. ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం. పరమపదించిన ఔలియాలు, పరమపదించిన ప్రవక్తలు, పరమపదించిన సత్పురుషులు కాదు. బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.

దీనికి ఉదాహరణ ఏమిటి? సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో వెళ్లి ఇలా రిక్వెస్ట్ చేసుకునేవారు, విన్నవించుకునేవారు: “ఓ దైవప్రవక్త, వర్షం లేదు, కరువు వచ్చేసింది, మీరు దుఆ చేయండి.” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు, అల్లాహ్ దుఆ స్వీకరించేవాడు, వర్షం వచ్చేది.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత – ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది – అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, మరి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వసీలాగా చేసుకోవచ్చు కదా? లేకపోతే ఆయన సమాధి వారి దగ్గరే ఉంది కదా? మస్జిద్ లోనే, పక్కనే ఉంది కదా? మదీనాలోనే ఉంది కదా? ఆ సమాధి దగ్గరికి పోయి వసీలాగా అడగవచ్చు కదా? లేదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు దగ్గరికి పోయి దుఆ చేయమని కోరేవారు. ఇది చాలా గమనించే విషయం. సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ప్రవక్త గారి పేరుతో వసీలాగా దుఆ చేయలేదు. ప్రవక్త గారి యొక్క సమాధి దగ్గరికి పోయి వసీలాగా చేసుకోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, ప్రవక్త గారితో దుఆ చేయించేవారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు బ్రతికి ఉన్నారు కాబట్టి, ఆయన దగ్గరికి పోయి దుఆ చేయమని వేడుకునేవారు, అడిగేవారు, రిక్వెస్ట్ చేసుకునేవారు.

కావున, ఇవి నేను చెప్పిన ఆరు రకాలు, ఇవి మాత్రమే ధర్మ సమ్మతమైన వసీలా.

  • మొదటిది ఏమిటి? అల్లాహ్ యొక్క నామాలను, గుణాలను వసీలాగా చేసుకోవటం.
  • రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
  • మూడవది, అల్లాహ్ సన్నిధిలో అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించటం.
  • నాలుగవది, అల్లాహ్ వైపు మరలి అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం.
  • ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం.
  • ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషులు, పుణ్యాత్ముల దగ్గరికి పోయి దుఆ చేయమని కోరటం. వారు కూడా దుఆ చేస్తారు.

ఈ విధంగా, ఇవి తప్ప ఇంకా ఇతర రకమైన వసీలా ధర్మ సమ్మతం కాదు. అది ధర్మ సమ్మతం కాని వసీలా, అధర్మమైన వసీలా. అది ఏమిటో, ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు)
మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

వసీలా , తవస్సుల్

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/