ప్రాణాంతకమైన 7 విషయాలు! [వీడియో & టెక్స్ట్]

ప్రాణాంతకమైన 7 విషయాలు!
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/gRDAnqTbVpY [9 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో ఏడు ఘోరమైన, ప్రాణాంతకమైన పాపాల గురించి వివరించబడింది. మునుపటి ప్రసంగంలో చర్చించిన ఏడు రకాల పుణ్యకార్యాలకు విరుద్ధంగా, ఈ పాపాలు ఒక వ్యక్తిని నాశనం చేస్తాయని చెప్పబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసును ఉటంకిస్తూ, ఈ ఏడు పాపాలను జాబితా చేశారు: 1) అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించడం (షిర్క్), 2) చేతబడి (సిహ్ర్), 3) అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీయడం, 4) వడ్డీ తినడం (రిబా), 5) అనాథ ఆస్తిని తినడం, 6) ధర్మయుద్ధం నుండి పారిపోవడం, మరియు 7) పవిత్రులైన విశ్వాస స్త్రీలపై అపనిందలు వేయడం. ఈ పాపాలు ఎంత తీవ్రమైనవో, వాటికి కేవలం సాధారణ పుణ్యకార్యాలు కాకుండా, ప్రత్యేక పశ్చాత్తాపం (తౌబా) అవసరమని నొక్కి చెప్పబడింది. ఈ ఘోరమైన పాపాల నుండి రక్షణ పొందాలని అల్లాహ్‌ను ప్రార్థిస్తూ ప్రసంగం ముగుస్తుంది.


అభిమాన సోదరులారా! కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

అభిమాన సోదరులారా! ఈ రోజు మనం ప్రాణాంతకమైన ఏడు విషయాలు తెలుసుకుందాం. నిన్న ఎపిసోడ్ లో మనం ప్రళయ దినాన ఏడు రకాల మనుషులకి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు అని తెలుసుకున్నాము. అంటే నిన్న తెలుసుకుంది కావలసిన ఏడు విషయాలు. న్యాయం కావాలి, నమాజ్ చేయాలి, యవ్వనం అల్లాహ్ మార్గంలో గడపాలి, గుప్తంగా దానం చేయాలి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి, ఏకాంతంలో అల్లాహ్ కు భయపడాలి, ఏడవాలి భయపడి, కలుసుకుంటే అల్లాహ్ ప్రసన్నత, విడిపోతే అల్లాహ్ ప్రసన్నత – ఈ ఏడు కావలసిన, చేయవలసిన విషయాలు నిన్న తెలుసుకున్నాము.

ఈ రోజు ఏడు విషయాలని వదులుకోవాలి. ప్రాణాంతకమైన ఏడు విషయాలు. పాపంతో కూడుకున్న ఏడు విషయాలు. ఘోరమైన పాపంతో కూడుకున్న ఏడు విషయాలు. అందుకే, దానికి ప్రాణాంతకమైన విషయాలు అని చెప్పడం జరిగింది. ఆ హదీస్ ఏమిటంటే, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు:

اجْتَنِبُوا السَّبْعَ الْمُوبِقَاتِ
(ఇజ్తనిబు అస్సబ్’అల్ మూబికాత్)
“ప్రాణాంతకమైన ఏడు విషయాలకు దూరంగా ఉండండి” అని అన్నారు.

ఇది విన్న సహాబాలు రిజ్వానుల్లాహి అలైహిం అజ్మయీన్

قَالُوا يَا رَسُولَ اللهِ وَمَا هُنَّ
(ఖాలూ యా రసూలల్లాహ్, వమా హున్)
“ఓ దైవ ప్రవక్తా! ఆ ప్రాణాంతకమైన ఏడు విషయాలు ఏమిటి?” అని అడిగారు.

దానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఏడు విషయాలు వివరించారు. వాటిల్లో మొదటి విషయం

اَلشِّرْكُ بِاللهِ
(అష్-షిర్కు బిల్లాహ్)
అల్లాహ్‌కు సహవర్తుల్ని నిలబెట్టడం.

ఇది అన్నింటికంటే ఘోరమైన పాపం, ప్రాణాంతకమైన విషయం.

ప్రియ వీక్షకుల్లారా! షిర్క్ అంటే ఏమిటి? అల్లాహ్ అస్తిత్వములో లేదా అల్లాహ్‌కు కొరకు మాత్రమే ప్రత్యేకమైన ఉన్న భావములో ఆయన గుణగణాలలో లేదా ఆయన హక్కులలో ఎవరినైనా సహవర్తునిగా ఎంచటమే షిర్క్. వాడుక భాషలో చెప్పాలంటే, అల్లాహ్‌ను నమ్ముతూ, అల్లాహ్ తో పాటు ఇతరులని కూడా పూజ చేయటం, ఆరాధించటం. ఆరాధన అల్లాహ్‌కే ప్రత్యేకం కదా, కానీ ఆ ఆరాధన ఇతరులకు కూడా చేయటం. ఇది కూడా షిర్క్ అవుతుంది. అంటే బహుదైవారాధన.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో సూరె లుఖ్మాన్ లో ఇలా తెలియజేశాడు:

يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
(యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహ్, ఇన్నష్షిర్క ల జుల్మున్ అజీమ్)
“ఓ నా కుమారా! అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. నిశ్చయంగా షిర్క్‌ చాలా పెద్ద దుర్మార్గం.” (31:13)

ఇది లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి హితోపదేశిస్తూ చెప్పిన విషయం ఇది. “యా బునయ్య! ఓ నా ముద్దుల పుత్రుడా! లా తుష్రిక్ బిల్లాహ్ – అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. అల్లాహ్ తో షిర్క్ చేయవద్దు, సాటి కల్పించవద్దు. ఇన్నష్షిర్క ల జుల్మున్ అజీమ్ – ఎందుకంటే నిస్సందేహంగా షిర్క్ అనేది మహా పాపం, ఘోరమైన అన్యాయం.”

ఇది క్లుప్తంగా షిర్క్. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రాణాంతకమైన ఏడు విషయాలలో ఇది మొట్టమొదటిది, చాలా ఘోరమైనది – షిర్క్. షిర్క్ చేస్తూ చనిపోతే అటువంటి వారికి క్షమాపణ లేదని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి షిర్క్ నుండి – పెద్ద షిర్క్, చిన్న షిర్క్, అన్ని రకాల షిర్క్ నుండి అల్లాహ్ మనల్ని రక్షించు గాక, కాపాడు గాక.

ఇది మొదటి విషయం. ప్రాణాంతకమైన ఏడు విషయాలలో మొదటి విషయం షిర్క్ చేయటం. అల్లాహ్‌కు భాగస్వాములు నిలబెట్టడం.

రెండవది:

وَالسِّحْرُ
(వస్-సిహ్ రు)
చేతబడి.

జాదూ. చేతబడి చేయటం, చేయించటం ఇస్లాంలో హరాం, నిషిద్ధం, అధర్మం, ఘోరమైన పాపం.

అలాగే మూడవది:

وَقَتْلُ النَّفْسِ الَّتِي حَرَّمَ اللهُ إِلَّا بِالْحَقِّ
(వ కత్లున్-నఫ్సిల్లతీ హర్రమల్లాహు ఇల్లా బిల్-హఖ్)
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిషిద్ధం చేసిన ప్రాణిని అన్యాయంగా చంపటం.

హత్య చేయటం ఘోరమైన పాపం.

అలాగే నాలుగవది:

وَأَكْلُ الرِّبَا
(వ అకులుర్-రిబా)
వడ్డీ తినటం.

ఇస్లాం ధర్మంలో వడ్డీ సమంజసం కాదు. అధర్మం, నిషిద్ధం, హరాం, ఘోరమైన పాపం, అన్యాయం, దగా, మోసం కిందకి లెక్కించబడుతుంది. ఇస్లాం ధర్మంలో వడ్డీ ఇచ్చినా, వడ్డీ పుచ్చుకున్నా, దానికి సాక్ష్యంగా ఉన్నా, అందరూ పాపములో సమానులే అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే ఐదవ విషయం:

وَأَكْلُ مَالِ الْيَتِيمِ
(వ అకులు మాలిల్-యతీమ్)
అనాథుని సొమ్ము తినేయటం.

ఎవరి సొమ్మయినా సరే అన్యాయంగా తినేస్తే, కాజేస్తే అది అధర్మమే, అది పాపమే. దాంట్లో ముఖ్యంగా అనాథుని సొమ్ము తినేస్తే ఇది ఇంకా ఘోరమైన పాపం.

ఆరవది:

وَالتَّوَلِّي يَوْمَ الزَّحْفِ
(వత్-తవల్లీ యౌమజ్-జహ్ఫి)
దైవ తిరస్కారులతో యుద్ధం జరిగినప్పుడు వెన్ను చూపి పారిపోవటం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ధర్మయుద్ధం అది. ఎక్కడైతే అక్కడ గొడవ చేయటం, ధర్మయుద్ధం కిందకి రాదు. బాంబులు వేసేయటం, ధర్మయుద్ధం కిందకి రాదు. ఇది అపోహ. దానికి కొన్ని రూల్స్, కండిషన్లు ఉన్నాయి. అల్లాహ్ మార్గంలో యుద్ధం జరిగినప్పుడు వెన్ను చూపి పారిపోవటం.

అలాగే ఏడవది:

وَقَذْفُ الْمُحْصَنَاتِ الْمُؤْمِنَاتِ الْغَافِلَاتِ
(వ కజ్ఫుల్ ముహ్సినాతిల్ ము’మినాతిల్ గాఫిలాత్)
అమాయకులు, శీలవంతులు అయిన విశ్వాస స్త్రీల మీద అభాండాలు వేయటం, అపనిందలు మోపటం.

ఈ ఏడు రకాల పాపాలు ప్రాణాంతకమైనవి. పాపాలలో అతి ఘోరమైనవి. దీనికి పెద్ద పాపాలు అంటారు, కబాయిర్ అంటారు. అంటే, ఈ పాపాలు నమాజ్ వల్ల, దుఆ వల్ల, వేరే పుణ్యాల వల్ల క్షమించబడవు. దీనికి తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాల్సిందే, తౌబా చేసుకోవాల్సిందే. ఈ పాపాలకి తప్పనిసరిగా తౌబా చేసుకోవాలి, పశ్చాత్తాప పడాలి. అప్పుడే ఇవి క్షమించబడతాయి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఈ ఘోరమైన పాపాల నుండి రక్షించు గాక! అల్లాహ్ మనందరినీ షిర్క్ నుండి కాపాడు గాక! వడ్డీ నుండి కాపాడు గాక! చేతబడి చేయటం, చేయించటం నుండి కాపాడు గాక! అనాథుని సొమ్ముని కాజేయటం నుండి అల్లాహ్ మనల్ని రక్షించు గాక! ప్రతి పాపం నుండి, ఆ పాపం పెద్దదైనా, ఆ పాపం చిన్నదైనా, అల్లాహ్ మనందరినీ రక్షించు గాక! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్ని అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించు గాక! ఆమీన్.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42368

పాపాలు (Sins):
https://teluguislam.net/sins/

జాదు (చేతబడి) [వీడియో & టెక్స్ట్]

జాదు (చేతబడి) 
https://youtu.be/Jq8qXPHgDLc [ 11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో చేతబడి (సిహ్ర్) యొక్క స్థానం, దాని ప్రభావం మరియు దాని నుండి రక్షణ పొందే మార్గాల గురించి చర్చించబడింది. ధర్మ పండితులు చేతబడిని ‘అఖీదా’ (విశ్వాసం) కు సంబంధించిన విషయంగా మరియు ‘షిర్క్’ (బహుదైవారాధన) గా పరిగణించారని వక్త స్పష్టం చేశారు. చేతబడి చేయడం, చేయించడం, నేర్చుకోవడం మరియు నేర్పించడం వంటివన్నీ ఘోరమైన పాపాలు మరియు హరామ్ (నిషిద్ధం) అని ఉద్ఘాటించారు. చేతబడి ప్రభావం వాస్తవమే అయినప్పటికీ, అది అల్లాహ్ అనుమతితో మాత్రమే సంభవిస్తుందని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరించారు. చేతబడి ప్రభావాన్ని తిరస్కరించే వారి వాదనలను ఖండిస్తూ, దాని నివారణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరహ్ అల్-బఖరా పారాయణం, ఉదయం-సాయంత్రం దువాలు (అజ్కార్) వంటి మార్గాలను సూచించారని తెలిపారు. చేతబడి ద్వారా సంపాదించిన ధనం నిషిద్ధమని మరియు ఇస్లామీయ రాజ్యంలో చేతబడి చేసేవారికి మరణశిక్ష విధించబడుతుందని కూడా పేర్కొన్నారు.

చేతబడి గురించి ఇక్కడ మనకు సంక్షిప్తంగా కొన్ని విషయాలు వస్తాయి. అల్లాహ్ యొక్క దయతో ఈరోజు దీన్ని కొంచెం వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చేతబడిని ధర్మ పండితులు అఖీదా (విశ్వాసం) విషయాలలో చేర్చారు. మరియు చేతబడి చేయడం అన్నది షిర్క్ లో వస్తుంది అని కూడా స్పష్టపరిచారు. అందుకొరకు మీరు చూడగలుగుతారు, అఖీదాకు సంబంధించిన, విశ్వాసాలకు సంబంధించిన ప్రత్యేకమైన పుస్తకాలు ఏవైతే వ్రాయబడ్డాయో, వాటిలో చేతబడి (సిహ్ర్) ను ప్రస్తావించడం జరిగింది.

అయితే సోదర మహాశయులారా, చేతబడి చేయుట, చేయించుట, నేర్పుట మరియు నేర్చుకొనుట, ఇవన్నీ కూడా హరాంలో వస్తాయి. మరియు ఇవన్నీ కూడా అవిశ్వాసంలో లెక్కించబడతాయి. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసులో తెలిపారు, బుఖారీ మరియు ముస్లింలో, వినాశనానికి గురిచేసే విషయాలలో ఒకటి ఇది అని కూడా తెలిపారు.

اجْتَنِبُوا السَّبْعَ الْمُوبِقَاتِ
[ఇజ్తనిబుస్ సబ్ అల్ మూబిఖాత్]
(ఏడు) వినాశకరమైన పాపాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

మరియు చేతబడి అన్నది నష్టమే కలుగజేస్తుంది తప్ప ఏమీ లాభం కలగజేయదు. ఇక్కడ నష్టం అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, ఇది నేర్చుకోవడం గాని, నేర్పటం గాని, చేయడం గాని, చేయించడం గాని, ఈ విషయంలో ప్రత్యేకంగా.

అలాగే సోదర మహాశయులారా, ఒకవేళ ఖురాన్ ఆయతులు మనం గమనించామంటే, అక్కడ ఇది ఇహలోకంలో ఒక ఆజ్మాయిష్, ఒక పరీక్ష మాదిరిగా ఉంది. సూరతుల్ బఖరా ఆయత్ నంబర్ 102 ఏదైతే కొంచెం సుమారు ఒక 15 పేజీల ఖురాన్ లలో సుమారు సగం పేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఈ పూర్తి ఆయత్. అందులో

إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ
[ఇన్నమా నహ్ను ఫిత్నతున్ ఫలా తక్ ఫుర్]
నిశ్చయంగా, మేము కేవలం ఒక పరీక్ష మాత్రమే, కనుక మీరు అవిశ్వాసానికి పాల్పడకండి.

సోదర మహాశయులారా, చేతబడి చేయడం, చేయించడం, నేర్పడం, నేర్పించడం, దీని గురించి ఈ విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే దీని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

చేతబడి గురించి ఈ రోజుల్లో కొందరు దాని యొక్క ప్రభావమే లేదు ఏమాత్రం అని నిరాకరిస్తున్నారు. కానీ ఈ మాట కూడా నిజమైనది కాదు. దాని ప్రభావం ఉంది. కానీ అది అల్లాహ్ తలచినప్పుడే జరుగుతుంది. దానివల్ల నష్టం జరగవచ్చు, ఎవరిపై చేతబడి చేయబడుతుందో వారిపై. కానీ అది ఎప్పుడు? అల్లాహ్ యొక్క అనుమతి తో.

وَمَا هُم بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلَّا بِإِذْنِ اللَّهِ
[వమా హుమ్ బి దార్రీన బిహీ మిన్ అహదిన్ ఇల్లా బి ఇజ్ నిల్లాహ్]
అల్లాహ్ అనుమతి లేకుండా వారు దాని ద్వారా ఎవరికీ ఎలాంటి హాని చేయలేరు.

ఇప్పుడు ధూమపానం, బీడీ సిగరెట్లు తాగడం, మత్తు పానీయాలు సేవించడం, ఇవి హరామ్ ఉన్నాయి. వీటి యొక్క నష్టాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ సారాయి త్రాగేవారు, బీడీ సిగరెట్లకు అలవాటు పడినవారు ఎంతోమంది ఇప్పటికీ ఏమంటున్నారు? అరె ఇప్పటికీ నేను 30 సంవత్సరాల నుండి తాగుతున్నా. ఇప్పటికీ నేను 40 సంవత్సరాల నుండి తాగుతున్నా. ఏదో అడ్వర్టైజ్ లు, ఏదేదో పేపర్లు, ఏదేదో పిక్చర్లు, వీడియోలు చూపిస్తారు. అది లంగ్స్ పాడైపోతాయని, ఆ కిడ్నీలు పాడైపోతాయని, ఇంతవరకు నాకేమీ కాలేదు. ఇప్పటివరకు నేను మంచిగానే ఉన్నాను. అయితే ఇక్కడ వాటి ప్రభావం లేదు, వాటి నష్టం లేదు అని భావమా?

సోదర మహాశయులారా, అల్లాహు త’ఆలా స్వయంగా ఆ చేతబడి యొక్క నష్టాల గురించి ప్రస్తావించాడు. ఎవరికైనా ఆ నష్టం జరిగితే దాని నుండి ఎలా కోలుకోవాలి, ఎలా చికిత్స పొందాలి, ఆ మార్గం కూడా చూపాడు, దువాల ద్వారా. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా నేర్పారు. ఇవన్నీ కూడా మనకు ఖురాన్ మరియు సహీ హదీసుల ద్వారా మరియు సహాబాలు, సలఫుస్ సాలిహీన్ రహిమహుముల్లాహ్ ద్వారా మనకు కనబడుతున్నాయి, గ్రంథాలలో రాసి ఉన్నాయి. అందుకొరకే ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఎంతోమంది ధర్మవేత్తలు, చేతబడికి సంబంధించిన హదీసులు ఏవైతే వచ్చాయో అవి తవాతుర్ కు చేరినవి. తవాతుర్, ఇది హదీస్ పరిభాషలో, ఇస్తిలాహాతె హదీస్ లో ఒక పదం. దాని భావం సంక్షిప్తంగా ఏంటి? ఏ హదీసులైతే ఎన్ని పరంపరాల ద్వారా, ఎన్ని ఉల్లేఖనాల ద్వారా వస్తాయో, వాటిని తిరస్కరించడం, వాటిలో అబద్ధం అని చెప్పడం అసాధ్యం. ఆ సంఖ్యకు చేరినటువంటి హదీసులను తవాతుర్ అని అంటారు.

మరియు దీని గురించి ఎందరో ధర్మవేత్తలు ఇజ్మా, అందరూ ఏకీభవించిన విషయం. సహాబాల కాలంలో, తాబియీన్ల కాలంలో, తబె తాబియీన్ల కాలంలో, ఆ తర్వాత ఎన్నో వందల సంవత్సరాల వరకు ఏకీభవించిన దీనిని తిరస్కరిస్తూ ఈ రోజుల్లో కొందరి మాటలు మనం ఎలాగైతే వింటున్నామో, చేతబడి యొక్క ఏదీ లేదు అని. మరికొందరైతే మూర్ఖత్వంలో ఒక హద్దును మించి నాపై చేసి చూపించండి. ఒకరు నన్ను అడిగారు కూడా, షేఖ్ మరి వానిపై మనం ఒకసారి చేద్దామా? నేను అన్నాను, షరియత్ ధర్మం మనకు అనుమతి ఇవ్వదు. ఒక మూర్ఖుడు ఇలా వాదులాడుతుంటే అతని మూర్ఖత్వంలో మనం పడే అవసరం లేదు. మనం అలాంటి పాపంలో ఎందుకు పడాలి? ఎందుకంటే చేతబడి చేయడం, చేయించడం, నేర్పడం, నేర్చుకోవడం ఇవన్నీ కూడా హరామ్. ఇవన్నీ కూడా ఘోరమైన పాపాలలో వస్తాయి.

చేతబడి ఉంది, దాని ప్రభావం ఉంది, అల్లాహ్ తలచినప్పుడు దాని యొక్క నష్టం జరుగుతుంది. మరియు దాని నుండి మనం రక్షింపబడటానికే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఎన్నో మార్గాలు కూడా చూపారు. ఖర్జూర్ (అజ్వా) విషయంలో కూడా తెలిపారు. హబ్బతుస్ సౌదా (కలోంజి నల్ల జీలకర్ర విషయంలో) విషయంలో కూడా తెలిపారు. ఇంకా సూరా సూరతుల్ ఫలఖ్, సూరతున్నాస్ ఇలాంటి ఆయతులు.

అయితే సోదర మహాశయులారా, అందుకొరకే నేను అంటాను, ఖురాన్ హదీసులను మనం సహాబాలు అర్థం చేసుకున్న విధంగా చేసుకోవాలి, అప్పుడే మనం నిజమైన ఇస్లాంపై స్థిరంగా ఉండగలుగుతాము.

ఇక ఎవరైనా మాంత్రికులు, చేతబడి చేసేవారు, ఏదైతే తమ చేతబడి ద్వారా సంపాదిస్తారో ధనం, అదంతా కూడా వారి కొరకు నిషిద్ధం. ఇది వారి కొరకు ఏమాత్రం హలాల్ కాదు. వారు త్వరగా తౌబా చేసుకొని మానుకోవాలి. లేదా అంటే చాలా ఘోర పాపంలో పడిపోతారు.

అందుకొరకే హజరత్ హఫ్సా రదియల్లాహు త’ఆలా అన్హా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య, ఇంకా వేరే సహాబాల ద్వారా రుజువైన విషయం, ఏ మాంత్రికుని గురించి అయితే తెలుస్తుందో అతడు చేతబడి చేస్తున్నాడు, చేతబడి చేసేవాడు అని, అతడిని పిలిచి ఇస్లామీయ ప్రభుత్వంలో, ముస్లిం యజమాని, ముస్లిం హాకిమ్ పరిపాలకుని వద్ద తౌబా చేయించాలి. ఆ పనిని వదులుకోవాలి అని చెప్పాలి. ఒకవేళ అతడు వదులుకోకుంటే, తౌబా చేయకుంటే అతడిని హత్య చేసేయాలి. హఫ్సా రదియల్లాహు త’ఆలా అన్హా స్వయంగా హత్య చేసిన సంఘటన హదీసుల్లో మనకు ఉంది.

ఇక్కడ మన ఇండియా లాంటి ప్రాంతంలో అలాంటి వారికి చట్టపరంగా వారి పట్ల తగిన చర్య తీసుకోవడం జరగాలి. అయితే ఇక్కడ రెండు విషయాల ప్రస్తావన మనకు వచ్చింది. ఒకటి, చేతబడి గురించి ఈ రోజుల్లో ఎవరైతే తిరస్కరిస్తున్నారో ప్రభావం లేదు అంటున్నారో, వారి గురించి కూడా మనం మాట్లాడాము. కానీ చేతబడి నేర్చుకోవడం, నేర్పడం, మరి చేయించడం, చేయడం, అలాంటి వారి వద్దకు వెళ్లడం ద్వారా మన యొక్క పుణ్యాలు కూడా నశించిపోతాయి అన్న విషయం తెలుసుకోవాలి. తర్వాత సామాన్యంగా ఈ రోజుల్లో పగలు తీర్చుకుంటూ ఒకరిపై ఒకరు ఏదైతే భూమి విషయంలో గాని, పొలాల విషయంలో గాని, లేదా ఇంకా వేరే పరస్పరం సంబంధాలలో ఏవైతే వ్యతిరేకతలు వస్తాయో వాటి కారణంగా ఎదుటి వారికి నష్టం చేకూర్చే ఉద్దేశంతో చేతబడి చేయించి వారికి నష్టం చేయించాలి అన్నటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అలాంటి సందర్భంలో ఎవరైతే సూరె బఖరా యొక్క పాబందీగా తిలావత్ (పారాయణం) చేస్తూ ఉంటారో, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు,

وَلَا تَسْتَطِيعُهَا الْبَطَلَةُ
[వలా తస్తతీవుహల్ బతలహ్]
మాంత్రికులు దానిని (సూరహ్ అల్-బఖరాను) ఎదుర్కోలేరు.

బతలహ్ (మాంత్రికులు) ఈ సూరాను ఎదుర్కొనేటువంటి శక్తి ఏమాత్రం కలిగి ఉండరు. మరియు అజ్కార్, ఉదయం సాయంకాలం, నమాజుల తర్వాత, పడుకునే ముందు, ఇంట్లో వస్తూ పోతూ వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా పాటించేది ఉంటే, అలాంటి వారిపై కూడా చేతబడి ప్రభావం అల్లాహ్ యొక్క దయతో కలగదు.

అయితే సోదర మహాశయులారా, ఈరోజు మనం అల్లాహ్ యొక్క దయవల్ల చేతబడి వరకు మూడు అంశాలు ఈనాటి పాఠంలో తెలుసుకున్నాము. ఇంకా మిగతా విషయాలు అల్లాహ్ యొక్క దయతో తర్వాత పాఠాల్లో వస్తాయి.

అల్లాహు త’ఆలా మనందరికీ అన్ని రకాల చెడుల నుండి కాపాడుగాక. ముహర్రమాత్, నిషిద్ధతలు ఏమిటో ఖురాన్ హదీసుల ఆధారంగా తెలుసుకొని వాటికి దూరం ఉండే సౌభాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సనల్ జజా వ బారకల్లాహు ఫీకుమ్ వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్.

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]