సహాయం కోరుకోవడం (ఇస్తిఆన) – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

సహాయం కోరుకోవడం (ఇస్తియాన) 
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/xGpbNMU2qLQ

ఈ ప్రసంగంలో, “ధర్మ అవగాహనం” అనే సిరీస్ యొక్క పదవ ఎపిసోడ్‌లో సహాయం కోరడం (ఇస్తిఆన) అనే అంశం గురించి వివరించబడింది. ఇస్లాంలో సహాయం కోరడంలో నాలుగు రకాలు ఉన్నాయని బోధకుడు వివరిస్తున్నారు. మొదటిది, అల్ ఇస్తిఆనతు బిల్లాహ్ – అల్లాహ్ యే సహాయం కోరడం, ఇది తౌహీద్ యొక్క పునాది. రెండవది, అల్ ఇస్తిఆనతు బిల్ మఖ్లూఖాత్ – పుణ్య కార్యాల కోసం సృష్టి జీవుల నుండి సహాయం తీసుకోవడం, ఇది ధర్మసమ్మతమే. మూడవది, అల్ ఇస్తిఆనతు బిల్ అమ్వాత్ – మరణించిన వారి నుండి సహాయం కోరడం, ఇది షిర్క్ (బహుదైవారాధన) మరియు తీవ్రమైన పాపం. నాల్గవది, అల్ ఇస్తిఆనతు బి అ’మాలే సాలిహా – సహనం, నమాజ్ వంటి సత్కర్మల ద్వారా అల్లాహ్ సహాయాన్ని అర్థించడం, ఇది ప్రోత్సహించబడింది. ప్రసంగం ముగింపులో, ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం సరైన మార్గంలో సహాయం కోరే సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహ్ ను ప్రార్థిస్తూ ముగించారు.

إِنَّ ٱلْحَمْدَ لِلَّٰهِ وَحْدَهُ
(ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు)

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَىٰ مَنْ لَا نَبِيَّ بَعْدَهُ أَمَّا بَعْدُ
(వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అ దహు, అమ్మా బ’అద్)

اَلسَلامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ‎
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ పదవ ఎపిసోడ్ లో మనం సహాయం కోరుకోవటం అనే విషయం గురించి తెలుసుకుందాం. మనిషి పలు రకాలుగా సహాయాన్ని కోరుకుంటాడు. ఈ ఎపిసోడ్లో మనం నాలుగు రకాలు తెలుసుకుందాం.

మొదటిది అల్ ఇస్తిఆనతు బిల్లాహ్, అల్లాహ్ తో సహాయాన్ని అర్థించటం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ ఫాతిహాలో ఇలా తెలియజేశాడు:

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
(ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము..” (1:5)

ఈ ఆయత్ సూరహ్ ఫాతిహాలోని ఆయత్. దీనిని మనం ప్రతిరోజూ, ప్రతి నమాజులో, ప్రతి రకాతులో పఠిస్తాము. దీని అర్థం: ఓ అల్లాహ్, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కోసం నిన్నే అర్థిస్తాము, నీతోనే సహాయం కోరుతాము, ఇతరులతో సహాయము కోరము అని అర్థం.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

إِذَا سَأَلْتَ فَاسْأَلِ اللَّهَ
(ఇదా స’అల్త ఫస్’అలిల్లాహ)
“వేడుకుంటే అల్లాహ్ తోనే వేడుకోండి”

وَإِذَا اسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاللَّهِ
(వ ఇదస్త’అంత ఫస్త’ఇన్ బిల్లాహ్)
“సహాయం కోసం అర్థిస్తే అల్లాహ్ తోనే అర్పించండి.”

దీని పరంగా, ఇతరులను సహాయం కోసం మొరపెట్టుకోవటం, సహాయం కోసం ఇతరులను పూజించటం ధర్మసమ్మతం కాదు. అది షిర్క్ అవుతుంది, ఇబాదాలో షిర్క్ అవుతుంది, తౌహీద్ ఉలూహియ్యతులో షిర్క్ అవుతుంది. ఇది మొదటి విషయం. ఇటువంటి సహాయం అల్లాహ్ తోనే కోరాలి, ఇతరులతో కోరకూడదు.

ఇక రెండో విషయానికి వస్తే, అల్ ఇస్తిఆనతు బిల్ మఖ్లూఖాత్. అంటే, సృష్టితాల సహాయం. కారకాలకు లోబడి, ఒకరికొకరి సహాయాన్ని కోరటం. ఇది ధర్మసమ్మతమే. దీన్ని ఇస్లాంలో ప్రోత్సహించటం కూడా జరిగింది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ మాయిదాలో ఇలా తెలియజేశాడు:

وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ
(వ త’ఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా, వలా త’ఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్)
సత్కార్యాలలో, అల్లాహ్‌ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి.” (5:2)

మంచికి, దైవభీతికి సంబంధించిన విషయాలలో ఒకరికొకరికి అందరితోనూ సహకరించండి. మంచి విషయాలలో, పుణ్య విషయాలలో, దైవభీతికి పుట్టిన విషయాలలో అందరితోనూ సహకరించండి. వలా త’ఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్, అంటే పాప కార్యాలలో, అధర్మ విషయాలలో, ఖుర్ఆన్ మరియు హదీసులకి విరుద్ధమైన విషయాలలో సహకరించకండి. అంటే, కారకాలకు లోబడి, పరస్పరం మనము చేయగలిగే విషయాలలో సహాయం తీసుకోవటం, ఇది ధర్మసమ్మతమే.

ఇక మూడో విషయానికి వస్తే, అల్ ఇస్తిఆనతు బిల్ అమ్వాత్, చనిపోయిన వారి సహాయం తీసుకోవటం. ఇది షిర్క్, అధర్మం, అసత్యం, ఇది ఘోరమైన పాపం, ఇది షిర్క్ కిందికి వచ్చేస్తుంది, పెద్ద షిర్క్ అవుతుంది. ఎందుకంటే, చనిపోయిన వారు, తల్లిదండ్రులైనా, పితామహులైనా, స్నేహితులైనా, సజ్జనులైనా, గురువులైనా, పండితులైనా, ఔలియాలు అయినా, ప్రవక్తలు అయినా సరే, చనిపోయిన వారు చనిపోయిన తర్వాత మన పిలుపుని వారు వినలేరు. మన సమస్యల్ని వారు దూరం చేయలేరు. కావున చనిపోయిన వారి సహాయాన్ని కోరటం ఇది ధర్మసమ్మతం కాదు, షిర్క్ క్రిందికి వస్తుంది. ఈ విషయం గురించి మనము బాగా జాగ్రత్త పడాలి.

ఇక నాలుగో విషయం, అల్ ఇస్తిఆనతు బి అ’మాలే సాలిహా, సత్కర్మల ద్వారా సహాయాన్ని కోరటం. ఇది ధర్మసమ్మతం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ బఖరాలో ఇలా తెలియజేశాడు:

وَٱسْتَعِينُوا۟ بِٱلصَّبْرِ وَٱلصَّلَوٰةِ
(వస్త’ఈనూ బిస్సబ్రి వస్సలాహ్)
మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి.” (2:45)

మీరు సహనం ద్వారా, సలాహ్, నమాజ్ ద్వారా అల్లాహ్ సహాయాన్ని అర్పించండి, కోరండి అని. దీన్ని బట్టి, మంచి పుణ్యాల ద్వారా, సత్కర్మల ద్వారా, సహనం నమాజుల ద్వారా సహాయాన్ని కోరవచ్చు.

అభిమాన సోదరులారా! ఈ సహాయం అనే విషయంలో, ఖుర్ఆన్ మరియు హదీస్ కి అనుగుణంగా నడుచుకునే, ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రసాదించుగాక. ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.

వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44277

ధర్మ అవగాహనం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియోలు & టెక్స్ట్]