రజబ్ నెల 27వ తేది మేరాజున్ నబీ పవిత్రమైన సంఘటన జరిగిందని ఆ పండుగను జరుపుకునే వారి అభిప్రాయం. అందువలన వారు ప్రతి ఏటా మేరాజున్ నబీ రాత్రి ఒక పండుగ కొరకు ముస్తాబవుతారు. అలాగే తమ ఇండ్లల్లో ప్రత్యేకమైన వంటకాలు చేసుకుంటారు. మరియు ఫాతిహాలు అర్పిస్తారు. మసీదులను పచ్చటి మరియు ఎర్రటి లైట్లతో అలంకరిస్తారు, మసీదులలో ప్రత్యేకమైన నఫిల్ నమాజులు చదువుతారు. మరియు ఆ రాత్రంతా మేరాజున్ నబీ జరిగిన సంఘటను గురించి మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చరిత్ర గురించి ప్రసంగాల సభలు నిర్వహిస్తారు. మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ప్రత్యేకమైన “దరూద్ దుఆ” లను చదువుతారు. ఆ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు.
కొంతమంది ప్రజలు మేరాజున్ నబీ గురించి కొన్ని కల్పిత విషయాలు జొప్పించుకొని ప్రసంగాలు చేస్తారు, అంతే కాక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) గారి పట్ల ధర్మ హద్దులు మీరి అతిగా పొగుడ్తారు. ఉదాహరణకు:
1- ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కొరకు అల్లాహ్ తన తేజస్సు తెరను తొలిగించాడు. కనుక అల్లాహ్‌ను అసలైన రూపంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కళ్ళారా దర్శించే భాగ్యాన్ని పొందినట్లు అంటారు.
2- ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మేరాజ్ రాత్రి అల్లాహ్ వద్దకు చేరుకునేందుకు తమ కాళ్ళ నుండి చెప్పులను తీయబోతే, అల్లాహ్ ఆయన్ని చెప్పులతో సహా ఆహ్వానించారు అని కథలు చెప్పుకుంటారు.
౩- మేరాజ్ రాత్రి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ను స్వయంగా సందర్శించారు మరియు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మధ్య ఆలింగనము చేసుకునే వ్యత్యాసం మాత్రమే మిగిలిందని అంటారు.
4- అల్లాహ్ తన తేజస్సు తెరను తొలిగించినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు అల్లాహ్‌ను చూస్తే అల్లాహ్ కూడా ప్రవక్త రూపంలోనే ఉన్నారని అంటారు.
హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి ఆయిషా (రజియల్లాహు అన్హ) గారు ఇలా తెలియజేసారు: “ఎవరైతే అల్లాహ్‌ను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు కళ్ళారా చూసారని అంటారో వారు అల్లాహ్ పై అబద్దాన్ని అంటగట్టినట్టే”…. (బుఖారి: 259)
ఇలా అనేకమైన షిర్క్ కు చెందిన విషయాలను మేరాజ్ రాత్రిన అమాయక ప్రజల ముందు ప్రసంగిస్తారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని అల్లాహ్ స్థాయికి పెంచి అల్లాహ్ అంటే ప్రవక్త, ప్రవక్త అంటే అల్లాహ్ అని విశ్వసిస్తారు. ఇలా విశ్వసించటం క్రైస్తవుల విశ్వాసంకంటే హీనమైన విశ్వాసంగా తెలుస్తుంది. ఎందుకంటే? క్రైస్తవులు యేసు (అలైహిస్సలాం) వారిని అల్లాహ్ కుమారునిగా విశ్వసిస్తారు. కాని మన ముస్లిం ప్రజలలో కొంత మంది ప్రజలు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను పూర్తిగా అల్లాహ్ స్థాయికి పెంచి అనేక కవితాగానాలు రచించారు. మరియు ఆ రాత్రంతా వాటిని పాడుతుంటారు.
అందుకనే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “మీరు నన్ను పొగడటంలో హద్దులు మీరకండి, ఎలాగైతే క్రైస్తవులు మర్యమ్ కుమారుడగు ఈసా(అలైహిస్సలాం) గారి పట్ల హద్దుమీరి పొగడ్తల్లో ముంచారో! నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుడను మాత్రమే. కనుక మీరు నన్ను అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని మాత్రమే అనండి.” (బుఖారి: ౩189)
13- పవిత్రమైన మేరాజ్ సంఘటన వాస్తవం
మేరాజున్ నబీ యాత్ర ఎప్పుడు జరిగిందని అడిగితే? దానికి సూటిగా ఒక జవాబుగా హిజ్రత్ కు ఒక ఏడాది ముందు జరిగిందని చెప్పవచ్చు.
కాని ఏ నెలలో? ఏ తేదిలో అని చెప్పడానికి స్పష్టమైన ఆధారం ఇస్లామీయ చరిత్రలో భధ్రపరచబడలేదు. కనుక ప్రవక్త గారి చరిత్రను రచించినవారిలో కూడా మేరాజ్ సంఘటన గురించి అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. వాటిలో కొన్నిటిని మీ ముందు ఉంచుతున్నాము:
1- దైవదౌత్యం ప్రసాదించబడిన సంవత్సరమే ఈ మేరాజ్ సంభవించిందని ఇమామ్ తబ్రీ కథనం.
2- దైవదౌత్యం అయిదు సంవత్సరాల తరువాత జరిగిందని ఇమామ్ నూవీ, ఇమామే ఖుర్తిబీ కథనం.
౩- దైవదౌత్యం పదవ సంవత్సరం రజబ్ నెల 27వ తేదిన సంభవించిందని, సులైమాన్ మన్సూర్‌పూరి కథనం.
4- హిజ్రత్ పదహారు మసాల ముందు రమజాన్ నెలలో సంభవించిందని, లేక హిజ్రత్ పదునాలుగు మాసాల ముందు ముహర్రం నెలలో సంభవించిందని, లేక హిజ్రత్ కు ఒక సంవత్సరం ముందు రబీఉల్ అవ్వల్ మాసంలో సంభవించిందని రచయితలు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఏదైనప్పటికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి హజ్రత్ ఖదీజా (రజియల్లాహు అన్హ) గారి తదనంతరం మేరాజ్ సంఘటన జరిగినట్లు స్పష్టమవుతుంది. మరియు హజ్రత్ ఖదీజా (రజియల్లాహు అన్హ) గారు దైవదౌత్య శకం పదవ సంవత్సరం రమజాన్ నెలలో మరణించినట్లు తెలుస్తుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హిజ్రత్ కంటే ఒక యేడాది ముందు మేరాజ్ సంఘటన సంభవించినదిగా భావించాలి. (వివరాలకు అర్రహిఖుల్ మఖ్తూమ్ – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర తెలుగు, 224-225 చూడండి).
మేరాజున్ నబీ సంఘటన ఏ నెలలో మరియు ఏ తేదిన జరిగిందో అన్న విషయం మన మహానీయులైన ధర్మ గురువులకే స్పష్టమైన జ్ఞానం లేదంటే మనం రజబ్ నెల 27వ తేదిన మేరాజున్ నబీ పండుగ జరుపుకోవడం ఎంతవరకు ధర్మం. అలాగే మేరాజ్ రాత్రి ఆరాధనలు మరియు పగలు ఉపవాసం గనక ఇస్లామీయ సాంప్రదాయం అనుకుంటే, ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అల్లిహి వసల్లం) మేరాజ్ తరువాత పన్నెండు సంవత్సరాల వరకు సహాబాల మధ్య బతికున్నారు, అయినా ఆయన మేరాజ్ జరిగిన పవిత్రమైన రోజు ఇలాంటి ఆరాధనలు ఎందుకు పాటించలేదు? తరువాత సహాబాలు మేరాజ్ రోజున పండుగగా ఎందుకు నిర్వహించలేదు. ఒకవేళ వారు ప్రతి సంవత్సరం మేరాజ్ రాత్రిని ఆరాధనల కొరకు మరియు పగలు ఉపవాసం కొరకు ప్రత్యేకం చేసుకొని పర్వదినంగా నిర్వహించి ఉంటే, మేరాజ్ జరిగిన మాసము మరియు తేది కూడా స్పష్టంగా తెలిసి ఉండేది కదా! మరియు ఆ రోజున చేసే కార్యాలకు, ఆరాధనలకు ప్రవక్త ఆమోదం కూడా లభించి ఉండేది కదా!.
నా ప్రియమైన ముస్లిం సోదరులారా! మనం పుణ్యాలు చేయుట కొరకు ఆశక్తి చూపాలి, కాని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గదర్శకం ప్రకారమే మనం ఆరాధనలు చెయ్యాలి. అప్పుడే అవి అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యానికి నోచుకుంటాయి. మేరాజున్ నబీ అన్నది ఇస్లామీయ ధర్మానికి చెందిన ఒక విశ్వాసనీయ సంఘటన, మరియు ఎంతో అద్భుతమైన సంఘటన, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు చాలా కష్టాలకు, దుఃఖాలకు నష్టాలకు గురికాబడ్డారు. అంతలో హజ్రత్ ఖదీజా(రజియల్లాహు అన్హా) కూడా మృతి చెందారు. చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ సంవత్సరానికి ఆముల్ హుజ్న్ (శోక సంవత్సరం) గా భావించారు. అప్పుడు అల్లాహ్ ఆయన శోకాన్ని, మరియు దుఃఖాన్ని దూరం చేయుట కొరకు ఈ మహోన్నతమైన మేరాజ్ గగన యాత్రను ఏర్పాటు చేసినట్లు ధర్మగురువులు భావిస్తారు.
అక్కడ ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) గారు అనేక మంది ప్రవక్తలను కలిసి మాట్లాడారు. స్వర్గం, నరకం మరియు అనేక అద్భుత విషయాలను చూసారు. తరువాత ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు వారి ఉమ్మత్ కొరకు అల్లాహ్ ఒక మహోన్నత బహుమానంగా, ఐదు సమయాల నమాజులను విధిగా ప్రసాదించాడు. మరియు “సూరతుల్ బఖరా” చివరి ఆయతులను కూడా ప్రసాదించాడు.
మనం మేరాజున్‌నబి గురించి పవిత్రమైన సంఘటనగా విశ్వసించాలి, ఆ సంఘటన గురించి ఉన్న వాస్తవాలను యదాతధంగా నమ్మాలి. మరియు ప్రతి రోజు ఐదు సమయాల నమాజును విధిగా పాటించాలి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వర్గం, నరకం గురించి తెలియజేసిన విషయాలను నిత్యం గుర్తుంచుకొని భయభక్తితో జీవితాన్ని గడపాలి.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 83-87). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని ఒక కీలకమైన ఘట్టం, ఇస్రా మరియు మేరాజ్ (రాత్రి ప్రయాణం మరియు ఆరోహణ) గురించి వివరించబడింది. ప్రవక్త పదవి పొందిన తర్వాత మక్కాలో పది సంవత్సరాల పాటు ఆయన ఎదుర్కొన్న తీవ్రమైన శారీరక, మానసిక, మరియు సామాజిక కష్టాల గురించి ప్రస్తావించబడింది. ముఖ్యంగా తాయిఫ్‌లో ఆయనపై జరిగిన దాడి, ఆ తర్వాత ఆయన ప్రియమైన భార్య హజ్రత్ ఖదీజా మరియు పినతండ్రి అబూ తాలిబ్ మరణంతో కలిగిన దుఃఖం గురించి చెప్పబడింది. ఈ కష్టాల సమయంలో అల్లాహ్ తన ప్రవక్తకు ఓదార్పుగా ప్రసాదించిన అద్భుత ప్రయాణమే ఇస్రా మరియు మేరాజ్. ఈ ప్రయాణంలో జరిగిన సంఘటనలు, ఏడు ఆకాశాలలో ప్రవక్తలను కలవడం, స్వర్గ నరకాలను దర్శించడం, మరియు ముఖ్యంగా ముస్లిం సమాజానికి బహుమానంగా లభించిన ఐదు పూటల నమాజు, సూరహ్ బఖరా చివరి రెండు ఆయతులు, మరియు షిర్క్ చేయని వారి పాపాలు క్షమించబడతాయన్న శుభవార్త గురించి వివరించబడింది. ఈ ప్రయాణం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ, దానిని స్మరించుకునే పేరుతో బిద్అత్ (నూతన ఆచారాలు) చేయకుండా, ప్రవక్త తెచ్చిన అసలైన బోధనలను, ముఖ్యంగా నమాజును మరియు తౌహీద్‌ను ఆచరించాలని నొక్కి చెప్పబడింది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
మహాశయులారా! ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసు నిండిన తర్వాత ప్రవక్త పదవిని పొందారు. ఆ తర్వాత ఇంచుమించు పది సంవత్సరాల వరకు ప్రజలను అల్లాహ్ వైపునకు పిలుస్తూ కేవలం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్‌ను మాత్రమే మనం ఆరాధించాలి అని బోధిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులను, ఎన్నో రకాల కష్టాలను కూడా భరించారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మనం ఊహించలేని, మనం పరస్పరం చెప్పుకోలేనటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక అన్ని రకాల కష్టాలు వచ్చాయి. కానీ అల్లాహ్ కొరకు ఎంతో సహనం వహించారు.
పది సంవత్సరాలు గడిచిన తర్వాత మక్కా నగరం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అయితే మక్కా నగరానికి ఇంచుమించు ఒక 80, 90 కిలోమీటర్ల దూరంలో తాయిఫ్ ఒక పెద్ద నగరము. అక్కడ నివసించే వారికి ఇస్లాం బోధన చేద్దామని వెళ్లారు. కానీ అక్కడి నుండి కూడా వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి కేవలం అల్లాహ్‌ను ఆరాధించే వారు అయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంతోషం కలిగేకి బదులుగా వారు కేవలం నిరాకరించలేదు, పైగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ఎంతగా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరం నుండి రక్తం వెళ్లి పాదాల్లో ఏ బూట్లయితే వేసుకున్నారో, చెప్పులయితే వేసుకున్నారో అందులో రక్తం ఆగిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సొమ్మసిల్లిపోయారు, స్పృహ తప్పిపోయారు.
మక్కా నగరం తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు, 25 సంవత్సరాల వరకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ, అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తూ, ఆమెకు ఒక ఉత్తమమైన భార్యగా నిలిచిన వారు హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా కూడా చనిపోయారు. గమనించండి, కేవలం సామాన్య మనలాంటి మనుషులకే మన భార్య చనిపోయింది అంటే మనకు ఏడుపొస్తుంది. కానీ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా ఒక సామాన్య భార్య కాదు, ఒక సామాన్య స్త్రీ కాదు. ఆ చరిత్రలోకి వెళితే చాలా సమయం మనకు ఇది అయిపోతుంది. హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా వారు చనిపోయాక కొద్ది రోజులకు వెన్నెముక లాంటి సహాయం అందించిన పినతండ్రి హజ్రత్ అబూ తాలిబ్ కూడా చనిపోతారు. ఆయన కేవలం చనిపోవడమే కాదు, ఇస్లాం ధర్మం స్వీకరించకుండా తాత ముత్తాతల ఆచారం మీద నేను చనిపోతున్నాను అని అనడం ప్రవక్త గారికి చెప్పలేనంత బాధ కలిగింది.
ఇన్ని బాధలను, ఇన్ని కష్టాలను, ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఒక శుభ ఘడియ వచ్చింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అదేమిటి? రాత్రిలోని కొన్ని క్షణాల్లోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చారు, బురాఖ్ అన్న ఒక జంతువు తీసుకొచ్చారు. ఆ జంతువు గురించి సహీహ్ హదీథ్ లో వచ్చిన ప్రస్తావన ఏమిటి? అది హైట్ లో గాడిద కంటే పెద్దగా మరియు కంచర గాడిద కంటే చిన్నగా మరియు దాని వేగం ఎక్కడివరకైతే దాని దృష్టి పడుతుందో అక్కడి వరకు అది ఒక గంతు వేస్తుంది. అంతటి వేగం గల ఒక జంతువును తీసుకుని వచ్చారు.
కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ రోజుల్లో మనం ఎన్నో క్యాలెండర్లలో, ఎన్నో ఫోటోలలో బురాఖున్ నబీ, ప్రవక్త వారికి గగన ప్రయాణం, మేరాజ్ ఏ వాహనంపై అయితే జరిగిందో దాని పేరు బురాఖ్ అని దానికి ఒక స్త్రీ ముఖం లాంటిది, ఇంకా వెనక ఒక తోక వేరే రకం లాంటిది, దాని కాళ్లు మరో జంతువు రకం లాంటివి, ఇలాంటి ఫోటోలు చూస్తాము. ఇవన్నీ కూడా అబద్ధము, అసత్యము, బూటకం. ఎందుకంటే ఆ జంతువు యొక్క చిన్నపాటి వర్ణన వచ్చింది కానీ అది, దాని ముఖం, దాని యొక్క ఇమేజ్, దాని యొక్క ఫోటో ఆ కాలంలో ఎవరూ తీయలేదు, దాని గురించి ఎలాంటి ప్రస్తావన హదీథుల్లో రాలేదు. ఇది మన యొక్క ధర్మంపై ఒక మహా అపనింద మనం వేసిన వాళ్ళం అవుతాము ఇలాంటి ఫోటోలను మనం ప్రచారం చేసి ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి బైతుల్ మఖ్దిస్, బైతుల్ మఖ్దిస్ నుండి ఏడు ఆకాశాల పైకి వెళ్లినటువంటి బురాఖ్ అని చెప్పడం ఇది చాలా తప్పు విషయం.
అయితే సహీహ్ హదీథుల్లో వచ్చిన విషయం ఏంటి? ఆ జంతువు, దాని యొక్క వేగం మనం చెప్పలేము. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎక్కించుకొని మక్కా నుండి బైతుల్ మఖ్దిస్, ఫలస్తీన్ కి వెళ్లారు. ఆ ప్రస్తావన సూరహ్ బనీ ఇస్రాయీల్ లోని మొదటి ఆయతులోనే ఉంది.
“ఆయన పరమ పవిత్రుడు. తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిద్-ఎ-హరామ్ నుండి మస్జిద్-ఎ-అఖ్సా వరకు తీసుకువెళ్లాడు. దాని పరిసరాలను మేము శుభప్రదంగా చేశాము. ఇది మేము మా సూచనలను అతనికి చూపించటానికి చేశాము.” (17:1)
ఆ ప్రభువు, అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు. అన్ని రకాల లోపాలకు, దోషాలకు అతీతుడు. ఆయనే రాత్రివేళ తన దాసునిని మస్జిద్-ఎ-హరామ్ నుండి బైతుల్ మఖ్దిస్, మస్జిద్-ఎ-అఖ్సా ఫలస్తీన్ వరకు తీసుకువెళ్లాడు. ఆ మస్జిద్-ఎ-అఖ్సా దాని చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా మేము దానిని శుభకరమైనదిగా చేశాము. ఎందుకు తీసుకువెళ్ళాము? మా యొక్క సూచనలు, మా యొక్క మహిమలు ఆయనకు చూపించాలని. అయితే దీనిని ఇస్రా అని అంటారు. ఇస్రా అంటే ఏంటి? మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు రాత్రివేళ ఏదైతే ప్రయాణం జరిగిందో దానిని ఇస్రా అని అంటారు. మరియు బైతుల్ మఖ్దిస్ నుండి ఏడు ఆకాశాల వైపునకు ఏ ప్రయాణం అయితే జరిగిందో దానిని మేరాజ్ అని అంటారు. దాని ప్రస్తావన ఖుర్ఆన్ లో సూరహ్ నజ్మ్ లో వచ్చి ఉంది.
అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇస్రా, మేరాజ్ ఈ ప్రయాణం ఏదైతే చేశారో ఇది వాస్తవం. ఖుర్ఆన్ లో దాని ప్రస్తావన ఉంది, సహీహ్ హదీథుల్లో దాని వివరాలు వచ్చి ఉన్నాయి. కానీ ఆ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏమేమి జరిగినది? ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడెక్కడ ఏమేమి దర్శించారు? ఏ ఏ అద్భుత విషయాలు మనకు తెలియజేశారు? మన విశ్వాసానికి, ఆచరణకు సంబంధించిన బోధనలు అందులో ఏమున్నాయి? అవి మనం తెలుసుకోవాలి ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథుల ద్వారా మరియు వాటి ప్రకారంగా మనం ఆచరించాలి, వాటి ప్రకారంగా మన విశ్వాసం సరిచేసుకోవాలి.
అలా కాకుండా, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? జషన్, షబ్-ఎ-మేరాజ్, మేరాజున్ నబీ యొక్క ఉత్సవాలు అని జరుపుకుంటున్నారు. ఒక వ్యక్తి వాట్సాప్ లో ఒక సందర్భంలో ఏం రాశాడు? చేసుకునే వాళ్ళు చేసుకుంటారయ్యా, మీకేం నొస్తుంది? మీకేం బాధ కలుగుతుంది? అని బూతులు కూడా వదిలారు కొందరు. కానీ ఇక్కడ వారి మదిలో, వారి ఆలోచనలో ఏముందంటే, మేము ఏం చేసినా గానీ ప్రవక్త ప్రేమలో చేస్తున్నాము కదా, మేం ఏం చేసినా గానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ గగన ప్రయాణం, మేరాజ్ అయితే ఒక గొప్ప బహుమానంగా ఇవ్వబడినదో దానిని గుర్తు చేసుకుంటున్నాము కదా, ఇందులో తప్పేమిటి? ఇలాంటి కొన్ని మంచి ఆలోచనలు వారివి ఉంటాయి కావచ్చు. కానీ ఇక్కడ గమనించాలి. ఏంటి గమనించాలి? ఒకవేళ ఇలా చేయడం ధర్మం అయితే ఈ ధర్మాన్ని అల్లాహ్ మనకు నేర్పలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు చేయలేదు, ఇమాములు చేయలేదు. అలాంటి కార్యం మనం చేస్తున్నాము అంటే మన ఆలోచన, మన ఉద్దేశం ఎంత ఉత్తమంగా, మంచిగా ఉన్నప్పటికీ అందులో మనకు పుణ్యం లభించదు, దాని వల్ల మనం బిద్అత్ లో పడిపోతాము, అది మహా ఘోరమైన పాపం అయిపోతుంది.
అందు గురించి మహాశయులారా! అలాంటి బిద్అత్ లకు, దురాచారాలకు మనం గురి కాకుండా ఈరోజు మీరు కొన్ని విషయాలు వింటారు ఇన్షా అల్లాహ్. ఏమిటి ఆ విషయాలు? ఈ గగన ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ ఏ బహుమానాలు బహూకరించబడ్డాయి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దృశ్యాలను చూశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రయాణం ఎలా జరిగింది? దానికి సంబంధించిన వివరాలు ఏమిటి?
అయితే పూర్తి వివరంగా చెప్పుకుంటూ పోతే గంటల తరబడి ప్రసంగం జరుగుతుంది. కానీ అలా కాకుండా టూ ద పాయింట్ హదీథుల ఆధారంగా నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దానిని మీరు శ్రద్ధగా ఆలకిస్తారు అని ఆశిస్తున్నాను.
ఇస్రా మరియు మేరాజ్ ప్రయాణం
మొదటి విషయం ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల జరిగినటువంటి గొప్ప మహిమ, ఒక అద్భుతం ఏమిటంటే ఈ ప్రయాణానికి బయలుదేరే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చెస్ట్ ఆపరేషన్ అని అనండి మీరు, హార్ట్ ఆపరేషన్ అని అనండి, ఓపెన్ హార్ట్ సర్జరీ అని మీరు చెప్పుకోండి, చెప్పుకోవచ్చు. అది జరిగింది. వాస్తవం. హజ్రత్ అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్తున్నారు, నేను స్వయంగా చూశాను ఆ కుట్లను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఛాతి చీల్చబడి, అందులో నుండి గుండెను బయటికి తీసి, జమ్ జమ్ నీళ్లతో దానిని కడిగి, అందులో ఈమాన్, విశ్వాసం, హిక్మత్, వివేకాలతో నింపబడినది. సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 3887 లో దీని ప్రస్తావన ఉంది.
ఇక ఏ వాహనం పైన అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేశారో నేను ఇంతకు ముందు తెలిపినట్లు గాడిద కంటే పెద్దది మరియు కంచర గాడిద కంటే చిన్నది, దాని పేరు ఏమిటి? బురాఖ్. దీని ప్రస్తావన సహీహ్ బుఖారీలోని ఈ హదీథ్ లోనే వచ్చి ఉంది. ఇంతకు ముందు నేను చెప్పిన నంబర్ 3887.
మరియు ఈ ప్రయాణం మస్జిద్-ఎ-హరామ్ మక్కా నుండి మొదలుకొని ఫలస్తీన్, ఫలస్తీన్ నుండి ఏడు ఆకాశాలు, ఏడు ఆకాశాల పైన అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో సంభాషించడం మరియు స్వర్గాన్ని చూడడం, నరకాన్ని చూడడం మధ్యలో ఇంకా ఎన్నో విషయాలు జరిగాయి. ఇవన్నీ కూడా ఎన్నో రోజులు, ఎన్నో గంటలు పట్టలేదు. لَيْلًا (లైలన్) రాత్రిలోని కొంత భాగం మాత్రమే. అది ఎలా? అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ సర్వశక్తిమంతుడు. అవునా లేదా? విశ్వాసం ఉందా లేదా? ఈ రోజు ఆ అల్లాహ్ ఇచ్చినటువంటి మేధ, బుద్ధి, జ్ఞానం, సైన్స్, విద్యతో రాకెట్లు తయారు చేస్తున్నారు. సామాన్యంగా ఇంతకు ముందు ఎవరైనా ఇక్కడి నుండి మక్కా నేను ఒక రోజులో పోయి వస్తాను అంటే ఎవరైనా నమ్ముతారా? ఇంచుమించు 1000 కిలోమీటర్లు. కానీ ఈ రోజుల్లో సాధ్యమా లేదా? నాలుగు సార్లు పోయి రావచ్చు కదా మక్కా. అదే రాకెట్ యొక్క వేగం ఎంత ఉన్నది? అయితే నేను ఈ విషయాలు మళ్ళీ విడమరిచి చెప్పడానికి వెళ్తే సమయం ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. మన విశ్వాసులం, ఖుర్ఆన్ లో వచ్చిన విషయం, సహీహ్ హదీథ్ లో వచ్చిన విషయాన్ని మనం తూచా తప్పకుండా నమ్మాలి, ఎలాంటి అనుమానాలకు, సందేహాలకు గురి కాకూడదు.
అయితే మస్జిద్-ఎ-అఖ్సా లో చేరిన తర్వాత అక్కడ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదమ్ అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంత మంది ప్రవక్తలు వచ్చారో వారందరినీ జమా చేశాడు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారందరికీ రెండు రకాతుల నమాజ్ చేయించారు. ఇమామత్, నమాజ్ చేయించే అటువంటి నాయకత్వం ఈ గొప్పతనం ఎవరికి లభించింది? ఎవరికీ? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అంటే ఇమాముల్ అంబియా అని అంటాము కదా మనం సామాన్యంగా ఉర్దూలో. ఇది వాస్తవ రూపంలో అక్కడ జరిగింది.
ఏడు ఆకాశాలలో ప్రయాణం మరియు సిద్రతుల్ ముంతహా
ఇంకా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రయాణంలో మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం, ఏడు ఆకాశాలలో పైకి వెళ్లారైతే, మొదటి ఆకాశంలో హజ్రత్ ఆదమ్ అలైహిస్సలాం తో కలిశారు. రెండవ ఆకాశంలో ఈసా మరియు యహ్యా అలైహిముస్సలాం తో కలిశారు. మూడవ ఆకాశంలో యూసుఫ్ అలైహిస్సలాం తో కలిశారు. నాలుగవ ఆకాశంలో హజ్రత్ ఇద్రీస్ అలైహిస్సలాం తో కలిశారు. ఐదవ ఆకాశంలో హారూన్ అలైహిస్సలాం తో కలిశారు. మరియు ఆరవ ఆకాశంలో హజ్రత్ మూసా అలైహిస్సలాం తో కలిశారు. ఏడవ ఆకాశంలో హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తో కలిశారు.
ఈ విధంగా ఏడు ఆకాశాలకు పైన ఒక రేగు చెట్టు ఉంది. దానిని సిద్రతుల్ ముంతహా అని అంటారు. ఆ చెట్టు, రేగు పండు ఒక్కొక్క పండు పెద్ద పెద్ద కడవలు చూసి ఉంటారు. పల్లెటూర్లలో పాతకాలంలో గోధుమాలో లేదా వడ్లు వేయడానికి పెద్ద పెద్ద గుమ్మీలు వాడేవారు. ఒక్కొక్క దాంట్లో 300 కిలో, 500 కిలోలు కూడా అంత స్థలం ఉంటుంది. ఆ విధంగా పెద్ద పెద్ద ఒక్కొక్క పండు అంత పెద్దగా ఉంటుంది. మరియు దాని యొక్క ఆకులు ఏనుగుల చెవుల మాదిరిగా అంత పెద్దగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. హదీథ్ లో వచ్చిన విషయం ఏంటంటే, హిజ్ర్ అని ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంత వాసులు ఎలాంటి మట్టి నీళ్లు వేయడానికి బిందెలు లాంటివి, నీళ్లు పోసుకోవడానికి కడవల లాంటివి ఏదైతే ఉపయోగిస్తారో దానికి సమానమైన పండ్లు ఆ రేగు పండు ఒక్కొక్కటి మరియు దాని యొక్క ఆకు ఏనుగు చెవుల మాదిరిగా ఉంటాయి.
ఇంకా ఆ రేగు చెట్టు యొక్క వ్రేళ్లు ఆరవ ఆకాశంలో ఉన్నాయి మరియు దాని యొక్క కొమ్మలు ఏడు ఆకాశాలకు పైగా ఉన్నాయి. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎన్నో విషయాలు చూపించడం జరిగింది, ఎన్నో విషయాలు అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జరిగాయి. ఉదాహరణకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడే అల్లాహ్ యొక్క చాలా దగ్గరగా ఉండే అల్లాహ్ ఆదేశాలను రాస్తూ ఉండే దైవదూతల కలముల శబ్దం విన్నారు, సిద్రతుల్ ముంతహాలో.
జన్నతుల్ మఅవా అన్నది దానికి సమీపంలోనే ఉన్నది. అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మూడు విషయాలు బహుమానంగా ఇవ్వబడ్డాయి. ఎలా? మీకు ఏదైనా బహుమానం దొరికింది, ఏదైనా పెద్ద గిఫ్ట్ దొరికింది, ఒక షీల్డ్, క్రికెట్ లో మీరు కప్ గెలిచారు. దానిని తీసుకొచ్చి పారేస్తారా? ఏం చేస్తారు? కాపాడుతారు. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అక్కడ లభించిన విషయాలు ఏమిటి? ఐదు పూటల నమాజులు, ఇక దాని వివరణలో వెళ్తాలేను, ముందు 50 ఉండే ఆ తర్వాత ఇలా తగ్గింది అనేది. రెండవ బహుమానం, సూరహ్ బఖరా లోని చివరి రెండు ఆయతులు, ఆమన రసూల్ బిమా ఉన్జిలా అక్కడ నుండి మొదలుకొని. మరియు మూడవ బహుమానం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాజంలో, వారిని అనుసరించే వారిలో ఎవరైతే షిర్క్ నుండి దూరం ఉంటారో అల్లాహ్ త’ఆలా వారి యొక్క ఘోరమైన పాపాలను కూడా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్. ఈ మూడు పెద్ద బహుమానాలు.
సహీహ్ ముస్లిం షరీఫ్, హదీథ్ నంబర్ 173 లో వీటి ప్రస్తావన వచ్చి ఉంది. సిద్రతుల్ ముంతహా మరియు అక్కడ ఆ తర్వాత నుండి ఏదైతే విషయాలు చెప్పానో వాటి ప్రస్తావన. ఇక్కడ గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మేరాజ్ ప్రయాణంలో ప్రవక్తకు లభించినటువంటి గొప్ప బహుమానం ఏమిటి? ఏమిటి? చెప్పండి! ఐదు పూటల నమాజు. ఇంకా? సూరహ్ బఖరా లోని చివరి రెండు ఆయతులు. మరియు మూడో విషయం? షిర్క్ చేయని వారి యొక్క ఘోర పాపాలను కూడా అల్లాహ్ త’ఆలా క్షమిస్తాడు అని శుభవార్త.
ఈ రోజుల్లో మేరాజున్ నబీ అన్నటువంటి బిద్అత్ చేసి, ఇంకా అందులో ఎన్నో రకాల షిర్క్ పనులు చేసి, రజబ్ మాసంలో రజబ్ కే కూండే అన్న పేరు మీద ఎన్నో షిర్క్ పనులు చేసుకుంటూ మనం ప్రవక్త విధానానికి ఎంత వ్యతిరేకం చేస్తున్నాము. ఎంతో మంది ఎవరైతే జషన్-ఎ-మేరాజ్-ఉన్-నబీ అని ఈ మేరాజ్-ఉన్-నబీ పేరు మీద రాత్రి జాగారం చేస్తారో, సంవత్సరంలో ఎన్ని నమాజులు వారు చేస్తున్నారు? ఆ రోజు వచ్చి ఎన్నో నఫిల్‌లు చేస్తారు కావచ్చు కానీ, మహాశయులారా! గమనించండి. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప బహుమానంగా ఏ విషయాలు అయితే ఈ ప్రయాణంలో పొందారో వాటిని మనం గౌరవించాలి, వాటిని మనం పాటించాలి, వాటిని ఎప్పుడూ కూడా తూచా తప్పకుండా, అందులో ఎలాంటి అశ్రద్ధ చేయకుండా వాటిని మనం పాటించాలి.
ఇంకా మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని రెండవ సారిగా అతని యొక్క అసలైన రూపంలో చూశారు.
అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మత్తుపానీయం మరియు పాలు మరియు తేనె మూడు విషయాలు ఇవ్వబడ్డాయి. ప్రవక్తా ఇదిగో తీసుకోండి, మీరు సేవించండి అన్నట్లుగా ఏ విషయాలు ఇవ్వబడ్డాయి? అల్లాహు అక్బర్! మత్తుపానీయం, మరియు పాలు, మరియు తేనె. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తీసుకున్నారు? పాలు తీసుకున్నారు. సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 3887 లో ఈ ప్రస్తావన ఉంది.
మరియు ఏడవ ఆకాశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బైతుల్ మఅమూర్ అని చూశారు. బైతుల్ మఅమూర్ ఏంటి? ఇహలోకంలో మన కొరకు బైతుల్లాహ్ ఎలానైతే ఉందో, కాబతుల్లాహ్, అలాగే దానికి స్ట్రెయిట్ గా ఏడు ఆకాశాల పైన బైతుల్ మఅమూర్ ఉంది. దైవదూతలు అక్కడ నమాజ్ చేస్తారు, దాని యొక్క తవాఫ్ చేస్తారు. ఒక్కసారి 70,000 మంది దైవదూతలు అక్కడ తవాఫ్ చేస్తారు, నమాజ్ చేస్తారు. మరియు ఒక్కసారి ఎవరికైతే ఈ అవకాశం దొరికిందో ప్రళయం వరకు మళ్ళీ వారికి ఈ అవకాశం దొరకదు. గమనించండి దైవదూతల సంఖ్య ఎంత గొప్పగా ఉందో. దీని ప్రస్తావన సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నంబర్ 3207.
ఇంకా మహాశయులారా, ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ మూసా అలైహిస్సలాం వారిని కూడా చూశారు. అలాగే నరకం యొక్క కాపరి, మాలిక్ అతని పేరు, అతనిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఈ ప్రయాణంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని కూడా చూశారు, అలాగే నరకాన్ని కూడా దర్శించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గం దర్శించారో అక్కడ చూశారు, వజ్రాలతో తయారు చేయబడినటువంటి అక్కడ గోపురాలు ఉన్నాయి. ఖైమా, ఇక్కడ ఏదైనా వాతావరణం చాలా సునాయాసంగా ఉండి, వేడి కూడా ఎక్కువ లేకుండా, చలి కూడా లేకుండా, మోసమ్-ఎ-రబీ అని ఏదైతే అంటారో మనం చూస్తాము కదా, ఎడారిలో డైరాలు వేసుకొని, ఖైమాలు వేసుకొని అక్కడ కొంత సమయం గానీ లేదా కొద్ది రోజులు గానీ గడుపుతారు. చూశారా కదా? అయితే అలాంటి ఖైమాలో వారికి ఎంత ఆనందం ఏర్పడుతుంది, అన్ని రకాల సౌకర్యాలు బహుశా అందులో ఉంటాయి కావచ్చు కానీ అస్తగ్ ఫిరుల్లాహ్, ఇది పోలిక కాదు స్వర్గంలో లభించే అటువంటి ఖైమాకు. కానీ అక్కడ ఒకే ఒక వజ్రం ఇంత పెద్దగా ఉంటుంది, ఆ ఒకే వజ్రంతో చాలా పెద్ద ఖైమాగా తయారు చేయబడుతుంది. మరియు అక్కడి యొక్క మట్టి కస్తూరి అని చెప్పడం జరిగింది. దీని యొక్క ప్రస్తావన బుఖారీ 349, అలాగే సహీహ్ ముస్లిం 163 లో వచ్చి ఉంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గంలో కౌథర్ అనేటువంటి ఒక పెద్ద వాగు ఏదైతే ప్రసాదించడం జరుగుతుందో దానిని కూడా చూసి వచ్చారు. అలాగే ఫిరౌన్ కూతురికి జడలు వేసే అటువంటి ఒక సేవకురాలు, ఆమె ఇస్లాం స్వీకరించింది, మూసా అలైహిస్సలాం ను విశ్వసించింది. దానికి బదులుగా ఫిరౌన్ ఆ దౌర్జన్యపరుడు, దుర్మార్గుడు ఏం చేశాడు? ఆమెను, ఆమె యొక్క నలుగురి సంతానాన్ని సలసల మసులుతున్న నూనెలో, వేడి నూనెలో వేసేశాడు. అయితే ఆమెకు స్వర్గంలో ఏ గొప్ప అక్కడ గృహం అయితే ప్రసాదించబడిందో, దానిని అక్కడి నుండి వస్తున్నటువంటి సువాసనను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయం సహీహ్ ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది, జిల్ద్ 5, పేజ్ 30.
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని మరొక రూపంలో చూశారు. అల్లాహ్ తో భయపడుతూ ఎంత కంపించిపోయారంటే అతని యొక్క పరిస్థితి ఒక చాలా మాసిపోయిన లేదా పాడైపోయిన తట్టు గుంత ఎలా ఉంటుందో అతనిని చూస్తే అలా ఏర్పడింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఈ హదీథ్ ను సహీహాలో ప్రస్తావించారు, 2289.
ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం సందేశం
ఇంకా మహాశయులారా, హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కూడా ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్తతో కలిసి ఏం చెప్పారు? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు నా వైపు నుండి నీ అనుచర సంఘానికి సలాం తెలుపు. అల్లాహు అక్బర్. సల్లల్లాహు అలైహి వ ఆలా ఆలిహి వసల్లం. అల్లాహ్ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం పై కూడా తన కరుణ, శాంతులు కురియజేయుగాక. గమనించండి. ఒకవేళ నేను, మీరు, మనందరము, ముస్లింలం అని అనుకునే వాళ్ళము, మేరాజ్-ఉన్-నబీ లాంటి బిదత్ పనులు, జషన్-ఎ-మేరాజ్ అని బిదత్ పనులు చేయకుండా నిజమైన ధర్మంపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన ధర్మంపై ఉండి ఉంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సలాం కూడా మనకు కలుగుతుంది. ఆయన ప్రత్యేకంగా సలాం పంపారు. ఇంకా ఏం చెప్పారు? ఓ ముహమ్మద్, నీ అనుచర సంఘానికి తెలుపు, ఈ స్వర్గం దీని యొక్క మట్టి ఇది చాలా మంచిది. ఇక్కడ విత్తనం వేసిన వెంటనే మంచి చెట్లు మరియు దానికి ఫలాలు వెంటనే అవుతూ ఉంటాయి. అట్లాంటి మట్టి ఇది. మరియు ఇక్కడి యొక్క నీరు కూడా చాలా మంచి నీరు. కానీ ఇప్పటివరకు అది ఎలాంటి చెట్టు లేకుండా ఉంది. అక్కడ చెట్టు మనకు కావాలంటే ఏం చేయాలి? నీ అనుచర సంఘానికి తెలుపు, సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అధికంగా చదువుతూ ఉంటే అల్లాహ్ వారి కొరకు స్వర్గంలో మంచి చెట్లు నాటుతాడు, పరలోకంలో స్వర్గంలో చేరిన తర్వాత వారికి ఆ చెట్లు ప్రసాదించబడతాయి. అల్లాహు అక్బర్. ఏమైనా కష్టమా ఆలోచించండి? సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవడం.
అలాగే మహాశయులారా, మరొక హదీథ్ లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చెప్పారు, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అధికంగా చదువుతూ ఉండమని చెప్పండి. ఈ హదీథ్ లు తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉన్నాయి. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహ్ అని చెప్పారు.
నరకంలోని దృశ్యాలు మరియు హజ్రత్ అబూ బకర్ (ర.అ) విశ్వాసం
అలాగే నరకంని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దర్శించారు. నరకంలో ఏం చూశారు? నరకంలో ఒక చాలా భయంకరమైన దృశ్యం చూశారు. కొందరి యొక్క గోర్లు వారి యొక్క ఆ గోర్లు ఎలాంటివి? ఇత్తడివి. చాలా పొడుగ్గా ఉన్నాయి. వాటితో వారు తమ ముఖాలను, తమ శరీరాన్ని గీకుతున్నారు. తోలు బయటికి వచ్చేస్తుంది. వారి గురించి జిబ్రీల్ ను అడిగారు, ఈ పరిస్థితి వీరికి ఎందుకు జరుగుతుంది? అప్పుడు జిబ్రీల్ వీరికి తెలిపారు, వీరు ఎవరు తెలుసా? ప్రజల మానంలో, వారి యొక్క పరువులో చేయి వేసుకొని వారిని అవమానపరిచేవారు. అంటే పరోక్ష నిందలు, చాడీలు, గీబత్, చుగ్లీ, ఇంకా వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని వారిని నిందించడం, వారి యొక్క మానం, పరువులో జోక్యం చేసుకోవడం, ఇలా చేసుకునే వారికి ఈ శిక్ష జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సునన్ అబూ దావూద్ లో హదీథ్ వచ్చి ఉంది, 4878 హదీథ్ నంబర్.
ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రయాణంలో ఇంకా ఎన్నో రకాల దృశ్యాలు చూశారు కానీ మనకు సమయం అనేది సరిపోదు గనుక ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. అదేమిటి? షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు, హదీథ్ నంబర్ 306.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గగన ప్రయాణం, ఈ మేరాజ్ ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి విషయాలు ప్రజలకు తెలుపుతున్నారు. ఎవరైతే సత్య విశ్వాసులో వారు తూచా తప్పకుండా నమ్మారు. కానీ అవిశ్వాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హేళన చేశారు. ఏమని? మేము మక్కా నుండి ఫలస్తీన్ కు ఒక నెల రోజులు పడుతుంది మాకు పోవాలంటే. నీవు కేవలం ఫలస్తీన్ వరకే కాదు, ఏడు ఆకాశాల పైకి రాత్రిలోని కొన్ని క్షణాల్లో, కొంత సమయంలోనే వెళ్లి వచ్చావు అంటున్నావు అని హేళన చేశారు. అంతే కాదు, కొందరు అవిశ్వాసులు అయితే ఒకవేళ నీవు వాస్తవంగా ఫలస్తీన్ వెళ్లి, మస్జిద్-ఎ-అఖ్సా చూసి వచ్చావంటే దాని యొక్క వివరణ మాకు తెలుపు అని ఎన్నో ప్రశ్నలు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ సందర్భంలో ఎప్పుడైతే వారు అడిగారో నాకు దాని వివరణ ఏమీ తెలియదు. కానీ ఆ మస్జిద్-ఎ-అఖ్సా యొక్క దృశ్యం అల్లాహ్ నా ముందుకు తీసుకొచ్చాడు. వారు అడిగిన ప్రతి దానికి, ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పుకొచ్చాను. అల్లాహు అక్బర్.
అక్కడ ఆ సమయంలో అబూ బకర్ రదియల్లాహు త’ఆలా అన్హు లేరు. ఎక్కడో దూరంగా ఏదో పని మీద ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయాలు విన్న ఒక వ్యక్తి, “ఈరోజు అబూ బకర్, “ఎల్లవేళల్లో అబూ బకర్ ను చూశాము, ముహమ్మద్ చెప్పింది నిజమే, ముహమ్మద్ చెప్పింది నిజమే అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ కు తోడుగా ఉన్నాడు కదా, ఈరోజు అబూ బకర్ కు వెళ్లి నేను తొందరగా ఈ విషయం తెలియజేస్తాను, అబూ బకర్ ఈ విషయాన్ని తిరస్కరిస్తాడు, అబద్ధం అని అంటాడు అన్నటువంటి నమ్మకంతో వెళ్లి, “అబూ బకర్! ఎవరైనా ఒక రాత్రిలో మక్కా నుండి ఫలస్తీన్ వెళ్లి వచ్చాడు అంటే నువ్వు నమ్ముతావా?” అంటే, “లేదు.” సంతోషం కలిగింది అతనికి. వెంటనే అన్నాడు, “మరి మీ స్నేహితుడు, మీ యొక్క గురువు ముహమ్మద్ అంటున్నాడు కదా?” సల్లల్లాహు అలైహి వసల్లం. అబూ బకర్ వెంటనే చెప్పారు, “నిజమా? ముహమ్మద్ ఈ మాట చెప్పారా?” సల్లల్లాహు అలైహి వసల్లం. అతను అన్నాడు, “అవును, ముహమ్మద్ ఈ మాట చెప్పాడు. అంతే కాదు, రాత్రిలోని కొంత భాగంలో ఫలస్తీన్ వరకే కాదు, మస్జిద్-ఎ-అఖ్సా కాదు, అక్కడి నుండి ఏడు ఆకాశాల పైకి కూడా వెళ్లారట.” వెంటనే అబూ బకర్ చెప్పారు, “ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట చెప్పి ఉంటే నూటికి నూరు పాళ్లు నిజం, ఇది సత్యం, ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు.” అతడే, ప్రశ్న అడిగినవాడు, అబూ బకర్ గురించి ఏదో తప్పుగా ఆలోచించి వచ్చినవాడు చాలా ఆశ్చర్యపోతాడు. “ఎలా నీవు ఇది నిజం నమ్ముతున్నావు?” అని అంటే, “నీకు ఇందులో ఏం అనుమానం? ప్రవక్త చెప్తారు నాకు పొద్దున వహీ వస్తుంది, సాయంకాలం వహీ వస్తుంది, అల్లాహ్ నుండి దైవదూత వస్తున్నాడు, నాకు ఈ సందేశం ఇచ్చారు, మేము అన్ని విషయాలను నమ్ముతున్నాము. ఒకవేళ అల్లాహ్ త’ఆలా తలుచుకొని ప్రవక్తని అక్కడి వరకు తీసుకువెళ్లాడంటే ఇందులో మాకు నమ్మని విషయం ఏమిటి?” అప్పుడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సిద్దీఖ్, సత్యవంతుడు అన్నటువంటి బిరుదు లభించినది. సత్యవంతుడు అని బిరుదు లభించినది.
అందుకు మహాశయులారా, గమనించండి. సిద్దీఖ్ అన్నటువంటి బిరుదు హజ్రత్ అబూ బకర్ కు ప్రవక్తను అనుసరిస్తే లభించిందా? ప్రవక్తను నమ్మితే లభించిందా? లేదా అనుసరణ, ఆచరణ అన్నిటినీ వదులుకొని కేవలం ప్రేమ, ప్రేమ, ప్రేమ అని కేవలం నోటికి చెప్పుకుంటే లభించిందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల అబూ బకర్ కు ఉన్నంత ప్రేమ ఇంకా ఎవరికీ లేకుండే. కానీ ఆయన అంతే అనుసరించేవారు. ప్రవక్త మాటను ఆచరించేవారు. ఈ గుణపాఠం మనం కూడా నేర్చుకోవాలి. ఆచరణ అనేది ఉండాలి ప్రవక్త సున్నత్ ప్రకారంగా, దురాచారాన్ని వదులుకోవాలి, బిదత్ లను వదులుకోవాలి, షిర్క్ లను వదులుకోవాలి. మరియు ఏదైతే నమాజులను వదులుతున్నామో అది వదలకూడదు. ఎందుకు? ఇదే సామాన్య విషయమా నమాజ్? ఎక్కడ దొరికింది నమాజ్ ప్రవక్తకు? ఆకాశాల పైకి పిలువబడి ఇవ్వబడినది. ఇంతటి గౌరవమైన విషయాన్ని మనం ఎంత సునాయాసంగా, ఎంత ఈజీగా వదులుతున్నాము. అల్లాహ్ త’ఆలా మనందరికీ మేరాజ్ ప్రయాణంలో ప్రవక్త గారు ఏ ఏ విషయాలు చూశారో, ఏ ఏ బహుమానాలు పొందారో, దాని గురించి కొన్ని విషయాలు ఏదైతే విన్నామో వాటిని అర్థం చేసుకొని, వాటిని పాటించే భాగ్యం ప్రసాదించుగాక. స్వర్గంలో తీసుకెళ్ళేటువంటి సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక. మరియు నరకంలో తీసుకెళ్ళే విషయాల నుండి దూరం ఉండే అల్లాహ్ త’ఆలా భాగ్యం కూడా మనకు ప్రసాదించుగాక.
జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.