తౌహీద్ (ఏక దైవారాధన) రక్షణ కవచం – జుమా ఖుత్బా [ఆడియో & టెక్స్ట్]

జుమా ఖుత్బా: తౌహీద్ రక్షణ కవచం
https://youtu.be/ywb7-3fUjCo [17 నిముషాలు]
ఖతీబ్ (అరబీ): షేఖ్ రాషిద్ బిన్ అబ్దుర్ రహ్మాన్ అల్ బిదాహ్
అనువాదకులు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ.
స్థలం: జామె షేఖ్ ఇబ్ను ఉసైమీన్ . జుల్ఫీ, సఊది అరేబియ

ఈ ప్రసంగం ఇస్లాం యొక్క ప్రాథమిక విశ్వాసమైన తౌహీద్ (ఏకేశ్వరోపాసన) యొక్క ప్రాముఖ్యతను మరియు షిర్క్ (బహుదైవారాధన) యొక్క ప్రమాదాలను వివరిస్తుంది. తౌహీద్ అత్యున్నత ఆరాధన అని, షిర్క్ అత్యంత ఘోరమైన పాపమని వక్త నొక్కిచెప్పారు. తాయెత్తులు కట్టుకోవడం వంటి షిర్క్‌కు దారితీసే కార్యాలను నివారించాలని, అల్లాహ్ పట్ల ఎల్లప్పుడూ సద్భావన కలిగి ఉండాలని ఆయన ఉద్బోధించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు తౌహీద్‌ను ఎలా కాపాడారో, షిర్క్‌కు దారితీసే మార్గాలను ఎలా మూసివేశారో హుదైబియా చెట్టు ఉదంతం ద్వారా వివరించారు. మనల్ని మరియు మన కుటుంబాలను తౌహీద్‌పై స్థిరంగా ఉంచమని అల్లాహ్‌ను ప్రార్థించాలని, ఇస్లాం మరియు సున్నత్ అనే అనుగ్రహాలకు కృతజ్ఞతతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

أَلْحَمْدُ لِلَّهِ الْمُتَوَحِّدِ بِالْجَلَالِ بِكَمَالِ الْجَمَالِ تَعْظِيمًا وَتَكْبِيرًا
(అల్ హమ్దు’లిల్లాహిల్ ముతవహ్హిది బిల్ జలాలి బికమాలిల్ జమాలి త’అజీమన్ వ తక్బీరా)

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ تَقْدِيرًا وَتَدْبِيرًا
(అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ తఖ్దీరన్ వ తద్బీరా)

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا
(వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ లియకూన లిల్ ఆలమీన నజీరా)

صَلَّى اللَّهُ وَسَلَّمَ عَلَيْهِ تَسْلِيمًا كَثِيرًا، أَمَّا بَعْدُ
(సల్లల్లాహు వ సల్లమ అలైహి తస్లీమన్ కసీరా, అమ్మా బ’అద్)

الْحَمْدُ لِلهِ اَلْمُتَوَحِّدِ بِالْجَلَالِ بِكَمَالِ الْجَمَالِ تَعْظِيمًا وَتَكْبِيرًا. أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا هُوَ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ تَقْدِيرًا وَتَدْبِيرًا، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ؛ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا، صَلَّى اَللهُ وَسَلَّمَ عَلَيْهِ تَسْلِيمًا كَثِيرًا، أَمَّا بَعْدُ:

నేను మీకూ, అలాగే నాకు కూడా అల్లాహ్‌ (సుబహనహు వ త’ఆలా) భయభీతిని కలిగి ఉండాలని బోధిస్తున్నాను. అల్లాహ్‌కు భయపడటానికి అత్యంత ముఖ్యమైన మార్గం తౌహీద్‌ను (అల్లాహ్‌ ఏకత్వాన్ని) స్థాపించడం, షిర్క్‌ను (ఆయనకు భాగస్వాములను కల్పించడాన్ని) నివారించడం. తౌహీద్‌ అన్ని ఆరాధనలలోకెల్లా గొప్పది, దాన్ని పాటించేవారు అల్లాహ్‌ వద్ద అత్యుత్తమ స్థానంలో ఉంటారు. షిర్క్‌ అన్ని పాపాలలోకెల్లా అత్యంత అసహ్యకరమైనది,  చెడ్డది, దాన్ని పాటించేవారు అల్లాహ్‌ నుండి అత్యంత దూరంలో ఉంటారు.

అవును, తౌహీద్‌ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇది దాసులపై అల్లాహ్‌కు ఉన్న హక్కు. వారి కోరికలు వారిని తౌహీద్ నుండి దూరం చేశాయి. కలహాలు, సంక్షోభాలు, రోగాలు వారిని ఆవరించాయి. వారిలో కొందరు తాయెత్తులు, కడియాల మాయలో పడి ఉన్నారు, వాటిని తమకు, తమ పిల్లలకు, తమ వాహనాలకు, తమ ఇళ్లకు కట్టుకుంటారు. అవి కీడును దూరం చేస్తాయని, కంటిదిష్టిని తొలగిస్తాయని, మంచిని తీసుకువస్తాయని వారు నమ్ముతారు. కానీ వారు ప్రవక్త ఆదేశాన్ని మరిచారా?

(مَنْ عَلَّقَ تَمِيمَةً فَقَدْ أَشْرَكَ)
“ఎవరైతే తాయెత్తు కట్టుకుంటారో, వారు షిర్క్‌ చేసినట్లే.” (ముస్నద్ అహ్మద్ 17422. దీని సనద్ బలమైనది).

అల్లాహ్‌ ను కాకుండా వేరొకరిని ఆశ్రయించినా, వేరొకరిని ఆశించినా వారికి ఎంతటి వినాశనం! విశ్వాసులు స్వచ్ఛమైన దానిని త్రాగారు, కానీ అతను (షిర్క్ చేసే వాడు) కలుషితమైన దానిని త్రాగాడు. విశ్వాసులు ఒక్క ప్రభువును ఆరాధించారు, కానీ అతను పదిమంది ప్రభువులను ఆరాధించాడు:

(ءأَرْبَابٌ مُّتَّفَرّقُونَ خَيْرٌ أَمِ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ)
అనేక మంది విభిన్న ప్రభువులు మేలా? లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లాహ్‌ మేలా? (మీరే చెప్పండి!)” (యూసుఫ్ 12:39).

ఇక మృతులను పూజించేవాడు ఎక్కడ, ఎన్నటికీ మరణించని జీవించియున్న అల్లాహ్ ని పూజించేవాడు ఎక్కడ?

(هَلْ يَسْتَوِيَانِ مَثَلاً الْحَمْدُ للَّهِ بَلْ أَكْثَرُهُمْ لاَ يَعْلَمُونَ)
మరి వీరిద్దరూ సమానులేనా? సర్వస్తోత్రాలూ అల్లాహ్‌ కొరకే. అయితే వీరిలో చాలామందికి తెలీదు.” (నహ్ల్ 16:75).

అయినప్పటికీ, మన బాధ్యతలో ఉన్న వారి మనస్సులలో ఈ ప్రాథమిక భావాలను నాటాలి. అంటే తౌహీద్ ను ప్రేమించడం, ప్రోత్సహించడం, దానిని స్థాపించడం. షిర్క్ ను అసహ్యించుకోవడం, షిర్క్ ను వారించడం. ఇది ప్రాథమిక విషయం. వీటిని మనం మన భార్యా, పిల్లలు, మన బంధువులు, మన బాధ్యతలో ఉన్న వారి మనస్సులలో నాటాలి. వారిలో అల్లాహ్ పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల, నిషేధాల పట్ల గొప్ప గౌరవాన్ని పెంచాలి. ఆయన గొప్ప ఆజ్ఞ తౌహీద్. ఆయన గొప్ప నిషేధం షిర్క్. అల్లాహ్ జల్ల వ’ఉలా తన ప్రవక్తకు తౌహీద్‌ గురించి జ్ఞానం పొందమని ఆజ్ఞాపించాడు:

{فَاعْلَمْ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اَللَّهُ}
కనుక (ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. ” (ముహమ్మద్ 47:19).

ఇక ప్రవక్తకే ఈ ఆదేశం అల్లాహ్ ఇచ్చినప్పుడు, మనకు ఇది మరింత ప్రాధాన్యమైన ఆజ్ఞ.. కాబట్టి, మనకు ఇది మరింత ప్రాధాన్యమైన ఆజ్ఞ. అందుకే మనలో ఒకరు ఇలా అనడం అజ్ఞానం: “మేము తౌహీద్‌ను అర్థం చేసుకున్నాము, అయితే దానిని మన పాఠశాలల్లో, మసీదుల్లో ఎందుకు బోధిస్తూ ఉండాలి?” అంటారు కదా కొందరు ఇలా. ఇలా అనడం తప్పు విషయం. అల్లాహ్ నేర్చుకోమని ఏ విషయం అయితే చెబుతున్నాడో, దానిని ఇలా విస్మరించడమా?

ఓ విశ్వాసులారా: తౌహీద్‌ విషయాలలో విస్మరించబడిన వాటిలో ఒకటి అల్లాహ్‌ పట్ల దుర్బుద్ధి, దురాలోచన.

{الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ}
అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించేవారు, వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి.” (ఫత్ హ్ 48:6).

ఎంత మంది ప్రజలు అసత్యం విజయం సాధించడాన్ని, సత్యం బలహీనపడడాన్ని చూసినప్పుడు, అసత్యం శాశ్వతంగా ఉన్నత స్థితిలో ఉంటుందని, సత్యం క్షీణిస్తుందని భావిస్తారు? ఇది అల్లాహ్‌ పట్ల దుర్బుద్ధి, దురాలోచన, చెడు ఊహ. ఇది ఆయన స్వభావానికి, గుణాలకు తగనిది.

ఎంత మంది ప్రజలు తీవ్రమైన అనారోగ్యంతో లేదా పేదరికంతో బాధపడుతున్నప్పుడు అల్లాహ్‌ పట్ల దుర్బుద్ధిని కలిగి ఉంటారు, అల్లాహ్‌ వారి కష్టాలను దూరం చేయడని భావిస్తారు? ఇది నిస్సందేహంగా తౌహీద్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

మీ పరిస్థితిని మీరే చూసుకోండి, మీ పట్ల ఎవరైనా చెడుగా భావిస్తే మీరు ఎంత కోపంగా ఉంటారు, దాన్ని ఎంత ఖండిస్తారు? మీరు ప్రతి లోపానికి అర్హులు, అలాంటిది మీ ప్రభువు పట్ల మీరు ఎలా దుర్బుద్ధి, దురాలోచన కలిగి ఉంటారు, ఆయన పరిపూర్ణ గుణాలన్నింటికీ అర్హుడు?

ఇమామ్ అల్ ముజద్దిద్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్‌ రహిమహుల్లాహ్ రచించిన ‘కితాబుత్-తౌహీద్‌’లో ఒక అధ్యాయం ఉంది, దాని శీర్షిక:

حِمَايَةُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حِمَى التَّوْحِيدِ وَسَدِّهِ طُرُقَ الشِّرْكِ
(హిమాయతున్-నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ హిమత్-తౌహీద్ వ సద్దిహీ తురుఖష్-షిర్క్)
తౌహీద్‌ను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎలా రక్షించారు, షిర్క్‌కు దారితీసే మార్గాలను ఎలా మూసివేశారు.”

ఇందులో, ఆ ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ వారి యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) షిర్క్ కు దారి తీసే మార్గాలను మూసివేశారు, స్వయం ఆ మార్గాలు షిర్క్ కాకపోయినప్పటికీ, తౌహీద్ ను రక్షించడానికి ఇది ముందు జాగ్రత్త చర్యగా.

తౌహీద్‌ను రక్షించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పే ఒక చిన్న కథ తెలుసుకుందాము: హజ్రత్ ముసయ్యిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: హుదైబియాలోని చెట్టు కింద ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో బైఅత్ చేసిన వారిలో ఒకరు ఆయన కూడా ఉన్నారు, ఆయన చెప్పారు: “బైఅత్ జరిగిన తర్వాత సంవత్సరం మేము ఆ చెట్టు దగ్గరి నుండి దాటిపోయాము, కాని మేము దానిని మరచిపోయి ఉంటిమి గనక దానిని కనుగొనలేకపోయాము.” (బుఖారీ 4162, 4163, ముస్లిం 1859).

ఈ హదీస్ వ్యాఖ్యానంలో ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ చెప్పారు, “దాని అదృశ్యం, అంటే అది కనబడకుండా ఉండడం, అల్లాహు త’ఆలా దయలో ఓ భాగం. అది కనిపించి ఉన్నట్లయితే, అజ్ఞానులు దానికి గొప్ప గౌరవం ఇస్తారన్న భయం ఉండేది”. (షర్హ్ ముస్లిం).

తరువాత హజ్రత్ ఉమర్‌ రజియల్లాహు అన్హు కాలంలో, ప్రజలు దాని పట్ల మరొకసారి ఫిత్నాలో పడ్డారు. అప్పుడు ఆయన దానిని నరికివేయమని ఆజ్ఞాపించారు, షిర్క్‌కు దారితీసే మార్గాన్ని మూసివేయడానికి; ఎందుకంటే వారు దాని కిందకు వెళ్లి నమాజ్ చేసేవారు. అయితే వారు ఫిత్నాలో పడతారని ఆయన భయపడ్డారు. (ఫత్హుల్ బారీ 7/448 ثُمَّ وَجَدْتُ عِنْد بن سَعْدٍ بِإِسْنَادٍ صَحِيحٍ عَنْ نَافِعٍ أَنَّ عُمَرَ بَلَغَهُ أَنَّ قَوْمًا يَأْتُونَ الشَّجَرَةَ فَيُصَلُّونَ عِنْدَهَا فَتَوَعَّدَهُمْ ثُمَّ أَمْرَ بِقَطْعِهَا فَقُطِعَتْ).

ఓ అల్లాహ్‌, మమ్మల్ని తౌహీద్‌పై జీవింపజేయి, తౌహీద్‌పై మరణింపజేయి, ప్రళయదినాన మమ్మల్ని తౌహీద్ పై లేపు. అస్తగ్ఫిరుల్లాహ లీ వ’లకుమ్ ఫ’స్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్’రహీం.

الْحَمْدُ لِلهِ الَّذِيْ هَدَانَا لِنِعْمَةِ الْإِسْلَامِ وَالتَّوْحِيدِ وَالسُّنَّةِ الْبَيْضَاءِ، وَالصَلَاَةُ وَالسَلَاَمُ عَلَى إمَامِ الْحُنَفَاءِ، أَمَّا بَعْدُ:
అల్ హమ్దు’లిల్లాహిల్లజీ హదానా లిని’అమతిల్ ఇస్లామి వత్-తౌహీది వస్-సున్నతిల్ బైదా, వస్-సలాతు వస్-సలాము అలా ఇమామిల్ హునఫా, అమ్మా బ’అద్.

ఇస్లాం, తౌహీద్‌, స్పష్టమైన సున్నత్ అనే గొప్ప అనుగ్రహాలు ప్రసాదించిన అల్లాహ్‌కు స్తోత్రములు. తౌహీద్ పై స్థిరంగా ఉండి, అటూ ఇటూ తొంగని, వంగనివారి నాయకులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి, శుభాలు వర్షించుగాక. ఆమీన్. అమ్మాబాద్!

ఓ షిర్క్‌ను, దానిని పాటించేవారిని వదలి, తౌహీద్‌ను పాటించేవాడా, ఓ బిద్అత్‌ను, దానిని పాటించేవారిని వదలి సున్నత్‌ను పాటించేవాడా: నీవు తౌహీద్‌, సున్నత్ దేశంలో తౌహీద్‌ మరియు సున్నత్ యొక్క అనుగ్రహాన్ని గమనిస్తున్నావా, దాని విలువను గ్రహిస్తున్నావా?

మన దేశంలో ఉన్న గొప్ప అనుగ్రహాన్ని నీవు గుర్తించావా (సౌదీయాలో జరిగిన ఖుత్బా, అందుకొరకే ఖతీబ్ చెప్పిన మాటలు అలాగే అనువదించడం జరిగింది), ఏంటి అది? అల్లాహ్ దయ వల్ల మనం మస్జిదులు, శ్మశాన వాటికలలోకి, ఖబ్రిస్తాన్ లలోకి ప్రవేశించినప్పుడు, షిర్క్ లేదా బిద్అత్ యొక్క ఏ చిహ్నాలను కూడా మనం చూడము. విగ్రహాలను పూజించకుండా, సాలిహీన్‌లను, సమాధి చేయబడిన వారిని, ఔలియాలను మధ్యవర్తులుగా చేసుకోవడం నుండి నిన్ను దూరంగా ఉంచిన అల్లాహ్‌ గొప్ప దయను నీవు గుర్తుకు తెచ్చుకున్నావా?

నీ మూడవ తండ్రి ఇబ్రహీం (అలైహిస్సలాం) చేసిన దుఆ నీవు చేస్తూ ఉన్నావా?
(మూడవ తండ్రి ఎందుకు అన్నారండీ? మనల్ని కన్న తండ్రి ఒక తండ్రి అయితే, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తండ్రి లాంటి వారు కాదా? ధర్మమంతా ప్రేమగా నేర్పారు కదా).

{وَاجْنُبْنِي وَبَنِيَّ أَنْ نَعْبُدَ الْأَصْنَامَ رَبِّ إِنَّهُنَّ أَضْلَلْنَ كَثِيرًا مِنَ النَّاسِ}
నన్నూ, నా సంతానాన్నీ విగ్రహ పూజ నుంచి కాపాడు, నా ప్రభూ! అవి ఎంతో మందిని పెడదారి పట్టించాయి” (ఇబ్రాహీం 14:35-36).

ఇబ్నుల్-ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “నేను ఒక రోజు మా స్నేహితులలో ఒకరిని సందర్శించాను – ఆయనకు దుఃఖం వచ్చి ఏడుస్తూ ఉన్నారు – నేను ఆయనను దాని గురించి అడిగాను, ఆయన అన్నారు: అల్లాహ్ నాకు సున్నత్ ప్రసాదించాడు, దాని జ్ఞానం ప్రసాదించాడు. మరియు ప్రజలు ఏ సందేహాల్లో పడి ఉన్నారో, ఏ తప్పుడు నియమ నిర్ణయాల్లో ఉన్నారో, వాటి నుండి విముక్తిని కలిగించాడు. ఇలా కలిగించిన ఆ అల్లాహ్ ను నేను గుర్తు చేసుకుంటున్నాను, ఈ అనుగ్రహాలను నేను గుర్తు చేసుకుంటున్నాను. అది నన్ను సంతోష పెట్టింది, చివరికి నన్ను ఏడ్పించింది”. (మదారిజుస్సాలికీన్ 3/127).

فاللهم لَكَ الحَمْدُ عَلَى نِعْمَةِ التَّوْحِيْدِ وَالسُّنَّةِ، بِبِلَادِ التَّوْحِيْدِ وَالسُّنَّةِ.
(అల్లాహుమ్మ లకల్ హమ్దు అలా ని’అమతిత్ తౌహీది వస్-సున్నతి ఫీ బిలాదిత్ తౌహీది వస్-సున్న)
ఓ అల్లాహ్‌, తౌహీద్‌, సున్నత్ దేశంలో తౌహీద్‌, సున్నత్ అనే గొప్ప అనుగ్రహానికి నీకే ప్రశంసలు, స్తోత్రములు.

اللَّهُمَّ ثَبِّتْنَا عَلَى ذَلِكَ إِلَى يَوْمِ نَلْقَاكَ
(అల్లాహుమ్మ సబ్బిత్నా అలా జాలిక ఇలా యౌమి నల్ఖాక)
ఓ అల్లాహ్! మేము నిన్ను కలిసే రోజు వరకు దానిపై మమ్మల్ని స్థిరపరచు.

وَعُمَّ بِالتَّوْحِيدِ وَالسُّنَّةِ أَوْطَانَ الْمُسْلِمِينَ
(వ’ఉమ్మ బిత్-తౌహీది వస్-సున్నతి అవ్తానల్ ముస్లిమీన్)
ముస్లింల దేశాలను తౌహీద్, సున్నత్ తో నింపు.

اللهم كَمَا هَدَيْتَنا لِلإِسْلاَمِ فلاَ تَنْزِعْهُ مِنّا حَتَّى تَتَوَفَّانا وَنحن مُسْلِمونَ.
(అల్లాహుమ్మ కమా హదైతనా లిల్ ఇస్లామి ఫలా తన్జి’అహు మిన్నా హత్తా తతవఫ్ఫానా వ నహ్ను ముస్లిమూన్)
ఓ అల్లాహ్‌, నీవు మమ్మల్ని ఇస్లాంపై నడిపించినట్లే, మేము ముస్లింలుగా మరణించే వరకు దానిని మమ్మల్నుండి దూరం చేయకు.

اللهم اجْعَلْنَا مِمَّنْ يَلْقَاكَ لَا يُشْرِكُ بِكَ شَيْئَاً.
(అల్లాహుమ్మ జ’అల్నా మిమ్మన్ యల్ఖాక లా యుష్రికు బిక షైఆ)
ఓ అల్లాహ్‌, నిన్ను కలిసేటప్పుడు నీకు ఏమీ భాగస్వామిగా చేయని వారిలో మమ్మల్ని చేర్చు.

اللَّهُمَّ اجْعَلْنَا أغَنْى خَلْقِكَ بكَ، وأفْقَرَ خَلْقِكَ إليْكَ.
(అల్లాహుమ్మ జ’అల్నా అగ్నా ఖల్ఖిక బిక వ అఫ్ఖర ఖల్ఖిక ఇలైక)
ఓ అల్లాహ్‌, నీ తప్ప నీ సృష్టిలో ఎవరి అవసరం లేకుండా చేయి, మరియు నీ సృష్టిలోకెల్లా నీ సన్నిధిలో అత్యంత పేదవారిగా ఉంచు.

اللَّهُمَّ إِنّا نَسْأَلُكَ النَّعِيمَ الْمُقِيمَ الَّذِي لَا يَحُولُ وَلَا يَزُولُ.
(అల్లాహుమ్మ ఇన్నా నస్అలుకన్-నయీమల్ ముఖీమల్లజీ లా యహూలు వలా యజూల్)
ఓ అల్లాహ్‌, ఎన్నటికీ మారకుండా, తొలగిపోకుండా ఉండే శాశ్వతమైన అనుగ్రహాలు మేము నిన్ను అడుగుతున్నాము.

اللهم وفِّقْ إِمَامَنَا خَادِمَ الحَرَمَينِ الشَّرِيْفَيْنِ، وَوَلِيَّ عَهْدِهِ لِمَا فِيْهِ عِزُّ الإِسْلامِ وَصَلاحُ المُسْلِمِيْنَ. وَارْحَمْ وَالِدَهُمُ الإِمَامَ المُؤَسِّسَ، وَالإِمَامَ المُجَدِّدَ.
(అల్లాహుమ్మ వఫ్ఫిఖ్ ఇమామనా ఖాదిమల్ హరమైనిష్-షరీఫైని వ వలియ్య అహదిహీ లిమా ఫీహి ఇజ్జుల్ ఇస్లామి వ సలాహుల్ ముస్లిమీన్, వర్’హమ్ వాలిదహుమల్ ఇమామల్ ముఅస్సిస వల్ ఇమామల్ ముజద్దిద్)
ఓ అల్లాహ్! మా నాయకుడు (అంటే రాజు), రెండు పవిత్ర మస్జిదుల సేవకుడు మరియు ఆయన యువరాజును ఇస్లాం గౌరవానికి, ముస్లింల శ్రేయస్సుకు దోహదపడే వాటికి మార్గనిర్దేశం చెయ్యి. వారి తండ్రి, వ్యవస్థాపక ఇమామ్ (మలిక్ అబ్దుల్ అజీజ్) మరియు పునరుద్ధరణ చేసిన ఇమామ్ (ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్) రహిమహుముల్లాహ్ పై నీవు దయ చూపు.

اللهم احْفَظْ أَمْنَنَا وَإيْمَانَنَا وَجُنُودَنَا وَحُدُوْدَنَا، وَمُقَدَّسَاتِنَا وَقُدْسَنَا.
(అల్లాహుమ్మ హ్ఫజ్ అమ్ననా వ ఈమాననా వ జునూదనా వ హుదూదనా వ ముఖద్దసాతినా వ ఖుద్సనా)
ఓ అల్లాహ్‌, మా భద్రతను, మా విశ్వాసాన్ని, మా సైనికులను, మా సరిహద్దులను, మా పవిత్ర స్థలాలను, మా బైతుల్ మఖ్దిస్ ను రక్షించు, కాపాడు.

اللهم يَا ذَا النِّعَمِ الَّتِيْ لا تُحْصَى عَدَدًا: نَسْأَلُكَ أَنْ تُصَلِّيَ وَتُسَلِّمَ عَلَى مُحَمَّدٍ أَبَدَاً.
(అల్లాహుమ్మ యా జన్ని’అమిల్లతీ లా తుహ్సా అదదా, నస్అలుక అన్ తుసల్లియ వ తుసల్లిమ అలా ముహమ్మదిన్ అబదా)
ఓ అల్లాహ్‌, లెక్క లేనన్ని అనుగ్రహాలు ప్రసాదించేవాడా: ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఎల్లప్పుడూ శాంతిని, శుభాలను కురిపించమని మేము నిన్ను అడుగుతున్నాము.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42249

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/