అల్లాహ్ నామాలపై  గుణగణాలపై విశ్వాసం  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢ 

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١ 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క దైవభీతి కలిగి ఉండండి. అల్లాహ్ అవిధేయతకు దూరంగా ఉండండి. ఇస్లాంలో అఖీదా పరంగా అల్లాహ్ యొక్క పవిత్ర నామాలపై, గుణగణాలపై విశ్వాసం తీసుకురావడం తప్పనిసరి. ఇస్లాంలో దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. అల్లాహ్ తన మహోత్తరమైన దివ్య గ్రంథం ఖురాన్ లో తన గుణగణాలను ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశాడు:

وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمًا
మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

మరొకచోట ఇలా ప్రస్తావించబడింది.

إِنَّ ٱللَّهَ كَانَ سَمِيعَۢا بَصِيرٗا
నిశ్చయంగా అల్లాహ్ వినేవాడు మరియు చూసేవాడు

ఇలాంటి వాక్యాలు దివ్య ఖురాన్ లో అనేక చోట్ల అనేకమార్లు ప్రస్తావించబడ్డాయి. అదే విధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా హదీసులలో అనేకసార్లు అల్లాహ్ యొక్క స్తోత్రం, ఆయన గుణగణాలను గురించి కొనియాడేవారు. 

అల్లాహ్ యొక్క నామాలపై, గుణగణాలపై విశ్వాసం ఉంచడం వలన దాసునిలో దైవభీతి మరియు భక్తితత్వం పెరుగుతుంది. దాని ద్వారా అల్లాహ్ దాసుని పట్ల ఎంతో సంతోషిస్తాడు. (ఎందుకంటే వాస్తవికత కూడా ఇదే) దాసుడు అల్లాహ్ గురించి ఎంత తెలుసుకుంటాడో అల్లాహ్ తో అంతే భయపడతాడు. ఉదాహరణకి, అల్లాహ్ దివ్య ఖురాన్ లో ఇలా సెలవిస్తున్నాడు:

إِنَّمَا يَخۡشَى ٱللَّهَ مِنۡ عِبَادِهِ ٱلۡعُلَمَٰٓؤُاْۗ
అల్లాహ్ దాసులలో జ్ఞానం గలవారు మాత్రమే ఆయనకు భయపడతారు.

సర్వం అల్లాహ్ యొక్క పవిత్ర నామాలపై, ఆయన గుణగణాలపై విశ్వాసం తేవడం యొక్క ప్రాధాన్యత ఎంతో మనకు వీటి ద్వారా తెలుస్తుంది. అందుకే దాసునిపై విధి ఏమిటంటే అతను అల్లాహ్ యొక్క పవిత్ర నామాలపై,  గుణగణాలపై అదే విధంగా విశ్వాసం తీసుకురావాలి ఏ విధంగా అయితే అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ లో మరియు ప్రవక్త హదీసులలో బోధించబడిందో. 

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క నామాలను ఆయన గుణగణాలను విశ్వసించడానికి రెండు ఆవశ్యకతలు ఉన్నాయి.  

మొదటిది: అవి వెల్లడి చేసిన విధానంలో, వాటి స్పష్టమైన అర్థంలో ఎలాంటి ఎలాంటి వక్రీకరణలు, అనుసరణులు, దిద్దుబాటులు లేకుండా అర్థం చేసుకోవడం.

క్రింది వక్రీకరణలు చేయకూడదు:

  • తహ్‌ రీఫ్‌’ అంటే: ఏ ఆధారము లేకుండా నామగుణాల భావాన్ని మార్చుట. తారుమారు చేయుట.
  • ‘తతీల్‌’ అంటే: అల్లాహ్‌ గుణనామాలన్నిటిని లేదా కొన్నిటిని తిరస్మరించుట. ఉదాహరణకు అల్లాహ్‌ ను నిరాకారునిగా నమ్ముట.
  • ‘తక్‌ యీఫ్‌’ అంటే: అల్లాహ్‌ గుణాలను మాట, ఊహ ద్వారా ఏదైనా ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేయుట. ఉదాహరణకు అల్లాహ్‌ చేయి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని అనుట.
  • ‘తమ్‌సీల్‌ అంటే: అల్లాహ్‌ గుణాలను సృష్టి గుణాలతో పోల్పుట. లేదా సృష్టి గుణాల మాదిరిగా ఉంటాయని విశ్వసించుట.

అల్లాహ్ ఇలా తెలియజేశాడు:

وَلِلَّهِ ٱلۡمَثَلُ ٱلۡأَعۡلَىٰۚ
మరియు అల్లాహ్ మాత్రమే సర్వోన్నతుడిగా పరిగణింపబడేవాడు.

మరొకచోట ఇలా తెలియజేయడం జరిగింది.

لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ
ఆయనకు పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, చూసేవాడు.

రెండవ ఆవశ్యకత ఏమనగా: అల్లాహ్ యొక్క ఏయే పేర్లు మరియు గుణగణాలు ఖురాన్ మరియు హదీసులలో తెలియ చేయబడ్డాయో కేవలం వాటిపై మాత్రమే సరిపెట్టుకొని, వాటిపై మాత్రమే విశ్వాసము ఉంచడం. అందులో కొత్త పేర్లు చేర్చడం కానీ లేక మార్పు చేర్పులకు గురిచేయడం కానీ చేయరాదు.

ఇమామ్ అహ్మద్ బిన్  హంబల్ రహిమహుల్లాహ్ ఇలా తెలియచేశారు:

“అల్లాహ్ తఆలా ఏవైతే తన ప్రియమైన పేర్లను, ఉన్నతమైన స్వభావం కలిగిన గుణాలను గురించి తెలియజేశారో వాటికంటే గొప్పగా ఎవరూ కూడా తెలియజేయలేరు. ఇది అల్లాహ్ యొక్క ఔన్నత్యం”.
(ఖాజీ అబూ యాలా “తిబఖాతుల్ హనాబిల లో ఈ విషయాన్ని తెలియచేసారు)   

ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ యొక్క పేర్లకు, గుణగణాలకు విరుద్ధం ఏమిటంటే వాటిలో నాస్తికత్వాన్ని  చేర్చడము (ఇల్ హాద్ కి పాల్పడటం) అనగా అల్లాహ్ యొక్క పవిత్ర నామాలను మరియు గుణగణాల అర్ధాలను  ఏవిధంగానైతే మన పూర్వీకులు సలఫ్  పండితులు అర్థం చేసుకున్నారో అలా అర్థం చేసుకోకపోవడం. 

ఇల్ హాద్ అనేక రకాలు. అందులో ముఖ్యమైనది ఏమిటంటే అల్లాహ్ పేర్ల యొక్క అసలు అర్ధాన్ని మార్చడం, లేకపోతే అసలు అర్థమే లేకుండా చేయడం. ఈ రెండు విషయాలు విశ్వాసానికి విరుద్ధమైనవి మరియు అలాంటి మార్పుచేర్పులకు గురి అయిన పేర్లను అజ్ఞానంతో అల్లాహ్ వైపు ఆపాదించడం ఘోరమైన పాపం మరియు సలఫ్ పండితులు వారించినటువంటి బిద్అత్ లలో ఒకటి అవుతుంది. అల్లాహ్ అలాంటి వారిని శిక్ష  గురించి హెచ్చరిస్తున్నాడు.

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

وَلِلَّهِ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰ فَٱدۡعُوهُ بِهَاۖ وَذَرُواْ ٱلَّذِينَ يُلۡحِدُونَ فِيٓ أَسۡمَٰٓئِهِۦۚ سَيُجۡزَوۡنَ مَا كَانُواْ يَعۡمَلُونَ
మరియు అల్లాహ్ పేర్లు అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి. మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందగలరు.

మరో చోట ఇలా సెలవిచాడు:

[وَلَا تَقۡفُ مَا لَيۡسَ لَكَ بِهِۦ عِلۡمٌۚ إِنَّ ٱلسَّمۡعَ وَٱلۡبَصَرَ وَٱلۡفُؤَادَ كُلُّ أُوْلَٰٓئِكَ كَانَ عَنۡهُ مَسۡ‍ُٔولٗا]
మరియు (ఓ మానవుడా!) నీకు తెలియని విషయం వెంటబడకు. నిశ్చయంగా చూపులూ, వినికిడీ మరియు హృదయం వీటన్నింటినీ గురించీ, (తీర్పు దినమున) ప్రశ్నించడం జరుగుతుంది.

ఓ విశ్వాసులారా! ఇల్ హాద్ రకాలలో ముఖ్యమైనది ఏమిటంటే అల్లాహ్ సద్గుణ విశేషాలలో వక్రీకరణకు పాల్పడటం. అనగా అసలు పేరు యొక్క అర్ధాన్ని మార్చడం. వీటి గురించి సలఫ్ పండితులు అనగా మన పూర్వీకులు ఖురాన్ మరియు హదీస్ జ్ఞానం  ఉన్నవారు మాత్రమే వీటి అసలు అర్థాలను గ్రహించగలరు. ఉదాహరణకు మన సహాబాలు జ్ఞానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి నేర్చుకున్నారు మరియు చిత్తశుద్ధితో ఆయనకు విధేయత చూపారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సైతం వారి గురించి ఇలా సాక్ష్యం ఇచ్చారు – “అందరికంటే మంచివారు, ఉత్తమమైన వారు నా కాలం నాటివారు, ఆ తర్వాత వారి తర్వాత వచ్చిన వారు, ఆ తర్వాత వారి తర్వాత వచ్చినటువంటి వారు“. (బుఖారి -2652 ముస్లిం -2533)  

దీని ద్వారా మనకు తెలిసొచ్చే దేమిటంటే ఏ విషయమైతే సహాబాల ఆలోచనకు విరుద్ధంగా ఉంటుందో ఆ విషయానికి ధర్మానికి ఏ సంబంధం లేదు. అది కేవలం ఒక కల్పితం మాత్రమే అవుతుంది.  అల్లాహ్ యొక్క నామాలలో సద్గుణ విశేషాలలో వక్రీకరణకు పాల్పడటం యొక్క ఉదాహరణ: (అల్లాహ్ సింహాసనం పై ఆసీనుడై ఉన్నాడు) దీని భావం ఆయన అక్కడి నుండి తన ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాడు.  కానీ భావించే వాళ్ళు మాత్రం ఆయన అక్కడ సింహాసనంపై ఉన్నతంగా ఉన్నాడు అనే విషయాన్ని తిరస్కరిస్తారు.  

మరొక రకం ఏమిటంటే అల్లాహ్ పేర్లలో ఏదైనా పేరు గురించి దాని స్వభావాన్ని గురించి అనేక రకాలుగా ఆలోచించడం. ఇది పూర్తిగా నిషేధించబడింది. ఎవరు కూడా తమ జ్ఞానం తో అల్లాహ్ ను గ్రహించలేరు. అల్లాహ్ ఇలా అంటున్నాడు [وَلَا يُحِيطُونَ بِهِۦ عِلۡمٗا]  (కాని వారు తమ జ్ఞానంతో ఆయనను గ్రహించజాలరు.) అనగా ఈ వాక్యంలో అల్లాహ్ గురించి ఆయన ఎలా ఉన్నాడు అన్నటువంటి విషయాల గురించి ఆలోచించడాన్ని అల్లా పూర్తిగా వారించాడు.  

మన సలఫ్ పండితులు కూడా ఈ విషయాన్ని కఠినంగా తిరస్కరించారు.  ఒక వ్యక్తి ఇమామ్ మాలిక్ బిన్ అనస్ (రహిమహుల్లాహ్) గారి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు ఓ (అబూ అబ్దుల్లాహ్)  అల్లాహ్ (రహ్మాన్) ఆర్ష్ పై ఎలా ఆసీనుడై ఉన్నాడు.? అని ప్రశ్నించాడు.  దానికి ఇమామ్ గారు కొద్దిసేపు తలవంచుకున్నారు. చమటలు కూడా పట్టసాగాయి. కొద్దిసేపు తర్వాత ఇలా సమాధానమిచ్చారు:

వెంటనే ఆ వ్యక్తిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. (బైహఖీ ఫీ అస్మా వ సిఫాత్)   

ఇబ్నెఉతైమీన్ (రహిమహుల్లాహ్) గారు ఇమామ్ మాలిక్ గారి మాట గురించి వివరణ ఇస్తూ ఇలా తెలియజేశారు.

అల్లాహ్ యొక్క పవిత్ర నామాలలో ఇల్హాద్ కు పాల్పడటం యొక్క మరొక రకం ఏమిటంటే అల్లాహ్ ను ఇతరులతో పోల్చడం: ఉదాహరణ ఇతరుల చేతులను అల్లాహ్ చేతుల్లా ఉన్నాయి అనడం. అల్లాహ్ వీటి అన్నిటినుండి పరమ పరిశుద్ధుడు. 

నయీమ్ బిన్ హమ్మాద్ అల్ ఖాజాయీ రహిమాహుల్లాహ్ (బుఖారి రహిమహుల్లాహ్ గారి గురువు) ఆయన ఇలా అన్నారు:

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క పవిత్ర పేర్లు మరియు ఆయన గుణగణాలలో ఎటువంటి మార్పు చేర్పులు చేయకుండా అర్థం చేసుకోవడం అఖీదాలోని భాగం. నలుగురు ఇమాములు కూడా ఈ విషయాన్ని ఏకీభవించారు  

ఇమామ్ ముహమ్మద్ బిన్ హసన్ అల్ షైబాని (వీరు ఇమామ్ అబూ హనీఫా గారి శిష్యులు) ఈ విధంగా తెలియజేశారు:

ఇమామ్ షాఫయీ (రహిమహుల్లాహ్) వారు ఇలా అన్నారు:

ఇబ్నె తైమీయా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేశారు:

ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) అల్లాహ్ యొక్క వాక్యం [ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ] (ఆయన సింహాసనం పై ఆసీనుడై ఉన్నాడు) యొక్క తఫ్సీర్ లో ఇలా రాశారు.  

వాస్తవికత కూడా ఇదే. ధార్మిక పండితులు దీని గురించే వివరించారు. అందులో  నయీమ్ బిన్ హమ్మాద్ అల్ ఖాజాయీ రహిమాహుల్లాహ్ (బుఖారి రహిమహుల్లాహ్ గారి గురువు) కూడా ఉన్నారు.  ఆయన ఇలా అన్నారు:

అబ్దుర్రహ్మాన్ బిన్ అల్ ఖాసిం అల్ మక్కీ  (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేశారు:

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాతాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.        

స్తోత్రం మరియు దరూద్ తరువాత  

ఓ ముస్లింలారా! మనిషి యొక్క హృదయం, తెలివి మరియు శరీర అవయవాలకు అల్లాహ్ యొక్క గుణగణాలు తెలుసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ఇలా ప్రస్తావించారు:

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించు గాక! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యాని కై  అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు:  

[إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا] 
(నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) 

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.  

ఓ అల్లాహ్! ఇస్లాం ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు. ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రతను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి .  

ఓ అల్లాహ్! మమ్ములను ఇస్లాం మరియు ముస్లింలను నష్టంలో ముంచే ఆలోచన ఎవరికైతే ఉందో వారిని వారిలోనే నిమగ్నం చేసేయి. వారి ఆలోచనను వారివైపే త్రిప్పికొట్టు . ఓ అల్లాహ్! ఖరీదుల పెరుగుదల, వడ్డీ, వ్యబిచారము, భూకంపాలు, పరీక్షలను మా నుండి దూరం చేయి. ప్రత్యేకంగా మా దేశము నుండి మరియు సాదారణంగా ముస్లిముల అన్నీ దేశాలనుండి బాహ్యమైన, అంతర్గత కల్లోలాలను మానుండి దూరం చేసేయి. ఓ అల్లాహ్! మా నుండి కష్టాలను, ఇబ్బందులను దూరం చేయి. ఓ మా ప్రభువా! ఇహలోకంలో మాకు పుణ్యాన్ని, పరలోకంలో మేలును మరియు నరకం నుండి రక్షణ ను ప్రసాదించు . ఆమీన్.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

అల్లాహ్ (త’ఆలా) (మెయిన్ పేజీ):
https://teluguislam.net/allah/

అల్లాహ్ పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ పట్ల విశ్వాసం
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/0Ud2-JK7Y7k [17 నిముషాలు]

ఈ ప్రసంగంలో, విశ్వాసంలోని ప్రాథమిక అంశాల గురించి వివరించబడింది. ముఖ్యంగా ‘అర్కానుల్ ఈమాన్’ (విశ్వాస మూలస్తంభాలు) లోని మొదటి అంశమైన అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి వివరంగా చర్చించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు జిబ్రీల్ అలైహిస్సలాం మధ్య జరిగిన సంభాషణ ద్వారా ఈమాన్ యొక్క ఆరు మూలస్తంభాలు వివరించబడ్డాయి: అల్లాహ్ ను విశ్వసించడం, ఆయన దైవదూతలను, గ్రంథాలను, ప్రవక్తలను, పరలోక దినాన్ని మరియు మంచి చెడు విధిరాతను విశ్వసించడం. అల్లాహ్ అస్తిత్వం, ఆయన సర్వాధికారాలు (తౌహీద్ అర్-రుబూబియ్య), ఆరాధనలకు ఆయన ఒక్కడే అర్హుడు (తౌహీద్ అల్-ఉలూహియ్య), మరియు ఆయన పవిత్ర నామాలు, గుణగణాలు (తౌహీద్ అల్-అస్మా వస్సిఫాత్) అనే మూడు ముఖ్య విషయాలను తెలుసుకోవడం ద్వారా అల్లాహ్ పై సంపూర్ణ విశ్వాసం కలుగుతుందని బోధించబడింది. ఖురాన్ ఆయతుల ఆధారాలతో ఈ అంశాలు స్పష్టంగా వివరించబడ్డాయి.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని మొదటి ముఖ్యాంశం, అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.

చూడండి, దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం మానవ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో వచ్చి, “ఈమాన్ (విశ్వాసం) అంటే ఏమిటి? తెలుపండి” అన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ, “ఈమాన్ (విశ్వాసం) అంటే అల్లాహ్ ను విశ్వసించాలి, దైవదూతలను విశ్వసించాలి, దైవ గ్రంథాలను విశ్వసించాలి, దైవ ప్రవక్తలను విశ్వసించాలి, పరలోక దినాన్ని విశ్వసించాలి, మంచి చెడు విధివ్రాతను విశ్వసించాలి.” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని చెప్పారు. దానికి దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారు, “అవును, మీరు చెప్పింది నిజమే” అన్నారు.

రండి ఈరోజు మనము విశ్వాస ముఖ్యాంశాలలోని మొదటి విషయం, అల్లాహ్ పై విశ్వాసం గురించి తెలుసుకుందాం.

అల్లాహ్ ను విశ్వసించడం అంటే అల్లాహ్ ఉన్నాడు అని, అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని, అల్లాహ్ ఆరాధనలన్నింటికీ అర్హుడు అని, అల్లాహ్ కు గొప్ప నామాలు, పేర్లు ఉన్నాయి అని విశ్వసించటం. దీని క్లుప్తమైన వివరణ ఇప్పుడు మీ ముందర ఉంచడం జరుగుతూ ఉంది.

అల్లాహ్ ఉన్నాడు అని ప్రతి వ్యక్తి నమ్మాలి. ఇదే వాస్తవము కూడా. అల్లాహ్ ఉన్నాడు అని మనందరి ఆత్మ సాక్ష్యమిస్తుంది. సమస్యలు, బాధలు వచ్చినప్పుడు “దేవుడా” అని విన్నవించుకుంటుంది మన ఆత్మ. సృష్టిలో గొప్ప గొప్ప నిదర్శనాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉంచి ఉన్నాడు. ఆ నిదర్శనాలను చూసి, అల్లాహ్ ఉన్నాడు, సృష్టికర్త అయిన ప్రభువైన అల్లాహ్ ఉన్నాడు అని మనము గుర్తించాలి. ఉదాహరణకు, భూమి, ఆకాశాలు, పర్వతాలు, సముద్రాలు, సూర్యచంద్రులు, ఇవన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించినవి. అల్లాహ్ కాకుండా ప్రపంచంలోని ఏ సామ్రాజ్యంలో, ఏ ఫ్యాక్టరీలో ఇవన్నీ తయారు అవ్వవు. వీటన్నింటినీ సృష్టించిన వాడు గొప్ప శక్తిమంతుడు, ఆయనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. మానవుల ద్వారా భూమి, ఆకాశాలను, సముద్రాలను, వీటిని పుట్టించడమో, సృష్టించటమో వీలుకాని పని. కాబట్టి, ఇది మానవులు సృష్టించిన సృష్టి కాదు, సృష్టికర్త, ప్రభువు అల్లాహ్ సృష్టించిన సృష్టి అని ఈ సృష్టిలో ఉన్న నిదర్శనాలు చూసి మనము అల్లాహ్ ఉన్నాడు అని గుర్తించాలి.

ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము, ఒకవేళ సృష్టిలో ఉన్న నిదర్శనాలను చూసి మనము తెలుసుకోకపోయినా, మన శరీరంలో ఉన్న అవయవాలను బట్టి కూడా మనము మహాప్రభువు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నాడని తెలుసుకోవచ్చు. మన శరీరంలో ఉన్న అవయవాలలో నుంచి ఏ ఒక్క అవయవము పాడైపోయినా, అలాంటి అవయవము ప్రపంచంలోని ఏ సామ్రాజ్యంలో కూడా తయారు కాబడదు. మళ్ళీ అల్లాహ్ సృష్టించిన వేరే మనిషి శరీరం నుండి తీసుకుని మనము ఒకవేళ దాన్ని అతికించుకున్నా గానీ, అది అల్లాహ్ ఇచ్చిన అవయవం లాగా పని చేయదు. కాబట్టి మన శరీర అవయవాలే సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క గొప్పతనాన్ని మనకు సూచిస్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగా మనము అల్లాహ్, సృష్టికర్త ఉన్నాడు అని మనం నమ్మాలి. ఇదే నిజమైన నమ్మకం.

చూడండి, ఖురాను గ్రంథం 52వ అధ్యాయం, 35వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ
(అమ్ ఖులిఖూ మిన్ ఘైరి షైఇన్ అమ్ హుముల్ ఖాలిఖూన్)
ఏమిటి, వీరు (పుట్టించేవాడు) ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టికర్తలా?” (52:35)

అంటే, ఎవరికి వారు స్వయంగా సృష్టించబడలేదు, వారిని సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని ఆలోచింపజేస్తున్నాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా.

అలాగే, ఖురాను గ్రంథం 51వ అధ్యాయం, 20 మరియు 21 వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:

وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ
(వఫిల్ అర్ది ఆయాతుల్ లిల్ మూఖినీన్)
నమ్మేవారికి భూమిలో పలు నిదర్శనాలున్నాయి.” (51:20)

وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ
(వఫీ అన్ఫుసికుమ్ అఫలా తుబ్సిరూన్)
స్వయంగా మీ ఆత్మల్లో (అస్తిత్వంలో) కూడా ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా చూడటం లేదా?” (51:21)

చూశారా? మన శరీరంలోనే నిదర్శనాలు ఉన్నాయి. అవి చూసి అల్లాహ్ ను గుర్తుపట్టండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు. మొత్తానికి, సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నాడు. అదే విషయం మన ఆత్మ సాక్ష్యమిస్తుంది, అదే విషయం సృష్టిలో ఉన్న నిదర్శనాలు, సూచనలు మనకు సూచిస్తూ ఉన్నాయి.

ఇక, అల్లాహ్ ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మూడు విషయాలను బాగా అవగాహన చేసుకోవాలి. ఆ మూడు విషయాలు ఏమిటంటే:

మొదటి విషయం: అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని నమ్మాలి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టికర్త, వస్తువులన్నింటినీ ఆయనే సృష్టించాడు, అన్నింటికీ ఆయనే యజమాని, ఆయన వద్దే సర్వాధికారాలు ఉన్నాయి అని విశ్వసించాలి. దీనిని అరబీ భాషలో తౌహీద్ అర్-రుబూబియ్య అంటారు.

ఖురాను గ్రంథం 39వ అధ్యాయం, 62వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ
(అల్లాహు ఖాలిఖు కుల్లి షైఇన్)
అన్ని వస్తువులనూ సృష్టించినవాడు అల్లాహ్‌యే.”  (39:62)

జనన మరణాలను ప్రసాదించువాడు, ఉపాధి ప్రసాదించువాడు, లాభనష్టాలు కలిగించువాడు, సంతానము ప్రసాదించువాడు, వర్షాలు కురిపించువాడు, పంటలు పండించువాడు, సర్వాధికారాలు కలిగి ఉన్నవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అని మనము తెలుసుకొని విశ్వసించాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గురించి తెలుసుకోవటానికి మరో రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ ఒక్కడే ఆరాధనలన్నింటికీ అర్హుడు అని నమ్మాలి. దీనిని అరబీ భాషలో తౌహీద్ ఉలూహియ్య అంటారు.

ఆరాధనలు ప్రత్యక్షమైన ఆరాధనలు ఉన్నాయి, గుప్తమైన ఆరాధనలు ఉన్నాయి, చిన్న ఆరాధనలు ఉన్నాయి, పెద్ద ఆరాధనలు ఉన్నాయి. ఆరాధన ఏదైనా సరే, ప్రతి ఆరాధనకు అర్హుడు అల్లాహ్ ఒక్కడే అని మనము తెలుసుకొని నమ్మాలి. ఆ తర్వాత ప్రతి చిన్న, పెద్ద, బహిరంగమైనది, గుప్తమైనది ఆరాధన ఏదైననూ అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి, ఎందుకంటే ఆరాధనలకు అర్హుడు ఆయన ఒక్కడే కాబట్టి.

ప్రత్యక్ష ఆరాధనలు ఏవి? గుప్తమైన ఆరాధనలు ఏవి? అంటే నమాజు, ఉపవాసము, దుఆ, జంతుబలి, ఉమ్రా, హజ్, ఇవన్నీ ప్రత్యక్షంగా కంటికి కనిపించే ఆరాధనలు. గుప్తమైన ఆరాధనలు అంటే అల్లాహ్ పట్ల అభిమానం, అల్లాహ్ మీద నమ్మకం, అల్లాహ్ తో భయపడటం, ఇవి పైకి కనిపించని రహస్యంగా, గుప్తంగా ఉండే ఆరాధనలు. ఈ ఆరాధనలు అన్నీ కూడాను మనము కేవలం అల్లాహ్ కోసమే చేయాలి.

ఆరాధనల గురించి ఒక రెండు ముఖ్యమైన విషయాలు మీ ముందర ఉంచి నా మాటను ఇన్షా అల్లాహ్ ముందుకు కొనసాగిస్తాను. అసలు ఆరాధన ఎంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను, జిన్నాతులను ఈ ఆరాధన కోసమే సృష్టించాడు అని తెలియజేసి ఉన్నాడు.

ఖురాను గ్రంథం 51వ అధ్యాయము, 56వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
(వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియ’బుదూన్)
“నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే.” (51:56)

చూశారా? మానవులు మరియు జిన్నాతులు అల్లాహ్ ను ఆరాధించటానికి సృష్టించబడ్డారు. మరి ఏ విషయం కోసం అయితే మానవులు సృష్టించబడ్డారో, అదే విషయాన్ని విస్మరిస్తే ఎలాగ? కాబట్టి ఆరాధన ముఖ్యమైన విషయం, మన పుట్టుక అందుకోసమే జరిగింది కాబట్టి, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ ఉండాలి.

అలాగే, ప్రవక్తలు పంపించబడినది మరియు దైవ గ్రంథాలు అవతరింపజేయబడినది కూడా మానవులు అల్లాహ్ ను ఆరాధించటం కోసమే. మానవులు షైతాను వలలో చిక్కి, ఎప్పుడైతే అల్లాహ్ ను మరిచిపోయారో, అల్లాహ్ ను ఆరాధించటం మానేశారో, అల్లాహ్ ను వదిలి బహుదైవారాధన, మిథ్యా దేవుళ్ళను ఆరాధించడం ప్రారంభించారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలను మళ్ళీ రుజుమార్గం పైకి తీసుకురావటానికి, అల్లాహ్ ను ఆరాధించే వారిలాగా చేయటానికి ప్రవక్తలను పంపించాడు, దైవ గ్రంథాలు అవతరింపజేశాడు.

చూడండి ఖురాను గ్రంథం 16వ అధ్యాయం, 36వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
(వలఖద్ బ’అస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అని’బుదుల్లాహ వజ్తనిబుత్ తాఘూత్)

మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము. గా ఉండండి” అని బోధపరచాము.” (16:36)

చూశారా? ప్రవక్తలు వచ్చింది ఎందుకోసం అంటే అల్లాహ్ ఒక్కడే ఆరాధనలకు అర్హుడు, ఆయననే ఆరాధించండి, మిథ్యా దేవుళ్ళను ఆరాధించకండి అని చెప్పటానికే వచ్చారు. అందుకోసమే గ్రంథాలు అవతరింపజేయబడ్డాయి. కాబట్టి ఆరాధన ముఖ్యమైనది. ఆరాధనలు మనము అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి.

ఇక, ఆరాధన స్వీకరించబడాలంటే రెండు ముఖ్యమైన షరతులు ఉంటాయండి. ఒక షరతు ఏమిటంటే అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే ఆరాధనలు చేయాలి, దీనిని అరబీ భాషలో ఇఖ్లాస్ లిల్లాహ్ అంటారు. రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారమే ఆరాధనలు చేయాలి. అరబీ భాషలో దీనిని ముతాబి’అతు సున్నతి రసూలిల్లాహ్ అంటారు. ఆరాధన స్వీకరించబడాలంటే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజము కాబట్టి, ప్రతి ఆరాధన అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే చేయాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి చూపించిన పద్ధతి ప్రకారము చేయాలి. అప్పుడే ఆ ఆరాధన స్వీకరించబడుతుంది.

ఇక, అల్లాహ్ ను కాకుండా ఇతరులను ఆరాధిస్తే, అది బహుదైవారాధన అనిపించుకుంటుంది, దానిని అరబీ భాషలో షిర్క్ అంటారో. బహుదైవారాధన, షిర్క్, పెద్ద నేరము, క్షమించరాని నేరము. ఎట్టి పరిస్థితిలో ఆ నేరానికి పాల్పడకూడదు అని తెలియజేయడం జరిగింది.

ఇక, అల్లాహ్ ను తెలుసుకోవటానికి మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ కు పవిత్రమైన నామాలు, పేర్లు ఉన్నాయి, వాటిని ఉన్నది ఉన్నట్టుగానే విశ్వసించాలి. దీనిని అరబీ భాషలో తౌహీదుల్ అస్మా వస్సిఫాత్ అంటారు. ఈ పేర్లలో అల్లాహ్ యొక్క గుణాలు తెలియజేయడం జరిగి ఉంది. కాబట్టి అందులో ఎలాంటి వక్రీకరణ చేయకుండా, మన ఇష్టానుసారంగా అర్థాలు తేకుండా, ఏ విధంగా అయితే అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేసి ఉన్నారో, ఆ ప్రకారము ఉన్నది ఉన్నట్టుగానే విశ్వసించాలి.

ఉదాహరణకు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు రహ్మాన్, రహీమ్ అని పేర్లు ఉన్నాయి. రహ్మాన్, రహీమ్ అంటే అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అని. అలాగే అల్లాహ్ కు సమీ’, బసీర్ అనే పేర్లు ఉన్నాయి. సమీ’ అంటే వినేవాడు, బసీర్ అంటే చూసేవాడు అని అర్థం. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు రజ్జాఖ్, గఫూర్ అని పేర్లు ఉన్నాయి. రజ్జాఖ్ అంటే ఉపాధి ప్రదాత, గఫూర్ అంటే మన్నించేవాడు, క్షమించేవాడు. ఆ ప్రకారంగా, అల్లాహ్ యొక్క గుణాలను, అల్లాహ్ యొక్క లక్షణాలను తెలిపే చాలా పేర్లు ఉన్నాయి. అవి ఉన్నది ఉన్నట్టుగానే మనము విశ్వసించాలి.

ఇక, ఈ అల్లాహ్ యొక్క నామాల ద్వారా మనము అల్లాహ్ తో దుఆ చేస్తే, ఆ దుఆ తొందరగా స్వీకరించబడటానికి అవకాశం ఉంటుంది.

ఖురాను గ్రంథం 7వ అధ్యాయం, 180 వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్’ఊహు బిహా)
అల్లాహ్‌కు మంచి మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి.” (7:180)

అల్లాహ్ కు ఉన్న పేర్లతో ఆయన్నే పిలవండి అని అల్లాహ్ చెప్పాడు కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు, ఉదాహరణకు మనతో పాపము దొర్లింది, మన్నించమని మనం అల్లాహ్ తో వేడుకుంటున్నామంటే, “ఓ పాపాలను మన్నించే ప్రభువు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, యా గఫూర్, ఓ పాపాలను మన్నించే ప్రభువా, ఓ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, నీవు గఫూర్, పాపాలను మన్నించేవాడివి, నన్ను మన్నించు” అని వేడుకోవాలి. అలా వేడుకుంటే చూడండి, ప్రార్థనలో ఎంత విశిష్టత వస్తూ ఉందో చూశారా? ఆ ప్రకారంగా మనము వేడుకోవాలి.

ఇవి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను పూర్తిగా విశ్వసించటానికి ఈ మూడు ముఖ్యమైన విషయాలు. అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని, అల్లాహ్ ఒక్కడే ఆరాధనలన్నింటికీ అర్హుడు అని, అల్లాహ్ కు పేర్లు ఉన్నాయి అని, ఈ మూడు విషయాలను మనం అవగాహన చేసుకుంటే అల్లాహ్ మీద మనకు సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది.

ఈ మూడింటిలో నుండి ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాము, మిగతా రెండు విషయాలని మనము వదిలేశాము అంటే అప్పుడు మన విశ్వాసము అల్లాహ్ మీద సంపూర్ణము కాజాలదు. ఉదాహరణకు, మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించే సమయానికి అల్లాహ్ గురించి తెలుసుకొని ఉన్నారు. ఒక విషయం మాత్రమే తెలుసుకున్నారు: సృష్టి మొత్తానికి అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త, ఆయన వద్దే సర్వాధికారాలు ఉన్నాయని ఆ ఒక్క విషయాన్ని మాత్రమే వారు తెలుసుకున్నారు. కానీ ఆరాధనల విషయంలో మాత్రం వారు తప్పు చేసేవారు, విగ్రహాలను ఆరాధించేవారు. అల్లాహ్ కు గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయన్న విషయాన్ని వారు విశ్వసించే వారు కాదు. కాబట్టి వారి విశ్వాసము అసంపూర్ణము అని చెప్పబడింది, వారు విశ్వాసులు కారు అని చెప్పబడింది. కాబట్టి, అల్లాహ్ మీద మన విశ్వాసము పూర్తి అవ్వాలంటే, అల్లాహ్ గురించి ఈ మూడు విషయాల అవగాహన చేసుకుని మనము నమ్మాలి, ఆచరించాలి.

అల్లాహ్ మీద విశ్వాసం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తెలుసుకొని విశ్వసిస్తాడో అతనిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదుకుంటాడు, సహకరిస్తాడు, అతని కోరికలు తీరుస్తాడు, సమస్యలు పరిష్కరిస్తాడు. అలాగే, అల్లాహ్ ను విశ్వసించిన వ్యక్తి మంచి జీవితం గడుపుతాడు. మార్గభ్రష్టత్వానికి గురి అయ్యి పశువుల్లాగా, చాలామంది చేస్తున్న చేష్టలకు దూరంగా ఉంటాడు. అలాగే మనిషి అల్లాహ్ ను విశ్వసించటము ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ప్రసన్నత పొందుతాడు.

ఇవి అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి మనము తెలుసుకొనవలసిన ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30628


అల్లాహ్ (త’ఆలా) – మెయిన్ పేజీ:
https://teluguislam.net/allah/

అల్లాహ్ మనతోపాటు ఏ విధంగా అతి దగ్గరలోనే ఉన్నాడు? [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ మనతోపాటు ఏ విధంగా అతి దగ్గరలోనే ఉన్నాడు?
https://youtu.be/aLKl1fLh9eQ [13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ

“(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవు వారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగల్గుతారు.” (సూర బఖర 2:186)

అల్లాహ్ మనతో పాటు ఉన్నాడన్న విశ్వాసం “అల్లాహ్ పై విశ్వాసం”లోని ఓ ముఖ్యమైన భాగం. అరబీలో ‘మఇయ్యతుల్లాహ్’ అనబడుతుంది. అల్లాహ్ తనకు తగిన రీతిలో ఏడు ఆకాశాల పైన తన అర్ష్ పై ఉన్నాడు. ఇందులో ఏ అనుమానం లేదు. ఖుర్ఆనులో ఎన్నో ఆయతులున్నాయి. ఉదాహరణకు చూడండి సూర తాహా 20:5

అయితే ఇది (‘మఇయ్యతుల్లాహ్’) రెండు రకాలు 1: ‘మఇయ్య ఆమ్మ’ 2: ‘మఇయ్య ఖాస్స’

1: ‘మఇయ్య ఆమ్మ’ అంటే అల్లాహ్ తన అర్ష్ పై ఉండి కూడా సర్వ సృష్టి వెంట ఉన్నాడు, అంటే సర్వ సృష్టిపై దృష్టి పెట్టి ఉన్నాడు, వారిని చూస్తూ వింటూ ఉన్నాడు. దీనికి దివ్య ఖుర్ఆన్ సూర హదీద్ 57:4 లో ఉంది:

هُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۖ وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنتُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ

“ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు. భూమి లోపలికి పోయేదీ, అందులో నుంచి బయల్పడేదీ, ఆకాశం నుంచి క్రిందికి దిగేదీ, మరందులోకి ఎక్కిపోయేదీ – అంతా ఆయనకు (బాగా)తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.” (సూర హదీద్ 57:4)

2: ‘మఇయ్య ఖాస్స’: అంటే పై భావంతో పాటు ప్రత్యేకంగా తన ప్రవక్తల, విశ్వాసులకు తోడుగా, మద్దతుగా, సహాయంగా ఉన్నాడని కూడా భావం వస్తుంది.

దీనికి ఆధారంగా అనేక ఆయతులు హదీసులున్నాయి.

قَالَ لَا تَخَافَا ۖ إِنَّنِي مَعَكُمَا أَسْمَعُ وَأَرَىٰ

“మీరు ఏ మాత్రం భయపడకండి. నేను మీతోనే ఉన్నాను. అంతా వింటూ, చూస్తూ ఉంటాను” అని సమాధానమిచ్చాడు అల్లాహ్. (సూర తాహా 20:46)

… إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا ۖ أَنزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَيْهِ وَأَيَّدَهُ بِجُنُودٍ لَّمْ تَرَوْهَا…

“బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్‌ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు. (ఆ ఘడియలో) అల్లాహ్‌ తన తరఫునుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. (సూర తౌబా 9:40)

 إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ
“నిశ్చయంగా అల్లాహ్‌ తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి, సద్వర్తనులకు తోడుగా ఉంటాడు.” (సూర నహ్ల్ 16:128)

పై మూడు ఆయతుల వ్యాఖ్యానంలో ఇమాం ఇబ్ను తైమియా (రహిమహుల్లాహ్) చెప్పారు:

“అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు అబూ బక్ర్ కు తోడుగా ఉండి, సహాయ పడ్డాడు అబూ జహల్ మరియు ఇతర శత్రువులకు వ్యెతిరేకంగా, మూసా (అలైహిస్సలాం) మరియు హారూన్ (అలైహిస్సలాం)కు తోడుగా ఉండి, సహాయం అందించాడు ఫిర్ఔన్ కు వ్యెతిరేకంగా, ఇంకా భక్తిపరులకు, సద్వవర్తనులకు తోడుగా ఉండి, సహాయపడ్డాడు పాపాత్ములు, దౌర్జన్యపరులకు వ్యెతిరేకంగా.”

(మజ్మూఉల్ ఫతావా 11/ 249-250)

ఈ ప్రసంగంలో అల్లాహ్ మనతో ఎలా ఉన్నాడు (మయ్యతుల్లాహ్) అనే భావనను ఇస్లామీయ విశ్వాసం ప్రకారం వివరించబడింది. అల్లాహ్ ప్రతిచోటా భౌతికంగా ఉన్నాడు అనే సాధారణ తప్పుడు అభిప్రాయాన్ని ఖండిస్తూ, సరైన విశ్వాసం ప్రకారం అల్లాహ్ ఏడు ఆకాశాలపైన, తన అద్వితీయతకు తగిన విధంగా అర్ష్ (సింహాసనం) పై ఉన్నాడని ఖురాన్ ఆధారాలతో స్పష్టం చేయబడింది. అల్లాహ్ యొక్క సామీప్యం రెండు రకాలుగా ఉంటుందని వివరించారు. మొదటిది ‘మఇయ్య ఆమ్మ’ (సాధారణ సామీప్యం), ఇది సర్వ సృష్టికి వర్తిస్తుంది. అంటే అల్లాహ్ తన జ్ఞానం, దృష్టి మరియు వినికిడి ద్వారా ప్రతిదాన్ని గమనిస్తూ, పరివేష్టించి ఉన్నాడు. రెండవది ‘మఇయ్య ఖాస్సా’ (ప్రత్యేక సామీప్యం), ఇది కేవలం ప్రవక్తలు మరియు విశ్వాసులకు మాత్రమే లభిస్తుంది. ఇది అల్లాహ్ యొక్క ప్రత్యేక సహాయం, మద్దతు మరియు మార్గదర్శకత్వం రూపంలో ఉంటుంది. ఈ రెండు రకాల సామీప్యాలను వివరించడానికి ప్రవక్తలు మూసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితాల నుండి ఖురాన్‌లో పేర్కొనబడిన సంఘటనలను ఉదాహరణలుగా చూపించారు.

అల్లాహ్ మనతో పాటు ఏ విధంగా అతి దగ్గరిలోనే ఉన్నాడు? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో చాలామంది ఏమంటారు? అల్లాహ్ హర్ జగహ్ హై (అల్లాహ్ ప్రతిచోటా ఉన్నాడు). అల్లాహ్ హమారే దిల్ మే హై (అల్లాహ్ మా హృదయాల్లో ఉన్నాడు). ఇంకా దీనికి సంబంధించిన కొన్ని శ్లోకాలు గేయాల మాదిరిగా చదువుతూ ఉంటాడు. అందు లేడు ఇందు గలడు ఈ విధంగా. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని మనం చెప్పవద్దు. అల్లాహ్ అంతటా ఉన్నాడు, ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు, మస్జిద్ లో ఉన్నాడు, చర్చిలో ఉన్నాడు, ఫలానా ఫలానా ఏమేమో అంటూ ఉంటారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్.

సరైన ఇస్లామీయ విశ్వాసం

సరియైన విశ్వాసం అల్లాహ్ గురించి, అల్లాహు తఆలా తన అస్తిత్వంతో ఏడు ఆకాశాలపైన అర్ష్ పై ఉన్నాడు. అయితే, అల్లాహు తఆలా మనతో ఉన్నాడు అని మనం ఏదైతే అంటామో, దీనిని

معية الله
మఇయ్యతుల్లాహ్ అని అరబీలో అనడం జరుగుతుంది.

అల్లాహు తఆలా అర్ష్ పై ఉన్నాడు, ఖురాన్‌లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకు:

الرَّحْمَٰنُ عَلَى الْعَرْشِ اسْتَوَىٰ
అర్రహ్మాను అలల్ అర్షిస్తవా
(ఆ కరుణామయుడు) సింహాసనంపై ఆసీనుడయ్యాడు.
(సూరతు తాహా, సూర నంబర్ 20, ఆయత్ నంబర్ 5).

అయితే ఈ మఇయ్యతుల్లాహ్, అల్లాహ్ మన వెంట ఉన్నాడు అనే భావం ఏదైతే మనం, మాట ఏదైతే మనం పలుకుతామో, ఇందులో రెండు భావాలు వస్తాయి, రెండు రకాలు వస్తాయి. ఒకటి మఇయ్య ఆమ్మ, రెండవది మఇయ్య ఖాస్స.

మఇయ్య ఆమ్మ (సాధారణ సామీప్యం)

మఇయ్య ఆమ్మ అంటే ఏంటి? అంటే అల్లాహ్ తన అర్ష్ పై ఉండి కూడా, సర్వ సృష్టి వెంట ఉన్నాడు. అంటే, సర్వ సృష్టిపై దృష్టి పెట్టి ఉన్నాడు, వారిని చూస్తూ ఉన్నాడు, వారిని వింటూ ఉన్నాడు, వారి గురించి అల్లాహ్ కు సర్వమూ తెలుసు. అమావాస్య చీకటి రాత్రి అయినా, లేకుంటే ఎలాంటి మబ్బు లేని, దుమ్ము లేని పట్టపగలు మిట్ట మధ్యాహ్నం వెలుతురులోనైనా, అల్లాహ్ కు అంతా కూడా సమానమే. ఒక్కసారి సూరతుల్ హదీద్, సూర నంబర్ 57, ఆయత్ నంబర్ 4 చదవండి. శ్రద్ధగా దీని అర్థ భావాలను గమనించండి.

هُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنْزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۖ وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنْتُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ

ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని (అర్ష్) అధిష్టించాడు. భూమి లోపలికి పోయేది, అందులో నుంచి బయల్పడేది, ఆకాశం నుంచి క్రిందికి దిగేది, మరి అందులోకి ఎక్కిపోయేది అంతా ఆయనకు బాగా తెలుసు. మీరెక్కడా ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లాహు తఆలా చూస్తూనే ఉన్నాడు.

గమనించండి, అల్లాహ్ ఎక్కడున్నాడు? ఇస్తవా అలల్ అర్ష్ (అర్ష్ పై ఆసీనుడయ్యాడు) ఆ విషయం ఇందులోనే వచ్చేసింది. యఅలము (ఆయనకు తెలుసు), అల్లాహ్ కు అంతా తెలుసు. భూమిలోకి వెళ్లేది, భూమి నుండి బయటికి వచ్చేది, ఆకాశం నుండి దిగేది, ఆకాశం వైపునకు ఎక్కేది, అంతా కూడా అల్లాహ్ కు తెలుసు, అల్లాహ్ జ్ఞానంలో ఉంది. వహువ మఅకుమ్ (ఆయన మీకు తోడుగా ఉన్నాడు). అర్ష్ పై ఉండి అల్లాహ్ మీకు తోడుగా ఎలా ఉన్నాడు? అంటే ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయనకు తెలుసు అంతా కూడా, ఆయన వింటూ ఉన్నాడు. అందుకొరకే ఆయత్ యొక్క చివరి భాగం ఏముంది?

وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
వల్లాహు బిమా తఅమలూన బసీర్
మీరు చేసే పనులన్నింటినీ కూడా అల్లాహ్ చూస్తూ ఉన్నాడు.

ఇది మఇయ్య ఆమ్మ, అంటే సర్వము ఈ సృష్టిలో ఉన్న ప్రతీ ఒక్కటి ఆయన వినుట, ఆయన యొక్క చూచుట, ఆయన యొక్క జ్ఞానం నుండి బయట ఏదీ లేదు.

మఇయ్య ఖాస్సా (ప్రత్యేక సామీప్యం)

ఇక మరొకటి రెండవ రకం మయ్య ఖాస్సా. ప్రత్యేకమైన తోడు. అదేమిటి? అంటే, ప్రత్యేకంగా తన ప్రవక్తల, విశ్వాసులకు తోడుగా, మద్దతుగా, సహాయంగా ఉన్నాడు అన్నటువంటి భావం కూడా వస్తుంది. దీనికి ఆధారాలు కూడా ఖురాన్ మరియు హదీసులలో ఎన్నో ఉన్నాయి.

ఉదాహరణకు సూరె తాహా, సూర నంబర్ 20, ఆయత్ నంబర్ 46 గమనించండి. మూసా అలైహిస్సలాం వారిని మరియు ఆయన యొక్క సోదరుడు హారూన్ అలైహిస్సలాంను అల్లాహు తఆలా ఫిరౌన్, ఎలాంటి దౌర్జన్యపరుడైన రాజు, తనకు తానే ప్రభువుగా అన్నాడు, అలాంటి రాజు వద్దకు పంపుతూ, అల్లాహు తఆలా మంచి బోధనలు చేసి మీరు ఎంతో మృదువుగా అతన్ని ఏకత్వం వైపునకు పిలవండి అని చెప్పారు. ఆ సందర్భంలో చిన్నపాటి ఒక కొంత భయం ఏదైతే కలిగిందో, స్టార్టింగ్ లో, ఎందుకంటే మూసా అలైహిస్సలాం ఫిరౌన్ యొక్క ప్యాలెస్ లోనే పెరిగారు కదా. అయితే, అక్కడ ఈ విషయాలను గుర్తుంచుకొని కొంచెం ఒక చిన్నపాటి భయం లాంటిది ఏదైతే కలిగిందో, అల్లాహు తఆలా ఈ ఆయత్, ఆయత్ నంబర్ 46, మీరు దానికంటే ముందు తర్వాత ఆయతులు ఖురాన్ తీసి చదవండి. ఈ ఆయతులో అల్లాహ్ ఏమంటున్నాడు?

قَالَ لَا تَخَافَا ۖ إِنَّنِي مَعَكُمَا أَسْمَعُ وَأَرَىٰ
ఖాల లా తఖఫా, ఇన్ననీ మఅకుమా అస్మఊ వ అరా
(అల్లాహ్ అన్నాడు) మీరిద్దరూ భయపడకండి. నిశ్చయంగా నేను మీతోనే ఉన్నాను, నేను అంతా వింటూ ఉన్నాను మరియు చూస్తూ ఉన్నాను
.

మీరు చేస్తున్నది గాని, ఫిరౌన్ మీ పట్ల ఎలా ప్రవర్తిస్తాడు ఇదంతా నేను చూస్తూనే ఉన్నాను. అల్లాహు అక్బర్.

విశ్వాసి అల్లాహ్ యొక్క ఏదైనా ఆదేశాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు, కొందరు ఎవరైనా వ్యతిరేకులు బెదిరిస్తున్నప్పుడు, అల్లాహ్ నాకు తోడుగా ఉన్నాడు, అల్లాహ్ యొక్క సహాయం నాకు లభిస్తుంది అన్నటువంటి పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. ఇలాంటి ఈ భావాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు, సూరతుత్ తౌబా, సూర నంబర్ 9, ఆయత్ నంబర్ 40 చదవండి.

إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا
ఇజ్ యఖూలు లిసాహిబిహీ లా తహ్జన్ ఇన్నల్లాహ మఅనా
అతను తన సహచరునితో, “విచారించకు, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు” అని అన్న సందర్భం.

ఇందులో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ప్రస్తావన ఉంది. దీని యొక్క వ్యాఖ్యానం మీరు తెలుగు అహ్సనుల్ బయాన్, ఇంకా హదీసుల్లో కూడా చూడవచ్చు. సంక్షిప్త విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గార్-ఎ-సౌర్ లో మూడు రోజుల వరకు ఉన్నారో, మదీనా వలస పోయే సందర్భంలో, అక్కడ హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తఆలా అన్హు వారికి చాలా బాధ కలుగుతూ ఉండింది, శత్రువులు చూశారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఎంత తలబిరుసుతనంతో, దుష్ప్రవర్తనతో మెలగుతారో ఏమో అని. ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత మంచి రీతిలో అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారికి ధైర్యం చెప్పారో గమనించండి.

ఇజ్ యఖూలు లిసాహిబిహీ, అప్పుడు ఆ సందర్భంలో తన మిత్రుడైన, ఆ సందర్భంలో తన వెంట ఉన్నటువంటి మిత్రునికి, ‘లా తహజన్‘, నీవు బాధపడకు. ‘ఇన్నల్లాహ మఅనా‘, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, అని ఓదార్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? అల్లాహ్ తఆలా ఆ ఘడియలో ప్రవక్తపై ప్రశాంతతను అవతరింపజేశాడు.

وَأَيَّدَهُ بِجُنُودٍ لَمْ تَرَوْهَا
వఅయ్యదహు బిజునూదిల్ లమ్ తరౌహా
మరియు మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు.

మూసా అలైహిస్సలాం, వెనక ఫిరౌన్ యొక్క లష్కర్, సైన్యం. ముంగట సముద్రం ఉంది. ‘ఇన్నాలముద్రకూన్‘ (నిశ్చయంగా మేము చిక్కిపోయాము) అని భయాందోళనకు గురియై అరుస్తున్నారు బనూ ఇస్రాయీల్. అప్పుడు మూసా అలైహిస్సలాం ఎంత నమ్మకంతో, దృఢమైన విశ్వాసంతో, పూర్తి ధీమాతో,

إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
ఇన్న మఇయ రబ్బీ సయహ్దీన్
నిశ్చయంగా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. నాకు మార్గదర్శకం చేస్తాడు, దారి చూపుతాడు.

ఎంత గొప్ప నమ్మకమో చూడండి. ఆ నమ్మకం ప్రకారంగా అల్లాహ్ యొక్క సహాయం అందిందా లేదా? అందింది. సముద్రంలో మార్గాలు, నీళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోయి దారి అయిపోయింది. ఇటునుండి అటు దాటిపోయారు. అదే దారి మీద ఫిరౌన్ వచ్చాడు. అల్లాహు తఆలా సముద్రానికి ఆదేశించాడు, సముద్రం కలిసిపోయింది, నీళ్ళల్లో అదే సముద్రంలో, ఏ సముద్రంలో నుండైతే వీరికి మార్గం దొరికింది మరియు దాటిపోయారో, అదే సముద్రంలో ఫిరౌన్ మరియు అతని యొక్క సైన్యాన్ని అల్లాహు తఆలా ముంచి వేశాడు. అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాల పట్ల మనం ఏ రవ్వంత కూడా శంకించకూడదు మరియు వ్యతిరేకించి, అల్లాహ్ ను ధిక్కరించి అతని ఆదేశాలకు వ్యతిరేకంగా నడవకూడదు.

ఇలాంటి భావాలు చూస్తే ఇంకా ఎన్నో ఉన్నాయి. సూరతున్ నహల్ లో కూడా మీరు చదవండి. సూర నంబర్ 16, ఆయత్ నంబర్ 128. ఇమామ్ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్ ఈ సూరె నహల్ మరియు సూరె తౌబా, సూరె తాహా యొక్క ఆయతులు ఏవైతే సంక్షిప్తంగా చెప్పడం జరిగిందో వాటి యొక్క వ్యాఖ్యానంలో చెప్పారు, ఇమామ్ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ కు తోడుగా ఉండి సహాయపడ్డాడు, అబూ జహల్ మరియు ఇతర శత్రువులకు వ్యతిరేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయం చేశాడు. ఇక మూసా అలైహిస్సలాం మరియు హారూన్ అలైహిస్సలాంకు తోడుగా ఉండి సహాయం అందించాడు ఫిరౌన్ కు వ్యతిరేకంగా. అలాగే, ‘ఇన్నల్లాహ మఅల్లజీనత్తఖౌ వల్లజీన హుమ్ ముహ్సినూన్’ సూరతున్ నహల్. విశ్వాసులకు తోడుగా ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నవారి మరియు సద్వర్తన కలిగి ఉన్నవారికి తోడుగా ఉన్నాడు, ఎవరికి వ్యతిరేకంగా? దౌర్జన్యపరులకు, పాపాత్ములకు వ్యతిరేకంగా. ఇమామ్ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్ యొక్క మాట ఇది. మజ్మూఉల్ ఫతావాలో ఉంది. వాల్యూమ్ నంబర్ 11, పేజ్ నంబర్ 249, 250.

అల్లాహ్ పై మనం దృఢమైన నమ్మకం కలిగి ఉండాలి. అల్లాహ్ యొక్క విశ్వాసం దృఢంగా మనలో నిండి ఉండే విధంగా సత్కార్యాలు చేస్తూ ఉండే విధంగా అల్లాహ్ మనందరికీ భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

అల్లాహ్ (తఆలా) – (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1t8VyQxAKsZ5-yfRrX-ugp