విగ్రహాల, స్మారక చిహ్నాల పట్ల భక్తి ప్రపత్తులు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అరబీలో ‘తమాసీల్‘  అనబడుతుంది. అంటే విగ్రహాలు, స్థూపాలు అని అర్థం. అవి మానవ రూపంలోగానీ, జంతువుల రూపంలోగానీ, మరేదైనా సజీవ వస్తువు ఆకారంలోగానీ చెక్కబడి ఉంటాయి. ‘నుసుబ్‌’ అంటే ఒక చిహ్నం (జెండా) లేక ప్రత్యేక రాయి. అక్కడ బహుదైవారాధకులు బలి ఇస్తారు. “స్మారక చిహ్నాలు” అంటే ప్రజలు బహిరంగ స్థలాలలో తమ నాయకుల గౌరవార్థం, వారి ఘనకార్యాల స్మారకార్థం నిర్మించుకుని ప్రతిష్టించే స్థూపాలు లేక విగ్రహాలు.

సజీవుల ఆకారం వే(చే)యటాన్ని మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారించారు. ముఖ్యంగా సమాజంలోని ప్రముఖుల, ఆదరణీయుల రూపాలను వేయరాదు. ఉదాహరణకు: రాజులు, విద్వాంసులు, సజ్జనులు, సన్యాసులు, నాయకుల రూపచిత్రాలు. ఈ చిత్రాలు పలకపై వేసినా, కాగితంపై గీసినా, గోడపై చిత్రీకరించినా, దుస్తులపై వేయబడినా, కెమెరాల ద్వారా తీయబడినవైనా, శిలలపై చెక్కబడినా – ఇవన్నీ ధార్మికంగా నిషిద్ధమే (హరామే).

అలాగే గోడలపై చిత్ర పటాలను వ్రేలాడదీయటం, విగ్రహాలను ప్రతిష్టించటం కూడా ఈ కోవకు చెందినవే. స్మారక చిహ్నాలు ఇందులోకే వస్తాయి. దేవుని ఈ భూమిపై మొట్టమొదటిసారి షిర్క్‌ ఈ రూపచిత్రాల, విగ్రహ ప్రతిష్టాపన ద్వారానే పొడసూపింది. దైవప్రవక్త హజ్రత్‌ నూహ్‌ ( అలైహిస్సలాం) జాతిలో కొంతమంది పుణ్య పురుషులుండేవారు. వారి మరణం పట్ల ఆ జాతివారు తీవ్రంగా దుఃఖించారు. ఆ సమయంలో షైతాన్‌ రంగప్రవేశం చేసి, ఆ పుణ్య పురుషులు కూర్చునే సభాస్థలిలో వారి విగ్రహాలను ప్రతిష్టించి, వాటిపై వారి పేర్లను వ్రాయమని ఆ ప్రజల ఆంతర్యాల్లో ప్రేరేపించాడు. వారు అలాగే చేశారు. ఆ సమయంలో వారు ఆ విగ్రహాలను పూజించలేదు. వారు మరణించిన తరువాత వారి తరువాతి తరాల వారు ఆ విగ్రహాలను పూజించటం మొదలెట్టారు. ఎందుకంటే ఆ విగ్రహాలను ప్రతిష్టించటం వెనుక వాస్తవికత వారికి తెలీదు. ఆ విధంగా నూహ్‌ జాతి వారిలో విగ్రహారాధన చోటు చేసుకుంది. (సహీహ్‌ బుఖారీ)

ఈ విగ్రహారాధన రూపంలో పొడసూపిన షిర్క్‌ నుండి నిరోధించేందుకు అల్లాహ్ తన ప్రవక్త నూహ్‌ (అలైహిస్సలాం)ను పంపాడు. కాని నూహ్‌ పిలుపును ఆ జాతి జనులు త్రోసిపుచ్చారు. విగ్రహ రూపంలో ఉన్న తమ పూర్వీకుల పూజపై స్థిరంగా ఉండిపోయారు. పైగా వారిలా అన్నారు :

وَقَالُوا لَا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا

“ఎట్టి పరిస్థితిలోనూ మీ పూజ్య దైవాలను వదలకండి. వద్ద్‌ను, సువాను గానీ,  యగూస్‌, యవూఖ్‌, నస్ర్ లను గానీ వదలిపెట్టకండి.”(నూహ్‌:23)

(1) వద్ద్‌(2) సువా (3) యగూస్‌ (4) యవూఖ్‌ (5) నస్ర్ – ఇవి చనిపోయిన పుణ్య పురుషుల పేర్లు. వారి స్మారకార్థం వారి పేర్లతో మొదట విగ్రహాలను ప్రతిష్టించారు. కాని అవే చివరకు పూజనీయం అయ్యాయి.

చూశారా! కేవలం స్మారక చిహ్నాలుగా ప్రతిష్టించబడిన విగ్రహాలు ఎలా షిర్మ్‌కు దారితీశాయో! చివరకు ఈ పని దైవప్రవక్త పట్ల శత్రుత్వంగా పరిణమించింది. తత్కారణంగా వారు పెనుతుఫాను ద్వారా అంతమొందించబడ్డారు. వారు దేవుని దృష్టిలోనూ, ప్రజల దృష్టిలోనూ ఆగ్రహించబడినవారుగా నిలిచారు. రూపచిత్రాలు, విగ్రహ ప్రతిష్టాపన ఎంత తీవ్రమైన పనో దీని ద్వారా అవగతమవుతోంది. అందుకే మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) రూపాలను చిత్రించేవారిని థూత్మరించారు. ప్రళయదినాన వారు చాలా తీవ్రమయిన శిక్షకు గురిచేయబడతారని చెప్పారు. రూప చిత్రాలను నిర్మూలించాలని ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఆదేశించారు. ఫోటోలు ఉన్న ఇండ్లల్లో దైవదూతలు ప్రవేశించరని తెలిపారు. ఎందుకంటే వీటి పరిణామం తీవ్రంగా ఉంటుంది. వీటి మూలంగా భూమండలంలో ప్రప్రథమంగా షిర్క్‌ ప్రబలింది. ఈ రకమయిన విగ్రహాలు, చిత్రాలు సభాస్థలాలలో ప్రతిష్టించినా, బహిరంగంగా పెట్టినా, పార్కులలో ప్రతిష్టించినా చెడుకు తొలి మెట్టు!!

అన్యుల సంగతిని అలా ఉంచితే ముస్లిముల కొరకు మాత్రం ఇది ఎట్టి పరిస్థితిలోనూ సమ్మతం కాదు. ఈ విషయంలో వారు అన్యులకు ప్రభావితులై కాల ప్రవాహంలో కొట్టుకుపోరాదు. తమ ధార్మిక విశిష్టతకు మూల సరోవరమయిన ‘విశ్వాసాన్ని’ (అఖీదా) వారు కాపాడుకోవాలి. “మరీ అంత ఇదిగా చెబితే ఎలాగండీ! ధర్మా ధర్మాల గురించి వారికి తెలియదా ఏమి!?” అని దాటవేయటం ఏ విధంగాను సరికాదు. ఎందుకంటారా!? షైతాన్‌ భావితరాల వారిపై దృష్టిని కేంద్రీకరిస్తాడు. భావితరాలలో విషయ పరిజ్ఞానం లోపించగానే ఆ ధూర్తుడు పాదరసంలా పారుతాడు. తన నక్కజిత్తులలో నవతరాలను బోల్తా కొట్టిస్తాడు. నూహ్‌ (అలైహిస్సలాం) జాతి వారి విషయంలో జరిగింది కూడా ఇదే కదా! జ్ఞాన సంపన్నులైన వారి పూర్వీకులు మరణించిన పిదప, భావి తరాలలో అజ్ఞానం ప్రబలింది. మనిషి బ్రతికి ఉన్నన్నాళ్ళూ ఈ ఉపద్రవానికి (షిర్క్‌) లోనయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే దైవప్రవక్త హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అలైహిస్సలాం) అల్లాహ్  ను ఇలా వేడుకున్నారు.

وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ

“(ప్రభూ!) నన్నూ, నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడు.” (ఇబ్రాహీమ్‌ – 35)

అందుకే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) వారు తన స్వవిషయంలో దీని గురించి భయపడ్డారు. అందుకే పూర్వకాలపు సత్పురుషులు ఇలా వ్యాఖ్యానించారు:

“ఇబ్రాహీమ్‌ (అలైహిస్సలాం) తరువాత ఈ విషయంలో ఎవరు మాత్రం నిర్భయంగా ఉండగలరు?”


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 131-132)

అఖీదా-యే-తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం)- డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం]

బిస్మిల్లాహ్

Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
దేవుని ఏకత్వం అఖీదా ఏ తౌహీద్ పుస్తకం
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan దేవుని ఏకత్వం అఖీదా ఏ తౌహీద్ పుస్తకం డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

[ఇక్కడ చదవండి / PDF డౌన్ లోడ్ చేసుకోండి]
https://tinyurl.com/aqeeda-tawheed
[228 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

విషయసూచిక

అల్లాహ్ ఆరాధన (ఇబాదత్) అంటే ఏమిటి? ఆరాధన రకాలు [వీడియో & టెక్స్ట్]

https://youtu.be/bqXH8XAhqW8
[ 15 నిముషాలు]

అల్లాహ్ ఆరాధన (ఇబాదత్) అంటే ఏమిటి? ఆరాధన రకాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

విశ్వాస మూల సూత్రాలు పుస్తకం నుండి .

వీడియో లో ఈ విషయాలు చెప్ప బడ్డాయి:

  • అల్లాహ్ ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన రకాలు
  • అల్లాహ్ ఆరాధన యొక్క సామాన్య భావన
  • అల్లాహ్ ఆరాధన యొక్క ప్రత్యేక భావన
  • హృదయానికి సంబంధించిన ఆరాధనలు – ప్రేమించడం,భయపడడం ..
  • శరీరానికి సంబంధించిన ఆరాధనలు – నమాజు , హజ్ ,ఉపవాసం 
  • ధనానికి సంబంధించిన ఆరాధనలు – జకాత్ , సదఖా 
  • ఆరాధన అల్లాహ్ కు మాత్రమే చెయ్యాలి, లేనియెడల అది షిర్క్ అవుతుంది
  • దుఆ ఇబాదత్ (ఆరాధన)లో ఒక రకం , కేవలం అల్లాహ్ కు మాత్రమే చెయ్యాలి
  • తవక్కుల్  (నమ్మకం, భరోసా) అల్లాహ్ మీద మాత్రమే ఉంచాలి 
  • కష్ట సమయంలో కీడు నుంచి రక్షణ కోరడం, సహాయం అర్ధించడం  
  • మొక్కుబడులు

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఆరు మూల స్తంభాల గురించి, ముఖ్యంగా మొదటి స్తంభమైన అల్లాహ్ పై విశ్వాసం గురించి వివరించబడింది. ఆరాధన అనేది కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించబడాలని, అందులో ఎవరినీ భాగస్వాములుగా చేయరాదని స్పష్టం చేయబడింది. దుఆ (ప్రార్థన), తవక్కుల్ (భరోసా), సహాయం మరియు శరణు వేడటం, మొక్కుబడులు వంటి ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ తోనే చేయాలని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో నొక్కి చెప్పబడింది. ప్రాపంచిక విషయాలలో జీవించి ఉన్న వారి నుండి, వారి శక్తి పరిధిలోని సహాయం కోరడానికి మరియు చనిపోయిన వారి నుండి సహాయం కోరడానికి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా వివరించబడింది. చివరగా, అల్లాహ్ ను విశ్వసించడం ద్వారా కలిగే లాభాల గురించి తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావించారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహీ అజ్మయీన్ అమ్మా బాద్.

సోదర మహాశయులారా! విశ్వాస మూల సూత్రాలు అనే ఈ ముఖ్యమైన శీర్షికలో మనం ఇప్పటివరకు అల్లాహ్ యొక్క దయవల్ల ఆరు పాఠాలు విని ఉన్నాము, తెలుసుకున్నాము. ఈనాటి ఏడవ పాఠం అర్కానే ఈమాన్, విశ్వాస మూల సూత్రాలు. విశ్వాస మూల సూత్రాలు ఎన్ని ఉన్నాయి? ఆరు ఉన్నాయి. ఆరిట్లో మొట్టమొదటిది, ఎక్కువ ప్రాముఖ్యత గలది అల్లాహ్ పై విశ్వాసం. అల్లాహ్ పై విశ్వాసంలో ఎన్నో విషయాలు వస్తాయి. వాటిలోనే ఒక ముఖ్యమైనది ఏమిటి? అల్లాహ్ ను ఆరాధించడం. అల్లాహ్ ఆరాధనలో ఎవరినీ కూడా భాగస్వామిగా చేయకపోవడం.

అయితే ఈ ఒక్క మాటనే సరిపోతుంది. మనల్ని అల్లాహ్ ఆరాధించడానికే పుట్టించాడు గనక ఆయన ఆరాధనలో మనం మరెవరినీ కూడా భాగస్వామిగా చేయకూడదు. అయినా ఆరాధన అని మనం అన్నప్పుడు ఏ ఏ విషయాలు అందులో వస్తాయి? వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

అల్లాహ్ ఆరాధన అని మనం అన్నప్పుడు, ఇందులో ముందు రెండు విషయాలని మీరు అర్థం చేసుకోండి. ఒకటి, అల్లాహ్ ఆరాధన అని మనం అన్నప్పుడు ఒక సామాన్య భావన, మరొకటి ప్రత్యేక భావన. అల్లాహ్ ఆరాధన యొక్క సామాన్య భావం, మరొకటి ప్రత్యేక భావం. ప్రత్యేక భావం అంటే ఏంటి? కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఎలాంటి భాగస్వామ్యం లేకుండా చేసేటువంటి పనులు. అవి మన హృదయానికి సంబంధించినవి ఉన్నాయి, మన ధనానికి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా మన సామాన్య అవయవాలు, నాలుక, చేతులు, కాళ్ళు, శారీరక ఆరాధనలు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైనవి.

ఉదాహరణకు, హృదయానికి సంబంధించినవి ముహబ్బత్, ఇఖ్లాస్, ఖౌఫ్, రజా. సంక్షిప్తంగా ఈ పేర్లు గత ఆరవ పాఠంలో కూడా వచ్చాయి. అంటే అల్లాహ్ ను ఎలా ప్రేమించాలో అలాగ మరెవ్వరినీ కూడా ప్రేమించరాదు. ఏ పనులు మనం అల్లాహ్ కొరకు చేస్తామో అందులో ఇఖ్లాస్, స్వచ్ఛత అనేది ఉండాలి. అంటే ఏ ప్రదర్శనా బుద్ధి, ఏదైనా ప్రపంచ లాభం పొందే ఉద్దేశం అట్లాంటిది ఏదీ కూడా ఉండకూడదు.

అల్లాహ్ తో ఏ రీతిలో మనం భయపడాలో ఆ రీతిలో ఇంకా ఎవరితోనీ కూడా భయపడకూడదు. అల్లాహ్ పట్ల మనం ఎలాంటి ఆశతో ఉండాలో అలాంటి ఆశ ఇంకా ఎవరితోనీ కూడా మనకు ఉండకూడదు. అర్థమైంది కదా?

మన శరీరానికి సంబంధించిన కొన్ని ఆరాధనలు, నమాజ్. నమాజ్ ఇది శరీరానికి సంబంధించిన ఇబాదత్. ధనానికి సంబంధించిన ఇబాదత్ లో దానధర్మాలు, ప్రత్యేకంగా బలిదానం, జిబహ్ చేయడం. ఈ విధంగా నాలుకకు సంబంధమైన ఖురాన్ యొక్క తిలావత్, జిక్ర్. విషయం కొంచెం అర్థమైంది కదా?

అయితే మరి కొన్ని ఆరాధనలు ఉన్నాయి. వాటిలో ఎంతోమంది అల్లాహ్ తో పాటు ఇతరులకు ఆ ఆరాధనలు చేస్తారు. మరియు ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎంతో నొక్కి చెప్పాడు అల్లాహ్ తప్ప వేరే ఎవరికీ అవి చేయకూడదు అని. అయితే వాటి ప్రాముఖ్యత పరంగా, వాటి గురించి ప్రత్యేకమైన ఆధారాలు, దలీల్ ఖురాన్ హదీస్ లో వచ్చి ఉంది గనుక వాటిల్లో కొన్ని మీ ముందు నేను ఉంచి వాటి యొక్క దలీల్ కూడా తెలిపే ప్రయత్నం చేస్తాను.

ఉదాహరణకు, ఆరాధనలో ఒక రకం దుఆ. దుఆ కేవలం ఎవరితోని చేయాలి? అల్లాహ్ తో మాత్రమే చేయాలి. ఎందుకు? దీనికి సంబంధించిన ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. కానీ సూరె ఘాఫిర్, సూరా నెంబర్ 40, ఆయత్ నెంబర్ 60 లో,

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
మీ ప్రభువు చెప్పాడు మీతో కేవలం నాతో మాత్రమే దుఆ చేయండి, మీ దుఆలను అంగీకరించే వాడిని నేను మాత్రమే.

ఇక్కడ గమనించండి, ఈ ఆయత్ యొక్క ఆరంభం ఎలా ఉంది?

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي
మీరు నాతో దుఆ చేయండి. ఆ తర్వాత ఏమంటున్నాడు?

إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي
ఎవరైతే నా ఆరాధన పట్ల విముఖత చూపుతారో, గర్వానికి గురి అవుతారో.

అంటే ఏం తెలిసింది ఇక్కడ? దుఆ, ఇబాదత్. అసలైన ఇబాదత్. అందుగురించి తిర్మిజీ లోని ఒక సహీ హదీస్ లో ఉంది,

الدُّعَاءُ هُوَ العِبَادَةُ
(అద్దుఆవు హువల్ ఇబాదా)
దుఆ యే అసలైన ఇబాదత్

అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరైతే నాతో దుఆ చేయరో, నాతో దుఆ చేయడంలో గర్వానికి గురి అవుతారో, నాతో దుఆ చేయడంలో విముఖత చూపుతారో,

سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ
ఎంతో అవమానంతో, పరాభవంతో వారు నరకంలో ప్రవేశిస్తారు.

అల్లాహు అక్బర్. ఏం తెలిసింది ఇప్పుడు మనకు? దుఆ ఆరాధనలో ఒక రకం, అది కేవలం ఎవరితో చేయాలి? అల్లాహ్ తో మాత్రమే. అల్లాహ్ తోనే మనం దుఆ చేయాలి. ఫలానా బాబా సాహెబ్, ఫలానా పీర్ సాహెబ్, ఫలానా వలీ సాహెబ్, ఫలానా సమాధిలో ఉన్న చాలా పెద్ద బుజుర్గ్, ఆయన మన దుఆలను వింటాడు, మన అవసరాలను తీరుస్తాడు అని వారితో దుఆ చేయడంలో ఎన్నో రకాల పాపాలు ఉంటాయి.. అందుగురించి దుఆ కేవలం ఎవరికి ప్రత్యేకించాలి? అల్లాహ్ కు మాత్రమే.

అలాగే తవక్కుల్, భరోసా, నమ్మకం. అల్లాహ్ త’ఆలా సూరె మాయిదా, సూరా నెంబర్ 5, ఆయత్ నెంబర్ 23 లో తెలిపాడు,

وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ
(వ అలల్లాహి ఫతవక్కలూ ఇన్ కున్తుమ్ ము’మినీన్)
మీరు నిజమైన విశ్వాసులు అయితే కేవలం అల్లాహ్ పై మాత్రమే నమ్మకం కలిగి ఉండండి. అల్లాహ్ తో మాత్రమే మీరు భరోసా, తవక్కుల్ తో ఉండండి.

ఇంకా సోదర మహాశయులారా! ఇలాంటి ఆయతులు చూసుకుంటే ఖురాన్ లో ఈ భావంలో ఎన్నో ఆయతులు ఉన్నాయి.

అలాగే ఏదైనా ఆపద, కష్ట సమయాల్లో సహాయానికి అర్ధించడం మరియు ఏదైనా కీడు నుండి రక్షణ పొందడానికి శరణు వేడుకోవడం, ఇవి కూడా కేవలం ఎవరితో ఉండాలి? అల్లాహ్ తో పాటు, అల్లాహ్ తో మాత్రమే.

కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని లేదా చిన్న తేడా మరియు వ్యత్యాసాన్ని గమనించండి. అదేమిటంటే ఏదైనా అవసరానికి సహాయం కోరడం గానీ లేదా ఏదైనా కీడు నుండి రక్షణ పొందడానికి శరణు వేడుకోవడం గానీ కేవలం ఎవరితో చేయాలి అన్నాము? అల్లాహ్ తో. కానీ కొన్ని సందర్భాల్లో మనం బ్రతికి ఉన్న కొందరు మనుషులతో సహాయము కోరుతాము మరియు శరణు వేడుకుంటాము. ఇది ఎప్పుడు జాయెజ్, ఎప్పుడు యోగ్యమవుతుంది? ఎవరితోనైతే మనం సహాయం కోరుతున్నామో, ఎవరితోనైతే శరణు వేడుకుంటున్నామో అతను బ్రతికి ఉండాలి, దగ్గరగా ఉండాలి మరియు అది ఆ శక్తి అతనిలో ఉండాలి వాస్తవానికి.

ఉదాహరణకు, ఎవరైనా మిమ్మల్ని హత్య చేస్తాడు అని మీకు మెసేజ్ పంపాడు, బెదిరింపులు పంపాడు, ఫోన్ పై చెప్పాడు లేదా ఏదో రకంగా. లేదా నవూజుబిల్లాహ్, అల్లాహ్ త’ఆలా మనందరినీ కూడా కాపాడు గాక, మన ఏదైనా వస్తువు తీసుకొని లేదా కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని డిమాండ్ చేస్తారు, అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? పోలీసులకి వెళ్లి అక్కడ వారి యొక్క సహాయం, వారి యొక్క శరణు కోరుతామా లేదా? ఇది షిర్క్ అయిపోతుందా? కాదు. ఎందుకు? ఇలాంటి రక్షణ కొరకే వారు ఉన్నారు.

కానీ ఇక్కడ ఒక విషయం, అదేమిటి? అల్లాహ్ తో కోరడం అనేది మనం మరిచిపోకూడదు. అల్లాహ్ ఒక సబబుగా చేశారు వారిని, వారికి ఈ యొక్క అవకాశం ఇచ్చారు. అందుకొరకే మనం వారితో కోరుతున్నాము. కానీ అసలు కోరడం అల్లాహ్ తో అది మరవకూడదు. ఓ అల్లాహ్, ఈ శక్తి సామర్థ్యం అంతా సర్వమూ నీ చేతిలోనే ఉంది. నువ్వు నన్ను కాపాడు, నీవు నాకు సహాయపడు మరియు నీవు మాత్రమే నాకు శరణు ప్రసాదించు అని అల్లాహ్ తో వేడుకోవాలి. వేడుకొని బ్రతికి ఉన్న వారిలో దాని యొక్క శక్తి ఉండేది ఉంటే వారితోని మనం సహాయం కోరవచ్చు.

ఇప్పుడు ఎవరైనా ఎంత పెద్ద వలీయుల్లాహ్ గానీ, అల్లాహ్ యొక్క వలీ, ఎంత గొప్ప అల్లాహ్ యొక్క వలీ గానీ చనిపోయి ఉన్నారు. అయితే అలాంటి వారితో మనం నాకు సంతానం ఇవ్వండి, మాకు సహాయం చేయండి, మా కొడుకును పాస్ చేయండి, ఫలానా శత్రువు మాపై దండెత్తడానికి, మాకు నష్టం, కీడు చేయడానికి సిద్ధం పూనుకున్నాడు, మీరు ఏదైనా మాకు శరణు ఇవ్వండి. వారు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప వలీ కావచ్చు. కానీ అలా వారితో మనం ఈ శరణు కోరడం, సహాయం కోరడం అల్లాహ్ మనకు ఖురాన్ లో దాని యొక్క అనుమతి ఇవ్వలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆ పద్ధతి మనకు నేర్పలేదు. విషయం అర్థమవుతుంది కదా?

అయితే అల్లాహ్ ను విశ్వసించడంలో ఈ విషయాలు కూడా వస్తాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. అదే ప్రకారంగా మన యొక్క జీవితం మనం గడపాలి.

మొక్కుబడులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎంతో మందిని మనం చూస్తున్నాము, సమాధుల వద్దకు వెళ్లి అక్కడ మొక్కుకుంటారు. నా ఈ పని జరిగేది ఉంటే నేను ఇక్కడ వచ్చి చాదర్ వేస్తాను, పూలు వేస్తాను, ఒక మేక కోస్తాను, లేదా ఒక కోడిపుంజును జిబహ్ చేస్తాను ఈ విధంగా. ఇవన్నీ షిర్క్ లోకి వచ్చేస్తాయి. ఎందుకు? మొక్కుబడులు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి.

విషయం అర్థమైంది కదా? ఇంకా ఎన్నో ఇలాంటి ఆధారాలు, దలీల్ ఖురాన్, హదీస్ లో ఉన్నాయి. కానీ సమయం సరిపోదు గనుక నేను ఈ కొన్ని విషయాల ద్వారానే ఈ టాపిక్ ను ఇక్కడి వరకు ముగింపు చేస్తున్నాను. కానీ విషయం అర్థమైంది కదా మీకు? అల్లాహ్ ను విశ్వసించడం అనేది అర్కానే ఈమాన్, విశ్వాస మూల సూత్రాల్లో మొట్టమొదటిది, ముఖ్యమైనది. అల్లాహ్ పై విశ్వాసంలో ఆయన అస్తిత్వం, అంటే ఆయన ఒకే ఒక్కడు తన అస్తిత్వంలో కూడా మరియు ఆయనకు మంచి ఉత్తమ పేర్లు, గుణాలు ఉన్నాయి అని కూడా (అస్మా వ సిఫాత్) మరియు ఆయన మాత్రమే సర్వాన్ని సృష్టించువాడు, పోషించువాడు, నడిపించువాడు (రుబూబియత్) మరియు సర్వ ఆరాధనలకు అర్హుడు కూడా కేవలం ఆయన మాత్రమే.

అల్లాహ్ విషయంలో మనం ఈ విషయాలు, అల్లాహ్ పై విశ్వాసంలో మనం ఈ విషయాల్ని అర్థం చేసుకోవడం, ఈ ప్రకారంగా మన జీవితాన్ని గడపడం ఇది చాలా అవసరం.

అల్లాహ్ త’ఆలా మనందరికీ అల్లాహ్ పై విశ్వాసం సంపూర్ణ విధంగా పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ పై విశ్వాసంలో ఏ రవ్వంత కొరత వచ్చేటువంటి చెడుల నుండి, పాపాల నుండి, లోపాల నుండి అల్లాహ్ మనల్ని కాపాడు గాక.

ఇన్ షా అల్లాహ్, దీని తర్వాత అల్లాహ్ యొక్క దయవల్ల, అల్లాహ్ పై విశ్వాసం, దీని యొక్క లాభాలు ఏమిటి? ఇది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సమరాతుల్ ఈమాని బిల్లాహ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతోమంది, అరే అల్లాహ్ నే నమ్మండి, అల్లాహ్ నే విశ్వసించండి అని మాటిమాటికి అంటా ఉంటారు. ఏంటి లాభం మాకు దీనితోని? కొందరితో అజ్ఞాన కారణంగా అడగవచ్చు, అడగకపోయినా గానీ మనసులో వారికి అల్లాహ్ ను మనం తప్పకుండా విశ్వసించి జీవించాలి అన్నటువంటి ఒక తపన, కోరిక ఎంతో మందిలో లేకుండా మనం చూస్తూ ఉన్నాము. అలాంటప్పుడు మనం అల్లాహ్ ను విశ్వసించడం ద్వారా ఏం లాభాలు మనకు కలుగుతాయి, అవి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇవి తెలుసుకొని వాటిని పాటించేటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. వ ఆఖిరు ద’వాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: [విశ్వాసము]

    “ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో & టెక్స్ట్]

    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
    https://www.youtube.com/watch?v=yZS2dByYpu8
    Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

    أَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِيْنَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِيْنَ، أَمَّا بَعْدُ.
    (సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ (స) పైన, ఆయన కుటుంబ సభ్యులపైన మరియు ఆయన సహచరులందరిపైన శాంతి మరియు శుభాలు వర్షించుగాక.)

    సోదర మహాశయులారా! “విశ్వాస మూల సూత్రాలు అనే ఈ ముఖ్య శీర్షికలో, అల్లాహ్ యొక్క దయవల్ల ఇప్పటివరకు మనం తౌహీద్, అల్లాహ్ ఏకత్వం విషయంలో, తౌహీద్ అంటే ఏమిటి? అందులో ముఖ్యమైన మూడు లేదా నాలుగు భాగాలు ఏవైతే మనం అర్థం చేసుకోవడానికి విభజించి తెలుసుకున్నామో.

    రెండవ పాఠంలో, తౌహీద్, కలిమ-ఎ-తౌహీద్ لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్ – అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) యొక్క నిజమైన భావం ఏమిటి? అందులో ఉన్న రెండు ముఖ్యమైన రుకున్‌లు, అంటే మూల సూత్రాలు నఫీ (نفي – తిరస్కరించుట) వ ఇస్బాత్ (إثبات – అంగీకరించుట), నిరాకరించుట మరియు అంగీకరించుట, వీటి గురించి ఇంకా لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) యొక్క గొప్ప ఘనత ఏమిటి అనేది కూడా తెలుసుకున్నాము.

    ఇక మూడవ పాఠంలో, لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) కు ఏడు షరతులు అందులో ఉన్నాయి. వాటిలో ప్రతీ ఒక్కటినీ మనం నమ్మడం, అర్థం చేసుకోవడం, దాని ప్రకారంగా ఆచరించడం తప్పనిసరి. ఆ ఏడు షరతులు కూడా తెలుసుకున్నాము. సంక్షిప్తంగా ఏమిటవి? ఇల్మ్ (علم – జ్ఞానం), యఖీన్ (يقين – దృఢ విశ్వాసం), కబూల్ (قبول – అంగీకారం), ఇన్ఖియాద్ (انقياد – విధేయత), ఇంకా సిద్ఖ్ (صدق – సత్యసంధత), మహబ్బత్ (محبة – ప్రేమ), ఇఖ్లాస్ (إخلاص – నిష్కల్మషత్వం). ఏడు కదా! అయితే ఎవరైనా ఈ విషయాలు ఇంకా అర్థం కాకుంటే, వెనుక పాఠాలు వినాలి అని నేను కోరుతున్నాను. అల్లాహ్ యొక్క దయవల్ల YouTube ఛానల్‌లో ‘Z Dawah’ లేదా ‘JDK Naseer’ అనే ఛానల్‌లో వెళ్లి వాటిని పొందవచ్చు.

    ఈనాటి పాఠంలో మనం అల్లాహ్ యొక్క దయవల్ల కలిమ-ఎ-షహాదత్ (كلمة الشهادة), పవిత్ర వచనం యొక్క సాక్ష్యం మనం ఏదైతే పలుకుతామో అందులో ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి కదా! ఒకటి لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్), రెండవది محمد رسول الله (ముహమ్మదుర్ రసూలుల్లాహ్). ఆరాధనలకు అర్హులు కేవలం అల్లాహ్ మాత్రమే అని నమ్ముతాము. ఇది لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) లో ఉంది. ఇక రెండవది, محمد رسول الله (ముహమ్మదుర్ రసూలుల్లాహ్).

    ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం అంటామో, సామాన్యంగా వుజూ చేసిన తర్వాత أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ) అనాలి. ఏంటి లాభం? స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి. ఎవరైతే వుజూ చేసిన తర్వాత ఈ చిన్న దుఆ చదువుతారో అని మనకు సహీహ్ ముస్లిం షరీఫ్‌లో ఈ శుభవార్త ఉంది. అలాగే అత్తహియ్యాత్ మనం చదువుతాము కదా, అందులో కూడా أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ) అత్తహియ్యాత్‌లో. మరి ఈ అత్తహియ్యాత్ ప్రతీ నమాజ్‌లోని తషహ్హుద్‌లో, ప్రత్యేకంగా చివరి తషహ్హుద్, ఏ తషహ్హుద్‌లోనైతే మనం సలాం తింపుతామో, అందులో చదవడం నమాజ్ యొక్క రుకున్, నమాజ్ యొక్క పిల్లర్ లాంటి భాగం అని కూడా పండితులు ఏకీభవించారు. అయితే గమనించండి, మనం మాటిమాటికీ ఏదైతే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ యొక్క సాక్ష్యం కూడా పలుకుతూ ఉంటామో, దాని యొక్క నిజమైన భావం తెలుసుకోవడం కూడా చాలా అవసరం.

    హృదయంతో మరియు నోటితో, మనసా వాచా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యం పలుకుతూ, ఆయన అల్లాహ్ యొక్క దాసుడు మరియు సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడిన వారు అని నమ్మాలి. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని అంటే, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క దాసులు మరియు సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడిన వారు. ముఖ్యంగా ఈ రెండు విషయాలు. ఇక ఈ రెండు విషయాలు నమ్ముతున్నప్పుడు అందులో మరికొన్ని వివరాలు ఉంటాయి, వాటిని కొంచెం మనం అర్థం చేసుకుందాం.

    అయితే ఇందులో ధర్మ పండితులు, ప్రత్యేకంగా ఉలమాయె అఖీదా, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని మనం పలుకుతున్నాము, సాక్ష్యం పలుకుతున్నాము, నమ్ముతున్నాము అంటే అందులో నాలుగు విషయాలు వస్తాయి అని చెప్పారు. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ను విశ్వసించడంలో ఎన్ని విషయాలు? నాలుగు విషయాలు.

    మొదటి విషయం, ఆయన మనకు ఏ ఆదేశం ఇచ్చారో విధేయత చూపాలి, అంటే ఆజ్ఞాపాలన చేయాలి. طَاعَتُهُ فِيمَا أَمَرَ (తాఅతుహూ ఫీమా అమర్). ప్రవక్త ఏ ఆదేశం ఇచ్చారో ఆ ఆదేశాన్ని మనం పాటించాలి. అర్థమైందా? ఉదాహరణకు మీరు హదీసులు చదువుతూ ఉన్నప్పుడు, “ఆమురుకుం బి సబ్అ” (నేను ఏడు విషయాల గురించి మీకు ఆదేశిస్తున్నాను) అని సహీ బుఖారీలో వచ్చింది. అల్లాహ్‌ను తప్ప ఇంకా వేరే ఎవరినీ కూడా మీరు ఆరాధించకండి, ఐదు పూటల నమాజు పాబందీగా చేయండి, ఈ విధంగా. ఇంకా వేరే ఎన్నో ఆదేశాలు ఉన్నాయి. ప్రవక్త ఇచ్చిన ప్రతీ ఆదేశాన్ని ఏం చేయాలి? విధేయత చూపాలి. ఆజ్ఞాపాలన చేయాలి.

    రెండవ విషయం, تَصْدِيقُهُ فِيمَا أَخْبَرَ (తస్దీఖుహూ ఫీమా అఖ్బర్). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ ఏ విషయాలు మనకు తెలిపారో వాటన్నింటినీ మనం సత్యంగా నమ్మాలి. గత కాలాలలో జరిగిన కొన్ని సంఘటనలు మనకు తెలిపారు. తర్వాత కాలంలో రానున్న కొన్ని సంఘటనల గురించి మనకు తెలియజేశారు. ప్రత్యేకంగా ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి అని కూడా తెలిపారు. అరే, అంత పాత కాలం నాటి విషయాలు ఎలా చెప్పారు? అరే ఇలా కూడా జరుగుతుందా? అరే ప్రళయానికి కంటే ముందు ఇట్లా అవుతుందా? ఇలాంటి సందేహాల్లో మనం పడకూడదు. ప్రవక్త చెప్పిన మాట నూటికి నూరు శాతం సత్యం. అందులో అనుమానానికి, దాన్ని మనం తిరస్కరించడానికి, అబద్ధం అన్నటువంటి అందులో ఏ సంశయం లేనే లేదు. تَصْدِيقُهُ فِيمَا أَخْبَرَ (తస్దీఖుహూ ఫీమా అఖ్బర్). ప్రవక్త తెలిపిన విషయాలను సత్యంగా నమ్మాలి. నూహ్ (అలైహిస్సలాం) ఎన్ని సంవత్సరాలు జీవించారో, వాటికి సంబంధించిన కొన్ని విషయాలు, ప్రవక్త ఇబ్రాహీంకు సంబంధించిన విషయాలు, ప్రవక్త మూసా, ఈసా (అలైహిముస్సలాతు వత్తస్లీమ్) కు సంబంధించిన కొన్ని విషయాలు, ఇంకా బనీ ఇస్రాయీల్‌లో జరిగిన ఎన్నో సంఘటనలు ప్రవక్త మనకు తెలిపారు. వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? సత్యంగా నమ్మాలి. ప్రళయానికి కంటే ముందు దజ్జాల్ వస్తాడు, మహదీ వస్తాడు, ఈసా (అలైహిస్సలాం) వస్తారు, అలాగే దాబ్బతుల్ అర్ద్ అనే ఒక జంతువు వస్తుంది. అలాగే ప్రళయానికి కంటే ముందు సూర్యుడు, ప్రతిరోజూ ఎటునుండి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి, ప్రళయం రోజు పడమర నుండి. అల్లాహు అక్బర్! అది అలా ఎలా జరుగుతుంది, ప్రతిరోజూ మనం ఇట్లా చూస్తున్నాము కదా, ప్రళయానికి కంటే ముందు అట్లా ఎట్లా జరుగుతుంది అని సందేహం వహించడానికి అవకాశం లేదు. ప్రవక్త తెలిపారు, ఇలా జరిగి తీరుతుంది.

    ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం నమ్ముతామో, అందులో ఎన్ని విషయాలు ఉన్నాయని చెప్పాను? మొదటి విషయం, ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి, విధేయత చూపాలి, ఆజ్ఞాపాలన. రెండవది, ఆయన ఏ ఏ విషయాలు తెలిపారో అవన్నీ సత్యం అని నమ్మాలి.

    మూడవది, اجْتِنَابُ مَا نَهَى عَنْهُ وَزَجَرَ (ఇజ్తినాబు మా నహా అన్హు వ జజర్). ఆయన ఏ విషయాల నుండి మనల్ని హెచ్చరించారో, వారించారో, నిషేధించారో, “ఇది చేయకండి” అని చెప్పారో వాటికి మనం దూరంగా ఉండాలి. తల్లిదండ్రులకు అవిధేయత చూపకండి, చేతబడి చేయకండి, జూదం ఆడకండి, వ్యభిచారం చేయకండి, షిర్క్ పనులు చేయకండి, గడ్డాలు కత్తిరించకండి. ఈ విధంగా ఏ ఏ నిషేధాలు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు నిషేధించి ఉన్నారో, ఖండించి ఉన్నారో, వారించి ఉన్నారో, వాటన్నిటినీ మనం వాటికి దూరంగా ఉండాలి.

    నాల్గవ విషయం, وَأَلَّا يُعْبَدَ اللَّهُ إِلَّا بِمَا شَرَعَ (వ అల్లా యూ’బదల్లాహు ఇల్లా బిమా షర’అ). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ను ఏ విధంగా ఆరాధించారో, అదే విధంగా మనం కూడా ఆరాధించాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ను ఎలా ఆరాధించాలో, మనము కూడా అలాగే ఆరాధించాలి. నమాజ్ విషయంలో గానీ, ఉపవాసాల విషయాలలో గానీ, జకాత్, హజ్ విషయాలలో గానీ, వివాహ విషయాలలో గానీ, ప్రవక్త యొక్క నడవడిక గానీ, అందుకొరకే అల్లాహ్ ఏం చెప్పాడు? لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ (లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనహ్ – నిశ్చయంగా మీ కొరకు అల్లాహ్ ప్రవక్తలో ఒక ఉత్తమ ఆదర్శం ఉంది). ప్రవక్త మీకు ఒక మంచి ఆదర్శం. మీరు ఆయన ఆదర్శాన్ని పాటించాలి.

    ఇక ఈ నాలుగు విషయాలు ఏదైతే నేను చెప్పానో, ప్రతి ఒక్క దానికి ఖురాన్‌లో, హదీస్‌లో ఎన్నో దలీల్‌లు ఉన్నాయి. కానీ టైం మనకు సరిపడదు గనుక సంక్షిప్తంగా చెబుతున్నాను. విషయం అర్థమైంది కదా! మనం ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నమ్ముతున్నాము అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి అందులో? నాలుగు విషయాలు. మరొకసారి మీకు గుర్తుండడానికి: ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి, ఆయన తెలిపిన విషయాలను సత్యంగా నమ్మాలి, ఆయన ఏ విషయాల నుండి మనల్ని నిషేధించారో, ఖండించారో, వారించారో వాటికి దూరంగా ఉండాలి, ఆయన అల్లాహ్‌ను ఎలా ఆరాధించారో అలాగే మనం ఆరాధించాలి.

    అయితే సోదర మహాశయులారా, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం పలుకుతున్నామో, ఇందులో కూడా ముఖ్యమైన రెండు రుకున్‌లు ఉన్నాయి. రెండు మూల సూత్రాలు ఉన్నాయి. لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) లో రెండు మూల సూత్రాలు ఉన్నాయి అని చెప్పాము కదా, ఒకటి నఫీ, మరొకటి ఇస్బాత్. ఇందులో రెండు మూల సూత్రాలు ఉన్నాయి. ఒకటి ‘అబ్ద్’ (عَبْد), మరొకటి ‘రసూల్’ (رَسُول). ‘అబ్ద్’ అంటే దాసుడు. అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన అబ్దుల్లాహ్ యొక్క కుమారుడు. అబ్దుల్లాహ్ మరియు ఆమిన. ఆయన యొక్క వంశ పరంపర ఏమిటి? ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ వంశ పరంపరంగా ఇబ్రాహీం (అలైహిస్సలాం) యొక్క పెద్ద కుమారుడైన ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతతిలో వస్తారు. మరియు ఇబ్రాహీం (అలైహిస్సలాం), ఆదం (అలైహిస్సలాం) సంతతిలోని వారు. ఈ విధంగా, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మనలాంటి ఒక మనిషి. అల్లాహ్ యొక్క దాసుడు. కానీ కొంచెం జాగ్రత్త. మనలాంటి మనిషి అన్న ఈ పదం ఏదైతే ఉపయోగించానో, ఇక్కడ భావాన్ని తెలుసుకోవాలి. లేదా అంటే మళ్ళీ కొందరు మనల్ని పెడత్రోవ పట్టించేటువంటి ప్రమాదం ఉంది.

    మనలాంటి మనిషి అని ఎప్పుడైతే మనం మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి అంటామో, అక్కడ దాని భావం ఏమిటి? మనం ఎలాగైతే తల్లిదండ్రులతో పుట్టామో, మనం ఎలాగైతే ఆదం యొక్క సంతతియో, మనకు ఎలాగైతే ఆకలి, దాహము కలిగినప్పుడు తినడం, త్రాగడం, అవసరాలు తీర్చుకోవడం, పడుకోవడం, నిద్ర రావడం, ఏదైనా దెబ్బ తగిలిందంటే నొప్పి కలగడం, బాధ కలగడం, ఇలాంటి మానవ సహజ అవసరాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి అవసరాలే ప్రవక్తకు ఉండినవి. ఆయన వేరే ఏ సృష్టి కాదు, మానవ సృష్టిలోనే మనలాంటి ఒక వ్యక్తి. కానీ, సర్వ మానవాళిలోనే కాదు, సర్వ సృష్టిలో అల్లాహ్ తర్వాత అందరికంటే గొప్పవారు. అర్థమైందా? కేవలం మానవుల్లోనే కాదు, జిన్నాతులో, మిగతా ఈ సృష్టి అంతటి, అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఏదేదైతే ఉందో, ప్రతి దానిలో కెల్లా అత్యంత గౌరవనీయులు, అత్యంత అల్లాహ్‌కు ప్రియులు, అత్యంత గొప్పవారు, ఎక్కువ ఘనత గలవారు ఎవరు? మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). ప్రవక్త ముహమ్మద్ మనలాంటి మనిషి అంటే, నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా, సమానత్వంగా చేస్తున్నాము, మనకు ఈక్వల్‌గా చేస్తున్నాము, అలాంటి భావం రానే రాకూడదు. మనలాంటి మనిషి అంటే ఏంటి ఇక్కడ భావం? మనం ఎలాగైతే తల్లిదండ్రులతో పుట్టామో, ఆయన కూడా అబ్దుల్లాహ్, ఆమినాకు పుట్టినవారు. మానవ జన్మ ఎత్తినవారు. మానవ అవసరాలు సహజంగా ఏవైతే ఉంటాయో తినడం, త్రాగడం, పడుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, సంతానం కలగడం, మార్కెట్‌కు వెళ్లడం, అవసరం ఉన్న సామాను కొనుక్కొని రావడం, ఈ విధంగా ఈ పనులు ఏదైతే మనం మానవులం చేసుకుంటామో, అలాంటి అవసరాలు కలిగిన ఒక వ్యక్తే. కానీ, ఆయన స్థానానికి ఎవరూ చేరుకోలేరు. ఈ లోకంలోనే మొత్తం అల్లాహ్ తర్వాత ఆయనకంటే గొప్ప ఇంకా వేరే ఎవరూ కూడా లేరు.

    అబ్ద్. దీని గురించి ఖురాన్‌లో ఎన్నో పదాలు ఉన్నాయి. అబ్ద్ అన్న పదం ఖురాన్‌లో వచ్చింది. సూరహ్ కహఫ్ స్టార్టింగ్‌లో వచ్చింది. సూరహ్ కహఫ్ యొక్క చివరిలో కూడా వచ్చింది. సూరహ్ ఫుర్ఖాన్ యొక్క స్టార్టింగ్‌లో కూడా వచ్చింది. ఇంకా ఎన్నో సూరాలలో అబ్ద్ అంటే దాసుడు. అలాగే మానవుడు, మనిషి అన్న పదం కూడా, బషర్ (بشر), మనిషి అంటే బషర్ అని అరబీలో అంటారు, ఈ పదం కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఉపయోగపడింది.

    ఇక రెండవ రుకున్, రసూల్. రసూల్. అంటే ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ఆయన్ని ప్రళయం వచ్చే వరకు సర్వ మానవాళి వైపునకు, సర్వ దేశాల, ఈ మొత్తం సృష్టిలో ఉన్న ప్రజల వైపునకు ఆయన్ని ప్రవక్తగా, సందేశహరులుగా, సందేశాన్ని అందజేసే వారులుగా, ఆచరించి చూపే వారులుగా, స్వర్గం వైపునకు పిలిచే వారిగా, నరకం గురించి హెచ్చరించే వారిగా చేసి పంపాడు.

    ఈ రెండిటినీ మనం తప్పకుండా నమ్మాలి మరియు ఈ ప్రకారంగానే మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సూరత్ సబా, అలాగే సూరహ్ అంబియా, ఇంకా ఎన్నో సూరాలలో, అలాగే సూరతుల్ అన్ఆమ్‌లో కూడా, సూరతుల్ ఆరాఫ్‌లో కూడా ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సర్వ మానవాళి వైపునకు అల్లాహ్ యొక్క కారుణ్య మూర్తి, అల్లాహ్ యొక్క సందేశం అందజేసే ప్రవక్త అని చాలా స్పష్టంగా చెప్పబడినది.

    ఈ రెండు గుణాలను మనం నమ్ముతాము కదా, లాభం ఏమిటి? ఈ రెండు ఉత్తమ గుణాలు, ఈ రెండు ఉత్తమ రుకున్‌లు, మూల సూత్రాలు, అబ్ద్ మరియు రసూల్, ప్రవక్త విషయంలో నమ్మడం తప్పనిసరి. ఎందుకు? ఇలా నమ్మడం ద్వారా ఆయన హక్కులో కొందరు ఏదైతే అతిశయోక్తి లేదా ఆయన హక్కును తగ్గించి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఆ రెండు రకాల వారికి ఇందులో సరైన సమాధానం ఉంది.

    ప్రజల్లో కొందరు ఇలా ఉన్నారు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మనిషే కాదు అని అంటున్నారు. ఆయన వేరే ఒక సృష్టి అని అంటున్నారు. అది కూడా తప్పు విషయం. మరికొందరు ఆయన ఒక మనిషి, అబ్దుల్లాహ్, ఆమినాకు పుట్టినవారు అని నమ్ముతున్నారు, కానీ ప్రవక్త అని నమ్మడం లేదు, తిరస్కరిస్తున్నారు. అయితే మరొక వైపు ఏమున్నది? ఆయన్ని ప్రవక్తగా నమ్మి ఆయన హక్కులో చాలా అతిశయోక్తితో ప్రవర్తించి, ఆయన్ని అల్లాహ్ యొక్క స్థానానికి లేపేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కేవలం అల్లాహ్‌తో అడిగేటువంటి కొన్ని దుఆలు, కేవలం అల్లాహ్‌తో మాత్రమే ప్రశ్నించేటువంటి కొన్ని విషయాలు, “ఓ అల్లాహ్ మాకు సంతానం కలిగించు”, “ఓ అల్లాహ్ మాకు మా రోగాన్ని దూరం చేసి ఆరోగ్యం ప్రసాదించు”, “ఓ అల్లాహ్ మా యొక్క కష్టాలను దూరం చెయ్యి” – ఇట్లాంటివి ఏవైతే కొన్ని దుఆలు ప్రత్యేకంగా కేవలం అల్లాహ్‌తో మాత్రమే అడగవలసినవి ఉంటవియో, అవి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో అడుగుతున్నారు. మాకేం అవసరం ఉన్నా గానీ ప్రవక్త యొక్క దర్బార్ మీదికి వెళ్ళాము, ప్రవక్త యొక్క రౌదా వద్దకు వెళ్ళాము, అక్కడ మా అవసరాలు అన్నీ తీరిపోతాయి అన్నటువంటి మూఢనమ్మకాల్లో ఉన్నారు. తప్పు విషయం. ఆయన ప్రవక్త, సర్వ మానవుల్లో కెల్లా ఎంతో ఉత్తమమైన వారు. కానీ ఆయన అల్లాహ్‌ను ఆరాధించేవారు, మనం కూడా అల్లాహ్‌నే ఆరాధించాలి, ఆయన్ని ఆరాధించకూడదు.

    మరికొందరు మన ముస్లిములలో ఎలా ఉన్నారు? ఆయన్ని ప్రవక్తగా అని నమ్ముతూ ఎంతో గౌరవం, ఆయనకు గౌరవం ఇస్తున్నట్లుగా చెబుతారు. కానీ ఇతరుల ఇమాములను, ఇతరుల ముర్షిద్‌లను, వేరే కొందరు పీర్‌లను నమ్మి, ప్రవక్త కంటే ఎక్కువగా వారికి స్థానం కల్పిస్తారు. ఇది కూడా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని చదవడానికి వ్యతిరేకం అవుతుంది సోదర మహాశయులారా.

    విషయం అర్థమైంది కదా! ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని సాక్ష్యం పలుకుతున్నామో, అందులో ఎన్ని విషయాలు వస్తాయి? ఏమేమిటి? ఇచ్చిన ఆదేశాన్ని పాటించడం, చెప్పిన ప్రతి మాటను సత్యంగా నమ్మడం, నిషేధించిన వాటికి దూరంగా ఉండడం, ఆయన ఎలా అల్లాహ్‌ను ఆరాధించారో అలా అల్లాహ్‌ను ఆరాధించడం. ఇందులో రెండు రుకున్‌లు ఉన్నాయి, మూల సూత్రాలు ఉన్నాయి: ఒకటి అబ్ద్, రెండవది రసూల్. ఈ రెండిటినీ నమ్మడం ద్వారా ఎవరైతే ప్రవక్తను ఆయన స్థానానికి దించి తగ్గించారో వారికి కూడా ఇందులో జవాబు ఉంది, మరి ఎవరైతే ప్రవక్తను నమ్మినట్లుగా చెప్పి ఇతరులను ప్రవక్తకు పైగా, ప్రవక్త యొక్క మాటకు వ్యతిరేకంగా ఇతరుల మాటలకు ప్రాధాన్యతనిస్తున్నారు, ప్రవక్త యొక్క పద్ధతి, సున్నత్‌కు వ్యతిరేకంగా ఇతరుల యొక్క ఫత్వాలను, ఇతరుల యొక్క మాటలకు ప్రాధాన్యతనిస్తున్నారు, అలాంటి వారికి కూడా ఇందులో జవాబు ఉన్నది.

    అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనందరికీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి మనం ఏదైతే సాక్ష్యం పలుకుతున్నామో, అందులో ఈ విషయాలను తెలుసుకొని ఈ ప్రకారంగా సాక్ష్యం పలికేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

    పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
    విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

    ఇతరములు: