సిఫారసు (షఫాఅత్) – కితాబ్ అత్ తౌహీద్ : ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

17వ అధ్యాయం
సిఫారసు (షఫాఅత్) [Intercession]

అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం:

وَأَنذِرْ بِهِ الَّذِينَ يَخَافُونَ أَن يُحْشَرُوا إِلَىٰ رَبِّهِمْ ۙ لَيْسَ لَهُم مِّن دُونِهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ لَّعَلَّهُمْ يَتَّقُونَ

ప్రవక్తా! తమ ప్రభువు ముందు ఆయన తప్ప తమకు అండగా నిలిచి, సహాయం చేసే (అధికారం గల) వాడుగానీ లేదా తమ కొరకు సిఫారసు చేసే వాడుగానీ ఎవడూ ఉండని స్థితిలో ఎప్పుడైనా హాజరు కావలసివస్తుందని భయపడుతూ ఉండేవారికి నీవు దీని (ఖుర్ఆన్) ద్వారా ఉపదేశించు.” (అన్ ఆమ్ 6:51).

قُل لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيعًا

(ఓ ప్రవక్తా!) చెప్పు: “సిఫారసు అనేది పూర్తిగా అల్లాహ్ చేతిలోనే ఉంది.” (జుమర్ 39:44).

مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ

ఆయన సముఖంలో ఆయన అనుమతి లేకుండా సిఫారసు చెయ్యగల వాడెవ్వడు?” (బఖర 2:255).

وَكَم مِّن مَّلَكٍ فِي السَّمَاوَاتِ لَا تُغْنِي شَفَاعَتُهُمْ شَيْئًا إِلَّا مِن بَعْدِ أَن يَأْذَنَ اللَّهُ لِمَن يَشَاءُ وَيَرْضَىٰ

“ఆకాశాలలో ఎంతో మంది దైవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏ మాత్రం ఉపయోగపడదు. అల్లాహ్ తాను ఎవరిని గురించైతే ఏదైనా విన్నపం వినదలుస్తాడో, ఎవడైతే ఆయనకు ఇష్టమైనవాడో, అటువంటి వ్యక్తి విషయంలో దానికి (సిఫారసుకు) అనుమతి ఇస్తేనే తప్ప.” (నజ్మ్  53:26).

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ

(ప్రవక్తా! ఈ ముష్రికులతో) ఇలా అను, “అల్లాహ్ ను కాదని మీరు ఆరాధ్యులుగా భావించిన వారిని పిలిచి చూడండి. వారు ఆకాశాలలో గాని, భూమిలోగాని, రవ్వంత వస్తువుకు కూడా యజమానులుకారు” (సబా 34:.22-23).

షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియ (రహిమహుల్లాహ్) ఇలా చెప్పారు:

“తనలో తప్ప ముష్రికులు భావించే వారిలో ఏ శక్తి లేదని అల్లాహ్ స్పష్టం చేశాడు. ఆయన తప్ప మరెవ్వరికి (భూమ్యాకాశాల్లో దేనికీ) ఏలాంటి అధికారం లేదు. ఎవరూ అల్లాహ్ మద్దతుదారులూ కారు. కేవలం సిఫారసు మిగిలి ఉన్నది. దాన్ని స్పష్టం చేశాడు; ఆయన అనుమతి ఇచ్చిన వారికి తప్ప మరెవ్వరి సిఫారసు పనికిరాదు. అదే విషయం ఈ వాక్యంలో ఉంది.

وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ارْتَضَىٰ

వారు ఎవరిని గురించీ సిఫారసు చేయరు. సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడిన వాని విషయంలో తప్ప.” (అంబియా 21:28).

ఏ సిఫారసు గురించి ముష్రికులు (పనికి వస్తుందన్నట్లు) ఇక్కడ భావిస్తున్నారో ప్రళయ దినమున అది కనబడదు, పనికిరాదు. ఖుర్ ఆన్ దానిని రద్దు చేసింది.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా తెలిపారు: “ప్రళయదినాన అందరూ సమూహమైన చోట (మహ్-షర్ మైదానం లో) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ప్రభువు కొరకు దీర్ఘ సమయం వరకు సజ్దాలో ఉండి, ఆయన స్తోత్రములు పఠిస్తారు. వెంటనే సిఫారసు చేయరు. తరువాత ఇలా చెప్పబడుతుంది. “ఓ ముహమ్మద్ ! తల ఎత్తు, పలుకు, నీ మాట వినబడుతుంది. అడుగు, ఇవ్వబడుతుంది. సిఫారసు చేయి, అంగీక రించబడుతుంది“.

ఒక సారి అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో ఇలా ప్రశ్నించారు: “ప్రళయ దినాన మీ సిఫారసుకు అర్హులు ఎవరు కాగలరు?“. దానికి ఆయన “ఎవరు “లాఇలాహ ఇల్లల్లాహ్” హృదయాంతర సత్యత మరియు స్వఛ్ఛతతో అంటారో వారు” అని సమాధానమిచ్చారు. ఈ సిఫారసు, అల్లాహ్ అనుమతి తరువాత లభించేది సత్య విశ్వాసులకు. కానిఅల్లాహ్ తో  షిర్క్ చేసినవారు దీనికి నోచుకోలేరు.

అల్లాహ్ అనుమతి ఇచ్చిన వారి సిఫారసు, దుఆతో సత్యవిశ్వాసులను క్షమించడం వాస్తవానికి ఇది వారికి అల్లాహ్ వైపు నుండి లభించే గౌరవం, ఘనత. మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు గౌరవం, ప్రసాదం, ఇలా ఆయన “మఖామె మహ్మూద్ ” (అత్యంత స్తుతింపబడిన మహోన్నత స్థానం) పొందుతారు.

ఖుర్ఆన్ రద్దు చేసిన సిఫారసు షిర్క్ తో కలుషితమైన సిఫారసు. అందుకే స్వయంగా ఆయన అనుమతితో చెల్లే సిఫారసును గురించి అనేక చోట్ల ప్రస్తావించాడు. దానికి అర్హులు తౌహీద్ ను విశ్వసించిన సత్య విశ్వాసులు అని ప్రవక్త స్పష్టం చేశారు.

(షేఖుల్ ఇస్లాం వివరణ సమాప్తమయింది).

ముఖ్యాంశాలు:

1. ఖుర్ ఆన్ ఆయతుల భావం తెలిసింది.

2. రద్దు చేయబడిన సిఫారసు వివరణ వచ్చింది.

3. చెల్లునటువంటి సిఫారసు వివరణ వచ్చింది.

4. మఖామె మహ్మూద్ ను షఫాఅతె కుబ్రా (పెద్ద సిఫారసు) అని అంటారు, దాని ప్రస్తావన వచ్చింది.

5. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ సిఫారసు సాధారణంగా చేయరు. ముందు దీర్ఘ సమయం వరకు సజ్దాలో ఉంటారు తరువాత అనుమతి లభిస్తుంది.

6. దాని అర్హులైన అదృష్టవంతులెవరో కూడా తెలిసింది.

7. అల్లాహ్ తో షిర్క్ చేసినవారికి అది ప్రాప్తం కాదు.

8. దాని వాస్తవికత కూడా తెలిసింది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

రచయిత (ముహమ్మద్ బిన్అబ్దుల్ వహ్హాబ్) రహిమహుల్లాహ్ సిఫారసుకు సంబంధించిన అధ్యాయాన్ని ఇచ్చట ప్రస్తావించడానికి కారణం ముష్రికుల భ్రమ, తప్పుడు ఆలోచనను దూరం చేయడానికి.

అది ఏమనగా: దైవదూతల, ప్రవక్తల, వలీల (ఔలియా అల్లాహ్)తో ముష్రికులు దుఆ చేస్తూ, మొరపెట్టుకుంటూ, తాము షిర్క్ కు అతీతులమని చెప్పుకుంటారు. అది ఎలా అనేది వారే స్వయంగా ఇలా తెలుపుతారు: “వారు మా లాంటి మనుషులని మాకు తెలిసినప్పటికీ మేము వారితో దుఆ చేస్తాము. ఎందుకనగా వారు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానం గలవారు. మేము వారితో దుఆ చేస్తే, వారు మమ్మల్ని అల్లాహ్ వరకు చేర్పిస్తారు. అల్లాహ్ వద్ద మాకు సిఫారసు చేస్తారు. ఎలాగైతే రాజుల, అధికారుల వరకు చేరుకోవటానికి, వారి దగ్గర ఉండే కొందరు ప్రత్యేక సిఫారసు చేయువారు, సామాన్య ప్రజల అవసరాలు తీర్చుటకు గాను రాజుల, అధికారుల వద్ద సిఫారసు చేస్తారో“.

కాని ఇది అసత్యం, తుఛ్ఛం. సర్వ అధికారులకన్నా గొప్ప అధికారి అయిన, శక్తి సామర్థ్య వంతుడైన అల్లాహ్ యొక్క ఉదాహరణ భిక్షకుడైన, అసమర్ధుడైన రాజుతో ఇవ్వబడుతుంది. కొందరు మంత్రులతో కలసియే అతను రాజు అయినందుకు (అతని అసమర్థత అట్లే ఏర్పడుతుంది). ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఆయతులతో ఇలాంటి భ్రమ తొలిగిపోతుంది. సర్వ లోకాలకు అధికారి అయిన అల్లాహ్యే సిఫారసు యొక్క అధికారి అని అందులో స్పష్టంగా ఉంది. ఆయన అనుమతి లేనిదే ఎవ్వరూ ఎవ్వరికీ సిఫారసు చేయలేరు. ఎవని మాట, కర్మలతో అల్లాహ్ సంతృప్తి పడతాడో అతని కొరకే అనుమతి లభించేది. తౌహీద్, ఇఖ్లాస్  ఉన్న వ్యక్తి తోనే అల్లాహ్ ఇష్టపడతాడు. అయితే ముష్రిక్ (షిర్క్ చేసినవానికి) సిఫారసు ప్రాప్తం కాదు.


నుండి:
ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం].
https://teluguislam.net/2019/10/25/al-qawlul-sadeed/
తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఇతరములు:

దరూద్ చదవండి ప్రవక్త సిఫారసు పొందండి [వీడియో]
https://teluguislam.net/2019/11/08/darood-shafaa-prophet/

ఉరుసులు, దర్గాల వాస్తవికత
https://teluguislam.net/2019/09/09/reality-of-urusulu-dargalu/

ఏక ధైవారాధకుల నరక విమోచనకై సిఫారసు
https://teluguislam.net/2012/04/30/aking-out-of-the-believers-in-oneness-of-allaah-from-the-hell-fire/

శుచీశుభ్రత-2: నజాసత్ (అశుద్ధత) [వీడియో]

బిస్మిల్లాహ్

[12:23 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

أحكام الطهارة –: పరిశుభ్రత ఆదేశాలు

‘నజాసత్’ అంటేమిటి?

దేనితోనయితే ఒక ముస్లిం దూరంగా ఉండి, అది ఏ చోటనైనా అంటినచో కడుగుట విధిగా ఉందో దానినే ‘నజాసత్’ (అశుధ్ధత) అంటారు.

బహిష్టు రక్తం లాంటి కనబడే మలినమేదైనా శరీరానికి లేదా బట్టలకు అంటినచో దానిని కడుగుట విధిగా ఉంది. కడిగిన తర్వాత దాని మరక కనబడితే, అది తొలగడం కూడా కష్టంగా ఉంటే పాపం లేదు. ఒక వేళ మలినం కానరానిదై ఉంటే, అది తొలిగిపోవుటకు దానిని ఒక్క సారి కడిగినా సరిపోతుంది.

ఇక నేలపై ఏదైనా మలినం పడిపోతే అక్కడ నీళ్ళు పారబోస్తే అది శుభ్రమవుతుంది. మలినము పలుచగా పారునటువంటిదైతే అది ఎండిపోయినచో నేల పరిశుభ్రమవుతుంది. ఒక వేళ పారనిదిగా ఉంటే దాన్ని తీసిపడేసిన తరువాతనే అది శుభ్రమవుతుంది.

పరిశుభ్రత పొందుటకు మరియు అశుద్ధతను దూరం చేయుటకు నీళ్ళు ఉపయోగించబడతాయి. అవి వర్షపు నీరు, సముద్రపు నీరు, బావుల నీళ్ళు, నదుల నీళ్ళు వగైరా. ఇంకా శుభ్రమైన వస్తువు నీళ్ళలో కలిసి అందులో ఏలాంటి మార్పు రాకుండా దాని అసలు రూపములో ఉండిపోతే అవి కూడా ఉపయోగించవచ్చును. ఇక ఏదైనా శుభ్రమైన వస్తువు నీళ్ళలో కలసి దాని అసలు రూపంలో మార్పు వచ్చి, నీళ్ళు అనలేని స్థితిలో ఉంటే వాటిని శుభ్రత కొరకు ఉపయోగించరాదు. ఉదా: చాయ్, కాఫీ, జ్యూస్. కాని ఏదైనా అపరిశుభ్రమైన వస్తువు అందులో కలుషితమై దాని రంగు, రుచి, వాసనలో మార్పు వస్తే అవి ఉపయోగించరాదు. మార్పు రాని యెడల అవి ఉపయోగించవచ్చును. అలాగే ఎవరైనా త్రాగిన తర్వాత మిగిలిన నీళ్ళు ఉపయోగించ వచ్చును. (కాని కుక్క లేక పంది ఎంగిలి చేసిన నీళ్ళు వాడరాదు).

‘నజాసత్’ రకాలు:

మలమూత్ర మార్గాల నుండి వెలువడే అశుద్ధత రకాలు:

(1) మలమూత్రం.

(2) ‘వదీ‘: అది తెల్లటి చిక్కని ద్రవ పదార్థం. అది మూత్రము తరువాత వెలువడుతుంది.

(3) ‘మజి‘: అది తెల్లటి జిగటగల పదార్థం. అది భార్యభర్తల సరసా- లాడడముతో, లేదా మనిషి కామాలోచనలో పడినప్పుడు వెల్తుంది.

(4) ‘మనీ’ (ఇంద్రియం, వీర్యం) శుభ్రమైనప్పటికీ, అది పచ్చిగా ఉన్నప్పుడు కడుగుట, ఎండిపోయినప్పుడు నలుచుట అభిలషణీయం.

(5) తినుట యోగ్యం కాని జంతువుల మలమూత్రం అపరిశుభ్రం. తినుట యోగ్యమైన జంతువుల మలమూత్రం అపరిశుభ్రం కాదు.

(6) బహిష్టు మరియు బాలంత రక్తస్రావం.

పైన చెప్పబడిన మలినాలు శరీరానికి, లేదా దుస్తులకు అంటినచో వాటిని దూరం చేయాలి మరియు కడగాలి. అయితే కేవలం ‘మజి’ విషయంలో చిన్న మినహాయింపు ఉంది. అదేమిటంటే: అది అంటిన చోట కడగకుండా నీళ్ళు చల్లినా సరిపోవును.

కొన్ని ‘నజాసత్’ ఆదేశాలు:

1- మనిషికి ఏదో ఒక పదార్థం అంటింది, కాని అది నజాసతేనా కాదా అనే నిర్థారణ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, దాని గురించి పరిశోధన చేసే అక్కర లేదు. అలాగే దాన్ని కడిగే అవసరం కూడా లేదు.

2- ఒక మనిషి నమాజు చేసిన తరువాత శరీరములో లేక తన దుస్తుల్లో నజాసత్ చూశాడు. దాని గురించి నమాజుకు ముందు తెలియదు, లేదా తెలిసు కాని మరచిపోయాడు. అలాంటప్పుడు అతని నమాజు అయినట్లే.

3- దుస్తుల్లో నజాసత్ పడిన స్థలం తెలియకుంటే, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ స్థలం అన్న అంచన గలదో దాన్నే కడగాలి. ఆ స్థలం గురించి అంచన వేయలేక పోతే పూర్తి బట్టని కడగాలి.

మలమూత్ర విసర్జన:

మలమూత్ర విసర్జన పద్దతులు ఈ క్రింది విధంగా ఉన్నాయిః

1- మరుగుదొడ్డిలో ఎడమ కాలుతో ప్రవేశిస్తూ, ప్రవేశముకు ముందే అనాలి:

బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇసి
بسم الله اَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْـخُبُثِ وَالْـخَبَائِثِ
(అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్ నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను).
(బుఖారి 142, ముస్లిం 375).

మరుగుదొడ్డి నుండి కుడి కాలు ముందు వేస్తూ బయటకు వచ్చి అనాలి: గుఫ్రానక غُفْرَانَكَ నీ మన్నింపుకై అర్థిస్తున్నాను. (తిర్మిజి 7).

2- అల్లాహ్ పేరుగల ఏ వస్తువూ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్ళకూడదు. కాని దాన్ని తీసి పెట్టడంలో ఏదైనా నష్టం ఉంటే వెంట తీసుకెళ్ళవచ్చును.

3- ఎడారి ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఖిబ్లా వైపున ముఖము, వీపు పెట్టి కూర్చోకూడదు. నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు ఏలాంటి పాపం లేదు. అయినా మంచిది కాదు.

4- కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ప్రజల చూపులకు దూరంగా పోవాలి. ఇందులో ఏ కొంచమైనా అశ్రద్ధ వహించకూడదు. నాభి నుండి మోకాళ్ళ వరకు పురుషులు కప్పి ఉంచుట తప్పనిసరి. స్త్రీ తన పూర్తి శరీరాన్ని. 5- శరీరం లేక దుస్తులపై మలమూత్ర తుంపరులు పడకుండా జాగ్రత్త వహించాలి.

6- మలమూత్ర విసర్జన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు లేనప్పుడు నజాసత్ మర్కలను దూరము చేయుటకు రాళ్ళు, టిష్యు (కాగితము) లాంటివి ఉపయోగించవచ్చును. పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి.

[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)  గారు రాసిన “శుద్ధి & నమాజు (Tahara and Salah)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది]


ఇతరములు :

శుచిశుభ్రత -3: స్నానం (గుస్ల్) & తయమ్ముమ్ [వీడియో]

బిస్మిల్లాహ్

[13:50 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

స్నానం గుస్ల్ అంటే పరిశుభ్రత పొందే ఉద్దేశ్యం (నియ్యత్)తో పూర్తి శరీరంపై నీళ్ళు పోసుకొనుట. అయితే గుస్ల్ సహీ అగుటకు పుక్కిలించడం, ముక్కులో నీళ్ళు ఎక్కించడంతో పాటు (శరీరంలో ఏ కొంత భాగం కూడా పొడిగా ఉండకుండా) పూర్తి శరీరాన్ని తడుపుట తప్పనిసరి. (దాని వివరణ ఇది: ముందు మర్మాంగ భాగాన్ని శుభ్రపరుచుకోవాలి. పిదప నమాజుకు చేయునటువంటి వుజూ చేయాలి. మళ్ళీ పూర్తి శరీరము పై నీళ్ళు పోసుకొని మంచిగా స్నానం చేయాలి).

గుస్ల్ విధియగుటకు ఐదు కారణాలు:

1) స్త్రీలకు గానీ పురుషులకు గానీ నిద్రలో ఉన్నా లేక మేల్కొని ఉన్నా కామము (షహ్వత్)తో ‘మనీ’ ఉబికిపడుటు. కామము లేకుండా ఏదైనా వ్యాది, లేదా విపరీతమైన చలి కారణంగా వెలువడితే గుస్ల్ విధి కాదు. అలాగే స్ఖలనమైనట్లు కలగని ‘మనీ’ లేదా దాని మర్కలేమీ చూడకుంటే గుస్ల్ విధి కాదు. ఎప్పుడు ‘మనీ’ లేక దాని మర్కలు కనబడునో అప్పుడే గుస్ల్ విధి యగును. స్ఖలమైనట్లు అతనికి గుర్తు లేకున్నా పరవాలేదు.

2- మర్మాంగాల కలయిక. అంటే భర్త మర్మాంగము భార్య మర్మాంగంలో ప్రవేశించినప్పుడు వీర్యము పడకపోయినా స్నానం చేయుట విధియగును.

3- రుతు స్రావం, ప్రసవ స్రావం ముగిసిన తరువాత గుస్ల్ విధియగును.

4- శవానికి గుస్ల్ చేయించడం విధిగా ఉంది.

5- ఇస్లాం స్వీకరించిన అవిశ్వాసి గుస్ల్ చేయడం విధిగా ఉంది.

‘జునుబీ’ పై నిశిద్ధమున్న విషయాలు:

స్వప్నస్ఖలనం వల్ల, లేదా భార్యభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనయిన వ్యక్తిని ‘జునుబీ’ అంటారు.

  • 1- నమాజ్.
  • 2- తవాఫ్.
  • 3- దివ్య ఖుర్ఆనును ఏ అడ్డు లేకుండా ముట్టుకోవడం, మెల్లగ, శబ్దముగా, చూసీ, చూడక ఏ స్థితిలోగాని చదవడం నిశిధ్ధం.
  • 4- మస్జిదులో నిలవడం. కాని మస్జిదులో నుండి దాటి పోవడంలో తప్పేమీ లేదు. మస్జిదులో నిలువవలసే గత్యంతర పరిస్థితి ఏర్పడినప్పుడు వుజూ చేసుకున్నా (మలినము కొంత వరకు తగ్గును, కనుక అది) సరిపోవును.

తయమ్ముమ్:

తయమ్ముమ్ అంటే పరిశుభ్రత పొందే ఉద్దేశ్యంతో నీళ్ళకు బదులుగా పరిశుభ్ర మట్టిని ఉపయోగించుట.

క్రింద తెలుపబడే కారణాలు సంభవించినప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా సరే వుజూ మరియు గుస్ల్ కు బదులుగా తయమ్ముమ్ చేయవచ్చును.

  • 1- అతికష్టంగా వెతికినప్పటికీ నీళ్ళు దొరకనప్పుడు, లేదా ఉండికూడా వుజూకు సరిపడనప్పుడు తయమ్ముమ్ చేయవచ్చును. కొంత దూరములో నీళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవడంలో అతనికి ధన, ప్రాణ నష్టమున్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
  • 2- నీళ్ళు లేదా వాతవరణం మరీ చల్లగా ఉండి నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
  • 3- నీళ్ళు కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
  • 4- వుజూ అవయవాల్లో ఏ ఒకదానికైనా గాయమయితే దాన్ని కడిగే ప్రయత్నం చేయాలి. కడగడం వల్ల నష్టం ఉంటే మసహ్ చేయాలి, అంటే చేయి తడి చేసి దాని మీద తుడువాలి. మసహ్ వల్ల కూడా హాని కలిగే భయం ఉంటే ఇతర అవయవాలు కడగాలి, ఈ అవయవం గురించి తయమ్ముమ్ చేయాలి. 

తయమ్ముమ్ విధానం:

మనుసులో నియ్యత్ /సంకల్పం చేసుకొని రెండు అరచేతులు ఒక సారి భూమిపై తట్టి ముఖముపై మసహ్ చేయాలి. మళ్ళీ ఎడమ అరచేతి తో కుడి చేతి పై భాగమున, మళ్ళీ కుడి అరచేతితో ఎడమ చేతి పై భాగమున మసహ్ చేయాలి. (కొందరు వుజూ చేసినట్లుగా మోచేతుల వరకు, కాళ్ళు సయితం మసహ్ చేస్తారు ఇది ప్రవక్త పద్దతి ఎంతమాత్రం కాదు).

వుజూను భంగపరిచే విషయాలే తయమ్ముమ్ ను భంగపరుస్తాయి. నమాజుకు ముందు లేదా నమాజు మధ్యలో నీళ్ళు లభిస్తే తయమ్ముమ్ భంగమవుతుంది. నమాజు పూర్తి చేసుకున్న తరువాత నీళ్ళు లభిస్తే ఆ నమాజు అయినట్లే. తిరిగి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు

[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)  గారు రాసిన “శుద్ధి & నమాజు (Tahara and Salah)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది]


ఇతరములు :

ఖుర్’ఆన్ తెలుగు (అహ్సనుల్ బయాన్) మొబైల్ యాప్

బిస్మిల్లాహ్

అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ – అహ్సనుల్ బయాన్

ఉర్దూ భాషలో మౌలానా ముహమ్మద్ జునాగడీ (Moulana Muhammad Jonagari ) మరియు హాఫిజ్ సలాహుద్దీన్ యుసుఫ్ (Hafiz Salah-ud-Din Yusuf) లు కలిసి తయారు చేసిన అహ్సనుల్ బయాన్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ సంకలనం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు తెలుగులో అనువదించినారు. శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించినారు.

క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఈ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
అరబిక్ మరియు తెలుగు అనువాదం మాత్రమే యాప్ లో ఉంది. వ్యాఖ్యానం లేదు. ఆడియో ఉంది కానీ ప్రస్తుతం పని చేయుటలేదు.

https://play.google.com/store/apps/details?id=com.qurantelegu&hl=en_US

 

సత్కార్య వనాలు: ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేయించుట

బిస్మిల్లాహ్

సత్కార్య వనాలు – దశమ వనం
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

ఉపవాస విరమణ (ఇఫ్తార్ చేయించుట)

కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు ఇందులో ఓ పాలు పంచుకున్నవారికి రెండింతల పంట, అంటే నీవు ఒక్క రోజులో రెండు ఉపవాసాలు ఉంటున్నావన్నమాట. అది ధర్మసంపద నుండి కొంత ఖర్చు పెట్టినంత మాత్రాన. దట్టమైన తోటల ఛాయలో నీవు ఛాయ పొందుతావు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:

(مَنْ فَطَّرَ صَائِمًا كَانَ لَهُ مِثْلُ أَجْرِهِ غَيْرَ أَنَّهُ لَا يَنْقُصُ مِنْ أَجْرِ الصَّائِمِ شَيْئًا)

ఎవరు ఉపవాసమున్నవారికి ఇఫ్తార్ చేయిస్తారో అతనికి ఉపవాసమున్నవారంత పుణ్యం లభించును. ఉపవాసమున్నవారి పుణ్యంలో ఏ కొరత జరగదు“. (తిర్మిజి 807. ఈ హదీసు హసన్ మరియు సహీ అని ఇమాం తిర్మిజి స్వయంగా చెప్పారు).

ఈ రోజుల్లో -అల్లాహ్ దయతో- కొన్ని స్వచ్ఛంద సేవ సంస్థలు ఎన్నో చోట్ల ఈ ఆరాధనను చాలా సులభమైనదిగా చేస్తున్నారు. కొన్ని (ఇఫ్తార్ చేయించే) మార్గాలు చూపిస్తారు. నీవు నీ కొంత సంపదతో అందులో పాల్గొనవచ్చు. వాస్తవానికి ఇది అగత్య పరులపై అల్లాహ్ కరుణ మరియు ఉపకారం చేసేవారికై రెట్టింపు పుణ్యాలకు మంచి దారి.

నీవు స్వయంగా ఈ దృశ్యాలు చూసి ఉంటావు. మస్జిదు ఆవరణలో మంచి మంచి ఆహారపదార్థాలతో విస్తరి వేయబడి ఉంటుంది. దాని చుట్టు దేశ, విదేశ బీద ముస్లింలు ఎంతో ప్రేమ, సంతోషంతో కూర్చుండి ఉంటారు. శ్రీమంతులు, ధనవంతులు స్వయంగా వారి సేవలో ఉండటాన్ని చూసి నీ నరనరాల్లో విశ్వాసం జీర్ణించుకుపోతుంది. వారు (శ్రీమంతులు) వారి(ఇఫ్తార్ చేయువారి)కిచల్లటి నీరు, వేడి వేడి జిలేబీలు, ఇతర తీపి పదార్థాలు అందిస్తూ ఉంటారు. సౌభ్రాత్వం, ప్రేమతో కూడిన చిరునవ్వు దాని మాధుర్యాన్ని మరింత పెంచుతుంది. ఇది ఓ చెప్పరాని విశ్వాసం. ఇది నిన్ను నీ ధర్మంపై గౌరవంగా ఉండే విధంగా చేస్తుంది. ఈ ధర్మమే ధనవంతుడిని పేదవాని పెదవుపై చిరునవ్వు తెప్పించే వానిగా చేస్తుంది. అంతే కాదు ధనవంతుడు స్వయంగా పేదలను వెతికి వారు సంతోషపడే వరకు వారికి ఇస్తూ ఉండే విధంగా చేస్తుంది.

వాస్తవానికి నేను ఆ సౌభ్రాత్రుత్వ దృశ్యాన్ని మరవలేను. నా కళ్ళారా నేను చూశాను (ఇఫ్తార్ సందర్భంలో) ఒక యజమాని తన చేతిలో ముద్ద తీసుకొని తన పనిమనిషి నోటిలో పెట్ట బోయాడు. ఆ పనిమనిషి సిగ్గుపడి తాను కూర్చున్న స్థలాన్ని వదలి పరిగెత్తాడు. యజమాని అతని వెంట పరుగిడుతూ చివరికి అతని నోట్లో ముద్ద పెట్టాడు. ఇది ఏదో ఒక నూతన సంఘటన కాదు. ప్రవక్త ﷺ ప్రవచనానికి ఆచరణ రూపం.

(إِذَا أَتَى أَحَدَكُمْ خَادِمُهُ بِطَعَامِهِ فَإِنْ لَمْ يُجْلِسْهُ مَعَهُ فَليُنَاوِلْهُ لُقْمَةً أَوْ لُقْمَتَيْنِ أَوْ أُكْلَةً أَوْ أُكْلَتَيْنِ فَإِنَّهُ وَلِيَ عِلَاجَهُ)

మీలో ఎవరి దగ్గరికైనా అతని సేవకుడు భోజనం తీసుకువస్తే, అతను సేవకుడ్ని తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకోలేని స్థితిలో ఉంటే అందులో నుంచి ఒక రెండు ముద్దలయినా అతనికి తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే అతను అన్నం వండే శ్రమ భరించాడు“. (బుఖారి 2557, ముస్లిం 1663).

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి.


ఇతరములు :

రమదాన్  మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

ఏ వస్తువునూ సృష్టించలేనివారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా? – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

15వ అధ్యాయం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
ఏ వస్తువునూ సృష్టించలేనివారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా?
[Do they make partners with that which has not created anything]
The famous commentary of Shaykh as-Sa’di (rahimahullaah) of the book Kitab at-Tawhid of Imam Muhammad ibn Abdul Wahhab (rahimahullaah)


అల్లాహ్ ఆదేశం:

أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنفُسَهُمْ يَنصُرُونَ

“ఏ వస్తువునూ సృష్టించలేనివారిని, స్వయంగా తామే సృష్టింపబడ్డవారిని, ఎవరికీ సహాయం చేయలేనివారిని, స్వయంగా తమకు తామే సహాయం చేసుకోలేనివారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా?” (ఆరాఫ్ 7: 191, 192).

అల్లాహ్ ఆదేశం:

وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِي

అల్లాహ్ ను కాదని మీరు పిలిచే ఇతరులకు కనీసం ఖర్జూరం విత్తనం పై ఉండు పొర అంత అధికారం కూడా లేదు.” (ఫాతిర్ 35: 13).

అనస్ (రజియల్లాహు అన్హు) కథనం: ఉహద్ యుద్ధం నాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గాయపడ్డారు. అందులో ఆయన నాలుగు పళ్ళు విరిగాయి. అప్పుడు ఆయన అన్నారు: “తమ ప్రవక్తను గాయపరచిన జాతి సాఫల్యం ఎలా పొందగలదు?” అప్పుడే ఈ వాక్యం అవతరించింది. “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీ లేదు“. (ఆలె ఇమ్రాన్ 3:128).

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫజ్ర్ నమాజులో, రెండవ రకాతులోని రుకూ నుండి తలెత్తి, “సమిఅల్లాహు లిమన్ హమిదహ్ రబ్బనా వలకల్ హందు” అన్న తరువాత “ఓ అల్లాహ్ ఫలాన, ఫలానను శపించు” అని అన్నది విన్నారు. అప్పుడే ఈ ఆయతు అవతరించింది: “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీ లేదు.” (ఆలె ఇమ్రాన్ 3:128). – (బుఖారి, నసాయీ).

మరో ఉల్లేఖనంలో ఉంది: సఫ్వాన్ బిన్ ఉమయ్యా, సుహైల్ బిన్ అమ్ర్, హారిస్ బిన్ హిషాంపై “బద్ దుఆ” చేస్తున్నప్పుడు (శపిస్తున్నప్పుడు) అవతరించింది: “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీలేదు.” (ఆలె ఇమ్రాన్ 3: 128). – (బుఖారి).

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: “నీ దగ్గరి బంధువులను భయపెట్టు.” (షుఅరా 26: 214). అన్న ఆయతు అవతరించిన తరువాత “ఓ ఖురైషులారా!” అని లేక ఇలాంటిదే ఒక పదముతో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందరిని సమావేశపరచి ఇలా చెప్పారు: “మీ ప్రాణాలను మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి. అల్లాహ్ వద్ద నేను మీకు ఏ మాత్రం సహాయం చేయలేను. ఓ అబ్బాసు బిన్ అబ్దుల్ ముత్తలిబ్! అల్లాహ్ వద్ద నేను మీకు ఏ మాత్రం సహాయం చేయలేను. ప్రవక్త మేనత్త సఫియ్యా! నేను నీకు అల్లాహ్ వద్ద ఏ మాత్రం సహాయం చేయలేను. ముహమ్మద్ కుమార్తె ఫాతిమా! నీవు కోరినంత నా సొమ్ము అడుగు ఇచ్చేస్తా, కాని అల్లాహ్ వద్ద నేను నీకు ఏ మాత్రం సహాయం చేయలేను“. (బుఖారి).

ముఖ్యాంశాలు:

1. పై రెండు ఆయతుల భావం.

2. ఉహద్ యుద్ధం యొక్క సంఘటన.

3. సకల ప్రవక్తల నాయకులైన ముహమ్మద్  (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఖునూత్ “లో దుఆ చేస్తు అంటున్నారు. (అలాంటి మహాపురుషులు తమ కష్ట కాలాల్లో అల్లాహ్ తో మొరపెట్టుకుంటే, సామాన్యులు తమ కష్ట కాలాల్లో అల్లాహ్ తో మొర పెట్టుకొనుట ఎక్కువ అవసరం).

4. ఎవరిని శపించబడినదో వారు అప్పుడు అవిశ్వాసులుగా ఉండిరి.

5. వీరు ఇతర అవిశ్వాసులు చేయని ఘోరకార్యాలు వారు చేశారు. ఉదా: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను గాయపరిచారు. ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారు. అమర వీరులైన (హత్యచేయబడిన విశ్వాసుల) అవయవాలను సయితం కోశారు. వీరు (విశ్వాసులు) వారి (అవిశ్వాసుల) తండ్రి సంబంధిత దగ్గరి బంధువులే.

6. ఇంత జరిగినందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని శపించినప్పుడు పై వాక్యం “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీలేదు”  ను అల్లాహ్ అవతరింపజేసాడు.

7. “వారిని క్షమించే, శిక్షించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది“(ఆలె ఇమ్రాన్ 3:128). అన్న అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ వారిని క్షమించాడు. వారు ఇస్లాం స్వీకరించారు. .

8. ముస్లింపై కష్టకాలం దాపురించినప్పుడు “ఖునూత్ నాజిల” చేయవలెను.

9. ఎవరిని శపించబడుతుందో వారిని, వారి తండ్రుల పేరుతో కలిపి శపించ వచ్చును.

10. ఖునూత్ లో ప్రత్యేకించబడిన ఒక్కొక్క వ్యక్తిని పై ప్రవక్త శపించారు.

11. (షుఆరా:214) ఆయత్ అల్లాహ్ అవతరించినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అందరిని సమూహపరచి తౌహీద్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసింది.

12. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తౌహీద్ ప్రచారం చేయునప్పుడు, “పిచ్చివాడు” అని అవిశ్వాసుల ద్వారా పిలువబడ్డారు. ఈ రోజుల్లో ఎవరైనా ముస్లిం అదే పని చేస్తుంటే వారి తో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు.

13. దగ్గరి, దూరపు బంధువులందరికి “నేను మీకు సహాయము చేయలేను” అని స్పష్టం చేశారు. స్వయం తమ కుమార్తె అయిన ఫాతిమాకు కూడా “ఓ ఫాతిమా! నేను నీకు సహాయము చేయలేను ” అని చెప్పారు. ఆయన ప్రవక్తల నాయకులై, స్త్రీల నాయకురాలైన ఫాతిమ (రజియల్లాహు అన్హా)కు ఏ మాత్రం పనికి రాను అని తెలిపారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సత్యం తప్ప మరేది పలకరు అని అందరి విశ్వాసం. అయినా ఈ రోజుల్లో ఈ రోగం సామాన్య ప్రజలకే కాక విద్యావంతులు కూడా అర్థం చేసుకోలేకున్నారు. తౌహీద్ , ధర్మం వారి వద్ద ఎంత విచిత్రమైందో అగపడుతుంది.

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ) :

ఇక్కడి నుండి తౌహీద్ యొక్క నిదర్శనాలు ప్రారంభం అవుతున్నాయి. తౌహీద్ ను నిరూపించడానికి ఉన్నటువంటి గ్రాంధిక, జ్ఞాన సంబంధమైన నిదర్శనాలు మరేదానికి లేవు.

తౌహీద్ రుబూబియత్, ఉలూహియత్ స్వయంగా ఇవి రెండు పెద్ద నిదర్శనాలు. సృష్టి, నిర్వహణలో అద్వితీయుడైన, అన్ని విధాలుగా సర్వశక్తుడైన వాడే ఆరాధనలకు అర్హుడు. అతడు తప్ప మరెవ్వడూ ఆరాధనలకు అర్హుడు కాడు.

అదే విధంగా సృష్టిరాసుల గుణాలను పరిశీలిస్తే కూడా దాని నిదర్శనాలు కనబడుతున్నాయి. అల్లాహ్ యేతరులలో దైవదూత, మానవుడు, చెట్లు, గుట్టలు మొదలగు ఎవరెవరి పూజా చేయబడుతుందో వారందరూ/అవన్నియు అల్లాహ్  ఎదుట దీనులు, బలహీనులు, భిక్షకులు. లాభనష్టాలు చేకూర్చే రవ్వంత శక్తి కూడా లేనివారు. ఏ కొంచెమూ సృష్టించలేరు. వారే సృష్టింపబడ్డారు. లాభనష్టాలు, జీవన్మరణాలకు మరియు రెండవసారి పునరుత్తానానికి వారు అధికారులు కారు. అల్లాహ్ మాత్రమే సర్వ సృష్టికి సృష్టికర్త. పోషకుడు. నిర్వహకుడు. లాభనష్టాలు చేకూర్చే, కోరిన వారికి ప్రసాదించే, కోరనివారికి ప్రసాదించకుండా ఉండే అధికారం కలవాడు. సర్వశక్తి ఆయన చేతిలో ఉంది. ఇంతకు మించిన, మంచి నిదర్శనాలు ఇంకేం కావాలి. వీటి ప్రస్తావన అల్లాహు తఆలా, ఖుర్ఆన్ లో అనేక చోట్ల ప్రస్తావించాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనేక సార్లు తెలిపారు. ఇది అల్లాహ్ ఒక్కడు, సత్యుడు, బహుదైవత్వం (షిర్క్) తుఛ్ఛం అనడానికి స్వాభావికమైన, జ్ఞాన సంబంధమైన నిదర్శనాలతో పాటు, గ్రాంధిక, ఎల్లవేళల్లో కనవినబడుతున్న నిదర్శనాలు కూడానూ.

సృష్టిలో కెల్ల అతి ఉన్నతుడైన ఒక మానవుడు (ప్రవక్త) స్వయం తన దగ్గరి బంధువునికి ఏ లాభం అందించలేక పోయినప్పుడు ఇతరులకు ఏమివ్వగలడు? ఇంతా తెలిసికూడా అల్లాహ్ తో షిర్క్ చేసినా, సృష్టిలో ఏ ఒక్కరిని అల్లాహ్ కు సమానంగా నిలబెట్టినవాడు నాశనమవుగాకా, అతడు ధర్మం కోల్పోయిన తరువాత, బుద్ధి జ్ఞానం కూడా కోల్పోయాడు.

అల్లాహ్ ను ఆ తరువాత సృష్టిని తెలుసుకున్నవాడు, అతని ఈ తెలివితో కేవలం అల్లాహ్ నే ఆరాధించాలి, ధర్మమును ఆయనకే ప్రత్యేకించాలి, ఆయన్ను మాత్రమే ప్రశంసించాలి, తన నాలుక, హృదయం, శరీరాంగాలతో ఆయనకే కృతజ్ఞత తెలుపాలి. సృష్టి రాసులతో భయం, ఆశ లాంటివేమి ఉండకూడదు.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 58: రమజాన్ క్విజ్ 08 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 58
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం – 08

(1) ఖుర్ఆన్ పఠిస్తే ప్రతీ అక్షరానికి ఎన్ని పుణ్యాలు లభిస్తాయి?

A)  10 పుణ్యాలు
B)  70 పుణ్యాలు
C)  1 పుణ్యం

(2) ఖుర్ఆన్ లో “రూహుల్ ఆమీన్” అని ఎవరిని సంభోదించుట జరిగింది?

A) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం )
B)  ఈసా (అలైహిస్సలాం)
C)  జిబ్రీల్ (అలైహిస్సలాం)

(3) ఖుర్ఆన్ ఏ రాత్రియందు అవతరించినది?

A)  షబే ఖద్ర్ రాత్రి
B)  లైలతుల్ ఖద్ర్ రాత్రి
C)  మేరాజ్ రాత్రి

క్విజ్ 58: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [5:44 నిమిషాలు]


రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం -08 : జవాబులు మరియు విశ్లేషణ

(1) ఖుర్ఆన్ పఠిస్తే ప్రతీ అక్షరానికి ఎన్ని పుణ్యాలు లభిస్తాయి?

A)  10 పుణ్యాలు

[999] وعن ابن مسعودٍ – رضي الله عنه – قال: قَالَ رسولُ اللهِ – صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ -: «مَنْ قَرَأ حَرْفاً مِنْ كِتَابِ اللهِ فَلَهُ حَسَنَةٌ، وَالحَسَنَةُ بِعَشْرِ أمْثَالِهَا، لا أقول: ألم حَرفٌ، وَلكِنْ: ألِفٌ حَرْفٌ، وَلاَمٌ حَرْفٌ، وَمِيمٌ حَرْفٌ» . رواه الترمذي، وقال: (حَدِيثٌ حَسَنٌ صَحيحٌ)

హదీసు కిరణాలు 999లో ఉంది: అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “ఎవరు అల్లాహ్ గ్రంథం ఖుర్ఆనులోని ఒక అక్షరం చదువుతారో వారికి దానికి బదులుగా ఒక పుణ్యం, ఆ ఒక పుణ్యం పది రెట్లు పెంచి ఇవ్వడం జరుగుతుంది. అలిఫ్, లామ్, మీమ్ (ఈ మూడు కలసి ఉన్న పదం) ఒక అక్షరం అని చెప్పను, అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం. (అంటే అలిఫ్ లామ్ మీమ్ అని చదువుతే ముప్పై పుణ్యాలు లభిస్తాయని భావం).

(2) ఖుర్ఆన్ లో “రూహుల్ ఆమీన్” అని ఎవరిని సంభోదించుట జరిగింది?

C)  జిబ్రీల్ (అలైహిస్సలాం)

26:192-195 وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ * نَزَلَ بِهِ الرُّوحُ الْأَمِينُ * عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنذِرِينَ * بِلِسَانٍ عَرَبِيٍّ مُّبِينٍ

“నిశ్చయంగా ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు. (ఓ ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వ సల్లం!) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది. (ఇది) సుస్పష్టమైన అరబీ భాషలో ఉంది.”

(3) ఖుర్ఆన్ ఏ రాత్రియందు అవతరించినది?

షబే ఖద్ర్ రాత్రి / లైలతుల్ ఖద్ర్ రాత్రి

రమజాను మాసములోని లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రేయి) లో అవతరించింది. దానిని లైలతుల్ ముబారక (శుభప్రదమైన రేయి) అని కూడా అంటారు .

2:185 شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ
“రమజాను నెల – ఖుర్‌ఆన్‌ అవతరింపజేయబడిన నెల.”

97:1 إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ
“నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖుర్ఆనును) ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము.”

44:3 إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةٍ مُّبَارَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ
“నిశ్చయంగా మేము దీనిని శుభప్రదమైన రాత్రియందు అవతరింపజేశాము. నిస్సందేహంగా మేము హెచ్చరిక చేసేవాళ్ళము.”


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

రమదాన్  మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

ఉపవాసం గురించిన సందేహాలు మరియు సమాధానాలు – షేఖ్ ఇబ్నె ఉథైమీన్ & ఇబ్నె బాజ్

బిస్మిల్లాహ్

مـســأل و أحـكام في الصـيـام

24 అంశాల గురుంచి చాల ముఖ్యమైన ఉపవాసపు ఫత్వాలు. తప్పక చదవండి

  1. రమదాన్ మాసపు నెలవంక కనబడటం గాని లేదా షాబాన్ నెల యొక్క మొత్తం 30 రోజులు పూర్తవటం గాని – ఈ రెండింటిలో ఏ ఒక్క సంఘటన జరిగినా సరే, అది మనం పవిత్ర రమదాన్ నెలలో ప్రవేశించామనే విషయాన్ని దృఢపరుస్తుంది. (ఫతావా ఫీ అహ్కామ్ అశ్శియామ్ 36వ పేజీ, షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్)

  1. రమదాన్ మాసం ప్రారంభంలో (ఆ నెల మొత్తం ఉపవాసం ఉండటం కోసం) ఒకేసారి నిశ్చయం (నియ్యత్) చేసుకుంటే సరిపోతుంది. కాని, ప్రయాణం లేదా అనారోగ్యం కారణంగా ఒకవేళ ఉపవాసాలను పూర్తిగా కొనసాగించక మధ్యలో ఆపినట్లయితే, వారి (రమదాన్ నెల ప్రారంభంలో చేసుకున్న) నిశ్చయం భంగమై పోతుంది (అంతమైపోతుంది). కాబట్టి ఆ సమస్య పూర్తయిన తర్వాత మరల ఉపవాసాలు ఉండేటప్పుడు, మరోసారి క్రొత్తగా సంకల్పం (నియ్యత్) చేయడం తప్పని సరి. (ఫతావా అర్కాన్ అల్ ఇస్లాం – 466వ పేజీ – షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్)
  1. ఎవరైనా ముసలితనం వలన ఉపవాసం ఉండలేకపోతున్నవారు లేదా కోలుకోవటానికి అవకాశం లేని దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్నవారు తగిన ఆర్థిక స్థోమత కలిగి ఉన్నట్లయితే తమ ప్రతి దినపు ఉపవాసానికి బదులుగా ఒక పేదవానికి భోజనం పెట్టవలెను. (మజ్ముఅ ఫతావా – సం-5, 233 వ పేజీ – ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్)
  1. నమాజు చేయకపోవటం వలన ఉపవాసం అసంపూర్తి అవుతుంది. ఇంకా వారి ఆచరణలు కూడా స్వీకరించబడవు. ఎందుకంటే నమాజు వదిలిన వాడు ఇస్లాం ధర్మానికి దూరమై (ముర్తద్)పోతాడనే విషయాన్ని ఖుర్ఆన్ అత్తౌబా-9:11లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడుفَإِنْ  تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآَتَوُا الزَّكَاةَ فَإِخْوَانُكُمْ فِي الدِّينِ“ఫఇన్ తాబూ, వ అఖాముస్స్ లాత, వఅతావుజ్జకాత, ఫఇఖ్వానుకుం ఫిద్దీన్.”
    “కావున వారు పశ్ఛాత్తాప పడి, నమాజు స్థాపించి, జకాత్   ఇస్తే! వారు మీ ధార్మిక సోదరులు”.ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు “బైన అర్రజులి వ బైన అష్ షిర్కి వల్ కుఫ్రి తర్కుశ్శలాత్” నమాజ్ చేయకపోవడమే ముస్లిం, షిర్క్ మరియు కుఫ్ర్ ల మధ్య ఉన్న భేదం. (ముస్లిం అంటే ఏకైక సృష్టికర్తకు సమర్పించుకున్నవాడు, షిర్క్ అంటే బహుదైవారాధన మరియు కుఫ్ర్ సృష్టికర్తను తిరస్కరించటం)” ముస్లిం హదీథ్ గ్రంథం, ఫతావా ఫీ అహ్కామ్ అశ్శియామ్-87వ పేజీ- షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్)
  1. ఒక వేళ అక్కడి ముఅజ్జిన్ (నమాజు వైపునకు పిలిచేవాడు) ఫజర్ సమయం ఆరంభమైన కొంత సేపటి తర్వాతనే అజాన్ (నమాజు కోసం పిలుపు) ఇచ్చేవాడని తెలిస్తే, అతడి అజాన్ పలుకులు మొదలు కాగానే భోజనం తినటం, త్రాగటం, మరియు ఉపవాసాన్ని భగ్నం చేసే ఇతర పనులన్నింటినీ వెంటనే ఆపివేయాలి. కాని అజాన్ సమయాన్ని కేవలం అనుమానం (గుమాన్), ఉజ్జాయింపు (అందాజా), నమాజు వేళల పట్టిక(జంత్రీ) ఆధారంగా నిర్ణయిస్తున్నట్లయితే అజాన్ సమయంలో తినటం, త్రాగటం తప్పు కాదు. (మజ్ముఅ ఫతావా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5, 259 వ పేజీ).
  1. ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ అభిప్రాయం ప్రకారం ఉపవాసం ఉన్నవారు నోటిలో ఊరే లాలాజలాన్ని మింగడంలో తప్పులేదు. నా జ్ఞానం ప్రకారం మరియు ఇతర పండితుల జ్ఞానం ప్రకారం కూడా ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాని ఒకవేళ చిక్కగా (పసుపు రంగులో) ఉండే ఉమ్ము (తెమ్డా) మరియు బల్గం నోటిలో వచ్చినట్లయితే వెంటనే బయటకు ఉమ్మేయడం అత్యవసరం. ఉపవాసకులకు దీన్ని మింగడానికి అనుమతివ్వబడలేదు. ఎందుకంటే దీనిని ఉమ్మేయడం తేలికగా సాధ్యమయ్యే పని. (వివరణ – నోటిలో మాటిమాటికి ఉరే లాలాజలాన్ని ఉమ్మేయడం కష్టమైన పని అందుకని అటువంటి చిన్న మోతాదులో ఉండే లాలాజలాన్ని మింగేయడానికి అనుమతివ్వబడినది మరియు పెద్దగా ఉమ్ము నోటిలో చేరినా లేక బల్గం నోటిలోకి వచ్చినా దానిని ఉమ్మేయడం అంత కష్టమైన పని కాదు, మరియు మాటిమాటికి రాదు కూడా – అందుకని దీన్ని మింగటానికి అనుమతివ్వబడలేదు, కాబట్టి దీనిని వెంటనే ఉమ్మేయ వలెను) (మజ్మూఅ ఫతావా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5, 251 వ పేజీ)
  1. ఉపవాసకుల గాయాల నుండి రక్తం కారటం లేక కొన్ని సందర్భాలలో రక్తం స్వయంగా (పంటిలో నుండి, ముక్కులో నుండి…) బయటికి రావడం వలన (అంటే తక్సీర్, ఇస్తేహాఙ అనేది లేక వేరే ఏదైన రక్తం) ఉపవాసం భగ్నం (ఫాసిద్) కాదు. కాని స్త్రీల నెలవారి ఋతుస్రావం అంటే మడి (హైజ్), జన్మనిచ్చిన తర్వాత బాలింతల నుండి బయటకు వచ్చే రక్తస్రావం (నిఫాస్), మరియు కావాలని ఎక్కువ మోతాదులో రక్తం బయటకు తీయడం (రక్తదానం, కప్పింగ్) మొదలైన పరిస్థితులలో ఉపవాసం భగ్నం (ఫాసిద్) అవుతుంది. అవసరమైనప్పుడు రక్తపరీక్షల కోసం ఉపవాసకుల నుండి తక్కువ మోతాదులో రక్తం తీయడంలో తప్పు లేదు.(మజ్ముఅ ఫతావా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5, 253 వ పేజీ)
  1. ఒకవేళ ఎవరైనా కావాలని స్వయంగా వాంతి చేసుకున్నట్లయితే వారి ఉపవాసం భగ్నమైపోతుంది. కాని వాంతి దానికదే వచ్చినట్లయితే ఉపవాసం భగ్నం కాదు.(ఫతావా అల్ షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ సం -1, 500 వ పేజీ)
  1. పుక్కిలించటం కోసం ఉపయోగించే (గర్ గరా) మందు (మౌత్ వాష్ లాంటిది) వాడటంతో ఉపవాసం భగ్నం కాదు. కాని అది ఎట్టిపరిస్థితిలోను కడుపులోనికి వెళ్ళకూడదు. కాబట్టి అనవసరంగా పుక్కిలించటం (గర్ గరా) చేయకూడదు. (ఫతావా అల్ షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ సం-1, 514 వ పేజీ)
  1. కంటిలో లేదా ముక్కులో మందు వేయడం, అలాగే కళ్ళలో కాటుక (సుర్మా) పెట్టడం వలన ఉపవాసం భగ్నం కాదు.(ఫతావా ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ సం-1, 520వ పేజీ)
  1. అవసరమైతే వంటకాల రుచి పరీక్షించడం లో తప్పు లేదు. అలాంటి పరిస్థితి లో నాలుక కొనభాగం (ముందున్న అంచు) ద్వారా మాత్రమే రుచి చూడవలెను మరియు కొంచం కూడా గొంతు లోపలికి పోనివ్వకూడదు. (షేఖ్ ఇబ్నె జిబ్రీన్ హఫిజహుల్లాహ్ – ఫతావా ఇస్లామీయ సం-2, 128 వ పేజీ)
  1. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ రమదాన్ మాసపు ఉపవాస స్థితిలో ఉండి, భర్త బలవంతంగా భార్యతో సంభోగం చేస్తే, భార్య ఉపవాసం భగ్నం కాదు మరియు ముఖ్యంగా ఆవిడ పై ఏ విధమైన ప్రాయశ్చితం ఉండదు. ఇక ఆ భర్త విషయాని కొస్తే, ఇటువంటి ఘోరమైన పాపపు పని చేయటం వలన అతడు మహా పాపిష్టి అవుతాడు. ఆ ఘోరమైన తప్పు నుండి బయటపడటానికి, అతడు బదులు ఉపవాసం అంటే ఆ రోజుకు మారుగా రమదాన్ నెల తర్వాత మరొక రోజు ఉపవాసం ఉండాలి (ఖదా రోజా) మరియు తప్పని సరిగా ధర్మ పద్ధతి ప్రకారం ప్రాయశ్చితం చేయాలి. అటువంటి పాపిష్టుల కోసం ఇస్లాం నిర్దేశించిన ప్రాయశ్చిత విధానం – అతడు తప్పని సరిగా ఒక దాసుడిని (గులాంను) విడుదల చేయ్యాలి లేదా ఎడతెగకుండా 2 నెలల పాటు ఉపవాసాలు ఉండాలి లేదా 60 మంది పేదలకు భోజనం పెట్టాలి. (ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్, ఫతావా ఇస్లామీయ సం-2, 136 వ పేజీ)
  1. కామావేశం వలన వీర్యస్ఖలనం జరిగినా లేదా పగటి కలలో వీర్యస్ఖలనం జరిగినా అతడి ఉపవాసం (ఫాసిద్)భగ్నం కాదు.(మజ్మూహ్ ఫతావీ ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5,243 పేజీ)
  1. భావోద్రేకం వలన బయటకు వచ్చే (వీర్యస్ఖలనం కాకుండా) చిక్కటి ద్రవం వలన ఉపవాసకుల ఉపవాసం భగ్నం కాదు.(మజ్మూహ ఫతావా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5, 245పేజీ)
  1. అన్నపానీయాలకు బదులు కానిదీ మరియు కేవలం చికిత్స కోసమే ప్రత్యేకింపబడినదీ అయిన ఏ ఇంజెక్షనైనా సరే, దానిని పొట్ట పై ఇచ్చినా లేక నరాలలో ఇచ్చినా మరియు దాని రుచి (పుల్లదనం) గొంతు లోనికి  వచ్చినా సరే ఉపవాసం భగ్నమవ్వదు.(మజాలిస్ షహర్ రమదాన్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ 100వ పేజీ)
  1. ఎవరైనా మతిమరుపు (పరధ్యానం) వలన ఏదైనా తిన్నా లేక త్రాగినా వారి ఉపవాసం భగ్నం కాదు. కాని వారికి ఉపవాసంలో ఉన్నామనే విషయం జ్ఞాపకం వచ్చిన వెంటనే తినటం, త్రాగటం ఆపేయాలి. అంతే కాకుండా వారి నోటిలో ఉన్న అన్నపు ముద్దను లేదా నీటి గుటకను కూడా వెంటనే ఉమ్మేయ వలెను. (ఫతావా ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ సం-1, 527 వ పేజీ)
  1. గర్భవతుల, పాలిస్తున్న మహిళల ఉపవాస ఆదేశాలు మరియు అనారోగ్యుల ఉపవాస ఆదేశాలు దాదాపుగా ఒకటే. ఒకవేళ ఉపవాసం ఉండటం వీరికి కష్టమైనట్లయితే, దానిని వాయిదా వేయటానికి షరియత్ (ఇస్లామీయ ధర్మాదేశాలు) అనుమతిస్తున్నది. అయితే ఆరోగ్యం కుదుటపడగానే వదిలేసిన ఆ ఉపవాసాలను తప్పక పూర్తి చేయవలెను. (మజ్మూఅ ఫతావా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5, 207 వ పేజీ)
  1. ముక్కులో మందు వేసుకుంటున్నప్పుడు ఒకవేళ అది గొంతులోనికి లేదా కడుపు లోనికి వెళ్ళినట్లయితే, ఉపవాసం భగ్నమైపోతుంది. (ఫతావా ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ సం-1, 560 వ పేజీ)
  1. శరీరానికి శక్తినిచ్చే విటమిన్ల ఇంజెక్షన్లు అంటే అన్నపానీయాల అవసరాన్ని తీర్చగలిగే ఇంజెక్షన్లు చేయించుకుంటే వారి ఉపవాసం భగ్నమైపోతుంది. (మజాలిస్ షహర్ రమదాన్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ 100 వ పేజీ)
  1. ఒకవేళ ఎవరైనా ముస్లిం రమదాన్ నెలలో ఉపవాసం ఉండ లేనంతటి అనారోగ్యంతో బాధపడుతూ, దాన్నుండి కోలుకోకుండానే రమదాన్ నెల దాటిన తర్వాత అదే అనారోగ్యంతో చనిపోతే, వారి పై ఉపవాసాలు పూర్తి చేయవలసిన నియమం వర్తించదు. ఇంకా ఆ తప్పిపోయిన ఉపవాసాలకు బదులుగా పేదలకు భోజనం పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే షరియత్ ప్రకారం అతడు బలహీనుడిగా (మాజూర్) పరిగణింపబడతాడు. (ఫతావా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5, 239వ పేజీ)
  1. ప్రయాణికులు ఉపవాసం ఉండకపోవటం మంచిది. మరియు ప్రయాణికులు ఉపవాసం ఉండగలిగితే ఏమీ తప్పు కాదు. ఎందుకంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రయాణంలో ఒకోసారి ఉపవాసాలు ఉండేవారు, ఇంకోసారి వదిలి పెట్టేసేవారు. కాని ఎండలు మరీ వేడిగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండవద్దని హెచ్చరించబడినది. మరియు ప్రయాణికుల ఉపవాసం మక్రూ అంటే అల్లాహ్ కు అయిష్టమైనది. (ఫతావా ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ సం-5, 187 వ పేజీ)
  1. రమదాన్ నెల ఉపవాసాలలో మరియు వేరే ఇతర నెలల ఉపవాసాలలో ఉపవాసకులు, మిస్వాక్ పుల్లతో పళ్ళు తోముకోవడానికి వెనుకాడడంలో ఎటువంటి అర్థం పర్థం లేదు. ఎందుకంటే మిస్వాక్ చేయడం సున్నత్ అంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఆచారం. (షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ ఫతావా ఇస్లామీయ సం-2, 126 వ పేజీ)
  1. ఉపవాసకులు సుగంధపరిమళాలు (ఇత్తర్లు) రాసుకోవడం లేక సువాసన పీల్చడంలో ఏమీ తప్పులేదు. కాని సాంబ్రాణి(బఖూర్) పీల్చడం తగదు. ఎందుకంటే అందులో పొగరూపంలో ఉండే తేమ కడుపు లోనికి చేరుతుంది. (షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ ఫతావా ఇస్లామీయ సం -2, 128 వ పేజీ)
  1. ఉపవాసకుల దంతాల నుండి వచ్చే రక్తం వలన వారి ఉపవాసం పై ఎటువంటి ప్రభావం ఉండదు. కాని ఆ రక్తం గొంతు లోపలికి పోకుండా (మింగకుండా) జాగ్రత్త పడాలి. అలాగే ముక్కు నుండి వచ్చే రక్తం వలన వారి ఉపవాసం పై ఎటువంటి ప్రభావం ఉండదు. కాని ఆ రక్తం గొంతు లోపలికి పోకుండా (మింగకుండా) జాగ్రత్త పడాలి. అటువంటి వారిపై ఏ విధమైన ప్రాయశ్చితం ఉండదు మరియు వేరే దినాలలో బదులు ఉపవాసం ఉండవలసిన అవసరం కూడా లేదు. (ఫతావా అర్కాన్ అల్ ఇస్లాం షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ 476 వ పేజీ).

తెలుగు అనువాదం: బిన్తె ఖాదర్ అలీ ఖాన్ లోధి
దివ్యఖుర్ఆన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, ఇస్లాంహౌస్ వారి సౌజన్యంతో
మూలాధారం – ఉర్దూ ప్రచురణ పత్రం, రబువా ప్రచారకేంద్రం, రియాధ్, సౌదీ అరేబియా.

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 57: రమజాన్ క్విజ్ 07 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 57
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం – 07

(1) ఉపవాసం మరియు తరావీహ్ నమాజు ఏ ఉద్దేశ్యంతో ఆచరించాలి?

A) అయిష్టం అయినప్పటికీ
B) బరువు తగ్గేందుకు ఉద్దేశించి
C) విశ్వాసం మరియు పుణ్యం పొందే ఉద్దేశం

(2) అల్లాహ్ వద్ద ఉపవాసి యొక్క నోటి వాసన దేనికంటే మేలైనది?

A) కస్తూరి వాసన కంటే
B) తేనె వాసన కంటే
C) అజ్వా ఖర్జురం వాసన కంటే

(3) ఎండతీవ్రత భరించలేనప్పుడు ఉపవాస స్థితిలో చేసే స్నానం గూర్చిన ఆదేశం ఏమిటి?

A) ఉపవాసం భంగం అవుతుంది
B) చెయ్య వచ్చు
C) పరిహారం చెల్లించాలి

క్విజ్ 57: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [7:48 నిమిషాలు]


రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం -07 : జవాబులు మరియు విశ్లేషణ

(1) ఉపవాసం మరియు తరావీహ్ నమాజు ఏ ఉద్దేశ్యంతో ఆచరించాలి?

C) విశ్వాసం మరియు పుణ్యం పొందే ఉద్దేశం

البخاري 37 ، 38 عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: «مَنْ قَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ» و «مَنْ صَامَ رَمَضَانَ، إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ» ورواه مسلم 759

బుఖారీ 37, 38 ముస్లిం 759లో ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని, అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “ఎవరు రమజాన్ మాసమెల్లా విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో ఖియామ్ చేశారో వారి గత పాపాలు మన్నించబడ్డాయి.” మరో ఉల్లేఖనంలో ఉంది: “ఎవరు రమజాన్ మాసమెల్లా విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో ఉపవాసాలు పాటించారో వారి గత పాపాలు మన్నించబడ్డాయి.

(2) అల్లాహ్ వద్ద ఉపవాసి యొక్క నోటి వాసన దేనికంటే మేలైనది?

A) కస్తూరి వాసన కంటే

«وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ، لَخُلُوفُ فَمِ الصَّائِمِ أَطْيَبُ عِنْدَ اللَّهِ مِنْ رِيحِ المِسْكِ»

బుఖారీ 1904, ముస్లిం 1151లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని, అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి! ఉపవాసి నోటి వాసన అల్లాహ్ వద్ద కస్తూరి సువాసన కంటే ఎంతో ఉత్తమమైనది.”

(3) ఎండతీవ్రత భరించలేనప్పుడు ఉపవాస స్థితిలో చేసే స్నానం గూర్చిన ఆదేశం ఏమిటి?

B) చెయ్య వచ్చు

అబూ దావూద్ 2365లో ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాహం లేదా వేడి వల్ల తన తలపై నీళ్ళు పోస్తూ ఉన్నది నేను చూశాను.

బుఖారీలో ఉంది: అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హు) వేడిని తగ్గించే కొరకై తన శరీరంలోని కొంత భాగం లేదా పూర్తి శరీరంపై తడి గుడ్డ వేసే ఉండేవారు.

وروى أبو داود (2365) عَنْ بَعْضِ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ رَأَيْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَصُبُّ عَلَى رَأْسِهِ الْمَاءَ وَهُوَ صَائِمٌ مِنْ الْعَطَشِ أَوْ مِنْ الْحَرِّ . صححه الألباني في صحيح أبي داود .
قال عون المعبود :
فِيهِ دَلِيل عَلَى أَنَّهُ يَجُوز لِلصَّائِمِ أَنْ يَكْسِر الْحَرّ بِصَبِّ الْمَاء عَلَى بَعْض بَدَنه أَوْ كُلّه , وَقَدْ ذَهَبَ إِلَى ذَلِكَ الْجُمْهُور وَلَمْ يُفَرِّقُوا بَيْن الاغْتِسَال الْوَاجِبَة وَالْمَسْنُونَة وَالْمُبَاحَة اهـ .
وقال البخاري رحمه الله :
بَاب اغْتِسَالِ الصَّائِمِ وَبَلَّ ابْنُ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا ثَوْبًا فَأَلْقَاهُ عَلَيْهِ وَهُوَ صَائِمٌ وَدَخَلَ الشَّعْبِيُّ الْحَمَّامَ وَهُوَ صَائِمٌ . . . وَقَالَ الْحَسَنُ لا بَأْسَ بِالْمَضْمَضَةِ وَالتَّبَرُّدِ لِلصَّائِمِ .


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

రమదాన్  మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 56: రమజాన్ క్విజ్ 06 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 56
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం – 06

(1) నెలవంక ను చూసి “చాంద్ ముబారక్” అని చెప్పవచ్చునా?

A)  చెప్ప వచ్చు
B)  చెప్పకూడదు
C)  తెలీదు

(2) నెలవంకను చూసినట్లు ఎంతమంది సాక్ష్యం – ఎవరి సాక్ష్యం అవసరం?

A)  శాస్త్రవేత్తలు
B)  మన వద్ద గల కాలండర్
C) సత్యవంతులు – ఆరోగ్యవంతులు అయిన కనీసం ఇద్దరు ముస్లీం లు

(3) ఉపవాస స్థితిలో మరచిపోయి తింటే లేదా త్రాగితే ఏమవుతుంది? 

A) ఉపవాసం భంగం అవుతుంది
B) ఉపవాసం భంగం కాదు
C) పుణ్యం తగ్గుతుంది

క్విజ్ 56: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [8:00 నిమిషాలు]


రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం -06

(1) నెలవంక ను చూసి “చాంద్ ముబారక్” అని చెప్పవచ్చునా?

B)  చెప్పకూడదు

రమజాను నెలవంక చూసి “చాంద్ ముబారక్” అనే అలవాటు మనలో కొంత మందికుంది. ఈ పద్ధతి మనకు మన సలఫె సాలిహీన్ (పూర్వ కాలపు సజ్జనులు) లో కానరాదు. రమజాను గాని ఏ ఇతర మాస నెలవంక గానీ చూసినచో ఈ దుఆ చదవాలి.

الترمذي 3451 مسند أحمد 1397 – أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا رَأَى الْهِلالَ، قَالَ: ” اللهُمَّ أَهِلِلْهُ عَلَيْنَا بِالْيُمْنِ وَالْإِيمَانِ، وَالسَّلامَةِ وَالْإِسْلامِ، رَبِّي وَرَبُّكَ اللهُ “

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నెలవంక చూసినప్పుడు ఈ దుఆ చదివేవారు

అల్లాహుమ్మ అహిల్లహూ అలైనా బిల్ యుమ్నీ వల్ ఈమాని వస్సలామతి వల్ ఇస్లామి రబ్బీ వరబ్బుకల్లాహ్

ఓ అల్లాహ్ ఈ చంద్రోదయాన్ని మా కొరకు శుభప్రదమైనదిగా, విశ్వాసముతో కూడుకున్నదిగా, ప్రశాంతమైనదిగా, ఇస్లాంతో కూడుకున్నదిగా చేయుము. ఓ చంద్రమా! నా ప్రభువు, నీ ప్రభువూ కూడా అల్లాహ్ యే.

أَيْ أَطْلِعْهُ عَلَيْنَا وَأَرِنَا إِيَّاهُ مُقْتَرِنًا بِالْأَمْنِ وَالْإِيمَانِ أَيْ بَاطِنًا وَالسَّلَامَةِ وَالْإِسْلَامِ أَيْ ظَاهِرًا وَنَبَّهَ بِذِكْرِ الْأَمْنِ وَالسَّلَامَةِ عَلَى طَلَبِ دَفْعِ كُلِّ مَضَرَّةٍ وَبِالْإِيمَانِ وَالْإِسْلَامِ عَلَى جَلْبِ كُلِّ مَنْفَعَةٍ عَلَى أَبْلَغِ وَجْهٍ وَأَوْجَزِ عِبَارَةٍ انْتَهَى رَبِّي وَرَبُّكَ اللَّهُ خِطَابٌ لِلْهِلَالِ عَلَى طَرِيقِ الِالْتِفَاتِ
وَلَمَّا تَوَسَّلَ بِهِ لِطَلَبِ الْأَمْنِ وَالْإِيمَانِ دَلَّ عَلَى عِظَمِ شَأْنِ الْهِلَالِ فَقَالَ مُلْتَفِتًا إِلَيْهِ رَبِّي وَرَبُّكَ اللَّهُ تَنْزِيهًا لِلْخَالِقِ أَنْ يُشَارَكَ فِي تَدْبِيرِ مَا خَلَقَ وَرَدَّ الْأَقَاوِيلَ دَاحِضَةً فِي الْآثَارِ الْعُلْوِيَّةِ

(2) నెలవంకను చూసినట్లు ఎంతమంది సాక్ష్యం – ఎవరి సాక్ష్యం అవసరం?

C) సత్యవంతులు – ఆరోగ్యవంతులు అయిన కనీసం ఇద్దరు ముస్లీం లు

أبوداود 2342 – عَنِ ابْنِ عُمَرَ قَالَ: «تَرَائِى النَّاسُ الْهِلَالَ،» فَأَخْبَرْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنِّي رَأَيْتُهُ فَصَامَهُ، وَأَمَرَ النَّاسَ بِصِيَامِهِ ” [حكم الألباني] : صحيح

అబూ దావూద్ 2342లో ఉంది: ఇబ్ను ఉమర్ (రజియల్లాహు అన్హు) చెప్పారు: ప్రజలు నెలవంక చూశారు, నేనూ చూశాను, వెంటనే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వస్లలం)కు నేను కూడా నెలవంక చూశానని తెలియజేశాను. అప్పుడు ప్రవక్త స్వయంగా ఉపవాసం పాటించి, ప్రజలు ఉపవాసం పాటించాలని ఆదేశించారు.

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే: ఉపవాసం మొదలు పెట్టుటకు ఒకరి సాక్ష్యం సరిపోతుంది. కాని ఉపవాసాలు మానుకొని, పండుగ జరుపుకొనుటకు ఇద్దరి సాక్ష్యం అవసరం. ఆ ఇద్దరు న్యాయవంతులు, విశ్వసనీయులైన ముస్లిములై ఉండాలి. దీనికి దలీల్ ఇదే అబూ దావూద్ గ్రంథంలో హదీసు నంబర్ 2338, 2339లో ఉంది. ఇవి రెండు కూడా సహీ హదీసులు.

(3) ఉపవాస స్థితిలో మరచిపోయి తింటే లేదా త్రాగితే ఏమవుతుంది? 

B) ఉపవాసం భంగం కాదు

البخاري 1933 ، مسلم 1155- عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: «إِذَا نَسِيَ فَأَكَلَ وَشَرِبَ، فَلْيُتِمَّ صَوْمَهُ، فَإِنَّمَا أَطْعَمَهُ اللَّهُ وَسَقَاهُ»

బుఖారీ 1933, ముస్లిం 1155లో ఉంది: అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “ఎవరైనా మరచిపోయి తిని ఉంటే, త్రాగి ఉంటే అతని తన ఉపవాసాన్ని కొనసాగించాలి, అల్లాహ్ అతని తినిపించాడు, త్రాపించాడు.”


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

రమదాన్  మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/