అల్లాహ్ ఎవరినైనా అభిమానిస్తే అతడ్ని తన దాసులకు అభిమాన పాత్రుడిగా చేస్తాడు

1692. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

అల్లాహ్ ఏ దాసుడిని అయినా అభిమానిస్తే జిబ్రయీల్ (అలైహిస్సలాం) ని పిలిచి “అల్లాహ్ ఫలానా వ్యక్తిని  అభిమానిస్తున్నాడు కనుక నీవు కూడా అతడ్ని అభిమానించు” అని అంటాడు. అందుచేత జిబ్రయీల్ (అలైహిస్సలాం) అతడ్ని అభిమానించడం ప్రారంభిస్తారు. తరువాత ఆయన ఆకాశంలో ఒక ప్రకటన గావిస్తూ “అల్లాహ్ ఫలానా వ్యక్తిని అభిమానిస్తున్నాడు. కనుక మీరంతా అతడ్ని అభిమానించండి” అని అంటారు. దాంతో ఆకాశవాసులంతా (అంటే దైవదూతలందరూ) అతడ్ని అభిమానించడం మొదలెడతారు. చివరికి భూమిపై కూడా అతనికి ప్రజాదరణ లభిస్తుంది.

[సహీహ్ బుఖారీ : 97 వ ప్రకరణం – అత్తౌహీద్, 33 వ అధ్యాయం – కలామిర్రబ్బి మఅ జిబ్రయీల్]

సామాజిక మర్యాదల ప్రకరణం – 48 వ అధ్యాయం – అల్లాహ్ ఎవరినైనా అభిమానిస్తే అతడ్ని తన దాసులకు అభిమాన పాత్రుడిగా చేస్తాడు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

సామూహిక నమాజు ప్రాముఖ్యం, దీనిని పోగొట్టుకున్న వారికి హెచ్చరిక

382. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  ఈవిధంగా అన్నారు :-

నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షం! కట్టెలు సమీకరించమని, అజాన్ ఇవ్వమని ఆజ్ఞాపించి, నమాజు చేయించడానికి నా స్థానంలో మరొకరిని నిలబెట్టి (సామూహిక నమాజులో పాల్గొనని) వారి దగ్గరకు వెళ్లి వారి ఇండ్లను తగలబెడదామని నేను (ఎన్నోసార్లు) అనుకున్నాను. నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆశక్తి స్వరూపుని సాక్షం! ఇషా నమాజు చేస్తే ఓ పెద్ద మాంసపు ముక్కగాని లేదా శ్రేష్టమైన రెండు మేక కాళ్ళు గాని లభిస్తాయని తెలిస్తే వారు తప్పకుండా ఇషా నమాజు చేయడానికి (మస్జిదుకు) వచ్చేవారు”.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 29 వ అధ్యాయం – వజూబి సలాతిల్ జమాఅత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 42 వ అధ్యాయం – సామూహిక నమాజు ప్రాముఖ్యం, దీనిని పోగొట్టుకున్న వారికి హెచ్చరిక. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఓ ఖర్జూరపు ముక్కనయినా సరే దానం చేసి నరకాగ్ని నుండి రక్షించుకోండి

597. హజ్రత్ అదీ బిన్ హాతిం (రధి అల్లాహు అన్హు) ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

“అతి త్వరలోనే అల్లాహ్ ప్రళయదినాన మీలోని ప్రతివ్యక్తితో ప్రత్యక్షంగా మాట్లాడుతాడు. ఆరోజు అల్లాహ్ కి దాసునికి మధ్య ఎలాంటి అనువాదకుడు ఉండదు. దాసుడు తల పైకెత్తి చూస్తాడు. మొదట తన ముందు ఏదీ కన్పించదు. రెండవసారి మళ్ళీ తలపైకెత్తి చూస్తాడు. అప్పుడతని ముందు ఎటు చూసినా అతనికి స్వాగతం చెబుతూ అగ్నే (భగభగ మండుతూ) కన్పిస్తుంది. అందువల్ల మీలో ఎవరైనా ఖర్జూరపు ముక్కయినా సరే దానం చేసి నరకం నుండి కాపాడుకోగలిగితే కాపాడుకోవాలి.”

హజ్రత్ అదీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారమే మరో సందర్భంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నరకాన్ని ప్రస్తావిస్తూ “నరకాగ్ని నుండి కాపాడుకోండి” అన్నారు. ఈ మాట చెప్పి ఆయన ముఖం ఓ ప్రక్కకు తిప్పుకున్నారు. (తాను నరకాగ్నిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు) నరకాగ్ని పట్ల భీతి, అసహ్యతలు వెలిబుచ్చారు. ఆ తరువాత తిరిగి ఆయన “నరకాగ్ని నుండి రక్షించుకోండి” అన్నారు. మళ్ళీ నరకాగ్ని పట్ల భీతి, అసహ్యతలు వెలిబుచ్చుతూ ముఖాన్ని ఒక పక్కకు తిప్పుకున్నారు.

ఈ విధంగా ఆయన మూడుసార్లు చేశారు. చివరికి ఆయన నిజంగానే నరకాగ్ని చూస్తున్నారేమోనని మాకు అనుమానం వచ్చింది. ఆ తరువాత ఇలా అన్నారు: “ఓ ఖర్జూరపు ముక్కనయినా సరే దానం చేసి నరకాగ్ని నుండి రక్షించుకోండి. అదీ దొరక్కపోతే ఓ మంచి మాటయినా పలకండి. నోట ఓ మంచిమాట వెలువడటం కూడా దానం (సదఖా) గానే పరిగణించబడుతుంది“.

[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – రిఖాఖ్, 49 వ అధ్యాయం – మన్నూ ఖిషల్ హిసాబి అజాబ్]

జకాత్ ప్రకరణం – 20 వ అధ్యాయం – దానం నరకానికి అడ్డుగోడగా నిలుస్తుంది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1.
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజులో మరచిపోవటం, సహూ సజ్దా చేయటం గురించి

335. హజ్రత్ అబ్దుల్లా బిన్ బహీనా (రధి అల్లాహు అన్హు) కధనం :-

(ఓ రోజు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక నమాజులో రెండు రకాతులు పఠించిన తరువాత లేచి నిల్చున్నారు. ‘ఖాయిదాయె ఊలా’ ప్రకారం కూర్చోవడం మరచిపోయారు. అనుచరులు కూడా ఆయనతో పాటు పైకి లేచారు. నమాజు పూర్తయి ‘సలాం’ చేయడానికి మేము ఎదురుచూస్తున్న తరుణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘అల్లాహు అక్బర్’ అంటూ కూర్చునే రెండు సార్లు సజ్దా చేశారు. ఆ తరువాత కుడి ఎడమల వైపు సలాం చేశారు.

[సహీహ్ బుఖారీ : 22 వ ప్రకరణం – సహూ, 15 వ అధ్యాయం – మాజాఅ ఫిస్సహూ….]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 19 వ అధ్యాయం – నమాజులో మరచిపోవటం, సహూ సజ్దా చేయటం గురించి. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు స్థితిలో మాట్లాడటం నిషిద్ధం

311. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

మొదట్లో మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేస్తుంటే ఆయనకు సలాం చేసే వాళ్ళము. నమాజు స్థితిలోనే ఆయన మాకు ప్రతి సలాం పలికేవారు. అయితే మేము (అబిసీనియా రాజు) నజాషీ దగ్గర నుండి (వలస వెళ్లి) తిరిగి వచ్చిన తరువాత మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు (నమాజు స్థితిలో) సలాం చేస్తే, ఆయన మాకు సమాధానమివ్వలేదు. (నమాజు ముగిసిన తరువాత) “నమాజు చేస్తున్నప్పుడు మనిషికి ఏకాగ్రత చాలా అవసరం” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 21 వ ప్రకరణం – అల్ అమలు ఫిస్సలాత్, 2 వ అధ్యాయం – మాయున్హా మినల్ కలామి ఫిస్సలాత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 7 వ అధ్యాయం – నమాజు స్థితిలో మాట్లాడటం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

క్రింది చేయి కంటే పైచేయి శ్రేష్టమైనది

613. హజ్రత్ హకీం బిన్ హిజామ్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

క్రింది చేయి కంటే పైచేయి శ్రేష్టమైనది. మొదట మీ పోషణలో ఉన్న వారికి దానం చేయండి. దానమిచ్చిన తరువాత కూడా మనిషి ధనవంతుడిగా ఉండిపోతే అలాంటి వ్యక్తి చేసే దానమే ఎంతో శ్రేష్టమైనది. (దానం) అర్ధించడం మానుకున్న వ్యక్తికి అల్లాహ్ దేవురించే అవమానం నుండి కాపాడుతాడు. దాన స్వీకారాన్ని లక్ష్యపెట్టకుండా మసలుకునే వారికి అల్లాహ్ కలిమిని ప్రసాదిస్తాడు.

[సహీహ్ బుఖారీ : 24 వ ప్రకరణం – జకాత్, 18 వ అధ్యాయం – లా సదఖత ఇల్లా అన్ జహ్ రిగ్నీ]

జకాత్ ప్రకరణం – 32వ అధ్యాయం – ఇచ్చే చేయి ఎప్పుడూ పైనే, పుచ్చుకునే చేయి ఎప్పుడూ క్రిందనే. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

The Upper Hand is better then the Lower Hand and Imaam Sufyaan ath-Thawree on the Filth of the People

ఒకడు మూత్రం (చుక్కలు) వంటిపై పడకుండా జాగ్రత్త వహించేవాడు కాదు. రెండవ వ్యక్తి చాడీలు చెబుతూ తిరుగుతుండే వాడు

167. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి రెండు సమాధుల మధ్య నుంచి నడుస్తూ “ఈ రెండు సమాధుల వాసులు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ శిక్షకు పెద్ద కారణం ఏదీ లేదు. వారిద్దరిలో ఒకడు మూత్రం (చుక్కలు) వంటిపై పడకుండా జాగ్రత్త వహించేవాడు కాదు. రెండవ వ్యక్తి చాడీలు చెబుతూ తిరుగుతుండే వాడు. అంతే” అని తెలియజేశారు. తరువాత ఆయన ఓ పచ్చటి మండ తీసుకుని, దాన్ని మధ్యకు చీల్చి రెండు భాగాలు చేశారు. ఆ రెండింటిని ఆ రెండు సమాధులపై నాటారు.

అనుచరులు అది చూసి “దైవప్రవక్తా! మీరిలా ఎందుకు చేశారు” అని అడిగారు. దానికి ఆయన సమాధానమిస్తూ “ఇలా చేయడం వల్ల ఈ మండలు ఎండిపోనంత వరకు వీరి (సమాధి) శిక్ష కొంత వరకు తగ్గిపోవచ్చని భావిస్తున్నాను” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 4 వ ప్రకరణం – వుజూ, 56 వ అధ్యాయం -మాజా అఫీ గస్లిల్ బౌల్]

శుచి, శుభ్రతల ప్రకరణం – 34 వ అధ్యాయం – మూత్రం ఆశుద్దత కు దూరంగా ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి

494. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

“శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.”

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 36 వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్]

జుమా ప్రకరణం – 3 వ అధ్యాయం – జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మస్జిద్ లో రెండు రకాతులు (నఫిల్) నమాజు చెయ్యనిదే కూర్చోరాదు

503. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపన్యాసం ఇస్తూ “ఇమామ్ ఉపన్యాసం ఇస్తున్నప్పుడు” లేక ఉపన్యాసం ఇవ్వడానికి ఉపక్రమించినప్పుడు ఎవరైనా వస్తే అతను (ముందుగా) రెండు రకాతులు (నఫిల్) నమాజు చేయాలి” అని అన్నారు.(*)

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 25 వ అధ్యాయం – మాజాఅ ఫిత్తత్వా మస్నామస్నా]

జుమా ప్రకరణం – 14 వ అధ్యాయం – జుమా ప్రసంగం సమయంలో ‘తహ్యతుల్ ఉజూ’ నమాజ్ చేయవలెను . మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

వడ్డీరహిత ఆర్ధిక వ్యవస్థ అల్లాహ్ ఆకాంక్ష

బిస్మిల్లాహ్

(తీర్పు దినం రోజు) వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతను గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు.  [అల్ బఖర – 2 : 275 ]

అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు. దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.

ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్ కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలిఉన్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదిలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీకొరకు శ్రేయోదాయకం.[అల్ బఖర – 2 : 276 – 280 ]

అధ్యాయం : 37 – వడ్డీరహిత ఆర్ధిక వ్యవస్థ అల్లాహ్ ఆకాంక్ష
పసిడిపూలు – అంశాల వారీగా ఖుర్ఆన్ వ్యాఖ్యాల సంకలనం
సంకలనం : రచన అనువాద విభాగం, శాంతి మార్గం పబ్లికేషన్స్