దుఆ విశిష్ఠత & నియమాలు – సలీం జామి’ఈ [వీడియో | టెక్స్ట్]

దుఆ విశిష్ఠత & నియమాలు
https://youtu.be/lrwdFEJwxlg [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ‘దుఆ’ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత, నియమాలు, మరియు విశిష్టతల గురించి చర్చించబడింది. దుఆ అనేది అల్లాహ్‌తో ప్రత్యక్ష సంభాషణ అని, ఆయనతో బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి ఒక సువర్ణ మార్గమని, మరియు ఆరాధనలలో అత్యంత విలువైనదని ఇది నొక్కి చెబుతుంది. పాపాలు చేసిన వారి దుఆను అల్లాహ్ స్వీకరించడు, పుణ్యాత్ముల దుఆలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరిస్తాడు వంటి అపోహలను ప్రసంగికుడు సరిదిద్దుతాడు. ఆదం, నూహ్, ఇబ్రాహీం, మూసా, మరియు ముహమ్మద్ (వారిపై శాంతి కలుగుగాక) వంటి వివిధ ప్రవక్తల ప్రార్థనల నుండి ఉదాహరణలను ఖుర్ఆన్ మరియు హదీసుల నుండి ఉదహరిస్తూ, విశ్వాసి జీవితంలో దుఆ యొక్క లోతైన ప్రాముఖ్యతను మరియు శక్తిని వివరిస్తాడు.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదా ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي
[రబ్బిష్రహ్ లీ సద్రీ, వ యస్సిర్లీ అమ్ రీ, వహ్ లుల్ ఉఖ్ దతమ్ మిల్ లిసానీ, యఫ్ ఖహూ ఖౌలీ]

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా, ఈనాటి ఈ ప్రసంగంలో మనం దుఆ, ప్రార్థన నియమాలు మరియు విశిష్టత గురించి ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్ మరియు హదీసు వెలుగులో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మిత్రులారా, భక్తుడు భగవంతునితో తన సంబంధం దృఢపరుచుకోవడానికి, దౌర్జన్యానికి గురవుతున్న అభాగ్యులు ఆ పరిస్థితి నుండి బయటపడుటకు, వ్యాపారి తన సంపాదనలో శుభం మరియు వృద్ధి పొందుటకు, అన్ని సమస్యలను అందరూ పరిష్కరించుకొనుటకు లోక రక్షకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందజేసిన సువర్ణ మార్గం దుఆ.

దుఆ అంటే అల్లాహ్‌ను వేడుకోవటం, అల్లాహ్‌ను ప్రార్థించటం. దీనిని మనము ఉర్దూ మరియు అరబీ భాషలో దుఆ అంటూ ఉంటాము కాబట్టి ప్రసంగంలో నేను ఎక్కడైనా దుఆ అని ప్రస్తావిస్తే దాని అర్థం అల్లాహ్‌ను వేడుకోవటం మరియు అల్లాహ్‌ను ప్రార్థించటం అనే అర్థం మీరు తెలుసుకోవాలి.

అల్లాహ్‌ను వేడుకోవాలని, అల్లాహ్‌తో దుఆ చేయాలని స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లోని 40వ అధ్యాయం, 60వ వాక్యంలో తెలియజేశాడు.

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
మీ ప్రభువు ఇలా అంటున్నాడు: “నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. (40:60)

ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులను ఆయనను వేడుకోవాలని, ఆయనను ప్రార్థించాలని ఆదేశిస్తున్నాడు. కాబట్టి, భక్తులు ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి మనిషి, ప్రతి భక్తుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను వేడుకోవాలి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను ప్రార్థించాలి.

మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులకు భరోసా కల్పిస్తున్నాడు. కొంతమంది సందేహపడవచ్చు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అయితే పైన ఆకాశాల పైన ఉంటాడు కాబట్టి మనము ఆయనకు వేడుకుంటే ఆయన మన మాటలను, మన ప్రార్థనలను వింటాడా అని సందేహపడవచ్చు. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులకు భరోసా కల్పిస్తున్నాడు, ఖుర్ఆన్ లోని రెండవ అధ్యాయం 186వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ
(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును ఆలకిస్తానని వారికి చెప్పు. (2:186)

కాబట్టి అభిమాన సోదరులారా, ఎప్పుడైతే భక్తుడు అల్లాహ్‌ను వేడుకుంటాడో, అతని ప్రార్థనను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వినటానికి, ఆమోదించడానికి, అతనికి సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది.

ఇక రండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు తెలియజేసి ఉన్నారు. అది కూడా మనం తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు:

الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
[అద్దుఆ’ఉ హువల్ ఇబాదా]
మనిషి చేసే ఆరాధనలలో దుఆ చాలా ముఖ్యమైనది. అసలు ఆరాధన అంటేనే దుఆ, దుఆ అంటేనే ఆరాధన అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటించారు.

ఇక్కడ మనం మరొక విషయం అర్థం చేసుకోవచ్చు, అదేమిటంటే ప్రార్థన ఆరాధనలోని ముఖ్యమైన భాగము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారంటే, ఏ భక్తుడైతే ఆరాధనలో ఎక్కువగా దుఆలు చదువుతాడో అతను అంతే విలువైన ఆరాధన చేస్తున్నాడని అర్థం. ఉదాహరణకు నమాజ్ ఉంది. ఒక వ్యక్తి నమాజ్ లోని దుఆలన్నీ నేర్చుకొని ఆ నమాజ్ ఆరాధన ఆచరిస్తున్నాడు. మరొక వ్యక్తి నమాజ్ లోని సగం దుఆలు మాత్రమే నేర్చుకొని ఆ నమాజ్ ఆరాధన ఆచరిస్తున్నాడు. ఇద్దరిలో ఎవరు ఉత్తముడు, ఎవరికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది అంటే ఏ వ్యక్తి అయితే దుఆలు అన్నీ, ప్రార్థనలు అన్నీ నేర్చుకొని నమాజ్ ఆరాధన చేస్తున్నాడో, అతను మంచి విలువైన నమాజ్ ఆరాధన చేస్తున్నాడు కాబట్టి అతను ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవడానికి అర్హుడవుతాడు. ఇదే విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది.

అలాగే మరోచోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ గురించి ఈ విధంగా తెలియజేశారు:

لَيْسَ شَيْءٌ أَكْرَمَ عَلَى اللَّهِ مِنَ الدُّعَاءِ
అల్లాహ్ వద్ద దుఆ కంటే విలువైనది మరొకటి లేదు.

చూశారా? దుఆ సాధారణమైన విషయం అనుకుంటారు. కాదు అభిమాన సోదరులారా, దుఆ అల్లాహ్ వద్ద చాలా విలువైనది, చాలా పవిత్రమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు.

అలాగే దుఆ యొక్క విశిష్టత మనము ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రతి మనిషి యొక్క విధివ్రాత అతను జన్మించక ముందే వ్రాయబడి ఉంది. అయితే, విధివ్రాతను మార్చగలిగే శక్తి కేవలం దుఆకు మాత్రమే ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు:

لَا يَرُدُّ الْقَضَاءَ إِلَّا الدُّعَاءُ
విధివ్రాతను కేవలం దుఆ ద్వారానే మనము మార్చుకోగలము. మన విధివ్రాత మారాలి అంటే మనము దుఆ చేయాలి. ఒక దుఆ ద్వారా మాత్రమే మన విధివ్రాత మారగలుగుతుంది. వేరే ఏ మార్గము ద్వారా కూడా మన విధివ్రాతను మనము మార్చుకోలేము.

అలాగే, మరో విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. అదేమిటంటే:

إِنَّهُ مَنْ لَمْ يَسْأَلِ اللَّهَ يَغْضَبْ عَلَيْهِ
ఏ వ్యక్తి అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయడో, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను వేడుకోడో ఆ వ్యక్తితో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆగ్రహిస్తాడు.

అల్లాహు అక్బర్. చూడండి, ఒక మనిషి మరో మనిషి వద్ద వెళ్లి సహాయం కోరాడు. ఒకసారి సహాయం చేస్తాడు. రెండుసార్లు, మూడుసార్లు సహాయం చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అతనితో వెళ్లి సహాయం అడిగితే మనిషి కోపం చూపిస్తాడు. సారికి నా దగ్గరికే వస్తున్నావు అని మనిషి ఏమైతాడు అంటే, సహాయం అడిగే వ్యక్తి సహాయం అడిగితే కోపగించుకుంటాడు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అలా కాదు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తుడు సహాయం కోరినప్పుడల్లా సంతోషిస్తాడు. భక్తుడు అల్లాహ్‌తో సహాయం కోరకపోతే, దుఆ చేయకపోతే, వేడుకోకపోతే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ఆ విషయం నచ్చదు, ఆ భక్తునితో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆగ్రహిస్తాడు.

అయితే అభిమాన సోదరులారా, అల్లాహ్‌ను వేడుకోవటం, అల్లాహ్‌తో దుఆ చేయటం భక్తుల లక్షణము. భక్తులలో ఉత్తమమైన భక్తులు ఎవరంటే ప్రవక్తలు. ప్రవక్తల లక్షణము కూడా అల్లాహ్‌తో దుఆ చేయటం, అల్లాహ్‌ను వేడుకోవటం. ఖుర్ఆన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు అని, వారి దుఆ స్వీకరించబడింది అని తెలియజేసి ఉన్నాడు. ఉదాహరణకు మనము కొన్ని ఉదాహరణలు చూద్దాం.

ఆదం అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లో ప్రస్తావించాడు. ఆదం అలైహిస్సలాం కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు. ఏమని దుఆ చేశారు?

رَبَّنَا ظَلَمْنَا أَنفُسَنَا وَإِن لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
“ఓ మా ప్రభూ! మేము మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు గనక నీవు మమ్మల్ని క్షమించకపోతే, మాపై కరుణించకపోతే మేము పూర్తిగా నష్టపోయిన వారిలో చేరిపోతాము.” (7:23)

అలాగే నూహ్ అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు. ఆయన ఏమని దుఆ చేశారు?

رَّبِّ اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِمَن دَخَلَ بَيْتِيَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ
“ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను, విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారినీ, విశ్వాసులైన పురుషులనూ, స్త్రీలనూ క్షమించు. (71:28)

ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రార్థించారు. ఆయన ఏమని ప్రార్థించారు అంటే:

رَبِّ اجْعَلْنِي مُقِيمَ الصَّلَاةِ وَمِن ذُرِّيَّتِي ۚ رَبَّنَا وَتَقَبَّلْ دُعَاءِ
“ఓ నా ప్రభూ! నన్నూ, నా సంతానాన్ని నమాజును నెలకొల్పేవారిగా చేయి. మా ప్రభూ! నా ప్రార్థనను స్వీకరించు. (14:40)

అలాగే, మూసా అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్‌తో దుఆ చేశారు. ఆయన ఏమని దుఆ చేశారంటే:

رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي وَاجْعَل لِّي وَزِيرًا مِّنْ أَهْلِي هَارُونَ أَخِي
“ప్రభూ! నా వక్షాన్ని నా కోసం విశాలపరచు, నా పనిని నాకు సులభం చేయి, నా నాలుక ముడిని విప్పు, జనులు నా మాటను అర్థం చేసుకునేందుకు. నా వారిలో నుండి నాకు ఒక సహాయకుణ్ణి నియమించు. నా సోదరుడైన హారూనును. (20:25-30)

అలాగే, జకరియా అలైహిస్సలాం వారి గురించి మనం చూసినట్లయితే, జకరియా అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు.

رَبِّ لَا تَذَرْنِي فَرْدًا وَأَنتَ خَيْرُ الْوَارِثِينَ
“ప్రభూ! నన్ను ఒంటరిగా వదలి పెట్టకు. నీవే సర్వోత్తమ వారసుడవు.” (21:89)

అలాగే, అయ్యూబ్ అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్‌తో దుఆ చేశారు.

أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ
“నాకు బాధ కలిగింది. నీవు కరుణించే వారందరిలోకీ అధికంగా కరుణించేవాడవు.” (21:83)

మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం చూచినట్లయితే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని వేళలా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను దుఆ చేస్తూ ఉండేవారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి నిద్రపోయే సమయం వరకు ప్రతి చోట, ప్రతి సందర్భంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ చేసేవారు.

ఇక రండి అభిమాన సోదరులారా, దుఆ గురించి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. దుఆ చేయడం ప్రవక్తల లక్షణమే కాదు, మన సజ్జన పూర్వీకులు సలఫ్ సాలిహీన్ మరియు గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే గతించారో వారందరి యొక్క లక్షణం ఏమిటంటే వారు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు, ప్రార్థించారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి, కొన్ని ఉదాహరణలు క్లుప్తంగా చెప్తున్నాను.

మనము ధార్మిక పండితుల నోట వింటూ ఉంటాం, ఒకసారి ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. వర్షం పడుతూ ఉంటే వర్షం నుండి తమను తాము కాపాడుకోవడానికి ఒక గుహలోకి వెళ్లిపోయారు. అనుకోకుండా కొండచరియలు విరిగిపడి ఒక పెద్ద రాయి వచ్చి గుహ యొక్క ముఖద్వారం వద్ద వచ్చి అడ్డుపడిపోయింది. వీరు గుహలోనే ఉండిపోయారు. గుహ నుంచి బయటికి రావడానికి వేరే మార్గం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏ ఆయుధాన్ని వారు ఉపయోగించారు? ఎలా వారు బయటికి పడగలిగారు అంటే ఆ లోపల ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ప్రార్థించారు. ముందు ఒక వ్యక్తి ప్రార్థించాడు, ఆ తర్వాత మరొక వ్యక్తి ప్రార్థించాడు, ఆ తర్వాత మరొక వ్యక్తి ప్రార్థించాడు. ఆ విధంగా ముగ్గురు గుహలో నుంచి అల్లాహ్‌ను ప్రార్థిస్తే, దుఆ చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ రాయిని తొలగించేశాడు, వారు ప్రాణాలతో బయటపడ్డారు.

అలాగే, మనము చూచినట్లయితే యూనుస్ అలైహిస్సలాం. యూనుస్ అలైహిస్సలాం వారికి, చాలా పెద్ద కథ, క్లుప్తంగా చెప్తున్నాను. నా అంశానికి సంబంధించిన విషయం మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. యూనుస్ అలైహిస్సలాం వారికి సముద్రంలో పడవేయడం జరిగింది. ఒక పెద్ద చేప వచ్చి ఆయనను మింగేసింది. చేప కడుపులో ఆయన ఉంటూ అల్లాహ్‌ను దుఆ చేశారు. ఓ అల్లాహ్ నన్ను కాపాడు, నన్ను మన్నించు అని

لَّآ إِلَٰهَ إِلَّآ أَنتَ سُبْحَٰنَكَ إِنِّى كُنتُ مِنَ ٱلظَّٰلِمِينَ
[లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక ఇన్నీ కున్తు మినజ్జాలిమీన్]

ఈ దుఆ ఆయన చేప కడుపులో నుంచి చేశారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేప కడుపులో ఉన్న ఆయన దుఆను, ప్రార్థనను విని ఆయనకు మళ్ళీ ప్రాణభిక్ష పెట్టి ఆ చేప కడుపులో నుంచి సముద్రం ఒడ్డున వచ్చేటట్టు చేసేశాడు.

ఈ విధంగా చాలా ఉదాహరణలు ఉన్నాయి. చెప్పొచ్చే విషయం ఏమిటంటే, మన సజ్జన పూర్వీకులు క్లిష్టమైన పరిస్థితుల్లో అల్లాహ్‌ను దుఆ చేశారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి దుఆను స్వీకరించి వారిని కష్టాల నుండి గట్టెక్కించాడు. కాబట్టి మనము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను తలుచుకోవాలి, అల్లాహ్‌ను వేడుకోవాలి, అల్లాహ్‌తో దుఆ చేయాలి. ఆయన మనకు కష్టాల నుండి గట్టెక్కించడానికి, మన సమస్యలు పరిష్కరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను, అదేమిటంటే చాలామంది ప్రజలు ఒక అపోహకి గురై ఉన్నారు. ఏంటి ఆ అపోహ? కొంచెం శ్రద్ధగా వినండి. చాలామంది ఏమనుకుంటారంటే, పాపాలు చేసిన వారి దుఆను అల్లాహ్ స్వీకరించడు, పుణ్యాత్ముల దుఆలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరిస్తాడు. ఈ విధంగా కొంతమంది భావిస్తారు. మేము పాపాలు బాగా చేసామండి కాబట్టి మనము ఏ దుఆ చేసినా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించడు, పుణ్యాత్ములు పాపాలు చేయని వారు వారు ఏ దుఆ చేసినా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఆమోదిస్తాడు అని కొంతమంది అపోహ పడుతూ ఉంటారు. ఇది నిజమేనా? అలా జరుగుతుందా? రండి మనము ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా ఈ విషయాన్ని ఇన్ షా అల్లాహ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

పాపాలు చేసిన వారి కోసం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేయింబవళ్ళు ఎదురుచూస్తూ ఉంటాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటించి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఉదయం పాపాలు చేసిన వ్యక్తులు రాత్రి పశ్చాత్తాపం చెంది అల్లాహ్‌తో క్షమాపణ కోరుకుంటారేమో అని రాత్రి మొత్తం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎదురుచూస్తాడు. రాత్రి పాపాలు చేసిన వారు ఉదయం పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరుకుంటారేమో అని ఉదయం మొత్తం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎదురుచూస్తాడు. ఆ విధంగా రేయింబవళ్ళు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నా భక్తులు పాపక్షమాపణ కోరుకుంటారేమో అని, పాపాలు చేసిన వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అభిమాన సోదరులారా. కాబట్టి పాపాలు చేసిన వారి దుఆలు స్వీకరించబడవు అని అనుకోవటం భ్రమ మాత్రమే. అల్లాహ్ వారి పాపాలు మన్నించడానికి ఎదురుచూస్తున్నాడు. కాబట్టి పాపాలు చేసిన వాళ్ళు సైతం అల్లాహ్‌తో దుఆ చేయాలి, అల్లాహ్‌తో క్షమాపణ వేడుకోవాలి.

పాపాలను చేసేవాళ్ళలో పెద్ద పాపిష్టుడు ఎవడండీ? పాపాలు చేసేవాడు కాదు, చేయించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడు వాడు? షైతాన్. షైతాన్ కంటే పెద్ద పాపిష్టుడు ఎవడైనా ఉన్నాడా? అంత పెద్ద పాపిష్టుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రార్థన చేశాడు, దుఆ చేశాడు. ఏమని దుఆ చేశాడు? ఖుర్ఆన్ లో ఆ ప్రస్తావన ఉంది. అతను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో అడిగాడు.

قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
“అల్లాహ్ నాకు నీవు ప్రళయం వరకు సజీవంగా ఉంచు” అని అల్లాహ్‌తో దుఆ చేశాడు.

పాపిష్టులలోనే పెద్ద పాపి, పెద్ద పాపిష్టుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తున్నాడు, ఓ అల్లాహ్ నాకు ప్రళయం వరకు నీవు సజీవంగా ఉంచు అంటున్నాడు. అల్లాహ్ ఏం చేశాడు? నువ్వు పాపిష్టుడివి, నేను నీ ప్రార్థన స్వీకరించను, నీ దుఆ స్వీకరించను అన్నాడా? సూర హిజ్ర్ 36 వ వాక్యంలో చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు:

قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
నువ్వు కోరుకున్నట్లుగానే నీకు నేను ప్రళయం వరకు వ్యవధి ఇచ్చేస్తున్నాను, నీకు ప్రళయం వరకు మరణం రాదు పో అని చెప్పేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. చూశారా? కాబట్టి, పాపి, పాపాలు చేసిన వారి దుఆలు స్వీకరించబడవు అని అనుకోవటం తప్పు అభిమాన సోదరులారా.

ఇక రండి, రెండో విషయం. పుణ్యాలు చేసే పుణ్యాత్ముల ప్రార్థనలన్నీ, దుఆలన్నీ స్వీకరించబడిపోతాయా? అలాంటిది ఏమైనా ఉందా అంటే రండి ఆ విషయం కూడా మనము ఖుర్ఆన్, హదీసు గ్రంథాల ద్వారా తెలుసుకుందాం. పుణ్యాత్ములలో, భక్తులలో గొప్ప భక్తులు ఎవరండీ? ప్రవక్తలు. పైగంబర్లు, ప్రవక్తల కంటే గొప్ప భక్తులు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో?

ప్రవక్తలలో గొప్ప ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు. నూహ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తున్నారు. ఏమని దుఆ చేస్తున్నారు?

رَبِّ إِنَّ ابْنِي مِنْ أَهْلِي
ఓ అల్లాహ్ నా ఇంటి సభ్యుడు, నా కుమారుడు నా కళ్ళ ఎదుటే మునిగిపోతున్నాడు, కాపాడు అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏం చేశాడు? నూహ్ అలైహిస్సలాం వారి ప్రార్థనను తిరస్కరించేశాడు. ఓ నూహ్,

إِنَّهُ لَيْسَ مِنْ أَهْلِكَ
అతను నీ కుమారుడే కాదు. అలాంటి వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేయటం తగదు. ఇంకొకసారి అలాంటి వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తే ప్రవక్తల జాబితాలో నుంచి నీ పేరు చెరిగిపోతుంది జాగ్రత్త అన్నాడు.

అల్లాహు అక్బర్. కాబట్టి నూహ్ అలైహిస్సలాం లాంటి గొప్ప ప్రవక్త, గొప్ప భక్తుడు దుఆ చేస్తూ ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన ఒక దుఆను తిరస్కరిస్తున్నాడు కాబట్టి, పుణ్యాత్ముల ప్రార్థనలన్నీ, దుఆలన్నీ స్వీకరించేస్తాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అని మనం అనుకోవటం తప్పు.

ఇంకొక ఉదాహరణ మనం చూచినట్లయితే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఉదాహరణ కూడా ఉంది, కాకపోతే సమయం ఎక్కువైపోతుంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. అదేమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్‌తో మూడు కోరికలు కోరారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరండీ? భక్తులలో, మానవులలోనే గొప్ప వ్యక్తి, ప్రవక్తలలోనే గొప్ప ప్రవక్త, ప్రపంచం మొత్తంలో ఆయన కంటే గొప్ప భక్తుడు, ఆయన కంటే గొప్ప వ్యక్తి ఎవరూ లేరు. అలాంటి గొప్ప భక్తుడు, అలాంటి గొప్ప ప్రవక్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో మూడు కోరికలు కోరితే, రెండు కోరికలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీర్చేశాడు, మూడవ కోరిక మాత్రము ఇది కుదరదు అని చెప్పేశాడు. అవేమిటంటే, అదంతా చెప్పుకుంటూ పోతే ఎక్కువ సమయం అయిపోతుంది కాకపోతే ఇది మీరు తెలుసుకోండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో కోరారు: ఓ అల్లాహ్ నా అనుచర సమాజం తుఫానులతో చెరిగిపోకూడదు అంటే అల్లాహ్ ఒప్పుకున్నాడు. నా అనుచర సమాజం కరువుకి గురికాకూడదు అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒప్పుకున్నాడు. నా అనుచర సమాజం పరస్పరం గొడవలు చేసుకోకూడదు అంటే ఇది కుదరదు అని చెప్పేశాడు. చూశారా? కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్‌తో దుఆ చేస్తే, వారి దుఆలలో ఒక దుఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తిరస్కరిస్తున్నాడు కాబట్టి, పుణ్యాత్ముల ప్రార్థనలన్నీ, దుఆలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరిస్తాడని అనుకోవటం కూడా తప్పే.

మరి వాస్తవం ఏమిటంటే, పాపిష్టులైనా పుణ్యాత్ములైనా ఎవరి దుఆ స్వీకరించాలి, ఎవరి దుఆ తిరస్కరించాలనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే అధికారం ఉంది. ఆయన తలచుకుంటే పాపిష్టుల దుఆ కూడా స్వీకరించగలుగుతాడు, పుణ్యాత్ముల దుఆ కూడా స్వీకరించగలుగుతాడు. కాబట్టి, ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే, మేమంతా పాపిష్టులము మా దుఆలు అల్లాహ్ దగ్గర ఆమోదించబడవు, కాబట్టి పుణ్యాలు చేసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో చూడండి, వారితో దుఆ చేయిద్దాం అని చెప్పి వెతుకుతారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కేవలం పుణ్యాలే చేసిన వాళ్ళు దొరకరు. ప్రతిచోట ప్రజలు పాపాలు చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా చివరకు? సజీవంగా ఉన్నవారిని వదిలేసి, మరణించిన వారి వద్దకు వెళ్ళిపోతారు. వారి గురించి రకరకాల కట్టుకథలు వ్రాయబడి ఉంటాయి అక్కడ. ఏమని అంటే, ఆయన అంత గొప్ప భక్తుడు, ఇంత గొప్ప భక్తుడు, ఇలాంటి ఇలాంటి గొప్ప గొప్ప పుణ్యకార్యాలు చేశాడు అని చెప్పేసి, చాలా విషయాలు అక్కడ రాయబడి ఉంటే, వారిని గొప్ప భక్తులు అని, పాపాలకు అతీతులు అని, పాపాలు చేయని వారు అని వారిని నమ్మి వెళ్లి వాళ్ళ దగ్గర ఇక వారిని సంతృప్తి పరచడానికి అక్కడ వెళ్లి లేనిపోని పనులన్నీ చేస్తూ ఉంటారు. గుండు కొట్టించుకోవడం అంట, తలనీలాలు సమర్పించుకోవడం అంట, అన్నాలు తినిపించడం అంట, అలాగే దుప్పటి కప్పడం అంట, చాదర్ ఎక్కించడం అంట, అలాగే రకరకాల కార్యాలన్నీ అక్కడ వెళ్లి చేస్తూ ఉంటారు అభిమాన సోదరులారా. సమాధుల వద్ద, జెండా మానుల వద్ద, ఇవన్నీ అక్కడ వెళ్లి చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారంటే, మేము పాపిష్టులము, మా దుఆ అల్లాహ్ స్వీకరించడు, వాళ్ళు గొప్ప భక్తులు వారి దుఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే స్వీకరిస్తాడు అని ఈ భ్రమలో పడిపోయి ఇలాంటి పాపాలన్నీ, ఇలాంటి చేరని తప్పులన్నీ చేస్తూ ఉంటారు.

కాబట్టి అభిమాన సోదరులారా, ఇలాంటి భావన నుండి బయటికి రండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఎప్పుడైతే భక్తుడు రెండు చేతులు ఎత్తి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో వేడుకుంటాడో, దుఆ చేస్తాడో, అతని రెండు చేతుల్ని ఖాళీగా పంపించడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సిగ్గుపడతాడు, నాకు తగిన విషయము కాదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భావిస్తాడు. కాబట్టి అభిమాన సోదరులారా, అలాంటి అల్లాహ్‌తో దుఆ చేయండి. ఏ అల్లాహ్ అయితే మీకు ఖాళీ చేతులు ఇంటికి పంపించడానికి సిగ్గుపడతాడో, ఆ అల్లాహ్‌తో దుఆ చేయండి. ఆయన ఎదురు చూస్తున్నాడు, నా భక్తులు నన్ను అడిగితే వారి మొరలను, వారి దుఆలను నేను స్వీకరించానని ఆయన ఎదురు చూస్తున్నాడు. అభిమాన సోదరులారా, అపోహలు వదలండి, అల్లాహ్‌ను నమ్మండి, అల్లాహ్‌ను విశ్వసించండి, అల్లాహ్ కారుణ్యాన్ని అర్థం చేసుకోండి, అల్లాహ్‌ను వేడుకోండి అభిమాన సోదరులారా. ఆయన అందరి మొరలను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు.

అల్లాహ్‌తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అల్లాహ్‌ను అర్థం చేసుకొని, అల్లాహ్‌ను ఎల్లవేళలా ప్రార్థించే వారిలాగా మార్చుగాక ఆమీన్.

أقول قولي هذا أستغفر الله لي ولكم ولسائر المسلمين فاستغفروه إنه هو الغفور الرحيم
[అఖూలు ఖౌలీ హాదా అస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్]

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17068

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


“నబీ కే సదఖా కే తుఫైల్ సే మా దుఆలు అల్లాహ్ స్వీకరించుగాక..” అని వేడుకోవచ్చా? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

https://youtu.be/JkmEHDE7xDU
[2:38 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ఆడియోలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) లేదా ఇతరుల మాధ్యమంతో (వసీలా) అల్లాహ్‌ను ప్రార్థించడం సరైనదేనా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం దుఆ (ప్రార్థన) చేయడానికి సరైన పద్ధతిని ఇది వివరిస్తుంది. సరైన పద్ధతి ప్రకారం, మొదట అల్లాహ్‌ను స్తుతించి, ఆ తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ (సలావత్) పంపి, ఆపై మన అవసరాలను అల్లాహ్‌తో విన్నవించుకోవాలి.

“ప్రవక్త యొక్క పుణ్యం కారణంగా” లేదా “ఫాతిమా, హసన్, హుసైన్‌ల పుణ్యం కారణంగా” మా ప్రార్థనను స్వీకరించు అని వేడుకోవడం ప్రవక్త (స) నేర్పని, సహాబాలు ఆచరించని మరియు సలఫ్-ఎ-సాలిహీన్ పద్ధతి కాని ఒక బిదాత్ (నూతన కల్పన) అని స్పష్టం చేయబడింది. కావున, ముస్లింలు ఇలాంటి పద్ధతులకు దూరంగా ఉండాలని బోధించబడింది.

ఇక్కడ వలీ భాయ్ ఒక ప్రశ్న అడిగారు, అస్సలాము అలైకుమ్. వ అలైకుమ్ అస్సలామ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. “ప్యారే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కే తుఫైల్ సే (ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆశీర్వాదం వల్ల)” మా యొక్క ప్రార్థనలు మరియు దువాలను అల్లాహ్ స్వీకరించు గాక అని అనటం పరిపాటి అయిపోయింది. కావున ఈ విధంగా వేడుకోవటం సమంజసమేనా?

చూడండి, అల్లాహు తాలా దుఆ చేసే యొక్క విధానాన్ని, పద్ధతిని మనకు తెలియజేశాడు. మనం ఖురాన్ ఆరంభంలోనే సూరహ్ ఫాతిహా చూస్తున్నాము కదా?

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَۙ، الرَّحْمٰنِ الرَّحِيْمِۙ، مٰلِكِ يَوْمِ الدِّيْنِۗ، اِيَّاكَ نَعْبُدُ وَاِيَّاكَ نَسْتَعِيْنُۗ
(అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్-రహ్మానిర్-రహీం, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక న’బుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
(సర్వస్తోత్రములు అల్లాహ్, సకల లోకాల ప్రభువుకే శోభాయమానం. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. తీర్పుదినానికి యజమాని. మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము.)

ఆ తర్వాత, మనకు కావలసింది ఏమిటో, మనకు మన జీవితంలో చాలా అత్యవసరమైనది ఏమిటో అది అడగండి అని అల్లాహ్ స్వయంగా మనకు నేర్పాడు. అయితే అల్లాహు తాలా దుఆ అడిగే యొక్క పద్ధతిని మనకు తెలియజేశాడు. అల్లాహ్ తో మనం ఏదైనా అడగాలంటే, ఏదైనా అర్ధించాలి అంటే, దుఆ చేయాలి అంటే ముందు అల్లాహ్ యొక్క స్తోత్రములు, అల్లాహ్ యొక్క పొగడ్తలు మనం పొగడాలి. అల్లాహ్ యొక్క స్తుతిని స్తుతించాలి.

ఇక ఆ తర్వాత హదీసుల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదవాలి. ఈ విషయం గమనించండి. ఈ రోజుల్లో ధర్మ జ్ఞానం ఖురాన్ హదీసుల నుండి మనం నేర్చుకోవడం లేదు. మనం అంటే అధిక మంది. అల్హందులిల్లాహ్ కొంతమంది ఉన్నారు, మీలాంటి చాలా శుభము గలవారు కూడా ఉన్నారు. అల్హందులిల్లాహ్ చాలా మంది ఖురాన్ హదీస్ ద్వారా సరైన జ్ఞానం నేర్చుకోవడం లేదు. అందుకొరకు, మనకు మన అవసరాలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క పరిష్కారాలు అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ మరియు హదీసుల్లో తెలిపారు. అయితే మనం నేర్చుకోవట్లేదు.

ఇక్కడ ప్రశ్నలో వచ్చిన విషయానికి మనం దూరమవుతున్నామని అనుకుంటున్నారు, కానీ లేదు. మనం దుఆ అంగీకరించబడాలి, మనం చేసే దుఆ అల్లాహు తాలా స్వీకరించాలి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది, అల్లాహ్ యొక్క స్తుతి, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ చదివి, మనం కావలసింది మనం కోరాలి. అప్పుడు అల్లాహు తాలా తప్పకుండా దుఆ స్వీకరిస్తాడు.

ఇక, “నబీ కే సదఖే కే తుఫైల్ మే (ప్రవక్త యొక్క పుణ్యం మరియు గౌరవం కారణంగా)”, “ఫాతిమా కే సదఖే కే తుఫైల్ మే (ఫాతిమా యొక్క పుణ్యం మరియు గౌరవం కారణంగా)”, “హసన్ హుసైన్ కే సదఖే కే తుఫైల్ మే (హసన్ మరియు హుసైన్ యొక్క పుణ్యం మరియు గౌరవం కారణంగా)”, “హమారీ దుఆ కుబూల్ ఫర్మా (మా ప్రార్థనను స్వీకరించు)” – ఈ విధంగా చెప్పడం, పలకడం స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పలేదు, సహాబాలు ఆచరించలేదు మరియు ఈ పద్ధతి అనేది మన సలఫ్-ఎ-సాలిహీన్ వారిది కాదు. ఇది ఈ పద్ధతి బిదాతి పద్ధతి (ధర్మంలో నూతన కల్పన). దీని నుండి మనం దూరం ఉండాలి.

వసీలా , తవస్సుల్

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/


రధీతు బిల్లాహి రబ్బన్, వ బిల్ఇస్లామి దీనన్, వబి ముహమ్మదిన్ రసూలన్ | విశ్వాస పాఠాలు | 11వ హదీస్ [వీడియో]

బిస్మిల్లాహ్

[13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ أَنَّ رَسُولَ اللهِ قَالَ: (يَا أَبَا سَعِيدٍ مَنْ رَضِيَ بِاللهِ رَبًّا وَبِالْإِسْلَامِ دِينًا وَبِمُحَمَّدٍ نَبِيًّا وَجَبَتْ لَهُ الْجَنَّةُ).

11- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం )ఉపదేశించారని, అబూ సఈద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఓ అబూ సఈద్! అల్లాహ్ ను తన పోషకునిగా విశ్వసించి, ఇస్లాంను తన ధర్మంగా స్వీకరించి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రవక్తగా నమ్మినవాడు తప్పక స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (ముస్లిం 1884).

ఈ హదీసులో:

ఈ మూడింటిని ఎవరైతే పూర్తి విశ్వాసముతో, స్వచ్ఛత, సంకల్పశుద్ధితో నోటి ద్వారా పలుకుతాడో తప్పక అల్లాహ్ అతనిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఎందుకనగా మూడు విషయాల్ని అతడు వాస్తవం చేసిచూపాడు. మరియు ధర్మానికి సంబంధించిన ముఖ్య పునాదుల్ని నమ్మాడు. అవిః అల్లాహ్ పట్ల విశ్వాసం. సత్యధర్మ స్వీకారం. సత్యవంతులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నమ్మకం.

—-

رَضيتُ بالله رَبّاً ، وبالإسلامِ ديناً ، وبمحمَدِ نَبِيًّا ، وَجَبَتْ له الجنَّةُ
“రధీతుబిల్లాహి రబ్బా, వబిల్ ఇస్లామి దీనా, వబి ముహమ్మదిన్ నబియ్యా“ ఎవరు ఈ దుఆ ఉదయం చదువుతారో, అతని చేయిని పట్టుకొని స్వర్గంలో ప్రవేశింపజేస్తానని ప్రవక్త పూచీ తీసుకున్నారు

والحديث فيه أخرجه الطبراني في “المعجم الكبير” (20/355) ، من طريق الْمُنَيْذِرِ صَاحِبِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ – وَكَانَ يَكُونُ بِإِفْرِيقِيَّةَ – قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: مَنْ قَالَ إِذَا أَصْبَحَ: رَضِيتُ بِاللهِ رَبًّا ، وَبِالْإِسْلَامِ دِينًا ، وَبِمُحَمَّدٍ نَبِيًّا ، فَأَنَا الزَّعِيمُ لِآخُذَ بِيَدِهِ حَتَّى أُدْخِلَهُ الْجَنَّةَ . والحديث حسنه بهذا اللفظ الشيخ الألباني في “السلسلة الصحيحة” (2686) .

ఎవరు అజాన్ లో షహాదతైన్ సందర్భంలో (లేదా చివరిలో) చదువుతారో వారి పాపాలు మన్నించబడతాయి. (సహీ ముస్లింలో 386)

أخرجه مسلم في “صحيحه” (386) ، من حديث سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ ، عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ:

مَنْ قَالَ حِينَ يَسْمَعُ الْمُؤَذِّنَ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ ، رَضِيتُ بِاللهِ رَبًّا ، وَبِمُحَمَّدٍ رَسُولًا ، وَبِالْإِسْلَامِ دِينًا ، غُفِرَ لَهُ ذَنْبُهُ .

మరెవరయితే ఎప్పుడైనా (సమయం నిర్థారిత కాకుండా, స్వచ్ఛమైన మనస్సుతో, అర్ధభావాలను తెలుసుకోని, ఆచరించి) చదువుతాడో అతని కొరకు స్వర్గం తప్పనిసరి. (అబూదావూద్ లోని సహీ హదీస్ 1368)

من حديث أبي سعيدِ الخدريَّ ، أن رسولَ الله – صلَّى الله عليه وسلم – قال: مَنْ قال: رَضيتُ بالله رَبّاً ، وبالإسلامِ ديناً ، وبمحمَدِ رَسولاً ، وَجَبَتْ له الجنَّةُ . والحديث صححه الشيخ الألباني في “صحيح أبي داود” (1368) .


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw

ఖజా నమాజు ఎలా చెయ్యాలి? ఖజా ఉమ్రీ నమాజు చేయవచ్చా?[వీడియో]

బిస్మిల్లాహ్

[4 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఉదయం సాయంత్రపు దుఆలు చదివి చేతుల మీద ఊపుకొని శరీరం మీద తుడుచుకోవచ్చా? మన పిల్లల శరీరం మీద తుడవవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[4 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ప్రతి నమాజు తరువాత చేతులెత్తి దుఆ చేసుకొని ఒళ్ళంతా చేతులతో తుడుచుకోవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[2 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

అనారోగ్యంగా ఉన్నవారి స్వస్థత కోసం ఉపవాసం ఉండి, ఖురాన్ చదివి దుఆ చేయవచ్చా? [ఆడియో]

బిస్మిల్లాహ్

[4 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

‘ఇన్షా అల్లాహ్’ అనే జిక్ర్ ని పని చేసే ఉద్దేశం లేకుండా, అబద్దం చెప్పడం కోసం వాడుకోగూడదు [వీడియో]

బిస్మిల్లాహ్

[7:42 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

క్రింది వీడియో కూడా తప్పక వినండి

“ఇన్షా అల్లాహ్” కు సంబంధించిన ముఖ్య ఆదేశాలు [వీడియో]
https://teluguislam.net/?p=14098

18:23 وَلَا تَقُولَنَّ لِشَيْءٍ إِنِّي فَاعِلٌ ذَٰلِكَ غَدًا
ఏ విషయంలోనయినాసరే “రేపు నేను ఈ పని చేస్తాను” అని ఎట్టిపరిస్థితిలోనూ చెప్పకు.

18:24 إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ وَاذْكُر رَّبَّكَ إِذَا نَسِيتَ وَقُلْ عَسَىٰ أَن يَهْدِيَنِ رَبِّي لِأَقْرَبَ مِنْ هَٰذَا رَشَدًا
అయితే “అల్లాహ్‌ తలిస్తే చేస్తాను (ఇన్‌షా అల్లాహ్‌)” అని అనాలి. మరచిపోయినప్పుడల్లా నీ ప్రభువును స్మరించు. “నా ప్రభువు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ వుంది” అని చెబుతూ ఉండు.

మృతుని కోసం మదరసా పిల్లలతో ఖురాన్ చదివించి వారికి భోజనాలు పెట్టవచ్చా? మృతుని కోసం ఎటువంటి మంచి పనులు చేయాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[7 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

క్రింది ఆడియోలు కూడా తప్పక వినండి
ఇస్లాం ఆత్మహత్యకు అనుమతిస్తుందా? [ఆడియో]
ఆత్మహత్య చేసుకున్న ముస్లిం కొరకు జనాజా నమాజు మరియు దుఆ చేయవచ్చా [వీడియో]

ఆత్మహత్య చేసుకున్న ముస్లిం కొరకు జనాజా నమాజు మరియు దుఆ చేయవచ్చా [వీడియో]

బిస్మిల్లాహ్

[3 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

క్రింది ఆడియో కూడా తప్పక వినండి
ఇస్లాం ఆత్మహత్యకు అనుమతిస్తుందా? [ఆడియో]

పరలోకం (The Hereafter) ( మెయిన్ పేజీ)
https://teluguislam.net/hereafter/