కేవలం వుజూ ద్వారా మీరు అనేకానేక పుణ్యాలు పొందవచ్చును ఆ పుణ్యాల గురించి ఈ వీడియోలో వినండి, చూడండి.
[6 నిమిషాల వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
నిఫాఖ్ (కపటత్వం) నిర్వచనం, దాని రకాలు
(1) నిఫాఖ్ (కపటత్వం, వంచన) నిర్వచనం :
“నిఫాఖ్” అనేది నిఘంటువు ప్రకారం “నాఫఖ” అనె క్రియతో ముడిపడి ఉంది. నాఫఖ యునాఫిఖు నిఫాఖన్ వ మునాఫఖతన్ అని అనబడుతుంది – ఈ పదం “అన్నాఫిఖాఅ” నుండి గ్రహించబడినది. అంటే ఉడుము తన కన్నం నుండి బయటపడే రహస్యమార్గం అని భావం. కన్నంలో ఉన్న ఉడుమును ఒక మార్గం నుంది పట్టుకోటానికి ప్రయత్నించినపుడు అది రెండో వైపు నుండి పారిపోతుంది. మరో ఉవాచ ప్రకారం ఇది ‘నఖఫ‘ నుండి సంగ్రహించబడినది. ఉడుము దాక్కున్న కన్నాన్ని నఫఖ అంటారు. (అన్నిహాయతుల్ ఇబ్బ్నుల్ అసీర్ – 5/98)
షరీయత్ ప్రకారం ‘నిఫాఖ్’ అంటే:
ఇస్లాం గురించి, మంచి గురించి ప్రకటించటం. దాంతోపాటే తిరస్కారభావాన్ని, కపటత్వాన్ని మనసులో దాచి పెట్టడం. దీనికి నిఫాఖ్ అనే నామకరణం ఎందుకు చేయబడిందంటే మునాఫిఖ్ (కపటవిశ్వాసి, వంచకుడు) షరీయతులో ఒక ద్వారం గుండా ప్రవేశించి, మరో ద్వారం గుండా షరీయత్ నుండి బయటికెళ్ళిపోతాడు. దీనిపై అల్లాహ్ ఈ విధంగా హెచ్చరించాడు –
“నిశ్చయంగా కపటులు పాపాత్ములు (అవిధేయులు).” (అత్ తౌబా : 67)
అంటే వారు షరీయత్ కట్టుబాట్లను ఖాతరు చేయకుండా వెళ్ళిపోయువారన్నమాట!
అల్లాహ్ కపట విశ్వాసులను అవిశ్వాసులకన్నా చెడ్డవారుగా ఖరారు చేశాడు :
“నిశ్చయంగా కపటులు నరకంలోని అధమాతి అధమ శ్రేణిలోకి వెళతారు.” (అన్ నిసా :145)
ఇంకా ఇలా సెలవిచ్చాడు :
“నిశ్చయంగా కపటులు తమ జిత్తులతో అల్లాహ్‌నే మోసగించాలనుకుంటున్నారు. అయితే అల్లాహ్ వారి జిత్తులకు తగిన శిక్ష విధించనున్నాడు” (అన్ నిసా : 142).
ఇంకా ఈ విధంగా కూడా సెలవిచ్చాడు:
“వారు అల్లాహ్‌ను, విశ్వాసులనూ మోసపుచ్చుతున్నారు. అయితే వాస్తవానికి వారు స్వయంగా – తమను తామే – మోసపుచ్చుకుంటున్నారు. కాని ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు. వారి హృదయాలలో రోగం ఉంది. ఆ రోగాన్ని అల్లాహ్ మరింతగా పెంచాడు. వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమయిన శిక్ష ఉంది.” (అల్ బఖర – 9, 10)
(2) నిఫాఖ్ (కాపట్యం) రకాలు ;
నిఫాఖ్ (కపటత్వం) రెండు రకాలు : (1) విశ్వాసపరమైన కపటత్వం (2) క్రియాత్మకమైన కపటత్వం.
మొదటిది: విశ్వాసపరమైన కపటత్వం
ఇదే నిఫాఖె అక్బర్. అంటే పెద్ద తరహా కపటత్వం. దీనికి ఆలవాలమై ఉన్న వ్యక్తి పైకి ఇస్లాం స్వీకరించినట్లు ప్రకటిస్తాడు. లోపల కుఫ్ర్ని (అవిశ్వాసాన్ని) దాచిపెట్టుకుంటాడు. ఈ రకమయిన కపటత్వం కలవాడు ఇస్లాం నుండి పూర్తిగా బహిష్క్రుతుడైనట్లే. దీనికి పాల్పడినవాడు నరకంలోని అట్టడుగు వర్గీయుల్లో చేరతాడు. అల్లాహ్ కపటులను అత్యంత చెడ్డవారుగా అభివర్ణించాడు. ఉదాహరణకు : అవిశ్వాసం, అవినీతి, ధర్మాన్ని ధర్మావలంబీకులను పరిహసించటం, వారిని చూసి వెకిలి సైగలు చేయటం, ఇస్లాం విరోధులతో కుమ్మక్కు అవటం వారిలోని దుర్గుణాలు. కపట విశ్వాసులు శత్రుత్వంలో ఇస్లాం శత్రువులకు సమ ఉజ్జీలుగా ఉంటారు. ఈ కపటులు అన్ని కాలాల్లో ఉన్నారు, ఉంటారు. ముఖ్యంగా ఇస్లాం ప్రాబల్యం వహించినపుడు ఓర్చుకోలేకపోతారు. బహిరంగంగా ముస్లింలను ఎదిరించే శక్తి వారిలో ఉండదు. అందుకే ఇస్లాంకు, ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు పన్నే ఉద్దేశంతో ఇస్లాం స్వీకరిస్తున్నట్లు ప్రకటిస్తారు. ఆ విధంగా ఇస్లాం ముసుగులో ఎసరుపెడతారు. అలా ఉండటం వల్ల తమ ధన ప్రాణాలకు రక్షణ ఉంటుందన్న స్వార్ధం కూడా వారి అంతరంగంలో దాగి ఉంటుంది.
అందుకే కపట విశ్వాసి (మునాఫిఖ్) అల్లాహ్‌ను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని విశ్వసించినట్లు పైకి ప్రకటిస్తాడు. కాని అతని అంతరంగంలో తిరస్కరణాభావం తిష్టవేసి ఉంటుంది. నిజానికి అతనికి అల్లాహ్ పై విశ్వాసముండదు. ఖుర్‌ఆన్ దైవప్రోక్తమని, ఆయన దానిని ఒక మానవమాత్రుని (ముహమ్మద్ – సల్లలాహు అలైహి వ సల్లం) పై అవతరింపజేశాడని, ఆయన్ని సమస్త మానవుల వైపు సందేశహరునిగా పంపాడనీ, ఆ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహిస్తారని, ఆయన విధించే శిక్ష గురించి సావధానపరుస్తారని స్వయంగా అల్లాహ్ తెలియజేశాడు. అయినప్పటికీ కపట విశ్వాసికి ఇదేమీ పట్టదు. అల్లాహ్ దివ్య ఖుర్‌ఆన్‌లో కపటుల బండారాన్ని బట్టబయలు చేశాడు. వారి లోగుట్టును రట్టు చేశాడు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండమని తన దాసులను సావధానపరిచాడు.
అల్ బఖరా సూరాలోని తొలి వాక్యాలలోనే మానవుల లోని మూడు వర్గాల ప్రస్తావన తేబడింది – (1) విశ్వాసులు (2) అవిశ్వాసులు (3) కపటులు. విశ్వాసుల ప్రస్తావన 4 సూక్తులలో, అవిశ్వాసుల ప్రస్తావన 2 సూక్తులలో వస్తే కపటుల ప్రస్తావన 13 సూక్తులలో వచ్చింది. ఎందుకంటే కపటులు అధిక సంఖ్యలో ఉన్నారు – నివురు గప్పిన నిప్పులా ఉంటారు. వారెక్కడ ఉన్నా అక్కడి ప్రజల పాలిట ఒక పరీక్షగా, ఉపద్రవంగానే ఉంటారు. కాగా; ఇస్లాం మరియు ముస్లింల పాలిట వారి బెడద తీవ్రమైనది. ఎందుకంటే వారి మూలంగా సదా ఇస్లాంకు ఎన్నో కష్టాలు వచ్చిపడ్డాయి. వారు బాహ్యంలో ఇస్లాం అనుయాయులుగా కనిపిస్తారు. సమర్థకులుగా ముందుకు వస్తారు. యదార్దానికి వారు ఇస్లాం ధర్మానికి బద్ధశత్రువులుగా ఉంటారు. సర్వవిధాలా వారు ఇస్లాంకు తూట్లు పొడుస్తుంటారు. అమాయకులు, అవివేకులు వారిని చూసి మంచివారుగా తలపోస్తారు. వారి మాటల్ని సంస్కరణతో కూడిన మాటలుగా భావిస్తారు. కాని వారి మాటల్లో అజ్ఞానం, కల్లోలం కలగలసి ఉంటుంది.
(‘సిఫాతుల్ మునాఫిఖీన్ లి ఇబ్బ్నుల్ ఖయ్యిమ్’ నుండి సేకరించబడింది. )
విశ్వాసపరమైన కపటత్వం ఆరు రకాలు :
(మజ్మూఅతుత్తౌహీద్ – పేజి : 9)
రెండవ రకం – క్రియాత్మకమైన కపటత్వం (నిఫాఖె అమలీ) :
అంటే మనిషి హృదయంలో విశ్వాస (ఈమాన్) మైతే ఉంటుంది గాని అతని ఆచరణల్లో కపటత్వం తొంగి చూస్తుంటుంది. ఇటువంటి ఆచరణ మనిషిని ఇస్లాం పరిధి నుండి బయటికి నెట్టదు. కాని కపటత్వం ముదిరే ప్రమాదం మాత్రం పొంచి ఉంటుంది. ఇలాంటి వ్యక్తిలో విశ్వాసం, కాపట్యం – రెండూ ఉంటాయి. అయితే కాపట్యం మోతాదు పెరిగిపోయినపుడు అతను పక్కా కపటిగా తయారవుతాడు. దీనికి ప్రమాణం ప్రవక్త మహనీయుల (సల్లలాహు అలైహి వ సల్లం) వారి ఈ ప్రవచనం.
“నాలుగు లక్షణాలున్నాయి. అవి గనక ఎవరిలోనయినా ఉంటే అతను పక్కా కపట విశ్వాసి అవుతాడు. ఎవరిలోనయినా వాటిలో ఏ ఒక్క లక్షణమైనా ఉంటే కాపట్యానికి సంబంధించిన ఒక లక్షణం అతనిలో ఉన్నట్లు లెక్క – దానిని అతను విడిచిపెట్టనంత వరకూ (ఆ అవగుణం కారణంగా అతను నిందార్హుడే). అవేమంటే;
(బుఖారీ, ముస్లిం)
కనుక ఏ మనిషిలోనయినా ఈ నాలుగు అవ లక్షణాలు ఏకకాలంలో తిష్టవే స్తే, అతనిలో చెడు పూర్తిగా జొరబడినట్లే. అతనిలో కపట లక్షణాలన్నీ పొడసూపినట్లె. మరెవరిలోనయినా వీటిలో ఒక అవలక్షణం ఉంటే, అతనిలో కాపట్యానికి సంబంధించిన ఒక ఆనవాలు ఉందన్నమాట! ఒక్కోసారి ఒక దాసునిలో మంచి లక్షణాలు – చెడు లక్షణాలు, విశ్వాస లక్షణాలు – అవిశ్వాస, కాపట్య లక్షణాలు – రెండూ చోటు చేసుకుంటాయి. తత్కారణంగా అతను బహుమానంతో పాటు శిక్షకు కూడా అర్హుడవుతుంటాడు. మస్జిదులో జరిగే సామూహిక నమాజ్ పట్ల అనాసక్తత, బద్దకం కూడా ఈ కాపట్య లక్షణాలలో ఒకటి.
కపటత్వం (నిఫాఖ్) మహా చెడ్డ వస్తువు. అందుకే ప్రవక్త ప్రియసహచరులు (రది అల్లాహు అన్హుమ్) కాపట్యానికి లోనయ్యె విషయం పట్ల నిత్యం భయపడుతూ ఉండేవారు. ఇబ్నె అబీ ములైకా ఇలా అంటున్నారు :
“నేను ముప్పయి మంది సహాబా (ప్రవక్త సహచరుల)ను కలుసుకున్నాను. వారంతా తమను కాపట్యం ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడుతూ ఉండేవారు.”
నిఫాఖె అక్బర్ – నిఫాఖె అస్గర్‌కి మధ్య గల తేడాలు :
(1) నిఫాఖె అక్బర్ (పెద్ద తరహా కాపట్యం) మనిషిని ఇస్లామీయ సమాజం నుండి బహిష్కరిస్తుంది. నిఫాఖె అస్గర్ (చిన్న తరహా కాపట్యం) సమాజం నుండి బహిష్మరించదు.
(2) విశ్వాసాలలోని అంతర్బాహ్యాలలో గల విభేదానికి మరో పేరె నిఫాఖె అక్బర్. కాగా ఆచరణల్లోని అంతర్బాహ్యాలలో గల వైరుధ్యమే నిఫాఖె అస్గర్.
(3) ఒక విశ్వాసి వల్ల పెద్ద తరహా కపట చేష్ట జరగదు. చిన్న తరహా కపట చేష్టలే అతని వల్ల జరిగేందుకు ఆస్కారముంటుంది.
(4) పెద్ద తరహా కాపట్యానికి (నిఫాఖె అక్బర్‌కి) ఒడిగట్టిన వ్యక్తి చాలా వరకు పశ్చాత్తాపం ప్రకటించడు. ఒకవేళ అతను పరిపాలకుని సమక్షంలో పశ్చాత్తాపం చెందితే అతని పశ్చాత్తాపం స్వీకారయోగ్యమవుతుందా? లేదా? అనే విషయంలో విద్వాంసుల మధ్య భేదాభిప్రాయం ఉంది. తద్భిన్నంగా చిన్న తరహా కాపట్యానికి పాల్పడిన వ్యక్తి ఒక్కోసారి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపపడుతుంటాడు. అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు.
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :
“తరచూ జరిగేదేమిటంటే ఒక విశ్వాసి కాపట్యానికి సంబంధించిన ఏదో ఒక విషయానికి లోనవుతాడు. తరువాత అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు. ఒక్కోసారి అతని ఆంతర్యంలో కొన్ని విషయాలు జనిస్తుంటాయి. అవి కాపట్యానికి ఆనవాలుగా ఉంటాయి. ఎట్టకేలకు అల్లాహ్ అతని ఆ స్థితిని కూడా రూపుమాపు తాడు. ఒక విశ్వాసి ఒక్కోసారి పైశాచిక ప్రేరణలకు, అవిశ్వాస శంకలకు లోనవుతుంటాడు. తత్కారణంగా అతని మనసు కుంచించుకుపోతూ ఉంటుంది. అతను తీవ్రంగా మనస్తాపానికి గురవుతాడు. ఆ విషయమే ఒకసారి ప్రియ సహచరులు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తో చెప్పుకున్నారు :
“దైవప్రవక్తా (సల్లలాహు అలైహి వ సల్లం)! మాలో కొందరి హృదయాలలో కలిగే భావాలు ఎంత తీవ్రమైనవంటే, వాటిని గురించి నోటితో చెప్పటం కన్నా నింగి నుంచి నేలపై పడిపోవటమే మిన్న అని అనుకుంటున్నాము”. దానికి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు : “ఈ భావనే అసలు విశ్వాసం (ఈమాన్).” (ముస్నదె అహ్మద్, ముస్లిం)
మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయి :
‘వాటిని నోటితో చెప్పటం కష్టమని భావిస్తున్నాడు.’
దానికి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు : “షైతాన్ ఎత్తుగడలను శంకలుగా మార్చివేసిన అల్లాహ్‌కే సకల స్తోత్రాలు.” అంటే ఆంతర్యంలో జనించే ఇలాంటి దుష్ప్రేరణలపై అయిష్టతను వ్యక్తపరచటం, వాటీని మనసులో నుంచి తీసిపడవెయ్యటం విశ్వాసానికి చిహ్నం అన్నమాట!” (కితాబుల్ ఈమాన్, పేజీ – 288)
నిఫాఖె అక్బర్ (పెద్ద తరహా కాపట్యం) సంగతి వేరు. అలాంటి వారి గురించి అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి:
“వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. వారిక మరలిరారు.” (అల్ బఖర : 18)
అంటే వారు మనస్ఫూర్తిగా ఇస్లాం వైపునకు రుజువర్తనులవరు. అలాంటి వారి గురించి అల్లాహ్ ఈ విధంగా కూడా సెలవిచ్చాడు :
“ఏమిటీ, ప్రతి ఏటా ఒకసారో, రెండుసార్లో తాము ఏదో ఒక ఆపదలో చిక్కుకుపోవటాన్ని వారు గమనించటం లేదా? అయినాసరే, వారు పశ్చాత్తాపాపడటంగానీ, గుణపాఠం నేర్చుకోవటంగానీ జరగటం లేదు.” (అత్ తౌబా : 126)
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :
“వారి పశ్చాత్తాపం స్వీకరించబడే విషయంలో విద్వాంసుల మధ్య భిన్నాభిప్రాయం ఉంది. ఎందుకంటే అందులోని వాస్తవికత ఏపాటిదో తెలీదు. ఎందుచేతనంటే వారు నిత్యం తమను ఇస్లాం అనుయాయులుగానే చెప్పుకుంటూ ఉంటారు.” (మజ్మూఅ ఫతావా – 28/434, 435)
ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది
మానవ జీవితంలో, విశ్వంలో సంభవించే సంఘటనల్లో నక్షత్రాల ప్రభావం ఉంటుందని విశ్వసించుట కూడా షిర్క్.
జైద్ బిన్ ఖాలిద్ జుహనీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: హుదైబియా ప్రాంతంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు నమాజు చేయించారు. అదే రాత్రి వర్షం కురిసింది. నమాజు ముగించి ప్రజల వైపునకు తిరిగి “మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా?” అని అడిగారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కే బాగా తెలుసు అని సహచరులు సమాధానం పలికారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ఇలా తెలిపాడని విశదీకరించారు: “ఈ రోజు ఉదయం నా దాసుల్లో కొందరు విశ్వాసులయ్యారు, మరికొందరు అవిశ్వాసులయ్యారు. ‘అల్లాహ్ దయవలన మాకు వర్షం కురిసింది’ అని అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలాన నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసింది అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”. (బుఖారి 846, ముస్లిం 71).
అదే విధంగా పత్రిక, మ్యాగజైన్లలో వచ్చే రాశిచక్ర వివరాలను చదివి, అవి నక్షత్రాల ప్రభావంతోనే ఉంటాయని విశ్వసిస్తే అతను బహుదైవారాధకుడవుతాడు. ఒకవేళ అతను తృప్తి కొరకు చదివితే పాపాత్ముడవుతాడు. ఎందుకనగా? షిర్క్ విషయాలను చదివి తృప్తి పొందడం యోగ్యం కాదు, దానిని విశ్వసించాలని షైతాన్ ప్రేరేపించవచ్చు కూడా, అప్పడు అది చదవడం ఒక షిర్క్ పని కోసం ఆధారంగా మారిపోతుంది.
[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. ]
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/
షైతాన్ ఎల్లప్పుడూ మానవులను ఏదైనా ఉపద్రవంలో పడవేయడానికి మరియు నిషిద్ధ కార్యానికి గురిచెయ్యడానికి పరితపిస్తూ ఉంటాడు. అందుకే అల్లాహ్ మనల్ని ఈ విధంగా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు.
“విశ్వాసులారా! షైతాను అడుగుజాడలలో నడవకండి, ఎవడు షైతాన్ అడుగుజాడలలో నడుస్తాడో నిశ్చయంగా షైతాన్ అతనిని అశ్లీలమైన మరియు అసభ్యకరమైన పనులు చేయటానికి ప్రోత్సహిస్తాడు” (సూర నూర్ 24:21)
మనిషి శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో అలాగే షైతాన్ మానవ శరీరంలో తిరుగుతుంటాడు. మానవులను అశ్లీల కార్యం (వ్యభిచారం)లో పడవేయడానికి షైతాన్ మార్గాల్లో ఒకటి పరస్త్రీతో ఒంటరిగా ఉండడం. అందుకే ఇస్లాం ధర్మం ఆ మార్గాన్ని మూసివేసింది. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఆదేశించారు?
“వినండి! ఏ పురుషుడైనా ఏ స్త్రీతో ఏకాంతంలో ఉంటాడో వారిద్దరితో మూడోవాడు షైతాన్ ఉంటాడు”. (తిర్మిజి 2165. మిష్కాతుల్ మసాబీహ్ 3118).
ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“ఈ రోజు తరువాత ఎవ్వరూ కుడా భర్త లేకుండా ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటిలో ప్రవేశించకూడదు. (ఏదైనా అవసరం ఉండి పోదలుచుకుంటే) అతనితో ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు ఉండాలి”.(ముస్లిం 2173).
ఏ పురుషుడు కూడా ఇంటిలోగాని, గదిలోగాని, వాహనములోగాని ఎక్కడైనా పరస్త్రీతో ఏకాంతంలో ఉండకూడదు. ఆమె సోదరుని భార్య అయినా, సేవకురాలు, ఆడ పనిమనిషి అయినా, డాక్టర్ వద్ద ఆడరోగి అయినా ఎవరైనా సరే. అనేక మంది తమపై లేదా ఇతరులపై నమ్మకంతో ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. అందువల్ల వ్యభిచారంలో లేదా దాని కారణంగల విషయాల్లో పడే భయం ఉంటుంది. తర్వాత వంశవృక్ష౦లో లోటు మరియు అక్రమ సంతానాలు అధికమవుతున్న విషాద వార్తలు వినవస్తాయి.
[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. ]
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/
అల్లామా అల్‌బానీ, బహుశా పాఠకుల సౌకర్యార్థం, పుస్తక అంశాలలో కేవలం “నమాజు సరిగా నెరవేర్చని వ్యక్తి” అన్న ఒక్క పదం తప్ప మరే పారిభాషిక పదాన్ని ఉపయోగించలేదు. వాస్తవానికి ఈ పదం, యావత్తు ముస్లిం సమాజం దృష్టిలో, ఎంతో ఖ్యాతిగాంచిన మరియు జ్ఞాన తూకంలో ఎంతో విలువ పొందిన ఒక ముఖ్యమైన హదీసును గూర్చి సూచిస్తుంది.
ఈ హదీసును ధార్మిక పండితులు “నమాజు సరిగా నెరవేర్చని వ్యక్తి (ముసయీ సలాత్) హదీసు” గా పిలుస్తారు.
ఈ హదీసు, దీని సంపూర్ణ రూపంలో ఏ ఒక్క ఉల్లేఖనంలో కూడా లభించనందున, పాఠకుల ప్రయోజనార్థం, దీని సంపూర్ణ రూపాన్ని అవసరమైన పదజాలంతో సమర్పిస్తున్నాం. తద్వారా పండితులు మరియు సామాన్య ప్రజానీకం – వీరిలో ప్రతి ఒక్కరూ దీని ద్వారా ప్రయోజనం పొందగలరని ఆశించవచ్చు.
రఫా బిన్ రాఫే (రజిఅల్లాహు అన్హు) కథనం:
ఒకరోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మస్జిదె నబవీలో కూర్చొని వున్నారు. మేము కూడా ఆయన దగ్గర కూర్చొని వున్నాం. ఇంతలో, పల్లెవాసిలా కనబడే ఒక వ్యక్తి మస్జిద్‌లోకి ప్రవేశించి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు దగ్గరలోనే ఖిబ్లా వైపునకు తిరిగి అసంపూర్ణ రుకూ, సజ్దాలతో (రుకూ, సజ్దాలు ప్రశాంతంగా చేయకుండా) రెండు తేలికపాటి రకాతులు పూర్తి చేశాడు. తదుపరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మరియు అక్కడున్న వారికి సలాం చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వ అలైకుం సలాం” అని జవాబిచ్చి, “వెళ్ళు, వెళ్లి తిరిగి నమాజు చేయి, ఎందుకంటే నువ్వు అసలు నమాజే చేయలేదు” – అని ఆజ్ఞాపిం చారు.
ఆ వ్యక్తి తిరిగి వెళ్ళి మునపటి లాగే మళ్ళీ నమాజు చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతన్ని గమనించసాగారు. కానీ ఆ వ్యక్తి మాత్రం, నమాజులో తను చేస్తున్న పొరపాట్లను గూర్చి తెలుసుకోలేక పోయాడు. నమాజు పూర్తి చేసి మళ్ళీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మరియు అక్కడున్న వారికి సలాం చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వ అలైకుం సలాం” అని జవాబిచ్చి “వెళ్ళు, వెళ్ళి మళ్ళీ నమాజు చేయి, నీ నమాజు అసలు నెరవేరలేదు” అని పురమాయించారు. ఇలా, ఆ వ్యక్తి మూడుసార్లు తన నమాజును పూర్తిచేశాడు. (బుఖారీ,ముస్లిం)
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రతిసారీ అతనికి “వ అలైకుం సలాం” అని జవాబిచ్చి “వెళ్ళు, వెళ్ళి మళ్ళీ నమాజు చేయి, ఎందుకంటే నీ నమాజు అసలు నెరవేరలేదు” అని పురమాయించారు.
దైవప్రవక్త (సల్లల్తాహు అలైహి వ సల్లం) మాటలు విని అక్కడున్నవారు — “బహుశా, ఎవరయితే తేలికపాటి నమాజు చేస్తారో వారి నమాజు అసలు నెరవేరదు కాబోలు” అని భావించారు. ఆ వ్యక్తి – “నా నమాజులో అయ్యే పొరపాట్లను గూర్చి నేను తెలుసుకోలేక పోతున్నాను. మీపై ఖుర్‌ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసిన వాని సాక్షిగా! నాకింతకన్నా మంచిగా నమాజు చేయడం రాదు. నేను నా ప్రయత్న మంతా చేశాను. మీరే నాకు చెప్పండి మరియు నేర్పించండి. ఎందుకంటే – నేను మానవ మాత్రుణ్ణి, నా ద్వారా తప్పొప్పులు రెండూ జరిగే ఆస్కారముంది” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విన్నవించు కున్నాడు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతనికి ఇలా హితబోధ చేశారు:
“బాగా విను! నువ్వెప్పుడైనా నమాజు చేయాలని సంకల్పించుకున్నప్పుడు, మంచిగా వుజూ చేయి. ఎందు కంటే – అల్లాహ్ ఆదేశించిన దాని ప్రకారం – వుజూ సరిగా చేయనంత వరకు ఎవరి నమాజ్ కూడా నెరవేరదు. అంటే – వుజూ సరిగా చేయ నంతవరకు ఎవరి నమాజ్ కూడా నెరవేరదు. అంటే – అతను తన ముఖాన్ని రెండు చేతులను, మోచేతి క్రీళ్ల వరకు కడిగి, తలను రెండు చేతులతో స్పర్శించి (మసహ్ చేసి) తదుపరి రెండు కాళ్ళను చీలమండ వరకు శుభ్రం చేసుకోవాలి.
తదుపరి, అజాన్ యిచ్చి ఇఖామత్ పలుకు, ఖిబ్లా వైవునకు తిరిగి నిలబడిన తర్వాత, అల్లాహు అక్బర్ అని పలికి, అల్లాహ్ స్తోత్రాన్ని గొప్పతనాన్ని స్మరించు, తదుపరి ఫాతిహా సూరా మరియు దానితో పాటు మరేదైనా పఠించు.
అబూదావూద్ లోని మరో ఉల్లేఖనంలో యిలా ఉంది: (ఫాతిహా సూరా పఠించిన అనంతరం) దివ్యఖుర్‌ఆన్‌లో నుండి నీకు అనుమతి యివ్వబడిన దానిని, సులభమైన దానిని పఠించు. ఒకవేళ ఖుర్‌ఆన్ జ్ఞప్తి యందు లేకపోతే, అప్పుడు ‘అల్‌హందులిల్లాహ్, అల్లాహు అక్బర్ , లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘ అని పలుకు.
తదుపరి ‘అల్లాహు అక్బర్’ అంటూ ప్రశాంతంగా కీళ్లన్నీ కుదుటపడి ప్రశాంతత పొందేలా రుకూ చేయి. రుకూ చేసేటప్పుడు నీ అరచేతులను మోకాళ్ళపై పెట్టు మరియు వీపును తిన్నగా వుంచు.
తదుపరి ‘సమిఅల్లాహు లిమన్ హమిద’ అంటూ ఎముకలన్నీ తమ తమ స్థానాలకు వచ్ఛే విధంగా నిటారుగా నిలబడు. తిరిగి అల్లాహు అక్బర్ అని సజ్దాలోకి వెళ్ళు మరియు నీ ముఖాన్ని నుదుటిని – శరీర కీళ్ళు కుదుటపడి ప్రశాంతత పొందేలా నేలపై గట్టిగా వుంచు. తదుపరి అల్లాహు అక్బర్ అంటూ తలను సజ్దా నుండి పైకెత్తి నీ పిరుదులపై చక్కగా కూర్చో.
(అబూదావూద్ లోని వేరొక ఉల్లేఖనం లో యిలా ఉంది): సజ్దా నుండి నీవు తల పైకెత్తినప్పుడు, నీ ఎడమ తొడపై కూర్చో. తదుపరి “అల్లాహు అక్బర్” అని పలికి సజ్దాలోకి వెళ్ళి నీ ముఖాన్ని ప్రతి కీలూ కుదుట పడి ప్రశాంతత పొందేలా నేలపై వుంచు. తదుపరి తల పైకెత్తి అల్లాహు అక్బర్” అని అను.
(అబూదావూద్‌లోని ఇంకొక ఉల్లేఖనం లో యిలా ఉంది):“నమాజు మధ్యలో నీవు కూర్చున్నప్పుడు ప్రశాంతంగా నీ ఎడమ తొడపై కూర్చొని తషహ్హుద్ చేస్తూ ఉండు.”
(అబూదావూద్ లోని మరొక ఉల్లేఖనం లో యిలా ఉంది):“తదుపరి నీవు నిలబడినప్పుడు, మునపటిలాగే చేస్తూ నీ నమాజును పూర్తి చెయ్యి.”
ఇలా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాలుగు రకాతులు నమాజ్ చదివే పద్ధతిని తెలియజేశారు. తదుపరి ఇలా పలికారు: ఇక ఎవరైతే ఇలా చేయరో (అంటే ఖియ్యాం, రుకూ, సజ్దాలు మరియు తషహ్హుద్ లలో పూర్తి ప్రశాంతతను ప్రదర్శించకుండా నమాజ్ చేయరో) వారి నమాజ్ సంపూర్ణం కానేరదు. ఒకవేళ యిలా చేస్తే, అప్పుడు వారి నమాజ్ సంపూర్ణం అవుతుంది. ఒకవేళ వీటిలో ఏ విషయంలోనైనా తొందరపాటును ప్రదర్శిస్తే దానికి తగ్గట్టుగానే మీ నమాజులో తగ్గుదల వస్తుంది.
ఇది దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా) (పుస్తకం) నుండి తీసుకో బడింది. (16-21పేజీలు)
ఇతర లింకులు:
ఖుర్‌ఆన్ పఠనం పూర్తయిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాసేపు అలాగే మౌనంగా [303] నిలబడి ఉండేవారు. ఆ తర్వాత ఇంతకు ముందు ‘తక్బీరే తహ్రీమా’ అంశం క్రింద వివరించినట్టుగా చేతులు పైకెత్తేవారు (రఫయదైన్ చేసేవారు).[304] తదుపరి “అల్లాహు అక్బర్” [305] అంటూ రుకూలోకి వెళ్ళిపోయేవారు. [306]
“నమాజ్‌ను సరిగా నెరవేర్చని వ్యక్తి“కి ఈ రెండు విషయాల గురించి ఆజ్ఞాపిస్తూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:
“నమాజ్ చేసే వ్యక్తి ఎవరయినా ముందుగా అల్లాహ్ ఆదేశించినదాని ప్రకారం చక్కగా వుజూ చేసుకోవాలి. తర్వాత “అల్లాహు అక్బర్” అని చెబుతూ అల్లాహ్‌ను స్తుతించాలి, ఆయన పవిత్రతను కొనియాడాలి. ఆ తర్వాత ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ తనకు నేర్పించిన దానిలో, తనకు అనుమతి ప్రసాదించిన దానిలో తనకు వీలు కలిగినంత పఠనం చేయాలి. ఆ తర్వాత “అల్లాహు అక్బర్” అంటూ రుకూ చేయాలి. దేహంలోని కీళ్ళన్నీ వాటి వాటి స్థానాల్లో కుదుటపడి, ప్రశాంతతను పొందే విధంగా రుకూలో రెండు చెతుల్ని మోకాళ్ల చిప్పలపై ఉంచాలి. ….(సశేషం) ఈ విధంగా చేయని వారెవరైనా, వారి నమాజు సంపూర్ణమైనదిగా భావించబడజాలదు.”” [307]
“రుకూ స్థితిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అరచేతుల్నిమోకాళ్ల మీద ఉంచేవారు”,[308] “అలా చేయమని ఆయన ప్రజలకు సయితం ఆదేశించేవారు”.[309] ఈ విధంగా చేయమని ఆయన “నమాజ్ సరిగా నెరవేర్చని వ్యక్తి“కి కూడా ఆజ్ఞాపించి ఉన్నారు. కొన్ని వాక్యాల క్రితమే ఈ విషయం గడిచింది.
“రుకూలో ఆయన తన రెండు చేతులతో మోకాళ్లను పట్టుకొని ఉన్నట్లుగా వాటిని గట్టిగా అదిమి ఉంచేవారు”[310] “ఆ సమయంలో చేతివేళ్లను విశాలంగా ఉంచుతారు”. [311] “నమాజ్‌ను సరిగా నెరవేర్చని వ్యక్తి”కి ఇలా చేయమని ఆజ్ఞాపిస్తూ ఆయన “రుకూ చేసినప్పుడు నీ అరిచేతుల్ని మోకాళ్ల మీద పెట్టుకో. చేతివ్రేళ్లను వదులుగానూ, విశాలంగానూ ఉంచు. ప్రతి అవయవం తన స్థానంలోకి వెళ్ళిపోయే వరకు అదే స్థితిలో ఉండు” అని పురమాయించారు.[312] రుకూ స్థితిలో ఆయన తన మోచేతుల్ని ప్రక్కలకు ఎడంగా ఉంచేవారు.[313] రుకూలో వీపును విశాలంగా,[314] నీళ్లు పోసినా అటూ ఇటూ జారిపోనంత తిన్నగా ఉంచేవారు.[315]
“రుకూ స్థితిలో నీ అరచేతుల్ని మోకాళ్ళ మీద పెట్టుకో. వీపును పొడుగ్గా ఉంచు. రుకూ స్థితికి బలాన్నివ్వు” అని ఆయన “నమాజును సరిగా నెరవేర్చని వ్యక్తి“కి సూచించారు.[316] రుకూలో తలను ఆయన వంచిగాని, పైకెత్తిగాని ఉంచేవారు కాదు.[317] పైగా ఆయన (రుకూ స్థితిలో) తన తలను వీపుకు సమాంతరంగా ఉంచేవారు. [318]
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ప్రశాంతంగా రుకూ చేసేవారు. అలా చేయమని ఆయన “నమాజును సరిగా నెరవేర్చని వ్యక్తి“కి కూడా ఆదేశించి ఉన్నారు. గత అంశం ప్రారంభంలో దీని ప్రస్తావన వచ్చింది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అంటుండేవారు: “మీరు రుకూ మరియు సజ్దాలు బాగా చేయండి. ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. మీరు రుకూ చేసినప్పుడు, సజ్దా చేసినప్పుడు నేను మిమ్మల్ని నా వెనుక వైపు నుంచి చూస్తూ ఉంటాను.” [319]
ఒకతను నమాజు చేస్తున్నాడు. కాని అతను రుకూ సరిగా చేయటం లేదు. సజ్దా కూడా చాలా తొందరతొందరగా చేస్తున్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతన్ని చూసి, “ఒకవేళ ఇతనికి ఇదే స్థితిలో మరణం గనక వస్తే ఇతను ముహమ్మద్ ప్రవక్త ధర్మంపై మరణించినట్లు కాదు. (కాకి నెత్తురులో ముక్కు పొడిచినట్లు ఇతను చాలా వేగంగా నమాజ్ చేస్తున్నాడు). రుకూ సరిగ్గా నెరవేర్చకుండా సజ్దాలు కూడా సుడిగాలిలా చేసే వ్యక్తి బాగా ఆకలితో ఉండి, ఒకటి రెండు ఖర్జూర పండ్లు తిన్నప్పటికీ ఆకలి చల్లారని మనిషిలాంటివాడు” అని చెప్పారు. [320]
తన ముక్కును నేలకేసి పొడిచే కోడి లాగా నమాజులో తొందర చేయవద్దని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు ఉపదేశించారనీ, నమాజులో నక్క లాగా కుడి ఎడమలు దిక్కులు చూడవద్దని తనను ఆదేశించారని, కోతి లాగా పిరుదుల్ని చేతులను నేలకు ఆనించి పెట్టి, పిక్కలను, తొడలను నిలబెట్టి కూర్చో రాదని కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు ఆదేశించారని అబూ హురైరా (రజిఅల్లాహు అన్హు) తెలియజేశారు. [321]
“నమాజు నుండి దొంగిలించేవాడు అందరిలోకెల్లా చెడ్డ దొంగ” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అన్నారు. ఈ మాట విని ఆయన సహచరులు (ఆశ్చర్య పోయారు). “దైవవక్తా! అసలు ఎవరైనా నమాజులో నుండి ఎలా దొంగిలిస్తారు?” అని అడిగారు. దాని కాయన “అంటే అతను రుకూ, సజ్దాలు పూర్తిగా నెరవేర్చడు” అంటూ తన మాటకు అర్ధం చెప్పారు. [322]
ఒకతను నమాజు చేస్తూ రుకూ, సజ్దాల్లో వీపుని తిన్నగా ఉంచటం లేదు (దగ్గర్లో) నమాజు చేస్తున్న దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన క్రీగంట చూపులతో అతన్ని గమనించారు. నమాజు పూర్తయిన తర్వాత ఆయన అందర్ని ఉద్దేశించి “ముస్లింలారా! రుకూ, సజ్దాల్లో తమ వీపుల్ని తిన్నగా ఉంచని వారి నమాజు నెరవేరదు” అని హెచ్చరించారు. [323]
మరో హదీసు ప్రకారం ఆయన “రుకూ, సజ్దాల్లో వీపుని తిన్నగా ఉంచి చేయబడని నమాజు సరిపోదు” అని అన్నారు. [324]
[303]. అబూదావూద్, హాకిమ్ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు. ఈ మౌనం కేవలం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రశాంతంగా శ్వాస తీసుకోగలిగినంత పరిమాణంలో వుండేదని ఇబ్నె ఖయ్యూం (రహిమహుల్లాహ్) అభిప్రాయ పడ్డారు.
[304,305,306]. బుఖారీ, ముస్లిం.
ఈ రఫయదైన్ మరియు దీనితోపాటు రుకూ నుండి లేచేటప్పుడు చేసే రఫయదైన్ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ఎన్నో పరంపరలతో నిరూపించబడి ఉంది. ముగ్గురు ఇమాములు, ఎంతో మంది హదీసువేత్తలు. ధార్మికజ్ఞానుల అభిమతం కూడా ఇదే. తారీఖ్ ఇబ్నె అసాకిర్ (15/78/2) నందు ఇమామ్ మాలిక్ జీవితాంతం దీనిపై ఆచరించారని వుంది. కొందరు హనఫీ ఉలమాలు కూడా దీనిని యిష్టపడ్డారు. వీరిలో ఇమామ్ అబూ యూసుఫ్ శిష్యులు ఇసామ్ బిన్ యూసుఫ్ ఖల్‌బీ (మరణం 210 హి.) కూడా ఒకరు. ఆయన గురించి యిది వరకే వివరించబడింది.
అబ్బుల్లా ఇబ్నె అహ్మద్ తన ‘మసాయల్’ – 60వ పేజీలో తన తండ్రి ద్వారా యిలా ఉల్లేఖించారు: ఉఖ్బా బిన్ ఆమిర్ (రజి అల్లాహు అన్హు) ద్వారా నమాజులో రఫయదైన్ గురించి యిలా ఉల్లేఖించబడింది: ఒక్కో రఫయదైన్‌కు బదులుగా పదిపుణ్యాలు దొరుకుతాయి.
నేను చెప్పేదేమిటంటే – ఉఖ్బా బీన్ ఆమిర్ మాట – బుఖారీ, ముస్లింలోని ఎవరైనా ఏదైనా సత్మార్యం చేయాలని సంకల్పించుకొని, తదుపరి దానిని పూర్తి చేస్తే దానికి బదులుగా అతనికి 10 నుంది 700 పుణ్యాలు దొరుకుతాయి అన్న హదీసుకు అనుగుణంగా వుంది. మరిన్ని వివరాల కోసం ‘సహీ అత్తర్‌గీబ్- 16వ పేజీ చూడగలరు.
[307]. అబూదావూద్,నసాయి. హాకిమ్ దీనిని సహీగా ఖరారు చేశారు మరియు జహబీ దీనితో ఏకీభవించారు.
[308]. బుఖారీ, అబూదావూద్.
[309]. బుఖారీ, ముస్లిం.
[310]. బుఖారీ, అబూ దావూద్.
[311]. హాకిమ్ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ కూడా దీనితో ఏకీభవించారు. అబూదావూద్, తయాలిసీ కూడా దీనిని ఉల్లేఖించారు. దీని తఖ్రీజ్ – సహీ అబూదావూద్: 809 నందు చేయబడింది.
[312]. సహీ ఇబ్నె ఖుజైమా, సహీ ఇబ్నె హిబ్బాన్.
[313]. తిర్మిజి, ఇబ్నె ఖుజైమా దీనిని సహీగా ఖరారు చేశారు.
[314]. బైహఖీ – సహీ బుఖారీ పరంపరతో.
[315]. తబ్రానీ – మోజమిల్ కబీర్ వ సగీర్, జవాయెద్ ముస్నద్ అబ్దుల్లా బిన్ అహ్మద్,ఇబ్నెమాజా.
[316]. అహ్మద్, అబూదావూద్ – సహీ పరంపరతో.
[317]. అబూదావూద్, బుఖారీ – జుజ్ అల్ ఖీరా ఖలఫుల్ ఇమామ్ – సహీ పరంపరతో
[318]. ముస్లిం, అబూ ఆవాన
[319]. బుఖారీ, ముస్లిం. నేను చెప్పదేమిటంటే – ఇలా చూడగలగడం ఒక వాస్తవం. యిది ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అద్భుతాలలో ఒకటి. అయితే ఇది నమాజు కొరకే ప్రత్యేకం. ఇతర సందర్భాలలో దీనికి సంబంధించిన ఆధారమేదీ లేదు.
[320]. మున్నద్ అబూ యాలా (340, 349/1), ఆజూరీ- అర్బయీన్, బైహఖీ, తబ్రానీ (1/192/1), జియా – అల్ మున్తఖా (276/1), ఇబ్నె అసాకిర్ (2/226/2, 414/1, 8/14/1,76/2) – హసన్ పరంపరతో. ఇబ్నె ఖుజైమా దీనిని సహీగా ఖరారు చేశారు (1/82/1). ఇబ్నె బత్తా, మొదటి భాగంలోని అదనపు పదజాలం లేకుందా దీనిని బలపర్చే ఒక ముర్సల్ హదీసును “అల్ ఇబానా” (5/43/1) నందు ఉల్లేఖించారు.
[321]. తయాలిసీ, అహ్మద్, ఇబ్నె అబీషైబా. ఇది హసన్ హదీసు. ఈ విషయం నేను హాఫిజ్ అబ్దుల్ హఖ్ ఇష్‌బిలీ – అల్ అహ్‌కామ్ – హదీసు నెం. 1348 పాద సూచికలో వివరించాను.
[322]. ఇబ్నె అబీ షైబా (1/89/2), తబ్రానీ, హాకిమ్ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ కూడా దీనితో ఏకీభవించారు.
ఇది దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా) (పుస్తకం) నుండి తీసుకో బడింది. (150-154 పేజీలు)
ఇతర లింకులు:
1822. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు :-
“మీలో ఎవరైనా చనిపోయినప్పుడు అతనికి (సమాధిలో) ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అతను ఉండవలసిన శాశ్వత స్థానం చూపబడుతుంది. అతను గనక స్వర్గవాసి అయి ఉంటే అతనికి స్వర్గవాసుల స్థానం చూపబడుతుంది; నరకవాసి అయి ఉంటే అతనికి నరకవాసుల స్థానం చూపబడుతుంది. అప్పుడు “ఇదే నీ అసలు స్థానం. నిన్ను ప్రళయదినాన లేపినప్పుడు ఈ స్థానానికే నీవు చేరుకోవలసి ఉంటుంది” అని అతనికి చెప్పబడుతుంది.”
(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 90వ అధ్యాయం – అల్‌మయ్యతి యూరజు అలైహి మఖ్ అదుహు బిల్ ఘదాతి వల్ అషియ్యి)
[అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు), vol 2,స్వర్గ భాగ్యాల , స్వర్గ వాసుల ప్రకరణం]
[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/eu7r]
[30 నిమిషాల వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
[నెల్లూరు రొట్టెల పండగ పేరుతో జరిగే షిర్క్ మరియు అధర్మ కార్యాల గురుంచి ఈ పోస్టులో వివరించబడింది]
నెల్లూరు ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఒక జిల్లా, సముద్రం ఒడ్డున ఉన్న ఒక అందమైన పట్టణము. 12వందల సంవత్సరాల క్రితం పన్నెండు మంది అరబ్ ముస్లిములు వలస వచ్చారు అని కథనాలు చెప్పుకుంటారు. వారందరూ జాతులకు, మతాలకు అతీతంగా శాంతిని నెలకొల్పాలని వచ్చినట్లు భావిస్తారు. మరియు కొన్ని రోజుల తరువాత వారందరూ షహీద్ కాబడ్డారనీ అంటారు. ఆ తరువాత వారందరినీ ఆ సెలయేరు (ఒక పెద్ద చెరువు) వద్దనే సమాధి చేసారు. తరువాత కొంత మంది ప్రజలు ఆ సమాధులనే దర్గాలుగా నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ పన్నెండు దర్గాలను కలిపి “బారా షహీద్ మజార్ షరీఫ్” అని పేర్కొంటారు. అక్కడే మరొక దర్గా “సయ్యద్ బాబా” అని “లాల్ దర్గా” పేరుతో ఉంది.
రొట్టెల పండుగ పేరుతో 10 నుండి 15 లక్షల మంది ప్రజలు ధర్మాలకు అతీతంగా, ప్రతి ఏట ముహర్రం నెలలో సందర్శిస్తారు. అక్కడ ఉత్సవాల పేరుతో ముహర్రం నెల 10, 11, 12వ తేదిలలో రొట్టెల మార్పిడి జరుగుతుంది. అలా మూడు నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు.
అంటే అక్కడ వచ్ఛేవారి వివిధ మొక్కుబడుల ప్రకారం రొట్టెలకు పేర్లు కేటాయించుకుంటారు. ఉదాహరణకు “పిల్లల రొట్టెలు” – ఎవరికైన సంతానం లేకపోతే ఆ నదిలో నిలబడి తలపై ఆ నది నీళ్ళను తీర్ధంలా చల్లుకొని, సంతానం లేనివారు సంతానం కలిగినవారి నుండి రొట్టెలను తీసుకొని తింటారు. అలా చేస్తే సంతాన ప్రాప్తి జరుగుతుందని వారి మూఢ నమ్మకం. అలా సంతానం లేనివారు రొట్టెలను తిన్న తరువాత వారికి సంతానము కలిగితే, తిరిగి వచ్చి వారుకూడా రొట్టెలను ఇతరులకు ఇస్తారు. అలా అనేక మంది ప్రజలు తమ తమ మ్రొక్కుబడుల ప్రకారం ప్రతి ఏట రొట్టెల మార్పిడి జరిపే ఆచారాన్ని “నెల్లురు రొట్టెల పండుగ” అని అంటారు.
ప్రజల సమస్యలకు అనుగుణంగా రొట్టెలకు పేర్లు పెట్టుకుంటారు. అంటే; ఉద్యోగం రొట్టెలు, ధనం రొట్టెలు, విదేశాలకు పోయే వీసా రొట్టెలు, అసెంబ్లీ రొట్టెలు, ఆరోగ్యం రొట్టెలు, వివాహం రొట్టెలు అని వివిధ సమస్యల పేర్లతో రొట్టెల మార్పిడి జరుగుతుంది. తరువాత అక్కడికి వచ్చేవారు అక్కడ ఉన్న దర్గాలను కూడా ఆరాధిస్తారు. ప్రతి దర్గా వద్ద జరిగే షిర్క్ మరియు బిద్‌అత్ వంటి అధర్మ కార్యాలను బహిరంగా పాటిస్తారు.
“బారా షహీద్ మజార్ షరీఫ్”కు వచ్చే ప్రజలు తమ నమ్మకాల ప్రకారం నాణల రూపంలో ఆ దర్గాలపై నాణెములను(చిల్లరడబ్బులు) విసురుతారు. దర్గాల నిర్వాహకులు దర్గాలపై నుండి రూపాయి లేక రెండు రూపాయి బిళ్లలను తీసుకుని, ఎర్రటి లేక పచ్చటి రంగుల గుడ్డపేలికలలో చుట్టి, ప్రజల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని, ఆ ఒక్క రూపాయిని పది రూపాయిలకు లేక ఇరవై రూపాయిలకు విక్రయిస్తారు. ఎందుకంటే? ఆ నాణెములను ప్రజలు తమ దగ్గర ఉంచుకుంటే ధనంలో శుభాలు కలుగుతాయని నమ్మిస్తారు.
అధికమైన సంఖ్యలో స్త్రీలు అక్కడ సమావేశమవుతారు. ఎందుకంటే? మూఢ నమ్మకాల వలలో స్త్రీలే అతి ఎక్కువగా చిక్కుకుంటారు. మరియు ఇస్లాం ధర్మం తెలియని అజ్ఞాన ముస్లింలు మరియు బలహీన విశ్వాసులు అలాంటి మూఢ విశ్వాసాలకు తొందరగా ప్రభావితులవుతారు. ఎందుకంటే? ఎదో విధంగా తమ అదృష్టాలను పరిక్షించుకొని, కష్టాలను దూరం చేసుకోవాలని వారి తపన. మన సమాజంలో అలాంటి మూఢ విశ్వాసాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. మరియు వారు దేశ, విదేశాల దర్గాలను సందర్శించి ఆరాధిస్తూ ఉంటారు.
కనుక అల్లాహ్ వాటిని ఖండిస్తూ ఇలా తెలియజేసాడు:
“ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి, తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింప జేయలేదు. వారు కేవలం తము ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరపునుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది?” (సూరతున్ నజ్మ్:23)
అల్లాహ్ ఇలా తెలియజేసాడు:
(ఓ ప్రవక్తా!)వారికి ఇలా చెప్పు: “అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవ్వంత అధికారంగానీ వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాదు” (సూరతుస్ సబా:22).
అల్లాహ్‌ను మాత్రమే ప్రార్ధించాలి. భయం, భక్తి ఆశ, ప్రేమానురాగం, మొరపెట్టుకోవడం, అణుకువ, అశక్తత, శరణు వేడుకోవడం, జిబహ్ చేయడము, మొక్కుబడులు చెల్లించడం, ఉపాధిని కోరడం వంటి కార్యాలన్నీ ఆరాధనలే. కనుక ఆ ఆరాధనలు అల్లాహ్‌కే సొంతం చేసి ఆరాధించాలి. అల్లాహ్‌ను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు.
కనుక అల్లాహ్ ఇలా తెలియజేసాడు:
“మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తనూ పంపినా: “నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! కావున మీరు నన్నే ( అల్లాహ్‌నే) ఆరాధించండి” అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపాము.” (సూరతుల్ అంబియా:25)
అల్లాహ్ ఇలా తెలియజేసాడు:
“మీరు నిజంగానే ముస్లిములైతే అల్లాహ్‌నే నమ్ముకోండి” (సూరతుల్ మాయిదా:23)
మరోచోట అల్లాహ్ ఇలా తెలియజేసాడు:
“అల్లాహ్‌ను నమ్మకున్నవారికి అల్లాహ్‌యే చాలు.” (సూరతు తలాఖ్ :3)
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎప్పుడైతే మీరు సహయం కొరకై మొరపెట్టుకుంటారో అప్పుడు అల్లాహ్‌ను మాత్రమే సహాయానికై ఆర్థించండి.” (తిర్మిజీ:2516, జిలాలుల్ జన్నహ్: 316-318).
ముఖ్య గమనిక: “రొట్టెల పండుగ పేరున మనం చేసే ఆచారాలు, ఆరాధనలు, మొక్కుబడులు ధర్మం కానే కావు. ఎవరైనా అల్లాహ్ పేరుపై తప్ప ఇతరులెవరి పేరుపై నైనా మొక్కుబడులు చెల్లిస్తే అది “షిర్క్” ఆచారమే అవుతుంది. ఒక వేళ ఎవరైనా తెలిసి తెలియక మొక్కుబడులు చేసుకొని ఉంటే, వాటిని నెరవేర్చకూడదు. దాని వల్ల ఎలాంటి నష్టంగాని లేక కీడుగాని జరగదు. కనుక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎవరైతే అల్లాహ్ విధేయత పట్ల మొక్కుబడి చేసుకున్నారో వారు ఆ మొక్కుబడిని తీర్చాలి. మరియు ఎవరైతే అల్లాహ్ అవిధేయత పట్ల మొక్కుకున్నారో వారు ఆ మొక్కబడిని తీర్చకూడదు.”” (బుఖారి :2602).
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 67-70). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
You must be logged in to post a comment.