నిఫాఖ్‌ (కపటత్వం) మరియు దాని రకాలు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

నిఫాఖ్‌ (కపటత్వం) నిర్వచనం, దాని రకాలు

(1) నిఫాఖ్‌ (కపటత్వం, వంచన) నిర్వచనం :

నిఫాఖ్‌” అనేది నిఘంటువు ప్రకారం “నాఫఖ” అనె క్రియతో ముడిపడి ఉంది. నాఫఖ యునాఫిఖు నిఫాఖన్‌ వ మునాఫఖతన్‌ అని అనబడుతుంది – ఈ పదం “అన్నాఫిఖాఅ” నుండి గ్రహించబడినది. అంటే ఉడుము తన కన్నం నుండి బయటపడే రహస్యమార్గం అని భావం. కన్నంలో ఉన్న ఉడుమును ఒక మార్గం నుంది పట్టుకోటానికి ప్రయత్నించినపుడు అది రెండో వైపు నుండి పారిపోతుంది. మరో ఉవాచ ప్రకారం ఇది ‘నఖఫ  నుండి సంగ్రహించబడినది. ఉడుము దాక్కున్న కన్నాన్ని నఫఖ అంటారు. (అన్నిహాయతుల్‌ ఇబ్బ్నుల్‌ అసీర్‌ – 5/98)

షరీయత్‌ ప్రకారం ‘నిఫాఖ్‌’ అంటే:

ఇస్లాం గురించి, మంచి గురించి ప్రకటించటం. దాంతోపాటే తిరస్కారభావాన్ని, కపటత్వాన్ని మనసులో దాచి పెట్టడం. దీనికి నిఫాఖ్‌ అనే నామకరణం ఎందుకు చేయబడిందంటే మునాఫిఖ్‌ (కపటవిశ్వాసి, వంచకుడు) షరీయతులో ఒక ద్వారం గుండా ప్రవేశించి, మరో ద్వారం గుండా షరీయత్‌ నుండి బయటికెళ్ళిపోతాడు. దీనిపై అల్లాహ్‌ ఈ విధంగా హెచ్చరించాడు –

إِنَّ الْمُنَافِقِينَ هُمُ الْفَاسِقُونَ

“నిశ్చయంగా కపటులు పాపాత్ములు (అవిధేయులు).” (అత్‌ తౌబా : 67)

అంటే వారు షరీయత్‌ కట్టుబాట్లను ఖాతరు చేయకుండా వెళ్ళిపోయువారన్నమాట!

అల్లాహ్‌ కపట విశ్వాసులను అవిశ్వాసులకన్నా చెడ్డవారుగా ఖరారు చేశాడు :

إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ

“నిశ్చయంగా కపటులు నరకంలోని అధమాతి అధమ శ్రేణిలోకి వెళతారు.” (అన్‌ నిసా :145)

ఇంకా ఇలా సెలవిచ్చాడు :

إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّهَ وَهُوَ خَادِعُهُمْ

“నిశ్చయంగా కపటులు తమ జిత్తులతో అల్లాహ్‌నే మోసగించాలనుకుంటున్నారు. అయితే అల్లాహ్‌ వారి జిత్తులకు తగిన శిక్ష విధించనున్నాడు” (అన్‌ నిసా : 142).

ఇంకా ఈ విధంగా కూడా సెలవిచ్చాడు:

يُخَادِعُونَ اللَّهَ وَالَّذِينَ آمَنُوا وَمَا يَخْدَعُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ فِي قُلُوبِهِم مَّرَضٌ فَزَادَهُمُ اللَّهُ مَرَضًا ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ

“వారు అల్లాహ్‌ను, విశ్వాసులనూ మోసపుచ్చుతున్నారు. అయితే వాస్తవానికి వారు స్వయంగా – తమను తామే – మోసపుచ్చుకుంటున్నారు. కాని ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు. వారి హృదయాలలో రోగం ఉంది. ఆ రోగాన్ని అల్లాహ్‌ మరింతగా పెంచాడు. వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమయిన శిక్ష ఉంది.” (అల్‌ బఖర – 9, 10)

(2) నిఫాఖ్‌ (కాపట్యం) రకాలు ;

నిఫాఖ్‌ (కపటత్వం) రెండు రకాలు : (1) విశ్వాసపరమైన కపటత్వం (2) క్రియాత్మకమైన కపటత్వం.

మొదటిది: విశ్వాసపరమైన కపటత్వం

ఇదే నిఫాఖె అక్బర్‌. అంటే పెద్ద తరహా కపటత్వం. దీనికి ఆలవాలమై ఉన్న వ్యక్తి పైకి ఇస్లాం స్వీకరించినట్లు ప్రకటిస్తాడు. లోపల కుఫ్ర్ని (అవిశ్వాసాన్ని) దాచిపెట్టుకుంటాడు. ఈ రకమయిన కపటత్వం కలవాడు ఇస్లాం నుండి పూర్తిగా బహిష్క్రుతుడైనట్లే. దీనికి పాల్పడినవాడు నరకంలోని అట్టడుగు వర్గీయుల్లో చేరతాడు. అల్లాహ్‌ కపటులను అత్యంత చెడ్డవారుగా అభివర్ణించాడు. ఉదాహరణకు : అవిశ్వాసం, అవినీతి, ధర్మాన్ని ధర్మావలంబీకులను పరిహసించటం, వారిని చూసి వెకిలి సైగలు చేయటం, ఇస్లాం విరోధులతో కుమ్మక్కు అవటం వారిలోని దుర్గుణాలు. కపట విశ్వాసులు శత్రుత్వంలో ఇస్లాం శత్రువులకు సమ ఉజ్జీలుగా ఉంటారు. ఈ కపటులు అన్ని కాలాల్లో ఉన్నారు, ఉంటారు. ముఖ్యంగా ఇస్లాం ప్రాబల్యం వహించినపుడు ఓర్చుకోలేకపోతారు. బహిరంగంగా ముస్లింలను ఎదిరించే శక్తి వారిలో ఉండదు. అందుకే ఇస్లాంకు, ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు పన్నే ఉద్దేశంతో ఇస్లాం స్వీకరిస్తున్నట్లు ప్రకటిస్తారు. ఆ విధంగా ఇస్లాం ముసుగులో ఎసరుపెడతారు. అలా ఉండటం వల్ల తమ ధన ప్రాణాలకు రక్షణ ఉంటుందన్న స్వార్ధం కూడా వారి అంతరంగంలో దాగి ఉంటుంది.

అందుకే కపట విశ్వాసి (మునాఫిఖ్‌) అల్లాహ్‌ను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని విశ్వసించినట్లు పైకి ప్రకటిస్తాడు. కాని అతని అంతరంగంలో తిరస్కరణాభావం తిష్టవేసి ఉంటుంది. నిజానికి అతనికి అల్లాహ్‌ పై విశ్వాసముండదు. ఖుర్‌ఆన్‌ దైవప్రోక్తమని, ఆయన దానిని ఒక మానవమాత్రుని (ముహమ్మద్‌ – సల్లలాహు అలైహి వ సల్లం) పై అవతరింపజేశాడని, ఆయన్ని సమస్త మానవుల వైపు సందేశహరునిగా పంపాడనీ, ఆ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహిస్తారని, ఆయన విధించే శిక్ష గురించి సావధానపరుస్తారని స్వయంగా అల్లాహ్ తెలియజేశాడు. అయినప్పటికీ కపట విశ్వాసికి ఇదేమీ పట్టదు. అల్లాహ్‌ దివ్య ఖుర్‌ఆన్‌లో కపటుల బండారాన్ని బట్టబయలు చేశాడు. వారి లోగుట్టును రట్టు చేశాడు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండమని తన దాసులను సావధానపరిచాడు.

అల్‌ బఖరా సూరాలోని తొలి వాక్యాలలోనే మానవుల లోని మూడు వర్గాల ప్రస్తావన తేబడింది – (1) విశ్వాసులు (2) అవిశ్వాసులు (3) కపటులు. విశ్వాసుల ప్రస్తావన 4 సూక్తులలో, అవిశ్వాసుల ప్రస్తావన 2 సూక్తులలో వస్తే కపటుల ప్రస్తావన 13 సూక్తులలో వచ్చింది. ఎందుకంటే కపటులు అధిక సంఖ్యలో ఉన్నారు – నివురు గప్పిన నిప్పులా ఉంటారు. వారెక్కడ ఉన్నా అక్కడి ప్రజల పాలిట ఒక పరీక్షగా, ఉపద్రవంగానే ఉంటారు. కాగా; ఇస్లాం మరియు ముస్లింల పాలిట వారి బెడద తీవ్రమైనది. ఎందుకంటే వారి మూలంగా సదా ఇస్లాంకు ఎన్నో కష్టాలు వచ్చిపడ్డాయి. వారు బాహ్యంలో ఇస్లాం అనుయాయులుగా కనిపిస్తారు. సమర్థకులుగా ముందుకు వస్తారు. యదార్దానికి వారు ఇస్లాం ధర్మానికి బద్ధశత్రువులుగా ఉంటారు. సర్వవిధాలా వారు ఇస్లాంకు తూట్లు పొడుస్తుంటారు. అమాయకులు, అవివేకులు వారిని చూసి మంచివారుగా తలపోస్తారు. వారి మాటల్ని సంస్కరణతో కూడిన మాటలుగా భావిస్తారు. కాని వారి మాటల్లో అజ్ఞానం, కల్లోలం కలగలసి ఉంటుంది.

(‘సిఫాతుల్‌ మునాఫిఖీన్‌ లి ఇబ్బ్నుల్‌ ఖయ్యిమ్‌’ నుండి సేకరించబడింది. )

విశ్వాసపరమైన కపటత్వం ఆరు రకాలు :

  1. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను ధిక్కరించటం.
  2. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) షరీయతులోని కొన్ని విషయాలను అసత్యమంటూ త్రోసిపుచ్చటం.
  3. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పై అక్కసును వెళ్ళగ్రక్కటం, విరోధ భావం కలిగి ఉండటం.
  4. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెచ్చిన షరీయతులోని కొన్ని విషయాల పట్ల ఓర్వలేనితనాన్ని ప్రదర్శించటం.
  5. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం అధోగతిలో ఉన్నట్టు అనిపిస్తే సంతోషించటం.
  6. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మానికి చేకూరిన ప్రాబల్యాన్ని చూసి సహించలేకపోవటం.

(మజ్మూఅతుత్తౌహీద్‌ – పేజి : 9)

రెండవ రకం – క్రియాత్మకమైన కపటత్వం (నిఫాఖె అమలీ) :

అంటే మనిషి హృదయంలో విశ్వాస (ఈమాన్‌) మైతే ఉంటుంది గాని అతని ఆచరణల్లో కపటత్వం తొంగి చూస్తుంటుంది. ఇటువంటి ఆచరణ మనిషిని ఇస్లాం పరిధి నుండి బయటికి నెట్టదు. కాని కపటత్వం ముదిరే ప్రమాదం మాత్రం పొంచి ఉంటుంది. ఇలాంటి వ్యక్తిలో విశ్వాసం, కాపట్యం – రెండూ ఉంటాయి. అయితే కాపట్యం మోతాదు పెరిగిపోయినపుడు అతను పక్కా కపటిగా తయారవుతాడు. దీనికి ప్రమాణం ప్రవక్త మహనీయుల (సల్లలాహు అలైహి వ సల్లం) వారి ఈ ప్రవచనం.

 أَرْبَعٌ مَنْ كُنَّ فِيهِ كَانَ مُنَافِقًا خَالِصًا، وَمَنْ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنْهُنَّ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنَ النِّفَاقِ حَتَّى يَدَعَهَا: إِذَا اؤْتُمِنَ خَانَ وَإِذَا حَدَّثَ كَذَبَ وَإِذَا عَاهَدَ غَدَرَ، وَإِذَا خَاصَمَ فَجَرَ  

“నాలుగు లక్షణాలున్నాయి. అవి గనక ఎవరిలోనయినా ఉంటే అతను పక్కా కపట విశ్వాసి అవుతాడు. ఎవరిలోనయినా వాటిలో ఏ ఒక్క లక్షణమైనా ఉంటే కాపట్యానికి సంబంధించిన ఒక లక్షణం అతనిలో ఉన్నట్లు లెక్క – దానిని అతను విడిచిపెట్టనంత వరకూ (ఆ అవగుణం కారణంగా అతను నిందార్హుడే). అవేమంటే;

  • (1) అతనికేదన్నా అమానతు (సొత్తు)ను అప్పగిస్తే ద్రోహానికి పాల్పడతాడు.
  • (2) మాట్లాడితే అబద్ధం చెబుతాడు.
  • (3) నమ్మి ఒడంబడిక చేసుకున్నప్పుడు నమ్మక (ద్రోహం చేస్తాడు.
  • (4) పోట్లాట జరిగినపుడు దుర్భాషకు దిగుతాడు.”

(బుఖారీ, ముస్లిం)

కనుక ఏ మనిషిలోనయినా ఈ నాలుగు అవ లక్షణాలు ఏకకాలంలో తిష్టవే స్తే, అతనిలో చెడు పూర్తిగా జొరబడినట్లే. అతనిలో కపట లక్షణాలన్నీ పొడసూపినట్లె. మరెవరిలోనయినా వీటిలో ఒక అవలక్షణం ఉంటే, అతనిలో కాపట్యానికి సంబంధించిన ఒక ఆనవాలు ఉందన్నమాట! ఒక్కోసారి ఒక దాసునిలో మంచి లక్షణాలు – చెడు లక్షణాలు, విశ్వాస లక్షణాలు – అవిశ్వాస, కాపట్య లక్షణాలు – రెండూ చోటు చేసుకుంటాయి. తత్కారణంగా అతను బహుమానంతో పాటు శిక్షకు కూడా అర్హుడవుతుంటాడు. మస్జిదులో జరిగే సామూహిక నమాజ్‌ పట్ల అనాసక్తత, బద్దకం కూడా ఈ కాపట్య లక్షణాలలో ఒకటి.

కపటత్వం (నిఫాఖ్‌) మహా చెడ్డ వస్తువు. అందుకే ప్రవక్త ప్రియసహచరులు (రది అల్లాహు అన్హుమ్) కాపట్యానికి లోనయ్యె విషయం పట్ల నిత్యం భయపడుతూ ఉండేవారు. ఇబ్నె అబీ ములైకా ఇలా అంటున్నారు :

“నేను ముప్పయి మంది సహాబా (ప్రవక్త సహచరుల)ను కలుసుకున్నాను. వారంతా తమను కాపట్యం ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడుతూ ఉండేవారు.”

నిఫాఖె అక్బర్  – నిఫాఖె అస్గర్‌కి మధ్య గల తేడాలు :

(1)  నిఫాఖె అక్బర్‌ (పెద్ద తరహా కాపట్యం) మనిషిని ఇస్లామీయ సమాజం నుండి బహిష్కరిస్తుంది. నిఫాఖె అస్గర్ (చిన్న తరహా కాపట్యం) సమాజం నుండి బహిష్మరించదు.

(2)  విశ్వాసాలలోని అంతర్బాహ్యాలలో గల విభేదానికి మరో పేరె నిఫాఖె అక్బర్‌. కాగా ఆచరణల్లోని అంతర్బాహ్యాలలో గల వైరుధ్యమే నిఫాఖె అస్గర్.

(3) ఒక విశ్వాసి వల్ల పెద్ద తరహా కపట చేష్ట జరగదు. చిన్న తరహా కపట చేష్టలే అతని వల్ల జరిగేందుకు ఆస్కారముంటుంది.

(4) పెద్ద తరహా కాపట్యానికి (నిఫాఖె అక్బర్‌కి) ఒడిగట్టిన వ్యక్తి చాలా వరకు పశ్చాత్తాపం ప్రకటించడు. ఒకవేళ అతను పరిపాలకుని సమక్షంలో పశ్చాత్తాపం చెందితే అతని పశ్చాత్తాపం స్వీకారయోగ్యమవుతుందా? లేదా? అనే విషయంలో విద్వాంసుల మధ్య భేదాభిప్రాయం ఉంది. తద్భిన్నంగా చిన్న తరహా కాపట్యానికి పాల్పడిన వ్యక్తి ఒక్కోసారి అల్లాహ్‌ సన్నిధిలో పశ్చాత్తాపపడుతుంటాడు. అల్లాహ్‌ అతని పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు.

షేఖుల్‌ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :

“తరచూ జరిగేదేమిటంటే ఒక విశ్వాసి కాపట్యానికి సంబంధించిన ఏదో ఒక విషయానికి లోనవుతాడు. తరువాత అల్లాహ్‌ అతని పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు. ఒక్కోసారి అతని ఆంతర్యంలో కొన్ని విషయాలు జనిస్తుంటాయి. అవి కాపట్యానికి ఆనవాలుగా ఉంటాయి. ఎట్టకేలకు అల్లాహ్‌ అతని ఆ స్థితిని కూడా రూపుమాపు తాడు. ఒక విశ్వాసి ఒక్కోసారి పైశాచిక ప్రేరణలకు, అవిశ్వాస శంకలకు లోనవుతుంటాడు. తత్కారణంగా అతని మనసు కుంచించుకుపోతూ ఉంటుంది. అతను తీవ్రంగా మనస్తాపానికి గురవుతాడు. ఆ విషయమే ఒకసారి ప్రియ సహచరులు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తో చెప్పుకున్నారు :

“దైవప్రవక్తా (సల్లలాహు అలైహి వ సల్లం)! మాలో కొందరి హృదయాలలో కలిగే భావాలు ఎంత తీవ్రమైనవంటే, వాటిని గురించి నోటితో చెప్పటం కన్నా నింగి నుంచి నేలపై పడిపోవటమే మిన్న అని అనుకుంటున్నాము”. దానికి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు : “ఈ భావనే అసలు విశ్వాసం (ఈమాన్‌).” (ముస్నదె అహ్మద్‌, ముస్లిం)

మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయి :

‘వాటిని నోటితో చెప్పటం కష్టమని భావిస్తున్నాడు.’

దానికి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు : “షైతాన్‌ ఎత్తుగడలను శంకలుగా మార్చివేసిన అల్లాహ్‌కే సకల స్తోత్రాలు.” అంటే ఆంతర్యంలో జనించే ఇలాంటి దుష్ప్రేరణలపై అయిష్టతను వ్యక్తపరచటం, వాటీని మనసులో నుంచి తీసిపడవెయ్యటం విశ్వాసానికి చిహ్నం అన్నమాట!” (కితాబుల్‌ ఈమాన్‌, పేజీ – 288)

నిఫాఖె అక్బర్‌ (పెద్ద తరహా కాపట్యం) సంగతి వేరు. అలాంటి వారి గురించి అల్లాహ్‌ ఏమంటున్నాడో చూడండి:

صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَرْجِعُونَ

“వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. వారిక మరలిరారు.” (అల్‌ బఖర : 18)

అంటే వారు మనస్ఫూర్తిగా ఇస్లాం వైపునకు రుజువర్తనులవరు. అలాంటి వారి గురించి అల్లాహ్‌ ఈ విధంగా కూడా సెలవిచ్చాడు :

أَوَلَا يَرَوْنَ أَنَّهُمْ يُفْتَنُونَ فِي كُلِّ عَامٍ مَّرَّةً أَوْ مَرَّتَيْنِ ثُمَّ لَا يَتُوبُونَ وَلَا هُمْ يَذَّكَّرُونَ

“ఏమిటీ, ప్రతి ఏటా ఒకసారో, రెండుసార్లో తాము ఏదో ఒక ఆపదలో చిక్కుకుపోవటాన్ని వారు గమనించటం లేదా? అయినాసరే, వారు పశ్చాత్తాపాపడటంగానీ, గుణపాఠం నేర్చుకోవటంగానీ జరగటం లేదు.” (అత్‌ తౌబా : 126)

షేఖుల్‌ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :

“వారి పశ్చాత్తాపం స్వీకరించబడే విషయంలో విద్వాంసుల మధ్య భిన్నాభిప్రాయం ఉంది. ఎందుకంటే అందులోని వాస్తవికత ఏపాటిదో తెలీదు. ఎందుచేతనంటే వారు నిత్యం తమను ఇస్లాం  అనుయాయులుగానే చెప్పుకుంటూ ఉంటారు.” (మజ్మూఅ ఫతావా – 28/434, 435)


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది

%d bloggers like this: