మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 4]
[మరణానంతర జీవితం – పార్ట్ 58] [26 నిముషాలు]
https://www.youtube.com/watch?v=rtI9WoN-uuo
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో నరకం (జహన్నం) యొక్క తీవ్రతను, దాని అగ్ని మరియు శిక్షల గురించి వివరిస్తారు. నరకంలో మరణం అనేది ఉండదని, శిక్ష నిరంతరంగా మరియు తీవ్రంగా ఉంటుందని, అది ఎముకలను మరియు హృదయాలను తాకుతుందని స్పష్టం చేస్తారు. నరకాగ్ని, దాని నిప్పురవ్వలు, నివాసుల హింస, వారు తాగే బాధాకరమైన పానీయాలు మరియు నీడలేని నీడ గురించి ఖురాన్ ఆయతులను ఉటంకిస్తారు. కృతజ్ఞత లేకపోవడం మరియు ఇతరులను శపించడం వంటివి నరకంలో స్త్రీలు అధిక సంఖ్యలో ఉండటానికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, ఈ దుర్గుణాలు ఎవరినైనా నరకానికి దారితీస్తాయని నొక్కి చెబుతారు. ఈ ప్రపంచం యొక్క తాత్కాలిక స్వభావాన్ని పరలోకం యొక్క శాశ్వత వాస్తవికతతో పోలుస్తూ, శ్రోతలను అల్లాహ్కు భయపడాలని, పాపాలను విడిచిపెట్టాలని, మరియు ఖురాన్ మరియు ప్రవక్త మార్గదర్శకత్వం అనుసరించి పరలోకం కోసం సిద్ధం కావాలని ప్రబోధిస్తారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు, అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
మహాశయులారా, నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు. దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. నరకం, దాని యొక్క వేడి ఎలా ఉంటుంది? నరకం దాని వేడితో అందులో పడే నరకవాసులను ఎలా శిక్షిస్తుంది? దానిని వివరిస్తూ అల్లాహ్ త’ఆలా ఎన్నో రకాలు దాని గురించి తెలిపాడు. ఈ రకాలు ఏదైతే తెలిపాడో, దానివల్ల మనలో భయం ఏర్పడి, మనం ఆ నరకం నుండి రక్షింపబడుటకు ప్రయత్నాలు చేయాలి.
సామాన్యంగా ఈ రోజుల్లో ఎవరినైనా అడగండి, నరకంలో వేసిన తర్వాత ఏమవుతుంది అంటే, మనిషి కాలి బూడిదైపోతాడు అని అంటారు. కానీ నరకాగ్ని అలాంటిది కాదు. అది మనిషిని కాల్చడంలో ఎంత వేగం, దాని యొక్క శిక్షలో ఎంత కఠినత్వం మరియు దానివల్ల మనిషికి కలిగే బాధ ఎంత ఘోరంగా ఉంటుందో, మరో విచిత్రకరమైన విషయం ఏంటంటే, ఆ శిక్షలో, ఆ నరకాగ్నిలో మనిషికి చావు అన్నది రాదు. అందులో మనిషి కాలి బూడిదైపోడు. అలా కావడానికి ఏ మాత్రం అవకాశం లేదు.
నరక శిక్షల గురించి అల్లాహ్ త’ఆలా ఏ ఏ ఆయతులైతే అవతరింపజేశాడో, వాటిలో కొన్ని ఆయతులు మాత్రమే మనం చదివి వాటి అర్థభావాలను తెలుసుకుందాము. వాటి ద్వారా నరక శిక్ష యొక్క వేడిని, దాని యొక్క గాంభీర్యతను తెలుసుకోవడంతో పాటు, ఏ పాపాల వల్ల అలాంటి శిక్ష ఇవ్వడం అనేది జరుగుతుందో, ఆ పాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం కూడా మనం చేద్దాము.
నరకాగ్ని యొక్క తీవ్రత
నరకాగ్ని ఎంత శిక్షాపరమైనదంటే, కేవలం మనిషి చర్మాన్నే కాల్చివేయదు. దాని యొక్క వేడి, అగ్ని ఎముకలకు చేరుకుంటుంది. అంతేకాదు, హృదయం లోపలి భాగంలో కూడా అది చేరుకుంటుంది. అంతేకాదు, అగ్ని మనిషి యొక్క నోటి వరకు వచ్చినా, దాని మూలంగా కడుపులో దాని యొక్క బాధ, అవస్థ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంతకుముందే మనం ఒక కార్యక్రమంలో విన్నాము, అతి తక్కువ శిక్ష ఎవరికైతే నరకంలో ఇవ్వబడుతుందో, దాని యొక్క రకం ఏమిటి? నరకపు బూట్లు ధరింపచేయడం జరుగుతుంది, దానివల్ల అతని యొక్క మెదడు ఉడుకుతున్నట్లుగా అతనికి ఏర్పడుతుంది.
ప్రపంచపు అగ్నిలో ఎప్పుడైనా అది ఎముకల వరకు చేరుతుంది, హృదయం లోపలి వరకు చేరుతుంది, కడుపు లోపలి వరకు చేరుతుంది, ఇలాంటి విషయాలు వింటామా? సోదరులారా, నరకం గురించి ఇన్ని వివరాలు అల్లాహ్ మనకు తెలిపాడు అంటే, అన్ని రకాల పాపాలను, అన్ని రకాల చెడుగులను మనం వదులుకోవాలని.
సూరె ఘాషియాలో,
وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ
(వుజూహున్ యౌమఇజిన్ ఖాషిఅహ్)
ఆ రోజు ఎన్నో ముఖాలు అవమానంతో పాలిపోయి ఉంటాయి.(88:2)
عَامِلَةٌ نَّاصِبَةٌ
(ఆమిలతున్ నాసిబహ్)
శ్రమిస్తూ, అలసి సొలసి ఉంటాయి. (88:3)
تَصْلَىٰ نَارًا حَامِيَةً
(తస్లా నారన్ హామియహ్)
వారు మండే అగ్నికి ఆహుతి అవుతారు.(88:4)
ఎన్నో ముఖాలు, వారి ముఖాలు క్రిందికి వాలి ఉంటాయి, వంగి ఉంటాయి. వారు ఇహలోకంలో ఎంతో కష్టపడేవారు. అలసిపోయి అలసిపోయి ఎన్నో మేము పుణ్యాలు చేసుకున్నాము అని సంతోషపడేవారు. కానీ ప్రవక్త విధానంలో లేనందుకు, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు లేనందుకు ఏం జరిగింది? తస్లా నారన్ హామియా. ఆ పుణ్యాలన్నీ కూడా వృధా అయిపోయినాయి మరియు వారు తస్లా, నరకంలో చేరారు. ఎలాంటి నరకం? హామియా, అది మండుతూ ఉంటుంది.
మరోచోట సూరతుల్ లైల్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్,
فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
(ఫ అన్-జర్తుకుమ్ నారన్ తలజ్జా)
మరి నేను మటుకు నిప్పులు చెరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాను.(92:14)
అని తెలియపరిచాడు. ఆ నరకాగ్ని ఎలాంటిది? నారన్ తలజ్జా. నిప్పులు చెరిగే ఆ నరకాగ్ని నుండి నేను మిమ్మల్ని హెచ్చరించలేదా? ఇంకా ఆ నరకాగ్ని భగభగ మండుతూ ఉంటుంది, మంటలు లేస్తూ ఉంటాయి. దాని యొక్క జ్వాలలతోనే మనిషికి ఎంతో దూరం నుండి వాటి యొక్క వేడి తలుగుతూ ఉంటుంది.
తబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్. మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్. అబూ లహబ్ అతని చేతులు విరిగిపోవు గాక, అతను సర్వనాశనమయ్యాడు. అతను సంపాదించిన సంపద మరియు అతని యొక్క డబ్బు, ధనం అతనికి ఏమీ ప్రయోజనం కలిగించలేదు.
سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
(సయస్లా నారన్ జాత లహబ్)
త్వరలోనే వాడు భగ భగ మండే అగ్నికి ఆహుతి అవుతాడు. (111:3)
గమనించండి ఇక్కడ. నారన్ హామియా, నారన్ తలజ్జా, నారన్ జాత లహబ్. నార్, ఆ అగ్ని, నరకం దాని యొక్క గుణాలు ఈ విధంగా తెలుపబడుతున్నాయి. ఇక్కడ జాత లహబ్, అందులో భగభగ మండుతూ ఉంటుంది, దాని యొక్క మంటలు, దాని యొక్క జ్వాలలు మహా భయంకరంగా ఉంటాయి.
ఈ విధంగా మహాశయులారా, అంతటి కఠిన శిక్ష గల ఆ నరకం మరియు ఆ నరకాగ్ని యొక్క ఇలాంటి రకరకాల గుణాలు వాటితో రక్షణ పొందడానికి ఏముంది మన వద్ద?
الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ
(అల్లతీ తత్తలివు అలల్ అఫ్-ఇద)
అది హృదయాల వరకూ చొచ్చుకు పోయేటటువంటిది. (104:7)
అని ఒకచోట తెలపడం జరిగింది. ఆ నరకం, నరకాగ్ని మనిషి యొక్క హృదయాల వరకు చేరుతుంది. మరియు ఆ నరకాగ్ని అందులో ఏ నిప్పులైతే లేస్తాయో, అగ్ని యొక్క నిప్పులు ఏవైతే లేసి వేరేచోట పడతాయో, వాటి గురించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఆ నిప్పులు ఎంత పెద్దగా ఉంటాయో, దాని యొక్క వివరణ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సూరతుల్ ముర్సలాత్లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,
إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ
(ఇన్నహా తర్మీ బిషరరిన్ కల్-ఖస్ర్)
నిశ్చయంగా నరకం మేడలు, మిద్దెలంతటి నిప్పు రవ్వలను విసురుతుంది. (77:32)
ఆ నరకం ఎలాంటి నిప్పులను పడవేస్తుందంటే, ఆ నిప్పులు పెద్ద పెద్ద బిల్డింగుల మాదిరిగా, మహా గొప్ప కోటల మాదిరిగా, అంత పెద్దగా ఒక్కొక్క నిప్పు ఉంటుంది. అల్లాహు అక్బర్! ఆ నిప్పు అంత భయంకరమైన, ఘోరమైన, అంత పెద్దగా ఉంటుంది అంటే, ఇక ఆ నరకాగ్ని ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి.
ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
“నారుకుమ్ హాజిహిల్లాతీ యూఖిదు ఇబ్ను ఆదమ్, జుజ్ఉమ్ మిన్ సబ్ఈన జుజ్ఇన్ మిన్ హర్రి జహన్నమ్”.
ఇహలోకంలో మనిషి ఏ అగ్నినైతే కాలుస్తున్నాడో, అది నరకపు అగ్నిలో 70 భాగాలు చేస్తే, అందులోని ఒక భాగం.
సహాబాలకు చాలా ఆశ్చర్యం కలిగింది. సహాబాలు చెప్పారు, “ప్రవక్తా, మనిషిని కాల్చడానికి ఈ ఇహలోకపు అగ్నియే చాలు కదా?” ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ నరకాగ్ని ఇహలోకపు అగ్ని కంటే “ఫుద్విలత్ బి తిస్ఇన్ వసిత్తీన జుజ్ఆ”, 69 రేట్లు ఎక్కువగా అది ఇంకా వేడిగా ఉంటుంది. మరి గమనించండి, ఈ ఇహలోకపు అగ్నియే మనిషిని కాల్చడానికి సరిపోతుంది అని అనుకునే వాళ్ళం మనం, ఇంతకంటే 69 రేట్లు ఎక్కువగా వేడి ఉన్న ఆ నరకాగ్ని నుండి రక్షింపబడడానికి ఏం చేస్తున్నాము?
నరకంలో ఉపశమనం లేదు
మహాశయులారా, మనిషి వేడిలో, ఎండకాలంలో ఏదైనా ప్రశాంతత పొందడానికి, నీడ పొందడానికి, చల్లదనం పొందడానికి ఎక్కడికి వెళ్తాడు? ఏదైనా చెట్టు కింద నీడ పొందాలని, అక్కడ హాయిగా గాలి వీస్తూ ఉండాలని, త్రాగడానికి చల్లటి నీళ్లు అతనికి లభించాలని కోరుకుంటాడు. అవునా కాదా? మనందరి పరిస్థితి ఇదే కదా?
కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. అందులో అతనికి ఎండలో పని చేస్తూ చేస్తూ చెమటలు కారుతూ, శక్తి క్షీణించిపోయినట్లుగా ఏర్పడుతుంది. కొంతసేపటి గురించైనా నీడలోకి వెళ్లి, గాలి వీస్తున్నచోట కూర్చుండి, ప్రశాంతత తీసుకొని అక్కడ త్రాగడానికి చల్లటి నీరు లభించిందంటే, అతనికి ఓ స్వర్గం లభించింది అన్నట్టుగా భావిస్తాడు.
కానీ నరకంలో ఉన్నవారు నరక శిక్షను భరిస్తూ భరిస్తూ సహించలేక, ఓపిక వహించలేక, చావు వచ్చి చనిపోతే బాగుండు అని కోరుతూ ఉంటారు. అయినా అక్కడ చావు రావడానికి ఏ మాత్రం అవకాశం లేదు. అప్పుడు వారికి ఒక నీడ లాంటిది కనబడుతుంది.
انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ
(ఇన్-తలిఖూ ఇలా జిల్లిన్ జీ సలాసి షుఅబ్)
“మూడు పాయలుగా చీలిన ఆ నీడ వైపు పదండి!!” (77:30)
لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ
(లా జలీలిన్ వలా యుగ్నీ మినల్ లహబ్)
నిజానికి అది మీకు నీడనూ ఇవ్వదు, అగ్ని జ్వాలల నుండి మీకు రక్షణనూ ఇవ్వదు. (77:31)
అక్కడ వారికి ఒక నీడ లాంటిది కనబడుతుంది. ఆ నీడలో వెళ్దాము అని వారు అక్కడికి వెళ్తారు. అల్లాహు అక్బర్! ఆ నీడ కూడా ఎలాంటిది? ఆ నీడ నరకాగ్ని యొక్క నీడ. మనిషి కొంతపాటు విశ్రాంతి తీసుకుందామని ఆ నీడలోకి వెళ్ళినప్పుడు, నరకం నుండి పెద్ద పెద్ద నిప్పులు వచ్చి పడతాయి. ఒక్కొక్క నిప్పు ఒక పెద్ద పర్వతం మాదిరిగా, పెద్ద కోట మాదిరిగా, ఓ మహా పెద్ద ప్యాలెస్ మాదిరిగా ఉంటుంది.
ఇక ఆ నీడతో అతనికి ఏం ప్రయోజనం కలిగింది? చల్లని గాలి వస్తుందేమో అని అక్కడ ఆశిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరుగుద్ది? సూరె వాఖిఆలో అల్లాహ్ త’ఆలా దాని గురించి ప్రస్తావించాడు. నరకం, నరకపు అగ్ని, దాని యొక్క వేడి, దాని యొక్క రకాలు, గుణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటున్నాము. నరకాగ్ని శిక్షను మనిషి భరించలేక నీడ చూస్తాడు, ఆ నీడలో కొంత విశ్రాంతి తీసుకుందామని వస్తాడు, కానీ ఆ నీడ నరకపు అగ్ని యొక్క నీడ. అందులో ఎలాంటి ప్రశాంతత అనేది ఉండదు. పైగా నరకపు నిప్పులు వచ్చి పడుతూ ఉంటాయి. ఒక్కొక్క నిప్పు ఎంతో పెద్ద ప్యాలెస్ గా, పెద్ద కోట మాదిరిగా ఉంటుంది.
ఏమైనా గాలి వీస్తుందో ఏమో, ఆ గాలి ద్వారా కొంచెం ఏదైనా లాభం పొందుదాము అని కోరుతాడు. కానీ అది ఎలాంటిది? మీ యహ్మూమ్ అని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తెలిపాడు. గాలి వీస్తుంది, కానీ ఆ గాలి ఎలాంటిది? అందులో కూడా విపరీతమైన వేడి, పొగ మరియు ఆ దానిని మనిషి ఏ మాత్రం భరించలేడు. ఎందుకైతే నేను ఆ నరకం నుండి బయటికి వచ్చాను, ఇక్కడి కంటే అక్కడే బాగుండే కదా అని అప్పుడు మనిషి భావిస్తాడు. ఈ విధంగా స్థలాలు మార్చినా, ఒక స్థితి నుండి మరో స్థితికి వచ్చినా, నరకపు అగ్ని అనేది, నరకపు శిక్ష అనేది తగ్గదు.
ఇక ఏదైనా నీరు త్రాగాలి అని అనిపిస్తుంది. అప్పుడు అతనికి మరీ దాహం కలిగి త్రాగడానికి ఏ నీరైతే ఇవ్వబడుతుందో, లా బారిదిన్ వలా కరీమ్. అది చల్లగా ఉండదు మరియు అతిథికి గౌరవ మర్యాదలు ఇస్తూ ఎలాగైతే ఒక వస్తువు త్రాగడానికి, తినడానికి ఇవ్వడం జరుగుతుందో అలా జరగదు. సూరె కహఫ్ లో చదవండి.
وَإِن يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ ۚ بِئْسَ الشَّرَابُ وَسَاءَتْ مُرْتَفَقًا
ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!!. (18:29)
దాహం కలుగుతుంది, మాకు నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అని వారు కోరుతారు. అప్పుడు వారికి త్రాగడానికి ఏ నీరైతే ఇవ్వడం జరుగుతుందో, దానిని దగ్గరికి తీసుకుంటే యష్విల్ వుజూహ్, త్రాగకముందే కేవలం దగ్గరికి తీసుకున్నంత మాత్రాన ముఖమంతా కాలిపోతుంది. అల్లాహు అక్బర్! దాన్ని చూసి ఏమంటాడు? బిఅసష్షరాబ్! ఇది ఎంత చెడ్డ నీరు, త్రాగడానికి ఇవ్వబడిన ఈ పదార్థం ఎంత చెడ్డది అని అక్కడ భావిస్తాడు. అల్లాహు అక్బర్! కానీ ఈ రోజుల్లో ఆ నరకం నుండి రక్షణ పొందడానికి ఏ పాపాల నుండి అయితే మనం దూరం ఉండాలో, ఆ పాపాలలో ఎంతో ఆనందిస్తున్నాడు. అల్లాహు అక్బర్! ఇలాంటి జీవితం మనిషిది గమనించండి. అందుగురించి అల్లాహ్ త’ఆలా ఖురాన్ లాంటి దివ్య గ్రంథాన్ని మనకు ప్రసాదించి, దీన్ని చదవడం ద్వారా, దీనిని మనం గ్రహించడం ద్వారా ఇలాంటి పాపాల నుండి దూరం ఉండి రేపటి రోజు ఆ నరక శిక్షల నుండి కూడా మనం రక్షింపబడగలుగుతాము.
నరకంలో అతి ఎక్కువ సంఖ్య ఎవరిది?
మహాశయులారా, నరకం, అందులో అతి ఎక్కువ సంఖ్య ఎవరిది ఉంటుంది? నరకం ఎవరి స్థానం అవుతుంది? దీని గురించి హదీసుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా తెలిపారు. పురుషుల కంటే ఎక్కువ సంఖ్య నరకంలో స్త్రీలది ఉంటుంది అని తెలిపారు. అయితే ఇక్కడ స్త్రీలను అగౌరవపరచడం కాదు, కొన్ని రకాల గుణాలు తెలపడం జరిగింది. వారిలో ఆ చెడు గుణాలు ఎక్కువ ఉన్నందుకు వారు ఎక్కువగా నరకంలో ఉంటారు అని తెలపడం జరిగింది. ఒకవేళ అలాంటి గుణాలు పురుషుల్లో ఉంటే, వారు కూడా నరకంలో ఉంటారు.
ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఇన్నీ రఐతు అక్సర అహ్లిన్నారి అన్నిసా”. నేను నరకంలో అధిక సంఖ్య స్త్రీలది చూశాను అని చెప్పారు. స్త్రీలలో నుండి ఒక స్త్రీ నిలబడి, “ప్రవక్తా, ఎందుకు, కారణం చెప్పగలుగుతారా?” ఉద్దేశం ఏమిటి? కారణం తెలిస్తే అలాంటి కారణాలు మా ద్వారా సంభవించకుండా మేము జాగ్రత్త పడగలము. ఆనాటి కాలంలో సహాబాలు గాని, సహాబాల యొక్క భార్యలు, సహాబియాత్ కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా శిక్ష గురించి హెచ్చరిస్తున్నారు అంటే, ఇలా ఎందుకు అని వారు కారణం అడిగితే వారి ఉద్దేశం ఏముండేది? అలాంటి పాపాల నుండి దూరం ఉండాలి అని.
ఎక్కడైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త తెలుపుతున్నారు, “అలా అదుల్లుకుమ్ అలా మా యమ్హుల్లాహు బిహిల్ ఖతాయా”, మీ పాపాలు ఎలా మన్నించబడాలి, మీ స్థానాలు ఎలా రెట్టింపు చేయబడాలి అని ఇలాంటి శుభవార్తలు ఏదైనా ఇస్తున్నప్పుడు, “తప్పక తెలపండి, ఆ విషయాలు ఏమిటి?” అని అడిగేవారు. ఎందుకు? అలాంటి సత్కార్యాలు చేసుకోవాలని. అల్లాహ్ మనలోని ప్రతి ఒక్కరిని క్షమించు గాక, ఈ రోజుల్లో మనలో అనేకమంది అలవాటు ఏమైంది? చెడు గుణం గురించి ఏదైనా, శిక్ష గురించి ఏదైనా హెచ్చరిక ఇవ్వబడుతున్నప్పుడు, అడ్డ ప్రశ్నలు వేసి, ఆ శిక్షకు కారణమయ్యే పాపాల నుండి దూరం ఉందాము అన్నటువంటి ఆలోచన లేకుండా, ఇంత పాపానికి ఇంత పెద్ద శిక్షనా? ఇలాంటి పాపాలు మన్నించబడవా? ఇలాంటి పాపాలు చేసిన తర్వాత ఏదైనా .. ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ, వాటి నుండి మనం దూరం ఉందాము మరియు దానికి సబబు ఏదైతే శిక్ష అవుతుందో, ఆ శిక్ష నుండి మనం తప్పించుకునే ప్రయత్నం చేద్దాము అన్నటువంటి ఆలోచన కలగటం లేదు.
మరోవైపు పుణ్యకార్యాల గురించి శుభవార్త ఇవ్వడం జరిగినప్పుడు, ఇది కూడా చేయడం తప్పనిసరియా? చేయకుంటే నడవదా? అన్నటువంటి ప్రశ్నలు అక్కడ. అల్లాహ్తో భయపడాలి మనం. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మీకంటే ముందు గతించిన జాతి వారు వినాశనానికి గురి అయ్యే కారణాల్లో ఒక కారణం, ప్రవక్తలు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉండడం మరియు అధికంగా అనవసరమైన ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఉండడం.
అందుగురించి మహాశయులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే తెలిపారో, నేను నరకంలో అధిక సంఖ్యలో స్త్రీలను చూశాను అని, ఒక స్త్రీ నిలబడి, “ప్రవక్తా, కారణాలు ఏంటి?” అని అడిగితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “యక్సుర్నల్ లఅన్, వ యక్ఫుర్నల్ అషీర్”. వారి నోట మాటిమాటికి శాపనార్థాలు వెళ్తూ ఉంటాయి. వారు ఎక్కువగా శపిస్తూ ఉంటారు మరియు తమ భర్తలకు వారు కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది.
భర్తలకు ఆదేశం ఇవ్వడం జరిగింది, “ఖియారుకుమ్ ఖియారుకుమ్ లి అహ్లిహి, వ అన ఖైరుకుం లి అహ్లీ”. మీలో అందరికంటే మేలైన వాడు తమ ఇల్లాలి పట్ల, తమ ఇంటి వారి పట్ల అతి ఉత్తమంగా మెలిగేవాడు అని. మరియు నేను మీ అందరిలోకెల్లా ఉత్తమమైన వాడిని, నేను నా ఇల్లాలి పట్ల, ఇంటి వారి పట్ల ఉత్తమ వైఖరి అవలంబిస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అటువైపున భర్తలకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే భార్యలకు కూడా భర్త హక్కు ఏమిటో, భర్త జీవితాంతం మేలు చేసుకుంటూ వస్తాడు, కానీ ఒక్కసారి భార్య యొక్క కోరిక ఏదైనా నెరవేర్చక పోవడంలో, “జీవితంలో ఎప్పుడూ కూడా నీతో సుఖం పొందలేదు నేను” అని భార్య అంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరణ ఇచ్చారు. అయితే, ఇలాంటి చెడు గుణం కొందరి భర్తల్లో కూడా ఉంది. వారు కూడా తమ చెడు గుణాన్ని దూరం చేసుకోవాలి. భార్యతో ఎంత ఆనందం పొందినా, ఎంత సుఖం పొందినా, ఒక్కసారి కూడా నీతో నేను సుఖం పొందలేదు అన్నటువంటి మాటలు కూడా మాట్లాడతారు.
మహాశయులారా, నరకానికి కారణమయ్యే ఇలాంటి దుర్గుణాల నుండి, దురలవాట్ల నుండి, చెడు కార్యాల నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి.
నరకవాసుల సంఖ్య
ఇక్కడ ఒక విషయం తెలుసుకోవడం చాలా ఉత్తమం. అదేమిటంటే, నరకవాసుల సంఖ్య స్వర్గవాసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది అని. అయితే, ఇలా ఎందుకు జరుగుతుంది అని వచ్చిన ప్రశ్నకు ధర్మవేత్తలు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రజలు ప్రపంచపు వ్యామోహంలో కూరుకుపోయి ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్ని స్వీకరించరు గనక వారు నరకంలో పడిపోతారు.
మరి ఏ జాతి వారి వద్దకు కూడా అల్లాహ్ త’ఆలా తన ప్రవక్తని లేదా ప్రవక్త కాలం అంతమైపోయిన తర్వాత, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకంలో నుండి చివరి ప్రవక్తగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, వారి స్థానంలో, అంటే వారి లాంటి దావా కార్యక్రమం చేస్తూ ఉన్న వారిని ఎవరినొకరినైనా అల్లాహ్ త’ఆలా ఏదైనా సమాజంలో పంపి ఉంటాడు. ఆ తర్వాతనే వారిపై శిక్ష విధిస్తాడు.
وَمَا كُنَّا مُعَذِّبِينَ حَتَّىٰ نَبْعَثَ رَسُولًا
(వమా కున్నా ముఅజ్జిబీన హత్తా నబ్-అస రసూలా)
ఒక ప్రవక్తను పంపనంతవరకూ ఎవరినయినా శిక్షించటం మా సంప్రదాయం కాదు. (17:15)
ఏ ప్రవక్తను పంపనిది మేము ఏ జాతిని శిక్షించము అని అల్లాహ్ త’ఆలా అంటున్నాడు. ఇక ఏ జాతి పైనైనా ఏదైనా శిక్ష వచ్చి పడుతుంది అంటే, ఆ జాతి వారికి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఏదో ఒక రకంగా. కానీ దానిని వారు పెడచెవిన పెట్టారు, దానిని స్వీకరించలేదు, దానిని అర్థం చేసుకోలేకపోయారు. అందుగురించి వారు శిక్షను అనుభవించాల్సి వచ్చింది.
మహాశయులారా, మనిషిలో ఉన్నటువంటి ఒక చెడు గుణం ఏమిటంటే, అతను దూరపు ఆలోచన తక్కువ, ప్రవక్తల ద్వారా లేక అల్లాహ్ మార్గం వైపునకు పిలిచే అటువంటి ప్రచారకులు ఎవరైతే ఉన్నారో, వారు ఖురాన్ ఆధారంగా ఏ సత్య బోధన చేస్తున్నారో, ఆ సత్య బోధనలో ఉన్నటువంటి లాభాలను గ్రహించరు. తొందరపాటు పడి, ప్రపంచ వ్యామోహంలో పడి, ప్రస్తుత లాభాన్ని పొందడంలో వారు నిమగ్నులై ఉంటారు. దాని మూలంగా పరలోక జీవితాన్ని మరిచిపోతూ ఉంటారు. అందుగురించి ఎన్నో సందర్భాల్లో అల్లాహ్ త’ఆలా ఖురాన్లో స్పష్టంగా తెలిపాడు,
كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ
(కల్లా బల్ తుహిబ్బూనల్ ఆజిల)
ఎన్నటికీ కాదు. మీరసలు తొందరగా లభించే దాని (ప్రపంచం)పై మోజు పడుతున్నారు.(75:20)
وَتَذَرُونَ الْآخِرَةَ
(వ తజరూనల్ ఆఖిర)
పరలోకాన్ని మాత్రం వదలిపెడుతున్నారు.(75:21)
మీరు ప్రపంచాన్ని అధికంగా ప్రేమిస్తున్నారు, మరియు మీ వెనక ఉన్నటువంటి ఆ పరలోకాన్ని మరిచిపోతున్నారు. ఇలా ప్రపంచ వ్యామోహంలో పడి, తాత్కాలికపు లాభాలు, ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచించి, దూరమున ఉన్న ఆ పరలోకం మహా దూరం ఉంది కదా అని భావించి, దాని విషయంలో ఏ సంసిద్ధత ముందు నుండే ఉండాలో, దానిని పాటించనందుకు, అధిక సంఖ్యలో ప్రజలు నరకంలో పోవడానికి కారణమవుతుంది.
ఇప్పటికైనా అల్లాహ్ మనకు అవకాశం ఇచ్చాడు. మన ప్రాణం పోకముందే ఇలాంటి మంచి బోధనలు వినడానికి మనకు అవకాశం కలుగజేస్తున్నాడు. ఇకనైనా నరకంతో మనం భయపడాలి, దానికి కారణమయ్యే పాపాల నుండి మనం దూరం ఉండాలి, మరియు ఎల్లవేళల్లో అల్లాహ్తో భయపడుతూ, అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం నరకం నుండి రక్షింపబడతాము.
సూరె జుఖ్రుఫ్, ఆయత్ నంబర్ 23, 24 లో అల్లాహ్ త’ఆలా ఎంత స్పష్టంగా ప్రజల యొక్క ఈ చెడు భావాన్ని తెలిపి వారికి గుణపాఠం వచ్చే విధంగా చేశాడు, గమనించండి.
మా అర్సల్నా మిన్ ఖబ్లిక ఫీ ఖర్యతిన్ మిన్ నజీరిన్ ఇల్లా ఖాల ముత్రఫూహా.
మేము మీకంటే ముందు, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు, మీకంటే ముందు ఏ బస్తీలో, ఏ హెచ్చరిక చేసేవానిని మేము పంపినా, ఆ బస్తీలో, ఆ నగరంలో ఉన్నటువంటి సిరివంతులు, ఆనందంలో జీవితం గడుపుతున్న వారు ప్రవక్తలతో ఏమన్నారు?
إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَىٰ أُمَّةٍ وَإِنَّا عَلَىٰ آثَارِهِم مُّهْتَدُونَ
అది కాదు, “మా తాతముత్తాతలు ఒకానొక పద్ధతిపై ఉండటం మేము చూశాము. మేము వాళ్ల అడుగుజాడలలోనే నడుచుకుని సన్మార్గం పొందాము” అని వారు బుకాయిస్తారు.. (43:22)
అప్పుడు ఆ ప్రవక్తలు వారితో చెప్పారు,
قَالَ أَوَلَوْ جِئْتُكُم بِأَهْدَىٰ مِمَّا وَجَدتُّمْ عَلَيْهِ آبَاءَكُمْ
“మీ తాతముత్తాతలు అనుసరిస్తుండగా మీరు చూసిన మార్గం కంటే చాలా మంచి మార్గాన్ని (గమ్యానికి చేర్చే మార్గాన్ని) నేను మీ వద్దకు తీసుకువచ్చాను” అని (దైవప్రవక్త) అన్నప్పుడు, (43:24)
మీ తాతముత్తాతల కంటే ఎక్కువ సన్మార్గం, ఉత్తమ మార్గం నేను మీకు చూపినా మీరు తిరస్కరిస్తారా? అంటే వారు స్పష్టంగా ఏం చెప్పారు?
قَالُوا إِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ
దానికి వారు, “మీకిచ్చి పంపబడిన పద్ధతిని మేము తిరస్కరిస్తున్నాం” అని వాళ్లు (తెగేసి) చెప్పారు. (43:24)
మీరు ఏ ధర్మమైతే తీసుకొచ్చారో, ఏ సత్యమైతే తీసుకొచ్చారో, వాటిని మేము తిరస్కరిస్తున్నాము. అల్లాహు అక్బర్! ఈ విధంగా ప్రజలు పెడమార్గంలో పడిపోతారు. అల్లాహ్ త’ఆలా నరకంలోకి తీసుకెళ్లే ప్రతి చెడు కార్యం నుండి మనల్ని దూరం ఉంచు గాక. నరకం నుండి అల్లాహ్ మనందరికీ రక్షణ కలిగించు గాక. వా ఆఖిరు ద’అవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44015
—
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]