నరకం, నరకవాసుల రంగు, నరకాగ్ని యొక్క ఇంధనం, అపరాధులను నరకంలో పడవేసే విధానం, నరకంలో తొలిసారిగా ఎవరిని వేయడం జరుగుతుంది? [మరణానంతర జీవితం – పార్ట్ 57] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 3]
నరకం, నరకవాసుల రంగు, నరకాగ్ని యొక్క ఇంధనం, అపరాధులను నరకంలో పడవేసే విధానం, నరకంలో తొలిసారిగా ఎవరిని వేయడం జరుగుతుంది?
[మరణానంతర జీవితం – పార్ట్ 57] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=NZqkJ0Gly10
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.అల్హమ్దులిల్లాహిల్లజీ అఅద్దల్ జన్నత లిల్ ముత్తఖీన్, వ అఅద్దన్నార లిజ్జాలిమీన్, వస్సలాతు వస్సలామ్ అలా మన్ ఉర్సిల బషీరన్ వ నజీరా, అమ్మాబాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. నరకం, నరకవాసులు, వారి యొక్క శిక్షల వివరాలు మనం తెలుసుకుంటున్నాము.

మహాశయులారా, నరకం దాని రంగు ఎలా ఉంటుంది? నరకవాసుల రంగు ఎలా ఉంటుంది? ఈ వివరాలు కూడా మనకు ఖురాన్ హదీసుల్లో తెలుపబడ్డాయి. ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది? ఇంటి నుండి బయటికి వెళ్తున్నాము అంటే ఆఫీస్ కు ఒక రకంగా తయారయి వెళ్తాము, మార్కెట్లో వెళ్ళాలంటే ఒక రకంగా తయారయి వెళ్తాము. ఎవరైనా ఫ్రెండ్స్ తో పార్టీలలో పాల్గొనాల నుకుంటే మరో రకంగా మేకప్ చేసుకుని వెళ్తాము. ఈ విధంగా మనిషి యొక్క స్వభావంలో అందంగా ఉండాలి, నలుగురు మెచ్చుకునే రీతిలో మనం వారి ముందు ఉండాలి అని భావిస్తూ ఉంటాడు. నశించిపోయే ఈ ప్రపంచంలో ఇంతటి అలంకరణ విషయాలు మనం ప్రదర్శిస్తూ ఉంటాము. కానీ శాశ్వత జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా?

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఏమిటి? ఆ నరకం అంటే మీరు ఇహలోకంలో కాల్చే అగ్ని మాదిరిగా అనుకుంటున్నారా? కాదు.

أُوقِدَ عَلَى النَّارِ أَلْفَ سَنَةٍ حَتَّى احْمَرَّتْ، ثُمَّ أُوقِدَ عَلَيْهَا أَلْفَ سَنَةٍ حَتَّى ابْيَضَّتْ، ثُمَّ أُوقِدَ عَلَيْهَا أَلْفَ سَنَةٍ حَتَّى اسْوَدَّتْ، فَهِيَ سَوْدَاءُ مُظْلِمَةٌ.

వెయ్యి సంవత్సరాల వరకు నరకాగ్నిని దహించి వేయడం జరిగింది, అది ఎర్రగా ఎరుపుగా మారింది. ఆ తర్వాత మళ్లీ వెయ్యి సంవత్సరాల వరకు దానిని తేజోవంతంగా చేయడం జరిగింది, అది తెలుపుగా మారింది. ఆ తర్వాత ఇంకా వెయ్యి సంవత్సరాలు అగ్నిని కాల్చడం కాల్చడం జరిగింది. చివరికి అది నలుపుగా మారింది. ఫహియ సౌదావు ముజ్లిమతున్ కల్లైలిల్ ముజ్లిమ్ (అది అమావాస్య చిమ్మని చీకటి రాత్రి ఎలా ఉంటుందో ఆ విధంగా అది ఇప్పుడు నలుపుగా మరియు చీకటిగా ఉంది).

అల్లాహు అక్బర్. గమనించండి, మీరు ఉన్న రూమ్ లో బ్లాక్ కలర్ వేసుకొని ఉండగలుగుతారా? దానిపై ఒకవేళ ఇంకా చీకటి ఉండేది ఉంటే, ఇంత భయంకరంగా ఉంటుంది. నరకం ఆ విధంగా తయారు చేయడం జరిగింది.

మువత్తా ఇమామ్ మాలిక్ లోని ఒక హదీస్ లో ఉంది:

أَتَرَوْنَهَا حَمْرَاءَ كَنَارِكُمْ هَذِهِ؟ لَهِيَ أَسْوَدُ مِنَ الْقَارِ

మీరు నరకాగ్నిని మీ ఇహలోకపు అగ్ని మాదిరిగా ఎరుపుగా ఉంది అని భావిస్తున్నారా? అది తార్ (రోడ్డుపై వేసే డాంబర్) కంటే ఎక్కువ నలుపుగా ఉంది.

ఇక నరకం అలా ఉన్నప్పుడు, ఆ నరకంలో పడిన వారు ఎలా ఉంటారు? అల్లాహు అక్బర్. ఆ విషయం కూడా ఖురాన్ హదీసుల్లో తెలపడం జరిగింది. సూరె ఆలి ఇమ్రాన్, ఆయత్ నంబర్ 106 లో ఉంది:

يَوْمَ تَبْيَضُّ وُجُوهٌ وَتَسْوَدُّ وُجُوهٌ
యౌమ తబ్యద్దు వుజూహున్ వ తస్వద్దు వుజూహ్.
ఆ రోజు కొన్ని ముఖాలు ఆనందంతో కాంతిలాగా మెరుస్తూ తెలుపుగా ఉంటే, మరికొన్ని చీకటి మాదిరిగా నలుపుగా ఉంటాయి.

మరొకచోట సూర యూనుస్ ఆయత్ నంబర్ 27లో అల్లాహ్ తెలిపాడు:

كَأَنَّمَا أُغْشِيَتْ وُجُوهُهُمْ قِطَعًا مِّنَ اللَّيْلِ مُظْلِمًا
క అన్నమా ఉగ్షియత్ వుజూహుహుమ్ ఖితఅమ్ మినల్లైలి ముజ్లిమా.
వారి యొక్క ముఖాలు, రాత్రిని చీకటి క్రమ్ముకుని ఉన్న మాదిరిగా అంతటి నలుపుగా వారి ముఖాలపై అవమానం, చీకటి, నలుపు అన్నీ కూడా ఆవరించుకుని ఉంటాయి.

మహాశయులారా, నరకం అనేది ఇంత నలుపుగా ఉన్నప్పుడు, అందులో పడిన వారు కూడా అదే విధంగా ఉంటారు. ఇహలోకంలో ఎవరు ఎన్ని క్రీములు పెట్టుకుని, ఎన్ని పౌడర్లు రాసుకుని, ఎన్ని మేకప్ లు చేసుకుని, ఎన్ని బ్యూటీ పార్లర్లలో తమ జీవితాలు గడిపి ఉన్నా, అవిశ్వాస మార్గంలో, ఎన్ని బ్యూటీ పార్లర్లలో తమ జీవితాలు గడుపుకొని ఉన్నా, అవిశ్వాస మార్గంలో నడుస్తూ ఉంటే, పాప కార్యాలు చేస్తూ ఉంటే, ఈ అందమంతా ఇక్కడే నశించిపోతుంది. అందు గురించి ఇహలోకపు అవసరం ఉన్నప్పుడు అందచందాలను మరియు అలంకరణను నిషిద్ధపరచడం జరగడం కాదు. విషయం, ఇక్కడి అందచందాలు అవిశ్వాసంతో అక్కడ ఏ మాత్రం పనికిరావు. ఇక్కడి ఎన్ని మేకప్ లు కూడా పాపాలతో కూడుకొని ఉంటే అక్కడ అవేమీ పనికిరావు. మనిషి విశ్వాసాన్ని ఎన్నుకోవాలి, విశ్వాస మార్గాన్ని అవలంబించాలి, పాపాలకు దూరంగా ఉండి సత్కార్యాలు చేసుకుంటూ వెళ్ళాలి. అది అతనికి పరలోకంలో పనికి వస్తుంది.

పరలోకాన నరకాగ్ని యొక్క ఇంధనం మనుషులు మరియు రాళ్లు అవుతారు అని ఖురాన్లో చాలా స్పష్టంగా ఉంది. అయితే మనం అలా నరకానికి ఇంధనం కాకుండా, స్వర్గంలో చేరే ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది.

ఖురాన్ లో అల్లాహ్ తెలిపాడు:

فَاتَّقُوا النَّارَ الَّتِي وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ
ఫత్తఖున్నారల్లతీ వఖూదుహన్నాసు వల్ హిజార.
మనుషులు మరియు రాళ్లు ఇంధనం కాగల ఆ నరకాగ్ని నుండి మీరు భయపడండి. దాని నుండి తప్పించుకునే మార్గాన్ని మీరు అవలంబించండి.

సూర తహ్రీమ్ లో:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ
యా అయ్యుహల్లజీన ఆమనూ ఖూ అన్  ఫుసకుమ్ వ అహ్లీకుమ్ నారన్ వఖూదుహన్నాసు వల్ హిజార.
ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మరియు మీ సంతానాన్ని నరకాగ్ని నుండి రక్షించుకోండి. దాని యొక్క ఇంధనం మనుషులు మరియు రాళ్లు.

ఇక్కడ మనుషులు అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, సర్వ మానవులు కాదు. అల్లాహ్ మనందరినీ కూడా క్షమించు గాక, సన్మార్గం చూపి విశ్వాస మార్గంలో నడిపించు గాక. మనుషులు అంటే ఎవరైతే ఆ సృష్టికర్త ఆరాధనను తిరస్కరించి, ఆయన విధేయత మార్గాన్ని విడనాడి పాపాల్లోకి దూసుకు వెళ్తున్నారో వారు అని.

అలాగే రాళ్లు అని అంటే సామాన్య రాళ్లు అని కాదు. రాళ్లల్లో కొన్ని రాళ్లు ఉంటాయి, వాటిలో అగ్ని అనేది పుట్టుకొస్తుంది. దానితో మంట కూడా పెట్టడానికి ఆ రాళ్లు ఉపయోగపడతాయి. అరబీలో వాటిని కిబ్రీత్ అని, ఇంగ్లీష్ లో సల్ఫర్ అని అంటారు. అలాంటి రాళ్లు.

ఇమామ్ ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ “అత్తఖ్వీఫు మినన్నార్” (నరకము నుండి భయపెట్టుట) అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. దానిలోని పేజీ నంబర్ 107 లో ఉంది, ఆయన చెప్పారు: అల్లాహుతాలా ఖురాన్ లో హిజారతు కిబ్రీత్ (సల్ఫర్ రాయి) గురించి ఏదైతే చెప్పాడో, ఆ రాయిలో ఐదు రకాల శిక్షలు ఉంటాయి, అల్లాహు అక్బర్. అలాంటి ఐదు రకాల శిక్షలు మరి వేరే ఏ రాయిలో, మరి వేరే వస్తువులో ఉండవు అన్నట్లుగా ఆయన తెలుపుతున్నారు.

  1. సుర్అతుల్ ఈఖాద్: అందులో మంట త్వరగా అంటుకుంటుంది.
  2. నతనుర్రాయిహా: అందులో మహా దుర్వాసన ఉంటుంది.
  3. కసరతుద్దుఖాన్: అందులో అధికంగా పొగ వెళ్తుంది.
  4. షిద్దతుల్ ఇల్తిసాఖి బిల్ అబ్దాన్: శరీరాలకు అది త్వరగా అంటుకుంటుంది.
  5. ఖువ్వతు హర్రిహా ఇదహ్మర్రత్: అందులో మంట వచ్చింది అంటే దాని యొక్క వేడి అనేది మహా భయంకరంగా ఉంటుంది.

ఈ ఐదు రకాల శిక్షలు ఆ సల్ఫర్ స్టోన్ లో ఉంటాయని ఇమామ్ ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ తెలిపారు.

నరకంలో నరకవాసులను ఎలా పడవేయడం జరుగుతుంది? ఆ విషయాలు తెలుసుకుందాము. అల్లాహ్ అలాంటి అవమానం మరియు అలా శిక్షలతో కూడిన ఆ నరకంలో పడడం నుండి మనందరినీ కాపాడు గాక.

సూర రహ్మాన్ లో అల్లాహ్ తెలిపాడు:

يُعْرَفُ الْمُجْرِمُونَ بِسِيمَاهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِي وَالْأَقْدَامِ
యుఅరఫుల్ ముజ్రిమూన బిసీమాహుమ్ ఫయు’ఖజు బిన్నవాసీ వల్ అఖ్దామ్.
అపరాధులను వారి యొక్క గుర్తులు (అంటే వారి ముఖాల మీద చీకటి కమ్ముకొని ఉండి నలుపుగా ఉన్న ఆ గుర్తులతో) వారిని గుర్తించడం జరుగుతుంది. మరియు వారి యొక్క జుట్టును, వారి యొక్క కాళ్ళను పట్టి ఈడ్చుకుంటూ నరకంలో వేయడం జరుగుతుంది.

మరొకచోట అల్లాహుతాలా ఇలా చెప్పాడు:

خُذُوهُ فَاعْتِلُوهُ إِلَىٰ سَوَاءِ الْجَحِيمِ
ఖుజూహు ఫఅ’తిలూహు ఇలా సవాయిల్ జహీమ్.
ఇతన్ని పట్టుకోండి, ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి నరకం యొక్క నడిబొడ్డున ఇతన్ని పడవేయండి.

సూర హాఖ్ఖాలో:

خُذُوهُ فَغُلُّوهُ

ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ

ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ﴾‏
ఖుజూహు ఫగుల్లూహ్, సుమ్మల్ జహీమ సల్లూహ్, సుమ్మ ఫీ సిల్సిలతిన్ జర్ఉహా సబ్ఊన జిరాఅన్ ఫస్లుకూహ్.
అతన్ని పట్టుకోండి, అతని మెడలో గుదిబండ వేయండి. మరి వాణ్ని నరకంలోకి త్రోసివేయండి. మరియు వాణ్ని 70 మూరల సంకెళ్లలో బంధించి అందులో పడవేయండి.

మరియు సూర అలఖ్ లో:

كَلَّا لَئِن لَّمْ يَنتِهِ لَنَسْفَعًا بِالنَّاصِيَةِ
కల్లా లఇల్లమ్ యన్తహి లనస్ఫఅమ్ బిన్నాసియహ్.
అతడు గనుక తన వ్యతిరేక ధోరణిని వదులుకోకుంటే మేము అతని నుదుటి జుట్టును పట్టి ఈడుస్తాము. మరియు ఈ పాపాలు చేసే ఈ నుసటిని పట్టి లాగి నరకంలో పడవేస్తాము.

నరకంలో ఎలా వేయడం జరుగుతుందో ఆ వివరాలు సైతం మనకు తెలపడం జరిగింది.

ఇక నరకంలో తొలిసారిగా ఎవరిని వేయడం జరుగుతుంది? నరకాగ్నిని ఎవరి ద్వారా మరింత దహించడం జరుగుతుందో అది కూడా హదీసుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా తెలిపారు.

ముస్లిం షరీఫ్ లో వచ్చిన హదీస్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అందరికంటే ముందు ఎవరి తీర్పు అయితే జరుగుతుందో మరియు ఎవరినైతే నరకంలో పంపబడి నరక అగ్నిని దహించి వేయడం జరుగుతుందో, వారు మూడు రకాల వారు.

ఒకరు: అల్లాహ్ వారికి తన గ్రంథ జ్ఞానం ప్రసాదించి వారిని ఇహలోకంలో ఇతరులకు మార్గదర్శులుగా చేశాడు. ప్రళయదినాన అల్లాహుతాలా అతన్ని పిలుస్తాడు. “ఏమీ, నేను నీకు ఖురాన్ గ్రంథం యొక్క జ్ఞానం ప్రసాదించలేదా?” అతడు అంటాడు, “అవును ఓ అల్లాహ్, ప్రసాదించావు.” “అయితే నీవు దీనికి బదులుగా ఏం చేశావు?” అని అడిగితే, “ఓ అల్లాహ్, నేను కేవలం నీ సంతృప్తి కొరకే ఖురాన్ చదువుతూ, ప్రజలకు ఖురాన్ నేర్పుతూ ఉన్నాను” అని అంటాడు. అల్లాహ్ అంటాడు, “నీవు అబద్ధం పలుకుతున్నావు.” దైవదూతలు అంటారు, “నీవు అసత్యం పలుకుతున్నావు. నీవు ఖురాన్ చదివినది ఇహలోకంలో కేవలం నిన్ను ప్రజలు మెచ్చుకోవాలని, నిన్ను ప్రజలు ఖారీ, ఖారీ సాబ్ అన్నటువంటి బిరుదులతో నిన్ను ప్రశంసించాలని. అలా నీకు జరిగింది, ప్రశంసనలు నీవు అందుకున్నావు.” ఆ తర్వాత అతన్ని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి నరకంలో వేయడం జరుగుతుంది.

రెండవ వ్యక్తి: అల్లాహుతాలా అతనికి శక్తి ప్రసాదించి ఉంటాడు. అల్లాహ్ మార్గంలో అతను పోరాడుతాడు. అల్లాహుతాలా అతన్ని పిలుస్తాడు. “నేను నీకు ఇహలోకంలో శక్తిని ప్రసాదించాను, బలం ఇచ్చాను, నీవు ఏం చేశావు?” అని అడుగుతాడు. అతడు అంటాడు, “ఓ అల్లాహ్, నీవు ఇచ్చిన బలంతో నేను నీ మార్గంలో వెళ్లాను, నీ ధర్మ ప్రచారానికి వెళ్లాను.” అప్పుడు అల్లాహ్ అంటాడు, “నీవు అబద్ధం పలుకుతున్నావు.” దైవదూతలు అంటారు, “నీవు అసత్యం పలుకుతున్నావు. నీవు ఇహలోకంలో ప్రజలు నిన్ను మెచ్చుకోవాలి, గొప్ప ముజాహిద్వి, గొప్ప శూరునివి, బలం గలవాడివి అని ప్రజలు నిన్ను అనాలి, అందుకొరకే నీవు పోరాడావు. ప్రజలు నిన్ను అలా మెచ్చుకున్నారు. ఇహలోకంలో ఇక నీకు ఏ సాఫల్యం లేదు.” అతన్ని కూడా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి నరకంలో వేయడం జరుగుతుంది.

మూడో వ్యక్తి: అల్లాహ్ అతనిపై ఇహలోకపు అన్ని రకాల వనరులు అతనికి ఒసగాడు, ప్రసాదించాడు. అతన్ని కూడా పిలుస్తాడు. అతడు వస్తాడు. అల్లాహుతాలా అతన్ని ప్రశ్నిస్తాడు, “నేను నీకు అన్ని రకాల వనరులు ప్రసాదించాను, నీవు వాటిని ఏం చేశావు?” అతడు అంటాడు, “ఓ అల్లాహ్, నేను నీ సంతృప్తి కొరకు నీ మార్గంలో ఖర్చు పెడుతూ, ప్రజలకు ఎన్నో రకాల సహాయాలు చేశాను” అని అంటాడు. అప్పుడు అల్లాహుతాలా “నీవు అబద్ధం పలుకుతున్నావు” అని అంటాడు. దైవదూతలు కూడా అంటారు, “నీవు అసత్యం పలుకుతున్నావు” అని. చివరికి అతన్ని కూడా తీసుకువెళ్లి నరకంలో ఈడ్చుకుంటూ వేయడం జరుగుతుంది.

తిర్మిజీలో ఈ హదీస్ వచ్చి ఉంది. అక్కడ మరికొన్ని విషయాలు అదనంగా ఉన్నాయి. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు చెప్పారు, ఈ మాటలు చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా తొడలను తట్టారు, మళ్లీ చెప్పారు:

يَا أَبَا هُرَيْرَةَ، أُولَئِكَ الثَّلَاثَةُ أَوَّلُ خَلْقِ اللَّهِ تُسَعَّرُ بِهِمُ النَّارُ يَوْمَ الْقِيَامَةِ
యా అబా హురైరా, ఉలాయికస్సలాసతు అవ్వలు ఖల్ఖిల్లాహి తుసఅ’రు బిహిమున్నారు యౌమల్ ఖియామ.

“ఓ అబూ హురైరా, ఈ మూడు రకాల వారు అల్లాహ్ సృష్టిలో తొలివారు, వీరి ద్వారా ప్రళయ దినాన నరకాగ్నిని మరింత ఎక్కువగా కాల్చడం, మరింత ఎక్కువగా దహించడం జరుగుతుంది.”

అల్లాహు అక్బర్. మహాశయులారా, ఈ హదీస్ తో ఒక గుణపాఠం నేర్చుకోవాలి కానీ పెడర్థం అనేది ఎట్టి మాత్రం తీసుకోకూడదు. గుణపాఠం ఏమిటి? పెడర్థం ఏమిటి? గుణపాఠం, మనం చేసే ప్రతీ కార్యం కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు చేయాలి అన్నటువంటి గుణపాఠం నేర్చుకోవాలి. లేదా అంటే నరకంలో వేయబడతాము. కార్యం చూడడానికి మంచిదే అయినప్పటికీ, ఇఖ్లాస్ (చిత్తశుద్ధి) లేకుంటే, మనస్సంకల్పం లేకుంటే, సంకల్ప శుద్ధి లేకుంటే నరకంలో కాల్చడం జరుగుతుంది.

పెడర్థం తీసుకోకూడadu. పెడర్థం ఏంటిది? దుష్భావం ఏమిటి అది తీసుకోకూడదు? “అవును అందుగురించే నేను పండితులతో, ఉలమాలతో, మౌల్వీ సాబ్ లతో దూరం ఉండి నేను మంచిగా చేస్తాను. మౌల్వీ సాబ్ లకు దగ్గర ఉండేది ఉంటే మనం కూడా వాళ్లతోనే నరకంలో పోతామో ఏమో” అని ధర్మం నేర్చుకోకుండా, ఉలమాలకు దగ్గరగా రాకుండా ఉండడం – కొందరు ఇలాంటి దుష్భావం, ఇలాంటి పెడర్థం తీసుకుంటున్నారు. ఇది తప్పు విషయం. ఆలిమ్ తో, ధర్మ పండితులతో ధర్మం నేర్చుకోవడం ఇది మహా అవసరం, అతి ముఖ్యమైన విషయం. అతని యొక్క సంకల్పం అల్లాహ్ సంతృప్తి లేకుంటే అతడు నరకంలో వెళ్తాడు. కానీ నీవు అతని నుండి నేర్చుకున్న విద్య, ఖురాన్, హదీస్ విద్య అయి ఉండి, నీవు సత్సంకల్పంతో దానిని ఆచరించావు అంటే, నీవు ధన్యుడివి అవుతావు, నీవు సాఫల్యునివి అవుతావు, నీవు లాభం పొందుతావు.

ఈ రోజుల్లో ఎంతో మంది ఎన్నో రకాల పాపాలకు గురి అవుతారు. కానీ మౌల్వీ సాబ్ ను ఒక తప్పు చేస్తున్నది చూసి, మరింత దూరం ఉంటారు. అతనికంటే నేనే చాలా గొప్పవానినిగా అని కొందరు భావిస్తూ ఉంటారు. ఇలాంటి తప్పుడు భావాల్లో మనం పడకూడదు. అయితే మహాశయులారా, ఇక్కడ మన టాపిక్ కు సంబంధించిన, శీర్షికకు సంబంధించిన విషయం ఏమిటంటే, ఎవరి సంకల్ప శుద్ధి ఉండదో, ఎవరు సత్సంకల్పంతో సదాచరణ చేయరో, వారు ప్రళయ దినాన వారితోనే నరకాగ్నిని దహించడం జరుగుతుంది. ఈ విధంగా నరకాగ్ని నుండి మనం రక్షణ పొందాలి అంటే సత్సంకల్పంతో సదాచరణ చేస్తూ ఉండాలి.

ఈ విధంగా సోదరులారా, ఈనాటి శీర్షికలో మనం ఎవరిని, ఎలా నరకంలో పడవేయడం జరుగుతుందో తెలుసుకోవడంతో పాటు, నరకాగ్నిని ఎలా దహించడం జరుగుతుంది, నరకాగ్ని అందులో పడి ఉన్న వారు ఎలాంటి కలర్ లో, ఎలాంటి రంగులో ఉంటారో ఆ వివరాలు కూడా తెలుసుకున్నాము. మనం ఇలాంటి నరకం నుండి రక్షణ పొందడానికి విశ్వాసంతో పాటు సత్కార్యాలు చేస్తూ సాధ్యమైనంత వరకు పాప కార్యాల నుండి దూరం ఉండాలి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక.

వా ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]