నరకంపై వంతెన (ఫుల్ సిరాత్): పార్ట్ 3 – [మరణానంతర జీవితం – పార్ట్ 53] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 3
[మరణానంతర జీవితం – పార్ట్ 53] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=QVnrPdQraUA
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షికలో కూడా మనం నరకంపై వేయబడే వంతెన గురించే తెలుసుకుంటూ ఉన్నాము.

అయితే, ఈరోజు మనం మరికొన్ని విషయాలు ఏవైతే తెలుసుకోబోతున్నామో వాటిలో మొట్టమొదటి విషయం ఆ వంతెనను తొలిసారిగా దాటేవారు ఎవరు? దీని గురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పొడవైన హదీసులో పరలోకంలో సంబంధించే కొన్ని విషయాలను వివరంగా ప్రస్తావిస్తూ వంతెన విషయం వచ్చినప్పుడు ఇలా తెలిపారు:

فَأَكُونُ أَنَا وَأُمَّتِي أَوَّلُ مَنْ يُجِيزُ
(ఫ అకూను అనా వ ఉమ్మతీ అవ్వలు మన్ యుజీజ్)
“నేను మరియు నా అనుచర సంఘం అందరికంటే ముందు ఈ వంతెనను దాటుతాము.”

అల్లాహు అక్బర్. మహాశయులారా, లక్షకు పైగా ప్రవక్తలు ఈ లోకంలో వచ్చి పోయారు. చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ ప్రవక్తను, ఆ ప్రవక్తపై సంపూర్ణం చేయబడిన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడమే తప్పనిసరి. అయితే ఇక్కడ గమనించండి, ఆ ప్రవక్త, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ప్రవక్తల కంటే ముందు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సంఘం అంటే మనం, ఇతర అనుచర సంఘాల కంటే ముందు వంతెనను కూడా దాటడంలో ముందుగా ఉంటాము. ఇదే వంతెన గురించి మరీ తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

وَلَا يَتَكَلَّمُ يَوْمَئِذٍ إِلَّا الرُّسُلُ
(వలా యతకల్లము యౌమఇదిన్ ఇల్లర్రుసుల్)
“ఆ వంతెన దాటుతున్న సందర్భంలో ఆ సమయం వచ్చినప్పుడు ప్రవక్తలు తప్ప ఇంకా ఎవరూ మాట్లాడలేరు.”

అంతటి భయంకరమైన సమయం. ఎవరూ మాట్లాడలేరు. ప్రవక్తలు ఏదైతే మాట్లాడతారో, వారికి మాట్లాడే అటువంటి శక్తి అల్లాహ్ ఏదైతే ప్రసాదిస్తాడో, అప్పుడు ఆ ప్రవక్తలు కూడా ఏం మాట్లాడతారు?

اللَّهُمَّ سَلِّمْ، اللَّهُمَّ سَلِّمْ
(అల్లాహుమ్మ సల్లిమ్, అల్లాహుమ్మ సల్లిమ్)
“ఓ అల్లాహ్ మమ్మల్ని కాపాడుకో. ఓ అల్లాహ్ మమ్మల్ని కాపాడుకో.”

ఆ తర్వాత, ఆ వంతెన యొక్క వివరాలు ఏవైతే మనం గత కార్యక్రమంలో విన్నామో వాటిని ప్రస్తావించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ తర్వాత తెలిపారు, ప్రజలు తమ కర్మల ప్రకారం దాన్ని దాటుతారు. అయితే విశ్వాసులు, విశ్వాసం తర్వాత ఎన్ని సత్కార్యాలు ఎక్కువగా చేస్తారో అదే విధంగా వారు ఎక్కువ వేగంతో వెళ్లి దాని నుండి మోక్షం పొందుతారు.

ఇంకా మహాశయులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సంఘంలో ప్రవక్త తర్వాత, ప్రవక్త అనుచర సంఘంలో తొలిసారిగా ఆ వంతెనను దాటేవారు ఎవరు? ఆ వివరణ కూడా, ఆ ప్రస్తావన కూడా హదీసులో వచ్చి ఉంది. సహీహ్ ముస్లిం షరీఫ్ లోని ఉల్లేఖనం, ఒక యూదుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగాడు. అప్పుడు ఒక ప్రశ్న, మొట్టమొదటిసారిగా ఎవరు ఆ వంతెనను దాటుతారు అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

فُقَرَاءُ الْمُهَاجِرِينَ
(ఫుకరాఉల్ ముహాజిరీన్)
“మక్కా నుండి వలస వచ్చిన (మదీనాకు వలస వచ్చిన వారిలో) పేదవాళ్లు ఎవరైతే ఉన్నారో, వారు అందరికంటే ముందు ఆ వంతెనను దాటుతారు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.

మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ వంతెనకు సంబంధించిన ఏ ఏ వివరాలైతే మనకు తెలిపారో, వాటిని చదువుతూ పోతే, అల్లాహు అక్బర్, ఇంకా ఎన్నో వివరాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు, ఆ వంతెనను దాటే విషయంలో ప్రజల్లో నాలుగు రకాల వారు ఉంటారు.

ఒకరు, క్షేమంగా దాటి వెళ్ళేవారు. వారికి ఆ వంతెన ద్వారా, వంతెన చుట్టుపక్కన ఉన్న కొండ్లు గానీ, జారడం గానీ, నరకాగ్ని యొక్క జ్వాలలు గానీ ఏవీ ఎలాంటి నష్టం చేకూర్చవు. అల్లాహు అక్బర్. అల్లాహ్ అలాంటి అదృష్టవంతుల్లో మనల్ని కూడా చేర్చు గాక. ఆమీన్.

రెండో రకమైన వారు, దాటుతారు కానీ వారిపై మహా ఆపదలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చి పడతాయి మరియు వారు చివరికి ఎలాగో దాటేస్తారు.

మూడో రకమైన వారు, అల్లాహ్ వారి నుండి, వారిలో కలవకుండా అల్లాహ్ మనల్ని కాపాడు గాక. ఎవరు? దానిని దాటకముందే నరకంలో పడిపోయేవారు. ఈ మూడు రకాల వారి గురించి సహీహ్ బుఖారీలో ప్రస్తావన వచ్చి ఉంది.

అయితే ఇక నాలుగో రకం వారు ఎవరు? ఈ నాలుగో రకం వారి గురించి సునన్ అబీ దావూద్ లో వచ్చిన హదీసు ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

وَمَنْ رَمَى مُسْلِمًا بِشَيْءٍ يُرِيدُ شَيْنَهُ بِهِ، حَبَسَهُ اللَّهُ عَلَى جِسْرِ جَهَنَّمَ حَتَّى يَخْرُجَ مِمَّا قَالَ
(వ మన్ రమా ముస్లిమన్ బిషైఇన్ యురీదు షైనహు బిహీ, హబసహుల్లాహు అలా జిస్రి జహన్నమ్ హత్తా యఖ్రుజ మిమ్మా కాల్)

“ఎవరైనా ఒక ముస్లిం పై అపనింద వేస్తాడో,” శ్రద్ధగా వినండి ఈ హదీసును. మనలో చాలా మందిలో ఇలాంటి దుర్గుణం ఉంది, అల్లాహ్ తఆలా మనందరినీ కూడా కాపాడు గాక. “ఎవరైతే ఒక ముస్లిం పై అపనింద వేస్తాడో, అపనింద వేయడం ద్వారా ప్రజల్లో అతన్ని అవమానపరచాలి అని, అతని పరువు మర్యాదలను మట్టిలో కలపాలని అతని యొక్క ఉద్దేశం ఉంటుంది, అలాంటి వ్యక్తిని నరకంపై వేయబడిన వంతెన మీద ఆపుకోవడం జరుగుతుంది.” అల్లాహు అక్బర్. దాటకుండా అతన్ని ఆపివేయడం జరుగుతుంది.

حَتَّى يَخْرُجَ مِمَّا قَالَ
(హత్తా యఖ్రుజ మిమ్మా కాల్)

ఎంతవరకు అతన్ని ఆపడం జరుగుతుంది? ఆ ఆపివేయడంలో అతనిపై ఎన్ని కష్టాలు, ఎన్ని ఆపదలు వచ్చి పడతాయి, అల్లాహు అక్బర్. ఎంతసేపు ఆపడం జరుగుతుంది? అతడు ఎలాంటి అపనింద వేశాడో మరియు ఆ అపనింద వల్ల ఆ ముస్లింకి ఎంత అవమానం ఏర్పడిందో, అదంతా అతని నుండి దూరమయ్యే వరకు. అల్లాహు అక్బర్. అది ఎంత టైం పడుతుందో, ఆ మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చి పడతాయో ఆ అల్లాహ్ కే చాలా తెలుసు.

ఈ హదీస్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటి? మనం ఒకవేళ వేగవంతంగా ఈ వంతెనను దాటాలని కోరుకుంటే, మన నాలుకను కాపాడుకోవాలి. ఇతరుల పట్ల మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎవరిపై ఎలాంటి అపనింద వేయకుండా మనం జాగ్రత్త పడాలి.

మహాశయులారా, ఒక్కొక్క హదీసును చదువుతూ ఉంటే వాస్తవానికి మనలో ఎంతో మార్పు రావచ్చు. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి అతిపెద్ద ఆపద, ఆపద ఏమిటంటే మనలో అనేకమంది ఇలాంటి ధర్మ విషయాలను, పరలోకానికి సంబంధించిన ఈ వివరాలను చదవడానికి సిద్ధంగా లేరు. ఎవరైతే ఏదో కొన్ని ఆపదల ద్వారా, కష్టాల ద్వారా ఆ వంతెనను దాటేస్తారో, అలాంటి వారి గురించి కూడా కొన్ని వివరాలు హదీసులో వచ్చి ఉన్నాయి.

ఆ వివరాల్లోని ఒక విషయం సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చిన ఈ హదీసు ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, తొలిసారిగా ఆ వంతెనను దాటేవారు పిడుగు మాదిరిగా దాటిపోతారు. అక్కడ ఉన్న సహాబాలలో ఒకరు, “ప్రవక్తా, నేను నా తల్లిదండ్రులను మీకు అర్పింతు గాక, బర్ఖ్, ఆ పిడుగు మాదిరిగా దాటడం అంటే ఏమిటి?” అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఉరుముతున్న సందర్భంలో నీవు పిడుగును చూడవా, కనురెప్ప కొట్టే అంత సేపట్లో, అంతకంటే తక్కువ సమయంలో అది ఎలా మెరుస్తూ వెళ్ళిపోతుంది. ఆ విధంగా అని తెలుపుతూ, మరికొందరు గాలి వీస్తున్న మాదిరిగా, మరికొందరు, వారి యొక్క రకాలు తెలుపుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.

మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు ఎంత వేగంతో వెళ్తారో, దాని యొక్క కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఇస్తూ తెలిపారు:

تَجْرِي بِهِمْ أَعْمَالُهُمْ
(తజ్రీ బిహిమ్ అఅమాలుహుమ్)
“వారి వారి కర్మల ప్రకారంగా వారు దానిని దాటుతూ ఉంటారు.”

وَنَبِيُّكُمْ قَائِمٌ عَلَى الصِّرَاطِ
(వ నబియ్యుకుమ్ ఖాఇమున్ అలస్సిరాత్)
“మరియు మీ ప్రవక్త,” అంటే ప్రవక్త స్వయంగా తమ గురించి తెలుపుతున్నారు, “మరియు మీ ప్రవక్త ఆ సందర్భంలో ఆ వంతెన వద్ద ఉంటారు.”

فَيَقُولُ رَبِّ سَلِّمْ سَلِّمْ
(ఫయకూలు రబ్బి సల్లిమ్ సల్లిమ్)
“ఓ అల్లాహ్, ఓ ప్రభువా కాపాడు, నా అనుచర సంఘాన్ని కూడా కాపాడు,” అని దుఆ చేస్తూ ఉంటారు.

حَتَّى تَعْجِزَ أَعْمَالُ الْعِبَادِ
(హత్తా తఅజిజ అఅమాలుల్ ఇబాద్)

చివరికి దానిని దాటే వారిలో కొందరు ఎలాంటి వారు వస్తారంటే వారి యొక్క కర్మలు వారిని దాటడంలో వారికి ఏ శక్తిని ప్రసాదించవు. అంటే వారి యొక్క విశ్వాసం, వారి యొక్క సత్కార్యం అంతా తక్కువగా ఉంటుంది.

حَتَّى يَجِيءَ الرَّجُلُ فَلَا يَسْتَطِيعُ السَّيْرَ إِلَّا زَحْفًا
(హత్తా యజీఅర్రజులు ఫలా యస్తతీఉస్సైర ఇల్లా జహ్ఫా)
“చివరికి ఒక మనిషి ఎలాంటివాడు వస్తాడంటే అతడు దానిపై నడవలేకపోతాడు, నడిచే అటువంటి శక్తి కూడా అతనికి ఉండదు. ఏం చేస్తాడు? అంబాడూతూ (పాకుతూ) ఉంటాడు.”

అల్లాహు అక్బర్. మహాశయులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్ని వివరాలు ఎందుకు ఇస్తున్నారు మనకు? గమనించండి. అక్కడ జరిగే ఈ పరిస్థితులను ఇంత వివరంగా ఎందుకు మనకు తెలియజేస్తున్నారు? మనం ప్రథమ స్థానంలో, అతివేగంగా దాటి వెళ్లే వారిలో కలవాలని, ఇలాంటి కష్టతరంగా, నడవలేకుండా అంబాడూతూ వెళ్లే వారిలో మనం కలవకూడదు అని. మరి ఇలాంటి పరిస్థితి ఎవరికి వస్తుంది?

حَتَّى تَعْجِزَ أَعْمَالُ الْعِبَادِ
(హత్తా తఅజిజ అఅమాలుల్ ఇబాద్)
వారి యొక్క విశ్వాసం, వారి యొక్క సత్కార్యాలు చాలా తక్కువ ఉన్నాయి గనుక.

మహాశయులారా, ఈ హదీసులో మనిషి నడవలేకపోతాడు, అంబాడూతాడు. అయితే మరొక ఉల్లేఖనంలో ఉంది, హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తలా అన్హు దానిని ఉల్లేఖించారు. చివరికి ఒక మనిషి ఎలాంటి వాడు వస్తాడంటే, నడిచే శక్తి అతనిలో ఏమీ ఉండదు,

حَتَّى يَمُرَّ آخِرُهُمْ يَتَلَبَّطُ عَلَى بَطْنِهِ
(హత్తా యముర్రు ఆఖిరుహుమ్ యతలబ్బతు అలా బత్నిహి)
“అతడు తన కడుపు మీద పల్టీలు కొట్టుకుంటూ” కొందరు కాళ్లు, చేతులు లేని వారిని బహుశా చూశారు కావచ్చు రోడ్డు మీద అడపాదడపా, ఎలా వారు పల్టీ కొట్టుకుంటూ వెళ్తారో ఆ విధంగా వెళ్తారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.

మరో విచిత్ర విషయం ఏంటో తెలుసా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ కడుపు మీద పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళే వ్యక్తి అల్లాహ్ తో ప్రశ్నిస్తాడంట. ఏమని?

يَا رَبِّ لِمَ بَطَّأْتَ بِي؟
(యా రబ్బి లిమ బత్తఅత బీ?)
“ఓ ప్రభువా, నేను అందరికంటే వెనక, ఇంత ఆలస్యంగా పోయే వారిలో నన్ను ఎందుకు చేర్చావు? నేను ఎందుకు ఇలా అయ్యాను?”

అప్పుడు అల్లాహ్ వైపు నుండి సమాధానం ఏం వస్తుంది?

فَيَقُولُ: إِنِّي لَمْ أُبَطِّئْ بِكَ، إِنَّمَا بَطَّأَ بِكَ عَمَلُكَ
(ఫయకూలు ఇన్నీ లమ్ ఉబత్తిఅ బిక, ఇన్నమా బత్తఅ బిక అమలుక్)
అల్లాహు అక్బర్. “నేను నిన్ను ఆలస్యంగా వెళ్లే వారిలో చేర్చలేదు. నేను నిన్ను వెనక ఉంచలేదు. నిన్ను వెనక ఉంచింది, ఆలస్యంగా చేసింది ‘అమలుక్’ నీ ఆచరణ, నీ కర్మ.”

అల్లాహు అక్బర్. అందుకు సోదరులారా, సత్కార్యాల్లో ముందుకు వెళ్ళండి. విశ్వాస మార్గాన్ని అవలంబించండి. ఈ రోజుల్లో మనలోని ఎంతమంది ముస్లింలు కూడా నమాజు చేయకుంటే ఏమవుతుంది, ఫర్జ్ చేస్తున్నాము కదా సున్నతులు చేయకుంటే ఏమవుతుంది, టోపీ పెట్టుకుంటున్నాను కదా గడ్డం లేకుంటే ఏమవుతుంది, ఒక్కొక్క విషయం ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారో, ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని విడనాడుకుంటూ, ఫలానా మంచి పని చేస్తున్నా ఇది చేయకుంటే ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నల్లో ఉన్నారు. కానీ ఆ రోజుల్లో తెలుస్తుంది అందరికంటే ముందు స్వర్గంలో వెళ్లే వారిలో, వంతెనను దాటే వారిలో నన్ను ఎందుకు చేర్చలేదు, నేను ఎందుకు వెనకయ్యాను అంటే, అల్లాహ్ వైపు నుండి సమాధానం ఏం వస్తుంది? “ఇన్నీ లమ్ ఉబత్తిఅ బిక”. నేను నిన్ను వెనక వేయలేదు, నీ కర్మ, నీ ఆచరణ, నీవు సత్కార్యాల్లో ఏదైతే వెనక ఉన్నావో, అదే ఈ రోజు కూడా నిన్ను వెనక ఉంచింది. అల్లాహు అక్బర్.

మహాశయులారా, ఆ రోజు ఆ వంతెనను సులభతరంగా దాటడానికి మనం విశ్వాసంలో, సత్కార్యాల్లో ముందు ముందుగా ఉండాలి. అయితే ఒక విషయం మర్చిపోకండి, ఈ సత్కార్యాలు మన ఇష్టానుసారం చేయడం కాదు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అని కేవలం నోటితో పలకడం కాదు.

ఆ రోజు ఆ వంతెన వద్ద కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఉంటారు, తమ అనుచర సంఘం గురించి సిఫారసు చేస్తూ ఉంటారు అన్నట్లుగా మనకు హదీసుల ద్వారా బోధపడిన విషయం మీరు కూడా తెలుసుకున్నారు. ఆ రోజు మనకు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసు ఆ వంతెన దాటుతున్న సందర్భంలో కూడా ప్రాప్తించాలంటే, మొట్టమొదటి విషయం ఏమిటి? సహీహ్ బుఖారీలో వచ్చిన హదీసు ప్రకారం,

مَنْ أَسْعَدُ النَّاسِ بِشَفَاعَتِكَ يَوْمَ الْقِيَامَةِ يَا رَسُولَ اللَّهِ؟
(మన్ అస్అదున్నాసి బిషఫాఅతిక యౌమల్ ఖియామతి యా రసూలల్లాహ్?)

అని అబూ హురైరా రదియల్లాహు తలా అన్హు అడిగారు. అంటే, “ఓ ప్రవక్తా, ప్రళయ దినాన మీ సిఫారసును పొందే అదృష్టవంతులు ఎవరు?” అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللَّهُ خَالِصًا مِنْ قَلْبِهِ
(మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ ఖాలిసమ్ మిన్ కల్బిహి)
“ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ హృదయాంతర సంకల్పంతో, సంకల్ప శుద్ధితో, స్వచ్ఛంగా చదువుతారో, పఠిస్తూ ఉంటారో,” మరియు దాని యొక్క భావాన్ని తెలుసుకొని అన్ని రకాల షిర్క్ లకు దూరం ఉంటారో, అలాంటి వారే నా సిఫారసును పొందుతారు.

అలాగే నమాజ్ యొక్క పాబందీ చేయడం, నమాజ్ కొరకు అదాన్ పిలుపు ఏదైతే వింటామో, అదాన్ పిలుపుకు సమాధానం ఇస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ చదివి:

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ، وَالصَّلَاةِ الْقَائِمَةِ، آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ
(అల్లాహుమ్మ రబ్బ హాదిహిద్దావతిత్తామ్మ వస్సలాతిల్ కాఇమ ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫదీల వబ్అస్హు మకామమ్ మహమూదనిల్లదీ వఅత్తహు)

చదవడం. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఇది చదువుతారో “హల్లత్ లహు షఫాఅతీ”, అతని గురించి నా సిఫారసు లభిస్తుంది అని.

అలాగే ఉదయం, సాయంకాలం పది పది సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదువుతూ ఉండడం. సహీహ్ హదీసులో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

مَنْ صَلَّى عَلَيَّ حِينَ يُصْبِحُ عَشْرًا، وَحِينَ يُمْسِي عَشْرًا، أَدْرَكَتْهُ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ
(మన్ సల్లా అలయ్య హీన యుస్బిహు అషరన్ వ హీన యుమ్సీ అషరన్ అద్రకత్హు షఫాఅతీ యౌమల్ ఖియామ)

“ఎవరైతే ఉదయాన్న పది సార్లు, సాయంకాలం పది సార్లు నాపై దరూద్ చదువుతారో” – అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. దీనినే దరూద్ అంటారు. ఇది పదిసార్లు ఉదయం, పదిసార్లు సాయంకాలం చదువుతారో, “అద్రకత్హు షఫాఅతీ యౌమల్ ఖియామ”, ప్రళయ దినాన అతనికి నా సిఫారసు లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు.

ఈ విధంగా మహాశయులారా, వంతెనను దాటడం ఎంత కష్టతరమైన విషయమో, దానిని సులభతరంగా చేసుకోవడానికి ఇహలోకంలో అల్లాహ్ మనకిచ్చిన ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

మహాశయులారా, దీని తర్వాత కార్యక్రమంలో ఈ వంతెన దాటడానికి మనకు ఉపయోగపడే సత్కార్యాల గురించి మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకుంటాము. కొన్ని విషయాలైతే ఈ కార్యక్రమంలో కూడా మీరు తెలుసుకున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం తెలిపి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. అదేమిటంటే, ఈ వంతెన అనేది, ఇందులో ఎవరూ కూడా సందేహపడకూడదు. మరియు ఇది పరలోక విషయం గనుక దాని యొక్క సంపూర్ణ వివరాలను మనం ఇహలోకంలో తెలుసుకోలేము. కేవలం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తెలిపిన విషయాలు తప్ప. అయితే అది వెంట్రుక కంటే సన్నగా మరియు కత్తి కంటే ఎక్కువ పదునుగా దాని పదును ఉంటుంది అంటే, అది ఎలా, ఒక్కొక్కరు దాని మీది నుండి దాటుతారా, ఒకే సందర్భంలో ఒక గ్రూపు, ఒక వర్గం దాటుతుందా, ఇవన్నీ విషయాలు అల్లాహ్ కే బాగా గుర్తెరుగు గాక. కొందరు ఇలాంటి ప్రశ్నలు లేపి తర్వాత ఆ వంతెననే తిరస్కరించారు. అందుకొరకు అల్లాహ్ తో భయపడాలి, ఇలాంటి పొరపాట్లలో పడకూడదు. అల్లాహ్ మనందరినీ కూడా ఆ నరకంపై వేయబడే వంతెన క్షేమంగా, సురక్షితంగా, అతివేగంగా, ఎలాంటి కష్టం లేకుండా దాటే సద్భాగ్యం ప్రసాదించు గాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]