త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది? [మరణానంతర జీవితం – పార్ట్ 19] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది?
[మరణానంతర జీవితం – పార్ట్ 19] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=kKaOZfTuxe0
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బాద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి శీర్షిక: త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది?

మహాశయులారా, సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వము తెలిసినవాడు. మరియు ఆయన ఎవరి పట్ల కూడా ఎలాంటి అన్యాయం చేయనివాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు మరియు దాసులకు వారి పుణ్యాలకంటే ఎంతో ఎక్కువ రేట్లో ఉపకారాలు చేసి వారిని మన్నిస్తూ ఉండేవాడు. కానీ రవ్వంత కూడా ఎవరిపై ఏ అన్యాయము చేయడు.

ఆయన ప్రళయ దినాన తలచుకుంటే, దాసుల పట్ల ఆయనకున్న పరిజ్ఞానంతో వారి యొక్క విశ్వాసం, అవిశ్వాసం, సత్కార్యాలు, దుష్కార్యాలు అనే ఆధారం మీద వారిని స్వర్గంలో పంపడం, నరకంలో పంపడం వంటి తీర్పులు చేయగలడు. అలా చేసే అధికారం అతనికి ఉంది. కానీ, అలా చేయకుండా వారి యొక్క లెక్క, వారి యొక్క తీర్పు, సాక్ష్యాధారాలను, ఇంకా ఆ రోజు త్రాసును నెలకొల్పుతాడు.

త్రాసును నెలకొల్పి, అందులో ప్రజలు చేసినటువంటి సత్కార్యాలను ఒకవైపున, దుష్కార్యాలను మరోవైపున తూకం చేస్తాడు. స్వయంగా సత్కార్యాలు, దుష్కార్యాలు చేసిన ప్రజలను కూడా అందులో పెట్టడం జరుగుతుంది. అంతేకాదు, ఏ కర్మపత్రాలు దైవదూతలు రాస్తూ ఉన్నారో, ఆ పత్రాలను కూడా, ఆ ఫైల్లను కూడా అందులో తూకం చేయడం జరుగుతుంది. ఇదంతా దేని కొరకు? ప్రజలు కూడా స్వయంగా వారు తృప్తికరమైన న్యాయం వారికి లభించినది అని వారికి మనస్తృప్తి కలగాలి.

అయితే, ప్రళయ దినాన త్రాసును నెలకొల్పడం ఇది సత్యం. అల్లాహుతాలా ఈ విషయాన్ని సూరె అంబియా, ఆయత్ నెంబర్ 47లో ఇలా తెలియపరిచాడు:

وَنَضَعُ الْمَوَازِينَ الْقِسْطَ لِيَوْمِ الْقِيَامَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَإِنْ كَانَ مِثْقَالَ حَبَّةٍ مِنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا وَكَفَىٰ بِنَا حَاسِبِينَ

ఈ విధంగా ఖురాన్లో త్రాసును నెలకొల్పడం సత్యం అన్న విషయం ఎన్నో సందర్భాలలో, ఎన్నో సూరాలలో చెప్పడం జరిగింది. సూరతుల్ ముఅ్‌మినూన్, ఆయత్ నెంబర్ 102, 103 లో అల్లాహుతాలా ఇలా తెలియపరిచాడు:

فَمَنْ ثَقُلَتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَوَمَنْ خَفَّتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنْفُسَهُمْ فِي جَهَنَّمَ خَالِدُونَ

ఈ విధంగా మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును నెలకొల్పడం సత్యం. ఇందులో మనం ఏ మాత్రం అనుమానానికి, సంకోచానికి గురి కాకూడదు. మన మూల విశ్వాసాల్లో ఇది కూడా ఒక విషయం మరియు అగోచర విషయాల్లో కూడా ఒకటి ఇది. హజరత్ ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీథ్ లో ఉంది, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విశ్వాసం యొక్క నిర్వచనం ఇలా తెలియపరిచారు:

اَلْإِيْمَانُ أَنْ تُؤْمِنَ بِاللهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَتُؤْمِنَ بِالْجَنَّةِ وَالنَّارِ وَالْمِيْزَانِ وَتُؤْمِنَ بِالْبَعْثِ بَعْدَ الْمَوْتِ وَتُؤْمِنَ بِالْقَدَرِ خَيْرِهِ وَشَرِّهِ

ఈమాన్, విశ్వాసం అంటే ఏమిటి? నీవు అల్లాహ్‌ను, దైవదూతలను, అల్లాహ్ పంపిన గ్రంథాలను, ఆయన పంపిన ప్రవక్తలను విశ్వసించాలి. అలాగే స్వర్గాన్ని, నరకాన్ని మరియు త్రాసును (మీజాన్) కూడా విశ్వసించాలి. అలాగే చనిపోయిన తర్వాత మరోసారి అల్లాహు తాలా తిరిగి లేపుతాడు, అందరినీ బ్రతికిస్తాడు అన్న విషయాన్ని కూడా విశ్వసించాలి. అలాగే మంచి చెడు అదృష్టాన్ని కూడా విశ్వసించాలి.

తొమ్మిది విషయాలను విశ్వసించడం ఈమాన్ (విశ్వాసం) యొక్క నిర్వచనంలో భాగం. ఎవరైనా త్రాసును విశ్వసించకుంటే, అతను అవిశ్వాసులలో కలిసిపోతాడన్న భయం ఉన్నది. మరియు ఆ త్రాసుకు రెండు పెద్ద పల్లాలు ఉంటాయి. ఒక పల్లెంలో సత్కార్యాలు, మరో పల్లెంలో దుష్కార్యాలు తూకం చేయడం జరుగుతుంది. హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ ఇబ్నుల్ ఆస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఒక పొడవైన హదీథ్ ఉంది. అందులో, అల్లాహుతాలా ఒక వ్యక్తిని ప్రళయ దినాన హాజరుపరుస్తాడు. అతని పాపాల 99 ఫైళ్ళను ఒక పల్లెంలో పెడతాడు మరియు అతను పలికిన “లా ఇలాహ ఇల్లల్లాహ్” సాక్ష్యాన్ని మరో పల్లెంలో పెడతాడు. ఈ విధంగా ఆ త్రాసుకు రెండు పల్లాలు ఉన్నాయి అన్న విషయం ఈ హదీథే కాకుండా వేరే హదీథుల ద్వారా కూడా రుజువై ఉన్నది.

అంతేకాదు, ఆ త్రాసు పల్లాలు ఎంత బ్రహ్మాండమైనవి అంటే, వాటిలో ఏడు ఆకాశాలను, ఏడు భూములను కూడా పెట్టవచ్చు, తూకం చేయవచ్చు. అంత పెద్దటి త్రాసులు. దీనికి సంబంధించిన హదీథ్‌లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు, హజరత్ నూహ్ (అలైహిస్సలాం) చనిపోయే ముందు తమ కుమారునికి ఇలా వాంగ్మూలం చేశారు: “నేను నీకు రెండు విషయాల గురించి ఆదేశిస్తాను, రెండు విషయాల నుండి నివారిస్తాను. మొదటిది, “లా ఇలాహ ఇల్లల్లాహ్” గురించి ఆదేశిస్తున్నాను. ఏడు ఆకాశాలు, ఏడు భూములు త్రాసులోని ఒక పల్లెంలో, “లా ఇలాహ ఇల్లల్లాహ్” ను మరో పల్లెంలో పెడితే, “లా ఇలాహ ఇల్లల్లాహ్” ఉన్న పల్లెం కిందికి వంగిపోతుంది. ఏడు ఆకాశాలు, ఏడు భూములు కలిసి ఒక పటిష్టమైన రింగు మాదిరిగా తయారైనా, “లా ఇలాహ ఇల్లల్లాహ్” దానిని విరగొట్టగలదు. రెండవది, నీవు అధికంగా “సుబ్ హా నల్లాహి వబిహమ్దిహి” అని స్మరిస్తూ ఉండు. ఎందుకంటే అది సర్వ సృష్టి యొక్క ఆరాధన, దాని ద్వారానే సర్వ సృష్టికి ఆహారం ఇవ్వబడుతుంది. నేను నిన్ను నివారించే రెండు విషయాలు: షిర్క్ (బహుదైవారాధన) మరియు గర్వం, అహంకారం. వాటికి దూరంగా ఉండు.”

ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు ఇంత పెద్దగా, బ్రహ్మాండమైనదిగా ఉన్నప్పటికీ, అది అత్యంత సూక్ష్మమైనది కూడా. అణువు, అణువు కంటే మరీ చిన్నదైన ఏదైనా వస్తువు ఉన్నా దానిని కూడా తూకం చేసే శక్తి అల్లాహ్ దానికి ప్రసాదించి ఉన్నాడు. ఈ లోకంలో మనం వంద కిలోలు తూకం చేసే త్రాసులో గ్రాములు తూకం చేయలేము, అలాగే స్వర్ణకారుల వద్ద గ్రాములు తూకం చేసే త్రాసులో వంద కిలోలు తూకం చేయలేము. కానీ ప్రళయ దినాన అల్లాహుతాలా నెలకొల్పే త్రాసు యొక్క విశిష్టత ఏమిటంటే, అది పెద్ద పెద్ద బ్రహ్మాండమైన వాటిని తూకం చేయడంతో పాటు సూక్ష్మమైన వాటిని కూడా తూకం చేయగలదు. సూరె అంబియాలోని ఆయత్‌లో చెప్పబడినట్లు, “ఆవగింజంత కర్మ ఉన్నా, దానిని కూడా మేము హాజరు పరుస్తాము,” అంటే దానిని కూడా అందులో తూకం చేస్తాము.

ఈ విషయం యొక్క గాంభీర్యాన్ని ఒక సంఘటన ద్వారా అర్థం చేసుకుందాం. హజరత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారు ఉల్లేఖించారు:

ఈ విధంగా మహాశయులారా, త్రాసును నెలకొల్పడం సత్యం. దీని పట్ల మనం భయం కలిగి ఉండాలి. దీని యొక్క గాంభీర్యత, కష్టతరం ఎంత భయంకరమైనదో ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]