అంతిమ దినం పై విశ్వాసం [4] : స్వర్గ విశేషాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .

మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ

(మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)

ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థానం, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం, లెక్కల పత్రము శిక్ష ప్రతిఫలం గురించి తెలుసుకున్నాం ఈ రోజు మనం విశ్వాసుల కొరకు సృష్టించబడిన స్వర్గం గురించి తెలుసుకుందాం. 

1. స్వర్గనరకాలను విశ్వసించడం అంతిమ దినాన్ని విశ్వసించడంలో భాగం మరియు ఇది మానవుల మరియు జిన్నాతుల శాశ్వత నివాసం. స్వర్గం అనేది అనుగ్రహాల నిలయం, దీనిని విశ్వాసులకు మరియు పవిత్రమైన దాసుల కోసం తయారు చేయబడింది. దీని కొరకు అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించడం, వారి ఆజ్ఞలను పాటించడం తప్పనిసరి. స్వర్గం లోపల ఏ కన్ను చూడని, ఏ చెవి వినని మరియు ఏ మనసు అలోచించ లేనటువంటి అనుగ్రహాలు ఉన్నాయి. అల్లాహ్ ఇలా అంటున్నాడు: 

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ  جَزَاؤُهُمْ عِندَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ

(అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు.) (98:7-8)

మరో చోట అల్లాహ్ ఇలా అన్నాడు. 

فَلَا تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ

(వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా, వారి కళ్లకు చలువనిచ్చే ఎలాంటి సామగ్రిని మేము దాచిపెట్టామో (దాని గురించి) ఏ ప్రాణికీ తెలియదు.) (32:17)

2. ఓ విశ్వాసులారా! స్వర్గానికి 100 స్థానాలు ఉన్నాయి. ఉబాదహ్ బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం ఇలా తెలియజేశారు:

స్వర్గానికి 100 స్థానాలు ఉన్నాయి. ప్రతి రెండు స్థానాల మధ్య 100 సంవత్సరాల ప్రయాణమంత దూరం ఉంటుంది“.

మరియు అఫ్ఫాన్ అంటున్నారు:

అది ఆకాశం మరియు భూమికి మధ్య దూరం వంటిది. మరియు అందులో ఫిర్ దౌస్ అన్నింటికంటే ఉన్నతమైనది. దాని నుండి నాలుగు సెలయేర్లు ప్రవహిస్తాయి మరియు అల్లాహ్ యొక్క సింహాసనం దాని పైనే ఉంటుంది కనుక అల్లాహ్ ను ఎప్పుడు అడిగిన తప్పకుండా ఫిర్ దౌస్ ను ప్రసాదించమని అడగండి“. (అహ్మద్) 

3. ఓ ముస్లింలారా! స్వర్గం అంటే ఏదో ఒక ఉద్యానవనం పేరు కాదు. వివిధ స్థాయిలలో అనేక రకాల తోటలు, ఉద్యానవనాలు, మరియు స్వర్గంలో అనుగ్రహాలు కూడా ఒకే విధంగా ఉండవు. మరియు స్వర్గవాసులు కూడా వారి వారి మంచి పనులను బట్టి వివిధ హోదాలలో ఉంటారు, 

అదేవిధంగా అందులోని రెండు తోటలు మరియు అందులో ఉన్నటువంటి సామాను అన్నీ కూడా బంగారంతో చేసినవై ఉంటాయి మరియు ఇంకో రెండు తోటలు అందులో ఉన్నటువంటి సామాను అంతా కూడా వెండితో చేయబడి ఉంటుంది. వీటి గురించి దివ్య ఖురాన్ లో ఈ విధంగా తెలియచేయబడింది. 

وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ
(తమ ప్రభువు ఎదుట నిలబడవలసి ఉందనే భయం కలిగి ఉండేవారికి రెండు తోటలుంటాయి.)  (55:46)

మరో రెండు తోటల గురించి కూడా ఇలా తెలియజేయబడింది.

وَمِن دُونِهِمَا جَنَّتَانِ
(ఈ రెండు తోటలే గాకుండా మరో రెండు తోటలు కూడా ఉన్నాయి.) (55:62)

ఈ వాక్యాల యొక్క వివరణలో అల్లామా ఇబ్నే తబరీ (రహిమహుల్లాహ్) గారు అబూ మూసా అష్అరీ గారితో ఉల్లేఖిస్తూ ఇలా తెలియజేశారు: “సామీప్యంలో ఉన్న వారి కొరకు రెండు బంగారు తోటలు మరియు కుడివైపు ఉన్న వారి కొరకు రెండు వెండి తోటలు ఉన్నాయి“. 

హజ్రత్ అబ్దుల్లా బిన్ కైస్ గారు అబూ మూస అష్ అరీ గారితో ఉల్లేఖిస్తున్నారు: “రెండు వెండి ఉద్యానవనాలు అందులోని పాత్రలు సామాన్లు అన్నీ వెండితో తయారైనవై ఉంటాయి. మరో రెండు బంగారు ఉద్యానవనాలు అందులో పాత్రలు సామాన్లు అన్నీ బంగారంతో తయారై వుంటాయి మరియు ఇవి శాశ్వతమైన ఉద్యానవనములు. స్వర్గవాసులు తమ ప్రభువుని చూసే సందర్భంలో వారికి అడ్డుతెర ఏమీ ఉండదు. మరియు ఆ మహోన్నతుడైన సృష్టికర్త ముఖం పై ఉన్నతమైన గర్వం యొక్క దుప్పటి ఉంటుంది“. (బుఖారి, ముస్లిం) 

ఓ అల్లాహ్ దాసులారా! దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏమిటంటే సామీప్యం పొందిన స్వర్గవాసులు మరియు కుడి వైపు ఉన్న స్వర్గవసుల మధ్య తేడా ఉంది. సామీప్యాన్ని పొందిన స్వర్గవాసులు ఫర్జ్ ఆరాధనలు మరియు నఫీల్ ఆరాధనలు పాటించే వారు మరియు అవిధేయతకు చెడు పనులకు దూరంగా ఉండేవారు. ఇక కుడి వైపు వారు (వీరిని పుణ్యాత్ములు అని కూడా పేర్కొనడం జరిగింది) వీరు కూడా ఫర్జ్ ఆరాధనలు చేస్తారు కానీ నఫిల్ విషయంలో కట్టుబడి ఉండేవారు కాదు. మరియు వీరిరువురూ కూడా ఘోర పాపాల విషయంలో మరియు చిన్న పాపాల విషయంలో అవిధేయతకు పూర్తిగా దూరంగా ఉండేవారు, మరియు వీరు పశ్చాత్తాప విషయంలో త్వరపడేవారు దీని ద్వారా వీరి పరిస్థితి మునుపటికంటే బాగుండేది. మొత్తానికి సామీప్యం పొందిన వారు కుడివైపు వారి కంటే ఎక్కువ దైవభీతి కలవారై ఉంటారు. అదేవిధంగా సామీప్యం పొందినవారు అవిధేయతకు దూరంగా ఉంటూ విధేయత చూపడంలో అతి ఎక్కువగా కృషి చేసేవారు. మరియు నమాజ్, రోజా, జకాత్ దానధర్మాల విషయంలో మున్ముందు ఉండేవారు. మరియు ధర్మ ప్రచారంలో మంచిని ఆజ్ఞాపించడంలో చెడు నుండి వారించడంలో ముందు ఉండేవారు. మరియు మస్జిద్ నిర్మాణంలో ప్రతి మంచి పనిలో ముందుండేవారు. ఇక కుడివైపు వారు పుణ్యాత్ములు ఇంత కృషి చేసేవారు కాదు ఎందుకంటే వారు తమని తాము సంస్కరించుకోవడంలోనే సరిపోయేది. వీరి గురించి అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.

يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِن ذَهَبٍ وَلُؤْلُؤً 
(అక్కడ వారు స్వర్ణకంకణాలతో, ముత్యాలతో ముస్తాబు అవుతారు.) (35:33)

మరోచోట ఇలా అంటున్నాడు. 

وَحُلُّوا أَسَاوِرَ مِن فِضَّةٍ
(ఇంకా, వారికి వెండి కంకణాలు – ఆభరణంగా – తొడిగింపబడతాయి.) (76:21)

4. అల్లాహ్ దాసులారా! ఒకే లక్షణం గల స్వర్గ వాసులందరు వేరు వేరు తరగతులలో ఉంటారు. సామీప్యం పొందిన వారు తమ సదాచరణ మేరకు వేరు వేరు తరగతులలో మరియు కుడి వైపు వారు కూడా తమ సదాచరణ మేరకు వేరు వేరు తరగతులలో ఉంటారు. 

హజ్రత్ అబూ సయీద్ అల్ ఖుద్రి (రదియల్లాహు అన్హు)  ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు:

“ఆకాశానికి తూర్పు లేదా పడమర వైపున మెరుస్తున్న నక్షత్రాన్ని ప్రజలు ఎలా చూస్తారో స్వర్గంలోని ప్రజలు పై అంతస్తుల ప్రజలను అలా చూస్తారు. ఎందుకంటే వారి వారి అంతస్తుల్లో తప్పక తేడా ఉంటుంది”. అప్పుడు సహచరులు ఇలా అన్నారు “ఓ ప్రవక్తా! అది ప్రవక్తల స్థానం కదా! మామూలు వ్యక్తి దానిని ఎలా పొందుతాడు!”. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు: “ఎవరి చేతిలోనైతే ప్రాణం ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసిస్తారో వారు తప్పకుండా ఆ స్థానాలను పొందుతారు”.(బుఖారి, ముస్లిం) 

5. ఓ అల్లాహ్ దాసులారా! స్వర్గవాసుల అనుగ్రహాలలో స్వర్గ స్త్రీలు కూడా ఉన్నారు. ఖుర్ఆన్ మరియు హదీసు ఆధారాల ద్వారా తెలిసే విషయం ఏమిటంటే ప్రతి విశ్వాస పురుషుడి భాగంలో ఇద్దరు దైవకన్యలు (హూర్లు) ప్రసాదించబడతారు. వారితోపాటు ప్రపంచంలో భాగస్వామి అయినటువంటి భార్యలు కూడా ఉంటారు. అదేవిధంగా అల్లాహ్ కూడా విశ్వాసి యొక్క సదాచరణను బట్టి అతనికి దైవకన్యలను ప్రసాదిస్తాడు ఈ దైవకన్యల గురించి ఖుర్ఆన్ మరియు హదీసులో అనేక చోట్ల ప్రస్తావించడం జరిగింది అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

وَحُورٌ عِينٌ كَأَمْثَالِ اللُّؤْلُؤِ الْمَكْنُونِ
(మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్); దాచబడిన ముత్యాలవలే!) (56:22-23)

ఈ వాక్యం యొక్క వివరణలో ఇమామ్ సాది గారు ఇలా తెలియజేశారు: ఈ వాక్యంలో తెలియచేయబడినటువంటి స్త్రీలు సూర్మా పెట్టుకుని ఉంటారు. మరియు ఎంతో అందంగా ఉంటారు (عِينٌ) అంటే అందమైన పెద్ద పెద్ద కనులు అని అర్థం. వారు అందంగా ఉంటారు అని అనడానికి ఇది ఒక ఆధారం. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.

(كَأَمْثَالِ اللُّؤْلُؤِ الْمَكْنُونِ) 
(దాచబడిన ముత్యాలవలే!

అనగా వారు గొప్ప సుందరాంగులు, చెదిరిన ముత్యాలవలే ఉంటారు. వారిలో ఎటువంటి లోపము కనిపించదు. మరో చోట ఇలా ఉంది.

మరొకచోట వారి యొక్క గొప్ప లక్షణాలు తెలియజేస్తూ అల్లాహ్ ఇలా అన్నాడు. 

كَأَنَّهُنَّ الْيَاقُوتُ وَالْمَرْجَانُ
( స్వర్గకన్యలు (అందచందాల రీత్యా స్వచ్చమైన) కెంపులు, పగడాల మాదిరిగా ఉంటారు.) (55:58)

అదేవిధంగా సూరె వాఖియా లో దైవ కన్యల యొక్క గుణాలను ప్రస్తావిస్తూ అల్లాహ్ ఇలా అన్నాడు.

إِنَّا أَنشَأْنَاهُنَّ إِنشَاءً فَجَعَلْنَاهُنَّ أَبْكَارًا عُرُبًا أَتْرَابًا

(నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము; మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము; వారు ప్రేమించే వారుగానూ, సమ వయస్సుగల వారుగానూ (ఉంటారు);)  (56:35-37)

(عُرُبًا) అంటె వారు తమ భర్తలను అతి ఎక్కువుగా ప్రేమిస్తారు (أَتْرَابًا) అంటె అందరూ సమ వయస్సు గల వారై అనగా 33 సంవత్సరాలు గలవారై ఉంటారు.

అదేవిధంగా వారి యొక్క సౌశీల్యతను పరిశుభ్రతను గురించి తెలియజేస్తూ ఇలా అన్నాడు. 

وَلَهُمْ فِيهَا أَزْوَاجٌ مُّطَهَّرَةٌ ۖ وَهُمْ فِيهَا خَالِدُونَ
(వారి కొరకు పరిశుద్ధులైన భార్యలుంటారు. వారు ఈ స్వర్గవనాలలో కలకాలం ఉంటారు.) (2:25)

ఇబ్నే ఖయ్యిం (రహిమహుల్లాహ్) తెలియజేస్తున్నారు “అంటే, ఆ స్త్రీలు ఋతుస్రావం నుండి, వ్యర్థ మాటల నుండి మరియు ప్రపంచంలో వారికి బాధ కలిగించే ప్రతిదాని నుండి విముక్తి పొందుతారు. అదేవిధంగా వారి హృదయాలు కూడా గౌరవంతో నిండి ఉంటాయి. వారి భర్తలను బాధపెట్టడం నుండి, వారిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం నుండి పరిశుభ్రంగా ఉంటారు. మరియు వారు తమ భర్తలపై అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. 

అదేవిధంగా అల్లాహ్ తఆలా వారి మరో గుణాన్ని కూడా తెలియజేశారు. అదేమీటనగా వారు తమ భర్తను తప్ప పరాయి పురుషుడు వైపు కన్నెత్తి కూడా చూడరు. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.

فِيهِنَّ قَاصِرَاتُ الطَّرْفِ
(వాటి మధ్య (బిడియంతో) చూపులు క్రిందికి వాలి ఉండే స్వర్గ కన్యలుంటారు.) 

మరొక చోట ఇలా అంటున్నాడు. 

حُورٌ مَّقْصُورَاتٌ فِي الْخِيَامِ
(గుడారాలలో సురక్షితంగా ఉంచబడిన (ఎర్రని) సుందరాంగులు కూడా ఉన్నారు.) (55:72)

ఇబ్నే ఖయ్యిం (రహిమహుల్లాహ్) తెలియజేస్తున్నారు “వారి లక్షణం వారు స్వర్గపు గుడారాలలో నివసిస్తారు. అంటే వారు తమ భర్తల కొరకు తప్ప మరెవరి ముందు అలంకరించరు. వారు తమ భర్తల కొరకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటారు. వారు బయటకు వెళ్ళరు. వారి ఇళ్లలో, వారు తమ భర్తలకే పరిమితం అవుతారు. వారిని తప్ప ఎవరినీ తమ దగ్గరకు రానివ్వరు. మరియు అల్లాహ్ వారిని గుడారాలలో నివసించే వారిగా వర్ణించాడు మరియు ఈ లక్షణం మునుపటి కంటే చాలా ఉత్తమమైనది మరియు పరిపూర్ణమైనది, కాబట్టి వారిలో ఒకరు తన భర్తను విపరీతంగా ప్రేమించాలని మరియు అతనితో తన సమ్మతిని తెలియజేసేందుకు తమ చూపులను క్రిందికి వాల్చుతారు మరియు వారు తమ భర్తలను తప్ప ఏ పరాయి పురుషుడి వైపు కూడా చూడరు. 

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలలో వారి అందం, అభినయం గురించి ప్రస్తావించబడినటువంటి విషయాలు మనిషి ఆలోచనలను ఆశ్చర్యానికి లోను చేస్తాయి దీని యొక్క ఉదాహరణ ఏమనగా అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త గారు ఈ విధంగా తెలియజేశారు:

అందరికంటే ముందు స్వర్గంలో ప్రవేశించే సమూహం యొక్క ముఖాలు పున్నమినాటి చంద్రునిలా ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటాయి. ఆ తరువాత ప్రవేశించేటువంటి మరో సమూహం యొక్క ముఖాలు ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె మెరుస్తూ ఉంటాయి.. మరియు అందరి మనసులు ఒకే విధంగా ఉంటాయి. వారిలో ఎటువంటి ఈర్ష ద్వేషాలు ఉండవు. ప్రతి స్వర్గవాసికి ఇద్దరు దైవకన్యలు ప్రసాదించడం జరుగుతుంది. వారు ఎంత అందంగా ఉంటారంటే వారి ఎముక భాగం యొక్క గుజ్జు సైతం చూడవచ్చు.” (బుఖారి ముస్లిం) 

ఇబ్నే హజర్ (రహిమహుల్లాహ్) ఇలా తెలియచేస్తున్నారు: దైవకన్యలను చూసిన తర్వాత కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. వారి దుస్తులలో నుంచే వారి ఎముకలపై ఉన్న మాంసం సైతం కనబడుతూ ఉంటుంది. చూసేవారికి వారి కాలేయ పై భాగం పై ఉన్న పలుచని పొర కూడా కనిపిస్తుంది. అనగా వారి యొక్క అద్భుతమైనటువంటి అందం కారణంగా వారి ముఖాలలో మన ముఖం అద్దంలా కనిపిస్తుంది.(ఫత్ హుల్ బారి) 

హజ్రత్ ఆనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారు తెలియజేశారు:

స్వర్గ కన్యలనుండి ఎవరైనా ఒకరు ఈ భూమి పై తొంగిచూస్తే ఆకాశం నుండి భూమి వరకు ఆ ప్రదేశం అంతా సువాసనతో ప్రకాశవంతంగా మారిపోతుంది. మరియు ఆ స్త్రీ యొక్క తలపై ఓని ఈ ప్రపంచం మరియు అందులో ఉన్నటువంటి అన్ని విషయాల కంటే ఉన్నతమైనది“. (బుఖారి) 

ఒక ప్రయోజనకరమైన ప్రశ్న ఏమనగా ఇబ్నే ఉథైమీన్  (రహిమహుల్లాహ్) వారిని ప్రశ్నించడం జరిగింది: స్వర్గ కన్యలు కలిగి ఉన్నటువంటి గుణాలను ఈ లోకంలోని స్త్రీలు కూడా కలిగి ఉంటారా? అప్పుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు: “నాకు తెలిసినంత వరకు ఈ లోకంలోని స్త్రీలు స్వర్గ కన్యల కంటే ఉన్నతంగా ఉంటారు.”

6. ఓ ముస్లింలారా! పానీయాలు కూడా స్వర్గ అనుగ్రహాలలో ఒక భాగమే. ఇవి నాలుగు రకాలు నీరు, పాలు, మద్యం, తేనె. ఈ పానీయాలు అన్ని సెలయేరులా పారుతూ ఉంటాయి. వీటి నుండి స్వర్గవాసులు తమ దప్పిక తీర్చుకుంటారు. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

مَّثَلُ الْجَنَّةِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۖ فِيهَا أَنْهَارٌ مِّن مَّاءٍ غَيْرِ آسِنٍ وَأَنْهَارٌ مِّن لَّبَنٍ لَّمْ يَتَغَيَّرْ طَعْمُهُ وَأَنْهَارٌ مِّنْ خَمْرٍ لَّذَّةٍ لِّلشَّارِبِينَ وَأَنْهَارٌ مِّنْ عَسَلٍ مُّصَفًّى

(భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గ విశిష్టత ఇలా ఉంటుంది: దుర్వాసనకు (కాలుష్యానికి) తావులేని నీటి కాలువలు ఉన్నాయి. రుచిలో మార్పురాని పాల కాలువలు కూడా ఉన్నాయి. త్రాగే వారికి మృదు మధురంగా ఉండే మద్యం కాలువలు కూడా ఉన్నాయి.) (47:15)

నీటి కాలువల గురించి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. (غَيْرِ آسِنٍ) అనగా ఎక్కువ కాలం నీరు నిల్చోవడం వల్ల అందులో ఎటువంటి దుర్వాసన కానీ లేక ఎటువంటి మార్పు కానీ రాదు. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.

(من خمر لذة للشاربين) అనగా స్వర్గం లో ఉండటువంటి మద్యం ప్రపంచంలో ఉన్నట్లు చేదుగా ఉండదు ఎంతో మధురంగా ఉంటుంది.

 (ولا هم عنها يُنزَفون) అనగా అది త్రాగడం మూలంగా కడుపులో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. 

(مِّنْ عَسَلٍ مُّصَفًّى) అనగా స్వర్గంలో తేనె ఈ ప్రపంచంలో లాగా కల్తీగా ఉండదు.

7. పండ్ల ఫలాలు మరియు ఆహార పదార్దాలు కూడా స్వర్గ అనుగ్రహాలలోని భాగమే. హదీసుల ద్వారా ఈ విషయం నిర్దారితమవుతుంది. మొట్టమొదటిగా స్వర్గ వాసులకు ఇచ్చేటువంటి ఆతిథ్యం చేప గుండె. ఎందుకంటే ఇది అత్యంత రుచికరమైనది. 

సౌభాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు ఒక యూద పండితుడు వచ్చాడు మరియు ప్రవక్తను పరీక్షించాలని అనేక ప్రశ్నలు అడిగాడు. అందులో ఈ ప్రశ్న కూడా అడిగాడు: స్వర్గవాసులు స్వర్గంలోకి ప్రవేశించగానే వారికి మొట్టమొదటిగా ఇచ్చేటువంటి కానుక ఏమిటి అనగా వారికి దేనితో ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు “చేప గుండె భాగం” .అప్పుడు అతను అన్నాడు “ఆ తర్వాత?” ప్రవక్త ఇలా అన్నారు వారి కొరకు స్వర్గంలో ఎద్దుని జుబహ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మరల ఇలా ప్రశ్నించాడు “వారికి త్రాగడానికి ఏమి ఇవ్వబడుతుంది?”. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు “ఆ స్వర్గం లో ఉండేటువంటి ఒక సెలయేరు సల్ సబీల్ నుండి వారికి త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది”. (ముస్లిం) 

స్వర్గవాసుల పండ్ల ఫలాలు గురించి వారి ఆహార పదార్దాల గురించి ఎన్నో ఆధారాలు మనకు లభిస్తాయి కానీ ఇక్కడ తెలియపరచడం కుదరదు కనుక ఆ యొక్క అనుగ్రహాల గురించి అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నారు. 

وَأَمْدَدْنَاهُم بِفَاكِهَةٍ وَلَحْمٍ مِّمَّا يَشْتَهُونَ
(మేము వారి కోరిక మేరకు ఫలాలను, మాంసాహారాలను పుష్కలంగా సరఫరా చేస్తూ ఉంటాము.) (52:22)

8. ఓ విశ్వాసులారా! అంతిమదినం రోజున స్వర్గవాసుల అతి ఉత్తమమైనటువంటి అనుగ్రహం ఏమిటంటే అల్లాహ్ ను చూడటం. అల్లాహ్ యొక్క దర్శన భాగ్యం లభించడం.

హజరత్ సుహేబ్ రూమి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: స్వర్గవాసులు స్వర్గం లో ప్రవేశించిన తర్వాత అల్లాహ్ వారిని ఉద్దేశించి ఇలా ప్రశ్నిస్తాడు “మీకు ఇంకా ఏమైనా కావాలా అడగండి నేను ప్రసాదిస్తాను!”. అప్పుడు వారు ఇలా సమాధానం ఇస్తారు “‘ఓ మా ప్రభువా’ నువ్వు మా యొక్క ముఖాలను ప్రకాశింపజేశావు, నువ్వు మమ్ములను స్వర్గంలోకి ప్రవేశింపజేశావు, ఆ నరకాగ్ని నుంచి రక్షించావు ఇక దీనికంటే గొప్ప సాఫల్యం ఇంకేం ఉంటుంది”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు: ఆ తరువాత అల్లాహ్ త ఆలా తనపై ఉన్నటువంటి పరదా తొలగిస్తాడు. ఆయనకు మరియు చూసేటువంటి స్వర్గవాసుల మధ్య ఎటువంటి అడ్డుతెర ఉండదు. అప్పుడు ఆ స్వర్గవాసులకు సర్వశక్తిమంతుడైనటువంటి అల్లాహ్ దర్శనం కంటే ప్రియమైనది ఏమీ ఉండదు. (ముస్లిం) 

9. ఓ ముస్లింలారా! స్వర్గంలో స్వర్గవాసుల అందం పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు.

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు ఇలా తెలియజేశారు: “స్వర్గంలో ఒక బజారు (మార్కెట్) ఉంటుంది. స్వర్గవాసులు ప్రతి శుక్రవారం రోజున ఆ మార్కెట్ వద్దకు వస్తారు. ఆ రోజున ఉత్తరం దిక్కు నుండి వీచే గాలి ద్వారా వారి ముఖాలు వారి దుస్తులు ప్రకాశింపచేయబడతాయి. దాని ద్వారా వారి అందం ఇంకా పెరుగుతుంది. వారు తిరిగి తమ కుటుంబం వద్దకు వచ్చినప్పుడు వారు కూడా ఎంతో అందంగా ఉంటారు. అప్పుడు వారంటారు: అల్లాహ్ సాక్షిగా మీరు మా వద్ద నుంచి వెళ్ళిన తర్వాత మీ అందం పెరిగిపోయింది అప్పుడు వారు కూడా అంటారు మీ అందచందాలు కూడా పెరిగాయి“.(ముస్లిం) 

అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక, అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పాశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు. 

స్తోత్రం మరియు దరూద్ తరువాత: 

ఓ అల్లాహ్ దాసులారా! తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించు గాక! ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి .

హజ్రత్ ముగైరా బిన్ షూబా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

మూసా అలైహిస్సలాం వారు తన ప్రభువుతో ఈ విధంగా ప్రశ్నించారు “ఓ అల్లాహ్ స్వర్గంలో చిట్టచివరిగా ప్రవేశించేటువంటి వ్యక్తి ఎవరు?” అప్పుడు అల్లాహ్ ఇలా తెలియజేశాడు: ఆ వ్యక్తి స్వర్గ వాసులందరూ స్వర్గంలోకి ప్రవేశించిన తర్వాత వస్తాడు. అప్పుడు అతనితో అనబడుతుంది “స్వర్గంలోకి ప్రవేశించు”. అప్పుడు అతనంటాడు: “ఓ నా ప్రభువా ఎలా? ప్రజలు తమ తమ స్థానాలలో ఉన్నారు. అన్ని అంతస్తుల నిండిపోయి ఉన్నాయి. వారికి ఏమేమి కావాలో అన్నీ వారు పొందారు”. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు “ఏమిటి? నువ్వు భూ ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులలో ఒక చక్రవర్తి పరిపాలించినంత సామ్రాజ్యాన్ని లేక అంతటి భూభాగాన్ని నీకు ప్రసాదించడం ఇష్టపడతావా?” అప్పుడు అతను అంటాడు ‘ఓ నా ప్రభువా నేను ఇష్టపడతాను’ అల్లాహ్ ఇలా అంటాడు “ఇదిగో ఇదంతా నీదే. అంతే కాదు ఇంకా ఇది కూడా మరియు ఇంకా ఇది కూడా” ఇలా ఐదుసార్లు అనడం జరుగుతుంది. అల్లాహ్  ఇస్తూ  ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు “ఓ అల్లాహ్ నేను సంతృప్తి చెందాను” అప్పుడు అల్లాహ్ అంటాడు “ఇదంతా నీదే మరియు దీనికి పది రెట్లు నీకు ప్రసాదించడం జరుగుతుంది. మరియు నీ మనసు కోరుకున్నదంతా నీకు ఇవ్వబడుతుంది”. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు “నా ప్రభువా! నేను సంతృప్తి చెందాను”. అప్పుడు మూసా  తన ప్రభుతో ఇలా అంటారు: “ఓ అల్లాహ్! అలాంటప్పుడు అతను అందరికంటే ఉన్నత స్థానం కలిగిన స్వర్గవాసి అవుతాడు కదా!” అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు “వీరే వారు” నా ఉద్దేశం వారి గౌరవాన్ని నేను ఉన్నతం చేశాను. మరియు వారిపై నేను సీలు వేశాను. వారి కొరకు దీన్ని రక్షించి ఉంచాను కనుక ఈ గౌరవప్రదమైనటువంటి ఈ స్థలం ఏ కన్ను చూడలేనిది ఏ చెవి విననటువంటిది మరియు ఏ మనిషి మనసు లో దీని గురించి ఆలోచించ లేనటువంటిది. (ముస్లిం) 

10. ఓ అల్లాహ్ దాసులారా! స్వర్గ నరకాలు ఎల్లకాలం ఉండేటటువంటివి అవి ఎప్పటికీ అంతం కావు. దీని ఆధారం ఖుర్ఆన్ మరియు హదీసులలో మనుకు లభిస్తుంది. స్వర్గం విశ్వాసుల కొరకు మరియు నరకం అవిశ్వాసుల కొరకు ఎల్లకాలం ఉండేలా తయారు చేయబడ్డాయి. వీటి ఆధారాలు దివ్య ఖురాన్ లో అనేక వాక్యాల ద్వారా మనకు తెలుస్తాయి. మరియు ఎవరైతే ఇవి అంతమవుతాయి అనే విషయం గురించి అంటున్నారో వారి ఆధారాలన్నీ బలహీనమైనవి, వారి మాటపై నమ్మకం ఉంచరాదు. ఎందుకంటే అవి ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయి. మరియు అల్లాహ్ తఆలా ప్రజలకు అర్థమయ్యేటటువంటి విధంగా ప్రతి విషయాన్ని తెలియజేశాడు కనుక  ఏ విధంగానైతే ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు ఆధారాలు లభించాయో వాటిపై ఎటువంటి అనుమానం లేకుండా వాటిని విశ్వసించడం తప్పనిసరి. 

11. ఓ విశ్వాసులారా! స్వర్గ నరకాల సృష్టి ఇప్పటికీ ఉనికిలో ఉంది. దీని ఆధారం అల్లాహ్ అంటున్నాడు. 

وَسَارِعُوا إِلَىٰ مَغْفِرَةٍ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمَاوَاتُ وَالْأَرْضُ أُعِدَّتْ لِلْمُتَّقِينَ

(మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. ఆ స్వర్గం వెడల్పు భూమ్యాకాశాలంత ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది.) (3:133)

అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిలాల్ (రదియల్లాహు అన్హు) గారితో ఇలా అన్నారు: ఓ బిలాల్! నువ్వు ఇస్లాం లోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ఆచరణ గురించి నాకు తెలియజేయి. ఎందుకంటే నేను స్వర్గంలో నీ యొక్క పాదాల చప్పుడు విన్నాను.(బుఖారి, ముస్లిం) 

అదేవిధంగా మరో ఆధారం ఏమిటంటే మహాప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: “నన్ను స్వర్గంలోకి ప్రవేశింప చేయడం జరిగింది. నేను చూసాను అక్కడ ముత్యాలతో చేయబడిన గూడారాలు ఉన్నాయి మరియు అక్కడ మట్టిలో కస్తూరి సువాసన వెదజల్లుతుంది”. (ముస్లిం) 

ఓ అల్లాహ్ దాసులారా! ఇవి స్వర్గం గురించి తెలియజేయబడ్డ పది విషయాలు కనుక ప్రతి విశ్వాసి కూడా వీటిని తెలుసుకోవడం మరియు వీటిని విశ్వసించడం తప్పనిసరి. కనుక ప్రతి వ్యక్తి కూడా స్వర్గాన్ని పొందడానికి కృషి చేయాలి. ఇందులో ఎటువంటి సోమరితనం చేయరాదు. 

మా ప్రభూ, మాకు ఇహలోకంలో మంచిని మరియు పరలోకంలో మంచిని ప్రసాదించు మరియు అగ్ని యొక్క బాధ నుండి మమ్మల్ని రక్షించు. ఓ దేవా, మా ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వసల్లం, అయన కుటుంబం మరియు అయన సహచరులకు శాంతిని ప్రసాదించు. 

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి