దుఆ ఇలా చేయండి – తప్పక ఫలిస్తుంది [పుస్తకం]

దుఆ ఇలా చేయండి - తప్పక ఫలిస్తుంది [పుస్తకం]
దుఆ ఇలా చేయండి – తప్పక ఫలిస్తుంది [పుస్తకం]

సులువైన, సంక్షిప్తమైన, సమగ్రమైన – దుఆ చేసే విధానం
దుఆ ఇలా చేయండి తప్పక ఫలిస్తుంది
[డౌన్లోడ్ బుక్] [PDF] [16 పేజీలు ]

దుఆ(ప్రార్థన) చేయవలసింది ఒకే ఒక్క అల్లాహ్ కు మాత్రమే. ఎందుకంటే, ప్రతిరోజూ మనం నమాజులో-

“ఓ అల్లాహ్ ! మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము. సహాయం కొరకు నిన్ను మాత్రమే వేడుకుంటాము” అని వాగ్దానం చేస్తున్నాం.(ఫాతిహా సూరా : 5)

కనుక వాగ్దానం ప్రకారం మనం అల్లాహ్ కు మాత్రమే దుఆ చేసుకోవాలి. ప్రార్థన (దుఆ) విషయంలో ఇతర మధ్యవర్తులను (అనగా ఉదాహరణకు పుణ్యాత్ములను, వలీలను) ఆశ్రయించటాన్ని కూడా అల్లాహ్ అస్సలు ఇష్టపడడు. తన తరఫున ప్రపంచ ప్రజలకు ఈ సందేశం అందజేయమని అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దివ్యఖుర్ఆన్లో ఈ విధంగాచెప్పాడు:

“(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవువారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గభాగ్యం పొందగల్గుతారు.” (ఖుర్ఆన్ 2: 186)

మరోచోట ఆయన స్వయంగా ఇలా ప్రకటిస్తున్నాడు:

“మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా ఆరాధన (ఇబాదత్) పట్ల గర్వాహంకారాలు ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులైనరకంలో ప్రవేశించటం ఖాయం.” (ఖుర్ఆన్ 40: 60)

మానవులందరూ-వారు మంచివారైనా, పాపాత్ములైనా అందరూ నేరుగా అల్లాహ్ ప్రార్థిస్తూఉండాలి. ‘మేము పాపాత్ములము, అల్లాహ్ మా ప్రార్థనలను ఆమోదిస్తాడా?’ అని సందేహంలో ఉండిపోరాదు. ఎందుకంటే, పాపాత్ముల ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడన్న మాట ఎంత అవాస్తవమో పుణ్యాత్ముల ప్రతి వేడుకోలునూ అల్లాహ్ అంగీకరిస్తాడు అన్న భావన కూడా అంతే అసత్యం. నూహ్, ఇబ్రాహీమ్, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అంతటి గొప్ప దైవప్రవక్తలు చేసిన కొన్ని ప్రత్యేక ప్రార్థనలను కూడా అల్లాహ్ ఆమోదించలేదు. మరోవైపు బనీ ఇస్రాయీల్కాలంలో 100 హత్యలు చేసిన ఒక పాపాత్ముడు పశ్చాత్తాపం చెందగా అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. పశ్చాత్తాపం కూడా ఒక రకమైన ప్రార్థనే కదా! దీని ద్వారా తెలిసింది ఏమిటంటే, ప్రతిఒక్కరూ తప్పకుండా నేరుగా అల్లాహ్ ను ప్రార్థిస్తూఉండాలి. దాసులు కనబరిచే పశ్చాత్తాపాన్ని బట్టి అల్లాహ్ వారి ప్రార్థనలను అంగీకరిస్తాడు లేక తోసిపుచ్చుతాడు. అంతేగాని ప్రార్థించేవాడు పుణ్యాత్ముడా? పాపాత్ముడా? అని చూడడు. అనంత కరుణామయుడైన అల్లాహ్ ఆకాశాల నుంచి ఏమని ప్రకటిస్తున్నాడోచూడండి:

“ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యంపట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగాక్షమించేవాడు. అపారంగా కరుణించేవాడు.” (ఖుర్ఆన్ 39 : 53)

మీ దుఆలు స్వీకరించ బడటం లేదని నిరాశ చెందకండి. ఎందుకంటే, మీ దుఆలు క్రింది మూడు రూపాల్లోని బహుశా ఏదో ఒక రూపంలో స్వీకరించబడి ఉండవచ్చు.

(1) ప్రార్థన చేసిన వెంటనే (అంటే ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో, సమీప కాలంలోనో, సుదీర్ఘకాలంలోనో ఎప్పుడైనా) అది తప్పక నెరవేరవచ్చు.

(2) లేక అల్లాహ్ ఆ ప్రార్థనను మీ పరలోక నిధిగా భద్రంగా దాచి ఉంచవచ్చు.

(3) లేక ఆ ప్రార్థన మూలంగా భవిష్యత్తులో మీపై రాబోయే ఆపదను తొలగించాలని నిర్ణయం చేసి ఉండవచ్చు.

ఏ ముస్లిం అయినా పాపం, బంధువులు విడిపోవటం లాంటి దురుద్దేశాలేవీ లేకుండా ప్రార్ధన చేస్తే అల్లాహ్ అతని కోసం పై మూడు వాటిల్లో ఏదో ఒకటి తప్పకుండా చేస్తాడని దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు. (అహ్మద్)

(1) చిత్తశుద్ధి: ఒక్క అల్లాహ్ నే ప్రార్థించాలి. ఖుర్ఆన్ ఇలా అనబడింది: మీరు మీధర్మాన్ని (ఆరాధనను) అల్లాహ్ కొరకు ప్రత్యేకించుకొని ఆయన్ని వేడుకోండి.(ఖుర్ఆన్ 40: 65)

(2) ఏకాగ్రత: పూర్తి ఏకాగ్రతతో, మనసుని అల్లాహ్ మీద లగ్నం చేసుకొని ప్రార్థించాలి. “పరధ్యానంలో ఉంటూ చేసేవారి ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడు.”(బుఖారీ గ్రంథం)

(3) వినమ్రత, అణకువ: అల్లాహ్ సన్నిధిలో ప్రార్థించేటప్పుడు వినయ వినమ్రతలు, అణకువ భావాలు ఉట్టిపడాలి. దివ్యఖుర్ఆన్ ప్రబోధనం:“మీ ప్రభువును వేడుకోండి, విలపిస్తూనూ, గోప్యంగానూ.” (ఖుర్ఆన్ 7: 55)

ఖుర్ఆన్లో ఇలా చెప్పబడింది:

“పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసి, ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్నవారిని నేను అమితంగా క్షమిస్తాను”.(ఖుర్ఆన్ 20: 82)

అంటే,

(1) మనిషి గతంలో తనవల్ల జరిగిన పాపాలపై మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి. క్షమాభిక్షకై వేడుకోవాలి.
(2) అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, దైవగ్రంథాలను, పరలోక దినాన్ని హృదయ పూర్వకంగా విశ్వసించాలి.
(3) ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)విధానానికి అనుగుణంగా ఆచరణలను సంస్కరించుకోవాలి.
(4) సత్కార్యాల మార్గంలో స్థయిర్యాన్ని,నిలకడను ప్రదర్శించాలి. అప్పుడే అతని ప్రార్థనస్వీకరించబడటానికి అవకాశం వుంటుంది.

(1) దుఆ చేసే వ్యక్తి వుజూ చేసుకొని ఉండటం ఉత్తమం. దుఆ చేసే చోటు కూడా పరిశుభ్రంగాఉంటే మంచిది.

(2) చేతులెత్తకుండా నయినా దుఆ చేయవచ్చు (ముస్లిం). కాని చేతులెత్తి దుఆ చెయ్యడం సున్నత్ (బుఖారి గ్రంథం).

(3) ఒకవేళ చేతులు ఎత్తి దుఆ చేస్తున్నట్లైతే భుజాలవరకు పైకెత్తి దుఆ చేయాలి. (తిర్మిజీ గ్రంథం)

(4) దుఆ చేసేటప్పుడు అరచేతులు ముఖం వైపుఉండాలి.(అబూదావూద్)

[1] ముందుగా అల్లాహ్ ను స్తుతించండి. తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పఠించండి. (తిర్మిజీ)

[2] అంతకు ముందు మీ వల్ల జరిగిన పాపాలను ప్రార్థనలో ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. పశ్చాత్తాపపడండి. మీ వల్ల పాపం జరిగిందని అల్లాహ్ సన్నిధిలో సిగ్గుపడుతూ వినమ్రంగా ఒప్పుకోండి (హాకిమ్ గ్రంథం) (అయితే క్రైస్తవుల్లో మాదిరిగా మత గురువుల ముందు మీ పాపాలను బయటపెట్టుకొని అవమానం పాలుకావలసిన అవసరం లేదు.)

[3] పూర్తి నమ్మకంతో ప్రార్థించండి. (బుఖారి గ్రంథం)

[4] పరిపూర్ణ ఏకాగ్రతతో (అల్లాహ్ యందే మనసును లగ్నం చేసుకొని) ప్రార్థించండి. (తిర్మిజీ)

[5] అల్లాహ్ నుంచి మీరు కోరుకుంటున్న విషయంమీకు చాలా ముఖ్యమైనదయితే ప్రార్థనా వచనాలను మూడేసి సార్లు పలకండి. (ముస్లిం)

[6] ముందు మీ కోసం ప్రార్ధించుకోండి. తర్వాతమీ తల్లిదండ్రుల కోసం, సోదరీ సోదరుల కోసం,ముస్లిం సమాజం కోసం ప్రార్థించండి. (ముస్లిం)

[7] ప్రార్థనను మీ వరకే పరిమితం చేయకుండాపరులకోసం కూడా ప్రార్థించండి.(బుఖారి)

[8] సమగ్రమైన, మంచి భావం కలిగిన ప్రార్థనలుచేయండి. (అబూదావూద్ గ్రంథం) (అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నిరూపితమైన వేడుకోలు వచనాల ద్వారా ప్రార్థించటం ఎంతోఉత్తమం.)

[9] మీకు కావలసింది చాలా చిన్న వస్తువు కదా!అని అనుకోకండి. (ఎంత చిన్న అవసరమైనా అంతిమంగా దాన్ని తీర్చేవాడు అల్లాహ్ యే కనుక) ప్రతి అవసరం కోసం ఆయన్నే వేడుకోండి.(తిర్మిజీ)

[10] ప్రార్థన చివర్లో ‘ఆమీన్’ పలకటం మర్చిపోకండి.(ముస్లిం)

[11] చివర్లో కూడా మరో మారు దరూద్ పఠించండి.ఆ తర్వాత అల్లాహ్ ను మళ్ళీ స్తుతిస్తూ ప్రార్థన(దుఆ) ముగించండి. (ముస్లిం)

వీలైతే అల్లాహ్ యొక్క గొప్ప నామం (ఇస్మె ఆజం) కలిగిన ప్రార్థనా వచనాలు పలుకుతూ ప్రార్థన మొదలుపెట్టండి. ‘ఇస్మె ఆజం’ కలిగివుండే ప్రార్థనా వచనాలు ఉదాహరణకు కొన్ని ఇక్కడ ఇవ్వబడుతున్నాయి.

“అల్లాహుమ్మ! ఇన్నీ అలుక బిఅన్నక అంతల్లాహు, లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్సమదుల్లజీ లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్.”

(ఓ అల్లాహ్! అల్లాహ్ వు నీవే. కనుకనే నేను నిన్ను అర్థిస్తున్నాను. నీవు తప్ప మరో అరాధ్యుడు లేనేలేడు. అవసరాలు, అక్కరలు లాంటి లోపాలు లేనివాడవు నీవు. నీకు సంతానం లేదు. నీవు కూడా ఎవరి సంతానమూ కావు. నీకు సరి సమానులు ఎవరూ లేరు అటువంటి మహోన్నత అస్తిత్వం నీది.)-(ఇబ్నెమాజా – సహీహ్)

“లా ఇలాహ ఇల్లా అంత సుబహానక ఇన్నీ కుంతు మినజ్జాలిమీన్”(అహ్మద్, తిర్మిజీ – సహీహ్)

”యా జల్(zal) జలాలి వల్ ఇక్రామ్! యా హయ్యు! యా ఖయ్యూమ్!” (తిర్మిజీ)

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలిముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలాఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్ అల్లాహుమ్మబారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్

ఉదాహరణకు ఒక ప్రార్థన:

అల్లాహుమ్మ ఇన్నక అ’ఫువ్వున్ తుహిబ్బుల్ అ’ఫ్వ’ఫా’ఫు (fafu) అన్నీ
(అల్లాహ్ ! నువ్వు క్షమించేవాడవు. క్షమను ఇష్టపడతావు. నన్ను క్షమించు.)

“రబ్బనా ఆతినా ‘ఫిద్దున్యా హసనతన్ వ’ఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అజాబన్నార్.”
ప్రభూ! మాకు ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మంచిని ప్రసాదించు. ఇంకా మమ్మల్ని అగ్నిశిక్ష నుండి రక్షించు.(ఖుర్ఆన్ 2 : 201)

‘రబ్బిరమ్ హుమా కమా రబ్బయానీ స’గీరా’
ఓ అల్లాహ్! వారిద్దరూ (నా తల్లిదండ్రులు) నన్నుఏ విధంగా ప్రేమగా పెంచారో అదే విధంగా నువ్వుకూడా వారిపై దయజూపు.

‘రబ్బి జిద్నీ ఇల్మ (ఖుర్ఆన్ 17:24)
ప్రభూ! నాకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించు.(ఖుర్ఆన్ 20:114)

‘రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత ఆయునిన్ వజ్ అల్నా లిల్ ముత్తఖీన ఇమామా’

ఓ మా ప్రభూ! నీవు మా భాగస్వాముల (నా భర్త లేక నా భార్య) ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చల్లదనాన్ని ప్రసాదించు. మమ్మల్ని దైవభక్తిపరుల (ముత్తఖీన్) నాయకునిగా చేయి.(ఖుర్ఆన్ 25:74)

“అల్లాహుమ్మ ఇన్నీ అలుకల్ హుదా వత్తుఖా వల్ అ’ఫా’ఫ వల్ ‘గినా”
అల్లాహ్! నాకు సన్మార్గాన్నీ, దైవభీతినీ, శీలాన్నీ,నిరపేక్షా భావాన్నీ ప్రసాదించమని వేడుకుంటున్నాను.(ముస్లిం)

“అల్లాహుమ్మ ఇన్నీ అవూజుబిక మినల్ అర్బయి మిన్ యిల్మిన్ లా యన్ఫా, వ మిన్ ఖల్బిన్ ల యఖ్షా, వ మిన్ నఫ్సిన్ లా తష్బా, వమిన్ దుఆయిన్ లా యుస్మా.”

అల్లాహ్ ! నేను నాలుగు విషయాల నుండి నీ శరణు వేడుతున్నాను. (1) నిష్ప్రయోజనకరమైన విద్యనుండి (అంటే ఆచరణలేని విద్య) (2) దైవ భీతి లేని హృదయం నుండి (3) ఆత్రం తీరని మనస్సు నుండి (4) అంగీకరించబడని ప్రార్ధన నుండి (అహ్మద్)

“అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్ హమ్మి వల్ హుజిని వల్ అజిజి వల్ కస్ లి వల్ బుఖ్ లి వల్ జుబ్ ని వ జలయిద్దయిని వ ‘గలబతిర్రిజాలి.”

అల్లాహ్! నేను దిగులు, దుఃఖం, బలహీనత, సోమరితనం, పిరికితనం, పిసినారితనం, రుణ భారం, ఇంకా ప్రజలు నాపై ఆధిక్యతను సంపాదించటం నుండి నీ శరణు వేడుతున్నాను. (నసాయి గ్రంథం)

ఇంకా మీకు ఏం ఏం కావాలో అన్నీ మీరు మాట్లాడే భాషలోనే ప్రార్ధించుకోండి. మీ ఇష్టం. కాని జాగ్రత్త! మీరు చనిపోవాలనిగాని లేక పరులకు హాని జరగాలని గాని శాపనార్ధాలు పెట్టకండి. అలా చేయటం పాపం.

ప్రార్థన చివర్లో ‘ఆమీన్’ అని పలకండి.

దరూద్ 11వ పేజీలో వుంది.

ఇలాగా: సుబహానల్లాహ్ వల్హమ్దులిల్లాహ్ వ లా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ వలా హౌల వలాఖువ్వత ఇల్లా బిల్లాహ్.

దాసుల ప్రార్థనలను అల్లాహ్ ఎల్లవేళలా స్వీకరిస్తూనే ఉంటాడు. అయితే కొన్ని ప్రత్యేక ఘడియల్లో ఆ ప్రార్థనలు మరింత త్వరగా స్వీకరించ బడటానికి అవకాశం ఉంటుంది.

[1] అజాన్, ఇఖామత్ ల మధ్య సమయంలో (తిర్మిజీ)

[2] అల్లాహ్ సన్నిధిలో మోకరిల్లి (సజ్దాలో) ఉన్న స్థితిలో (ముస్లిం)

[3] ఫర్జ్ నమాజ్ తర్వాత ప్రార్థన స్వీకరించబడుతుంది.(తిర్మిజీ గ్రంథం)

[4] ఉపన్యాసకుడు (ఖతీబ్) వేదిక పైకెక్కి కూర్చున్నప్పటి నుండి (జుమా) నమాజ్ ముగిసే వరకు మధ్యలోని ఘడియలో దుఆ స్వీకరించబడుతుంది.(ముస్లిం గ్రంథం) అంటే రెండు ఖుత్బాల మధ్యన.

[5] జుమా రోజు ప్రార్థన స్వీకరించబడే ఘడియ ఒకటి ఉంది. ఆ సమయంలో చేయబడే ప్రార్థనస్వీకరించబడుతుంది.(బుఖారి గ్రంథం)

[6] ఉపవాస విరమణ (ఇఫ్తార్) సమయంలో (ముస్లిం)

[7] రమదాన్ నెలలోని ఘనమైన రేయి (లైలతుల్ ఖద్ర్)లో చేసే ప్రార్థన (తిర్మిజీ గ్రంథం)

[8] రాత్రి ఆఖరి జాము (తహజ్జుద్ సమయం)లో ప్రార్థన స్వీకరించ బడుతుంది. ఆ సమయంలో అల్లాహ్ కారుణ్యం మానవుల ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. (బుఖారి గ్రంథం)

[9] వర్షం కురిసేటప్పుడు.(హాకిమ్ గ్రంథం)

మీ దుఆల్లో మమ్మల్ని గుర్తుంచుకుంటారని ఆశిస్తూ…