ఇస్మాయిల్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

ఇస్మాయిల్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]
https://www.youtube.com/watch?v=Irj32QUFtXs [32 నిముషాలు]
ముహమ్మద్ సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త ఇస్మాయీల్ (అలైహిస్సలాం)

పలస్తీనాలో ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) సందేశాన్ని కొందరు విశ్వసించారు. సత్య సందేశాన్ని స్వీకరించారు.

సారాకు సంతానం కలుగలేదు. ఆమెకు వయసు పైబడింది. పిల్లలు కలిగే వయసు దాటిపోయింది. తన భర్తకు ఒక పిల్లవాడిని ఇవ్వలేకపోయానని ఆమె బాధపడేవారు. అందువల్ల తమ సేవకురాలు హాజిరాను పెళ్ళి చేసుకోవలసిందిగా ఆమె భర్తను కోరారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఈ సలహా మన్నించారు. హాజిరాను వివాహం చేసుకున్నారు. హాజిరాకు ఒక కుమారుడు, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) జన్మిం చారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) చాలా సంతోషించారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం)ను అమి తంగా ప్రేమించారు.

సహజమైన ఈర్ష్యాసూయలు

మొదట్లో సారా కూడా ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) సంతోషంలో పాలుపంచుకున్నారు. కాని తర్వాత తన భర్త కొత్తగా జన్మించిన శిశువు పట్ల, శిశువు తల్లి అయిన హాజిరా పట్ల అధిక శ్రద్ధ చూపడం ఆమెలో ఈర్ష్యాసూయలకు కారణమయ్యింది. ఆమెలో అసూయ బుసలుకొట్టింది. వాళ్ళిద్దరిని ఎక్కడైనా దూరంగా విడిచి రావలసినదిగా ఆమె భర్తను కోరారు. సారా కోరినట్లు చేయవలసిందిగా అల్లాహ్ ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)కు సూచించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళవలసింది అల్లాహ్ స్వయంగా మార్గం చూపిస్తానన్నాడు. అనేక రోజులు ప్రయాణించిన తర్వాత, భయంకరమైన ఎడారిని దాటిన తర్వాత, ఒక నిర్మానుష్యమైన ప్రదేశం వద్ద వారు విడిది చేశారు. అక్కడ చెట్టుచేమ మచ్చుకు కూడా లేవు. నీటి బొట్టు కూడా దొరకని నిర్జనమైన ప్రదేశం అది. ఆ ప్రదేశంలోనే ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన భార్యాపిల్లలను వదలి వెళ్ళాలని అల్లాహ్ ఆజ్ఞాపించాడు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన భార్యకు కొన్ని ఎండు ఫలాలు, కొంత నీరు, ఒక గుడారం, మరికొన్ని వస్తువులు ఇచ్చి బరువైన మనసుతో విచారంగా అక్కడి నుంచి వెనుదిరగడానికి తన ఒంటెను అధిరోహించారు. హాజిరా ఆ ఒంటెను పట్టుకుని, “ఇబ్రాహీమ్! మమ్మల్ని ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకు వదిలేస్తున్నారు? మీకు నా పట్ల ఎలాంటి అభిమానం లేకపోయినా కనీసం మీ కన్నబిడ్డ గురించి ఆలోచించండి. మీ కుమారుడు ఇక్కడ ఆకలి దప్పులతో ప్రాణం వదిలేయవచ్చు. ఇక్కడ క్రూర మృగాలు మాపై దాడి చేయవచ్చు” అని వేడుకున్నారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఎడారిని చూస్తూ, సహనం వహించాలని ఆమెతో చెప్పారు. తాను తన ఇష్టప్రకారం వ్యవహరించడం లేదనీ, కేవలం అల్లాహ్ ఆదేశాలను అమలు చేస్తున్నాననీ జవాబిచ్చారు. ఆయన జవాబు ఆమెకు ఊరట కలిగించింది. కన్నీళ్ళు తుడుచు కుంటూ, “ఇది అల్లాహ్ అభీష్టమైతే ఆయన మమ్మల్ని ఒంటరిగా వదలిపెట్టడు” అన్నారు.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) దుఃఖం

తన కుటుంబాన్ని వదలి ఒక్కో అడుగు దూరంగా వెళుతున్న కొద్దీ ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)కు దుఃఖం అతిశయించసాగింది. ముసలి వయసులో తనకు అల్లాహ్ ప్రసాదించిన ఏకైక కుమారుడిని అక్కడ వదిలి వెళుతున్న ఆలోచన కూడా భరించరానిదిగా ఉందాయనకు. అయితే విశ్వప్రభువు పట్ల దృఢమైన తన నిబద్ధతను నిరూపించుకునే పరీక్షల్లో ఇదొకటని ఆయన గుర్తించారు. ఆయన అల్లాహ్ ను ప్రార్థిస్తూ, “ఓ ప్రభూ! నీ పవిత్రమైన గృహానికి దగ్గరగా నిర్జన ప్రదేశంలో నేను నా కుటుంబీకులను వదలివచ్చాను. వారు అక్కడ దైవారాధనను స్థాపించాలని భావిస్తున్నాను. వారి పట్ల సానుభూతి, ఆదరాభిమానాలను ప్రజల్లో కలిగించు. వారికి కావలసిన సదుపాయాలు ప్రసాదించు” అని వేడుకున్నారు.

అల్లాహ్ పై భారం వేసిన హాజిరాకు విశ్వప్రభువు సహనాన్ని, ధైర్యాన్ని ప్రసాదించాడు. కొన్ని రోజులు గడచిన తర్వాత, వారి వద్ద ఉన్న ఆహారం, నీరు అయిపోయాయి. పసిబిడ్డతో సహా ఆమె ఆకలిదప్పులతో అలమటించసాగారు. బిడ్డకు పాలుపట్టడానికి ఆమె రొమ్ముల్లో పాలు కూడా రావడం లేదు. పసిబిడ్డ ఆకలితో దయనీయంగా ఏడుస్తున్నాడు. హాజిరా కన్నీరు మున్నీరయ్యింది. బిడ్డను అక్కడే నేలమీద వదలి నీటి కోసం, ఆహారం కోసం వెదుకాడుతూ తిరగసాగారు. ఒక కొండను ఎక్కారు (ఈ కొండనే తర్వాత సఫా కొండగా పిలుస్తున్నారు). ఆ కొండ పై నుంచి ఆ లోయ మొత్తాన్ని పరిశీలించి చూశారు. మరో వైపున ఇంకో కొండ కనబడింది (దీనిని తర్వాత మర్వా కొండ అని పిలుస్తున్నారు). ఆ కొండపై నుంచి చూస్తూ నీటి జాడ కనబడుతుందన్న ఆశతో ఆ కొండపై కెక్కారు. కాని ఏమీ కనబడలేదు. ఆమె ఆందోళనతో మళ్ళీ మొదటి కొండపై కెక్కారు. ఆ విధంగా ఆమె నీటి కోసం వెదుకాడుతూ ఆ రెండు కొండల మధ్య ఏడుసార్లు పరుగులు తీశారు. (హజ్ యాత్ర సందర్భంగా సఫా మర్వా కొండల మధ్య ఏడుసార్లు పరుగెత్తుతూ చేసే ‘సయీ’ ఈ సంఘటన జ్ఞాపకార్థమే జరుగుతోంది.)

జమ్ జమ్

ఆమె నిరాశగా పసిబిడ్డ వద్దకు వచ్చారు. బిడ్డ పరిస్థితి దయనీయంగా ఉంది. “ఓ ప్రభూ! కరుణించు” అంటూ మొర పెట్టుకున్నారు. బిడ్డ పరిస్థితి క్షణ క్షణానికి దిగజారుతోంది. ఊపిరి మందగిస్తోంది. శ్వాస కష్టమవుతోంది.

బాధాతప్త హృదయంతో, తన ఏకైక సంతానం కొసప్రాణంతో పెనుగులాడడాన్ని ఆమె నిస్సహాయంగా చూడసాగారు. ఎండిపోయిన బిడ్డ గొంతు నుంచి ఎలాంటి ధ్వని రావడం లేదు. కేవలం కాళ్ళు కొట్టుకుంటున్న శబ్దం మాత్రం వినిపిస్తోంది. పసిబిడ్డ ఇస్మాయీల్ తన చిన్నారి కాళ్ళతో నేలను కొడుతున్న ప్రదేశంలో స్వచ్ఛమైన నీటి ఊట అకస్మాత్తుగా ఉబికి వచ్చింది. ఆమె తన కళ్ళను తాను నమ్మలేకపోయారు.

అల్లాహ్ పట్ల ఆమె చూపిన విధేయత, ఆమె ప్రదర్శించిన సహనాలకు అత్యుత్తమ బహుమానం లభించింది. ఎండిపోయిన నేల నుంచి స్వచ్ఛమైన జల ధార ఉబికి వచ్చేలా చేశాడాయన. తనకు నమ్మకస్తుడైన స్నేహితుడు ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) కుటుంబం కష్టాల నుంచి బయటపడే దారి చూపించాడు. హాజిరా ఆ స్వఛ్ఛమైన నీటిని బిడ్డ నోటిలో పోసారు. ఆ నీటితో బిడ్డ ప్రాణాలు కుదుట పడడాన్ని ఆమె ఆనందంగా వీక్షించారు. కన్నీళ్ళతో ఆమె అల్లాహ్ కు కృతజ్ఞతలు అర్పించారు. ఆ అద్భుతమైన జలధారలే “జమ్ జమ్” జలంగా ప్రసిద్ధి కెక్కాయి. 4000 సంవత్సరాల క్రితం నాటి ఈ జలధార నేటికి కూడా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. లక్షలాది హజ్ యాత్రికులకు అత్యంత ఆరోగ్యప్రదమైన నీటిని అంది స్తోంది. ఒకప్పుడు నిర్జనమైన ఆ ప్రదేశంలో జీవం తొణికిసలాడేలా చేసింది ఈ జమ్ జమ్ జలమే.

మరిన్ని చిహ్నాలు

దూరదూర ప్రాంతాలకు చెందిన పక్షులు ఆ నీటిని చూసి దాహం తీర్పు కోవడానికి అక్కడ వాలడం ప్రారంభించాయి. యెమన్ నుంచి వస్తున్న ఒక అరబ్బు తెగ “జుర్ హుమ్”* దూరం నుంచి పక్షులు గుంపులుగా ఆ ప్రదేశం వైపునకు వెళ్ళడాన్ని గమనించారు. విచారించడానికి కొందరిని అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళి వచ్చిన వారు అక్కడ నీటి వనరు ఉందని తెలిపారు. ఆ అరబ్బు తెగ ఆ ప్రదేశానికి వచ్చింది. ఆ నిర్జనప్రదేశంలో మనుష్యుల్ని చూసి హాజిరా చాలా సంతోషించారు. తనకు, తన కుమారునికి అల్లాహ్ పరిరక్షణ లభించిందనడానికి సూచనగా వారి ఆగమనాన్ని ఆమె భావించారు. ఆ ప్రజల హృదయాల్లో వారి పట్ల సానుభూతిని అల్లాహ్ జనింపజేశాడు. ఆ ప్రదేశం వైపునకు వారు వచ్చేలా చేశాడు. ఆ విధంగా ఇబ్రాహీమ్ చేసిన ప్రార్థనను అల్లాహ్ ఆమోదించాడు.

* యెమన్ వాసులు నిజమైన అరబ్బులు అనబడుతారు. వారు మాట్లాడే అరబ్బీ భాష చాలా ప్రామాణికమైనది.

ఆ ప్రదేశంలో జమ్ జమ్ నీటి ఊట బయటపడినందు వల్ల యెమన్ నుంచి అక్కడకు వచ్చిన జుర్ హుమ్ తెగ అక్కడ విడిది చేయడానికి, ఆ నీటిని వాడు కోవడానికి హాజిరా అనుమతి కోరారు. హాజిరా సంతోషంగా వారిని స్వాగతించారు. వారిని అతిథులుగా గౌరవించారు. వారిలో కొందరు తమ కుటుంబాలను అక్కడకు పిలిపించుకున్నారు. చాలా మంది ఆ ప్రదేశం(మక్కా)నే తమ శాశ్వత నివాసంగా మార్చుకున్నారు.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) అభిలాష

నిర్మానుష్య ప్రదేశంలో తాను వదలి వచ్చిన తన భార్యాబిడ్డల గురించి ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఎప్పుడూ చింతిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి వారిని చూసి వచ్చేవారు. తాను కోరిన విధంగా తన కుమారుడు పెద్ద వాడవ్వడాన్ని చూసి సంతృప్తి చెందేవారు. తన కుటుంబాన్ని ఆదుకున్న విశ్వ ప్రభువుకు కృతజ్ఞతలు అర్పించేవారు. తన కుటుంబానికి నిలువనీడ కల్పించి, వారికి కావలసిన అన్నపానీయాలు ఏర్పాటు చేసిన అల్లాహ్ కు ధన్యవాదాలు తెలుపుకునేవారు.

నిరుపమానమైన త్యాగం

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) జీవితం యావత్తు విశ్వప్రభువు పట్ల ఆయన నిబద్ధతను, చెక్కుచెదరని విశ్వాసాన్ని ప్రకటించే పరీక్షల సంగమం. అల్లాహ్ పట్ల నమ్మకం కలిగి ఉన్న వారు ఎన్నడూ నిరాశ చెందరు. అల్లాహ్ ఆదేశాలను ఎన్నడూ ప్రశ్నించరు. అల్లాహ్ ఎల్లప్పుడూ చెడుపై మంచికి విజయాన్ని ప్రసాదిస్తాడని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు అల్లాహ్ మరోసారి ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను కఠినమైన పరీక్షకు గురిచేశాడు. ఒక కల ద్వారా ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన ఏకైక కుమారుణ్ణి అల్లాహ్ కు బలిపెట్టాలని ఆదేశించడం జరిగింది.*

*బైబిలులో కూడా ఈ ప్రస్తావన ఉంది, అబ్రహంకు అతని ఏకైక పుత్రుడు, ఇస్ హాక్ ను బలి ఇవ్వాలని ఆదేశించడం జరిగిందని. కాని ఇస్ హాక్ ఆయనకు ప్రథమ పుత్రుడు కాదు. ఇస్మాయీల్ ఆయనకు ప్రథమ పుత్రుడు. అంటే ఈ ఆదేశం అందిన సమయంలో ఆయనకు ఉన్న ఏకైక పుత్రుడు ఇస్మాయీల్ (అలైహిస్సలాం) మాత్రమే. ఇస్ హాక్ ఆ తర్వాత చాలా సంవత్సరాలకు జన్మించారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) అరబ్బు తెగల్లో కలిశారు. ఆయన సంతానంలో అరబ్బు ప్రవక్త జన్మించారు. కాగా ఇస్ హాక్ సంతానంలో యూద ప్రవక్తలు జన్మించారు. అందువల్లనే అరబ్బులు, యూదులు సోదరులని చెప్పడం జరుగుతుంది.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) దృఢమైన విశ్వాసం కలిగినవారు. అల్లాహ్ పంపిన ప్రవక్త. అల్లాహ్ సందేశహరుడు. ఆయన తన ఏకైక పుత్రుడిని బలిపెట్టాలని అల్లాహ్ కోరితే ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) దైవాదేశాన్ని ఎలా కాదనగలరు? అయితే ఎవరికైనా ఇలా చేయడం ఊహించరాని త్యాగమే అవుతుంది. ఆ కుమారుడు ఆయనకు లేకలేక ముసలి వయసులో జన్మించిన కుమారుడు. ఆయనకు వయసు ఉడిగిన సమయంలో అతడే ఆధారం. ఆయనకున్న ఏకైక ఆనందం ఆ కుమారుడే. కేవలం ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) వంటి గొప్ప ప్రవక్త మాత్రమే ఇలాంటి బాధాకరమైన ఆదేశాన్ని అమలు చేయగలరు. తన సృష్టికర్త పట్ల, తన ప్రభువు పట్ల తన నిశ్చలమైన ప్రేమను ఈ విధంగా ప్రదర్శించడం ఆయనకు మాత్రమే సాధ్యం.

ఆత్మవిశ్వాసంతో ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) మక్కాకు బయలుదేరారు. ఈ వార్తను తన కుమారునికి చెప్పడం ఆయనకు ఒక పరీక్ష వంటిదే. అయితే ఇస్మాయీల్ (అలైహిస్సలాం) కూడా తండ్రికి తగిన కుమారులు. ఆయన అనితర సాధ్యమైన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అల్లాహ్ ఆదేశాన్ని అమలు చేయాలని ఆయన నిబ్బరంగా తన తండ్రికి చెప్పారు. “నాన్నా! మీకు ఆజ్ఞాపించబడినట్లు చేయండి. అల్లాహ్ కోరిన విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని బదులిచ్చారు. ఆయన తన దుస్తులు తొలగించారు. తల్లికి సలాములు చెప్పాలని తండ్రిని కోరారు. తన గుర్తులుగా తన దుస్తులు తల్లికి ఇవ్వాలని చెప్పారు. తాను కాళ్ళుచేతులు కొట్టుకోవడం జరిగితే తన తండ్రికి బాధ కలుగుతుందన్న ఉద్దేశ్యంతో తన కాళ్ళను చేతులను కట్టేయాలని తండ్రిని కోరారు.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన కత్తికి పదును పెట్టారు. ఆ విధంగా ఇస్మాయీల్ కు మృత్యువు బాధ లేకుండా ఉండాలని భావించారు. కుమారుడిని గట్టిగా కౌగిలించుకుని రోదించారు. తర్వాత ఇస్మాయీల్ (అలైహిస్సలాం)ను పడుకోబెట్టి కాళ్ళుచేతులు కట్టేశారు. బాధాతప్త హృదయంతో కుమారుణ్ణి చివరిసారిగా చూసుకున్నారు. బరువెక్కిన హృదయంతో కత్తిని ఎత్తారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) గొంతుపై వేటు వేశారు. కాని ఆ కత్తి గొంతును కోయలేదు. తన తండ్రి తగినంత గట్టిగా కత్తిని ఉపయోగించడానికి వెనుకాడుతున్నారని భావించిన ఇస్మాయీల్ (అలైహిస్సలాం) గట్టిగా కోయాలని తండ్రితో చెప్పారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) అలాగే చేశారు. అయినా ఆ కత్తి గొంతును కోయలేదు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఆశ్చర్యపోయారు. తన బలహీనతను క్షమించవలసినదిగా ఆయన అల్లాహ్ ను వేడుకున్నారు. అల్లాహ్ ఆయన వేడుకోలుకు బదులిచ్చాడు. “ఇబ్రాహీమ్! నీవు నిజంగా కలను సార్థకం చేశావు. మేము నీ విధేయతకు బహుమానం ప్రసాదిస్తున్నాము”అన్నాడు. ఆ తండ్రీ కొడుకులు అల్లాహ్ ఆదేశం శిరసావహించడానికి క్షణం వెనుకాడలేదు. అల్లాహ్ కు కావలసింది బలి కాదు. తన ఆదేశాల పట్ల వారు చూపిన నిబద్ధతనే ఆయన పరీక్షించాడు. తండ్రీ కొడుకులు అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల కృతజ్ఞతలు అర్పించారు. ఇస్మాయీల్(అలైహిస్సలాం)కు బదులుగా బలి ఇవ్వడానికి ఆ దగ్గర్లోనే ఒక పెద్ద గొర్రె కనబడింది. అంతకు ముందు కోయడానికి మొండికేసిన కత్తి ఆ గొర్రె గొంతును ఒక్క వేటుకు కోసింది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం ఈదుల్ అద్ హా (బక్రీదు పండుగ) సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడం జరుగుతుంది.

ద్వారబంధాన్ని మార్చడం

ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ఒక అందమైన యువకునిగా ఎదిగారు. జుర్ హుమ్ తెగ వారి వద్ద ఆయన అరబీ భాషను నేర్చుకున్నారు. ఈ తెగకు చెందిన అమ్మాయినే వివాహమాడారు. ఆయన చాలా ఆనందంగా జీవితాన్ని గడుపసాగారు. ఆయన జీవితంలో ఎదురైన ఒకే ఒక్క దుఃఖకరమైన సంఘటన ఆయనను అమితంగా ప్రేమించిన మాతృమూర్తి తనువు చాలించడం. ఇస్మాయీల్(అలైహిస్సలాం)ను కంటికి రెప్పలా సాకిన హాజిరా మరణించిన సంఘటన ఆయన్ను విపరీతంగా కలచి వేసింది.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) అప్పుడప్పుడు వచ్చి కుమారుణ్ణి చూసి వెళ్ళేవారు. ఆ ఎడారిలో ఆయన కుమారుణ్ణి చూడడానికి అనేక రోజులు ప్రయాణం చేసి రావలసి వచ్చేది. ఒకసారి ఆయన వచ్చినప్పుడు ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ఇంట లేరు. ఆయన భార్య ఇంట ఉండడంతో ఆమెతో ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) మాట్లాడారు. ఆమె భర్త ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు. అయితే ఆమె ఆయన చెప్పే విషయాలు ఏవీ వినకుండానే తన భర్త గురించి ఫిర్యాదులు ప్రారంభించింది. తమ బీదస్థితి గురించి చెప్పుకొచ్చింది. వచ్చింది ఎవరని కూడా ఆమె అడుగలేదు. కనీసం మంచినీరన్నా అందించలేదు. అసహనం నిండిన స్త్రీని ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఆమెలో చూశారు. అల్లాహ్ అనుగ్రహాలను గుర్తించే శక్తిలేని స్త్రీని చూశారు. ఆయన కనీసం తన ఒంటె నుంచి క్రిందికి కూడా దిగలేదు. ఆయన ఆమెతో, “నీ భర్తను అడిగానని చెప్పు… ఇంటి ద్వారబంధాన్ని మార్చడం మరచిపోవద్దని చెప్పు” అని వెళ్ళిపోయారు.

ఇస్మాయీల్(అలైహిస్సలాం) ఇంటికి వచ్చిన తర్వాత ఆమె జరిగింది ఆయనకు చెప్పింది. వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నారని ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ప్రశ్నించారు. ఆమె ఆ వ్యక్తిని వర్ణించింది. ఆ వచ్చింది తన తండ్రి అని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన మాటలకు అర్థాన్ని వివరిస్తూ, సరిగా లేని ద్వారబంధం ఇంటికి తగినది కాదనీ, దాని వల్ల మనిషికి ఎదురుదెబ్బలు తగలడమే కాదు గాయాలు కూడా అవుతాయనీ, అదే విధంగా ఆమె తనకు తగిన భార్య కాదని అన్నారు.

కొంతకాలం తర్వాత ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన కుమారుణ్ణి చూడ్డానికి మళ్ళీ వచ్చారు. అప్పుడు కూడా ఆయన కుమారుడు ఇంట లేరు. అయితే ఇంట మరో స్త్రీ ఉంది. ఆమె ఇస్మాయీల్(అన) మళ్ళీ పెళ్ళాడిన స్త్రీ. ఆమె ఆయనకు నీరందించింది. భోజనం వడ్డించింది. ఆయన ఒంటె దిగి.. ఆమెను ఆమె భర్త గురించి అడిగారు. తన భర్త వేటకు వెళ్ళారని ఆమె బదులిచ్చింది. ఆ కాలంలో ఎడారి జీవితం చాలా కష్టంగా ఉండేది. ఆహారం కోసం వేటాడ్డానికి చాలా దూరం వెళ్ళవలసివచ్చేది.

ఆమె తన భర్త గురించి చెబుతూ ఆయన చాలా కష్టపడి తమను పోషిస్తున్నారని ప్రశంసలతో ముంచెత్తింది. అల్లాహ్ కు కృతజ్ఞతలు అర్పిస్తూ మాట్లాడింది. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) చాలా సంతోషించారు. ఇస్మాయీల్(అలైహిస్సలాం)కు తగిన భార్య లభించిందని ఆనందించారు. తాను ఎవరైనది ఆమెకు చెప్పలేదు. తాను ఒక స్నేహితుడిని అని మాత్రమే చెప్పారు. ఆమె ఎలాంటి కోడలో తెలుసుకోవాలని ఆయన భావించారు. ఆమె గురించి తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా ఒక సందేశం రూపంలో అందించి ఆమెను ఆశ్చర్యపరచాలని భావించారు. అక్కడి నుంచి బయలుదేరుతూ ఆయన ఆమె చూపిన అతిథి మర్యాదలకు కృతజ్ఞతలు చెప్పారు. “మీ భర్త వచ్చిన తర్వాత నా సలాములు చెప్పండి. ఇప్పుడు ద్వారబంధం చక్కగా కుదిరిందని చెప్పండి” అని వెళ్ళిపోయారు.

ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె జరిగింది వివరించారు. వచ్చిన అతిథి ఎలా ఉన్నారని ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ప్రశ్నించారు. ఆమె వివరించిన తర్వాత ఇస్మాయీల్ (అలైహిస్సలాం) నవ్వుతూ, వచ్చినది తన తండ్రి అనీ, ఆయన నిన్ను నాకు తగిన భార్యగా అభివర్ణించారనీ, నీతో కలసి ఉండాలని, నిన్ను కాపాడాలని కోరారని వివరించారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) జీవితాంతం ఆమెతో కలసి ఉన్నారు. ఆమె ద్వారా ఆయనకు సన్మార్గులైన సంతానం కలిగారు.

కాబా నిర్మాణం

ఇబ్రాహీమ్(అలైహిస్సలాం) తన కుమారుణ్ణి చూసి చాలా కాలమయ్యింది. ఈ సారి ఆయన ఒక అతి ముఖ్యమైన పని చేయవలసి ఉంది. ప్రపంచంలో మొట్ట మొదటి ఆరాధనాలయాన్ని నిర్మించవలసిందిగా అల్లాహ్ ఆయన్ను ఆజ్ఞాపించాడు. మక్కా లోయలో ఈ ఆరాధనాలయం ప్రాచీన కాలంలో ఉండేది. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) మక్కా లోయకు వచ్చారు. అక్కడ జమ్ జమ్ బావి వద్ద తన కుమారుడు ఇస్మాయీల్(అలైహిస్సలాం) బాణాలకు పదును పెడుతుండడాన్ని చూశారు. తండ్రిని చూసి ఆయన అత్యంత సంతోషించారు. తండ్రీకొడుకులు ఆనందంతో కౌగలించుకున్నారు. అల్లాహ్ తనకు కాబా గృహాన్ని నిర్మించమని ఆదేశించాడని ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) కుమారునికి తెలియజేశారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ఎల్లప్పుడు తన ప్రభువు ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉండేవారు. ఇరువురు కలసి కాబా గృహం పునాదులు తవ్వసాగారు. ఈ పని చేస్తున్నప్పుడు వారి నోట క్రింది పదాలు వారి హృదయాల్లోని భావాలను వ్యక్తం చేస్తూ వెలువడసాగాయి.

“ఓ ప్రభూ! మా యిద్దర్ని ముస్లిములుగా జేయి. మా సంతానంలో ముస్లిం జాతిని ఉద్భవింపజేయి. మా ప్రయత్నాల ఫలితాలను మాకు చూపించు. మా పశ్చాత్తాపాన్ని స్వీకరించు. నీవే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడివి. అత్యంత కరుణామయుడివి.”

ఇస్మాయీల్ (అలైహిస్సలాం) రాళ్ళను మోసుకుని వస్తుంటే ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) వాటిని అమర్చసాగారు. కొంతకాలానికే నిర్మాణం రూపురేఖలు దిద్దుకుంది. తమకు సహాయంగా ఎవరినీ వారు తీసుకోలేదు. గోడలు చాలా ఎత్తుకు లేచాయి. ఇప్పుడు రాళ్ళు పేర్చడానికి ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఏదైనా ఎత్తు వేసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆయన ఇస్మాయీల్ (అలైహిస్సలాం)తో ఏదైనా మంచిరాయి, తాను నిలబడడానికి చూడమని చెప్పారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ఒక పెద్దరాయిని అక్కడికి దొర్లించారు*. ఆ విధంగా కాబాగృహం నిర్మించబడింది. మక్కాలో కాబా గృహం నిర్మించబడినప్పటి నుంచి ప్రపంచవ్యాప్త ముస్లిములకు (దైవవిధేయులకు) పవిత్రమైన గృహంగా కొనసాగుతోంది. విశ్వప్రభువైన అల్లాహ్ పట్ల తమ కృతజ్ఞ తలను ముస్లిములు ఇక్కడికొచ్చి తెలియజేస్తుంటారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 14:37-38)

ఈ రాయి వేలాది సంవత్సరాలుగా పరిరక్షించబడుతుంది. నేడు ‘మకామె ఇబ్రాహీమ్’ అన్న పేరుతో గాజు పలకల మధ్య ఉన్న రాయి ఇదే.

ఇతర ముఖ్యమైన లింకులు