ఈసా (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియోలు]

యూట్యూబ్ ప్లే లిస్ట్: https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3jl6Yyjn-7Kld6W0Y3xa-s

ఈసా (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – పార్ట్ 1 
ఈసా (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – పార్ట్ 2 
ఈసా (అలైహిస్సలాం) జీవిత చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు 
యేసు (ఈసా అలైహిస్సలాం) అద్భుతాలు, మహిమలు

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త ఈసా (అలైహిస్సలామ్)

మర్యమ్ కుమారుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. ఆయనకు మునుపు కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తను రాలు. ఆ తల్లీ కొడుకులిరువురూ అన్నం తినేవారే. (ఖుర్ఆన్ 5: 75)

మర్యమ్ దైవగృహంలో ఆరాధనలో ఉన్నప్పుడు ఒక దైవదూత పురుషుని రూపంలో ఆమె ముందు ప్రత్యక్ష మయ్యాడు. ఆమె భయంతో వణుకుతూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. “నీవే గనుక అల్లాహ్ కు భయపడే వానివైతే (ఇక్కణ్ణుంచి వెళ్ళిపో), నేను నీ నుంచి అల్లాహ్ శరణు కోరుతున్నాను” అంటూ అల్లాహ్ ను ప్రార్థించింది. దైవదూత ఆమెను ఉద్దేశించి మాట్లాడుతూ, “భయపడవద్దు. నీకెలాంటి ప్రమాదమూ లేదు. నేను నీ ప్రభువు పంపగా వచ్చిన దూతను మాత్రమే. నన్ను ప్రభువు నీ వద్దకు పంపాడు. నీకు సన్మార్గుడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించడానికి” అన్నాడు. ఈ మాటలు విని మర్యమ్ నిర్ఘాంత పోయింది. ఆమె దైవదూత చెప్పిన మాటలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, “నాకు కుమారుడు ఎలా పుడతాడు. నన్ను ఏ పురుషుడూ తాకలేదే. నేను శీలం లేని దాన్ని కాదు” అన్నారు. దైవ దూత ఆమెకు సమాధానమిస్తూ, “అలాగే అవు తుంది. నీ ప్రభువుకు ఇది చాలా తేలిక. ఆయన నీ కుమారుడిని మానవాళికి ఒక నిదర్శనంగా, అల్లాహ్ తరఫున కారుణ్యంగా తయారు చేస్తాడని” చెప్పాడు. ఈ మాటలు పలికిన దైవదూత అదృశ్య మయ్యాడు.

ఆందోళన

దైవదూత రాక వల్ల మర్యమ్ (అలైహస్సలాం) చాలా ఆందోళనకు గురయ్యారు. నెలలు గడచినకొద్దీ ఆమె ఆందోళన ఎక్కువయ్యింది. భర్త లేకుండా బిడ్డకు జన్మనివ్వడం ఎలా? ఎలా సమాధానమిచ్చుకోగలదు?

ఆమెలో మరో ప్రాణి ఊపిరి పోసుకుంటుందన్న విషయం త్వరలోనే ఆమెకు తెలిసివచ్చింది. ఆమె బరువెక్కిన హృదయంతో దైవగృహాన్ని వదలి నజరేతు వెళ్ళిపోయారు. నజరేత్ పట్టణంలోనే ఆమె జన్మించారు. ప్రజలకు దూరంగా ఒక చిన్న ఇంట్లో ఆమె నివసించసాగారు.

కాని భయం, ఆందోళన ఆమెను వదలిపెట్టలేదు. ఆమె ఒక ఉన్నత కులీన కుటుంబానికి, ధర్మపరాయణుల కుటుంబానికి చెందిన స్త్రీ. ఆమె కుటుంబ చరిత్ర ఘనమైనది. ఆమె తండ్రిని చెడ్డవాడిగా చెప్పే ధైర్యం ఎవరూ చేయలేదు. ఆమె తల్లిని ఎవరూ వ్రేలెత్తి చూపలేదు. కాని ఇప్పుడు ఆమె గురించి ప్రశ్నించే వారికి ఏమని జవాబు చెప్పగలదు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఆమె ఈ మానసిక ఒత్తిడిని భరించలేకపోయారు. గర్భంలో బిడ్డను మోస్తూ ఆమె నజరేత్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళాలన్నది ఆమెకు తెలియదు. ఎక్కడికో అక్కడికి ఈ ప్రాంతం నుంచి, ఈ వాతావరణం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని బయలు దేరారు.

పురిటి నొప్పులు

అలా బయలుదేరిన ఆమె ఎక్కువ దూరం వెళ్ళక ముందే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె ఒక చెట్టును ఆనుకుని కూర్చుండిపోయారు. అక్కడే ఆమె ఒక మగశిశువుకు జన్మనిచ్చారు. అందమైన ఆ శిశువు ముఖాన్ని తదేకంగా చూడసాగారు. తండ్రి లేకుండా ఆ శిశువును ఈ లోకంలోకి తీసుకు వచ్చినందుకు ఆమెకు చాలా బాధ కలిగింది. ఆమె చాలా విచారంగా, “ఇదంతా జరక్కముందే నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేది?” అనుకున్నారు. హఠాత్తుగా ఆమెకు ఒక స్వరం వినిపించింది. “దుఃఖించవద్దు, నీ ప్రభువు ఇక్కడికి సమీపంలో ఒక సెలయేరును ఏర్పాటు చేశాడు. ఇక ఆహారం విషయానికి వస్తే, ఈ ఖర్జూరం చెట్టు మొదలు పట్టుకుని ఊపితే ఖర్జూరాలు రాలతాయి. వాటిని తిని, సెలయేటి నీరు తాగి నీవు కోల్పోయిన బలాన్ని తిరిగి పొందు. సంతోషంగా ఉండు. నీవు చూస్తున్నది అల్లాహ్ శక్తిసామర్థ్యాల ప్రభావాన్ని. వాటి వల్ల ఎండిపోయిన ఖర్జూరం చెట్టు నీ కోసం ఫలాలను ఇస్తోంది” అని ఆ స్వరం పలికింది. అల్లాహ్ తరఫున వినిపించిన ఆ స్వరం ఆమెకు ధైర్యాన్నిచ్చింది. ఆమె స్వచ్ఛమైన నడవడికకు, వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం. ఆమె తిరిగి పట్టణానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కాని ఆమెలోని భయాలు మళ్ళీ ఆమెను చుట్టుముట్టాయి.

అప్పుడే జన్మించిన శిశువు మాట్లాడడం

ఆమె ప్రజలకు ఏమని జవాబు చెప్పగలదు? తల్లి పడుతున్న ఆందోళనను గుర్తించినట్లు శిశువు తానే స్వయంగా మాట్లాడడం ప్రారంభించాడు. “నీవు ఎవరినైనా కలిస్తే వారితో.. అల్లాహ్ కోసం నేను ఈ రోజు ఉపవాసం ఉంటున్నాను. ఈ రోజు ఎవరితోనూ మాట్లాడను” అని పలకాలని చెప్పాడు. ఈ అసాధారణ సంఘటన, పుట్టిన బిడ్డ మాట్లాడిన సంఘటన చూసి ఆమెలోని భయాలు చాలా వరకు తగ్గిపోయాయి.

అపవాదు

ఆమె అనుకున్నట్లే, పట్టణ ప్రజలు ఆమెను, ఆమె ఒడిలో ఉన్న బిడ్డను అనుమానంగా చూడడం ప్రారంభించారు. ఆమెను నిందించడం ప్రారంభించారు. “ఓ హారూన్ సోదరి! (ప్రవక్త హారూన్, ఆమెకు పూర్వీకుడు). నువ్వు చేసింది మహా పాపం. నీ తండ్రి చెడ్డవాడు కాదే, నీ తల్లి చెడ్డది కాదే” అంటూ నిలదీయడం ప్రారంభించారు. ఆమె తన నోటిపై వ్రేలు ఉంచుకుని తన బిడ్డ వైపు సైగ చేసింది. వారు ఆశ్చర్యంగా, “పసిబిడ్డతో మేం ఎలా మాట్లాడగలం?” అన్నారు. కాని వారిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆ బిడ్డ స్పష్టంగా మాట్లాడడం ప్రారంభించింది. “నేను అల్లాహ్ దాసుడను. అల్లాహ్ నాకు గ్రంథాన్ని ఇచ్చి నన్ను ప్రవక్తగా చేసి పంపాడు” అని పలికాడు.

ఆ బిడ్డ విశిష్టమైనదని ప్రజలు గ్రహించారు. అల్లాహ్ తాను అనుకున్నది జరగడానికి కేవలం ‘అయిపో’ అంటే చాలు. ఆయన తలచినది జరిగిపోతుందని తెలుసుకున్నారు. కాని ఇదంతా ఒక కనికట్టు విద్యగా భావించినవారు కూడా కొందరు ఉన్నారు. అయితే, ఈ పరిణామం తర్వాత మర్యమ్ (అలైహిస్సలాం) నజరేత్లో ఎలాంటి వేధింపులు లేకుండా నివసించడం సాధ్యపడింది.

ప్రవక్త పదవికి సంబంధించి మరిన్ని నిదర్శనాలు

ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) పెరిగి పెద్దయిన కొద్దీ ఆయన ప్రవక్త పదవికి సంబంధించిన మరిన్ని నిదర్శనాలు బహిర్గతం కాసాగాయి. ఆయన తన స్నేహితులతో మాట్లాడుతూ, వారి కొరకు వారి ఇంట ఎలాంటి భోజనం సిద్ధంగా ఉన్నదో చెప్పే వారు. వారు ఎక్కడ ఏది దాచి ఉంచారో కూడా చెప్పేసేవారు. ఆయన పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు చాలా శ్రద్ధగా వినేవారు. తనకు నేర్పబడిందంతా కంఠస్థం చేసేసేవారు. ఆయన తన ఉపాధ్యాయులను ప్రశ్నించి ప్రతిదీ తెలుసుకునేవారు.

పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన తన తల్లితో కలసి జెరుసలేం వెళ్ళారు. ఆయన అక్కడ ఆరాధనాలయంలో తిరుగుతూ, రబ్బీలు (యూద మతబోధకులు) చేస్తున్న బోధనలను అక్కడి జనసమూహంతో పాటు కలసి విన్నారు. అక్కడ ఉన్న వారందరూ పెద్దలే. పెద్దవారి మధ్య కూర్చుని మతవిషయాలు వినడానికి ఆయన ఏమాత్రం సంకోచించలేదు. మతబోధకుల ఉపన్యాసాలు శ్రద్ధగా విన్న తర్వాత ఆయన ఆసక్తిగా ఎన్నో ప్రశ్నలు అడిగి వారి నుంచి జవాబులు తీసుకున్నారు. తన అభిప్రాయాలు నిర్మొహమాటంగా తెలిపారు. ధైర్యంగా ప్రశ్నలు అడిగి, తన అభిప్రాయాలు తెలుపుతున్న ఆ బాలుని చూసి రబ్బీలు కాస్త కలవరపడ్డారు. ఆయన అడిగిన ప్రశ్నలకు వారి వద్ద జవాబులు లేవు. వారు ఏం చెప్పాలో తెలియని పరిస్థితికి గురయ్యారు. ఆయన ప్రశ్నలు అడక్కుండా అడ్డుకోవడానికి, ఆయన నోరు విప్పకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. కాని ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం)వారి ఎత్తుగడలు సాగనివ్వలేదు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేశారు. ఈ వాగ్వివాదంలో ఆయన ఎంతగా నిమగ్నమై పోయారంటే, ఆయనకు తాను ఇంటికి తిరిగి వెళ్ళవలసి ఉందన్న విషయం కూడా గుర్తుకు రాలేదు.

ఈలోగా ఆయన తల్లి ఆయన కోసం వెదికి, ఆయన స్నేహితులతో కలసి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారని భావించి తమ ప్రాంతానికి తిరుగుముఖ మయ్యారు. కాని ఇంటికి వచ్చి చూస్తే ఆయన లేరు. ఆమె తిరిగి జెరుసలేం వచ్చి ఆయన కోసం వెదకడం ప్రారంభించారు. చివరకు ఆరాధనాలయంలో మత బోధకుల మధ్య, వారితో మాట్లాడుతూ ఆయన కనబడ్డారు. ఆయన చాలా మామూలుగా, మతచర్చలు ఎప్పటి నుంచో చేస్తున్న వ్యక్తి మాదిరిగా ఎలాంటి బిడియం లేకుండా వారి మధ్య కూర్చుని మాట్లాడుతూ కనబడ్డారు. మర్యమ్ (అలైహిస్సలాం) ఆయన్ను చూసి నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని, తనను హైరానాకు గురి చేసినందుకు మందలించారు. ఆయన జవాబిస్తూ, మతపెద్దలతో చర్చల్లో మునిగి తాను సమయాన్ని మరచిపోయానని అన్నారు.

జిబ్రయీల్ రాక

ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) ముప్పయి సంవత్సరాల వయసుకు చేరుకున్న తర్వాత దైవ దూత జిబ్రయీల్ ఆయన వద్దకు వచ్చి ఇంజీల్ గ్రంథాన్ని ఇచ్చారు. దైవ గ్రంథమైన ఇంజీల్, అంతకు ముందు అరుదెంచిన ప్రవక్తల గ్రంథాలను, అంతకు ముందు అవతరించిన దైవసందేశాలను అన్నింటినీ ధృవీకరించిన గ్రంథం. కాని అప్పటికి యూదులు తమ ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తీసుకువచ్చిన తౌరాత్ గ్రంథానికి చాలా దూరమైపోయారు. వారు కేవలం సంపదను కూడ బెట్టడంలో మునిగి పోయారు. ఆరాధనాలయాల నిర్మాణం పేరిట ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసేవారు, కాని ఆ సొమ్ము యావత్తు తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేవారు.

అయితే, పునరుజ్జీవనాన్ని (మరణానంతరం మళ్ళీ బ్రతికించబడడాన్ని), తీర్పు దినాన్ని విశ్వసించే ఒక వర్గం కూడా వారిలో ఉండేది. అలాగే, బహిరంగంగా మాత్రం చాలా ధర్మపరాయణుల్లా, దైవభీతి కలవారిగా నటిస్తూ, తమ వ్యక్తిగత జీవితాల్లో అన్ని విధాల చెడుల్లో కూరుకుపోయిన వర్గం కూడా ఉండేది.

ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) తన సందేశ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. అల్లాహ్ మార్గానికి ప్రజలను ఆహ్వానించడం మొదలుపెట్టారు. యూదులు కూరుకు పోయిన చెడుల గురించి వివరిస్తూ వారిని మందలించేవారు. యూద మత పెద్దల ద్వంద్వ ప్రమాణాలను విమర్శించేవారు. వారి నైతిక పతనం పట్ల వారిని హెచ్చరించేవారు. కాని యూద మత పెద్దలు ప్రవక్త క్రీస్తు హితబోధను పెడచెవినపెట్టారు. పైగా ఆయనకు శత్రువులై పోయారు. తమ విలాసవంతమైన జీవితాలకు ప్రమాదం ముంచుకు వచ్చిందని భయపడ్డారు. సత్యాన్ని అణచివేయడానికి అన్ని విధాల ఎత్తుగడలకు పాల్పడ్డారు. అలాంటి ఎత్తుగడల్లో ఒకటేమిటంటే, ప్రవక్త క్రీస్తును ఆయన ప్రవక్త పదవికి సంబంధించి నిదర్శనాలు చూపమని అడగడం.

ప్రవక్త క్రీస్తు ప్రదర్శించిన మహత్యాలు

ప్రవక్త క్రీస్తుకు అల్లాహ్ మహత్యాలు ప్రదర్శించే శక్తిని ప్రసాదించాడు. ఆయన మట్టితో ఒక పక్షిని తయారు చేసి దానిలోకి ఊదారు. అల్లాహ్ అభీష్టంతో ఆ మట్టిపక్షి ప్రాణం పోసుకుంది. ఆయన గ్రుడ్డివారికి చూపు వచ్చేలా చేశారు. చెవిటివారికి వినికిడి శక్తి వచ్చేలా చేశారు. కుష్ఠువ్యాధిగ్రస్తులకు వ్యాధి నయమయ్యేలా చేశారు. మరణించిన వారు ప్రాణం పోసుకునేలా చేసి చూపించారు. ఇవన్నీ ఆయన అల్లాహ్ అభీష్టంతో మాత్రమే చేసి చూపించగలిగారు. ఇన్ని మహత్యాలు చేసి చూపించినప్పటికీ చాలా మంది ఆయన్ను విశ్వసించే బదులు ఆయన్ను మంత్రగానిగా ఆరోపించారు. అయితే ప్రవక్త క్రీస్తు బోధనలు కొందరిని ఆకట్టుకున్నాయి. ఒక చిన్న సమూహం ఆయన బోధనలను విని ఆయన్ను విశ్వసించింది.

కొంతకాలం తర్వాత ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) తన వ్యతిరేకులను బహిరంగంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు పండుగ రోజు. యూద మత పెద్దలు అందరూ జెరుసలేంలో సమావేశమై ఉన్నారు. పెద్ద బహిరంగ సభను ఉద్దేశించి వారు ప్రసంగించడానికి వచ్చారు. ఆ బహిరంగ సభను ఉద్దేశించి ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) ప్రసంగించారు. అయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ పరిణామం యూద మత పెద్దలను తీవ్రంగా అసహనానికి గురిచేసింది. ఎలాగైనా ప్రవక్త క్రీస్తును వదిలించుకోవాలని భావించారు.

కాని బహిరంగంగా ఆయనకు కీడు తలపెట్టడం వారి వల్ల కాలేదు. ఎందుకంటే, ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన్ను అభిమానిస్తున్నారు. అందువల్ల ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పన్నడం ప్రారంభించారు.

(చదవండి దివ్యఖుర్ఆన్ : 17:16-36, 2:87, 3:45-60. 4:156-159/ 171-172, 5:17/46/72/75, 19:30-31, 23:15, 63:57-65, 61:6-14, 5:109-120, 57:26-27, 9:111)

విందులో మహత్యం

తన శిష్యులతో సహా ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) ప్రతి పట్టణాన్ని సందర్శించి అల్లాహ్ సందేశాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆయన శిష్యులు సంఖ్యలో చాలా తక్కువ మంది కాని ఆయన కోసం దృఢంగా నిలబడే మద్దతు దారులు. ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) అన్యాయాలకు వ్యతిరేకంగా తన గొంతు విప్పారు.

ఈ ప్రయాణాల్లో ఒకసారి ఒక బంజరు భూమికి చేరుకున్నారు. వారు అలసిపోయి ఉన్నారు. ఆకలిదప్పులతో ఉన్నారు. ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) వారి ధైర్యస్థయిర్యాలను పెంచడానికి తన దైవిక ఉద్యమం గురించి వారికి సమగ్రంగా వివరించడం ప్రారంభించారు. ఆ విధంగా వారు ఆకలిదప్పులను మరచిపోయేలా చేయాలనుకున్నారు. కాని కేవలం నోటి మాటల ద్వారా ఆకలిదప్పుల బాధలు తీరడం లేదు. వారు ఏదైనా మహత్యం చూపించాలని కోరారు. ఆహార పదార్థాలు వడ్డించిన ఒక ಬಲ್ಲ తమ ముందుకు వచ్చేలా చేయాలని కోరారు. వారు ఈ కోరిక కోరడం వెనుక ఎలాంటి మూర్ఖపు ఆలోచనలు లేవు, వారి విశ్వాసంలోనూ ఎలాంటి లోపం లేదన్న విషయం ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) గ్రహించారు. వాళ్ళు కేవలం అల్లాహ్ శక్తిసామర్థ్యాలను మరోసారి చూడాలనుకుంటున్నారు. ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) సృష్టికర్తను వేడుకుంటూ, ఒక మహత్యం చూపించాలని అభ్యర్థించారు. అల్లాహ్ ఆయన ప్రార్థనను ఆలకించాడు. మరుక్షణం వారి ముందు ఆహార పదార్థాలు వడ్డించిన ఒక బల్ల ప్రత్యక్షమయ్యింది. ఇది తనకు, తన శిష్యులకు ఒక పరీక్ష అవుతుందేమో అని ఆయన భయపడ్డారు. ఈ మహత్యం తనకు, తన శిష్యులకు ఒక కారుణ్యంగా చేయాలని ఆయన అల్లాహ్ కు మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత వారంతా ఆ ఆహార పదార్థాలను కడుపారా భుజించారు. ఈ విందులో చుట్టు ప్రక్కల ప్రజలు చాలా మంది వచ్చి పాల్గొన్నారు. అందరూ తిన్నారు. దైవికంగా అక్కడకు వచ్చిన ఆ ఆహార పదార్థాలు ఎంత మంది తిన్నా తరగలేదు. ఆ తర్వాత కూడా చాలా కాలం వరకు ఆ మహత్యం గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పు కున్నారు. ఈ మహత్యం తర్వాత చాలా మంది ప్రవక్త క్రీస్తు సందేశాన్ని విశ్వసించారు. (చదవండి దివ్యఖుర్ఆన్ : 5:112-115)

అబద్ధపు ఆరోపణలు

యూద మత పెద్దల వాదనలను తప్పుగా నిరూపిస్తూ, సత్యమేదో అసత్యమేదో తేటతెల్లం చేస్తుండడంతో ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) వారికి కంటగింపయ్యారు. ఆయన పట్ల వారు వైరం పెంచుకున్నారు. ఆయన వాదనలకు వ్యతిరేకంగా వారు సమర్థవంతంగా వాదించలేకపోయారు. అందువల్ల ఆయన్ను ఒక మోసగానిగా, ఒక అబద్ధాలకోరుగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆ ప్రాంతం పాలకుని వద్ద ఆయనకు వ్యతిరేకంగా ఒక తప్పుడు ఫిర్యాదు నమోదు చేశారు. అప్పట్లో అక్కడ రోమన్ ప్రభుత్వం పాలిస్తోంది. ప్రవక్త క్రీస్తు ప్రజలను రెచ్చగొడుతున్నారని, విదేశీ పాలకులపై తిరగబడేలా చేస్తున్నారని, ఆయన చర్యలు యూద ధర్మంపై తిరుగు బాటుకు దారితీస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఆయన్ను ఒక మంత్రగానిగా ఆరోపించారు. మంత్రతంత్రాలు చేస్తున్నాడన్నారు.

ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) ప్రదర్శించిన అనేక మహత్యాలను చూసిన తర్వాత కూడా వారు తమ వైఖరిని మార్చుకోలేదు. మోసాలకు, ద్రోహాలకు పూనుకున్నారు. ఆయన్ను చంపేయాలని భావించారు. రోమన్ పాలకులను కూడా ఈ పరిణామాలు కలవరానికి గురిచేశాయి. ప్రజల్లో సమానత్వం వంటి విప్లవాత్మక భావాలు వ్యాపించడాన్ని వాళ్ళు కూడా సహించలేరు. చివరకు ప్రవక్త క్రీస్తును నిర్బంధించడానికి వాళ్ళు అంగీకరించారు. కాని ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) వారికి ఎక్కడ కూడా కనబడలేదు. ఆయన దైవసందేశాన్ని ప్రచారం చేస్తూ దూరప్రదేశాల్లో తిరుగుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా బహిరంగంగా లేదా రహస్యంగా ఆయన ప్రచారం కొనసాగుతోంది.

మోసం

ప్రవక్త క్రీస్తు ఆచూకి చెప్పినవారికి భారీ బహుమానం ఇస్తామని పాలకులు ప్రలోభ పెట్టారు. ఈ ప్రలోభానికి ప్రవక్త క్రీస్తు శిష్యుల్లో ఒకడైన ‘జూడా’ లొంగి పోయాడు. తన గురువుకు ద్రోహం చేయడానికి సిద్ధమయ్యాడు. తననెవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి వేషం మార్చుకుని రోమన్ సైనికులతో కలసి ప్రవక్త క్రీస్తును వెదకడంలో పాలుపంచుకున్నాడు. చాలా సేపు వెదకిన తర్వాత చీకటి పడుతున్న సమయంలో ప్రవక్త క్రీస్తు రాత్రి గడపడానికి బస చేయాలనుకున్న తోటకు చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని రోమన్ సైనికులు చుట్టుముట్టడాన్ని చూసిన క్రీస్తు శిష్యులు పారిపోయారు. ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) వంటరిగా శత్రువుల వలయంలో మిగిలిపోయారు.

కాని అల్లాహ్ ఆయన్ను వదలిపెట్టలేదు. ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) అక్కడ సైనికులకు ఎవరికీ కనబడకుండా అదృశ్యమయ్యేలా చేశాడు అల్లాహ్. క్రీస్తు కోసం వెదుకుతున్న సైనికులకు ఒక వ్యక్తి కనబడ్డాడు. అతని రూపురేఖలు క్రీస్తును పోలి ఉన్నాయి. వారు తక్షణం అతన్ని నిర్బంధించారు. ఈ వ్యక్తి మరెవరో కాదు, స్వయంగా జూడాయే. అతను ఎంతగా నిర్ఘాంతపోయాడంటే, తనను అన్యాయంగా నిర్బంధిస్తున్నారని చెప్పడానికిగాని, తన వాదన వినిపించడానికి గాని అతని నోరు పెగలలేదు. ప్రవక్త క్రీస్తుకు ద్రోహం చేసిన ఫలితమిది. ఆ విధంగా జూడా కుట్ర బెడిసికొట్టేలా చేశాడు అల్లాహ్. సైనికులు అతన్ని ఈడ్చుకుని శిలువ వేసే ప్రదేశానికి తీసుకుపోయారు. చిత్రవధకు, పరాభవంతో కూడిన మరణానికి గురయ్యాడతను. కాగా ప్రవక్త క్రీస్తును అల్లాహ్ కాపాడాడు.

గ్రహించవలసిన పాఠాలు

తీర్పుదినాన మానవులను మళ్ళీ బ్రతికించడం జరుగుతుందన్న విషయానికి ఒక నిదర్శనంగా క్రీస్తు ప్రవక్తను తండ్రి లేకుండా సృష్టించడం జరిగింది. ప్రవక్త క్రీస్తు పుట్టుకకు ముందు యూదుల ఒక గ్రూపు మరణానంతరం మళ్ళీ బ్రతికించడం జరగదని వాదించేది. ఈ గ్రూపును సెడ్యూసీస్ అనేవారు. ల్యూక్, అధ్యాయం 20, వాక్యం 27 ప్రకారం, ‘అప్పుడు కొందరు సెడ్యూసీలు – మృత్యువుతో జీవితం ముగిసి పోతుందని విశ్వసించేవారు – మరణానంతరం మళ్ళీ బ్రతికించడం లేదన్నారు).

గత కాలాలకు చెందిన ప్రవక్తలపై అవతరించిన క్రింది గ్రంథాలతో పాటు ఇంజీల్ గురించి కూడా దివ్యఖుర్ఆన్లో ప్రస్తావనలు ఉన్నాయి. ప్రస్తుత బైబిల్ వీటి నుంచి ఏర్పడిందే! బైబిల్లో పాతనిబంధన, కొత్త నిబంధనలు ఉన్నాయి. యూద మతానికి సంబంధించిన పాత నిబంధనను మాత్రమే యూదులు అంగీకరిస్తారు. ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) యూద ప్రవక్తలలో చివరి వారయినప్పటికీ కొత్త నిబంధనను వాళ్ళు అంగీకరిం చరు.

  1. తౌరాత్ (పాత నిబంధన… మూసా ప్రవక్త (అలైహిస్సలాం) పై అవతరించిన గ్రంథం)
  2. జబూర్ (డేవిడ్ పాటలు, పాత నిబంధనలో ఉన్నవి)
  3. ఇంజీల్ (గ్రీకులో ఇవాంజిల్, ఇంగ్లీషులో గోస్పెల్) ప్రవక్త క్రీస్తుపై అవతరించింది. దీనిని క్రయిస్తవులు కొత్త నిబంధనగా పేర్కొంటారు.

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఈ గ్రంథాలలో దివ్య ఖుర్ఆన్ ప్రస్తావనలు వేటిని సూచిస్తున్నాయో చెప్పలేము. అయితే ఈ గ్రంథాల భాగాలు మాత్రమే దొరుకుతున్నాయి. ఈ గ్రంథాలు సంపూర్ణంగా, మార్పులు లేకుండా ఉన్నాయని చెప్పే పరిస్థితి లేదు. ఇందులో అనేక వైరుధ్యాలు మనకు కనబడతాయి. కాని దివ్యఖుర్ఆన్ నేటికి 1400 సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా భద్రంగా ఉంది.

కొత్త నిబంధనకు సంబంధించి ఇద్దరు మార్క్, లూకాలు నిజానికి ప్రవక్త క్రీస్తును అయన జీవిత కాలంలో అనుసరించిన పన్నెండు మంది శిష్యుల లోని వారుకాదు. ( గోస్పెల్ ఆఫ్ బార్నబాస్ సహా) క్రీస్తు శిష్యులలో కొందరి రచనలను తదుపరి కాలాల క్రయిస్తవులు సందేహాస్పదమైన రాతలుగా తిరస్కరించారు.

జె.సి. ఫెంటాన్, యార్క్షైర్లోని వెంత్వర్తక్కు మాజీ మతాధికారి. తర్వాత ఆయన లీచ్ఫీల్డ్ థియోలాజికల్ కాలేజికి వెళ్ళారు. ఆయన రాసిన పుస్తకం “సెయింట్ మాథ్యూస్” 1963లో ప్రచురిత మయ్యింది. పెంగ్విన్ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అందులో ఆయన ఇలా రాశారు: శిలువ వేసిన తర్వాత నుంచి గోస్పెల్స్ రాయబడిన సమయం వరకు గడచిన కాలంలో కొంత మంది ప్రారంభ కాలాలకు చెందిన క్రయిస్తవులు క్రీస్తు శిలువ వేయబడలేదని, ఆయనకు బదులు మరొకరు శిలువ వేయబడ్డారని విశ్వసించారు. క్రీస్తు శిలువపై మరణించలేదని విశ్వసించే క్రయిస్తవ వర్గం కూడా ఉంది. వారి అభిప్రాయం ప్రకారం, క్రీస్తు శిలువ నుంచి సజీవంగా బ్రతికి క్రిందికి వచ్చారు. 19వ శతాబ్దం ప్రారంభంలో కొందరు క్రీస్తు శిలువపై నీరసపడ్డారని, తర్వాత రాతి సమాధి నుంచి బయటకు వచ్చారని కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించారు.

ప్రవక్త క్రీస్తు ప్రత్యక్ష శిష్యుల్లో ఒకరు రాసిన ‘గోస్పెల్ ఆఫ్ బార్నబాస్‘ను కొత్త నిబంధన నుంచి తొలగించడం అన్నది క్రీస్తు తర్వాత చాలా శతాబ్దాలకు జరిగింది. ఈ గోస్పెల్ ఒరిజినల్ కాపీ వియన్నాలో ఇంపీరియల్ లైబ్రరీలో భద్రపరచబడి ఉంది. లాన్సేల్, లారా రాగ్లు అనువదించిన ప్రతి ఇది. ఆక్స్ఫర్డ్ ప్రెస్ దీనిని 1907లో ప్రచురించింది. ఈ పుస్తకం 481వ పేజీలో ఈ విషయం స్పష్టంగా రాయబడింది. జూడా రూపురేఖలు సమయంలో పూర్తిగా ప్రవక్త క్రీస్తును పోలి ఉన్నందు వల్ల అతన్ని క్రీస్తుకు బదులు శిలువ వేయడం జరిగిందని బార్నబాస్ అన్నారు. ఈ మాటలు క్రీస్తు శిలువ వేయబడడాన్ని ఖండిస్తున్నాయి.

ప్రాచీన కాలానికి చెందిన ‘డెడ్ సీ స్క్రోల్స్‘ను ఒక అరబ్బు పశువుల కాపరి ఒక గుహలో కనుగొన్నాడు. వీటిని కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా దాదాపు నలభై సంవత్సరాల పాటు రహస్యంగా ఉంచడం జరిగింది. వీటిని పలస్తీనాకు చెందిన యూదులు రాశారని తెలుస్తోంది. ప్రవక్త క్రీస్తు జీవిత కాలానికి రెండు శతాబ్దాల ముందు నుంచి ప్రవక్త క్రీస్తు జీవితకాలం వరకు వ్రాయబడిన పత్రాలివి. బైబిలు సంబంధించిన అతిపురాతనమైన వ్రాతప్రతులివే.

హిబ్రూ యూనియన్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ బెన్ జిమ్ వాకోల్డర్, మార్టిన్ అబెక్ట్లు ఈ వ్రాతప్రతులను రహస్యంగా ఉంచడాన్ని సవాలు చేసి వాటిని బయటకు తీయడానికి కృషిచేశారు. ఈ వ్రాతప్రతుల ద్వారా మనకు మార్పులు చేర్పులకు గురికాని పత్రాలు దొరకవచ్చు.)

“వారు ఆయనను చంపలేదు, శిలువపై ఎక్కించనూ లేదు. వారు భ్రమకు గురిచేయబడ్డారంతే!” (దివ్యఖుర్ఆన్ 4 : 157)

ముస్లిములు ఇతర మతాల గురించి తెలుసుకోవడం ఎంతయినా అవసరం. ఆ విధంగా వారు ఇస్లామేతర విశ్వాసాలకు దూరంగా ఉండే అవకాశం లభిస్తుంది. అంతేకాదు, దివ్యఖుర్ఆన్ ఇతర మతాలను చులకన చేయడాన్ని నిషేధించిందన్న వాస్తవాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి.

ప్రవక్త క్రీస్తు (అలైహిస్సలాం) ఒక కొత్త మతాన్ని దేన్నీ తీసుకురాలేదు. ఆయన ఇస్రాయీల్కు చెందిన చెల్లాచెదరయిన తెగల వద్దకు పంపబడ్డారు. మూసా ప్రవక్త (అలైహిస్సలాం) తీసుకు వచ్చిన దైవచట్టాలను ధృవీకరించడానికి ఆయన పంపబడ్డారు. ఈ విషయం క్రయిస్తవ గ్రంథాలలోను నిర్ధారితమయ్యింది. ఆయన ఎన్నడూ తాను దేవుణ్ణని చెప్పుకోలేదు. త్రిత్వాన్ని ఎన్నడూ ప్రచారం చేయలేదు. దైవం మానవ కుమారునిగా రావడం గురించి కాని, లేక ‘మౌలిక పాపం’ (ఒరిజినల్ సిన్) గురించి కాని ఆయన చెప్పలేదు. కాని ఆయన బోధనలను తర్వాతి కాలాల్లోని మత పెద్దలు మార్చి వేశారు. పాల్ ముఖ్యంగా ఈ మార్పులు చేశారు. పునరుజ్జీవం, దైవసామ్రాజ్యం, శిలువ వగైరా పదాలకు ఆయన కొత్త అర్థాలు ఇచ్చారు.

(ఈ అనుచరులకు బహుశా బైబిల్ నుంచే అందుకు కావలసిన ప్రేరణ లభించి ఉంటుంది. బైబిల్లో దైవాన్ని సాధారణ మనిషి స్థాయికి తీసుకొచ్చిన ప్రస్తావనలు చాలా ఉన్నాయి. మామ్ మైదానాల్లో ప్రవక్త అబ్రహాం దేవుని కాళ్ళు కడిగి విందు భోజనం వడ్డించిన ప్రస్తావన అలాంటిదే. జెనెసిస్ : 18:1-8. ఇక్కడ సబ్ హెడింగ్లో ముగ్గురు దైవదూతలు దేవుని వెంబడి వచ్చారన్న విషయం ఉంది. ఇక్కడ దేవుడు వచ్చిన విషయం స్పష్టంగా ప్రస్తావించబడింది. ఆధునిక సంచికల్లో ఈ కథనం విభిన్నంగా ఉంది. జెనెసిస్ 32:24లో ప్రవక్త జాకబ్ భౌతికంగా దేవునితో మల్లయుద్ధం చేసిన ప్రస్తావన ఉంది. ఇక్కడ మళ్ళీ సబ్డింగ్ క్రింద దైవదూత అని ఉంది. కాని టెక్స్ట్ ఈ ప్రస్తావన లేదు. పైగా ప్రవక్త జాకబ్ “నేను దేవుడిని ముఖాముఖి చూశాను. నా జీవితం రక్షణ పొందింది” అన్న మాటలు ఉన్నాయి. బహుశా ఇవి మల్లయుద్ధం తర్వాత చెప్పిన మాటలు కావచ్చు.)

త్రిత్వం

క్రయిస్తవ విశ్వాసం ప్రకారం, త్రిత్వం అంటే దైవానికి సంబంధించిన మూడు రూపాలు. దైవం, దైవకుమారుడు, పరిశుద్ధాత్మ. దేవునికి ఈ మూడు రూపాలున్నాయని విశ్వసిస్తారు. ప్రతీ రూపం దేనికదే సమగ్రమైందని, మళ్ళీ ఈ మూడు ఒక్కటే అని అంటారు. ఈ విశ్వాసం ప్రకారం, క్రీస్తు దేవుని కుమారుడు. దేవుని వారసుడు. పూర్తిగా దేవుని వంటివాడు. (కొలోసియన్లు : 1:15-20, హిబ్రూస్, 1:1-14)

ఇస్లామీయ విశ్వాసం ఏమంటే, దేవుడు ఎవరికీ జన్మించలేదు. ఆయనకు సంతానం లేదు. ఆయనే సర్వస్వాన్ని సృష్టించాడు. ఆయన సాటిలేనివాడు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన వంటివాడు మరెవ్వరూ లేరు. దేవునికి సహవర్తులుగా లేదా భాగస్వాములుగా ఇతరులను నిలబెట్టడం మహాపాపం. దేవుని వద్ద మధ్యవర్తులు లేరు. ఎవరూ ఆయన ఎదుట ఎవరికీ సిఫారసు చేయలేరు. దైవవిశ్వాసం, మంచి పనులు తప్ప మరేవీ ఆయన సమక్షంలో మనిషికి ఉపయోగపడవు.

దైవకుమారుడు

ప్రవక్త క్రీస్తును దేవుని కుమారుడుగా విశ్వసిస్తారు. ఈ విశ్వాసం అను వాదాల్లో వచ్చిన పొరపాటు వల్ల జనించింది. ప్రవక్త క్రీస్తు మరణించిన తర్వాత దాదాపు ముప్పయి సంవత్సరాల వరకు గోస్పెల్స్ సంకలనం చేయబడ లేదని క్రయిస్తవ పండితులే అంగీకరిస్తున్నారు. ప్రారంభంలో గోస్పెల్స్ గ్రీకు భాషలో వ్రాయబడ్డాయి. ఇందులో కొన్ని మౌఖికంగా అందినవి, కాగా కొన్ని రాతప్రతుల ద్వారా లభించినవి. రాతప్రతుల ద్వారా లభించినవి ఆర్మాయిక్ భాషలో ఉన్నవి. ఈ భాషను అప్పటి యూదులు మాట్లాడేవారు. కాని ఇప్పుడు ఆ మూలప్రతులేవీ అందుబాటులో లేవు. కొత్త నిబంధనలో కూడా కొన్ని ప్రవక్త క్రీస్తు అనుచరులు చెప్పినవి, కొన్ని కొత్తవారు చెప్పినవి. అందువల్ల వీటి మధ్య వైరుధ్యాలున్నాయి.ప్రవక్త క్రీస్తు(అలైహిస్సలాం)పై అవతరించిన అసలు గ్రంథం కానీ, బైబిలు ప్రవక్తల పై అవతరించిన దైవసందేశాలు కాని ఏవీ కూడా నేడు లభించడం లేదు. (అయితే రోమన్ కేథలిక్ బైబిల్కు, ఇతర ప్రతులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది).

పౌల్ ఈ అనువాదం చేసినప్పుడు, గ్రీకు భాషలో ఉన్న “దైవదాసుడు” అన్న పదాన్ని (ఈ పదాన్ని ప్రవక్త క్రీస్తు ఎక్కువగా ఉపయోగించారు) అనువదించేటపుడు ఈ పొరపాటు దొర్లింది. ఈ పదానికి గ్రీకు భాషలో “దేవుని దాసుడు” అన్న అర్థంతో పాటు “దేవుని కుమారుడు” అన్న అర్థం కూడా ఉంది. పౌల్ ఇందులో రెండవ అర్థాన్ని స్వీకరించి అనువాదం చేశాడు. ఈ పొరపాటు తర్వాతి కాలాల్లో క్రయిస్తవ విశ్వాసాలను, దైవభావనను మార్చివేసింది.

టైమ్ పత్రిక 1988 ఆగష్టు 15 సంచికలో వచ్చిన వ్యాసం ఇక్కడ ప్రస్తావించ దగింది. ఆ వ్యాసంలో ఈ పంక్తులు ఉన్నాయి. “క్రీస్తు, క్రయిస్తవ మతాల చరిత్రలను మనం పోల్చి చూసినట్లయితే మనకు ఇద్దరు క్రీస్తులు ఉన్నట్లు అనిపిస్తుంది. చారిత్రక క్రీస్తు, ఏకదైవారాధనను బోధించిన ప్రవక్త ఒకరు కాగా పౌల్ తదితరులు సృష్టించిన పౌరాణిక క్రీస్తు మరొకరు. ప్రవక్త క్రీస్తు బోధనలను మార్చి, మార్పులు చేర్పులకు గురిచేసి ఈ కొత్త క్రీస్తును సృష్టించడం జరిగిందని ఎన్. ఓస్లింగ్ అధ్యయనం ధృవీకరిస్తోంది.”

ఈ ఆరోపణ కేవలం ఒక్క పౌల్ మీద మాత్రమే కాదు, పీటర్పై కూడా ఈ ఆరోపణ ఉంది. ఆయన దృక్పథం… ఆయన ఆకలితో ఉన్నప్పుడు ఏర్పరచుకున్న దృక్పథం ప్రారంభ కాలాల్లోని క్రయిస్తవుల ఆహార నియమా లను మార్చివేసింది. పాత దైవగ్రంథాల్లో నిషిద్ధమైన ఆహారాన్ని నేడు క్రయిస్తవులు అనుమతించబడిన ఆహారంగా మార్చుకోవడానికి కారణ మయ్యింది. (చూడండి : యాక్ట్ 10:9-16, 11:5-10). ఈ మార్పులు ప్రవక్త క్రీస్తు జీవన విధానానికి విరుద్ధమైనవి.

బైబిల్ ఇలాంటి ఆహారాన్ని నిషేధిస్తుందని, దివ్యఖుర్ఆన్ 5వ సూరా 4వ ఆయతులో సూచించిన విధంగా జుబహ్ చేయబడిన ఆహారాన్నే బైబిల్ కూడా బోధిస్తుందని తెలిస్తే ఆలోచించే క్రయిస్తవులు ఆశ్చర్యపోక తప్పదు. చూడండి లెవిటాకస్ : 11:7, 17:14, డైటరానమీ :12:2, 14:18, యాక్ట్స్ : 15:20)

పీటర్ వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. మాథ్యూస్ అధ్యాయం 16, వాక్యం 18లో ఆయన తనను క్రీస్తు చాలా ప్రశంసించినట్లు, దేవుని దీవెన పొందిన వానిగా పొగిడినట్లు, క్రీస్తు కట్టబోయే చర్చికి పునాదిరాయి వంటి వానిగా అభివర్ణించినట్లు చెబుతాడు. కాని అయిదు వాక్యాల తర్వాత క్రీస్తు అతడిని తీవ్రంగా ఖండిస్తూ, సాతానుగా, తనను దారితప్పించిన వానిగా వ్యాఖ్యానిస్తాడు.)

దివ్యఖుర్ఆన్లోని 9:30-31 ఆయతులో దేవుడు ఈ విషయాన్ని స్పష్టంగా విశదీకరించాడు:

“ఉజైర్ అల్లాహ్ కుమారుడు” యూదులు అంటారు. “మసీహ్ అల్లాహ్ కుమారుడు” అని క్రైస్తవులు అంటారు. వారికి పూర్వం అవిశ్వాసంలో పడివున్న వారి మాటలను అనుకరిస్తూ వారు తమ నోటితో అనే ఈ మాటలు నిరాధారమైనవి. దేవుని దెబ్బ వారిపై పడుగాక! వారెలా మోస పోతున్నారు! వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. వాస్తవానికి, ఒకే దేవుని దాస్యం తప్ప మరెవరి దాస్యాన్నీ చేసే ఆజ్ఞ వారికి ఇవ్వబడలేదు. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన వాడెవడూ లేడు. ఆయన పరిశుద్ధుడు. వారు పలుకుతున్న బహుదైవత్వ మాటలకు అతీతుడు.” (ఖుర్ఆన్ 9 : 30 – 31)

పునరుజ్జీవం

క్రయిస్తవ విశ్వాసం ప్రకారం, ప్రవక్త క్రీస్తును ఉంచిన రాతి సమాధి తర్వాత ఖాళీగా కనబడింది. ఆయన మరణించి మళ్ళీ సజీవుడయ్యారు. ఆ పిదప స్వర్గానికి అధిరోహించారు. గత అధ్యాయంలో దీని గురించి దివ్యఖుర్ఆన్ ఏమంటుందో తెలుసుకున్నాము)

అసలు పాపం

“అసలు పాపం” అన్న సిద్ధాంతం ప్రకారం, యావత్తు మానవాళి పాపం కారణంగా జన్మించింది. ఆదిపురుషుడు ఆదమ్, ఆయన సంతానం శాశ్వత పాపానికి గురయ్యారు. ఎందుకంటే, ఆదమ్, ఆయన భార్య హవ్వాలు నిషిద్ధ ఫలాన్ని తిన్నారు కాబట్టి. ఈ పాపం నుంచి విముక్తి పొందాలంటే మనిషి ఒక మత పెద్ద ద్వారా బాప్తిజం పొందక తప్పదు. లేకపోతే మనిషి నరకంలో శిక్ష అనుభ వించవలసి ఉంటుంది. కొన్ని చర్చిల ప్రకారం, మనిషి తన పాపాలను మత పెద్ద ముందు అంగీకరించడం కూడా తప్పనిసరి.

ఈ విషయంలో మనం ఇస్లామీయ విశ్వాసాన్ని పరిశీలిస్తే, మనిషి ఎలాంటి పాపం లేకుండా పాపరహితుడిగా జన్మిస్తాడు. మనిషి ఆచరించిన చెడు కర్మల వల్ల మాత్రమే మనిషి పాపాత్ముడవుతాడు. కేవలం అల్లాహ్ మాత్రమే మనిషిని క్షమించగలడు. మనిషి ప్రత్యక్షంగా అల్లాహ్ కు మొరపెట్టుకోగలడు. క్షమాభిక్ష అర్థించగలడు. పశ్చాత్తాపపడడం, మంచి పనులు చేయడం వల్ల మనిషి క్షమాభిక్ష పొందగలడు. అల్లాహ్ అపార కృపాశీలుడు, పరమ దయామయుడు. ముస్లిముకు మత పెద్దల ద్వారా బాప్తిజము పొందవలసిన అవసరం లేదు. మతపెద్దల ముందు అంగీకరించవలసిన అవసరమూ లేదు. ముస్లిమ్ ఎవరైనా తన పశ్చాత్తాపం తానే స్వయంగా అల్లాహ్ కు ప్రకటించవచ్చు.

క్రైస్తవ విశ్వాసం కొన్ని ప్రశ్నలకు జన్మనిస్తోంది. అవి ఏమంటే:

తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్లలకు శిక్ష విధిస్తారా?

తన సృష్టి అయిన మానవుడు చేసిన ఒక చిన్న పొరపాటును ఏమాత్రం క్షమించలేని వాడా దేవుడు?

ఎందుకు అనేక సంవత్సరాల తర్వాత దేవునికి తన స్వంత కుమారుడు ఉండాలన్న ఆలోచన వచ్చింది? అనేక సంవత్సరాల తర్వాత కానీ మానవాళి పాపాల ప్రక్షాళనకు కావలసిన రక్తం పారించడానికి తన స్వంత కుమారుణ్ణి అత్యంత అమానుషంగా హత్యకు గురయ్యే పరిస్థితి కల్పించ వలసి వచ్చిందా?

ప్రవక్త క్రీస్తు మన పాపాల కోసం మరణించి ఉన్నట్లయితే, ఆయన ద్వారానే సాఫల్యం సాధ్యమయ్యేదయితే, ఆయనకన్నా ముందు పుట్టి గతించిన మానవాళి సాఫల్యం ఎలా సాధ్యం? అంటే ఆయనకు ముందు పుట్టిన ప్రజలు, ఆయనకన్నా ముందు వచ్చిన ప్రవక్తలు అందరికీ శాశ్వత పాపం నుంచి విముక్తి లేదా?