ప్రవక్త ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

యూట్యూబ్ ప్లే లిస్ట్ – ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2lMvZtpD3RlAERoC9GN_WL

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)

فَجَعَلَهُمْ جُذَاذًا إِلَّا كَبِيرًا لَّهُمْ لَعَلَّهُمْ إِلَيْهِ يَرْجِعُونَ

“ఆ తరువాత ఇబ్రాహీమ్ ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు ముక్కలుగా పగులగొట్టాడు. అయితే పెద్ద విగ్రహాన్ని మాత్రం విడిచి దానివైపు పెట్టాడు. వారంతా మరలటానికే (అలా చేశాడు). ” (ఖుర్ఆన్ 21: 58)

బాబిలోనియా ప్రజలు సెమెటిక్ జాతికి చెందిన ప్రజలు. భోగభాగ్యాల జీవితం గడిపేవారు. విగ్రహాలను చెక్కి వాటిని పూజించేవారు.

కనాన్ కుమారుడు నమ్రూద్ వారి పాలకుడు. పరమ స్వార్థపరుడు. నిరంకుశుడైన నియంత. ప్రజలను బెదిరించి, భయపెట్టి తన చెప్పుచేతల్లో ఉంచుకున్నాడు. తన పాలనలో ప్రజలు భోగ భాగ్యాలతో జీవిస్తున్నారన్న విషయం నమ్రూద్ కి బాగా తెలుసు. ప్రజలు విలాసవంతమైన జీవితం తప్ప మరేదీ పట్టించుకోరన్నది కూడా అతనికి తెలుసు. ప్రజలు ఆరాధిస్తున్న విగ్రహాలకన్నా తానే గొప్పవాడినని భావించాడు. ఎందుకంటే విగ్రహాలు కనీసం చూడలేవు, వినలేవు, ఆలోచించలేవు, అనుభూతి చెందలేవు, ఎవరికీ రక్షణ కల్పించలేవు, ఎవరినీ సంపన్నులుగా లేదా నిరుపేదలుగా మార్చలేవు, కాని తాను ఎవరినైనా ఏమైనా చేయగల అధికారాలు కలిగిన వాడు. ఈ ఆలోచన కలిగిన వెంటనే నమ్రూద్ తానే అసలైన దేవుడినని ప్రకటించుకున్నాడు. విలాసవంతమైన జీవితం గురించి తప్ప మరి దేని గురించీ పట్టించుకోని ప్రజలు అతడు చెప్పినట్లు అతనే దేవుడని ఒప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో పద్దాన్ అరమ్ అనే పట్టణంలో ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) జన్మించారు. అల్లాహ్ ఆయనకు ఎంతో వివేకాన్ని, విజ్ఞతను, వివేచనను ప్రసాదించాడు. ఆయనకు సత్యమార్గాన్ని చూపించాడు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ప్రజలకు నిజమైన దేవుడిని ఆరాధించాలని బోధించడం ప్రారంభించారు. ఏకైక దేవుడైన అల్లాహ్ నే ఆరాధించాలనీ, విగ్రహాలను ఆరాధించడంలో విజ్ఞత లేదని ప్రచారం చేయసాగారు.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) అల్లాహ్ పట్ల దృఢమైన విశ్వాసం కలిగినవారు. సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వశక్తిమంతుడన్న బలమైన నమ్మకం కలిగినవారు. తనకు అల్లాహ్ తరఫున అందిన సందేశాన్ని హృదయపూర్వకంగా విశ్వసించేవారు. మనుష్యులందరూ మరణానంతరం ఒక రోజున మళ్ళీ బ్రతికించబడతారనీ, వారు తమ కర్మలకు జవాబు చెప్పుకోవలసి ఉంటుందని పూర్తి విశ్వాసం కలిగిన వారు. అయితే ఆయనకు మరణానంతరం మనిషి మళ్ళీ ఎలా బతుకుతాడో కళ్ళారా చూడాలన్న కుతూహలం ఉండేది.

పక్షుల మహత్యం

ఆయన అల్లాహ్ ని వేడుకుంటూ మరణానంతరం మళ్ళీ లేపబడడం అన్నది ఎలా జరుగుతుందో చూపించాలని ప్రార్థించారు. నాలుగు పక్షులను పట్టుకుని వాటిని కోసి వాటి శరీర భాగాలను కలగలపమని అల్లాహ్ ఆయన్ను ఆదేశించాడు. అలా కలగలిపిన శరీర భాగాలను నాలుగు వాటాలుగా చేసి వాటిని వేరు వేరు కొండలపై పెట్టాలని నిర్దేశించాడు. ఆ పిదప ఆ పక్షులను అల్లాహ్ పేరుతో పిలువాలని చెప్పాడు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) అల్లాహ్ ఆదేశం ప్రకారం చేశారు. ఆయన పిలిచిన వెంటనే కలగలిసిన శరీర భాగాలు ఏ పక్షివి ఆ పక్షివిగా వేరు పడ్డాయి. పక్షులు బ్రతికి ఎగిరి వచ్చాయి. అలాంటి అద్భుతమైన మహిమ చూసిన వ్యక్తికి మనిషి మరణానంతరం మళ్ళీ లేపబడతాడన్న విషయంలో ఎలాంటి సందేహం ఉండే ఆస్కారమే లేదు. అయితే అల్లాహ్ కు ఏది చేయడమైనా కష్టం కాదు. ఆయన ఏదయినా చేయదలిచితే “అయిపో” అంటాడు. అంతే ఆ పని అయి పోతుంది (దివ్యఖుర్ఆన్ 2:260).

తండ్రీ కుమారుల వాగ్వివాదం

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తండ్రి పేరు ఆజర్. అతను విగ్రహారాధకుడు మాత్రమే కాదు, విగ్రహాలను చెక్కి అమ్మేవాడు. ఒక మంచి కుమారుడిగా తాను తన తండ్రికి ఈ పనిలోని అనౌచిత్యం గురించి చెప్పడం తన బాధ్యతగా ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) భావించారు. ఆ విధంగా తన తండ్రిని అల్లాహ్ ఆగ్రహం నుంచి కాపాడాలనుకున్నారు. కాని ఈ విషయాన్ని చాకచక్యంగా, తండ్రి బాధపడకుండా చెప్పాలనుకున్నారు. ఆయన తన తండ్రి ఆరాధిస్తున్న విగ్రహాల విషయంలో ఎగతాళి చేయలేదు. తండ్రి పట్ల తనకున్న ప్రేమను తెలియజేసి ఆ విధంగా తండ్రిలో ప్రేమాభిమానాలను ప్రేరేపించి తన మాటలను తండ్రి శ్రద్ధగా వినేలా చేసుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా నచ్చజెప్పారు. జీవం లేని విగ్రహాలను ఎందుకు పూజిస్తున్నారని ప్రశ్నించారు. వినలేని, చూడలేని, కాపాడలేని విగ్రహాలను పూజించడం ఎందుకని అడిగారు. తండ్రికి కోపం రాకముందే, “నాన్నా! మీకు తెలియని జ్ఞానం నా వద్దకు వచ్చింది. నన్ను అనుసరించడం చిన్నతనమవుతుందని దయచేసి భావించవద్దు. మీ అనుభవం కాని, మీ వయసు కాని నాకు లేవన్న సంగతి నాకు బాగా తెలుసు. కాని షైతాన్ మానవాళికి శత్రువు, మనిషిని దారి తప్పించి దుర్మార్గానికి పాల్పడేలా చేస్తాడు” అన్నారు. కుమారుడు నిర్మొహ మాటంగా, నిక్కచ్చిగా చెబుతున్న ఈ మాటలు విని ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు. కుమారుడితో మాట్లాడుతూ, “నీవు నా దేవుళ్ళను కాదంటున్నావా? ఇబ్రాహీమ్! నువ్వు అలా చేస్తే నేను నిన్ను రాళ్ళతో కొట్టిస్తాను. నా కోపం నీకు తెలుసు. ఒక తండ్రి మాదిరి దయాగుణాన్ని నువ్వు నాలో చూడలేవు. ఇక నన్ను ఒంటరిగా వదిలేయ్!” అన్నాడు. అంటే ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన ఇల్లు వదలి వెళ్ళిపోవాలని పరోక్షంగా సూచించాడు.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) మౌనంగా ఊరుకున్నారు. అయితే తన తండ్రికి నచ్చ జెప్పడం మానుకోలేదు. “మీకు శాంతి కలుగుగాక! మీ కోసం నా ప్రభువుతో క్షమాభిక్ష అర్ధిస్తాను. అల్లాహ్ అనంత కరుణామయుడు. మీకూ, మీరు ఆరాధిస్తున్న వాటికి నేను దూరంగా వెళ్ళక తప్పదు” అన్నారు. తన తండ్రికి వీడ్కోలు చెప్పి భారమైన మనసుతో ఇల్లు వదలి వెళ్ళిపోయారు.

సంవాదం

తండ్రి కఠినంగా నివారించినా ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన సత్యసందేశ ప్రచారాన్ని మానుకోలేదు. ప్రజలు ప్రాణం లేని విగ్రహాల ముందు సాష్టాంగ పడడం చూసి ఆయన చాలా బాధపడేవారు. ఈ ఆచారాన్ని మానిపించాలని ఆయన తీర్మానించుకున్నారు. ఈ విషయమై ప్రజలతో వాదించడానికి సిద్ధపడ్డారు. ఇలాంటి వాదనల వల్ల తనకు ప్రమాదమని తెలిసినా ఆయన వెనుదీయలేదు.

ఒక వైద్యుడు తగిన చికిత్స సూచించడానికి రోగనిర్ధారణకు పరీక్షలు చేసినట్లుగా, ఒక న్యాయమూర్తి నిందితుడిని ప్రశ్నించి సత్యాన్ని రాబట్టడానికి ప్రయత్నించినట్లుగా ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ప్రజలను ప్రశ్నించారు. “మీరు సాష్టాంగ పడినప్పుడు ఈ విగ్రహాలు మిమ్మల్ని చూస్తాయా? మీకు ఏ విధంగా నయినా ఇవి ప్రయోజనం కలిగిస్తాయా?” అని అనేవారు.

ప్రజలు ఆయనకు జవాబిస్తూ, విగ్రహాలకు ప్రాణం లేదన్న వాస్తవం తమకు కూడా బాగా తెలుసనీ, కాని తమ తాతముత్తాతలు వాటిని పూజించారనీ, విగ్రహాల శక్తిసామర్థ్యాలకు ఇంతకన్నా రుజువు ఏంకావాలని అన్నారు.

మీ తాతముత్తాతలు తప్పు చేశారని ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) వారికి నచ్చజెప్ప డానికి ప్రయత్నించారు. ఈ మాటలు విన్న ప్రజలు ఆగ్రహంతో మండిపడ్డారు. “నువ్వు మా దేవుళ్ళను, మా తాతముత్తాతలను నిందిస్తున్నావా? లేక పరిహాసానికి చెబుతున్నావా?” అని నిలదీశారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఎలాంటి సంకోచం లేకుండా తాను పరిహాసం చేయడం లేదనీ, సత్యం చెబుతున్నాననీ, తాను ఒక సత్యమైన ధర్మం తీసుకువచ్చాననీ, అందరి ప్రభువైన అల్లాహ్ తనకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చి పంపాడనీ, అల్లాహ్ ఒక్కడే ఏకైక దేవుడనీ, ఆయనే సృష్టికర్త అనీ, భూమ్యా కాశాలను సృష్టించింది ఆయనేననీ, ఆయనే జీవన వ్యవహారాలన్నీ నడుపుతున్నాడనీ, కేవలం కలప, రాళ్ళతో చేసిన ఈ విగ్రహాలు కాదని నిర్మొహమాటంగా చెప్పారు. ఈ విగ్రహాలు తనకు ఎలాంటి హాని చేయలేవని వారికి నచ్చజెప్పడానికి ఆయన వారితో సవాలు చేశారు. “నేను విగ్రహాలను బాహాటంగా విమర్శించాను. వాటికి నిజంగా శక్తి ఉంటే ఈ పాటికి అవి నాకు హాని కలిగించి ఉండేవి” అన్నారు.

అల్లాహ్ సృష్టిలోని సౌందర్యాన్ని ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) వారికి వివరించారు. అల్లాహ్ శక్తి సామర్థ్యాలను, అల్లాహ్ వివేకవిజ్ఞతలను తెలియజేశారు. విగ్రహారాధనను అల్లాహ్ ఏవగించుకుంటాడనీ, ఈ సమస్త విశ్వానికి అల్లాహ్ మాత్రమే నిజమైన ప్రభువనీ, ఆయన తనను సృష్టించాడనీ, తనకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడనీ, తనకు అన్నపానీయాలు కల్పిస్తున్నాడనీ, జబ్బు పడినప్పుడు స్వస్థత ఇస్తున్నాడనీ, ఆయనే మృత్యువును ఇస్తాడనీ, తర్వాత మళ్ళీ బ్రతికించి లేపుతాడని వివరించారు. తాను ఆయన్నే ఆరాధిస్తున్నాననీ, ఆయనే తీర్పుదినాన తన తప్పులను మన్నిస్తాడని చెప్పారు. కాని ప్రజలు ఈ వాస్తవాలను గుర్తించకుండా విగ్రహారాధన కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విగ్రహాల యుద్ధం

పట్టణానికి బయట ఒక ఉత్సవం జరుపుకునే సంప్రదాయం వారికి ఉండేది. అయితే ఆ ఉత్సవానికి వెళ్ళే ముందు విగ్రహాలకు ప్రసాదాలు పెట్టి వాటి ఆశీర్వాదం తీసుకుని వెళ్లేవారు. ఉత్సవం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని పంచుకు తినేవారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) వారితో పాటు ఉత్సవానికి రానన్నారు. పట్టణంలోనే ఉండిపోయారు. పూర్తి పట్టణంలోని ప్రజలందరూ ఊరి బయటకు ఉత్సవంలో పాల్గొనడానికి వెళ్ళారు. పూజారులు కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) విగ్రహాలున్న ఆలయంలోకి ప్రవేశించారు. చాలా విగ్రహాల పాదాల వద్ద ఆహార పదార్ధాలు ఉన్నాయి. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) విగ్రహాలను భోంచేయడం లేదేమని వ్యంగ్యంగా అడిగారు. కోపంగా ఆ విగ్రహాలన్నింటినీ విరగ్గొట్టారు. ఒక దాని తర్వాత ఒకటిగా విగ్రహాలన్నీ ముక్కలు చేసి ఒక పెద్ద విగ్రహాన్ని మాత్రం వదిలేశారు. అప్పటికి ఆయన కోపం చల్లారింది. పూజారులు, ప్రజలు తిరిగి వచ్చి విగ్రహాలన్నీ ధ్వంసమై ఉండడం చూసి నిర్ఘాంతపోయారు. ఇలాంటి పని చేసేది ఇబ్రాహీమ్ తప్ప మరెవ్వరూ కాదని నిర్ణయించారు. ఆగ్రహంగా ఇబ్రాహీము నిర్బంధించి విచారణ జరపాలన్నారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) కూడా అందుకు ఒప్పుకున్నారు. ఆయన కూడా విచారణ జరగాలనే కోరుకున్నారు. బహిరంగంగా విచారణ జరిగితే ప్రజలకు వారి మూర్ఖ ఆచారాల గురించి బాహాటంగానే వివరించవచ్చని ఆయన భావించారు.

విచారణ

విచారణలో ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను విగ్రహాల విధ్వంసం గురించి ప్రశ్నిం చారు. విగ్రహాలను విరగ్గొట్టింది నీవేనా అని అడిగారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) నవ్వుతూ, విరక్కుండా ఉన్న పెద్ద విగ్రహాన్ని అడిగితే చెబుతుంది కదా అన్నారు. అసలు ఆ పెద్ద విగ్రహమే మిగిలిన విగ్రహాలను విరగ్గొట్టి ఉంటుంది అని కూడా చెప్పారు. ఈ మాటలు విన్న వాళ్ళు కోపంతో, విగ్రహాలు మాట్లాడవని నీకు తెలియదా అన్నారు. ఈ జవాబు కోసమే ఎదురు చూస్తున్న ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ప్రాణం లేని వాటిని పూజించడం ఎంత నిష్ప్రయోజనకరమో వారికి వివరించారు.

తమ విశ్వాసాలలోని హేతురాహిత్యాన్ని వాళ్ళు కూడా గుర్తించారు. కాని వారి అహంకారం సత్యం అంగీకరించకుండా అడ్డుపడింది. తమ బలాన్ని ప్రదర్శించడం తప్ప వారు మరో జవాబు ఇవ్వలేకపోయారు. సాధారణంగా నియంతలు చేసే పనే ఇది. వారు ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను సంకెళ్ళతో బంధించి ప్రతీకారం తీర్చుకునే పథకం వేశారు.

(చదవండి దివ్యఖుర్ఆన్: 21:52-68, 26:69-102, 29:16, 17,34)

అగ్నిగుండం

వారి గుండెల్లో కోపం బుసలు కొట్టసాగింది. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను ఒక మహా అగ్నిగుండంలో విసరివేయాలని నిర్ణయించారు.

తమ దేవుళ్ళకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు `ప్రజలందరూ కట్టెలు సమీకరించాలని ఆదేశించడం జరిగింది. అజ్ఞానంతో కొందరు వ్యాధిగ్రస్తులైన మహిళలు, తమ వ్యాధి తగ్గిపోతే తాము సాధ్యమైనంత ఎక్కువ కలప ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) దహనానికి ఇస్తామని మొక్కుకున్నారు. అనేక రోజుల పాటు వారు కట్టెలు, కలప సేకరించారు. ఆ తర్వాత వాళ్ళు మహా అగ్ని గుండాన్ని వెలిగించారు. ఆ మహా అగ్నిగుండం భగభగ మండసాగింది. ఆ మంటల నుండి వచ్చిన భీకరధ్వని చాలా దూరం వరకు వినిపించసాగింది. అందులో నిప్పులు ఎర్రగా మండసాగాయి. వాళ్ళు ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను తాళ్ళతో కట్టేసారు. ఆయన్ను అగ్ని గుండంలోకి విసరివేసారు. నల్లని దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించుకుంది.

ఆ అగ్నిగుండం చల్లారిన తర్వాత, పొగ తగ్గిన తర్వాత వాళ్ళు అందులో చూసి దిగ్భ్రాంతి చెందారు. అందులో నుంచి ఒక వ్యక్తి ఒంటరిగా బయటకు వస్తున్నాడు. తన స్నేహితునిగా అభివర్ణించిన ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను విశ్వప్రభువైన అల్లాహ్ కాపాడాడు. భగభగలాడే అగ్నికీలలు ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)కు పూలమాలల్లా స్వాగతమిచ్చాయి. ఆయనకు కట్టి ఉన్న తాళ్ళను మాత్రమే అవి దహించాయి. ఈ మహత్యాన్ని చూసి నిరంకుశ పాలకుడు సిగ్గుపడ్డాడు. కాని వారి మనస్సులో ఉన్న ఆగ్రహజ్వాలను ఇది చల్లార్చలేకపోయింది. అయితే ఈ మహత్యాన్ని చూసిన తర్వాత చాలా మంది ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) సందేశాన్ని విశ్వసించారు. కొందరు తమ విశ్వాసాన్ని రహస్యంగా ఉంచారు. నిరంకుశుడైన పాలకుడు తమను హతమార్చ వచ్చని లేదా తమకు హాని కలిగించవచ్చని భయపడ్డారు.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) నిరపాయంగా అగ్నిగుండం నుంచి బయటపడిన వార్త నిరంకుశ పాలకుడు నమ్రూద్ విన్నాడు. కోపంతో మండిపడ్డాడు. తన్ను తాను దేవుడిగా ప్రకటించుకున్న నమ్రూద్ తన దైవత్వానికి ప్రమాదం వచ్చిందని భయపడ్డాడు. అదీ ఒక సాధారణ మానవుడైన, ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) వల్ల ఆ ప్రమాదం ముంచుకు వస్తోందని ఆందోళన చెందాడు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను తన రాజ భవనానికి పిలిచి తీవ్రంగా హెచ్చరించాడు. “నువ్వు నా ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నావు. నన్ను మించిన దేవుడు ఎవడూ లేడు” అన్నాడు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) జవాబిస్తూ, “జీవన్మరణాలు ప్రసాదించేవాడే నా ప్రభువు. ఆయనే ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త” అన్నారు. ఈ మాటలు విన్న నమ్రూద్ తన గొప్పదనాన్ని చూపించడానికి, “నేను కూడా జీవితాన్ని ప్రసాదిస్తాను. నేను తలచిన వారిని ప్రాణాలతో వదిలేస్తాను. నేను తలచిన వారిని చంపించగలను. కాబట్టి నీ ప్రభువు చేసే పని ప్రత్యేకమైనదేం కాదు” అన్నాడు.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) నవ్వుతూ తలాడించారు. “నా ప్రభువు సూర్యుడిని తూర్పు నుంచి ఉదయించేలా చేస్తున్నాడు. పడమట అస్తమించేలా చేస్తున్నాడు. నువ్వు దేవుడివైతే ఈ క్రమాన్ని మార్చి చూపించు” అన్నారు. ఈ మాటలు విన్న నమ్రూద్ నోరెళ్ళబెట్టాడు. అతడి మూర్ఖపు వాదన తేటతెల్లమైపోయింది. అందరి ముందు సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది. కాని ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను బహిరంగంగా చంపించడానికి భయపడ్డాడు. చాలా మంది దీని వల్ల తనకు వ్యతిరేకులై పోతారనీ, తనకు శత్రువులైపోతారనీ భయపడ్డాడు. అందువల్ల ప్రజల్లోకి తన మనుష్యులను పంపించి ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను అనుసరిస్తే వారికి తీవ్రపరిణామాలు తప్పవనీ, మరణశిక్ష విధించడం కూడా జరుగుతుందని బెదిరింపులను జారీ చేయించాడు.

ఆ పట్టణంలో తన సందేశాన్ని స్వీకరించేవారు ఇంకెవరూ లేని పరిస్థితిని గమనించిన ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) అక్కడి నుంచి తరలిపోయారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 2:2,5,8)

ఖగోళాలను ఆరాధించే ప్రజలు

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) అక్కడి నుంచి హర్రాన్ అనే ప్రదేశానికి వచ్చారు. ఈ ప్రదేశం పలస్తీనాకు దగ్గరగా ఉంది. అక్కడే ఆయన స్థిరపడ్డారు. అక్కడి ప్రజలు తెలివిగల వారని విన్నారు. ప్రకృతిలోని వింతలను పరిశీలించడం వారికి చాలా యిష్టమని కూడా గ్రహించారు. తన సందేశాన్ని స్వీకరించేవారు ఇక్కడ లభిస్తారని ఆశించారు. అయితే అక్కడి ప్రజలు ఖగోళాలను పూజించడం కనబడింది. కాని ఆ ప్రజలు ఆలోచించే, పరిశీలించే అలవాటు కలిగిన ప్రజలు కాబట్టి హేతుబద్ధ మైన వాదనతో వారిని మార్చవచ్చని ఆయన భావించారు. ఒక రాత్రి నక్షత్రాలు మిలమిల లాడుతున్నప్పుడు ఆయన వాటిని చూపించి, “అదే నా ప్రభువు” అని బిగ్గరగా పలికారు. కాని ఆ నక్షత్రాలు కనుమరుగైపోయిన తర్వాత, “అరె నా ప్రభువు ఎక్కడికి వెళ్ళాడు?” అని బిగ్గరగా పలికారు. ఇది విన్న ప్రజలు నక్షత్రాలు అస్తమించాయని అన్నారు. ఆ మాటలు విన్న ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం), “ఇలా కనుమరుగయ్యే వాడు నా దేవుడు కాదు” అన్నారు. చంద్రుడు పెద్దగా, ప్రకాశవంతంగా కనబడడాన్ని చూసి ఆయన, “ఇదే నా ప్రభువు కావచ్చు” అని బిగ్గరగా పలికారు. కాని చంద్రుడు కూడా అస్తమించాడు. ఇది చూసిన ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం), “నా ప్రభువు నాకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఉండనట్లయితే నేను కూడా దారితప్పే వాడిని” అన్నారు. ఉదయం సూర్యుడు ఉదయించాడు. సూర్యుడిని చూస్తూ ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం), “ఇది తప్పక నా ప్రభువు అయి ఉండాలి. ఇది చాలా పెద్దగా ఉంది. చాలా తీక్షణమైన ప్రకాశం కలిగి ఉంది. కాబట్టి మరింత ప్రయోజన కరమైనది” అన్నారు. కాని సూర్యుడు కూడా అస్తమించడాన్ని చూసి “నిస్సందేహంగా ఈ ఖగోళాలు అన్నీ కూడా ఒక విశ్వప్రభువు ఆదేశాల ప్రకారం నడుచు కుంటున్నాయి” అని బిగ్గరగా పలికారు. ఈ విధమైన హేతుబద్ధమైన మాటలు ప్రజల మనోమస్తిష్కాలపై పని చేస్తాయనీ, వారు సత్యాన్ని గ్రహిస్తారనీ ఆయన ఆశించారు. కాని ఆయన ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఒకే దేవుడన్న విశ్వాసానికి రాలేదు. వారు అల్లాహ్ శిక్షకు భయపడలేదు. వారి వైఖరి వారిని నరకానికి తీసుకు పోతుందని ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) వారిని హెచ్చరించారు. (దివ్యఖుర్ఆన్: 6:74-83)

ఈజిప్టు యాత్ర

పలస్తీనాలో కరవు ఏర్పడింది. ఫలితంగా జీవితం దుర్భరమైంది. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన భార్య సారాను తీసుకుని ఈజిప్టుకు వలస వెళ్ళారు. సారా చాలా అందమైన స్త్రీ. ఆమె అద్భుత సౌందర్యరాశి అన్న విషయాన్ని రాజోద్యోగులు రాజుకు తెలియజేశారు. అలాంటి సౌందర్యరాశి తన భవనంలో ఉంటే తన ప్రతిష్ఠ చాలా పెరుగుతుందని భావించిన రాజు ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను పిలిపించి ఆయనకు సారాతో ఉన్న బాంధవ్యం ఏమిటని ప్రశ్నించాడు. ఆమెకు తానే భర్తనని చెబితే రాజు తనను హతమార్చే ప్రమాదాన్ని పసిగట్టిన ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఆమె తన సోదరి అని చెప్పారు. రాజు ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)తో ఆమెకు పెళ్ళయ్యిందా అని ప్రశ్నించినపుడు ఆయన మౌనం వహించారు.

సౌశీల్యవతి సారా

రాజోద్యోగులు సారాను రాజప్రాసాదానికి తీసుకువెళ్ళారు. ఆమెకు ఖరీదైన దుస్తులు, ఆభరణాలతో అలంకరణలు చేశారు. కాని రాజప్రాసాదంలోని ఆడంబరాలు, సుఖభోగాలు ఆమెను సంతోషపెట్టలేదు. ఆమె హృదయ విదారకంగా రోదించసాగింది. అన్నపానీయాలు మానేసింది. రాజు ఆమెను ఓదార్చాలని ప్రయత్నించాడు. కాని ఫలితం దక్కలేదు. రాజు ఆమె సమీపానికి వచ్చినప్పుడల్లా ఒక విచిత్రమైన అనుభూతి అతన్ని క్రమ్ముకునేది. ఒకవిధమైన భయం ఆవరించేది. ఆమెను కనీసం తాకలేకపోయేవాడు. చివరికి రాజుకు కలలో ఆమె వివాహిత అని తెలిసింది. మరుసటి రోజు ఉత్తముడైన ఆ రాజు సారాను స్వేచ్ఛగా విడిచి పెట్టడమే కాదు, తన వద్ద ఉన్న సేవకురాలు హాజిరాను ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఒక కొత్త దేశంలో ఒంటరివాడైన ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) గారి గౌరవ మర్యాదలను ఆ విధంగా కాపాడాడు అల్లాహ్.

పలస్తీనాకు తిరిగి రావడం

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఈజిప్టులో చాలా కాలం ఉన్నారు. అక్కడ ఆయన చాలా కష్టపడి పనిచేయడం వల్ల సంపన్నుడయ్యారు. అయితే జీవితంలో విజయాలు సాధించిన వ్యక్తికి ఇతరులు ఈర్ష్యాసూయలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. తన పట్ల ప్రజల్లో ఒక విధమైన అసూయ ఉందని గుర్తించిన ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన భార్య సారాను, సేవకురాలు హాజిరాను తీసుకుని అక్కడి నుంచి పలస్తీనాకు తరలి వచ్చారు.

ప్రవక్త ఇస్మాయీల్ (అలైహిస్సలాం)

పలస్తీనాలో ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) సందేశాన్ని కొందరు విశ్వసించారు. సత్య సందేశాన్ని స్వీకరించారు.

సారాకు సంతానం కలుగలేదు. ఆమెకు వయసు పైబడింది. పిల్లలు కలిగే వయసు దాటిపోయింది. తన భర్తకు ఒక పిల్లవాడిని ఇవ్వలేకపోయానని ఆమె బాధపడేవారు. అందువల్ల తమ సేవకురాలు హాజిరాను పెళ్ళి చేసుకోవలసిందిగా ఆమె భర్తను కోరారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఈ సలహా మన్నించారు. హాజిరాను వివాహం చేసుకున్నారు. హాజిరాకు ఒక కుమారుడు, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) జన్మిం చారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) చాలా సంతోషించారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం)ను అమి తంగా ప్రేమించారు.

సహజమైన ఈర్ష్యాసూయలు

మొదట్లో సారా కూడా ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) సంతోషంలో పాలుపంచుకున్నారు. కాని తర్వాత తన భర్త కొత్తగా జన్మించిన శిశువు పట్ల, శిశువు తల్లి అయిన హాజిరా పట్ల అధిక శ్రద్ధ చూపడం ఆమెలో ఈర్ష్యాసూయలకు కారణమయ్యింది. ఆమెలో అసూయ బుసలుకొట్టింది. వాళ్ళిద్దరిని ఎక్కడైనా దూరంగా విడిచి రావలసినదిగా ఆమె భర్తను కోరారు. సారా కోరినట్లు చేయవలసిందిగా అల్లాహ్ ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)కు సూచించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళవలసింది అల్లాహ్ స్వయంగా మార్గం చూపిస్తానన్నాడు. అనేక రోజులు ప్రయాణించిన తర్వాత, భయంకరమైన ఎడారిని దాటిన తర్వాత, ఒక నిర్మానుష్యమైన ప్రదేశం వద్ద వారు విడిది చేశారు. అక్కడ చెట్టుచేమ మచ్చుకు కూడా లేవు. నీటి బొట్టు కూడా దొరకని నిర్జనమైన ప్రదేశం అది. ఆ ప్రదేశంలోనే ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన భార్యాపిల్లలను వదలి వెళ్ళాలని అల్లాహ్ ఆజ్ఞాపించాడు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన భార్యకు కొన్ని ఎండు ఫలాలు, కొంత నీరు, ఒక గుడారం, మరికొన్ని వస్తువులు ఇచ్చి బరువైన మనసుతో విచారంగా అక్కడి నుంచి వెనుదిరగడానికి తన ఒంటెను అధిరోహించారు. హాజిరా ఆ ఒంటెను పట్టుకుని, “ఇబ్రాహీమ్! మమ్మల్ని ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకు వదిలేస్తున్నారు? మీకు నా పట్ల ఎలాంటి అభిమానం లేకపోయినా కనీసం మీ కన్నబిడ్డ గురించి ఆలోచించండి. మీ కుమారుడు ఇక్కడ ఆకలి దప్పులతో ప్రాణం వదిలేయవచ్చు. ఇక్కడ క్రూర మృగాలు మాపై దాడి చేయవచ్చు” అని వేడుకున్నారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఎడారిని చూస్తూ, సహనం వహించాలని ఆమెతో చెప్పారు. తాను తన ఇష్టప్రకారం వ్యవహరించడం లేదనీ, కేవలం అల్లాహ్ ఆదేశాలను అమలు చేస్తున్నాననీ జవాబిచ్చారు. ఆయన జవాబు ఆమెకు ఊరట కలిగించింది. కన్నీళ్ళు తుడుచు కుంటూ, “ఇది అల్లాహ్ అభీష్టమైతే ఆయన మమ్మల్ని ఒంటరిగా వదలిపెట్టడు” అన్నారు.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) దుఃఖం

తన కుటుంబాన్ని వదలి ఒక్కో అడుగు దూరంగా వెళుతున్న కొద్దీ ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)కు దుఃఖం అతిశయించసాగింది. ముసలి వయసులో తనకు అల్లాహ్ ప్రసాదించిన ఏకైక కుమారుడిని అక్కడ వదిలి వెళుతున్న ఆలోచన కూడా భరించరానిదిగా ఉందాయనకు. అయితే విశ్వప్రభువు పట్ల దృఢమైన తన నిబద్ధతను నిరూపించుకునే పరీక్షల్లో ఇదొకటని ఆయన గుర్తించారు. ఆయన అల్లాహ్ ను ప్రార్థిస్తూ, “ఓ ప్రభూ! నీ పవిత్రమైన గృహానికి దగ్గరగా నిర్జన ప్రదేశంలో నేను నా కుటుంబీకులను వదలివచ్చాను. వారు అక్కడ దైవారాధనను స్థాపించాలని భావిస్తున్నాను. వారి పట్ల సానుభూతి, ఆదరాభిమానాలను ప్రజల్లో కలిగించు. వారికి కావలసిన సదుపాయాలు ప్రసాదించు” అని వేడుకున్నారు.

అల్లాహ్ పై భారం వేసిన హాజిరాకు విశ్వప్రభువు సహనాన్ని, ధైర్యాన్ని ప్రసాదించాడు. కొన్ని రోజులు గడచిన తర్వాత, వారి వద్ద ఉన్న ఆహారం, నీరు అయిపోయాయి. పసిబిడ్డతో సహా ఆమె ఆకలిదప్పులతో అలమటించసాగారు. బిడ్డకు పాలుపట్టడానికి ఆమె రొమ్ముల్లో పాలు కూడా రావడం లేదు. పసిబిడ్డ ఆకలితో దయనీయంగా ఏడుస్తున్నాడు. హాజిరా కన్నీరు మున్నీరయ్యింది. బిడ్డను అక్కడే నేలమీద వదలి నీటి కోసం, ఆహారం కోసం వెదుకాడుతూ తిరగసాగారు. ఒక కొండను ఎక్కారు (ఈ కొండనే తర్వాత సఫా కొండగా పిలుస్తున్నారు). ఆ కొండ పై నుంచి ఆ లోయ మొత్తాన్ని పరిశీలించి చూశారు. మరో వైపున ఇంకో కొండ కనబడింది (దీనిని తర్వాత మర్వా కొండ అని పిలుస్తున్నారు). ఆ కొండపై నుంచి చూస్తూ నీటి జాడ కనబడుతుందన్న ఆశతో ఆ కొండపై కెక్కారు. కాని ఏమీ కనబడలేదు. ఆమె ఆందోళనతో మళ్ళీ మొదటి కొండపై కెక్కారు. ఆ విధంగా ఆమె నీటి కోసం వెదుకాడుతూ ఆ రెండు కొండల మధ్య ఏడుసార్లు పరుగులు తీశారు. (హజ్ యాత్ర సందర్భంగా సఫా మర్వా కొండల మధ్య ఏడుసార్లు పరుగెత్తుతూ చేసే ‘సయీ’ ఈ సంఘటన జ్ఞాపకార్థమే జరుగుతోంది.)

జమ్ జమ్

ఆమె నిరాశగా పసిబిడ్డ వద్దకు వచ్చారు. బిడ్డ పరిస్థితి దయనీయంగా ఉంది. “ఓ ప్రభూ! కరుణించు” అంటూ మొర పెట్టుకున్నారు. బిడ్డ పరిస్థితి క్షణ క్షణానికి దిగజారుతోంది. ఊపిరి మందగిస్తోంది. శ్వాస కష్టమవుతోంది.

బాధాతప్త హృదయంతో, తన ఏకైక సంతానం కొసప్రాణంతో పెనుగులాడడాన్ని ఆమె నిస్సహాయంగా చూడసాగారు. ఎండిపోయిన బిడ్డ గొంతు నుంచి ఎలాంటి ధ్వని రావడం లేదు. కేవలం కాళ్ళు కొట్టుకుంటున్న శబ్దం మాత్రం వినిపిస్తోంది. పసిబిడ్డ ఇస్మాయీల్ తన చిన్నారి కాళ్ళతో నేలను కొడుతున్న ప్రదేశంలో స్వచ్ఛమైన నీటి ఊట అకస్మాత్తుగా ఉబికి వచ్చింది. ఆమె తన కళ్ళను తాను నమ్మలేకపోయారు.

అల్లాహ్ పట్ల ఆమె చూపిన విధేయత, ఆమె ప్రదర్శించిన సహనాలకు అత్యుత్తమ బహుమానం లభించింది. ఎండిపోయిన నేల నుంచి స్వచ్ఛమైన జల ధార ఉబికి వచ్చేలా చేశాడాయన. తనకు నమ్మకస్తుడైన స్నేహితుడు ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) కుటుంబం కష్టాల నుంచి బయటపడే దారి చూపించాడు. హాజిరా ఆ స్వఛ్ఛమైన నీటిని బిడ్డ నోటిలో పోసారు. ఆ నీటితో బిడ్డ ప్రాణాలు కుదుట పడడాన్ని ఆమె ఆనందంగా వీక్షించారు. కన్నీళ్ళతో ఆమె అల్లాహ్ కు కృతజ్ఞతలు అర్పించారు. ఆ అద్భుతమైన జలధారలే “జమ్ జమ్” జలంగా ప్రసిద్ధి కెక్కాయి. 4000 సంవత్సరాల క్రితం నాటి ఈ జలధార నేటికి కూడా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. లక్షలాది హజ్ యాత్రికులకు అత్యంత ఆరోగ్యప్రదమైన నీటిని అంది స్తోంది. ఒకప్పుడు నిర్జనమైన ఆ ప్రదేశంలో జీవం తొణికిసలాడేలా చేసింది ఈ జమ్ జమ్ జలమే.

మరిన్ని చిహ్నాలు

దూరదూర ప్రాంతాలకు చెందిన పక్షులు ఆ నీటిని చూసి దాహం తీర్పు కోవడానికి అక్కడ వాలడం ప్రారంభించాయి. యెమన్ నుంచి వస్తున్న ఒక అరబ్బు తెగ “జుర్ హుమ్”* దూరం నుంచి పక్షులు గుంపులుగా ఆ ప్రదేశం వైపునకు వెళ్ళడాన్ని గమనించారు. విచారించడానికి కొందరిని అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళి వచ్చిన వారు అక్కడ నీటి వనరు ఉందని తెలిపారు. ఆ అరబ్బు తెగ ఆ ప్రదేశానికి వచ్చింది. ఆ నిర్జనప్రదేశంలో మనుష్యుల్ని చూసి హాజిరా చాలా సంతోషించారు. తనకు, తన కుమారునికి అల్లాహ్ పరిరక్షణ లభించిందనడానికి సూచనగా వారి ఆగమనాన్ని ఆమె భావించారు. ఆ ప్రజల హృదయాల్లో వారి పట్ల సానుభూతిని అల్లాహ్ జనింపజేశాడు. ఆ ప్రదేశం వైపునకు వారు వచ్చేలా చేశాడు. ఆ విధంగా ఇబ్రాహీమ్ చేసిన ప్రార్థనను అల్లాహ్ ఆమోదించాడు.

ఆ ప్రదేశంలో జమ్ జమ్ నీటి ఊట బయటపడినందు వల్ల యెమన్ నుంచి అక్కడకు వచ్చిన జుర్ హుమ్ తెగ అక్కడ విడిది చేయడానికి, ఆ నీటిని వాడు కోవడానికి హాజిరా అనుమతి కోరారు. హాజిరా సంతోషంగా వారిని స్వాగతించారు. వారిని అతిథులుగా గౌరవించారు. వారిలో కొందరు తమ కుటుంబాలను అక్కడకు పిలిపించుకున్నారు. చాలా మంది ఆ ప్రదేశం(మక్కా)నే తమ శాశ్వత నివాసంగా మార్చుకున్నారు.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) అభిలాష

నిర్మానుష్య ప్రదేశంలో తాను వదలి వచ్చిన తన భార్యాబిడ్డల గురించి ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఎప్పుడూ చింతిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి వారిని చూసి వచ్చేవారు. తాను కోరిన విధంగా తన కుమారుడు పెద్ద వాడవ్వడాన్ని చూసి సంతృప్తి చెందేవారు. తన కుటుంబాన్ని ఆదుకున్న విశ్వ ప్రభువుకు కృతజ్ఞతలు అర్పించేవారు. తన కుటుంబానికి నిలువనీడ కల్పించి, వారికి కావలసిన అన్నపానీయాలు ఏర్పాటు చేసిన అల్లాహ్ కు ధన్యవాదాలు తెలుపుకునేవారు.

నిరుపమానమైన త్యాగం

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) జీవితం యావత్తు విశ్వప్రభువు పట్ల ఆయన నిబద్ధతను, చెక్కుచెదరని విశ్వాసాన్ని ప్రకటించే పరీక్షల సంగమం. అల్లాహ్ పట్ల నమ్మకం కలిగి ఉన్న వారు ఎన్నడూ నిరాశ చెందరు. అల్లాహ్ ఆదేశాలను ఎన్నడూ ప్రశ్నించరు. అల్లాహ్ ఎల్లప్పుడూ చెడుపై మంచికి విజయాన్ని ప్రసాదిస్తాడని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు అల్లాహ్ మరోసారి ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను కఠినమైన పరీక్షకు గురిచేశాడు. ఒక కల ద్వారా ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన ఏకైక కుమారుణ్ణి అల్లాహ్ కు బలిపెట్టాలని ఆదేశించడం జరిగింది.*

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) దృఢమైన విశ్వాసం కలిగినవారు. అల్లాహ్ పంపిన ప్రవక్త. అల్లాహ్ సందేశహరుడు. ఆయన తన ఏకైక పుత్రుడిని బలిపెట్టాలని అల్లాహ్ కోరితే ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) దైవాదేశాన్ని ఎలా కాదనగలరు? అయితే ఎవరికైనా ఇలా చేయడం ఊహించరాని త్యాగమే అవుతుంది. ఆ కుమారుడు ఆయనకు లేకలేక ముసలి వయసులో జన్మించిన కుమారుడు. ఆయనకు వయసు ఉడిగిన సమయంలో అతడే ఆధారం. ఆయనకున్న ఏకైక ఆనందం ఆ కుమారుడే. కేవలం ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) వంటి గొప్ప ప్రవక్త మాత్రమే ఇలాంటి బాధాకరమైన ఆదేశాన్ని అమలు చేయగలరు. తన సృష్టికర్త పట్ల, తన ప్రభువు పట్ల తన నిశ్చలమైన ప్రేమను ఈ విధంగా ప్రదర్శించడం ఆయనకు మాత్రమే సాధ్యం.

ఆత్మవిశ్వాసంతో ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) మక్కాకు బయలుదేరారు. ఈ వార్తను తన కుమారునికి చెప్పడం ఆయనకు ఒక పరీక్ష వంటిదే. అయితే ఇస్మాయీల్ (అలైహిస్సలాం) కూడా తండ్రికి తగిన కుమారులు. ఆయన అనితర సాధ్యమైన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అల్లాహ్ ఆదేశాన్ని అమలు చేయాలని ఆయన నిబ్బరంగా తన తండ్రికి చెప్పారు. “నాన్నా! మీకు ఆజ్ఞాపించబడినట్లు చేయండి. అల్లాహ్ కోరిన విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని బదులిచ్చారు. ఆయన తన దుస్తులు తొలగించారు. తల్లికి సలాములు చెప్పాలని తండ్రిని కోరారు. తన గుర్తులుగా తన దుస్తులు తల్లికి ఇవ్వాలని చెప్పారు. తాను కాళ్ళుచేతులు కొట్టుకోవడం జరిగితే తన తండ్రికి బాధ కలుగుతుందన్న ఉద్దేశ్యంతో తన కాళ్ళను చేతులను కట్టేయాలని తండ్రిని కోరారు.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన కత్తికి పదును పెట్టారు. ఆ విధంగా ఇస్మాయీల్ కు మృత్యువు బాధ లేకుండా ఉండాలని భావించారు. కుమారుడిని గట్టిగా కౌగిలించుకుని రోదించారు. తర్వాత ఇస్మాయీల్ (అలైహిస్సలాం)ను పడుకోబెట్టి కాళ్ళుచేతులు కట్టేశారు. బాధాతప్త హృదయంతో కుమారుణ్ణి చివరిసారిగా చూసుకున్నారు. బరువెక్కిన హృదయంతో కత్తిని ఎత్తారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) గొంతుపై వేటు వేశారు. కాని ఆ కత్తి గొంతును కోయలేదు. తన తండ్రి తగినంత గట్టిగా కత్తిని ఉపయోగించడానికి వెనుకాడుతున్నారని భావించిన ఇస్మాయీల్ (అలైహిస్సలాం) గట్టిగా కోయాలని తండ్రితో చెప్పారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) అలాగే చేశారు. అయినా ఆ కత్తి గొంతును కోయలేదు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఆశ్చర్యపోయారు. తన బలహీనతను క్షమించవలసినదిగా ఆయన అల్లాహ్ ను వేడుకున్నారు. అల్లాహ్ ఆయన వేడుకోలుకు బదులిచ్చాడు. “ఇబ్రాహీమ్! నీవు నిజంగా కలను సార్థకం చేశావు. మేము నీ విధేయతకు బహుమానం ప్రసాదిస్తున్నాము”అన్నాడు. ఆ తండ్రీ కొడుకులు అల్లాహ్ ఆదేశం శిరసావహించడానికి క్షణం వెనుకాడలేదు. అల్లాహ్ కు కావలసింది బలి కాదు. తన ఆదేశాల పట్ల వారు చూపిన నిబద్ధతనే ఆయన పరీక్షించాడు. తండ్రీ కొడుకులు అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల కృతజ్ఞతలు అర్పించారు. ఇస్మాయీల్(అలైహిస్సలాం)కు బదులుగా బలి ఇవ్వడానికి ఆ దగ్గర్లోనే ఒక పెద్ద గొర్రె కనబడింది. అంతకు ముందు కోయడానికి మొండికేసిన కత్తి ఆ గొర్రె గొంతును ఒక్క వేటుకు కోసింది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం ఈదుల్ అద్ హా (బక్రీదు పండుగ) సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడం జరుగుతుంది.

ద్వారబంధాన్ని మార్చడం

ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ఒక అందమైన యువకునిగా ఎదిగారు. జుర్ హుమ్ తెగ వారి వద్ద ఆయన అరబీ భాషను నేర్చుకున్నారు. ఈ తెగకు చెందిన అమ్మాయినే వివాహమాడారు. ఆయన చాలా ఆనందంగా జీవితాన్ని గడుపసాగారు. ఆయన జీవితంలో ఎదురైన ఒకే ఒక్క దుఃఖకరమైన సంఘటన ఆయనను అమితంగా ప్రేమించిన మాతృమూర్తి తనువు చాలించడం. ఇస్మాయీల్(అలైహిస్సలాం)ను కంటికి రెప్పలా సాకిన హాజిరా మరణించిన సంఘటన ఆయన్ను విపరీతంగా కలచి వేసింది.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) అప్పుడప్పుడు వచ్చి కుమారుణ్ణి చూసి వెళ్ళేవారు. ఆ ఎడారిలో ఆయన కుమారుణ్ణి చూడడానికి అనేక రోజులు ప్రయాణం చేసి రావలసి వచ్చేది. ఒకసారి ఆయన వచ్చినప్పుడు ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ఇంట లేరు. ఆయన భార్య ఇంట ఉండడంతో ఆమెతో ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) మాట్లాడారు. ఆమె భర్త ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు. అయితే ఆమె ఆయన చెప్పే విషయాలు ఏవీ వినకుండానే తన భర్త గురించి ఫిర్యాదులు ప్రారంభించింది. తమ బీదస్థితి గురించి చెప్పుకొచ్చింది. వచ్చింది ఎవరని కూడా ఆమె అడుగలేదు. కనీసం మంచినీరన్నా అందించలేదు. అసహనం నిండిన స్త్రీని ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఆమెలో చూశారు. అల్లాహ్ అనుగ్రహాలను గుర్తించే శక్తిలేని స్త్రీని చూశారు. ఆయన కనీసం తన ఒంటె నుంచి క్రిందికి కూడా దిగలేదు. ఆయన ఆమెతో, “నీ భర్తను అడిగానని చెప్పు… ఇంటి ద్వారబంధాన్ని మార్చడం మరచిపోవద్దని చెప్పు” అని వెళ్ళిపోయారు.

ఇస్మాయీల్(అలైహిస్సలాం) ఇంటికి వచ్చిన తర్వాత ఆమె జరిగింది ఆయనకు చెప్పింది. వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నారని ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ప్రశ్నించారు. ఆమె ఆ వ్యక్తిని వర్ణించింది. ఆ వచ్చింది తన తండ్రి అని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన మాటలకు అర్థాన్ని వివరిస్తూ, సరిగా లేని ద్వారబంధం ఇంటికి తగినది కాదనీ, దాని వల్ల మనిషికి ఎదురుదెబ్బలు తగలడమే కాదు గాయాలు కూడా అవుతాయనీ, అదే విధంగా ఆమె తనకు తగిన భార్య కాదని అన్నారు.

కొంతకాలం తర్వాత ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన కుమారుణ్ణి చూడ్డానికి మళ్ళీ వచ్చారు. అప్పుడు కూడా ఆయన కుమారుడు ఇంట లేరు. అయితే ఇంట మరో స్త్రీ ఉంది. ఆమె ఇస్మాయీల్(అన) మళ్ళీ పెళ్ళాడిన స్త్రీ. ఆమె ఆయనకు నీరందించింది. భోజనం వడ్డించింది. ఆయన ఒంటె దిగి.. ఆమెను ఆమె భర్త గురించి అడిగారు. తన భర్త వేటకు వెళ్ళారని ఆమె బదులిచ్చింది. ఆ కాలంలో ఎడారి జీవితం చాలా కష్టంగా ఉండేది. ఆహారం కోసం వేటాడ్డానికి చాలా దూరం వెళ్ళవలసివచ్చేది.

ఆమె తన భర్త గురించి చెబుతూ ఆయన చాలా కష్టపడి తమను పోషిస్తున్నారని ప్రశంసలతో ముంచెత్తింది. అల్లాహ్ కు కృతజ్ఞతలు అర్పిస్తూ మాట్లాడింది. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) చాలా సంతోషించారు. ఇస్మాయీల్(అలైహిస్సలాం)కు తగిన భార్య లభించిందని ఆనందించారు. తాను ఎవరైనది ఆమెకు చెప్పలేదు. తాను ఒక స్నేహితుడిని అని మాత్రమే చెప్పారు. ఆమె ఎలాంటి కోడలో తెలుసుకోవాలని ఆయన భావించారు. ఆమె గురించి తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా ఒక సందేశం రూపంలో అందించి ఆమెను ఆశ్చర్యపరచాలని భావించారు. అక్కడి నుంచి బయలుదేరుతూ ఆయన ఆమె చూపిన అతిథి మర్యాదలకు కృతజ్ఞతలు చెప్పారు. “మీ భర్త వచ్చిన తర్వాత నా సలాములు చెప్పండి. ఇప్పుడు ద్వారబంధం చక్కగా కుదిరిందని చెప్పండి” అని వెళ్ళిపోయారు.

ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె జరిగింది వివరిం చారు. వచ్చిన అతిథి ఎలా ఉన్నారని ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ప్రశ్నించారు. ఆమె వివరించిన తర్వాత ఇస్మాయీల్ (అలైహిస్సలాం) నవ్వుతూ, వచ్చినది తన తండ్రి అనీ, ఆయన నిన్ను నాకు తగిన భార్యగా అభివర్ణించారనీ, నీతో కలసి ఉండాలని, నిన్ను కాపాడాలని కోరారని వివరించారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) జీవితాంతం ఆమెతో కలసి ఉన్నారు. ఆమె ద్వారా ఆయనకు సన్మార్గులైన సంతానం కలిగారు.

కాబా నిర్మాణం

ఇబ్రాహీమ్(అలైహిస్సలాం) తన కుమారుణ్ణి చూసి చాలా కాలమయ్యింది. ఈ సారి ఆయన ఒక అతి ముఖ్యమైన పని చేయవలసి ఉంది. ప్రపంచంలో మొట్ట మొదటి ఆరాధనాలయాన్ని నిర్మించవలసిందిగా అల్లాహ్ ఆయన్ను ఆజ్ఞాపించాడు. మక్కా లోయలో ఈ ఆరాధనాలయం ప్రాచీన కాలంలో ఉండేది. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) మక్కా లోయకు వచ్చారు. అక్కడ జమ్ జమ్ బావి వద్ద తన కుమారుడు ఇస్మాయీల్(అలైహిస్సలాం) బాణాలకు పదును పెడుతుండడాన్ని చూశారు. తండ్రిని చూసి ఆయన అత్యంత సంతోషించారు. తండ్రీకొడుకులు ఆనందంతో కౌగలించుకున్నారు. అల్లాహ్ తనకు కాబా గృహాన్ని నిర్మించమని ఆదేశించాడని ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) కుమారునికి తెలియజేశారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ఎల్లప్పుడు తన ప్రభువు ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉండేవారు. ఇరువురు కలసి కాబా గృహం పునాదులు తవ్వసాగారు. ఈ పని చేస్తున్నప్పుడు వారి నోట క్రింది పదాలు వారి హృదయాల్లోని భావాలను వ్యక్తం చేస్తూ వెలువడసాగాయి.

“ఓ ప్రభూ! మా యిద్దర్ని ముస్లిములుగా జేయి. మా సంతానంలో ముస్లిం జాతిని ఉద్భవింపజేయి. మా ప్రయత్నాల ఫలితాలను మాకు చూపించు. మా పశ్చాత్తాపాన్ని స్వీకరించు. నీవే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడివి. అత్యంత కరుణామయుడివి.”

ఇస్మాయీల్ (అలైహిస్సలాం) రాళ్ళను మోసుకుని వస్తుంటే ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) వాటిని అమర్చసాగారు. కొంతకాలానికే నిర్మాణం రూపురేఖలు దిద్దుకుంది. తమకు సహాయంగా ఎవరినీ వారు తీసుకోలేదు. గోడలు చాలా ఎత్తుకు లేచాయి. ఇప్పుడు రాళ్ళు పేర్చడానికి ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఏదైనా ఎత్తు వేసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆయన ఇస్మాయీల్ (అలైహిస్సలాం)తో ఏదైనా మంచిరాయి, తాను నిలబడడానికి చూడమని చెప్పారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ఒక పెద్దరాయిని అక్కడికి దొర్లించారు*. ఆ విధంగా కాబాగృహం నిర్మించబడింది. మక్కాలో కాబా గృహం నిర్మించబడినప్పటి నుంచి ప్రపంచవ్యాప్త ముస్లిములకు (దైవవిధేయులకు) పవిత్రమైన గృహంగా కొనసాగుతోంది. విశ్వప్రభువైన అల్లాహ్ పట్ల తమ కృతజ్ఞ తలను ముస్లిములు ఇక్కడికొచ్చి తెలియజేస్తుంటారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 14:37-38)

* ఈ రాయి వేలాది సంవత్సరాలుగా పరిరక్షించబడుతుంది. నేడు ‘మకామె ఇబ్రాహీమ్’ అన్న పేరుతో గాజు పలకల మధ్య ఉన్న రాయి ఇదే.

గ్రహించవలసిన పాఠాలు

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)ను ప్రవక్తల పితామహునిగా పేర్కొనడం జరిగింది. సమాజంలో విగ్రహారాధన, మానవ బలి వంటి దురాచారాలను తుదముట్టించడానికి ఆయన నిరంతరం శ్రమించారు.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తండ్రి అల్లాహ్ సందేశాన్ని తిరస్కరించినప్పుడు ఆయన తన తండ్రిని నిందించలేదు. ఆయన సాఫల్యం కొరకు ప్రార్థిం చారు. ఆయనను సత్యసందేశం స్వీకరించేలా మార్చాలని ఆశించారు. తండ్రి పట్ల ఆయన చాలా ప్రేమగా వ్యవహరించారు. ఆయన పట్ల గౌరవమర్యాదల్లో లోపం చేయలేదు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) అల్లాహ్ పట్ల పూర్తి విశ్వాసం కలిగిన వారు. ఎలాంటి త్యాగానికైనా వెనుదీయని వ్యక్తిత్వం ఆయనది. విశ్వప్రభువైన అల్లాహ్ ఆయన్ను “ఖలీలుల్లాహ్” (అల్లాహ్ కు మిత్రుడు) గా అభివర్ణించాడు.

విగ్రహారాధకులను ఎదుర్కొన్నప్పుడు ఆయన అనితరసాధ్యమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. వారు అత్యంత పవిత్రంగా భావిస్తున్న అంశాలలోని ఔచిత్యాన్ని నిర్భయంగా ప్రశ్నించారు. మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు ఆయన తన నిరసనను చేతల్లో చూపించారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. అందువల్ల ఆయన అగ్నిగుండంలోకి విసరివేయబడడం జరిగింది. కాని అల్లాహ్ పట్ల ఆయనకున్న చెక్కు చెదరని విశ్వాసం ఆయన్ను కాపాడింది.

ఆయన భార్యలు సౌరా, హాజిరా ఇద్దరూ సౌశీల్యవతులు, ఆయన పట్ల పూర్తి నిబద్ధత కలిగినవారు. సహనంతో వ్యవహరిస్తూ గొప్ప గొప్ప త్యాగాలు చేశారు. అందుగ్గాను అల్లాహ్ వారికి అనేక విధాల బహూకరించాడు.

హాజిరా పట్ల, హాజిరా కుమారుని పట్ల ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) గారి శ్రద్ధ చూసి సారా అసూయపడడం మానవ సహజమైన ప్రతిక్రియగా అర్థం చేసుకోవాలి.

సారాతో తన సంబంధాన్ని రాజుకు చెప్పకుండా దాచారు ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం). ఆ విధంగా తమ ప్రాణాలకు ప్రమాదం రాకుండా చూసుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ విధంగా వ్యవహరించే అనుమతి ప్రకారమే ఆయన చేశారు.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) కుమారుడు ఇస్మాయీల్ (అలైహిస్సలాం) తండ్రికి తగిన తనయుడు. తనకు తానుగా బలికి సిద్ధమై అల్లాహ్ సంతుష్టిని పొందారాయన.

అల్లాహ్ కు మానవ బలి అవసరం లేదు. అల్లాహ్ కోసం కన్నకొడుకును బలిపెట్టడానికి సిద్ధపడడాన్ని, అల్లాహ్ సేవ కోసం కన్న కుమారుడిని అంకితం చేయడంగా మనం అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలం.

వారు నిర్మించిన కాబా గృహం దేవుని ఏకత్వానికి చిహ్నంగా గత 4000 ఏళ్ళ సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది.

ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) జీవిత పాఠాలు

https://youtu.be/GRVQpu_nuJA

ఇతర ముఖ్యమైన లింకులు