ప్రవక్త సాలిహ్ (అలైహిస్సలాం) – సమూద్ జాతి ప్రజలు వారి విశిష్ట ఒంటె [వీడియో]

ప్రవక్త సాలిహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]
https://youtu.be/cbP4rt3rO4Q [43 నిముషాలు]
ముహమ్మద్ సలీం జామిఈ (హఫిజహుల్లాహ)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త సాలిహ్ (అలైహిస్సలాం) (సమూద్ జాతి ప్రజలు వారి విశిష్ట ఒంటె)

సమూదు (జాతి) వారు తమ పొగరు మూలంగా (వారి ప్రవక్తను) ధిక్కరించారు…… “మీరు దేవుని ఈ ఆడ ఒంటె విషయంలో, దాని నీళ్ల వంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి” అని దైవప్రవక్త వారిని హెచ్చరించాడు. కాని వారు మాత్రం తమ ప్రవక్త (మాటల)ను త్రోసిపుచ్చి, దాని గిట్టెలను నరికి(చంపేశారు). (ఖుర్ఆన్ 91 : 11-14).

91:11 كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا
91:12 إِذِ انبَعَثَ أَشْقَاهَا
91:13 فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا
91:14 فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنبِهِمْ فَسَوَّاهَا

సమూదు (జాతి) వారు తమ పొగరు మూలంగా (వారి ప్రవక్తను) ధిక్కరించారు. అప్పుడు వారిలోని ఒక పెద్ద దౌర్భాగ్యుడు (వారి తలబిరుసుపోకడలకు సారధిగా) నిలబడ్డాడు. “మీరు అల్లాహ్ యొక్క ఈ ఆడ ఒంటె విషయంలో, దాని నీళ్ళ వంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి” అని దైవప్రవక్త వారిని హెచ్చరించాడు..కాని వారు మాత్రం తమ ప్రవక్త (మాటల)ను త్రోసిపుచ్చి, దాని గిట్టెలను నరికి (చంపేశారు). అంతే! వారి ప్రభువు వారి దురాగతాల కారణంగా వారిపై వినాశాన్ని పంపాడు. వారందరినీ సమానం (నేలమట్టం) చేశాడు.

ఆద్ జాతి ప్రజల వినాశం తర్వాత సమూద్ జాతి వైభవోపేత స్థానాన్ని ఆక్రమించుకుంది. అయితే ఈ జాతి ప్రజలు కూడా విగ్రహారాధనకు లోనయ్యారు. భౌతిక సంపద పెరిగిన కొద్దీ వారి దుష్ట స్వభావం కూడా అధికమయ్యింది. సన్మార్గం కనుమరుగయ్యింది. ఆద్ జాతి ప్రజల మాదిరిగా వీరు కూడా ఎత్తయిన భవనాలను మైదాన ప్రాంతాల్లో నిర్మించారు. కొండలను తొలచి అందమైన సౌధాలు నిర్మించారు. అణచివేతలు, దౌర్జన్యాలు వారిలో నిత్యకృత్యమై పోయాయి. దుష్టులు, దుర్మార్గులు రాజకీయాధికారాన్ని ఆక్రమించుకున్నారు.

వారి వద్దకు ప్రవక్తగా సాలిహ్ (అలైహిస్సలాం) పంపబడ్డారు. కాని ఆయన సందేశాన్ని కేవలం నిరుపేదలు, అణగారిన ప్రజలు మాత్రమే స్వీకరించారు. సంపన్నులు, అధికారం కలిగినవారు ఆయన ప్రవక్త పదవిని నిరాకరించారు. అబద్ధాలు చెబుతున్నాడని వారు ఆయన్ను దూషించారు. ప్రవక్త సాలిహ్ (అలైహిస్సలాం)తో వారు, “నీవు చాలా కాలంగా మా మధ్య నివసిస్తున్నావు. నీ తెలివితేటలు, నీ వివేకం మాకు ఉపయోగ పడతాయనుకున్నాము. కాని ఇప్పుడు నువ్వు మా పూర్వీకులు పూజించిన దేవుళ్ళను వదలుకోవాలని చెబుతావా?” అన్నారు. సాలిహ్ (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “మీరు మీ నాయకులను, వారి దుష్ట మార్గాలను అనుసరించడం మానండి. వారు ఔచిత్యాన్ని పూర్తిగా కోల్పోయారు. మీరు సాఫల్యాన్ని పొందే ఏకైక మార్గం అల్లాహక్కు భయపడడం మాత్రమే. మీకు నా నిజాయితీ గురించి బాగా తెలుసు. అల్లాహ్ సందేశాన్ని ప్రచారం చేయడంలో నాకు వేరే రహస్య ఉద్దేశ్యాలు ఏవీ లేవు” అన్నారు.

సాలిహ్ (అలైహిస్సలాం) తన సందేశ ప్రచారాన్ని మానుకునేలా లేడని వారు భావించారు. ఆయన్ను అనుసరించే వారి సంఖ్య పెరుగుతుందన్న భయం వారికి పట్టు కుంది. ఆయన్ను నిరోధించడానికిగాను వారు ఒక పథకం వేశారు. ఆయనతో, “నీవు అల్లాహ్ ప్రవక్తవన్న విషయాన్ని మాకు నిరూపించు. ఏదైనా స్పష్టమైన మహత్యాన్ని మాకు చూపించు. కొండల్లోంచి ఒక విశిష్టమైన ఒంటెను బయటకు వచ్చేలా చేయి” అన్నారు.

అల్లాహ్ సాలిహ్ (అలైహిస్సలాం)కు ఈ మహత్యాన్ని ప్రసాదించాడు. ఒక విశిష్టమైన, భారీకాయం కలిగిన ఆడ ఒంటె కొండ నుంచి బయటకు వచ్చింది. వారందరూ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టారు. వారు ఆ ఒంటెను చంపుతారేమో అన్న భయం సాలిహ్ (అలైహిస్సలాం)కు కలిగింది. ఆ విధంగా చేస్తే అల్లాహ్ శిక్షను ఆహ్వానించడమే అవుతుంది. అందువల్ల వారిని ఆయన హెచ్చరించారు. “ఆ ఒంటె మీకు అల్లాహ్ చిహ్నం. మీ జీవితాలు ఇప్పుడు దానితో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయి. మీ పొలాల్లో దానిని స్వేచ్ఛగా మేయనీయండి. బావి నీటిని ఒక రోజు మొత్తం ఆ ఒంటె తాగడానికి వదిలేయండి. మరుసటి రోజు మీరూ, మీ పశువులు బావి నీటిని వాడుకోండి. ఆ ఒంటెకు మీరు హాని కలిగిస్తే తక్షణం మీపై అల్లాహ్ శిక్ష విరుచుకుపడుతుంది” అని చెప్పారు.

కొంతకాలం వాళ్ళు ఆ ఒంటెను స్వేచ్ఛగా మేయడానికి, నీరు తాగడానికి వదిలేశారు. కాని మనస్సులో వారందరూ దానిని ద్వేషించడం ప్రారంభించారు. అయితే ఒక మహత్యంగా ఆ ఒంటె కొండ నుంచి రావడం చూసిన కొందరు సాలిహ్ (అలైహిస్సలాం) సందేశాన్ని సత్యమైనదిగా విశ్వసించారు. ఇది చూసి పాలక వర్గానికి చెందిన వారు మరింత ఆందోళన చెందారు. సాలిహ్ (అలైహిస్సలాం) అనుచరులను వారు అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశారు. కాని సాలిహ్ (అలైహిస్సలాం) అనుచరులు తమ విశ్వాసాన్ని హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నారు.

అవిశ్వాసుల నాయకులు ఆ ఆడ ఒంటెపై ఫిర్యాదులు మొదలు పెట్టారు. భారీ ఆడ ఒంటె బావిలో నీరు మొత్తం తాగేస్తోందనీ, తమ పశువులు దాన్ని చూసి భయపడుతున్నాయని వారు ఆరోపించడం ప్రారంభించారు.

ఆ ఆడ ఒంటెను చంపడానికి వాళ్ళు ఒక పథకం రచించారు. అందుకు వారు ఆడవాళ్ళ సహాయం తీసుకున్నారు. తమ ఆదేశాలను మగవాళ్ళు పాటించేలా ఆడవాళ్ళతో చెప్పించారు. మాహ్యా కుమార్తె సాదుక్ ఉన్నత వంశానికి, సంపన్న కుటుంబానికి చెందినది. మహ్రాజ్ కుమారుడు మస్దా యువకుడు. సాదుక్ అతణ్ణి ప్రలోభపెట్టింది. ఆ భారీ ఆడ ఒంటె మోకాలి కండరాన్ని తెగ్గొడితే నీ దాన్నయి పోతానంది. అనీజా అనే వృద్ధమహిళ తన కుమార్తెల్లో ఒక కుమార్తెను చూపించి సాలిఫ్ కుమారుడు కుదార్ను ప్రలోభపెట్టింది. ఆడ ఒంటెను చంపితే నా కూతురు నీదేనని చెప్పింది. సహజంగానే ఈ కుర్రాళ్ళు ఈ ప్రతిపాదనల ప్రలోభానికి గురయ్యారు. వారు మరో ఏడుగురిని తమ సహాయానికి ఎన్నుకున్నారు. వారందరూ ఆ ఒంటెను చాలా దగ్గరగా పరిశీలించారు. దాని కదలికలను జాగ్రత్తగా పరికించారు.

ఆ ఒంటె బావి దగ్గర నీళ్ళు తాగుతున్నప్పుడు మస్దా బాణంతో దాని కాలిని గురిచూసి కొట్టాడు. అది తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కాని బాణం దెబ్బకు పరుగెత్తలేకపోయింది. కుదార్ దాన్ని అనుసరించి ఖడ్గంతో దాని కాలిపై వేటు వేశాడు. అది నేలపై కూలిపోగానే దానిని ముక్కలు ముక్కలు చేశాడు. ఒంటెను చంపిన వారికి గొప్ప స్వాగతం లభించింది. పాటలు పాడుతూ వారిని పొగిడారు. వారి గొప్పదనాన్ని కీర్తిస్తూ కవితలు అల్లారు. అహంభావంతో వారు సాలిహ్ (అలైహిస్సలాం)ను ఎగతాళి చేశారు. ఆయన వారితో, “మరో మూడు రోజులు జీవితాన్ని అనుభవించండి. ఆ పిదప మీపై శిక్ష రానుంది” అన్నారు. వారు తాము చేసిన తప్పులు తెలుసుకుంటారనీ, ఈ మూడు రోజుల్లో తమ ప్రవర్తనను మార్చుకుంటారని సాలిహ్ (అలైహిస్సలాం) ఆశించారు. కాని వాళ్ళు ఆయన్ను ఎగతాళి చేస్తూ, “మూడు రోజులెందుకు? ఆ శిక్షేదో త్వరగా రానివ్వు” అన్నారు. ఆయన వారికి నచ్చచెబుతూ, “ప్రజలారా! మీరు మంచికి బదులుగా చెడు కోసం తొందరపడుతున్నారెందుకు? మీరు అల్లాహ్ తో క్షమాభిక్ష ఎందుకు కోరుకోవడం లేదు? ఆ విధంగా మీరు దేవుని కారుణ్యం పొందే అవకాశం ఉంది కదా!” అన్నారు. కాని వారు ఆయన మాటల్ని ఖాతరు చేయలేదు. పైగా “నీ ఉనికి, నీ అనుచరుల ఉనికి మాకు చెడ్డ శకునంగా దాపురించింది” అని వారు ఆయనతో అన్నారు.

అవిశ్వాసులు సాలిహ్ (అలైహిస్సలాం)ను, ఆయన కుటుంబీకులను హతమార్చే పథకం వేశారు. దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ దీని గురించి చెబుతూ, “వారు పథకం వేశారు. మేము కూడా ఒక పథకం వేశాము, దాన్ని వారు అర్ధం చేసుకోవడం సాధ్యం కాదు” అని పేర్కొన్నాడు. అల్లాహ్ సాలిహ్ (అలైహిస్సలాం)ను, ఆయన అనుచరులను అవిశ్వాసుల కుట్ర నుంచి కాపాడాడు. సాలిహ్ (అలైహిస్సలాం) బాధాతప్త హృదయంతో దుర్మార్గులను వదలి తన అనుచరులతో సహా మరో ప్రదేశానికి తరలి పోయారు.

సాలిహ్ (అలైహిస్సలాం) హెచ్చరించిన మూడు రోజులు గడిచిన పిదప మహా ఉరుములు దద్దరిల్లాయి. భయంకరమైన భూకంపం కుదిపేసింది. మొత్తం జాతిని, వారి ఇళ్ళను సర్వనాశనం చేసింది. వారి బలమైన భవనాలు, కొండలను తొలచిన వారి నివాసాలు ఏవీ వారిని కాపాడలేకపోయాయి.

(చదవండి దివ్యఖుర్ఆన్: 11:61-67, 7:73-79, 26:141-159, 26:45-53, 27:51, 54:23-31, 91:11-15)

ఆద్, సమూద్ జాతుల కథల్లో ఒకే విధమైన గుణపాఠం ఉంది. అల్లాహ్ ప్రసాదించిన నైపుణ్యాలను, సంపదను, బలసామర్థ్యాలను దుర్వినియోగం చేయడం ప్రారంభించిన జాతి వినాశం వైపునకు ప్రయాణిస్తుంది. హూద్ (అలైహిస్సలాం) ఆద్ జాతి ప్రజలను అల్లాహ్ అవిధేయతకు పాల్పడవద్దని బోధించారు. తమ సంపదను ప్రదర్శించడానికి విలాసవంతమైన భవనాలు నిర్మించి సుఖవిలాసాల కోసం వృధా చేయవద్దని వారించారు. సమూద్ జాతి ప్రజలు సాలిహ్ (అలైహిస్సలాం)ను మహత్యం చూపించమని కోరారు. ఆ విధంగా ప్రవర్తనని నిరూపించుకొమ్మన్నారు. కాని మహత్యం చూపించిన తర్వాత దాని పట్ల అనుచితంగా వ్యవహరించారు.

హూద్ (అలైహిస్సలాం) జాతి ప్రజలను అల్లాహ్ కఠినంగా శిక్షించాడు. ఎందు కంటే వారు దుర్మార్గులైన తమ పాలకులను గుడ్డిగా అనుసరించారు. ఆ విధంగా వినాశాన్ని కొనితెచ్చుకున్నారు.

దివ్యఖుర్ఆన్ ప్రకారం, సంపద అన్నది వ్యక్తిగతమైనది కావచ్చు. కాని దాని ప్రయోజనాన్ని అవసరార్ధులు, నిరుపేదలతో పంచుకోవాలి.

సంస్కర్తకు స్థయిర్యం, సహనం ఉండాలి. హూద్(అలైహిస్సలాం) తనపై కుట్ర పన్నిన వారిని ఎదిరించారు. కేవలం అల్లాహ్ పై మాత్రమే భారం వేశారు. అల్లాహ్ ఆయన భయాలను దూరం చేసి భద్రతను ప్రసాదించాడు. ఆయన బలహీనతలను బలంగా మార్చాడు.

ప్రజలు తమకు లభించిన జ్ఞానవిజ్ఞానాలు, వైజ్ఞానిక, సాంకేతిక ప్రగతీ వికాసాలు చూసి అహంభావానికి గురవుతారు. సత్యాన్ని నిరాకరిస్తారు. బలహీనులను బానిసలుగా చేసుకుంటారు. వారి సంపదను, వనరులను దోచుకోవడానికి ప్రయత్నిస్తారు.

పాపాలు, అవిధేయత జీవనవిధానంగా మారినప్పుడు అల్లాహ్ చట్టం ప్రభావం చూపుతుంది. అది వారి వినాశానికి మార్గం అవుతుంది. కేవలం అల్లాహ్ వైపునకు మరలడం ద్వారా, ఆయన్ను క్షమాభిక్ష వేడు కోవడం ద్వారా మాత్రమే దైవాగ్రహం నుంచి తప్పించుకోగలుగుతారు.