అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం | జాదుల్ ఖతీబ్

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:-
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం: [ఇక్కడ డౌన్లోడ్ PDF]

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు 

 • 1) ఖురాను హదీసుల వెలుగులో అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం ప్రాధాన్యత.
 • 2) అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం – మహత్యం మరియు లాభాలు.
 • 3) అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం- కొన్ని మహత్తరమైన ఉదాహరణలు.
 • 4) అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం – మర్యాదలు.
 • 5) అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం – కొన్ని రూపాలు.
 • 6) దానాల ద్వారా లభించిన పుణ్యాన్ని వ్యర్థం చేసే కొన్ని కార్యాలు.
 • 7) జకాత్ విధిత్వము – దాని అంశాలు.

మొదటి ఖుత్బా

ఇస్లామీయ సోదరులారా!

అల్లాహ్ యే తన దాసులకు సంపదను ప్రసాదిస్తాడు. కొందరికి ఎక్కువ గానూ, కొందరికి తక్కువ గానూ. తదుపరి ఆ సంపద నుండి ఖర్చు చేయమని ఆజ్ఞాపిస్తాడు. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయమని ప్రోత్సహిస్తాడు, పిసినారి తనాన్ని వారిస్తాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

مَّثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ۗ وَاللَّهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ

“అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానం ఇలా వుంటుంది : ఒక విత్తనాన్ని నాటగా అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకొస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు వుంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారికి సమృద్ధి వొసగు తాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతీదీ తెలిసినవాడు”. (బఖర 2:261)

ఈ ఆయత్ ద్వారా తెలిసేదేమిటంటే – మీరు అల్లాహ్ మార్గంలో ఒక రూపాయి ఖర్చు పెట్టడం 700 రూపాయలు ఖర్చు పెట్టడంలాగా అన్నమాట.

అంటే – అల్లాహ్ మీకు దాని పుణ్యాన్ని 700 రెట్లు లేదా అంతకన్నా ఎక్కువగా చేసి ప్రసాదిస్తాడు. ఒకవేళ ఒక ధనవంతుడు ఒక వ్యక్తితో- నువ్వు ఈ రోజు ఫలానా వ్యక్తికి 100 రూపాయలిస్తే రేపు నేను నీకు 700 రూపాయలు ఇస్తాను- అని అంటే అతను 100 రూపాయలు ఇవ్వడానికి తటపటా యిస్తాడా? లేక నిరాకరించడానికి సాకులు వెతుకుతాడా? ఖచ్చితంగా అలా చెయ్యడు. ఎందుకంటే దీనికి బదులుగా రేపు అతనికి 100 రూపాయలు కాదు, ఏకంగా 700 రూపాయలు దొరుకుతాయి.

మరైతే ఆ శుభప్రదమైన శక్తిమంతుని (అల్లాహ్) గురించి మీ అభిప్రాయమేమిటి మరి? యావత్ ఖజానాల తాళం చెవులు ఆయన వద్దనే వున్నాయి. ఆయన తన దాసులపై అనంత కరుణామయుడు మరియు అపార కృపాశీలుడూను. తన వాగ్దానంలో సత్యవంతుడు. మరి ఆయనే స్వయంగా – నా మార్గంలో ఖర్చు చేయండి, దానికి బదులుగా 700 రెట్లు అధికంగా పుణ్యఫలం ఇస్తానని సెలవిచ్చినప్పుడు, ఆయన ఈ పని చేయడానికి శక్తి కలిగి లేడా? మరి మనం ఆయన ఆజ్ఞప్రకారం ఆయన మార్గంలో ఖర్చు చేయకూడదూ! మరి చూడబోతే ఆయన ఇలా సెలవిచ్చి వున్నాడు:

وَمَا تُقَدِّمُوا لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ اللَّهِ هُوَ خَيْرًا وَأَعْظَمَ أَجْرًا

మీరు మీ కోసం ఏ మంచి (పుణ్యకార్యాన్ని) ముందుగా పంపినా, దానిని అల్లాహ్ దగ్గర అత్యుత్తమ పుణ్యఫలం రూపంలో అత్యధికంగా పొందుతారు” (ముజ్జమ్మిల్ 73:20) 

మరో ఆయత్ లో అల్లాహ్ పగలూ, రాత్రి (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసేవారికి శుభవార్తనిస్తూ ఇలా సెలవిచ్చాడు:

الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُم بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ

ఎవరైతే తమ సిరిసంపదలను రేయింబవళ్ళు రహస్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు చేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద (గొప్ప) పుణ్యఫలం వుంది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు”. (బఖర 2:274)

మరొక చోటైతే అల్లాహ్ తన సంపదలోని ప్రియతమ వస్తువును అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయనంత వరకు ఎవరు కూడా పుణ్యఫలస్థాయికి చేరుకోలేడు అని స్పష్టం చేసాడు. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

لَن تَنَالُوا الْبِرَّ حَتَّىٰ تُنفِقُوا مِمَّا تُحِبُّونَ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ

మీకు ప్రియాతి ప్రియమైన వస్తువుల నుండి మీరు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంతవరకు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు పెట్టేదంతా అల్లాహ్ కు తెలుసు”. (ఆలి ఇమ్రాన్ 3:92)

ఈ ఆయత్ అవతరించాక సహాబాలు, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం గురించి చక్కటి ఉదాహరణలు సమర్పించారు.

వీటిలో ఒకటి అబూతల్హా సమర్పించినది – అనస్ (రజియల్లాహు అన్హు) ) కథనం : అబూ తల్హా (రజియల్లాహు అన్హు) మదీనా అన్సారులలో అందరికన్నా ధనవంతులు. తన సంపదలో ఆయనకు అత్యంత ప్రియమైనది మస్జిదె నబవి ముందు వున్న ఖర్జూరపు తోట. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తరచూ అక్కడికి వెళుతుండేవారు, దానిలోని నీళ్ళను త్రాగేవారు. “మీకు ప్రియాతి ప్రియమైన వస్తువుల నుండి అల్లాహ్ మార్గంలో…..” అన్న ఆయత్ అవతరించాక అబూ తల్హా (రజియల్లాహు అన్హు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికొచ్చి, ఓ దైవ ప్రవక్తా! అల్లాహ్ తన గ్రంథంలో- ‘మీకు ప్రియాతి ప్రియమైన వస్తువులను అల్లాహ్ మార్గంలో…..’ అని ఆజ్ఞాపించాడు. మరి నా ఖర్జూరపు తోట నాకు ఎంతో ప్రియమైనది. కనుక నేను దీనిని అల్లాహ్ కోసం దానం చేస్తున్నాను. దీని పుణ్యఫలాన్ని అల్లాహ్ నుండే ఆశిస్తున్నాను మరియు దానిని అల్లాహ్ వద్ద నిల్వ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే దీనిని మీరు మీ యిష్ట ప్రకారం ఖర్చు చేయండి అని విన్నవించుకున్నారు.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – ‘చాలా మంచిది, ఇదెంతో లాభదాయకమైన సంపద, ఇదెంతో లాభదాయకమైన సంపద‘ అని అన్నారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – ‘నువ్వు చెప్పినదంతా నేను విన్నాను. కానీ నా ఉద్దేశ్యం (సలహా) ఏమిటంటే-దీనిని (తోటను) నువ్వు నీ బంధువులకు పంచిపెట్టు’ అని చెప్పారు. దీనితో, ఆయన ఆ తోటను తన బంధువులకు, బాబాయి కొడుకులకూ పంచిపెట్టారు. (బుఖారీ: 2318, ముస్లిం: 998)

మరో చోట అల్లాహ్- తన మార్గంలో ఖర్చు పెట్టకుండా పిసినారితనాన్ని ప్రదర్శించేవారిని హెచ్చరిస్తూ అలాంటి వారిని తుదముట్టించి, వారి స్థానంలో పిసినారితనం చూపకుండా ఖర్చు చేసేవారిని తీసుకువస్తానని ఆజ్ఞాపించాడు:

هَا أَنتُمْ هَٰؤُلَاءِ تُدْعَوْنَ لِتُنفِقُوا فِي سَبِيلِ اللَّهِ فَمِنكُم مَّن يَبْخَلُ ۖ وَمَن يَبْخَلْ فَإِنَّمَا يَبْخَلُ عَن نَّفْسِهِ ۚ وَاللَّهُ الْغَنِيُّ وَأَنتُمُ الْفُقَرَاءُ ۚ وَإِن تَتَوَلَّوْا يَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ ثُمَّ لَا يَكُونُوا أَمْثَالَكُم

ఇదిగో! అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండని పిలిచినప్పుడు కొందరు పిసినారులుగా వ్యవహరిస్తున్నారు. ఎవరయితే పిసినారితనం వహిస్తు న్నాడో అతను తన పట్లనే పిసినారితనం వహిస్తున్నాడు. అల్లాహ్ సంపన్నుడు (అక్కర లేనివాడు). మీరేమో పేదలు (ఆయన పై ఆధార పడినవారు). ఒకవేళ మీరు గనక మరలిపోతే – ఆయన మీ బదులు మీ స్థానంలో మరో జాతివారిని తీసుకువస్తాడు. మరి వారు మీలాంటి వారై వుండరు”. (ముహమ్మద్ 47:38)

‘సబా’ సూరాలో అల్లాహ్ – మీరు ఎక్కువగా గానీ, తక్కువగా గానీ ఏం ఖర్చు చేసినా సరే – దానికిగాను అత్యంత మేలైన ఉపాధి ప్రదాత అయిన అల్లాహ్ మీకు దాని స్థానంలో మరింత ఎక్కువగా ప్రసాదిస్తాడని సెలవిచ్చాడు:

وَمَا أَنفَقْتُم مِّن شَيْءٍ فَهُوَ يُخْلِفُهُ ۖ وَهُوَ خَيْرُ الرَّازِقِينَ

“(అల్లాహ్ మార్గంలో) మీరు ఏది ఖర్చు చేసినా ఆయన దానికి (సంపూర్ణ) ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అందరికన్నా ఉత్తమ ఉపాధి ప్రదాత”. (సబా 34:39)

కనుక, ఏ వ్యక్తి అయినా, అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తూ ఇలా చేస్తూవుంటే నా సంపద తగ్గిపోతుంది – అని ఆలోచించకూడదు. పైగా అల్లాహ్ ఆదేశాలపై పూర్తిగా నమ్మకం వుంచి, దీనికి బదులుగా మరింత ఉత్తమ ఉపాధిని ఆయన తనకు ప్రసాదిస్తాడని గట్టిగా నమ్మి ఖర్చు చేయాలి.

ఈ ఆయతుల అన్నింటి సారాంశమేమిటంటే – అల్లాహ్ మనల్ని – తన మార్గంలో ఖర్చు పెట్టమని ప్రోత్సహించాడు. దీని ద్వారా కలిగే ప్రయోజనం, దొరికే పుణ్యఫలం వైపునకు మన దృష్టిని ఆకర్షింపజేసాడు.

దీనికనుగుణంగా, స్వయానా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా చాలా ఎక్కువగా (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసేవారు, ఇతరులకు కూడా దీని గురించి ప్రోత్సహించేవారు మరియు పిసినారితనాన్ని ఖండించేవారు.

అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

ప్రతిరోజూ ఉదయం ఇద్దరు దైవ దూతలు అవతరిస్తారు. అందులో ఒకతను ఇలా ప్రార్థిస్తాడు- ఓ అల్లాహ్ ! ఖర్చుచేసేవారికి మరింతగా ప్రసాదించు. ఇంకో అతను ఇలా ప్రార్థిస్తాడు – ఓ అల్లాహ్! ఖర్చు చేయని వారి సంపదను నాశనం చెయ్యి”. (బుఖారీ : 1442, ముస్లిం : 1010)

అబ్దుల్లా బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

ఇద్దరు వ్యక్తుల ఆచరణలపై అసూయ చెందవచ్చు. ఇందులో ఒకరేమో – అల్లాహ్ అతనికి ఖురాన్ ఇవ్వగా దానిని అతను రేయింబవళ్ళు పఠించేవాడు. మరొకరెవరంటే అల్లాహ్ అతనికి సంపదను ప్రసాదించగా అతను దానిని ఆయన మార్గంలో ఖర్చుచేసేవాడు”. (బుఖారీ: 5025, ముస్లిం:815)

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం అసూయ పడగలిగే ఆచరణ.

అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు :“ఓ ఆదమ్ సంతానమా! నువ్వు ఖర్చు చేయి, నీపై (నేను) గూడా ఖర్చు చేస్తూ వుంటాను.” (బుఖారీ : 4684, ముస్లిం: 993)

అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం ఎంతో లాభదాయకమైన వర్తకం

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّ الَّذِينَ يَتْلُونَ كِتَابَ اللَّهِ وَأَقَامُوا الصَّلَاةَ وَأَنفَقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً يَرْجُونَ تِجَارَةً لَّن تَبُورَ لِيُوَفِّيَهُمْ أُجُورَهُمْ وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۚ إِنَّهُ غَفُورٌ شَكُورٌ

“దైవ గ్రంథాన్ని పఠిస్తూ నమాజు నెలకొల్పేవారు, మేము ప్రసాదించిన దానిలోనుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు చేసేవారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు. వారికి వారి ప్రతిఫలాలు (అల్లాహ్) పూర్తిగా యివ్వటానికి, తన కృపతో ఆయన వారికి మరింతగా ప్రసాదించ టానికి గాను (వారు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు). నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు, సన్మానించేవాడు”. (ఫాతిర్ 35 : 29-30)

ఈ ఆయత్ ద్వారా తెలిసిందేమిటంటే -అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం ఎలాంటి వర్తకం అంటే- దీంట్లో ఎల్లప్పుడూ లాభమే చేకూరుతుంది, నష్టం ఎప్పుడూ కలుగదు. అంటే- సంపదలో శుభం కలుగుతుంది మరియు ఉపాధి ద్వారాలు మరింతగా తెరువబడతాయి.

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

إِن تُقْرِضُوا اللَّهَ قَرْضًا حَسَنًا يُضَاعِفْهُ لَكُمْ وَيَغْفِرْ لَكُمْ ۚ وَاللَّهُ شَكُورٌ حَلِيمٌ

మీరు గనక అల్లాహ్ కు మంచి రుణం ఇస్తే (అంటే అల్లాహ్ మార్గంలో ఖర్చుపెడితే) దాన్ని ఆయన మీ కొరకు పెంచుతూ పోతాడు. మీ పాపా లను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ (తన దాసుల సేవలను గుర్తించే వాడు, సహనశీలుడు”. (తగాబున్ 64:17)

ఈ ఆయత్ లో అల్లాహ్ – తన మార్గంలో ఖర్చుచేయడాన్ని – తనకు ఇచ్చే మంచి రుణం అని ఖరారు చేశాడు. మరి చూస్తే సంపద యొక్క అసలు యజమాని అల్లాహ్ యే. ఆయన తాను తలచుకున్న వారికి ఎక్కువగాను, తాను తలచినవారికి తక్కువగాను ప్రసాదిస్తాడు. సంపదను దాని అసలు యజమానికి తిరిగి ఇవ్వడం రుణం అనిపించు కోదు. కానీ అల్లాహ్ కృప చూడండీ! దీనిని ఆయన ‘మంచి రుణం’గా ఖరారు చేసి దాన్ని ఎన్నో రెట్లు పెంచుతాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

يَمْحَقُ اللَّهُ الرِّبَا وَيُرْبِي الصَّدَقَاتِ ۗ وَاللَّهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ أَثِيمٍ

అల్లాహ్ వడ్డీని హరింపజేశాడు, దాన ధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ ఎంత మాత్రం ప్రేమించడు”. (బఖర 2:276)

అల్లాహ్- దానాలను ఎలా పెంచుతాడు?- దీని వివరణ మనకు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

“ఏ వ్యక్తి అయినా తన ధర్మయుక్త (హలాల్) సంపాదన నుండి ఒక ఖర్జూరపు పండుకు సమానంగా దానం చేస్తే – అల్లాహ్ హలాల్ సంపాదనే స్వీకరిస్తాడు- అల్లాహ్ దానిని తన కుడి చేత్తో స్వీకరిస్తాడు. తదుపరి మీరు మీ దూడను పెంచినట్లు ఆయన దానిని పెంచుతాడు. చివరికి అది (దానం) ఒక కొండ లాగా అవుతుంది”. (బుఖారీ:1410, ముస్లిం:1014)

అల్లాహు అక్బర్. మన సృష్టికర్త, యజమాని అయిన అల్లాహ్ ఎంత ఉదారుడో చూడండి! ఒక ఖర్జూరపు పండుతో సమానంగా వున్న దానాన్ని ఎంతగా పెంచుతాడంటే, అదొక కొండలాగా అవుతుంది! సుబహానల్లాహి వబిహమ్దిహి .

ఈ ఆయత్ లు మరియు హదీసుల ద్వారా తెలిసిందేమిటంటే – అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది మరియు ఎంతో లాభం చేకూరుతుంది. అందుకే అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టేవారు – తమ సంపద తరిగిపోతుందని ఎప్పుడూ భావించకూడదు. పైగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ ప్రవచనంపై గట్టి నమ్మకం కలిగి వుండాలి. “దానం సంపదను తగ్గించదు, పైగా దానిలో వృద్ధి కలుగజేస్తుంది”. (ముస్లిం: 2588)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బిలాల్ (రజియల్లాహు అన్హు) )తో ఇలా చెప్పారు: “ఓ బిలాల్! నువ్వు ఖర్చు చేస్తూ వుండు. అర్షి వాని (అల్లాహ్) తరఫు నుండి తగ్గుదల భయం పెట్టుకోకు”. (అస్సహీహ లిల్ అల్బానీ: 2661)

దానం ప్రళయం రోజు మనిషికి నీడనిస్తుంది

ప్రళయం రోజు అల్లాహ్ మొత్తం ఆదమ్ సంతతిని ఒకచోట సమీకరించి నప్పుడు ఈ రోజు కొన్ని వేల మైళ్ళ దూరంలో వున్న సూర్యుడు ఆ రోజు కేవలం ఒక మైలు దూరంలో వుంటాడు – మనుష్యులకు వారి వారి ఆచరణల కనుగుణంగా చెమట పడుతుంది. ఒకరి చెమట అతని చీలమండ వరకు, మరొకరి చెమట అతని మోకాళ్ళ వరకు, ఇంకొకరి చెమట అతని పొట్ట వరకు, మరొకరి చెమట అతని నోటి దాకా వుంటుంది. ఆ రోజు దానం చేసే వ్యక్తి తన దానం నీడలో వుంటాడు. దీని గూర్చి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

ప్రతి వ్యక్తి తన దానం నీడలో వుంటాడు మానవులందరి మధ్య నిర్ణయం జరిగేంత వరకు“.

ఇక దాన ధర్మాలను గోప్యంగా చేసేవాడు అల్లాహ్ యొక్క అర్ష్ నీడలో వుంటాడు. దీని గూర్చి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు :

ఏడు రకాల వ్యక్తులను అల్లాహ్ తన (అర్ష్) నీడలో వుంచుతాడు. ఆ రోజు దాని నీడ తప్ప మరే నీడా వుండదు… వారిలో ఒక వ్యక్తి ఎవరంటే అతను ఎంత గోప్యంగా దానం చేస్తాడంటే, తన కుడి చేత్తో ఖర్చు చేసేది అతని ఎడమ చేతికి కూడా తెలియకుండా వుంటుంది“. (బుఖారీ:1423, ముస్లిం:1031)

మరి మనం కూడా ప్రళయ దినపు వేడి మరియు ఆ దినపు చెమట నుండి తప్పించుకోవాలంటే వీలైనంత ఎక్కువగా దానధర్మాలు చేయాలి. ప్రత్యేకించి గోప్యంగా చేయాలి. తద్వారా ఎవరికీ తెలియకుండా కూడా వుంటుంది మరియు అర్ష్ నీడ కూడా దొరుకుతుంది.

దైవదూతలు సాగునీరు అందిస్తారు

అవును, నిజమండీ! దాన ధర్మాలు చేసే వ్యక్తి సంపద ఎంతో శుభప్రద మైనది. ఆ వ్యక్తి తోటలకు దైవదూతలు సాగునీరు అందిస్తారు.

అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు:

ఒక వ్యక్తి ఎడారి ప్రాంతం గుండా పోతుండగా, మేఘాల్లోంచి – ‘ఫలానా వ్యక్తి తోటకు నీళ్ళివ్వు’ అన్న శబ్దం విన్నాడు. తదుపరి ఆ మేఘం ఓ వైపునకు మరలి నల్లటి రాతి ప్రదేశంపై వర్షం కురిపించింది. అక్కడ వున్న ఒక కాలువ ఆ వర్షపు నీటిని తనలో సమీకరించుకుంది. ఈ వ్యక్తి ఆ నీటిని చూస్తూ (కాలువ వెంబడి) నడుస్తూ పోయాడు. అకస్మాత్తుగా అతను ఒక వ్యక్తిని ఒక తోటలో నిలబడి పారతో నీళ్ల ప్రవాహాన్ని తోట వైపునకు మళ్ళించడం చూశాడు. ఈ వ్యక్తి అతనితో- ఓ అల్లాహ్ దాసుడా! మీ పేరేమిటి? అని అడగ్గా, అతను తన పేరు చెప్పాడు. అతను చెప్పిన పేరు, మేఘాల్లో తను విన్న పేరు ఒకటే. తదుపరి ఆ తోటలోని వ్యక్తి ఇతనితో – మీరు నా పేరు ఎందుకడిగారు? అని ప్రశ్నించాడు. అతను- నేను మేఘాలలో ఒక శబ్దం విన్నాను. ఆ మేఘాలే ఈ నీటిని ఇక్కడి దాకా తీసుకొచ్చాయి. ఆ శబ్దం- ‘ఫలానా వ్యక్తి తోటకు నీళ్ళివ్వు’ అని అంటూ మీ పేరే చెప్పింది. మరి మీరు ఈ తోటలో (ప్రత్యేకంగా) ఏం చేస్తారో కాస్త సెలవిస్తారా? అని అడిగాడు. తోటలోని వ్యక్తి జవాబిస్తూ- మీరు నాకు విషయం మొత్తం చెప్పారు కాబట్టి నేను కూడా మీకు అసలు విషయం చెబుతాను. అదేమిటంటే, ఈ తోటలో పండ్లు కాసిన తర్వాత నేను వాటిని మూడు భాగాలుగా చేస్తాను. దానిలో ఒక భాగం దానం చేస్తాను, మరొక భాగం నేనూ, నా పిల్లలు తింటాం మరియు మూడో భాగాన్ని మళ్ళీ ఈ తోటలోనే మళ్ళిస్తాను. (అంటే తదుపరి పంట కోసం గింజల లాగా ఉపయోగిస్తాను). (ముస్లిం: 2984)

అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టడం వల్ల మంచి, శుభకర ద్వారాలు తెరుచు కోబడతాయి మరియు ఇతర వ్యవహారాలన్నీ తేలికవుతాయి.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ وَصَدَّقَ بِالْحُسْنَىٰ فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ وَكَذَّبَ بِالْحُسْنَىٰ فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ

ఎవరైతే (అల్లాహ్ మార్గంలో) ఇచ్చాడో, (తన ప్రభువుకు) భయపడుతూ వున్నాడో, ఇంకా సత్పరిణామాన్ని సత్యమని ధృవపరిచాడో, అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యం వొసగుతాము. మరెవరైతే పిసినారిగా తయారై, నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించాడో, సత్పరిణామాన్ని త్రోసిపుచ్చాడో, అతనికి మేము కఠిన (దుర్) మార్గసామగ్రిని సమకూరుస్తాము. అతను పడిపోయే సమయంలో అతని ధనం అతనికే విధంగానూ పనికిరాదు”. (లైల్ 92:5-11)

ఈ ఆయతుల ద్వారా తెలిసిందేమిటంటే – అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం వల్ల- ఖర్చుచేసే వ్యక్తి ముందు, మంచి, శుభకర ద్వారాలు తెరవబడ తాయి మరియు అతని సమస్త వ్యవహారాలు- ఇహలోకం పరలోకానికి సంబంధించినవన్నీ – తేలిక చేయబడతాయి.

దీనికి విరుద్ధంగా, మనిషి పిసినారి తనాన్ని ప్రదర్శించి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టకపోతే అతని ముందు మంచి, శుభకర ద్వారాలు మూసుకోబడతాయి మరియు అతని సమస్త వ్యవహారాలు కఠినతరం చేయబడతాయి.

అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టడం ద్వారా మనస్సు పరిశుద్ధమవుతుంది.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

خُذْ مِنْ أَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا وَصَلِّ عَلَيْهِمْ ۖ إِنَّ صَلَاتَكَ سَكَنٌ لَّهُمْ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ

“(ఓ ప్రవక్తా!) నువ్వు వారిని పరిశుద్ధ పరచటానికీ, వారిని తీర్చిదిద్దటానికి వారి సంపదల నుంచి దానాలను తీసుకో. వారి బాగోగుల కోసం ప్రార్థించు. నిస్సందేహంగా నీ ప్రార్థన (దుఆ) వల్ల వారికి శాంతి లభిస్తుంది. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు”. (తౌబా 9 :103)

ఈ ఆయతు ద్వారా తెలిసిందేమిటంటే దానధర్మాల వల్ల మూడు ప్రయోజనాలు చేకూరుతాయి.

 • మొదటిది- మనిషి పాపాల నుండి పరిశుద్ధుడౌతాడు.
 • రెండవది – (దాన ధర్మాల తర్వాత) మిగిలిన సంపద కూడా పరిశుద్ధమవు తుంది.
 • మూడవది- ఖర్చు చేసేవారి మనస్సు – ధనసంపదల మీద ప్రేమ, ఆశ, పిసినారి తనం లాంటి వ్యాధుల నుండి పరిశుద్ధంగా వుంటుంది.

అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టడం – సమాధిలోని అగ్నిని చల్లారుస్తుంది

ఉఖ్బా బిన్ ఆమిర్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “నిస్సందేహంగా దాన ధర్మాలు చేసే వారికి – వారి దానాలు వారి సమాధిలోని వేడిని చల్లారుస్తాయి మరియు నిజమైన విశ్వాసి (మోమిన్) ప్రళయం రోజు తన దానధర్మాల నీడలో వుంటాడు“. (అస్సహీహ అల్బానీ: 4384)

అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం గురించి కొన్ని చక్కటి ఉదాహరణలు

అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం – దీని మహత్యం, ప్రయోజనాలు, ప్రతిఫలాల గురించి వివరించాక ఇక మేము దీనికి సంబంధించిన కొన్ని చక్కటి ఉదాహరణలను మీకు వివరిస్తాం.

“చక్కటి ఉదాహరణలు” గురించి మాట్లాడడం మొదలు పెడితే మన మనస్సులోకి వచ్చే మొట్టమొదటి వ్యక్తి దైవప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం). ఎందుకంటే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ఉదారులు మరియు దానశీలురు,

అనస్ (రజియల్లాహు అన్హు ) కథనం: ఒక వ్యక్తి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో – రెండు కొండల మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని నింపగలిగే అన్ని మేకలను అడిగాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతనికి తను అడిగినట్లే ఇచ్చేశారు. తదుపరి ఆ వ్యక్తి తన జాతి వద్దకు వెళ్ళి వారితో ఇలా అన్నాడు – ఓ నా జాతి వారలారా! మీరంతా ఇస్లాం స్వీకరించండి. ఎందుకంటే, అల్లాహ్ సాక్షి! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బీదరికం, కటిక దరిద్ర భయం లేని వ్యక్తి లాగా ఇస్తారు. (ముస్లిం: 2312)

ఉఖ్బా బిన్ హారిస్ (రజియల్లాహు అన్హు) కథనం:

నేను (ఓ సారి) మదీనాలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెనుక అసర్ నమాజ్ చదివాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు ముగించగానే, వెంటనే లేచి ప్రజలను దాటుకొంటూ తన సతీమణులలోని ఒకరి ఇంటికి వెళ్ళారు. ప్రజలు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తొందర పాటును చూసి కాస్త ఆందోళన చెందారు. కాసేపయ్యాక, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బయటి కొచ్చారు. తన తొందరపాటు పట్ల ప్రజలు ఆందోళన చెందారని గమనించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు:

నేను నమాజులో వున్నప్పుడు, నా దగ్గర దానం చేయబడ్డ ఒక బంగారం ముద్ద వుందన్న విషయం గుర్తుకొచ్చింది. రాత్రి అయ్యేంత వరకు అది మా ఇంట్లోనే వుండిపోతుందేమోనని నేను శంకించాను. అందుకే నేను త్వరత్వరగా వెళ్ళి దానిని దానం చేయమని ఆజ్ఞాపించి వచ్చాను”. (బుఖారీ: 851, 1221, 1430)

ఇక సహాబాల విషయానికొస్తే, వారుకూడా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అడుగుజాడల్లో నడుస్తూ అల్లాహ్ మార్గంలో ఎంతో అధికంగా ఖర్చుపెట్టేవారు.

ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజియల్లాహు అన్హు) కథనం:

ఒకరోజు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మమ్మల్ని దానం చేయమని ఆజ్ఞాపించారు. అదృష్టవశాత్తూ ఆ రోజు నా దగ్గర కొంత ధనం వుంది. నేను మనసులో ఇలా అనుకున్నాను – ఈ రోజు అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) ను మించిపోవడానికి ఒక మంచి అవకాశం. ఇలా అనుకొని నా దగ్గరున్న ధనంలో సగం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి తీసుకొచ్చాను. ఆయన నాతో – మీ ఇంటి వారికి ఏం మిగిల్చి వచ్చారు? అని అడిగారు. నేను ఇక్కడికి ఎంతైతే తీసుకొచ్చానో, అంతే ధనం ఇంటి వారి కోసం కూడా మిగిల్చి వచ్చాను అని అన్నాను. తదుపరి అబూ బక్ర్ (రజియల్లాహు అన్హు ) తన మొత్తం ధనాన్ని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధిలో సమర్పించారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – మీ ఇంటి వారికి ఏం మిగిల్చి వచ్చారు? అని అడిగారు. ఆయన (అబూ బక్ర్) జవాబిస్తూ- నేను వారి కోసం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను మిగిల్చి వచ్చాను అని అన్నారు. అప్పుడు (మనసులో) నేననుకున్నాను- అబూ బక్ర్ ((రదియల్లాహు అన్హు) ను నేనెప్పుడూ మించిపోలేను అని. (అబూదావూద్:1678, హసన్ – అల్బానీ)

అబ్దుర్రహ్మాన్ బిన్ సముర (రజియల్లాహు అన్హు) కథనం:

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (జైషుల్ ఉస్రా) అంటే అత్యంత కష్టకాలపు సైనిక దళాన్ని తబూక్ యుద్ధం కోసం సిద్ధం కమ్మని ఆజ్ఞాపించగా, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజియల్లాహు అన్హు) ఒక వస్త్రంలో వెయ్యి దీనారులు తీసుకొని వచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జోలె లో కుమ్మరించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాటిని తన చేత్తో పైకి క్రిందికి కదుపుతూ పలుమార్లు ఇలా అన్నారు: “ఈ రోజు నుంచి ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ ఏమి చేసినా అతనికి నష్టమేమీ వాటిల్లదు”. (ముస్నద్ అహ్మద్, తిర్మిజీ, హసన్ -అల్బానీ)

ఉమ్మె దర్దా (రదియల్లాహు అన్హ) కథనం:

నేనొకసారి ఆయెషా (రదియల్లాహు అన్హ) సన్నిధికి లక్ష దిర్హములు తీసుకొని వెళ్ళాను. ఆ రోజు ఆమె ఉపవాసంతో వున్నారు. ఆ మొత్తం ధనాన్ని ఆమె పంచి పెట్టారు. దీనిపై నేను మీరు మొత్తం ధనాన్ని పంచి పెట్టేశారు, ఒకవేళ మీరు కోరుకుంటే కనీసం ఒక దిర్హము మీ కోసం వుంచుకొని, దానితో కొంత మాంసం కొనుక్కొని, దాని ద్వారా ఇఫ్తార్ సమయంలో భుజించగలిగే వారు అని అన్నాను. ఆమె జవాబిస్తూ- ఒకవేళ నువ్వు నన్ను ముందుగానే గుర్తు చేసి వుంటే నేను ఇలాగే చేసేదాన్ని అని అన్నారు. (తబఖాత్ ఇబ్నె సాద్: 8వ సంపుటం, 53వ పేజీ)

ఇలాంటి సంఘటనలు ఎన్నో వున్నాయి. మేము కేవలం మూడు సంఘట నలు వివరించాం. వీటి ద్వారా తెలిసిందేమిటంటే- సహాబాలు, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడంలో ఒకర్నొకరు మించిపోవడానికి ప్రయత్నించేవారు. ఎంత మనస్ఫూర్తిగా వారు ఖర్చుపెట్టేవారంటే ఈ విషయంలో వారు తమ ఇంటి వారిని సైతం మరిచిపోయేవారు.

అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం – వివిధ రకాల పద్ధతులు

అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడానికి ఎన్నో పద్ధతులు వున్నాయి. వాటిలో కొన్ని ఇవి:

1) మస్జిద్ లను నిర్మించడం

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ ۖ فَعَسَىٰ أُولَٰئِكَ أَن يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ

“అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాతును విధిగా చెల్లిస్తూ అల్లాహు తప్ప వేరొకరికి భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిద్ల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు”. (తౌబా 9:18)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఏ వ్యక్తి అయినా అల్లాహ్ కోసం, కేవలం ఆయన మెప్పు పొందడానికి మస్జిద్ను నిర్మిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో గృహం నిర్మిస్తాడు”. (బుఖారీ: 450, ముస్లిం: 533)

2) ప్రయోజనకరమైన జ్ఞానాన్ని ముద్రించి పంచడం, వ్యాపింప జేయడం

అబూ దర్దా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “మనిషి మరణించాక మూడు విషయాలు తప్ప మిగతా ఆచరణలతో అతనికి సంబంధం తెగిపోతుంది. ఆ మూడు విషయాలు ఏవంటే- “సదఖ-ఏ-జారియా, ప్రయోజనకరమైన జ్ఞానం మరియు అతని కోసం ప్రార్థించే అతని మంచి సంతానం”. (ముస్లిం:1631)

ప్రయోజనకరమైన జ్ఞానాన్ని ముద్రించి వ్యాపింపజేయడంలో పలు రకాలుగా పాలు పంచుకోవచ్చు. ఉదా॥కు ఖురాను, హదీసులను బోధించడం, ప్రసంగాలు, శుక్రవారపు ఖుత్బాల ద్వారా ప్రజలకు షరీయత్తు ఆదేశాలు, ఇస్లామీయ మర్యాదలను విశదపరచడం, ధార్మిక గ్రంథాలను ముద్రించడం, ఖురాను, హదీసుల ప్రసంగాలను రికార్డు చేసి పంచిపెట్టడం, ధార్మిక విద్యనభ్యసించే విద్యార్థులకు పుస్తకాలు సమకూర్చడం, మస్జిద్లలో ఖురాను దానం చేయడం వగైరా॥ వంటి కార్యాలు.

3) అనాథల బాగోగుల బాధ్యత తీసుకోవడం

సహల్ బిన్ సాద్ (రజియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నేను మరియు అనాథల బాగోగుల బాధ్యత తీసుకున్నవాడు స్వర్గంలో ఈ రెండు వేళ్ళలాగా వుంటాం”, అంటే చూపుడు వ్రేలు మరియు మధ్య వ్రేలు లాగా”. (బుఖారీ: 6005)

4) అల్లాహ్ మార్గంలో జిహాద్ కోసం ఖర్చుపెట్టడం

జైద్ బిన్ ఖాలిద్ అల్ జహమి (రజియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

ఏ వ్యక్తి అయినా ఒక ముజాహిదు ధన పరంగా సన్నద్ధం చేసి యుద్ధానికి పంపడం, స్వయంగా తను యుద్ధంలో పాల్గొన్న దానితో సమానం” (బుఖారీ:2843, ముస్లిం: 1895)

5) నిరుపేదలకు అన్నం పెట్టడం మరియు వారికి సహాయపడడం

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَىٰ حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا

అల్లాహ్ ప్రీతి కోసం నిరుపేదలకు, అనాథలకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు”. (సూరా అద్ దహ్ర్76:8)

వితంతువులకు, అగత్యపరులకు సహాయపడుతూ వారి కోసం ఖర్చు చేసేవాడు అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసే వ్యక్తిలాంటి వాడు.

సఫ్వాన్ బిన్ సులైమ్ (రజియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు.

వితంతువుల కోసం మరియు నిరుపేదల కోసం ఖర్చు చేసే వ్యక్తి (పుణ్యఫలం రీత్యా) అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసే వ్యక్తి లేదా ప్రతి రోజూ పగలు ఉపవాసముండి రాత్రి ఖియామ్ చేసే వ్యక్తి లాంటివాడు“. (బుఖారీ: 6006)

6) ఉపవాసం వున్న వారికి ఇఫ్తార్ చేయించడం

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఎవరైనా ఉపవాసం వున్న వ్యక్తికి ఇఫ్తార్ చేయిస్తే అతనిక్కూడా ఉపవాసం ఉన్న వారికి దొరికినంతగా పుణ్యఫలం దొరుకుతుంది. ఉపవాసం వున్న వారి పుణ్యఫలంతో ఎలాంటి తగ్గింపు రాదు”. (తిర్మిజి, నసాయి, ఇబ్నె మాజ, సహీ అత్తర్బ్ వ తరీబ్: 1078)

అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టడం ద్వారా దొరికే పుణ్యఫలాన్ని వృథా చేసే కార్యాలు

(1) ప్రదర్శనాబుద్ధి

(2) ఉపకారాన్ని చాటుకోవడం

ఎవరైనా అల్లాహ్ మెప్పు కోసం కాకుండా (ప్రదర్శనాబుద్ధితో) కేవలం ప్రజలకు చూపించి తద్వారా వారి పొగడ్తలు, ప్రశంసలు అందుకోవాలన్న ఉద్దేశ్యంతో ఖర్చుచేస్తే అతని ఈ ఉద్దేశ్యం అతని పుణ్యఫలాన్ని వృథా చేసేస్తుంది.

అలాగే ఎవరైనా ఎవరికైనా దానం చేసిన లేదా అతని కోసం ఖర్చుపెట్టిన తర్వాత అతని వద్ద తన ఉపకారాన్ని చాటుకుంటే లేదా ప్రజల ముందు అతణ్ణి అగౌరవపరచి, అతని మనస్సును నొప్పిస్తే – అతని పుణ్యఫలం కూడా వృథా అయిపోతుంది.

దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ كَالَّذِي يُنفِقُ مَالَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ فَمَثَلُهُ كَمَثَلِ صَفْوَانٍ عَلَيْهِ تُرَابٌ فَأَصَابَهُ وَابِلٌ فَتَرَكَهُ صَلْدًا ۖ لَّا يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّمَّا كَسَبُوا ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ أَصَابَهَا وَابِلٌ فَآتَتْ أُكُلَهَا ضِعْفَيْنِ فَإِن لَّمْ يُصِبْهَا وَابِلٌ فَطَلٌّ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ

ఓ విశ్వాసులారా! తన ధనాన్ని పరుల మెప్పుకోసం ఖర్చు చేస్తూ, అల్లాహ్ ను గానీ, అంతిమ దినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకొని (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దాన ధర్మాలను వృథా చేసుకోకండి. అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకొని వున్న నున్నని రాతిబండ వంటిది. దానిపై భారీ వర్షం కురిసి, ఆ మట్టి కాస్తా కొట్టు కొని పోయి, కటిక రాయి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రదర్శనాకారులకు తాము చేసుకున్న దానిలో నుంచి ఏమీ ప్రాప్తించదు. అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు. ఇక దైవప్రసన్నతను చూరగొనే తపనతో, దృఢనమ్మకంతో తమ సంపదను ఖర్చుపెట్టేవారి ఉపమానం మెరక ప్రాంతంలో ఉన్న తోట వంటిది. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఇకవేళ దానిపై పెద్ద వర్షం పడకుండా, కేవలం వానజల్లు కురిసినా సరిపోతుంది. అల్లాహ్ మీ పనులన్నింటినీ చూస్తూనే వున్నాడు”. (బఖర 2: 264, 265)

ఈ ఆయత్లలో అల్లాహ్-ఉపకారాన్నిచాటుకుంటూ, గ్రహీతల మనస్సును నొప్పించి మన దాన ధర్మాలను వృథా చేసుకోవడాన్ని (గట్టిగా) వారించాడు. దీని ద్వారా తెలిసిందేమిటంటే ఈ రెండు విషయాల ద్వారా దానధర్మాల పుణ్యఫలం వృథా అయిపోతుంది.

తదుపరి అల్లాహ్- ప్రదర్శనా బుద్ధితో దానం చేసేవారు మరియు కేవలం అల్లాహ్ మెప్పుకోసం ఖర్చుచేసే వారి వేర్వేరు ఉపమానాలు వివరించాడు.

ప్రదర్శనాబుద్ధితో ఖర్చుచేసే వారి ఆచరణను అల్లాహ్ – నున్నని రాతి బండపై పేరుకొనివున్న కొద్ది పాటి మట్టిలాగా పోల్చాడు. తదుపరి, ఆ రాతి బండపై భారీ వర్షం కురవగానే ఆ మట్టి కాస్త కొట్టుకుపోయి కేవలం రాతి బండ మాత్రమే మిగిలినట్లు అతనిక్కూడా ఏమీ దొరకదు.

ఇక చిత్తశుద్ధితో ఖర్చుచేసే వారి ఆచరణను అల్లాహ్ – మెరక ప్రాంతపు తోటతో పోల్చాడు. ఒకవేళ భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. అలా కాకా, చిన్న వానజల్లు కురిసినా దాని కది సరిపోతుంది. అలాగే దాన ధర్మాలను కూడా చిత్తశుద్ధితో, కేవలం అల్లాహ్ మెప్పుకోసం చేస్తే దాని పుణ్యఫలం ఎన్నో రెట్లు పెరుగుతుంది.

అందుకే గోప్యంగా చేసే దాన ధర్మాలు బహిరంగంగా చేసే వాటి కన్నా ఉత్తమమైనవి. ఎందుకంటే గోప్యంగా చేసే దాన ధర్మాలలో చిత్తశుద్ధి ఎక్కువగా వుంటుంది. ప్రదర్శనాబుద్ధికి కూడా ఇది దూరంగా వుంటుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ

ఒకవేళ మీరు బహిరంగంగా దాన ధర్మాలు చేసినా మంచిదే, కానీ గోప్యంగా నిరుపేదలకు ఇస్తే అది మీ కొరకు ఉత్తమం. (దీని వల్ల) అల్లాహ్ మీ పాపాలను తుడిచిపెడతాడు. అల్లాహ్ కు మీరు చేసేదంతా తెలుసు”. (బఖర 2:271)

‘గోప్యంగా చేయబడే దానం అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లారుస్తుంది.’ (అస్సహీహ లిల్ అల్బానీ : 1908)

ఖర్చుపెట్టడం గురించి కొన్ని మర్యాదలు నేర్పుతూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَلِأَنفُسِكُمْ ۚ وَمَا تُنفِقُونَ إِلَّا ابْتِغَاءَ وَجْهِ اللَّهِ ۚ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ لِلْفُقَرَاءِ الَّذِينَ أُحْصِرُوا فِي سَبِيلِ اللَّهِ لَا يَسْتَطِيعُونَ ضَرْبًا فِي الْأَرْضِ يَحْسَبُهُمُ الْجَاهِلُ أَغْنِيَاءَ مِنَ التَّعَفُّفِ تَعْرِفُهُم بِسِيمَاهُمْ لَا يَسْأَلُونَ النَّاسَ إِلْحَافًا ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ

(ఓ విశ్వాసులారా!) మీరు అల్లాహ్ మార్గంలో ఏ మంచి వస్తువును ఖర్చుచేసినా, దాని లాభాన్ని స్వయంగా మీరే పొందుతారు. కాకపోతే మీరు కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ఖర్చు చేయాలి. మీరు ఎంత ఖర్చు చేసినా దాని పూర్తి ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది. మీకు ఎంత మాత్రం అన్యాయం జరుగదు. అల్లాహ్ మార్గంలో నిమగ్నులైన కారణంగా, (బ్రతుకు తెరువు కోసం) భూమిలో సంచరించే వీలులేని నిరుపేదలు వాస్తవానికి మీ ధన సహాయానికి అర్హులు. వారి నిజస్థితిని గురించి తెలియనివారు, (ఆత్మాభిమానం వల్ల) వారు ఎవరినీ అడగక పోవడంచూసి, వారిని అవసరాలు లేనివారుగా తలపోస్తారు. మీరు వారి వాలకాన్ని చూసి వాస్తవస్థితిని ఊహించవచ్చు. తమకు సహాయం చెయ్యమంటూ వారు ప్రజల వెంట పడరు. (అటువంటి త్యాగధనుల సహాయార్థం) మీరు ఎంత సొమ్ము వెచ్చించినా, నిశ్చయంగా దాని గురించి అల్లాహ్ కు తెలుసు”. (బఖర 2:272, 273)

ఇక ఉపకారాన్ని చాటుకుంటూ, గ్రహీతల మనస్సు నొప్పించే విషయాని కొస్తే- ఈ రెండింటి నుండి దూరంగా వుండి ఖర్చు చేసేవారికే అల్లాహ్ పుణ్యఫలం వాగ్దానం చేశాడు. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ ثُمَّ لَا يُتْبِعُونَ مَا أَنفَقُوا مَنًّا وَلَا أَذًى ۙ لَّهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ

ఎవరైతే అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసిన తరువాత తమ దాతృత్వాన్ని మాటిమాటికీ చాటుతూ ఉండకుండా, (గ్రహీతల మనస్సును) నొప్పించకుండా జాగ్రత్తపడతారో, వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికెలాంటి భీతిగానీ, దుఃఖంగానీ ఉండదు”. (బఖర 2:262)

ఉపకారాన్ని చాటుకోవడం ఎంత పెద్ద పాపమో, మీరు ఈ హదీసు ద్వారా గ్రహించవచ్చు.

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

“ప్రళయం రోజు అల్లాహ్ ముగ్గురు వ్యక్తుల వైపు కన్నెత్తి కూడా చూడడు. తల్లిదండ్రుల అవిధేయుడు (వారి పట్ల చెడుగా వ్యవహరించేవాడు), ఎల్లప్పుడూ సారాయి త్రాగేవాడు మరియు ఉపకారాన్ని చాటుకొనేవాడు. ముగ్గురు వ్యక్తులు స్వర్గంలోకి ప్రవేశించలేరు- తల్లిదండ్రుల అవిధేయుడు, వారి మనస్సు నొప్పించేవాడు, దయ్యూస్ (తన ఇంట్లో అశ్లీల కార్యాలు జరుగుతున్నప్పటికీ చూసి మౌనంగా వుండేవాడు) మరియు మగవారి శైలిని అలవర్చుకొని వారిని అనుకరించే స్త్రీ”. (నసాయీ, బజ్జార్, హాకిమ్, సహీహ్ అత్తరీబ్ వత్తరీబ్:2511)

3) నాసిరకం వస్తువులను దానం చెయ్యడం

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِن طَيِّبَاتِ مَا كَسَبْتُمْ وَمِمَّا أَخْرَجْنَا لَكُم مِّنَ الْأَرْضِ ۖ وَلَا تَيَمَّمُوا الْخَبِيثَ مِنْهُ تُنفِقُونَ وَلَسْتُم بِآخِذِيهِ إِلَّا أَن تُغْمِضُوا فِيهِ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ غَنِيٌّ حَمِيدٌ

ఓ విశ్వసించిన వారలారా! ధర్మ సమ్మతమైన మీ సంపాదనలో నుంచి, మేము మీ కోసం నేల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులలో నుంచి ఖర్చు చేయండి. వాటిలోని చెడు (నాసిరకం) వస్తువులను ఖర్చుపెట్టే సంకల్పం చేసుకోకండి – మీరు స్వయంగా కూడా వాటిని తీసుకోరు, ఒకవేళ కళ్ళు మూసుకుని వుంటే అది వేరే విషయం. అల్లాహ్ అక్కర లేనివాడు, సమస్త స్తోత్రములకు అర్హుడని తెలుసుకోండి”. (బఖర 2:267)

4) దాన ధర్మాలను తిరిగి తీసుకోవడం

అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

తను చేసిన దానాన్ని తిరిగి తీసుకొనే వ్యక్తి – కడుపు నిండా భుజించి, తదుపరి వాంతి చేసుకొని, మళ్ళీ దానిని నాకే కుక్కలాంటి వాడు.” (అస్సహీహ అల్బానీ : 1699)

ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజియల్లాహు అన్హు ) కథనం:

నేకొన వ్యక్తికి జిహాద్ నిమిత్తం ఒక గుర్రాన్ని ఇవ్వగా దాన్ని అతను పోగొట్టుకున్నాడు. తదుపరి నేను – ఒకవేళ ఆ గుర్రం గనక దొరికితే మళ్ళీ దానిని కొనాలని సంకల్పించుకున్నాను. గుర్రం దొరికిన వ్యక్తి దానిని తక్కువ ధరకే అమ్మ వచ్చని నేననుకున్నాను. ఈ విషయం నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్ద ప్రస్తావించగా, ఆయన నాతో – దానిని కొనకు మరియు నీ దానాన్ని తిరిగి తీసుకోకు. ఒకవేళ నీకది ఒక దిర్హమ్ లో దొరికినా సరే. ఎందుకంటే తన దానాన్ని తిరిగి తీసుకొనేవాడు తన వాంతిని తానే నాకే కుక్క లాంటివాడు అని వివరించారు. (బుఖారీ: 2623, ముస్లిం: 1620)

అందుకే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవారు తమ దాన ధర్మాలను వృథా చేసే ఈ కార్యాలన్నింటి నుంచి దూరంగా వుండాలి. అల్లాహ్ మనందరినీ తన మార్గంలో ఖర్చు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక! మరియు మన దాన ధర్మాలను స్వీకరించుగాక!

రెండవ ఖుత్బా

మొదటి ఖుత్బాలో మేము దానధర్మాల మహత్యం, ప్రయోజనాలు మరియు వాటికి సంబంధించిన ఆదేశాల గురించి వివరించాము. ఇక ఇది కూడా తెలుసుకోండి – దాన ధర్మాలలో అత్యంత ప్రముఖమైన దానం జకాత్ చెల్లింపు.

జకాత్ పరిచయం

అరబీ భాషలో ‘జకాత్’ పదాన్ని ‘పరిశుద్ధత’, ‘పెరుగుదల’ మరియు ‘శుభప్రదం’ అన్న అర్థాలలో వాడతారు. ఇక షరీయతు పరంగా ‘జకాత్’ అంటే ఒక ప్రత్యేక సంపద నుంచి ప్రత్యేక భాగాన్ని తీసి ప్రత్యేక మనుషులకు ఇచ్చేది. దీనిని జకాత్ అని ఎందుకంటారంటే – ఇది చెల్లించే వారి మనస్సు పరిశుద్ధమవుతుంది, దీనితో పాటు అతని సంపద కూడా పరిశుద్ధపరచబడి శుభ్రంగా అవుతుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే జకాత్ కొరకు ఖురాన్ మరియు సున్నత్లో ‘దానం’ అన్న పదం కూడా వచ్చింది.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

خُذْ مِنْ أَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا

ఓ ప్రవక్తా! నువ్వు వారిని పరిశుద్ధ పరచడానికీ, వారిని తీర్చిదిద్దడానికీ వారి సంపదల నుంచి దానాలను తీసుకో”. (తౌబా 9:103)

జకాత్ ప్రాముఖ్యత

1) ఇస్లాం ఆధారపడి వున్న ఐదు మౌలిక అంశాలలో జకాత్ కూడా ఒకటి.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

“ఇస్లాం పునాది 5 మౌలిక అంశాలపై ఆధారపడివుంది. అల్లాహ్ తప్ప మరో (నిజమైన) ఆరాధ్యుడెవ్వరూ లేరని, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయన దాసులు మరియు ప్రవక్త అని సాక్ష్యమివ్వడం, నమాజు నెలకొల్పడం, జకాత్ చెల్లించడం….” (బుఖారీ, ముస్లిం)

2) జకాత్ అల్లాహ్ కారుణ్యం పొందడానికి సాధనం.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَرَحْمَتِي وَسِعَتْ كُلَّ شَيْءٍ ۚ فَسَأَكْتُبُهَا لِلَّذِينَ يَتَّقُونَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَالَّذِينَ هُم بِآيَاتِنَا يُؤْمِنُونَ

నా కారుణ్యం అన్ని వస్తువులనూ ఆవరించివుంది. భయభక్తుల వైఖరిని అవలంబిస్తూ, జకాత్ ను చెల్లిస్తూ, మా ఆయతులను విశ్వసించేవారిపేర ఈ కారుణ్యాన్ని తప్పకుండా వ్రాస్తాను.” (ఆరాఫ్ 7:156)

3) జకాత్ – ఇస్లామీయ సోదర భావానికి ఒక షరతు

దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

فَإِن تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ فَإِخْوَانُكُمْ فِي الدِّينِ

ఇప్పటికైనా వారు పశ్చాత్తాపం చెంది, నమాజును నెలకొల్పుతూ, జకాతును విధిగా చెల్లించటం మొదలుపెడితే వారు మీ ధార్మిక సోదరులే”. (తౌబా 9:11)

4) ముస్లిం సమాజంలో సర్వసాధారణంగా వుండాల్సిన అలవాట్లలో జకాత్ కూడా ఒకటి.

దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللَّهَ وَرَسُولَهُ

విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడువాదోడుగా ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు, చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాతును చెల్లిస్తారు”. (తౌబా 9:71)

5) జన్నతుల్ ఫిర్ దౌస్ వారసులయ్యే విశ్వాసుల లక్షణాలలో జకాత్ చెల్లించడం కూడా ఒకటి.

దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

 وَالَّذِينَ هُمْ لِلزَّكَاةِ فَاعِلُونَ

వారు (తమపై విధించబడిన) జకాతు విధానాన్ని పాటిస్తారు”. (మూమినూన్ 23:4)

6) స్వర్గంలోకి చేర్చే ఆచరణ

అబూ అయ్యూబ్ (రజియల్లాహు అన్హు) కథనం:

ఒక వ్యక్తి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో – “నన్ను స్వర్గంలోకి చేర్చే ఆచరణ గురించి చెప్పండి, తద్వారా నేను దానిని ఆచరించి స్వర్గంలోకి వెళ్ళగలుగుతాను” అని అడిగాడు.

ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ “కేవలం అల్లాహ్ ను ఆరాధిస్తూ వుండు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ చేర్చకు, ఫర్జ్ నమాజును ఎల్లప్పుడూ నెలకొల్పుతూవుండు, జకాత్ చెల్లిస్తూ వుండు, బంధుత్వ సంబంధాలను కాపాడుతూ వుండు” అని వివరించారు (బుఖారీ, ముస్లిం)

7) జకాత్ చెల్లించడం ద్వారా సంపద వృద్ధి చెందుతుంది, శుభ ప్రదమవుతుంది, ఆపద, విపత్తుల నుండి సురక్షితంగా వుంటుంది.

దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَمَا آتَيْتُم مِّن رِّبًا لِّيَرْبُوَ فِي أَمْوَالِ النَّاسِ فَلَا يَرْبُو عِندَ اللَّهِ ۖ وَمَا آتَيْتُم مِّن زَكَاةٍ تُرِيدُونَ وَجْهَ اللَّهِ فَأُولَٰئِكَ هُمُ الْمُضْعِفُونَ

ప్రజల సొమ్ములో చేరి వృద్ధి చెందుతుందన్న ఉద్దేశ్యంతో మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్ దృష్టిలో ఎంత మాత్రం వృద్ధి చెందదు. అయితే అల్లాహ్ ముఖాన్ని చూసేందుకు (ప్రసన్నతను చూరగొనేందుకు) మీరు జకాతు దానం ఇచ్చినట్లయితే – అలాంటి వారే (తమ సంపదలను) ఎన్నో రెట్లు వృద్ధి పరుచుకున్నవారవుతారు”. (రూమ్ 30:39)

జకాత్ ప్రయోజనాలు

1) ఉపాధి పంపిణీని అల్లాహ్ తన వద్ద ఉంచుకున్నాడు. తన ఇష్ట ప్రకారం కొందరికి ఎక్కువగానూ, కొందరికి తక్కువగానూ ఇవ్వడానికి. కానీ, ధనవంతులకు మాత్రం ఆయన జకాత్ చెల్లించమని, దానధర్మాలు చేస్తూ ఖర్చు పెట్టమని ఆదేశించాడు. తద్వారా అడిగే ఆవశ్యకత లేకుండానే నిరుపేదలకు, వారి అవసరాలు తీర్చుకోవడానికి ఎంతో కొంత దొరుకుతూ వుండడానికి. ఇక నిరుపేదలకు, ఆయన – సహనం మరియు కృతజ్ఞత లాంటి విశేషగుణాలను అలవర్చుకోమని ఆజ్ఞాపించాడు. ఇలా ఇరువురూ పుణ్యఫలానికి హక్కుదారులవుతారు. ధనవంతులు ఖర్చు పెట్టడం ద్వారా మరియు నిరుపేదలు సహనం మరియు కృతజ్ఞతలు చూపడం ద్వారా.

2) ఇస్లామీయ ఆర్థిక వ్యవస్థ విశేషమేమిటంటే – ఒకవేళ చిత్తశుద్ధితో గనక దానిని అమలు పరిస్తే, సందప కేవలం కొంతమంది దగ్గర కేంద్రీకృతం కాకుండా సమాజంలోని ప్రజలందరి మధ్య తిరుగుతూ వుంటుంది. దీనికి విరుద్ధంగా ఇతర ఆర్థిక వ్యవస్థలలో సమాజంలోని కొందరు వ్యక్తులైతే భోగభాగ్యాలతో జీవిస్తుంటారు, కానీ వారి చుట్టు ప్రక్కల వుండేవారు మాత్రం పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటారు. ఇదెంతో దౌర్జన్యకరమైన విషయం. (అందుకే) సమాజంలోని ఆర్ధిక సమతూకాన్ని యథావిధిగా వుంచి, సామాజిక దౌర్జన్య ద్వారాన్ని మూసివేయడానికి అల్లాహ్ జకాతును విధిగా చేసి, దానధర్మాల గురించి ప్రోత్సహించాడు. తద్వారా సమాజంలో ప్రజలందరూ ధన సంపదల ద్వారా ప్రయోజనం పొందగలుగుతారు.

3) జకాతును చెల్లించడం ద్వారా ధనవంతులు, నిరుపేదల మధ్య ప్రేమానురాగాలు జన్మిస్తాయి. దీనితో సమాజం అసూయ, ద్వేషం, స్వార్థం లాంటి రోగాల నుండి పరిశుద్దమవుతుంది. జకాత్ చెల్లించే వారిలో దాతృత్వం, దయ, సానుభూతి మరియు జకాత్ పుచ్చుకొనేవారిలో కృతజ్ఞత, వినయ విధేయతలు లాంటి విశేషగుణాలు జన్మిస్తాయి. అంటే జకాత్ వ్యవస్థ సమాజంలో నైతిక విలువల ఉన్నతికి దోహదపడుతుంది.

4) గత చరిత్ర ఈ విషయం గురించి సాక్ష్యంగా వుంది: సజ్జనులైన ఖలీఫాల పరిపాలనా కాలంలో జకాతును ప్రభుత్వం తరఫు నుండి సేకరించి నిరుపేదలకు పంచడం జరిగేది. దీని ఫలితంగా ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే – (జకాత్ ఇవ్వడానికి) నిరుపేదలను వెతికినప్పటికీ (జకాత్ పుచ్చుకోవడానికి) సమాజంలో నిరుపేదలెవరూ దొరికేవారు కాదు. దీనితో – జకాతును ధనాగారం (బైతుల్ మాల్) లో జమ చేసేవారు. తదుపరి దానిని ముస్లిం సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేసేవారు. దీని ద్వారా రూఢీ అయినదేమిటంటే – ఇస్లామీయ జకాత్ వ్యవస్థ ద్వారా సమాజంలో పేదరికం నిర్మూలించబడుతుంది. కేవలం షరతు ఏమిటంటే – దానిని పూర్తి చిత్తశద్ధితో, నిజాయితీతో స్థాపించాలి.

5) ఒకవేళ ధనవంతులు జకాత్ చెల్లించకపోతే, సమాజంలోని నిరుపేదలు హీనభావానికి లోనై, ధనవంతుల పట్ల వారి హృదయాల్లో శత్రుత్వ భావన పెరగవచ్చు. తద్వారా వారు తమ అవసరాలు తీర్చుకోవడానికి దొంగతనాలు, దోపిడీల వంటి నేరాలు చేయడం ప్రారంభించవచ్చు. ఇలా సమాజంలో అశాంతి, చట్టాలేవీ లేని(పని చేయని) భయానక పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి విరుద్ధంగా, ఇస్లామీయ జకాత్ వ్యవస్థ ఇలాంటి నేరాల ద్వారాలను మూసివేసి సమాజంలో శాంతి భద్రతల గ్యారంటీని సమకూరుస్తుంది.

6) సంపద అనేది అల్లాహ్ అనుగ్రహాలలో ఒకటి కనుక దీనికిగాను అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలపడం తప్పనిసరి. దాని ఒకే ఒక స్వరూపం ఏమిటంటే ఆ సంపద నుండి జకాతును చెల్లించడం. అంతేకాక-అల్లాహ్ అనుగ్రహాలకు గాను కృతజ్ఞతలు తెలిపితే ఆ అను గ్రహాలు ఇంకా వృద్ధి చెందుతాయన్న విషయం తెలిసిందే.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ

“మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను”. (ఇబ్రాహీం 14:7)

జకాత్ చెల్లించని వాని పరిణామం

ఇంతకుముందే వివరించినట్లు జకాత్ ఒక విధి మరియు ఇస్లాం మౌలిక అంశాలలో ఒకటి. ఇక ఏ వ్యక్తి అయినా దీని విధిత్వాన్ని నిరాకరిస్తే సత్య తిరస్కారుడైపోయి, మరణదండనకు అర్హుడైపోతాడు. ఈ కారణంగానే, అబూ బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) – తాను ఖలీఫా అయ్యాక జకాత్ చెల్లించడానికి నిరాకరించిన వారికి విరుద్ధంగా యుద్ధ ప్రకటన చేస్తూ ఇలా అన్నారు:

అల్లాహ్ సాక్షి! ఎవరైనా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు (జకాత్ రూపంలో) ఒక్క త్రాడు ఇచ్చి వున్నా ఒకవేళ వారు దానిని నాకు (జకాత్ రూపంలో) సమర్పించకపోతే, వారితో నేను యుద్ధం చేస్తాను” (బుఖారీ: 7284, ముస్లిం:20)

ఇక ఏ వ్యక్తి అయినా జకాత్ విధిత్వాన్ని విశ్వసించినప్పటికీ దానిని చెల్లించడో, అతని పర్యవసానం గురించి ఒక ఆయతు మరియు ఒక హదీసును వినండి.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَالَّذِينَ يَكْنِزُونَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا يُنفِقُونَهَا فِي سَبِيلِ اللَّهِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ يَوْمَ يُحْمَىٰ عَلَيْهَا فِي نَارِ جَهَنَّمَ فَتُكْوَىٰ بِهَا جِبَاهُهُمْ وَجُنُوبُهُمْ وَظُهُورُهُمْ ۖ هَٰذَا مَا كَنَزْتُمْ لِأَنفُسِكُمْ فَذُوقُوا مَا كُنتُمْ تَكْنِزُونَ

ఎవరు వెండి, బంగారాలను పోగుచేస్తూ వాటిని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం లేదో వారికి బాధాకరమైన శిక్ష వుందన్న శుభవార్త వినిపించు. ఏ రోజున ఈ ఖజానాను నరకాగ్నిలో కాల్చి దానితో వారి నొసటిపై, పార్శ్వాలపై, వీపులపై వాతలు వేయడం జరుగుతుందో అప్పుడు, ఇది మీరు మీ కోసం సమీకరించినది. కాబట్టి ఇప్పుడు మీ ఖజానా రుచి చూడండి (అని వారితో అనబడుతుంది)”. (తౌబా 9:34,35)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

“అల్లాహ్ ఎవరికైతే సంపదను అనుగ్రహించాడో, అతను తన సంపద నుండి జకాత్ చెల్లించకపోతే – ప్రళయం రోజు అతని సంపద అత్యంత విష సర్పం రూపంలో అతని వద్దకు వస్తుంది. దాని కళ్ళపై భాగంలో రెండు నల్లని మచ్చలుంటాయి. అది అతని మెడలో సంకెళ్ళ లాగా చుట్టుకొని పోయి, అతని దవడలను పట్టుకొని ఇలా అంటుంది – నేను నీ సంపదను, నేను నీ ఖజానాను…..” (బుఖారీ:1403)

ఏయే వస్తువులపై జకాత్ విధిగా చెల్లించాలి?

ఇస్లాంలో ఏయే వస్తువులపై జకాత్ విధిగా వున్నదో, వాటికి సంబంధిం చిన కొన్ని వివరాలు ఇవి:

1) బంగారము/ వెండి మరియు నగదు డబ్బు

బంగారము/ వెండిలో జకాత్ విధిగా వుంది. కేవలం షరతు ఏమిటంటే, దాని పరిమాణం నిర్ణయించబడ్డ పరిమితికి సమానంగా లేక అధికంగా వుండి, ఒకరి స్వాధీనంలో ఒక సం॥ దాకా వున్నప్పుడు. బంగారము పరిమితి 85 గ్రాములు. కాగా వెండి పరిమితి 595 గ్రాములు ఒకవేళ బంగారం 85 గ్రాముల కన్నా, వెండి 595 గ్రాముల కన్నా తక్కువగా ఉన్న పక్షంలో వాటిపై జకాత్ విధిగా వుండదు. ఒకవేళ వీటి పరిమాణం పరిమితికి సమానంగా లేక అధికంగా వున్నప్పటికీ, 1 సం॥ గడువు కాలం పూర్తవకపోతే వీటిపై జకాత్ విధిగా వుండదు. రెండు షరతులు పూర్తయినప్పుడు జకాతును లెక్కకట్టే విధానం ఏమిటంటే – అన్నిటి కన్నా ముందుగా దీని బరువును లెక్క పెట్టాలి. తదుపరి మార్కెట్ ధర ప్రకారం వీటి మొత్తం బరువు విలువ లెక్కపెట్టాలి. ఆ తర్వాత దాని 2.5 శాతం (40వ భాగం) విలువను జకాత్ సంకల్పంతో చెల్లించాలి.

వివరణ (1): బంగారం, వెండి ముద్ద రూపంలో వున్నా లేక నగల రూపంలో వున్నా – రెండు పరిస్థితుల్లోనూ జకాత్ చెల్లించడం విధి.

అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక స్త్రీ తన కూతుర్ని వెంట బెట్టుకొని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చింది. ఆమె కూతురు బంగారు గాజులు ధరించి వుండడం చూసి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెతో – నువ్వు వీటి జకాత్ చెల్లిస్తావా? అని అడిగారు. ఆ స్త్రీ – లేదు అని అంది.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)- ప్రళయం రోజు అల్లాహ్ నీకు వీటికి బదులుగా అగ్ని గాజులు తొడిగించడం నీకిష్టమేనా? అని అన్నారు. ఆమె వెంటనే వాటిని తీసి నేలపై విసిరి – ఇవి అల్లాహ్, ఆయన ప్రవక్త కొరకు అని అంది. (అబూ దావూద్:1563, నసాయి: 2479, సహీహ్ -అల్బానీ)

వివరణ (2) : కరెన్సీ నోట్లు – రియాల్, దీనార్, రూపాయి లేదా డాలర్…ఇవన్నీ బంగారం, వెండికి సంబంధించిన ఆజ్ఞల క్రిందికే వస్తాయి.. అందుకే ఎవరి వద్దనైనా వెండి పరిమితి విలువకు సమానంగా లేదా అధికంగా కరెన్సీ వుండి, దానిపై 1 సం॥ గడువు కాలం పూర్తయితే దానిపై జకాత్ విధిగా అవుతుంది.

వివరణ (3) : అప్పుగా ఇచ్చివున్న డబ్బుపై జకాతుకు సంబంధించి రెండు స్వరూపాలున్నాయి. –

వీటిలో మొదటిది – రుణగ్రహీత రుణం చెల్లించడానికి అంగీకరిస్తాడు. త్వరగా కానీ, ఆలస్యంగా గానీ రుణంగా తీసుకున్న మొత్తాన్ని చెల్లించగలిగే సామర్థ్యం కూడా కలిగి వుంటాడు. ఈ పరిస్థితిలో రుణంగా ఇచ్చిన డబ్బుపై జకాతును రుణ దాత చెల్లించాల్సి వుంటుంది. దాని పద్ధతి ఏమిటంటే-1 సం॥ గడువు కాలం పూర్తయ్యాక తన వద్ద నున్న ధనాన్ని లెక్కించేటప్పుడు, దానితోపాటు రుణంగా ఇచ్చి వున్న డబ్బును కూడా కలిపి ఆ మొత్తం నుండి రెండున్నర శాతాన్ని జకాత్ రూపంలో తీసి చెల్లించాల్సి వుంటుంది.

ఇక రెండవ స్వరూపం ఏమిటంటే – రుణగ్రహీత రుణం చెల్లించడానికి నిరాకరిస్తాడు. కోర్టు ద్వారా కూడా ఆ ధనాన్ని పొందటం అంత తేలిక కాదు లేదా రుణ గ్రహీత రుణం చెల్లించడానికైతే అంగీకరిస్తాడు కానీ తన మాటను నిలబెట్టుకోకుండా వాగ్దాన భంగం చేస్తూ వుంటాడు లేదా అతని ఆర్థిక స్థితి అంత బాగా లేదు.

ఈ పరిస్థితిలో రుణంగా ఇచ్చివున్న డబ్బుపై జకాత్ విధిగా వుండదు. కానీ, ఒకవేళ రుణ గ్రహీత రుణాన్ని తిరిగి చెల్లిస్తే దాని నుండి గత ఒక సం॥పు జకాత్ చెల్లించాలి.

వివరణ (4) : ఒక వ్యక్తి దగ్గర జకాత్ పరిమితి అంత ధనం వుంది. అది బంగారం/వెండి రూపంలో గానీ లేదా నగదు రూపంలో గానీ లేదా మరేదైనా రూపంలో గానీ, కానీ అతను స్వయాన రుణగ్రస్తుడు. ఒకవేళ జకాత్ చెల్లిస్తే అతని ఆర్థిక స్థితి మరింత భారంగా తయారయ్యే ప్రమాదముంది. ఇలాంటి పరిస్థితిలో అతనిపై జకాత్ విధిగా వుండదు. కానీ, ఒకవేళ రుణం తీర్చిన తర్వాత కూడా అతని వద్ద జకాత్ పరిమితి అంత ధనం వుండి, దానిపై 1 సం॥ గడువు కాలం పూర్తయితే అప్పుడు దాని నుండి రెండున్నర శాతం తీసి జకాత్ రూపంలో చెల్లించాల్సి వుంటుంది.

వివరణ (5) : ఏదైనా కంపనీ షేర్లను వ్యాపార నిమిత్తం కొని వుంటే, దానిపై 1 సం॥ గడువు కాలం పూర్తయితే వాటి జకాతును చెల్లించాల్సి వుంటుంది. ఒకవేళ కంపనీయే స్వయంగా తన భాగస్వాముల షేర్లన్నింటి జకాతును చెల్లిస్తే సరి, లేకపోతే భాగస్వాములందరూ తమ తమ షేర్ల నుండి జకాతును చెల్లించాల్సి వుంటుంది.

వివరణ (6) : జకాత్ కేవలం స్వచ్ఛమైన బంగారం/వెండిపై విధిగా వుంది. అందుకే ఒకవేళ వాటిలో ఇతర లోహాలు కలిసివుంటే వాటి బరువును తీసేసిన తరువాత స్వచ్ఛమైన బంగారం, వెండి గనక జకాత్ పరిమితికి చేరుకోకపోతే వాటిపై జకాత్ వుండదు.

2) వ్యాపార సామగ్రి

జకాత్ విధిగా అయ్యే రెండవ వస్తువు వ్యాపార సామగ్రి. అంటే – వ్యాపార నిమిత్తం కొనబడే వస్తువులన్నీ అన్నమాట. అవి లోకల్ మార్కెట్ల నుండి కొన్నవి కావచ్చు లేదా బయటి మార్కెట్ల నుంచి కొన్నవి కావచ్చు. తమ అవసరాల కోసం కొనే వస్తువులు ఈ పరిధిలోకి రావు. ఉదా॥కు ఇల్లు, బండి, భూమి మొ||వి, వీటి మీద జకాత్ విధిగా వుండదు. అలాగే పరిశ్రమలకు సంబంధించిన యంత్రాలు, పనిముట్లు, స్టోర్లు, వాటిలోని అల్మారాలు, ఆఫీసు ఫర్నీచర్….వీటిలో జకాత్ వుండదు. ఈ వస్తువులన్నీ ఒకేచోట ఉంచబడతాయి. వీటిని అమ్మాలన్న ఉద్దేశ్యం వుండదు. 

వ్యాపార సామగ్రిపై జకాత్ చెల్లించే విధానం

1 సం|| గడువు ముగిసిన తర్వాత వ్యాపారస్తుడు (కంపనీ కూడా కావచ్చు) తన వద్దనున్న యావత్ వ్యాపార సామగ్రి యొక్క మార్కెట్ విలువను లెక్కించి, దానితోపాటు తన వద్ద నగదుగా వున్న సొమ్మును కలిపి, దాని నుండి అప్పుగా ఏమైనా చెల్లించాల్సి వుంటే దానిని తీసివేసి, అలాగే వ్యక్తిగతంగా తను ఏమైనా అప్పు తీసుకొని వుంటే దానిని కూడా తీసి వేసి మిగిలిన మొత్తం విలువ నుండి రెండున్నర శాతం తీసి జకాత్ రూపంలో చెల్లించాలి.

వివరణ: యంత్రాలు, పనిముట్ల అసలు ధరపై జకాత్ లేదు. కానీ, వాటి ద్వారా వచ్చే ఆదాయం గనక జకాత్ పరిమితికి చేరుకొని, దానిపై 1 సం॥ గడువు కాలం పూర్తయితే దానిపై జకాత్ విధిగా వుంటుంది. ఈ ఆదేశమే అద్దెకిచ్చిన ఇండ్లకు, దుకాణాలకు, వాహనాలకూ వర్తిస్తుంది. వీటి అసలు ధరపై జకాత్ వుండదు. కేవలం వాటి ద్వారా వచ్చిన అద్దె మీదనే వుంది. అది కూడా జకాత్ పరిమితికి చేరుకొని 1 సం॥ గడువు పూర్తయితే దానిలో రెండున్నర శాతం జకాత్గా చెల్లించాల్సి వుంటుంది. అంతేగాక, ఈ వస్తువులపై కట్టే పన్ను మరియు వీటి బాగోగుల కోసం అయ్యే ఖర్చు వాటి ద్వారా వచ్చిన సంపాదన నుండి తీసివేయాలి. ఒకవేళ ఈ వస్తువుల యజమానికి వీటి మినహా మరో జీవనోపాధి మార్గం లేకపోతే, తన భార్యాపిల్లల కయ్యే ఖర్చును కూడా దీనిలోనుంచి తీసేసి మిగిలిన డబ్బు నుండి జకాత్ చెల్లించాలి.

3) పశువులు

విధిగా జకాత్ చెల్లించాల్సిన పశువులు ఇవి: ఒంటె, ఆవు/ గేదెలు మరియు మేకలు.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు.

ఏ వ్యక్తి దగ్గరైనా ఒంటెలు లేదా ఆవులు లేదా మేకలు వుండి అతను వాటి జకాత్ చెల్లించకపోతే ప్రళయం రోజు అవి భారీ కాయంతో, ఎంతో పెద్దగా చేసి తీసుకురాబడతాయి. తదుపరి అతణ్ణి తమ కాళ్ళతో త్రొక్కుతూ కొమ్ములతో పొడుస్తాయి. అవన్నీ అతని మీది నుంచి (తొక్కుతూ, పొడుస్తూ) వెళ్ళిపోయాక, మళ్ళీ మొదటి దానిని పిలవడం జరుగుతుంది. ఇలా ప్రజలందరి నిర్ణయం జరిగేదాక, అతనితో ఇలానే వ్యవహరించడం జరుగుతుంది”. (బుఖారీ: 1460)

పశువులలో జకాత్ కోసం నాలుగు షరతులు వున్నాయి.

 • మొదటిది – అవి జకాత్ పరిమితికి చేరుకోవాలి. ఒంటెల పరిమితి కనీసం 5 ఒంటెలు, ఆవులు, గేదెల పరిమితి 30 మరియు మేకల పరిమితి 40.
 • రెండవది – ఆ పశువులు ఒక వ్యక్తి స్వాధీనంలో 1 సం॥ దాకా వుండాలి.
 • మూడవది – సంవత్సరంలో అధిక భాగం ఆ పశువులు స్వయంగా మేస్తూ, వాటి యజమానికి సం॥లో ఎక్కువ భాగం వాటి ఆహారాన్ని కొనాల్సిన అవసరం వుండకూడదు.
 • నాల్గవది – ఈ పశువులు వ్యవసాయానికి లేదా ఏవైనా బరువులు మోయటానికి ఉపయోగించకుండా వుండాలి.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే- ఏవైనా పశువులను వ్యాపార నిమిత్తం కొనుగోలు చేస్తే, వాటిపై జకాత్ – వ్యాపార వస్తువులపై జకాత్ తీసినట్లు- వాటి ధర ప్రకారం చెల్లించాలి, అంతేగానీ వాటి సంఖ్య ప్రకారం కాదు.

నోట్ : పశువుల పరిమితి గురించి మరిన్ని వివరాలను హదీసు మరియు ఫికహ్ గ్రంథాలలో చూడవచ్చు.

4) భూ ఉత్పత్తులు

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِن طَيِّبَاتِ مَا كَسَبْتُمْ وَمِمَّا أَخْرَجْنَا لَكُم مِّنَ الْأَرْضِ

ఓ విశ్వసించినవారలారా! ధర్మ సమ్మతమైన మీ సంపాదనలో నుంచి, మేము మీ కోసం నేల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులలో నుంచి ఖర్చు చేయండి”. (బఖర 2:267)

ఈ ఆయతు ద్వారా రూఢీ అయినదేమిటంటే – భూ ఉత్పత్తులు ఉదా॥ గోధుమలు, జొన్నలు, బియ్యం, ఖర్జూరాలు, ద్రాక్ష మరియు జైతూన్… లలో జకాత్ విధిగా వుంది. ఈ విషయంలో ఉమ్మత్ (ఆనుచర సమాజం)లో ఏకాభిప్రాయం (ఇజ్మా) వుంది.

భూ ఉత్పత్తుల జకాత్ పరిమితి

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఐదు వసఖ్ కన్నా తక్కువ దానిలో జకాత్ లేదు”. (బుఖారీ:1405, ముస్లిం: 979)

ఐదు వసఖ్ ల పరిమాణాన్ని నేటి కొలతతో పోలిస్తే 653 కేజీలు అవుతుంది. ఇలా ఏ భూ ఉత్పత్తి అయినా 653 కేజీల కన్నా తక్కువగా వుంటే దానిపై జకాత్ విధిగా వుండదు. కొందరు విద్వాంసులు ఈ పరిమాణాన్ని 630 కేజీలని ప్రస్తావించారు.

భూ ఉత్పత్తులలో ఎంత భాగం జకాత్గా చెల్లించాలి?

దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఏ ఉత్పత్తులైతే వర్షం నీటి ద్వారా లేదా కాలువ నీటి ద్వారా లేదా తమంతట తామే భూమి లోపలి నీటిని ఉపయోగించు కోవడం ద్వారా పండించబడ్డాయో వాటిలో పదవ భాగం మరియు ఏ ఉత్పత్తులైతే యంత్రాలను పయోగించి నీళ్ళు పట్టడం ద్వారా కష్టపడి నీళ్ళు పట్టడం ద్వారా పండించ బడ్డాయో వాటిలో 20వ భాగం (జకాత్ తీయాలి)”. (బుఖారీ: 1483)

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే – వర్షం నీరు, కాలువల నీటితో పండించబడ్డ ఉత్పత్తులలో పదవ భాగం మరియు యంత్రాల ద్వారా నీళ్ళు పట్టి పండించిన ఉత్పత్తులలో 20వ భాగాన్ని జకాత్ రూపంలో చెల్లించాలి.

వివరణ (1): భూ ఉత్పత్తుల కోసం 1 సం॥ గడువు కాలం లేదు. పంట పండి, చేతికొచ్చిన వెంటనే జకాత్ చెల్లించాలి.

దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَآتُوا حَقَّهُ يَوْمَ حَصَادِهِ

పంట కోసే రోజున తప్పనిసరిగా చెల్లించవలసిన దాని హక్కును చెల్లించండి”. (అన్ ఆమ్ 6: 141)

వివరణ(2): ఎప్పటికప్పుడు తాజాగా ఉపయోగించే పండ్లలో, కూరగాయల్లో జకాత్ లేదు. ఒకవేళ వాటితో వ్యాపారంచేస్తే అది వేరే విషయం. అప్పుడు (వ్యాపారం చేస్తే గనక) వాటి విలువ జకాత్ పరిమితికి చేరుకొని, తదుపరి సం॥ కాలం గడువు పూర్తయితే దాని నుండి రెండున్నర శాతం జకాత్ చెల్లించాల్సి వుంటుంది.

జకాత్ హక్కు దారులు

జకాతుకు సంబంధించిన వివరాల నేపథ్యంలో, దీనిని స్వీకరించగలిగే హక్కుదారులెవరో కూడా తెలుసుకోండి.

దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاءِ وَالْمَسَاكِينِ وَالْعَامِلِينَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِي الرِّقَابِ وَالْغَارِمِينَ وَفِي سَبِيلِ اللَّهِ وَابْنِ السَّبِيلِ ۖ فَرِيضَةً مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ

దానాలను కేవలం నిరుపేదల కొరకూ, అభాగ్యజీవుల కొరకు, వాటి వసూళ్ళ కోసం నియమితులైన వారి కొరకు, హృదయాలను ఆకట్టుకోవలసివున్న వారి కొరకు, మెడలను విడిపించడానికి, రుణగ్రస్తుల కొరకూ, అల్లాహ్ మార్గం కొరకూ, బాటసారుల కొరకూ వెచ్చించాలి. ఇది అల్లాహ్ తరఫున నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ మహాజ్ఞాని, మహావివేకి”. (తౌబా 9:60)

ఈ ఆయత్ ద్వారా తెలిసిందేమిటంటే – జకాత్ స్వీకరించడానికి అర్హులు – ఈ ఎనిమిది మందే. వీరు తప్ప, మిగతా ఏ వ్యవహారంలోనూ జకాత్ సొమ్ము వెచ్చించకూడదు. ఈ ఎనిమిది మందిలో కూడా అందరిపై తప్పకుండా ఖర్చు చేయాలన్న నియమం ఏదీ లేదు. ఈ ఎనిమిది మందిలో ఎవరు ఎక్కువ అవసరం కలిగివున్నారో వారిపై ఖర్చు చేయవచ్చు.

1) మరియు (2) – నిరుపేదలు, అభాగ్య జీవులంటే – అవసరాలు తీరని వారు, అంటే వారి దగ్గర తమ భార్యాపిల్లల అవసరాలను తీర్చడానికి సైతం డబ్బు వుండదు. అలాంటి వారికి గరిష్టంగా 1 సం॥ పాటు తమ అవసరాలు తీర్చుకొనగలిగేటంత జకాత్ చెల్లించవచ్చు.

3) ‘అల్ ఆమిలీన అలైహి’ అంటే – జకాత్ సేకరణకు మరియు అర్హులైన వారికి దాని పంపిణీకి గాను నియుక్తులైన వారు. వారికి కూడా ఈ జకాత్ నిధుల నుండి జీతం లాగా లేదా పింఛను లాగా వారి బాధ్యతకు అనుగుణంగా ఇవ్వవచ్చు. వారు స్వతహాగా ధనవంతులైనాసరే.

4) ‘అల్ మువల్లఫతి ఖులూబుహుమ్’ అంటే – క్రొత్తగా ఇస్లాం స్వీక రించిన బలహీన విశ్వాసులూ, ముస్లిములవుతారని ఆశవున్న వాళ్ళు లేదా డబ్బిచ్చిన కారణంగా తమ బస్తీ వారిని, ప్రదేశం వారిని ముస్లిములపై దాడి చేయకుండా నిరోధిస్తారని నమ్మకం వున్న అవిశ్వాసులు అని అర్థం.

5) ‘వఫిరిఖాబ్’ అంటే బానిసలకు వారి యజమాని నుండి విడిపించి స్వేచ్ఛను ప్రసాదించటం.

6) రుణాన్ని తిరిగి చెల్లించలేని రుణగ్రస్తుడు. అతనికి జకాత్ నిధులు చెల్లించవచ్చు. కానీ షరతు ఏమిటంటే – అతను తీసుకున్న రుణం ధర్మయుక్త కార్యం నిమిత్తం అయివుండాలి. అలాగే (ధర్మయుక్త) చిట్టీల డబ్బు చెల్లించే స్థితిలో లేనివారు, వ్యాపారంలో అత్యంత నష్టాన్ని చవిచూసినవారు – వీరికి గూడా జకాత్ చెల్లించవచ్చు.

7) ఫీసబీలిల్లాహ్ – అంటే జిహాద్ మరియు అల్లాహ్ సంతృప్తికి కారణమయ్యే ఇతర ధార్మిక ఉద్దేశ్యాల కొరకు అని అర్థం.

ఉదా॥కు ధార్మిక పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థుల కొరకు జకాత్ సొమ్ము ఖర్చు పెట్టవచ్చు. (విద్యార్థులు నిరుపేదలైతే వారి కోసం జకాత్ సొమ్ము ఖర్చు పెట్టవచ్చు. కాని ఒకవేళ ఏ విద్యార్థి అయిన ధనవంతుడయితే, అతని కోసం జకాత్ సొమ్ము ఖర్చు పెట్టకూడదు – అనువాదకుడు)

8) ఏదైనా ఉచిత కార్యం నిమిత్తం ప్రయాణం చేసే బాటసారి. ఒకవేళ అతని ప్రయాణ సామగ్రి అంతా అయిపోయి, ప్రయాణపు అవసరాలు తీర్చుకోలేని స్థితిలో వుంటే అతని అవసరానికి తగ్గట్లు జకాత్ సొమ్మును అతనికి ఇవ్వవచ్చు.

నోట్ (1) : ఒకవేళ జకాత్ హక్కుదారులు మన దగ్గరి బంధువులలో లభ్యమైతే వారికి జకాత్ చెల్లిస్తే రెండు రెట్ల పుణ్యం దొరుకుతుంది.

సల్మాన్ బిన్ ఆమిర్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఒకవేళ నిరుపేదకు ఇస్తే అది దానం అవుతుంది. అదే ఒకవేళ బంధువుకిస్తే అది దానంగానూ మరియు బంధుత్వాన్ని నెలకొల్పినట్లు గానూ అవుతుంది“. (నసాయి:2582, తిర్మిజి:658, సహీహ్ -అల్బానీ)

నోట్ (2): తమ భార్యాపిల్లలకూ, తల్లిదండ్రులకూ జకాత్ ఇవ్వకూడదు. ఒకవేళ సోదరులు, అక్క చెల్లెళ్ళలో ఎవరైనా అవసరాలు తీరని వారుంటే వారికి జకాత్ ఇవ్వడం ద్వారా రెండు రెట్లు పుణ్యం దొరుకుతుంది. అలాగే ధనవంతులకు, కష్టపడి సంపాదించే ఆరోగ్యవంతులు, పాపాత్ములు, దుర్మార్గులు మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటి వారికి కూడా జకాత్ ఇవ్వకూడదు.

ఆఖరుగా అల్లాహ్ ను వేడుకొనేదేమంటే – ఆయన మనందరికీ జకాత్ చెల్లించే మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!!

జకాతు & సదఖా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/zakah/

%d bloggers like this: