బహిష్టు స్త్రీలకు సంబంధించిన హజ్, ఉమ్రాహ్ ఆదేశాలు – షేక్ ఇబ్న్ ఉసైమీన్

పుస్తకం నుండి: ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు
మూల రచయిత (అరబీ): షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి హఫిజహుల్లాహ్

మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్

ప్ర-47: బహిష్టు స్త్రీ ‘ఇహ్రామ్’ కట్టుకున్న తరువాత రెండు రకాతులు నమాజు ఎలా చదవాలి? బహిష్టు స్త్రీ మెల్లగా ఖుర్ఆన్ ఆయతుల పారాయణం చేయవచ్చా? 

జ : ముందు మనం రెండు విషయాలు తెలుసుకుందాం. 

ఒకటి: ‘ఇహ్రామ్’ కు సంబంధించి ప్రత్యేక నమాజ్ అంటూ లేదు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ కు ప్రత్యేక ‘ఇహ్రామ్’ నమాజు గురించి ఆదేశంగా లేక చేసినట్లు లేక దృవీకరించినట్లు ఆధారాలు లేవు. 

రెండు: ఏ స్త్రీ అయితే ఇహ్రం కట్టుకోవటానికి ముందే ఋతుస్రావానికి గురువుతుందో ఆమె అదే స్థితిలో ‘ఇహ్రామ్’ కట్టుకోవచ్చు. 

హ॥ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) సతీమణి అస్మా బిన్తె ఉమైస్ (రజియల్లాహు అన్హా) మక్కా మార్గంలో ‘జుల్ హులైఫా’ ప్రదేశంలో రక్తస్రావానికి గురైయ్యారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెని “స్నానం చేసి తన యోనిపై గుడ్డ కట్టుకుని ‘ఇహ్రామ్’ కట్టుకోవాలని” ఆదేశించారు. 

అయితే ఋతుస్రావంగల స్త్రీకి కూడా ఆదేశం ఇదే. ఇక వారు పరిశుభ్రమయ్యేంత వరకు ‘ఇహ్రామ్’ నిబంధనల్లోనే ఉండాలి. పరిశుద్ధులైన తరువాత కాబా గృహాన్ని (తవాఫ్ చేయాలి) దర్శించాలి. అలాగే ‘సఫా’, ‘మర్వా’ నడుమ ‘సయీ’ (వేగంగా నడవటం) చేయాలి. 

ఇక ఋతుస్రావంగల స్త్రీ ఖుర్ఆన్ పారాయణం చేయవచ్చా..? అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే అవసరం మేరకు, ముఖ్య కారణంతో పారాయణం చేయవచ్చు. కానీ కేవలం అల్లాహ్ ఆరాధన నిమిత్తం లేక అల్లాహ్ సన్నిధిలో పుణ్యాలు పొందటానికైతే ఆ స్థితిలో చదవకపోవటమే మంచిది. 

గమనిక: అవసరం మేరకు, ముఖ్యకారణం అంటే పిల్లలకు బోధించేటప్పుడు, ఎవరైన చదువుతుంటే తప్పులు దిద్దటం, అలాగే రోజువారి ఖుర్ఆన్ ఆయతులు వస్తే దుఆ పరంగా చదవటంలో ఎలాంటి దోషం లేదు. 

ప్ర-48 : ఒక స్త్రీ హజ్ కొరకు ప్రయాణించింది. ప్రయాణంలో 5వ రోజు ఆమె ఋతుస్రావానికి గురైంది. ‘మీఖాత్’ వద్దకు చేరి ఆమె స్నానం చేసి ‘ఇహ్రామ్’ కట్టుకుంది. ఆమె ఇంకా ఋతుస్రావ స్థితి నుండి పరిశుద్దురాలు కాలేదు. మక్కా చేరుకున్న తరువాత ఆమె ‘హరం” బయటే నిలిచింది (వెలుపలే ఆగింది). ‘హజ్’, ‘ఉమ్రాహ్’కు సంబంధించి ఆమె ఏ ఒక్క పని కూడ చేయలేదు. రెండు రోజులు ఆమె “మినా” (ప్రదేశం)లో కూడ గడిపింది. తరువాత ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలై స్నానం చేసింది. పరిశుద్ధ స్థితిలో ‘ఉమ్రాహ్ ‘కు సంబంధించి అన్ని కార్యాలు, నియమాలు పూర్తి చేసింది. దాని తరువాత మళ్ళీ ఆమె ‘హజ్’ కొరకు ‘తవాఫ్ – ఇఫాజా’ చేస్తుండగా ఆమెకు మళ్ళీ రక్తస్రావం జరిగింది. సిగ్గుతో ఆమె తమ సంరక్షకులకు చెప్పలేదు. అదే స్థితిలో హజ్ విధానాలను పూర్తిచేసి, స్వస్థలానికి చేరుకున్న తరువాత ఆ విషయాన్ని తన సంరక్షకులకు తెలియపరిచింది. అయితే ఇప్పుడు ఆమెకు ఎలాంటి ఆదేశం వర్తిస్తుంది?

జ: పై పేర్కొన్న సమస్యకి పరిష్కారం ఏమిటంటే ఆమె తవాఫె – ఇఫాజా’ (తవాఫ్) చేస్తుండగా వచ్చిన రక్తం ఒకవేళ నెలసరి రక్తమైతే (దాన్ని ఆమె రక్తపు స్థితి, బాధతో పసిగట్టగలుగుతుంది) అప్పుడు ఆమె చేసిన ‘తవాఫె  ఇఫాజా’ సరైనది కాదు. ఆమె తప్పకుండా మరలా మక్కా వెళ్ళి ‘తవాఫె-ఇఫాజా’ పూర్తి చేయాలి. ‘మీఖాత్’ నుండి ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రాం’ కట్టి ‘తవాఫ్ ‘, ‘సయీ’తో సహా ‘ఉమ్రాహ్’ చేయాలి. ‘ఖస్ర్ ‘ చేసి దాని తరువాత ‘తవాఫె  ఇఫాజా’ చేయాలి.

అయితే ఒక వేళ ‘తవాఫె-ఇఫాజా’ చేస్తున్న మధ్యలో వచ్చే రక్తం సహజంగా నెలసరిది కాకుండా జన ప్రవాహం కారణంగా లేదా భయం కారణంగా లేదా మరే కారణంగా ఉన్నప్పుడు ఆమె ‘తవాఫె  – ఇఫాజా’ ‘తవాఫ్ ‘కు పరిశుద్ధత షరతుగా భావించని వారి పద్ధతి ప్రకారం సరైనదే. 

మొదటి విషయంలో : ఆమెకు రెండో సారి మక్కా రావటం అసాధ్యమైనప్పుడు, అంటే ఇతర దేశస్థురాలైనప్పుడు ఆమె ‘హజ్’ సరైనదె. ఎందుకంటే ఆమె ఏదైతే చేసిందో అంతకు మించి చేసే శక్తి, అవకాశం ఆమెకు లేదు. 

ప్ర-49 : ఒక స్త్రీ ఉమ్రాహ్ ఇహ్రాం కట్టుకుంది. ‘మక్కా’ చేరే సరికి ఆమెకు నెలసరి మొదలైంది. ఆమెతో పాటు వున్న ‘మహ్రమ్’ కి వెంటనే తిరుగు ప్రయాణం చేయవలసి వుంది. అక్కడ కొన్ని రోజులు ఉండే సౌకర్యం లేదు. పైగా ఆమె అక్కడ ఉండటానికి మక్కా నగరంలో ఆమెకు బంధువు లెవరూ లేరు. ఇలాంటి సందర్భంలో ఆమె ఏమి చేయాలి? 

జ.) పై పేర్కొనబడిన స్త్రీ ఒక వేళ అదే ప్రాంతానికి (సౌది అరేబియా) కి చెందినదైతే ఆమె తన ‘మహ్రమ్ ‘ (సంరక్షకుడి) తో తిరిగి వెళ్ళిపోవాలి. ‘ఇహ్రాం’ స్థితిలోనే వుండి, పరిశుద్ధురాలైన తరువాత రెండవ సారి మక్కా నగరానికి రావాలి. ఎందుకంటే ఆమెకు రెండవ సారి రావటం సులువైనదే. ఇందులో ఆమెకు ఎలాంటి అడ్డంకులు లేవు. పాస్పోర్టు కూడ అవసరంలేదు. 

కాని ఒకవేళ ఇతర దేశాల నుండి వచ్చివున్నవారైతే ఆమెకు రెండోసారి ప్రయాణం కష్టమైనప్పుడు ఆమె గుడ్డ కట్టుకోవాలి. మరి ‘తవాఫ్ , సయీ’ చేసి ‘ఖస్ర్’ చేసుకొని అదే ప్రయాణంలో తన ‘ఉమ్రాహ్’ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ‘తవాఫ్’ చేయుట ఒక అత్యవసరమైన ఆదేశంగా భావించబడుతుంది. కనుక అవసరాన్ని బట్టి కొన్ని నిషేధిత అంశాలు కూడా ‘ముబాహ్’ (అనివార్యం) గా పరిగణించ బడతాయి. 

ప్ర – 50 :ఒక స్త్రీకి నిర్దేశించబడిన హజ్ రోజుల్లో నెలసరి ప్రారంభమైంది. ఆమె గురించి ఆదేశం ఏమిటి? ఈ హజ్ ఆమెకై పరిపూర్ణమవుతుందా? 

జ : ఆమె ఎప్పుడు నెలసరికి గురైందనేది తెలియకుండానే ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వటం అసాధ్యం. ఎందుకంటే హజ్ లో కొన్ని కార్యాలు వున్నాయి. వాటికి నెలసరి ఎలాంటి ఆటంకం కల్గించదు. మరి కొన్ని ఉన్నాయి వాటిని నెలసరిలో చేయకూడదు. కనుక ‘తవాఫ్’ పరిశుభ్రత లేనిదే అసాధ్యం (చేయరాదు). ఇది కాకుండా ఇతరత్రా హజ్ కార్యాలు ఋతుస్రావంలో ఉండి కూడా చేసుకోవచ్చు. 

ప్ర- 51 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నేను గత సంవత్సరం హజ్ చేశాను. అయితే హజ్ కి సంబంధించి అన్ని కార్యాలు చేశాను. కాని ‘ధార్మిక ఆటంకం’ వల్ల “తవాఫ్ – ఇఫాజా”, “తవాఫె-విదాత్” చేయలేకపోయాను. ఆ తరువాత ఏదో ఒక రోజు మక్కాకు వచ్చి “తవాఫె-ఇఫాజా”, “తవాఫె-విదాత్” చేసుకోవాలనుకుని నా స్వస్థలం మదీనాకు తిరిగి వెళ్ళిపోయాను. దాని గురించి సరైన ధార్మిక అవగాహన లేనందువల్ల అన్నింటి నుండి ‘హలాల్’ కూడా అయిపోయాను. ‘ఇస్లామ్’ స్థితిలో ఏ ఏ విషయాలకు దూరంగా (‘హరాం’ అవుతాయో) ఉండాలో వాటికి దూరంగా ఉండలేదు. ఈ విషయమై (మక్కా తిరిగి రావటం, తవాఫ్  చేయటం గురించి)కొందరిని సంప్రదించినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చారు: ‘మీరు చేసిన ‘తవాఫ్ ‘ సరైనది కాదు. ఎందుకంటే మీరు మీ ‘హజ్’ను వృధా చేసుకున్నారు. కనుక వచ్చే సంవత్సరము మరో సారి ‘హజ్’ చేయాలి. అంతే కాకుండా దానితో పాటు ఒక ఆవు, లేదా ఒక ఒంటే ఫిద్యహ్’ (పరిహారం)గా ‘జిబహ్’ చేయవలసి వుంటుంది’. సందేహం ఏమిటంటే పై ప్రస్తావించబడిన సమాధానం వ్యాధి సరైనదేనా? లేదా నా సమస్యకు వేరే పరిష్కారం ఏమైనా వుందా? నిజంగా నా ‘హజ్’ వృధాయిపోయిందా? నా పై రెండో సారి హజ్ చేయటం ‘వాజిబ్’ (తప్పని సరా)? ఇప్పుడు నేను ఏమి చేయాలో తెల్పండి. అల్లాహ్ మీకు శుభాలు కలుగ చేయుగాక.! 

జ :నేడు మన సమాజంలో ఇది కూడా ఒక సమస్యగా మారిపోయింది. ప్రజలు జ్ఞానం లేకుండా ‘ఫత్వా’ ఇస్తున్నారు. పై పేర్కొనబడిన విధంగానైతే మీరు మక్కా వెళ్ళి కేవలం ‘తవాఫ్-ఇఫాజా’ మాత్రం చేయటం వాజిబ్ (తప్పనిసరి) అవుతుంది. 

మక్కా నుండి బయలుదేరినప్పుడు మీరు నెలసరితో వున్నారు. కాబట్టి మీపై తవాఫ్-విదాత్ వాజిబ్ (తప్పనిసరి) కాదు. ఎందుకంటే ఋతుస్రావం గల స్త్రీ పై తవాఫ్-విదాత్ లేదు. 

హ॥ ఇబ్నె అబ్బాస్ (రజియల్లాహు అన్ను) ఉల్లేఖించిన ఒక హదీసులో ఇలా ఉంది : 

ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వబడింది ఏమంటే బైతుల్లా (కాబా గృహము) తవాఫ్(కాబా ప్రదక్షిణం) వారి చివరి కార్యం కావాలని, అయితే నెలసరిగల స్త్రీ నుండి అది తప్పించబడింది“. 

అబుదావూద్ హదీసు గ్రంథంలో ఇలా ఉల్లేఖించబడి వుంది: 

“బైతుల్లాహ్ లో ప్రజల (యాత్రికుల) చివరి కార్యం తవాఫ్  కావాలి”

హ॥ ‘సుఫియా’ (రజియల్లాహు అన్హా ) తవాఫె -ఇఫాజా చేసుకున్నారు (దాని తర్వాతే ఆమెకు నెలసరి ప్రారంభమైంది) అనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసినప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు : “అయితే బయలుదేరండి!” 

ఈ హదీసు ఆధారం ఏమంటే నెలసరి గల స్త్రీ పై ‘తవాఫె -విదాత్’ లేదు. కాని ‘తవాఫె -ఇఫాజా’ తప్పని సరి. 

ఇక మీరు అన్నింటి నుండి ‘హలాల్’ అయిపోయినదాని గురించి ఏమిటంటే ఇది (ధార్మిక జ్ఞానము లేనందున) తెలియనందున జరిగిన విషయం. కనుక ఇది మీకు ఎలాంటి నష్టం కల్గించదు. ఎందుకంటే ఎవరైనా తెలియకుండా ‘ఇహ్రాం’ స్థితిలో నివారించబడిన ఏదైన కార్యానికి పాల్పడితే దానికి ఎలాంటి పరిహారం లేదు. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِنْ نَسِينَا أَوْ أَخْطَأْنَا 

“ ఓ మా ప్రభువా! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు”.(బఖరా 2:286) 

దాసుడు ఇలా అడిగినప్పుడు అల్లాహ్ దానిని అంగీకరించి సమాధానంగా ఇలా సెలవిచ్చాడు: 

وَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ فِيمَا أَخْطَأْتُمْ بِهِ وَلَكِنْ مَا تَعَمَّدَتْ قُلُوبُكُمْ 

“మరుపు వల్ల మీ చేత ఏదైన (తప్పు) జరిగిపోతే దాని పాపం మీపై ఉండదు. అయితే హృదయ పూర్వకంగా చేసిన పక్షంలో అది పాపమే“. (33: అల్ అహ్ జాబ్ :5) 

కనుక జాగ్రత్త పడవలసినవన్నీ దేనినైతే అల్లాహ్ మహ్రమ్ కై వారించాడో ఒకవేళ తెలియకుండా లేదా మరచిపోయి వాటిని చేస్తే లేదా మరో దారి లేని పరిస్థితిలో పాల్పడితే అలాంటి పరిస్థితుల్లో అతని పై ఎలాంటి దోషం లేదు. కానీ ఆ స్థితి మారిపోయినప్పుడు దాని నుండి దూరమవ్వట తప్పనిసరవుతుంది. 

ప్ర-52 : బాలింతదశకు చెందిన రక్తస్రావం గల స్త్రీకి ఒక వేళ ‘తర్వియహ్’ రోజు (జిల్ హిజ్జ 8వ తేది) రక్తస్రావం మొదలైయింది. కాని ఆమె ‘తవాఫ్’, ‘సయీ’ తప్ప ‘హజ్’కు సంబంధించిన అన్నీ పనులు పూర్తిచేసుకుంది. అయితే పది రోజుల తరువాత ఆమె తొలిదశగా పరిశుద్ధురాలైనట్లు భావించింది. అప్పుడు ఆమె స్వయంగా పరిశుద్ధురాలుగా నిర్ధారించుకుని మిగిలిన పనులు అంటే ‘తవాఫె ఇఫాజా’ చేసుకోవచ్చా? 

జ: పై పేర్కొనబడిన స్త్రీకి పరిశుద్ధతపై పూర్తిగా విశ్వాసము కలగనంత వరకు ఆమె స్నానము చేసి తవాఫ్  చేయరాదు. ఎందుకంటే ప్రశ్నలో ప్రస్తావించిన తీరులో ‘తొలిదశ’తో ఆమె ఇంకా పూర్తిగా పరిశుద్ధతకు నోచుకోలేదన్న విషయం వ్యక్తమవుతుంది. కనుక ఆమె పూర్తిగా పరిశుద్ధతను గ్రహించిన తరువాతే స్నానము చేసి ‘తవాఫ్’, ‘సయీ’ చేయాలి. ఒక వే ‘తవాఫ్ ‘ కంటే ముందు ‘సయీ’ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ‘హజ్జతుల్-వదాత్’ సందర్భములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ‘ఎవరైన ముందు ‘సయీ’ చేసుకుంటే? అని సంప్రదించినప్పుడు .. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఎలాంటి దోషం లేదు” అని సమాధానమిచ్చారు. 

ప్ర- 53 : ఒక స్త్రీ నెలసరి స్థితిలో “సైల్” ప్రదేశం నుండి హజ్ ‘ఇహ్రాం” కట్టుకుంది. మక్కా వెళ్ళిన తరువాత ఏదో అవసరం పై ‘జిద్దాహ్’ ‘వెళ్ళింది. ‘జిద్దాహ్’ లోనే నెలసరి నుండి పరిశుద్దురాలైంది. స్నానం చేసి తలదువ్వుకుని తరువాత తన ‘హజ్’ను పూర్తిచేసుకుంది. అయితే ఆమె ‘హజ్’ సరైనదేనా? ఆమెపై ఇంకేమైన బాధ్యత వుంటుందా? 

జ : పై ప్రస్తావించబడిన స్త్రీ ‘హజ్’ సరైనదే. ఆమె పై ఎలాంటి బాధ్యత లేదు. 

ప్ర – 54 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నేను ఉమ్రాహ్ చేయటానికి బయలుదేరాను. ‘మీఖాత్’ చేరుకున్నప్పుడు నేను నెలసరితో వున్నాను కనుక నేను ‘ఇహ్రామ్’ కట్టుకోలేదు. పరిశుద్ధురాలైనంత వరకు మక్కాలోనే ఉన్నాను. తరువాత మక్కానుండి ‘ఇహ్రామ్’ కట్టుకున్నాను. అయితే ఇది సరైనదేనా? నా పై ఏమి వాజిబ్ వుంది? 

జ : పై పేర్కొనబడిన పద్ధతి సరైనది కాదు. ఏ స్త్రీ అయితే ఉమ్రాహ్ సంకల్పం కలిగివుందో ఆమెకు ‘ఇహ్రామ్’ లేకుండా ‘మీఖాత్’ నుండి ముందుకు వెళ్ళటం సరైనది కాదు. ఒకవేళ ఆమె నెలసరితో వున్నా సరే. నెలసరి స్థితిలోనే ఆమె ‘ఇహ్రామ్’ కట్టుకోవాలి. ఆమె కట్టుకునే ఈ ఇహ్రామ్ సరైనదే. 

దీనికి ఆధారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘హజ్జతుల్-వదా (అంతిమ హజ్) సంకల్పంతో ‘జుల్ హులైఫా’ ప్రాంతములో వున్నప్పుడు హ॥ అబూ-బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) సతీమణి ‘అస్మా బిన్తె ఉమైస్’ (రజియల్లాహు అన్హా) కు ఒక శిశువు జన్మించింది. అప్పుడు ‘అస్మా’ (రజియల్లాహు అన్హా) ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియపరచి ఈ పరిస్థితిలో తాను ఏమి చేయాలి? అని కబురు పంపారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు : 

“స్నానం చేసి (యోనిపై) గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘ఇహ్రామ్’ వేసుకోవాలి”. 

నెలసరి రక్తం కూడ రక్తస్రావం (బాలింతదశ) ఆదేశాల పరిధిలోనే వస్తుంది. కనుక నెలసరిగల స్త్రీకి మా సూచనేమిటంటే ‘ఆమె ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ సంకల్పముతో ‘మీఖాత్’ ప్రదేశము నుండి వెళ్ళినప్పుడు స్నానము చేసి యోని పై గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రామ్’ కట్టుకోవాలి. కాకపోతే ‘ఇహ్రామ్’ కట్టుకొని పవిత్ర మక్కా చేరుకున్న తరువాత పరిశుద్ధురాలైనంత వరకు ‘మస్జిదే-హరామ్’లో ప్రవేశించ కూడదు. కాబా గృహానికి ప్రదక్షిణం చేయరాదు. ఎందుకంటే హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా)కు ‘ఉమ్రాహ్’  మధ్యలోనే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు (నెలసరి వచ్చినప్పుడు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు  ఇలా సూచించారు: 

హాజీలు చేసినట్టే నీవు కూడ చేయ్యి. కాకపోతే పరిశుద్ధురాలైనంత వరకు కాబా గృహాన్ని ‘తవాఫ్ ‘ చేయకు”. (సహీహ్ బుఖారి, సహీహ్ ముస్లిం) 

‘సహీహ్ బుఖారి’లోని మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది : హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా ) ఇలా తెలిపారు : 

“ఆమె పరిశుద్ధు రాలైనప్పుడు కాబా గృహానికి ప్రదక్షిణం చేశారు. ‘సఫా-మర్వా’ మధ్య ‘సయీ’ కూడా చేశారు”. 

పై ఉల్లేఖనాల ద్వారా తెలిసేదేమిటంటే స్త్రీ నెలసరి కాలంలోనే ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రామ్ కట్టుకోవాలి. లేదా ‘తవాఫ్ ‘ చేయటానికి ముందే నెలసరి ప్రారంభమైనప్పుడు పరిశుద్ధురాలై స్నానం చేయనంత వరకు ‘తవాఫ్ ‘ మరి ‘సయీ’ చేయకూడదు. ఒకవేళ ఆమె పరిశుద్ధ స్థితిలో ‘తవాఫ్ ‘ చేసింది, దాని తరువాత ఆమెకు నెలసరి ప్రారంభమైనప్పుడు ఆమె అదే పరిస్థితిలో తన ‘ఉమ్రహ్ ను పూర్తిచేస్తుంది. ‘సయీ’ చేస్తుంది, తల వెంట్రుకలు కత్రిస్తుంది. ఎందుకంటే సఫా’, ‘మర్వా’ మధ్య ‘సయీ చేయటానికి పరిశుభ్రత అనే షరతు విధించబడలేదు. 

ప్ర – 55: ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు: ‘నేను నా భార్యతో ‘యమ్ బ’ పట్టణం నుండి ‘ఉమ్రహ్’ కొరకు వచ్చాను. జిద్దాహ్  చేరుకున్నప్పుడు నా భార్యకు ఋతుస్రావం మొదలైంది. కనుక నేను ఒకణ్ణి ‘ఉమ్రహ్’ చేసుకున్నాను. అయితే ఇప్పుడు నా భార్యకు ఎలాంటి ఆదేశాలు వుంటాయి? 

జ: ఇలాంటి పరిస్థితిల్లో మీ భార్య సమస్యకు పరిష్కారం ఏమిటంటే ఆమె పరిశుద్ధురాలైనంత వరకు నిరీక్షించి ఆ తరువాత తన ‘ఉమ్రహ్’ పూర్తి చేయాలి. ఎందుకంటే విశ్వాసులు మాతృమూర్తి హ॥ సఫియ (రదియల్లాహు అన్హా) కు నెలసరి మొదలైనప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి సల్లం) ఇలా అన్నారు: “ఏమిటి మాకు ఈమె ప్రయాణం నుండి ఆపేస్తుందా?” ప్రజలు ఇలా అన్నారు : ఓ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె ‘తవాఫె -ఇఫాజా’ అయితే చేసుకున్నది. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అయితె బయలుదేరుదాం“. 

పై హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన “ఏమిటి మాకు ఈమె ప్రయాణం నుండి ఆపేస్తుందా?” మాట ఆధారంగా స్త్రీకి ఒకవేళ ‘తవాఫె -ఇఫాజా’ కంటే ముందు నెలసరి వస్తే ఆమె పరిశుద్ధురాలైనంత వరకు నిరీక్షించి దాని తరువాత ‘తవ్వా ఫె-ఇఫాజా చేయటం తప్పనిసరి ‘వాజిబ్’గా గుర్తించబడుతుంది. 

అలాగే ‘తవాఫె-ఉమ్రహ్’ కూడ ”తవాఫె-ఇఫాజా’ ఆదేశంలోనే వుంది. ఎందుకంటే అది ”ఉమ్రహ్ ‘కు మూల సూత్రం. కనుక ‘ఉమ్రహ్’ చేయదలుచుకునే స్త్రీ ఒకవేళ ‘తవాఫె-ఉమ్రహ్’ కంటే ముందే నెలసరికి గురైతే పరిశుద్ధత కలిగేవరకు నిరీక్షించి దాని తరువాత ‘తవాఫ్ ‘ చేయాలి. 

ప్ర – 56 : ‘మస్ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’ (కాబా చుట్టుప్రక్కల కొంత భాగాన్ని అల్లాహ్ పవిత్ర స్థలంగా నిర్దేశించాడు. అందులో ఎలాంటి రక్తపాతాలు, అపవిత్ర కలాపాలకు పాల్పడరాదు. దానిని ‘హరం’ అంటారు) లో భాగమేనా? నెలసరిగల స్త్రీ ‘మస్ఆ’లో ప్రవేశించ గలుగుతుందా? ‘మస్ఆ’ నుండి ‘హరం’లో ప్రవేశించటానికి ‘తహియ్యతుల్ మస్జిద్’ (మసీదులో ప్రవేశించగానే చదివే నమాజు చదువుట ‘వాజిబా’ (తప్పనిసరా)? 

జ: అందరికీ సుపరిచితమైన విషయం ఏమిటంటే ‘మస్ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’లో భాగం కాదు. ఈ కారణంతోనే దానికి ‘మస్జిదె హరాం’కి మధ్య ఒక చిన్న గోడ నిర్మించబడింది. మస్ఆ ‘హరం’ వెలుపల వుండటమే ప్రజలకు మేలు అని భావించడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకవేళ దీన్ని ‘హరం’లో భాగమేనని నిర్ధారిస్తే అప్పుడు ‘తవాఫ్ ‘, ‘సయీ’ చేస్తున్న సమయంలో నెలసరికి గురైయ్యే స్త్రీని కూడా ‘సయీ’ చేయకుండా వారించడం జరిగేది. 

ఈ విషయంలో నా అభిప్రాయం (‘ఫత్వా’) ఏమిటంటే ఒకవేళ స్త్రీ ‘తవాఫ్ ‘ చేసుకున్న తరువాత ‘సయీ’ చేయటానికి ముందు నెలసరికి గురైతే అప్పుడు ఆమె అదే స్థితిలో ‘సయీ’ చేయవచ్చు. ఎందుకంటే ‘మస్ ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’తో వేరుగా వుంది. 

ఇక ‘తహియ్యతుల్-మస్జిద్’ విషయానికి వస్తే.. ఎవరైన ‘తవాఫ్ ‘ చేసిన తరువాత ‘సయీ’ చేసి, మళ్ళీ ‘మస్జిద్ హరాం’లో రావాలనుకున్నప్పుడు అతనికి  ‘తహియ్యతుల్ మస్జిద్’ చదవవలసి వుంటుంది. ఒకవేళ చదవక పోయినా పర్వాలేదు. కాని అల్లాహ్ ప్రసాదించిన ఈ మహత్తర అవకాశాన్ని వినియోగించుకుంటూ, అక్కడ నమాజు చేయుటలో ఉన్న గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రకాతుల (తహయ్యతుల్ మస్జిద్) చదువుకోవడమే ఉత్తమమైన కార్యం. 

ప్ర – 57 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది : నేను హజ్ చేశాను. హజ్ లో ఉన్నప్పుడే ఋతుస్రావం ప్రారంభమైంది. సిగ్గు, బిడియం కారణంగా ఎవరికీ చెప్పలేకపోయాను. అదే పరిస్థితిలో ‘హరం’లో కూడ ప్రవేశించాను, నమాజు చదివాను, ‘తవాఫ్ ‘, ‘సయీ’ కూడా చేశాను. అయితే ఇప్పుడు నేను ఏమిచేయాలి? ఒకమాట ఏమిటంటే (బాలింత దశ ) రక్తస్రావం తరువాత నెలసరి వచ్చింది.? 

జ : నెలసరి, రక్తస్రావంగల స్త్రీ నమాజు ఆ స్థితిలో చేయరాదు. అది మక్కాలో నైనా స్వగ్రామంలో నైనా, మరెక్కడైనా సరే. ఎందుకంటే మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్త్రీ గురించి ఇలా అన్నారు: “ఏమిటి ఇలా లేదా (వాస్తవం కాదా)? ఏమంటే స్త్రీ నెలసరితో వున్నప్పుడు నమాజు చదవదు మరి ఉపవాసం పాటించదు.” 

యావత్తు ముస్లిములు ఏకీభవించేది ఏమిటంటే నెలసరి గల స్త్రీ నమాజు చదవకూడదు, ఉపవాసం వుండకూడదు. కనుక పై పేర్కొనబడిన స్త్రీ అల్లాహ్ క్షమాపణ కోరుతూ తనతో జరిగిన ఈ తప్పుకి పశ్చాతాపపడాలి. 

ఇక ఈ స్థితిలో ‘తవాఫ్ ‘ చేసే విషయమైతే ఇలా తవాఫ్  చేయుట కూడా సరికాదు. కాని ‘సయీ’ చేయవచ్చు. ఎందుకంటే ఈ విషయంలో ప్రఖ్యాత అభిప్రాయం ఏమిటంటే ‘హజ్’ సందర్భములో తవాఫ్  కంటే ముందు’సయీ’ చేసుకోవచ్చు. కనుక ఆమె రెండోసారి ‘తవాఫ్ ‘ చేయవలసి వుంటుంది. ఎందుకంటే ‘తవాఫ్-ఇఫాజా’ ‘హజ్’ మూల సూత్రాల్లో ఒకటి. అది లేకుండా ‘హలాల్’ కాలేరు (సమ్మత్వాన్ని పొందలేరు). అందుకని ఆ ఒకవేళ వివాహిత అయితే ‘తవాఫ్ ‘ చేయనంత వరకు తన భర్తతో లైంగికంగా దగ్గరకాకూడదు. ఒకవేళ అవివాహితురాలైతే ‘తవాఫ్ ‘ చేయనంత వరకు ‘నికాహ్’ (వివాహం చేసుకోకూడదు. 

ప్ర – 58: స్త్రీకి ‘అరఫహ్’ రోజున ఋతుస్రావం మొదలైతే ఏమిచేయాలి? 

జ: స్త్రీకి ‘అరఫహ్’ రోజున ఋతుస్రావం మొదలైతే ఇతర హాజీల్లా ఆమె కూడ హజ్జ్ లోని  కార్యాలన్ని పూర్తి చేయాలి. కాకపోతే ‘బైతుల్లాహ్’ (కాబాగృహం) తవాఫ్ ‘ చేయరాదు. పరిశుద్ధులయ్యేంత వరకు నిరీక్షించి, పరిశుద్ధులైన తరువాత ‘బైతుల్లాహ్ ‘ (కాబా గృహం) ‘తవాఫ్  చేయాలి. 

ప్ర – 59: ఒకవేళ స్త్రీ ‘జమరయె-ఉఖ్బహ్’ పై రాళ్ళు రవ్వినంతరం – ‘తవాఫ్-ఇఫాజా’ కంటే ముందు ఋతుస్రావానికి గురైంది. ఆమె, ఆ ఒక బృందముతో కలిసి ఉన్నారు. ఆమె ప్రయాణం తరువాత తిరిగి మక్కాకు రావటం కష్టం లేక అసాధ్యం. అప్పుడు ఆమె ఏమిచేయాలి? 

జ: పై ప్రస్తావించబడిన స్త్రీ మళ్ళీ ‘మక్కా’కు రావటం అసాధ్యమైనప్పుడు అవసర నిమిత్తం ఆమె తన యోనిపై గుడ్డ కట్టుకుని ‘తవాఫ్’ చేసుకోవాలి. అలాగే మిగితా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో ఆమెపై ఎటువంటి పరిహారం వాజిబ్ కాదు. 

ప్ర – 60 : రక్తస్రావం గల స్త్రీ ఒకవేళ 40 రోజులకు ముందే పరిశుద్ధురాలైతే ఆమె ‘హజ్’ సరైనదేనా? ఒక వేళ పరిశుద్ధతను గ్రహించకపోతే ఏమిచేయాలి? గమనించవలసిన విషయం ఏమంటే ఆమె ‘హజ్’కై సంకల్పం చేసి వుంది? 

జ : రక్తస్రావం గల స్త్రీ ఒకవేళ 40 రోజులకు ముందే పరిశుద్దురాలైనప్పుడు స్నానముచేసి నమాజు చదువుకోవాలి. పరిశుద్ధ స్త్రీలు చేసే కార్యాలన్నీ చేయాలి. చివరికి ‘బైతుల్లాహ్’ (కాబాగృహం) ‘తవాఫ్ ‘ కూడ చేయాలి. ఎందుకంటే రక్తస్రావం కనీస కాలానికి ఎలాంటి పరిమితం లేదు. సంకల్పం సరైనదే. కాకపోతే పరిశుద్ధురాలైనంత వరకు ఆమె ‘బైతుల్లాహ్’ పై పేర్కొనబడిన స్త్రీ పరిశుద్ధతను చూడనప్పుడు ఆమె ‘హజ్’ (కాబా గృహం) ‘తవాఫ్’ చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఋతుస్రావంలో గల స్త్రీని బైతుల్లాహ్ (కాబాగృహం) తవాఫ్ ‘ నుండి వారించారు. 

ఈ విషయంలో రక్తస్రావం గల స్త్రీ కూడ నెలసరి గల స్త్రీ ఆదేశంలోనే వుంటుంది

నోట్స్:

  • ఇహ్రామ్ : కాబా దర్శనానికి వెళ్ళేటప్పుడు కట్టుకునే ప్రత్యేక వస్త్రాలు. కానీ స్త్రీలకు ప్రత్యేక వస్త్రాలంటు లేవు. కేవలం పరిమిత కాలంలో తమకు తాముగా ధర్మపరమైన నిబంధనలకు లోబడి ఉండాలి
  • మీఖాత్: పవిత్రం కాబా గృహానికి చుట్టూ నిర్ణయించబడిన పరిధిలో ప్రవేశించడానికి కేటాయించ బడిన పవిత్ర స్థలము ‘హరం’
  • ‘తహియ్యతుల్-మస్జిద్‘ : మసీదులో ప్రవేశించినప్పుడు, మసీదును దర్శించినప్పుడు పాటించ వలసిన రెండు రకాతులను అంటారు. 
  • మస్జిదే హరాం : కాబా చుట్టు నిర్మించబడి వున్న మసీదు. దీనిలో ఒక నమాజు లక్ష నమాజుల పుణ్యంతో సమానం.
  • తవాఫ్  : పవిత్ర ‘కాబా’ గృహానికి ప్రదక్షిణ చేయడం. 
  • తవాఫ్ – ఇఫాజా: ‘జిల్-హిజ్జహ్’ పదో తేది రోజు చేసే ‘కాబా’ ప్రదక్షణం 
  • ఖస్ర్ : తలవెంట్రుకలు కొద్దిగా కత్రించుట. 
  • సయీ : సఫా, మర్వా అనే కొండప్రాంతాల నడుమ వేగంగా నడవడానిని అంటారు. ఇది హజ్, ఉమ్రాహ్ మూలాల్లో ఒకటి. 
  • మహ్రమ్: ఆమెతో వివాహానికి ఆస్కారం లేని వ్యక్తి ఉదాహరణకు : తండ్రి, కుమారుడు, సోదరుడు, మావయ్య లాంటి వారు
%d bloggers like this: