ఇస్లామీయ షరీఅత్, ఖుర్ఆన్ హదీసుల్లో నిర్ణయించిన పద్ధతుల ద్వారానే మరణించిన వారికి పుణ్యప్రాప్తి జరుగుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:
“మనిషి చనిపోగానే అతని ఆచరణల పరంపర కూడా ఆగిపోతుంది.అయితే మూడు మార్గాల ద్వారా అతనికి పుణ్యం చేరుతూ ఉంటుంది.”
ఆ మూడు మార్గాలు ఇవి :
1) సదఖయె జారియా
2) ప్రయోజనకరమైన విద్య
3) సదాచార సంపన్నులైన సంతానం చేసే దుఆలు
ఈ క్రింది హదీసుకు అనుగుణంగా కూడా తమ మృతులకు పుణ్య సమర్పణ చేయవచ్చు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:
విశ్వాసికి తను మరణించిన తర్వాత కూడా తన ఆచరణల, సత్కార్యాల పుణ్యం లభించే మార్గాలు ఇవి:
1) తాను ఇతరులకు బోధించి ప్రచారం చేసిన విద్య
2) తన సంతానాన్ని సదాచార సంపన్నులుగా, ఖుర్ఆన్కు వారసులుగా తీర్చిదిద్దటం
3) మస్జిద్ లు, సత్రాలు నిర్మించటం
4) ఆరోగ్యంగా ఉన్న కాలంలో తన ధనంలో కొంత భాగం దాన ధర్మాల కోసం ఖర్చుపెట్టడం. (ఇబ్నెమాజా)
3) చనిపోయిన వారి తరఫు నుండి ఏదయినా వస్తువు దానం చేస్తే దాని పుణ్యం కూడా మృతులకు లభిస్తుంది. బుఖారీలోని ఒక హదీసులో ఇలా ఉంది: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) దగ్గరికి వెళ్ళి, “దైవప్రవక్తా! నా తల్లి చనిపోయింది. నేనామె తరఫున దానధర్మాలు చేస్తే దాని వల్ల ఆమెకు పుణ్యం లభిస్తుందా?” అనడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ‘లభిస్తుంద‘ని చెప్పారు.
జలదానం అన్నింటి కంటే గొప్ప దానం!
4) ముస్నదె అహ్మద్ మరియు సునన్ గ్రంథాల్లో ఇలా ఉంది: హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) దగ్గరకు వెళ్ళి, “దైవప్రవక్తా! నా తల్లి చనిపోయింది. నేను ఆమె తరఫున ఏ వస్తువు దానం చేస్తే ఆమెకు ఎక్కువ పుణ్యం లభిస్తుంది?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) “నీళ్ళు” అని సమాధానమిచ్చారు. అప్పుడు సాద్ (రదియల్లాహు అన్హు) ఒక బావిని త్రవ్వించి, సాద్ తల్లికి పుణ్య సమర్పణ కోసం ఈ బావి త్రవ్వించ బడిందని ప్రజల మధ్య ప్రకటించారు.
పై హదీసు ద్వారా బోధపడే విషయమేమిటంటే మృతులకు వారి సంతానం తరఫున పుణ్యం చేకూరే మార్గాలలో జల దానం కూడా ఒకటి. ఈ ఆదేశం బావులు, గొట్టపు బావులు, కాలువలు, చెరువులు త్రవ్వించటానికి కూడా వర్తిస్తుంది.
5) సహీహ్ ముస్లింలోని ఒక హదీసులో ఇలా ఉంది: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) దగ్గరకు వెళ్ళి, “నా తల్లిదండ్రులు ఆస్తి వదలి వెళ్ళారు. వారు అందులో (దానధర్మాల) గురించి ఎలాంటి వీలునామా రాసి వెళ్ళలేదు. ఇప్పుడు వారి తరఫున నేను దానం చేస్తే దాని పుణ్యం వారికి లభించగలదా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ‘లభిస్తుంద’ని చెప్పారు.
6) మృతుని కొరకు ముస్లిం ప్రజానీకం దుఆ చేసినా, అతని మన్నింపు కొరకు ప్రార్థించినా దానివల్ల అతనికి పుణ్యం లభిస్తుంది. దాని గురించి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
وَالَّذِينَ جَاءُوا مِن بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ
“వారి తరువాత వచ్చిన వారు ఇలా ప్రార్థిస్తారు: ప్రభూ! మమ్మల్నీ, మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందరినీ క్షమించు.”(ఖుర్ఆన్ 59 : 10)
సునన్ గ్రంథాల్లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) “మీరు మరణించిన వారి జనాజా నమాజ్ చేస్తే, వారి కొరకు చిత్తశుద్ధితో ప్రార్థించండి” అని ఆదేశించారని ఉంది.
బ్రతికున్న వారి తరఫు నుండి మరణించిన వారికి పుణ్యం చేకూరే మార్గాలు ఇవే. ఇవిగాక ఇతర పద్ధతులకు ఖుర్ఆన్ హదీసుల్లో ఎక్కడా రుజువు లభించదు.
Tags: Conveying Rewards to the Deceased (Dead), Isal e Sawab
—
క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. పూర్తి పుస్తకం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇస్లామీయ ఆరాధనలు – ప్రతి ముస్లిం ఇంట్లో ఉండవలసిన పుస్తకం – శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్