The Day of ‘Arafah – by Shaykh ‘Abdurrazzāq al Badr [Video|Ar-En Subtitles]
https://youtu.be/b_laOsp-N6Y [56 min]
గౌరవనీయ సోదరులారా, అరఫా దినం చాలా గొప్ప దినం. దానికి ఇవ్వాల్సిన సరైన ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి, దాని స్థాయిని మనం తెలుసుకోవాలి. దాని స్థానం మరియు ప్రాధాన్యత పట్ల మనం స్పృహతో ఉండాలి. తద్వారా దాని అపారమైన ప్రాముఖ్యతను, ఉన్నత స్థాయిని అలాగే దాని గొప్ప అంతస్తును స్పష్టంగా అర్థం చేసుకుని మనం ఆ రోజులోకి ప్రవేశించగలము. ఇది మరే ఇతర దినం లాంటిది కాదు, ప్రత్యేకంగా అరఫాలో నిలబడే భాగ్యాన్ని అల్లాహ్ ఎవరికైతే ప్రసాదించాడో వారికి ఇది మరింత ప్రత్యేకం, అయితే ఈపుణ్యం కేవలం వారికి మాత్రమే పరిమితం కాదు.
ఎందుకంటే, మీ అందరికీ తెలిసినట్లుగా, అరఫా రోజున ఉపవాసం ఉండటం గురించి ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం పాపాలను అల్లాహ్ క్షమిస్తాడని నేను ఆశిస్తున్నాను.” ఇది సాధారణ ముస్లింలకు వర్తిస్తుంది. హజ్ యాత్రికుల (హాజీల) విషయానికొస్తే, వారు అరఫా రోజున ఉపవాసం ఉండక పోవడమే వారికి ఉత్తమం. ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం)ను ఆదర్శంగా తీసుకుని, ఆ గొప్ప మరియు పవిత్రమైన రోజున అల్లాహ్ స్మరణలో (జిక్ర్), దుఆలు చేయడంలో మరియు అల్లాహ్ ధ్యానంలో గడపడానికి వారు తమను తాము, తమ శరీరాలను బలోపేతం చేసుకోవాలి. ఉమ్ముల్ ఫజ్ల్ బింత్ అల్-హారిస్(రజియల్లాహు అన్హా) ఉల్లేఖించిన హదీసు సహీహైన్ (బుఖారీ, ముస్లిం)లో ఉంది, ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపవాసం ఉన్నారా లేదా అనే విషయమై కొందరు ఆమె దగ్గర చర్చిస్తున్నారు, అది అరఫా రోజు. కాబట్టి, ఆమె ఒక కప్పు పాలు తీసుకుని ప్రవక్తకు అందించగా, ఆయన దానిని త్రాగారు. ‘మీరు చూస్తున్నదే సమాధానం’ అని ఆమె చెప్పినట్లుగా అది ఉంది. ప్రవక్త దానిని త్రాగారు, కాబట్టి ఆయన ఉపవాసం లేరని తెలిసింది. కాబట్టి, అరఫా రోజున హాజీలు ఉపవాసం ఉండక పోవడమే సున్నత్. హాజీలు కాని ఇతరుల విషయానికొస్తే, అరఫా రోజున ఉపవాసం ఉండటం అనేది ఐచ్ఛిక (నఫిల్) ఉపవాసాలలో అత్యుత్తమమైనది. నిశ్చయంగా, ప్రవక్త ఇలా అన్నారు: “గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం పాపాలను అల్లాహ్ క్షమిస్తాడని నేనుఆశిస్తున్నాను.”
గౌరవనీయ సోదరులారా, ఈ గొప్ప అరఫా దినం యొక్క స్థాయి పట్ల మనం స్పృహ కలిగి ఉండటం అత్యవసరం. ప్రవక్త సున్నత్ ద్వారా వచ్చిన అనేక ఆధారాలు మరియు రుజువుల ద్వారా దీని స్థాయి స్పష్టమవుతుంది. తారిఖ్ ఇబ్న్ షిహాబ్ ద్వారా సహీహైన్ లో వచ్చిన ఉల్లేఖన వాటిలో ఒకటి: యూదులలో ఒక వ్యక్తి ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రజియల్లాహు అన్హు) వద్దకు వచ్చి ఇలా అన్నాడు, “ఓ ముస్లింలారా, మీ గ్రంథంలో ఒక ఆయత్ అవతరించింది. ఒకవేళ అది మా యూదులపై అవతరించి ఉంటే, మేము ఆ రోజును పండుగ (‘ఈద్) గా జరుపుకునే వాళ్ళం.” అప్పుడు ఉమర్, “ఆ ఆయత్ ఏది?” అని అడిగారు. దానికి అతడు, అల్లాహ్ వచనం: “ఈ రోజు నేను మీ ధర్మాన్ని మీకొరకు పరిపూర్ణం చేశాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, మరియు ఇస్లాంను మీధర్మంగా ఎంచుకున్నాను” (5:3) అని చెప్పాడు. అప్పుడు ఉమర్ ఇలా బదులిచ్చారు,”నిశ్చయంగా, అల్లాహ్ సందేశహరుడిపై (సల్లల్లాహు అలైహి వసల్లం) అది ఏరోజు, ఏ సమయంలో అవతరించిందో నాకు తెలుసు. అది శుక్రవారం రోజున, అరఫా దినం మధ్యాహ్నం వేళ అవతరించింది.” ఈ ఆయత్ తర్వాత హలాల్ మరియు హరామ్ లకు సంబంధించి మరేమీ అవతరించలేదు. అల్లాహ్ ధర్మాన్ని పరిపూర్ణం చేసి పూర్తి చేశాడని స్పష్టం చేస్తూ ఇది అవతరించింది. అరఫా దినం యొక్క ఈ అపారమైన గొప్పదనాన్ని గురించి ఆలోచించండి! ఈ ఉమ్మత్ (సమాజం) కొరకు అల్లాహ్ వారి ధర్మాన్ని పూర్తి చేసి పరిపూర్ణం చేసిన దినం ఇది. ఇందువల్ల, అరఫా దినం తర్వాత, ఈ ఆయత్ అవతరించిన తర్వాత, హలాల్ మరియు హరామ్ కు సంబంధించిన విషయాలపై ప్రవక్తపై ఎలాంటి ఆయతులూ అవతరించలేదు. ఎందుకంటే ధర్మం పరిపూర్ణమైంది. ఇది ఈ గొప్ప అరఫా దినం యొక్క స్థాయిని మనకు తెలియజేస్తుంది!
అదే విధంగా, సహీహ్ ముస్లింలో విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా (రజియల్లాహు అన్హా) నుండి ఉల్లేఖించబడినది, ప్రవక్త ఇలా అన్నారు: “అరఫా దినాన అల్లాహ్ నరకాగ్ని నుండి దాసులను విముక్తులను చేసినంతగా మరే రోజున చేయడు. ఆయన వారి సమీపానికి వస్తాడు, ఆపై తన దూతల వద్ద వారి గురించి గర్వపడుతూ, ‘వీరికి ఏమి కావాలి?’ అని అంటాడు.” ఈ అపారమైన హదీసుపై ఆలోచించండి! అల్లాహ్ మిమ్మల్ని రక్షించి, మీకు సాఫల్యం ప్రసాదించుగాక. మీరు అరఫాలో నిలబడి ఉన్నప్పుడు ఇది మీ మనస్సులో ఉండనివ్వండి. నిశ్చయంగా, ఇది అరఫా దినం యొక్క నాలుగు అత్యంత గొప్ప సుగుణాలను ఒక చోట చేర్చింది!
మొదటిది: సంవత్సరంలో మరే రోజున లేనంతగా అల్లాహ్ నరకాగ్ని నుండి ఎక్కువ మంది దాసులకు విముక్తి కలిగించే రోజు ఇది. అరఫా రోజున, అల్లాహ్ ఒక్కడికి తప్ప మరెవరికీ తెలియని సంఖ్యలో దాసులకు నరకాగ్ని నుండి అల్లాహ్ విముక్తి కలిగిస్తాడు. కాబట్టి, మీకు ఇది తెలిసి, దీని పట్ల మీరు అప్రమత్తంగా ఉంటే, మీరు అరఫాలో నిలబడినప్పుడు నరకం నుండి విముక్తి పొందే వారిలో మీరు కూడా ఒకరు కావాలనే కోరికను అది అల్లాహ్ పట్ల బలోపేతం చేస్తుంది. అల్లాహ్ పై మీ ఆశను మరియు నమ్మకాన్ని బలపరచుకోండి. దుఆతో అల్లాహ్ ను వేడుకోండి. “మా ప్రభువా! మాకు ఇహలోకంలో మేలును ప్రసాదించు మరియు పరలోకంలో కూడా మేలును ప్రసాదించు, మరియు నరకాగ్ని శిక్ష నుండి మమ్మల్ని రక్షించు!” (2:201) “మా ప్రభువా! మా నుండి నరక శిక్షను దూరంగా ఉంచు. నిశ్చయంగా దాని శిక్ష ఎన్నటికీ వదలని శాశ్వతమైన శిక్ష.” (25:65) కాబట్టి, అల్లాహ్ తో మీ అనుబంధాన్ని, నమ్మకాన్ని దృఢపరచుకోండి. ఈ రోజున నరకం నుండి విముక్తి పొందే వారిలో మీరూ ఉన్నారనే ఆశను ఆయనపై దృఢపరచుకోండి. “అరఫా దినాన అల్లాహ్ నరకాగ్ని నుండి దాసులను విముక్తులను చేసినంతగా మరే రోజున చేయడు.” ఇది ఈ పవిత్ర దినం యొక్క అద్భుతమైన సుగుణం.
రెండవ సుగుణం: అరఫా మధ్యాహ్నం వేళ అల్లాహ్ తన దాసుల సమీపానికి వస్తాడు. దైవికమైన ఈ సామీప్యం ముస్లింల, విశ్వాసుల, తమ ప్రభువును తెలుసుకున్న వారి హృదయాలలో గొప్ప మరియు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అల్లాహ్ తన ఘనతకు తగినట్లుగా, అరఫా మధ్యాహ్నం తన దాసులకు చేరువవుతాడు. ఎలాగో మనకు తెలియదు. ఆ విషయం అల్లాహ్ కే బాగా తెలుసు. అయితే, ఈ పవిత్రమైన మధ్యాహ్నం వేళ తాను తన దాసులకు చేరువవుతున్నానని ఆయన తన సందేశహరుడికి తెలియజేసినట్లుగానే మనం విశ్వసిస్తాము. సుబ్ హానల్లాహ్! ఆయన సమీపానికి రావడంతో ఎంత దయ, మంచితనం, ఆశీర్వాదాలు మరియు అంగీకరించబడిన దుఆలు వస్తాయి?! ఎంత అద్భుతం?! కాబట్టి, అరఫా ప్రజలను అల్లాహ్ సత్కరించిన ఈ అపారమైన విషయం పట్ల స్పృహ కలిగి ఉండండి! నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉండకండి. బదులుగా, అల్లాహ్ వైపుకు మరలే వారిలో, దుఆ చేసేవారిలో, స్మరించే వారిలో, ప్రార్థనలతో అల్లాహ్ ను వేడుకునే వారిలో ఉండండి. అల్లాహ్ తన దాసులకు చేరువవుతాడని, తన దాసుల పట్ల సంతోషిస్తూ దగ్గరకు వస్తాడనే ఈ అపారమైన, గొప్ప విషయం పట్ల స్పృహ కలిగి ఉండండి! అందులో ఆయన తన దాసుల గురించి తన దూతలతో గర్వంగా చెబుతాడు. “నా దాసులను చూడండి. వారు చింపిరి జుట్టుతో, ధూళితో నిండి నా దగ్గరకు వచ్చారు. నేను వారిని క్షమించానని మీకు సాక్ష్యమిస్తున్నాను!” కాబట్టి, ఈ విధంగా సమీపించడంలో అపారమైన ప్రాముఖ్యత ఉంది. అందువల్లనే, ఆ ప్రవచనం చివరలో “ఆయన తన దాసుల సమీపానికి వస్తాడు. ఆపై వారి గురించి తన దూతలతో గర్వంగా చెబుతాడు” అని ఉంది.
మరియు ఇది మూడవ అపారమైన సుగుణం. ధార్మిక పండితులు చెప్పినట్లుగా, అల్లాహ్ హాజీల గురించి దూతల వద్ద గర్వపడటం అనేది ఆయన వారిని క్షమించాడనడానికి రుజువు. ఎందుకంటే ఆయన పాపుల గురించి గర్వపడడు. ఏదేమైనా, ఆయన వారిని క్షమించాడని మరియు వారి దుఆలను అంగీకరించాడని అనడానికి ఇది రుజువు. అందుకే ఆయన వారి గురించి దూతలతో గర్వపడుతున్నాడు.
మన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనంలోని నాల్గవ సుగుణం ఆయన చెప్పిన మాట, “వీరికి ఏమి కావాలి?” ఈ మాట చెబుతున్నది ఎవరు? నిశ్చయంగా ఆయనే సకల లోకాల ప్రభువు! ఆయన క్షమించలేనంత పెద్ద పాపం గానీ, ఆయన తీర్చలేనంత పెద్ద అవసరం గానీ ఏదీ లేదు. కాబట్టి, అల్లాహ్ చేత సాఫల్యం పొందిన ఓ భాగ్యశాలి, ఓ దీవించబడిన సోదరుడా, ఓ హాజీ, అల్లాహ్ వద్ద ఉన్న దాని కొరకు మీ నిరీక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. మీ ప్రభువును అడగడానికి మీ పాపం లేదా మీ అవసరం మరీ పెద్దదైనదని ఎన్నడూ అనుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ ఈ రోజున “వీరికి ఏమి కావాలి?” అని అడుగుతున్నాడు. ఇందులో, దుఆలు అంగీకరించ బడతాయని మరియు తనను వేడుకునే వారిని, తన నుండి ఆశించే వారిని మరియు తనపై నమ్మకం ఉంచిన వారిని అల్లాహ్ నిరాశపరచడనడానికి రుజువు ఉంది. ముఖ్యంగా వారు వినమ్రంగా నిలబడి, ఏడుస్తూ, అల్లాహ్ కు దుఆ చేస్తూ, ఆయన అనుగ్రహాలను అడుగుతున్నప్పుడు. అల్లాహ్ సాక్షిగా, ఆయన దానిని ఎన్నటికీ తిరస్కరించడు!
ఇమామ్ ఫుజైల్ ఇబ్న్ ఇయాజ్ చెప్పిన ఈ అద్భుతమైన, గొప్ప వాక్యాన్ని గురించి ఆలోచించండి. ఆయన అరఫా దినం మధ్యాహ్నం వేళ నిలబడి, దుఆలు చేస్తూ, ఏడుస్తున్న ప్రజలను చూశారు. అప్పుడాయన ఇలా అన్నారు: “వారు ఇలా ఏడుస్తున్న స్థితిలో వెళ్లి ఒక వ్యక్తిని ఒక నాణెం (చాలా చిన్న మొత్తం) అడిగితే, అతడు వారిని తిరస్కరిస్తాడా?” అని అడిగారు. దానికి వారు “లేదు” అని అన్నారు. అప్పుడు ఫుజైల్, “అల్లాహ్ సాక్షిగా, ఈ వ్యక్తి వారికి ఒక నాణెం ఇవ్వడం కంటే అల్లాహ్ వద్ద క్షమాపణ లభించడం చాలా సులభం” అని అన్నారు. కాబట్టి, ఓ అల్లాహ్ దాసుడా! అల్లాహ్ మిమ్మల్ని మరియు మిగిలిన ముస్లింలను క్షమిస్తాడని అల్లాహ్ పట్ల మంచి ఆలోచనలు (హుస్నె జన్) కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని మరియు చేతులెత్తి భక్తిశ్రద్ధలతో దుఆలు చేస్తూ, అర్థిస్తున్న వారిని క్షమిస్తాడనే మీ మంచి ఆలోచనను బలోపేతం చేయండి. నిశ్చయంగా, అల్లాహ్ వారిని తిరస్కరించడు. మీ గురించి మరియు ఇతరుల గురించి నిరాశ చెందడం, ఆశలు కోల్పోవడం పట్ల జాగ్రత్త వహించండి. దీని పట్ల అప్రమత్తంగా ఉండండి!
అబ్దుల్లాహ్ ఇబ్న్ అల్-ముబారక్ ఇలా అన్నారు: అరఫా మధ్యాహ్నం సుఫ్యాన్ సవ్రీ మోకాళ్లపై కూర్చుని ఏడుస్తుండగా నేను ఆయన వద్దకు వచ్చాను. అది నన్ను కూడా ఏడ్చేలా చేసింది. అప్పుడాయన నా వైపు తిరిగి, “ఏమైంది?” అని అడిగారు. అప్పుడు నేను ఆయనను “ఈ ప్రదేశంలో ఉన్న వారిలో అత్యంత దౌర్భాగ్యులు (చెడ్డవారు) ఎవరు?” అని అడిగాను. అప్పుడాయన, “అల్లాహ్ తమను క్షమించడని భావించేవారే!” అని అన్నారు. ఇబ్న్ అబీ దున్యా తన గ్రంథమైన ‘హుస్న్ అజ్-జన్ బి అల్లాహ్’ లో దీనిని ఉల్లేఖించారు.
ఈ పవిత్ర మధ్యాహ్నం సమయంలో విశ్వాసి తన కోసం మరియు తన సోదరుల కోసం అల్లాహ్ పట్ల సదాభిప్రాయం (హుస్నె జన్) కలిగి ఉండటం అత్యవసరం. వృద్ధులు, పేదలు, ధనికులు, నాయకులు, సామాన్యులు ఇలా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తమను తాము కష్టపెట్టుకుని, అలసిపోయి ఈ పవిత్రమైన భూమికి రావడం మీరు చూశారా? వారు అల్లాహ్ వద్ద ఉన్నదాని (స్వర్గం, క్షమాపణల) పట్ల ఆశతో ఉన్నారు. అందువలన, అల్లాహ్ హాజీలందరినీ క్షమిస్తాడని, వారిని నిరాశతో వెనుతిరగనివ్వడని, వారి దుఆలను అంగీకరిస్తాడని, వారి తప్పులను క్షమిస్తాడని, దారి తప్పిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడని, వారిని మంచి స్థితిలో తన వైపుకు మరలుస్తాడని, వారి పాపాలు క్షమించబడి వారి దేశాలకు తిరిగి చేర్చుతాడని అల్లాహ్ పట్ల మంచి ఆలోచనలు కలిగి ఉండటం అత్యవసరం. మన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అంగీకరించబడిన హజ్ (హజ్జె మబ్రూర్) కు స్వర్గం తప్ప మరే ప్రతిఫలం లేదు.”
గౌరవనీయ సోదరులారా, అరఫా దినం దుఆ (ప్రార్థన) దినం. అరఫా రోజున చేసే దుఆ అంగీకరించబడుతుంది మరియు తిరస్కరించబడదు. అల్లాహ్ కు దుఆ చేయడానికి అత్యంత అనువైన రోజులు మరియు సమయాలలో ఇది ఒకటి. అందుకనే, మన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి వచ్చిన హదీసులో ఆయన ఇలా అన్నారు: “అత్యుత్తమ దుఆ అరఫా దినాన చేసే దుఆ.” ఈ పవిత్ర దినాన దుఆ యొక్క విశిష్టత, దాని గొప్ప ప్రాముఖ్యత మరియు దుఆ చేయడానికి ఇది అత్యుత్తమ దినం అనే విషయానికి ఈ మాటే మీకు తగిన ఆధారంగా సరిపోతుంది. ఆయన ఇలా అన్నారు: “అత్యుత్తమ దుఆ అరఫా దినాన చేసే దుఆ, మరియు నేను, నా కంటే ముందు వచ్చిన ప్రవక్తలు పలికిన అత్యుత్తమ వాక్యం ఏమిటంటే: లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహు, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్ (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన వాడు మరొకడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు ఎలాంటి భాగస్వాములు లేరు. సర్వాధికారాలు, సర్వస్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి, ఆయన ప్రతిదానిపైనా శక్తిమంతుడు).” శ్రద్ధ వహించండి! “అత్యుత్తమ దుఆ అరఫా దినాన చేసే దుఆ”.
అయితే, మన ప్రవక్త మరియు ఆయన కంటే ముందు వచ్చిన ప్రవక్తలు కూడా అరఫా దినం మధ్యాహ్నం వేళ తరచుగా ఇలా అనేవారు: లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహు, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్ (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన వాడు మరొకడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు ఎలాంటి భాగస్వాములు లేరు. సర్వాధికారాలు, సర్వస్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి, ఆయన ప్రతిదానిపైనా శక్తిమంతుడు). ఇందులో అద్భుతమైన, గొప్ప రహస్యం దాగి ఉంది. దీనిని మనం తప్పక అర్థం చేసుకోవాలి. నిశ్చయంగా, ఈ వాక్యానికి పునాది అయిన తౌహీద్ (అల్లాహ్ ను ఆరాధనలో ఏకైకుడిగా ఆరాధించడం) అనేది దుఆలు అంగీకరించబడటానికి తాళంచెవి లాంటిది! మరియు ఇది ప్రతి మేలుకు ద్వారం! ఇహలోకంలో మరియు పరలోకంలో ప్రతి సంతోషం మరియు విజయానికి పునాది. అందువల్ల, అరఫా మధ్యాహ్నం వేళ మీరు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వాక్యాన్ని పదే పదే పఠించడం ద్వారా మీ హృదయంలో ఈ తౌహీద్ ను మరియు ఈ ఈమాన్ ను పునరుద్ధరించుకోవాలి: లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహు, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్ (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన వాడు మరొకడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు ఎలాంటి భాగస్వాములు లేరు. సర్వాధికారాలు, సర్వస్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి, ఆయన ప్రతిదానిపైనా శక్తిమంతుడు).
గౌరవనీయ సోదరుడా, అత్యంత గొప్ప వాక్యం మరియు స్మరణ అయిన ఈ గొప్ప ప్రకటన, కేవలం నోటితో పలికే వాక్యమో లేదా ఊరికే వల్లించే పదమో కాదు. కాదు! ఈ వాక్యం అత్యంత గొప్ప అర్థాలను, ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉంది. అల్లాహ్ పట్ల సత్యసంధత, చిత్తశుద్ధి (ఇఖ్లాస్), దృఢవిశ్వాసం (యఖీన్) మరియు ఈమాన్ తో ఎవరైతే దీనిని పలుకుతారో వారికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. కేవలం నోటితో ఉచ్చరిస్తూ, దాని అర్థాన్ని గ్రహించకుండా, దాని లక్ష్యాలను నెరవేర్చకుండా పలికే వ్యక్తికి దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు! అల్లాహ్ పట్ల దృఢవిశ్వాసం, సత్యసంధత, చిత్తశుద్ధి, ప్రేమ మరియు సామీప్యంతో పలికే వారికి మాత్రమే ఇది ప్రయోజనకరం. నిశ్చయంగా ఇది స్వర్గానికి తాళంచెవి. అయితే, వహబ్ ఇబ్న్ మునబ్బిహ్ చెప్పినట్లుగా, “పళ్ళు లేని తాళంచెవి అంటూ ఏదీ ఉండదు. మీరు సరైన పళ్ళున్న తాళంచెవిని తీసుకువస్తేనే, తలుపు తెరుచుకుంటుంది. లేకపోతే అది తెరచుకోదు.”
ప్రతి నమాజు చివరలో మీరు పలికే ఈ వాక్యాలు మీ తౌహీద్ ను అభివృద్ధి చేయడానికి, స్థిరపరచడానికి, పునరుద్ధరించడానికి మరియు దాని అసలు అర్థాన్ని ప్రకటించడానికి ఉద్దేశించబడినవి. మరియు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క అర్థం ఏమిటంటే, ఎలాంటి భాగస్వాములు లేకుండా మనం అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తాము మరియు మన ఆరాధనలన్నింటినీ కేవలం ఆయన (ఒక్కడికే) అంకితం చేస్తాము. కాబట్టి ఎవరైతే ఈ పద్ధతిలో (దాని షరతులను, హక్కులను నెరవేరుస్తూ) దానిని పలుకుతారో వారికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. గతంలో వివరించినట్లుగా, దుఆ దినమైన అరఫా మధ్యాహ్నం వేళ తరచుగా ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని పఠించడం అత్యంత సముచితమైన, సరైన మరియు పరిపూర్ణమైన దుఆ. నిశ్చయంగా, అల్లాహ్ ను ఆరాధనలో ఏకైకుడిగా చేయడం, ధర్మాన్ని కేవలం ఆయనకే అంకితం చేయడం అనే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ వాక్యమే ప్రతీ సత్కార్యం అంగీకరించబడటానికి తాళంచెవి, అంతేగాక దుఆ అనేది ఆరాధనలన్నింటిలోకెల్లా గొప్పది. “కాబట్టి, మీ ఆరాధనను కేవలం ఆయనకే అంకితం చేస్తూ ఆయనను మాత్రమే వేడుకోండి. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.” (40:65)
మన ప్రవక్త చెప్పినట్లుగా, “దుఆయే ఆరాధన యొక్క సారాంశం (లేదా దుఆయే ఆరాధన).” మరియు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ లేకుండా ఏ ఆరాధనా అంగీకరించబడదు. చిత్తశుద్ధి (ఇఖ్లాస్) లేకుండా అది స్వీకరించబడదు. అందువల్ల, ఎవరైతే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ను సత్యసంధతతో పలుకుతారో, వారు అల్లాహ్ ను తప్ప మరెవరినీ ప్రార్థించరు, మరెవరినీ అడగరు, మరెవరి శరణుజొచ్చరు, మరెవరి సహాయాన్ని కోరరు, మరెవరి పేరున జంతుబలి ఇవ్వరు, మరెవరి పేరున మొక్కుబడులు చెల్లించుకోరు, మరియు ఏ ఒక్క ఆరాధనను కూడా అల్లాహ్ తప్ప మరెవరికీ అంకితం చేయరు!
“ఇలా అను (ఓ ముహమ్మద్): ‘నిశ్చయంగా, నా నమాజు, నా ఖుర్బానీ (బలి), నా జీవితం, మరియు నా మరణం అన్నీ సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు ఎవరూ భాగస్వాములు లేరు. నాకు ఇదే ఆజ్ఞాపించబడింది, మరియు దానికి కట్టుబడే ముస్లింలలో నేను మొట్టమొదటివాణ్ణి.‘” (6:162,163) ఒకవేళ ఒక వ్యక్తి ఈ అర్థాన్ని తెలియనివాడైతే, అజ్ఞానులు పడిపోయే తప్పులలో అతడు కూడా పడిపోతాడు. ఈ వాక్యం యొక్క వాస్తవికతను లేదా దాని అర్థాలను గ్రహించని కొందరు అజ్ఞానులు, బహుశా దాని వెనుక, మార్గభ్రష్టత్వం వైపు పిలిచే వారి నుండి తమ జ్ఞానాన్ని గ్రహిస్తారు. ప్రవక్త ఇలా అన్నట్లుగా, “నా ఉమ్మత్ (సమాజం) గురించి నేను అత్యంత భయపడేది మార్గభ్రష్టత్వం వైపు పిలిచే వారినే.” కాబట్టి, కొందరు అజ్ఞానులు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని పలకడం మీరు చూస్తారు. ఆ తర్వాత, ఎంతో సమయం గడవకముందే వాడు చేతులెత్తి, “ఓ ఫలానా! నాకు సహాయం చేయండి” అని అంటాడు. మరి ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ఎక్కడ ఉన్నట్లు?! అతడు “ఓ ఫలానా! నాకు సహాయం చేయండి” అని అంటుంటే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ఎక్కడున్నట్లు?! ఇది ఎంతవరకంటే, గౌరవనీయులైన మా సోదరుల్లో ఒకరు నాకు ఇలా చెప్పారు, సజ్దా (సాష్టాంగం) లో ఉన్న ఒక వ్యక్తి “ఓ ఫలానా! నాకు సహాయం చేయండి” అనడం ఆయన విన్నారు. తాను అల్-ఫాతిహాలో “మేము నిన్ను (మాత్రమే) ఆరాధిస్తాము, మరియు నీ (యొక్క) సహాయాన్ని (మాత్రమే) కోరుతాము (1:5)” అని చదువుతున్నప్పటికీ! అతడు “ఓ ఫలానా! నాకు సహాయం చేయండి” అని అంటుంటే “మేము నిన్ను (మాత్రమే) ఆరాధిస్తాము, మరియు నీ (యొక్క) సహాయాన్ని (మాత్రమే) కోరుతాము” అనేది ఎక్కడ ఉన్నట్లు?! ఇది స్పష్టమైన షిర్క్! అల్లాహ్ ను వదిలి ఇతరులను ప్రార్థించడం! అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, “అల్లాహ్ ను వదిలి పునరుత్థాన దినం వరకు తనకు బదులివ్వలేని వారిని ప్రార్థించే వానికంటే గొప్ప మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? పైగా వారు (వీరి) ప్రార్థనల పట్ల పూర్తిగా అజ్ఞానంలో ఉన్నారు. మరియు ప్రజలందరినీ (పునరుత్థాన దినాన) సమావేశపరచినప్పుడు, వారు (ఆరాధ్యదైవాలు) వీరికి శత్రువులు అవుతారు మరియు వీరు తమను ఆరాధించిన విషయాన్ని నిరాకరిస్తారు.” (46:5,6) ఇలా అను: (ఓ ముహమ్మద్) “అల్లాహ్ ను వదిలి మీరు (ఆరాధ్యదైవాలుగా) భావించే వారిని పిలవండి, వారికి ఆకాశాలలో గానీ లేదా భూమిలో గానీ కనీసం ఒక అణువు (లేదా చిన్న చీమ) అంత అధికారం కూడా లేదు, వాటిలో (భూమ్యాకాశాల సృష్టిలో) వారికి ఎలాంటి భాగస్వామ్యం లేదు, మరియు వారిలో ఆయనకు (అల్లాహ్ కు) ఏ సహాయకుడూ లేడు. (34:22) “ఆయనను (అల్లాహ్ ను) వదిలి మీరు దేవతలుగా భావిస్తున్న వారిని [దూతలు, ఈసా (యేసు), ఉజైర్ వంటి వారిని] పిలవండి. వారు మీ కష్టాలను తొలగించలేరు, వాటిని మీ నుండి ఇతరుల మీదికి మార్చనూ లేరు.” (17:56)
కాబట్టి, గౌరవనీయ సోదరులారా, ప్రియమైన వారలారా, అల్లాహ్ పవిత్ర గృహానికి వచ్చిన హాజీలారా, మనం ఈ అర్థాన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం, ఎందుకంటే ఇది అత్యున్నతమైన అర్థాలలో ఒకటి మరియు అత్యంత ముఖ్యమైనది. తరచుగా ఇలా అనండి: లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహు, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్ (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన వాడు మరొకడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు ఎలాంటి భాగస్వాములు లేరు. సర్వాధికారాలు, సర్వస్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి, ఆయన ప్రతిదానిపైనా శక్తిమంతుడు). మనం మన తౌహీద్ ను, మన ఈమాన్ ను పునరుద్ధరించుకుంటాం. మన అఖీదా (విశ్వాసం) ను దృఢపరచుకుంటాం. ఒక ప్రామాణిక (సహీహ్) హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు, “నిశ్చయంగా, ఒక దుస్తులు ఎలా పాతబడిపోతాయో అదే విధంగా మీలో ఈమాన్ పాతబడిపోతుంది, కాబట్టి మీ హృదయాలలో ఈమాన్ ను పునరుద్ధరించమని అల్లాహ్ ను అడగండి.” ఈ విషయాన్ని గ్రహించండి: లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహు, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్ (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన వాడు మరొకడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు ఎలాంటి భాగస్వాములు లేరు. సర్వాధికారాలు, సర్వస్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి, ఆయన ప్రతిదానిపైనా శక్తిమంతుడు). ఇది అత్యున్నత లక్ష్యాన్ని నిరంతరం పునరుద్ధరించడమే, అదే ఆరాధనలో అల్లాహ్ ను ఏకైకుడిగా చేయడం (తౌహీద్)! మనందరినీ ఆయన పట్ల చిత్తశుద్ధి గలవారిగా, పశ్చాత్తాపపడేవారిగా, ఆయన వైపు వినమ్రంగా మరలేవారిగా చేయాలని అల్లాహ్ ను వేడుకుంటున్నాను! మన దుఆలన్నింటినీ కేవలం అల్లాహ్ కొరకే, మన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గదర్శకత్వంలో ఉండేలా చేయాలని కోరుకుంటున్నాను.
మీరు అరఫాలో అల్లాహ్ కు దుఆ చేస్తున్నప్పుడు, దుఆ కు సంబంధించి అత్యంత ముఖ్యమైన విషయంపై శ్రద్ధ వహించండి! మీ దుఆలన్నింటినీ ఆయన స్వీకరిస్తాడనే దృఢవిశ్వాసం అల్లాహ్ పై ఉండాలన్నదే ఆ విషయం. మన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు, “అల్లాహ్ మీ ప్రార్థనను అంగీకరిస్తాడనే దృఢవిశ్వాసంతో ఆయనను వేడుకోండి. నిశ్చయంగా, అజాగ్రత్తగా, పరధ్యానంలో ఉన్న హృదయంతో చేసే దుఆను అల్లాహ్ స్వీకరించడు.” మీరు దుఆ చేస్తున్నప్పుడు, అల్లాహ్ మీ దుఆలను స్వీకరిస్తాడని మీ హృదయం దృఢంగా విశ్వసించడం అత్యవసరం. పరధ్యానం మరియు ఆటపాటల పట్ల జాగ్రత్తగా ఉండండి. వాటి గురించి అప్రమత్తంగా ఉండండి. మీ దుఆలు అంగీకరించబడాలంటే, మీ హృదయాన్ని అల్లాహ్ వైపు లగ్నం చేసి, దృఢంగా, ఏకాగ్రతతో ఆయనకే అంకితమిచ్చేలా కృషి చేయండి.
కొన్నిసార్లు దుఆ చేసే కొందరిని మీరు చూస్తారు, వారు దుఆలో చేతులు పైకెత్తుతారు, కానీ అతడు పరధ్యానంలో ఉన్నాడని, అతని హృదయం అశ్రద్ధగా ఇటూ అటూ చూస్తోందని స్పష్టంగా తెలుస్తుంది. ఇలా చేసేవారి సంఖ్య తక్కువేమీ కాదు. కాబట్టి మీరు అల్లాహ్ కు దుఆ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని గ్రహించండి. నేను మీకు చాలా ప్రత్యేకమైన, అందమైన మరియు ప్రయోజనకరమైన ఒక కథను వివరిస్తాను.
ఖలీఫా ఉమర్ ఇబ్న్ అబ్దుల్ అజీజ్ ఒక వ్యక్తి పక్కన వెళ్తున్నారు, ఆ వ్యక్తి చేతిలో ఒక గులకరాయితో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ రాయితో ఆడుకుంటూ అతడు, “ఓ అల్లాహ్! అందమైన విశాలమైన కళ్ళున్న స్వర్గపు స్త్రీల (హూర్ అల్-ఈన్) తో నాకు వివాహం జరిపించు” అని అంటున్నాడు. అప్పుడు ఉమర్ అతడితో ఏమన్నారో తెలుసా? ఆయన అతడితో, “నువ్వు ఎంత చెడ్డ పెండ్లి కుమారునివి (ఆశిస్తున్నావు)!” అని అన్నారు (అంటే: అందమైన కళ్ళున్న స్వర్గపు స్త్రీల కొరకు ఆశపడే వాడివి). “ఆ రాయిని పారేసి, నీ దుఆను కేవలం అల్లాహ్ కొరకే చిత్తశుద్ధితో చేయలేవా?!” ఎంత అందమైన మాట! ఇబ్న్ అబీ దున్యా తన గ్రంథం ‘అన్-నియ్యహ్ వల్ ఇఖ్లాస్’ లో దీనిని ఉల్లేఖించారు. “ఆ రాయిని పారేసి, నీ దుఆను కేవలం అల్లాహ్ కొరకే చిత్తశుద్ధితో చేయలేవా?!” అవును! ఆ రాయిని పారేయండి. పరధ్యానాలకు దారితీసే వాటన్నింటినీ పక్కన పెట్టండి! కేవలం రాయి మాత్రమే కాదు, అది ఒక రకమైన పరధ్యానం మాత్రమే. అలాంటివి ఎన్నో ఉన్నాయి.
గతంలో లేని, నేటి కాలంలో ప్రజలకు అత్యంత హానికరమైన ఒక పరధ్యానం గురించి నేను మీకు చెబుతాను. గతంలో వారి వద్ద రాళ్లు ఉండేవి. కానీ, ఈ రోజుల్లో ఒక పరధ్యానం (వస్తువు) ఉంది, అది చాలా మంది ప్రజలను తీవ్రంగా మభ్యపెట్టి, ఎన్నో పుణ్య కార్యాల నుండి వారిని దూరం చేసింది. అది ఏమిటో మీకు తెలుసా? మీకు తెలుసా లేదా? అదేమిటో? ఈ వేలు, బొటనవేలు. సుబ్ హా నల్లాహ్! అరఫా మధ్యాహ్నం వేళ కూడా అది ప్రజల ధ్యాసను తీవ్రంగా మరల్చింది. కొందరు ప్రజలు (ఫోన్ లో) లీనమై ఉండటం మీరు చూస్తారు! వాడి బొటనవేలు కదులుతూ ఉంటుంది మరియు వాడు పూర్తిగా పరధ్యానంలో ఉంటాడు. వాడికే ఇలా చెప్పబడుతోంది “ఆ ‘రాయిని’ (ఫోన్ ను) పక్కన పడేయ్, నీ దుఆను చిత్తశుద్ధితో అల్లాహ్ కే అంకితం చెయ్!” ఈ మాట చాలా ముఖ్యమైనది. “ఆ ‘రాయిని’ పక్కన పడేయ్, నీ దుఆను చిత్తశుద్ధితో అల్లాహ్ కే అంకితం చెయ్!” ఉమర్ ఆ వ్యక్తితో “రాయిని పారేయ్” అని అన్నారు. కానీ, ఇప్పుడు మన వద్ద మరింత ప్రమాదకరమైన వివిధ రకాల ‘రాళ్లు’ (గ్యాడ్జెట్స్/ఫోన్లు) ఉన్నాయి. ఇది చాలా మందిని పరధ్యానంలో పడేసింది. ఈ కాలంలో మన చేతుల్లో ఉన్న ఈ ‘రాళ్ల’ పరధ్యానాలు హాజీలను అత్యంత ప్రమాదకరమైన పరిస్థితికి దారితీశాయి! అల్లాహ్ సాక్షిగా!
ఈ రోజుల్లో చాలా మంది హాజీలను మీరు గమనించవచ్చు, వారు ఈ పవిత్ర ప్రదేశాలలో అంటే అరఫా, ముజ్దలిఫా, మస్జిద్ అల్-హరామ్, సఈ చేసే స్థలంలో, జమరాత్ (రాళ్లు విసిరే స్థలం) వద్ద ఉన్నప్పుడు వారి అతి పెద్ద ధ్యాసల్లా తమ ఫోటోలు తీసుకోవడమే. కొందరు ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ప్రజలు చూడటానికి వెంటనే పోస్ట్ చేస్తారు. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే, మేము కొందరు హాజీలను చూశాము – అల్లాహ్ మాకు, వారికి మార్గదర్శకత్వం ప్రసాదించుగాక, మనందరికీ ధర్మ జ్ఞానాన్ని (బసీరత్) ఇచ్చి, సత్యం వైపు మంచి మార్గంలో మరలేలా చేయుగాక. వారు జమరాత్ వద్ద ఆగి, తమ కింది వస్త్రాన్ని (ఇజార్ ను) సర్దుకుని, చేతులు పైకెత్తుతారు. అప్పుడు అతని స్నేహితుడు అతడి ఫోటో తీస్తాడు. ఫోటో తీయడం అయిపోగానే అతడు చేతులు కిందకు దించుతాడు. మరి అతడు ఆ చేతులను ఎవరి కోసం పైకెత్తాడు? అల్లాహ్ కోసమా? కాదు, అతడు అల్లాహ్ కోసం చేతులు ఎత్తలేదు! సల్మాన్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు, “నిశ్చయంగా, అల్లాహ్ సిగ్గు మరియు ఔదార్యం గలవాడు. తన వైపుకు చేతులెత్తిన తన దాసుడి చేతులను ఖాళీగా, నిరాశగా వెనక్కి పంపడానికి ఆయన సిగ్గుపడతాడు!” కానీ వీడు చేతులు పైకెత్తాడు, ఫోటో తీసుకోబడింది, తర్వాత చేతులు దించేశాడు. ఆ ఫోటోను పోస్ట్ చేస్తాడు. బహుశా ‘నేను జమరాత్ వద్ద లేదా అరఫాలో దుఆ చేస్తుండగా నా స్నేహితుడు ఈ ఫోటో తీశాడు’ అని చెబుతాడు, కానీ వాస్తవానికి అతడు దుఆ చేయలేదు! ఫోటో తీయించుకోవడానికి మాత్రమే చేతులు పైకెత్తాడు. అల్లాహ్ సాక్షిగా, మస్జిద్ (అల్-హరామ్) లో ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఉండగా నేను స్వయంగా చూశాను, వెంటనే నేను అతడికి ఒక పెద్ద ముస్ హాఫ్ (ఖుర్ఆన్) తీసుకోమని చెప్పాను. అతడు దానిని తెరిచాడు. అతని స్నేహితుడు కుడి వైపు నుండి, ఎడమ వైపు నుండి ఫోటోలు తీశాడు. తర్వాత అతడు ముస్ హాఫ్ మూసివేసి దాని స్థానంలో పెట్టేశాడు. ఆ ఫోటోను అతడు తన ఇంట్లో వేలాడదీసుకోవచ్చు లేదా మస్జిద్ లో ఖుర్ఆన్ చదువుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు. మస్జిద్ లో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారని ఒకరు నాతో చెప్పారు. వారిలో ఒకరు తషహ్హుద్ భంగిమలో కూర్చున్నాడు. అతని స్నేహితుడు ఫోటో తీశాడు. తర్వాత అతడు లేచి వెళ్లిపోయాడు. అల్లాహ్ సాక్షిగా, ఇదొక ఘోరమైన విపత్తు. ఇది ధర్మం పట్ల అభిమానం (గైరత్) ఉన్నవారిని బాధిస్తుంది. ఇతరులకు మేలు జరగాలని కోరుకునే వారిని ఇది బాధిస్తుంది. అల్లాహ్ సాక్షిగా, వారి మేలు కోరుకునే వ్యక్తి వారిని ఇలా చూస్తే అతని హృదయం ముక్కలవుతుంది. ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి? మన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మీఖాత్ చేరుకున్నప్పుడు హజ్ మరియు ఉమ్రా తల్బియాను కలిపి ఇలా అన్నారు, “ఓ అల్లాహ్, దీనిని ఎలాంటి ఆడంబరం (రియా) లేని నిష్కల్మషమైన హజ్ గా మలచు.” ఇది వారి ఆరాధనలకు పెను ముప్పు. సూరహ్ అల్-బఖరాలోని మొదటి హజ్ ఆయతులలో అల్లాహ్ ఏమన్నాడు? “మరియు అల్లాహ్ కోసం హజ్, ఉమ్రాలను సంపూర్ణంగా నెరవేర్చండి.” (2:196) మరొక ఆయత్ లో ఆయన ఇలా అన్నాడు, “మరియు అక్కడికి చేరుకునే స్తోమత గలవారిపై, అల్లాహ్ కొరకు ఆ గృహపు (కాబా) హజ్ చేయడం విధిగా నిర్ణయించబడింది.” (3:97) మన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో ఇలా అన్నారు, “ఎవరైతే అల్లాహ్ కోసం ఈ గృహపు హజ్ చేస్తారో, అందులో లైంగిక సంబంధాలకు, పాపాలకు పాల్పడరో, వారు తమ తల్లి కన్నప్పటి (పాపరహితమైన) రోజులా స్వచ్ఛంగా తిరిగి వస్తారు.” …’అల్లాహ్ కొరకు’ అనడంలోనే చిత్తశుద్ధి (ఇఖ్లాస్) ఉంది. హజ్ లో వేరే దేనికీ, మరెవరికీ ఏ వాటా ఉండదు. అందుకనే, హదీస్ ఖుద్సీలో అల్లాహ్ ఇలా అన్నాడు, “నాకు ఎలాంటి భాగస్వాముల అవసరం లేదు. ఎవరైనా ఒక కర్మ (ఆరాధన) చేసి అందులో నాతో పాటు ఇతరులకు భాగస్వామ్యం కల్పిస్తే, నేను వాడిని మరియు వాడి భాగస్వామిని వదిలేస్తాను.” “వాడిని మరియు వాడి భాగస్వామిని వదిలేస్తాను” అనగా వాడి ఆరాధనను నేను తిరస్కరిస్తానని అర్థం. అల్లాహ్ దానిని వాడి నుండి స్వీకరించడు. అందువల్ల, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ప్రదర్శనలకు, ఆడంబరాలకు కొత్త మార్గాలు ఏర్పడిన ఈ రోజుల్లో హాజీ తనను తాను కాపాడుకోవాలి. ఆడంబరం (రియా) నుండి, ప్రజలు తనను పొగడాలనే కోరిక నుండి దూరం ఉండాలి. తనను తాను గొప్పగా భావించడం (ఉజుబ్) పట్ల జాగ్రత్తగా ఉండండి. నిశ్చయంగా, ఆత్మాభిమానం లేదా గర్వం ఒక వ్యక్తి చేసిన సత్కార్యాలను ప్రళయంలా తుడిచిపెట్టేస్తుంది. ఇది ఎంతటి అపారమైన ప్రమాదమో! కాబట్టి, దాసుడు అల్లాహ్ కొరకు మాత్రమే ఆరాధనలు చేస్తూ, తన నఫ్స్ తో పోరాడుతూ హజ్ లో ప్రవేశించాలి. అతడు అల్లాహ్ ముఖాన్ని (సంతోషాన్ని) మాత్రమే కోరుకుంటాడు. తన ఆరాధనలలో మరెవరికీ, దేనికీ వంతు ఇవ్వడు. ఒక హదీసులో మన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు, “తీర్పు దినాన (ఖియామత్ రోజున) ప్రజల మెప్పు కోసం పనులు చేసిన వారితో ఇలా చెప్పబడుతుంది: ‘మీరు ఎవరి మెప్పు కోసం పనులు చేశారో వారి వద్దకే వెళ్లి ప్రతిఫలాన్ని కోరుకోండి!'” అతడు మంచి పనులు చేస్తుండగా ప్రజలు చూడాలని, వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తే అతడికి దక్కే ప్రతిఫలం ఏమిటి? కాబట్టి, దాసుడు ఈ అపారమైన ముప్పు పట్ల అప్రమత్తంగా ఉండి, ఈ పరధ్యానాలకు దూరంగా ఉండేలా కష్టపడటం అత్యవసరం, ఎందుకంటే అవి ఇప్పుడు చాలా ఎక్కువయ్యాయి. అల్లాహ్ మనందరినీ వాటి నుండి రక్షించుగాక, నిష్కల్మషమైన ఉద్దేశ్యాలతో, పవిత్ర ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానానికి అనుగుణంగా సరైన సత్కార్యాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక.
గౌరవనీయ సోదరుడా, దుఆ విషయంలో ఒక ముఖ్యమైన విషయం, మీరు అల్లాహ్ వైపు చేతులు చాచి ఆయనను వేడుకుంటున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి. మీ దుఆలలో వ్యక్తిగతమైనవి మరియు సమగ్రమైనవి ఉండేలా చూసుకోండి. “నా ప్రభువా! నన్ను, నా తల్లిదండ్రులను మరియు విశ్వాసులైన పురుషులు, స్త్రీలందరినీ క్షమించు.” (అలాగే) నిర్దిష్టంగా మరియు సమగ్రంగా వేడుకోండి. మీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ బంధువుల కోసం, మీకు ఇష్టమైన వారి కోసం మరియు ముస్లింలందరి కోసం దుఆ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ముస్లింలందరి కొరకు సమగ్రమైన దుఆ చేయండి. ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల పరిస్థితుల గురించి ఆలోచిస్తే, వారి పరిస్థితి ఎలా ఉంది? వారిలో కొందరు తీవ్రమైన పేదరికంలో, తీవ్రమైన అవసరంలో ఉన్నారు. అక్కడ ఆకలిదప్పులు రాజ్యమేలుతున్నాయి. ఆపదలు చుట్టుముట్టాయి. కొందరు ముస్లింలు యుద్ధాలు, కష్టాలు, పరీక్షలు మరియు బాధలలో ఉన్నారు. కొందరు ముస్లింలు తీవ్రమైన అనారోగ్యాలతో ఆసుపత్రులలో తీవ్రమైన వేదన అనుభవిస్తున్నారు. ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. కాబట్టి, మీ దుఆలలో మీ ముస్లిం సోదరులను మరచిపోకండి. నిర్దిష్టంగా, సమగ్రంగా అడగండి. వారిలోని రోగులకు స్వస్థత కోసం, దారి తప్పిన వారికి మార్గదర్శకత్వం కోసం, పేదలకు సంపద కోసం, అందరి పాపాల క్షమాపణ కోసం దుఆ చేయండి. ‘ఓ అల్లాహ్, నన్ను మరియు ముస్లిం పురుషులు, స్త్రీలందరినీ క్షమించు’ అని మీరు అన్నప్పుడు అల్లాహ్ మీకు ఎంత ప్రతిఫలం ఇస్తాడో మీకు తెలుసా? అల్-తబరానీ మరియు ఇతరుల హదీసు గ్రంథాలలో వచ్చినట్లుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఓ అల్లాహ్! నన్ను, నా తల్లిదండ్రులను, ముస్లిం పురుషులు, స్త్రీలను, వారిలో జీవించి ఉన్నవారిని, మరణించిన వారిని క్షమించు అని ఎవరైతే అంటారో, వారిలో ప్రతి ఒక్కరి పేరు మీద అతడికి ఒక పుణ్యం లభిస్తుంది.” అతనికి ఎన్ని పుణ్యాలు లభిస్తాయి! కాబట్టి, అల్లాహ్ దయతో మీరు మీ సోదరులకు ఈ దుఆ ద్వారా ఎలాగైతే ప్రయోజనం చేకూరుస్తారో, మీ పరోక్షంలో మీ కొరకు మరో ముస్లిం చేసే దుఆ అంగీకరించబడుతుంది, దానికి పరిమితి లేని ప్రతిఫలాలను మీరు కూడా పొందుతారు. అల్లాహ్ యొక్క అనుగ్రహాలు చాలా విశాలమైనవి. “కాబట్టి, (ఓ ముహమ్మద్) అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన వాడు మరొకడు లేడని తెలుసుకో. నీ తప్పుల కొరకు, విశ్వాసులైన పురుషులు మరియు స్త్రీల (పాపాల) క్షమాపణ కొరకు వేడుకో. మీరు ఎక్కడ తిరుగుతారో, ఎక్కడ విశ్రమిస్తారో అల్లాహ్ కు బాగా తెలుసు. (47:19)” దుఆ విషయానికొస్తే ఇది చాలా ముఖ్యమైనది. అలాగే, నిర్దిష్ట దుఆలలో, నిర్లక్ష్యం చేయకూడని మరో ముఖ్యమైన దుఆ దేశ నాయకులకు (పాలకులకు) మార్గదర్శకత్వం కోసం, సాఫల్యం కోసం, వారు మేలు చేసేలా దుఆ చేయడం. నిశ్చయంగా, ఇది దాని ప్రభావం దృష్ట్యా అత్యంత ప్రయోజనకరమైనది మరియు గొప్పది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే, ఫుజైల్ ఇబ్న్ ఇయాజ్ ఇలా అన్నారు, “నా యొక్క ఒక దుఆ కచ్చితంగా అంగీకరించబడుతుందని నాకు తెలిస్తే, నేను ఆ దుఆ పాలకుని కోసమే చేస్తాను.” ఎందుకంటే పాలకుని మార్గదర్శకత్వం మరియు అతనిలోని ధర్మనిష్ఠ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ కారణంగా, అరఫా రోజున మరియు ఇతర రోజులలో కచ్చితంగా చేయాల్సిన ముఖ్యమైన దుఆలలో నాయకులకు (పాలకులకు) మార్గదర్శకత్వం మరియు సాఫల్యం కోసం దుఆ చేయడం ఒకటి. సలఫ్ (పూర్వీకుల) లో ఒకరు ఇలా అన్నారు, “ఒక వ్యక్తి నాయకుడి కోసం దుఆ చేయడం మీరు చూస్తే, అతడు సున్నత్ కు చెందినవాడని తెలుసుకోండి. ఒక వ్యక్తి నాయకుడికి వ్యతిరేకంగా (చెడుగా) దుఆ చేయడం మీరు చూస్తే, అతడు బిద్అత్ (నూతన పోకడలు తెచ్చేవాడు) కు చెందినవాడని తెలుసుకోండి.” ఎందుకంటే (పాలకుల కొరకు దుఆ చేయడం) ఇది సున్నత్. వారి కోసం వ్యతిరేకంగా దుఆ చేయడం, వారిని శపించడాన్ని ఇది నిషేధిస్తుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు, “మీ పాలకులను శపించకండి.” కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈ విషయంలో శ్రద్ధ వహించాలి. వారి మార్గదర్శకత్వం, సాఫల్యం, సంస్కరణ కోసం మరియు వారికి మంచి సలహాదారులు లభించాలని దుఆ చేయండి. మరియు ఈ దేశ పాలకుల కోసం ప్రత్యేకంగా దుఆ చేయండి, వారు అల్లాహ్ గృహానికి, హాజీలకు సేవ చేస్తూ చేస్తున్న నిరంతర, అపారమైన కృషికి, సేవలకు అల్లాహ్ వారికి మంచి ప్రతిఫలం ఇవ్వాలని దుఆ చేయండి, ఇది మనం ప్రత్యేకంగా మరియు సమగ్రంగా చూస్తున్న విషయమే. “మీకు ఎవరైనా మేలు చేస్తే, వారికి ప్రతిఫలం ఇవ్వండి. ఒకవేళ వారికి ప్రతిఫలం ఇవ్వడానికి మీ దగ్గర ఏమీ లేకపోతే, వారి కోసం దుఆ చేయండి.” ఇది మన ప్రవక్త మనకు నేర్పిన పాఠం. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి.
గౌరవనీయ సోదరులారా, మనం దుఆ చేసేటప్పుడు చేతులు పైకెత్తడం పట్ల శ్రద్ధ వహించాలి. ఉసామా ఇబ్న్ జైద్ (రజియల్లాహు అన్హు) ఇలా అన్నారు, “నేను అరఫా మధ్యాహ్నం వేళ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక ఒంటెపై కూర్చుని ఉన్నాను. ఆయన తన చేతులను చాచారు. ఆయన ఒంటె కిందకు వంగి దాని తాడు కింద పడిపోయే వరకు ఆయన చేతులు చాచే ఉంచారు. అప్పుడు ఆయన ఒక చేతిని పైకే ఉంచి, మరో చేతితో ఆ తాడును పట్టుకున్నారు.” ఆయన తన చేతిని పైకే ఉంచారు! దుఆ చేసేటప్పుడు అల్లాహ్ పట్ల ఆశతో ప్రతి ఒక్కరూ తమ చేతులను పైకెత్తి చాచడానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఇది మనకు తెలియజేస్తుంది. ప్రవక్త ప్రవచనాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి: “నిశ్చయంగా, అల్లాహ్ సిగ్గు మరియు ఔదార్యం గలవాడు. తన వైపుకు చేతులెత్తిన తన దాసుడి చేతులను ఖాళీగా, నిరాశగా వెనక్కి పంపడానికి ఆయన సిగ్గుపడతాడు!” అలాగే, దుఆ చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన మర్యాదలు (ఆదాబ్) పట్ల శ్రద్ధ వహించండి: ఖిబ్లా వైపుకు తిరగడం, పరిశుద్ధతతో (వజూతో) ఉండటం, ఇంకా ధార్మిక పండితులు దుఆ మర్యాదల గురించి వివరించిన ఇతర గొప్ప మర్యాదలను పాటించడం. అలాగే, సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్త వహించండి! నిశ్చయంగా, సమయం ఎంతో విలువైనది! కొందరు వ్యక్తులు, అరఫా మైదానంలో ఇటూ అటూ తిరుగుతూ, ఈ వ్యక్తితో ఆ వ్యక్తితో మాట్లాడుతూ తమ సమయాన్ని వృథా చేస్తారు. కొందరు జబల్ అల్-రహ్మా (రహ్మత్ కొండ) కోసం వెతుకుతూ తమను తాము కష్టపెట్టుకుని, అలసిపోతారు. బహుశా, కొందరు అక్కడ ఫోటో తీసుకోవడం కోసమే వెళ్లి తిరిగి వస్తారు. అతడు ఎంత సమయాన్ని వృథా చేశాడు? ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న తప్పులలో ఎంతమంది పడిపోతున్నారు? అయితే, అతడు తన స్థానంలోనే ఉండిపోతే, అతని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అల్లాహ్ ధ్యానంలో నిమగ్నమవుతుంది. ముఖ్యమైన విషయమేమిటంటే అతడు అరఫా హద్దుల లోపల ఉండాలి. ప్రవక్త చెప్పినట్లుగా, “హజ్ అంటే అరఫా.” కాబట్టి, ఆ హద్దుల లోపల ఎక్కడైనా ఉండవచ్చు. అతడు కొండ దగ్గరే ఉండాలనే నిబంధన ఏమీ లేదు. అరఫాలో ఏ ప్రదేశంలోనైనా సరే, అతడు ఖిబ్లా వైపుకు తిరిగి నిలబడవచ్చు. దుఆలో సర్వోన్నతుడైన అల్లాహ్ ను వేడుకోవాలి. ఇది మధ్యాహ్నం నుండి సూర్యాస్తమయం వరకు కొనసాగుతుంది. ఇదంతా దుఆ సమయమే. కాబట్టి, సూర్యాస్తమయం వరకు అల్లాహ్ స్మరణ, ఖుర్ఆన్ పఠనం, దుఆలు చేస్తూ, తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, నరకాగ్ని నుండి విముక్తి పొందే వారిలో ఉండాలని ఆశిస్తూ, అతడు అల్లాహ్ ధ్యానంలో గడపాలి. నేను అల్లాహ్ వైపు మరులుతున్నాను, తనను వేడుకునే వారిని నిరాశపరచని, తనను ప్రార్థించే వారిని తిరస్కరించని ఆయన యొక్క అందమైన నామాలతో ఆయనను వేడుకుంటున్నాను. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన వారు ఎవరూ లేరని, ఆయన దయ, జ్ఞానం ప్రతి వస్తువును చుట్టుముట్టి ఉన్నాయని ఆయనను వేడుకుంటున్నాను. అరఫాలో నిలబడే భాగ్యాన్ని మనందరికీ అత్యుత్తమ రీతిలో ప్రసాదించుగాక. మనం మన హజ్ ను అత్యుత్తమ రీతిలో నిర్వహించడానికి, మన విధులను అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో పూర్తి చేయడానికి, మన హజ్ ను కేవలం అల్లాహ్ కొరకే, మన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ కు అనుగుణంగా చేసే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. నరకాగ్ని నుండి విముక్తి పొందే వారిలో మనందరినీ చేర్చాలని, మన పాపాలను, తప్పులను, ఉల్లంఘనలను క్షమించి, వాటిని ఉపేక్షించాలని, సర్వత్రా వ్యాపించి ఉన్న తన దయతో మనపై కరుణ చూపాలని అల్లాహ్ ను వేడుకుంటున్నాను. అల్లాహ్ మన పశ్చాత్తాపాన్ని స్వీకరించుగాక, మన పాపాలను కడిగివేయుగాక, మన వాదనను స్థిరపరచుగాక, మన హృదయాలకు మార్గదర్శకత్వం ప్రసాదించుగాక, మన నాలుకలను సరిదిద్దుగాక, మన హృదయాలలోని ద్వేషాన్ని తొలగించుగాక. ఓ అల్లాహ్! మమ్మల్ని సన్మార్గంపై స్థిరంగా, దృఢంగా ఉంచాలని నిన్ను వేడుకుంటున్నాము. నీ దయకు, క్షమాపణకు కారణమయ్యే పనులను మాకు ప్రసాదించమని నిన్ను అడుగుతున్నాము. నీ అనుగ్రహాలకు కృతజ్ఞత చూపేలా, నిన్ను అత్యుత్తమ రీతిలో ఆరాధించేలా మాకు భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము. పవిత్రమైన హృదయాన్ని, సత్యసంధమైన నాలుకను మాకు ప్రసాదించమని నిన్ను అడుగుతున్నాము. నీకు తెలిసిన ప్రతి మేలును మాకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాము, నీకు తెలిసిన ప్రతి కీడు నుండి నీ శరణు కోరుతున్నాము. నీకు తెలిసిన మా పాపాలను క్షమించమని నిన్ను అడుగుతున్నాము. అగోచర విషయాలన్నీ (గాయిబ్) నీకు బాగా తెలుసు. ఓ అల్లాహ్, ఇహలోకంలో మరియు పరలోకంలో మాకు తెలిసిన, తెలియని అన్ని రకాల మేలులను ప్రసాదించమని నిన్ను అడుగుతున్నాము. ఇహలోకంలో మరియు పరలోకంలో మాకు తెలిసిన, తెలియని అన్ని రకాల కీడుల నుండి నీ శరణు కోరుతున్నాము. ఓ అల్లాహ్, మాకు స్వర్గాన్ని ప్రసాదించు, దానికి దగ్గర చేసే మాటలను, చేతలను మాకు ప్రసాదించు. నరకాగ్ని నుండి మరియు దానికి దగ్గర చేసే మాటల, చేతల నుండి నీ శరణు కోరుతున్నాము. ఓ అల్లాహ్, నీ దాసుడు, నీ సందేశహరుడు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నిన్ను కోరిన ప్రతి మేలును మాకూ ప్రసాదించమని నిన్ను అడుగుతున్నాము. నీ దాసుడు, నీ సందేశహరుడు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ కీడు నుండి నీ శరణు కోరారో, ఆ కీడు నుండి మేమూ నీ శరణు కోరుతున్నాము, మా కొరకు నీవు నిర్ణయించిన ప్రతి విధిని మాకు మేలు కలిగించేలా చేయమని వేడుకుంటున్నాము. ఓ అల్లాహ్, మా వ్యవహారాలన్నింటినీ మంచి ముగింపుతో ముగించు, ఇహలోక అవమానాల నుండి, పరలోక శిక్ష నుండి మమ్మల్ని రక్షించు. ఓ అల్లాహ్, మాకు మార్గదర్శకత్వం (హిదాయత్), భయభక్తులు (తఖ్వా), పవిత్రత, స్వయం సమృద్ధి ప్రసాదించు. ఓ అల్లాహ్, నీవు మాకు ప్రసాదించిన దానితో మమ్మల్ని తృప్తిపడేలా చేయి, నీవు మాకు నేర్పిన జ్ఞానంతో మాకు ప్రయోజనం చేకూర్చు. మా జ్ఞానాన్ని పెంపొందించు, నీవు మాకు నేర్పిన దానిని మాకు అనుకూలంగా ఉండే సాక్ష్యంగా చేయి, వ్యతిరేకంగా కాదు. ఓ అల్లాహ్, మా వ్యవహారాలకు రక్షణ అయిన మా ధర్మాన్ని మా కొరకు సరిదిద్దు. మా జీవనోపాధి ఉన్న ఈ ఇహలోక వ్యవహారాలను మా కొరకు సరిదిద్దు. మేము తిరిగి వెళ్ళాల్సిన మా పరలోక వ్యవహారాలను కూడా సరిదిద్దు. మా జీవితాన్ని ప్రతి మేలును పెంపొందించుకునేదిగా చేయి, మా మరణాన్ని ప్రతి కీడు నుండి రక్షించేదిగా, మాకు ఉపశమనం కలిగించేదిగా చేయి. ఓ అల్లాహ్, దుఃఖంతో ఉన్నవారి దుఃఖాన్ని దూరం చేయి, కష్టాల్లో ఉన్నవారి కష్టాలను తీర్చు. అప్పుల ఊబిలో ఉన్నవారి అప్పులను తీర్చు, మా రోగులకు, ముస్లిం రోగులకు స్వస్థత చేకూర్చు, మా మృతులపై, ముస్లిం మృతులపై దయ చూపించు. ఓ అల్లాహ్! మమ్మల్ని, మా తల్లిదండ్రులను, మా ఉపాధ్యాయులను, మా నాయకులను, ముస్లిం పురుషులను, స్త్రీలను, విశ్వాసులైన పురుషులను, స్త్రీలను, వారిలో జీవించి ఉన్నవారిని, మరణించిన వారిని క్షమించు. ఓ అల్లాహ్, మా ఆత్మలకు భయభక్తులను (తఖ్వా) ప్రసాదించు, వాటిని పవిత్రం చేయి. వాటిని పవిత్రం చేసేవారిలో నీవే అత్యుత్తముడవు. నీవే వాటి రక్షకుడవు, సంరక్షకుడవు. ఓ అల్లాహ్, నీ పట్ల భయాన్ని మాకు ప్రసాదించు, అది మమ్మల్ని పాపాల నుండి కాపాడుతుంది, నీ పట్ల విధేయతను ప్రసాదించు, అది మమ్మల్ని నీ స్వర్గానికి చేరుస్తుంది, మరియు ఇహలోక కష్టాలను భరించేలా చేసే దృఢవిశ్వాసాన్ని (యఖీన్) మాకు ప్రసాదించు. ఓ అల్లాహ్, నీవు మమ్మల్ని జీవింపజేసినంత కాలం మా వినికిడిని, మా చూపును, మా శక్తిని మాకు ఆనందదాయకంగా చేయి, మా సంతానం నుండి మాకు వారసులను ప్రసాదించు, మమ్మల్ని అణచివేసే వారిపై ప్రతికారం తీర్చుకునేలా చేయి. మా పట్ల శత్రుత్వం వహించే వారిపై మాకు సహాయం చేయి, మా ధర్మానికి ఎటువంటి కీడూ రాకుండా చూడు. ఇహలోకం మా అతిపెద్ద లక్ష్యంగా లేదా మా జ్ఞానానికి హద్దుగా ఉండకుండా చూడు, మా పట్ల దయ చూపని వారు మమ్మల్ని పాలించకుండా చూడు. ఓ అల్లాహ్, నీవు సర్వ లోపాలకూ అతీతుడవు, సర్వ స్తోత్రాలు నీకే. నీవు తప్ప ఆరాధనకు అర్హుడైన వారు ఎవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను నీ క్షమాపణ కోరుతున్నాను, పశ్చాత్తాపంతో నీ వైపు మరులుతున్నాను. అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించుగాక.