సూర కాఫిరూన్ అనువాదం, సంక్షిప్త వ్యాఖ్యానం
ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
https://youtu.be/q7wEERbzMKU [7 నిముషాలు]
సూరత్ అల్-కాఫిరూన్ (అధ్యాయం 109) యొక్క ప్రాముఖ్యత, ఘనతలు మరియు ప్రధాన బోధనలపై ఈ ప్రసంగం దృష్టి పెడుతుంది. ఈ సూరాను నిద్రపోయే ముందు పఠించడం వలన షిర్క్ (బహుదైవారాధన) నుండి రక్షణ లభిస్తుందని మరియు తౌహీద్ (ఏకేశ్వరోపాసన) పై మరణం సంభవిస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు వివరించబడింది. ఇది ఖురాన్లో నాలుగో వంతుకు సమానమని, మరియు ప్రవక్త దీనిని ఫజ్ర్ మరియు మగ్రిబ్ సున్నత్ నమాజులలో పఠించేవారని హదీసుల ద్వారా తెలియజేయబడింది. మక్కా అవిశ్వాసులు ప్రవక్తతో మతపరమైన రాజీకి ప్రయత్నించినప్పుడు, ఈ సూరా అవతరించి, విశ్వాసంలో ఎలాంటి రాజీకి తావులేదని స్పష్టం చేసింది. ఇస్లాం మానవ వ్యవహారాల్లో ఇతరులతో సత్ప్రవర్తనను ప్రోత్సహిస్తుందని, కానీ అల్లాహ్ ఆరాధనలో భాగస్వామ్యాన్ని (షిర్క్) తీవ్రంగా ఖండిస్తుందని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.
109. సూరా అల్ ఖాఫిరూన్
بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో
109:1 قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ
ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు : “ఓ తిరస్కారులారా!”
109:2 لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ
లా అఅబుదు మా తఅబుదూన్
మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు.
109:3 وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
వలా అన్తుం ఆబిదూన మాఅఅబుద్
నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు.
109:4 وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ
వలా అన ఆబిదుమ్మా అబత్తుం
మీరు ఆరాధించే వాటిని నేను అరాధించబోను.
109:5 وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
వలా అన్ తుం ఆబిదూన మా అఅబుద్
మరి నేను ఆరాధించేవానిని మీరెలాగూ ఆరాధించరు.
109:6 لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ
లకుం దీనుకుమ్ వ లి యదీన్
మీ ధర్మం మీది, నా ధర్మం నాది.”
సూరా యొక్క ఘనతలు
ఈ సూరాకు ఎన్నో ఘనతలు మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, పడుకునే ముందు ఎవరైతే ఈ సూరా చదువుకుంటారో, దీని అర్థ భావాలను గ్రహిస్తారో, వాస్తవానికి వారు షిర్క్ నుండి మొత్తానికి దూరమై తౌహీద్ పై మరణిస్తారన్నటువంటి శుభవార్త ఇచ్చారు. సునన్ అబీ దావూద్ 5055 యొక్క సహీ హదీస్.
అలాగే ఈ సూరా నాలుగో వంతు ఖురాన్‌కు సమానం అని సహీ హదీస్లో వచ్చి ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు. హదీస్ నంబర్ 586.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ కంటే ముందు సున్నతులలోని మొదటి రకాతులో మరియు మగ్రిబ్ తర్వాత రెండు రకాతుల సున్నతులోని మొదటి రకాతులో ఈ సూరా ఎక్కువగా చదువుతూ ఉండేవారు అని సునన్ నిసాయిలో హదీస్ వచ్చి ఉంది. 992 హదీస్ నంబర్.
హజ్రత్ జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ఒక సహాబీ ఫజ్ర్ కంటే ముందు సున్నతులలోని మొదటి రకాతులో ‘ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్’ మరియు రెండో రకాతులో ‘ఖుల్ హువల్లాహు అహద్’ తిలావత్ చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని మెచ్చుకున్నారు, ప్రశంసించారు. చెప్పారు: “హాదా అబ్దున్ ఆమన బిరబ్బిహ్” – ఈ వ్యక్తి తన ప్రభువును విశ్వసించాడు. ఈ విషయం సహీ ఇబ్నె హిబ్బాన్లో ఉంది 2460, అలాగే షుఅబుల్ ఈమాన్ బైహఖీలో ఉంది 2524, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సిఫతుస్ సలాలో ప్రస్తావించారు.
సూరా యొక్క బోధనలు
ఇందులోని కొన్ని ముఖ్యమైన బోధనలను మనం గ్రహించే ప్రయత్నం చేద్దాము.
అల్లాహు త’ఆలా ఇస్లాం ధర్మం సర్వమానవాళికి ప్రసాదించాడు. సర్వ ప్రవక్తలు తీసుకొచ్చినటువంటి ఈ ఇస్లాం యొక్క అసలైన బోధన ఏమిటి? మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి. ఆయన ఆరాధనలో ఎలాంటి భాగస్వామి, ఏ సాటి కల్పించకూడదు.
ప్రవక్తల పరంపరలో చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళికి ఇదే సందేశం ఇచ్చారు. అయితే ఆయన కాలంలో, ఆయన ఇచ్చేటువంటి ఈ సత్య సందేశాన్ని అడ్డుకోవడానికి విరోధులు, అవిశ్వాసులు, సత్య తిరస్కారులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడ్డుకోలేరు మరియు ఈ సత్యధర్మం వ్యాప్తి చెందకుండా ఎలాంటి వారి ప్రయత్నం సఫలీకృతం కాలేదు.
అప్పుడు ఒక పన్నాగం వారు ఏం పన్నారంటే, “ఓ ముహమ్మద్! సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక సంవత్సరం మీరు మా దేవుళ్లను ఆరాధించండి, ఒక సంవత్సరం మేము మీ అల్లాహ్‌ను ఆరాధిస్తాము”. అయితే, అల్లాహు త’ఆలా ఈ సూరా అవతరింపజేసి, ముమ్మాటికీ ఇలా జరగదు, మీరు అల్లాహ్‌ను ఎంత ఆరాధించినా బహుదైవారాధనను వదులుకోకుంటే మీ యొక్క ఆరాధన నిజమైన ఆరాధన కానే కాదు.
మరియు ఈ సూరాలోని మొదటి ఆయత్లో యా అయ్యుహల్ కాఫిరూన్, ఓ కాఫిరులారా అని అంటే ఇది ఏదైనా దూషణం, తిట్టు కాదు. కొందరు ఇలా అనుకుంటారు. వాస్తవానికి విషయం ఏమంటే, ఎవరైతే అల్లాహ్‌ను ఏకైక సత్యమైన ఆరాధ్యునిగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అల్లాహ్ యొక్క సత్య ప్రవక్తగా నమ్మలేదో, విశ్వసించలేదో వారితో చెప్పడం జరుగుతుంది, ఓ సత్య తిరస్కారులారా అని. ఇక ఎవరైతే అల్లాహ్ ఆరాధనలో ఏకత్వాన్ని పాటించకుండా వేరే ఎవరినైనా భాగస్వామిగా కలుపుతారో, వాస్తవం ఏమిటంటే వారి ఆరాధన కూడా అల్లాహ్ కొరకు కాదు. వారికి దాని యొక్క సరైన ప్రతిఫలం లభించదు.
ఈ రోజుల్లో మత సామరస్యం అన్నటువంటి పేరు మీద కొందరు కొన్ని అవిస్వాసుల పండుగల్లో పాల్గొని, వారిలాంటి వేషధారణ వేసుకొని, వారి యొక్క విగ్రహాల ముందు కొబ్బరికాయ కొట్టడం గానీ, లేదా అక్కడ ఏదైనా వంగడం గానీ, ఇలాంటి కొన్ని పనులు చేసుకుంటూ ఇది మత సామరస్యం అని ఏదైతే చూపుతున్నారో, ఇది అసలైన సామరస్యం కాదు.
ఇస్లాం ధర్మం ముస్లింలకు అవిశ్వాసుల పట్ల మానవ రీత్యా ఉత్తమ నడవడిక అవలంబించి సత్ప్రవర్తనలతో వారితో మెలగాలని ఆదేశిస్తుంది. కానీ అల్లాహ్ ఆరాధనలో ఎలాంటి భాగస్వామ్యం అనేది ఇస్లాం ఒప్పుకోదు. ఈ అసలైన సందేశాన్ని ఈ సూరా ద్వారా గ్రహించాలి మరియు పడుకునే ముందు, ఇంకా మగ్రిబ్, ఫజ్ర్ నమాజులలో ఇలా దీనిని ఖురాన్‌లోని నాలుగో భాగానికి సమానం అన్నటువంటి ఘనతలు ఏవైతే ప్రసాదించబడ్డాయో, దీని కారణంగా అన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించి తౌహీద్ పై స్థిరంగా ఉండాలి. అల్లాహ్ అందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
—
ఖుర్’ఆన్ (మెయిన్ పేజీ)
https://teluguislam.net/quran/