సమాధుల పూజ – ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [వీడియో | టెక్స్ట్]

సమాధుల పూజ (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/JEdmx9LRr78 (17 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, సమాధుల వద్ద జరిగే ఆరాధనల గురించి వివరించబడింది. ఇస్లాంలో సమాధుల పూజ తీవ్రంగా నిషిద్ధమని, అది పెద్ద షిర్క్ (బహుదైవారాధన) కిందకు వస్తుందని వక్త స్పష్టం చేశారు. చాలా మంది తాము కేవలం పుణ్యపురుషులను (ఔలియాలను) గౌరవిస్తున్నామని భావించినప్పటికీ, వారి చర్యలు ఆరాధన పరిధిలోకి వస్తున్నాయని ఆయన హెచ్చరించారు. సమాధుల వద్ద సజ్దా (సాష్టాంగం) చేయడం, తవాఫ్ (ప్రదక్షిణ) చేయడం, మొక్కుబడులు చెల్లించడం, సహాయం కోసం ప్రార్థించడం వంటివి కేవలం అల్లాహ్‌కు మాత్రమే చేయాల్సిన ఆరాధనలని ఉద్ఘాటించారు. ఆపదలను తొలగించి, అవసరాలు తీర్చే శక్తి కేవలం అల్లాహ్‌కు మాత్రమే ఉందని, చనిపోయిన వారు వినలేరని, సమాధానం ఇవ్వలేరని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేశారు. అల్లాహ్‌ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ మరణించిన వారు నరకానికి వెళ్తారని ప్రవక్త హదీసును ఉటంకించారు. ముస్లింలు ఇలాంటి షిర్క్ చర్యలకు దూరంగా ఉండి, ఏకైక దైవమైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

సమాధుల పూజ. అల్లాహు అక్బర్. బహుశా కొందరు మన మిత్రులు ఈ మాట విని కోపానికి వస్తారు కావచ్చు. కొందరంటారు – “ఏంటి మేము ఔలియాలను గౌరవిస్తాము, ప్రవక్తలను గౌరవిస్తాము, ఎవరైతే షహీద్ అయిపోయారో, పుణ్య పురుషులు ఉన్నారో వారిని గౌరవిస్తాము. మీరు సమాధుల పూజ అని అంటారా?” కానీ వాస్తవంగా ఈ రోజుల్లో జరుగుతున్నది అదే. చదవండి, వినండి, శ్రద్ధ వహించండి.