1) లాభనష్టాల అధికారం కలవాడు ఎవరు? 2) సఫర్ మాసం వగైరా లలో దుశ్శకునం పాటించడం. 3) నక్షత్రాల ద్వారా (గ్రహాల ద్వారా) అదృష్టాన్ని తెలుసుకోవడం. 4) మాంత్రికుల వద్దకు వెళ్ళడం. 5) విచారణ లేకుండానే స్వర్గంలోకి ప్రవేశించే వారి గుణగణాలు
మొదటి ఖుత్బా
ఇస్లామీయ సోదరులారా!
లాభనష్టాల అధికారం కేవలం అల్లాహ్ కు వుందని ప్రతి ముస్లిం మనస్ఫూర్తిగా విశ్వసించాలి. అతనికి తప్ప మరెవరికీ ఈ అధికారం లేదు. ఏ ‘వలీ‘ దగ్గరా లేదు, ఏ ‘బుజుర్గ్‘ దగ్గరా లేదు. ఏ ‘పీర్‘, ‘ముర్షద్‘ దగ్గరా లేదు. ఏ ప్రవక్త దగ్గరా లేదు. చివరికి ప్రవక్తలలో శ్రేష్ఠులు, ఆదమ్ సంతతికి నాయకులు మరియు ప్రవక్తల ఇమామ్ అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు కూడా. ఇతరులకు లాభనష్టాలు చేకూర్చడం అటుంచి, స్వయానా తమకు కలిగే లాభనష్టాలపై సయితం వారు అధికారం కలిగిలేరు.
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.” (ఆరాఫ్ 7: 188)
ఈ ఆయతుపై దృష్టి సారిస్తే తెలిసేదేమిటంటే స్వయానా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు కలిగే లాభనష్టాలపై అధికారం కలిగి లేకపోతే మరి ఆయన కన్నా తక్కువ స్థాయి గల వలీ గానీ, బుజుర్గ్ గానీ, పీర్ గానీ- ఎవరి సమాధులనయితే ప్రజలు గట్టిగా నమ్మి సందర్శిస్తుంటారో ఈ అధికారాన్ని ఎలా కలిగి వుంటారు? తమకు ప్రయోజనం చేకూర్చే మరియు నష్టాన్ని కలిగించే వారుగా ప్రజలు తలపోసే వారి గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
ఆకాశాలను, భూమిని సృష్టించిన వాడెవడు? అని నువ్వు గనక వారిని అడిగితే, “అల్లాహ్” అని వారు తప్పకుండా చెబుతారు. వారితో చెప్పు : “సరే! చూడండి. మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని పిలుస్తున్నారో వారు, అల్లాహ్ నాకేదన్నా కీడు చేయదలిస్తే, ఆ కీడును తొలగించగలరా? పోనీ, అల్లాహ్ నన్ను కటాక్షించదలిస్తే, వారు ఆయన కృపను అడ్డుకోగలరా?” ఇలా అను: “నాకు అల్లాహ్ చాలు. నమ్మేవారు ఆయన్నే నమ్ముకుంటారు.” (జుమర్ 39 : 38)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లామీయ ఈ రెండవ మాసంలో ఎంతో మంది అపశకునం పాటిస్తారు. ఇలా పాటించడం ధర్మమా అధర్మమా ఈ వీడియోలో తెలుసుకోండి.
సఫర్ (صفر) మాసం – ఇస్లామీయ క్యాలెండరులో రెండవ నెల. ఇది ముహర్రం నెల తర్వాత వస్తుంది. దీనికా పేరు ఎలా వచ్చిందనే విషయమై కొందరు పండితులు తమ అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు – ఈ నెలలో ప్రయాణం కోసం ప్రజలు మక్కా నగరాన్ని ఖాళీ (ఇస్ఫార్) చేస్తుండేవారు.
ఇంకో అభిప్రాయం ప్రకారం ఈ నెలలో మక్కావాసులు ఇతర తెగలపై దాడి చేసి, వారి మొత్తం సంపదనను కొల్లగొట్టేవారు (అరబీలో సిఫ్రాన్ మినల్ మతాఅ) అంటే వారికి ఏమీ మిగల్చకుండా నిలువుదోపిడి చేసేవారు. (ఇబ్నె అల్ మంధూర్ వ్రాసిన లిసాన్ అల్ అరబ్ పుస్తకం 4వ భాగం 462-463)
సఫర్ అంటే భాషాపరంగా శూన్యమాసం అంటే ఖాళీ నెల అని అర్థం. ఈ పదం ఉనికిలోనికి రావటానికి రెండు కారణాలు వాడుకలో ఉన్నాయి:
మొదటిది: ఈ నెలలో అనాగరిక అరబ్బులు తమ ఇళ్ళను ఖాళీ చేసి లూటీ చేయటం కోసం వెళ్ళటం – సిఫర్ అంటే విసర్జించటం లేక ఖాళీ చేయటం.
రెండోది: అరబీ పదమైన సుఫ్ర్ అంటే పసుపు అనే పదం నుండి సఫర్ అనే పదం రావటం. ఈ నెలకు ఆ పేరు పెట్టబడిన కాలంలో, క్రమంగా క్షీణించిపోతూ, ఆకులు పసుపు రంగులో మారిపోయే శరదృతువులో ఆ నెల రావటం వలన దానికి ఆ పేరు వచ్చిందనేది మరొక అభిప్రాయం.
[24 నిమిషాల వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
సఫర్ నెల వాస్తివికత
సఫర్ నెల ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం రెండవ నెల. అరబ్బులలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్తగా రాక మునుపు సఫర్ నెలను అపశకునంగా భావించేవారు. మరియు ప్రాచీన అరబ్బులు ఈనెలలో ఆకాశం నుండి అనేక విపత్తులు, బాధలు, నష్టాలు అవతరిస్తాయని నమ్మేవారు. అందుకని ఈ నెలలో వివాహాలు, సంతోష సంబరాలు వంటి మంచి కార్యాలను నిర్వహించేవారు కాదు.
ప్రస్తుత కాలంలో మన ముస్లిం సమాజానికి చెందిన కొంత మంది అజ్ఞానులు, అలాంటి మూఢ నమ్మకాల వెంటపడి వారిలాగానే సఫర్ నెల పట్ల అపశకునాలకు చెందిన కొన్ని నమ్మకాలకు గురికాబడి ఉన్నారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి:
1-మొత్తం సంవత్సరంలో పది లక్షల ఎనభై వేల విపత్తులు ఆకాశం నుండి దిగి వస్తాయని భావిస్తారు. ఆ విపత్తలలో నుండి ఒక్క సఫర్ నెలలోనే తొమ్మిది లక్షల ఇరవై వేల విపత్తులకు గురికాబడతారని భావిస్తారు.
2-సఫర్ నెల రాగానే ప్రయాణాలను మానుకుంటారు, సంతోషకరమైన సంబరాలను జరుపుకోవడం అపశకునంగా భావిస్తారు.
౩-ఈ నెల మొదటి పదమూడు రోజులను “తేరతేది” అని పేర్కొంటూ, తీవ్రమైన విపత్తులకు గురికాబడే రోజులుగా భావిస్తారు.
4- ఈ నెలలో వివాహాలు చేసుకోరు, పెళ్ళి చూపులకు సహితం దూరంగా ఉంటారు. ఒక వేళ క్రొత్తగా వివాహాలు జరిగి ఉన్నా ఆ జంటలను పదమూడు రోజుల వరకు విడదీసి, ఒకరి ముఖాలను మరొకరు చూడడం అపశకునంగా భావిస్తారు. అలా కాదని వారు గనుక కలుసుకుంటే, వారిద్దరిలో ఒకరు చనిపోతారు, లేక జీవితాంతం వారి మధ్య తగాదాలు ఏర్పడతాయని భావిస్తారు.
యదార్ధం ఏమంటే? అలాంటి అపశకునాలకు ఇస్లాం ధర్మంలో ఎలాంటి వాస్తవికత లేదు. పైగా అలాంటి మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే? నెలలను లేక సమాయాలను అపశకునాలకు విపత్తులకు ప్రత్యేకిస్తే, అల్లాహ్ ను తప్పుపట్టినట్లుగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేసారు. కనుక ఒక హదిసు ఖుద్సీలో ఇలా ఉంది:
“అల్లాహ్ ఇలా తెలియజేసాడు: “ఆదాము పుత్రుడు (మానవుడు) కాలాన్ని (రోజులను, నెలలను, యేడాదిని) తిట్టుతున్నాడు. మరియు నేనే కాలాన్ని. నా చేతిలోనే రాత్రింబవళ్ళ మార్పిడి ఉన్నది.”,(బుఖారి;4452, ముస్లిం:41 70)
మరొక చోట ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“మీరు కాలాన్ని తిట్టకండి. నిశ్చయంగా అల్లాహ్ యే కాలము.” (ముస్లిం:4165)
ఆఖరి చహార్షుమ్బా
సఫర్ నెలకు చెందిన చివరి వారంలో ఉన్న బుధవారాన్ని ఊరుబయటకు వెళ్ళి పచ్చగడ్డిపై నడవటం పుణ్య ఆచారంగా భావిస్తారు. ఎందుకంటే? ఆ రోజే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి స్వస్థత లభించినది అని, మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సరదాగా ఆ రోజు పచ్చగడ్డిపై నడిచారని అంటారు. దాని కారణంగా ప్రజలు భార్యపిల్లలతో కలిసి పార్కులలో, తోటలలో షికార్లు చేస్తారు. దానిని ప్రవక్త ఆచారం అని అంటారు.
ఆ సాకుతో కొంత మంది ప్రజలు సఫర్ నెల చివరి బుధవారం తమ ఇండ్లలో మంచి వంటకాలు చేసుకొని, స్నానాలు చేసుకొని, క్రొత్త దుస్తులు ధరించి, బాగా అందంగా తయారయ్యి అందాల పోటీల సభలలో పాల్గొన్నట్లు ముస్తాబు అవుతారు. చిన్నాపెద్ద, ఆడామగా అనే తేడా లేకుండా పార్కుల్లో, తోటల్లోకి పోయి ఏ విధంగా కలిసి మెలిసి షికార్లు చేస్తుంటారనేది మనం చెప్పనక్కర లేదు.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చివరి రోజులు:
సఫర్ నెల చివరి బుధవారం రోజున ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి స్వస్థత లబించిందా అంటే? దానికి జవాబు కానేకాదు. ఎందుకంటే? “అర్రహీఖుల్ మఖ్తూమ్” తెలుగు పేజి: 813లో ప్రవక్త గారి గురించి ఇలా ఉంది: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి అయిదు రోజుల ముందు బుధవారం రోజున ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) శరీర ఉష్ణోగ్రత (జ్వరము) మరింత పెరిగిపోయింది. ఆ కారణంగానే ఆయన బాధ బాగా ఎక్కువై అపస్మారక పరిస్థితి ఎర్పడింది.” నిజమేమంటే ఆ రోజే ఆయన అస్వస్థకు గురికాబడ్డారు. కాని మనం స్వస్థత చేకూరిందంటూ సంతోషాలు జరుపుకోవడం ధర్మమేనా? దాని వలన మనకు పుణ్యం ప్రాప్తిస్తుందా? లేక పాపం ప్రాప్తిస్తుందా? మనం ఆఖరి చహార్షుమ్బా పేరుతో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చరిత్రనే తప్పుగా ప్రచారం చేయడం లేదా?
ప్రియమైన ముస్లిములారా! ఆఖరి చహార్షుమ్బా అంటూ ప్రత్యేకమైన ఎలాంటి పుణ్యకార్యం లేదు. మరియు సఫర్ నెల గురించి ఇస్లాం ధర్మంలో ఎలాంటి అపశకునాలు లేవు. అసలు అలాంటి అపశకునాలకు గురికాకూడదని ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు:
“అంటు (వ్యాధులు), దుశ్శకునం అనేవి ఒట్టిమాటలే. అపశకునాలు లేవు, గుడ్లగుబ కేకల వలన ఎలాంటి ప్రభావం లేదు, మరియు సఫర్ (నెల) ఏమి కాదు…” (బుఖారి: 5316, ముప్లిం: 4116)
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 71-74). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.