ప్రవక్త హూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
https://www.youtube.com/watch?v=ofVrllbBImA [41నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగం ఆద్ జాతి మరియు ప్రవక్త హూద్ అలైహిస్సలాంల చరిత్రను వివరిస్తుంది. అల్లాహ్ ఆద్ జాతి వారికి అపారమైన శారీరక శక్తిని, సంపదను మరియు విజ్ఞానాన్ని ప్రసాదించాడు, కానీ వారు గర్వంతో విగ్రహారాధనలో మునిగిపోయారు. హూద్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ వైపు ఆహ్వానించినప్పుడు వారు ఆయన్ని అపహాస్యం చేశారు. ఫలితంగా, అల్లాహ్ వారిపై భయంకరమైన పెనుగాలిని శిక్షగా పంపి వారిని నాశనం చేశాడు. ఈ కథ ద్వారా గర్వం మనిషిని ఎలా పతనానికి గురిచేస్తుందో మరియు అల్లాహ్ పై నమ్మకం ఎలా రక్షిస్తుందో తెలుస్తుంది. అలాగే షద్దాద్ రాజు నిర్మించిన ఇరం నగరం గురించిన కథనాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.
అస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్.
ఖాలల్లాహు తబారక వ త’ఆలా ఫిల్ ఖుర్ఆనిల్ మజీద్. అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.
وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ فَهَلْ تَرَىٰ لَهُمْ مِنْ بَاقِيَةٍ
ఆదు వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు , ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి. మరి వారిలో ఎవడైనా మిగిలి ఉన్నట్లు నీకు కనిపిస్తున్నాడా? (69:6-8)
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక, ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక ఆమీన్.
సోదర సోదరీమణులారా మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ఆద్ జాతి పరిచయం
ఈనాటి ప్రసంగంలో మనం ఒక జాతి గురించి తెలుసుకుందాం. వారికంటే గొప్ప శక్తిమంతులు అసలు పట్టణాలలోనే ఎవరూ సృష్టించబడలేదు అని స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు. అలాంటి శక్తివంతమైన జాతి. వారు తలుచుకుంటే పెద్ద పెద్ద పర్వతాలను సైతం చిన్న రాయిలాగా తొలిచేసి నిర్మించుకుంటారు భవనాలు మాదిరిగా మార్చేస్తారు. అలాంటి జాతి. మరి అలాంటి జాతి ఎవరిని ఆరాధించింది? అలాంటి జాతి వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ విధంగా రుజుమార్గం వైపు తీసుకురావడానికి ప్రవక్తను ఎవరిని పంపించాడు? ఆ ప్రవక్త ఆ జాతి వద్దకు వెళ్లి దైవవాక్యాలు వినిపిస్తే మరి అంత పెద్ద శక్తివంతమైన ఆ జాతి వారు ఆ ప్రవక్త మాటలను విశ్వసించారా లేదా తిరస్కరించారా? అసలు ఆ జాతి ఎవరు? ఎక్కడ ఆ జాతి ఉనికి ఉండింది భూమండలం మీద? పర్వతాలనే చెక్కేసి భవనాలు లాగా మార్చేసిన ఆ జాతి ప్రజల భవనాల ఆనవాళ్లు ఏమైనా ఈరోజు భూమండలం మీద మిగిలి ఉన్నాయా లేదా? ఇలాంటి విషయాలు ఈనాటి ప్రసంగంలో మనం తెలుసుకుందాం.
అరబ్బు భూమండలంలోని అరబ్బు ప్రదేశంలో దక్షిణ భాగం వైపు సౌదీ అరేబియాకి దక్షిణాన ఒక దేశం ఉంది దాని పేరు యెమన్ దేశం. ఆ యెమన్ దేశంలోని సనా మరియు హజ్రమౌత్ ఈ రెండు నగరాల మధ్యలో ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశాన్ని ‘అహ్ కాఫ్’ అంటారు. ఆ అహ్ కాఫ్ అనే ప్రదేశంలో ఒక జాతి వారు నివసించే వారు, ఆ అరబ్బు జాతి వారిని ఆద్ జాతి అని పిలిచేవారు మరియు ఆదె ఊలా, ఆదె ఇరమ్ అని కూడా ఆ జాతి వారిని పిలిచేవారు.
ఆ జాతి ప్రజలు ఎలాంటి వ్యక్తులంటే ధార్మిక పండితులు వారి గురించి తెలియజేసిన విషయం, వారిలోని ప్రతి ఒక్క మనిషి 12 మూరల ఎత్తు కలిగినవాడు, శారీరకంగా చాలా దృఢమైన వారు శక్తిమంతులు. వారి గురించి ధార్మిక పండితులు తెలియజేయడం పక్కన పెడితే స్వయంగా సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఏమన్నాడంటే:
الَّتِي لَمْ يُخْلَقْ مِثْلُهَا فِي الْبِلَادِ
(అల్లతీ లమ్ యుఖ్ లఖ్ మిస్ లుహా ఫిల్ బిలాద్)
“అటువంటి శక్తి గలవారు పట్టణాలలో సృష్టించబడలేదు.” (89:8)
స్వయంగా అల్లాహ్ అలాంటి ప్రజలు అసలు పట్టణాలలోనే సృష్టించబడలేదు అంటే వారు ఎంత గొప్ప శక్తివంతులై ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. వారి శక్తి సామర్థ్యాల మీద వారికే గర్వం ఉండేది వారు ఏమనేవారంటే:
مَنْ أَشَدُّ مِنَّا قُوَّةً
(మన్ అషద్దు మిన్నా ఖువ్వహ్)
“బల పరాక్రమాలలో మాకన్నా మొనగాడు ఎవడైనా ఉన్నాడా?” (41:15) అని వాళ్ళు ఛాలెంజ్ విసిరేవారు.
హూద్ అలైహిస్సలాం ఆహ్వానం
అలాంటి జాతి వారు, అయితే విషయం ఏమిటంటే అల్లాహ్ వారిని అంత శక్తిమంతులుగా అంత దృఢమైన శరీరం గలవారిలాగా పుట్టించినప్పటికీ సైతాన్ వలలో చిక్కుకొని నూహ్ అలైహిస్సలాం వారి తర్వాత ఈ భూమండలం మీద ఈ ఆద్ జాతి వారు విగ్రహారాధన ప్రారంభించారు. విగ్రహారాధన ప్రారంభించిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన సంప్రదాయం ప్రకారం వారిని మళ్ళీ సంస్కరించడానికి, మార్గభ్రష్టత్వానికి గురైన ఆ జాతి ప్రజలను మళ్ళీ రుజుమార్గం వైపు తీసుకురావడానికి వారిలో నుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆయన పేరే హూద్ అలైహిస్సలాం.
హూద్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తగా ఎన్నుకొని దైవవాక్యాలు వారి వద్దకు పంపించినప్పుడు హూద్ అలైహిస్సలాం ఆ దైవవాక్యాలు తీసుకొని ప్రజల ముందర వెళ్లారు. ప్రజల ముందర వెళ్లి ప్రజలను విగ్రహారాధన నుండి తప్పించి ఏకదైవ ఆరాధన వైపు పిలుపునిచ్చినప్పుడు, తౌహీద్ వైపు పిలుపునిచ్చినప్పుడు ఇతర జాతి ప్రజల మాదిరిగానే హూద్ అలైహిస్సలాం వారి జాతి ఆద్ జాతి ప్రజలు కూడా హూద్ అలైహిస్సలాం వారిని విమర్శించారు. ఏమని విమర్శించారు అసలు హూద్ అలైహిస్సలాం ఏమని పిలుపునిచ్చారు అవి కూడా మనకు ఖురాన్లో ప్రస్తావించబడి ఉన్నాయి అది కూడా మనం ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని ఏడవ అధ్యాయం 65వ వాక్యంలో తెలియజేస్తున్నాడు:
وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۚ أَفَلَا تَتَّقُونَ
(వ ఇలా ఆదిన్ అఖాహుమ్ హూదాన్ కాల యా ఖౌమిఅబుదుల్లాహ మాలకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహు)
మేము ‘ఆద్’ జాతి వద్దకు వారి సోదరుడైన హూద్ను పంపాము. ఆయన (వారితో) ఇలా అన్నాడు: “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరి మీరు భయపడరా?” (7:65)
అని హూద్ అలైహిస్సలాం వారు ఆద్ జాతి ప్రజల వద్దకు వెళ్లి దైవవాక్యాలు వినిపించారు. చూడండి ప్రతి ప్రవక్త జాతి ప్రజల వద్దకు వెళ్లి అందరికంటే ముందు ఏ విషయం వైపు పిలుపునిస్తున్నాడు అంటే అల్లాహ్ ఆరాధన వైపుకు రండి ఆయనే అన్ని రకాల ఆరాధనలకు ఏకైక అర్హుడు అన్న విషయాన్ని ప్రకటిస్తున్నాడు అంటే ప్రతి ప్రవక్త ఎప్పుడైతే జాతి ప్రజలు బహుదైవారాధనకు గురయ్యారో వారిని ముందుగా ఏకదైవ ఆరాధన వైపుకి తౌహీద్ వైపుకి పిలుపునిచ్చాడు అన్న విషయం స్పష్టమవుతుంది.
ఆద్ జాతి తిరస్కారం మరియు విమర్శలు
హూద్ అలైహిస్సలాం తౌహీద్ వైపు ప్రజలకు పిలుపునిస్తే ఆ జాతి ప్రజలు ఏమని విమర్శించారంటే చూడండి వారేమన్నారంటే:
إِنَّا لَنَرَاكَ فِي سَفَاهَةٍ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ الْكَاذِبِينَ
(ఇన్నా లనరాక ఫీ సఫాహతిన్ వ ఇన్నా లనజున్నుక మినల్ కాజిబీన్)
“నీవు మాకు తెలివితక్కువ వానిలా కనిపిస్తున్నావు. పైగా నీవు అబద్ధాలకోరువని మా అభిప్రాయం” (7:66) అన్నారు.
నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నీకు మతి భ్రమించింది అనే రీతిలో జాతి ప్రజలు హూద్ అలైహిస్సలాం వారిని విమర్శించినప్పుడు హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజల వద్దకు వెళ్లి ఏమండీ:
يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ
“ఓ నా జాతి ప్రజలారా! నాలో ఏమాత్రం తెలివితక్కువతనము లేదు. నేను సకల లోకాల ప్రభువు తరఫు నుంచి పంపబడిన ప్రవక్తను. నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేస్తున్నాను. నేను మీకు నమ్మకస్తుడైన హితైషిని” (7:67-68) అని చెప్పారు.
నా మతి భ్రమించింది నేను తెలివితక్కువ వాడిని అని మీరు అంటున్నారు కదా అలాంటిది ఏమీ లేదు అసలు విషయం ఏమిటంటే అల్లాహ్ నన్ను సురక్షితంగానే ఉంచాడు నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్ తరఫు నుండి ప్రవక్తగా మీ ముందు వచ్చి ఈ విషయాలు తెలియజేస్తున్నాను తప్ప మతి భ్రమించి నేను ఈ విషయాలు మాట్లాడటం లేదు అని హూద్ అలైహిస్సలాం వారు స్పష్టం చేశారు. అంతేకాదండి హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలు చేస్తున్న చేష్టలను వివరిస్తూ అల్లాహ్ అనుగ్రహాలు వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన అనుగ్రహాల గురించి కూడా వారి ముందర వివరించారు. మనం చూసినట్లయితే ఆ జాతి ప్రజలు ఏం చేసేవారంటే పెద్ద పెద్ద పర్వతాల వద్దకు వెళ్లి ఆ పర్వతాలను చెక్కేసి తొలిచేసి భవనాలు లాగా మార్చేసేవారు. అది హూద్ అలైహిస్సలాం వారు చూసి వారితో ఏమన్నారంటే ఏమండీ:
أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ
(అతబ్ నూన బికుల్లి రీఇన్ ఆయతన్ తఅబసూన్. వ తత్తఖిజూన మసానిఅ లఅల్లకుమ్ తఖ్ లుదూన్)
“మీరు ఎత్తయిన ప్రతి స్థలంలో ఎలాంటి ప్రయోజనం లేని స్మారక కట్టడాలు ఎందుకు కడుతున్నారు? మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు ఈ భవనాలు నిర్మిస్తున్నారా ఏంటి?” (26:128-129)
అసలు ఈ భవనాల్లో మీరు నివసిస్తారా? మీరు నివసించరు నివసించడానికి మైదానంలో భవనాలు నిర్మించుకున్నారు ఇళ్లు నిర్మించుకున్నారు ఈ పర్వతాలను చెక్కేసి తొలిచేసి భవనాలు లాగా మార్చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం ప్రపంచానికి మీ శక్తి సామర్థ్యాలు చూపించాలని మిమ్మల్ని పొగడాలని అయ్యో ఎంత శక్తిమంతులయ్యా పర్వతాలనే భవనాలు లాగా మార్చేశారు అని మిమ్మల్ని పొగడాలని ప్రజల వద్ద మీ శక్తి సామర్థ్యాలు మీరు ప్రదర్శించాలని కేవలం మీ అహంకారాన్ని ప్రదర్శించాలని మాత్రమే మీరు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి మీ శ్రమ వృధా మీ సమయము వృధా ఇలాంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు అని హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలతో అనగా తర్వాత అల్లాహ్ అనుగ్రహాల గురించి కూడా వివరించారు ఏమన్నారు:
أَمَدَّكُم بِأَنْعَامٍ وَبَنِينَ وَجَنَّاتٍ وَعُيُونٍ
(అమద్దకుమ్ బి అన్ ఆమిన్ వ బనీన్. వ జన్నాతిన్ వ ఉయూన్)
“చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీ కోసము పశువులను మరియు సంతానాన్ని ప్రసాదించాడు. మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోటల ద్వారా సెలమల ద్వారా సహాయపడ్డాడు.” (26:133-134)
నీటి కాలువలు మీకోసం ప్రవహింపజేశాడు మీకు సంతానాన్ని ప్రసాదించాడు పశువులను ప్రసాదించాడు తోటలు మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించాడు ఈ అనుగ్రహాలు పొందిన మీరు అల్లాహ్ ను వేడుకోవాలి అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి అల్లాహ్ మార్గంలో నడుచుకోవాలి మీ మీద ఉన్న ఇది బాధ్యత ఈ బాధ్యతను మీరు గ్రహించండి అని హూద్ అలైహిస్సలాం వారు చాలా రకాలుగా జాతి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసినప్పటికిని ఆ ఆద్ జాతి వారు హూద్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే:
إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ
(ఇన్ హాజా ఇల్లా ఖులుఖుల్ అవ్వలీన్)
“ఇది పూర్వికుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు.” (26:137)
మేము ఏమో కొత్త విషయాలు చేయట్లేదండి మా పూర్వీకులు చేస్తూ వచ్చిన విషయాలే మేము కూడా పాటిస్తూ ఉన్నాము వారి పద్ధతినే మేము కూడా అనుసరిస్తున్నాము అంతే తప్ప మేము కొత్త విషయాలు ఏమీ చేయట్లేదు ఈ విగ్రహారాధన మా పూర్వీకుల నుంచి వస్తున్న విషయమే అని చెప్పారు. మరికొంతమంది అయితే హూద్ అలైహిస్సలాం వారిని ఏమన్నారంటే:
أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا
(అజిఅతనా లినఅబుదల్లాహ వహ్ దహు వ నజర మా కాన యఅబుదు ఆబాఉనా)
“మేము అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చినవాటిని వదిలివేయమని చెప్పడానికి నువ్వు మా వద్దకు వచ్చావా?” (7:70) అన్నారు.
తాత ముత్తాతలు చేస్తూ వచ్చిన పనులన్నీ మేము వదిలేయాలి నువ్వు చెప్పినట్టుగా అన్ని దేవుళ్లను వదిలేసి ఒకే దేవుణ్ణి పూజించుకోవాలి ఈ మాటలు చెప్పడానికేనా నువ్వు మా వద్దకు వచ్చింది అన్నట్టు మరి కొంతమంది హేళన చేశారు వెక్కిరించారు. అయితే మరికొంతమంది అయితే మొండిగా ప్రవర్తిస్తూ హూద్ అలైహిస్సలాం వారితో ఏమన్నారంటే:
وَمَا نَحْنُ بِتَارِكِي آلِهَتِنَا عَن قَوْلِكَ
(వ మా నహ్ ను బి తారికి ఆలిహతినా అన్ ఖౌలిక)
“నువ్వు చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదిలిపెట్టము.” (11:53)
మేము ఎన్నో రోజుల నుంచి పూజించుకుంటూ వస్తున్నామయ్యా నువ్వు చెప్పగానే మా దేవుళ్లను పూజించటం మేము వదిలేయం మేము పూజిస్తాం అంతే అని మరికొంతమంది అయితే హూద్ అలైహిస్సలాం తో వాదించారు. అప్పుడు వారు వాదిస్తూ ఉంటే హూద్ అలైహిస్సలాం వారితో ఇలా అన్నారు:
أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا نَزَّلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ
(అ తుజాదిలూననీ ఫీ అస్మాయిన్ సమ్మైతుమూహా అన్తుమ్ వ ఆబాఉకుమ్ మా నజ్జలల్లాహు బిహా మిన్ సుల్తాన్)
“మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న పేర్ల విషయంలో ఇవి కేవలం మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న పేర్లు మాత్రమే ఈ పేర్ల విషయంలో నాతో గొడవ పడుతున్నారా? వాటి గురించి అవి ఆరాధ్య దైవాలని నిర్ధారించే ఏ ప్రమాణాన్ని అల్లాహ్ అవతరింపజేయలేదు.” (7:71)
ఈ విగ్రహాలు దేవుళ్ళు వీటిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మీ సమస్యలు పరిష్కరించే శక్తి సామర్థ్యాలు ఈ విగ్రహాలలో ఉన్నాయి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలాంటి ఆధారము ఎలాంటి వాక్యం అవతరింపజేయలేదే అలాంటప్పుడు ఏ విషయాన్ని చూసి మీరు వాటిని పూజిస్తున్నారు ఏ ఆధారాన్ని బట్టి మీరు వాటిని నమ్ముతున్నారు కేవలం పూర్వీకుల అంధానుసరణ తప్ప మరే ఆధారము మీ వద్ద లేదు ఈ విషయాన్ని మీరు గ్రహించండి. అయితే నేను మాత్రం ఒక విషయం స్పష్టం చేసేస్తున్నాను అదేమిటంటే:
إِنِّي أُشْهِدُ اللَّهَ وَاشْهَدُوا أَنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ
(ఇన్నీ ఉష్ హిదుల్లాహ వష్ హదూ అన్నీ బరీఉమ్ మిమ్మా తుష్రికూన్)
“అల్లాహ్ తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసిగిపోయాను. వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఈ విషయానికి అల్లాహ్ ను సాక్షిగా పెడుతున్నాను మీరు కూడా ఈ విషయానికి సాక్షులుగా ఉండండి.” (11:54)
ఎవరినైతే మీరు పూజిస్తున్నారో దేవుళ్లు అని నమ్ముతున్నారో ఆరాధిస్తున్నారో వారితో నేను విసిగిపోయాను నేను వారి పూజను వారి పూజతో నేను దూరంగా ఉంటున్నాను నాకు ఈ విగ్రహాలకు ఎలాంటి సంబంధం లేదు ఈ విషయానికి నేను అల్లాహ్ కు సాక్ష్యం పెడుతున్నాను మీరు కూడా సాక్షులుగా ఉండండి అని హూద్ అలైహిస్సలాం వారు తెలియజేసేశారు. ప్రజలతో నువ్వు హూద్ అలైహిస్సలాం వారు మాట్లాడుతున్నారు ప్రజలు కూడా హూద్ అలైహిస్సలాం వారితో ఇదే విధంగా సమాధానం ఇస్తున్నారు ఈ విషయాలన్నీ మనం విన్నాము.
ఆద్ జాతి నాయకుల గర్వం
ఇక రండి ఆ జాతి ప్రజలు ఉంటారు ఆ జాతి పెద్దలు ఉంటారు కదండీ ప్రజలు ఒకవైపు పెద్దలు ఆ జాతి పెద్దలు వారు హూద్ అలైహిస్సలాం తో ఏమనేవారు చూడండి ఆ జాతి పెద్దలు హూద్ అలైహిస్సలాం వద్దకు వచ్చి ప్రజలందరినీ ఉద్దేశించి ఇలా అనేవారు:
مَا هَٰذَا إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يَأْكُلُ مِمَّا تَأْكُلُونَ مِنْهُ وَيَشْرَبُ مِمَّا تَشْرَبُونَ وَلَئِنْ أَطَعْتُم بَشَرًا مِّثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَّخَاسِرُونَ
(మా హాజా ఇల్లా బషరుమ్ మిస్ లుకుమ్ యాకులు మిమ్మా తాకులున మిన్హు వయష్రబు మిమ్మా తష్రబూన్. వ లఇన్ అతఅతుమ్ బషరమ్ మిస్ లకుమ్ ఇన్నకుమ్ ఇజల్ లఖాసిరూన్)
“ఇతను కూడా మీలాంటి సామాన్య మానవుడే. మీరు తినేదే ఇతను తింటున్నాడు మీరు తాగేదే ఇతను త్రాగుతున్నాడు మీరు గనుక మీలాంటి ఒక మానవ మాత్రుని అనుసరించారంటే మీరు తప్పకుండా నష్టపోతారు.” (23:33-34)
జాతి ప్రజలు వచ్చి జాతి పెద్దలు వచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నారు ఇతను కూడా మీలాంటి ఒక సాధారణ మనిషే మీలాంటి ఒక సాధారణ మనిషి వచ్చి చెప్పగానే మీరు వారి మాటలు వినేస్తే మీరు నష్టపోతారు కాబట్టి ఇతని మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు అని జాతి పెద్దలు వచ్చి ప్రజలతో అనేవారు. మరికొంతమంది వచ్చి ఏమనేవారు అంటే:
أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنتُمْ تُرَابًا وَعِظَامًا أَنَّكُم مُّخْرَجُونَ هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوعَدُونَ
(అ యఇదుకుమ్ అన్నకుమ్ ఇజా మిత్తుమ్ వ కున్తుమ్ తురాబన్ వ ఇజామన్ అన్నకుమ్ ముఖ్రజూన్. హైహాత హైహాత లీమా తూఅదూన్)
“ఏమిటి? మీరు చచ్చి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ లేపబడతారని ఇతను వాగ్దానం చేస్తున్నాడా? అసంభవం! మీకు చేయబడే ఈ వాగ్దానం అసంభవం.” (23:35-36) అని మరికొంతమంది వచ్చి చెప్పేవారు.
ఇతని వాగ్దానాలని సంభవించే విషయాలు కావు. మనిషి మరణించి మట్టిలో కలిసిపోతాడు ఎముకల్లాగా మారిపోతాడు మళ్ళీ పుట్టడమంట తర్వాత అల్లాహ్ వద్ద లెక్కింపు జరగటమంట అక్కడ స్వర్గము నరకము అని ఫలితాలు శిక్షలు ఉన్నాయి అని విశ్వసించడమంట ఇవన్నీ అసంభవం జరిగే విషయాలు కావు అని మరికొంతమంది పెద్దలు వచ్చి జాతి ప్రజలకు మార్గభ్రష్టత్వానికి గురయ్యేటట్లుగా మాట్లాడేవారు. మరికొంతమంది అయితే ఏకంగా హూద్ అలైహిస్సలాం వారితోనే వచ్చి ఏమనేవారంటే జాతి పెద్దలు కొంతమంది:
إِن نَّقُولُ إِلَّا اعْتَرَاكَ بَعْضُ آلِهَتِنَا بِسُوءٍ
(ఇన్ నఖూలు ఇల్లా ఇఅతరాక బఅజు ఆలిహతినా బి సూ)
“మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురి చేసి ఉంటారని మేము అనుకుంటున్నాము.” (11:54)
ఈ విధంగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మా విగ్రహాలను దేవుళ్ళు కాదు అని నువ్వు ఎందుకు విమర్శిస్తున్నావు అంటే దీనికి గల ముఖ్యమైన కారణము మా దేవుళ్ళలోనే ఏదో ఒక దేవుడు ఆగ్రహించి నిన్ను శిక్షించాడు అతని శిక్ష నిన్ను పట్టుకునింది కాబట్టి ఈ విధంగా నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు అని మాటలు మాట్లాడారు చిత్రీకరించి మరి హూద్ అలైహిస్సలాం వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మాటలు ప్రజలు చాలా తొందరగా స్వీకరిస్తారు నమ్మే నమ్ముతారు.
అయితే చూడండి హూద్ అలైహిస్సలాం వారు ఏమంటున్నారో చూడండి. వారు బెదిరించేటట్టు ప్రజలు కూడా భయపడే పోయేటట్టు వారు మాట్లాడుతుంటే దానికి సమాధానంగా హూద్ అలైహిస్సలాం వారు ఏమంటున్నారో చూడండి. హూద్ అలైహిస్సలాం వారు అంటున్నారు:
إِنِّي تَوَكَّلْتُ عَلَى اللَّهِ رَبِّي وَرَبِّكُم
(ఇన్నీ తవక్కల్తు అలల్లాహి రబ్బీ వ రబ్బికుమ్)
“నేను కేవలం అల్లాహ్ నే నమ్ముకున్నాను ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే.” (11:56)
వాళ్ళేమంటున్నారు మా దేవుళ్ళలో ఎవడో ఒకడు నిన్ను శిక్షించాడు కాబట్టి నీ మీద అతని శిక్ష పడింది నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని మా దేవుళ్ళు అని వారు వచ్చి హూద్ అలైహిస్సలాం తో హెచ్చరిస్తుంటే సమాధానంగా హూద్ అలైహిస్సలాం వారు ఏమంటున్నారు మీ దేవుడు ఏంటి నా దేవుడు ఏంటి అని చెప్పట్లేదు మీ దేవుడు ఏంటి నా దేవుడు గొప్పతనం చూడండి అనేటట్టుగా మాట్లాడట్లేదు ఆయన ఏమంటున్నారంటే నేను అల్లాహ్ నే నమ్ముతున్నాను ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే అంటే అల్లాహ్ నా దేవుడు అనే రీతిలో మాట్లాడట్లేదు అల్లాహ్ నాకు మీకు మనందరికీ దేవుడు అనే రీతిలోనే మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఒక దాయికి ఒక ఉదాహరణగా ఒక ఆదర్శప్రాయంగా విషయం తెలుపబడింది అదేమిటంటే ఎదుటి వ్యక్తి నా దేవుడు అని మాట్లాడుతుంటే దాయి అతనితో మాట్లాడేటప్పుడు నా దేవుడు అల్లాహ్ నా దేవుడు అల్లాహ్ అన్నట్టు మాట్లాడరాదు మన దేవుడు మీకు మాకు మనందరికీ దేవుడు అల్లాహ్ ఆ అల్లాహ్ గురించి తెలుసుకోండి ఆ అల్లాహ్ వైపుకు రండి అనే మాట్లాడాలి గాని విగ్రహాలు మీ దేవుళ్ళు అల్లాహ్ నా దేవుడు అనే రీతిలో మాట్లాడరాదు ఇది సరైన విధానము కాదు సరైన విధానం ఏమిటంటే అల్లాహ్ మనందరి ప్రభువు ఆ ప్రభువు వైపుకు రండి అని మాత్రమే చెప్పాలి. ఇది ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. అలాగే హూద్ అలైహిస్సలాం వారు మరొక విషయం వారికి తెలియజేశారు ఏమన్నారంటే:
فَإِن تَوَلَّوْا فَقَدْ أَبْلَغْتُكُم مَّا أُرْسِلْتُ بِهِ إِلَيْكُمْ
(ఫఇన్ తవల్లౌ ఫఖద్ అబ్లగ్ తుకుమ్ మా ఉర్ సిల్ తు బిహీ ఇలైకుమ్)
“ఏమయ్యా నేనేమో మీ వద్దకు వచ్చి ఈ విషయాలు ప్రకటిస్తున్నాను ఒకవేళ మీరు మరలిపోదలిస్తే నేను మాత్రం నాకు ఇచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను నా బాధ్యత నెరవేర్చేశాను.” (11:57)
అల్లాహ్ వాక్యాలు మీ వద్దకు చేర్చటం వాటిని వివరంగా మీ ముందర తెలియజేయడం నా బాధ్యత నేను ఆ బాధ్యతను నెరవేర్చాను మీరు మరలిపోతే నా బాధ్యత తీరిపోతుంది మీరు మాత్రం అల్లాహ్ వద్ద ప్రశ్నించబడతారన్న విషయాన్ని హూద్ అలైహిస్సలాం జాతి ప్రజలకు తెలియజేశారు. తర్వాత హూద్ అలైహిస్సలాం చాలా రోజుల వరకు అనేక సంవత్సరాలుగా ఆద్ జాతి వారు కి దైవ వాక్యాలు వినిపిస్తూ వినిపిస్తూ ముందుకు సాగిపోయారు. అయితే జాతి ప్రజలు హూద్ అలైహిస్సలాం వారిని పట్టించుకోవట్లేదు. అప్పుడు హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలకు హెచ్చరించటం ప్రారంభించారు ఏమన్నారంటే:
إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
(ఇన్నీ అఖాఫు అలైకుమ్ అజాబ యౌమిన్ అజీమ్)
“నేను మీ విషయంలో ఒక మహా దినపు శిక్ష గురించి భయపడుతున్నాను.” (26:135)
మీరు దైవ వాక్యాలను నమ్మటం లేదు మీరు దైవ వాక్యాలను అంగీకరించుట లేదు విశ్వసించుట లేదు ఒక మహా దినపు శిక్ష వచ్చి మీ మీద పడబోతుందన్న విషయము నాకు భయభ్రాంతుల్ని చేస్తుంది ఆ రోజు మీ మీద వచ్చి పడుతుందేమో ఆ శిక్ష వచ్చి మీ మీద పడుతుందేమో అని నేను భయపడుతున్నాను అని చెప్పారు. దానికి చూడండి గర్విష్టులు శక్తివంతులు బాగా ఎత్తుగా ఉన్నవారు బలంగా ఉన్నవారు శక్తిమంతులు మాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు ప్రపంచంలో అనుకుంటున్నవాళ్ళు శిక్ష వచ్చి పడుతుంది అని హూద్ అలైహిస్సలాం హెచ్చరిస్తుంటే వాళ్ళు ఎలాంటి గర్వంగా హూద్ అలైహిస్సలాం కు సమాధానం ఇస్తున్నారో చూడండి వాళ్ళు అంటున్నారు:
وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
(వ మా నహ్ ను బి ముఅజ్జబీన్. ఫ అత్తినా బిమా తఇదునా ఇన్ కున్త మినస్సాదిఖీన్)
“ఎట్టి పరిస్థితిలోనూ మేము శిక్షించబడము. ఏ శిక్ష గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం.” (26:138, 7:70)
శిక్ష వచ్చి పడుతుంది అని హెచ్చరిస్తున్నావు కదా మేము శిక్షించబడము మాకంటే శక్తిమంతులు ఎవరూ ప్రపంచంలో లేరు కాబట్టి మాకు ఎలాంటి శిక్ష గురించి భయము లేదు ఒకవేళ శిక్ష వస్తుంది అదే నిజమైటట్లయితే ఆ శిక్ష తీసుకొని రా చూద్దాము అని హూద్ అలైహిస్సలాం తో ఛాలెంజ్ చేస్తున్నారు సవాలు విసురుతున్నారు ఆద్ జాతి ప్రజలు. అప్పుడు హూద్ అలైహిస్సలాం అల్లాహ్ తో ప్రార్థన చేశారు:
قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونِ
(కాల రబ్బిన్ సుర్నీ బిమా కజ్జబూన్)
“ఓ ప్రభూ! వీళ్లు ధిక్కార వైఖరికి ప్రతిగా, వీళ్ళ ధిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయపడు” (23:39) అని ప్రవక్త హూద్ అలైహిస్సలాం వారు ప్రార్థించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హూద్ అలైహిస్సలాం వారి ప్రార్థన స్వీకరించాడు స్వీకరించి త్వరలోని శిక్షించబడే రోజు రాబోతుంది నిరీక్షించండి అని తెలియజేశాడు. అదే విషయం హూద్ అలైహిస్సలాం జాతి ప్రజల వద్దకు వచ్చి:
فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ
(ఫన్ తజిరూ ఇన్నీ మఅకుమ్ మినల్ మున్ తజిరీన్)
“దైవ శిక్ష తీసుకొని రా చూద్దామని సవాలు విసిరారు కదా మీరు నిరీక్షించండి మీతో పాటు నేను కూడా నిరీక్షిస్తున్నాను.” (7:71) అని తెలియజేశారు అంటే ప్రార్థన అయిపోయింది దైవ శిక్ష రావటం నిర్ణయించబడింది ఇక అది ఎప్పుడు వస్తాది అనే దాని కోసం మీరు ఎదురు చూడండి నేను కూడా మీతో పాటు నిరీక్షిస్తున్నాను అని హూద్ అలైహిస్సలాం వారు ఆద్ జాతి వారికి తెలియజేశారు.
అల్లాహ్ శిక్ష ఆరంభం
ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క శిక్ష ప్రారంభమైంది. ప్రారంభంలో అక్కడ వర్షాలు ఆగిపోయాయి. వర్షం ఆగిపోయిన కారణంగా అక్కడ కరువు ఏర్పడింది. ప్రజలకు ఆహారము నీళ్ళ సమస్య ఎదురైంది చాలా రోజుల వరకు వర్షాలు కురవకపోయేసరికి కరువు ఏర్పడిన కారణంగా వారు ఆకలి దప్పికలతో అల్లాడే పరిస్థితి ఏర్పడింది అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత నల్లటి మేఘాలు వచ్చాయి ఇక్కడ గమనించండి కొంచెం బాగా మిత్రులారా నల్లటి మేఘాలు ఎప్పుడైతే వస్తూ కనిపించాయో అప్పుడు జాతి ప్రజలు ఏమన్నారంటే:
قَالُوا هَٰذَا عَارِضٌ مُّمْطِرُنَا
(ఖాలూ హాజా ఆరిజుమ్ ముమ్ తిరునా)
“ఇది మాపై వర్షాన్ని కురిపించే మబ్బులు. ఇవి మాపై వర్షాన్ని కురిపించే మబ్బు తునక” (46:24) అని వారు చెప్పుకోసాగారు. అయితే అల్లాహ్ ఏమన్నాడంటే:
بَلْ هُوَ مَا اسْتَعْجَلْتُم بِهِ ۖ رِيحٌ فِيهَا عَذَابٌ أَلِيمٌ
(బల్ హువ మస్ తఅ జల్ తుమ్ బిహీ రీహున్ ఫీహా అజాబున్ అలీమ్)
“నిజానికి అది మీరు తొందరపెట్టిన విపత్కర మేఘం, అదొక పెనుగాలి అందులో వేదాభరితమైన శిక్ష ఉంది.” (46:24)
వారేమనుకుంటున్నారు దూరం నుంచి చూసి అవి నల్లటి మబ్బులు ఇప్పుడు వర్షం వస్తుంది వర్షం కురుస్తుంది మా కరువు మొత్తం దూరమైపోతుంది అని వారు అనుకుంటున్నారు కానీ అల్లాహ్ ఏమంటున్నాడు అంటే ఆ మేఘాల వెనుక పెనుగాలి ఉంది మరియు విపత్కరమైన శిక్ష మీకోసం వస్తూ ఉంది భయంకరమైన శిక్ష అందులో దాగి ఉంది అని అంటున్నాడు. తర్వాత ఏమైందండి ఆ మేఘాలు ఎప్పుడైతే ఆ జాతి ప్రజల వద్దకు వచ్చాయో వర్షానికి బదులు తీవ్రమైన భయంకరమైన గాలి మొదలయింది. ఎన్ని రోజులు ఆ గాలి నడిచింది ఏ విధంగా అల్లాహ్ వారిని శిక్షించాడో అది కూడా ఖురాన్ లో ప్రస్తావించబడింది 69వ అధ్యాయం ఆరు ఏడు వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:
وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ
(వ అమ్మ ఆదున్ ఫ ఉహ్ లికూ బిరీహిన్ సర్ సరిన్ ఆతియతిన్. సఖ్ ఖరహా అలైహిమ్ సబ్ అ లయాలిన్ వ సమానియత అయ్యామిన్ హుసూమన్ ఫతరల్ ఖౌమ ఫీహా సర్ ఆ క అన్నహుమ్ అఅజాజు నఖ్ లిన్ ఖావియతిన్)
“ఆద్ జాతి వారు ప్రచండమైన పెనుగాలి ద్వారా నాశనం చేయబడ్డారు. దాన్ని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు ఎనిమిది పగళ్లు విధించాడు. నీవు గనుక అక్కడ ఉండి ఉంటే వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దుల వలె నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి.” (69:6-7) అల్లాహు అక్బర్. ఏడు రాత్రులు ఎనిమిది పగళ్లు పూర్తి ఒక వారం వరకు ఆ పెనుగాలి వారిపైకి పంపించబడింది.
అంతే కాదు ఆ గాలితో పాటు మరొక శిక్ష ఏమిటంటే:
فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ بِالْحَقِّ فَجَعَلْنَاهُمْ غُثَاءً
(ఫ అఖజత్ హుముస్ సైహతు బిల్ హఖ్ ఖి ఫజఅల్ నాహుమ్ గుసాఅన్)
“ఎట్టకేలకు న్యాయం వాంఛించే దాని ప్రకారం ఒక పెద్ద అరుపు అమాంతం వారిని కబళించింది అంతే మేము వారిని చెత్తాచెదారం లాగా చేసేసాము.” (23:41)
ఒకవైపు ఏడు రాత్రులు ఎనిమిది పగళ్ల వరకు తీవ్రమైన ఒక గాలి వీస్తూ ఉంది దానికి తోడుగా ఒక భయంకరమైన అరుపు కూడా వారిని పట్టుకునింది ఆ గాలి వచ్చినప్పుడు ఆ గాలి వచ్చి వారి ఇళ్లలోకి దూరి ఎవరైతే మాకంటే శక్తిమంతులు ప్రపంచంలో ఎవరూ లేరు అని విర్రవీగిపోయారో సవాలు విసిరారో ప్రపంచానికి అలాంటి వారి పరిస్థితి ఏమైపోయిందంటే ఆ గాలి వారిని పైకి తీసుకెళ్లి తలకిందులుగా కిందికి పడేసేది నేలకేసి కొడితే వచ్చి నేలకు తల తగలగానే తల బద్దలైపోయేది వారు తుఫాను వచ్చిన తర్వాత మనం టీవీ ఛానల్లో చూస్తూ ఉంటాం టెంకాయ చెట్లు, తాటి చెట్లు, ఖర్జూరపు చెట్లు అవన్నీ నేలకొరిగి ఉంటాయి పంట నష్టం జరిగింది అని చూపిస్తూ ఉంటాడు కదండీ ఆ విధంగా ఎంతో ఎత్తు ఉన్న బలశాలులైన ఆ ఆద్ జాతి ప్రజలందరూ కూడా బొద్దుల వలె కింద పడిపోయి ఉన్నారు తాటి ఖర్జూరపు టెంకాయ బొద్దుల వలె అక్కడ పడి మరణించారు నాశనమయ్యారు.
విశ్వాసుల రక్షణ
అయితే పూర్తి జాతిలో ఎంతమంది అయితే హూద్ అలైహిస్సలాం వారి మాటను నమ్మి విశ్వసించారో హూద్ అలైహిస్సలాం ప్రవక్తను మరియు ఆయన మాట విశ్వసించిన ఆ జాతి ప్రజలను మాత్రం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రక్షించాడు సురక్షితమైన ప్రదేశానికి వారిని తరలించాడు ఖురాన్లో 11వ అధ్యాయం 58వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:
وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا هُودًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا
(వ లమ్మా జాఅ అమ్రునా నజ్జైనా హూదన్ వల్లజీన ఆమనూ మఅహూ బిరహ్ మతిమ్ మిన్నా)
“మరి మా ఆజ్ఞ అమల్లోకి వచ్చినప్పుడు మేము హూద్ను అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులను మా ప్రత్యేక కృపతో కాపాడాము.” (11:58)
అంటే ఆద్ జాతి వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గాలి మరియు అరుపు ద్వారా శిక్షించాడు వారందరూ నాశనమైపోయారు చెత్తాచెదారం లాగా అయిపోయారు విశ్వసించిన వారిని ప్రవక్తను మాత్రం అల్లాహ్ రక్షించాడు. ఇది హూద్ అలైహిస్సలాం మరియు ఆద్ జాతి యొక్క సంక్షిప్తమైన చరిత్ర.
షద్దాద్ మరియు ఇరం నగరం కథనం
అయితే ఈ చరిత్రతో మరొక కథ ముడిపడి ఉంది ఆ కథ అక్కడక్కడ కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు అదేమిటంటే హూద్ అలైహిస్సలాం వారి జాతిని ఆద్ జాతి అంటారు కదండీ ఆ జాతి వద్ద షద్దాద్ బిన్ ఆద్ మరియు షదీద్ బిన్ ఆద్ అనే ఇద్దరు రాజులు ఆ జాతిని పరిపాలించేవారు వారిద్దరూ అన్నదమ్ములు వారి తండ్రి పేరు వచ్చి ఆద్, ఆ ఆద్ అనే రాజు ఆ ప్రదేశాన్ని పరిపాలించేవాడు కాబట్టి ఆ పూర్తి జాతిని ఆద్ జాతి వారు అని పేరు పెట్టడం జరిగింది. అయితే తండ్రి మరణించిన తర్వాత షద్దాద్ మరియు షదీద్ వీరిద్దరూ ఆ ప్రదేశాన్ని పరిపాలించారు. అయితే కొద్ది రోజులకు వారిద్దరిలో నుంచి షదీద్ అనే ఒక తమ్ముడు మరణించాడు షదీద్ మరణించిన తర్వాత పూర్తి బాధ్యతలు షద్దాద్ చేతికి అప్పగించబడ్డాయి ఆ తర్వాత షద్దాద్ ఒక్కడే ఆ ప్రదేశం మొత్తానికి రాజయ్యాడు పూర్తి అధికారాలు అతని చేతుల్లోకి వచ్చాయి అతను ఆ ప్రదేశాన్ని పరిపాలించడం ప్రారంభించాడు.
జాతి ప్రజలు చాలా శక్తివంతులు ఎత్తు కలిగిన వారు కాబట్టి వారిని తీసుకొని తన సామ్రాజ్యాన్ని అతను చాలా దూరం వరకు విస్తరించుకుంటూ పోయాడు. అయితే ఎప్పుడైతే హూద్ అలైహిస్సలాం వారు జాతి ప్రజల వద్దకు వెళ్లి అల్లాహ్ గురించి మరణానంతర జీవితం గురించి స్వర్గం గురించి నరకం గురించి వివరించారో ఆ రాజు వద్దకు స్వర్గం గురించి ఎవరో వినిపించారు అప్పుడు ఆ రాజు ఆ స్వర్గం గురించి స్వర్గ అనుగ్రహాల గురించి విని ఏమన్నాడంటే ఆకాశాలలో స్వర్గం ఉండటం ఏమిటి భూమండలం మీదే నేను స్వర్గాన్ని నిర్మించి చూపిస్తాను అని ప్రకటించాడు. హూద్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు గర్వంతో అహంకారంతో అతను ఏమన్నాడంటే ఆకాశాల పైన ఉన్న స్వర్గం ఏమిటి భూమండలం మీదే నేను స్వర్గాన్ని నిర్మించి చూపిస్తాను చూడండి అని ఆ తర్వాత ‘అదన్‘ అనే ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ బంగారము వెండి వజ్రాలు ఈ విధంగా అతని వద్ద ఉన్న ఖజానా మొత్తం ఖర్చు పెట్టి ఒక స్వర్గాన్ని నిర్మించే పని మొదలెట్టాడు.
ఆ రోజుల్లో ప్రజల ఆయుష్షు చాలా పెద్దది చాలా ఎక్కువ రోజులు వారు బ్రతికేవారు ఆ విధంగా 300 సంవత్సరాల వరకు కష్టపడి ప్రజలు ఒక స్వర్గాన్ని నిర్మించారు. అందులో భవనాలు ఏర్పాటు చేశారు రహదారులు నిర్మించారు నీటి కాలువలు నిర్మించారు పండ్ల తోటలు నిర్మించారు సేవకుల్ని ఉంచారు అన్ని సౌకర్యాలు ఉంచారు దానితోపాటు బంగారం అందులో ఉంచారు వెండి ఉంచారు వజ్రాలు ఉంచారు ఈ విధంగా నగలు ఆభరణాలు కూడా అందులో ఉంచారు దానికి ‘ఇరం‘ అని నామకరణం చేశాడు స్వర్గానికి జన్నతుల్ ఫిర్దౌస్ జన్నాతు అద్న్ అని పేర్లు ఉంటాయి కదండీ ఆ విధంగా ఇతను నిర్మించిన స్వర్గానికి అతను ‘ఇరం’ అని నామకరణం చేశాడు.
300 సంవత్సరాల వరకు కష్టపడి ప్రజలు ఒక స్వర్గాన్ని నిర్మించారు నిర్మించబడిన స్వర్గం గురించి రాజుకు తెలియజేశారు రాజు ఏం చేశాడంటే 300 సంవత్సరాల తర్వాత తను కోరుకున్న స్వర్గము నిర్మించబడింది ఆ స్వర్గ ప్రారంభోత్సవానికి వెళ్లడానికి బంధుమిత్రులతో పాటు పయనమయ్యాడు. మార్గ మధ్యంలో ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఒక్క రోజు ప్రయాణము చేస్తే ఒక్క రోజు తర్వాత ఆ స్వర్గానికి చేరుకుంటాడు అనగా దైవ శిక్ష వచ్చి ఆద్ జాతి వారి మీద పడింది ఆ శిక్షలో ఆద్ జాతితో పాటు ఆ రాజు అతని కుటుంబ సభ్యులు బంధు మిత్రులు అందరూ కూడా అక్కడికక్కడే నాశనమైపోయి మరణించారు చనిపోయారు. తను ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న కలల స్వర్గాన్ని అతను చేరుకోలేకపోయాడు ఇంకా ఒక్క రోజు ప్రయాణం ఉందనగానే అంతలోనే అక్కడే అతను చనిపోయాడు మరణించాడు అని చరిత్రకారులు తెలియజేశారు.
ఇక్కడితో పూర్తి కథ ఇంకా పూర్తి కాలేదు. ఆ తర్వాత ఈ స్వర్గానికి సంబంధించిన మరొక విషయం చెప్పబడుతుంది అదేమిటంటే ఈ సంఘటన జరిగిన చాలా వేల సంవత్సరాల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం నలుగురు ఖలీఫాల మరణానంతరం ఎప్పుడైతే అమీరె మావియా ఖలీఫాగా చక్రవర్తిగా ముస్లింలను పరిపాలిస్తున్నారో ఆ రోజుల్లో అబ్దుల్లా బిన్ ఖిలాబా అనే ఒక వ్యక్తి ఒంటెను వెతుక్కుంటూ వెళ్లారు. వెళ్తున్నారు ఒంటెను వెతుకుతున్నారు వెంట ఒంటె ఎక్కడికో పారిపోయింది ఆ పారిపోయిన ఒంటెను వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉంటే ఒక చోట కాలు జారారు కింద పడ్డారు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్లి చూస్తే లోపల భవనాలు ఉన్నాయి అక్కడ వెండి వజ్రాలు బంగారం అన్నీ ఒక పెద్ద నగరాన్ని అక్కడ ఆయన చూశారు. ఆయన ఏం చేశారంటే అందులో నుంచి కొంచెం బంగారము వెండి వజ్రాలు ఇలాంటి ఆభరణాలు తీసుకొని ఏదో ఒక రకంగా కష్టపడి మళ్ళీ బయటికి వచ్చారు.
తరువాత ఆ విషయం తిన్నగా వారి ద్వారా వారి స్నేహితులకి స్నేహితుల ద్వారా బంధుమిత్రులకి బంధుమిత్రుల ద్వారా రాజు వద్దకు చేరిపోయింది. రాజు వద్దకు విషయం చేరినప్పుడు ఆ రాజు గారు అబ్దుల్లా బిన్ ఖిలాబా గారిని పిలిపించి ఏమయ్యా ఏదో సంఘటన జరిగిందంట భూమి లోపల నువ్వు ఎక్కడో కింద పడ్డావంట అక్కడ ఒక పెద్ద నగరం నీకు కనిపించింది అంట అక్కడ నువ్వు బంగారము ఇవన్నీ తీసుకువచ్చావు అంట కదా ఇది ఎక్కడ ఉందో నువ్వు మమ్మల్ని చూపించగలవా అని అడిగితే సరేనండి చూపిస్తాను పదండి అని ఆయన భటులతో పాటు బయలుదేరారు కానీ ఆ ప్రదేశాన్ని ఆయన కనుక్కోలేకపోయారు ఆ ప్రదేశానికి చేరుకోలేకపోయారు అని చెప్పడం జరిగింది.
అయితే ఈ రెండు సంఘటనలు ఎలాంటి సంఘటనలు అంటే ఇవి ప్రామాణికమైనవి కావు అని ధార్మిక పండితులు తేల్చి చెప్పారు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ ప్రస్తావన అక్కడక్కడ కొంతమంది ఈ రాజు గురించి చర్చిస్తూ ఉంటారు తెలియజేస్తూ ఉంటారు అయితే ఇది ప్రామాణికమైన విషయం కాదన్న విషయం మీ దృష్టిలో నేను ఉంచదలిచాను కాబట్టి ఈ పూర్తి కథ వినిపించి దాని వాస్తవాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది.
ముగింపు మరియు సందేశం
అయితే మిత్రులారా ఒక్క విషయం మాత్రం స్పష్టం అదేమిటంటే ఆద్ జాతి వారు చాలా శక్తిమంతులు. ఆ శక్తి సామర్థ్యాలను అల్లాహ్ కోసం అల్లాహ్ ధర్మం కోసం వారు ఉపయోగించలేదు గానీ ప్రపంచంలో వారి ఉనికిని చాటుకోవడానికి వారి శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చూపించడానికి గర్వపడడానికి మాత్రమే ఉపయోగించారు. ఒక రకంగా చెప్పాలంటే అహంకారం ప్రదర్శించారు తత్కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తను పంపి వారిని సంస్కరించేటందుకు ప్రయత్నం చేసినా గానీ వారు ప్రవక్తను విశ్వసించలేదు అల్లాహ్ ను విశ్వసించలేదు కాబట్టి దైవ శిక్షకు గురయ్యారు. ఈ హూద్ అలైహిస్సలాం మరియు ఆద్ జాతి వారి చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అహంకారం ప్రదర్శిస్తే వారు ఎంతటి శక్తి సామర్థ్యం కలిగిన వారైనా సరే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మెచ్చుకోడు వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కఠినంగా శిక్షిస్తాడు.
అలాగే రెండవ విషయం ఏమిటంటే హూద్ అలైహిస్సలాం వారిని జాతి ప్రజలు బెదిరించారు మా ప్రభువులు నీకు ఏదో రోగానికి గురి చేశారు కాబట్టి నువ్వు ఈ విధంగా వ్యాధిగ్రస్తుడిలా మారిపోయి మాట్లాడుతున్నావు అని లేనిపోని విషయాలు చెప్పి ఆయనను బెదిరించే ప్రయత్నం చేశారు అలాంటప్పుడు ఆయన అవునేమో అనుకోలేదు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం కలిగి నాకు లాభ నష్టాలు ఏమి జరిగినా అల్లాహ్ తరఫునే జరుగుతాయి గానీ అల్లాహ్ తప్ప మరెవరికీ లాభాలు నష్టాలు సమకూర్చే అధికారము శక్తి లేదు అన్న విషయాన్ని ప్రపంచానికి ముఖ్యంగా ఆ జాతి ప్రజలకు తెలియజేశారు కాబట్టి మనం కూడా అదే విషయాన్ని నమ్మాలి. మనకు లాభం కలిగినా నష్టం కలిగినా అల్లాహ్ తరఫునే కలుగుతుంది కానీ అల్లాహ్ తప్ప మరెవరి వల్ల అది సాధ్యము కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు “ప్రపంచం మొత్తం కలిపి మీకు సహాయం చేయాలనుకున్నా మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంత సహాయం చేయాలంటే అంతే చేయగలుగుతారు ప్రపంచం మొత్తం కలిసి మీకు నష్టం చేయాలనుకున్నా అల్లాహ్ మీకు ఎంత నష్టం చేయాలనుకుంటాడో అంతే వారు నష్టం చేయగలుగుతారు అంతే తప్ప అల్లాహ్ ఆజ్ఞకు మించి వారు ఏమీ చేయలేరు” అన్న విషయాన్ని తెలియజేశారు కాబట్టి అల్లాహ్ మీద పూర్తి నమ్మకం భక్తులకు ఉండాలి అనేది మనకు ఇక్కడ తెలుపడం జరిగింది.
చివరి విషయం ఏమిటంటే మనిషికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యము అల్లాహ్ పై మరియు ప్రవక్తల పై అల్లాహ్ వాక్యాలపై విశ్వాసము మరియు అనుసరణ ద్వారానే లభిస్తుంది అన్న విషయం తెలుసుకోవాలి.
నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ రుజుమార్గం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక మార్గభ్రష్టత్వానికి గురి కాకుండా సైతాన్ వలలో చిక్కుకోకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అల్లాహ్ మీద పూర్తి నమ్మకం కలిగి భక్తి శ్రద్ధలతో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్.
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
69:6 وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ
69:7 سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ
ఆద్ వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి. (ఖుర్ఆన్ 69 : 6-7)
యమన్, ఒమన్ ల మధ్య ఉన్న ప్రదేశంలో కొండచరియల వద్ద ఆద్ జాతి ప్రజలు చాలా కాలం నివసించారు. వారు శారీరకంగా దృఢకాయులు. భవన నిర్మాణ కౌశలానికి వారు పెట్టింది పేరు. ఎత్తయిన అనేక భవనాలు నిర్మించిన ఘనత వారిది. వారి బలసామర్ధ్యాల వల్ల, వారి సంపద వల్ల మిగిలిన జాతుల కన్నా వారికి విశిష్ట స్థానం లభించింది. కాని భౌతికంగా వారు సాధించిన ప్రగతీ వికా సాలు, వారి శారీరక బలాధిక్యత వారిని అహంకారానికి, గర్వాతిశయానికి గురి చేశాయి. దౌర్జన్యాలు, అన్యాయానికి మారు పేరయిన పాలకుల చేతుల్లో రాజ్యాధికారం ఉండేది. వారికి వ్యతిరేకంగా గొంతువిప్పే సాహసం ఎవరూ చేసేవారు కాదు.
అల్లాహ్ గురించి ఏమీ తెలియని జాతి కాదు వారిది. అలాగే వారు అల్లాహ్ ఆరాధనను పూర్తిగా నిరాకరించనూ లేదు. కాని వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, అంటే ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడాన్ని నిరాకరించారు. అల్లాహ్ పాటు వారు అనేక దేవీదేవతలను ఆరాధించేవారు. ఇది మహాపరాధం, అల్లాహ్ ఎంతమాత్రం సహించని అపరాధం ఇది.
అల్లాహ్ ఈ ప్రజలకు మార్గదర్శకత్వం అందించాలని, వారికి హితబోధ చేయాలని నిర్ణయించి, వారిలో ఒకరిని దైవప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయనే హూద్ (అలైహిస్సలాం). ఆయన తనకు అప్పగించిన పనిని నిబద్ధతతో, దృఢసంకల్పంతో, సహనంతో నిర్వర్తించారు. ఆయన విగ్రహారాధనను ఖండించారు. ప్రజలకు బోధిస్తూ, “ప్రజలారా! ఈ రాళ్ళ వల్ల లాభం ఏముంది? మీ స్వంత చేతులతో . మీరు చెక్కే వీటి వల్ల ప్రయోజనం ఏముంటుంది? నిజానికి ఇలా చేయడం మీ వివేకవివేచనలను పరాభవించుకోవడమే అవుతుంది. దేవుడు కేవలం ఒకే ఒక్కడు. ఆయనే ఆరాధనకు అర్హుడు. ఆయనే అల్లాహ్. ఆయన్ను మాత్రమే ఆరాధించడం మీ బాధ్యత. ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. ఆయనే మీకు పోషణనిస్తున్నాడు. ఆయనే మీకు జీవన్మరణాలు ఇస్తున్నాడు” అని చెప్పారు. ‘అల్లాహ్ మీకు అద్భుతమైన శారీరక శక్తిని ప్రసాదించాడు. అనేక విధాలుగా మిమ్మల్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవుణ్ణి విశ్వసించండి. ఆయన మీకు ప్రసాదించిన అనుగ్రహాల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. లేకపోతే నూహ్ జాతి ప్రజలకు పట్టిన దుర్గతి మీకూ పట్టవచ్చు అని వారిని హెచ్చరించారు.
అజ్ఞానుల వాదన
హేతుబద్ధమైన వాదనతో హూద్ ప్రవక్త (అలైహిస్సలాం) ప్రజల్లో దైవవిశ్వాసాన్ని పాదుకొల్పడానికి ప్రయత్నించారు. కాని వారు ఆయన సందేశాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. పైగా హూద్ (అలైహిస్సలాం)తో వాదనకు దిగారు. “హూద్ ! నీవు చెబుతున్న దేమిటి? ఈ దేవీదేవతలు అల్లాహ్ తో మా తరఫున సిఫారసు చేస్తాయి” అని. దబాయించారు. హూద్ (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “ప్రజలారా! అందరి దేవుడు అల్లాహ్ ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. ఆయన మీ బృహద్ధ మనికన్నా మీకు దగ్గరగా ఉన్నాడు. ఈ విగ్రహాలు మీ కోసం సిఫారసు చేయలేవు. వీటిని ఆరాధించడం వల్ల మీరు అల్లాహు మరింత దూరం అవుతారు. మేము చాలా తెలివైన వాళ్ళం అని మీరు భావిస్తున్నారేమో! కాని మీ విశ్వాసాలు మీ అజ్ఞానాన్ని చాటిచెబుతున్నాయి” అన్నారు.
నిష్పలం
కాని వారు హూద్ (అలైహిస్సలాం) మాటలను తిరస్కరించారు. ఆయన్ను ఎగతాళి చేశారు. “హూద్! నీవు కూడా మాలాంటి మామూలు మనిషివే. అలాంటప్పుడు అల్లాహ్ నీకు మాత్రమే ప్రవక్త పదవీ బాధ్యతలను అనుగ్రహించాడా? అలా ఎన్నటికీ జరగదు. నువ్వు అబద్ధాలాడుతున్నావు” అన్నారు. హూద్ (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “నేను నా జీవితమంతా మీ మధ్యనే గడిపాను. నా వివేకవివేచనలను మీలో ఎవ్వరూ ప్రశ్నించలేదు. అల్లాహ్ నన్ను హెచ్చరించేవానిగా, మార్గం చూపేవానిగా ఎన్నుకున్నాడు. అల్లాహ్ ఒక్కడే. ఆయన ఏకత్వం అన్నది విశ్వం లోని ప్రతి వస్తువులోనూ కనబడుతుంది. ప్రతి వస్తువులోనూ ఒక సూచన ఉంది. కాబట్టి ఆయన్ను విశ్వసించండి. ఆయన్ను క్షమాభిక్ష కొరకై అర్థించండి. ఆయన కారుణ్యానికి దూరం కావద్దు. పరలోకం కొరకు ఏర్పాట్లు చేసుకోండి. మీకు వైభవోపేతమైన ఎత్తయిన భవనాలు ఉన్నాయి. ఈ భవనాలు మీ శక్తిని, మీ సంపదను చాటిచెబుతున్నాయి. కాని వీటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇవి కేవలం మీ వైభవానికి చిహ్నాలైన అవశేషాలుగా మిగిలిపోతాయి. మీరు మీ సంపదను, మీ నైపుణ్యాలను ఎలాంటి జీవిత లక్ష్యం లేకుండా వెచ్చిస్తున్నారు. మీరు శాశ్వతంగా ఇక్కడే ఉంటారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీరు కేవలం సుఖవిలాసాల కోసం ప్రాకులాడుతున్నారు” అని హెచ్చరించారు. కాని ఆ ప్రజలు ఆయన బోధనలను పెడచెవిన పెట్టారు. హూద్ (అలైహిస్సలాం) తన ప్రచారోద్యమం నిష్ఫలమయ్యిందని గుర్తించారు. ఆయన వారితో, “అల్లాహ్ ముందు సాక్షులుగా ఉండండి. నేను దైవసందేశాన్ని మీకు అందజేశాను. నేను నా ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉంటాను. మీ బెదిరింపులకు భయపడను. నేను కేవలం అల్లాహు మాత్రమే భయపడతాను” అన్నారు.
ఒక రోజు వారు ఆకాశాన్ని ఒక నల్లమబ్బు కప్పివేయడాన్ని చూశారు. వర్షం వస్తుందని వారు భావించారు. ఈ తొలకరి వర్షానికి పొలాలను సిద్ధం చేసుకోవాలనుకున్నారు. హూద్ (అలైహిస్సలాం) వారిని హెచ్చరించారు. ఇది దేవుని కరుణ వల్ల వచ్చిన మేఘం కాదు. ఇది అభిశాపంగా వస్తున్న గాలివాన. ఇది బాధాకరమైన శిక్షను తీసుకువస్తుంది. దీని గురించే నేను మీకు హెచ్చరికలు చేశాను అన్నారు.
భయంకరమైన తుఫాను గాలి ఎనిమిది పగళ్ళు, ఏడు రాత్రులు కొనసాగింది. ఆ ప్రాంతం యావత్తు శిథిలమయంగా మారే వరకు అది ఆగలేదు. అక్కడి దుర్మార్గ ప్రజలు అందరూ వినాశం పాలయ్యారు. ఎడారి ఇసుక వారిని ముంచెత్తింది. కేవలం హూద్ (అస), ఆయన అనుచరులు మాత్రం బ్రతికి బయటపడ్డారు. వారు అక్కడి నుంచి ‘హద్రమౌత్’కు వలస పోయారు. వారు అక్కడ ఒకేదేవుడు అల్లాహ్ ను ఆరాధిస్తూ శాంతియుతంగా జీవించారు.
(చదవండి దివ్యఖుర్ఆన్: 7:65-72, 11:50-60, 26:123-140)
గ్రహించవలసిన పాఠాలు
ఇటీవల స్పేస్ షటిల్ నుంచి తీసుకున్న ఆధునిక రాడార్ ఇమేజ్ల వల్ల లభించిన వైజ్ఞానిక ఆధారాలతో దక్షిణ ఓమ్మాన్ ని ఉబార్ వద్ద ఎనిమిది ఎత్తయిన టవర్లను కనిపెట్టడం జరిగింది. ఈ ప్రాంతాన్ని “ఖాళీ ప్రదేశం” (ఎంప్టీ క్వార్టర్)గా పిలువడం జరుగుతుంది. ఈ సంఘటన దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వం జరిగిందని భావిస్తున్నారు. ఒక్క దివ్యఖుర్ఆన్ తప్ప మరో మతగ్రంథం లేదా ధార్మిక పుస్తకం ఏదీ ఈ పట్టణం పతనాన్ని ప్రస్తావించలేదు.
[క్రింది భాగం అహ్సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది]
ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:
7:65 وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۚ أَفَلَا تَتَّقُونَ
మేము ఆద్జాతి వద్దకు వారి సోదరుడైన హూద్ను పంపాము. “నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరలాంటప్పుడు మీరు భయపడరా?” అని అతను చెప్పాడు.
7:66 قَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ إِنَّا لَنَرَاكَ فِي سَفَاهَةٍ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ الْكَاذِبِينَ
దానికి అతని జాతిలోని అవిశ్వాస సర్దారులు, “నువ్వు మాకు తెలివి తక్కువ వానిలా కనిపిస్తున్నావు. పైగా నువ్వు అబద్ధాల కోరువని మా అభిప్రాయం” అన్నారు.
7:67 قَالَ يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
“ఓ నా జాతివారలారా! నాలో ఏ మాత్రం తెలివితక్కువ తనం లేదు. నేను సకల లోకాల ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను.
7:68 أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ
“నా ప్రభువు సందేశాలను మీకు చేరవేసేవాణ్ణి. మీరు నమ్మదగ్గ మీ శ్రేయోభిలాషిని.
7:69 أَوَعَجِبْتُمْ أَن جَاءَكُمْ ذِكْرٌ مِّن رَّبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِّنكُمْ لِيُنذِرَكُمْ ۚ وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِن بَعْدِ قَوْمِ نُوحٍ وَزَادَكُمْ فِي الْخَلْقِ بَسْطَةً ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ
“ఏమిటీ, మిమ్మల్ని హెచ్చరించటానికి స్వయంగా మీనుండే ఒక వ్యక్తి ద్వారా, మీ ప్రభువు తరఫునుండి మీ వద్దకు హితోపదేశం రావటం మీకు ఆశ్చర్యం కలిగించిందా? అల్లాహ్ మిమ్మల్ని నూహ్ జాతి అనంతరం వారసులుగా చేసి, మీకు ఎక్కువ శరీర సౌష్ఠవాన్ని ప్రసాదించిన సంగతిని గుర్తుంచుకోండి. అల్లాహ్ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందుతారు” అని హూద్ బోధపరచాడు.
7:70 قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا ۖ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
“మేము అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలనీ, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదలివేయమని (చెప్పటానికేనా) నువ్వు మా వద్దకు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే ఏ శిక్షను గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం” అని వారు అన్నారు.
7:71 قَالَ قَدْ وَقَعَ عَلَيْكُم مِّن رَّبِّكُمْ رِجْسٌ وَغَضَبٌ ۖ أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا نَزَّلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ
అప్పుడు హూద్ ఇలా అన్నాడు : “ఇక మీ ప్రభువు శిక్ష, ఆయన ఆగ్రహం మీపై విరుచుకుపడినట్లే. ఏమిటీ, మీరూ మీ తాతముత్తాతలూ కల్పించుకున్న పేర్ల విషయంలో నాతో గొడవపడుతున్నారా? వాటి గురించి (అవి ఆరాధ్య దైవాలని నిర్థారించే) ఏ ప్రమాణాన్నీ అల్లాహ్ అవతరింపజెయ్యలేదు. కాబట్టి మీరూ నిరీక్షించండి, మీతోపాటు నేను కూడా నిరీక్షిస్తాను.”
7:72 فَأَنجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَقَطَعْنَا دَابِرَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ وَمَا كَانُوا مُؤْمِنِينَ
ఎట్టకేలకు మేము అతన్నీ, అతని సహచరులను మా కృపతో కాపాడాము. అయితే మా ఆయతులు అబద్ధాలంటూ కొట్టి పారేసినవారి వేరును త్రెంచివేశాము. వారు ఎట్టి పరిస్థితిలోనూ విశ్వసించేవారు కారు.
11:50 وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ إِنْ أَنتُمْ إِلَّا مُفْتَرُونَ
మరి మేము ఆద్ జాతి వైపుకు వారి సోదరుడైన హూద్ను పంపాము. అతను (తన వారినుద్దేశించి) ఇలా అన్నాడు: “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీరు కల్పించేవన్నీ అబద్ధాలు తప్ప మరేమీ కావు.”
11:51 يَا قَوْمِ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى الَّذِي فَطَرَنِي ۚ أَفَلَا تَعْقِلُونَ
“ఓ నాజాతి ప్రజలారా! ఈ పనికై నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత నన్నుసృష్టించిన వానిదే. అయినప్పటికీ మీరు వివేకవంతులుగా వ్యవహరించరే?!”
11:52 وَيَا قَوْمِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَىٰ قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا مُجْرِمِينَ
“ఓ నా జాతి వారలారా! మీ పోషకుని (అంటే అల్లాహ్) సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై (ఆకాశం నుండి) ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తినీ, బలాన్నీ చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి.”
11:53 قَالُوا يَا هُودُ مَا جِئْتَنَا بِبَيِّنَةٍ وَمَا نَحْنُ بِتَارِكِي آلِهَتِنَا عَن قَوْلِكَ وَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ
దానికి వారు, “ఓ హూద్! నువ్వు మావద్దకు ఏ నిదర్శనాన్నీ తేలేదు. నువ్వు (నోటితో) చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదలి పెట్టలేము. నిన్ను మేము విశ్వసించబోవటం లేదు.
11:54 إِن نَّقُولُ إِلَّا اعْتَرَاكَ بَعْضُ آلِهَتِنَا بِسُوءٍ ۗ قَالَ إِنِّي أُشْهِدُ اللَّهَ وَاشْهَدُوا أَنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ
పైగా మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురిచేసి ఉంటారని మేము అనుకుంటున్నాము” అని పలికారు. అప్పుడు హూద్ ఇలా సమాధానమిచ్చాడు: “అల్లాహ్ తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసుగెత్తి పోయాను. (వారితో నాకెలాంటి సంబంధం లేదు). నేను ఈ విషయానికి అల్లాహ్ను సాక్షిగా పెడుతున్నాను, మీరు కూడా దీనికి సాక్షులుగా ఉండండి.”
11:55 مِن دُونِهِ ۖ فَكِيدُونِي جَمِيعًا ثُمَّ لَا تُنظِرُونِ
“సరే. మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకు ఏమాత్రం కూడా గడువు ఇవ్వకండి.
11:56 إِنِّي تَوَكَّلْتُ عَلَى اللَّهِ رَبِّي وَرَبِّكُم ۚ مَّا مِن دَابَّةٍ إِلَّا هُوَ آخِذٌ بِنَاصِيَتِهَا ۚ إِنَّ رَبِّي عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
“నేను కేవలం అల్లాహ్నే నమ్ముకున్నాను. ఆయన నాకూ ప్రభువే. మీ అందరికీ ప్రభువే. ప్రతి ప్రాణి యొక్క జుట్టు ఆయన చేతిలోనే ఉంది. నిశ్చయంగా నా ప్రభువు సన్మార్గాన ఉన్నాడు.
11:57 فَإِن تَوَلَّوْا فَقَدْ أَبْلَغْتُكُم مَّا أُرْسِلْتُ بِهِ إِلَيْكُمْ ۚ وَيَسْتَخْلِفُ رَبِّي قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّونَهُ شَيْئًا ۚ إِنَّ رَبِّي عَلَىٰ كُلِّ شَيْءٍ حَفِيظٌ
ఒకవేళ మీరు మరలి పోదలిస్తే (పొండి), నేను మాత్రం నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను. నా ప్రభువు మీ స్థానంలో ఇంకొకరిని తీసుకువస్తాడు. మీరు ఆయనకు ఏవిధమైన కీడూ కలిగించలేరు. నిస్సందేహంగా నా ప్రభువు అన్నింటినీ పర్యవేక్షిస్తున్నాడు.”
11:58 وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا هُودًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَنَجَّيْنَاهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ
మరి మా ఆజ్ఞ (అమల్లోకి) వచ్చినప్పుడు మేము హూద్నూ, అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులనూ మా ప్రత్యేక కృపతో కాపాడాము. ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము.
11:59 وَتِلْكَ عَادٌ ۖ جَحَدُوا بِآيَاتِ رَبِّهِمْ وَعَصَوْا رُسُلَهُ وَاتَّبَعُوا أَمْرَ كُلِّ جَبَّارٍ عَنِيدٍ
ఇదీ ఆద్ జాతి (వృత్తాంతం). వీరు తమ ప్రభువు ఆయతులను త్రోసి పుచ్చారు. ఆయన ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడ్డారు. ఇంకా అహంకారి, అవిధేయీ అయిన ప్రతివ్యక్తినీ వారు అనుసరించారు.
11:60 وَأُتْبِعُوا فِي هَٰذِهِ الدُّنْيَا لَعْنَةً وَيَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا إِنَّ عَادًا كَفَرُوا رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّعَادٍ قَوْمِ هُودٍ
ప్రపంచంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయదినాన కూడా అది (వారిని) వెన్నంటి ఉంటుంది. చూడండి! ఆద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. హూద్ జాతి వారైన ఆదు జనులు (దైవ కారుణ్యానికి) దూరం చెయ్యబడ్డారు.
—
26:123 كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ
ఆద్ జాతి వారు (కూడా) దైవ ప్రవక్తలను ధిక్కరించారు.
26:124 إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ
అప్పుడు వారి సోదరుడైన హూద్, (వారినుద్దేశించి) ఇలా అన్నాడు : “మీరు బొత్తిగా భయపడరా?
26:125 إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
“నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్థుణ్ణి అయిన ప్రవక్తను.
26:126 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
“కనుక అల్లాహ్కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.
26:127 وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
“ఈ పనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుపై ఉంది.
26:128 أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ
“ఏమిటీ, మీరు ఎత్తయిన ప్రతి స్థలంలోనూ ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తారా?
26:129 وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ
“మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు అపురూపమైన (పటిష్టమైన) భవనాలను నిర్మిస్తున్నారే!
26:130 وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ
“మీరు ఎప్పుడు, ఎవరిని పట్టుకున్నా చాలా దౌర్జన్య పూరితంగా పంజా విసురుతున్నారే!?
26:131 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
“కనుక, మీరు అల్లాహ్కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.
26:132 وَاتَّقُوا الَّذِي أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ
“మీకు తెలిసివున్న సమస్త (మంచి) వస్తువులను మీకు వొసగి, మిమ్మల్ని ఆదుకున్న వానికి భయపడండి.
26:133 أَمَدَّكُم بِأَنْعَامٍ وَبَنِينَ
“ఆయన మీకు పశువుల ద్వారా, సంతానం ద్వారా తోడ్పడ్డాడు.
26:134 وَجَنَّاتٍ وَعُيُونٍ
“తోటల ద్వారా, చెలమల ద్వారా (సహాయపడ్డాడు).
26:135 إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
“నేను మీ విషయంలో ఒక మహా దినపు శిక్ష గురించి భయపడుతున్నాను.”
26:136 قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ
వారిలా అన్నారు : “నువ్వు మాకు బోధించినా, బోధించే వారిలో ఒకడవు కాకపోయినా మాకు ఒకటే.
26:137 إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ
“ఇది పూర్వీకుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు.
26:138 وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
“ఎట్టి పరిస్థితిలోనూ మేము శిక్షించబడము.”
26:139 فَكَذَّبُوهُ فَأَهْلَكْنَاهُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
ఆద్ (జాతి) వారు అతనిని (హూదును) ధిక్కరించిన కారణంగా మేము వారిని అంతమొందించాము. నిశ్చయంగా ఇందులో సూచన ఉంది. కాని వారిలో అనేకులు విశ్వాసులు కాలేదు.
26:140 وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
మరి నిస్సందేహంగా నీ ప్రభువు అపార శక్తిసంపన్నుడు, పరమ కృపాశీలుడు.
—
ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets
ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8