సహనం, తృప్తి, నిరపేక్షాభావం అలవరచుకొని పరుల ముందు చేయి చాపకుండా ఆత్మ గౌరవంతో బతకండి

26. హజ్రత్‌ అబూ సయీద్‌ సాద్‌ బిన్‌ సినాన్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హు ) కథనం :

కొంత మంది అన్సారులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను యాచించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారడిగింది ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ యాచించారు. అప్పుడు కూడా ఆయన వారికి (ఎంతోకొంత) ఇచ్చారు. ఆఖరికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గర ఉన్నదంతా అయిపోయింది. తన చేతిలో ఉన్నదంతా అయిపోయిన తరువాత ఆయన వారితో ఇలా అన్నారు:

నా వద్దకు ఏ కొంత ధనమొచ్చినా నేను దాన్ని నిల్వ చేసి ఉంచుకోను. ఎవడైతే యాచించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడో అల్లాహ్‌ అతన్ని కాపాడుతాడు. నిరపేక్షాభావం అలవరచుకోవాలనుకున్న వ్యక్తిని అల్లాహ్‌ నిరపేక్షాపరునిగా చేస్తాడు. సహనం కోరే వ్యక్తికి అల్లాహ్‌ సహనం వహించే సద్బుద్దిని ప్రసాదిస్తాడు. మనిషికి ఇవ్వబడిన కానుకల్లో ఓర్పును మించిన మేలైన, విశాలమైన కానుక మరొకటి లేదు. “

(బుఖారీ – ముస్లిం). (సహీహ్ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం. సహీహ్ ముస్లింలోని జకాత్‌ ప్రకరణం)

ముఖ్యాంశాలు:

ఈ హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)గారి దాతృత్వం, ఉదాత్త గుణం, హృదయ విశాలత మరియు ఉన్నత నైతికపు విలువలను గురించి ప్రస్తావించడం జరిగింది. అంతేగాకుండా సహనం, తృప్తి, నిరపేక్షాభావం మొదలగు సుగుణాలను అలవరచుకొని పరుల ముందు చేయి చాపకుండా ఆత్మ గౌరవంతో బతకాలని కూడా ఈ హదీసులో చెప్పబడింది.

నుండిసహనం , ఓర్పు –  హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి (Riyadh-us-Saaliheen)

ఆపద ప్రారంభంలో వహించే సహనమే సహనం

533. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఓ రోజు ఒక స్త్రీ సమాధి మీద కూర్చొని ఏడుస్తుంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అటుగా పోవడం జరిగింది. అపుడు ఆయన ఆ స్త్రీని చూసి “అల్లాహ్ కి భయపడి కాస్త సహనం వహించు” అని అన్నారు. దానికి ఆ స్త్రీ (ముఖం చిట్లించుకుంటూ) “మీ దారిన మీరు వెళ్ళండి, నన్ను నా మానాన వదిలెయ్యండి. నా మీద వచ్చిపడిన ఆపద మీ మీద రాలేదు. అందువల్ల మీరు (నా) బాధను అర్ధం చేసుకోలేరు” అని అన్నది.

తరువాత (కొందరు) ఆ స్త్రీకి ‘ఆయనగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)’ అని తెలియజేశారు. అది విని ఆమె (పరుగుపరుగున) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికి వెళ్ళింది. చూస్తే ఆయన వాకిలి ముందు ఒక్క ద్వారపాలకుడు కూడా లేడు. సరే, ఆ మహిళ [దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను కలుసుకొని] “నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను (క్షమించండి)” అని అన్నది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఆపద ప్రారంభంలో వహించే సహనమే (అసలు) సహనం”(*) అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయేజ్, 32 వ అధ్యాయం – జియారతుల్ ఖుబూర్]

(*) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచానానికి భావం ఏమిటంటే – నీ వన్న మాటలకు నువ్వు క్షమాపణ చెప్పుకోనవసరం లేదు. నేను స్వవిషయం గురించి ఎవరి మీద కోపగించుకోను. నా ఇష్టాఇష్టాలన్నీ ధైవప్రసన్నత కోసమే పరిమితం. కాకపోతే నువ్వు కష్ట సమయంలో సహనం వహించకుండా ఏడ్పులు పెడబొబ్బలు పెట్టి నీకు దక్కే పుణ్యాన్ని పోగొట్టుకున్నావు. ఇది నీ పొరపాటు. నా విషయంలో నీవు చేసిన పొరపాటు క్షమించబడింది. కాని ధైవధర్మం విషయంలోనే నీవు పొరబడ్డావు. ఆపద ప్రారభంలో సహనం వహించి ఉంటే పుణ్యం లభించి ఉండేది. నువ్వలా చేయలేకపోయావు.

జనాయెజ్ ప్రకరణం : 8 వ అధ్యాయం – ఆపద ప్రారంభంలో వహించే సహనమే సహనం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ముష్టి ఎత్తకుండా లేమిలో సహనం వహించడం

627. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) కధనం:-

కొందరు అన్సార్ ముస్లింలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి కొంత ధనం అర్ధించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఇచ్చారు. కానీ వారు మళ్ళీ అడిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండోసారి కూడా ఇచ్చారు. ఇలా ఇస్తూపోయారు, చివరికి ఆయన దగ్గర ఉన్నదంతా హరించుకుపోయింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు :

“నా దగ్గరున్న ధనసంపద (ఎంతైనా) మీ కివ్వడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. మీకు ఇవ్వకుండా నేను ఏదీ దాచుకోను. కాని (ఒక విషయం గుర్తుంచుకోండి) దానం అడగకుండా ఉండే వాడికి దేవుడు అలాంటి పరిస్థితి రాకుండా  కాపాడుతాడు. నిరపేక్షా వైఖరిని అవలంబించే వాడికి దేవుడు అక్కరలేనంత ప్రసాదిస్తాడు. సహనం  వహించే వాడికి సహనశక్తి ప్రసాదిస్తాడు. (దైవానుగ్రహాలలో) సహనానికి మించిన మహాభాగ్యం లేదు.”

సహీహ్ బుఖారీ : 24 వ ప్రకరణం – జకాత్, 50 వ అధ్యాయం – అల్ ఇస్తిఫాఫి అనిల్ మస్అల

జకాత్ ప్రకరణం : 42 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్