త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (3) – ‘చూపుగోలుతనం’ లేదా ప్రదర్శనా బుద్ధి (రియా) | మరణానంతర జీవితం : పార్ట్ 44 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (3) – ‘చూపుగోలుతనం’ లేదా ప్రదర్శనా బుద్ధి (రియా)
[మరణానంతర జీవితం – పార్ట్ 44]
https://www.youtube.com/watch?v=gOF9pfhteUE [21 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రళయ దినాన కర్మల త్రాసును తేలికపరిచే పాప కార్యాల గురించి వివరించబడింది. ముఖ్యంగా, ‘చూపుగోలుతనం’ లేదా ప్రదర్శనా బుద్ధి (రియా) అనే పాపంపై దృష్టి సారించారు. అల్లాహ్ కోసం కాకుండా ఇతరుల ప్రశంసలు, పేరు ప్రఖ్యాతుల కోసం చేసే సత్కార్యాలను అల్లాహ్ తిరస్కరిస్తాడని ఒక హదీథ్ ద్వారా స్పష్టం చేయబడింది. దీని తీవ్రతను వివరిస్తూ, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఒక సుదీర్ఘ హదీథ్ ను ప్రస్తావించారు. దాని ప్రకారం, ప్రళయ దినాన అల్లాహ్ ముందు తీర్పు కోసం నిలబెట్టబడే తొలి ముగ్గురు: ఖురాన్ పారాయణం చేసినవాడు, ధనాన్ని దానం చేసినవాడు మరియు అల్లాహ్ మార్గంలో పోరాడినవాడు. అయితే, వీరు తమ కార్యాలను ప్రజల మెప్పు కోసం చేసినందున, వారి సత్కార్యాలు నిరర్థకమై, నరకాగ్నికి గురవుతారు. ఈ హదీథ్ విని ముఆవియా (రదియల్లాహు అన్హు) తీవ్రంగా ప్రభావితమై, సూరహ్ హూద్ లోని ఆయతులను పఠించిన వృత్తాంతాన్ని కూడా వివరించారు. దానధర్మాలు, హజ్-ఉమ్రా, ఖుర్బానీ వంటి అనేక ఆచరణలలో ప్రదర్శనా ధోరణుల పట్ల జాగ్రత్త వహించాలని ప్రసంగం ముగుస్తుంది.

అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహి కఫా, వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీ నస్తఫా, అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ప్రళయ దినాన త్రాసును బరువుగా చేసే సత్కార్యాలు ఏమిటో ఈ శీర్షికలోని ఒక ముఖ్య విషయం, ఏ పాప కార్యాల వల్ల మన త్రాసు తేలికగా అయి మీదికి లేసిపోతుందో, బరువుగా ఉండదో, అలాంటి పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము.

మొదటి విషయం కుఫ్ర్, షిర్క్ మరియు ధర్మభ్రష్టత. వాటిలోని కొన్ని భాగాలను మనం తెలుసుకున్నాము. రెండవది చూపుగోలుతనం.

మీకు గుర్తుండాలి, త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో ఇఖ్లాస్, సంకల్ప శుద్ధి అని మనం తెలుసుకున్నాము. దానికి అపోజిట్, విరుద్ధమైన విషయం చూపుగోలుతనం. పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఏదైనా సత్కార్యం చేయడం. ఇది మన ఆ సత్కార్య సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది. ఈ విధంగా ఆ చేసిన సత్కార్యం పుణ్యాల త్రాసులో ఉండి బరువుగా ఉండేదానికి బదులుగా పాపంలో లెక్కించబడుతుంది, త్రాసు తేలికగా అయిపోతుంది.

ఒకసారి ఈ హదీథ్ పై మీరు కూడా శ్రద్ధ వహించండి. అల్లాహ్ త’ఆలా తెలియజేశాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.

أَنَا أَغْنَى الشُّرَكَاءِ عَنِ الشِّرْكِ
[అన అగ్నష్ షురకాఇ అనిష్ షిర్క్]
భాగస్వాములలో భాగస్వామ్యానికి అందరికంటే ఎక్కువ అతీతున్ని, నిరపేక్షాపరుడిని నేనే”

مَنْ عَمِلَ عَمَلاً أَشْرَكَ فِيهِ مَعِي غَيْرِي تَرَكْتُهُ وَشِرْكَهُ
[మన్ అమిల అమలన్ అష్రక ఫీహి మ’ఈ గైరీ, తరక్తుహు వ షిర్కహు]
ఎవరైతే ఏదైనా కార్యం సత్కార్యం చేస్తాడో, అందులో నాతో పాటు ఇతరులను భాగస్వామిగా చేస్తాడో, నేను అతడిని అతడి భాగస్వామిని అన్నిటిని వదిలేస్తాను, అలాంటి సత్కార్య అవసరం నాకు లేదు, దాని యొక్క సత్ఫలితం కూడా నేను అతనికి ప్రసాదించను.

ఎంత నష్టం గమనించండి. అల్లాహ్ సంతృష్టి కొరకు మనం ఆ కార్యం చేయకుండా, దాని యొక్క లాభం ఇహలోకంలో ఎవరితోనైనా పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో చేస్తే ఎంత నష్టానికి మనం గురి అవుతున్నాము.

ఇంకా మహాశయులారా, ఈ హదీథ్ సహీ ముస్లిం షరీఫ్ లోనిది. కానీ ఇంతకంటే మరీ ఘోరమైన, ఇంతకంటే మరీ ఘోరమైన గతి, ఈ ప్రదర్శనా బుద్ధితో, చూపుగోలుతనంతో పేరు ప్రఖ్యాతుల గురించి ఏదైనా సత్కార్యం చేశామంటే ఎలాంటి శిక్షను ఎదుర్కోవలసి వస్తుందో, ఎలాంటి నరకంలో పడవలసి వస్తుందో మీరు ఈ హదీథ్ ద్వారా వినే ప్రయత్నం చేసి అర్థం చేసుకోండి.

జామె తిర్మిజీలో వివరంగా ఈ హదీథ్ ఉంది. పోతే దీని యొక్క కొన్ని భాగాలు సంక్షిప్తంగా సహీ ముస్లిం షరీఫ్ లో కూడా ఉంది. జామె తిర్మిజీ హదీథ్ నెంబర్ 2382.

షుఫయ్యా అల్ అస్బహీ రహిమహుల్లాహ్ ఉల్లేఖనం ప్రకారం, నేను మదీనా తయ్యిబా నగరానికి వచ్చాను. మస్జిద్-ఎ-నబవీలో ఒక వ్యక్తి చుట్టూనా చాలామంది పోగై ఉన్నారు. ఆ మధ్యలో ఉన్న వ్యక్తి అందరికీ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథులు వినిపిస్తున్నారు. నేను కూడా చోటు చేసుకొని అతనికి దగ్గరగా కూర్చున్నాను. హదీథులు వినిపించడం సమాప్తం అయ్యాక, ఒక్కొక్కరు ప్రజలందరూ కూడా లేచి పోయ్యాక, ఆయన ఒంటరిగా అయిన తర్వాత నేను ఆయనతో అడిగాను, నేను అల్లాహ్ యొక్క ప్రమాణం చేసి నిన్ను అడుగుతున్నాను, నీవు స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో విని, అర్థం చేసుకొని, గ్రహించి ఉన్న ఏదైనా హదీథ్ ఉంటే నాకు వినిపించండి అని.

అప్పుడు హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు, “సరే మంచిది, నేను స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో నా చెవులతో విన్న ఒక హదీథ్ ను, అర్థం చేసుకున్న హదీథ్ ను నీకు వినిపిస్తాను” అని అన్నారు. ఒక కేక వేశారు, స్పృహ తప్పి పడిపోయారు. కొంతసేపటి తర్వాత ఆయన, మరోసారి, “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో విన్న హదీథ్ ను, దానిని అర్థం చేసుకున్న హదీథ్ ను నీకు వినిపిస్తాను” అని అన్నారు. కేక వేశారు, మళ్లీ స్పృహ తప్పారు. మరి కొంత సేపటికి తర్వాత ఆయన మూడోసారి అలాగే అని, మూడోసారి కూడా స్పృహ తప్పారు.

ఇక ఆ తర్వాత అతను స్పృహ స్థితి నుండి బయటికి వచ్చి, ఏం చెప్పారు? “నేను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఇంట్లో ఉండగా, అప్పుడు నేను తప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇంకా ఎవరూ లేరు, నేను ఈ హదీథ్ ను విన్నాను” అని మళ్లీ ఒక కేక వేశారు, స్పృహ తప్పిపోయారు. ఇక నేను ఒకవేళ ఆయన్ని ఆనుకొని పట్టుకోకుంటే పడిపోయేవారు. కొంతసేపటి వరకు నేను అలాగే అతన్ని పట్టుకొని ఉన్నాను. ఆ తర్వాత ఆయన మేల్కొన్నారు. ఆ తర్వాత చెప్పారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు అని.

ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ప్రజల మధ్యలోకి వస్తాడు, వారి యొక్క తీర్పు చేయడానికి. అప్పుడు ఇహలోకంలో ఎన్ని జాతులు, ఎన్ని కులాలు, ఎవరెవరు ఎలా వచ్చారో అక్కడ ఎన్నో సంఘాలు, వారు తమ యొక్క మోకాళ్ళ మీద ఆ మహా మైదానంలో వచ్చి అల్లాహ్ యొక్క తీర్పు గురించి వేచిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సందర్భంలో అల్లాహ్ త’ఆలా తొలిసారిగా ప్రజలందరి మధ్యలో నుండి ఒక వ్యక్తిని పిలుస్తాడు. అతడు ఎవడు? ఖురాన్ కంఠస్థం చేసిన వ్యక్తి, ఖురాన్ పారాయణం చేసే వ్యక్తి మరియు ఖురాన్ పట్ల శ్రద్ధ కలిగి ఉన్న వ్యక్తి.

అల్లాహ్ త’ఆలా ఆయన్ని పిలిచి, “నేను నీకు ఖురాన్ యొక్క విద్య ప్రసాదించాను కదా? నీవు దీనిని నమ్ముతావా? నా యొక్క ఈ అనుగ్రహాన్ని తిరస్కరిస్తావా?” అప్పుడు అతను అంటాడు, “లేదు ఓ అల్లాహ్, నేను తిరస్కరించను. నీవు నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించావు, నేను ఒప్పుకుంటాను.” అప్పుడు అల్లాహ్ అడుగుతాడు, “నా ఈ అనుగ్రహానికి బదులుగా నీవు ఎలాంటి కృతజ్ఞత తెలిపావు?” అప్పుడు అతను అంటాడు, “ఓ అల్లాహ్, నేను నీ కొరకే ఈ ఖురాన్ పారాయణం చేశాను. ప్రజలను ఈ ఖురాన్ వైపునకు ఆహ్వానించేవాణ్ణి, ప్రజలకు ఖురాన్ చదవడం నేర్పేవాణ్ణి.”

అప్పుడు అల్లాహ్ ఏమంటాడు? “నీవు అబద్ధం పలుకుతున్నావు, అసత్యం మాట్లాడుతున్నావు.” అప్పుడు దైవదూతలు కూడా అంటారు అతనితో, “నీవు అసత్యం పలుకుతున్నావు” అని. అప్పుడు అల్లాహ్ అంటాడు, “ఖురాన్ పారాయణం చేయడం, ప్రజలకు ఇది నేర్పడం, దీని యొక్క ఉద్దేశం నీది ఏమంటే ప్రజలు నిన్ను ఓ ఖారీ సాబ్, ఓ ఖారీ సాబ్ అని నీ పేరు ప్రఖ్యాతుల గురించి, ఇహలోకంలో గొప్ప పేరు సంపాదించాలన్న ఉద్దేశంతో నీవు చదివేవానివి. అల్లాహ్ ప్రసన్నత కొరకు కాదు.” ఓ అల్లాహ్, నీ కరుణా కటాక్షాలతో మమ్మల్ని ఇలాంటి వారిలో కలపకుండా కేవలం నీ సంతృష్టి కొరకు చదివే సద్భాగ్యుల్లో మమ్మల్ని కూడా చేర్చు ఓ అల్లాహ్.

“నీ ఉద్దేశం ఏముండే? నీవు ఇహలోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఖురాన్ చదివావు, ఖురాన్ పఠించావు, దానిని ఇతరులకు నేర్పావు. ప్రజలు నిన్ను చాలా మెచ్చుకున్నారు, అక్కడే నీ ఫలితం అయిపోయింది.”

ఆ తర్వాత, రెండో వ్యక్తిని అల్లాహ్ త’ఆలా పిలుస్తాడు ప్రజలందరి మధ్యలో నుండి. అతడు ఎవడు? అల్లాహ్ అతనికి చాలా డబ్బు, ధనం ప్రసాదించి ఉంటాడు. అల్లాహ్ అతని యొక్క అనుగ్రహాలను గుర్తు చేసి, “నీవు ఈ నా ఈ అనుగ్రహాలకు బదులుగా ఏమి ఆచరించావు? ఎలా కృతజ్ఞత తెలిపావు?” అని ప్రశ్నిస్తే, “ఓ అల్లాహ్, నీవు నాకు ఇచ్చిన ఈ అనుగ్రహాలన్నీ కూడా నేను ఒప్పుకుంటున్నాను. అయితే వీటిని నేను నీ మార్గంలో ఖర్చు పెట్టాను” అని అంటాడు. అప్పుడు అల్లాహ్ వైపు నుండి ఏం సమాధానం వస్తుంది? మళ్ళీ ఏం జరుగుతుంది? ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాము ఆ విషయాలు విందాము.

డబ్బు ధనాలు కలిగి ఉన్న వ్యక్తి ఒప్పుకుంటాడు. “నీవు నేను ప్రసాదించిన అనుగ్రహానికి బదులుగా ఎలా ఆచరించావు? ఏం చేశావు? ఏ కృతజ్ఞత తెలిపావు?” అని అంటే, “ఓ అల్లాహ్, నేను నీ మార్గంలో ఖర్చు పెట్టాను, బంధుత్వాలను పెంచుకునే ప్రయత్నం చేశాను, నీకు ఇష్టమైన మార్గాల్లో నా ఈ ధనాన్ని వెచ్చించాను.” అప్పుడు అల్లాహ్ త’ఆలా సమాధానం ఇస్తూ, “నీవు పేరు ప్రఖ్యాతుల గురించి, అరే ఇతను చాలా ఉదార మనసు మరియు ఎంతో మంచి బుద్ధి గలవాడు, ధనాన్ని ఖర్చు పెట్టేవాడు అని పేరు ప్రఖ్యాతుల గురించి నీవు ఖర్చు పెట్టావు. ఇహలోకంలో ప్రజలు కూడా నిన్ను మెచ్చుకున్నారు.” ఈ విధంగా అతనికి ఏ పుణ్యము, ఏ సత్ఫలితము ప్రసాదించడు.

మూడో వ్యక్తిని కూడా అల్లాహ్ త’ఆలా అందరి మధ్యలో నుండి తీసుకువస్తాడు. అల్లాహ్ అతనికి శక్తి, గొప్ప మేధ, బుద్ధి ప్రసాదించి ఉంటాడు. అతను అల్లాహ్ మార్గంలో పోరాడుతూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు. “నేను నీకు ఇచ్చిన ఈ శక్తి సామర్థ్యాలను నీవు ఒప్పుకుంటున్నావా?” అంటే, “అవును ఓ అల్లాహ్, నేను ఒప్పుకుంటున్నాను.” “నీవు ఏం కృతజ్ఞత చెల్లించావు?” అని అంటే, “ఓ అల్లాహ్, నేను నీ మార్గంలో పోరాడాను” అని అతను సమాధానం ఇస్తాడు. అప్పుడు అల్లాహ్ అంటాడు, “నీవు అబద్ధం పలుకుతున్నావు.” దైవదూతలు కూడా అతనితో అంటారు, “నీవు అబద్ధం పలుకుతున్నావు. ఇహలోకంలో నీవు ఒక గొప్ప ధైర్యవంతునివి, చాలా గొప్పగా పోరాడే వానివి అని పేరు ప్రఖ్యాతుల గురించి ఇలా పోరాడావు.” అప్పుడు అల్లాహ్ త’ఆలా అతని యొక్క ఏ సత్కార్యాన్ని స్వీకరించడు. “నీవు అబద్ధం పలుకుతున్నావు” అని అంటాడు.

అబూ హురైరా చెప్పారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా యొక్క మోకాళ్ళను ఇలా తట్టి, కొట్టి, “అబూ హురైరా, నీకు తెలుసా? అల్లాహ్ యొక్క సృష్టిలో తొలిసారిగా ఈ ముగ్గురిని ప్రశ్నించి, వారు అల్లాహ్ సంతృష్టి కొరకు ఆ సత్కార్యాలు చేయలేదు, పేరు ప్రఖ్యాతుల గురించే సత్కార్యాలు చేశారు గనుక వారి ఆ సత్కార్యాలని వృధా చేసి, ఎలాంటి సత్ఫలితం లేకుండా చేసి, నరకాగ్నిని ఈ ముగ్గురి ద్వారా మరింత ఎక్కువగా దహించడం జరుగుతుంది.”

అల్లాహ్ మనందరినీ కూడా నరక శిక్ష నుండి కాపాడు గాక. ఎప్పుడూ ఏ సత్కార్యం చేసినా గాని అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయకూడదు. అల్లాహ్ సంతృష్టి కాకుండా ఫలానా వారు, ఫలానా వారు నన్ను మెచ్చుకోవాలి, ఇహలోక పేరు ప్రఖ్యాతుల గురించి ఏదైనా చేయడం, ఇది మహా ఘోర పాపం. దీనివల్ల మన త్రాసు అనేది బరువుగా కాకుండా తేలికగా అయిపోతుంది అన్న విషయం ఈ హదీథ్ ల ద్వారా మనకు తెలిసింది.

ఈ షుఫయ్యా రహిమహుల్లాహ్ ఎవరైతే అబూ హురైరా రదియల్లాహు అన్హు ద్వారా ఈ హదీథ్ ను విన్నారో, ఆయన హజ్రత్ ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క బాడీగార్డ్ లలో ఒకరు. ఒక సందర్భంలో ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు వద్దకు ఎవరో వచ్చారు. అప్పుడు షుఫయ్యా రదియల్లాహు అన్హు ఈ హదీథ్ ను కంప్లీట్ గా, సంపూర్ణంగా ఆ సందర్భంలో వినిపించారు. ఆ హదీథ్ ను విని హజ్రత్ ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు ఏం చెప్పారు?

“ఖురాన్ ను చదివేవారు, చదివించేవారు, ధనభండారాలు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేవారు మరియు అల్లాహ్ మార్గంలో పోరాడేవారు, వీరి యొక్క పరిస్థితి ఇలా ఉన్నది. వీరి ద్వారా నరకాగ్నిని దహించి వేయడం జరుగుతుంది అంటే, మరి మన పరిస్థితి ఏమవుతుందో కదా?” అని బాధపడుతూ ఉన్నారు. బాధ పడుతూ పడుతూ హజ్రత్ ముఆవియా రదియల్లాహు అన్హు కూడా స్పృహ తప్పిపోయారు. చాలా సేపటి తర్వాత ఎప్పుడైతే ఆయన మేల్కొన్నారో, ఖురాన్ యొక్క ఈ ఆయతులు పఠించారు.

ఖురాన్ సూరహ్ హూద్ యొక్క ఆయత్ నెంబర్ 15, 16 పఠించారు.

مَنۡ كَانَ يُرِيۡدُ الۡحَيٰوةَ الدُّنۡيَا وَزِيۡنَتَهَا نُوَفِّ اِلَيۡهِمۡ اَعۡمَالَهُمۡ فِيۡهَا وَهُمۡ فِيۡهَا لَا يُبۡخَسُوۡنَ
ఎవరయితే ప్రాపంచిక జీవితం పట్ల, దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను (వాటి ఫలితాన్ని) మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ (ప్రపంచంలో) వారికి ఏ లోటూ జరగదు. (11:15)

اُولٰٓئِكَ الَّذِيۡنَ لَيۡسَ لَهُمۡ فِى الۡاٰخِرَةِ اِلَّا النَّارُ ‌ۖ وَحَبِطَ مَا صَنَعُوۡا فِيۡهَا وَبَاطِلٌ مَّا كَانُوۡا يَعۡمَلُوۡنَ
అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృథా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి. (11:16)

అల్లాహు అక్బర్, గమనించారా? ఎంత గొప్ప ఘోర విషయం. ప్రళయ దినాన వారికి అగ్ని తప్ప, నరకాగ్ని తప్ప ఇంకా వేరే ఏదీ లభించదు. ఇహలోకంలో వారు చేసినదంతా కూడా వృధా అయిపోతుంది. ఇక ముందుకు వారు ఏదైతే చేస్తూ ఉంటారో అదంతా కూడా వృధా అవుతుంది. పరలోకాన వారికి ఎలాంటి లాభం దాని ద్వారా చేకూర్చదు.

అందుగురించే మహాశయులారా, అల్లాహ్ తో భయపడాలి. మనం ఏ సత్కార్యం చేసినా గాని కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయాలి మరియు ప్రదర్శనా బుద్ధి, పేరు ప్రఖ్యాతుల గురించి కాకుండా మనం అల్లాహ్ యొక్క అభీష్టాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మహాశయులారా, ప్రళయ దినాన మన త్రాసు బరువు కాకుండా దాని యొక్క బరువు తగ్గిపోయి తేలికగా అయి మనకు స్వర్గంలో కాకుండా నరకంలో పోయేటువంటి పరిస్థితి రావడానికి ఒక ముఖ్య కారణం ఈ లోకంలో మనం చేసే సత్కార్యాలు కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు చేయడం కాకుండా ఇతరుల ప్రశంసలు అందుకోవడానికి, ఫలానా ఫలానా వారు మనల్ని మెచ్చుకోవాలని, ఇలా మనం చేస్తే మన పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అని చేయడం మహా భయంకరం.

ఈ రోజుల్లో అనేకమంది దానధర్మాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? ఏదైనా ఇలాంటి దానధర్మాలు చేస్తే రాయి మీద వారి పేరు రాయబడి చాలా కాలం వరకు అక్కడ పెట్టడం జరుగుతుంది, ఈ విధంగా వారిని గుర్తించడం జరుగుతుంది అని. మరికొందరు ఏదైనా మరో సత్కార్యం చేస్తారు మరియు దాని యొక్క ఫోటోలు తీసి ఫేస్ బుక్ లలో, వాట్సాప్ లలో, సోషల్ మీడియాలలో వేసి నేను ఇలా చేశాను అని చెప్పుకుంటారు. ఈ రోజుల్లో ఎంతోమంది హజ్ కు వెళ్తూ ఉంటారు, ఉమ్రాకు వెళ్తూ ఉంటారు. హజ్, ఉమ్రాల యొక్క ఎన్నో సందర్భాలలో ఫోటోలు తీసి ఫేస్ బుక్ లలో వేయడం, వాట్సాప్ గ్రూప్ లలో పంపడం. అలాగే మరికొందరు ఖుర్బానీ సందర్భాలలో మంచి మంచి జంతువులు కొని ప్రజల్లో వారి యొక్క పేరు రావాలి అని, దాని యొక్క ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వేయడం, రమదాన్ మాసాల్లో ఇఫ్తార్ పార్టీలు ఇచ్చి వారి యొక్క పేరు ప్రఖ్యాతుల గురించి వాటి యొక్క ఫోటోలు తీసి గ్రూపులలో పంపడం.

అందరూ ఇలా చేసేవారు నవూజు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, ఇలాంటి దుష్కార్యానికి పాల్పడుతున్నారు అని నేను చెప్పడం లేదు. కానీ అనేక మంది యొక్క ఉద్దేశాలు ఇంచుమించు ఇలాగా ఉంటున్నాయి. ఎవరైనా ఏదైనా కారణంగా ఒక నిరూపణ ఉండడానికి ఏదైనా చేస్తూ ఉంటే వారి యొక్క మన: సంకల్పాన్ని, వారి హృదయాంతరంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని అల్లాహ్ యే బాగవుగా గుర్తెరుగుతాడు. కానీ ఈ రోజుల్లో సామాన్యంగా మీరు ఎవరిని అడిగినా గాని, “అరే, ఏంటి దీన్ని మీరు ఎందుకు ఫోటోలు తీసి వేశారు?” అంటే, “మన ఫ్రెండ్స్ చూస్తారు కదా, మంచి కామెంట్స్ ఇస్తారు కదా.” అయితే ఈ విధంగా మన యొక్క మన సంకల్పంలో అల్లాహ్ యొక్క అభీష్టం, అల్లాహ్ యొక్క సంతృష్టి తగ్గిపోవడం వల్ల మన యొక్క ఈ సత్కార్యాల సత్ఫలితాలు కూడా తగ్గిపోతున్నాయి. చివరికి మన యొక్క త్రాసులు బరువుగా కాకుండా తేలికగా అయిపోతున్నాయి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ ఇలాంటి దుష్కార్యాల నుండి దూరం ఉంచుగాక. మన యొక్క త్రాసును తేలికగా చేసే మరికొన్ని పాపాల గురించి ఇన్షా అల్లాహ్ ఈ విధంగానే మనం తెలుసుకుంటూ ఉంటాము. మీరు ఈ కార్యక్రమాలను చూస్తూ ఉండండి. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42019

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]