ధర్మసంపాదన నుండి తీసిన దానం దిన దినాభివృద్ధి అవుతుంది

595. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:-

“దేవుని దగ్గరకు పవిత్ర వస్తువు మాత్రమే చేరుతుంది. అందువల్ల ఎవరైనా తన పవిత్ర సంపాదన నుండి ఒక ఖర్జూరపుటంత దానం చేసినా సరే దేవుడు దాన్ని కుడిచేత్తో స్వీకరిస్తాడు. ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లు ఆయన ఆ దానాన్ని వృద్ధి పరుస్తాడు. అలా వృద్ధి చెందుతూ చివరికది పర్వతం మాదిరిగా పెరిగిపోతుంది.”

[సహీహ్ బుఖారీ : 97 వ ప్రకరణం – తౌహీద్, 23 వ అధ్యాయం – ఖౌలిల్లాహి తాలా – తారుజుల్ మలాయికతు వర్రూహు ఇలై]

19 వ అధ్యాయం – ధర్మసంపాదన నుండి తీసిన దానం దిన దినాభివృద్ధి అవుతుంది
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

షైతాన్ పై అజాన్ ప్రభావం

216. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు:-

అజాన్ చెప్పడం ప్రారంభించగానే షైతాన్ వెనక్కి తిరిగి పలాయనం చిత్తగిస్తాడు. (తీవ్రమైన భయాందోళనతొ) వాడికి అపానవాయువు వెలువడుతుంది.  దాంతో వాడు అజాన్ వినరానంత దూరం పారిపోతాడు. అయితే అజాన్ చెప్పడం అయిపోగానే వాడు మళ్ళీ (ప్రార్ధనా స్థలానికి) చేరుకుంటాడు. ఇఖామత్ చెప్పగానే తిరిగి తోకముడిచి పారిపోతాడు. ఇఖామత్ చెప్పడం అయిపోగానే మళ్ళీ వచ్చి మానవుని హృదయంలో దుష్టాలోచనలు రేకేత్తిస్తాడు. మనిషికి అంతకు ముందు గుర్తుకురాని విషయాలన్నిటినీ (నమాజు కోసం నిలబడగానే) గుర్తు చేస్తూ ‘ఇది జ్ఞాపకం తెచ్చుకో’, ‘అది జ్ఞాపకం తెచ్చుకో’ అని పురిగొల్పుతాడు. దాంతో మనిషికి (వాడి మాయజాలంలో పడిపోయి) తాను ఎన్ని రకాతులు పఠించానన్న సంగతి కూడా జ్ఞాపకం ఉండదు.

[సహీహ్ బుఖారీ : 10 ప్రకరణం – అజాన్, 4 వ అధ్యాయం – ఫజ్లిత్తాజీన్]

నమాజు ప్రకరణం – 8వ అధ్యాయం – అజాన్ ఔన్నత్యం – షైతాన్ పై దాని ప్రభావం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2

సకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఉపవాసం ఔన్నత్యం

707. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

“దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మానవుడు చేసే సత్కార్యాలన్నీ తన కోసమే ఉన్నాయి. అయితే ఉపవాసం సంగతి అలా కాదు.ఉపవాసం నాకోసం ప్రత్యేకంగా పాటించబడుతుంది. అందువల్ల నేను స్వయంగా దానికి ప్రతిఫలం ప్రసాదిస్తాను – ఉపవాసం ఒక డాలు వంటిది. మీలో ఎవరైనా ఉపవాసం పాటిస్తే వారు అశ్లీలపు పలుకులు పలకరాదు, పోట్లాటల్లో దిగకూడదు; ఎవరైనా దూషిస్తే లేక జగడానికి దిగితే అలాంటి వ్యక్తితో తాము ఉపవాసం పాటిస్తున్నామని చెప్పాలి.”

“ఎవరి అధీనంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణం ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్ష్యం! ఉపవాసకుడి నోటి వాసన దేవుని ద్రుష్టిలో కస్తూరి సువాసన కంటే ఎంతో శ్రేష్ఠమైనది. ఉపవాసి రెండు సందర్భాలలో  అమితానందం పొందుతాడు. ఒకటి : ఉపవాసం విరమిస్తున్నప్పుడు. రెండు : తన ప్రభువును సందర్శించినపుడు ఉపవాస పుణ్యఫలం చూసి”.

[సహీహ్ బుఖారీ: 30 వ ప్రకరణం – సౌమ్, 9 వ అధ్యాయం – హల్ యఖూలు ఇన్నీ సాయిమున్ ఇజాసితుమ్ ?]

ఉపవాస ప్రకరణం – 30 వ  ప్రకరణం – ఉపవాసం ఔన్నత్యం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

స్వర్గానికి చేర్చే విశ్వాసం

7. హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రధి అల్లాహు అన్హు) కధనం:-

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరి కొచ్చి “ధైవప్రవక్తా! నన్ను స్వర్గానికి గొనిపోగల సత్కర్మలేమిటో  కాస్త చెప్పండి” అని అన్నాడు. ప్రజలు (అతను ముందుకు వస్తూ మాట్లాడుతున్న తీరును చూసి) “ఏమయింది ఇతనికి (ఒక పద్ధతి అంటూ లేకుండా) ఇలా అడుగుతున్నాడు?” అని చెప్పుకోసాగారు.  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని “ఏం కాలేదు. అతనికి నాతో పని పడింది, మాట్లాడనివ్వండి” అని అన్నారు. తరువాత ఆయన ఆ వ్యక్తి వైపుకు తిరిగి

“పూర్తి ఏకాగ్రతతో ఒక్క దేవుడ్ని మాత్రమే ఆరాధించు. ఆయన్ని తప్ప మరెవరినీ ఆరాధించకు. ఆ దైవారాధనలో మరెవరినీ ఆయనకు సహవర్తులుగా కల్పించకు. నమాజ్ వ్యవస్థను నెలకొల్పు. జకాత్ (పేదల ఆర్ధిక హక్కు) చెల్లించు. బంధువులతో కలసిమెలసి ఉంటూ మంచిగా మసలుకో. ఇక దీన్ని వదలిపెట్టు” (*) అని అన్నారు.

హజ్రత్ అబూ అయ్యూబ్ (రధి అల్లాహు అన్హు) ఈ హదీసు ఉల్లేఖించిన తరువాత ఆ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒంటె ఎక్కి ఉన్నారని, ఆ వ్యక్తి దాన్ని నిరోధించి  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఈ ప్రశ్న అడిగినప్పుడు దానికాయన సమాధానమిచ్చి, చివర్లో ఇక దీన్ని (ఒంటె పగ్గాన్ని) వదలిపెట్టు అని చెప్పి ఉంటారని తెలియజేశారు.

(*) ఇక్కడ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట వెలువడిన అసలు మాటేమిటో హదీసు ఉల్లేఖకునికి గుర్తులేదు

[సహీహ్ బుఖారీ : ప్రకరణం – 78 (అదబ్), అధ్యాయం – 10 (సలాతుర్రహం)]

విశ్వాస ప్రకరణం – 5 వ అధ్యాయం – స్వర్గానికి చేర్చే విశ్వాసం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

తల్లి గొప్పదనం

1652. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం:-

“ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చిధైవప్రవక్తా! నా సత్ప్రవర్తనకు ఎవరెక్కువ హక్కుదారులు?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ తల్లి” అని చెప్పారు. “ఆ తరువాత ఎవరూ?” అంటే “నీ తల్లి” అనే చెప్పారు ఆయన. తిరిగి ఆ వ్యక్తి “ఆ తరువాత ఎవరు?” అని అడిగాడు. “నీ తల్లి” అనే చెప్పారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). అతను మళ్ళీ అడిగాడు:- “ఆ తరువాత ఎవరెక్కువ హక్కుదారులు?” అని. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ తండ్రి” అని అన్నారు.

 (సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్,  2వ అధ్యాయం – మన్ అహఖ్కున్నాసి బిహుస్నిస్సుహుబతి)

సామాజిక మర్యాదల ప్రకరణం
1వ అధ్యాయం – తల్లిదండ్రుల సేవే అన్నిటికంటే గొప్పసేవ
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్