త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన [మరణానంతర జీవితం – పార్ట్ 23] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన
[మరణానంతర జీవితం – పార్ట్ 23] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=bqcAR6CBK80
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

السلام عليكم ورحمة الله وبركاته
الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد

మహాశయులారా, మరణానంతర జీవితం అనే అంశంలో మీకు స్వాగతం. మరణానంతర జీవితం అనే అంశంలో ఒక ముఖ్య శీర్షిక ప్రళయ దినాన త్రాసు యొక్క ఏర్పాటు చేయడం, అందులో కర్మలను, కర్మ పత్రాలను, ఆ కర్మలు చేసిన మానవుల్ని కూడా తూకం చేయబడటం దాని గురించి మనం ఎన్నో వివరాలు విని ఉన్నాము. అయితే, ఇందులోనే ఒక ముఖ్య శీర్షిక త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు ఏమిటి?

మహాశయులారా, ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా చదవడం, వినడం, తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసు బరువుగా ఉన్నప్పుడే మనం స్వర్గాల్లోకి ప్రవేశించగలుగుతాము. ఒకవేళ మన సత్కార్యాల పళ్ళెం బరువుగా కాకుండా తేలికగా ఉంటే, అల్లాహ్ కాపాడుగాక మనందరినీ రక్షించుగాక, నరకంలోనికి వెళ్ళవలసి వస్తుంది. అందుకొరకు ఈనాటి నుండి మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఏ సత్కార్యాలు ప్రళయ దినాన మన త్రాసును బరువుగా చేస్తాయి, ఆ సత్కార్యాల గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.

ఇందులో మొదటి విషయం ఇఖ్లాస్. అంటే సంకల్ప శుద్ధి. ఏ కార్యం ఎంత ఎక్కువగా సంకల్ప శుద్ధితో కూడుకొని ఉంటుందో అంతే ఎక్కువగా దాని పుణ్యం పెరుగుతుంది. ఎంత పుణ్యం ఎక్కువగా పెరుగుతుందో అంతే పళ్ళెంలో, సత్కార్యాల త్రాసులో అది బరువుగా ఉంటుంది. ఎవరైనా ఎంత పెద్ద సత్కార్యం చేసినా, అది చూడడానికి ఎంత గొప్పగా ఉన్నా, సంకల్ప శుద్ధి కలిగి లేకుంటే, అది కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయబడకుంటే దాని యొక్క సత్ఫలితం మనిషికి ఏ మాత్రం దొరకడమే కాదు, ఏనాడైతే మనిషి దాని సత్ఫలితం పొందుదాము అని ప్రలోకాన హాజరవుతాడో అప్పుడు దుమ్ము ధూళి వలె అది వృధా అయిపోతుంది. ఏమీ ఫలితము మనిషికి లభించదు. చూడడానికి ఇహలోకంలో అతను ఎంతో కష్టపడ్డాడు. చూడడానికి ఆ కార్యం చేయడానికి అతను ఎంతో శ్రమించాడు, కానీ సంకల్ప శుద్ధి లేని వల్ల దాని పుణ్యం తుడుచుకుపోతుంది. సత్ఫలితం లేకుండా చేస్తుంది.