క్రింది లింక్ క్లిక్ చేసి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి దుఆ – ఒక దివ్యౌషధం [పుస్తకం] – [పాకెట్ సైజు ] కూర్పు: ముహమ్మద్ హమ్మాద్ ఉమరి పర్యవేక్షణ: ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్[PDF][90 పేజీలు ]
ముందు మాట
ఈ లోకంలో కష్టాలు, బాధలు ఎవరికి తీపి?! కష్టాల నుంచి విముక్తిని ఆశించటం, సుఖాలకు గాను ఆనందించటం మానవ సహజ లక్షణం. ఎంత గొప్ప ఓర్పు కలవారైనా, తాము అన్ని రకాల శిక్షల నుంచి సురక్షితంగా ఉండాలనే ఆకాంక్షిస్తారు. చిన్న కష్టం కూడా తమ దరి చేరరాదని కోరుకుంటారు.
సాధారణంగా మనుషులకు కలిగే వ్యాధులు,రోగాల వంటివే కష్టాలు, బాధలు కూడా. అల్లాహ్ ఈ లోకంలో ప్రతి రోగానికి చికిత్సను తయారు చేసి ఉంచాడు. ఆ విధంగా ప్రతి వ్యాధికి అల్లాహ్ తరఫున ఒక మందు అందుబాటులో ఉంది. మరి కష్టాలకు, బాధలకు ఆయన దృష్టిలో అత్యంత ప్రభావవంతమైన మందు ఏదో తెలుసా? అదే దుఆ (ప్రార్థన). కాకపోతే,ఆ దివ్యౌషధాన్ని సక్రమంగా వినియోగించు కోవటం మనుషులకు తెలిసి ఉండాలి.
కేవలం కష్టాలను దూరం చేసుకోవటానికే కాదు, ఈ లోకంలో సంతృప్తికర ఆనందాన్ని అంది పుచ్చుకోవాలన్నా, సుఖమయ సంతోషాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవాలన్నా మనిషికి దుఆయే ఏకైక సాధనం. అంతే కాదు, దుఆ అత్యంత పుణ్యప్రదమైన ఒక ఆరాధన కూడా.
దుఆ చేసే సరైన విధానం తెలియని కారణంగా,తాము ఎంతగా దుఆ చేసిన తమ ప్రార్థనలు స్వీకరించబడటం లేదని చాలామంది తరచూ వాపోతుంటారు. ముఖ్యంగా అలాంటి వారి కోసమే ఈ చిరుపుస్తకం రూపొందించబడింది. ఇందులో దుఆ సమయం, దుఆ విధానం, దుఆ పలుకులు, దుఆలో సముచిత, అనుచిత విషయాలు మొదలగునవన్నీ పొందుపరచ బడ్డాయి. మొత్తానికి ఈ చిరు పుస్తకం తెలుగు ప్రజలందరికీ ప్రయోజనకరం కాగలదని ఆశిస్తున్నాం.
పరమ ప్రభువైన అల్లాహ్ మనందరికీ ‘దుఆ’ దివ్యౌషధాన్ని సక్రమంగా వినియోగించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ….
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఖుర్ఆన్ ద్వారా స్వస్థత (షిఫా) ఎలా పొందాలి? https://youtu.be/koWlTdlX4BI [52 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా పొందవచ్చో వివరించబడింది. సర్వశక్తిమంతుడు అల్లాహ్ యే అని, ఆయన తలచినప్పుడే అన్నీ జరుగుతాయని గట్టి నమ్మకం కలిగి ఉండాలని ప్రసంగీకులు నొక్కిచెప్పారు. ఖుర్ఆన్ కేవలం చికిత్స కాదు, సంపూర్ణ స్వస్థత (షిఫా) అని అల్లాహ్ స్వయంగా చెప్పిన విషయాన్ని వారు స్పష్టం చేశారు. ఇది శారీరక రోగాలకే కాకుండా, అనుమానాలు, సందేహాలు వంటి హృదయ సంబంధమైన (ఆధ్యాత్మిక) రోగాలకు కూడా స్వస్థతను కలిగిస్తుంది. సూరహ్ యూనుస్, సూరహ్ అల్-ఇస్రా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని సంఘటనలను ఉదాహరిస్తూ, ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందాలంటే దృఢ విశ్వాసం, పాపాలకు దూరంగా ఉండటం మరియు ఖుర్ఆన్ బోధనలను ఆచరించడం తప్పనిసరి అని బోధించారు. మూఢనమ్మకాలు, షిర్క్ వంటి పద్ధతులకు దూరంగా ఉంటూ, సరైన పద్ధతిలో ఖుర్ఆన్ ద్వారా చికిత్స పొందాలని వారు ఉద్బోధించారు.
అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాఇ వల్ ముర్సలీన్. వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ వ మన్ తబిఅహుం బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అమ్మా బాద్.
وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ (వ నునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫావువ్ వ రహ్మతుల్ లిల్ మూమినీన్) మేము అవతరింపజేసే ఈ ఖుర్‌ఆన్ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని. (17:82)
సర్వ స్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సర్వ లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సర్వ మానవాళి సన్మార్గం కొరకు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అంతిమ గ్రంథం ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశారు. అల్హందులిల్లాహ్, ఈ రోజు ధర్మ సందేశ విభాగం, రాష్ట్ర జమీయతే అహ్లె హదీస్ తెలంగాణ వారి తరఫున మూడు ప్రసంగాలు, మూడు పాఠాలు మీ ముందు ఇన్షా అల్లాహ్ తీసుకురావడం జరుగుతుంది. అందులో ఇన్షా అల్లాహ్ ప్రప్రథమంగా మీ ముందు ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా అనే అంశంపై ఫజీలతుష్ షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామయీ హఫిదహుల్లాహ్ మీ ముందు ఇన్షా అల్లాహ్ ఈ అంశం పైన ప్రసంగించనున్నారు. నేను ఎలాంటి ఆలస్యం చేయకుండా గురువు గారిని నేను ఇన్షా అల్లాహ్ ఈ అంశం పైన మాకు ఎన్నో ఖుర్ఆన్ హదీసు వెలుగులో ఖుర్ఆన్ ద్వారా ఎలా స్వస్థత పొందాలి, అల్లాహ్ అజ్జవజల్లా ఈ గ్రంథం ద్వారా ఎలా స్వస్థతను పొందుపరిచాడు అనే అంశాల గురించి ఇన్షా అల్లాహ్ వివరిస్తారని ఆశిస్తున్నాను. వలియత ఫద్దల్ మష్కూరున్ మాజూరా ఫలియత ఫద్దల్.
అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్. అమ్మా బాద్.
يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్నవ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం. (10:57)
قُلْ بِفَضْلِ اللَّهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا هُوَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “అల్లాహ్ ప్రదానం చేసిన ఈ బహుమానానికి, కారుణ్యానికి జనులు సంతోషించాలి. వారు కూడబెట్టే దానికంటే ఇది ఎంతో మేలైనది.” (10:58)
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ ధర్మ ప్రేమికులారా, ఖుర్ఆన్ అల్లాహ్ యొక్క సత్య గ్రంథం. మన కొరకు స్వస్థత ఎలా? అనే అంశంపై ప్రసంగించడానికి చెప్పడం జరిగింది. అయితే ఖుర్ఆన్ మన కొరకు ఏ రూపంలో స్వస్థత ఉంది, దాని ద్వారా మనం ఎలా స్వస్థత పొందగలుగుతామో తెలుసుకునేకి ముందు ఒక రెండు విషయాలు మనం గ్రహించడం చాలా అవసరం. ఏంటి ఆ రెండు విషయాలు? ముందు మనమందరమూ కూడా చాలా బలంగా విశ్వసించవలసినది, దృఢంగా నమ్మవలసినది ఏమిటంటే,
సర్వశక్తిమంతుడు అల్లాహ్ యే
సర్వశక్తిమంతుడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా అల్లాహ్ యొక్క ఆదేశ ప్రకారమే జరుగుతుంది. చివరికి అమ్రే కౌనీ అని ఏదైతే అనడం జరుగుతుందో, మానవులు, జిన్నాతులు తప్ప మిగతా సృష్టి రాశులందరికీ కూడా వారి వారి ఏ పనిని బాధ్యతను అల్లాహ్ అప్పగించాడో, తూచా తప్పకుండా అవి పాటిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా అల్లాహ్ యొక్క అనుమతితోనే జరుగుతుంది. అది మన దృష్టిలో ఒకప్పుడు ఏదైనా చెడు అనిపించినా, అది కూడా అల్లాహ్ అనుమతితోనే జరుగుతుంది, దీనినే అమ్రే కౌనీ అని అంటారు. ఎక్కడైనా ఏదైనా మంచి జరిగినా అది కూడా అల్లాహ్ వైపు నుండే జరుగుతూ ఉంది.
అగ్నిలో కాల్చే గుణం, కత్తిలో కాటు వేసే గుణం, ఇంకా సృష్టి రాశుల్లో వేరే ప్రతీ ఒక్క దానిలో అల్లాహ్ త’ఆలా అనుమతితోనే అది తన పని చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే అల్లాహ్ కోరుతాడో, అది తన ఆ పని చేయకూడదు అని, అది ఆ పని చేయదు. అగ్ని ఇబ్రాహీం అలైహిస్సలాంను కాల్చకూడదు అంటే అది కాల్చలేదు. కత్తి ఇస్మాయిల్ అలైహిస్సలాంను కోయకూడదు అని అంటే, కత్తి ఇస్మాయిల్ అలైహిస్సలాం మెడపైన నడిచినప్పటికీ రవ్వంత గాయం కూడా కాలేదు. సముద్రంలో మునగడం, అందులో ఉన్న పెద్ద జీవరాశులు, తిమింగలాలు మనిషిని గానీ ఇంకా వేరే వాటిని తినడం ఒక సర్వసాధారణ అలవాటుగా మనం చూస్తాము, కానీ అదే యూనుస్ అలైహిస్సలాంను అతనికి ఏ కొంచెం నష్టం జరగకుండా అలాగే కాపాడాలి అని అల్లాహ్ ఆదేశం వస్తే కాపాడింది.
ఈ విధంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ఈ సృష్టిలో తాను కోరిన విధంగా తన ఈ సృష్టిలో మార్పుచేర్పు చేస్తూ ఉంటాడు, అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అందుకొరకే ఉర్దూలో, అరబీలో ఒక పదం ఉపయోగపడుతుంది. మనం మన లాభానికి ఎన్ని సాధనాలు ఏర్పరచుకున్నా, నష్టం నుండి దూరం ఉండడానికి మనం ఏ మార్గాలు అవలంబించినా, ఇవన్నీ కూడా అస్బాబ్ (సాధనాలు). కానీ, ముసబ్బిబుల్ అస్బాబ్, ఆ సాధనాలకు అవి తమ పని చేయాలి అన్నట్లుగా ఆదేశం ఇచ్చేవాడు ఆ అల్లాహ్ మాత్రమే. ఈ బలమైన నమ్మకం మనకు ఉండాలి.
అల్లాహ్ తలచినప్పుడే అన్నీ జరుగుతాయి
రెండో విషయం, అల్లాహ్ ఏది కోరితే అదే జరుగుతుంది, మన ఇష్ట ప్రకారం ఏమీ జరగదు. మనం ఏదైనా మంచి కోరి, మంచి సాధనం దాని గురించి ఉపయోగిస్తే అల్లాహ్ తలచినప్పుడే ఆ మంచి మనకు జరుగుతుంది. అంటే, అల్లాహ్ త’ఆలా అందులో ఒక కారణం పెట్టాడు. కానీ అది ఎప్పుడు పని చేస్తుంది? అల్లాహ్ అనుమతి జరిగినప్పుడు, అల్లాహ్ తాను కోరి అనుమతి ఇచ్చినప్పుడు. ఈ నమ్మకం కూడా చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే, ఈ రోజుల్లో ఉదాహరణకు చెప్తున్నాను, మనం సర్వసాధారణంగా తెలుగు ప్రాంతాలకు చెందిన వారిమి, హైదరాబాద్ ను ఒక క్యాపిటల్ సిటీగా మనం చూస్తున్నాము, అందుకొరకు కొన్ని ఉదాహరణలుగా ఎప్పుడైనా దాని పేరు తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఎన్నో గల్లీలలో మీరు చూస్తూ ఉంటారు, “హమారే పాస్ హర్ తరహా కా రూహానీ ఇలాజ్ హై, ఖురానీ ఇలాజ్ హై”(మా దగ్గర అన్ని రకాల ఆధ్యాత్మిక చికిత్స ఉంది, ఖుర్ఆన్ చికిత్స ఉంది) ఇలాంటి బోర్డులు వేసి ఉంటాయి. వారి యొక్క మొబైల్ నెంబర్లు ఇచ్చి ఉంటాయి. జనాలు, ప్రజలు ధర్మ అవగాహన సరైన రీతిలో లేనందువల్ల, విశ్వాసాలు బలహీనంగా అయిపోయినందువల్ల, వారు ఎన్నో రకాల మోసాలకు గురి అవుతారు. తర్వాత కొందరు అల్లాహ్ యొక్క సత్య గ్రంథం ఖుర్ఆన్ విషయంలో శంకించడం మొదలు పెడతారు. ఇలా ఉండకూడదు.
అందుకొరకే నేను నా అసలైన టాపిక్ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా? ప్రారంభించేకి ముందు ముఖ్యమైన రెండు మాటలు చెప్పాను. వాటిపై చాలా శ్రద్ధ ఇవ్వండి.
ఖుర్ఆన్ – శారీరక మరియు ఆధ్యాత్మిక రోగాలకు స్వస్థత
ఇక ఖుర్ఆన్ మన కొరకు స్వస్థత ఇది మన శారీరక రోగాలకు కూడా మరియు ఆధ్యాత్మికంగా కూడా. మన యొక్క బాహ్య రోగాలకు కూడా మరియు ఇది అంతర్య కళ్ళకు కనబడనటువంటి రోగాలకు కూడా ఒక మంచి స్వస్థత కలుగజేసేది.
దీనికి సంబంధించిన ఆయతులు, హదీసులు చెప్పి, ఏ ఏ రీతిగా మనం ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందగలుగుతామో చెప్పేకి ముందు, ఖుర్ఆన్ గురించి స్వయంగా అల్లాహ్ త’ఆలా స్వస్థత అన్న పదం ఏదైతే పలికాడో, “షిఫా” అని ఖుర్ఆన్ లో వచ్చి ఉంది. సూరత్ యూనుస్, సూరహ్ నెంబర్ 10, ఆయత్ నెంబర్ 57 లో, అలాగే సూరత్ అల్-ఇస్రా, బనీ ఇస్రాయీల్ అని అంటారు, సూరహ్ నెంబర్ 17, ఆయత్ నెంబర్ 82, అలాగే సూరత్ ఫుస్సిలత్, సూరహ్ నెంబర్ 41, ఆయత్ నెంబర్ 44, ఇంకా ఈ భావంలో వేరే కొన్ని చోట్ల కూడా ఆయతులు ఉన్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సర్వసాధారణంగా మనలో ఎవరైనా ఏదైనా రోగానికి గురి అయితే, ఏ మందు తీసుకుంటున్నావు? ఎవరి వద్ద చికిత్స చేయిస్తున్నావు? చికిత్స, మందు తీసుకోవడం ఇలాంటి పదాలు ఉపయోగిస్తాము. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఏంటంటే అల్లాహ్ త’ఆలా ఈ ఖుర్ఆన్ మీ అన్ని రకాల రోగాలకు ఒక ఔషధం అని, దవా అని, ఇలాజ్ అని, చికిత్స అని చెప్పలేదు. మందుల ఉపయోగంతో ఏ ప్రయోజనం కలుగుతుందో, అంటే మనిషి యొక్క రోగం దూరమైపోయి స్వస్థత కలగడం. మర్ద్ (రోగం) పూర్తిగా అతనిలో నుండి వెళ్ళిపోవడం, దాని చోట అతనికి సిహ్హత్, షిఫా (ఆరోగ్యం, స్వస్థత) కలగడం. డైరెక్ట్ అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ గురించి ఆ చివరి లాభం ఏదైతే ఉందో, స్వస్థత, ఆరోగ్యం అది అని తెలిపాడు. మందు అని తెలపలేదు, ఔషధం అని తెలపలేదు.
ఇందులో ఉన్నటువంటి గొప్ప మహిమ గ్రహించాల్సినది ఏమిటంటే, మనం చూస్తూనే ఉన్నాము, ఔషధాలు, మందులు సర్వసాధారణంగా మనం ఉపయోగిస్తాము, కొన్ని సందర్భాల్లో అవి పని చేస్తాయి, మనకు వాటి ద్వారా స్వస్థత కలుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో వాటి ద్వారా మనకు స్వస్థత అనేది కలగదు. కానీ ఇక్కడ ఖుర్ఆన్ గురించి అల్లాహ్ త’ఆలా ఏం చెబుతున్నాడు అంటే, దీని ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. మీ రోగాలన్నీ కూడా నశించిపోతాయి, అంతమైపోతాయి, నామరూపాలు లేకుండా “లా తుగాదిరు సఖమా”, ఆ రోగం నామరూపాలు లేకుండా మీలో నుండి దూరమైపోతాయి.
సోదర మహాశయులారా, తొందర తొందరగా పది, ఇరవై ఆయతులు చదివేయడం, పది, ఇరవై హదీసులు వినడం అది గొప్ప కాదు. ఒక్క ఆయతు విన్నా, అందులో ఉన్న భావాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని అల్లాహ్ ఇష్ట ప్రకారంగా మనలో ఒక మార్పు తీసుకురావడం, స్వయం మనం రోగం నుండి ఆరోగ్యం, మరియు అన్ని రకాల చెడుల నుండి మంచి వైపునకు, బలహీన విశ్వాసం నుండి బలమైన విశ్వాసం వైపునకు, ఆచరణ పరంగా ఎంతో లోపం, దోషం ఉన్న మనం, సత్కార్యాలు పాటించడంలో చాలా వేగంగా ముందుకు రావడం, ఇలాంటి మంచి మార్పు మనలో రావాలి.
సూరహ్ యూనుస్ ఆయత్ (10:57) వివరణ
يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్నవ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం. (10:57)
అయితే, సూరత్ యూనుస్ యొక్క ఆయత్ నేను ముందు మీకు వినిపిస్తాను. ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప మహిమను గ్రహించండి. ఒకవేళ గత నెలలో ఖుర్ఆన్ ఎవరి గ్రంథం, ఎవరి కొరకు అన్న విషయంలో నేను హుదన్, హిదాయత్ ఏ ఏ రకంగా ఉంది అనే విషయం ఏదైతే తెలిపాను, సూర యూనుస్ యొక్క ఆయత్ ఇక్కడ ఏదైతే నేను ఇప్పుడు మీ ముందు పఠిస్తున్నానో, స్టార్టింగ్ లో కూడా సంక్షిప్త ఖుద్బయే మస్నూన తర్వాత పఠించాను, దాన్ని ఒక్కసారి గమనించండి మీరు.
“యా అయ్యుహన్ నాస్”, ఓ ప్రజలారా, అల్లాహు అక్బర్. ఎందరో మన హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు ఇంకా వేరే ఇస్లాం ధర్మం పై లేని వారు నా మాట వింటున్నారో కొంచెం శ్రద్ధ వహించండి. దివ్య గ్రంథం ఖుర్ఆన్, సూరత్ యూనుస్, సూరహ్ నెంబర్ 10, ఆయత్ నెంబర్ 57 లో అల్లాహ్ త’ఆలా “యా అయ్యుహన్ నాస్”, ఓ ప్రజలారా అని సంబోధించాడు. అంటే, ముస్లింలారా అని అనలేదు, అరబ్బులారా అని అనలేదు, మక్కావాసులారా అని అనలేదు. సర్వ మానవాళిని ఉద్దేశించి అల్లాహ్ త’ఆలా ఇక్కడ చెబుతున్నాడు. ఏం చెప్పాడు? ఇక సర్వ మానవులకు ఉంది గనక మీరందరూ కూడా వినాలి. ఎందుకంటే, ఇది నా మాట కాదు, ఏదో తురుకోని మాట కాదు, ఏదో నీకు ఇష్టం లేని నీ పక్కన ఉన్నటువంటి నీ శత్రువుని మాట కాదు. నిన్ను సృష్టించిన నీ నిజ సృష్టికర్త అయిన ఆ అల్లాహ్ యొక్క మాట. నీతో సంబోధిస్తున్నాడు, నిన్ను ఉద్దేశించి చెబుతున్నాడు. “యా అయ్యుహన్ నాస్, ఓ మానవులారా, “ఖద్ జాఅత్కుం మౌఇజతుమ్ మిర్రబ్బికుం”. మీ ప్రభువు వైపు నుండి మీ కొరకు ఉపదేశం వచ్చేసింది. అల్లాహు అక్బర్.
ఈ ఉపదేశాన్ని గనక మీరు పాటించారంటే, అల్హందులిల్లాహ్, మీకు ఎంత లాభం కలుగుతుంది అంటే, మీలో ఉన్నటువంటి అన్ని రకాల చెడులు, అది విశ్వాసానికి సంబంధించిన, లేదా ఆచరణ పరంగా నైనా, అశ్లీలత, అన్ని రకాల దుష్కార్యాలు వాటి నుండి మీరు దూరం ఉండగలుగుతారు. అల్లాహ్ యొక్క ఈ ఉపదేశాన్ని మీరు ఆచరించారంటే, విశ్వాసంలో కూడా అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో మీరు మరల గలుగుతారు. ఆచరణ పరంగా కూడా మీరు అల్లాహ్ కు ఇష్టమైన సదాచరణ చేయగలుగుతారు. ఎప్పుడు? అల్లాహ్ మీ కొరకు పంపినటువంటి ఉపదేశాన్ని స్వీకరించారంటే.
ఆ తర్వాత చెప్పాడు, “వ షిఫావుల్ లిమా ఫిస్ సుదూర్”. సుదూర్, మీ యొక్క హృదయాలకు ఇది మంచి నివారణ, స్వస్థత. హృదయాలు అని ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగిందో, ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పారు,
مِنَ الشُّبَهِ وَالشُّكُوكِ، وَهُوَ إِزَالَةُ مَا فِيهَا مِنْ رِجْسٍ وَدَنَسٍ. “మినష్ షుబహి వష్ షుకూకి, వహువ ఇజాలతు మా ఫీహా మిన్ రిజ్సిన్ వ దనస్”. “ఇది మీ రోగాల యొక్క, మీ హృదయాలకు నివారణ, స్వస్థత. హృదయాలలో ఏ అనుమానాలు, ఏ సందేహాలు, ఏ డౌట్స్ వస్తూ ఉంటాయో, వాటన్నిటికీ కూడా ఈ ఖుర్ఆన్ మంచి నివారణ.”
అవును. నిజమైన సృష్టికర్త అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఆరాధ్యుడు ఉన్నాడు అటువంటి అనుమానంలో ఎవరైతే పడి ఉన్నారో, ఈ ఖుర్ఆన్ ను శ్రద్ధగా చదివారంటే, వారి యొక్క ఈ అనుమానాలు దూరమైపోతాయి. మేము ఆ అరబ్బుల్లో వచ్చిన ముహమ్మద్ ను ఎందుకు విశ్వసించాలి అన్నటువంటి సందేహంలో ఇంకా పడి ఉన్నారో, వాస్తవానికి ఖుర్ఆన్ గ్రంథాన్ని శ్రద్ధగా చదివారంటే వారి యొక్క ఈ సందేహాలు దూరమవుతాయి. ఆయన కేవలం అరబ్బుల కొరకు కాదు. ఇక్కడ అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ గురించి ఎలాగైతే చెబుతున్నాడో, మీ కొరకు ఉపదేశం, మీ కొరకు స్వస్థత, మీ రోగాలకు మంచి నివారణ కలిగిస్తూ మీకు స్వస్థత కలుగజేసేది అని, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా అల్లాహ్ ఇదే ఖుర్ఆన్ లో తెలిపాడు, “యా అయ్యుహన్ నాస్, ఓ ప్రజలారా, ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ”, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా పంపబడ్డాను. ఇంతకంటే మరీ స్పష్టంగా “వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్”, సర్వ లోకాల వైపునకు మిమ్మల్ని కారుణ్య మూర్తిగా పంపడం జరిగింది.
మనిషి ఇహలోకంలో శాంతి, పరలోకంలో కూడా నరకం నుండి ముక్తి పొంది శాంతి స్థలమైన ఆ స్వర్గంలో చోటు పొందాలంటే తప్పకుండా ఏకైక అల్లాహ్ ను ఆరాధించాలి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించాలి, ప్రవక్తపై అవతరించిన ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని విశ్వసించి అన్ని రకాల రోగాలకు స్వస్థత కలిగించేటువంటి ఈ ఖుర్ఆన్ ను చదివి మనలో మార్పు తీసుకురావాలి. దీని ద్వారా అన్ని రకాల చెడుగులు మన నుండి దూరమై, సందేహాలు, అనుమానాలు, డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి, మనం మన సృష్టికర్తకు ఇష్టమైన మార్గంలో ఉండగలుగుతాము.
సోదర మహాశయులారా, ఆ తర్వాత అల్లాహ్ తెలిపాడు “వ హుదవ్ వ రహ్మ”. ఎప్పుడైతే మీరు ఉపదేశాన్ని స్వీకరించి మీ రోగాలకు స్వస్థత కలిగించే దానిని మీరు సరైన రీతిలో చదివి ఆచరిస్తూ ఉంటారో, అప్పుడు మీకు మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది. తద్వారా మీ జీవితాల్లో అల్లాహ్ యొక్క ప్రత్యేక కరుణలు మీపై దిగుతూ ఉంటాయి.
ఆ తర్వాత ఏం చెప్పాడు? “లిల్ ముఅమినీన్”.విశ్వాసుల కొరకు. కొంచెం విచిత్రంగా ఉంది కదూ? ఆయత్ యొక్క ఆరంభం యా అయ్యుహన్ నాస్ తోనే ఉంది. మరియు ఖుర్ఆన్ గురించి చెప్పడం జరుగుతుంది, ఇది ఉపదేశం, ఇది స్వస్థత, ఇది మార్గదర్శకత్వం, ఇది కారుణ్యం, నాలుగు గుణాలు చెప్పబడ్డాయి. ఆయత్ యొక్క చివరి పదం ఏముంది? లిల్ ముఅమినీన్, విశ్వాసుల కొరకు. అంటే ఏమిటి? ఇంతకు ముందు నేను ఉదాహరణ ఇచ్చాను మీకు. వాస్తవానికి ఇది సర్వ మానవాళి కొరకు ఉపదేశము, స్వస్థత మరియు మార్గదర్శకత్వము, ఇంకా కారుణ్యము. కానీ ఎవరైతే వాస్తవ రూపంలో ఈ లాభాలు పొందుతారో, సర్వ మానవాళి పొందకుండా విశ్వాసులు ఈ లాభాలు పొందుతారు. ఎందుకు? విశ్వసించి దానిని అదే రీతిలో ఆచరిస్తారు గనుక.
ఇంతకు ముందు ఇచ్చిన ఒక సామెత మీకు గుర్తుందా? టార్చ్ లైట్ మీ చేతిలో ఉంది. బ్యాటరీ ఉంది. కానీ ఏం చేయాలి? రాత్రి మీరు ఏ దారి గుండా చీకటి దారిలో నడుస్తూ వెళ్తున్నారో, బ్యాటరీ ఆ టార్చ్ లైట్ వెంట తీసుకోవాలి, దాని బటన్లు నొక్కి ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత కూడా మీకు మార్గం కనబడదు. ఎందుకు? మీరు దానిని మీరు నడిచే మార్గం వైపునకు కరెక్ట్ గా చూపించుకుంటూ వెళ్ళాలి. మీరు ఉదాహరణకు టార్చ్ లైట్ తీసుకున్నారు, బటన్ నొక్కారు, ఇక్కడ లైట్ ఉంది. కానీ దానిని ఆకాశం వైపునకు ఇలా ఎత్తుకొని పట్టుకొని ఉన్నారు. మీ ముంగట చీకటిలో ఏ దారి అయితే ఉందో అక్కడ వెలుతురు పడుతుందా? పడదు కదా?
అలాగే ముస్లింలారా మీరు కూడా శ్రద్ధగా వినండి. ఖుర్ఆన్ కేవలం ఇళ్ళల్లో పెట్టుకొని, చేతిలో అందకుండా పైన ఎక్కడో అటుక మీద పెట్టి చదవకుండా, దానిని శ్రద్ధగా ఆలకించకుండా, దాని యొక్క అర్థ భావాలు తెలుసుకోకుండా, దాని ద్వారా ఎలా స్వస్థత పొందాలో ఆ ప్రయత్నం చేయకుండా మనం ఉండేది ఉంటే, ఖుర్ఆన్ ఇంట్లో కాదు, జేబులో ఉన్నప్పటికీ, మీ యొక్క మొబైళ్ళలో ఉన్నప్పటికీ, మీ దుకాణాల్లో ఉన్నప్పటికీ, మీ బండిలో మీరు పెట్టుకున్నప్పటికీ మీ యొక్క జీవితాల్లో శుభాలు అనేటివి రావు. రోగాలు దూరం కావు, స్వస్థత అనేది కలగదు.
సూరతున్నహల్, సూర నెంబర్ 16, ఆయత్ నెంబర్ 69లో అల్లాహ్ త’ఆలా తేనె గురించి తెలిపాడు. తేనెటీగ మరియు తేనె యొక్క లాభం గురించి. “ఫీహి షిఫావుల్ లిన్నాస్”, తేనెలో సర్వ మానవాళికి స్వస్థత ఉంది అని. మొన్న కూడా మీరు వార్త చూశారు కావచ్చు. చివరికి కరోనా లాంటి రోగాలకైనా గానీ మన భారతదేశపు పాతకాలపు నాటి చికిత్సలను, ఔషధాలనే అమెరికా, యూరప్ లో కూడా వాడుతున్నారు. అక్కడి ల్యాబొరేటరీస్ లలో, అక్కడి శాస్త్రవేత్తలు తేనె లాంటి గొప్ప ఔషధం మరొకటి లేదు అని చెబుతున్నారు. అని తెలుగులో వార్తలు ప్రచురిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. తేనె, ఒరిజినల్ తేనె, 2000 రూపాయలకు కిలో పెట్టి మీరు కొన్నారు కావచ్చు. ఎంతో అందమైన బాటిల్ లో మీరు తీసుకొని వచ్చారు కావచ్చు. దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో ఎంతో మంచి చోట దాన్ని పెట్టేది ఉంటే, ఒక మంచి అందమైన చిన్న బాటిల్ లో ఒక 20, 30 గ్రాములు వేసుకొని జేబులో వేసుకుంటే లేదా కడుపునొప్పి ఉన్నప్పుడు కడుపుకు కట్టుకుంటే, ఏదైనా మెడనొప్పి ఉన్నప్పుడు మెడకు కట్టుకుంటే లేదా గొంతులో ఏదైనా మీకు ఇబ్బంది ఉండి మెడ కింద కట్టుకుంటే లాభం ఉంటుందా? ఉండదు కదా? డాక్టర్ మరియు ఆయుర్వేద అనుభవజ్ఞులైన వారు దానిని ఏ మోతాదులో, పొద్దున ఎన్నిసార్లు, నీళ్లలోనా, పాలల్లోనా, ఎందులో, నీళ్లు అయితే కూడా సామాన్య నీళ్లా, లేకుంటే కొంచెం కునుకున నీళ్లా, ఇవన్నీ మనం పద్ధతులు తెలుసుకొని ఆ విధంగా పాటించినప్పుడే దాని ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఎన్నో రోగాలకు మీరు డాక్టర్ల వద్ద నుండి మందు బిళ్ళలు గానీ, గొట్టం గోలీలు గానీ, లేకుంటే ఇంకా టానిక్ త్రాగే మందు గానీ తీసుకొని వస్తారు కదా? పొద్దుకు రెండు సార్లు తీసుకోవాలా, మూడు సార్లు తీసుకోవాలా, ఒక్కసారి తీసుకోవాలా, అన్నం కంటే ముందు తీసుకోవాలా, అన్నం తర్వాత తీసుకోవాలా, ఇవన్నీ విషయాలు మంచి విధంగా కనుక్కుంటారు కదా? అదే విధంగా దాన్ని పాటిస్తూ ఉంటారు కదా?
ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందే విధానం మరియు షరతులు
మరి ఖుర్ఆన్ విషయంలో కూడా స్వస్థత పొందే మార్గం ఏంటి? మనం ఖుర్ఆన్ ద్వారా ఎలా స్వస్థత పొందగలుగుతాము, ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఇంతవరకు చేయలేదు అంటే, మనం ఎంత అశ్రద్ధలో ఉన్నామో మనమే గమనించండి.
సోదర మహాశయులారా, ఖుర్ఆన్ ద్వారా మనం స్వస్థత అనేది నేను ఇంతకు ముందే తెలిపినట్లు, మన శారీరక రోగాలకు అంతకంటే ముఖ్యమైన మన హృదయ సంబంధమైన రోగాలకు కూడా ఇది మంచి స్వస్థత. హృదయ సంబంధ రోగాల గురించి కొన్ని విషయాలు ఇంతవరకే నేను చెప్పి ఉన్నాను. అయితే మనం ఖుర్ఆన్ చదువుతూ ఉండేది ఉంటే, ఖుర్ఆన్ ను శ్రద్ధగా అర్థం చేసుకుంటూ ఉండేది ఉంటే, దాని ప్రకారంగా మన ఆచరణ, దాని ప్రకారంగా మన యొక్క జీవితంలో నడవడికలో మార్పు తెచ్చుకొని సదాచరణ పాటిస్తే, తప్పకుండా మన హృదయాల రోగాలకు స్వస్థత కలుగుతుంది.
హృదయ రోగాల యొక్క ప్రస్తావన ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు వచ్చిందంటే సోదర మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసును గుర్తుంచుకోండి.
“ఇన్న ఫిల్ జసది ముద్గా”, శరీరంలో ఒక అవయవం ఉంది. “ఇదా సలుహత్, సలుహల్ జసదు కుల్లు”, అది బాగుందంటే పూర్తి శరీరం బాగున్నట్లు. “వ ఇదా ఫసదత్, ఫసదల్ జసదు కుల్లు”, అది పాడైపోతే శరీరం అంతా కూడా పాడైపోతుంది. అదేమిటి? “అలా వహియల్ ఖల్బ్”, వినండి, అదే హృదయం.
అందుకొరకే మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గానీ, అన్నిటికంటే ముందు ఏం చూస్తారు? చెవిలో పెట్టుకొని రెండు దాని ద్వారా మీ యొక్క ఈ హృదయాన్ని, ముందు కూడా వెనక కూడా, హార్ట్ బీటింగ్ ఎలా ఉంది? లేదా కొందరు ఆయుర్వేద అనుభవజ్ఞులు ఇక్కడ నాడి పట్టి చూస్తారు. దీని ద్వారా కూడా ఏం తెలుస్తుంది? హృదయం నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? హార్ట్ బీటింగ్ ఎలా ఉంది? దీని ద్వారా శరీరంలోని ఎన్నో రోగాలను గుర్తుపడతారు. ఈ విధంగా సోదర మహాశయులారా, హృదయం బాగుంది అంటే, అది అన్ని రకాల రోగాల నుండి స్వస్థత పొందింది అంటే మన విశ్వాసంలో, మన ఆచరణలో ఎంతో మంచి మార్పు వస్తుంది. అందుకొరకు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయ నివారణ కొరకు, హృదయం మార్గదర్శకత్వంపై స్థిరంగా ఉండడానికి ఎన్నో దువాలు కూడా చేస్తూ ఉండేవారు. “అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తక్వాహా, వ జక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా, అంత వలియ్యుహా వ మౌలాహా” ఇంకా వేరే ఎన్నో దువాలు ఉన్నాయి.
ఇక ఈ ఖుర్ఆన్ శారీరక రోగాలకు కూడా స్వస్థత. అవును. అల్హందులిల్లాహ్. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పేకి ముందు ఒక విషయం శ్రద్ధగా వినండి. అదేమిటి? ఖుర్ఆన్ మీ శారీరక రోగాలకు కూడా స్వస్థత అని అంటే, ధర్మపరమైన వేరే ఔషధాలు వాడే అవసరం లేదు అని ఎంతమాత్రం భావం కాదు. చికిత్స చేయించుకోకూడదు అని ఎంతమాత్రం భావం కాదు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా చెప్పారు. “దావూ మర్దాకుం యా ఇబాదల్లాహ్”, ఓ అల్లాహ్ దాసులారా, మీ యొక్క రోగాలకు మీరు చికిత్స చేయించండి. అయితే ఖుర్ఆన్ కు ప్రాధాన్యత అనేది ఉండాలి. ఈ రోజుల్లో పరిస్థితి ఏముంది? అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్లి ఫెయిల్ అయి వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద స్పెషలిస్టులను కలిసి అన్ని మందులు వాడాము, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాము, కానీ ఇక ఏదీ కూడా లాభం లేదు. ఇక అల్లాహ్ యే ఏదైనా చేయాలి అని ఇక ఖుర్ఆన్ ద్వారా స్వస్థత గురించి వచ్చాము. ఇలా ఉండకూడదు. ఖుర్ఆన్ శారీరక రోగాలకు మంచి ఔషధం, మంచి చికిత్స, దీని ద్వారా స్వస్థత కలుగుతుంది. అయితే రోగ ఆరంభంలో, అంతకంటే ముందు ఇంకా రోగం రాకుండా ఉండడానికి మరియు వచ్చిన వెంటనే ఆరంభంలో, మధ్యలో, చివరిలో, అన్ని వేళల్లో దీని ద్వారా చికిత్స మనం పొందుతూ ఉండాలి. చిట్టచివరిసారిగా కాదు, ఈ యొక్క తప్పును మనం సరిదిద్దుకోవాలి.
రెండో విషయం ఇందులో మనం గ్రహించాల్సింది, ఖుర్ఆన్ తప్పకుండా స్వస్థత. ఎందుకంటే అల్లాహ్ త’ఆలా తెలిపాడు ఈ విషయం ఖుర్ఆన్ లో. “వనునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫా”, వాస్తవానికి మేము ఖుర్ఆన్ ద్వారా, ఖుర్ఆన్ ను స్వస్థత కొరకు అవతరింపజేశాము. “వ రహ్మతుల్ లిల్ ముఅమినీన్“, విశ్వాసుల కొరకు కారుణ్యంగా పంపాము.
అయితే ఇంతటి సత్యమైన మాటను మనం ఎలా తిరస్కరించగలుగుతాము? కానీ ఎంత ఎక్కువగా మన విశ్వాసం ఉంటుందో, ఎంత సత్యంగా మనం నమ్మి దీని ద్వారా చికిత్స చేయిస్తామో, అంతే ఎక్కువగా, అంతే తొందరగా అల్లాహ్ యొక్క దయతో మనకు స్వస్థత కలుగుతుంది. ఈ రోజుల్లో కొంతమందికి ఖుర్ఆన్ చదివినప్పటికీ స్వస్థత కలుగుతలేదు అని ఎవరైతే అంటారో వారు ఖుర్ఆన్ ను శంకించకూడదు, ఇంకా విశ్వాసం పాడైపోతుంది. తనలో, తాను అనాలసిస్ చేసుకోవాలి. తనలో తాను మార్పు తీసుకురావాలి. తనలో ఏ లోపం ఉందో, ఏ దోషం ఉందో దానిని కనుక్కునే ప్రయత్నం చేయాలి, దానిని వెతకాలి.
చిన్న ఉదాహరణ, షుగర్ రోగం తగ్గడానికి సర్వసాధారణంగా డాక్టర్లు, షుగర్ స్పెషలిస్టులు ఒక టాబ్లెట్ ఇస్తారు. స్టార్టింగ్ లో 2 mg. ఒక వారం, పది రోజులు, పదిహేను రోజులు, ఇరవై రోజులు ఇచ్చి చూసి డౌన్ కాకపోతే కొంచెం పెంచుతారు. కొందరు మూడు, మరికొందరు ఐదు. ఇంకా తగ్గకుంటే ఇంకొంచెం డోస్ పెంచుతారు, ఒకటి కాడ రెండు, లేదా దానితో పాటు మరొకటి ఉంది, అది ఇస్తారు. కొందరి కొందరికి 300 కు పైగా, 400 కు ఆ విధంగా ఉండేది ఉంటే 400 కూడా దాటి ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ గురించి కూడా సలహా ఇస్తారు. కానీ అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఆయుర్వేద అనుభవజ్ఞులు, ఈ స్టార్టింగ్ డోస్ ద్వారానే మీకు 15 రోజుల్లో ఎందుకు తగ్గలేదు? మీరు ఏమైనా అన్నం తింటున్నారా? లేక మీరు పొటాటో లాంటి ఏమైనా కూరగాయలు తింటున్నారా? లేదా మీరు ఇంకా తీపి పదార్థాలు కూడా తింటూ ఉన్నారా? అని కూడా కనుక్కొని కొంచెం చురక పెడతారు. ఇది మీరు తగ్గించుకోకుంటే చాలా ప్రమాదంగా ఉంది అని. ఇక్కడ టాబ్లెట్ పని చేయకపోవడానికి ఒక ముఖ్య కారణం, అటువైపు నుండి మీరు ఏ పత్యం చేయాలో అందులో సరిగ్గా పాస్ అవ్వలేదు. ఒక్క కారణం చెప్తున్నాను, మీరు 100% గా ఇదే విషయాన్ని ఖుర్ఆన్ పై ఫిట్ చేయకండి, విషయం అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ఖుర్ఆన్ చదివినప్పటికీ శారీరక కొన్ని రోగాలు మనకు దూరం కాలేదంటే, ఖుర్ఆన్ లో ఎలాంటి కొరత లేదు నవూదుబిల్లాహ్, మనలో ఉంది. దాన్ని మనం అన్వేషించాలి, వెతకాలి, ఆ కొరత, ఆ లోపం, ఆ దోషాన్ని మనం దూరం చేసే ప్రయత్నం చేయాలి.
దీనికి సంబంధించి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. హజ్రత్ ఆయిషా సిద్దీఖా రది అల్లాహు త’ఆలా అన్హా తెలుపుతున్నారు. ఎప్పుడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా అనారోగ్యానికి గురి అయ్యారంటే, ఏం చేసేవారు? ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బి రబ్బిల్ ఫలక్, ఖుల్ అఊదు బి రబ్బిన్నాస్ చదువుకొని, తమ చేతులతో తమ శరీరంపై తుడుచుకునేవారు. ఎప్పుడైతే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణ వేదనకు గురి అయ్యారో, అప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ దువాలు చదివి, ఈ సూరాలు చదివి, ప్రవక్త యొక్క చేతులను పట్టుకొని, ప్రవక్త యొక్క చేతులలో ఊది, ఎంతవరకు చేరగలుగుతుందో నేను ప్రవక్త చేతులతోనే ప్రవక్త శరీరంపై తుడుచేదాన్ని.ఇప్పుడు నేను చెప్పిన హదీస్ సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది.
ముస్నద్ అహ్మద్ లో ఒక హదీస్ ఉంది, ఉక్బా రది అల్లాహు త’ఆలా అన్హు చెప్పారు. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఒక సందర్భంలో ఓ ప్రయాణంలో ఉన్నాను. సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజ్ లోని రెండు రకాతులలో సూరతుల్ ఫలక్ మరియు సూరతున్నాస్ చదివారు. మళ్ళీ చెప్పారు, “లమ్ యతఅవ్వద్ ముతఅవ్విదున్ బిమిస్లిహిన్”, ఓ ఉక్బా, ఏ రకమైన రోగం గానీ, ఏ సమస్య ఎదురైనా గానీ, ఈ రెండు సూరాల కంటే ఉత్తమమైన వేరే ఏదీ కూడా అవసరం లేవు. గమనించారా? యూదుల్లో ఒకరు ప్రవక్తపై చేతబడి చేశారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎందులోనైతే చేతబడి చేయడం జరిగిందో ఆ వస్తువులను తెప్పించారు. వాటిలో 11 ముడులు వేసి ఉన్నాయి. సూరతుల్ ఫలక్ మరియు సూరతున్నాస్, ఈ రెండు సూరాలలో కలిపి 11 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు సూరాల యొక్క తిలావత్ మొదలు పెట్టారు. ఒక్కొక్క ఆయత్ పూర్తి చేస్తున్నప్పుడు ఒక్కొక్క ముడి దానంతట అదే విడిపోయేది. ఏ విధంగా ముడులు విడిపోతూ ఉండేవో, ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వస్థత అనేది ఎక్కువగా, మంచిగా ఏర్పడుతూ వచ్చింది.
సహీహ్ బుఖారీ మరియు ముస్లింలో వచ్చినటువంటి అబూ సయీద్ ఖుద్రీ రది అల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం, వారు ఓ ప్రయాణంలో ఉన్నారు, ఓ ప్రాంతం నుండి వెళ్తున్నప్పుడు సాయంకాలం అయింది. ఆ ప్రాంతం యొక్క పెద్దలను కలిసి, మీ వద్ద మేము ఈ రాత్రి చుట్టాలుగా ఉంటాము, మాకు అనుమతి ఇవ్వండి అంటే వారు ఇవ్వలేదు. ఆ ప్రాంతం యొక్క బయట శివార్లలో ఎలాగో రాత్రి గడుపుదాము అని ఉన్నారు. అదే రాత్రి ఆ గ్రామ పెద్ద మనిషికి ఏదో ఒక విషపురుగు కాటేసింది. ఎవరెవరో మంత్రగాళ్ళను, డాక్టర్లను పిలిపించి చికిత్స గురించి ప్రయత్నం చేయడం జరిగింది కానీ తగ్గలేదు. అప్పుడు వారికి గుర్తొచ్చింది. అయ్యో, సాయంకాలం అయ్యేకి ముందుగా ఎవరో బయట నుండి కొందరు బాటసారులు వచ్చారు కదా, ఏమో వెళ్లి చూడండి కొంచెం ఏదైనా చుట్టుపక్కల ఉండవచ్చును, వారి దగ్గర ఏదైనా మంచి మందు ఉందో తెలుసుకుందాము. అబూ సయీద్ ఖుద్రీ రది అల్లాహు త’ఆలా అన్హు తన వెంట ఒక ఇద్దరిని తీసుకొని వెళ్లారు, సూరతుల్ ఫాతిహా చదివారు. అప్పటికప్పుడే అల్లాహ్ త’ఆలా ఆ గ్రామ పెద్ద మనిషికి ఆరోగ్యం ప్రసాదించాడు.
సోదర మహాశయులారా, ఈ విధంగా అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ ను శారీరక రోగాలకు కూడా స్వస్థతగా చేశాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ స్వస్థతకు అడ్డు కలిగించే విషయాలు ఏమున్నాయో, వాటి నుండి మనం దూరం ఉండడం కూడా చాలా చాలా అవసరం. ఒకవేళ వాటి నుండి మనం దూరం ఉండలేము అంటే చాలా నష్టపోతాము.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ గ్రంథాన్ని మన కొరకు స్వస్థత అని ఎన్నో హదీసుల్లో కూడా తెలిపారు. అంతేకాదు, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన కొరకు కొన్ని దువాలు కూడా నేర్పి ఉన్నారు. అందుకొరకు ఒక సహీ హదీస్ లో వస్తుంది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా సిద్దీఖా రది అల్లాహు త’ఆలా అన్హా వారి యొక్క ఉల్లేఖనం, ప్రవక్త వద్దకు ఒక అబ్బాయిని తీసుకురావడం జరిగింది. అతనికి అతనిపై షైతాన్ యొక్క ప్రభావం, షైతాన్ అతనిలో ప్రవేశించి ఉన్నాడు అని తెలిసింది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ఆయతులు తిలావత్ చేసి అతనిపై ఊదుతారు, అల్లాహ్ త’ఆలా అతనికి స్వస్థత ప్రసాదిస్తాడు. ఈ విధంగా ఇంకా ఎన్నో హదీసులు ఉన్నాయి,
కానీ చివరిలో నేను చెప్పే ముఖ్యమైన కొన్ని విషయాలు ఏమిటంటే, ఖుర్ఆన్ ద్వారా మనం ఎలా స్వస్థత పొందాలి. మొట్టమొదటి విషయం, నేను చెప్పినటువంటి రెండు విషయాలను నమ్మాలి. అల్లాహ్ యే సర్వశక్తిమంతుడు, అల్లాహ్ ముసబ్బిబుల్ అస్బాబ్, అన్ని సాధనాలకు మూల కారకుడు మరియు ఆ సాధనాలకు ఏ గుణం ఇచ్చాడో, ఆ గుణం ఇచ్చినవాడు అల్లాహ్ మాత్రమేనని. రెండో విషయం, అల్లాహ్ తలచినప్పుడే స్వస్థత కలుగుతుంది, అల్లాహ్ తలచినప్పుడే ప్రతీ సాధనం పని చేస్తుంది, అల్లాహ్ తలచినప్పుడే ఈ సృష్టిలో అల్లాహ్ కోరినది మాత్రమే జరుగుతూ వస్తుంది.
ఈనాటి నా ప్రసంగంలోని సారాంశంలో రెండో విషయం, ఖుర్ఆన్ ను మనం అల్లాహ్ యొక్క గ్రంథం అని, అల్లాహ్ యొక్క వాక్కు అని చాలా బలంగా విశ్వసించాలి. ఈ విశ్వాసంలో ఏ మాత్రం లోటు రాకూడదు, కొరత ఉండకూడదు, బలహీనంగా ఉండకూడదు.
ఈ ఖుర్ఆన్ మన యొక్క రోగాల, హృదయ రోగాలకు కూడా చికిత్స, మంచి ఔషధం, స్వస్థత కలుగుతుంది. అంటే, విశ్వాసం సరిగా లేనివారు విశ్వాసపరులు అవుతారు. నమాజులకు దూరం ఉన్నవారు నమాజు చదవగలుగుతారు. ఇంకా వేరే దుష్కార్యాలు చేసేవారు మంచి కార్యాలు చేయగలుగుతారు. కానీ ఎప్పుడు? ఖుర్ఆన్ ను చదివి శ్రద్ధగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఆచరించినప్పుడు. ఖుర్ఆన్ గ్రంథం మన యొక్క ధర్మపరమైన అనుమానాలకు మంచి స్వస్థత కలుగజేస్తుంది. మరియు ఖుర్ఆన్ గ్రంథం మనలో ఏ చెడు పనుల గురించి కోరికలు పుడతాయో, మన యొక్క చెడు మనస్సు ఏ చెడులకైతే ప్రేరేపిస్తుందో, వాటన్నిటి నుండి కూడా అల్హందులిల్లాహ్ స్వస్థత కలుగుతుంది. ఏ విధంగా? ఖుర్ఆన్ ను చదవడం ద్వారా, ఖుర్ఆన్ ను శ్రద్ధగా అర్థం చేసుకోవడం ద్వారా, ఖుర్ఆన్ ప్రకారంగా మన జీవితం గడుపుకోవడం ద్వారా.
అలాగే ఖుర్ఆన్ మన యొక్క శారీరక రోగాలకు కూడా మంచి స్వస్థత. అది కూడా ఎప్పుడు? పూర్తి నమ్మకం కలిగి ఉండాలి, పూర్తి సత్యంతో మనం ఈ ఖుర్ఆన్ ను స్వయం మనం అనారోగ్యానికి గురి అయినప్పుడు గానీ, లేక వేరే ఇంకా ఏదైనా రోగికి చదవాలి.
కానీ గుర్తుంచుకోండి సోదర మహాశయులారా, ఈ ఖుర్ఆన్ ద్వారా అల్హందులిల్లాహ్ అల్లాహ్ త’ఆలా ఏ స్వస్థత మనకు కలుగజేస్తాడని శుభవార్త ఇచ్చాడో, ఖుర్ఆన్ లోని ఎన్నో ఆయతులలో, ఈ ఖుర్ఆన్ ను ప్రజల రోగాల కొరకు స్వస్థత అని ప్రజల విశ్వాసాలను పాడు చేయకూడదు. అబద్ధపు, అసత్యపు బోర్డులు వేసి, సోషల్ మీడియా ద్వారా తమ గురించి ప్రచారం చేసుకుంటూ, తమ నెంబర్ ప్రజలకు ఇస్తూ, రూహానీ ఇలాజ్, ఖురానీ ఇలాజ్ మా దగ్గర జరుగుతుంది అంటూ వారిని షిర్క్ లో పడవేయడం గానీ, ఖురానీ ఇలాజ్ అన్న పేరుతో నిమ్మకాయలు, మిరపకాయలు, నల్ల కోడి, ఫలానా రాత్రి, ఫలానా చోట జిబా చేయాలి అన్నటువంటి ఆదేశాలు ఇవ్వడం, సోదర మహాశయులారా ఫలానా సమాధి వద్ద, ఫలానా బాబాగారు ఖుర్ఆన్ తో ఇలాజ్ మరియు స్వస్థత కలుగజేస్తాడట అని అలాంటి సమాధుల వైపునకు వెళ్లడం, ఈ విషయాలన్నీ ఏవైతే నేను ఇప్పుడు చెప్పాను చివరిలో, ఈ తప్పు విషయాల నుండి మనం చాలా దూరం ఉండాలి. వీటి ద్వారా విశ్వాసం పాడైపోతుంది, వీటి ద్వారా మనం ఇస్లాం నుండి దూరమైపోతాము అని మనం భయపడాలి.
అల్లాహ్ త’ఆలా మనందరికీ ఖుర్ఆన్ ద్వారా సరైన రీతిలో, అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో, ప్రవక్త యొక్క పద్ధతి, విధానంలో స్వస్థత కోరే, పొందే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.
జజాకుముల్లాహు ఖైరా, వ ఆఖిరు దఅవానా అనిల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
ప్రసంగ సారాంశం:
అల్లాహ్‌పై దృఢ విశ్వాసం: సర్వశక్తిమంతుడు అల్లాహ్ యే అని, ఆయన అనుమతి లేకుండా ఏదీ జరగదని గట్టిగా నమ్మాలి. అన్నీ ఆయన తలచినప్పుడే జరుగుతాయి.
ఖుర్ఆన్ – కేవలం చికిత్స కాదు, సంపూర్ణ స్వస్థత: అల్లాహ్ ఖుర్ఆన్‌ను కేవలం ఔషధం (దవా) లేదా చికిత్స (ఇలాజ్) అని చెప్పలేదు, సంపూర్ణ స్వస్థత (షిఫా) అని స్పష్టంగా చెప్పాడు. దీని అర్థం ఖుర్ఆన్ ద్వారా రోగం పూర్తిగా నయమవుతుంది.
శారీరక మరియు ఆధ్యాత్మిక రోగాలకు నివారణ: ఖుర్ఆన్ కేవలం జ్వరం, నొప్పి వంటి శారీరక రోగాలకే కాకుండా, అనుమానాలు, సందేహాలు, చెడు ఆలోచనలు వంటి హృదయ సంబంధమైన (ఆధ్యాత్మిక) రోగాలకు కూడా స్వస్థతను కలిగిస్తుంది.
విశ్వాసులకు ప్రత్యేకం: ఖుర్ఆన్ సర్వమానవాళికి మార్గదర్శకమైనప్పటికీ, దాని ద్వారా సంపూర్ణ స్వస్థత మరియు కారుణ్యం పొందేది విశ్వాసులు మాత్రమే. ఎందుకంటే వారు దానిని నమ్మి ఆచరిస్తారు.
సరైన పద్ధతిలో ఆచరించడం ముఖ్యం: తేనె సీసా ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యం రానట్లే, ఖుర్ఆన్‌ను చదవకుండా, అర్థం చేసుకోకుండా, దాని బోధనలను ఆచరించకుండా ఇంట్లో పెట్టుకుంటే స్వస్థత కలగదు.
మూఢనమ్మకాలకు దూరం: ఖుర్ఆన్ పేరుతో నిమ్మకాయలు, కోడి బలులు, సమాధుల వద్ద మొక్కుబడులు వంటి షిర్క్ మరియు మూఢనమ్మకాలకు పాల్పడకూడదు. ఇది విశ్వాసాన్ని నాశనం చేస్తుంది.
లౌకిక చికిత్సను తిరస్కరించరాదు: ఖుర్ఆన్ స్వస్థత ఇస్తుందని వైద్య చికిత్సను మానేయకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చికిత్స చేయించుకోవాలని బోధించారు. ఖుర్ఆన్ పారాయణంతో పాటు వైద్యం కూడా కొనసాగించాలి.
ముస్లింలు ఆచరించవలసిన విషయాలు:
విశ్వాసాన్ని బలపరచుకోండి: ప్రతిదీ అల్లాహ్ అధీనంలోనే ఉందని, ఆయన తలచినప్పుడే స్వస్థత లభిస్తుందని మీ విశ్వాసాన్ని దృఢపరచుకోండి.
ఖుర్ఆన్‌ను రోజూ పారాయణం చేయండి: ఖుర్ఆన్‌ను అర్థంతో సహా క్రమం తప్పకుండా చదవండి. దాని బోధనలను మీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించండి.
రుఖియా (ఖుర్ఆన్ ద్వారా చికిత్స) చేసుకోండి: అనారోగ్యానికి గురైనప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన పద్ధతిలో సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఫలక్, సూరతున్నాస్ వంటి సూరాలను చదివి మీపై లేదా రోగిపై ఊదుకోండి.
దువా చేయండి: స్వస్థత కోసం అల్లాహ్‌ను ప్రార్థించండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేర్పిన దువాలను నేర్చుకొని వాటి ద్వారా అల్లాహ్‌ను వేడుకోండి.
పాపాలకు దూరంగా ఉండండి: స్వస్థతకు అడ్డుపడే పాప కార్యాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. మీలో ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.
మూఢనమ్మకాలను వదిలివేయండి: ఖుర్ఆన్ పేరుతో జరిగే మోసాలకు, షిర్క్‌కు దారితీసే పద్ధతులకు దూరంగా ఉండండి. స్వస్థతను ఇచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమేనని నమ్మండి.
వైద్య చికిత్సను నిర్లక్ష్యం చేయవద్దు: రుఖియాతో పాటు నిపుణులైన వైద్యుల సలహా తీసుకోండి మరియు వారు సూచించిన మందులను వాడండి. ఇస్లాం వైద్య చికిత్సను ప్రోత్సహిస్తుంది.
సమస్య ఆరంభంలోనే ఖుర్ఆన్‌ను ఆశ్రయించండి: కేవలం అన్ని దారులు మూసుకుపోయాకే కాకుండా, అనారోగ్యం ప్రారంభ దశలోనే ఖుర్ఆన్ ద్వారా స్వస్థత కోసం ప్రయత్నించండి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.