దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం మరణం మరియు సమాధి జీవితం (బర్ జఖ్) గురించిన వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. మరణ దూత (మలకుల్ మౌత్) అందరికీ ఒకరేనని, వేర్వేరు మతాల వారికి వేర్వేరు దూతలు ఉండరని స్పష్టం చేస్తుంది. విశ్వాసులు మరియు అవిశ్వాసుల మరణ అనుభవాలలో తేడా ఉంటుందని సహీ హదీసుల ఆధారంగా వివరిస్తుంది. విశ్వాసి ఆత్మ శాంతియుతంగా తీయబడి, స్వర్గపు సువాసనలతో స్వీకరించబడి, ఆకాశాలలో గౌరవించబడుతుంది. దీనికి విరుద్ధంగా, అవిశ్వాసి ఆత్మ కఠినంగా తీయబడి, నరకపు దుర్వాసనలతో అవమానించబడుతుంది. సమాధిలో పెట్టడం అనేది సాధారణ పద్ధతి అయినప్పటికీ, దహనం చేయబడిన లేదా ఏ విధంగానైనా శరీరం నాశనమైనప్పటికీ, ఆత్మకు శిక్ష లేదా బహుమానం తప్పదని ఖురాన్ మరియు హదీసుల ద్వారా వివరిస్తుంది. ఈ మధ్య కాలాన్ని “బర్ జఖ్” అని అంటారు. చివరగా, సమాధిలో జరిగే ముగ్గురు దేవదూతల ప్రశ్నలు (నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు?) మరియు వాటికి విశ్వాసులు, అవిశ్వాసులు ఇచ్చే సమాధానాలను చర్చిస్తుంది.
أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ (అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్) సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక. ఇక ఆ తర్వాత.
మరణ దూత గురించి ఒకే ఒక వాస్తవం
చావు మరియు సమాధి శిక్షణ గురించి ఒక ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్నలో ఎన్నో ఇంకా లింక్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానంగా ఈ ఆడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. శ్రద్ధగా వింటారని, విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.
మొదటి విషయం ఏమిటంటే, సామాన్యంగా చావు దూత అని, మలకుల్ మౌత్ అని, మౌత్ కా ఫరిష్తా అని, లేదా యమదూత అని ఏదైతే అంటారో, హిందువులకు వేరు, ముస్లింలకు వేరు, క్రైస్తవులకు వేరు, వేరే ఇంకా మతాలు అవలంబించే వారికి వేరు, అలాగా ఏమీ లేరు. ఇలాంటి భ్రమలో నుండి మనం బయటికి రావాలి. వాస్తవానికి, ప్రాణం తీసే దూత మరియు ఆయనకు తోడుగా వచ్చే అటువంటి దూతలు, ఆ తోడుగా వచ్చే దూతల యొక్క సంఖ్య అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అయితే, ఇక్కడ మనకు ఖురాన్ హదీస్ ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే, విశ్వాసులు, పుణ్యాత్ములు వీరికి వీరి యొక్క ప్రాణం ఒక రకంగా తీయడం జరుగుతుంది మరియు ఎవరైతే అవిశ్వాసులు లేదా విశ్వాసులుగా ఉండి కలిమా చదివి కూడా మహా పాపాత్ములు ఉంటారో వారి యొక్క ప్రాణం మరో రకంగా తీయడం జరుగుతుంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఖురాన్ యొక్క ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఏదైనా వేరే సందర్భంలో ఆ ఆయతులు, ఆ వాటి యొక్క అర్థం భావం అనేది ఇన్ షా అల్లాహ్ రికార్డ్ చేసి పంపుదాము. కానీ సంక్షిప్తంగా ప్రస్తుతం ఏంటంటే, సహీ హదీస్లో వచ్చిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు.
విశ్వాసి మరణ ఘట్టం
విశ్వాసుడు, పుణ్యాత్ముడు అతని ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు, ప్రాణం తీసే దూత, ఆయన కూడా దైవదూతనే, ప్రాణం తీసే దూత వస్తాడు మరియు స్వర్గం నుండి కరుణ దూతలు కూడా హాజరవుతారు. స్వర్గం నుండి వారు సువాసనతో కూడి ఉన్నటువంటి వస్త్రాలు తీసుకొని వస్తారు. ఆ తర్వాత అతని దగ్గర కూర్చుండి, ప్రభువు యొక్క కారుణ్యం వైపునకు, అల్లాహ్ యొక్క సంతృష్టి వైపునకు వచ్చేసెయ్ ఓ పవిత్ర ఆత్మా, ఈ రోజు నీపై నీ ప్రభువు ఏమీ కోపగించుకోకుండా నీ పట్ల సంతృప్తి కలిగి ఉన్నాడు అన్నటువంటి శుభవార్తలు వినిపిస్తూ ఉంటారు. దీని సంక్షిప్త విషయం ఖురాన్ సూరే హామీమ్ అస్సజ్దాలో కూడా వచ్చి ఉంది.
وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ (వ అబ్షిరూ బిల్ జన్నతిల్లతీ కున్తుం తూ’అదూన్) “మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం ఇదేనని సంతోషించండి.” (41:30)
ఇక ప్రాణం తీసే దూత ఎంతో సునాయాసంగా, నిదానంగా మంచి విధంగా అతని యొక్క ప్రాణం తీస్తాడు. ఆ మనిషి యొక్క ఆత్మ కూడా మంచి విధంగా ఆ ప్రాణం తీసే దూత యొక్క చేతుల్లోకి వచ్చేస్తుంది. దానికి కూడా హదీసుల్లో కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ దైవదూతలు వెంటనే ఆ సువాసనలతో కూడి ఉన్నటువంటి స్వర్గపు వస్త్రాలలో ఆ ఆత్మను చుట్టుకొని ఆకాశం పైకి వెళ్తారు. మొదటి ఆకాశం ద్వారాలు మూయబడి ఉంటాయి. అయితే అక్కడ తీసుకుపోయే దూతలు పర్మిషన్ కోరుతారు. ఆకాశపు యొక్క ఆ దూతలు అడుగుతారు, ఈ మంచి ఆత్మ ఎవరిది మీరు తీసుకొని వస్తున్నారు? అయితే అతని యొక్క మంచి పేరు, మంచి గుణాలు ఈ దైవదూతలు తెలియజేస్తారు. ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి. ఆ మొదటి ఆకాశపు దైవదూతలు ఘనంగా ఇతన్ని స్వాగతిస్తూ ఆ దూతలతో కలిసి ఇంకా పైకి వెళ్తారు. ఈ విధంగా రెండో ఆకాశం పైకి చేరుతారు. అలాగే అక్కడ కూడా స్వాగతం జరుగుతుంది, ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. చివరికి ప్రతి ఆకాశంలో కూడా అలాగే జరుగుతుంది. ఏడో ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదేశం వస్తుంది. నా యొక్క ఈ దాసుని యొక్క ఆ నామము عِلِّيِّينَ (ఇల్లియీన్) ఉన్నతమైన స్థానం లో రాయండి. మరో ఉల్లేఖన ప్రకారం, ఇతని యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో, దీని ఇతడు స్వర్గపు యొక్క రుచులు, స్వర్గపు యొక్క మంచి అనుభవాలు పొందుతూ ఉంటాడు. కానీ, మళ్ళీ అతన్ని ప్రశ్నించడానికి తిరిగి ఆ మనిషిని ఏదైతే సమాధిలో ఖననం చేయడం జరుగుతుందో, ఆ అతని శరీరంలో పంపడం జరుగుతుంది. ఇది విశ్వాసుడు, పుణ్యాత్ముని యొక్క ఆత్మ ఏదైతే తీయడం జరుగుతుందో దాని యొక్క సంక్షిప్త విషయం.
అవిశ్వాసి మరణ ఘట్టం
ఇక మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కాఫిర్ (అవిశ్వాసుడు), ఫాసిఖ్ వ ఫాజిర్ (పాపాత్ములు) వారి యొక్క ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ప్రాణం తీసే దూత వస్తాడు మరియు నరకం నుండి శిక్ష దూతలు దుర్వాసనతో కూడి ఉన్న చెడ్డ వస్త్రాలను తీసుకొని వస్తారు. ప్రాణం తీసే దూత ఓ చెడు ఆత్మా, వచ్చేసెయ్ అల్లాహ్ యొక్క కోపం, ఆగ్రహం వైపునకు అని అంటారు. అతని యొక్క ఆత్మ శరీరంలో తిరుగుతుంది. ఆ ప్రాణం తీసే దైవదూత చేతిలోకి రావడానికి రెడీగా ఉండదు. కానీ బలవంతంగా తీయడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఆ దూతలు ఆ వస్త్రాల్లో చుట్టుకొని పైకి వెళ్తారు. కానీ ఆకాశపు ద్వారాలు తెరవబడవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ లోని ఈ ఆయత్ కూడా చదివారు:
لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ (లా తుఫత్తహు లహుమ్ అబ్వాబుస్ సమా’) వారి కొరకు ఆకాశ ద్వారాలు తెరవబడవు. (7:40)
మళ్ళీ అక్కడి నుండే అతని యొక్క ఆత్మను క్రిందికి విసిరివేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరే హజ్ లోని ఆయత్ చదివారు:
وَمَن يُشْرِكْ بِاللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ (వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫక అన్నమా ఖర్ర మినస్ సమా’ఇ ఫతఖ్తఫుహుత్ తైరు అవ్ తహ్వీ బిహిర్ రీహు ఫీ మకానిన్ సహీఖ్) అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయిన వాని వంటివాడు. పక్షులు అతన్ని తన్నుకుపోతాయి, లేదా గాలి అతన్ని దూరప్రాంతానికి విసిరివేస్తుంది. (22:31)
అంటే అల్లాహ్ తో పాటు షిర్క్ చేసేవారు, ఇలా పాపాలలో తమ జీవితం పూర్తిగా గడిపేవారు, పాపాలలో విలీనమైన వారు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వారి యొక్క ఉపమానం ఎలా తెలుపుతున్నాడంటే,
فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ (ఫక అన్నమా ఖర్ర మినస్ సమా) ఆకాశం నుండి పడిపోయిన వాని వలె. ఆకాశం నుండి పడిపోయిన వారు, ఇక అతనిని పక్షులు తమ యొక్క చుంచులతో వేటాడుతాయి, లాక్కుంటాయి, లేదా గాలి అనేది అటు ఇటు ఎక్కడైనా విసిరి పారేస్తుంది. అక్కడి నుండి పారేయడం జరుగుతుంది. అయితే ఏడు భూముల కింద سِجِّين (సిజ్జీన్) ఖైదీల చిట్టా అనే ఏదైతే దఫ్తర్ (రిజిస్టర్), ప్రాంతం ఏదైతే ఉందో అందులో అతని నామం రాయడం జరుగుతుంది. ఇక అతన్ని, ఆ శరీరం, భౌతికాయాన్ని అతని బంధువులు ఖననం చేశారంటే, అక్కడ ప్రశ్నోత్తరాల గురించి అందులో పంపడం జరుగుతుంది.
సమాధి జీవితం (బర్ జఖ్)
ఇక ఆ తర్వాత, సమాధిలో ఏదైతే పెట్టడం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది సంక్షిప్తంగా వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరంగా ఆ విషయాలు తెలిపారు. కానీ ఆ విషయాల యొక్క వివరణలో వెళ్ళేకి ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. అదేమిటంటే, సామాన్యంగా సమాధి యొక్క శిక్ష లేదా సమాధి యొక్క వరాలు అని ఏదైతే అనడం జరుగుతుందో, ఇక్కడ ఇలా ఎందుకు అనడం జరుగుతుంది అంటే, వాస్తవానికి మానవ చరిత్రలో మానవునికి ఇవ్వబడిన ఆదేశ ప్రకారం అతన్ని సమాధిలో పెట్టడమే. ఇక ఎవరైతే సమాధిలో పెట్టకుండా వేరే పద్ధతులు అవలంబిస్తున్నారో, వారు స్వభావానికి, ప్రకృతికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ఇదొక మాట అయితే, రెండో మాట ఏమిటంటే, అధిక శాతం చనిపోయే వారిని సమాధిలో పెట్టడం జరుగుతుంది. అందుకొరకే ఈ పదాలు ఉపయోగించబడ్డాయి.
కానీ ఇక ఎవరైనా, ఎవరిదైనా కాల్చివేయడం జరిగితే, లేదా ఎవరైనా అగ్నికి ఆహుతి అయి పూర్తిగా బూడిదైపోతే, లేదా ఏదైనా మృగ జంతువు యొక్క ఆహారంగా మారిపోతే, ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే, మనిషిని బొందలో పెట్టకుండా, సమాధిలో పెట్టకుండా ఏ విధంగా ఏది జరిగినా గానీ, ఈ శరీరం ఏదైతే ఉందో, భౌతికాయం అని ఏదైతే అంటామో అది నాశనమైపోతుంది. కానీ ఆత్మ అయితే ఉంటుంది. అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే ఆత్మకైనా శిక్ష ఇవ్వవచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలై దీనికి సంబంధించిన ఎన్నో వివరాలు తెలిపి ఉన్నారు. అల్లాహ్ తలుచుకుంటే ఆ కుళ్ళిపోయిన, కాలిపోయిన, ఆహారంగా మారిపోయిన ఆ శరీరాన్ని మరోసారి ఉనికిలోకి తీసుకురావచ్చు. లేదా అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే కొత్త శరీరం ప్రసాదించవచ్చు. అల్లాహ్ తలుచుకుంటే, సమాధి యొక్క శిక్షలు మరియు వరాలు ఏవైతే ఉన్నాయో, శిక్షలు అంటే అవిశ్వాసులకు పాపాత్ములకు, వరాలు అంటే, అనుగ్రహాలు అంటే విశ్వాసులకు మరియు పుణ్యాత్ములకు, ఈ సమాధి శిక్షలు లేదా అనుగ్రహాలు, వరాలు ఇవి ప్రతి ఒక్కరికీ జరిగి ఉంటాయి.
وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ (వ మిన్ వరా’ఇహిమ్ బర్ జ ఖున్ ఇలా యౌమి యుబ్ ‘అసూన్) వారి వెనుక పునరుత్థాన దినం వరకు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది. (23:100)
దీన్నే కొందరు మధ్య కాలం, ఇటు ఇహలోకం అటు పరలోకం, దాని మధ్య లోకం ఇది. మధ్య లోకంలో ఇవి తప్పకుండా జరిగి ఉంటాయి. తప్పకుండా జరిగి ఉంటాయి. ఈ విశ్వాసం మనం తప్పకుండా మనసులో నిశ్చయించాలి. ఈ విషయాలను నమ్మాలి.
సమాధిలో ప్రశ్నోత్తరాలు
ఇక సమాధిలో… సమాధి అంటే ఇక్కడ గుర్తు ఉంది కదా, ఒకవేళ ఎవరినైనా సమాధిలో పెట్టడం జరగకపోయినా గానీ వారిని ప్రశ్నించడం జరుగుతుంది. వచ్చి దైవదూత అడుగుతాడు, నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? అప్పుడు విశ్వాసుడు అయితే, నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు నా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానం ఇస్తాడు. తర్వాత నాలుగో ప్రశ్న అడగడం జరుగుతుంది, ఈ విషయాలు నీవు ఎలా తెలుసుకున్నావు అని? అతడు చెబుతాడు, నేను ఖురాన్ ను చదివాను, ధర్మం నేర్చుకున్నాను అని.
ఇక ఎవరైతే అవిశ్వాసి లేదా పాపాత్ముడై ఉంటాడో, మహా ఘోరమైన పాపాత్ముడు, అలాంటి వారు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వరు. అయ్యో, మాకు తెలియదు, ప్రజలు అన్నట్లుగా మేమన్నాము అని అంటారు. నువ్వు ఎందుకు తెలుసుకోలేదు, ఎందుకు చదువుకోలేదు, ఎందుకు చదువుకున్న వారిని అనుసరించి ఖురాన్ పారాయణం చేయలేదు అని చెప్పుకుంటూ వారిని కొట్టడం, శిక్షించడం జరుగుతుంది.
ముగింపు
ఇక సమాధిలో, ఈ మధ్య లోకంలో జరిగే అటువంటి మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి. కానీ సమయం ఇప్పటికే ఎక్కువైనందుకు నేను ఇంతటితో ముగిస్తున్నాను. కానీ మీ యొక్క ప్రశ్నకు సమాధానం లభించింది అని ఆశిస్తున్నాను. సంక్షిప్తంగా మీ ప్రశ్న ఏముండే? ఎవరి చావు ఎట్లా వస్తుంది? హిందువులకు వేరే రకంగా యమదూత వస్తాడా, ప్రాణం తీసే దూత వస్తాడా? ఇంకా ముస్లింలకు వేరే దూతనా? మనలాంటి, మనకు జరిగే విధంగానే వారికి జరుగుతాయా? మరి వారినైతే సమాధిలో పెట్టడం జరగదు కదా, కాల్చేస్తారు కదా, మరి వారికి ఎలా జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఏవైతే వచ్చాయో వాటన్నిటినీ కలుపుకొని ఈ సంక్షిప్త విషయం తెలపడం జరిగింది.
చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని, మళ్ళీ అల్లాహ్ యొక్క మైదానే మహ్షర్ లో నిలబడే వరకు ఏ ఏ సంఘటనలు జరుగుతాయని ఖురాన్ మరియు సహీ హదీసులలో తెలపబడ్డాయో, వాటన్నిటినీ మనం విశ్వసించి ఆ ప్రకారంగా మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఉంచేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా ఆఖరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.
أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.