అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ﷺ ను మించి పోవటం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ﷺ ను మించి పోవటం
షేక్ హబీబుర్రహ్మాన్ జామయి(హఫిజహుల్లాహ్)
https://youtu.be/omW0Jrb-7Xk [5 నిముషాలు]

ఈ ప్రసంగం ఇస్లాం యొక్క ప్రాథమిక సూత్రమైన విధేయతను చర్చిస్తుంది. ఒక విశ్వాసి, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్పష్టమైన ఆదేశాల కంటే ఇతరుల—కుటుంబం, పండితులు లేదా తనతో సహా—మాటలకు లేదా అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చా అనే కేంద్ర ప్రశ్నను ఇది అన్వేషిస్తుంది. అలాంటి ప్రాధాన్యత అనుమతించబడదని వక్త ఖురాన్ (సూరా అల్-హుజురాత్ 49:1 మరియు సూరా అల్-మాయిదా 5:2) మరియు బుఖారీ, ముస్లింల నుండి ఒక హదీసును ఉటంకిస్తూ దృఢంగా స్థాపించారు. నిజమైన విశ్వాసానికి దైవిక ఆదేశాలకు సంపూర్ణ లొంగుబాటు అవసరమని, మరియు మతపరమైన విషయాలలో ఏదైనా విచలనం, జోడింపు లేదా స్వీయ-ఉత్పన్నమైన తీర్పు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కంటే “ముందుకు వెళ్ళడంగా” పరిగణించబడుతుందని దీని ముఖ్య సారాంశం. పుణ్యం మరియు ధర్మబద్ధమైన పనులలో సహకారం ప్రోత్సహించబడింది, కానీ పాపం మరియు అతిక్రమణ విషయాలలో ఖచ్చితంగా నిషేధించబడింది.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాఇ వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశాలపై మనం ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలమా? ఈ ప్రశ్నకి మనము ఈరోజు సమాధానం తెలుసుకుంటున్నాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలపై మనం ఇతరులకు, ఆ ఇతరులు బంధువులు కావచ్చు, అమ్మానాన్న కావచ్చు, పండితులు కావచ్చు, ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలమా?ముమ్మాటికీ లేదు. మనము అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలపై ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వలేము.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో సూరతుల్ హుజురాత్, ఆయత్ నంబర్ ఒకటిలో ఇలా సెలవిచ్చాడు,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుఖద్దిమూ బైన యదయిల్లహి వ రసూలిహీ వత్తఖుల్లాహ, ఇన్నల్లాహ సమీవున్ అలీమ్)

విశ్వాసులారా, అల్లాహ్ ను ఆయన ప్రవక్తను మించిపోకండి. అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ సమస్తము వినేవాడు, సర్వము ఎరిగినవాడు.” (49:1)

అంటే ధార్మిక విషయాలలో తమంతట తాముగా నిర్ణయాలు తీసుకోవటం గానీ, తమ ఆలోచనలకు పెద్ద పీట వేయటం గానీ చేయరాదు. దీనికి బదులు వారు అల్లాహ్ కు, దైవ ప్రవక్తకు విధేయత చూపాలి. తమ తరఫున ధర్మంలో హెచ్చుతగ్గులు చేయటం, సరికొత్త విషయాలను కల్పించటం వంటి పనులన్నీ దైవాన్ని, దైవ ప్రవక్తకు మించిపోవటంగా భావించబడతాయి.

అలాగే, ఖురాన్ మరియు హదీసులతో నిమిత్తం లేకుండా ధార్మిక తీర్పు ఇవ్వకూడదు. అలాగే ఒకవేళ ఏదైనా తీర్పు ఇస్లామీయ షరీఅతుకు విరుద్ధంగా ఉందని తెలిస్తే, ఇక దాని కోసం ప్రాకులాడకూడదు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆజ్ఞలను శిరోధార్యంగా భావించటమే ఒక విశ్వాసికి శోభాయమానం. తద్భిన్నంగా అతను ఇతరుల అభిప్రాయాలను కొలబద్దగా తీసుకుంటే తలవంపు తప్పదు అని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి.

దీనికి సారాంశం బుఖారీ మరియు ముస్లింలోని ఒక హదీస్ ఉంది. దాని అర్థం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవిధేయతకు, అంటే అల్లాహ్ అవిధేయతకు దారి తీసే ఏ విషయంలోనూ ఎవరికీ విధేయత చూపకూడదు. అయితే మంచి విషయాలలో విధేయత చూపవచ్చు అన్నమాట. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లింలో ఉంది.

ఈ విషయాన్నే ఇంకో విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ మాయిదాలో సెలవిచ్చాడు,

وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَلْعُدْوَانِ
(వ తఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా, వలా తఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్)
సత్కార్యాలలో, అల్లాహ్‌ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి (5:2)

అంటే అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒకరికొకరుని తోడుపడుతూ ఉండండి, సహాయం చేస్తూ ఉండండి, అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండండి, తోడుపడుతూ ఉండండి. పాప కార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశాలపై మనం ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రాధాన్యత అల్లాహ్ కి, ప్రాధాన్యత ఆయన ప్రవక్తకి మాత్రమే ఇవ్వాలి.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43614


విశ్వాసి తన కోసం ఇష్టపడే వస్తువునే తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి [వీడియో]

విశ్వాసి తన కోసం ఇష్టపడే వస్తువునే తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి | బులూగుల్ మరాం | హదీసు 1256
https://youtu.be/aWHz-iM7Tq4 [12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1256. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆ పవిత్రమూర్తి సాక్షిగా చెబుతున్నాను తన స్వయం కొరకు ఇష్టపడేదే తన ఇరుగు పొరుగు లేక తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకూ ఏ దాసుడూ విశ్వాసి (మోమిన్) కాలేడు.” (బుఖారీ, ముస్లిం)

సారాంశం:

ఈ హదీసులో విశ్వాస పరిపూర్ణత కొరకు ఒక షరతు విధించబడింది. అదేమంటే విశ్వాసి అయినవాడు తన కోసం ఇష్టపడే వస్తువునే తన పొరుగువారి కోసం లేదా తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి. సమాజంలో తన గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడించాలని అతను కాంక్షిస్తున్నపుడు ఇతరులు కూడా అలాగే కోరుకుంటారని అతడు తలపోయాలి. కనుక ఇతరుల గౌరవ ప్రతిష్ఠలకు తన తరపున విఘాతం కలగకుండా చూసుకోవాలి. తనకు శాంతీ సౌఖ్యాలు ప్రాప్తించాలని కోరుకున్నప్పుడు సాటి వ్యక్తుల కోసం కూడా అదేవిధంగా ఆలోచించాలి. వ్యక్తుల్లో ఇలాంటి సకారాత్మక ఆలోచనలున్నప్పుడు సమాజమంతా సుఖశాంతులకు నిలయమవుతుంది. ప్రగతి పథంలో సాఫీగా సాగిపోతుంది. అశాంతి అలజడులుండవు. ఒకరింకొకరి శ్రేయస్సును అభిలషించే వారుగా, ఒండొకరి యెడల సానుభూతి పరులుగా ఉంటారు. ఒక సత్సమాజానికి ఉండవలసిన ప్రధాన లక్షణమిదే.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ఇస్లాం స్వీకరించి, దాని ప్రకారం ఆచరిస్తాడో అతను గతంలో చేసిన ప్రతి పుణ్యాన్ని అల్లాహ్ వ్రాసి పెడతాడు| విశ్వాస పాఠాలు | హదీసు 13 [వీడియో]

బిస్మిల్లాహ్

[8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُولُ اللهِ : (إِذَا أَسْلَمَ الْعَبْدُ فَحَسُنَ إِسْلَامُهُ كَتَبَ اللهُ لَهُ كُلَّ حَسَنَةٍ كَانَ أَزْلَفَهَا وَمُحِيَتْ عَنْهُ كُلُّ سَيِّئَةٍ كَانَ أَزْلَفَهَا ثُمَّ كَانَ بَعْدَ ذَلِكَ الْقِصَاصُ الْحَسَنَةُ بِعَشْرَةِ أَمْثَالِهَا إِلَى سَبْعِ مِائَةِ ضِعْفٍ وَالسَّيِّئَةُ بِمِثْلِهَا إِلَّا أَنْ يَتَجَاوَزَ اللهُ عَزَّ وَجَلَّ عَنْهَا)

13- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని అబూ సఈద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఏ దాసుడు ఇస్లాం స్వీకరించి, దాని ప్రకారం ఆచరిస్తాడో అతను గతంలో చేసిన ప్రతి పుణ్యాన్ని అల్లాహ్ వ్రాసి పెడతాడు. గతంలో చేసిన అతని ప్రతి పాపం మన్నించబడుతుంది. ఆ తర్వాత పుణ్యపాపాల ఫలితాల లెక్క కొత్తగా మొదలవుతుంది. ఒక సత్కార్య పుణ్యం పది రెట్ల నుండి ఏడువందల వరకు లభిస్తుంది. దుష్కార్య పాపము దానంతే లభిస్తుంది. అల్లాహ్ దయతలుస్తే మన్నించనూవచ్చు”. (నిసాయీ 4912).


ఈ హదీసులో:

కొందరు సంపూర్ణంగా ఇస్లాం ప్రకారం నడిచేవారుంటే మరికొందరు అసంపూర్ణంగా నడిచేవారుంటారు. అందుచేత వారిలో ఒకరిపై మరొకరికి ఘనత ఉంటుంది. అందుకే అది (ఇస్లాం, ఈమాన్) తరుగుతుంది, పెరుగుతుంది. ఇస్లాంలో ప్రవేశం ద్వారా పూర్వ పాపాలన్నీ మన్నించబడతాయి. అలాగే తౌబా (నిజమైన పశ్చాత్తాపంతో కూడిన క్షమాభిక్ష) ద్వారా పాపాలు మన్నించబడతాయి. అంతేకాదు సంకల్పశుద్ధి మరియు ప్రవక్త పద్ధతిని అనుసరించి చేసిన సత్కార్యాలు కూడా దుష్కార్యాలకు పరిహారమవుతాయి. అల్లాహ్ కారుణ్యం చాలా విశాలమైనది. అందుకే సత్కార్య పుణ్యాన్ని పది రెట్ల నుండి ఏడువందల రెట్ల వరకు పెంచాడు. దుష్కార్య పాపం దానంతే ఉంచాడు. ఒక్కోసారి అల్లాహ్ దయతలచి సత్కార్యాలకు బదులుగా కాకుండా తనిష్టంతో పాపాల్ని మన్నిస్తాడు. కాని పెద్ద పాపాల మన్నింపుకై తప్పనిసరిగా తౌబా చేయవలసిందేనని ఆధారాలుగలవు. అవిశ్వాసుని ఏ ఒక్క కార్యం స్వీకరించబడదు అన్న విషయం తెలిసినదే. అయినా ఈ హదీసు ద్వారా కూడా తెలిసింది. ఈ హదీసులో దాసుడు అని సాధారణంగా చెప్పబడినది, అయితే స్త్రీలకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది.


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw

విశ్వాసి, అవిశ్వాసి కన్నా ఎక్కువ గౌరవ, మర్యాదలకు అర్హుడు | విశ్వాస పాఠాలు | హదీసు 12 [వీడియో]

బిస్మిల్లాహ్

[10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنْ عَائذِ بنِ عَمرو أَنَّهُ جَاءَ يَومَ الْفَتحِ مَعَ أبِي سُفيانَ بنِ حَربٍ وَرَسُولُ اللهِ حَولَه أصْحَابُهُ فَقَالُوا: هَذَا أبُو سُفيانَ وَعَائِذُ بنُ عَمرو فَقَالَ رَسُولُ اللهِ : (هَذَا عَائِذُ بنُ عَمرو وَأبو سُفيَانَ ، الإسْلاَمُ أَعَزُّ مِنْ ذَلِكَ، الإسلاَمُ يَعْلُو وَلاَ يُعلى).

12- ఆయిజ్ బిన్ అమ్ర్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, మక్కా జయింపబడిన రోజు అతను అబూ సుఫ్యాన్ (*) తో కలసి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చాడు. ఆయన చుట్టూ కూర్చొని ఉన్న సహచరులు (వీరు వస్తున్నది చూసి) అదిగో అబూ సుఫ్యాన్ మరియు ఆయిజ్ బిన్ అమ్ర్ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

“వీరు ఆయిజ్ బిన్ అమ్ర్ మరియు అబూ సుఫ్యాన్. ఇస్లాం ధర్మం ఇతనికంటే గౌరవనీయమైనది, గొప్పది. ఇస్లాం ధర్మం ఎన్నటికీ అగ్రస్థానం లో ఉంటుంది తప్ప క్రిందికి వంగి ఉండదు సుమా”.

(సునన్ దార్ ఖుత్నీ, సుననుల్ కుబ్రా బైహఖీ. అల్ ఇర్వా 1268).

(*) ఆ సమయాన అబూ సుఫ్యాన్ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. కాని ఆయిజ్ బిన్ అమ్ర్  అప్పటికే ఇస్లాం స్వీకరించిఉన్నారు.


ఈ హదీసులో:

సర్వ మతాల్లోకెల్లా ఇస్లాం మాత్రమే అల్లాహ్ యొక్క సత్య ధర్మం. విశ్వాసి, అవిశ్వాసికన్నా ఎక్కువ గౌరవ, మర్యాదలకు అర్హుడు. ఆ అవిశ్వాసి ఎంత గొప్ప స్థానం, హోదా అంతస్తులు కలిగి ఉన్నవాడైనా సరే. ఎందుకంటే ఇస్లాం వీటన్నిటికంటే గొప్పది. గౌరవం, ప్రతిష్ట, ప్రేమ మర్యాదల్లో విశ్వాసి, అవిశ్వాసులు సమానులు కాజాలరు. ముస్లిం వద్ద ఇస్లాం ఉన్నందువల్ల అతని మాటే వేరు.

విశ్వాసి, అవిశ్వాస బంధువుల ఆస్తిలో హక్కుదారుడవుతాడు కాని అవిశ్వాసి, తన విశ్వాస బంధువుల ఆస్తిలో హక్కుదారుడు కాడని కొందరు పండితులు సిద్ధాంతీకరించారు. కాని నిజమైన మాటేమిటంటే విశ్వాసి, అవిశ్వాసులిద్దరూ పరస్పరం ఆస్తిలో హక్కుదారులు కాజాలరు.


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw