జ్యోతిష్యం (Astrology) [వీడియో & టెక్స్ట్]

జ్యోతిష్యం (Astrology)
https://youtu.be/8-736OAwe1A [5 నిముషాలు]
వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో జ్యోతిష్యం మరియు భవిష్యవాణి యొక్క నిషేధం గురించి చర్చించబడింది. భవిష్యత్తు మరియు అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉందని, ప్రవక్తలకు కూడా ఆ జ్ఞానం లేదని ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేయబడింది. జ్యోతిష్కులను సంప్రదించడం మరియు వారి మాటలను విశ్వసించడం ఇస్లాంలో తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుందని, అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించడంతో సమానమని హెచ్చరించబడింది.

ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్, అమ్మా బ’అద్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ 14వ ఎపిసోడ్ లో జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం.

జ్యోతిష్యం అంటే ఇతరుల భవిష్యత్తు గురించి చెప్పడం. కొందరు తమకు కానరాని వాటి గురించి, భవిష్యత్తు గురించి జ్ఞానం ఉందని అంటారు. ఇటువంటి వారిని జ్యోతిష్కుడు, మాంత్రికుడు అని అంటారు.

జ్యోతిష్యం చెప్పడం గురించి ఇస్లాంలో నిషేధించబడింది. అలాగే జ్యోతిష్కుని దగ్గరకు వెళ్ళటం కూడా పాపమే. భవిష్యత్తు మరియు కానరాని విషయాలు అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు.

ఈ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ అన్ఆమ్ లో ఇలా తెలియజేశాడు,

وَعِندَهُ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَا إِلَّا هُوَ
(వ ఇందహూ మఫాతిహుల్ గైబి లా య’అలముహా ఇల్లా హువ)
“అగోచర విషయాల తాళం చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. ఆయన తప్ప మరెవరూ వాటిని ఎరుగరు.” (6:59)

అంటే అగోచర జ్ఞానం, ఇల్మె గైబ్ గురించి అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు. దైవ ప్రవక్తలకు కూడా తెలియదు.

అభిమాన సోదరులారా, ఈ విషయం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ అ’అరాఫ్ లో ఇలా తెలియజేశాడు,

قُل لَّا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్‌ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. (7:188)

ఓ దైవ ప్రవక్తా, నువ్వు చెప్పు, అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశిస్తున్నాడు, ఓ దైవ ప్రవక్తా నువ్వు చెప్పు, (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్‌ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. అల్లాహ్ యే కోరితే తప్ప, స్వయంగా నాకు నేను ఏ లాభమూ చేకూర్చుకోలేను, ఏ నష్టమూ నివారించుకోలేను.”

అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కూడా లాభం చేయటం, నష్టం చేకూర్చటం అనే అధికారం లేదు. అలాగే, నాకే గనక,

وَلَوْ كُنتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ ۚ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ
నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే. (7:188)

అని ఈ ఆయత్ లో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి ఎన్నో సందర్భాలలో సమస్యలు వచ్చాయి, నష్టం జరిగింది. ఒకవేళ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి అగోచర జ్ఞానం ఉండి ఉంటే, ఇల్మె గైబ్ తెలిసి ఉంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కి ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ కష్టాలు వచ్చేవి కావు.

కావున, జ్యోతిష్యం అనేది తర్వాత జరగబోయే విషయాలు, అగోచర జ్ఞానం ఉందని, కానరాని విషయాలు చెప్తారని, ఆ విద్య ఉందని, అది నమ్మటము, అలా చెప్పటము, అది ఇస్లాం ధర్మంలో హరామ్, అధర్మం. ఇది కేవలం ఇల్మె గైబ్ అనేది అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు.

అభిమాన సోదరులారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ జ్యోతిష్యం గురించి ఇలా తెలియజేశారు,

مَنْ أَتَى كَاهِنًا، أَوْ عَرَّافًا، فَصَدَّقَهُ بِمَا يَقُولُ، فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ صلى الله عليه وسلم
“ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళ్ళి అతడు చెప్పిన మాటల్ని నమ్మితే, జ్యోతిష్యుని దగ్గరికి పోయి ఆ జ్యోతిష్కుడు చెప్పే మాటలు నమ్మితే, అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన వాటిని తిరస్కరించిన వాడవుతాడు.”

అంటే ఎవరైతే ఈ జ్యోతిష్యాన్ని నమ్ముతాడో, అతను చెప్పిన మాటల్ని నమ్ముతాడో, ఆ వ్యక్తి వాస్తవానికి ఏం చేస్తున్నాడు, అంతిమ దైవ ప్రవక్తపై అల్లాహ్ ఏది అవతరింపజేశాడో, వహీని, ఖుర్ఆన్ ని దాన్ని తిరస్కరించినట్టు అని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ లో స్పష్టంగా తెలియజేశారు.

అభిమాన సోదరులారా, కావున మన సమాజంలో అప్పుడప్పుడు మనము చూస్తూ ఉంటాం, పోయి చేతులు చూపించి, ఏదో చూపించి, నష్టం జరుగుతుందని, రాబోయే కాలంలో ఏం జరుగుతుందని వివరించుకుంటారు. ఇది హరామ్, ఇస్లాం ధర్మంలో దీన్ని ఖుర్ఆన్ మరియు హదీసులో చాలా కఠినంగా ఖండించడం జరిగింది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఈ పాపం నుంచి కాపాడు గాక. సరైన మార్గాన్ని చూపించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

హస్తాన్ని పరిశీలించి లేదా తారాబలాన్ని చూసి అగోచర  జ్ఞానం ఉందని చెప్పటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అగోచరం అంటే .. :

భూత భవిష్యత్ కాలాలకు చెందిన ఏ విషయాలైతే  జనుల దృష్టికి రావో – కంటికి కానరావో – వాటిని అగోచరాలని అంటారు.

అగోచర జ్ఞానాన్ని అల్లాహ్‌ తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఆయన ఇలా సెలవిచ్చాడు :

قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ

“అల్లాహ్  తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు.” (అన్‌ నమ్ల్‌ 27: 65)

అల్లాహ్ కొన్ని సందర్భాలలో దైవప్రవక్తలలో కొందరికి, కొన్ని పరమార్థాల దృష్ట్యా తన అగోచర జ్ఞానంలోని కొన్ని విషయాలను తెలియజేస్తాడు. ఆ విషయాన్నే ఇక్కడ ప్రస్తావించటం జరిగింది.

عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ

“ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు – తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప!” (అల్‌ జిన్న్‌ : 26, 27)

అంటే, అల్లాహ్ తనకు స్వంతమైన అగోచర జ్ఞానంలోని కొంత భాగాన్ని తన ప్రవక్తలలో తాను కోరిన వారికి, కొన్ని పరమార్థాల దృష్ట్వా తెలియపరచటం సంభవమే. ఎందుకంటే అతను (ఆ ప్రవక్త) ఆ అద్భుతాలను తన దైవదౌత్యానికి నిదర్శనంగా చూపుతాడు. ఇలాంటి అద్భుతాలలో, అగోచర విషయాలను (భవిష్యవాణి) తెలుపటం కూడా ఒకటి. ఈ అగోచర జ్ఞానంలో మానవ సందేశహరునికి, దైవదూతల సందేశవాహకునికి మాత్రమే ప్రమేయం ఉంటుంది. మూడో వ్యక్తికి ఇందులో ఎలాంటి దఖలు ఉండదు. ఎందుకంటే అల్లాహ్ అగోచర జ్ఞానాన్ని వారిరువురికే పరిమితం చేశాడు. కాబట్టి అల్లాహ్‌ దృష్టిలో మినహాయింపుకు నోచుకున్న ఆ సందేశహరులు తప్ప వేరెవరయినా తనకు అగోచర జ్ఞానం ఉందని అంటే అతను అసత్యవాది, అవిశ్వాసానికి ఒడిగట్టిన వాడవుతాడు. అతను హస్త సాముద్రికం ఆధారంగా చెప్పినా, తారాబలం చూసి చెప్పినా, క్షుద్రవిద్యలను ఆశ్రయించినా, జ్యోతిష్కం ద్వారా చెప్పినా, మరే వనరుల ఆధారంగా చెప్పినా అతను అబద్ధీకుడే. ఈ యుగంలో కూడా ఇలాంటి నయవంచకులు, మోసగాళ్లకు కొదువలేదు. వారు తమ వాక్చాతుర్యంతో, మాయమాటలతో అమాయక జనులను బుట్టలో వేసుకుని పోగొట్టుకున్న వస్తువుల ఆచూకీ తెలుపుతామని, రోగ కారణాలను తెలుపుతామని అంటుంటారు. ఫలానా వ్యక్తి నీకేదో చేసేశాడని, అందుకే నీవు ఈ విధంగా మంచాన పడ్డావని చెబుతుంటారు. ఈ విషయాలను వారు జిన్నాతుల నుండి, షైతానుల నుండి సేకరిస్తారు. అందుకోసం వారు ఆ పైశాచిక శక్తులను ప్రసన్నుల్ని చేస్తుంటారు. ఎవరయినా మీ వద్దకు క్షుద్రవిద్యను పొందిన మాటలంటే ఖచ్చితంగా వారు మాయలమారులని, మోసగాళ్లని గ్రహించాలి.

షేఖుల్‌ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : “భవిష్యవాణి (సోదె) చెప్పేవారి పరిస్థితి ఎటువంటిదంటే, వారి వద్ద షైతాన్‌ సహచరుడు ఉంటాడు. ఆకాశాలలో దొంగచాటుగా. విన్న విషయాలను వాడు వారికి తెలియజేస్తుంటాడు. వాటిలో వారు మరికొన్ని అబద్ధాలను (మిర్చిమసాలాను) జోడించి వివరిస్తారు.”

ఆయన ఇంకా ఇలా అంటున్నారు : “ఈ సోదె చెప్పటంలో కొందరు ఆరితేరిన వారుండేవారు. వారి దగ్గరకు షైతానులు తినే త్రాగే పదార్థాలను కూడా తెచ్చేవారు. ఆ ప్రదేశాలలో లభ్యంకాని పండ్లను, మిఠాయిలను కూడా తెచ్చేవారు. వాటిలో కొన్నింటిని జిన్ను మక్కా లేదా బైతుల్‌ మఖ్దిస్ లేదా వేరే ఇతర స్థలాలకు తరలించేవాడు.” (మజ్మూ అత్ తౌహీద్ – పేజీ : 797, 801)

అగోచరాలకు సంబంధించి వారు జ్యోతిష్యశాస్త్రం ద్వారా కొన్ని విషయాలు అందజేస్తుంటారు. నక్షత్రాలను, రాసులను చూసి వారు భూమండలంపై సంభవించబోయే దానిని సూచిస్తుంటారు. గాలులు ఎంతవేగంగా వీస్తాయి, వర్షం ఎప్పుడు ఎక్కడ కురుస్తుంది తదితర విషయాలను అంచనా వేస్తారు. నక్షత్రాలు తమ తమ కక్ష్యల్లో చేసే పరిభ్రమణం, వాటి కలయిక, విడిపోవటాలను బట్టి జరిగే సంఘటనలను నిర్ధారిస్తారు. వారిలా అంటారు: ఇతను గనక ఫలానా నక్షత్రం సంచరించే సమయంలో వివాహమాడితే అతనికి ఈ ఈ సమస్యలు ఎదురవుతాయి. అతను గనక ఫలానా నక్షత్రం పొడసూపినపుడు ప్రయాణం చేస్తే ఫలానా ఫలానా గండాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అతను ఫలానా నక్షత్రం సమయంలో పుట్టాడు కనుక ఫలానా భాగ్యం వరిస్తుంది లేదా ఫలానా దరిద్రం చుట్టుకుంటుంది. ప్రస్తుతం కొన్ని చవుకబారు పత్రికలు సయితం ఇలాంటి రాశి ఫలాలను ముద్రించి మనుషుల జీవితాలలో సంభవించబోయే వాటిని గురించి విచ్చలవిడి రాతలు రాస్తున్నాయి.

కొంతమంది అజ్ఞానులు, బలహీన విశ్వాసులు జ్యోతిష్కుల వద్దకు వెళుతుంటారు. వారు తమ జీవితాలలో యెదురు కానున్న సంఘటనలను గురించి, ముఖ్యంగా వివాహాది శుభకార్యాల గురించి దర్యాప్తు చేస్తుంటారు.

ఎవడయితే తనకు అగోచర జ్ఞానముందని అంటాడో, మరెవరయితే అలాంటి వారిని సత్యవంతులని ధృవీకరిస్తాడో అతను ముష్రిక్కు, కాఫిర్‌ అవుతాడు. ఎందుకంటే వాడు అల్లాహ్  యొక్క ప్రత్యేక గుణాలలో తనకు భాగస్వామ్యం ఉందని దావా చేస్తున్నాడు. నిజానికి నక్షత్రాలు అల్లాహ్ కు సంపూర్ణ విధేయతను ప్రకటించే సృష్టితాలు. వాటి అధీనంలో ఏ శక్తీ లేదు. ఒకరి భాగ్యాన్నిగానీ, దరిద్రాన్ని గానీ శాసించే అధికారం వాటికి లేదు. జీవన్మరణాలతో కూడా వాటికి ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ పైశాచిక చేష్టలు. ఆకాశాలలో దొంగచాటుగా విన్న విషయాలను అవి చేరవేస్తుంటాయి.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 120 – 121)